చాటుపద్య రత్నాకరము/ద్వితీయతరంగము

శ్రీరస్తు

చాటుపద్యరత్నాకరము

ద్వితీయతరంగము

రాయనభాస్కరుఁడు

ఈరాయనభాస్కరుఁడు మహాదాత. రాయనభాస్కరు లనేకులు కలరు. ఈభాస్కరుఁడు ముప్పదియిద్దఱు మంత్రులలోనివాఁడు. ఈమహాదాతనుగూర్చి యనేక చాటుపద్యములు రచింపఁబడియున్నవి.

ఉ. సన్నుతలీలఁబాడ నలసంతతిఁ గర్ణుఁడు దాత గాక వా
   రన్నలఁ దమ్ములందు నొక రైన వదాన్యులు గారు; కీర్తిసం
   పన్నుని రాయనప్రభుని భాస్కరుసంతతి నెంచి చూడ వా
   రన్నలు దమ్ము లింటఁ గలయందఱు దాతలు భూతలంబునన్.

సీ. నిత్యసత్యత్యాగనీతిలో శిబిఁ జెప్పి
               మిముఁ జెప్పి మఱియును మిమ్ముఁ జెప్పి
   బహుపరాక్రమమునఁ బరశురామునిఁ జెప్పి
               మిముఁ జెప్పి మఱియును మిమ్ముఁ జెప్పి
   రఘుకులోత్తముఁ డైన రామచంద్రునిఁ జెప్పి
               మిముఁ జెప్పి మఱియును మిమ్ముఁ జెప్పి
   సుకుమారతను సరి సురరాజసుతుఁ జెప్పి
               మిముఁ జెప్పి మఱియును మిమ్ముఁ జెప్పి

గీ. చెప్పఁ దగుఁగాక యితరులఁ జెప్పఁదగునె?
   కలియుగంబున నీవంటిఘనుఁడు కలఁడె?
   అమితగుణసాంద్ర! మానినీకుముదచంద్ర!
   భాగ్యదేవేంద్ర! రాయనిభాస్కరేంద్ర!

సీ. ఏవేళఁ జూచిన నిందిరానందమై
               యందమై చెలఁగు నీమందిరంబు
   ఏజాముఁ జూచిన నిష్టాన్నభోజనా
               నందమై చెలఁగు నీమందిరంబు
   ఏపాలఁ జూచిన గోపాలసత్కథా
               ళిందమై చెలఁగు నీమందిరంబు
   ఏప్రక్కఁ జూచిన సుప్రజానాయకా
               ళిందమై చెలఁగు నీమందిరంబు
   గాక తక్కినమంత్రివర్గములయిండ్లు
   మేకమెడచండ్లు గిజిగాండ్లమెఱుగుగూండ్లు
   పూవుఁబోఁడులు నిర్మించు బొమ్మరిండ్లు
   భవ్యవిభవేంద్ర! రాయనిభాస్కరేంద్ర!

సీ. బట్టు దీవించుచు బాసికంబును జూప
               వెలయఁ బెండిలి చేసి వేడ్కఁ బంపెఁ
   జొప్పకట్టలమీఁద సోలియుండఁగఁ జూచి
               పట్టెమంచము పాన్పు బట్టు కిచ్చె
   వలెత్రాడుఁ జూపినఁ జెలఁగి యెద్దు నొసంగెఁ
               బలుపుఁ జూచినఁ బాడిపశువు నిచ్చెఁ
   గళ్ళెంబుఁ జూపిన ఘనత గుఱ్ఱము నిచ్చె
               జుట్టఁ జూపిన దాసి సుదతి నిచ్చె

   స్నానమాడంగఁ గడియంబు జారఁ గడమ
   కడియమును వేయ శాంభవి కరముఁ జూపె
   వెలయరాయల కుంగ్రమ్ము వేసి చూపె
   సర్వమాన్యుండు వినుకొండశాసనుండు
   భవ్యభరతుండు రాయనభాస్కరుండు.

సీ. శ్రీగిరిప్రాగ్దిశశ్రీల కానాలమై
               విలసిల్లు విరిదండ విన్నకొండ
   విబుధాధిరాణ్మౌళివిశ్వంభరవ్రజ
               విజయధాటికి జెండ విన్నకొండ
   వేదవేదాంతవిద్యావిచక్షణ
               విదవజ్జనులకండ విన్నకొండ
   రాయనభాస్కర ప్రాంచత్ప్రధానుండు
               విత్తము లిడుకొండ విన్నకొండ
   కొండవీడాది పెనుగొండ గోలకొండ
   కొండపలిసీమ మేలైనకొండవీడు
   దుర్గముల కెల్ల బలుదొడ్డ దొడ్డకొండ
   భాస్కరునికొండ వినుకొండఁ బ్రబలుచుండ.

క. ఏకొండయు వినుకొండకు
   రాఁగోరదు సాటి పోటి రా నేరదుగా
   చేకొని రాయనిభాస్కరు
   డేకోన్నతవృద్ధి మీఱ నేలుట చేతన్.

క. ఆవినుకొండకు రెండవ
   దేవేంద్రుఁడు భాస్కరుండు దీపించె భళీ
   ఏవేళ నర్థికోటికిఁ
   గావించుచుఁ గనకవృష్టి కడుఁ జోద్యముగన్.

సీ. దాతతో నర్థులతారతమ్యముఁ దెల్పి
               యిప్పింప నేర్చుఁ దా నీయ నేర్చు
   నవరసాలంకారనయకవిత్వప్రౌఢిఁ
               దెలియనేర్చును మూఢుఁ దెలుప నేర్చు
   భట్టసంఘట్టఘరట్టవాగ్దిట్టయై
               చదువఁగా విన నేర్చుఁ జదువ నేర్చు
   మానుషాధిపులైన మానవాధీశుల
               మెప్పింప నేర్చుఁ దా మెచ్చ నేర్చు
   దాత కవి భట్టు మంత్రియుఁ దానె యగుచు
   మంతు కెక్కెను ధారుణీమండలమున
   సరసహృదయుండు! వినుకొండశాసనుండు!
   భవ్యభరతుండు! రాయనభాస్కరుండు!

సీ. నీదేవదేవుండు నిజభక్తరక్షాప
               రాయణుం డాదినారాయణుండు
   నీతాత జగదేకదాత రాయనమంత్రి
               భాస్కరాన్వయుఁ డైన భాస్కరుండు
   నీతండ్రి వితరణఖ్యాతినిఁ గలియుగ
               కర్ణుండు రామలింగప్రధాని
   నీతల్లి పతిహితనీతి నరుంధతీ
               దేవితోఁ బ్రతివచ్చు తిరుమలాంబ
   తనర వెలిసితి వత్యంతవినయవిభవ
   గురుతరైశ్వర్య మహనీయగుణగణాఢ్య!
   సరసహృదయుండ! వినుకొండశాసనుండ!
   భవ్యభరతుండ! రాయనభాస్కరుండ!

క. వగ గల్గి యర్థి కీయని
   మొగముండల కేల మొలిచె మూతిని మీసల్
   తెగగొరుగఁ డాయె మంగలి
   రగ డొందగఁ గీర్తికాంత రాయనిబాచా!

క. మీఁగాలుబంటినీటికి
   నీగుదు “రమక్క” యనుచు నిలలో వనితల్
   వేగమె దాటెఁ బయోధుల
   ఱాగ భవత్ కీర్తికాంత రాయనిబాచా!

సీ. రంగత్కృపాదృష్టి గంగాభవానికి
               మణికంకణంబు లేమంత్రి యొసఁగె
   భిక్షార్థ మీయఁగా నక్షయం బగునట్లు
               మార్తాండుఁ డర్థ మేమంత్రి కొసఁగెఁ
   దగ వేఁడినంతలో జగతిపై నర్థికి
               మానంబు ప్రాణ మేమంత్రి యొసఁగె
   మీసంబు తాకట్టు వేసి పదార్థంబు
               మహిమచే నర్థి కేమంత్రి యొసఁగె
   అతఁడు నందవరీకవరాన్వయుండు
   దుర్ఘటుండు వసిష్ఠగోత్రోద్భవుండు
   శత్రుమథనుండు వినుకొండశాసనుండు
   భవ్యభరతుండు రాయనిభాస్కరుండు.

రామలింగభాస్కరుఁడు

రామలింగభాస్కరుఁడు రాయనిభాస్కరునకు మనుమఁడు. ఈవిషయము ఈక్రిందిపద్యమువలనఁ దేలుచున్నది. రామలింగభాస్కరుఁడు పిన్నవయసున విద్యాభ్యాసము చేయుచుండఁగా నొక బట్టు వచ్చి రామలింగభాస్కరుఁడు వినునట్లుగా

క. రాయనిభాస్కరుతోనే
   పోయెఁ జుమీ కీర్తికాంత.....

అనెనఁట! వెంటనే రామలింగభాస్కరుఁడు తనకరముననున్న మణికంకణమును దీసి బట్టు కొసంగి— పోదె—అనెనఁట! అది విని యచ్చట మఱియొకఁడు—మఱేదీ—అనెనఁట! అప్పు డాబట్టుకవి పద్యము నిట్లు పూర్తిచేసెనఁట.

   ఆయనమనుమఁడు చతురో
   పాయుండగు రామలింగభాస్కరుఁ జేరెన్.

సీ. ఏమంత్రిసత్కీర్తి హిమసేతుపర్యంత
               మవనిమండలము ముత్యాలశాల
   ఏమంత్రిమొగసాల యేప్రొద్దు చూచిన
               సంగీతసాహిత్యసరసగోష్ఠి
   ఏమంత్రియిలవేలు పిందురేఖామౌళి
               చౌడేశ్వరీమహాశంభుశక్తి
   ఏమంత్రి సౌందర్య మిందీవరాక్షుల
               వాలారుఁజూపుల వలపుముద్దు
   అతఁడు హరిదాసవంశాబ్ధి కబ్ధిభవుఁడు
   అర్థిదారిద్ర్యగాఢతమోర్కుఁ డతఁడు
   దానధర్మపరోపకారానుకూలి
   భాస్కరుని రామలింగన్న భాస్కరుండు.

సీ. ఏలినపతికార్య మీడేర్పనేరని
               పట్టుగుడుపుకుఁ బారుపత్తె మేల?
   పరమర్మభేదనోపాయ మెఱుంగని
               పందగోవుకుఁ బారుపత్తె మేల?
   తను నమ్మియుండిన దాక్షిణ్య మెఱుఁగని
               పాపాత్మునకుఁ బారుపత్తె మేల?
   భటకవియాచకబంధుల కీయని
               పరమలోభికిఁ బారుపత్తె మేల?
   అట్టివానిఁ గృపాదృష్టి నరయఁ గానె
   మిండఁడౌ నౌర! భువియందు దండిగాను
   బాలికాజననుత పంచబాణరూప!
   భాస్కరుని రామలింగన్న భాస్కరేంద్ర!

సీ. అతిథికోటికి నింట నమృతాన్నసత్రంబు
               లంబటిసత్రంబు లర్థులకును
   కర్మకాలములఁ బాన్కాలసత్రంబులు
               చల్లసత్రము ధాత్రి కెల్లవేళ
   నంత్యగృహమున రామానుజసత్రంబు
               నూనెసత్రము శిరస్నానములకుఁ
   బౌరబాలురకు నేర్పున పాలసత్రంబు
               కామసత్రము విటగ్రామణులకు
   గట్టడులు చేసె వినుకొండపట్టణమున
   దానసింహాసనాసీనుఁడై నిరూఢి
   నర్థి దారిద్ర్యరూపగాఢాంధకార
   భాస్కరుఁడు రామలింగయ్య భాస్కరుండు.

కోటసింగరాజు

“సీ. పట్టిసపుర వీరభద్రుని ప్రేమచేఁ
   జెన్నొందె శ్రీకోటసింగరాజు...”

అని ముప్పదియిద్దఱుమంత్రులను దెల్పు సీసమాలికలోఁ బేర్కొనఁబడిన సింగరా జీతఁడే. ఈతనిఁ గుఱించిన చాటువులు

క. నరజన్మంబునఁ బుట్టినఁ
   గరణీకమె యుత్తమంబు కరణంబైనం
   బురుషార్థపరుఁడు గావలె
   శిర సెత్తినఫలము కోటసింగమవర్యా!

చ. గడుసరిలోభియర్థ మది కన్నపుదొంగలబందిపోట్లకున్
   బుడమిని వారకాంతలకు భూపతికిం జను కోటసింగ! నీ
   పడసినయర్థ మార్తులకు బాంధవకోటికి యాచకాళికిన్
   గుడులకు సత్త్రశాలలకుఁ గూపతటాకవనప్రతిష్ఠకున్.

సాహిణిమారుఁడు

“సీ. కొనియె భాస్కరునిచేఁ దెనుఁగురామాయణం
   బారూఢి సాహిణి మారమంత్రి....”

అను ద్వాత్రింశన్మంత్రిసీసమాలికాచరణ మీతని నియోగిఁగా నియోగించినది; కాని యీతఁడు బ్రాహ్మణుఁడు కాఁడు.

క. ఇంతులమనమున సరిసా
   మంతులమనములను బుద్ధిమంతులమదిలోఁ
   జింతింపని బ్రదు కేటికి
   సంతతసత్కీర్తిహార! సాహిణిమారా!

కొట్ఠర యెఱ్ఱమంత్రి


ఈతనింగురించి మంత్రులసీసమాలిక యిట్లు చెప్పుచున్నది.

సీ. “తనదుమీసము దీసి తాకట్టుగా నుంచి
   కొర్ఠ రెఱ్ఱం డర్థి కోర్కెఁ దీర్చె....”

ఉ. వీనులు సంతసిల్లు నిను విన్నఁ గనుంగవ నిండువారు నీ
   మానితమూర్తిఁ గన్న నిను మంత్రిశిఖామణి యన్ననాలుకం
   దేనియ లొల్కు నీ వొసఁగు దివ్యవిభూషణచందనాదులన్
   మేనును నాసికేంద్రియము మెచ్చును కొఠ్ఠర యెఱ్ఱధీనిధీ!

పెమ్మ సింగరాజు


ఈతడును ముప్పదియిద్దఱుమంత్రులలోనివాఁడె. ఇందు కీక్రింది సీసచరణమే సాక్ష్యము

సీ. “పగతుఁ జుట్టమటంచుఁ బల్కఁగా ధన మిచ్చి
   చేపట్టెఁ బెమ్మయసింగరాజు....”

ఈమంత్రినిగుఱించిన చాటుపద్యములు నీతిబోధకములు. అవి శతకముగా రచియింపఁబడెనేమో కాని, కొన్ని మాత్రమే దొరకినవి.

ఉ. పెట్టక కీర్తిరాదు వలపింపక యింతికి నింపు లేదు తాఁ
   దిట్టక వాదు లేదు కడు ధీరత వైరుల సంగరంబులోఁ
   గొట్టక వాడలేదు కొడు కొక్కఁడు పుట్టక ముక్తి రాదయా
   పట్టపురాజుకైన నిది పద్ధతి పెమ్మయసింగధీమణీ!

ఉ. సత్యములేనిచోటఁ దనుసమ్మతిఁ జెందనిచోట సాధుసాం
   గత్యమునేనిచోట ధనకాంక్షమునింగినచోట శత్రురా
   హిత్యములేనిచోట ఋణమీయనిచోటను గాపురంబుఁ దా
   నిత్యముఁజేయరాదు సుమి నిక్కము పెమ్మయసింగధీమణీ!

ఉ. బూరుగుమ్రానియున్నతియుఁ బూవులుఁ బిందెలుఁ జూచియాసతోఁ
   గీరము లారు నెల్లు తమకించుచునుండి ఫలాభిలాషితన్
   జేరి రసంబుఁ గ్రోలుటకుఁ జించినదూదియు రేఁగునట్టు లా
   కూరిమిలేనిరాజులను గొల్చుట పెమ్మయసింగధీమణీ!

ఉ. మనవికి నొక్కయేడు ననుమానపుమాటకు నాఱునెల్లు నే
   డనిపెదనన్న మాసమవు నన్పెదపొమ్మనఁ బక్షమౌను తత్
   క్షణమిదె యంపితన్న మఱిసంతయు వచ్చును మోక్షమింక నా
   మనవికి యెన్నఁడో? సుజనమాన్యుఁడ! పెమ్మయసింగధీమణీ!

ఉ. మాడలమీఁద నాస గలమానిసి కెక్కడికీర్తి కీర్తిపై
   వేడుక గల్గునాతనికి విత్తముమీఁద మఱెక్క డాస? యీ
   రేడుజగంబులందు వెల హెచ్చినకీర్తిధనంబు గాంచి స
   త్ప్రౌఢయశంబుఁ జేకొనియె బమ్మయసింగఁడు దానకర్ణుఁడై.

ఉ. పద్దెము లోభికేల? మఱిపందికి జాఫరుగంధ మేల? దు
   క్కెద్దుకు పంచదారటుకు లేల? నపుంసకుఁ డైనవానికిన్
   ముద్దులగుమ్మ యేల? నెఱముక్కర యేల వితంతురాలికిన్?
   గద్దకు స్నాన మేమిటికిఁ గావలెఁ? బెమ్మయసింగధీమణీ!

గోపయ రామయ

ఇతఁడు ప్రథమశాఖాబ్రాహ్మణుఁడు. ఇంటిపేరు హనుమకొండవారు.

సీ. వీఁడెగా శఠమంత్రి వీరధైర్యకఠోర
               భూధరంబులకు దంభోళిధార
   వీఁడెగా సౌందర్యవిభ్రమాదభ్రప
               ర్యాచకఘనయక్షరాజసుతుఁడు
   వీఁడెగా కవిరాజవికటదారిద్ర్యాంధ
               కారభారస్ఫుటకమలహితుఁడు
   వీఁడెగా చతురబ్ధివేష్టితోర్వీచక్ర
               యాచకావళికిఁ గర్ణాంశదాత
   మంత్రిమార్తాండదుర్మంత్రిమదవిరోధి
   అఘవిదూరుండు హనుమకొండాన్వయుండు
   గణికనిర్వాహుఁ డగ్రశాఖాప్రభుండు
   రమ్యగుణపాళి గోపయరామమౌళి.

గుంటుపల్లిసాంబనమంత్రి

మ. హరిపూజొత్కరగుంటుపల్లిసచివేంద్రా! సాంబయామాత్య! నీ
   స్థిరకీర్తిప్రతతిప్రతాపములతో దీటంచుఁ జంద్రార్కులన్
   గరిమన్ పద్మభవుండు త్రాసు నిడి వేగం బైపయి న్బోవఁగన్
   సరి రారంచును గుండలించెఁ బరివేషాపఙ్క్తి రేఖాకృతిన్.

చ. అఱువదినాల్గువిద్య లరయంగను నాలు గసాధ్య మందులో
   దురఘనదానశీలతయుఁ దోరపుఁబాట కవిత్వశౌర్యముల్

   తఱచుగ నుండ వేరికిని తప్పక నీయెడ నాల్గువిద్యలుం
   బురిగొను గుంటుపల్లికులభూషణ! సాంబనమంత్రిశేఖరా!

పసుమర్తి హుళిక్కిమంత్రి


చ. ధరణివదాన్యు నొక్కని విధాత సృజింపక పోయె నంచు ద
   త్తరపడఁబోకుమోయికవి! దైవగతిన్ వినుకొండసీమలో
   మురికిపుడీపురంబునఁ బ్రమోదమున న్వసించు చీవులన్
   మఱవడుపుణ్యమూర్తి పసుమర్తి హుళిక్కిని జూఁడుఁడయ్య మే
   ల్తురఁగము లంబరావళులు తోడనె యిచ్చుఁ గవీంద్రకోటికిన్.

ఉ. మారసమానమూర్తి పసుమర్తికులీనుఁ డుళిక్కి దాతయౌఁ
   బేరుహుళిక్కి గాని పృథివీస్థలిఁ ద్యాగ ముళిక్కి గాదు త్వ
   త్సారకవిత్వసంపద లొసంగక దూరము జారఁ జూచెఁ దౌ
   రౌర! కవీ! యొసంగును వరాలు గుఱాలు సరాలు సేలువల్.

దమ్మవళం పుల్లప్పప్రధాని


ఈతఁడు మంచిదాత. నివాసస్థలము గుంటూరుమండలములోని కుంకెల్లకుంట (కుంకలగుంట) యను గ్రామము. ఆగ్రామమున నీపురుషుఁడు ప్రతిష్ఠించినవనము లిప్పటికిని గలవు.

మ. ఎలమి న్గర్ణుఁ డొసంగుదానములసొం పెల్లన్ బగల్ రెండుజా
   ములపర్యంతమై కాని నీవలె సదామోదస్థితి న్గోర్కు ల
   ర్థుల కేవేళల నీయఁ గల్గెనె? భళా దుర్వారగర్వద్విషో
   జ్జ్వలకాంతారకుఠార! దమ్మళపుశుంభద్వంశపాధోధిస
   ల్లలితాబ్జాహిత! సుప్రజోధ్యమతి! పుల్లప్పప్రధానాగ్రణీ!

ఉ. భూరివదాన్యదమ్మళపుపుల్లపమంత్రిగుణాఢ్యసత్పదాం
   భోరుహయుగ్మముం గడిగి పుణ్యజలంబులు లోభిమంత్రిపైఁ
   జేరెఁడు నెత్తిఁ జల్లి యరచేరెఁడు లోపలికిచ్చినన్ మహో
   దారమనస్కుఁడై యతఁడు ధారుణిఁ గీర్తి వహింపకుండునే?

ఈయమాత్యుఁడు మల్రాజువారితరఫున నేజెంటుగా నుండెను. అప్పుడు తాను వసూలు చేయుచుండిన శిస్తుపయికము నెప్పటి దప్పుడే బ్రాహ్మణసంతర్పణలకును గవీశ్వరబహుమానములకును వెచ్చ పెట్టుచుండెను. ఒకసమయమునఁ బయికము నంతయును దివాణమునకుఁ బంపవలసిన దని జమీన్దారు లుత్తరువులు పంపిరి. ఏజంటుగారిచేతిలో నొకదమ్మిడియు లేదు. అప్పుడు పుల్లప్ప యేమియుఁ దోఁపక, పల్నాడుతాలూకాలోని గుత్తికొండయను గ్రామమునకు కాపురము లేచిపోయెను. ఆకాలమున నాగుత్తికొండ రామరాజువారిపాలనముక్రింద నుండెను. అప్పుడు మల్రాజువారియాస్థానకవియు, ఆకుంకలగుంటగ్రామనివాసియు నగు బట్టుకవి ప్రభువుగారితో నిట్లు మనవి చేసెనట!

ఉ. రాముఁడు లే నయోధ్యవలె రాజిలెఁ గుంకలగుంట పుల్లప
   గ్రామణి గుత్తికొండనగరానకుఁ బిల్లలతోడఁ జేరఁగా
   స్వామి పరాకు నామనవిఁ జక్కగ నీమదినుంచి యంచితో
   ద్దాముని దమ్మళాన్వయునిఁ దప్పక తోఁడుకరావె ధీమణీ!

అంతట సంస్థానాధీశులు పుల్లప్పను మరలఁ బిలిపించి, యథాప్రకారము తమయేజంటుగనే యుంచుకొనిరఁట.

తమ్మడపు సెబాసుమంత్రి

ఉ. ...........................................................................నం
   దమ్ము నిజమ్ము రమ్ము కవనమ్ము కవీ! రచియించిచూడమీ
   దమ్వడాన్వయేందుని వదాన్యశిఖామణి మా సెబాసు మం
   త్రి మ్మతిమంతునిం గనిన దివ్యదుకూలముతోడ గంధపు
   ష్పమ్ము లవారితమ్ముగఁ గృపామతి నిచ్చుఁ గవీంద్రకోటికిన్.

ఉ. నందవరీకబృందమున నాటికి రాయనిభాస్కరుండు సొం
   పొంది వదాన్యుఁ డంచుఁ బొలుపొందెను; నేటికి దమ్మడంపువం
   శేందుఁ డరే! సెబాసనఁ బ్రసిద్ధి వహించెనుగా! సెబాసుమం
   త్రీంద్రుఁడు మంత్రికోటులు నుతింప వదాన్యుఁ డనంగ ధారుణిన్.

ఉ. కాసులు కొన్ని కూర్చికొని గర్వముతో నపకీర్తిఁ బొందువా
   రేసభ సన్నుతిం బడసి రెక్కడి కెక్కిరి దమ్మడంపుసే
   బా సనిపించుకొన్నసచివప్రభు వీవె కదా? నియోగిలో
   కాసమకీర్తిచే రవికులాంబుధిసోముఁడు రాముఁడుం బలెన్.

శా. ఏబోధల్ విని తల్లిదండ్రు లురుభూమీశాంఘ్రిపద్మంబులం
   దేబిల్వావళు లుంచిరో? కవులు నేతీర్థావగాహాప్తులుం
   గాఁ బొల్పారి హరి న్సపర్య లొకదీక్షాసక్తిఁ గావించిరో?
   శాబాసయ్య జనించె దమ్మడపువశంబందుఁ బుణ్యాత్ముఁడై.

ఉ. మందమతిం గవుల్ ఖలుల మందుల గర్వుల దుష్టలోభిరా
   డ్బృందము నెంచఁబోవుట వివేకులు గా రొకవేళఁ గాంచిన
   న్నందవరీకులందు సుగుణాఢ్యుఁ డుదారుఁడు మాసెబాసుమం
   త్రీంద్రుని గాంచినంతనె దరిద్రమతిభ్రమ లూడకుండునే?

ఉ. భాసురకీర్తిశాలి హరిభక్తవిభామతి దమ్మడంపుసే
   బాసనుమంత్రికీర్తి రుచి భాసిలె దిగ్వనితాశిరోగ్రజా

   తీసుమదామమై చటులదివ్యదుకూలమునై యురాజపా
   ళీసితతారహారమయి లీలల కాస్పదమై విచిత్రమై.

ఉ. వేసట లేక యాపరకవేషము బొఱ్ఱలు పోగులుంగరాల్
   మీసము లుండఁజూచి చెయి మేలని యెత్తితి దమ్మడంపు శా
   బాసనుమంత్రిఁ జూచితిని పార్థివకోటులఁ జూడఁబోను గా
   వాసవశాఖి చేతఁగలవారల కేల విచారసంగతుల్?

చ. నలువ సృజించె నౌర మననందవరీకుఁడు దమ్మడంపుస
   త్కులుడు “సెబాస్సెబా”సని బుధుల్ నుతియింపగఁ బేరుఁగాంచెనౌఁ
   గలియుగమందు నాఘనునికన్నను మిన్నవదాన్యుఁ డొక్కడే
   తెలియఁగ భాస్కరుం డని తదీయకులోద్భవు లెంతు రెయ్యెడన్.

పీసపాటి శేషాచల మంత్రి

ఉ. యాచకులన్ సృజించితి సురాగము లెల్ల సురేంద్రునింటిలోఁ
   దోఁచక యుంచి తంచు విధి త్రొక్కటముం బడి పీసపాటి శే
   షాచలమంత్రిచంద్రుని మహాత్ముని తాను సృజించినాఁడహో
   యాచకులార! రండి పరమార్థము లెల్లఁ గొనుండి! దండిగన్.

క. అలశేషాచలపతిఁ గన
   గలఁ దందురు ముక్తి కనులఁ గన్నది లేదే
   యిలఁ బీసపాటి శేషా
   చలపతిఁ గనుఁగొన్నభుక్తి చక్కఁగఁ గలుగున్.

ఉ. తంద్ర యొకింతలో కల పితామహీ నేమిటఁ బూజఁజేసిరో?
   చంద్రునితల్లియుం గుసుమసాయకశూరుని తల్లియున్ హరి
   శ్చంద్రునితల్లియు న్విశదసారసలోచనుతల్లియున్ దయా
   సాంద్రునిఁ బీసపాటికులచంద్రుని శేషునిఁగన్నతల్లియున్.

ఉ. ఖేచరభూధరంబు పరుగెత్తినభానుఁడు పశ్చిమంబునన్
   దోచిన వీతిహోత్రుఁడు జడోజ్జ్వలుఁడైన గిరిన్సరోజముల్
   సూచిత మైనఁ బుణ్యగుణశోభితుఁడై తగు పీసపాటి శే
   షాచలమంత్రిపుంగవుఁ డసత్య మొకింత వచింపఁ బూనునే?

గీ. మిమ్ముఁ గనుఁగొని “కల్పద్రుమమ్ము సుమ్ము
   సఫల” మనుకొని కనుఁగవ సంతసించె
   పీసపాటికులాంభోజ! ధీసమాజ!
   దానసురభూజ! శేషప్రధానిభోజ!

చ. ఇలు నిలువెంబడిం దిరిపె మెత్తెడుశంభుని నమ్మలేదు; కోఁ
   తుల నొనఁగూర్చి రావణుని దున్మినరాముని నమ్మలేద; యా
   కలిఁ గొనువేళవారెవరుఁ గన్నులఁ చూడరు పీసపాటిస
   త్కులుఁ డగు శేషమంత్రిఁ గనుఁగొన్నను నాఁకలిఁ దీర్చుఁనర్థికిన్.

ఉ. పూచినయట్టికొమ్మలివి పో! కరము ల్నఖపఙ్క్తి గాదు శో
   భాచయపల్లవంబు లివి భవ్యపదంబులు గావు చక్కఁగా
   యాచకకోటి బాంధవజనావళిఁ బ్రోవఁగఁ బీసపాటి శే
   షాచలవల్లభాకృతిసురాగము సంభవమయ్యె ధారుణిన్.

ఉ. చందురుఁ డుద్భవించె సరసంబుల బ్రోవఁగ నెన్నభానుఁడిం
   పొందుచు నుద్భవించె బిసపుంజము లుల్లము లుల్లసిల్ల గో
   విందుఁడు సంభవించెఁ బృథివీస్థలిఁ బ్రోవఁగఁ బీసపాటివం
   శేందుఁడు శేషశైల ముదయించెర! యర్థులఁ బ్రోవ నేటికిన్?

గుమ్మడి వెల్లికృష్ణయ్య


సీ. కాలకంధరఘోరకంధరారభటికి
               భీతుఁడై చెలువంబు విడుఁవడేని

   పవికరాభీలసంభగ్నాంతరంగుఁడై
               మున్నీటిలోపల మునుఁగఁడేని
   కలశోద్భవునిచేత గాసిఁ జెందక సదా
               స్పర్శార్హవృత్తిఁ దాఁజలిపె నేని
   అమరావళికి నెల్లనమృత మిచ్చెడుతఱి
               నెమ్మోము నీలిమఁ గ్రమ్మదేని
   యాకృతిని ధీరత గభీరిమను వితరణ
   మున సుమాస్త్రు మైనాకసముద్రవిధుల
   నగును గుమ్మడివెల్లివంశాగ్రగణ్యుఁ
   గృష్ణయవదాన్యుఁ బోల్ప నీపృథ్వియందు.

కోఠి సుబ్బారాయఁడు


శా. ప్రత్యబ్దత్వదుదాత్తదానధరణీద్రవ్యాగ్రహారాఢ్యసౌ
   హిత్యేచ్ఛద్విజపంక్తి దీవన లిడున్ “హేభూపవర్యాగ్రణి
   ప్రత్యగ్రప్రభుతా జయో౽స్తు భవతః ప్రాయో” యటంచున్ బలౌ
   ద్ధత్యప్రాభవకోఠిసంతతిపవిత్రా! సుబ్బరాయాధిపా!

వరదామాత్యుఁడు


మ. శరదంభోధరకాలకంధరహరిస్వర్గోహిమాద్రిస్వరా
   డ్ఢరిహంసామరవాహినీబలసమీరాహారజైవాతృకుల్
   కరుణాంభోనిధి మంత్రిపుంగవుఁడు సత్కల్పావనీజాతమా
   వరదామాత్యునికీర్తితోడ సరి జెప్పం బోల దెబ్భంగులన్.

గోపరాజు రామప్రధానుఁడు

ఈరామప్రధానుఁ డొకరాజసంస్థానమున మంత్రిగా నుండెను. ఆకాలమునఁ గరణీకవృత్తి కమసాలులదై యుండగా నీతఁడు నియోగిబ్రాహ్మణుల కిప్పించెను. ఒకతఱి నీతఁడు కృష్ణవేణీనదీతీరమున భూదానము పరిగ్రహించి సశాఖీయుల భరించెనఁట. అందుల “కెప్పుడు నబద్ధపువ్రాఁతలు తగాదావ్రాఁతలు వ్రాసికొని జీవించుచుండు నీ నియోగులు దానపాత్రులా?” అని వైదికులెవరో యాక్షేపింపఁగా నియోగు లెవరో చెప్పిన సమాధానపద్యములు—

ఉ. వ్రాయుట చిత్రమా? వికృతవైదికమా? నిజదారరక్షణో
   పాయముకై నియోగి యిలఁ బార్థివసేవ యొనర్చినంతనే
   పాయునె! వంశశీలములు పాయక యెప్పుడు చిత్రగుప్తులున్
   వ్రాయరె? యెల్లలోకములవారలుఁ జేసిన పుణ్యపాపముల్.

ఉ. మానఘనుండు బ్రహ్మకులమండనమూర్తి పరోపకారి దు
   ర్దానదురన్నముల్ గొనఁడు తప్పఁడు స్వామిహితోపకారముల్
   దీనులఁ బ్రోచు బాంధవవిధేయుఁడు డస్సియు వేఁడఁబోఁడు తా
   నూనినవేడ్కతోడుత నియోగికి నిచ్చినదాన మల్పమే?

కవులు దానపాత్రులు గారని యాక్షేపించుచుఁ జెప్పిన పద్యము—

చ. అవగతశబ్దశాస్త్రచయు లైన మహాత్ములు పండితోత్తముల్
   భువనతలంబునం దధికపూజ్యులు వార లటుండఁ గూటికై
   నవనవకల్పనావిధిచణత్వము తోఁప నబద్ధమాడు నీ
   కవు లిల దానపాత్రు లయి గౌరవమందుట చూవె చిత్రముల్!

పై యాక్షేపణకు సమాధానము—

చ. కవి కమలాసనుండు త్రిజగత్పతి యైనపినాకపాణియుం
   కవియె తలంపఁగాఁ గవులుకారె పరాశరబాదరాయణుల్

   కవికృతపుస్తకగ్రహణగర్వితు లల్పులె పూజ లందఁ గాఁ
   గవు లఁట! దానపాత్రులును కారఁట! యిట్టివి పో విచిత్రముల్.

చ. గురుకులవాసఖేదమునకుం గడు డస్సి యపారశాస్త్రసా
   గరముల నీదియు న్వలఁతి గాఁ డలరింపఁగఁ బండితుండు తా
   వరకవు లద్యదిందుకర వారసమాగమఫుల్లహల్లకో
   త్కరవిగవళన్మరందపదకాండముచే నలరించుచాడ్పునన్.

గీ. ఎంచి యెంచి చూడ నింపయి తోఁచు నీ
   మూఁడులోకములను ముగ్ధ లైన
   మించుబోండ్లచూపు లించురసంబులు
   చతురు లైనకవులసరసమతులు.

చ. పలుమరు శాస్త్రముల్ చదివి పండితుఁడై యజురాణిసత్కృపా
   ఫలమును గాంచి తా రసము బాగుగఁ జెప్ప వలంతి యైనవాఁ
   డిలఁగవి; లాతివాఁడు కపియే యని చెప్పఁగ నొప్పు; జాయ నాఁ
   గులజయ జాయ గాని పెఱకోమలి మాయయ కాక జాయయే?