6. వచన రచన

తెనుఁగుభాషలో నవ్యయుగవికాసమునకు ముఖ్య చిహ్నమగు వచనరచనయందు చిన్నయసూరి యందెవేసిన చేయి. ఆంధ్రవచన వాఙ్మయమున చిన్నయసూరిరచన యొక ప్రత్యేక ఘట్టమగుటచేత నంతకుముందు ప్రవర్తిల్లిన వచన వాఙ్మయస్వరూపము నెఱుఁగుట మనకు కర్తవ్యము.

తెలుఁగు వచనరచన - పూర్వస్థితి

ఏవాఙ్మయమునందై నను తొలుత పద్యవాఙ్మయమే పరిణతి కెక్కును. వచనవాఙ్మయము కాలక్రమమున రాజకీయసాంఘికాది వ్యవస్థలనుబట్టి పరిణామముపొంది విపులభావవిన్యాసరూపమున శాఖోపశాఖలుగా వృద్ధిపొందును. భావములను సులభతరమగు రచనారూపమున పొందుపఱుచుటకు వచనమే ప్రధాన సాధనము. తెనుఁగున పద్య, వచన సమ్మిళితమగు చంపూకావ్య పద్ధతియే కవులకు నాలంబన మైనది. అందునను వచన మనఁగా నేఁటివలె కేవలము భావప్రకటనకై కూర్చిన వాక్యసముదాయములు కావు. ఆ వచనము తాళలయానుగుణముగా నడచుచు పాటగా పాడుటకు వీలుగా నుండెడిది. వచనమైనను 'వృత్త గంధి', అనఁగా వృత్తమువలె వాసింపఁ జేయునది. యనఁగా చదువ మొదలిడఁగానే పద్యపాద మను లక్షణము కలిగియుండెడిది. ఈ పద్ధతి ననుసరించియే నన్నయభట్టారకుఁడు తన భారతమున వచనము మొదలిడినపుడు పద్యపాదమువలె తోపింపఁ జేసియున్నాఁడు. తరువాతి తిక్కనాదికవులు వర్ణనలు చేసిన చోట సంస్కృతపదము లుపయోగించి పై సంప్రదాయమును కొంతవఱకు పోషించిరి.

తెనుఁగున మొదటి వచనగ్రంథములని చెప్పఁదగినవి కృష్ణమాచార్యుని 'సింహగిరినరహరివచనములు', 'శఠగోప విన్నపములు', గ్రంథకర్త కాకతీయ రాజగు ద్వితీయప్రతాపరుద్రుని కాలములో, క్రీ. శ. 1300 ప్రాంతమున నుండెను. ఇతఁడే వచనవాఙ్మయప్రథమాచార్యుఁడు. కాకతీయుల వెనుక శ్రీనాథయుగమున, నావెనుక కృష్ణరాయలయుగమున ప్రబంధవాఙ్మయమే యపారముగా పెరిఁగినది. ఆకాలములో కొన్నివచనగ్రంథములు పుట్టినను నవి కేవల శాస్త్రవిషయములనే బోధించుచు వ్యావహారికరూపమున నుండినవి. క్రీ. శ. 1600 వఱకును వచనరచన పైరీతిగనే వెలయుచుండెను.

దక్షిణాంధ్రవాఙ్మయము - వచనరచన

సలక్షణమగు గ్రాంథిక వచనరచన సమీచీనముగా ప్రారంభమైనది దక్షిణదేశమున, మధురనాయకుల కాలమునుండి యని చెప్పనొప్పును. ఈ దేశమున తంజావూరు మధుర ప్రాంతములను తెలుఁగునాయకు లేనినను నచ్చటి వ్యవహారభాష తమిళముగాని తెనుఁగు కాదు. కాఁబట్టి యా నాయకులతో నచ్చటనే నెలకొనిన తెలుఁగు రాజకీయోద్యోగులకును, కవులకును, పండితులకును, తక్కినవారికిని మాతృభాష తెనుఁగైనను నిత్యవ్యవహారమున తమిళభాష తప్పనిసరియైనది. అయినను, పాలకులు తెలుఁగువా రగుటచేత వచన రచన యందు నొక ప్రత్యేకలక్షణము ప్రవర్థిల్లినది. ఆంధ్రదేశము నందువలె నిచ్చట తెనుఁగున గ్రాంథికరచన, వ్యావహారికరచన యని రెండువిధములుగా ప్రవర్తిల్లుటకు వీలులేదు. ఏలయన, ప్రజాసామాన్య వ్యవహారభాష తెనుఁగు కాకపోవుటచే గ్రంథరచనలలో సలక్షణ మగు వచనమునే యుపయోగించవలసిన యావశ్యకత యేర్పడినది. ఈ కారణముచేతనే సలక్షణవచన వాఙ్మయము దక్షిణాంధ్రదేశముననే తొలుత ప్రారంభమైనది. ధేనుమాహాత్మ్యము, శ్రీరంగమాహాత్మ్యము, సారంగధర చరిత్ర, జైమినీభారతము, భారతరామాయణములు, హాలాస్య మాహాత్మ్యము మొదలగు ప్రశస్తవచనగ్రంథములు దక్షిణదేశమున పుట్టినవియే.

కుంఫిణీ కాలము

క్రీ. శ. 1700 ప్రాంతమునుండి ఈస్టిండియాకంపెనీ వారితో మనకు సంబంధము కలిగి క్రీ. శ. 1800 నాఁటికి వారిరాజ్యము స్థిరముగా నెలకొన్నవెనుక వచనవాఙ్మయ దృక్పథము మాఱినది. బ్రిటిషు పరిపాలన ప్రారంభములో క్రైస్తవమతాచార్యులు వారి మతప్రచారముకొఱకు క్రైస్తవ మతగ్రంథములను సులభగ్రాహ్య మగు వ్యావహారికశైలిలో వచనరూపమున వ్రాయ మొదలిడిరి. అంతేకాక వ్రాసిన గ్రంథములను ముద్రించు పద్ధతినిఁగూడ వారే దేశమున ప్రవేశ పెట్టి వ్యాప్తినొందించిరి. కాని యిందలి శైలి యేగ్రాంథిక వ్యావహారికపద్ధతిని నతుకుకొనకపోవుటచే నది బైబిలు తెలుఁగుగా పరిణమించి దానిప్రవర్తకు లనుకొన్నంత ప్రచారములోనికి రాలేదు.

సులభ వచన గ్రంథములు

ప్రభుత్వమువారు స్థాపించిన కళాశాలలో రాజకీయోద్యోగులై యాంగ్లభాష మాతృభాషగాఁగల దొరలకే తెలుఁగు నేర్చుకొనుట యావశ్యక మగుటచే వారికొఱకు సులభమగు శైలిలో వచనగ్రంథములు వ్రాయవలసివచ్చినది. ఇవి వారు గ్రహింపఁదగిన సౌలభ్యముతో నున్నను కేవల వ్యవహార రచనలుకాక గ్రాంథికరచనతో నొప్పెడివి. ఆ కళాశాలలోని రావిపాటి గురుమూర్తిశాస్త్రులుగారు విక్రమార్కుని కథలను (1819), పంచతంత్రకథలను (1834) రచించిరి. ఇవి 1860 లోపుగ నొక్కొక్కటి నాల్గుముద్రణము లందిన వన్నచో వాని కెంత వ్యాప్తి యుండెడిదో తెలిసికొనవచ్చును. ఆ కాలములోనే శుకసప్తతి కథలు, హరిశ్చంద్ర చరిత్ర, విజయ విలాసము, తాతాచార్యుల కథలు మున్నగునవి రచితములైనవి. భాషాపోషకులగు బ్రౌనుదొరవారు సులభ వ్యావహారిక రచనలో కొన్నిగ్రంథములను ప్రకటించిరి. కాని యవియన్నియు భాషయందు ప్రాథమిక శిక్షణపొందుటకు మాత్రమే తగియుండి కేవలము రాజకీయోద్యోగులకే యుపయోగపడెడివి కాని యుత్తమసాహితీద్వారమున భాషాపాండిత్యమును సంపాదింపఁ గోరు విద్యార్థుల కేమాత్రమును సహాయకారులుగా నుండెడివి కావు.

గ్రాంథిక వచన రచన

మదరాసు విశ్వవిద్యాలయ మేర్పడిన వెనుక కళాశాలలో నుత్తమతరగతులకు ప్రౌఢవచనసాహిత్యము కావలసివచ్చినది. వచనరచనా పథకము మార్పుచెందినది, అప్పటికి దక్షిణ దేశమందు వచనరచనలున్నను యవి యజ్ఞాతదశ నుండి యా కాలపు పండితులకుఁగూడ నందుబాటులో లేకుండెను. *[1] అంతకు ముందుగనే వెలసిన పై వచనరచన లీనూతనప్రణాళికకు సరిపోయినవి కావు. మఱియును విద్యాశాఖయందలి పద్ధతుల ననుసరించి కొన్నివర్ణనలపట్ల నౌచిత్యమును పాటించి త్యజించవలసివచ్చినది. విద్యార్థుల భావిసాహిత్యాభివృద్ధి కనుకూలపడునట్లు నైతికముగను, నుదారముగను, గంభీరభావములను నూతనరీతిని వివరింప సమర్థత గల లాక్షణికగ్రాంథికశైలి గల వచనరచన లత్యావశ్యకములైనవి. ఇట్టిసమయముననే చిన్నయసూరి తన నీతిచంద్రికతో వచనసాహిత్యా కాశమున నుదయించి యశశ్చంద్రికల నలుదెసల వ్యాపింపఁజేసెను.

నీతి చంద్రిక

'నీతి చంద్రిక' యనునది కథా వాఙ్మయమునకు సంబంధించిన రెండు గ్రంథముల సంపుటీకరణము. ఒకటి నారాయణ పండిత కృతమైన హితోపదేశము; రెండవది విష్ణుశర్మ కృతమగు పంచతంత్రము. ఇవి రెండును సంస్కృత భాషయందు బహు ప్రాచీన కాలమునుండి ప్రపంచ విఖ్యాతిఁ బడసినవి. వీనిలో పంచతంత్రము క్రీ. శ. ఆఱవ శతాబ్దమునకే పాశ్చాత్య ఖండములో గ్రీకు భాషలోనికేగాక యరబ్బీ పారసీక భాషలలోనికిని అనువదింపఁబడియుండెను. రెండును సంస్కృత శ్లోకములతో, మధ్య మధ్య వచనములతో నొప్పుచున్నవి. హితోపదేశమున కేవలము నీతి కథలు మాత్రమే పొందుపఱుపఁబడియున్నవి. కాని పంచతంత్రమున నీతిమాత్రమే కాక రాజనీతికూడ ప్రపంచితమైయున్నది. పై రెండు గ్రంథములలోని విషయములను చిన్నయసూరి పరిశీలించి కావలసిన యంశములను తీసికొని కొంత క్రొత్తఁదనమును కల్పించి 'నీతి చంద్రిక' యను పేర వచనముగ రచించెను.

పంచతంత్రము పద్యకృతిగా చిన్నయసూరికి ముందు నలుగురుకవులు రచియించిరి. వారిలో ప్రాథమిక రచయిత కృతి లభ్యముకాలేదు. తక్కినవి - దూబగుంట నారాయణకవి, బైచరాజు వేంకటనాథకవి, భానుకవి యనువారు రచించినవి - లభ్యమగుచున్నవి. అవి యన్నియు, కావ్యపద్ధతిని ప్రౌఢరీతి నుండి పండితులకుమాత్రమే యుపయుక్తములైనవి.

నవీనయుగమున వచనరచన ప్రాముఖ్యములోనికి వచ్చుచుండినకాలమున శ్రీ రావిపాటి గురుమూర్తిశాస్త్రిగారు సులభవచనశైలిలో నీగ్రంథమును రచించియుండి రని ముందే తెల్పఁబడినది. కాని యాగ్రంథ మున్నతవిద్యార్థి జనోపయోగము గామింజేసియు, నుత్తమసాహిత్యమున కనుకూలింపమింజేసియు నా లోపములకు తీర్చుటకు చిన్నయసూరి గంభీరమును, లక్ష్యలక్షణసమన్వితమును, విద్యార్థిజనాకర్షణీయమును నగు శైలిలో తన నీతిచంద్రికను రచించెను.

చిన్నయసూరి రచనయందలి ప్రత్యేకతను చూపుటకు నిర్వురి రచనలనుండియు సమానఘట్టముల నుదాహరించుచున్నాను:

"ధనము లేకుంటే ఆర్జింపవలయును. ఆర్జించిన ధనమును రక్షింప వలయును. రక్షించిన ధనమును వృద్ధిపొందింపవలయును. వృద్ధిపొందించిన ధనమును సద్వినియోగము చేయవలయును. ఇట్లు చేయ నేరనివారి యింట ద్రవ్య మెట్లు నిలుచును? మూఢులైనవారు యీ యర్థమును తెలియ నేరరు. సంరక్షణసేయని ద్రవ్య మప్పుడే నశించును. వృద్ధిబొందించని ధనము కొంచెముగా *[2] సెలవుచేసిన కాటుకవలె సమసిపోవును. అనుభవమునకు రాని సొమ్ము కలిగియు లేనిదానివలె సుఖకరముగాదు. ఒకరి కివ్వడము, తా ననుభవించడము, యెవరైన యెత్తుకొనిపోవడము, యీ మూఁడున్ను ధనము పొయ్యేటందుకు దోవలు. కాఁబట్టి యెవఁడు తన ధనము నొకరి కివ్వక తా ననుభవించఁడో వాని ధనమును యెవరైన యెత్తుకొనిపోదురు. నిండిన చెరువులకు అలుగులు తీసినట్లు సంపాదించిన ధనము పాత్రమెఱిఁగి సెలవుచేయుట రక్షించడమేను."

ఇది గురుమూర్తిశాస్త్రిగారి శైలి. ఇఁక చిన్నయసూరి గారిశైలి నుదాహరించుచున్నాను:

"అర్థము పురుషార్థములలో నుత్తమము. అర్థవంతున కసాధ్యము లోకమం దేదియుఁ గానము. కాఁబట్టి పురుషుఁడు న్యాయము తప్పక యే యుపాయముచేతనైనను ద్రవ్యము సంపాదింపవలెను. ఇంత సంపాదించితి నిం కేల యని తనియరాదు. బుద్ధిమంతుఁడు జరామరణములులేని వానివలె విద్యాధనములు గడియింపవలె నని పెద్దలు చెప్పుదురు. ధనార్జనమునకు సాధనములు పెక్కులు గలవు. వాని లోపల వాణిజ్యము సర్వ ప్రకారములచే మేలయి కానఁబడుచున్నది."

పై రెండింటిలో గురుమూర్తిశాస్త్రిగారి రచనలో "లేకుంటే, చేసినా, రక్షించడమేను" మొదలగు వ్యావహారిక భాషా రూపములు కాన్పించుచున్నవి. కొన్ని యెడల విసంధులు కూడ కానఁబడుచున్నవి. వాక్యములయందు అన్వయక్రమము గూడ సరిగ లేదు. 'సెలవు చేయుట' మొదలగు మాండలికములుకూడ నందందు కాన్పించుచున్నవి. ఇట్టి లోపముల నివారించి చిన్నయసూరి సలక్షణమును, సర్వజన గ్రాహ్యము నగు శైలిలో మిక్కిలి కట్టుదిట్టముగ తన గ్రంథమును రచించెను. అందలి ప్రత్యేక లక్షణములను ముందు వివరించెదను.

చిన్నయసూరి యీ నీతిచంద్రికను మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము అను నాలుగు విభాగములుగా విభజించినాఁడు. అందు మొదటి రెండు భాగములను మాత్రమే యాతఁడు రచించి క్రీ. శ. 1853 - వ సంవత్సరమున తాను స్వయముగ స్థాపించిన 'వాణీ దర్పణ' మను ముద్రాక్షరశాలయందు ముద్రింపించియున్నాఁడు దీనిని సూరి తన కింతవఱ కభ్యుదయ కారకుఁడగు ఆర్బత్ నాటు దొరగారి కంకితము గావించినాఁడు. ఈ గ్రంథము ముద్రితమైననాఁట నుండి పఠనీయగ్రంథమై బహుళ ప్రచారము గాంచి విద్వజ్జనరంజకమైనది. సంధి విగ్రహము లను మిగిలిన రెండు భాగములను చిన్నయసూరి రచింపక పోవుట మన దురదృష్టమని చెప్పవచ్చును. కాని మఱి యిరువది యేండ్లలోపుననే యా కొఱఁత మనకు తీఱినది. క్రీ. శ. 1871 లో చిన్నయసూరి వెనుక రాజధాని కళాశాలయం దాంధ్రపండిత పదవి వహిం చిన భారతవర్ష మహామహోపాధ్యాయ శ్రీ కొక్కొండ వేంకటరత్నం పంతులవారు విగ్రహ తంత్రమును పూర్తిచేసి ప్రకటించిరి. ఆ మరుసటి సంవత్సరమునందే రాజమహేంద్రవరములో గద్యతిక్కన కుందుకూరి వీరేశలింగం పంతులుగారు విగ్రహ భాగమునేకాక సంధినికూడ సంపూర్తి చేసిరి. వీరిరువురి శైలియు చిన్నయసూరి శైలిని వెన్నాడుచు ధారాశుద్ధిఁ గలిగి మనోహరముగ నుండును. వేంకటరత్నము పంతులవారి శైలి యించుక జటిలము; వీరేశలింగముగారి శైలి ప్రసన్నము. ఈ రెండు గ్రంథములనుకూడ మదరాసు విశ్వవిద్యాలయము వారు ప్రథమశాస్త్ర పరీక్షకు పఠనీయ గ్రంథములుగా నేర్పఱచిరి. వీరి వెనుక నెల్లూరియందు 'విద్యార్థి కల్పభూజ' మను పత్రికకు సంపాదకులగు ఉల్లిగొండ రామచంద్రరా వను ఆంధ్ర పండితుఁడు సంధి విగ్రహములను వచన రూపమున రచించెను. ఈతని శైలియు ప్రౌఢముగ నుండి పైవానికి తీసిపోకుండ నుండెను. దీనినిగూడ నొకప్పుడు కళాశాలయందు పఠనీయ గ్రంథముగ నేర్పఱచియుండిరి. శ్రీ ఉల్లిగొండ రామచంద్రరావుగా రిప్పటి కర్ధశతాబ్ది క్రిందట జీవించి యుండిరి. చిన్నయసూరి కాలమునకు కొంచెము వెనుక నుద్దండ పండితుఁడగు శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి యొక పంచతంత్రమును రచించెనని ప్రతీతి. నవీన కాలములో చెఱకువాడ వెంకటరామయ్యగారు నీతిచంద్రికయందలి లబ్ధనాశము మాత్రము ప్రాచీన శైలి ననుసరించి దీర్ఘ సమాసయుక్తముగ రచించిరి. ఎవ రెన్ని విధములుగ రచించినను చిన్నయసూరి గ్రంథమునకుండు విశిష్టత మఱెవరి రచనకును రాలేదు. ఇంత విశిష్టతకు కారణ మెదియో ముందు తెలిసికొందము.

నీతిచంద్రిక యొక విడికథల సంపుటమైనను వీనిలో నొకటి కొకటి యంగాంగిభావసంబంధము గల్గి కథాశరీరము స్ఫుటమగునట్లుగా రచితమైనది. దీనివలన గ్రంథమం దొక యైక్యభావ మేర్పడి చదువరులకు రాఁబోవుకథలను జదువుట కాతురతను గల్గించును.

విషయ విభజనము

కథారచనయం దొక్కొక్క భావము, లేక విషయమునకు వేర్వేఱు 'పేరా'లను విభాగించు పద్ధతిని పాటించినవాఁడు చిన్నయసూరి. తత్పూర్వగ్రంథకారు లింత విశదముగా నీ నియమమును పాటించియుండ లేదు. ఆంగ్ల వచన రచనాపద్ధతి ననుసరించి చిన్నయసూరి విషయము సుబోధకమగుటకు నీ నూతన పద్ధతిని ప్రవేశపెట్టినాఁడు. చిన్నయసూరి కళాశాలపండితుఁడు కావున విద్యార్థులుకూడ నీపద్ధతి నలవఱచుకొనునట్లు దారితీసి యీ పథకము వ్యాప్తిలోనికిఁ దెచ్చెను. నేఁటికిని వ్యాస రచనయందు నీపద్ధతి నియతముగా పాటింపఁబడుచుండుట మన మెఱిఁగినదే కదా!

శైలి లక్షణములు

1. ఇందలి శైలి యతి కఠినముగను, నతి సులభముగను కాక సుగ్రాహ్యమై కమ్మెచ్చులోని తీఁగవలె మొదటినుండి తుదివఱకు నొకేరీతిని, నిమ్నోన్నతములు లేక యొప్పారును. కేవలము దీర్ఘసమాసయుక్తము లగు పంక్తులుగాని, కేవల మచ్చ తెనుఁగుపదములు విచ్చలవిడిగ నున్న పంక్తులుగాని కానరావు. ఈ శైలియందు నన్నయశైలివలె ప్రసన్నతయు, ప్రసాదగుణమును, గాంభీర్యమును ముప్పిరిగొనియున్నవి.

2. ఇందు సంస్కృతాంధ్రపదములు సమపాళముగ సమ్మిళితములైనవి. ఇందలి శైలి తేలిక యని పేలవముగాదు; తెనుఁగని సంస్కృతసంపర్కము లేకయుండలేదు. అల్లికబిగియని యపూర్వపదబంధురముగాదు. అనుసృతి కలవీయదు.

3. ఇచట ప్రత్యేకత తెలుపువానిలో జాతీయములు ముఖ్యములు. అవి జాతికి సహజమైన వ్యక్తిస్వరూపమును తెలుపుచు నితరభాషలలోనికి పరివర్తనము చేయుటకు సాధ్యము కానివి. "పోతరించియుండుట, యిల్లుద్రొక్కుకొనివచ్చుట, బిఱ్ఱ బిగిసికొని, కడుపుపని, కాలక్షేపముచేయు, మొదలు నఱికిన తరువు, కన్నులు మిఱుమిట్లుగొలుపుట, పెండ్లినడక నడచుచున్న వాఁడు, చిటుకనకుండ కొఱుకుట, నిన్న మాపో నేఁడు ఱేపో, యీడిగలబడిన బక్కయెద్దు, చియ్యబట్టు, అఱ్ఱాడు, ఎత్తువారిచేతిబిడ్డ, పాటెఱుఁగనిదొర" మొదలగు తెలుఁగు జాతీయములు, "పయోముఖవిషకుంభము. గోముఖవ్యాఘ్రము, కుక్షింభరిత్వము, పరేంగితావగాహియైనబుద్ధి, మృగతృష్ణికాప్రవాహము" మున్నగు సంస్కృతజాతీయములు రచనయం దంతటను మెండుకొనియుండును. 4. ఈ శైలియొక్క వేఱొకలక్షణము సామెతల నుపయోగించుట. "అడుసుత్రొక్కనేల కాలుగడుగనేల," "పిట్ట కొంచెము కూఁత ఘనము" మున్నుగాఁగల తెనుఁగు సామెతలును, "శరీరమాద్యం ఖలు ధర్మసాధనం," "యథా రాజా తథా ప్రజా," "జీవన్ భద్రాణి పశ్యతి" మొదలగు సంస్కృతలోకోక్తులును నందందు పొందుపఱుపఁబడి గ్రంథమున కొక క్రొత్తయందము నందించుచున్నవి.

5. చిన్నయసూరికిముందు వచనరచనలలో పాశ్చాత్యులు సులభముగ గ్రహించుటకు నచ్చటచ్చట సంధి క్రమముగ పాటింపఁబడియుండలేదు. సూరి వ్యాకరణము రచించినవాఁడు గావున సంధిపరిచ్ఛేదములోని లక్షణములకు లక్ష్యముగా నీగ్రంథమున సంధులను సక్రమముగా పాటించియున్నాఁడు. ముందుదాహరింపఁబడిన గురుమూర్తిశాస్త్రిగారి రచనను, చిన్నయసూరి రచనను పరిశీలించిన నీవిషయ మింకను స్పష్టము కాఁగలదు.

6. పూర్వవచనగ్రంథములలో ప్రబంధరచన ననుసరించి వర్ణనలు ఔచిత్యమును పాటింపకుండ రచియింపఁబడుచుండెడివి. అందు శృంగారవర్ణనల నధికముగా పొందుపఱచెడివారు. నవీనకాలమున కళాశాలపద్ధతుల ననుసరించి యిట్టివర్ణనలు పరిత్యజించుటయేకాక చిన్నయసూరి సముచితమును, సంభావ్యము నగు సంభాషణశైలిలో నీతిచంద్రికను రచించెను.

గ్రంథముద్రణ పద్ధతి

నీతిచంద్రికను చిన్నయసూరి స్వయముగా 'వాణీదర్పణ' మను ముద్రాక్షరశాలయందు ముద్రించినాఁడని తెలిపితిని. అందుకు కారణము ముద్రణమునందు కొన్నిమార్పులు తెచ్చుటయే. ఈ మార్పుల నీక్రింద సూచించుచున్నాను.

1. రేఫసంయుక్తాక్షరము వలపలగిలక (౯) తో వ్రాయుట. అనఁగా "అథ౯ము" నిట్లు వ్రాసెడివారు. చిన్నయసూరి దానిని "అర్థము" అను నవీనరీతిగా ముద్రింపించినాఁడు.

2. పూర్వము నిండుసున్న (పూర్ణానుస్వారము) లే యన్నిచోట్ల నుపయోగించెడువారు. చిన్నయసూరి ఆ పద్ధతిని వీడి యర్ధానుస్వారపద్ధతిని ప్రవేశ పెట్టినాఁడు.

3. తత్పూర్వము ద్రుతమునకు నకారపొల్లు నిచ్చెడువారు (౯). సూరి దానిని విసర్జించి స్వత్వరూపమునఁగాని, ('ను' ), బిందురూపమునఁగాని, సంశ్లేషరూపమునఁగాని(న్గ) యుపయోగించి తనవ్యాకరణసూత్రమునకు లక్ష్యముగా చూపినాఁడు.

4. శకట రేఫసాధురేఫలను సక్రమముగా పాటించినాఁడు సంయుక్తాక్షరములయందు వర్ణక్రమనియమమును సరిగా పాటించినాఁడు. పూర్వము "విఛిన్న" "ఉజ్వల" "తత్వము" అని వ్రాసినవానిని సూరి "విచ్ఛిన్న" "ఉజ్జ్వల" "తత్త్వము" అని వానిరూపములను పరిష్కరించినాఁడు. ఇట్లనేక నూతనపద్ధతులను వచనరచనయందు నెలకొల్పి తన యనుయాయులకు మార్గదర్శకుఁ డగుటచేతనే యాంధ్ర వాఙ్మయమున చిన్నయసూరి నీతిచంద్రికలు సకలబుధాహ్లాదకరములై యాచంద్రార్క మభినందనీయము లగుచున్నవి.

వచనరచన - లక్ష్యలక్షణ సమన్వయము

ఈ గ్రంథము తనవ్యాకరణమున కెట్లు చిన్నయసూరి లక్ష్యముగా నిరూపించినాఁడో యీ క్రింది యుదాహరణమును బట్టి గ్రహింపనగును.

"ఎవ్వఁడు హంసములను శుకములను మయూరములను శుక్ల హరిత చిత్రములఁ గావించె నా యీశ్వరుఁ డాయాయి జంతువులకుఁ దత్తదను రూపమైన వృత్తిని గల్పించువాఁడు. మూఢు లీయర్థ మెఱుఁగక వృత్తికయి పడరానిపాట్లు పడి కాలము వ్యర్థముగాఁ బోఁగొట్టుచున్నారు. విత్తము గడనయం దొక దు:ఖము, కాఁపుదలయం దొక దు:ఖము, వినాశమం దొక దు:ఖము పుట్టించుచున్నది. ఇట్లు దు:థైకమూలమైన విత్త మేల? కాల్పానా! ధర్మార్థము ధనము గోరుటకంటె నిస్పృహత్వము మంచిది. 'అడుసు ద్రొక్కనేల, కాలు గడుగ నేల?' ఆకాశమునందుఁ బక్షులచేత, భూమియందు వ్యాళములచేత, జలములయందు మీలచేత మాంసము భక్షింపఁబడినట్లు సర్వత్ర విత్తవంతుఁడు భక్షింపఁబడియెడును. కాఁబట్టి ధనతృష్ణమానికోలు వివేకకార్యము. తృష్ణ యొకటి మానెనా యావల దరిద్రుఁ డెవఁడు, ధనికుఁ డెవఁడు? దాని కెవ్వఁ డెడమిచ్చును? వాని మూర్ధమే దాస్యమునకు సింహాసనము. నీ సన్నికర్ష ప్రభావముచేత నా యజ్ఞానము సర్వము నివర్తించినది. కృతార్థుఁడనైతిని. నిరంతరముగా నీతోడిసంగతికంటె నాకు లాభ మొకటిలేదు. నీతోడి ప్రణయమున కొక్క కొఱఁతయు రాఁబోదు. ప్రణయము లామరణాంతములు, కోపములు తత్ క్షణభంగురములు, త్యాగములు నిశ్శంకములు నగుట మహాత్ములకు సహజము." ఈ భాగము నుదాహరణముగాఁ గైకొని వచనకావ్య రచనకు ముఖ్యముగా తెలిసికొనఁదగిన యంశముల నెట్లు విద్యార్థులు గ్రహింపవలయునో స్థాలీపులాక న్యాయముగా నిందు చూపుచున్నాను.

ఎవ్వఁడు - అరసున్న సిద్ధము.

చిత్రములఁ గావించెను - సాధ్యము. ఎఱుఁగక - సిద్ధము - వ్యర్థముగాఁ బోఁగొట్టు - సాధ్యము.

భక్షింపఁబడియె - సాధ్యము.

కొఱఁత - సిద్ధము.

ఈ విధముగా సిద్ధసాధ్యములైన యర్ధానుస్వారముల పరిజ్ఞాన మావశ్యకము.

చిత్రములఁగావించెను = చిత్రములన్ + కావించెను - ఇది ద్రుత ప్రకృతికము; జంతువులకుఁ దత్తదనురూప = జంతువులకున్ + తత్తదనురూప - దృతప్రకృతికము.

వ్యర్థముగాఁ బోఁగొట్టుచున్నారు.

వ్యర్థముగాన్ + పోన్ + కొట్టు = ద్రుతములు.

ఆకాశమునందుఁ బక్షులచేత; భూమియందు వ్యాళములచేత = ఆకాశమునందున్ + పక్షులచేత; భూమియందున్ + వ్యాళములచేత - ద్రుతప్రకృతికములు.

ఈశ్వరుఁడాయాయి - ఈశ్వరుఁడు కళ. తత్తదనురూపమైన - అనురూపము కళ. వృత్తికై పడరాని - "వృత్తి" కళ. ఏల - కళ. తృష్ణ యొకటి - తృష్ణ కళ.

ఈ విధముగా కళాద్రుతప్రకృతికముల పరిజ్ఞాన మావశ్యకము.

ఈశ్వరుఁ డాయాయి - ఈశ్వరుఁడు + ఆయాయి.

ఉకారసంధి: కాఁపుదలయందొక. కాఁపుదలయందున్ + ఒక - ఉకారసంధి.

ధనముఁగోరుట = ధనమున్ + కోరుట - సరళాదేశ సంధి. ధనతృష్ణమానికోలు = ధనతృష్ణన్ మానికోలు - ద్రుతలోపసంధి.

తృష్ణ _ ఒకటి - ఇచట సంధి లేదు.

ఈ విధముగా సంధులు పరిజ్ఞాన మావశ్యకము.

ధనము గోరుటకంటె - "కోరు" సాధురేఫ

ఒక్క కొఱఁత - శకటరేఫ.

ఈ విధముగా రేఫ శకట రేఫ పరిజ్ఞాన మావశ్యకము.

వృత్తి-ఋకారము; తృష్ణ - ఋకారము; దరిద్ఁరుడు - రేఫ ఉకారము.

ఈ విధముగా కొమ్ము క్రారవడి వట్రువసుడి పరిజ్ఞాన మావశ్యకము.

"అడుసు ద్రొక్క నేల కాలు గడుగ నేల" ఇది ప్రసిద్ధమైన తెలుఁగుసామెత.

ఈ విధముగా సామెతలపరిజ్ఞాన మావశ్యకము.

"హంసములను శుకములను మయూరములను శుక్ల హరిత చిత్రములఁ గావించె." యథా సంఖ్యాలంకారము.

ఆకాశమందుఁ బక్షుల చేత భూమియందు వ్యాళముల చేత జలముల యందు మీలచేత మాంసము భక్షింపఁబడినట్లు సర్వత్ర విత్తవంతుఁడు భక్షింపఁబడియెడును - ఉపమాలంకారము.

ఈ విధముగా నలంకారపరిజ్ఞాన మావశ్యకము.

వినాశ = వి + నాశ - ఉపసర్గము - ఇచట "వి" కి అర్థము లేదు. నిస్పృహత్వము = నిర్ + స్పృహత్వము. ఇం దిది నఞ్ అర్థకము = లేకపోవుట.

వి + వేకము = ఉపసర్గము.

సన్నికర్షము = సం + ని + కర్ష - ఉపసర్గములు.

అర్థాంతరముల నిచ్చునది:

"సంగతి" = సం + గతి - ఉపసర్గము అర్థాంతరము నిచ్చునది. ఈ విధముగ నుపసర్గపరిజ్ఞాన మావశ్యకము. "ఆ యీశ్వరుఁ డాయాయి జంతువులకుఁ దత్తసమరూపమయిన వృత్తినిఁ గల్పించువాఁడు." ఈశ్వరుఁడు వృత్తిని గల్పించువాఁడు - ఇది మూలవాక్యము. ఆయాయి జంతువులకు అనుసరి వృత్తి కల్పనతో సంబంధము. "తత్తదనురూపమైన" వృత్తికి విశేషణము. "ఆ" ఈశ్వరునికి విశేషణము.

ఈ విధముగా వాక్యవృద్ధిరచనాపరిజ్ఞాన మావశ్యకము.

ప్రాచీనకాలమున నన్నయభట్టారకుని రచన ననుసరించుచు నవీన వచన రచనాపద్ధతుల సమ్మేళనమున లక్ష్య లక్షణ సమన్వయముచేసి నూతన పథకము నేర్పఱచుటవలన నవీన వచన రచనకు చిన్నయసూరి మార్గదర్శకుఁడయ్యెను.

కథలు - నీతులు

నీతిచంద్రికయందలి నీతులను, అందలి కథలను ఇందు పొందుపఱచుచున్నాను.

సుదర్శనుఁ డను రాజు మూర్ఖు లగు తనపుత్రులఁగూర్చి వగచి విష్ణుశర్మ యను బ్రాహ్మణునియొద్ద వారిని విద్యాశిక్షణ కొఱకై ప్రవేశపెట్టెను. అతఁడును నీతిని బోధించు కథలను వారికి వినిపింపఁగోరి మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధి అను నాలుగంశములు గల కథను వినుపించును.

వీనిలో మిత్రలాభము, మిత్రభేదము నను రెండు మాత్రమే యిందున్నవి. అందు మిత్రలాభమున స్నేహము వలని లాభములను తెలియఁజేయు కాక కూర్మ మృగ మూషికముల కథ చెప్పఁబడినది. ఈ కథలోనే కొన్ని యుపకథలు కలవు. అవియును నీతిబోధకములే. వానిలో "ఆశ యన ర్థమునకు హేతువు" అను నీతిని బోధించు ముసలి పులి - బాటసారి కథ చెప్పఁబడినది. పిమ్మట మృగ కాక జంబుకముల కథ "సర్వ విధముల విచారింపక యేపనియు చేయరాదు" అను నీతి నుద్ఘోషించుచున్నది. ఈ కథలోనే (అనఁగా మృగ కాక జంబుకముల కథలో) "కొఱగానివారితో మైత్రి విపత్తునకు కారణ" మనుదానికి దృష్టాంతముగా మార్జాలమునకు జరద్గవమను గృధ్రము తావిచ్చి మృతిఁబొందు కథ పొందుపఱుపఁ బడినది. మూలకథ నడచుచున్న కొలఁది నింకను మూఁడు కథలు లోభిత్వమే వినాశహేతువు అను నీతికి ననుసరణముగా రచితములైనవి. ఇవి వీణాకర్ణ చూడాకర్ణుల కథ (మూషికము యొక్క స్వవృత్తాంతము), జంబుకము - వింటినారి కథ, చిత్రాంగుఁ డను జింక తన పూర్వవృత్తాంతమును కాక కూర్మ మూషికములకు చెప్పుట. ఇంతటితో మిత్రలాభ మందలి కథలు సమాప్తము లగుచున్నవి.

ఇఁక మిత్రభేదము పింగళక సంజీవకము లను సింహ వృషభముల కథతో ప్రారంభమగుచున్నది. ఇందు కథాసూత్రమును నడిపించువారు కరటక దమనకు లను జంబుకములు. వీ రిరువురి సంభాషణయందును నీక్రిందికథలు ప్రసక్తములైనవి. పింగళ సంజీవకములకు ప్రథమమున మిత్రత్వము నేర్పఱచి తుదకు భేదమును కలిగించుట కీ కరటక దమనకులే కారణ భూతులు. కావున నట్టివా రేవిధముగా ప్రవర్తించి కార్యాను కూల్యము చేయవలయునో యాపద్ధతులను లోకమునకు విశదమొనర్చుటకు నీకథలావశ్యకము లైనవి.

కథలు. నీతులు.
1. కోతి - ఱంపపుదూలముకథ జోలిమాలినపనికి పోరాదు.
2. ఓండ్రపెట్టి మోదుపడిన గాడిద కథ పరాధికారము పై వేసికొనుట హానికరము.
3. జంబుకము - దుందుభికథ శబ్దమాత్రమునకు నివ్వెఱపోవం జనదు.
4. ఆషాఢభూతిసన్యాసి, మేష యుద్ధము, జంబుకము దైవము ప్రతికూలంభైన పురుషకారంబెల్ల వ్యర్థంబై చనును.
5. కాకముపాయముచే సర్పమును మృతినొందించుట. ఉపాయంబుచే నేయది సాధ్యంబగు నాయది పరాక్రమ శతంబుచే నైన సాధ్యంబు గాదు.
(అ) దు:ఖించుచున్న కాకమునకు నక్క చెప్పిన కొంగను ఎండ్రి చంపిన కథ.
6. కుందేలు - సింహము కథ బుద్ధిబలముగలవారికి ఇతర విధమగు బలము లేకున్నను కొఱఁతలేదు.
7. మందవిసర్పిణి యను చీరపోతు - డిండిమం బను నల్లి కథ. స్వరూపం బెఱుఁగక పరునిం జేర్చిన వాని కవశ్యము హాని సంభవించును.
కథలు. నీతులు.
8. వ్యాఘ్ర జంబుకములు లొట్టియను కపటోపాయంబుచేత స్వామియను సింగంబుచే చంపించుట. భృత్యులు మాయోపాయముచే నెట్టికార్యమునైన సాధింపఁగలరు.
9. వడ్రంగి - సింహము కథ. క్షుద్రజనపరివృత్తుం డగు రాజు సమాసన్న జనములకు ముప్పు పుట్టించును.
10. టిట్టిభ సముద్రముల కథ. హితవచనముల వినని పాలిశుఁడు నశించును.
(అ) టిట్టిభి వాక్రుచ్చిన తామేటి - అంచల కథ. హితవచనముల వినని పాలిశుఁడు నశించును.
(ఆ) జలాశయ మందలి మూఁడు మత్స్యముల కథ. మతిమంతుఁడు అనర్థము కలిగించు అభిజనమును మానుకొనవలయును. లేదా, యుపాయ సంపన్నుఁడై యుండవలెను; దైవపరుఁడై యుండరాదు.
11. వానరములు - సూచీముఖము కథ. మూర్ఖులకు బుద్ధిచెప్పుట హానికరము.
12. నందనగుప్త సుదర్శనగుప్తుల కథ. తన మేలు గోరి యితరులకు కీడు గోరువాఁడు తప్పక చెడిపోవును.
కథలు. నీతులు.
(అ) నందనగుప్తుని తండ్రి చెప్పిన శాబకములను కాచికొనఁబోయి కోలుపోయిన బకము కథ. ఉపాయమును చింతించునప్పు డపాయమును కూడ చింతింపవలయును.
13. ఇంద్రపాలిత ధనగుప్తుల కథ పరులను వంచింపఁబోయినవాఁడు తాన వంచితుఁడగును.

ఇట్లు నీతిచంద్రిక వేర్వేఱుకథల సంపుటియైనను నొక సముద్రమున కలియు వేర్వేఱు నదులవలెను, ఒకేసూత్రమున బంధింపఁబడిన మౌక్తికములవలెను నొకదాని కొకటి సంబంధము గలిగినవియై, తమ ప్రత్యేకవ్యక్తిత్వము స్థిరీకరించుచున్నవియై యున్నవి. ఇది నీతినిధి యగుటచేత ప్రతిమానవునికి నావశ్యకముగా తెలియఁదగిన దగుటచేతను సంఘములో నన్ని తరగతులవారికి సర్వకాలము పఠనీయగ్రంథమై యొప్పుచున్నది. కావుననే నేఁటివఱకు నిది నియతముగా సర్వజనాదరణమును చూఱగొన్నది.

  1. * ఆనాఁడే కాదు. ముప్పదేండ్ల క్రిందటివఱకును నీకాలమువారికే యవి యందుబాటులో లేకుండెడివి.
  2. * 'సెలవు' తమిళము. 'ఖర్చు' అని దీని కర్థము.