చిన్నయసూరి జీవితము/వ్యాకరణ రచన

7. వ్యాకరణ రచన

చిన్నయసూరి బాలవ్యాకరణము రచించుటకుఁ బూర్వ మాంధ్రభాషలో సూత్రీకరణవిధానమున నేర్పఱచు నభ్యాస రూపకములగు సంస్కృతాంధ్ర వ్యాకరణ సంగ్రహములను రచించియున్నాఁడు. వానిలో నీతిచంద్రిక వెనువెంటనే, క్రీ. శ. 1853 లో ముద్రితమైన చిన్నయసూరి రచన 'శబ్దలక్షణ సంగ్రహము.'

శబ్దలక్షణసంగ్రహము

ఇది వ్యాకరణగ్రంథము. ఇం దైదుపరిచ్ఛేదములు కలవు. వాని వివరణ మిది:

1. సంజ్ఞాపరిచ్ఛేదము 42 సూత్రములు.
2. సంధిపరిచ్ఛేదము 46 సూత్రములు.
3. శబ్దపరిచ్ఛేదము 214 సూత్రములు.
4. క్రియాపరిచ్ఛేదము 118 సూత్రములు.
5. ప్రకీర్ణ పరిచ్ఛేదము 150 సూత్రములు.
వెరసి 570 సూత్రములు.

దీనికి మంగళాచరణముగా నీక్రిందిశ్లోకములు గలవు.

               కరోదరధృతోద్భూతవనజాతౌ సనాతనౌ,
               శేషాద్రిశేఖరత్పాదచ్ఛాయౌ జాయాపతీ స్తుమ:.
               పూర్వేషాం లక్ష్యలక్ష్మాని వికృతే ర్వీక్ష్య భూరిశ:,
               క్రియతే బాలబోధాయ శబ్దలక్షణసంగ్రహ:.

ప్రతిపరిచ్ఛేదాంతమునను -

"ఇది పరవస్తు చిన్నయసూరికృతంబగు శబ్దలక్షణనామ కాంధ్రవ్యాకరణమునందు.......పరిచ్ఛేదము."

ఇందున్న మఱియొకవిశేష మే మనఁగా, ప్రాచీనాంధ్ర వాఙ్మయమున పొడగట్టు సంబోధ నేతరవిభక్తిరూపములతో పరిచ్ఛేదాద్యములు కనుపట్టుచున్నవి.

ద్వితీయపరిచ్ఛేదము మొదలు - సంబోధన.

            క. శ్రీచరణసరోరుహలా క్షా చారువిలాసపక్ష సంశ్రితజనర
               క్షాచరణదక్ష దుష్టని శాచారకులశిక్ష శేషశైలాధ్యక్షా.

తృతీయపరిచ్ఛేదము - షష్ఠీవిభక్తి.

            క. శ్రీగృహమేధికి నతనిధి కాగమవేద్యునకుఁ ద్రిభువనారాధ్యునకున్
               భోగాపవర్గదాయికి నాగాధిపశాయి కంజనాధరపతికిన్.

చతుర్థపరిచ్ఛేదము - ప్రథామావిభక్తి.

            క. శ్రీనయనోత్పలశీతల భానుఁడు కలుషాంధకారభానుఁడు కరుణా
               ధీనుం డాశ్రితశుభసంధానుం డధ్యుషితశేషధర సానుఁ డొగిన్.

పంచమపరిచ్ఛేదము - తృతీయావిభక్తి.

            క. శ్రీలోచనాంజనాంక శ్రీలలితాధరునిచేతఁ జిరభద్రగుణ
                శ్రీలునిచేతన్ దీనకృపాళునిచేతన్ వృషాద్రిపాలునిచేతన్.

ఈ ప్రాచీనసంప్రదాయము నెఱిఁగినవాఁ డగుటచే సూరి యీగ్రంథము చివర నీక్రిందిసూత్రము గావించి యున్నాఁడు.

"స్వరూపవిభక్తినాయకవిశేషణంబులతోడ నాశ్వాసాంతంబు నందు మీఁదం దదాదిని విశేష్యాంతంబులతోడను మంగళం బార్యు లభివర్ణింతురు." ఈగ్రంథ మిప్పుడు లభ్యముకాదు. *[1]

ఇందలి సూత్రములు పాణినీయాష్టాధ్యాయీ సూత్రములవలె రచితములైనవి. సూత్రములకు నుదాహరణము లిందు లేవు. "సిద్ధి లోకంబువలనఁ దెలియనగు - సిద్ధి ర్లోకాత్ దృశ్యా; శాసనం బియ్యది దిక్ప్రదర్శనంబు - (శాసన మితి దిక్ప్రదర్శనం" అను రీతిని సూత్రములు కలవు. ఇది భాషా సమష్టికి రెండవ సోపానమువంటిది. ఇట్టి సూత్రము లున్నవని కంఠస్థము చేయుటకు ననుకాలముగ నుండును. కావుననే చిన్నయసూరి ఇట్టి సూత్ర రచనఁ గావించినాఁడు.

ఆంధ్ర శబ్దానుశాసనము

ఇయ్యది సంస్కృత సూత్రముల రీతిని ఆంధ్ర భాషా లక్ష్యములతో రచితమైన వ్యాకరణము. ఇది కేవలము తెనుఁగు భాషను గూర్చి సంస్కృతములో వ్రాయఁబడిన గ్రంథము. దీనికి పద్యానువాదముకూడ చిన్నయసూరి గావించి యున్నాఁడు. దానిని గుఱించి ముందు తెలిపెదను. ఇదియును పై వ్యాకరణమువలె సంజ్ఞా, సంధి పరిచ్ఛేదములుగా విభజింపఁబడియున్నది.

ఇది సంజ్ఞ, సంధి, తత్సమ, ప్రకీర్ణ, క్రియ, తద్భవము లను నాఱుపరిచ్ఛేదముల క్రింద విభక్తమైనది. ఇందలి సూత్రము లీరీతిగ నుండును. "సిద్ధి లోకంబువలన గ్రాహ్యంబు." "శాసనం బీయది దిక్ప్రదర్శనంబు." "ఉత్వంబు కచ్చ రా సంధియగు." "ప్రాతాదులకు సమాసంబునం దాద్యక్షర శేషంబు బహుళంబు." "గుణవదాదికంబు హలంతం బమంత తుల్యం బిందునామంబగు." "దాని మకారంబు లోపించు." "ప్రథమాంతమున కస్మద్విశేషణంబునకు బహుత్వంబున మువర్ణకంబగు." "ఆగామి కర్మానుబంధతుమాద్యర్థంబుల ద్రుతంబునగు." "భూతంబునం దిత్వంబునగు." "ఆకాశాదుల మధ్యగంబునకు హ్రస్వంబగు. ఏకాంతాదుల బిందువునకు లోపంబగు."

పద్యాంధ్ర వ్యాకరణము

ఇది సూత్ర రూపముననున్న పైదానికి సూరి పద్య రూపమున రచించిన గ్రంథము. అందు పద్యరూప మసమగ్రముగా నున్నది. ఈ రెండిటి స్వరూపమును చూపించుటకు నారెండు గ్రంథములనుండి కొన్ని యుదాహరణములను పొందుపఱచుచున్నాఁడను.

గ్రంథ ప్రారంభము : -

                శ్రీమహిముఖ్య దివ్యమహిషీనయనోత్పలచారుదీధితి
                స్తోమమనారతం బగుచు జొప్పున బర్వుట నాగ మేచక
                శ్రీ మెయి దోప నొప్పలరు శేషధరాగ్రనికేతనుండు భ
                క్తాసురపాదపోత్తమ ముదారఫలప్రతిపాది గావుతన్.

            గీ. ఆద్యభాషకు నేఁబది యక్కరములు
                ప్రకృతి కవి పది కొఱవడి వరలు నిందు
                ముప్పదాఱగు నవి యస్యములును శబ్ద
                యోగవశమున పిఱుసొచ్చు నుదధిశయన.

            గీ. అదులు పదాఱు స్వరములు కాదికములు
                ముప్పదియునాల్గు వ్యంజనంబు లనఁ దనరు
                బిందువు విసర్జనీయంబు వెలయు వ్యంజ
                నములు నన నాద్యభాష పన్నగనగేశ.

            క. ఋముఖములు నాల్గు వక్రత
                మములు ఙ ఞ శ షాక్షరములు మానిన నవశి
                ష్టములగు నలువది వర్ణము
                లమరు ద్వితీయ ప్రకృతికి నగధరనిలయా.

పై పద్యములు ఈ క్రింద సూత్రములకు వివరణములు: -

1. ఆద్యప్రకృతికి వర్ణంబు లేఁబది.

2. ద్వితీయంబునకు ఋగ్ వక్రతను ఙ ఞ శషలు ద్రిక్కనగు. ఇట ముప్పదాఱు.

3. ఋగ్విసర్గయున్ ఙ ఞ శ ష లు సమయోగంబునం గలియు. (ఇందు 48 పద్యములు మాత్రమే కలవు. కొన్ని క్రియా రూపములు మాత్రమే తెలుపుటతో గ్రంథము నిల్చి పోయినది కావున నిది యసమగ్రమని చెప్పనొప్పును. ఇదియు శ్రీ వెంకటేశ్వరునకు కృతి.)

సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము

ప్రాచీన కాలమున నన్నయాథర్వణులవలె నవీన కాలమున చిన్నయ సంస్కృత భాషలోనే సూత్రరీతిని నొక వ్యాకరణమును రచించెను. దానికే సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణమని పేరు. ఇది 1. సంజ్ఞా, 2. సంధి, 3. అజంత, 4. ఆచ్ఛిక, 5. సర్వనామ, 6. కారక, 7. సమాస, 8. తద్ధితపరిచ్ఛేదములు గలది. ఈ విభాగమునుబట్టి యిది పాణిని అష్టాధ్యాయి ననుసరించి వ్రాయఁబడినది. గ్రంథ ప్రారంభమున ముం దీ క్రింద శ్లోకము చెప్పఁబడినది.

               "అస్తి కల్పద్రుమ:కోపి జాతరూపలతాసృత:
                వేంకటాద్రి శిఖారూఢు స్మరతాం పరమర్థద:.

గ్రంథాంతమున "సర్వం లక్షణం చిన్నయసూరీయాణి సూత్రాణి సీధాదృష్టమ్" అని కలదు. ఇదియును బాల వ్యాకరణమునకు పూర్వము రచింపఁబడినదే యగును. ఏల యనఁగా నిందలి సంస్కృత సూత్రములకు తెనుఁగు భాషా పదము లనుసంధింపఁబడినవి. అయినను వ్యాకరణ శాస్త్రము శబ్దబ్రహ్మను ప్రతిపాదించుటచేత నీతఁడు మొదటి సూత్రములనే 'ఆంధ్రభాషా సంబంధినీ సిద్ధి శ్లోకస్య వ్యవహారా దవగం తవ్యా, తర్హి శాసనమిద మనారంబనేయమిత్యాశంక్యా శాసనమితి' అని వ్యాకరణశాస్త్ర మర్యాదలేని తెనుఁగు భాషకు సంస్కృత వ్యాకరణముతో సమానమగు ప్రతిపత్తిని గడించినాఁడు. దీనినే తిరిగి సూత్రములుగా కూడ తెనుఁగున శబ్దలక్షణ సంగ్రహమున ననువదించియున్నాఁడు. సంస్కృత పదములను తెనుఁగు పదములను ఎట్లు సమ్మేళనము చేసియున్నాఁడో ఈ క్రింది యుదాహరణముబట్టి గుర్తింపవచ్చును.

                   కచటతపా: పరుషా:
                   గజడదబా స్సరళా:
                   ఉభయే కంపా:

                 హల: పరేస్థిరా:
                 చుస్తాల వ్యే తాలవ్య:
                 అస్యత్ర దన్త్య:

అక్కజాదిషు (కంచంత - కాచాకు - వచ్చాకిత్యాదీనా మక్కజాదిత్వా త్సాధుత్వ మవగన్తవ్యమ్)

దీనినిబట్టి చూచినచో తెనుఁగుభాషకు సంస్కృత వ్యాకరణపరిపాటి నలవఱచుటయేకాక తెనుఁగు తెలియని సంస్కృతపండితులకు తెనుఁగుభాషాసంప్రదాయములను, తెనుఁగు వ్యాకరణపరిపాటిని తెలియఁజేయుటకు సూరి దీనిని రచించియున్నాఁడు కాని తన వ్యాకరణపాండిత్యప్రకర్ష ప్రదర్శించుటకుఁ గాదని విశదముగా తెలియుచున్నది కదా!

  1. * దీని కొక వ్రాఁతప్రతినివ్రాసి, కీర్తిశేషులు గిడుగు రామమూర్తి పంతులుగారి కిప్పటికి నలువదేండ్లక్రిందట నొసఁగితిని.