చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/మహాపురుషుల జీవితచరిత్ర : గాంధీ తాత
గాంధీ తాత
ప్రతి యింట్లో ఒక తాతయ్య ఉండవచ్చు, కాని ఒక దేశంలోనివారందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య ఉండటం చాల కష్టం. అలాంటి తాతయ్యలు ఏ వెయ్యేళ్ళకో ఒకసారి దొరుకుతుంటారు. ఇవాళ మన భారతీయులందరికీ ఒక తాతయ్య ఉన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు కదూ? ఆయనే గాంధీ తాత! మనం చెప్పుకోవాలంటే ఆయన కథలు చాలా ఉన్నాయి.
మన తాతయ్య తండ్రిగారు కరంచంద్ గాంధి; తల్లిగారు పుత్తలిబాయి. ఆయన 1889 అక్టోబరు 2 తేదీన పోర్బందర్ అనే గ్రామంలో పుట్టాడు. ఈ గ్రామాన్ని సుధామపురం అనికూడాఅంటారు. మనతాతయ్యకు బాల్యం పోర్బందరులోనే గడిచింది. ఆ ఊరిబళ్లో మూడో క్లాసు వరకు చదివాడేమో. గాంధితాత తన కధ రాసుకుంటూ ఇలా అన్నాడు: "ఆ రోజుల్లో చదువుమాట ఎలాఉన్నా మాష్టార్ని తిట్టటం మాత్రం నేర్చుకొన్నాను. నేను వట్టి మొద్దబ్బాయిని. ఒక్క అక్షరంముక్క నాకు అంటేది కాదు. ఇప్పుడు చెప్పింది ఇంకా కాసేపటికి మరచిపోయేవాణ్ణి"
అంటే గాంధితాత చిన్నతనంలో మనలాగానే మామూలు కుర్రవాడన్న మాట.
మన తాతయ్య ఏడేళ్ళవాడై ఉండగా వాళ్ళనాయన రాజకోట సంస్థానంలో ఉద్యోగిగా ప్రవేశించాడు. మన తాతయ్యకూడా తండ్రివెంటవెళ్ళి అక్కడ బళ్లోనే కొంతకాలం చదివి హైస్కూలులో చేరాడు. మనతాతయ్య అక్కడ చదువుతుండగా ఒకసారి భలేగమ్మత్తు జరిగింది. ఇన్స్పెక్టరు తనిఖీకి వచ్చాడు. పిల్లలకు డిక్టేషన్ వ్రాయమని ఐదు గొట్టుమాటలు ఇంగ్లీషులో చెప్పాడు. మనతాతయ్య "హరిశ్చంద్రుడు" లాంటి కష్టమైన ఒక ఇంగ్లీషుమాట తప్పువ్రాశాడు. మాస్టరు అదిచూచి 'ప్రక్కపిల్లవాడి పలకలోచూచి తప్పు దిద్దుకో మని తాతయ్యకు సైగచేశాడు. నువ్వూ నేనూ ఐతే అలాంటి మాస్టరుదొరికినందుకు ఎంతసంతోషించే వాళ్ళం? కాని మనతాతయ్యకు మొదటినించీ, అబద్ధ మాడకూడదనీ, దొంగతనం చేయకూడదనీ ఒకపిచ్చి ఉండేది. అందుచేత పక్కవాడి పలక చూచి తప్పు దిద్దుకోలేదు. మాస్టరుకు భలేకోపం వచ్చింది. ఇన్స్పెక్టరు పోయిన తర్వాత గాంధితాతను పిలిచి - "నీకు బుద్ధిలేదా? నేను పక్కకుర్రవాడి పలకచూసి నిన్ను దిద్దుకోమనలా? ఎందుకు దిద్దుకోలేదూ?" అని అడిగాడు.
"నేనీ బళ్లోనించి పొమ్మనా పోతాను గాని చచ్చినా దొంగతనం చేయను," అన్నాడు గాంధీతాత మాస్టరుతో, చాశారా ఇలాంటి మొద్దుపనులు చేసే ఆయన తాతయ్య అయ్యాడు. లేకపోతే మనందరికీ ఒకే తాతయ్య ఎలా దొరికేవాడు? వెంటనే తండ్రిగారికి ఇలా ఉత్తరం వ్రాశాడు:
"నాన్నగారికి, ఇంతటి బుద్ధితక్కువపని చేసినందుకు విచారపడుతున్నాను. అన్నగారి బాకీ తీర్చటానికని మురుగుబంగారం కొంతనరికించి అమ్మివేశాను ఇంతకన్న పెద్ద తప్పు మరేముంది? దీనికి తగ్గ శిక్ష మీరు నాకు తప్పకుండా వెయ్యాలి. ఈ ఉత్తరం చూచిం తరువాత మీరు ఏమాత్రం విచారపడవద్దు."
ఈ ఉత్తరం మనతాతయ్య తనే పట్టుకెళ్ళి తండ్రిగారికి ఇచ్చాడు. ఆయన అప్పుడు జబ్బుపడి మంచంలో ఉన్నాడు. ఉత్తరం అందుకొని ఆయన లోలోపల చదువుకో సాగాడు. వారి కళ్లనించి కన్నీటి చుక్కలు జొటజొట క్రింద పడినాయి. అది చూడగానే గాంధితాతకు కూడ టపటపా కన్నీళ్ళు రాలాయి. కరంచంద్గారు అమిత ఆనందముతో, పొంగివచ్చే వాత్సల్యంతో కన్నీళ్లు నించితే, మన తాతయ్య తాను ఎంత తప్పుపని చేశానన్న విచారంతో కన్నీళ్లు నించాడు. ఇందులో ఎవరి కన్నీళ్ళు గొప్పవో మీరు చెప్పగలరా? లేక ఆ విక్రమార్కుడే దిగివచ్చి చెప్పాలంటారా?
కరంచంద్ కుమారుని ఉత్తరం చదివి మెల్లగా చించివేశాడు. కొడుకును దీవించాడు. గాంధీతాతయ్య మనసు కుదుటపడింది.
ఇలాంటి సత్యసంధతవల్లనే గాంధిజీ మనందరికీ తాతయ్య అయ్యాడు. ప్రపంచానికి మహాత్ము డయ్యాడు.