చంద్రగుప్త చక్రవర్తి/అయిదవ ప్రకరణము
అయిదవ ప్రకరణము
చంద్రగుప్త కాలనిర్ణయము
హిందూ దేశమునకుఁ బ్రథమ చక్రవర్తియైన చంద్రగుప్తుని కాలమెట్లు నిర్ణయింపఁబడినదని చదువరు లడుగవచ్చును. వారి జిజ్ఞాస తృప్తిపఱుచుటకై యిచ్చట నీ విషయము చర్చింప వలసియున్నది. ఇదియుఁగాక చంద్రగుప్త కాలనిర్ణయము హిందూదేశ చరిత్రాధ్యయనముఁ జేయగోరు విద్యార్థులు గమనింపవలసిన ముఖ్యవిషయములలో నొక్కటి. హిందూదేశము యొక్క సాద్యంత చరిత్రము నేటి వరకు హిందూ మహాయుగము, మహామ్మదీయ మహాయుగము బ్రిటిషు ప్రభుత్వము అని త్రిప్రకరణాత్మకముగా వర్ణింపఁబడు చున్నది. ఇందు రెండవ మూఁడవ ప్రకరణములలోని కాల నిర్ణయములు నిశ్చితములు. వానిని గుఱించి విశేష భిన్నాభిప్రాయము లుండవు. గజినీమహమూదు సోమనాథ దేవాలయమును దోఁచుకొనిన సంవత్సరమును, అగ్బరు చక్రవర్తి రాజ్యమునకు వచ్చిన తేదియు, లార్‌డుకారన్ వాలిసు రాజప్రతినిథిగా హిందూదేశమునకు వచ్చిన యేడును మనము నిశ్చయముగా నెఱుఁగుదుము. ఇందుకు కారణము ఆయా కాలముల చరిత్రకారులు కాలస్థల నిర్ణయముతో సమకాలిక చరిత్ర విషయములను వ్రాసియుంచుటయే. కాని హిందూమహా యుగము నందలి చరిత్రాంశముల కాలనిర్ణయ మిట్టిది కాదు. ఇందలి ప్రతివిషయిక కాలనిర్ణయము సంశయాస్పదమే. ప్రతి విషయమును గుఱించియు అభిప్రాయ భేదములు తండోప తండములుకలవు. ఋగ్వేద మెప్పుడు రచింపఁబడెననిన ప్రశ్నకు నొక్కఁ డైదువేల యేండ్ల క్రిందననియు మఱియొకఁడు ఏడువేలేండ్ల క్రిందననియు, నింకొకఁడు పదివేలేండ్ల క్రిందననియుఁ బ్రత్యుత్తరము లిచ్చెదరు. ఇదమిత్థమని చెప్పుటకు దగిన సాధనములు లేవు. ఇట్లే ఉపసిషత్తుల కాలమును గుఱించియు మహాభాష్య రచనాకాలమును గుఱించియు శంకరాచార్యుని యవతార సమయమును గుఱించియు వాద ప్రతివాదములును గలవు. పై కారణములచే హిందూ మహాయుగము నిశ్చితకాల జ్ఞానాభావ మను అంధకారముచే నిండియున్నది. ఇట్టి మహాంధకార మధ్యమున చంద్రగుప్త కాలనిర్ణయమను నొక చిన్న దీపము గ్రీకు చరిత్రకారుల సాయముచే వెలుగు చున్నందున దానిని నాధారముఁ జేసికొని అందుకు ముందు వెనుక జరిగిన చరిత్రాంశముల కాలము పండితులు నిశ్చయించుచున్నారు.
కావున కాలనిర్ణయము లన్నింటికిని ఆధారభూతమైన చంద్రగుప్త కాలనిర్ణయమెట్లు చేయఁబడెనో, అది యెంతవఱకు నమ్మఁదగినదో మన మాలోచింప వలెను, అలెగ్జాండరు హిందూదేశమునకు వచ్చినప్పు డతనితో నేతెంచిన పండితులును, చంద్రగుప్తుని దివాణమునకు రాయబారిగ వచ్చిన మెగస్తనీస్ అనువాఁడును వాని ననుసరించి మఱియు ననేకులగు గ్రీకు గ్రంథకారులును సాంద్రకోటస్ లేక శాంద్రగోప్తస్ అనువాఁడు అలెగ్జాండరును మొదట వచ్చి చూచినట్టును అలెగ్జాండరు చనిపోయిన కొలఁది కాలములోనే అతఁడు పంజాబు దేశమునుండి గ్రీకు సైనికులను వెడలఁగొట్టి స్వతంత్రుఁ డైనట్టును అతని రాజధాని గంగయొడ్డున పాలిబోత్రానామముతో మిగుల వైభవమునొందిన పట్టణమైనట్టును అతనికి పూర్వమున రాజుగనుండినది. నంద్రన్ అనువాఁడైనట్టును వానియందు జనులకు ద్వేషము గలిగినందున సాంద్రకోటన్ వానిని జంపి రాజైనట్టును వ్రాసియున్నారు. మొట్టమొదట సాంద్రకోటస్ అన నెవ్వఁడో దెలియక పోయెనుగాని పై వర్ణనలన్నియు చక్కగ విమర్శించి పాశ్చాత్య విద్వాంసులు సాంద్రకోటస్ అనగా చంద్రగుప్తుఁ డనియు పాలిహోత్ర యనగా పాటలీపుత్రమనియు నండ్రస్ అనగా నందుఁడనియు నిశ్చయించి యున్నారు. పాలిహోత్రకును గంగానదికిని గల యంతరము మెగస్తనీస్ వ్రాసి యున్నాఁడు. అదియును ప్రస్తుతము పాట్నా పట్టణమునకును గంగకును గల యంతరముతో సరిపోవుచున్నది. ఇంతియగాక పాలిహోత్ర గంగా శోణల సంగమము వలన గలిగిన యంతర్వేదిలో నున్నదని అతఁడు వ్రాసిన విషయము ప్రస్తుతము పాట్నా, అనఁగా పూర్వపు పాటలీపురమునకే, అన్వయించుచున్నది, కావున పాలిహోత్ర యనగా పాటలీపురమనియు, సాంద్రకోటస్ అనఁగా చంద్రగుప్తుఁడనియు ఈతఁడే సెల్యూకస్ నికేతర్ నోడించిననియు, ఇతని రాజధాని పాటలీపురమనియు మనము గట్టిగఁ జెప్పవచ్చును.
కాలనిర్ణయమునకు రెండవసాధనము
ఇట్లు మనమొక నిశ్చయమైన సాధనమును బట్టి చంద్రగుప్తుని కాలమును కనుగొంటిమి. ఇదియే నిజమైనదని నొక్కి వక్కాణించుటకు మఱియొక స్వతంత్ర సాధనముకలదు. మొదటి సాధనమునకును దీనికిని సంబంధములేక దీన వేఱువిధముగ లెక్కలువేసి పై కాలమునే సాధించుటవలన దీనిని స్వతంత్ర సాధనమంటిమి.
చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు. బిందుసారుని కుమారుఁడు అశోక వర్ధనుఁడు. ఇతఁడే ధర్మోపదేశార్ధమై తన రాజ్యము నందంతటను శిలాశాసనములను చెక్కించి వేయించి మిక్కిలి ఖ్యాతివడసిన అశోకుఁడు. ఇతని శాసనములలో అశోకుఁడనెడు నామము లేదు. ప్రియదర్శియన్న సంస్కృత పదమునకు ప్రాకృతరూపమైన పియదశి నామముకలదు. కాని అశోకునికే ప్రియదర్శియనిన నామాంతరము గలదని మనము పెక్కు సాధనములవలన నిశ్చయింపవచ్చును. *[1] ఈవిషయము చరిత్రకారులందఱును నిస్సంశయముగా నొప్పుకొనినదే యయిసందున ఇచ్చట వివరణ మనవసరము.
అశోకునిచేఁ బ్రకటింపఁబడిన పదమూఁడవ శిలాశాసనమునందు నీ ప్రకారముగా వాయఁబడియున్నది.
పదమూఁడవ శిలాశాసనము.
సత్యజయము.
"పియదశి ముఖ్యతమముగ నెన్నెడి విజయము ధర్మ సందేశము వలననగు విజయమే. ఇట్టి విజయము పియదశి దన సామ్రాజ్యము నందేగాక దన కిరుగు పొరుగు సీమల యందలి ప్రజలందఱమీఁదను గూడ నొందియున్నాఁడు. ఆరువందల యోజనముల దూరముననుండు అంతియోక నామధేయుఁడగు యోనరాజు నివసించు ప్రదేశమునకు ఈ అంతియోకున కావల 'తురమాయె' 'అంతికిని' 'మక' 'అలికనుందర” అను నామములతోఁ బరగు రాజచతుష్టయము నివసించు ప్రదేశములకును ఈ విజయము వ్యాపించియున్నది."[2] ఈ శాసనమునందు నైదుగుఱు విదేశపురాజుల పేళ్లుదాహరింపఁబడినవి. వీరిలో అంతియోకుఁ డనువాఁడు ఆంటీయోకస్‌థియాన్ అను (Antiochus Theos) సిరియాదేశపు రాజు, ఇతఁడు క్రీ. పూ. 246 వఱకు రాజ్యముచేసెను. తురమాయే అనువాఁడు టాలిమీ ఫిలాడల్‌ఫస్ (PtolemyPhiladelPhus) అను నామముతో ఈజిప్టు దేశముపై రాజ్యముఁజేసీ క్రీ. పూ. 246 లో మృతుఁడయ్యెను. ఈతని కూఁతునే అంటియోకుఁడు వివాహమాడెను. అంతికిని అనువాఁడు ఆంటిగోనన్ గొనిటన్ అనునామముతో మకడోనియా రాజ్యమును సంపాదించి 239 వఱకు రాజ్యముచేసెను. అలికసుందరుఁడను వాఁడు పైరసు అనువాని కుమారుఁడు. అలెగ్జాండరు నాఁబడు ఎపిరస్ దేశపు ప్రభువు. క్రీ. పూ. రమారమి 260 వ సంవత్సరము వఱకు ప్రభుత్వముఁ జేసెను. మాగాస్ అనువాఁడు సైరిన్ దేశపురాజు టాలిమీకి సాపత్న్య సోదరుఁడు. 258 వ సంవత్సరమున పరలోకగతుఁ డయ్యెను,
పైని ఉదాహరింపఁబడిన పేళ్లుగలరాజు లచ్చటచ్చట భిన్న కాలములం దుండినను పై ఐదు పేళ్లుగల రాజులేక కాలము నందు భిన్నదేశముల నేలుచుండుట మేముదహరించిన సిరియా, ఈజిప్తు, మకడోనియా, ఎపిరస్, సైరిన్ రాజుల విషయమయ్యే సిద్ధించుచున్నది. కనుక కాలనిర్ణయ విషయములో పొరబాటెంతమాత్ర ముండుటకు వీలులేదు. ఇదియునుంగాక ఈ మెగాన్ తప్ప యీ నామధేయము గల మఱియొక రాజు లేనేలేఁడు. మెగాస్ రాజు 258 వ సంవత్సరమున మృతుఁడయ్యెను. అలెగ్జాండరు గూడ ఆ సంవత్సరముననో లేక యంతకు గొంచెము కాలము పూర్వముననో పరలోక గతుఁడయ్యెను. కావున పైని పేర్కొనఁబడిన అశోకశాసనము మెగాస్ బ్రతికి యుండగనో లేక మృతిఁజెందిన సమాచారము తెలియక పూర్వమో చెక్కింపఁబడి యుండును. సైరస్ నుండి మెగాస్ మృతిఁజెందిన వర్తమానము హిందూదేశమునకు వచ్చుటకు నొక సంవత్సరము కంటే నెక్కుడుకాలము పట్టదనుట నిశ్చయము. కావున 257 వ సంవత్సరముకంటెఁ దరువాతి కాలమున నీ శాసనము చెక్కింపఁ బడలేదని మనము నిశ్చయింపవచ్చును. ఈ శాసనము అశోకుని పట్టాభిషేకమయిన తరువాత పదమూఁడవ యేట చెక్కింపఁ బడియెను. అనఁగాఁ బట్టాభిషేకమై పండ్రెండు సంవత్సరములు గతించెనని యర్ధము. 257 తో 12 కలుపగా 269 వ సంఖ్య సిద్ధించుచున్నది. కావున క్రీ. పూ. 269 వ సంవత్సరమున అశోక మహారాజు పట్టాభిషిక్తుడయ్యె నని తేలుచున్నది. సింహళద్వీప చరిత్రములఁజూడ కొన్ని గృహ కలహములచే నశోకుఁడు రాజ్యమునకు వచ్చిన తరువాత మూఁడు సంవత్సరములకు నతని పట్టాభిషేకము జరిగెనని తెలియుచున్నది. కనుక నాతనికి 269 లోఁ బట్టాభిషేకము జరిగినను ఆతఁడంతకు మూఁడు సంవత్సరముల ముందే అనఁగా క్రీ. పూ. 272 లో రాజ్యమునకు వచ్చినట్టు గ్రహింపవచ్చును.
అశోకుని తండ్రి బిందుసారుఁడు. ఆతఁడిరువది యైదు సంవత్సరములు రాజ్యముఁ జేసెనని పురాణములు చెప్పు చున్నవి. మన చరిత్ర నాయకుఁడగు చంద్రగుప్తుఁడీ బిందుసారునితండ్రి. ఈతఁడిరువదినాలుగు సంవత్సరములు నేలయేలె నని పురాణములును సింహళ గ్రంథములును నుడువుచున్నవి. అనఁగా చంద్రగుప్తుఁడును బిందుసారుడును కలిసి 49 సంవత్సరములు రాజ్యమేలిరి. ఈ సంఖ్య 49 యిదివఱకు మనచే సాధింపబడిన 272లో ననఁగా అశోకుఁడు రాజ్యమునకు వచ్చిన సంఖ్యలోఁ గలుపగా 321 వచ్చుచున్నది. ఇదియే చంద్రగుప్తుఁడు రాజ్యమునకు వచ్చిన సంవత్సరపు సంఖ్య,
ఈలాగున మనము రెండు భిన్నమార్గముల బయలుదేరి వేఱు వేఱు నడకల నడచినను ఘట్టకుటీప్రభాత న్యాయమున నొక్కచోటికే వచ్చి చేరుచున్నాము. సాంద్రకోటస్ అనఁగా చంద్రగుప్తుడని యెంచి, అలెగ్జాండరుయొక్క దండయాత్ర తిథులును గ్రీకు చరిత్రకారులును నాధారముగాగై కొని వేసిన లెక్కలవలనను అశోకవర్ధనుని శాసనము నాధారము చేసికొని పురాణాదులలో వర్ణింపఁబడిన మౌర్యరాజుల పాలనాకాలము లెక్క వేసినను క్రీ. పూ. 321 లోనో, లేక 322 లోనో అతఁడు రాజ్యమునకు వచ్చినట్లు స్పష్టమగుచున్నది.
ఇదియుఁగాక వేరొక విశేషము గలదు. అశోకుఁడు క్రీ. పూ. 272 మొదలుకొని 231 వఱకు రాజ్యమేలెను. అతనిచే శాసనములోఁ బేర్కొనఁ బడిన ఆంటియోకుఁ డతనికి సమకాలికుఁడై 261 మొదలు 246 వఱకు రాజ్యమేలెను. చంద్రగుప్తుఁడు అశోకుని తాత, శల్యూకస్ నెకటాస్ అంటి యోకునితాత. మనుమలు సమకాలికులైనప్పుడు వారితాతలు గూడ సమకాలికులగుట సహజమని సాధారణముగ గ్రహింపవచ్చును. కావున సెల్యూకస్ నికేతర్ చంద్రగుప్త మౌర్యునకు సమకాలికుఁడనుట స్పష్టము.
పైని వ్రాయఁబడిన హేతువులచే మనచరిత్ర నాయకుండగు చంద్రగుప్త మౌర్యుఁడు అలెగ్జాండరు. తోడను సెల్యూకస్ నికేతర్ తోడను సమకాలీనుఁడు అని తేలినది. గ్రీకు వారగు వీరిద్దఱి చరిత్రలును సమకాలికులైన గ్రంథకారులచే వాయఁబడి యున్నందున వారి కాలము నిశ్చితము. వారి యుద్ధములను గుఱించియు దాడులను గుణించియు ప్రవాసములను గుఱించియు చేయఁబడిన కాలనిర్ణయములలో ఒకటిరెండు నెలల విభేదము వచ్చినను రావచ్చును. కాని అంతకంటే నెక్కుడు ఎచ్చు తక్కువ లుండవు.
అలెగ్జాండరు హిందూదేశమునకు వచ్చినప్పుడు చంద్రగుప్తుడు ఆతనిని సందర్శించి నట్టున్నది. గావున ఈ ప్రసంగము క్రీ.పూ. 325 లోనో 326 లోనో జరిగియుండవలెను. అలెగ్జాండరు క్రీ.పూ. 325 వ సంవత్సరమందు మే నెలలోనో జూన్ నెలలోనో కీర్తి శేషుఁడయ్యెను. అతని మరణవార్త తెలిసిన కొలఁది కాలమునకే చంద్రగుప్తుడు స్వతంత్రుఁ డయ్యెనని వ్రాయఁబడి యున్నది. అలెగ్జాండరుని మరణవార్త హిందూదేశ జనులకుఁ తెలియుటకు రెండు నెలలు పట్టినదనుకొన్నను ఆగష్టు నెలలోనో లేక సెప్టెంబరు నెలలోనో యీ వార్త తెలిసియుండును. ఆతఁడు. వెంటనే సైన్యములను కూర్చుకొని పంజాబు చేశమునుండి గ్రీకువారిని వెడలఁగొట్టి నందున నీవార్త క్రీ.పూ. 322లో జరిగెనని చెప్పవచ్చును. సెల్యూకస్ తన ఏష్యవై భవమునకు బునాది నిర్మించుకొను చుండగా చంద్రగుప్తుఁడు హిందూదేశమునకు జక్రవర్తి యయ్యేనని జస్టిన్ వాసియున్నాఁడు.*[3] సెల్యూకస్ క్రీ. పూ. 321 లో బేబిలోన్ పట్టణమునకు క్షేత్రపుడుగా నియమింపఁబడెను. ఈ క్షేత్రపాధికారమే యతఁడు తరువాత రాజగుటకు మూలాధారము. అప్పటికి చంద్రఫుప్తుఁడు మగధా ధీశ్వరుఁడై యుండవలెను. కావున నంద సంహారము, పర్వతేశ్వర వథ, అమాత్య రాక్షసుని వశపఱచుకొనుట మొదలైన ముద్రారాక్షస వర్ణిత కథాంశము లన్నియు 321 లోనో తరువాత ఒకటి రెండు సంవత్సరములలోనో జరిగియుండవలెను. సెల్యూకసు 305 లోనో 304 లోనో చంద్రగుప్తుని మీదికి దండెత్తి వచ్చి 303 లోఁ బూర్తిగ పరాభూతుఁడై మగధేశ్వరునితో సంధిఁ జేసికొని వెళ్లి పోయెను. చంద్రగుప్తుఁ డిఱువదినాలుగు సంవత్సరములవఱకు రాజ్యముఁ జేసెనని వాయుభాగవతాది పురాణములలోను సింహళదేశపు చరిత్రలోను వ్రాసియుండుటఁ బట్టి అతఁడు 298 లోనో లేక 297 లోనో కీర్తి శేషుఁ డయ్యెనని మనము చెప్పవచ్చును. చంద్రగుప్తుఁ డలెగ్జాండరును చూచు వఱకు నిఱువదియై దేండ్ల వయస్సు గలవాఁడని యెంచితి మేని యాతఁడు 350 వ సంవత్సర ప్రాంతమున జన్మించి యుండవలెను. మనమిట్లు తేల్చుకొనిన కాలనిర్ణయమంతయు నీక్రింది పట్టికలోఁ గనుపఱచఁ బడినది.
కీ. పూ.
350 చంద్రగుప్త జననము.
326, 325 అలెగ్జాండరును చూచుట
323 అక్టోబరు, 322 చంద్రగుప్తుఁడు పంజాబునుండి గ్రీకు వారిని వెడలఁగొట్టుట.
322, 321 మగధరాజ్యము నాక్రమించుకొనుట.
305, 304 సెల్యూకస్ హిందూదేశముమీదికి దండెత్తి వచ్చుట.
303 సెల్యూకసు పరాభవము, చంద్రగుప్తునితో సంధిచేసికొనుట.
298, 297 చంద్రగుప్తుని మరణము.
- ↑ *ఇందును గురించి యధికము తెలిసికొనఁ గోరువారు The Journal of the Royal Asiatic Society యొక్క 1801 వ సంవత్సరపు సంపుటలో Identity of Piyedasi with Asoka Maurya అన్న వ్యాసము చూడనగును.
- ↑ Eshe cha mu (kha ) mute Vijayedevanam Priyasayo dhramavijayo; so cha puna ladho devanam priyasa iha cha sa (dre ) shu cha anteshu (8) ashashu pi Yojanasa (te) shu yatra Amtiyokonama Yona raja param cha teva Amtiyokena chature (4) rajani Turamaye nama Amtikini nama Makanama Alikasundaro nama. ( ఏ షేచా ముఖముతే విజయే దేవానాం ప్రియసయోధ్రమవిజయోసో చ పున లధో దేవానాం ప్రియస ఇహ చ వద్రేషుచ అంతేషు [8] అషషుపి యోజనా శ [తే] షు యాత్ర ఆంతియోకోనామ యోనరాజా పరాంచ తేవ అంతి యోకేనచతురే [4] రాజాని తురమాయే నామ అంతికిని నామ మకనామ అలిక సుందరో నామ.)
- ↑ *" Sandrakottus having thus won the throne was reigning Over India when Seleucus was laying the foundations of his future greatness" (Justis)