గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/జూలై 1928/కళింగదేశ గ్రంథాలయ సభ
కళింగదేశ గ్రంథాలయసభ
గంజాంజిల్లా భీమునిపట్నమున 18-5-28 తేదీ ఉదయం ఆంధ్రభారతీ తీర్థముయొక్కశాఖగ ఆంధ్రగ్రంథాలయసభ జరిగెను. విజయనగరం సబ్‌కలెక్టరుగా రగు వి. ఎస్. కుడ్వా ఐ. సి. ఎప్. గారధ్యక్షత వహించిరి. అడయారు కాలేజి యుపాధ్యాయులగు వి. ఎస్. శర్మగారు శాంతివిషయమై ముచ్చటించిరి. పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు విపులముగా నుపన్యసించుచు గ్రంథాలయముల ప్రస్తుతస్థితి - క్షీణదశలను గురించి వివిరముగా దెల్పిరి. గ్రంథాలయోద్యమనాయకులు సరియైన యభిమానముతోను పూనికతోను పనిచేయలేదనియు, బీరువాలలో బైండుపుస్తకము లుండుటతోనే సరిగాదనియు, వాటిని ప్రతివారును చదువవలెననియు, అట్టి యవకాశములు కల్పించి గ్రంథకర్తలకు తోడ్పడి మూలమూలలకు గూడ గ్రంథాలయ ప్రతిష్ఠాపనలకు గడంగవలయునని చెప్పిరి. మంగిపూడి శ్రీరామచంద్రశాస్త్రిగారు ఎట్టి గ్రంథములు గ్రంథాలయములలో నుండవలె నను విషయము - అవి వాడుకభాషలో నుండవలయుననియు, జనసామాన్యమునకు బోధపడవలెననియు, దేశోద్ధరణకు మూలముగ నుండవలెననియు, ప్రాచీన గ్రంథములన్నియు వాడుకభాషలో ద్విపదలో రచింపవలెననియు నుడివిరి. కుడ్వాగారు అవసరమగు పనిపై విజయనగరమునకు దయచేయుటచే తిత్తి బలరామయ్యగారు చివర కార్యక్రమము సాగించిరి. ఈ దిగువ తీర్మానములు అంగీకరింప బడెను.
(1) ప్రతిపట్టణములోను పల్లెలోను గ్రంథాలయములను పఠన మందిరములను స్థాపింపవలెనని యీ సభవారు ప్రజలను హెచ్చరించుచున్నారు.
(2) గ్రామ పురోభివృద్ధికి హేతుభూతంబులగు ధర్మగ్రంథాలయములకు గ్రాంటునిచ్చి తోడ్పడవలెనని జిల్లాబోర్డులను తాలూకా యూనియను బోర్డులను మ్యూనిసిపాలిటీవారిని యీసభవారు కోరుచున్నారు.
(3) ఇప్పుడు ప్రభుత్వమువారు గ్రంథాలయములకు గ్రాంటులిచ్చుచున్నారు. కాని రిజస్టరీ అయినవాటికే యిచ్చుచున్నారు. మిక్కిలి బీదస్థితిలో నున్న గ్రంథాలయములు రిజస్టరీచేయ నవకాశములేదు. కావున గ్రంథాలయముల నుచితముగా రిజస్టరీచేయ వేడుచున్నాము.
(4) కళింగ మండలములోనేమి తదితర మండలములలో నేమి ప్రజల యుపయోగార్థ మేర్పడియున్న ద్రవ్యవసతిగల గ్రంథాలయము లాంధ్ర భారతీతీర్థములో సభ్యత్వము (రూ, 2/- వార్షికముతో) పొంది ఆంధ్ర భారతీతీర్థము ప్రజలలో ఉన్నతజ్ఞానము ప్రచారము చేయుటకై చేయుచున్న ప్రయత్నములకు దోహదము చేయవలెననియు, అట్లు సభ్యులైన గ్రంథాలయముల పక్షమున ఆంధ్రభారతీ తీర్థపండితులు అవసరమైనపుడెల్ల ప్రచారకులుగా పనిచేయవలెననియు తీర్మానించడ మైనది.
(5) ప్రస్తుతము గ్రంథాలయములకు గవర్నమెంటువారును జిల్లా తాలూకాబోర్డులును మ్యూనిసిపల్ యూనియనులు గ్రాంటులిచ్చే సందర్భములో ప్రతిబంధకములుగా నున్న డిస్ట్రిక్టు ఎడ్యుకేషనలు ఆఫీసరు ఆమోదమును తీసివేయవలెననియు, గవర్నమెంటువారు జి. ఓ. రూపకముగా బహిష్కరించిన గ్రంథములు తప్ప తదితర గ్రంథముల విషయమున గ్రంథాలయములు తయారుచేసిన లిష్టుల ప్రకారము గవర్నమెంటువారు గ్రాంటు లీయవలెననియు నీసభవారు కోరుచున్నారు. (6) భారతీతీర్థపక్షమున గ్రంథాలయోద్యమము ప్రచారము చేయుటకు డిపార్టుమెంటును యేర్పరచవలసినదని తీర్మానించి అందుకు డాక్టరు బుర్రా శేషగిరిరావు (అధ్యక్షులు) తిత్తి బలరామయ్య (కార్యదర్శి) వి. ఎస్. శర్మ (అడయారు), జగన్నాథపాడీ, గిడుగు సీతాపతి, కోన వెంకటరాయశర్మ, తూముల కృష్ణమూర్తి, విద్వాన్ గంటి సోమయాజులు, కొండపల్లి జగన్నాథదాసు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగార్లు గల ఉపసంఘమును ఏర్పరచిరి.