వైదికు లిది శుద్ధవైదికం బని యెన్న
                      శాస్త్రజ్ఞు లిది ధర్మశాస్త్ర మనఁగఁ
దార్కికు లిది మహాతర్కం బనంగఁ బౌ
                      రాణికు లిదియె పురాణ మనఁగ
నాగమవిదులు దివ్యాగమం బిది యనఁ
                      దంత్రజ్ఞులు లిది వీరతంత్ర మనఁగఁ
భక్తవారం బిది భక్తి మార్గం బన
                      ముక్త్యర్థు లిది మహాముక్తిద మన


కవులు భువిని నిదియె కావ్యం బనంగ స
జ్జనుల కెల్ల మిగుల సంతసముగ
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!

22


బసవన్న శ్రీపాదపద్మపుష్పంధయ
         స్థేముండు పాల్కుర్కి సోముఁ డనఁగ
బసవపురప్రాప్యపర్వతోత్తరముఖ
         సీముండు పాల్కుర్కి సోముఁ డనఁగ
బసవపురాణప్రబంధసంఘటనాభి
         రాముండు పాల్కుర్కి సోముఁ డనఁగ
బసవశతకగద్యపద్యాదిసంస్కృతి
         ధాముండు పాల్కుర్కి సోముఁ డనఁగ


పరగ ప్రస్తుతించి భావించి భజియించి
బసవవిభునికరుణ యెసఁగఁ బడసి
నిర్వికల్పరతి చతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!

23