చంపూరామాయణము/ప్రథమాశ్వాసము

శ్రీరస్తు

చంపూరామాయణము

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాప్రార్థనాదికము

శా.

శ్రీవత్సాంకము చాయకైవడి మిటారింప న్మనోవారిజా
తావిర్భూతనిశావిటప్రతిభటుండై హృత్తటిం దోఁచు రా
జీవాప్తుం డనఁ బొల్చు కౌస్తుభముచేఁ జెన్నౌరమాజాని మా
కావేరీప్రభునందనుం గసవరాట్కంఠీరవుం బ్రోవుతన్.

1


ఉ.

గుబ్బలికన్యలోచనచకోరయుగంబునకు న్మృగాంకుఁడై
నిబ్బరపున్ముదం బొసఁగునెయ్యుఁడు బంగరుగట్టువింటివాఁ
డబ్బురమైన నవ్వునఁ బురాసురులం దెగటార్చుపాదుషా
గిబ్బపటాణిరావుతుఁడు గె ల్పొసఁగుం గృతినేత కెప్పుడున్.

2


ఉ.

నీ వనురాగలీల హవళించుప్రవాళము కేలివీణె కో
హా విధ మంచు నెంచుతనసూక్తిచమత్కృతికిన్ దరస్మితం
బావహిలన్ రహించుజవరాలినిఁ గూడి పయోజపీఠిఁ గొ
ల్వై వసియించు ధాత కసవావనినేతఁ జిరాయుఁ జేయుతన్.

3


సీ.

ప్రభవిల్లుఁ బద్మసౌభాగ్య మేవిరిఁబోఁడి యభిముఖస్పూర్తిఁ జెన్నొందినపుడ
పొగడొందుఁ గుందవిస్ఫురణ మేజవరాలు చిఱునవ్వు కెమ్మోవిఁ జిలికినపుడ
పాటిల్లు నీలసంపత్తి యేవాల్గంటి క్రేగంటిచే నిరీక్షించినపుడ
పల్లవించు ముకుందభావ మేవగలాఁడి యడుగు మందిరమునం దిడినయపుడ


గీ.

యాజగన్మాత మకరాకరాత్మజాత, శంఖనందనకచ్ఛపోజ్జ్వలపదాగ్ర
పరమహాపద్మరాగనూపురరుచుల్ ర, హించఁ గృతినేతనగర నర్తించుఁగాత.

4


ఉ.

ఫాణితమాధురిం దెగడుపల్కులయందము నభ్యసింపఁగాఁ
బోణిమి నేగుదెంచుగతిఁ బొల్పగుచక్కెరవింటిదంటసా
మ్రాణిపటాణి వాణి ననురక్తిని దాల్చు మెఱుంగుఁబోణి శ
ర్వాణి యొసంగుఁ గాతఁ గసవక్షితినేత కభీప్సితార్థముల్.

5

చ.

నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళమాధురిం
దమి యిడునేర్పు నీకు విదితం బగు నింక వరాళిచాలిగా
త్రమున రహింపఁజాలుట గదా! యరు దంచు విరించి మెచ్చ హా
సము నునువాతెఱం జొనుపు శారద పొల్చుఁ గృతీంద్రుసూక్తులన్.

6


చ.

అలఘుతమాగమాంతసముదంచితమౌ చిగురాకు విఘ్నమం
డలకులశైలఖండన మొనర్చు బలాసురఘాతిహేతి కం
దలదరవిందకాంతిహరణస్ఫురణాభరణంబు నిచ్చలుం
బలితపుగౌరుమోముదొరపాదయుగంబు శుభంబు లీవుతన్.

7


ఉ.

ఇం బడరంగ సద్గతిసమృద్ధినిదానము ధర్మ మేని ధ
ర్మంబు నెఱుంగఁజేయుమహిమం దగునట్టిది వేద మేని వే
దంబు భరించువారు వసుధాసురు లేని తదీయపాదప
ద్మంబులఁ దక్క నొక్కయెడ మామకమౌళిమదాళి వ్రాలునే.

8


శా.

ఆరాధింతు నిరంతరంబు నతులధ్యానప్రసూనంబుచే
ధారావాహికతర్కవాదపటుశబ్దగ్రంథవైజ్ఞానికున్
భారద్వాజసగోత్రు లోకవినుతాపస్తంబసూత్రు న్మహా
ధీరు న్మద్దురు నాగదేవగురునిం దిప్పార్యవర్యాత్మజున్.

9


క.

శుకభీష్మవిభీషణశౌ, నకశాక్త్యనరాంబరీషనారదుల వసి
ష్ఠ[1]కయాధుజరుక్మాంగద, బకదాల్భ్యులఁ బుండరీకు వ్యాసుఁ దలంతున్.

10


సీ.

కౌఠారధార యేఘనునిబాహాదండ మక్షరాక్షసమహావృక్షమునకు
శతకోటి యేమేటిజాగ్రన్నఖాగ్రంబు జంబుమాలిశరీరశైలమునకుఁ
గూటపాకల మేవనాటవీరుబలంబు జృంభమాణనికుంభకుంభిపతికి
నాభీలఫణధరం బేభవ్యువాలంబు కంపనప్రాప్రకంపనమున


గీ.

కతని శ్రీరామభద్రముద్రాంగుళీయ, దానసంతోషితావనీతనయు సనయు
గోష్పదీకృతవారాశి గుణవిభాసి, జవనభస్వంతు హనుమంతు సన్నుతింతు.

11


సీ.

మహికర్ణపుటశుక్తిమౌక్తికాకృతిధన్యు, యామునద్వీపాబ్జహేమగర్భుఁ
గాళికాముఖవీటికారసజ్ఞరసజ్ఞు నిజముఖాలోకివాణీవదాన్యు
మాలతీమాధవమేళనాద్భుతశీలు దశకుమారకథాసుధాసముద్రుఁ
బ్రణుతచంద్రాపీడగుణయథార్థితనాము శిశుపాలవధకృతిశ్రీకళత్రు

గీ.

నాంధ్రభాషారచితభారతాదికావ్య, భాగవతముఖ్యవిఖ్యాతబహువిధప్ర
బంధమకరందబృందపుష్పంధయార్య, మతిచణులు నైనకవిశిఖామణులఁ దలఁతు.

12


మ.

నిరతంబుం బలుకున్మిటారికి చొకానిద్దంపుటద్దంబులై
పరమానందకలావిజృంభణపరీపాకక్షపాకాంతులై
సరసోదారకథాసుధారసవిలాసక్షీరవారాసులై
చిరకీర్తు ల్గను సత్కవీంద్రుల గుణశ్రీసాంద్రులం గొల్చెదన్.

13


మ.

నెల రెణ్ణెల్లకు నొండు రెండుపదము ల్నిద్రాదరిద్రాణతా
కలితాంధ్రోక్తులఁ గూర్చునంతనె మదిం గర్వించుదుర్వృత్తు న
త్యలఘుప్రౌఢి దృఢాంధ్రసంస్కృతసమస్యాపద్యసద్యస్సము
జ్జ్వలసందర్భసమర్థసత్కవుల రచ్చ న్మెచ్చఁగా వచ్చునే.

14


ఉ.

ధారణి గద్యసూక్తిమిళితంబగు పద్యము హృద్యవాద్యరే
ఖారమణీయమైన మృదుగానమురీతి రహించుఁ గాన నా
నారసవత్కవిత్వకలనాచతురానను లిచ్చ మెచ్చఁగా
నారసనంబు చంపురచనంబుఁ దిరంబుగఁ జేయుఁగావుతన్.

15


అవతారిక

వ.

అని యిష్టదేవతాగురునమస్కారంబును మహాకవిపురస్కారంబును గుకవితిరస్కారంబును సనమస్కారంబుగా నొనర్చి సుధారసమధురదశరథాత్మజకథాసంవిదానబంధురంబగు మహాప్రబంధంబు సందర్భింపం బూని యున్న సమయంబున.

16


సీ.

సత్యభాషాహరిశ్చంద్రుండు సాహసోన్నతుఁడు శ్రీహరికరుణాకటాక్ష
వీక్షణాలంకారుఁ డిందీవరేక్షణాజనలోచనచకోరచంద్రుఁ డమర
తేజుఁడు సాహిత్యభోజుఁడు దానకర్ణావతారుఁడు మహాహవకిరీటి
యాదిగర్భేశ్వరుం డశ్వరేవంతుండు కటకపురీచూరకారుఁ డుత్త


గీ.

మద్విజాశీల్వచోవర్ధమాన సకల, భోగభాగ్యాయురారోగ్యయోగశాలి
కసవరాజన్యమూర్ధన్యుఁ డసమవైభ, వోజ్జ్వలతమంతుకెక్కఁ దా నొక్కనాఁడు.

17


గీ.

సరసమై తగునట్టి ప్రసన్నవేంక, టేశ్వరస్వామిపద్యము లిపుడు మాకు
వీనులకు విందు సంధిల వినఁగనలయు, ననినఁ జదివితి నార్యులు హర్ష మొంద.

18

శా.

వేర్వేఱన్ శివుఁ డంచు విష్ణు వనుచు న్వెల్లంటికావేరిరా
జోర్వీనాథకుమారుఁడౌ కసవరా జుత్సాహవృత్తిన్ ధరా
గీర్వాణప్రకారంబు లెంచఁగను భక్తి న్ని న్బ్రతిష్ఠించెఁగా
కార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా!

19


శా.

దుర్వాసఃప్రముఖుల్ మునీశ్వరులు నెంతోభక్తితో నెమ్మది
న్నిర్వాణప్రదుఁడైన దేవుఁడని నిన్నే యెంచి భావింపఁగాఁ
దర్వాత న్మది నన్యదైవతచరిత్రం బెంచ మా కేటికిం
గార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా!

20


శా.

చర్వాద్యాహుతు లాదిగాఁ దగినయజ్ఞంబందు ఋగ్యాజుషా
ధర్వోద్గాతృవచోవిలాసమున నీతత్త్వంబు నిత్యంబు నం
తర్వాణుల్ నుతియింతు రెల్లెడను శాస్త్రగ్రంథసద్యుక్తులం
గార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా![2]

21


క.

వారిదగంభీరోక్తుల, నీరీతిఁ బ్రసన్నవేంకటేశ్వరునుతియున్
గౌరవమునఁ గావించుచు, భూరమణుసభాంతరంబుఁ బొగడెద మఱియున్.

22


చ.

పగడపుఁగంబముల్ గరుడపచ్చలబోదెలు తమ్మికెంపుఱా
సొగసగు చూరుమొగ్గలును జొక్కపునీలపుఁగప్పుజాళువా
జగతియుఁ గ్రొత్తముత్తెములజాలకరాశి సిరాజిచేలచాల్
జిగిబిగిచందువాలు విలసిల్లు సభాభవనాంతరంబునన్.

23


సీ.

అలమేలుమంగాంతరంగసారసభృంగలలితుఁడై వేంకటాచలవిభుండు
జానకీముఖపూర్ణచంద్రచకోరమై రాణించు రామచంద్రప్రభుండు
రాధాకుచాద్రిధారాధరాకారుఁడై భాసిల్లు మదనగోపాలశౌరి
శ్రీరంగనాయికాశృంగారకాసారరాజహంసంబైన రంగపతియుఁ


గీ.

జారుచామీకరాధిక్యచాకచక్య, భూరిమాణిక్యధగధగస్ఫురణభరణ
భాసురవిచిత్రశుభచిత్రపటములందు, వెలసి కన్నులవిందు గావింప మఱియు.

24


ఉ.

అందపునర్తనం బభినయంబును మద్దెలసద్దు గీతగో
విందము వేణునాదననవీనసుధూరసధార వల్లకీ
బృందరవంబుఁ దాళరుతి పేర్మిపురాణము నింపుసొంపు ది
గ్వందితకీర్తియైన కసవక్షితిజానిసభాంతరంబునన్.

25

సీ.

శబ్దతర్కాదిశాస్త్రప్రసంగములఁ బే రెక్కిన విద్యాంసు లొక్కవంకఁ
బ్రాకృతమాగధప్రముఖభాషలఁ గబ్బ మొనరించుకవిరాజు లొక్క వంక
రామభారతకథాప్రస్తావపటిమఁ జెన్నొందుపౌరాణికు లొక్కవంక
గీతప్రబంధాతిచాతురీవిస్పూర్తి నొఱపుమీఱినగాణ లొక్కవంక


గీ.

నుచితమతిమంతు లగుమంత్రు లొక్కవంక
మఱియు సామంతబంధుసమాజవంది
యోధదండాధిపతిముఖ్యు లొక్కవంకఁ
బ్రమదమునఁ గొల్వ నిండోలగమున నుండి.

26


ఉ.

వందిధురీణుల న్మధురవాణులఁ గన్లొని వేంకటాచలా
ర్యేందునిగుంభితం బగుసుధీడితమద్బిరుదాంకగద్య మా
నందవదాన్య మిత్తఱి వినన్వలె నావుడు వారు నింపుసొం
పొందఁ బఠించి రీగతి ననూనఘనస్వననిర్భరార్భటిన్.

27


బిరుదుగద్యము.

జయజయారంభజృంభమాణ గంభీరభేరీనినాదమేదురామోద
కల్వాదశిలితాలయానుసారిభూరినటనావలోకనారచితఖచరపురచకోరలోచనాని
చయచారుహసితచంద్రచంద్రికానికరముకుళితామందమందాకినీకనకారవింద
సందోహసద్యోవికాసకారణసముద్యోతమానప్రతాపమార్తాండ! ఐవరగండ!
సంభోగభోగసాహస్రమండీతకుండలికులాఖండలధరణీమండలభరణపాండిత్యగరి
మసాహాయ్యవితరణప్రవీణబాహాగ్రజాగ్రత్కృపాణకంఠీరవకుమారలుంఠితా
కుంఠపరిపంథివసుంధరారమణగంధశుండాల! గండరబాల! చతుస్సముద్రముద్రి
తాఖండిభూమండలసభాగ్రవిభాసమానవిశంకటపాదపటలశంకుప్రకాండహిండి
తానూనసానుమాణిక్యరశ్మిసంభారవిజృంభితశాతకుంభకుంభినీధరస్తంభశిఖరసా
నట్యమానమాననీయకీర్తినర్తకీకరాంబుజాదభ్రవిభ్రమభ్రామ్యమాణధౌతభా
జనయుగవిరాజమానరజనికరహరిత్తుంగ! లోభిరాజకుమారవేశ్యాభుజంగ!
విలాసవతీవితానవిలోచనచకోరికానికరరాకాసుధాకరశ్రీకరాకారకామనీయక
విశేషనిర్జితనిర్జరసేనాధినాథనవనిధానాధీశనందనపురందరకుమారవిక్రమవసంత
కంతుసౌందర్య! దేవబ్రాహ్మణప్రతిష్టాపనాచార్య! దుర్వారవేగలీలాపరా
భూతజాతమన్యవతురగమణిరోచమానదేవమణిరోచమానతత్తాదృశావర్తకీర్త
నీయఝంపాఛుడాఝళిపిఖురళిభంజళిగతిచతురసింధుగాంధారకాంభోజసంభవ
సమంచితపంచభద్రప్రముఖసైంధవధురంధరసమారోహనైపుణసపత్నీకృతన



కులరేవంత! గజపతిసప్తాంగహరణబిరుదభాస్వంత! శచీకాంతదిశాక్పశోదరీము
ఖదరీదృశ్యమానకాశ్మీరతిలకాయమానవాసరాధీశతరుణకిరణప్రసారవికస దర
విందమకరందబిందు మధురిమధురీణ నిరవద్యహృద్య గద్యపద్య భాసురమహా
భారతభాగవతరామాయణాదిపుణ్యకథానిరంతరావధారణలగద్భగవదమలగు
ణశంకాసమంకురనిదానవిశదాష్టమౌక్తికీవిశిష్టకర్ణశష్కులీయుగళపర్యంతవిశ్రా
స్తవిశాలనయనతామరసమందిరనందదిందిరాచరణలాక్షారసప్రేక్షావహతరంగి
తాపాంగశోణరేఖామయూఖసంచారధౌరేయకృపాకటాక్షరక్షితసంస్కృతాం
ధ్రకవిరాయకురుకుకురుకాశకరూశకోసలకళింగబంగాళచోళగౌళమాళవమగధ
మద్రమళయాళదహళపాండ్యపాంచాలపల్లవనేపాలముఖ్యభూపాలశేఖరాస్థాన
ప్రసిద్ధపాఠకపటలపాపఠ్యమానమానితాత్మీయబిరుదావళిప్రహేళికారగడభోగా
వళీదండకశతకతారావళీచతుర్బద్రికోదాహరణచక్రవాళాదిచాటుప్రబంధబంధు
రలతాంతకంతుకనితాంతకవితాశాంతసౌరభ! కావేరీవల్లభ! యిబ్బరాత్య
బబ్బరబాహ! ధరణీవరాహ! పంచఘంటానాదమేదినీమీసరగండ! మో
హనమురారి! సౌహత్తమల్ల! చాణూరమల్ల! చాళుక్యనారాయణాంక!
నిశ్శంకదుర్గాధినాథ! కళ్యాణపురవరాధీశ్వరకటారిసాళ్వమాకరాజవీరరాఘవ
రాజతనూజతిర్వెంగళనాథరాజకులపాలికాతిలకదేవళాంబాగర్భశుక్తిముక్తాఫల
బొమ్మభూపాల సాధ్వీలలామ రాగమాంబాచిరంతన సుకృతపరిపాక శ్రీస్వరూప
చిన్నకృష్ణాజిమామనోహర! బాసదప్పవరగండాంక భాస్వరవీరానేకపనీకాశ
ప్రచండగండక్షరద్దానధారాసముద్దండవేదండప్రకాండోపరిసమారోపితబిరుదకే
తనశిఖానిర్ఘాతజీమూతసముదయాదభ్రగర్భనిర్గళదనర్గళవిమలకరకానికాయ
మాయావిలసదాత్మీయవిజయప్రయాణవీక్షణక్షణోత్సుకఋభుక్షపురచకోరేక్ష
ణాగణవికీర్యమాణరారాజదాచారలాజాసంభార! కటకపురిచూరకార! శ్రీ
వేంకటాద్రిపతివందన! కావేరిరాజవరనందన! సల్లలితరసవిరాజగీర్ధన్య! వెల్లం
టికసవరాజమూర్ధన్య! విజయీభవ! దిగ్విజయీభవ!

28


వ.

అని యనితరసాధారణానవద్యపదహృద్యనిజబిరుదగద్యపఠనపరిశీలిత పారీషద్యశ్రవణానందు లగువందిజనులకు నభీష్టవస్తువు లొసంగి యంత.

29


చ.

నను హరిణాంకమౌళికరుణాసముపాత్తరసప్రసాదవ
ద్ఘనతరసంస్కృతాంధ్రకవితాధను నాదిమవేదివంశవ

ర్ధను దిరువేంగళార్యకవిరాజసమాశ్రయధన్యచి త్తవ
ర్తను దయఁ బిల్వఁబంపి సముదంచితచాతురిఁ బల్కె నీగతిన్.

30


సీ.

చక్రవాళాంకప్రశస్తివిస్ఫురణంబు సాళ్వతిమ్మనృపాలుసమ్ముఖమునఁ
గొలఁకులాయపుఁ దేజిబలురౌ తనినకీర్తి వీర వేంకటరాయశౌరిసభను
జంఘాలవాతూలచతురలాంఛనరూఢి వెలుగోటి వేంకటవిభునిచెంతఁ
బాకశాసనచిహ్నభాసురప్రభ చెంజివరదేంద్రునాస్థానవసుధయందు


గీ.

మంతు కెక్కంగ నేమతిమంతుఁ డమరు, నతఁడు సామాన్యుఁడే సమస్తావనీమ
నీషిగణనీయమధురవాణీవిలాస, హసితభారవి తిరువేంగళార్యసుకవి.

31


ఉ.

అత్తిరువేంగళార్యునియుదారదయావిలసత్కటాక్షసం
పత్తి నుదీర్ణమైనసుకుమారవచఃప్రతిభానిరూఢి ను
ద్యత్తరగద్యపద్యచయ మాశుగతి న్రచియింప నేర్చి నీ
విత్తఱి మంతు కెక్కితి మహీశులచెంగట వేంకటాచలా!

32


సీ.

సందర్భములు లేవె జనసన్నుతానన్యపదసహిష్ణుతకుఁ జొప్పడవు గాక
కావ్యరీతులు లేవె కమనీయజాలివార్తావిశేషస్ఫూర్తి దగవు గాక
యుత్తరోక్తులు లేవె యుచితాదిమప్రౌఢకవిసుప్రయోగముల్ గావు గాక
సౌజన్యములు లేవె సకలార్థనికరోపకారసామర్థ్యంబు గనవు గాక


గీ.

సమధికాచారభూసురోత్తములు లేరె, జగతి నీరీతి గౌరీశచరణభజన
ధీరనిష్టాగరిష్టులు గారు గాక, సకలగుణసాంద్ర వేంకటాచలకవీంద్ర!

33


చ.

తరణిసమప్రతాపనిధి దామరయక్కనృపాలుసన్నిధిన్
వరకవిగంధసింధురము వచ్చె నటంచు వచించువాని క్రొ
వ్వగఁ గవిరాజకేసరి నటంచుఁ బఠించితి వాశువైఖరిన్
సరసులు మెచ్చ వాఙ్ముఖవిశంకట వేంకటశైలసత్కవీ!

34


ఉ.

అంబుజసంభవోపమసమగ్రమనీష! నిరస్తదోషమై
యిం బడరంగ నీవు రచియింపఁ దొడంగినభవ్యకావ్యర
త్నంబు మదంకితంబుగ నొనర్పు మనల్పయశోవిభానుభా
వం బిల నానిశాకరదివాకరతారకమై విరాజిలన్.

35


వ.

అని సబహుమానంబుగా నుదారఘనసారతాంబూలజాంబూనదాంబరాభరణాదు లొసంగినం గైకొని యత్యంతసంతోషతరంగితాంతరంగుండనై కృతిముఖంబున కలంకారంబుగాఁ గృతిపతివంశావతారం బభివర్ణించెద.

36

కృతిపతివంశవర్ణనము

సీ.

సౌగంధికవ్యూహసమ్మోహనాస్త్రంబు నాళీకనికరవైతాళికుండు
కృతకేతరాలాపలతికాలవాలంబు కోకవియోగాబ్ధికుంభసూతి
ప్రథమాద్రిపార్వతీపతిజటాజూటంబు గగనరంగముకుందకౌస్తుభంబు
కౌశికాశావధూకాశ్మీరతిలకంబు బ్రహ్మాండమండపరత్నదీప


గీ.

మఖిలహరిదంతరూఢగాఢాంధకార, గంధసింధురవర్గనిర్గంధనైక
ధీరకంఠీరవేంద్రంబు తేజరిల్లుఁ, బ్రణుతలక్ష్మీకరుండు విభాకరుండు.

37


సీ.

నిజతపోనందితాంబుజగర్భలబ్ధరంగవిమానరాజుఁ డిక్ష్వాకునృపతి
శాక్కరాకారవాసవసమారోహాప్తశంభులీలుఁడు కకుత్స్థప్రభుండు
సత్యభాషాప్రతిష్ఠానభాజితగాధిజన్మసంయమి హరిశ్చంద్రవిభుఁడు
గాఢయత్నానీతగంగాతరంగిణీకీర్తిధ్వజుండు భగీరథుండు


గీ.

విశ్వజిద్యాజి రఘుమేదినీశ్వరుండు, నాదియగురాజు లుదయించి రాదినేంద్రు
సంతతికి భూషణంబులై యంత నందు, శౌరి జనియించె శ్రీరామచంద్రుఁ డనఁగ.

38


సీ.

దశరథేశ్వరచిరంతనపుణ్య మెవ్వానిశాంబరీమానుషసంభవంబు
జమదగ్నినందనస్వర్గమార్గనిరోధి తలఁప నెవ్వానికోదండపటిమ
దండకావనతపోధనభాగ్య మెవ్వానిపితృవాక్యపాలనవ్రతచరిత్ర
లంకాపురాంగనాలంకారభరపశ్యతోహరం బెవ్వానిసాహసంబు


గీ.

దశముఖావరజాచంద్రతారభూరి, విభవసంధాత యెవ్వానిశుభకటాక్ష
మతడు సీతామనోహరుం డనుజసహితుఁ, డమరనుతలీలఁ జిరకాల మవని నేలె.

39


సీ.

చూపరియడుగుమేల్తాపసి కేదేవదేవునిపదరజస్స్థేమ మామ
చిన్నిజాబిలితాల్పుసింగిణిరసదాడి కేస్వామిశుభకరం బిభకరంబు
మున్నీటిపెన్నీటి చెన్నుబన్నమున కేబలశాలిశరకీలి పనటిచూలి
తెఱగంటిపగతుమన్నెఱికంపుటంచగుంపునకు నేవిభుశరాసనము ఘనము


గీ.

తాదృశానూనకరుణానిధానమాన, సాభిరాముఁడు భక్తియుక్తాంతరంగ
బుధజనవిలోచనచకోరపూర్ణసోముఁ, డఖిలగుణధాముఁ డగురాముఁ డతిశయిల్లె.

40


సీ.

కొలిచిన వారికిఁ గెలనితంగెటిజున్ను నలసినవారికి నిలువనీడ
పేర్కొన్నవారికిఁ బెరటికల్చకశాఖి గణుతించువారికి గాఁడిసురభి
సేవించువారికిఁ జేరువమేరువు భావించువారికిఁ బట్టుగొమ్మ
చింతించువారికి జేతిచింతామణి మ్రొక్కినవారికి ముంగిటినిధి

గీ.

రాజమాత్రుండె హైమధరాధరాధి, రాజకన్యాంతరంగసారంగవికస
దమలకమలాభిరామనామాక్షరుండు, రామచంద్రుండు త్రైలోక్యరక్షకుండు.

41


క.

శరణాగతులకు నెల్లను, వరదుం డగురామభద్రువంశమునందుం
గరికాళచోళభూపతి, కరుణానిధి సంభవించెఁ గలియుగవేళన్.

42


మ.

హరిదశ్వప్రతిమప్రతాపవిమతాహంకారహుంకారి యౌ
కరికాళక్షితిపాలవంశమున విఖ్యాతప్రభావుండు సిం
గరిరాజేంద్రుఁడు సంభవించె దశదిక్కాంతాధరాభృత్పయో
ధరముక్తామణిహారధోరణిసముద్యత్కీర్తినిస్తంద్రుఁ డై.

43


మ.

చరణాంభోరుహబంభరాయితరిపుక్ష్మాపాలుఁ డౌధారణీ
శ్వరచూడామణి సింగరిప్రభునకున్ జన్మించె శ్రీరంగరా
జరవిందాప్తకుమారసౌరమణితారాధీశకల్పద్రుఖే
చరకాశాంబుజకామధేనుశిబిరాజ(భ్రాజదౌదార్యుఁ డై.

44


క.

గీరంగనాముఖాబ్జుఁడు, శ్రీరంగనృపాలసుతుఁడు సింగరిగా జా
జీరంగరంగదరినృప, సారంగమృగేంద్రుఁ డనఁగ జగతి న్వెలసెన్.

45


క.

సనయులు సింగరిభూభృ, త్తనయులు కావేరిరాజదాసరిరాజుల్
వినయులు వొగడొందిరి భువి, ననయులు సతతంబుఁ దలఁక నడరిరి క్షితిఫుల్.

46


శా.

శ్రీవెల్లంటికులాబ్ధికౌస్తుభమణిక్షేమంకరాకారుఁ డౌ
కావేరీంద్రున కుద్భవిల్లిరి సుతు ల్కాత్యాయనీవల్లభ
గ్రీవాక్ష్వేళకళంకపంకహరసత్కీరుల్ భుజోదారతే
జోవిస్ఫారులు సింగరీశకసవక్షోణీపతుల్ విశ్రుతుల్.

47


క.

ఆలలితయశోవైభవ, శాలులలో నగ్రజుండు చంద్రముఖీపాం
చాలుఁడు సింగరిధరణీ, పాలుఁడు పొగడొందె రిపువిఫాలుం డనఁగన్.

48


శా.

ఆరూఢన్మయవారణాధిపతీసప్తాంగాపహారక్రియా
ధీరాగ్రేసరుఁ డైనసింగరిధరిత్రీనేత కుజ్జృంభిత
క్షీరాంభోధికి యామినీకరునిమాడ్కిం గల్గెఁ బుత్త్రుండు కా
వేరిక్ష్మారమణీకళత్రుఁడు జగద్విఖ్యాతచారిత్రుఁ డై.

49


సీ.

కలలోన నైన నవ్వుల కైన ననృతంబు వచియింప వెఱచు నెవ్వానిజహ్వ
యెంతసందడి నైన నిల నన్యకాంతల వీక్షింప నళుకు నేవిభునిచూపు

శర ణన్న నపరాధశత మరాతికి నైన మన్నించు నేమహామహునిమనసు
కోటి యిచ్చెద నన్నఁ గొండీనిమాట యాకర్ణింప దేధన్యుకర్ణయుగళి


గీ.

యతఁడు పొగడొందు నీతిమార్గానుసారి, విబుధభరణాధికారి సేవితమురారి
కటకపురిచూరకారవిఖ్యాతబిరుద, రమ్యగుణహారి కావేరిరాజశౌరి.

50


క.

అంకెపలివంశజలధిమృ, గాంకకళం గోనమాంబ నంబుజపాణిన్
సంకీర్తితవిక్రమగరు, డాంకుఁడు కావేరినృపతి యర్థి వరించెన్.

51


శా.

కాకుత్స్థోసమసత్యవాక్యనిధి యాకావేరిరాజంచిత
శ్రీకోనాంబికయందు నందనులఁ గాంచెన్ బాహుశౌర్యప్రథా
పాకారాతికుమారునిం గసవభూపాలాగ్రణిన్ సింగరీ
లాకాంతుం దిరువేంగళేంద్రుఁ బెరుమాళ్రాజన్యమూర్ధన్యునిన్.

52


క.

అం దగ్రజుండు కవిబుధ, మందారుఁడు కసవరాజు మంతున కెక్కెం
గందళితామందసితా, బృందహితాలాపమాధురీధుర్యుం డై.

53


సీ.

చండాభియాతివేదండతండమదంబు ఖండించుమృగరాజు కసవరాజు
కమనీయసౌందర్యగాంభీర్యచాతుర్యకలియుగనలరాజు కసవరాజు
నిఖిలరాజన్యవర్ణితమైన యభిమానగరిమచే రారాజు కసవరాజు
కర్ణాటకవిరాజగణనీయవితరణఖ్యాతిచే శిబిరాజు కసవరాజు


గీ.

ధైర్యమున కద్రిరాజు విద్యలకు భోజ, రాజు వెల్లంటికావేరిరాజగర్భ
కలశజలరాశి నుదయించి కందులేని, కళల నింపొదురేరాజు కసవరాజు.

54


ఉ.

నీతివనీకుఠారులు వినీతివిదూరులు శాల్మలీక్షమా
జాతనిభు ల్విశాలగుడశైలసమాఖ్యు లజాగళస్తన
ఖ్యాతివహు ల్మహీపహతకాగ్రణు లెందఱు లేరు! తద్గుణ
వ్రాతము లెంతురా! కసవరాజధరాధిపు సమ్ముఖమ్మునన్.

55


ఉ.

వైరివిఫాలుఁ డైనకసవక్షితిపాలుఁడు వార్థిమేఖలా
భారధురంధరత్వమునఁ బ్రౌఢవచోరచన న్సురూపతా
స్ఫారత నెన్న సాటి యగు బంగరుగట్టుకమానుపాదుషా
నారికిఁ బదసంభవునినారికి ఫాలవిలోచనారికిన్.

56


క.

శ్రీమంతుఁడు చరణానత, సామంతుఁడు కసవరాజు సాటి యగుం దే
జోమహిమను భోగంబున, గాములదొరకు న్విమానగాములదొరకున్.

57

క.

ఆరాజుకూర్మితమ్ముఁడు, రేరాజు కళావిలాసరేఖం గలిమిన్
రారాజు సింగరీంద్రుఁడు, గీరాజు వచోనిరూఢిఁ గీర్తింపంగన్.

58


ఉ.

ఖ్యాతమృగవ్యకౌతుకవిహారుఁడు సింగరిరాజు సంభ్రమా
న్వీతబలోద్దతి న్వనుల నీలవరాహముల న్వధింపఁగా
భీతమనస్కు డై కలిమిబిత్తరినెయ్యుఁ డహో! మహోన్నత
శ్వేతవరాహరూపమును జేకొనియెం గడు నద్భుతంబుగన్.

59


క.

ఘనుఁ డాసింగరి భూపతి, కనుజుఁడు తిరువేంగళేంద్రుఁ డసమానయశో
ధనుఁడు ధనంజయసదృశుఁడు, తనరారు నరాతిరాజదర్పావహుఁ డై.

60


మ.

సభలన్ వాసవదారకైశికచకాశన్నూత్నమందారసౌ
రభసంభారవిజృంభమాణకవితారంభాతగంభీరతా
విభవప్రౌఢిమ నెంతు రెంతయుఁ గవుల్ వెల్లంటికావేరిభూ
విభుతిర్వేంగళనాథరాజనృపతిన్ విశ్రాణనశ్రీనిధిన్.

61


చ.

భటకవిగాయకార్థిజనబాంధవకైరవపర్వశర్వరీ
విటుఁ డననుల్లసిల్లు తిరువేంగళనాథునిసోదరుండు వేం
కటపెరుమాళ్లరాజు నలకంతువసంతజయంతజిద్విశం
కటతనుకాంతినందితజగజ్జనలోచనుఁ డై విరాజిలున్.

62


చ.

సురవరదంతిదంతములచొప్పున ధాతముఖంబులుం బలెన్
సరసిరుహాక్షుబాహువులచాడ్పున వార్ధులమాడ్కి లోకపా
లురకరణిన్ రణాంగణవిలూనరిపుల్గసవక్షమాపురం
దరముఖు లైనభూవరులు నల్వురు మంతున కెక్కి రెంతయున్.

63


క.

ఆనలుగురురాజులలో, భానునిభుఁడు కసవరాజు భాసిలె నెంతే
నానారిపుసేనాతటి, నీనాయకమంథమేదినీధరభుజుఁ డై.

64


క.

ధృతిఁ గసవశౌరి విభవో, న్నతసాళువబొమ్మరాజనందినిఁ గమలా
సతి కేన యనఁదగుసద్గుణ, పతిఁ జినకృష్ణాజిమ న్వివాహం బయ్యెన్.

65


సీ.

తనదుపుట్టినయిల్లు తగఁ బాలువొంగినచందాన వెలయించునిందువదన
తనదుమెట్టినయిల్లు తామరతంప మై పొగడొందఁ జేయునంభోజపాణి
మహనీయతరసర్వమంగళాభిఖ్య యై ధాత్రి సొం పెసఁగుసద్గోత్రజాత
సంగీతసాహిత్యసకలవిద్యాప్రౌఢిమహిమంబు దెలిసినమంజువాణి

గీ.

కరము రాణించు సౌజన్య గరిమధన్య, పరమకల్యాణి కసవభూపాలురాణి
ఆశ్రితత్రాణ విలసత్కృపావలంబ, సద్గుణకదంబ చిన్నకృష్ణాజిమాంబ.

66


క.

ఆచినకృష్ణాజిమ ల, క్ష్మీచంద్రాననవిధాన సేవింపఁ గృపా
రోచిష్ణుఁడు కసవప్రభుఁ, డాచక్రాయుధునికరణి నమరున్ ధరణిన్.

67


షష్ఠ్యంతములు

క.

ఈదృక్కళ్యాణగుణా, మోదితలోకునకు భువనమోహనకుశల
స్వాదూక్తివిపాకునకు మ, హీదేవాశ్రాంతభజనహేపాకునకున్.

68


క.

గండరబాలాంకున కు, ద్దండభుజబలనవీనతాలాంకునకున్
ఖండితరిపుజాలునకుం, బండితకవిరాజరాజిపరిపాలునకున్.

69


క.

రాజగ్రామణికిం బద, రాజీవప్రణతవిముఖరాజన్యగజో
ద్వేజనసృణికిం గోనాం, బాజఠరసవీనశుక్తిమౌక్తికమణికిన్.

70


క.

ఆరామసత్రసౌరా, గారసరఃప్రముఖధర్మకర్మవినిర్మా
ణారూఢకీ ర్తినిధికిన్, ధీరస్తుతమధురసాహితీసేవధికిన్.

71


క.

శ్రీలప్రాభవనిధికిం, దోళప్పాచార్యచరణతోయజసేవా
శీలప్రాదుర్భూతవి, శాలప్రారంభధైర్యసారాంబుధికిన్.

72


క.

కాశ్యపగోత్రోద్భవున క, వశ్యాయమయూఖలేఖవసుధాజసుధా
పశ్యాళికమౌళిధునీ, దేశ్యయశోహారవైశదీవిభవునకున్.

73


క.

మంథానాచలధృతికిన్, సంధాభృగుపతికి శౌరచరణాంబుజపు
ష్పంధయశుభచిత్తునకు, బాంధవరక్షామిళత్కృపాయత్తునకున్.

74


క.

ఆకాశీతలసేతు, ప్రాకటశరణాగతాభిరక్షణబిరుద
శ్రీకావేరినృపాంబుధి, రాకాచంద్రునకుఁ గసవరాజేంద్రునకున్.

75


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన చంపూరామాయణం బను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన.

76


కథాప్రారంభము

క.

అమరమునిపల్కు విని సం, భ్రమమున వాల్మీకిసుకవి మాధ్యందినకృ
త్య మొనర్ప నరిగె సురుచిర, తమసారసకుముదవనికిఁ దమసాధునికిన్.

77


చ.

అరిగి తదీయపావనతటావని నొక్కెడఁ దుంటవింటిబల్
దొరవిరితూపువాఁడిమికిఁ దోడు కిరాతశరాహతివ్యథం
బొరలి తపించుక్రౌంచయుగముం గని లోఁ గృపవూని మౌనిశే
ఖరునిముఖాంబుజంబున నొకానొకభారతి దోఁచె నీగతిన్.

78

శ్లో.

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమా:
య త్క్రౌంచమిథునా దేక మవధీః కామమోహితం.

79


చ.

అని శపియించి మౌనివిభుఁ డక్కట! యొక్కెడఁ బోక తీర్థసే
వన కిపు డేటికి న్నదికి వచ్చితి వచ్చిన నేమి కొంచల
న్వనచరుఁ డేయ నేమిటికి వాఁ డటు లేసిన నేయుఁగాక నేఁ
గన లెదఁ బూని వానిఁ గొఱగానిగతిం బడఁదిట్టనేటికిన్.

80


మ.

అని చింతించుచు వామలూరుతనయుం డాత్మీయపుణ్యాశ్రమం
బునకుం న్వచ్చినయంతలోనఁ బలుకుంబూఁబోఁడి వేఱొక్కది
క్కునఁ డెక్కు ల్పచరించునైఖరులు గన్గోలేనిచందంబునం
జనుదెంచెం జతురాస్యుఁ డంచతళుకున్సామ్రాణిదూఁకించుచున్.

81


క.

చనుదెంచి విరించి తపో, ధనువలనిసపర్యఁ గాంచి త్రైలోక్యవ్యా
జనిజేంద్రజాలభుజగా, దనబర్హీభూతకృతి యతం డి ట్లనియెన్.

82


మ.

నుడువుంజిల్కలకొల్కి సత్యజగతి న్నూల్కొన్నచందంబునం
బుడమి న్నల్గడ నాత్మవృత్తగతులన్ భూషింప నూహించి ని
ల్కడగావించె భవద్రసజ్ఞపయి నింకం దీనిచేఁ బ్రొద్దువం
గడపున్రాదొరవేలుపున్నడపడిం గబ్బంబు గావింపుమా.

83


చ.

అని యవనిశ్రవోభవుని కానతియిచ్చి యలంఘ్యవర్ణలే
ఖనకరుఁ డేగునంతఁ జెలికత్తియ లై రఘురాముకీర్తివ
ర్తన లనవద్యపద్యతనుధారిణిఁ దన్మృదుశయ్య కొయ్యనొ
య్యనఁ గదియించినం బలుకుటంగన ముంగల యై చెలంగఁగన్.

84


సీ.

అలరుఁబొట్లము విచ్చినట్లు కస్తురివీణె గోసినరీతిఁ గుంకుమము రాశి
బోసినఠేవఁ గప్పురము సిరంబు గుప్పినలీల మేళవించినవిపంచిఁ
బలికించినతెఱంగున లతాంగిబిగిచన్గవఁ గవుంగిలించినపగిదిఁ జంద
నాచలగంధవాహం బెదుర్కొన్నచందంబున నమృతపానంబుమాడ్కి


గీ.

బుధకవుల కింపు జనియింప మధుమయోక్తి, రత్నఖనిదర్శి బ్రహ్మర్షి రచనసలిపె
శ్రవణలేఖనపఠనకృజ్జనఘనాఘ, హరణపారాయణంబు రామాయణంబు.

85


క.

భవ్యపదశ్రావ్యముఁ ద,త్కావ్యముఁ గుశలవుల కతఁడు గఱపిన భువన
స్తవ్యులు వా రవి వనవా, స్తవ్యులకడఁ బాడి మెచ్చు సలిపిరి మదికిన్.

86

చ.

మునివటువేషధారు లతిమోహనశీలురు వా రయోధ్యకుం
జని యొకనాఁడు నాగరకసన్నిధి రామచరిత్ర మింపుసొం
పున నెనయించుగాణలఁ దముం గనుఁగోఁ గొలువుండి పిల్వఁ బం
పిన రఘువీరుఁ జేరి వినిపింపఁ దొడంగిరి గీతిఁ దత్కృతిన్.

87


సీ.

మాటలజవరాలిమగనికి నామభేదంబు లేకటకంబుధరణిసురులు
బలుజాళువాగట్టువిలుకానికిఁ బటాంతరంబు లేనగరంబురాజమణులు
నిధు లింటనుండుమన్నీనికి నపరావతారంబు లేవీటియూరుజనులు
హలముఖాత్తశ్రీల హర్యగ్రజునకుఁ బర్యాయంబు లేపురియంఘ్రిభవుల


గీ.

వెలయు నది సారవాజగంధిలసమీర, వికసితారామవాటికావిహరమాణ
కీరకలకంఠకలకలోద్గీతబిరుద రతీవధూజాని సాకేతరాజధాని.

88


ఉ.

ఆపుర మేలు మానవకులార్ణవపూర్ణశశాంకుఁ డుగ్రబా
ణాపహృతాశరోత్కరగళాంతరలోహితజాలతైలసం
దీపితదోఃప్రతాపమయదీపశిఖాపతయాళుశత్రుగో
త్రాపతిజాతకై తవపతంగుఁడు పఙ్క్తిశతాంగుఁ డున్నతిన్.

89


సీ.

తనశౌర్యశిఖ కుల్కి వినునీథి కెగబ్రాఁకుభానునంద పతంగతానుభూతి
తనసైన్యధాటిచే వనుల కేగువిరోధిసతులపల్కులయంద శౌకరీతి
తన కేలుబడి యైనధరలో నిరవుకొన్న వారలాయువునంద వర్షభూమ
తనరాజధానిలోఁ దనరు భూమినిలింపవరులయంద నవార్షవైభవంబు


గీ.

తనధృతిఁ జలించుకులధరాధరములంద, గైరికభరంబు తనసోయగంబుఁ జూచు
మదవతులయండ కంటకాభ్యుదయ మొదవ, ధారణి నిరీతిగా నేలె దశరథుండు.

90


శా.

సప్తద్వీపయుతావనిన్ బహుసమాసాహస్ర మి ట్లేలియున్
నప్తల్ పౌత్రులు పుత్రులుం గలుగుపుణ్యం బేమియున్ లేమికిం
బ్రాప్తస్వాంతదురంతచింతఁ బరితాపం బొందువాఁ డొక్కనాఁ
డాప్తామాత్యులతోడ మంతనమునం దాభూవరుం డి ట్లనున్.

91


సీ.

కలిమితొయ్యలి మెలంగనిమురారియురంబు చిన్నివెన్నెల లేనిశివునిశిరము
కలకంఠనికరంబు నెలకోని లేమావి యంచలపదువు డాయనికొలంకు
పారిజాతము వసింపనినిలింపవనంబు వినుమిన్న గానుపింపనిదినంబు
ప్రామిన్కుఁదెగ భజింపనీ విప్రునెమ్మోము తళుకుముత్తియము వర్తిలనిశుక్తి

గీ.

సంతతికి ద వ్వగుజనుండు సరియ కాన, నెంతధనమున్నఁ గులకాంత లెందఱున్నఁ
గాంతి పచరింప నోఁచరుగా మదీయ, సదన మనపత్య మగుట నోసచివులార.

92


మ.

భవనాలంకరణంబు సంసృతిసుధాపాథోనిధానక్షపా
ధవబింబోదయ మాశయారచితచింతాభారఘోరాంధకా
రవిభాతాగమనంబు ప్రాక్తనజనిప్రాప్తైకపుణ్యాతిరే
కవిపాకంబు తనూభవుండె కద లోకశ్రేణి కూహింపఁగన్.

98


చ.

అలికము రావి క మృదులాంఘ్రులగజ్జెలు గంధరంబునం
దలిపులిగోరు సందెజిగితాయెతు వీనులచిన్నిమద్దికా
యలు నిమువాలుఁగల్గొనలయంజనరేఖలు ముద్దుగుల్క ముం
గలఁ జరియించుబాలకునిఁ గల్గొనుభాగ్యము లెన్నఁ డబ్బునో!

94


గీ.

కనకమయకింకిణు లొకింత గల్లురనఁగ, దాదికరపల్లవము లూఁది తప్పుటడుగు
లల్లనల్లన మణిమందిరాంగణంబు, లం దిడుకుమారుఁ డెపుడొ కన్విందుసేయు.

95


చ.

అనిమిషలోకనాయకుని కైనఁ జరాచరసృష్టికర్త కై
నను భువనత్రయీభరణనైపుణి కోపినమేటి కైన నె
త్తిని బెనువాఁడికన్ను గలదేవున కైనను శక్య మౌనె నం
దనుఁ డనుకల్మి నెంతటిధనంబులు గల్గియు సంతరింపఁగన్.

96


సీ.

చిన్నినెన్నుదుటిపైఁ జిందులు ద్రొక్కు నీలము లైనయలకజాలములతోడ
ననిమిత్తహసితమోహనచంద్రచంద్రికల్ నిగిడించుముద్దునెమ్మొగముతోడ
నక్షురోచ్చారణం బవ్యక్త మై యుండఁ బులకండ మొలిగెడుపలుకుతోడఁ
గుందనంపుమెఱుంగుటందెమ్రోఁత చెలంగు బుడిబుడిమురిపంపునడుపుతోడఁ


గీ.

దనదు మ్రోల మెలంగెడుతనయు నెత్తు, కొని తొడలమీఁద నిడుకొని కురులు దువ్వి
శిరసు మూర్కొనుసుకృతి చేసినతపంబు, సలుపలే నైతినేమొ ధీసచివులార!

97


గీ.

అనుచు ననపత్యతాదురత్యయనిదాఘ, తాపమునఁగుందుతనదుడెందమునెమ్మి
కభినవాంభోదగర్జయో యనఁగఁ జెవుల, పండువొనరించుగంభీరఫణితి మీఱ.

98


సీ.

నదినీటితో విభండకుతేజ మాని జింకమిటారిఁ గన్న శేఖరితశృంగుఁ
డున్నచో వర్షింప నుర్వీధరాళిచే వరము గైకొన్న పావనచరిత్రుఁ
డిగురాకుఁబోడుల నేనుఁగుఁదలఱొమ్ముమునులంచు నెంచినముగ్ధహృదయుఁ
డంగవగ్రహనిగ్రహం బోలిగా శాంతయనుకాంతఁ బెండ్లియాడినఘనుండు

గీ.

ఋషి యొకఁ డొనర్చు పుత్రకామేష్టి వలన
నందనులు నీకుఁ గలుగనున్నారటంచు ము
న్నలసనత్కుమారుచే విన్నకథను
మంతుఁ డెఱిఁగింప ముదమంది మహిపుఁడంత.

99


వ.

శాంతాకుటుంబియుం దనకు సంబంధియు నగునంబుజోదరపదాంభోజరోలం
బాంతరంగు ఋష్యశృంగు రావించి యవ్విరించి చంచదాగమప్రపంచపార
గుం డుపద్రష్టగా వసిష్ఠవామదేవాధిష్ఠితం బగువాజిమేధంబు సరయూధుని
రోధంబున నిర్నిరోధంబుగా నిర్వర్తించి పుత్రీయయగు నిష్టిక్రియ కుపక్రమించు
తఱి నశేషభువనశోషణప్రవీణరావణప్రతాపరేఖానిదాఘదారణంబున కాది
కారణంబును నభంగశార్ఙ్గచక్రచాపాభిరామంబును నకూపారవరకుమారికాచి
రవిఫాలితాలలామంబును నఖిలతాపసవ్రాతచేతశ్చాతకోపరివికీర్యమాణనిరవధి
కృపారసజలౌఘంబును నగుకృష్ణమేఘంబు నూతనాతసీగుచ్ఛసచ్చఛాయ నిజ
తనుఃప్రభాపూరంబునఁ గలశపారావారంబు నభినవకువలయాకారంబు గా
వించు ఠావునకుం బోవ నూహించి మణివిపంచిపాణి వాణి వదనంబునం[3]
బొసఁగుసరసునిం బురస్కరించుకొని నడచి యొండొరులం గడచి ముందఱ.

100


శా.

నారీనూతనపంచబాణ! కవితానైపుణ్యపారీణ! కా
వేరీక్ష్మావరగర్భసింధురమణావిర్భూతరాకానిశా
తారాకాంత! దిగంతవైరిముఖపద్మస్తోమహేమంత! చిం
తారత్నప్రతిమానదానగరిమత్రాతాఖలార్థివ్రజా!

101


క.

భారతభాగవతకథా, నారాయణదేవదివ్యనామశ్రవణా
నారతసుకృతైకపరి, ష్కారభ్రాజిష్ణుకర్ణ! కలియుగకర్ణా!

102


స్రగ్విణి.

వీరచూడామణీ! విశ్రుతౌజోహృతా, శారణీ! భూరిభోగామరగ్రామణీ!
సూరవంశాగ్రణీ! సుస్థిరోదారదో, స్సారసామిరణీ! శబ్దవిద్యాఫణీ!

103


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదసమాసాదిత సరసకవితావిలాస
వాసిష్ణవంశకీర్తిప్రతిష్టాసంపాదక ఋగ్వేదికవితిర్వేంగళార్యకలశరత్నాకరసుధా
కర జగద్విఖ్యాతకవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతిప్రణీతం బైనచం
పూరామాయణం బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.


  1. హిరణ్యకశిపునిభార్య కయాధువు. ఆమెకొడుకు ప్రహ్లాదుఁడు.
  2. ఈవేంకటేశ్వరాష్టకంలోని మిగిలిన యైదుపద్యములు బీఠికలో ముద్రిపఁబడును.
  3. వేణి పదాంకంబునం (మాతృక)