చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/గీక్షసులు
అనగా అనగా ఒక ఊళ్లో ఒక చెమిటివాడూ ఒక గుడ్డివాడూ ఉండేవాళ్లు. వాళ్లిద్దరికీ మాంచి సావాసం ఇద్దరూ ఆ ఊళ్లోనే అడుక్కుతిని బతికేవాళ్లు. కాని ఒక్కఊళ్ళో ఎన్నాళ్లు దొరుకుతుంది వాళ్లకు బిచ్చం? అందుకని ఆ ఊరువదిలి దూరదేశాలు పోయి బతుకుదామని ఇద్దరూ కలిసి బయలుదేరారు.
దోవలో గుడ్డివాడు చెమిటివాడితో - "ఇదుగో చెమిటి మామా! మనిద్దరం ఒకమాటకు వద్దాము. నేను విన్నదెల్లా నీకు చెప్పుతాను నువ్వు చూసిందెల్లా నాకు చెప్పు. మనకు దొరికిందెల్లా చెరిసగం పంచుకుందాము." అన్నాడు.
చెమిటివాడు ఎగిరి గంతేసి 'సరే!' నన్నాడు. కొంతదూరం పోయేవరకు గుడ్డివాడికి గాడిద అరుపు వినిపించింది. "ఇదుగో, ఇక్కడ దగ్గరలో ఎక్కడో గాడిద ఉంది. దాన్ని పట్టుకు తీసుకెళ్లామా, మనకు ఏది దొరికినా దాని మీద వేసుకోవచ్చు." అన్నాడు.
చెమిటివాడు గుడ్డివాడు చెప్పిన దోవనే పోయాడు. అక్కడ ఒక గుంజకు గాడిద కట్టేసి ఉంది. చెమిటివాడు దాన్ని విప్పి తోలుకు వచ్చాడు.
ముగ్గురూ మళ్లీ కొంచెం దూరం పోయా
రు. చెమిటివాడు అన్నాడు: "ఇదుగో, గుడ్డిమామా! ఇక్కడ చీమలబారు పోతున్నది" అన్నాడు.
"ఇంకేం, కాసినితీసి పైపంచను మూటకట్టు. ఎందుకైనా పనికిరాక పోతయా?" అన్నాడు గుడ్డివాడు.
ఇంకా కొంచెందూరం పోయేవరకు చాకలివాడి బాన కనిపించింది. దాన్ని కూడా తీసుకుని గాడిదమీద కట్టుకుని బయలుదేరారు.
ఇంతలో పొద్దుకూకవచ్చింది. ఆకాశాన దట్టంగ మబ్బుపట్టింది. ఉరుములూ మెఱుపులతో వానవచ్చింది. దగ్గరలో ఏది కనపడినా చాలు, అందులో తలదాచుకుందా మనుకున్నారు ఇద్దరూ. అలాగే కాస్తెదూరం పోయేవరకు పెద్దమేడ కనిపించింది.
"అదుగో, పేద్ద మేడ!" అన్నాడు చెమిటివాడు.
"అయితే నా చెయ్యిపట్టుకు పరుగెత్తు: నా చెవులు ఉఱుముల మోతకు పగిలిపోతున్నై." అన్నాడు గుడ్డివాడు.
"నాకు ఉఱుములంటే లెక్క లేదు. మెఱుపులతో నా కళ్ళు పోతున్నై!" అన్నాడు చెమిటివాడు.
"ఎందుకుమామా, మనిద్దరం ఊరికే వాదించుకోటం. త్వరగాకొంపకు చేర్చు, తడిసిపోతున్నాం" అన్నాడు గుడ్డివాడు.
ఇద్దరూ ఆ కటిక చీకట్లో తడుస్తూ ఇంటికి చేరుకున్నారు. గుడ్డివాడు ఆయింటి మెట్లూ, తలుపులూ గడియలూ చూసి "ఇది ఎవడిదో రక్షసుడి కొంపలాగా ఉంది. మనం ఇంకోచోటికి పోదాం" అన్నాడు.
చెమిటివాడికి భయం వేసింది. కాని ఎక్కడికి పోతాడూ? ధైర్యం తెచ్చుకుని - "దీంటోకే పోదాంపద గుడ్డిమామా! రాక్షసివస్తే నేను జవాబు చెప్పుతాను." అన్నాడు.
ఇద్దరూ బలమంతా ఉపయోగించి తలుపునెట్టి గాడిదను లోపలికితోలి మళ్లీ తలుపుబిగించారు. లోపల రాక్షసీ లేదు, గీక్షసీ లేదు. వాళ్ళకు బాగా ఆకలి వేస్తున్నది. అన్నమూ, కూరలూ, పళ్లూ పెట్టి ఉన్నవి. గాడిదను స్తంభానికి కట్టివేసి ఇద్దరూ కూచుని ఆ అన్నమంతా మెక్కారు. కడుపు నిండేవరకు వాళ్ళకు నిద్రవచ్చింది. గురకపెట్టడం మొదలుపెట్టారు.
ఇంతలో ఎక్కడో తిరగటానికి పోయిన రాక్షసి వచ్చాడు. తలుపులు బిగించి ఉండేవరకు వాడికి కోపం వచ్చింది. "ఎవడ్రోయ్ లోపల! తలుపు తీస్తారా, మిమ్మల్ని పచ్చడి చెయ్య మంటారా?" అని కేకవేశాడు.
ఈ కేకతో గుడ్డివాడికి మెలకువ వచ్చింది. గజ గజ వణుకుతూ చెమిటి వాడిని లేపి "విన్నావా కేక! రాక్షసి వచ్చాడు!" అన్నాడు.
"నాకు వాడి కేకలంటే లెఖ్ఖలేదు. నువ్వుఊరుకో నేను జవాబుచెప్పుతాను." అని, చెమిటివాడు రాక్షసిని దబాయించాడు: "ముందు ఎవడివోయి నువ్వు? హాయిగా నిద్రపోయేవాళ్లనివచ్చి లేపుతావు!"
"నేనా? రాక్షసుణ్ణి. ఇది నా యిల్లు. తలుపు తియ్యకపోతే మీ ప్రాణాలు తీస్తాను." అన్నాడు రాక్షసుడు.
"నువ్వు రాక్షసుడివైతే, మేము గీక్షసులం. ఏమనుకున్నావు? మేము రోజూ రాక్షసులనే తింటాము అన్నంలో." అన్నాడు చెమిటివాడు బిగ్గిరిగా. రాక్షసికి ఆశ్చర్యంవేసింది. "ఏమిటీ! మీరు రాక్షసుల్ని తినే గీక్షసులా? ఏదీ పొట్టచూపించండి నేను నమ్ముతాను" అన్నాడు రాక్షసుడు.
"అయితే కిటికీదగ్గరికిరా చూపుతాను." అన్నాడు చెమిటివాడు. రాక్షసి కిటికీదగ్గరకు వచ్చేవరకు గుడ్డివాడు చాకలిబాన తీసుకుపోయి కిటికీకి అడ్డం పెట్టాడు. రక్షసి ఆబాన తడివిచూసి, "అమ్మయ్యో! ఎంతపెద్ద పొట్ట! అయితే బాబూ మీ తలకాయకూడా చూపుతారా?" అని అడిగాడు రాక్షసుడు.
గుడ్డివాడు గాడిదను లాక్కువచ్చి కిటికీముందు నిలబెట్టాడు. రాక్షసుడు గాడిదతల తడివిచూసి 'బాబో' అనుకున్నాడు లోపల. కాని బయటికి కనపడనివ్వకుండా "బాబూ! మీ అరుపుకూడా కాస్తె వినిపిస్తారా?" అని అడిగాడు.
గుడ్డివాడు మూటలోఉన్న చీమల్నితీసి గాడిద చెవులో పోశాడు. గాడిదతల అల్లల్లాడించి బిగ్గరగా, చెవులు పగిలిపోయేటట్టు ఓండ్రపెట్టింది.
పాపం! రాకాసికి హడలుపుట్టి ఆ అర్ధరాత్రే అడివిలోకి పారిపోయాడు.