చిత్రభారతము/చిత్రభారతము-పీఠిక

శ్రీరస్తు

చిత్రభారతము

పీఠిక



లక్ష్మీకుచపారిజాతకలికాశ్లిష్టోరువక్షుండు దే
వాళీమౌళిమణిప్రభారుచిరపాదాంభోజుఁ డుద్యద్దయా
లీలన్ ధర్మపురీశ్వరుండు గుణశాలిన్ మాదనాంభోనిధి
ప్రాలేయద్యుతిఁ బెద్దనప్రభు సమగ్రశ్రీయుతుం జేయుతన్.

1


చ.

మనసిజుఁ గన్నతల్లి నెఱమాటలతొయ్యలియత్తగారు చం
ద్రునిసయిదోడు శంకరునితోయజలోచనతోడిజోడు క
న్గొనల సిరు ల్దొలంకు హరికోమలి యెప్పుడు నిల్చుఁ గాత శ్రీ
యెనుములపల్లి మాదసచివేశ్వరు పెద్దనమందిరంబునన్.

2


మ.

దినమున్ బర్వతజాతమీఁది యనురక్తిం బాయఁగాఁజాలకే
తనదేహంబున నొక్కపా లొసఁగి తత్తచ్ఛ్రీలచేతన్ దన
ర్చినలోకంబుల కెల్లఁ దల్లి యుమ దండ్రిం దానె యౌ దేవుఁ డిం
పున శ్రీయెన్ములపల్లి పెద్దవిభునిం బ్రోచున్ దయాయుక్తుఁ డై.

3


చ.

పొలుపుగ నల్లవేల్పునునుఁబొక్కిలితామరపువ్వుముద్దుఁగో
డలిచెలువంబుఁ జూచి పొగడ న్ముఖపంకజ మొక్క టిట్లు నా

కలవడదంచు మోములు రయంబున నాలుగు దాల్చి మెచ్చునా
నలినజుఁ డిచ్చుఁగాతఁ గృతినాథున కర్థిఁ జిరాయురున్నతుల్.

4


ఉ.

సారససంభవుండు సరసంబున నాడు రహస్యభాషఁ ద
ద్ద్వారనిబద్ధకీరము ధ్రువంబుగ నందఱిమ్రోలఁ బల్కఁగా
దూరమునందు సంతసము దూర్కొన నొయ్యన బుజ్జగించునా
భారతి నిల్చుఁగావుత శుభస్థితి నెప్పుడు మన్ముఖంబునన్.

5


క.

చిట్టెలుక నెక్కి యాడెడు
ఱట్టడిరౌతునకుఁ జిలువరాజన్నిదముల్
గట్టుకొని మెఱయు శంకరు
పట్టికి నత్యంతభక్తిఁ బ్రణతి యొనర్తున్.

6


వ.

తదనంతరంబ.

7


సీ.

వాల్మీకిముని కభివందనం బొనరించి
             బాదరాయణునకుఁ బ్రణతి చేసి
బాణమయూరులపాదంబులకు మ్రొక్కి
             కాళిదాసునకుఁ గెంగేలు మొగిచి
మామల్లదేవీకుమారభారవిమాఘ
             జయదేవులకు నమస్కార మొసఁగి
ఘను నన్నపార్యుఁ దిక్కనసోమయాజుల
             వర్ణించి వేములవాడ భీము


తే.

నాచనామాత్యు సోము శ్రీనాథుఁ జిమ్మ
పూఁడి యమరేశు బమ్మెర పోతరాజు
శంభుదాసు హుళిక్కి భాస్కరుఁడు నాది
యైనసుకవుల కెల్ల నెయ్యమున నెరఁగి.

8

వ.

ఇవ్విధంబున నభిమతదేవతాప్రార్థనంబును బురాతనమహా
కవికీర్తనంబునుం జేసి యొక్కమహాప్రబంధరచనాకుతూ
హలాయత్తచిత్తుండనై యున్నసమయంబున.

9


సీ.

అక్షయక్ష్మాభారదక్షదక్షిణభుజా
             కౌక్షేయకక్షత్త్రరక్షితంబు
కూటకోటీశాతకుంభకుంభప్రభా
             మండితాంభోజాప్తమండలంబు
గంధసింధురదానగంధాంధమత్తపు
             ష్పంధయఝంకారబంధురంబు
విశ్వవిశ్వంభరా౽నశ్వరైశ్వర్యప్ర
             దాశ్వరత్నవ్రాతశాశ్వతంబు


తే.

సంతతోత్సవతోషితశంభులింగ
సమ్ముఖేందుశిలానందచారుమంట
వస్థలీనృత్యదంగనాపాదరణిత
నూపురంబగు నేకశిలాపురంబు.

10


సీ.

చలివేఁడివెలుఁగులై కలువదమ్ముల నేలు
             కనుదోయి నేప్రొద్దుఁ గరుణ చిలుక
మేలైన తామరమేడ నాడెడుకన్య
             కిరవైన యురము పెంపంది నెఱపఁ
దొలుచూలుబాపనదొర నింపుతోఁ గన్న
             పొక్కిలిపురుటాలిపూవు చెలఁగఁ
బదియాఱువన్నెలపసిమిఁ జూపెడువింత
             సరిగదుప్పటి మేనఁ జౌకళింపఁ


తే.

బ్రాఁజదువుగుంపుమ్రోఁతలు పరిఢవిల్ల
మేటిజగముల నాడుమిన్నేటిపాప

పుట్టినిల్లైన యడుగులఁ బొల్చి యెపుడు
సంతసంబున వెలయుఁ బాంచాలివిభుఁడు.

11


తే.

ఆజగన్నాథపరమదయాత్తమధ్య
మక్షమామండలుండు భీమప్రతాప
ఖండపరశుండు వైభవాఖండలుండు
భోగివంశాబ్ధిచంద్రుండు భూరిబలుఁడు.

12


సీ.

అనువత్సరంబు బ్రాహ్మణులకు గోసహ
             స్రము లిచ్చు నృగనరేశ్వరునిరీతి
గంధుల కెనగఁ బాకాలచెర్వాదిగాఁ
             జెఱువులు నిలుపు సగరునికరణి
దీవ్యత్ప్రతాపుఁ డై దిగ్విజయంబుఁ గా
             వించు మాంధాతృభూవిభునిలీల
దేవభూదేవతార్థిశ్రేణి కగ్రహా
             రము లిచ్చు భార్గవరాముపగిది


తే.

నిందుశేఖరపాదారవిందయుగళ
భావనాపరుఁ డంగనాపంచబాణుఁ
డతులధైర్యాభిభూతహిమాచలుండు
మానభూపాలచిత్తాంబుఖానఘనుఁడు.

13


సీ.

సర్వసర్వంసహాసంరక్షణక్రియా
             చాతుర్యసప్తమచక్రవర్తి
హరిదంతకరిదంతహరిరాజసురభూజ
             తారకానిర్మలోదారకీర్తి
దుర్వారపరిపంథిగర్వగాఢాంధకా
             రచ్ఛటాహరణమార్తాండమూర్తి

హేమభూధేనుగంధేభఘోటకదాన
             ధారాకృతాంభోనిధానపూర్తి


తే.

యాతఁ డింపొందు లాటకర్ణాటభోట
ఝాటకరహాటపాండ్యపానాటగౌడ
చోళమళయాళరాజసంస్తూయమాన
మానధనుఁడైన చిత్తాంబుఖానవిభుఁడు.

14


శా.

ఆరాజేంద్రశిఖావతంసనిజబాహాయత్తవిశ్వంభరా
ధౌరేయుండు విరోధిమంత్రిముఖముద్రాదక్షుఁ డుద్యద్దయా
పారీణుండు పటీకతారకసుధాపాణింధమశ్రీయశో
హారుం డెన్ములపల్లి మాదవిభు పెద్ధామాత్యుఁ డుల్లాసియై.

15


సీ.

లలితశాస్త్రాగమాలంకారనాటక
             వ్యాఖ్యానదక్షవిద్వజ్జనంబు
లత్యంతమధురవాక్యప్రౌఢకావ్యని
             ర్మాణబంధురకవిగ్రామణులును
శ్రవణసమ్మోదసంజననకారణహృద్య
             గానవిద్యాభిజ్ఞగాయకులును
దత్తిలభరతమతంగాదిమునికృత
             నాట్యకళా[1]ప్రాజ్ఞనర్తకులును


తే.

బాంధవులు సోదరులు హితుల్ భామినులును
వందిమాగధవరులుఁ గొల్వఁగ వినూత్న
చంద్రకాంతశిలానద్ధసౌధరత్న
పీఠికాసీనుఁ డై మనఃప్రేమ మీఱ.

16

సీ.

కౌండిన్యగోత్రదుగ్ధసముద్రచంద్రు నా
             పస్తంబసూత్రశోభనగరిష్ఠు
సర్వవిద్యాభిజ్ఞుఁ జరికొండ తిమ్మనా
             మాత్యాగ్రణికి మాదమకును గూర్మి
నందను నతిశాంతు నారాయణధ్యాన
             తత్పరు శ్రీరంగధామసదృశ
భట్టపరాశరప్రభురంగగురుపాద
             నీరేజబంభరు నిర్మలాత్ము


తే.

ధర్మనాహ్వయు సత్కవితాధురీణు
దాంతు శతలేఖినీసురత్రాణబిరుద
కలితు నను వేడ్కఁ బిలిపించి గారవించి
తేనియలు చిల్క నిట్లని యానతిచ్చె.

17


మ.

శతలేఖిన్యవధానపద్యరచనాసంధాసురత్రాణచి
హ్నితనామా! చరికొండ ధర్మసుకవీ! నీవాగ్విలాసంబు లా
శితికంఠోజ్జ్వలజూటకోటరకుటీశీతాంశురేఖాసుధా
న్వితగంగాకనకాబ్జనిర్భరరసావిర్భూతమాధుర్యముల్.

18


తే.

కావున విచిత్రగతి నలంకారసరణి
మీఱ రసములు సిప్పిల మెచ్చు లొలుకఁ
దెనుఁగు గావింపు నాపేర ననఘ సుకవి
ధీరు లరుదందఁగాఁ జిత్రభారతంబు.

19


వ.

అని యానతిచ్చి కర్పూరతాంబూలంబుతోడఁ గూడ జాం
బూనదాంబరాభరణసంకుమదమృగమదగంధసారంబులు
దోరహత్తులుగా నొసంగి యనిపిన నేనును భుజబలభీమ
ప్రతిగండభైరవ యిరువత్తు గండగోవాళ గండరగండ

భేరుండ మండలీకమృగబేంటెగార సమరరాహుత్తరాయ,
సంగ్రామధనంజయ, కోదండవిద్యాపాండిత్యరఘురామ,
యపరిమితభూధానపరశురామ, నిరంతరభోగసుత్రామ,
యష్టదిగ్రాజమనోభయంకర, దుష్టలాంకుశలారూసరిగ
జాంకుశ, [2]ఇప్పత్తేళుదండియరనాయంకరతలగుండగండ,
హెన్నుకట్టుకుదిరికట్టుమండలీకరగండ, [3]యెబిరుందగండ
సర్వబిరుదరకొవర, వేశ్యాభుజంగ, యనవరతకనక
కర్పూరదానధారాప్రవాహాద్యనేకబిరుదప్రశస్త మధ్య
మమండలాధీశ్వర, భోగివంశపయఃపారావారరాకాసుధా
కర, శ్రీచిత్తాంబుఖానమహీమహేంద్రదక్షిణబాహూ
పరిలసద్విశ్వవిశ్వంభరాభారధౌరేయుండును, సుజనవిధే
యుండును, భాషానిర్జితభోగీంద్రుండును, భోగవినిర్జిత
దేవేంద్రుండును, ధరణీమండలవదాన్యాగ్రణియును,
బంధుచింతామణియును నగు నమ్మంత్రిమణివాక్యంబు లంగీక
రించి మద్విరచితకావ్యకన్యకాకంఠమంగళసూత్రాయమా
నంబగు తదీయవంశక్రమం బభివర్ణించెద.

20


సీ.

కీర్తింపఁగాఁ ద్రిలోకీపాలనక్రియా
             దక్షుఁడై యెవ్వానితనయుఁ డమరె
సకలజగత్తమశ్చయసంహృతిక్రియా
             దక్షుఁడై యెవ్వానితనయుఁ డమరె
భువనత్రయీపదాంభోజమానక్రియా
             దక్షుఁడై యెవ్వానితనయుఁ డమరె
సర్వసర్వంసహాసంవాహనక్రియా
             దక్షుఁడై యెవ్వానితనయుఁ డమరె

తే.

నతఁడు మునికోటిలో మొదలైనమేటి
జంగమస్థావరంబులజన్మభూమి
పుణ్యచరితుండు విమలతపోధనుండు
ప్రబలుఁడై మించి కశ్యపబ్రహ్మ వెలసె.

21


క.

ఆమునికులదుగ్ధాంబుధి
సోముఁడు భువనప్రపూర్ణశుభ్రయశశ్శ్రీ
కాముఁడు పద్మాక్షీజన
కాముఁడు చెన్నప్రధానఘనుఁ డుదయించెన్.

22


చ.

ధరపయిఁ జెన్నమంత్రి వనితామణియైతగు కాంచమాంబకున్
సురుచిరకీర్తి నారనయు శుభ్రయశోనిధి లక్కరాజు శ్రీ
హరిచరణారవిందయుగళార్చనశీలుఁడు వల్లభన్న సు
స్థిరమతి సింగమంత్రియు నృసింహువరంబునఁ బుట్టి రున్నతిన్.

23


క.

అం దగ్రజుండు నరహరి
కుందేందుసమానకీర్తి గుణవతి లక్కా
యిం దగ నుద్వాహంబయి
నందితసుజనుల ముగురు తనయులం గనియెన్.

24


వ.

వా రెవ్వ రనిన.

25


ఉ.

ధీరుఁడు సింగమంత్రియును ధీజనవర్యుఁడు ధర్మరాజు ల
క్ష్మీరమణీశపాదయుగచింతనశీలుఁడు తిమ్మనార్యుఁడున్
ధారుణి నుల్లసిల్లిరి వదాన్యగుణంబుల నందు సర్వధా
శ్రీరమణస్తుతుం డనఁగఁ దిమ్మనమంత్రి చెలంగు నున్నతిన్.

26

క.

చెన్నుగ నాతిమ్మ[4]న య
మ్మన్నవలనఁ గనియె రూపమదనుల గుణసం
పన్నిధుల నత్యుదారుల
నన్నయమంత్రీంద్రు వేంగళార్యునిఁ గడఁకన్.

27


వ.

అందు.

28


క.

అన్నయ్య యర్థికోటికి
నన్నయ్య సమస్తవాంఛితార్థప్రదుఁ డై
మున్నీడు లేనిసంపద
మున్నీటితెఱంగునను సమున్నతిఁ దనరెన్.

29


ఉ.

అమ్మహనీయకీర్తికిఁ బ్రియంబగు తమ్ముఁడు వెంగళన్న రూ
పమ్మున దానసంపదను బాహుబలంబున రూఢి మించఁగా
నెమ్మది లజ్జ నొందుదురు నీరజసంభవుఁ [5]డైనమేటి పెం
దమ్ముఁడు సాగరాత్మభవతమ్ముఁడు ధర్మతనూజుతమ్ముఁడున్.

30


తే.

తజ్జనకపూర్వజుండగు ధర్మరాజు
ధర్మపథమున విహరించు ధర్మరాజు
శ్రీరమాధీశపాదరాజీవభక్తుఁ
డై తనర్చెను శుకయోగియట్ల జగతి.

31


వ.

అం దగ్రజుండు.

32


చ.

నరహరిమంత్రిసింగఁడు దినంబును విప్రులకోర్కు లీయఁ ద
ద్గురుతరకీర్తి మించి సురకోటుల నద్భుత మందఁజేయఁగాఁ
బొరిఁబొరిఁ గల్ఫకంబు లుడి[6]వోయె మరున్నది వట్టివోయెఁ
జందురుఁడును గందె సాగరము తోడనె భంగము నొందె సిగ్గునన్.

33

క.

ఆమంత్రి కులవరేణ్యుని
భామామణి సింగమాంబ పతిహితసుగుణ
స్తోమావలంబ కనియెన్
హేమాచలధైర్యయుతుల నిరువురసుతులన్.

34


సీ.

పరమదయాసక్తి హరిపాదభక్తులు
             మానితాచారంబుగా నొనర్చి
గురునమస్కారభూసురపురస్కారంబు
             లనుదినవ్రతముగా నాచరించి
శిష్టరక్షణమును దుష్టశిక్షణమును
             నిత్యకృత్యంబుగా నిర్వహించి
సత్యభాషణమును సాధుపోషణమును
             నైజవర్తనముగా నోజపఱిచి


తే.

శౌనకవ్యాసశుకపరాశరవసిష్ఠ
నరవిభీషణగాంగేయనారదాది
పరమభాగవతోత్తమస్ఫురణ మించు
వారు నారయ మాదయ్య గార లవని.

35


శా.

వందారువ్రజదోషమేఘపననున్ వారాశిగంభీరు నా
నందాత్మున్ హరిపాదభక్తు నిఖిలామ్నాయజ్ఞు విశ్వంభరా
మందారక్షితిజాతము న్నిగమసన్మార్గప్రతిష్ఠాపకున్
గందాళాప్పగురున్ వివేకనిధి లోకఖ్యాతు వర్ణించుచున్.

36


క.

ఆదేశికపదకమలము
లాదరమున హృదయవీథి ననవరతంబున్
మోదమున నిలిపి శ్రీలల
నాదయ మనినారు నారనయు మాదనయున్.

37

వ.

అందు.

38


సీ.

ఏమంత్రికులదైవ మిందిరావల్లభుం
             డళగుసింగరి దయాయత్తమూర్తి
యేమంత్రి మందిరం బెల్లభూసురసుహృ
             జ్జనసమూహములకు మనికిపట్టు
ఏమంత్రి మానసతామరసంబు స
             త్యదయాగుణముల కాస్థానసీమ
యేమంత్రిమతి పన్నగేంద్రపంకజగర్భ
             చిత్రగుప్తాదుల సిగ్గుపఱుచు


తే.

నతఁడు సతతాన్నదానపరాయణుండు
బ్రహ్మవిద్యాభినవబాదరాయణుండు
రత్నపూజాప్రహృష్టనారాయణుండు
శ్రీయుతుఁడు సింగమంత్రినారాయణుండు.

39


క.

క్షమయెల్లఁ దానె కైకొని
కమలాక్షపదాబ్జభక్తి గలిగి సదా భో
గములం బొలుపొంది యనం
తమహిమచే సింగమంత్రి నారాయ వెలయున్.

40


తే.

కోరి యాతండు శ్రీవత్సగోత్రజాతుఁ
డైన [7]యప్పలనారయ యతివ సింగ
సాని గాంచిన చెన్నాఖ్యచంద్రవదనఁ
బరిణయం బయ్యె సంతోషభరితుఁ డగుచు.

41


సీ.

వనజాక్షపదభక్తి ననసూయ యౌటచే
             నఖిలప్రపంచసమాత్మ యయ్యె

ననిశంబు ధర్మవర్తన నరుంధతి యౌటఁ
             బరమపాతివ్రత్యభరిత యయ్యె
శ్రీసర్వమంగళాకృతిఁ దనర్చుటఁ జేసి
             సత్కుమారోదయస్థాన యయ్యె
నసమక్షమారూప మంగీకరించుట
             నధికగోత్రాశ్రయఖ్యాత యయ్యె


తే.

నరయ నారాయణప్రియ యగుటకతన
లక్షణాన్విత లావణ్యలక్ష్మి యయ్యె
ననుచు నందఱుఁ గొనియాడ నతిశయించుఁ
జిరయశోగుణనికురంబ చెన్నమాంబ.

42


క.

ఆదంపతులకుఁ గలిగిరి
తేజోవిభవమున విమలదీధితిభాస్వ
ద్రాజులు వైభవనిర్జర
రాజులు నరసింగవిభుఁడు రంగప్రభుఁడున్.

43


సీ.

అమితప్రభావసౌమ్యాకారములయందుఁ
             బ్రతిపోల్ప నశ్వినీసుతు లనంగఁ
బరమకృపావిష్ణుపాదార్చనలయందు
             గణుతింప రామలక్ష్మణు లనంగఁ
జండకోదండదీక్షాసాహసములందు
             శ్రవణింపఁగాఁ గుశలవు లనంగ
నురుతరబాహాబలోపాయములయందు
             వివరింప రామకేశవు లనంగఁ


తే.

దగిలి వర్తించు పూవును దావి యనఁగఁ
దనువుఁ బ్రాణంబుననఁ బొగడ్తలకు నెక్కి

పాయరానట్టి చెలిమి సౌభ్రాత్రమహిమఁ
జెంగలింతురు నరసింగరంగఘనులు.

44


ఉ.

వారలలోన నగ్రజుఁ డవారితశౌర్యధురంధరుండు ది
గ్వారణదంతసంకలిత[8]భద్రయశోవిభవుండు దీనమం
దారుఁడు సంగరస్థలవిచారితశాత్రవుఁ డంగనామనో
హారుఁడు నారసింహసచివాగ్రణి మించు వసుంధరాస్థలిన్.

45


ఉ.

 సాగరయక్షరాజజలజాతహితాత్మజ[9]వారివాహతా
రాగణనాథులం దెలియరాక కవుల్ నెఱదాతలందు రా
యేగురి దానసంపదలు నేగుఱి సంతతభోగవైభవ
శ్రీగుణశాలి నారయనృసింహునిత్యాగముఁ బేరుకొన్నచోన్.

46


సీ.

పట్టించె వేడ్క సద్వైష్ణవబ్రాహ్మణ
             యాచకతతికి నానార్థములను
మట్టించెఁ గలన సామ్రాణితేజీలచే
             మత్తారిరాజన్యమస్తకములఁ
బెట్టించె నెడరైన పృథ్వీస్థలంబుల
             ధర్మసత్రంబు లుద్యానములును
గట్టించె నమృతాంశుకంజాప్తతారక
             స్థితి మీఱఁ జెఱువులు దేవళములు


తే.

నాతఁ డెన్ములపల్లివంశాంబురాశి
తోషకరనిత్యపరిపూర్ణతుహినకరుఁడు
దనరు సర్వంసహాధీశదండనాథ
మకుటమణియైన నరసింగమంత్రివరుఁడు.

47

ఉ.

ఆనరసింగమంత్రికిఁ బ్రియంబగు తమ్ముఁడు రంగనాథుఁ డం
భోనిధికన్యకారమణపూజనశీలుఁడు పద్మలోచనా
మానసరాజహంసము సమస్తదిశాపరిపూర్ణకీర్తిల
క్ష్మీనిధి దండనాథకులశేఖరుఁడై విలసిల్లు నుర్వరన్.

48


తే.

రజతభూమిధరంబుతోఁ బ్రతిఘటింప
దేవళము గట్టి నృహరిఁ బ్రతిష్ఠ చేసెఁ
గురవిపురమున వైభవస్ఫురణ మెఱయ
మంత్రి నారయ రంగనామాత్యఘనుఁడు.

49


సీ.

నాగేంద్రకేయూరనరసింహనరసింహ
             విఖ్యాత మేమంత్రివిక్రమంబు
సాగరస్వర్ధేనుసంతానసంతాన
             విశ్రుతం బేమంత్రివితరణంబు
ధవళనీరేరుహతారేశతారేశ
             సంకాశ మేమంత్రిచారుయశము
పరనృపస్త్రీకుచోపరిహారపరిహార
             కారణం బేమంత్రిఖడ్గలతిక


తే.

యతఁడు సౌందర్యవిజితదేవాధిరాజ
తనయ ధననాథజాత కందర్ప నిషధ
రాజ సకలాగమజ్ఞానభోజరాజు
బ్రహ్మవంశాంబునిధిరాజు రంగరాజు.

50


క.

ఏతజ్ఞనకానుజుఁడగు
నాతతనయశాలి మాధవార్యుఁడు పుణ్యో
పేతగుణంబుల వెలయు ధ
రాతలి కల్పమని సుకవిరాజులు పొగడన్.

51

సీ.

జనవినుతాచారమున నిమ్మహామంత్రిఁ
             జెప్పి వసిష్ఠునిఁ జెప్పవచ్చు
ననుపమకారుణ్యమున నిమ్మహామంత్రిఁ
             జెప్పి శ్రీరామునిఁ జెప్పవచ్చుఁ
బుణ్యపాపవివేకమున నిమ్మహామంత్రిఁ
             జెప్పి వైవస్వతుఁ జెప్పవచ్చు
వనజాక్షపాదభావన నిమ్మహామంత్రిఁ
             జెప్పి శ్రీశుకయోగిఁ జెప్పవచ్చు


ఆ.

ననఁగ భూమియందు నతిశయకీర్తుల
వెలయు నుభయకులపవిత్రుఁ డగుచు
నిద్ధచరితుఁడైన యెన్ములపలి సింగ
మంత్రి నందనుండు మాధవుండు.

52


తే.

అతఁడు కౌశికగోత్రవిఖ్యాతుఁ డనఁగఁ
దనరు గొబ్బూరి లక్కయధర్మపత్ని
చెన్నసానమ్మగన్న రాజీవపత్ర
నేత్రఁ గృష్ణాఖ్యం బెండ్లాడె నిండుప్రేమ.

53


సీ.

శుభలీల మంగళసూత్రంబు మోసిన
             యతివల కీలేమ యగ్రగణ్య
తొడిపూసి కట్టి యెప్పుడు సంతసిలునట్టి
             యువిదల కీభామ యోజబంతి
యనవరతము మాధవారాధనము సేయు
             ముదితల కీరామ మొదలివేరు
కొడుకులఁ జల్లనికడుపునఁ గాంచిన
             పొలఁతుల కీచామ తిలకలక్ష్మి

తే.

దీనజనతతిఁ బ్రోచి వర్ధిలినయట్టి
చెలువలకునెల్ల నీయింతి శేఖరంబు
ననుచు జనములు కొనియాడ నాదిలక్ష్మి
కరణి విలసిల్లి కృష్ణాంబ ధరణి వెలసె.

54


క.

ఆలేమ గనియెఁ గీర్తి
శ్రీలలనావరుల రూపరేఖావిజిత
ప్రాలేయాంశుల విద్యా
నాళీకోద్భవుల సుతుల నలువుర వారల్.

55


సీ.

సిద్ధబుద్ధిప్రభాజితకావ్యజీవకుం
             భీనసకులరాజు పెద్దిరాజు
నానావిధోపాయ నయకళాజ్ఞానత
             ర్జితవైరినృపమంత్రి సింగమంత్రి
యమృతధారాళనానార్థసంపద్వచ
             స్స్థితిరమావరుశయ్య తిరుమలయ్య
యఖిలభూదేవతాహ్లాదకారణసము
             ద్యమపుణ్యసంచారుఁ డన్నగారు


తే.

ననఁగ శ్రీహరి భుజముల యనువు దోఁప
మానవత్వంబుఁ బొందు నంభోనిధాన
ము లన మహిమయు గాంభీర్యమునుఁ దలిర్ప
మీఱుదురు సర్వలక్షణోదారు లందు.

56


మ.

అనతారాతివసుంధరారమణదుష్టామాత్యమంత్రక్రియా
వనదావానలుఁ డార్యహృద్వనజభాస్వన్మూరి మందాకినీ
వనజారాతిపటీరహీరహరశశ్వత్కీర్తి ధైర్యోల్లస
త్కనకక్ష్మాధరు నన్నగారిఁ బొగడంగా శక్యమే యేరికిన్.

57

క.

కడుచిన్న యయ్యు గుణములఁ
బొడవై దీనార్థి విబుధభూరుహమై యె
ప్పుడు ధర్మస్థితిచే న
ల్గడల న్నుతి కెక్కు నన్నగారు ధరిత్రిన్.

58


తే.

రామలక్ష్మణభరతు లారసిదినంబు
మనుపఁ జెలువొందు శత్రుఘ్నుమహిమ మీఱ
నన్న లెల్లను దనుఁ బ్రేమ నాదరింప
నన్నగారును శత్రుఘ్నుఁ డై తనర్చు.

59


సీ.

నలకూబరేందుకందర్పసౌందర్యంబు
             మీఱు నెవ్వాని యాకారరేఖ
పరిపంథిమేదినీపతుల దేవతలఁగాఁ
             జేయు నెవ్వాని కౌక్షేయకంబు
సకలభూసురవనీపకుల దౌర్గత్యంబుఁ
             ద్రుంచు నెవ్వాని వీక్షాంచలంబు
పుండరీకమరాళపూర్ణచంద్రులభంగి
             విలసిల్లు నెవ్వాని విశదకీర్తి


తే.

యతఁడు హరివాసరార్చితక్షితినిలింప
జాలకృతసార్థకాశీర్వచఃప్రవర్ధ
మానమానితసంపత్సమగ్రుఁ డగుచు
గరిమఁ జెలువొందు నల యన్నగారు ధరణి.

60


వ.

తదగ్రజుండు.

61


సీ.

అనిశంబుఁ దమ్ముల కాప్తుఁడై పూర్ణుఁడై
             కందనిద్విజరాజు గలిగెనేని

సతతంబు గోత్రరక్షకుఁడై యజారుఁడై
             వెలయు దేవేంద్రుఁడు గలిగెనేని
మధుపాశ్రయము గాక మ్రాన్పాటు నొందక
             చెలఁగు మందారంబు గలిగెనేని
యొరుచేతఁ జిక్కక తిరుగుడుపడక యూ
             ర్ములు లేక తగునబ్ధి గలిగెనేనిఁ


తే.

గళలపెంపున నతులభోగముల దాన
గరిమ గాంభీర్యసంపద సరిసమానుఁ
డీడుజోడని పోల్పంగ నెసఁగు మాద
మంత్రిశేఖరు తిమ్మనామాత్యవరుఁడు.

62


చ.

మదనవిలాసుఁడై యలరు మాదయతిమ్మనమంత్రిచంద్రుఁ డ
భ్యుదయము నొంద శాత్రవసమూహముఖాంబుజముల్ ముడింగె స
మ్మదమునఁ గీర్తిచంద్రిక సమస్తదిశావళి నిండె సత్కళా
స్పదమహిమంబునం జెలఁగె బాంధవకైరవకోటు లున్నతిన్.

63


మ.

అలఘుప్రాభవుఁడైన మాదవిభు తిమ్మామాత్యముఖ్యుండు తా
నెలయూరన్ రజతాచలంబుగతి లక్ష్మీశాలయం బర్థి ని
శ్చలభక్తి న్విలసిల్లఁ జేసి మఱి పాంచాలీశ్వరప్రాంగణ
స్థలి గట్టించె సువర్ణకుంభవిలసత్సౌధంబు నోర్గంటిలోన్.

64


వ.

తదగ్రజుండు.

65


సీ.

అతులితైశ్వర్యదుర్గాధీశుఁ డయ్యు ల
             క్ష్మీసమాకలితుఁడై చెలఁగినాఁడు
నిశ్చలసత్యహరిశ్చంద్రుఁ డయ్యు వి
             శ్వామిత్రదమనుఁడై యలరినాఁడు

భూరిలోకావనపురుషోత్తముం డయ్యుఁ
             బుణ్యజనాప్తుఁడై పొదలినాఁడు
శ్రీకరాంగప్రభాలోకబాంధవుఁ డయ్యుఁ
             గువలయాహ్లాదియై కూర్చినాఁడు


తే.

తనరిపరిపంథిమంత్రిమంత్రప్రభావ
తిమిరసంహారకారణతిగ్మకరుఁడు
సర్వసర్వంసహానాథ సచివముఖ్య
మౌళిమణియైన సింగనామాత్యవరుఁడు.

66


సీ.

తనప్రతాపాగ్ని శాత్రవసమిత్తతి నేర్చి
             భూరిభూమిధ్రంబుఁ బుటము వెట్టఁ
దనశాంతిచంద్రిక జననేత్రకువలయం
             బుల నేలి మరుముఖాంబుజము ముడుఁచఁ
దనదానమేఘ మర్థినికాయచాతకా
             వళిఁ బ్రోచి చంద్రమండలముఁ బొదువఁ
దనకీర్తిలత దిశాదంతిదంతంబుల
             [10]కడఁ బ్రాఁకి కల్పవృక్షంబుఁ బొదువఁ


తే.

నలరుఁ జిత్తాంబుఖానదయాత్తహేమ
చామరాందోళికార్జునచ్ఛత్రవీటి
కాకరండకలాచిభృంగారకాది
రాజచిహ్నాంచితుఁడు సింగరాజు భువిని.

67


క.

గరిమం దక్కినసచివులు
సరి యగుదురె సింగమంత్రిచంద్రునకు మహీ
వరనుతునకు సామిద్రో
హరగండాంకునకు మాదయకుమారునకున్.

68

వ.

ఏతదగ్రజుండు.

69


క.

బాహుబలభీముఁ డశ్వా
రోహణరేవంతుఁ డఖిలరూఢయశస్కుం
డాహవనిర్జితరిపు వీ
రాహంకారుండు పెద్దనార్యుఁడు వెలయున్.

70


ఉ.

నిద్దపుఁగీర్తిసంపదల నీరజబాంధవసూతికంటెనుం
బెద్దన సత్కళామహిమ మీనపతాకునిమామకంటెనుం
బెద్దన రూపరేఖల నుపేంద్రునిముద్దులపట్టికంటెనుం
బెద్దన మాదయప్రభుని పెద్దన మించు ధరాతలంబునన్.

71


సీ.

ఏలించెం బతిచేత హిమధరాధరసేతు
             పర్యంతమేదినీపతులనెల్లఁ
బాలించె నిజబుద్ధిబలముచే నాజ్ఞావ
             శంబులై చెలఁగ దేశంబులెల్లఁ
గూలించె సంగరక్షోణి బాహాసిచే
             దర్పితారాతిజాతంబు నెల్లఁ
దూలించె నీగిచే దుర్వారబుధబంధు
             యాచకవ్రాతదైన్యంబునెల్ల


తే.

మించి చిత్తాంబుఖానభూమీమహేంద్ర
సకలసామ్రాజ్యలక్ష్మీవిశారదుండు
భాగ్యసంపన్నుఁ డెన్ములపల్లి మాద
మంత్రిశేఖరు పెద్దనామాత్యవరుఁడు.

72


సీ.

పరమపావనమూర్తి బంధుచింతామణి
             పుణ్యాంగనాశిరోభూషణంబు

సౌందర్యగాంభీర్యసంభవస్థానంబు
             కాయంబు దాల్చిన కల్పవల్లి
సౌభాగ్యసదనంబు సైరణ భూదేవి
             యతిథులపాలిటి యన్నపూర్ణ
భూదేవతాకోటి పోషింప భామినీ
             దేహంబుఁ గైకొన్న దివ్యసురభి


తే.

లక్షణంబులప్రోవు శీలములఠావు
చికురనిర్జితరోలంబ సింగమాంబ
యనుచు జనులెల్లఁ గొనియాడ నమ్మృగాక్షి
తనకు నర్ధాంగలక్ష్మిగాఁ దనర మఱియు.

73


తే.

పాలవెల్లికి నల్లుఁడై పరఁగినట్టి
యాదిదేవుండు సర్వంసహావధూటిఁ
బెండ్లి యాడినవిధమునఁ బెద్దమంత్రి
లక్ష్మిఁ బరిణయమయ్యె నుల్లాస మెసఁగ.

74

షష్ఠ్యంతములు

తే.

తమ్ములెల్లను దను నిధానమ్ము గాఁగ
దైవమును దేశికుండుఁగాఁ దాత గాఁగ
నాత్మఁ దలపోసి సేవఁ జేయంగ మెఱయు
నీదృశగుణాఢ్యుఁడైన మంత్రీంద్రునకును.

75


క.

మరుదశనమండలేశ్వర
హరిదంతకరీంద్రకచ్ఛపాధిప కిరిరా
డ్గిరిసార్వభౌమబంధుర
ధరణీధౌరేయునకు బుధవిధేయునకున్.

76

క.

నిరుపమవితరణజితజల
ధరసురతరుసురభితరణితనయఖచరశం
కరసఖసుధాఘృణికి వి
స్ఫురణ నభోమణికి మంత్రి చూడామణికిన్.

77


క.

దివిజతురగ విశదగిరి సి
తవనజ శరభ హరి హర శతదృతియువతి కై
రవహిత వృష విషధరధవ
ధవళయశోనిధికి సంతతదయాంబుధికిన్.

78


క.

ధీరునకు రూపనిర్జిత
మారునకుం గృష్ణమాకుమారునకు గుణా
ధారునకుఁ జాపనిగమకు
మారునకున్ విబుధసుకవిమందారునకున్.

79


క.

శాతాసిహతోచ్చల దభి
యాతినృపాలకవిదారితాదిత్యునకున్
భూతలగురుపాండిత్యున
కాతతసత్యునకుఁ బెద్దనామాత్యునకున్.

80
  1. ప్రౌఢ
  2. హి
  3. యెంతెంబరగండ
  4. నఁ గడుమన్ననతోఁ
  5. డాసినట్టి
  6. వోయెను వెల్వలఁబోయె మబ్బు. చం.
  7. యుప్పుల
  8. కమ్ర
  9. మేఘవాహ
  10. కలఁ