చాటుపద్య రత్నాకరము/తృతీయతరంగము
శ్రీరస్తు
చాటుపద్యరత్నాకరము
తృతీయతరంగము
కృష్ణదేవరాయలు
ఈప్రభువు పదియాఱవ శతాబ్దిలో నున్నవాఁడు. పండితకవుల నాదరించి యాంధ్రభాషను మరల వృద్ధికిఁ దెచ్చినవాఁ డగుటయే గాక తాను గొప్పకవియై విష్ణుచిత్తీయమను మహాకావ్యము రచించి సుస్థిరయశంబు నందినవాఁడు. ఈమహాపురుషుని జననమునుగూర్చిన చాటువు—
ఉ. అందలిశాలివాహనశకాబ్దము లద్రివసుత్రిసోములన్
వందితమైనయవ్వికృతివత్సరమందలిపుష్యమాసమం
దుందగఁ గృష్ణపక్షమున నుండెడుద్వాదశిశుక్రవాసరం
బం దుదయించెఁ గృష్ణుఁడు శుభాన్వితుఁ డానరసింహమూర్తికిన్.
ఈరాజకవిని వేఱొకకవి యాశీర్వదించిన యాశీర్వాదము—
గీ. పద్మనాట్యస్థలంబునఁ బక్కిలోనఁ
బైరుపైఁ బవ్వళించిన పరమమూర్తి
యనుదినంబును కృష్ణరాయాధిపునకుఁ
జుక్కజగడాలవేలుపు శుభము లొసఁగు.
కోటి తిరుమలరాయలు
ఇతఁడు పుదుకోటప్రభువు. తిరుమలరాయలపుత్రుఁడు. కోటివంశస్థులకు “తొండమాన్” అనునది బిరుదు.
చ. స్థిరజయసాంద్ర! కోటికులతిర్మలరాయధరాధరేంద్ర! నీ
కరకరవాలశాతలను గాంచిన వైరికిఁబోటు దాన నం
బరమణిమేనఁదూటు బలవైరికిఁ దత్తరపాటు రంభవా
తెరపయిఁగాటు సౌరసుదతీమణి కబ్బురపాటు చిత్రమే?
చ. అరుదుగదా తలంపఁ గవులార! ధరాధిపులార! వింటిరా?
శరనిధిమేరఁదప్పినఁ బ్రచండకృశానుఁడు చల్లనైన దు
ర్భరకులిశంబువాడరిన రామునిబాణము సూటి తప్పినన్
దరణిసుధాకరున్ గతులు దప్పినఁ గోటికులాబ్ధిచంద్రుఁడీ
తిరుమలతొండమానుఁడు మదిన్మఱియాడినమాటఁ దప్పునే!
చ. జరజరవచ్చుబాణముల జళ్ళకు గొంకక రింగురింగునన్
మెఱయు తుపాకిగుండ్లకును మ్రెగ్గక ఖల్లను కత్తిపెట్లకున్
వెఱవక నాజిలో రిపుల వేమరు గెల్తువు రాయ తొండమాన్
తిరుమలభూపపుంగవుని తిర్మలభూప! దిలీపవిక్రమా!
చ. నఱకుదు వౌర వైరినరనాథుల గొగ్గిజిరాలు శింగిణి
తరకసజీనిఘోడలవదండథణాలు ఘణీలు ఘల్లనన్
దురమునఁ బెద్దకత్తిఁ గొని దోర్బలశక్తిని రాయతొండమాన్
తిరుమలభూపపుంగవుని తిర్మలభూప! దిలీపవిక్రమా!
ఉ. ఇట్టటుఁ గోటితిర్మలమహీపతియూరక కానివానిఁ జే
పట్టఁడు పట్టఁ డట్లనక పట్టినచోఁ దనయంతవానిగా
గట్టిగఁ జేయుఁగా కసదుగాదు నిజంబుగ నింకఁ జూడుఁడీ
పట్టపురాజులార! భట వంది పురోహితులార! వింటిరా?
సీ. చూచితి నేపాళచోళకేరళపాండ్య
ధరణీధవుల సభాస్థలులనెల్లఁ
గనుగొంటి నంగవంగకళింగకాశ్మీర
వసుధాధిపతుల ప్రాభవములెల్ల
దరిశించితి మరాటకరహాటకర్ణాట
జగతీశ్వరులవిలాసంబులెల్లఁ
గాంచితిఁ గుకురుకొంకణటెంకణవిదర్భ
ధరణీధవులశౌర్యధైర్యపటిమ
లిట్టిసొగ సిట్టివిధవంబు లిట్టిమహిమ
లిట్టియౌదార్యగరిమల నెందుఁ గాన
రాయతిరుమలతొండమాన్ ప్రభూతనూజ!
రమ్యగుణసాంద్ర! తిరుమలరామచంద్ర!
కళిక. మఱియును దుర్జనభర్జనతర్జన, పరిచయ కరజయ శరజాలునకై
నరపతి లక్షణరక్షణ .......................................నిజశీలునకై
హరిదతిహాటకశాటకఝాటక, రరుచిరసురచిరగత్తేజునకై
పరిసరభాసురభూసురవాసర.......................................
అధికృతగర్వితగుర్వితరోర్విత, లాధిపసాదిపదాతివితతికై
మధురిమపూరితసారితగీరిత, మంగళ.........................
కవిజనదాననిదాననిదానన, కరకృతకరకృతవరరేజునికై
అవితతభాషణపోషణభూషణ, సువదనభువదన.................
నవలాల్కనుగల నాట్యపుతళుకై, హవణిలువరుజుల నలరెడు పలుకై
దువలును బూనుకదుముకుచువడికై
శా. స్ఫాయద్దంతి ఘటాఘటోద్భవమదాసారస్ఫుదావాహినీ
.................................ధరారుహవరస్తోమావసంతభ్రమ
ద్గాయద్భృంగసమూహనిష్కుటములౌ దారిన్ సుధీగేహముల్
.......................................ధీరువలనన్ రంజిల్లు నెల్లప్పుడున్,
కళిక. మఱియు విబుధుల కలన, గరిమనుప్రభువలన
.............................................ననివిభువలన
రణధరాదికచలన, రహితశౌర్యునివలన
గుణధరాధికమిళన, కుతుకధుర్యునివలన
మ. ...............................................................
.............................................................నీ
కరణం బల్కిరి తద్గుణైక మని తర్కజ్ఞాళి నవ్వంబడున్
హరతుల్యప్రతిపాద్యుచేత..................................
కళిక. మరియును గవులను మనుచును విభుచే
నరులను కవులను ననుచును ప్రభుచే
కలనైనను బొంకని ధీరు........................
...................................................
గంట్లిండఁగాచిన కైగలదొరచే
గంట్లెడఁగాచిన కైనరవరుచే
కోటికులావనగుణవాక్పతిటే
కోటి..........................నిజముగఁ గొలిచె
ప్రజతగఁబొలిచెన్ దినుసునమనిచెన్
మనిమదినునిచెన్ నెనరునదనుచెన్
విజయరఘునాథరాయలు
సీ. శ్రీహరికరుణావిశేషవైఖరులచే
సామ్రాజ్య మేలుము జయము నీకుఁ
జంద్రజూటునిదయాసాంద్రవైభవముచే
సంపదల్ గాంచుము జయము నీకు
వారిజోద్భవుకృపాపారసత్ప్రేమచే
శౌర్యంబుఁ బూనుము జయము నీకు
మలయకేతనపాండ్యమధురేశువరముచే
సత్కీర్తిఁ జెందుము జయము నీకు
ననుచుఁ గవిబుధపాఠకుల్ వినుతి సేయ
విక్రమస్ఫూర్తికీర్తుల వెలసి తౌర!
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. పైఠాణిపాగపై పైఁడిరేకుతురాయి
చొక్కమై మిక్కిలిసొంపు నింప
హురుమంజిముత్యంపుటొంట్లతో మగరాల
బావిలీలహొరంగు పంతగింపఁ
బూర్ణచంద్రునిరీతిఁ బొలుపొందుమోముపై
సిస్తుకస్తురిచుక్క జిగి వహింప
మైని ధరించిన మణిభూషణావళుల్
కొమరొప్పుకాంతులఁ గ్రుమ్మరింప
నీవు పట్టాభిషిక్తుఁడై నిఖిలజనులు
గొలువ మాణిక్యపీఠిపైఁ జెలగితౌర
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. ధారుణీతలమెల్లఁ దనుదానె యుప్పొంగెఁ
బలుచోరజారబాధలు తొలంగెఁ
జేరికొల్చినవారి కోరికల్ ఫలియించె
విమతులకెల్లను వెత జనించె
బంధుసంతతికి సౌభాగ్యంబుఁ దనరారెఁ
గవుల దారిద్ర్యము ల్కడలి దూరె
సకలసజ్జనులకు సంతోషములు మీఱె
గాయకకోటికిఁ గఱవు తీఱె
నీవు పట్టాభిషిక్తుఁడై నిఖిలమైన
ధరణిజనులకు రక్షింపదలచినపుడె
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. సకలసద్గుణముల జానకీపతి జోడు
మరి నీకు “నారణప్పరశ” బిరుద
గాంభీర్యగరిమచేఁ గలశాబ్ధి నీ కెన
“వరవాకమాలికాభరణ” బిరుద
శౌర్యవిస్ఫురణచే సవ్యసాచీడౌను
ధర నీకు “వర్త్కాలతర్క” బిరుద
వితరణఖ్యాతిచే విధుఁడు నీ సాటియౌ
“జయవీరరమణవాళ” చండబిరుద
ధైర్యమున నీకు మేరుభూధరము దీటు
తనర వడుశురుకులదండధారిబిరుద
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. కత్తికిఁ బచ్చిపూల్ గలిగిన నెఱయోధ
బొడ్డుగంట గుఱాని కిడ్డజోత
కపికేతనము గల్గు కదనరంగకిరీటి
వీరకంకణముచే మీఱు మేటి
ప్రతిలేని సింహతలాటంబు గల ధీర
విజామరంబులు వెలయు శూర
గండపెండేరంబుఁ గైకొన్న దునెదారి
పచ్చగొడ్గులు గల్గు ప్రధనశౌరి
పంచెవన్నెలపావడల్ పరగు నేత
మానరక్షణబిరుదంబుఁ బూనుదాత
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. మదనుని యాకారమహిమంబు విడనాడి
యనిరుద్ధు సౌందర్య మణగఁద్రొక్కి
చందురు నెమ్మేని సారము నిరసించి
మహిని జయంతుని మట్టుపఱచి
నలకూబరుని నిండుచెలువమ్మునను రెమ్మి
నకులుని శృంగారనయము గేరి
నలరాజురూపంబు ననుఁజూచి యణకించి
గాంగేయుచందంబుఁ గాకుసేసి
కృష్ణదేవుని యందంబుఁ గ్రిందుపఱచి
సాటిలేకుండ మీఱె నీ చక్కదనము
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. తూనిక దాతాయెఁ దొలుదొల్త శిబిరాజు
చంచల దాతాయె జలధరంబు
కఠినదాతాయెను కాంచఁ జింతామణి
వీసపుదాతాయె వెలయువిధుఁడు
పరకదాతాయెను పరికింపకి..........
పాతికేదాతాయె భానుసుతుఁడు
అరనాసిదాతాయె నంబికారమణుండు
ముక్కాలుదాతాయె మున్నెబలియుఁ
గాన నీసాటి నెఱదాత కలియుగాన
నరసిచూడంగనేగాన హరిసమాన!
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. విడిబడి శేషుని పడగలు విడియించి
పాలమున్నీటిని భంగపఱచి
కలువలచెలికాని కాంతులు కఱగించి
మఱి తారకలనెల్ల మాయఁజేసి
ఆకాశవాహిని నబ్ధిలోపల ముంచి
వెలిదమ్మివిరులను విరియఁజేసి
పూని శంఖంబుల పొట్టలెల్లనుఁ జించి
కల్పవృక్షములఁ జీకాకుపఱచి
హారహీరపటీరనీహారరుచుల
మీఱి నీకీర్తి ధరలోన మెఱసె నౌర
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. ప్రతిలేని మైసూరిపతి కేతనముమీఁద
నెలకొన్నసింగంబు నీదుకీర్తి
పాచ్ఛాహుశిరముపై భాసిల్లుచున్నట్టి
నిండుచంద్రజ్యోతి నీదుకీర్తి
గడిచోడభూపతి కంఠదేశంబున
నెలకొన్నహారంబు నీదుకీర్తి
కేరళభూపాలు కెలఁకులఁ జేవల
నెగడు వింజామర నీదుకీర్తి
పరగ సామంతనృపతుల పాగలందు
నిలుచు మగరాతిజిగితురాల్ నీదుకీర్తి
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. భానుని నాకాశపథమునఁ బాలించి
బడబానలంబును జడధిఁ జొనిపి
కాంచనాద్రిని విల్లు గావించి యీడ్పించి
వేలాయుధుని ముందువెనుక జేసి
పద్మరాగంబులఁ బట్టి సానలఁ బెట్టి
యరుణునిఁ గుంటిగా నడరఁ జేసి
విష్ణుచక్రంబును వేయంచు లొనరించి
వారిజోద్భవు విప్రవరుని జేసి
పరగె నీదు ప్రతాపాగ్ని పద్మజాండ
భాండమెల్లను నిండి యుద్దండలీల
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. జోడెనల్ ద్రొక్కును సొగసుగా నొక తేప
మదనద్విరోధుల మస్తకములఁ
జేదాట్ల దాటును జగ్గుగా నొకసారి
కుటిలవిద్వేషుల నిటలములను
వేడెముల్ దిరుగును వేడ్కతో నొకమాటు
వీరాధివీరుల వీధులందు
కదలికల్ జూపును ఘనముగా నొకతూరి
సామంతనృపతుల ధామములను
పంచధారలు గనిపించుఁ బరులు బెగడఁ
బూని నీతేజి నృపరాజి పొగడ నాజి
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. ఘల్లుఘల్లుమనంగ గడుసువైరులఁ గొట్టి
ఘలిఘలీలుమనంగ బలులఁ గూల్చి
ఘణిఘణీలుమనంగ గడివీరులను డుల్చి
ఖచిఖచిక్కుమనంగఁ గరుల నొంచి
ఖంగుఖంగుమనంగఁ గంఖాణముల ద్రుంచి
ఖరిఖరీలుమనంగ నరులఁ జిదిమి
కఠికఠిల్లుమనంగ గర్వాంధులనుఁ జెండి
ఖణిఖణీలుమనంగఁ గత్తళములఁ
జించి విదళించి విమతులఁ జీల్చునౌర
మేలు నీకత్తి వైరులపాలిమిత్తి
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. కలనులోఁ బగవారి ఖచిఖచిక్కునఁ గ్రుమ్మి
ఛేదించు నీదు కైజీతబలము
దురములో రిపులపైఁ దూరి గోరించుచుఁ
జెండాడు నీదు కైజీతబలము
అనిలోన విమతుల నదలించి విదలించి
చించును నీదు కైజీతబలము
పోరిలో వజ్రీలఁ బొడిచి పొర్లించును
చేకొద్ది నీదు కైజీతబలము
ఘోరవైరుల బారులఁ గొట్టి కూల్చి
చెలఁగుఁ జలమున నీదు కైజీతబలము
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. ఘోడాలు తోడాలు కేడాలు బొమడికల్
ధరఁ గూల వజ్రీల నఱికి నఱికి
పేఁటలు కోటలు బిగువుజంట జిరాలు
స్థిరవ్రాల వైరులఁ జెండి చెండి
చిలుకొత్తుదగళాలు చికిలిచేదస్తులు
చెదరంగ దునెదార్లఁ జించి చించి
సింగాణితరకసల్ జిగిరేకుకత్తులు
దునియంగఁ బగతులఁ దునిమి దునిమి
తురఁగముల మీటు విమతులఁ ద్రుంచి త్రుంచి
గెలిచె భవదీయరాహుత్తదళము కలన
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. వికటించువైరులవేసి”కో” యని యార్చు
“నదె కయ్య” మన్న నీ యడపకాఁడు
మదవద్విరోధుల హదయముల్ పెకలించు
“రణ”మన్న నీ దుకారాంజివాఁడు
కుటిలవిద్వేషుల గుండెకాయలఁ జీల్చు
“సమర”మం చనిన నీ జారినాఁడు
గర్వించు విమతుల కంఠముల్ తెగఁగొట్టు
గడిదురంబునను నీ గొడుగువాఁడు
నీదుసాహస మెంచి వర్ణింపఁదరమె?
వీరమణవాళబిరుదాంక విక్రమార్క
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. నీభేరి నినదంబు నెగడినయంతనే
మదవద్విరోధుల మతులు గలఁగు
నీడాలు పెటపెటల్ నిండినయంతనే
ఘోరవిద్వేషుల గుండె లదురు
నీకత్తి నిగనిగల్ సోఁకినయంతనే
విమతుల గర్భనిర్భేద మగును
నీఘోటిఖురధూళి నెగడినయంతనే
మత్తుల చిత్తముల్ తత్తరించు
నౌర నినుఁ జూచినప్పుడె యాజి విడిచి
ఘోరవైరులు గుహలలోఁ జేరుచుంద్రు
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. మొనసి స్వామిద్రోహ మొనరించు మూర్ఖుల
పైతలమిత్తి నీ చేతికత్తి
ఏలినస్వామితో నెదిరించు కుమతుల
నెత్తిపై బలుమేకు నీదుబాకు
స్వామికార్యముల వంచనసేయు కుటిలుల
నిటలంబుపై కొంకి నీదువంకి
పతిమాట మీఱిన బండలండీలకు
జమునిదాడిర నీదు జమ్ముదాడి
గదర! యుష్మద్భుజాగ్రజాగ్రత్ప్రతాప
మెన్న శక్యంబె యల పన్నగేంద్రునికిని
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. మఝ్ఝారె! నీవంటి మహిపచంద్రుఁడు కల్గఁ
దప మాచరించిరో ధరణిసుతులు?
మాయురే! నీవంటి మనుజసింహము కల్గ
బద్మాక్షుఁ గొల్చిరో బంధుతతులు?
చాగురే! నీవంటి జననాయకుఁడు కల్గ
నేవర మందిరో యిష్టసఖులు?
భల్లారె! నీవంటి ప్రభుశిరోమణి కల్గ
నేపూజఁ జేసిరో యెల్లకవులు?
మేలు! శహబాసు! నీవంటిమేటి కలడె
జలధి వలయితధారుణి చక్రమునను?
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. అల్లమార్కండేయు నంతదీర్ఘాయువు
సూర్యునియంత తేజోభరంబు
శంకరునంతటి శాశ్వతైశ్వర్యంబు
దేవేంద్రునంతటి దివ్యభోగ
మర్జునునంతటి యాహవశౌర్యంబు
భీమసేనునియంత భీమబలము
నళరాజునంత పుణ్యశ్లోకతాయుక్తి
మాంధాతయంతటి మహితకీర్తి
అనిలునంతటి సత్ప్రతాపాతిశయము
కర్ణునంతటి యీవియుఁ గలిగి మనుము
భళిర! తిరుతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
ఈప్రభువుపై వేఱొకకవి రచించిన పద్యములు.
క. శ్రీకంఠుని కృపచేతను
నీకత్తికి దీటులేక నిఖిలధరిత్రిన్
జేకొమ్ము శాశ్వతమ్ముగ
రాకాశశిరూప! విజయరఘునాథనృపా!
సీ. కత్తికి పచ్చిపూల్ గలిగిన హంవీర!
బొడ్డుగంట గుఱానికిడ్డశూర!
సాంబ్రాణిధూపవాసనలు గైకొను మేటి!
గండపెండేరంబుఁ గలకిరీటి!
పంచవన్నెలు గల్గు పావడల్ గలయోధ!
నవబత్తు గలయట్టి యవనినాథ!
సింహతలాటంబుఁ జెల్లించు వజ్రీడ!
వేటుపావడఁ గల్గు పోటుకాఁడ!
మకరబిబ్బీలు కల్గిన మన్నెరాయ!
చంద్రసూర్యాదివాద్యపు సమితజేయ
కోటికులవర్య! రణనిరాఘాటధైర్య!
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. చేపట్టు సడలక చివ్వున వీఁడక
తెగవునఁ దప్పగ తెట్టగిలక
విసరెడి తావుల వెలిగాక కడివోక
సుంకులు రాలక చుట్టుకొనక
గడుసైన తావులఁ దడఁబడి నిలువక
సామానటంచన్న సరకుగొనక
కాదని వంపైన గతికూడకుండక
కొనకత్తి మెండైనఁ దునిగి చనక
దొనకు దిగియేటు పోటును చినుకు నిఱుకు
విసరులను హత్తి బిరుదుకక్కసపు బంట్ల
జిగురుఁ దినిపించు నౌర నీ చేతికత్తి
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. వడివేయు మీసంబు పట్టునఁ జిక్కఁగా
వీడియు డాచేత వ్రేలు తలలు
కరకరచేతఁ బల్గంటి సేయుచునుండ
దొర్లి ముంజేఁత బట్టుకొనెడు తలలు
అడుగంటఁ దెగియుండ నది యెఱుంగక పోర
రమ్మను సన్నచే వ్రాలు తలలు
బిరుదులు పలుకంగ దొరఁగియు మధ్యమ
వైఖరిగాఁ బల్క పడిన తలలు
కదియు బొమముళ్ళ నెత్తురుఁ గ్రక్కు తలలు
నూపి రెగఁదీయు ముక్కులఁ జూపి రిపుల
కుత్తుకలఁ గోయు నీ యసి కోటిరాయ
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. ఆధోరణుని వెన్ను నంటియుండెడి పింజ
దంతితుండపుచుట్లు దాఁక నలుగు
భటునకుఁ గుడిజబ్బఁ బడి కానఁబడు పింజ
డాకేలకేడెంబుఁ దాక నలుగు
రాహుత్తు నెత్తిపై రంజిల్లఁ దగు పింజ
గుఱ్ఱము వలచెవి గొన్న నలుగు
రధికు లస్తకమునఁ గ్రాలుచుండెడు పింజ
నాభిదేశంబున నాట నలుగుఁ
గాన జడిపట్టుచందాన కలనులోన
శరము లగలించుధాటి దేవరకు సాటి
గాన రిపుకోటి నేను జగానఁ గోటిఁ
గోటివంశసనాథ! సంగుప్తబోధ!
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. చికిలిబంగరుపూఁత చిల్లోడుగేడెంబు
చిప్పలంచును చనుల్ జెనక వెఱచి
బేధుమాలెడు జనబ్బీపరంగు మెఱుంగు
ధారగానెంచి నూగారుకలికి
సరిగెపూహరువుల చాయ సూర్యపుటంప
దొనలంచుఁ బిక్కలఁ గనఁగ వెఱచి
ఘాటంపులాహురి నౌటకు విల్లని
బొమముడి పాటున భ్రమ వహించి
భవదహితపాళి యప్సరఃప్రతతికేళి
ఖేదము వహించుగాని సుఖింపదాయె
కోటివంశసనాథ! సంగుప్తబోధ!
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. పాండ్యభూపాలు దీప్తప్రతాపాగ్ని కే
శూరునిబలము సమీరణంబు
మధురేశకీర్తి నిర్మలసుధారాశి కే
యున్నిద్రుజయము చంద్రోదయంబు
త్రిశిరఃపురాధిపతిప్రతిజ్ఞామంధ
రమునకే దొరబుద్ధి కమఠరాజి
విశ్వనాథావనీవిభుమనశ్శుభవధూ
గ్రీవకే భూపాలుసేవ బొట్టు
అతఁడు నీవెగదాపదానతమహారి!
హారికరుణావిహారి! యాహవపురారి!
కోటివంశసనాథ! సంగుప్తబోధ!
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. తేలవైచెడి వేళబాళిచే దొడరిన
వెనుచక్కి మొనఁబడ్డ విసరి విసరి
కంఠంబు కంఠంబుఁ గదిసియున్నటులైన
దాటించి తొడిబడ మీటి మీటి
కావాలపట్టచోఁ గలయక దగచెంది
చెండింపఁగాఁ జేరి జవిరి జవిరి
................................మరలించి
పైపైనిఁ జేకొద్ది వైచి వైచి
జోడనలు మించఁ గురుచల చురుకుఁ జూపి
నరికి నరికి.....................దరిమి దరిమి
ఘోటివడిమీటి గురుదాను గొనెడుకోటి
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. గరినిక్కుటమ్ములుఁ గురచయల్లెలుఁ బూన్చి
జబ్బువింటను వేసి చంపుకడిమి
కటికను దాటించు గతినైన మరలిన
తేజి నేమీటి హత్తెడుచలంబు
కత్తికత్తినఁ బట్టఁ గద్గానుఁ బొర్లిన
నఱకుచోఁ బాళ్ళ నేర్పఱచు నేర్పు
జీరాలు తెగెనని చేరి మొనల్ జిమ్మఁ
దప్పించి మక్కిచే గుప్పుతెగువ
నీ కులమ్మున కమరెను గాక ధరను
గనఁగ నేర్తురె? పోటుగాం డ్రనికిమకురు
లసికిలగుచేరఁ దిరుమలరాడ్కుమార!
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. జన్యాంగణమున రాజన్యపుంగవు లెన్నఁ
గ్రొన్నన విల్కానికన్న మిన్న
సన్నాహమున సముత్పన్నపన్నగవైరి
జవయుతమగు మహాశ్వంబు నెక్కి
“ధే”యనియార్చి సందీప్తకాలానల
కీలాకరాళసంవేలఖడ్గ
ధారాహతానేక వీరారిజనవార
సారశోణితపూర ఘోరనదులఁ
బఱప నొఱపైన దురము నిర్భరము సేయు
నేర్పు నీ కబ్బె భార్గవు నేర్పు మీరఁ
గోటివంశసనాథ! సంగుప్తబోధ!
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. గడగడమని కాళ్ళు వడఁకఁజొచ్చినయంత
స్తంభగుణంబు కొం తణఁచివైచెఁ
బలుకు డగ్గుత్తికఁ బడి వికారము నొందఁ
బ్రణయమ్ము మౌనసంపదను నిల్పె
వెలవెలయై మేను వికృతి వహించుచో
రోమాంచలంబు మఱుంగు వెట్టె
గన్నీటఁ జినుకులు కాలువలై పార
స్వేదప్రవాహంబుఁ జేర్చుకొనియెఁ
దక్కులను ద్రొబ్బె రంభపైఁ దనకుఁ బ్రేమ
యనుచు నీవైరి నేర్పుగ నతనుదారిఁ
గోటివంశసనాథ! సంగుప్తబోధ!
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
సీ. చెంగావిపావడరంగుగా మెఱయించి
యదికాక పూదండ లలవరించి
తనమేనిచాయచిత్తంబున భ్రమించి
వలసిన బహుమానములను జెంది
కేడంబుఁ దెరచోటు వీడి ముందర నిల్పి
క్రమముగా నటనవైఖరినిఁ జూపి
చెంతకు రమ్మని చింగున వెనుదీసి
వేగమే కంఠంబుఁ గౌఁగిలించి
సురతలీలనుఁ గనుపించి సుఖము నించు
నాటవిరిబోణి యనఁగ నీదగుకృపాణి
గోటివంశసనాథ! సంగుప్తబోధ!
విజయరఘునాథ! జయభార్గవీసనాథ!
ఈప్రభువుపై సీతారామయ్య యనుకవి వ్రాసిన పద్యములు.
సీ. వలిమలల్లుండును వానికుమారుండు
సరివత్తు రవనిలో శౌర్యమందు
వనధియల్లుండును వానికుమారుండు
రూ పొప్పుదురు ధాత్రి రూపమందు
పాండేంద్రునల్లుండు వానికుమారుండు
జంటౌదురిలలోన వింటియందు
వనజాక్షునల్లుండు వానికుమారుండు
నీడౌదురుర్విలో నీవియందు
గాన నినుఁ గొల్చి విఖ్యాతిఁ గాంచినట్టి
అల్లుడి కుమాళ్ళ కవనిలో ననుదినంబు
భళిర తిరుమలతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. దేవతారాజులు స్థిరశౌర్యమహిమచే
భోగిరాజులు పటుబుద్ధిచేత
గిరిరాజవర్యులు నెఱిధైర్యగరిమచేఁ
బక్షిరాజులు బాహుబలముచేతఁ
గలశాబ్ధిరాజులు గాంభీర్యగుణముచే
కలువలరాజులు కాంతిచేత
రాజరాజులు తనరారు సంపదలచే
వలరాజు లిలరూపవైభవమున
ధర్మరాజులు నీతిచేఁ దలచిచూడ
సామి నీరాజచంద్రులు జగతిమీఁద
భళిర తిరుమలతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. గుభగుభాలని పారు గుంటుకోవి ఫిరంగి
జవురు జంగీలకు సరకుఁ గొనక
సరసర బిరబిర జరజరమని వచ్చు
బాణాలరవళిచే బబ్బరిలక
ఫెళఫెళ ఢమిఢమీ పెటపెట ‘రొ య్యను’
బలు తుపాకీగుండ్ల కళుకుఁ గొనక
ధణధణాం ధణధణాం ధాణంధణత్కార
భేరిభాంకృతులకు బెండగిలక
యెంతలెమ్మని తేర్లపై నెక్కితూరి
చుట్టుముట్టుగఁ బాళెముల్ గొట్టితౌర
భళిర తిరుమలతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
సీ. గజఘంట ఘణఘణల్ ధ్వజముల పెటపెటల్
గుంటుకోవిఫిరంగి గుభగుభలును
బలుతుపాకీగుండ్ల ఫెళఫెళల్ కత్తుల
థళథళ లీటెల ధగధగలును
శరముల బిసబిసల్ వారణఘీంకృతుల్
జవనకంఖాణఘోషలు చెలంగ
నళుకు బెళుకును లేక యావహము సొచ్చి
ఘోరవైరుల శిరములఁ గూల్తు వౌర!
భళిర తిరుమలతొండమాన్ ప్రభుకుమార!
విజయరఘునాథ! తొండమాన్ విభువజీర.
కోటి రఘునాథరాయలు
ఈతఁడు విజయరఘునాథ తొండమాన్ మహీపాలుని పుత్రుఁడు. ఈ రఘునాథ తొండమాన్ మహీపాలుఁడు 1767సం॥మొదలు 1789సం॥వఱకును రాజ్యపాలనముఁ జేసెను. ఈతఁడు గొప్పపండితుఁడును గవియునై పార్వతీపరిణయ మను నారాశ్వాసముల ప్రబంధమును రచించియున్నాఁడు. ఈతనియాస్థానకవి నుదురుపాటి వేంకనార్యుఁడు. ఈతనిపైఁ జాటువులు.
శా. గంభీరోద్భటగంధసింధురఘటాఘంటాఘణాత్కారముల్
దంభాడంబరభేరికాధణధణంధాణంధణాత్కారముల్
జృంభింపన్ రణరంగమందు రిపులన్ శిక్షింతువౌ దిగ్జయ
స్తంభశ్రీరమణీయరాయ రఘునాథా! యోధయూథాగ్రణీ!
శా. రాజారామసరోజబాంధవుఁడు ప్రహ్లాదుండు భైరోజి స
త్తోజీఘోర్పముఖ్యు లైననెఱయోధుల్ తొండమాన్ రాజహే
రాజాభోజ ‘సబాసహోబహతుభల్లా’ యంచు నిన్మెచ్చ దా
బోజీ పండితుఁడా! సమర్థుఁడు రణంబు జేయ నీఢాకకున్
హాజీవై భళి మేలు రాయ రఘునాథా! యోధయూథాగ్రణీ!
శా. శ్రీరంజిల్లఁగ నీకుఁ బాండ్యనగరీ సింహాసనేంద్రుండు బల్
పేరిచ్చెం గద మెచ్చి మేలు సమరప్రేంఖజ్జయారంభగం
భీరస్ఫారఢమామికాఢమఢమా భీమోగ్రబాహాబలో
దారా! సారవిహార! రాయరఘునాథా! యోధయోథాగ్రణీ!
మ. గణుతింపన్ వశమా భవద్విజయజాగ్రద్వీరవిద్యావిజృం
భణపాండిత్యము నీకె చెల్లె భళిరా! భద్రేభ ఘంటాఘణాం
ఘణనిక్వాణనిరాఢ్యనిర్భరమహాగంభీరభేరీధణాం
ధణధాణంధణధాణ! రాయరఘునాథా! యోధయోథాగ్రణీ!
మ. దురమందుం దురగంబు ధై యనుచుఁ జిందుల్ ద్రొక్క భాహాసిభీ
కరలీలం.........................................................ల పేటీజరా
పెఱఘోడాగజశింగిణీతరకసానేజల్ ధణారింతువౌ
తరుణీమన్మథ! కోటిరాయరఘునాథా! యోధయోథాగ్రణీ!
సీ. నవరసాలంకారనయచమత్కృతు లొప్ప
సత్కవుల్ పద్యముల్ సంఘటింప
జమదగ్ని భుజగర్వశమహోగ్రభుజశక్తు
లుత్తమక్షత్రియు లొగిఁ జెలంగ
విదితసంగరరంగ విజయవిక్రము లైన
బిరుదురౌతుల పరంపరలు గొల్వ
ననవద్యజనహృద్యఘనగద్యపదపద్య
గతు లొంది వందిమాగధులు పొగడ
నెగడు నభినయవిభ్రమాన్వితులు వార
వనిత లనితరసులభవిద్యను నటింప
నిండుకొలువుండు నాఖండలుండు జగతి
నీవె యననౌర రఘునాథ! నృపవజీర!
సీ. మహిలోనఁ గలహంసమండలంబులచెల్వుఁ
గైకొని దిక్కులఁ గలయఁ దిరుగు
నారదద్యుతిపరిణాహంబులను జూచి
నయము మీఱంగఁ దా నవ్వఁదొడఁగు
నతిశీతభానుజాహంకారహుంకార
పటిమఁ జేకొని వియత్తటి నటించుఁ
దతహారకంఠనిస్సృతరుచిస్ఫూర్తితో
నవనిఁ జూడంగ నందంద నలరు
భళిర! నీవైరిరాజన్యకులము కీర్తు
లరయ నీభవ్యసత్కీర్తు లనుకరింప
వచ్చి జిగినల్లనల్లన విచ్చిపఱచు
నిస్తులోదార! రఘునాథ నృపవజీర!
సీ. సమదసైంధవశరాసనగురూత్తమరాజ
రాజకర్ణభయంకరంబు లగుచుఁ
గదనభీకరవైరిమదమదావళిపఙ్క్తి
వదనవైవరణ్యకృత్స్వనము లగుచు
సమరనిర్భయవిద్విషత్కృతవీర్యము
ల్గర్వసర్వంకషము లగుచు
ప్రతిమహీభృన్మహోద్భటపక్షసంతక్ష
ణవిచక్షణరక్షణమ్ము లగుచు
విజయరఘునాథ! పరకుభృద్భిదుర! దరని
రర్గళోదగ్ర భవ్యదివ్యాయుధోగ్ర
గుణములను మించు నీ భేరి ధణధణమ్ము
లదిర! రఘునాథచంద్ర! యాహవమృగేంద్ర!
సీ. కార్యంబునకు లేక గ్రాస మిమ్మనువానిఁ
బట్టుక ముచ్చెను గొట్టవలయు
సమరం బనినఁ బారి చదురున నుండెడు
వానిమీసముఁ బీకి వైవవలయు
బంతికూటికిఁ బొంచి బారుకేగనివాని
వీధిలో నిడి సొడ్ల వేయవలయుఁ
బతి యుండుమనుచోటఁ బారివచ్చినవానిఁ
జలమునఁ గొఱ్ఱుపై నిలుపవలయు
ననుచు రోషము లాడుచు నహితవరుల
నెగ్గి సిగ్గులు దీతురు నీదుభటులు
కోటికులవర్య! రణనిరాఘాటచర్య!
రాయబిరుదాంక! రఘునాథరాణ్మృగాంక!
సీ. శ్రీరామచంద్రుని గేరుదొరతనమ్ము
రతనమ్ములను మీరు సుతుల కలిమి
కలిమి పూఁబోఁడి నిల్కడయైన వరసభ
రసభావసత్కావ్యరచన తెలివి
తెలివిప్పుటస.........తెగని యాలోచన
లోచనానందమై తోచు నగరు
నగరు చిరస్తనీనవవిలాసకలన
సకలనరేంద్రప్రశస్తమహిమ
మహిమతంగజగామినీ మాననీయ
భావమును భావమున మెచ్చి భవుఁ డొసంగుఁ
గాత కోటికులాబ్ధినక్షత్ర నేత!
రాయబిరుదాంక! రఘునాథరాణ్మృగాంక!
సీ. గొలగొలమనినంతఁ గలకబాఱెడురాజు
జందెంబు తట్టు పచ్చాడిగాదె
స్వామికార్యమునందు జరిగిపోయెడురాజు
పట్టెనామము కొంగరెట్టగాదె
పాళెంబుపోవ జాలాలు చేసెడురాజు
బుఱ్ఱకట్టియ దోటికఱ్ఱగాదె
యిది తెలిసి.............నడరు బెదరు నొదిగి
మదవదహితులనెల్లను జదుమవలదె?
కోటికులవర్య! రణనిరాఘాటచర్య!
రాయబిరుదాంక! రఘునాథరాణ్మృగాంక!
సీ. తతభేరికాధణంధణరవప్రతిభయ
స్ఫూర్జద్ఘనాఘనగర్జితంబు
జృంభితాహితకుంభికుంభోత్పతత్పత
ద్రుచిరముక్తౌఘవర్షోపలంబు
ప్రతిదళస్ఫురదసిద్యుతిచకచ్చకలస
ద్విద్యుల్లతోదగ్రవిభ్రమంబు
శరవర్షనిర్మగ్న పరభూధరధ్వాంత
నిర్భరకీలాలనిర్ఝరంబు
గీ. సమర సమయ సముద్భవత్సైన్యవరస
ముదయపర్జన్యవిలసితం బదిర! భోజ
విజయరఘునాథమేదినీవిభు తనూజ
రాయరఘునాథ భూతలరాజరాజ!
సీ. మీసంబు దీటి గంభీరభేరీతతి
భాంక్రియాసంభ్రమభ్రమధురీణ
ఘోట్టాణజరటంక కుట్టకసంజాత
ధరణీరజస్స.......స్థగితసకల
హరిదంతరుండుగా నని మొనలో నిల్చి
చిఱునవ్వుతోడ బల్ సురియఁబూని
జిగజిరాల్ బిగిగురాల్ తెగిభటుల్ తెగినటుల్
బడి సలామిడ సాల మడుగుమడుగు
దుడుకు నడవడి తడఁబడి యడుగులిడఁగ
గడుసుకడువడిఁ బడెడు నీ యడుగులందు
నీకె తగుగాక రణజయాన్వితపతాక!
రాయరఘునాథభూప! విక్రమదిలీప!
సూర్యశేఖరకవి రచించిన పద్యములు
చ. హరిహరపద్మజాదిదివిజాంశము లన్నియుఁ గూడి మేటియై
హరిహయ మెక్కి మిక్కిలి రణార్భటి నిక్కిన దైత్యకోటులన్
దురమునఁ ద్రుంచి మించి దయతో భువనమ్ములఁ బ్రోచునట్టి
పురహరుదేవి దుర్గ నినుఁ బ్రోచుదయన్ రఘునాథభూవరా!
చ. సమరతలంబనే మడిని శాత్రవరక్తజలంబు నించి దు
ర్దమకరికుంభమౌక్తికపరంపరవిత్తనముల్ ఘటించి వ్యో
మమనెడు కాయమానమున మంజులకీర్తి లతాళితారకా
సుమసహితంబుగాఁ బ్రబలఁ జూచెదు శ్రీరఘునాథభూవరా!
సీ. ఖండింతువౌ సముద్దండదండాదండ
పరపంథిగంధసింధురకరాలు
సాధింతువౌ జగ్గుజగ్గుగాశరలుఠ
త్కరినారిలోకభీకరపురాలు
భేదింతువౌ బెడాబెడలుగా నళ్కు చె
ళ్కును లేక రిపుల గొంతులనరాలు
పెకలింతువౌ వకావకలుగాఁ జికిలిత
ళ్కులు గుల్కు శత్రురాజుల జిరాలు
హౌదు! మఝ్ఝారె! బాబురే! ఔ! సెబాసు!
రణజయోద్దండ భుజదండ రాయతొండ
మండలాఖండలతనూజ! దండితేజ!
రాయరఘునాథభోజ! విక్రమబిడౌజ!
సీ. ఖమ్ములై శశిమయూఖమ్ములై స్మరవిశి
ఖమ్ములై చంద్రసఖమ్ము లగుచు
భమ్ములై..............................శారదా
భమ్ములై పవసన్నిభమ్ము లగుచు
సరములైన వసుధాసరములై కుముదకే
సరములై కుందవిసరము లగుచు
శరములై ద్యోధునీశరములై హృతపురా
శరములై నరమృగీశరము లగుచు
తావకీనయశమ్ములు ధరణిలోనఁ
బ్రబలు బలసంపదుల పెంపు సొబగునింప
విజయరఘునాథమేదినీవిభుతనూజ
రాయరఘునాథభోజ! విక్రమబిడౌజ!
క. నీ కీర్తిపుష్పలతకును
లోకస్తుత పుష్పవంతులును ఫలములు గా
లోకాలోకముదం బగు
రాకాశశిపూర్ణవదన రఘునాథనృపా!
సీ. యామినీకామినీహారకాతారకా
శరకుందదరబృందసమితి నొంచి
హరగాత్ర సురగోత్ర మరగాత్ర మరసింధు
జరసింధు భవదంతిఁ బరిహసించి
హరికాండ హరికాండ హరిదంత కరిదంత
శరదభ్ర పరిశుభ్ర సరణి గెలిచి
మదజాల పదజాల మందార బృందార
కాహార భాహార గరిమ మించి
అంచితోదారవైఖరి.......................
మన్నారుకవికృతములు
సీ. ప్రాతరారంభజృంభన్మానసాంభోజ
రమణీయమకరందరసముఁ గేరి
సాయంసముత్ఫుల్లజాతిప్రసూనాళి
పరిమళసందోహపటిమఁ దూరి
శారదచంద్రికాసారసారపటీర
ఘనసారశీతలగరిమ మీరి
వాణీలసత్పాణివీణాపరిక్వాణ
కలకలార్పటులతోఁ గలసి పోరి
మధురసురభిళశీతలమంద్రభావ
ములను విలసిల్లు నీపల్కు వలనుమీరి
విజయరఘునాథమేదినీవిభుతనూజ
రాయరఘునాథభోజ! విక్రమబిడౌజ!
సీ. ఈతఁడే నా సముదితహితసముదయ
ములు కొలువఁగ బలుచెలువు తనర
ఘనరసికులగము లనవరతము మది
ముద మొదవగ నరు....................
........................మతు లగు బుధకవి
గురులును నయమున వరుసఁ దనర
కవితలు బలువగ కలితమధురసమ
ధురిమను గనుగొని మెరయ వినికి
గొను.................................నత
నమరు నమలపతి కరణిధరణి
గీ. దగు విజయరఘునాథేంద్రు తనయుఁడైన
రాయరఘునాథమానవ.......................
సీ. ...................................దురమున
నదరక బెదరక కుదురుకొనిన
మదమున రిపులను గదుముచు గుదుముచు
జదుముచు నదుముచు మెదలనీక
..................................................
గుదులను గళములఁ జిదురుపలుగఁ
బదపడి పుడమిని గదుపుల గెలుపులఁ
గలుముల చిలుకల కొలికి నెనసె
గీ. విభవుఁడై కీర్తిచేఁ జాల వెలసినట్టి
విజయరఘునాథ తొండమాన్ విభుకిరీటి
..............................
సీ. కీర్తిచే ధైర్యవిస్ఫూర్తిచే సతతంబుఁ
గల ధౌతగిరిలీల వెలసినావు
దానంబుచేఁ బూర్ణమానంబుచే సదా
రాజరాజఖ్యాతిఁ బ్రబలినావు
జయముచే నుతదయోదయముచే ననిశంబు
కృష్ణప్రభావంబు గెలిచినావు
చెలువుచే విద్యల నలువుచే సంతతం
బాత్మభూవైఖరి నలరినావు
రాజమాత్రుండవే? నీవు రాజలోక
సన్నుతౌన్నత్యగాంభీర్యశౌర్యధుర్య!
విజయరఘునాథమేదినీవిభుతనూజ
రాయరఘునాథభోజ! విక్రమబిడౌజ!
సీ. రాజకరప్రాప్తిఁ దేజంబు కడుమించి
రిపుభేదనస్ఫూర్తి నతిశయించి
వజ్రధరఖ్యాతి వదలకుండుటఁ జేసి
వృత్తసంఛేదనవృత్తిఁ దనరి
ధారాధరోన్నతిఁ దనరారుటను రాజ
హంసోదయనటన మొనరఁజేసి
తతసమగ్రస్ఫూర్తి నతిశయించుచుఁ జాల
కమలాధికవిహారగరిమఁ దూరి
నీదు తరవారి పటువైరి నియతిదారి
భూరిశుభకారి సంతతభూరిదారి
విజయరఘునాథమేదినీవిభుతనూజ
రాయరఘునాథభోజ! విక్రమబిడౌజ!
సీ. ఆలాగె యనుచు నైజాననాంభోరుహ
సౌందర్యమకరందసారలోక
చంచరీకచ్ఛటచ్ఛవిఁ గేరుమీసంబు
వడవేయ శాత్రవుల్ జడిసిపార
నడవులలోఁ దూరి యయ్యెడలను దారి
పోనున్న వడి యారి పొదలఁదూరి
ముండ్లిడవగ వైరి మూకలంచును దారి
తప్పఁగ మదిఁగోరి ధాతదూరి
యేడ వెడలితి మీసారి యింకసారి
వలదటంచును తమవారివద్దఁ జేరి
తెలుపుకొనఁజేసి తహహ! దోర్బలజితారి!
రాయరఘునాథశౌరి! విక్రమవిహారి!
సీ. వెడకేక వైచి నవ్విరమణమణిదీప్ర
హాటకడోలికాకటకకలిత
కుంభికుంభములపై గొరిసెలు మ్రోవంగఁ
బారాహజారిని జేర నుఱికి
దాపున నిడిన నిద్దాఫిరంగులచాయ
ధగధగ యనఁగ వైపుగనె డూసి
“అదె పోటు లదె మీటు లదె నఱుకదె చురు
కదె కొసరదె విసరదె యదె” యని
కదనమున నెదురుపడెడు మదవరుల
గదిమి చిదిమెడు మెరవడి కలదె మహిని
నీకె తగుఁగాక సమరలీలాకుమార!
రాయరఘునాథశౌరి! విక్రమవిహారి!
విజయరంగచొక్కనాథుఁడు
ఇతఁడు క్రీ.1704సం॥ మొదలు 1731సం॥ వఱకును మధురరాజ్యమును పాలించినవాఁడు.
క. రమ్మనెరా దనదేనే
రమ్మనెరా పంచశరుని రాపోల్చుట భా
రమ్మనెరా నీవే తన
సొమ్మనెరా విజయరంగ చొక్కవజీరా!
క. రాపేరా? జిగిపచ్చల
రాపేరా యొసఁగితల్ల రమణికి? నతో
దాపేరా? రేపేరా
చూపేరా విజయరంగ చొక్కవజీరా!
క. ఇమ్ముగఁ గమ్మని వీడెము
కొమ్మని కొమ్మ నిపుడేలుకొ మ్మనిసము కో
పమ్మేరా? యాచెలి నీ
సొమ్మేరా విజయరంగ చొక్కవజీరా!
క. వలరాజును నెలరాజును
నలరాజును........................నీతుల నీ
తులరాఁ గలరా? యిల రా
జులరాజా! విజయరంగ చొక్కవజీరా!
క. సరసానికి దొరసానికి
...........................నొసగితివి భళీ
సరసాలా? కవిగాయక
సురసాలా! విజయరంగ చొక్కవజీరా!
క. నూటికి మాబోటికి నొక
చోటికి రమ్మనియు నెనయఁజూచితి....
..............................
జూటేరా విజయరంగ చొక్కవజీరా!
క. ఎక్కడ నేర్చితి వగలను
నిక్కము వలచినది క్రొమ్మ నీ పేరంటే
మ్రొక్కునురా స్రుక్కునురా
సొక్కునురా విజయరంగ చొక్కవజీరా!
కోటిరాజగోపాలరాయలు
క. అదిరా! మహీరథవిధిమధు
మధమథనకధాసుధాసుమధుమధురిమధూ
ర్మధురమతీ! మధురగతీ!
కుధరధృతీ! కోటిరాజగోపాలపతీ!
క. కోటిగదా? వితరణ శత
కోటిగదా? యరిసహస్రకోటీరలుఠత్
కోటిగదా చరణతులా
కోటిభళీ! కోటిరాజగోపాలపతీ!
క. ధృషణయన నీదువనితా
విషమాంబక కార్యకార్యవిషమాంబక సత్
విషితసుధద్విషితబుధో
ద్ఘుషితకథాలాప! రాజగోపలానృపా!
క. మాపాటివారినెల్లరఁ
గాపాడుము విమలహృదయ కమలోద్భాస్వత్
గోపాలక గోపాలక
గోపాలకలాప! రాజగోపాలనృపా!
క. అందఱికి దొరకనేరదు
మందన్మందాకినీందు మందార ఖగ
స్యందన నందన చందన
కుందయశఃప్రతతి! రాజగోపాలపతీ!
పూసపాటి విజయరామరాజు
సీ. పదివేలయీటెలు బలువైన సరదార్లు
మేలైన బలుతుపాకీలతోడ
రామసింగులు పెద్దరాక్షసఫిరంగులు(?)
దుమికించు నుత్తమాశ్వములతోడ
నెరవైన కోకిరల్ మేలైన జముదార్లు
తప్పెట్ల భేరీల ఢముకుతోడ
నింతైనగజములు నీటెల మొనగాండ్రు
బందుబస్తులతోడ బారుగూర్చి
కోట సాధించి మాడ్గులు గొట్టినావు
రాళ్ళుదూక జగన్నాథరాజు దుమికె
భాగ్యదేవేంద్ర శ్రీపూసపాటిధీర
విజయగుణధామ! రణభీమ! విజయరామ.
కలిదిండి రామభూపతి
సీ. ఘోరయుద్ధంబులో కోటిరాణువమీఁద
చెండిచెండాడదా చేతియీటె
డీకొన్న మఱిదొడ్డ ఢిల్లిపౌజులమీఁద
జగడంబు సేయదా చాయకత్తి
చదురు పాచ్ఛాయైన నెదుట నున్నప్పుడే
సూటిగాఁ బొడువదా చూరకత్తి
నేటుగా మీరుప్రనిల్లుఖానునిమీఁద
నాఁడగా నురుకదా యాయుధంబు
మహిమ వర్ణింపఁగారాదు మానవులకు
విరివి చప్పన్నదేశాల వినుతి కెక్కి
వల్లగాకున్న తురకల వంచినావు
రమ్యగుణదీప! కలదిండి రామభూప!
సీ. ...............................................
అతనిసత్కృప మహోన్నతుఁ డితండు
అతఁడు మాయోద్యోగి యిఁత డుపాయోద్యోగి
యతనిసత్కృప మహోన్నతుఁ డితండు
అతఁడు శ్రీకాంతుండు నితఁడు భూకాంతుండు
అతనిసత్కృప మహోన్నతుఁ డితండు
...........................................................
..................................................
దాంతుఁ డాతండు కీర్తివిశ్రాంతుఁ డితఁడు
పుణ్యుఁ డాతండు వీరాగ్రగణ్యుఁ డితఁఢు
...................................................
రాముఁ డాతండు కలిదిండిరాముఁ డితఁడు.
కోమటి వేమన
పదమూఁడవశతాబ్దిలోఁ గొండవీటినిఁ బాలించిన రెడ్డిరాజులలో నీతఁడొకఁడు. ఈతఁ డిరువదిసంవత్సరములు రాజ్యపాలనముఁ జేసినట్టు లీ క్రిందిపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.
సీ. పోలయ వేమన్న పొలుపారఁ బండ్రెండు
వత్సరంబులు కాచె వసుధ యెల్ల
అట వెన్క ముప్పది యనపోతవేమన్న
వన్నెవాసికి నెక్కి వసుధ యేలె
ధర్మాత్ముఁ డన వేమ ధరణీకళత్రుండు
పదియునేనిట భూమిఁ బదిలపఱిచె
ప్రజల కుబ్బసముగఁ బదునాలుగేఁడులు
కొమరగి రేలెను సమయుదాఁక
ఏలెఁ గోమటివేమన యిరువదేండ్లు
రాచవేమన్న నాల్గువర్షముల నేలె
మించి కట్టిరి గృహరాజుమేడ కొండ
వీట నూఱేండ్లు రెడ్లు భూవిదితయశులు.
కోమటివేమనను గూర్చిన చాటువు
సీ. శాత్రవరాజవృక్షమ్ములఁ బడమొత్తి
దుర్మార్గపురములు దుక్కిదున్ని
చెనటి విరోధుల శల్యమ్ము లెడఁబాపి
నటకుటిరిపులను నల్కలేరి
వైరికాంతల నేత్రవర్షంబుఁ గురిపించి
కుటిలారిమొత్తము ల్గొఱ్ఱమర్చి
వీరరాహుత్తులవిత్తనా లెదఁ బెట్టి
పగతులయెమ్ములు పంటఁ జేసి
గీ. మొదల మన్నీలగుంపులమొదలు గోసి
యెసఁగ నూర్పించి, నూర్పెత్తి, యేకరాసి
ఖలను గావించె నీకత్తి కాపుకొడుకు
గాయగోవాళ! జగనొబ్బ గండబిరుద!
అతులబలభీమ! శ్రీకోమిటన్నవేమ!
ఇప్పల బక్కిరెడ్డి
సీ. కనకసోపానమార్గమ్ములు గట్టించె
మహిమీదఁ దంగెళ్ళ మాచిరెడ్డి
మల్లికార్జునగుడి మంచికుందనమునఁ
బొల్పించె ననుముల బుద్ధరెడ్డి
గుఱుతైన చెఱువులు కోటలు నిర్మించె
భువిఁ బ్రసిద్ధినిఁ గన్న బుద్ధరెడ్డి
జగదేకదాతృత్వసద్గుణంబుల కెల్ల
విఖ్యాతిఁ గనె ననవేమరెడ్డి
వీరిలో నీడుజోడన వితరణమున
నితరరెడ్లను సరిపోల్చ నెట్లువచ్చు
మానుషాఢ్యుండు కత్తి తిమ్మన యితండు
భాగ్యసంపన్నుఁ డిప్పల బక్కిరెడ్డి.
ఒడ్డెపూడి అక్కనరెడ్డి
ఉ. కాశిని గోలకొండ కటకంబును డిల్లి నిజాంపురమ్మునన్
భాసురమైన కొండపలి బందరు రాజమహేంద్రసీమలో
నీ సరిదాత లేఁడనుచు నేటుగ నెంచితి బంధుకోటిలో
భాసిలు నొడ్డెపూడి కులపావన! అక్కనరెడ్డి ధీమణీ!
క. యాచకులరాకఁ జూచియు
బూచీయని బెగడి పాఱిపోయెడు నా యీ
నీచుల వేఁడఁగఁ బోవను
ఆచార్యునితోడు పెద్ద యక్కనధీరా!
లక్కిరెడ్డి పుల్లారెడ్డి
సీ. చండప్రతాపదోర్దండసంభృతభూమి
మండలపాలనాఖండలుండు
చండాంశుతనుభవోద్దండవిశ్రాణన
ఖండితబుదనిస్వమండలుండు
చండీశకుండాలఖండలసంపూర్ణ
పాండిత్యరేఖాపిచండిలుండు
పుండరీకాండజడిండీరమండల
మండితసత్కీర్తిమండనుండు
లక్కిరెడ్డి కులాంభోధి రాజసముఁడు
సోమగౌడాగ్రజుండు సత్సూరివరదుఁ
డాశ్రితకవీంద్రపోషకుఁ డట్టిపుల్ల
రెడ్డి గీర్తింపఁ దరమె మారెందుఁ జూపి.
సీ. త్రిభువనభవనంబు లభవప్రసాదంబు
నలన నిర్మించి తౌ సలలితముగ
వేఁడి వేలుపుఁ బట్టి వేయి కరంబులు
సానఁ దీర్చితివౌర సరసముగను
కాళికాంబాపాదకమలంబులకు భక్తి
పూజలు సల్పితి పొందుగాను
సౌవర్ణభూషణసారవస్తువు లెల్ల
లలితంబుగాఁ జేయు లాఘవంబు
లహహ! తగె నీకు సోమకులాబ్ధిచంద్ర!
రమ్యగుణసాంద్ర! నీ కీర్తి రహిఁ జెలంగె
ఘనుఁడ పుల్లయ! కవిబృందకల్పతరువు!
నిన్ను వర్ణింపఁ దరమె వాణిపతి కైన.
ధరణికోట ధనంజయుఁడు
పదమూఁడవశతాబ్దిలో ధరణికోటను బాలించినవారిలో నీతఁ డొకఁడు.
చ. అమలపయోధిఁజంద్రుఁ డుదయం బగు నట్టులఁ బోలె వారిజా
తమున విరించి పుట్టినవిధంబునఁ గాంచనధారుణీధరేం
ద్రమున సురావనీజముదితంబయి యొప్పుగతిం జతుర్థ నం
శమున జనించె నుగ్రరిపుసైన్యజయుండు ధనంజయుం డిలన్.
రాజేంద్రచోడుఁడు
చ. ఇల వెలనాటి గొంకవసుధీశ తనూభవుఁ డైన చోడభూ
తలపతి చోడపట్టము ముదంబునఁ గట్టి భుజాబలంబునన్
గొలని జయించి యందు రిపుకుంజరు భీమునిఁ జంపె నాంధ్రభూ
తలము పదాఱువేలు సరసస్థితి నేలె సురేంద్రు లీలలన్.
కాటయ వేమన
ఈతఁడు పదునాలుగవశతాబ్దిలో నున్నవాఁడు. కొండవీటిని బాలించిన కుమారగిరిరెడ్డి మంత్రియగు కాటయ వేమన ఈతఁడే నేమో తెలియదు.
ఉ. మానుషదానమానబలమానితధర్మరమామనోజ్ఞరే
ఖానుతిభూతివిత్తములఁ గాటయ వేమన పోలు వాసవి
న్వానివిరోధి వానివిభు వనివిపక్షుని వానియగ్రజు
న్వానిమఱంది వానిసుతు వానియమిత్రుని వానిమిత్రునిన్.
ఉ. రాజులు వేశ్య లైరి సమరంబున కోర్వక వీరనామ! నీ
రాజితవిక్రమస్ఫురణ రాజులమిండఁడు వేమఁ డంచు రే
రాజు మనంబు కందె దినరాజునకు న్మది వెచ్చ పుట్టె గో
రాజు తృణంబు మేసె ఫణిరాజు శిరంబుల వంచె సిగ్గునన్.
జగదేవభూపతి
మ. జగలోభు ల్మలభాండ విగ్రహులు గంజాతిండిలఁడీలు మొం
డిగులాము ల్మగలంజ లాగడపుటెడ్డెల్ ఘోరక్రూరాధము
ల్ధగిడీ లుండఁగ నేమి యర్థులఁ గృతార్థత్వంబు నొందింతురే?
జగదేవక్షితిపాల రాణికులతేజా! దీనకల్పద్రుమా!
వెలుగోటివారు
ఉ. ఖేటవిఘోటభాండభవగీడ్ఢయపుంగవపున్నగద్విష
త్త్రోటికరుడ్జటీనటివిధూర్జటిసత్కరటీపటీరరు
గ్వాటి హసించి మించె బుధవర్ణిత! నీదుయశోవధూటి వె
ల్గోటికుమారయాచనృపకుంజర! కుంజరవైరివిక్రమా!
ఉ. గొబ్బురిజంగరాజు లొకకోటియు డెబ్బదికోట్లమక రా
జబ్బలు, లక్షమీఁదఁ బదియార్గురు రావిలవెంకు లైన మా
విబ్బరగండయాచధరణీపతిముందట నిల్వ శక్తులే
కబ్బులు లేక, బెబ్బులిముఖాముఖి మేఁకలు నిల్వనేర్చునే?
క. ఇయ్యక చదివించుకొనే
కొయ్యలు నౌలంజతొత్తుకొడుకులు దొరలా?
యియ్యఁగ నేరుతు వర్థికి
వెయ్యారులు యాచభూప! విమతదిలీపా!
సీ. ధరసుధారసుధసుధధారకదళికా
దళికాళికాకారకలిత మగుచు
మవరమావరమారమామానుజలవలీ
లవలవలీలీల లవని మెఱయ
శరతుషారతుషాతుషాసారలవసితా
వసితాసితాతారఫణిసమంబు
శరదశారదశాదశాశాంతభగణితా
గణితాణితాతారగాపథంబు
ఖగముఘాగముఖాముఖాఖాగ మగుచు
హరిపురారిపురాపురారాతినితియు
భవసభారసభాసభాభవ్య మగుచు
యశము, శము, ముదమొదవు యాచాధిపతికి.
ఉ. కోటలు నుగ్గునుగ్గు, మదకుందరపంక్తులు పిండిపిండి, చెం
డీటెలు పొట్టుపొట్టు, పొగరెక్కుహయంబులు చక్కుచక్కు, నీ
ధాటికి సాటి లేదు వసుధాతలనేతల నెంచి చూడ వె
ల్గోటికులాబ్ధిచంద్ర! నృపకుంజర! బంగరుయాచభూపతీ!
ఉ. శ్రీదరహాసకారణవిశేషవిలాసజనార్దనానుకం
పాదరలబ్ధకీర్తిజితహారతుషారపటీరహారకా
కోదరకాంతి యాచనృపకుంజరు లేలెడు దర్శిసీమలో
నీదర మానివాసము మదీయనివాసము యాచభూపతీ!
పైపద్యము మంచళ్ళకృష్ణకవి ప్రభుదర్శనమున కేగినప్పుడు చెప్పినది.
యాచమనాయని నిర్యాణము
శా. శ్రీరంజిల్లఁగ శాలివాహశకమద్రిశ్రోత్రసప్తేందుసం
ఖ్యారక్తాక్షిసమాదిసప్తమిని దివ్యస్ఫూర్తి వెల్గోటిబం
గారేచేంద్రకుమారయాచమణిమోక్షస్థానముం జేరె మున్
శ్రీరాముండు వికుంఠధామమున కర్థిం బోవు చందంబునన్.
మ. భువి నీడెంతుఁ గుమారనందవిభుతో భూతిప్రభావైభవా
హవతేజోధృతిచిద్విలాససుకళాయౌదార్యశౌర్యంబులన్
భవు భానున్ భిదురాస్త్రు భీష్ము భుజగప్రత్యర్థిభూర్యద్రిభే
డ్భవు భైమేశ్వరు భోజు భౌము భరతు న్భందీరు భర్గాత్మజున్.
ఉ. భండనభీమ కృష్ణ నిజవైరినృపాలురు నిల్చియు న్బృహ
న్మండలపుండరీకహరినాకనివాసులు పాఱియు న్బృహ
న్మండలపుండరీకహరినాకనివాసులు చచ్చియు న్బృహ
న్మండలపుండరీకహరినాకనివాసులు చిత్ర మిద్ధరన్.
ఉ. తారసితారవిందనరతారశతారశతారతారవి
స్తారపటీరహీరఘనసారతుషారతుషారచంద్రికా
పూరమరాళకాశపరిపూర్ణసుధాకరచారుమల్లికా
వారఫణీంద్రశైలరిపువారణకాంతుల నెంతు కీర్తిచేన్.
ఉ. కూరిమి రామకృష్ణ నృపకుంజర! నీదుయశంబు పైకొనన్
వారిజగర్భునారి పురభంజనునారి కుముద్వతీవిభి
న్నారి మఘారి మిత్రగృహనారియు నిల్వఁగ లేక భీతిమై
చేరె జనాళిభోగినుల శ్రీపతిపాద మపారదూరమున్.
మ. జగతి న్నీదుమహాఘనప్రబలరాజత్కీర్తి శాసించె నె
న్నగ నాగారి నగారినాగ నగభిన్నాగారి నాగంబుఁ బు
న్నగనాగారినగారినాగనగభిన్నాగారి నాగంబులన్
దగ వైరేభసృణీ! ఘృణీ! గుణమణీ! దానప్రధానాగ్రణీ!
సీ. మదవిద్విరోధులమెదడు బోనముఁ జేసి
ప్రత్యర్థిదంతము ల్పప్పుఁ జేసి
కుటిలారిమాంసంబుఁ గూరగాయలు చేసి
వైరికండలు పిండివంటఁ జేసి
ఉగ్రాహతులగుండె లూరగాయలు చేసి
శత్రుబాహులను బచ్చళ్ళు చేసి
అరిరాజరక్తంబు నానబాలుగఁ జేసి
నిష్ఠురారుల క్రొవ్వు నెయ్యిఁ జేసి
మొనసి నీఖడ్గభేతాళముఖ్యులకును
విందుఁ జేతువు సంగ్రామవీథులందు
సమరనిశ్శంక! రేచర్లశాసనాంక!
దీపితాటోప! వెల్గోటి తిమ్మభూప!
వత్సవాయ జగపతి భూపతి
ఉ. ఆయతవత్సవాయ సుకులాంబుధి పూర్ణనిశాపతీ! జగ
ద్గేయశుభాకృతీ! విదితకీర్తిసతీ! కమనీయయౌవన
ప్రాయసలాకృతీ! సతతవైభవనిర్జితపూర్వదిక్పతీ!
ధీయుతవాక్పతీ! జగపతీ! నృపతీ! సుకృతీ! మహోన్నతీ!
పెమ్మసానివారు
సీ. చూచెనా! యొకవింత సుముఖుఁడై కవులకు
నౌరౌర నూటపదాఱు లిచ్చు
మాటాడెనా! బలే మన్నీలమిండఁ డిం
పార వేనూటపదాఱు లిచ్చు
నవ్వెనా! యొకనూఱు నాయకారత్నంబు
చక్కఁగా లక్షలసంఖ్య నిచ్చు
సంతోషపడియెనా! సకలార్థిపోషకుం
డఱుదుగాఁ గోట్లపర్యంత మిచ్చు
మెప్పు లెన్నంగఁ దరమౌనె? మేలు! మేలు!
బళి! బళీ! యన జగతిలోఁ బరఁగి తౌర!
యవుర పెమసాని యక్కపార్థివకుమార!
మన్నె దేవేంద్ర! నరసింహమండలేంద్ర!
సీ. సత్కవికృతకావ్య శారదాదేవికిఁ
బాయకుండెడు రచ్చపట్టు భట్టు
జయలక్ష్మి వరియింప సమరశూరలఁ జేయఁ
బ్రస్తుతింపఁగ వాతరట్టు భట్టు
మంగళపాఠకమహితనామముఁ దాల్ప
విభుశుభంబులమీఁది బెట్టు భట్టు
రాజవర్యులకీర్తిరమణ స్వర్గం బను
మేడపై కెక్కింప మెట్టు భట్టు
గాన మీవంటిసత్కీర్తికాము లైన
పార్థివావళిభట్టుఁ జేపట్టవలయు
నాహవోపేంద్ర! పెమ్మసాన్యన్వయేంద్ర!
నయసుగుణాంద్ర! చినతిమ్మనాయనేంద్ర!
మాకనృపతి
ఉ. మేలిమితోడఁ దద్రిపుల మెట్టుచు రెక్కలగాలిచేతఁ బా
తాళముఁ దూలఁ గొట్టుచును తారలముట్టును నీదు పేరముం
గూళకుమార! మాకనృపకుంజర! శూరనృపాల! ధీర! నీ
సాళువపిట్టతోడ సరిసాటియె తక్కినయూరపిచ్చుకల్.
కంబనృపాలుఁడు
ఈతఁ డుదయగిరి దుర్గాధిపతి
సీ. మును పొకమాటాడి వెనుక నిల్పఁగ లేని
నరనాథులను ఱొమ్ము చరిచినాఁడు
తాను మాన్య మొసంగి నే నీయ నని పల్కు
మూర్ఖులశిరముల మొట్టినాఁడు
యెవ్వ రేమడిగిన నీయఁ జాలనియట్టి
పృథ్వీశులకుఁ బొమ్మఁబెట్టినాఁడు
స్వామికార్యములందు జాడ్యంబు లెన్నిన
మన్నీలముఖములఁ దన్నినాఁడు
యితనిసమ మెన్న జగతిలో నెవ్వ రీడు
ఉదయగిరిదుర్గసంరక్షణోన్నతుండు
నయగుణోదారచిన్నమల్లయకుమార
కంబనికిఁ బోల్ప దాతలు గలరె ధరణి?
క. కోటికిఁ బెట్టినయన్నము
పూటనె జీర్ణించుఁ గీర్తి పోదు ధరిత్రిన్
నాటుకొని కఱవు నిలువదు
మాటయొకటె నిలుచుఁ జిన్నమల్లయకంబా!
దామర వేంకటపతి
క. శ్రీదామరవరవేంకట
భూదారక! రూపభాగ్యభోగావనముల్
శ్రీదామరవరవేంకట
భూదారక నిన్నుఁ గాక పొందునె యొరులన్.
వాసిరెడ్డి వేంకటాద్రినాయఁడు
ఈకమ్మప్రభువు మహాదాత. పదునేడవశతాబ్దిలో దెలుఁగుదేశమునఁ గొంతభాగమును బాలించినవాఁడు. ఈతని రాజధాని కృష్ణాతీరముననున్న యమరావతి. ఆకాలములోఁ బచ్చెపువాండ్రను నొకజాతివాండ్రు దారిదోఁపుడుగాండ్రయి జనులను మిగుల బాధించుచుండిరి. వారిలో ననేకులను వేంక టాద్రినాయఁడు బహుప్రయత్నమునఁ బట్టించి, తలారులచే వారితలలు నఱికించి జనులకుఁ జోరభీతిని మాన్పెను. త్రాసునందు తానొకప్రక్కఁ గూర్చుండి రెండవప్రక్కనఁ దనతూకమునకు సరిగా బంగారము వేయించి—తులాభారముఁ దూగి—ఆబంగారమునంతయును విప్రులకుఁ గవులకును దానముఁ జేసెను. భూలోకదేవేంద్రుఁ డనుపేరుఁ బొందెను. అమరావతి, వైకుంఠపురము మొదలగు ననేకగ్రామములను గట్టించెను. ఈవేంకటాద్రినాయఁడు నింద్రునివలెనే యమరావతి కధినాథుఁడై నందవనమునుగూడ ప్రతిష్ఠించెను. ఈతఁడెన్నియో దేవాలయములను కట్టించెను. ఈపుణ్యపురుషుని గుఱించిన చాటువు లనేకములు గలవు. అందుఁ గొన్నిమాత్రమే దొరకినవి.
సీ. శ్రీకృష్ణవేణికిఁ జెలు వొప్పఁ బడమర
సిరిఁ దేజరిల్లు లక్ష్మీపురంబు
ఆయూరి కుత్తరం బతిరమ్య మైనట్టి
కుదురైన భైరవగుట్ట కలదు
పశ్చిమభాగానఁ బరభయంకర మైన
సౌరొప్పు మేదరసాల కలదు
దక్షిణమ్మున నీదు తల్లి పేరిఁట నొప్పు
ప్రేముడి యచ్చమ్మపేట గలదు
మేటిరాజులు మన్నీలు మిమ్ముఁ గొలువ
గజతురంగంబు లిరుగడఁ గదిసి నిలువ
వసుధఁ బెంపొందితివి భళీ? వాసిరెడ్డి
వేంకటాద్రీంద్ర! మన్యహం వీరచంద్ర!
శా. ఏరీ నీవలెఁ గీర్తిఁ గాంచిన ధరిత్రీశు ల్జమీన్దార్లఁ గా
శీరామేశ్వరమధ్యభూమిని నరశ్రేణి న్విచారింపఁగా
సారాచారతఁ గాంచిరో ప్రజలకిష్టాన్నంబుఁ బెట్టించిరో?
ధీరాగ్రేసర! వేంకటాద్రినృపతీ! దేవేంద్రభాగ్యోన్నతీ!
మ. వరహా ల్కాసులభంగి సేలువలు కంబ ళ్ళట్ల రూపాయలు
న్మఱి గవ్వల్బలెఁ గంకణంబులు తృణప్రాయంబుగా నిచ్చి బం
గరుపళ్ళెంబులఁ బాయసాన్నములుఁ లక్షబ్రాహ్మణాపోశనం
బర లే కిత్తువు వాసిరెడ్డి కులదీపా! వేంకటాద్రీశ్వరా!
శా. కానీనప్రతిమానమూర్తివని వక్కాణింతు నిన్ధాత్రి గీ
ర్వాణస్తోమము లెన్నఁ బ్రత్యహము సాలగ్రామగోదానభూ
దానాన్నప్రతిపాదనార్థు లిడి శీతక్షోణిభృత్సేతుమ
ధ్యానూనాంబుధి మేఖలాస్థలి సమాఖ్యం జెంది తీవే గదా
భూనాథావళి వేంకటాద్రినృపతీ! పూర్ణప్రభావాకృతీ!
సీ. ధాత్రీసురప్రీతి ధనతులాభారంబుఁ
దూఁగ నే భూపతి తూగఁగలఁడు?
నవరత్నకీలితనవ్యత్కిరీటంబు
మించి యేరాజు ధరించఁగలఁడు?
పదినూర్లశిరముల ఫణిరాజుపై శౌరి
లీల నేపతి పవ్వళింపఁగలఁడు?
చతురిభరాజితస్యందనారూఢంబుఁ
జక్కగా నిక నేరు సల్పఁగలరు?
అతఁడు రాజశిఖామణి ధృతిసురాద్రి
కనుక నేతత్ప్రకారప్రకాశుఁ డగుచు
వసుధఁ బెంపొందె నౌరౌర వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రుఁ డతులపృథ్వీవరుండు.
సీ. ఇంతి! యీధీరుఁ డాయింద్రుఁడుఁ గాఁబోలు?
నింద్రుఁడుఁ గాఁడె యో యిగురుబోణి!
కాంత! యీధీరుండు కర్ణుఁడుఁ గాఁబోలు?
కర్ణుఁడు గాఁడె యో కంబుకంఠి!
మగువ! యీధీరుండు మదనుండు గాఁబోలు?
మదనుఁడుఁ గాఁడె యో మందగమన!
సుదతి! యీధీరుండు సోముఁడు గాఁబోలు?
సోముఁడుఁ గాఁడె యో సుందరాంగి!
ధరపురందరుఁ డొకొ? సుధాకరుఁడొ? నరుఁడొ?
తరణిసూనుండొ? వరధర్మతనయుఁ డొక్కొ?
వరమదనకోటి లావణ్య వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రుఁడే కదే! పంకజాక్షి!
చ. గుణనిధి! వేంకటాద్రినృపకుంజర! వైభవధీ! భవత్సుధీ
జనకరవంశజాతముల శత్రుమదేభనికాయసద్వధూ
గణనయనాండజాతములఁ గారణజన్ముఁడ వౌటచేతఁ గం
కణములు నిల్వఁ గా నొకటఁ గల్పనఁ జేసితి వెంతచిత్రమో?
ఉ. అర్థికి నీవొసంగినపదార్థము భోజనవస్త్రధర్మకా
మ్యార్థములౌ త్వదన్యవసుధాధిపు లిచ్చుపదార్థము ల్నిశా
తీర్థమరీచికామ్లరసదివ్యమఖాదులు నౌనొ! కావొ! స
త్పార్థివ! వేంకటాద్రివసుధాపతి! నూతన మన్మథాకృతీ!
క. అమరావతి యమరావతి
అమరఁగ నింద్రుండు వేంకటాద్రీంద్రుండే
అమరులు గోత్రామరులే
కమనీయము నందనంబు ఘననందనమే.
చ. హితమతి వేంకటాద్రివిభుఁ డేలెడు నయ్యమరావతీపురిన్
గ్రతుభుజు లన్నవస్త్రములు గాంచ రొకప్పుడుఁ బూర్వదేవతా
హితమతి; వేంకటాద్రినృపుఁ డేలెడు నీయమరావతీపురిన్
సతత సమస్తవర్ణులును జక్కఁగ గాంచుదు రన్నవస్త్రముల్.
సీ. ఏరాజు కట్టించె నెలమితో నమరావ
తీపురప్రాకారగోపురములు
ఏరాజు ఘటియించె హితభద్రగిరికేళి
కుంభధ్వజస్తంభగోపురములు
ఏరాజు రచియించె భూరివైకుంఠపు
రస్తంభవరగోపురాలయములు
ఏరాజు నిలిపెఁ బొన్నూరుపట్టణ ధర్మ
కూటధ్వజస్తంభగోపురములు
మేటిబాపట్ల గుంటూరు మోటుపల్లి
చింతపల్ల్యాదికుండిన సీమఁ గొన్ని
యూళ్ళ నేతత్ప్రతిష్ఠల నొనరఁ జేసె
నతఁడు శ్రీవేంకటాద్రీంద్రుఁ డతులయశుఁడు.
సీ. ఏరాజు వాకిట నేప్రొద్దు గృష్ణాన
దీదివ్యతిలకంబు తిరుగుచుండు
నేరాజు హృదయమం దింద్రప్రతిష్ఠితుం
డమరేశ్వరేశ్వరుం డమరియుండు
నేరాజు కెదుట గా నీప్సితార్థము లీయ
వైకుంఠపురిశౌరి వరుసనుండు
నేరాజు నెడఁబాయ కేవేళఁ గేళికై
రాజ్యలక్ష్మియు హృష్టిఁ గ్రాలుచుండు
నట్టిరాజును వినుతింప నలవి యగునె?
రాజమాత్రుం డటం చనరాదు గాని
వేంకటాద్రీంద్రుఁ డంచును వినుతి సేయ
వలయు శ్రీవాసిరెడ్డి సత్కులజమణిని.
మ. సుమబాణాకృతి! వేంకటాద్రినృపతీ! శుంభత్ప్రతాపాఢ్య! నీ
యమరావత్యమరేశ్వరోన్నతసువర్ణాంచన్మణీగోపురో
ద్గమ మెన్నన్ ద్విజరాట్శశ ప్రథమదృక్ప్రాప్తస్థితిం గాంచి కా
ర్యము కాదంచును నిల్చెఁ గాక గగనం బంతంతకు న్మించదే?
మ. క్షయసంవత్సరమాఖశుద్ధశుభచంచద్ద్వాదశీజీవవా
రుయుతశ్రేష్ఠపునర్వసుప్రఝషసద్రాశిం దులాభారమే
నయశీలుం డమరావతీపురములోన న్దూగి నానార్థిసం
చయహర్షాప్తి ధనం బొసంగెఁ గవు లెంచన్ వేంకటాద్రీంద్రురీ
తి యనంగాఁ దగి వాసిరెడ్డికులము న్దేజంబుఁ జెన్నొందఁగన్.
ఉ. ఎన్నివనంబు లెన్ని కృతు లెన్న సురార్చన లెన్ని దేవళా
లెన్ని సువర్ణగోపురము లెన్ని తటాకము లెన్ని బావు లె
న్నెన్ని పురంబు లెన్ని కల వెన్నిక ధర్మము లెన్న ధాత్రిపై
బన్నిన వేంకటాద్రివిభుపాటినృపాలుఁడు లేడు చూడఁగన్.
క. శ్రీవాసిరెడ్డికులభవ
పావనుఁడై వేంకటాద్రిపతి భాసిల్లెన్
గేవలవాగ్దీపశిఖా
వ్యావృతకలధౌతకుంభితాహిమకరుఁడై.
ఉ. తద్దయు వాసిరెడ్డికులధన్యుఁడు వేంకటనాయఁ డర్థికిన్
గొద్దిగ నిచ్చె నేని నృపకుంజరు కొక్కనిపెండ్లి కౌ నహో
గద్దరి మేదినీశ్వరులు కద్దనియిచ్చినయీవి పూటకుం
జద్దికిఁ జాల దాయె నృపసందడి దాతల నెన్న దోసమే?
చ. కమలజుఁ డుర్విపైఁ గవుల గాయకుల న్సృజియించి కల్పభూ
జమును సృజింపనైతి నని చక్కగఁ జక్కనివాసిరెడ్డిజ
గ్గమహిపవేంకటాద్రినృపుఁ గారణజన్ము సృజించెఁ గానిచో
నమితవిహాయితాత్మమతియై చెలువొందునె? చిత్రవైఖరిన్.
సీ. “సర్వబుధశ్రేణ సంతరింపఁ దలంచి
గగనావతీర్ణమౌ కల్పకంబు”
“కల్పకం బది గాదు కవిచాతకావళిఁ
బ్రేమతోఁ బ్రోవఁ గాన్పించు ఘనుఁడు”
“ఘనుఁడు గాఁ డితఁడు సజ్జనచకోరావళిఁ
గరుణింపవచ్చు రాకావిధుండు”
“విధుఁడు గాఁ డితఁడు కోవిదజనాధారుఁడై
సిరు లీయవచ్చు నిక్షేపమూర్తి”
యనగ విలసిల్లి తౌర! జగ్గావనీంద్ర!
లక్ష్మమాంబాతనూజ! సద్రాజతేజ!
వాసిరెడ్డ్యన్వవాయసద్వార్థిచంద్ర!
ధీరగుణసాంద్ర! వేంకటాద్రిక్షితీంద్ర!
క. భూపతి మతిజగతీభృ
ద్భూపతి శ్రీవేంకటాద్రిభూపతి క్రౌంచ
ద్వీపాకృతిఁ దగు శిఖర
స్థాపితహరినీలఘటితతారాపథయై.
శా. సద్వర్ణాంచితహేమపాత్రతతితో సత్రంబులోన న్విశి
ష్టాద్వైతప్రముఖద్విజావళికి మృష్టాన్నప్రరోక్తి న్వివే
కద్వైపాయను లిందు వచ్చిరనఁగాఁ గాన్పించు తన్మధ్యతి
ష్ఠద్వైచిత్ర్యగుణక్రమప్రతతిభాస్వచ్చంద్రికాశోభక్రౌం
చద్వీపం బమరావతీపురము వీక్షాసక్తిఁ జూడన్ దగున్.
సీ. అంజనాచల మీనఁ గంజోద్భవాండంబు
నిండారు రానడగొండ లనఁగ
భానుబింబంబుపైఁ బగలు సాధింపఁగా
గోరాడు చీకటిగుంపు లనఁగ
కవిదర్శనాపేక్షఁ గదలి వచ్చిన గజా
సురగోత్రదానవస్తోమ మనఁగ
వింధ్యశైలస్థలి వెడలి కృష్ణాస్నాన
వాంఛాగతేభరాడ్వర్గ మనఁగ
వెలయు నమరావతీపురి వేంకటాద్రి
విభుమనోభీష్టసంచారవీథిఁ దలఁచి
తీర్థవాసంబు గావునఁ దిరుగులాడుఁ
దత్పదావళిమత్తదంతావళములు.
సీ. విభుదేంద్రసేవ్యమై వెలయు క్రౌంచనగంబు
సలలితవేంకటాచలము గాఁగ
ఆశ్వీజశుద్ధమహానవమ్యాగతుల్
బ్రహ్మోత్సవాగతప్రజలు గాఁగఁ
బారమార్థికహోమపాత్రాన్నభుక్తియే
తనరఁ దీర్థప్రసాదంబుఁ గాఁగ
శ్రుతగజస్యందనారూఢోత్సవోన్నతుల్
దివ్యరథోత్సవస్థితులు గాఁగ
విశ్వసర్వంసహాస్థలావిర్భవంబు
తిరుపతిస్థల మమరావతీస్థలంబు
వన్నెఁ జెలువొంద విలసిల్లె వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రనామపృథ్వీవరుండు.
ఉ. అక్కడ వేంకటాద్రివిభు నద్భుతచర్యలు చూచి వచ్చి తా
నిక్కడఁ గూర్చెఁ బండితుల నిద్దఱి లోపల వాసిరెడ్డి వా
రెక్కడ...................................యుప్పలపాటిచోగిరా
జెక్కడ నక్క యెక్కడ న దెక్కట నిర్జరలోక మెక్కడో?
వేంకటాద్రినాయఁడుగారి యాస్థానమునకు బుచ్చి వెంకన యనుకవి యొకగ్రంథమును వ్రాసికొనివచ్చెనఁట. ఆతని కులమున గొంచెము కళంకము గలవాఁడఁట. ఆవిషయమును కొంచెమెత్తి యాస్థానములోని యొకకవి ప్రభువుగారి యభిప్రాయము నిట్లు తెల్పెను.
గీ. కులమునఁ గళంకు కల దనుకొంచుఁ గొంకుఁ
గేలిఁ గావించి కంకున కేలఁ గొంకుఁ
గవనమున జంకు నీమీఁదఁ గాదు బొంకు
బుధజనాటవ్యటన్యంకు బుచ్చివెంకు.
తరువాత వేఱొకకవి లేచి—
క. కొంకక తమరాడినయది
బొం కేలగు వేంకటాద్రిభూపాలక యీ
న్యంకేల వానికిం గల
రంకే యిచ్చోట నిల్ప రసవంత మగున్.
అనెనఁట. దానికా కవి యిట్లు పలికెనఁట.
చ. పన్నిన సత్ప్రబంధమున బాగును నోగునుఁ జూడ కీసుచే
మన్నన మాలి మాకులము మాటఁ దలంతురె? చేమకూరి వెం
కన్నకు లోపమేమి? కులమా కవనానకు వేంకటాద్రిరా
జన్న గణించి మీరలు దయామతిఁ బ్రోచిన నాకుఁ జాలదే?
వేంకటాద్రినాయఁడుగారిపై వేఱొక కవి చెప్పినది.
గీ. వైభవోద్దాముఁ డైనట్టి వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రుఁ డర్థార్థి వితతి కొసగు
నొక్కపూట వ్యయంబు లీ తక్కినట్టి
రాజకోటికి నొకయేటి భోజనంబు.
ఈపద్యమును రచించినకవి రాళ్ళబండి పట్టాభిరామరాజను బట్టనియు (ఇతండు మలరాజువారి యాస్థానకవి), నీతఁడు కృష్ణాస్నానమునకై యమరావతి కేగినప్పుడు వేంకటాద్రినాయఁడుగారిని దర్శించి చెప్పెననియు—నీవిషయము నెఱింగి మలరాజు వేంకటగుండారాయణంగారు రౌత్రమూర్తులై “మనయుప్పు పులుసుతోఁ బెరిగి సాటివాని నట్లు వొగడిన యాకృతఘ్నుఁడు మనదేశములో నడుగుఁబెట్టెనేని ఫిరంగితో గాల్చుఁడు” అని తమసైనికుల కుత్తరువు జేసి రనియు—నీ సంగతినంతయు విని యాబట్టు వేంకటాద్రినాయఁడుగారివద్దనే యమరావతిలో యుండి తరువాత కొలఁదికాలమునకే పరలోకగతుఁ డయ్యెననియు వినికి గలదు. అచటినుండియే
ఆ. వెలమదొరలపొందు వేయేండ్లు చేసినఁ
గాసువీస మైనఁ గానరాదు
మెచ్చె నేని మంచిముచ్చటఁ జెప్పును
అలిగె నేని ప్రాణహానిఁ జేయు.
అను పద్యమును వ్రాసెననియుఁ గింవదంతి గలదు.
జూపల్లి ధర్మారాయఁడు
ఈరపరాజు, సూరపరాజు ననునిరువురుకవులు జతఁగూడి ధనసంపాదనకు బయలువెడలిరఁట. వారు దేశసంచరణంబు చేయుచు, నొకనాఁ డీధర్మారాయఁ డుండుగ్రామముఁ జేరిరి. ఇద్దరు నొకచోటికే పోవుట యుక్తముకా దని తలంచి, యీరపరాజుమాత్రము ధర్మారాయనిదర్శనమున కేఁగెనఁట. సూరపరాజు వేఱొకచోటికిఁ బోయెనఁట. ధర్మారాయఁడు కవిని సమ్మానింపలేదఁట. వీరిరువురుని, తమబసకు చేరిన తర్వాత, సూరపరాజు రెండవకవి నిట్లడిగెనఁట.
క. జూపల్లిధర్మరాయం
డేపాటిధనం బొసంగె? నీరపరాజా!
అనఁగా నీరపరా జిట్లు సమాధానమును జెప్పెనఁట.
పాపాత్ముం డెవ్వరికిని
చూపనిదే చూపె నయ్య సూరపరాజా!
ధర్మారాయనిఁ గూర్చిన మఱికొన్నిచాటువులు
చ. ఎఱుఁగనివానిఁ గోటఁ జొఱనీయఁడు నేర్పున జొచ్చె నేనియున్
దొరసముఖమ్ము దొర్కుటది దుర్లభ మట్లు లభించె నేనియున్
మెరువడి విద్యలేక కడు మెచ్చఁడు మెచ్చక యీవి నీఁడయా
సురగురునంతవానికిని జూపలిధర్ముని వేఁడఁబోయినన్.
శా. నే నాకాశతరంగిణిన్ ధరణిలో నీవెవ్వరే? నావుడున్
నేనా! జూపలిధర్మభూవిభుని పాణిన్ బుట్టుదానాపగన్
నీనాయంతర మేడ కేడ? యవులే నీవేడ నేనేడ పో
నేనా యాచకుపాదజాతనటవే? నే దాతృహస్తోదితన్.
మల్కిభరామ్
ఈతఁడు తురుష్కప్రభువు. ఈతని సరియగు నామము మలిక్ ఇబ్రాహీమ్. ఈతను తురుష్కుఁడైనను తెలుఁగుభాషయందు రుచిగలవాఁడు. ఒకటిరెండు గ్రంథములనుఁగూడ కృతి నందెను. ఈతఁడు పదునారవశతాబ్దిలో నాంధ్రదేశమునకుఁ బ్రభువుగా నుండెను. ఈప్రభు వొకనాఁడు “ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే” యని సమస్య నొసంగఁగా నప్పు డచ్చటనే యుండిన యొకకవి యిట్లు పూరించెను.
క. ఆకుంటే వృక్షం బగు
నీకుంటే లోభియౌను హీనాత్ముం డౌ
మీకుంటే మా కిమ్మా
మాకుంటే మేము రాము మల్కిభరామా!
సమస్యాపూరణమునకు సంతోషించి మల్కిభరామ్ ప్రభు వాకవికి బహుమాన మొసంగెనఁట.
మహమ్మద్ భేక్ సాహెబు
ఇతఁ డొకచిన్నజమీనుదారుఁడు. ఇంచుకయుదారస్వభావముఁ గలవాఁడు. ఒకనాఁడు ప్రసంగవశమున నొకబ్రాహ్మణుఁడు— “పూర్వము, మల్కిభరామ్ ప్రభువు కవులను మిగుల నాదరించి కృతులనంది బహూకరించి తనపేరు జగమ్మున నిలుపుకొని చనెను. సాహేబుగారు! తమరును నవాబుప్రభువు లంతవారు గదా” యనెను. ఆమాటలకు సాహెబుగా రుబ్బి “ఇప్పు డెవరైన నాపైఁ బద్యమును వ్రాయుదురేని, నూటపదియాఱులు బహుమతి నొసంగెద” ననెను. కవి గాకపోయినను సమయస్ఫూర్తిగల యావిప్రుఁడు భాగతములోని యొకపద్యము చివరన సాహేబుగారిపేరు నీక్రిందిరీఁతిఁ దగిల్చి చదివి నూటపదియాఱు రూప్యములు గైకొనెను.
క. భిల్లీభల్లలులాయక
భల్లుకఫణిఖడ్గగవయబలిముఖచమరీ
ఝిల్లీహరిశరభకరికిరి
మల్లాద్భుతకాకఘూక! మహమదుభేకా!
రావిళ్ళవారు
చ. ఎనయఁగ నెన్నిజన్మముల నేమిట నీశ్వరుఁ బూజఁ జేసిరో?
మనసిజుఁ గన్నతల్లియును మల్లనృపాలునిఁ గన్నతల్లియున్
దనరఁగ భోజుతల్లియును దానగుణుం డగు కర్ణుతల్లియున్
ఘనుఁ డగురావిళాన్వయశిఖామణి శేషనృపాలుతల్లియున్.
సీ. దురములో నరివీరకరిఘటంబులఁ గన్న
వీఁకఁ బారఁ బొడిచి వెన్నుఁ దన్ను
దుర్భరశత్రుల దొడ్లనుఁ గనుఁగొన్న
గోరాడి కొమ్ముల గ్రుచ్చి యెత్తు
మార్కొన్న పగరాజు మన్నెగిత్తల నెల్ల
మానమూనము జేసి మగుడఁ దోలుఁ
గక్కసించెడు వైరి దుక్కిటెద్దుల నెల్లఁ
గురుమన్నెగిత్తల సరకుఁ గొనక
రంకె లిడుచుండు బసవనశంకరుండు
శంక సుంతయు లేక నిస్సంశయముగ
సమరరఘురామ! రావిళసార్వభౌమ!
వైరిహృద్భల్ల! యుద్దండవీరమల్ల!
క. పిన్నమహీశులపేరుల
నెన్నకురా భట్ట! దళము లెదిరించినచో
వెన్నిచ్చి పారిపోయిన
మన్నీలభుజంగు వీరమల్లఁడు ధాత్రిన్.
క. ఇచ్చెడువేళల రణమునఁ
జొచ్చెడువేళలను వెనుకఁ జూచినఁ బెద్దల్
మెచ్చరు వినుతిం జేయరు
రచ్చలఁ గవిగోటు లెల్ల రావిళమల్లా!
క. తెగి తాఁ బొడవని పోటును
తగ నర్థుల కీయనట్టిత్యాగము సభలోఁ
బొగడించుకొనుచుఁ దిరిగెడి
మగలంజలమగఁడు వీరమల్లఁడు ధాత్రిన్.
ఈ వీరమల్లన యొకకవికి మాన్య మిచ్చి, మఱల తానే కైకొనెనఁట. ఆసంగతి నాకవి యిట్లు వెల్లడి చేసెను.
ఆ. తోడబుట్టనదానిఁ దొలుతన మను విచ్చి
వయసు వచ్చువెన్క వలచినట్లు
రమణ మాన్య మిచ్చి రావిళమల్లన్న
కమతమందు తానె కలుపుకొనియె.
శాకమూరి యెల్లయజన్నయ
క. బాలుఁడు వెతలం బెట్టినఁ
దాళవలెన్ దల్లి యర్థి తగ బాధింపన్
దాళవలె దాత యితరుల
కేలా మఱి శాకమూరి యెల్లయజన్నా!
గద్వాలప్రభువులు
సోమభూపాలుఁడు
క. గద్వాల సోమభూపా!
మృద్వాకప్రసవతుల్యమృదులాలాపా!
విద్వద్విసరదిలీపా!
సద్విద్యాభోజభూప! శాత్రవతాపా!
క. నలుగురుఁ బలికిరి సరి యని
నలుగురు బలికిరి సురూపనయదానధరా
వలయధురాచరణోన్నతిఁ
బొలువుగ గద్వాలసోమభూపాలునకున్.
రామనృపాలుఁడు
శా. నిస్తంద్రప్రతిపక్షశిక్షకరణోన్నిద్రప్రతాపోజ్జ్వల
ద్దోస్తంభార్జితసర్వభూవలయదాతృత్వామరానోకహా!
అస్తోకాఖిలవైభవేంద్ర! కరుణాయాదోధినాథా! యశ
శ్శస్తప్రాభవ ముష్టిపల్లికులకంజాతార్క! రామాధిపా!
ఉ. చిత్రము ముష్టిపల్లికులశేఖర! రామనృపాల! నీయనిన్
శాత్రవకోటి నీల్గి కులసంగసుఖం బెడఁ బాసి యాపయిన్
గోత్రవిఘాతిఁ బొంది పయిఁ గోరినసంపద లొందుఁ జూడ నీ
పత్రిమహత్వ మిట్టి దనఁ బాత్రు లిలన్ మహనీయులే చుమీ!
మ. భవదీయామలకీర్తిసన్నిభములౌ పర్వేందుపాండుచ్ఛద
ప్రవరప్రాగ్గజపంకజాతీనససపాధోధి పంచాస్యముల్
పవనాహారపతిప్రలంబరిపుసత్పంకేజము ల్భోగగో
ధవగద్వాలపురీశ రామనృప! విద్వత్కల్పభూమీరుహా.
సీ. శరదంబుధరకంబహరిదంబరుల దూరు
ఘనమైన నీకీర్తి కామమూర్తి!
మేరుభూధరభూరిసారత న్గని గేరు
మహి నెన్న నీధైర్య మమలచర్య!
పటునిదాఘవిభాసి చటులార్యమునివాసి
మాయించు నీవిక్రమక్రమంబు
బలికర్ణదుగ్ధార్ణవముల వమ్ముగ డిందు
పఱచు నీదాతృత్వపటిమ హెచ్చు
కవిజనంబులు కొనియాడఁ గదనరంగ
చండకరవాల కోటిసంజాతవీతి
హోత్రశలభాయితాహితక్షాత్ర! ముష్టి
పల్లిగోత్రపవిత్ర! సంపద్విచిత్ర!
ఆత్మకూరు సంస్థానాధిపతులు
ముక్కర సీతారామభూపాలుఁడు
శా. జంభన్వేషణభోగ! నీదుయశమున్ జర్చింపఁగా స్వర్గవీ
శంభుద్యోద్రుమశంకరాలయ కుభృత్సర్పాధిరాడ్కాంతులన్
దంభంబు ల్సడలించుఁ గాక యనుచున్ దాత్పర్యమౌ మాకు దో
స్తంభప్రాభవ! ముక్కరాయాన్వజ! సీతారామభూపాలకా!
శా. శ్రీయోషిత్కుచపర్వతాశ్రయము సచ్ఛృంగాకారగాంగేయకౌ
శేయప్రస్ఫుటవిద్యుదన్వితము సుస్థేమప్రదాపాంగకో
చ్ఛ్రాచైకామృతవృష్టిదాయకము చంచత్కుర్మతీశాభ్ర మీ
కాయోత్పన్నసమాను ముక్కరకులక్ష్మాభర్తనుం బ్రోవుతన్.
క. శ్రీమన్ముక్కరసీతా
రామావనిజానికీర్తి రాజిలె ఘనమై
సోమహరిస్వర్గంగా
కామారిగజారిసీరి కంధుల కన్నన్.
శా. తారుణ్యాకర! ముక్కరాన్వయజ! సీతారామభూపాల! నీ
వైరిక్ష్మాపతి దారసంఘము కడుం బ్రాప్తాకులం బయ్యు వి
స్తారాక్షిద్వయ మందుఁ గంకణము లంచత్పాణియుగ్మంబునన్
ధారల్ గాఁ దిలకంబుఁ గూర్చుదు రహో! ధాత్రీజనుల్ నవ్వఁగన్.
చ. శరధిగభీర! భీరహితసత్వవినిర్జితశత్రుభూప! భూ
పరహితకార్య! కార్యఫణివల్యసమానసుధీ! సుధీభరా
డ్గిరివరకీర్తి! కీర్తిరుహదృగ్వసరాంగజమూర్తి! మూర్తిదు
స్తరరణసోమ! సోమనృపసన్నుత! ముక్కరవంశపాలనా!
జన్నుపల్లి రామకృష్ణభూపతి
సీ. ధర్మమార్గోఝ్ఝితధవళయశశ్ఛత్ర
గోపాయితాఖిలక్షోణితలుఁడు
ఘనదానమహిమ నిష్కాసితసంతాన
జీమూతబలిదైత్యశేఖరుండు
ధైర్యసంపల్లవధావితమేరుమం
దరగంధమాదనధరవరుండు
నిజపరాక్రమవహ్ని నిర్ఘోషితారాతి
పార్థివసందోహవార్ధి యితఁడ
టంచు బుధు లెన్న వెలసితి వౌర జన్ను
పల్లివంశాబ్ధిచంద్ర! వైభవజితేంద్ర!
భరితభూభార! శంకారాంబాకుమార!
అసమశరరూప! రామకృష్ణావనీప!
ఉ. చిత్రము రామకృష్ణనృపశేఖర జన్పలివంశదీప! నీ
శాత్రవకోటి పోరుటకుఁ జాలమి సాధ్వసమంది వేగ లో
కత్రయిఁ జొచ్చినన్ మిగులఁ గాకల విక్రమభానుఁ డేచి ని
శ్ఛత్రుల వీడి ఛత్రులను జాల తపింపఁగఁ జేసెఁ బూనికన్.
వేంకటరమణప్ప
క. పొంకముగ దిశలఁ గప్పెను
వేంకటరమణప్పకీర్తి విశదభ్రఝరీ
పంకజభవ పంకజభవ
పంకజభవ పంకజారి పంకేజంబై.
క. సరసిజశశి శిశిరశర
చ్ఛరదశరము లోడెఁ దద్యశమునకు ధైర్య
స్ఫురణకు నవియే యోడెను
హరనుత మగుతేజమునకు నవియే యోడెన్.
కచ్చి రంగయ్య
క. నలు గురు నినుఁ బలు మారున్
గెలిచితి సుగుణోక్తికాంతి కీర్త్యాకృతులన్
నలుగురు నినుఁ బలుమాఱున్
భళి! భళి! యనఁ గచ్చిరంగ! భాగ్యతరంగా!
బారు వెంకన
క. వర బారు వేంకనార్యుని
ధర నిండినకీర్తి వెలసె ధరజిత్పురజి
ద్ధరధరజిత్పురత్పురజి
ద్ధరజిత్పురజిత్తురంగ ధావళ్యంబై.
మల్రాజువారు
వీరు నరసారావుపేట సంస్థానాధీశ్వరులు. మహాశూరులు. వెలమదొరలు. దాతలు. పండితులయందును గవులయందును నాదరము గలవారు దిట్టకవి నారాయణకవికృతమగు రంగా రాయచరిత్రమునకుఁ గృతిభర్త యీవంశోద్భవుఁడే. నరసారావుపేట నరసారాయణుంగారిపేరఁ గట్టింపఁబడినది. కావుననే గ్రామమున కాపేరే పెట్టఁబడినది. వీరియాస్థానకవి రాళ్ళపల్లి పట్టాభిరామరాజను నొకబట్టు. సంస్థానాధిపతులనుగుఱించిన చాటువులు—
చ. “హరుఁ డనుకొంటిమా విషధరాభరణంబు ధరించుటేది? శ్రీ
హరి యనుకొంటిమా ఫణికృతాంతకవాహన మేది? వాఙ్మనో
హరుఁ డనుకొంటిమా సరసిజాసన మే”దని ధీరు లెంతు రీ
స్థిరతర మల్లరాడ్కులనృసింహుని వేంకటవారసింహునిన్.
మ. బలభిద్వైభవభీమరేఖ విలసద్భాహాబలప్రౌఢి కుం
డలిరాడ్పాండితి యక్షరాడ్తనుజసౌందర్యంబు దుర్గాధిప
త్యలఘుస్థేమము జానకీపతిసుదానాసక్తి మీ కిచ్చుఁ గా
కలరన్ శ్రీమలరాజవేంకటనృసింహా! రాజకంఠీరవా!
ఉ. తోయజగంధిచుక్క లని తోఁచు ఖభిత్తిక నున్న వేమి? యే
మో యని సంశయింపకుము ముద్దులగుమ్మ! సురాంగనామణుల్
వ్రాయఁగ లేక యిందు మలరాడ్కులవేంకటనారసింహభూ
నాయకచంద్రునింటఁ గలనాకము లెన్నఁగఁ జిత్రవైఖరిన్.
శా. శ్రీమన్మంగళదేవతాహృదయరాజీవద్విరేఫంబు శ్రీ
రామబ్రహ్మము పుత్రపౌత్రబలదీర్ఘాయుస్థిరాభోగసు
త్రామైశ్వర్యముఖాదిసద్విభవ మశ్రాంతంబు మీ కీవుతన్
హేమల్రాజకులీన! వేంకటనృసింహేంద్రా! కవీంద్రస్తుతా!
ఉ. కంతుఁడొ! యిందిరారమణికాంతుఁడొ! చారుసరస్వతీసతీ
కాంతుఁడొ! శ్రీజగజ్జననికాంతుఁడొ! పుణ్యవసంతుఁడో! శచీ
కాంతుఁడొ! యంచుఁ బండితులు గాంచి హృదబ్జములందు మించి యో
జింతురు మల్లరాడ్కులనృసింహుని వేంకటనారసింహునిన్.
సీ. ఇతఁడే కదా! మదోద్ధతవైరిరాణ్మత్త
వారణవారకంఠీరవుండు
ఇతఁడే కదా! జగద్ధితకీర్తివిఖ్యాత
విరియాలగోత్రాభివృద్ధికరుఁడు
ఇతఁడే కదా! సదాశ్రితకోటిసంరక్ష
ణార్థాగతామరానోహకంబు
ఇతఁడే కదా! కవిస్తుతభూరిసామ్రాజ్య
లక్ష్మీకటాక్షసంరక్షితుండు
ఈతఁడే కద గుడగిరిశ్రౌతశైల
కొండవీడ్దుర్గభూభుజోద్దండధారి
హారి మలరాజవేంకటనారసింహ
కుంభినీపతి వేంకటగుండనృపతి.
ఉ. రా జనవచ్చు శక్తి రతిరా జనవచ్చు మనోజ్ఞమూర్తి రా
రా జనవచ్చు భూతి నిధిరా జనవచ్చు పదార్థమోషధీ
రా జనవచ్చుఁ గీర్తి నగరా జనవచ్చు నుదారరేఖ మ
ల్రాజనవచ్చు రా నరసరాయని వేంకటగుండరాయనిన్.
సీ. అనృతభాషణ మొక్కఁ డాఁడనేరనిజిహ్వ
కేరీతి శాస్త్రార్థహితవుఁ గల్గెఁ
బరకాంత మాతృభావనఁ గనుమనమున
కెటు యశఃకాంతపై నిచ్చ గలిగెఁ
బరునినొక్కనిఁ బ్రోవఁ గరుణఁ బూననిమది
కెటు సర్వజనగుప్తపటిమ గలిగె
నవమానభార మిం తైన నోపనిశిరం
బెటుల భూభారసంఘటన నూనె
నౌర తావక మహిమ మహావిచిత్ర
మనఁగ వెలసితి మలరాజ ఘనకులేంద్ర
వేంకటనృసింహవిభుపుత్ర! విమలగాత్ర!
గుణగణకలాప! వేంకటగుండభూప!
సీ. వేంకటగుండేంద్రు వితరణస్ఫూర్తికి
జలరాశి సంతోషశాలి యయ్యె
వేంకటగుండేంద్రు విమలయశఃకాంతి
కేణాంకుఁ డతిహర్షమాణుఁ డయ్యె
వేంకటగుండేంద్రు వృత్తివైభవమున
కబ్జనాభుఁడు సుఖప్రాప్తుఁ డయ్యె
వేంకటగుండేంద్రు విక్రమప్రౌఢికి
విబుధాంగనాతతి వేడ్కఁ జెందె
నౌర మలరాజవేంకటనారసింహ
విభుఁ డొనర్చెడు తత్ఫలవిశదమూర్తిఁ
దేజరిల్లెడు జనభాగధేయ మనఁగ
గురుబలోన్నతి వేంకటగుండనృపతి.
మ. మలరాడ్వేంకటగుండభూరమణ యుష్మద్వైరిభూపాలకాం
తలు కాంక్షించుచునుందు రాతతసమత్వాబ్దంబు లబ్జారిచి
హ్నలఁ జెన్నొందని మాసబృందముఁ దమిస్రాయుక్తఘస్రావళిన్
బలభిద్భేదనరాజచంద్ర సుకృతీ! ప్రద్యుమ్నరమ్యాకృతీ!
మ. చటులోర్వీపతియై మహావిభవుఁడై సత్త్రాణధారాయశ
శ్చట లే దంచును వేంకటేశుఁ డిలపై జన్మించి మల్రాజవేం
కటభూపాలకమౌళి యౌచు వెలయం గాఁబోలుఁ గాకున్న నీ
పటుదాతృత్వవిశేష విశ్వభరణ ప్రారంభముల్ గల్గునే?
మ. మలరాడ్వేంకటగుండభూవర భవన్మాద్యద్ద్విషద్రాజమం
డలిగుండెల్ పగులన్ ధణాంధణనినాదస్ఫారభేరీఘళం
ఘళఘంటారవగంధసింధురఘటాక్రాంతైకపద్యాంచితా
ఖిలసంపద్పరిపూర్ణభావవిలసద్వృద్ధశ్రవఃపట్టణా
కలిత శ్రీనరసింహరాయనగరిన్ గట్టించి తీ విద్ధరన్.
ఈగుండారావుగారి కిరువురు భార్యలు.
శా. స్వామీ వేంకటగుండభూవరనృసింహక్ష్మాధిరాడ్పట్టణ
శ్రీమత్సౌధవిచిత్రరత్నరుచిసాంద్రీభూతపీఠిన్ భవ
ద్వామాక్షీయుగమధ్య మీరలు తలంపన్ రుక్మిణీసత్యభా
మామధ్యస్థిత కృష్ణమూర్తి వని సంభావింతు రార్యోత్తముల్.
మ. రవిచంద్రాక్షగృహాగమోపమిత బెల్లంకొండ విన్కొండ కొం
డవిటీదుర్గధరాధిపత్యధృతివై నానానృపస్తోమసు
స్తవివై శ్రీమలరాణ్ణృసింహుని తనూజాతుండు నా మించి తీ
వవనిన్ వేంకటగుండభూవరమణీ! యర్థార్థిచింతామణీ!
ఉ. రాజకళాకలాప! మలరాట్కులవేంకటగుండభూప! నీ
రాజితకీర్తి రాజసురరాజధరాజభరాజరాజభృ
ద్రాజశరాజవాహనగరాజశరాజశరాజవాహగో
రాజభుజంగరాజరుచిరస్థితిఁ గాంచెను చిత్రవైఖరిన్.
మ. మలరాడ్వేంకటగుండభూరమణ యుష్మత్కీర్తిశుభ్రాంబుజం
బలర న్నీలమణిప్రభావిజితదైత్యద్వేషిపాదంబు త
ద్దళమధ్యాంతరచంచరీకమనఁ బ్రోద్యల్లీలఁ జెన్నొందె భూ
వలయాధీశనుతాధిపా! ప్రబలతద్వైరివ్రజాబ్జద్విపా!
మ. మలరాడ్వేంకటగుండభూవరునిసామ్యం బెవ్వరిం జెప్ప భూ
వలయత్రాణమనోజ్ఞసూనృతరిపుప్రధ్వంసలీలావిని
శ్చలధైర్యోక్తుల నొక్కపట్టున హరిశ్చంద్రోరగేంద్రుల్ సముల్
తలఁపన్ వారల కన్న నెవ్వ రనుచున్ దర్కింతు రార్యోత్తముల్.
శా. శ్రీశా వేంకటగుండభూరమణవాక్క్రీడామహైశ్వర్యలీ
లాశాస్త్రాదికళావిలోచనధనుఃప్రజ్ఞానుభోగస్థిరా
పాశాస్ఫూర్తులఁ దుల్యు లం చనఁగ నుద్యత్ప్రాజ్ఞవాణీశగౌ
రీశాంభోజవరుల్ భవత్సములుగా కెవ్వారు నీసాటికిన్.
మ. పటువార్ధిన్ విధిదీనరక్షణకుఁ గల్పౌఘంబుఁ గల్పించి యొ
క్కటి నైనన్ ధర నుండ నీక దివిఁ జక్క న్నిల్పి మల్రాజవేం
కటగుండప్రభు నిత్యదానమతిఁ గాఁ గల్పించెఁ గా కెట్లు ప్రో
చుట యిం దుద్భవమైనయర్థులకు రక్షోపాయ మూహింపఁడే?
మ. పటులీలన్ నిఖిలావనీజనము సంప్రార్థింపఁగా ముందు ధూ
ర్జటి లోకోత్తరుఁ డీశుఁ డేకతరదుర్గాఢ్యుండునై యుంటయెం
తటి కార్యం బని బద్మనాయకకులోత్తారుండు మల్రాజవేం
కటగుండప్రభుఁడై జనించి బహుదుర్గాధ్యక్షుఁడై మించెఁ గా
కెటు లొక్కం డఖిలావనీజనమనోభీష్టంబు లీ డేర్చెడిన్.
ఉ. వేరుచమల్లరాజఘనవేంకటగుండనృపాల! నీయశ
స్సారము వారిజారికి గజారికి తార్క్ష్యగజారి కబ్జభి
న్నారికి శంభునారి కజునారికి సీరికి సౌరవాహినీ
వారికి లచ్చి వంగడమువారికి చివ్వఁ దినయ్యవారికిన్.
మ. కలివేళన్ విబుధాశ్రితావళికి సౌఖ్యప్రాప్తి గావింప శ్రీ
మలరాడ్వంశము భాస్క రాన్వయమునన్ మాన్యుం డుదారుండు కే
వలపుణ్యుండు నృసింహుఁ డాజిబలవద్వైరిక్షమావైభవో
జ్జ్వలుఁ డౌ వేంకటగుండభూవిభుఁడు విద్వద్వ్రాతపుణ్యంబునన్
గలిగె న్నేఁ డని పల్కుచుండుఁ గవిలోకం బెల్ల నెల్లప్పుడున్.
చ. రతివరదివ్యరూప! మలరాడ్కులవేంకటగుండభూప! నీ
వితరణరేఖఁ గాంచి ద్యుకవిగ్రహరాజు తనూజురాజు వా
క్పతు లొకవేళ దాత లని ప్రస్తుతిఁ జెందుదు రేమొ కాని సం
తతసహదుర్యచర్య! వసుధావరులం దొకఁ డైన దాత యై
క్షితి విలసిల్లుటం గన మొకించుక వంచన లేదు భూవరా!
ఉ. వింటిని మల్లరాజకులవేంకటగుండని కీర్తి జంటయౌఁ
దొంటికిటీంద్రుపంటికి నధోక్షజుడాపలికంటి కల్లము
క్కంటికి వానియింటికిని కామునివింటికిఁ దమ్మిచూలివా
ల్గంటికి నిగ్గులీనువడగంటికిఁ గప్పురపున్ననంటికిన్.
మ. మలరాడ్వేంకటగుండభూరమణ యుష్మత్ప్రాగణక్షోణిశృం
ఖలబంధంబుల గంధసింధురతతు ల్గాఢంబుగా నిల్చె శ
త్రులయావాసకృతాపరాధికకుభృస్తోమంబు నా లేక భే
రులనాదోన్నతి నిల్చునే? యకట! నిద్రోద్రేకము ల్మానునే?
మ. మలరాడ్వేంకటగుండభూరమణ యుష్మచ్ఛౌర్యసంరంభసం
కలితోద్యద్రణభేరికాధ్వని మహాకాంతారభూభృద్గుహా
వళులున్ వైరిచయంబుఁ గాంచెననగా వర్చించెఁ గాకున్నఁ త
త్కులనాదంబులు వానికేమి పని తత్తద్వేళల న్బల్కఁగన్.
మ. కుటిలారాతిపరాక్రమానలునిపైఁ గోపించి మార్తాండు నొ
క్కట భక్షించి నగాళి నెక్కి దివిమార్గం బేగి సింధూదక
చ్ఛట మాన్పం గమకించుఁ దద్ఘనగతు ల్శాంతింప మల్రాజువేం
కటగుండక్షితిభృచ్ఛమూజనితరంగద్భూరజోజాలముల్.
మ. అరిరాడ్శిక్షకనారసింహపురసౌధాగ్రస్థరాకానిశా
కరసారంగము మల్లికాకుసుమసంఘాతంబు భక్షింప సుం
దరు లంతం గనిపట్టి రం దది మొదల్ దైన్యంబు జెన్నొందఁ గ్ర
చ్చఱఁ జంద్రుం డదిగాక రాజులకుఁ గాంక్ష ల్గావె సారంగముల్.
మ. రమణీయాకృతి నారసింహనగరప్రాకారరత్నాగ్రదు
ర్దమసంధానవిభిన్నవిశ్రుతసుధాధారప్లుతిం గల్గె ను
త్తమచామీకరహర్మ్యమౌళి కలసౌధఖ్యాతి కాకున్నచోఁ
గమలారాతికి నాఁడునాటికిఁ దనూకార్శ్యంబు సిద్ధించునే?
మ. ధరణీమండలి నారసింహపురసౌధాభ్యంతరాళప్రభా
కరచంద్రామలపుత్రికాముకురముఖ్యాలంకృతస్తంభకు
డ్యరమావైభవముం గనుంగొన సహస్రాక్షుండు దక్షుండుగా
కరయం గేవలమర్త్యమాత్రునకు శక్యంబే నిరీక్షింపఁగన్?
మ. నరసింహప్రభుపట్టణోత్తరలసన్నానామణీచిత్రభా
స్వరమాయోషితరాజసౌధ మమరెన్ సర్వంసహామండలే
శ్వరసన్మానితభాసమై వెలయుచున్ సాక్షా దయోధ్యాపురీ
వరభాస్వత్కులరామచంద్రగృహభాస్వల్లీలఁ జెన్నారుచున్.
మ. ప్రతతార్యాన్వితనారసింహనగరప్రాసాదసంచారసం
గతదాంపత్యరతి...........................................
ప్రతతు ల్పువ్వులతోడఁ ద్రోయ నవిధారాభృత్తటిన్ వ్రాలి వి
చ్యుతు లయ్యెన్ ధరపై సముద్రజము లంచున్ జూడఁ జిత్రంబుగన్.
మ. పటులీలానరసింహరాయనగరప్రాసాదరత్నంబు వేం
కటగుండప్రభుతోడఁ జెల్వమరె సాక్షాద్వైజయంత్యాఖ్య నొ
క్కట గాకున్నను నిల్తురే బుధగురుల్ కావ్యజ్ఞు లుద్యత్సము
త్కటదివ్యాంగన లిష్టభోగములు శృంగారంబులుం గల్గునే?
మ. సరసీజాతపరాతతాంతగతలక్ష్యస్ఫూర్తి వీక్షించి కొం
దరు సారంగశశద్రుమాగ్రదళితేంద్రాశ్మద్యుతిస్తోమ మం
దురు గా కందు నృసింహరాయపురసౌధోత్సంగసంసర్గగా
కరయన్ వేఱొకరీతి గాదనుచు మత్స్వాంతంబునం దెంచెదన్.
ఉ. శ్రీయుతనారసింహపురశేఖరకాంచనరత్నసౌధవా
తాయనమార్గదీపకళికాగ్రసమంబున ధూమరేఖ నే
చాయనఁ జూచినా వదియె “చంద్రునిలో మృగ” మంచుఁ గాదు “లే
డే” యని కాని వాదములు దెప్పర మప్పురిముగ్ధకోటికిన్.
మ. నరసింహప్రభుపట్టణాంతరలసన్నానామణీవ్రాతబం
ధురసౌధం బురులీల మించ హిమవద్గోత్రంబు దూరంబుగా
జరిగెన్ దారకశైలరత్న మొగి నైజావాస మెవ్వారికిన్
గురిగాఁ గన్పడదయ్యెఁ దద్గరిమ లోకు ల్మెచ్చఁగా శక్యమే!
చ. అకలుషనారసింహనగరాంతరచిత్రితచక్రయంత్రనా
యకకృతతామ్రపాత్రనివహభ్రమణీకృతిఁ జూడ నొప్పె దీ
ర్ఘికనిజపుత్రకోటి కొకక్రీడ యొనర్పఁగఁ బూనెనో యనన్
నికటతలస్థరాజభవనేశ్వరుఁ డాత్మముదంబుఁ జెందఁగన్.
ఉ. శ్రీనరసింహరాయపురశేఖరసౌధనివాసవాసినీ
మానవమానినీమణులు మాటికిమాటికిఁ జూడ వచ్చు వై
మానికమానినీమణుల మానక పూజ లొనర్చు మల్లికా
సూనములో యనన్ దలపఁ జొప్పడు నప్పురిఁ దారకావళుల్.
ఉ. ఎంచఁగ వారిభాగ్యము మరేమన నేర్తు సమస్తనూత్నర
త్నాంచితనారసింహనగరాంతరసౌధవిహారిణుల్ కరా
భ్యంచితఖంబువిష్ణపద మంచు సపర్య లొనర్ప నేర్పుగా
నుంచినపూవులో యనఁగ నొప్పెడి నప్పురిఁ దారకావళుల్.
చ. నరహరిపట్టణాంతరమునం దపనీయమణిస్ఫురద్రసో
త్కరనృపమందిరం బలరె ద్వారకతో నలయాదవేంద్రుమం
దిర మనఁ గానిచో నచట నిల్చునె? రుక్మిణిసత్యభామలి
ద్దఱు నిరుప్రక్కలన్ వెలయఁ దామరసాక్షుఁడు కృష్ణదేవుఁడున్.
చ. జలనిధిమగ్నసాంద్రత....చస్థితి ద్వారవతీపురీరమా
లలన ముకుందుతోఁ దెలుప లాలనఁ జేసి నృసింహరాడ్పురిన్
నిలు మని సౌధరాడ్ప్రకృతి నే నొకవేంకటగుండరాయరా
డ్తిలకుఁడనై జనింతు నని తెల్పినవో? యన మించెఁ దత్స్థితుల్.
ఉ. ధారుణిశ్రీనృసింహవసుధాపతిపట్టణభర్మహర్మ్యచి
త్రారచితైకపుష్పవనులం దిర వొందెడు సత్సరఃపయః
పూరితభూరియంత్రజలపూరము లొక్కెడఁ గూడఁ బాఱి మి
న్నేరన నిల్చి కాల్వ యొకఁ డేరుపడెన్ గగనాంతరమ్మునన్.
ఉ. నీ టొలయన్ నృసింహధరణీశపురాంతరసౌధవీటిలో
బోటులు జల్లులాడుజలపూరము లభ్రములోనఁ గల్గెఁ బో
వాటికి నాటనుండి జలవాహము లన్నప్రసిద్ధి గల్గె నీ
బూటక మొప్పు నీటిఁగొని పోకెటు లిచ్చెడి? నిర్మలాంబువుల్.
క. గురుబుధకవిలోకంబై
సురుచిరబహువజ్రహేమశోభాకరమై
సురరాజు మేడకంటెను
నరసింహపురంబు సౌధనాయక మమరెన్.
క. నరహరిరాడ్పురసౌధం
బరయఁగఁ గైలాసశైల మనఁగా దగునా
గిరి కా దటందు రేనియు
మఱువక దుర్గాధినాథమందిర మగునే?