చాటుపద్యరత్నాకరము/పీఠిక
పీఠిక
(మొ ద టి కూ ర్పు)
ఆంధ్రభాషాభిమాని సోదరులారా!
వాగనుశాసన కవిసార్వభౌమాంధ్రకవితాపితామహాదిమహామహులచే నెత్తిపెంపఁబడి, రాజాధిరాజులచే లాలింపబడి, దేశభాషాలతాంగులకు దలమానికమై చెన్నారిన మన యాంధ్రభాషాధూటి, తన ముద్దులొలుకుపలుకులను కేవల పురాణకావ్యప్రబంధరూపములనే కాక చాటుపద్యరూపమున గూడ వెలయించి వెలలేని పొగడ్త నందియున్నది. ఆచాటుఫణితి యొక్కొక్కపట్టునఁ బ్రబంధసరణిం గూడ నధఃకరించుననుట కవితాతత్త్వజ్ఞులకు విదితము.
చాటువులు కేవల కల్పనాకథాత్మకములును—అత్యంత్యాశయోక్తిమయములును—గాక విషయానుకూల స్వాభావికవర్ణనాలంకృతము లయి, సర్వజనహృదయంగమము లయి రస మొలుకుచుండును. అంతేకాక పూర్వరాజుల గుణగణములను, అప్పటి దేశస్ధితులను, నాఁటి యుద్దములను; జయాప జయములను, కవులను; పండితులను; వారివారి వివాదసామర్థ్యములను; మఱియు ననేకవిషయములను దెలిపి ప్రకృతదేశచరిత్రకారులకును, కవులకును జేయూఁత నొసగఁజాలియున్నవి.
ఇట్టిచాటువు లాంధ్రప్రపంచమున నెన్నియో జన్మించినవి. అం దొకకొన్ని తాళపత్రగ్రంథములఁ జేరి, రామబాణముల వాతఁబడి నశించినవి. ఇంకను నశించుచున్నవి. మఱికొన్ని తాళపత్రముల కెక్కక, కొందఱుముదుసళ్లనోటన నెలకొనియుండి నేటికి నామమాత్రావశిష్టము లైనవి. పోయినవి పోయినప్పటికి ననేకపద్యములు నిల్చి యున్నవి. కాని అవి యొకగ్రామమున నొకయింట నొకపొత్తమున లేమిని వానిని సంతరించుట మిగుల గష్టము. చాటుపద్యరత్నములఁ గూర్చిశ్రద్ధవహించినవారు లేకపోవుటచేత నవి యట్ల దిక్కుమాలి పడి యుండెను. మొన్న మొన్న బ్ర. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు కొన్ని చాటువులంగూర్చి— యీనవీనమహాకార్యమునకు మార్గదర్శకులయి— "చాటుపద్య మణిమంజరి" యను గ్రంథము నాంధ్రలోకమున కొసంగి వినుతిపాత్రులైరి. సామాన్యముగ లోకములో వాడుకలో నున్న చాటువులే కాక యెన్నియో పురాతనచాటువు లందున్నవి. అయిన నందుఁ జేరని చాటువు లెన్నియో యింకను మేఘముల మఱుఁగున నున్న తారకలవలె నందందునున్నవి.
ఈవిషయము నెఱింగి బ్ర. దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు ఈ చాటుగ్రంథసంపాదకులలో రెండవవారుగా బయలువెడలిరి. వీరి ప్రయత్నము సకలాంధ్రజనశ్లాఘ్యము. వీరు వయస్సునఁ బిన్నలయ్యును, తమకుఁ గల భాషాప్రవేశాభిమానములు చెలులై తోడునడువ, వ్యయప్రయాసముల కోర్చి దేశసంచరణ మొనర్చి— మణిమంజరిలోఁ జేరని చాటువు లించుమించుగ నాఱువందలను గూర్చి యీ 'రత్నాకరము 'ను వెలువరించి మన కందఱకు నానందము గలిగించిరి. ఇందులకు మన కృతజ్ఞతను దెల్పుటతో దనివినందక, యింక నిటువంటిగ్రంథములను సంపాదింప మనశాస్త్రిగారికిఁ బ్రోత్సాహ మొసంగి వారి యుద్యమమునకు దోడుపడుట యాంధ్రులమగు మన కెల్ల రకును గర్తవ్య మని విన్నవించుచున్నాను.
9-7-17,ఇట్లు: కవిజనవిధేయుడు,తోటపల్లిగూడూరు, నెల్లూరుపొణకా పెంచెలురెడ్డి