చంద్రగుప్త చక్రవర్తి/ఆఱవ ప్రకరణము

ఆఱవ ప్రకరణము

చంద్రగుప్తుని రాజధాని

భరతఖండంబు నంతయు ఏక ఛత్రాధిపత్యము క్రిందికిఁదెచ్చిన మన కథానాయకుఁడు పాటలీపుత్రమను నగరమునందు రాజ్యము చేయుచుండెను. పుష్ప పురము, కుసుమ పురము అను నామాంతరములు గల యీ పట్టణరాజము చంద్రగుప్త చక్రవర్తి ప్రభుత్వ కాలమునందు మహోన్నతావస్థను చెంది, అతని మనుమఁడగు అశోకుని రాజ్య కాలమందు నత్యుచ్చవైభవ శిఖరముఁజేరి. భూలోకమునందు నా కాలమున నున్న యశేష పట్టణములలో నతి శ్రేష్ఠమైసదియు, నద్వితీయమైనదియు నని బొగడ్తఁగని యుండెను. ఇదియుఁగాక, యనేక కవులకును, పండితులకును, శిల్పులకును, అన్యదేశ వర్తకులకును, ఆశ్రయ స్థానమును, వర్లనీయవిషయమును అయి రాఘవుల అయోధ్యకును, కౌరవుల హస్తీనాపురమునకును, మోగలుల దిల్లీకిని, ఆంగ్లేయుల కలకత్తాకును సరిపోల్చఁదగిన యీ పుష్పపురి రమారమి వేయి సంవత్సరముల వఱకును మగధరాజధానియై విలసిల్లెను! ఇట్టి పుర శ్రేష్ఠము యొక్క యుత్పత్తియు, చంద్రగుప్తుని కాలమున నద్దాని వైభవమును, సంక్షిప్తముగఁ దరువాతి చరిత్రయు, నీ ప్రకరణమునందు వర్ణింపఁబడుట యత్యంతావశ్యకము.

నామనిర్దేశము

సాధారణముగా నిటీవలి యింగ్లీషుచరిత్ర గ్రంధములలో 'పాటలిపుత్ర' నామమే యెక్కుడుగా వ్యవహరింపఁబడు చున్నను, సంస్కృతకవులు మాత్రము పాటలీపుర, కుసుమపుర, పుష్పపుర నామములనే వాడి యున్నారు.*[1] త్రికాండ శేషమునందు మాత్రము 'పాటలీపుత్ర' మను పాఠాంతరము కలదు. బృహత్కథయందుఁ గూడ నీ పేరు వచ్చినట్లున్నది. గ్రీకుల భాషలో దీనిని పాలిబోతు (Palibothu ) అని వాడియున్నారు. ఈ పట్టణ స్థానమునందున్న పట్టణమునకు నిపుడు 'పొట్నా' యన్న పేరు కలదు.

ఇప్పుడీ పట్టణమెచ్చట నున్నది?

హిందూదేశ పటమును ఎదుట వేసికొని చూచినయెడల ఈశాన్య దిశయందు ఇప్పుడు ఈ దేశపు ముఖ్య రాజధానియగు కలకత్తాపురి కానవచ్చును. ఇప్పురి గంగానది పాయలో బెద్దదియగు హూగ్లినదీ తీరమున గంగాసాగరమునకు నలువది మైళ్ళ దూరమున అలరారుచున్నది. ఇచ్చటనుండి యోడమార్గమునో లేక పొగబండి మార్గమునో అనుసరించితిమేని రమారమి 333 మైళ్ళ దూరమున పాట్నా యను పట్టణము గంగాతీరమున కలకత్తాకు వాయవ్యమున నుండఁజూతుము. ఇయ్యది దిగువ బంగాళపు (Lower Bengal) పట్టణములలో కలకత్తాకు రెండవదిగా నున్నది. ఇంతటి విస్తీర్ణమును జనసంఖ్యయు నేటికిని గల యీ పాట్నాపురి మహమ్మదీయ పరిపాలనమున బేహారు జిల్లాకు ముఖ్యస్థానముగ నుండె. కాని ఈ నామముచే నొప్పుపురము 650 వత్సరములకు మున్నుండ లేదు. దీనిస్థానమున గొంతకాలము బీడును, అంతకుఁ బూర్వమున, ననఁగా ప్రాచీన కాలమునందు మఱియొక గొప్పపురియు నుండెడివి. ఆ వురియే పాటలీపురము.

రాజకీయ విషయమునందు గంగానదియొక్క విశేషము నరయుఁడు. గంగాశాఖ యగు హూగ్లీతీరమున హిందూదేశపు ప్రస్తుతపు రాజధాని కలకత్తా యున్నది. గంగ కుపనదియగు యమునాతీరమున మహమ్మదీయ రాజధానులగు దిల్లీ, యాగ్రాలు కలవు . దిల్లీకి మూడు మైళ్ళదూరమున పాండవ రాజధాని ఇంద్రప్రస్థ ముండె. ఇంద్ర ప్రస్థమునకు అఱువదిమైళ్లు వాయవ్యమున కౌరవపారిక్షితుల రాజధాని హస్తినాపురముండె. గంగ కుత్తరోప నదియగు సరయు (గాగ్రా) దక్షిణతీరమున అయోధ్యాపురి రఘుకుల రాజుల రాజధానిగనుండె గంగ, గాగ్రా, రాప్తి, గండకి, శోణానదులు కలియు ప్రాంతమున పాటలీపుత్రము చంద్రగుప్త రాజధానిగ నుండె. కావున రాఘవ, కౌరవ, పాండవ, పారిక్షిత, నంద, చంద్రగుప్త, గుప్త, ఆంధ్ర, మహమ్మదీయ, ఆంగ్ల రాజధానులు, గంగనో, గంగా శాఖోపశాఖలనో ఆశ్రయించి యున్నవి. ఇందు పాటలీపుత్రము నిర్మింపఁబడిన స్థలము కంఠసరములను గూర్చిన పతకమువలె అనేక నదుల సంగమమునకు సమీపమున నుండుటఁబట్టి అలంకారముగను, బలప్రదముగను, వ్యాపారానుకూలతంబట్టి ధనప్రదముగను నుండెను. కనుకనే ఇది వేయునెక్కు వేండ్ల కాలము హిందూస్థానవు బలిష్ఠ రాజధానిగా విరాజిల్లుచుండెను.

నామోత్పత్తి

పాటలీపుత్రమన్న పేరుగల్లుట కనేకు లనేక హేతువులు చెప్పుచున్నారు. పాటలీయన నొక పుష్పవిశేషము. దీనిని దెలుఁగులో కలిగొట్టు పువ్వందురు. ఈ పువ్వును బోలి ఆ పురియొక్క యాకారముండెననియు, అందుచే నా పేరు వచ్చెననియు కొందఱి యభిప్రాయము. ఆ పట్టణమందును, సమంత ప్రాంత మందును పాటలీ వృక్షములును, పుష్పములును మెండుగ నున్నందున ఈ నామము కల్గెనని కొందఱందురు. శ్రీరామ లక్ష్మణులు సరయూగంగా సంగమమునకు పైని సరయును దాఁటి దక్షిణతీరము చేరఁగనే వారికి పాటలాది వృక్ష సంకీర్ణమైన వనము కానవచ్చినట్లు శ్రీమద్రామాయణము నందు వర్ణింపఁబడినది.*[2] కావున మిక్కిలి ప్రాచీన కాలము నుండి మగధదేశముయొక్క యీభాగము పాటలిపుష్పమునకై ప్రసిద్ధి వహించినట్లు కానవచ్చెడిని. ఇప్పుడు పాట్నా నగరమునందు చిన్న పట్న దేవి, పెద్ద పట్న దేవి యను దేవాలయములు రెండు గలవు. వానిలో నర్చకులుగా నుండువా రిట్లు చెప్పెదరు. సుదర్శనుఁడను రాజునకు పాటలి యను కూఁతురు గలదు. ఆమెచే నీ పట్టణము కట్టింపఁ బడియెను. ఈమె కాతఁడు బహుమతిగ నీ పట్న మొసంగగ, దీనిని పుత్రవాత్సల్యముతో తల్లింబోలె సంరక్షించి నందున పాటలిపుత్రమని పేరుగల్గెనఁట.

పుత్రకుఁడు అను రాజకుమారుఁడు మంత్రదండ మహిమచే నిర్మించెననియు నతని భార్యపేరు పాటలి. కావున దీనికి పాటలిపుత్రమని పేరుఁ బెట్టెననియు కథా సరిత్సాగరము నందును హ్యూన్ ట్సాంగుని యాత్రా చరిత్రమునందు వ్రాయఁబడియున్నది. డియోడొరసు అను గ్రీకు చరిత్రకారుఁడు హెరక్ల్‌స్ (Herakles) అనఁగా బలరామునిచే నిది ప్రతిష్ఠింప బడియెనని తాను వినినట్లుగా దెల్పియున్నాఁడు. వాయు పురాణమును సూత్తపిటకమును శిశునాగవంశస్థుడు ఉదేయుడు దీనిని కట్టించినట్లు తెల్పుచున్నవి.

మేజరు విల్ఫోర్డు పాటలీపుత్రమును పద్మావతియనియు మహాబలిపురమనియు పేళ్ళు గలవనియు, ఈ పేళ్ళు గల్గుటకు కారణము, మహాబలియనియు మహాపద్ముఁడనియు దానిని బ్రతిష్టించిన రాజు పేళ్ళగుట యనియు వివరించుచున్నాడు. అట్టి నందుని పట్టణము కావున బలిపుత్ర యనియు పాలిబోత్ర యనియుఁ బేళ్ళనొంది. గ్రీకుల చెవుల కందెననియు నుడువు చున్నాఁడు. ఇంకొకవ్యుత్పత్తి కలదు. కోసి గంగాసంగమమున రాజమహాలునకు సమీపమున పాలిబోత్రయుండెనఁట ఇప్పటికిని మత్స్యదేశమున పాలి జూతివారు మెండుగ నివసించెదరు. కావున పాలిబోత్రయని పేరువచ్చెననియుఁ జెప్పఁబడుచున్నది. సూర్యవంశపు రాజగు మముండను వానికి 18 వ తరమువాఁడు సుదశన్‌న రాజనియు, ఆతని కూఁతురు పాటలియనియు, నీమె మూలమున పాటలిపుత్ర నామంబనియు నింకొక వాఖ్యానంబు గాన వచ్చుచున్నది.

మఱియొక చిత్రకథ

దక్షిణదేశమునందు నొక బాహ్మణుఁడు కలడు వానికి ముగ్గురు కొమాళ్లుండిరి. ఆ బ్రాహ్మణుఁడు. చిన్నవారై న తన పుత్రులను ఇంటియొద్దనే యుంచి హిమాలయ మందలి గంగాద్వారమునకు యాత్ర వెడలి యచ్చటనే కాలధర్మము నొందెను. ఎంతకాలమునకును తండ్రి తిరిగిరానందున అతని ముగ్గురుపుత్రులును విద్యాభ్యాసము నిమిత్తమై బయలుదేరి కుమారస్వామి క్షేత్రము నొద్దనున్న చించణీ యను గ్రామ మందు నివసించియున్న భోజకుఁడను విద్వాంసుఁడైన బ్రాహ్మణుని ఆశ్రయించిరి. అ బ్రాహ్మణుఁడు వీరి ముగ్గురికిని తగిన విద్యలఁ గజపి తనకు ముగ్గురు కూఁతులుండ వీరిముగ్గురికినిచ్చి వివాహము చేసి వారిని తన యింటనే యుంచుకొనెను.

వారు పెద్దకాల మచ్చటనే యుండి యొకప్పుడు కఱవు సంభవింపఁగాఁ దమ భార్యలను అచ్చటనే యుంచి ధనార్జనకై . తాము దేశాంతరమునకు వెడలిపోయిరి. వారు వెడలు నప్పుడు నడిపివాని భార్య గర్భవతియై యుండెను. కాని యా సమాచారమా బాహ్మణునకుఁ దెలియదు. ఆపెకు నొక కుమారుఁడు కలిగెను. వానికిఁ బుత్రకుఁడని పేరుపెట్టిరి. కాని, బ్రాహ్మణులు తిరిగి రానందునను, కఱ వధికమైనందునను పుత్రకునిఁ దీసికొని యాతని తల్లి మగధదేశమునకుఁ బోవలసినదాయెను. అచ్చట ఈమె దనకుమారునితోఁ గూడ యజ్ఞదత్తుఁడను బ్రాహ్మణు నాశ్రయించి యుండెను.

పుత్రుకుఁడు పెద్దవాఁడై విద్యాబుద్ధులు నేర్చుకొని మిక్కిలి ధనమును ఆర్జించెను. తన తండ్రియు పినతండి పెదతండ్రులును దేశాంతరమువెళ్ళి రాలేదన్న సమాచారము విని వారిని కనుఁగొను నిమిత్తమై యొక యన్న సత్రములు స్థాపించి తాను సత్రాధికారిగనుండి వచ్చిపోవువారి గోత్రనామములఁ దెలిసికొను చుండెను. ఆ మువ్వురు బ్రాహ్మణులును ఒక్కదిన మా సత్రమునకు రాఁ దటస్థించెను. వారా పుత్రకుని సమాచారమంతయుఁ దెలిసికొని వాఁడు వ్యభిచార జాతుఁడుగాఁ దలంచి వానిని జంపుటకుఁ గొందఱు పురుషులను నియమించిరి. పుత్రకుఁడు వారికి లంచమిచ్చి వారి చేతినుండి తప్పించుకొని వింధ్యప్రాంతమునకుఁ బోయెను. ఈతఁ డచ్చట చంచరించు చుండ నిద్దరన్నదమ్ములు రాక్షస కుమారులు తమ పిత్రార్జితమైన మూఁడు వస్తువులను గూర్చి తగవులాడు చుండఁ . జూచెను. వారు తగవులాడుచున్న వస్తువు లేవన 1 భోజన పాత్రము, 2 దండము, 3 పాదరక్షలు. ఈ మూఁటియందును మూఁడు విశేషములు కలవు. భోజన పాత్రము కోరిన భోజన పదార్థములనిచ్చును. దండమువలన కోరిన ద్రవ్యము లభించును. పాదరక్షలను తొడిగినయెడల ఆకాశపథమున స్వేచ్చా విహారమును చేయవచ్చును! ఇట్టి వస్తువులకై పోరాడువారు పుత్రకుని మధ్యవర్తిగ నేర్పఱుచుకొనిరి. రాక్షస పుత్రులు పరుగెత్త వలసినదనియు, ఎవ్వఁడు నిర్ణీతస్థలముచేరునో వానికి ఈ మూడు ద్రవ్యము లీయఁబడు ననియుఁ బుత్రకుఁడు నిర్ణయించెను. వారందుకు నంగీకరించి పరువెత్తసాగిరి. అటువారిని పరువెత్త నిచ్చి యిటు పుత్రకుఁ డా పాదరక్షలను ధరించి మిగిలిన రెండు ద్రవ్యములను తీసికొని యెగిరి యాకాశమార్గమున ఆ కార్షికా పురికిఁ బోయెను. అచ్చటి రాజు మహేంద్రవర్మ. ఆతనికి పాటలియను కూఁతురుకలదు. ఆమె యుక్తవయస్కురాలై వివాహమునకు సిద్ధముగనున్న దని విని పుత్రకుఁ డొకనాఁడు ఆకాశమార్గమున నామె మందిరముఁ జేరెను. ఆమెయు నతని యమానుషశ క్తి, కచ్చెరువంది అతనిని వరించెను. కాని యా సమాచారము రాజునకుఁ దెలిసిన నాతఁడు పుత్రకుని వధించు ననియెంచి వారిరువురును, అచ్చట నుండి ఆకాశ మార్గమున వెడలిపోయి యొక పట్టణమును నిర్మించి, తమ యిద్దఱిపేళ్లును కలిపి దానికి 'పాటలీపుత్ర' మని పేరు పెట్టిరఁట, ఈ కథ బృహత్కథయను గ్రంథమునందున్నది.

ఇట్లీ గ్రామముయొక్క యుత్పత్తిని గుఱించి పెక్కుగాథలు గలవు. ఇఁక వీనిని విడిచి చరిత్రభాగమునకు వత్తము.

పాటలి దుర్గము

క్రీ. పూ. 490 వ ప్రాంతమున అజాత శత్రుఁడను వాఁడు మగధ రాజయ్యెను. ఇంతకుఁ బూర్వము పాటలి యనునది గంగకు దక్షిణతీరమున నుండిన చిన్నపల్లె. ఆ నదికి నుత్తరమున లిక్షవి వంశజులగు రాజుల ప్రబలమైన రాజ్యముండెను. ఆ రాజులు తన రాజ్యమునకు నేమియు నాపద కలుగచేయ కుండగ వారిని అడఁచియుంప వలయునని అజాత శత్రుఁడు పాటలి గ్రామమున నొకదుర్గమును కట్టించెను. రాజభృత్యులు దుర్గమును నిర్మించుచుండు కాలమున గౌతమబుద్ధుఁడు అచటికి వచ్చెను. అతఁడా దుర్గమును చూచి యందునుగుఱించి యిట్లు భవిష్యత్తు చెప్పెనఁట. "మిక్కిలి విఖ్యాతి చెందు స్థలములలోను, నలుదిశలనుండి వర్తకమును ఆకర్షించినందున పేరొందు పట్టణములలోను ఇది ముఖ్యమైనది కాఁగలదు, కాని యీ పట్టణమునకు అగ్ని, జలము, అంతఃకలహము అను మూఁడు విపత్తులు సంభవించును.”

ఉదయనుఁడు అజాత శత్రుని మనుమఁడు. ఇతఁడు కీ. పూ. 450 వ ప్రాంతమున రాజయ్యెను. ఇతఁడు పాటలి దుర్గము నొద్దనే క్రీ. పూ. 434 వ ప్రాంతమున పాటలీపుత్ర పట్టణమును గట్టించెను. ఇదియే భగవాన్ బుద్ధదేవుని భవిష్యత్తు ననుసరించి వేయి సంవత్సరముల వఱకును హిందూదేశము యొక్క కంఠమణివోలె భ్రాజిల్లెను.

ఇంతకుఁ బూర్వము మగధ రాజ్యమునకు రాజగృహము రాజధానిగ నుండెను. ఉదయనుఁడు రాజధానిని పాటలిపుత్రము నకు మార్చెను. ఇట్లు పర్వత ప్రాంతములో నున్న రాజ గృహమునుండి ఏటియొడ్డున నున్న పాటలిపుత్రమునకు రాజధానిని మార్చుటకుఁ గారణము లేకపోలేదు. మగధరాజ్యము దినదినాభివృద్ధి నొందుచుండెను. రాజ్యము యొక్క యన్ని భాగములను స్వాధీనమం దుంచుకొనుటకును, హిందూదేశ మందలి వర్తకము నంతయును ఆకర్షించుటకును గంగా, శోణ, గోగ్రా మొదలయిన నదుల సంగమమునకు సమీపమునందున్న పాటలిపుత్రము మిక్కిలి తగినదియని నిశ్చయింపఁబడెను. ఉదయనుఁడు శిశునాగ వంశపురాజు. క్రీ. పూ. 371 వ ప్రాంతమున ఈ వంశమంతరించి మగధము నందుల స్వాధీనమయ్యెను. వారిని వోడించి మన చరిత్రనాయకుఁడగు చంద్రగుప్తుడు కీ. పూ. 321 వ ప్రాంతమున మగధాధీశ్వరుం డయ్యెనని యిదివఱకే వ్రాసియున్నారము.

చంద్రగుప్తునికాలపు పాటలీపుత్రము

క్రీ. పూ. 303 వ సంవత్సరము నందుఁ జంద్రగుప్తుడు సెల్యూకస్ అను గ్రీకురాజు నోడించి యతనితో సంధి చేసి కొనెనని యిదివఱకే వ్రాసియున్నాము. ఆ గ్రీకురాజు మెగస్తనీస్ అనువానిని పాటలి పుత్రమందు జంద్రగుప్తునియొద్ద రాయబారిగ నుంచెను. ( క్రీ. పూ. 302) ఇతఁడు కొన్ని సంవత్సరములవఱకు ఈ పట్టణమునందుఁ గాపురముండి యా గ్రామమును గుఱించియు, ఈ దేశమును గుఱించియు విశేషము లనేకములు , వ్రాసియుంచినాఁడు. ఆ కాలమునాఁటి చరిత్రాంశములు తెలిసికొనుటకు ఈ రాయబారియొక్క వ్రాతలే ముఖ్యాధారములు. ఆ వ్రాతల ననుసరించియే యీ క్రింది వర్ణనలు వ్రాయఁబడు చున్నవి.

పురవర్ణన

మగధదేశ రాజధానియగు పాటలిపురము గంగాశోణా నదుల సంగమమువలనఁ గలిగిన యంతర్వేదిలో శోణకు నుత్తరమునను, గంగకు దక్షిణమునను ఉండెను. ఇప్పురి రమారమి తొమ్మిది పదిమైళ్ల నిడివియు, రెండుమైళ్ల వెడల్పును గలిగి చతుర్భుజాకారముగ నిర్మింపఁబడియె. అనఁగా నిది యిరువది చదరపు మైళ్లు వైశాల్యముగల నగరము. అత్యంత ఘనమైన కాష్ఠ ప్రాకారముచే నావరింపఁబడి యఱువదినాల్గు ద్వారములును ఏనూటడెబ్బది బురుజులును గలిగి, శోణాది నీళ్ళతో నింపఁబడిన మిగుల వెడల్పును లోతునుగల యగడ్త చే రక్షింపఁ బడియుండెను. పట్టణము చుట్టునున్న యీ కందక మాఱు వందల యడుగుల వెడల్పును, ముప్పది మూరల లోతును ఉండెనఁట. ఈ గ్రామముచుట్టు డెబ్బదియైదు గజములకు నొక బురుజును, ఆరువందల యఱువది గజములకు నొక కోటగుమ్మమును ఉండెను. ఇరువది చదరపు మైళ్ల వైశాల్యమును ఇరువదినాల్గు మైళ్లు చుట్టుకొలతయుఁగల యా నగరరాజము కలకత్తాకు సమముగ నున్నట్లు లెక్కింపనచ్చును,

రాజమందిరము.

శోణానది యొడ్డున నానావిధ వృక్షజాతులచే శోభితంబగు నుద్యానవనము కలదు. అందు రాజమందిరముండెను. . రాజ ప్రాసాదము మ్రాకుతోఁ గట్టఁబడి, పారసీక రాజభవనములగు స్యూసా, ఎక్బటానాలకంటె మిక్కిలి వైభవముతో విలసిల్లుచుండె. దాని స్తంభములు స్వర్ణఖచితములై బంగారు గాలిటెక్కముల తోను, వెండి పిట్టలతోను అలంకరింపఁబడి యుండె. ఈ భవనము అనేక కట్టడములుగ విభజింపఁబడి, అన్నియు . నొక విశాలమును మనోహరమునైన యారామము నందు నిర్మింపఁబడియుండె. ఇందు తళుకుతళుకుమని మెఱయుచున్న మత్స్య పల్వలమును, పెక్కు తెగల శృంగార వృక్షములును పొదరిండ్లును పిక్కటిల్లె. ఇందలి కట్టడములలో కొన్ని రాజ కార్యశాలలు, కొన్ని పరివారనివాసములు, కొన్ని రాజస్త్రీల యంతఃపురములు, ఇంతేకాక సప్తభూమికా ప్రాసాదమును, సహస్రస్తంభ మండపమును, ద్యూతశాలయు, ఉష్ణ స్నానవాటికయు నుండెనఁట. ద్యూతశాలలో గెలుపులయందొక యంశము రాజస్వమ్ముగా జేరెనని ఉపస్తంబ వచనము, స్నానశాలయందు మొదట ప్రవేశాగారమును, పిదప ఉష్ణ గృహమును, అటుపై స్నాన పల్వలమును పొసఁగి, మధ్యమున అగ్నికుండమును చుట్టును ఆసనములు నుండును. సాధారణ స్నానమునకై వాపీ తటాకము లుపయోగింపఁ బడుచుండును. వీనికి ఱాతిపడికట్లును ఆ పడికట్లపై పుష్పాది శిల్పాలంకారములును అమరియుండును

రాజ సభామంటపము అత్యంతాలంకారా డంబరముల నొప్పియుండె. ఆరడుగుల వెడల్పుగల బంగారు పళ్లెములును గిన్నెలును, బలుసొగసు వలువలతోడను, విలువయైన మెత్తల తోను నొప్పి ముద్దులొలుక నలంకరించిన రాజపీఠములును, ఫలకములును, రత్నఖచితములైన రాగిపాత్రములును, అతి సుందరములైన చిత్రవస్త్ర సంచయములును కాన వచ్చు చుండెను. ఇచ్చట రాజు సంపూర్ణ శోభనముతో నైమిత్తిక వైభవ కార్యముల నాచరించును. అట్టి యుత్సవకాలముల నతఁడు ముత్యపు కుచ్చులతో నలంకరించిన బంగారుపాలకి నెక్కి స్వర్ణ మయములైన పట్టు పచ్చడములును, సొగసుబట్టలును ధరించి సవారిపోవుచుండు. చిన్న సవారుల కాలముల, రాజు అశ్వారూఢుడైయును పెద్దసవారులప్పుడు గజారూడుఁడైయును వెడలు సమయముల ఇయ్యవి బంగారు సజ్జలతో నొప్పుచుండును. మఱియు నిట్టిసమయములందు ఎడ్లు, పొట్టేళ్లు ఏనుఁగులు, గండకములు మొదలగు మృగముల పందెములను మల్లుల పోట్లాటలును రాజు మిక్కిలి యుత్సుకముతో విలోకించును. ఇందలి ఎడ్లపందెములు మాత్ర మిప్పుడు జరగు టరుదు. తక్కినవి హిందూ రాజధానులలో నేఁటికిని వాడుకలో నున్నవి. ఇంతేకాక రధములకు నడుమ గుఱ్ఱమును దానికి ఇరువైపుల నెడ్లను పూన్చి పరుగునర దూరపు పందెములు పరిగింతురఁట.

నగరముయొక్క నిర్మాణము విస్పష్టముగఁ దెలియఁ జూలము. కాని ఉన్నతములైన గోడలు, అలంగములు, ముట్టు గోడలు, కాపు గోపురములు, బురుజులు, మహాద్వారములు, అగడ్తలును నిస్సంశయముగనుండె. రాజు సాయంతన విహారము సేయునపు డతనిని పౌరులు చూచుటకై మందిరము లుచితరీతిని కిటికీలు గలవై యుండెను.*[3] నలువైపుల నిండ్లతో నమరిన చతుశ్శాల (Square) లును పెక్కులుండెను.

సామాన్యముగ రాతికట్టడములే లేవు. పునాదులు, కంబములు, పడికట్లును దప్ప తక్కి నవెల్ల మ్రాఁకు కట్టడములు నిటిక కట్టడములునుగ నుండెను. వెలుపలను లోపలను గచ్చు పూసి పువ్వులు, బొమ్మలు, దండపని, తీగపని, సన్నని బొందుపని, రాక్షసపుపని, మున్నగునవి యొప్పునట్లు దేదీప్యముగ రంగులుదీర్చి యుండెను.

గ్రామరక్షక సంఘము.

ఇట్టి రాజధానిని రాజ మందిరంబును గాపాడుటకు ముప్పది యుద్యోగస్తుల సంఘ మొకటి యేర్పరుపఁ బడియెను. ఇది యప్పటి మునిసిపాలిటి యనవచ్చును. ఇందుండు ముప్పది మందియు నాఱు పంచాయితులుగా విభజింపఁబడిరి. ఒక్కొక పంచాయితిలో నైదుగు రుద్యోగస్తులుండిరి. అందు మొదటి పంచాయితీవారు పట్టణములోని కలాకౌశల్యాభివృద్ధికి నుత్తర వాదులయి యుండిరి. అనఁగా నిప్పుడు మన దేశాభిమానులు కొందఱు చేయుచున్న స్వదేశోద్యమము వంటి యుద్యమ మీ యుద్యోగస్థులప్పుడు చేయుచుండిరి. రెండవ పంచాయితీ దార్లు పాటలీపుత్రమునకు వచ్చెడి యన్యదేశీయులఁ గాపాడుచుండిరి. అన్యదేశీయులు రాజ్యము గుట్టు కనుఁగొనవచ్చిన మోసకాండ్రో లేక నిజముగా నేదో యన్య కార్యముమీఁద వచ్చిన వారలో కనుఁగొనుట, అన్య కార్యముమీఁద వచ్చిన వారిని గౌరవించుట, వారికి నేమియు నిబ్బంది లేకుండఁ గాపాడుట, వారికిఁ గావలయు భోజన పదార్థము లిప్పించుట, జబ్బుగానున్న వారికి ఔషధము నొసంగుట, మృతిఁజెందిన వారికి నంత్య సంస్కార్యములు చేయించి వారిసొత్తేమైన నున్న యెడల వారి వారసులకు బంపుట, వీరి పనులయి యుండెను. ఇందువలన నా కాలమందు ననేక పరదేశీయులు మనదేశమునకు వచ్చుచుండి రనియు చంద్రప్తునకు సనేక పరరాజులు స్నేహితులుగానుండి రనియుఁ గానవచ్చుచున్నది. మూఁడవ పంచాయితీ దారులు గ్రామములోని జననమరణపు లెక్కను జూచుచుండిరి. నాగరికతఁ జెందినయింగ్లీషు దొరతనమువారుకూడా మొన్న మొన్నటివఱకు నీదేశంబున జననమరణపు లెక్కఁ బ్రారంభింపలేదు. ప్రారంభించి కొద్దికాలమే యాయెను. ఇట్టి స్థితిలో రెండు వేవేండ్ల క్రిందఁ జంద్రగుప్తుడు ప్రజా క్షేమము తెలియుకొఱకును, పన్ను కట్టుటకు వీలుగ నుండుకొఱకును ఈ లెక్కల వ్రాయించుట చూడ నతని బుద్ధివైభవమునకు నెవ్వరాశ్చర్య పడకుందురు ? నాల్గవ పంచాయితీదార్లు వాణిజ్యాధికారము గలవారయి యుండిరి. తూనికెలు, కొల్తలు తప్పువి కాకుండను, అమ్మెడి వస్తువులలో మోసము లేకుండను జూచుట వీరిపని. అయిదవ పంచాయితీ దార్లు చేతిపనులమీఁది యధికారులు. వారు వర్తకు లమ్మిన సరకులమీఁదఁ బన్నులు పోగుచేయువారు. ఈ విడివిడి పనులు గాక వీరందఱును గ్రామములలోని యితర వ్యవహారములన్నిటిని జూచుచు, గుళ్లు, రేవులు, అంగళ్లు, మొదలైనవానిని గాపాడు చుండిరి. ఇది పాటలీపుత్ర రక్షణ విధము. ఇటులే యితర పురంబులన్నియు రక్షింపఁబడుచుండెను.

ఒక మహోత్సవము

పాటలిపుత్రమున వీథులయందు డంబుగ జరిపింపఁబడిన యొక దివ్య మహోత్సవమును మెగాస్తనీసు దర్శించి తెలిపిన దానిని స్ద్రాబో దిగువరీతిని వర్ణించినాఁడు.

"వారి పండువుల యూరేగింపులయందు స్వర్ణ రజతాలంకృతములగు అనేక యేనుఁగులు ఒయ్యారముగ నడచి వచ్చును. నాలుగు గుఱ్ఱములచేతను, ఎద్దులజతలచేతను లాఁగఁబడిన "లెక్కలేని బండ్లును వెంబడించును. వెను వెంటఁ రిబచర సమూహములు నిండుదుస్తు తొడిగి బంగారు పాత్రలను, పెద్ద పళ్ళెరములను వెడల్పు గిన్నెలను, మేజాయిలు, విలువగల కుర్చీలు, పచ్చలు, మరకతములు, గరుడపచ్చలు, కెంపులు మున్నగు రత్నములు చెక్కిన రాగిగిన్నెలు, మొదలగునవి మోసికొని వచ్చుచుందురు. బంగారు నగిషీపని చేసిన ఉత్తమ వస్త్రములు మోచువారు కొందఱుందురు. వారి వెనుక అడవి దున్నలు, చిరుతలు, పెంపుడు సింగములు, పలురంగుల రెక్కలుగల నానాజాతుల పక్షులును, పిట్టలును గొనిరాఁబడు చుండెను."

  1. * రఘువంశము, 6 వ సర్గము, 24 వ శ్లోకము, ఆర్యభట్టీయము, ద్వితీయ గణితపాదము.
  2. *వాల్మీకి రామాయణము, బాలకాండము, 24 వ సర్గము.
  3. *కవికులగురు కాళిదాసకృతమైన రఘువంశముయొక్క యాఱవసర్గములో 24 వ శ్లోకమునందు పాటలిపురమును గుఱించి "ప్రాసాదవాతాయన సంశ్రితా నాంనేత్రోత్సవం పుష్పపురాంగనానాం" అనఁగా "మేడలలోని కిటికీలను ఆశ్రయించియున్నట్టి పుష్పపురమందలి స్త్రీలకు నేత్రోత్సవము" అని వర్ణింపఁబడుట చూడఁగా ఉత్సవాదులు చూచుటకై యిండ్లకు గవాక్షముల నుంచుచుండిరనుట స్పష్టము.