గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/జూలై 1928
గ్రంథాలయ సర్వస్వము.
సంపు. 7 బెజవాడ - జూలై 1928. సంచిక 1.
ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము.
పూర్వచరిత్ర: కావలసిన అభివృద్ధి.
ఆంధ్రోద్యమము యొక్క ----- నొప్పు ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ పూర్వచరిత్రను సింహావలోకనముగ పరిశీలించినచో అందు కావలసిన యభివృద్ధికి సూచనలు గోచరించుటయే గాక మాతృదేశమును ప్రస్తుతకాలమున కలవరపెట్టుచున్న అనేక సమస్యలకు సమాధానము వచ్చుననుట నిశ్చయము.
ఈ యుద్యమము యొక్క పరమప్రాప్యము ప్రజల జ్ఞానాభివృద్ధి. ఈఫలప్రాప్తికొర కవలంబించవలసిన సాధనవిధానమును గూర్చి భేదాభిప్రాయము లుండుటకు తావులేదు. కావున ఇప్పుడు మనదేశమున పెచ్చుపెరిగిన కులకక్షలు, మతద్వేషములు, రాజకీయ పక్షముల ననుసరించి యుండెడి వైషమ్యములకును స్థానమీయక గ్రంథాలయముల పక్షమున ప్రథమదశయందు జరిగిన కృషియంతయు సర్వజన సమ్మతమై సర్వజన సహకారమును పొంది "సర్వేజనాస్సుఖినోభవన్తు" యను యార్యోక్తికి యుదాహరణమని చెప్పుటకు తగిన విధముగ ప్రవర్తించినది. అందుకే అప్పటి పల్లెటూరు గ్రంథాలయముల యందేమి, బస్తీ గ్రంథాలయముల యందేమి, వేరువేరు అంతరములు గలవారందరు ఏకత్ర సమావేశమై అన్యోన్యాభివృద్ధికి తోడ్పడుచుండిరి. అప్పటికాలము వేరు, ఇప్పటి దినములువేరు. అప్పుడు గ్రంథాల యోద్యమ మంతయు ప్రజాయత్తమైయుండి అందు కొరకు వెచ్చించబడిన ద్రవ్యమంతయు ప్రజలే యిచ్చుచుండిరి. అచ్చటచ్చట నుండు దేశసేవా పరతంత్రులందరును తమ శక్తియుక్తుల నన్నిటిని ఇందుకొరకై ధారవోయుచుండిరి. ఇప్పటికాలమున పూర్వకాలముకన్న ప్రజాసంస్థల సంఖ్య మిక్కిలి హెచ్చినది. దేశసేవకులలో కొందరు ఒక యుద్యమ మందును మరికొందరు మరియుక యుద్యమమునందును అభిమానము కల్గియున్నారు. మనదేశమున "కొత్తో వింత, పాతో రోత" అను సామెతకు ఉదాహరణము చాలవరకున్నది. కాబట్టి ఈకారణము లన్నిటిచేతను గ్రంథాలయసంస్థ పూర్వపు అభ్యున్నతి పదవినుండి జారి వెనుకటిశోభను గోల్పోయినది. కావున ఈయుద్యమము యొక్క పరమస్రావ్యమును గూర్చియు తత్సిద్ధికొర కవలంబించ వలసిన సాధన విధానమును గూర్చియు వర్తమాన దేశకాల పరిస్థితుల కనువుగ నుండునట్లు తిరిగి ఈకాలమున విమర్శించుట ముఖ్యావసర మైయున్నది.
మన మాతృదేవతారాధన కొరకై పలువురు పలువిధముల కృషిచేయుచు భారతజాతికి అభ్యున్నతిని సంపాదించుచున్నారు. ఇందు కొరకెన్నియో సంస్థ లుద్భవిల్లినవి. వీనికన్నిటికి మూలాధారము ప్రజల జ్ఞానాభివృద్ధి. చేతిలో బంగారమున్నచో నగలెన్నియో చేయించుకొనవచ్చును. అట్లే జ్ఞానమును.
మనదేశపు జనులలో నూటికి తొమ్మండుగురుమాత్రము చదువునేర్చినవారు. తక్కినవారందరు నిరక్షరకుక్షులు. ఈతొమ్మండుగురిలో కూడ అత్యల్పసంఖ్యాకులు మాత్రమే విద్యావంతులై తన్మూలమున నిజమగు సౌఖ్యమును పొందగల్గిన వారు. ప్రస్తుతము మనదేశపు విద్యాశాలలును, దొరతనము వారిచే స్థాపించబడిన గ్రంథాలయములును ఈ అత్యల్ప సంఖ్యాకుల జ్ఞానాభివృద్ధికొరకు మాత్రమే ప్రవర్తించుచున్నవి. మిగిలిన జనసామాన్య మందరిని గూర్చియు మన దేశమున ఎట్టి కృషియు జరుగుచుండుట లేదు. వీరల నందరి నుద్ధరించుటకొరకే ధర్మగ్రంథాలయోద్యమ మవతరించినది. మనదేశపు ప్రజలలో చాలమంది ప్రైమరీ పాఠశాల చదువుతో చాలించెడువా రున్నారు. మరికొందరు లోవరుసెకండరీ చదువుతో చాలించుదురు వీ రందరు పెల్లెటూండ్లయందును, బస్తీలందును ఏదియో సామాన్యపు వృత్తుల నవలంబించి జీవించువారై యున్నారు. వీరిలో పెక్కుమంది ధనములేనివారు. వీరికున్న కొద్దిచదువు అనర్థ హేతువుగా నున్నదిగాని లాభించుటలేదు. వీరికన్న ఎక్కువమంది విద్యాగంధ మేమియు లేనివారు. ఈ రెందుతరగతుల వారి జ్ఞానాభివృద్ధిని చేయగల ధర్మసంస్థలు స్థాపించుట ఆవశ్యకర్తవ్యము. ఈసంస్థలుఎవ్వి? వానిని నడుపగలవా రెవరు? వానికి సొమ్ము ఎచ్చటనుండి రాగలదు? అను ప్రశ్నలకు జవాబు నిర్ధారణ చేసికొనవలసియున్నది
ఈ సంస్థలు ఏవ్వి? యనునది మొదటిప్రశ్న.
పల్లెటూండ్ల వెంటను బస్తీల వెంటను వెళ్ళి ప్రజల కవసరమగు యంశములనుగూర్చి వారికి తెలియు విధమున యుపన్యసించగల సంచార భొధకులుండుట మొదటి యవసరము. వీరి యుపన్యాసములకు సాధకముగా నుండుటకు చులకనభాషలో వ్రాసిన కరపత్రముల ప్రచురించుటయు, మ్యాజిక్కులాంతరు సహాయమును చేకూర్చుటయు అవశ్య కర్తవ్యము.
ఇట్టి ప్రయత్నము నీమధ్య మన ఆంధ్ర విశ్వవిద్యాలయము వారు ఉద్యమించిరి గాని అది ఫలోన్ముఖమైనట్లు కనుపడదు. ఆంధ్ర గ్రంథాలయోద్యమ పక్షమున ఈపని ప్రారంభించి సాగించినచో మన ప్రజలయందు దట్టముగా వ్యాపించియున్న అజ్ఞానము నశించును. ప్రజల యజ్ఞానమునే యాధారము చూచుకొని వారివలన అన్యాయముగా ప్రాతినిధ్యమును సంపాదించు యుపద్రవము ఈమూలమున నిర్మూలము కాగలదు. ప్రజల యార్థికస్థితిని బాగుపర్చుకొను మార్గములు ఈమూలమున ప్రజల కలవడును. పరదేశముల స్థితిగతులును, అచ్చటి ప్రజలు అభివృద్ధి జందెడి సాధనములును ఈవిధానము ననుసరచి ప్రజలకు బోధించి ఆవిధముగ వారల నభివృద్ధికి దేవచ్చును. వెనుకటి తరగతివారికన్న కొంత విద్యాగంధము కల్గి తమంతట తాము విద్యాభివృద్ధి చేసికొనలేనివారు మరియొక తరగతివారు. వీరి యుపయోగము కొరకు తగిన కూడలి స్థానములందు తాత్కాలికపాఠశాలలు పెట్టవచ్చును. వీటిని ప్రతిదినము సామాన్య పాఠశాలలవలె నడుప నవసరములేదు. వారమునకు గంట మొదలు రెండు గంటలవర కుంచిన చాలును. ఆయాప్రాంతముల నుండు విద్యార్థుల యవసరములను బట్టియు అభిరుచులను బట్టియు బోధానాంశములను మార్చవచ్చును.
ఇక తమంతట తామే జ్ఞానాభివృద్ధి చేసికొన గలవారు మరియొక తరగతివారు. వీరల యుపయోగముకొరకు సంచార గ్రంథాలయ పేటికలును స్థాయి గ్రంథాలయములును స్థాపించవలసి యున్నది.
ఈ సంస్థలు నడుపువారెవరు?
తాత్కాలికపు పాఠశాలలను నడుపుటకు ఆయాప్రాంతములందు స్థాపించబడియుండు సెకండరీ పాఠశాలలయందలి ఉపాధ్యాయులు మిక్కిలి యుపకరింతురు. సంచారోపన్యాసకులను పంపుటయు కరపత్రములను ప్రచురణచేయుటయు, తాత్కాలిక పాఠశాలలో జరుగు విద్యాభ్యాసమును తగుపద్ధతుల నడుచునట్లు చేయుటయు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముయొక్క విధిగా నుండవలెను. అందు కనుబంధముగ జిల్లాసంఘము లుండవలెను. సంచార గ్రంథాలయ పేటికలను స్థాపించి గ్రామములవెంట త్రిప్పుట లోకలు బోర్డుల మూలమునను మ్యూన్సిపాల్టీలవల్లను జరుపవచ్చును.
పూర్వమువలె కేవలము ప్రజలనుండి ఈసంస్థకు ద్రవ్యము చేకూరదు. మరియు అనధికారులు మాత్రమే నడుపు సంస్థకు నిరంతర కృషి యుండవలెనన్న కొన్ని కట్టుదిట్టము లుండవలెను తప్పక వచ్చెడి ద్రవ్యాదాయ ముండవలెను. స్థానిక ప్రభుత్వమునుండియి స్థానిక స్వపరిపాలనా సంఘములనుండియు వచ్చెడి వార్షికవిరాళములచే ఈ గ్రంథాలయసంస్థలు నడుపుట యవసరము. కేవలము అప్పుడప్పు డిచ్చు యథేచ్ఛాదానముల మీదనే ఈసంస్థలు ద్రవ్యముకొరకై యాధార పడి యుండినచో పని తృప్తికరముగా జరుగదు. కాని అట్టి వార్షికవిరాళములు బంధకములై యుండగూడదు.
- -సూరి వేంకట నరసింహశాస్త్రి
గ్రంథాలయముల పలుకుబడి - అమెరికా దేశము
(డాక్టరు సుధీంద్రబోసుగారు)
అమెరికా దేశమందు పట్టణములయందేగాక పల్లెలయందు గూడ కలిసి పదునెనిమిది వేల గ్రంథాలయములు గలవు. ఈగ్రంథాలయములు ప్రభుత్వము వారిచేతను, వ్యక్తులవలననుగూడ నిర్వహింపబడుచున్నవి. మనదేశమందు మసీదులు, చెర్చిలు, దేవాలయములు కలసి ఎన్నిగలవో, అమెరికా దేశమం దన్నిగ్రంథాలయములు గలవు. అందుచేత వానికొరకై ఖర్చుపడుద్రవ్యము అసంఖ్యాకమైయున్నది.
మనదేశమందు గ్రంథాలయముల యుపయోగము కొలదిజనులకుమాత్రమే ప్రత్యేకింపబడి యున్నది. అమెరికా దేశమందలి గ్రంథాలయోద్యమమును గూర్చి చదువుకొనుటకై, ఐరోపా దేశమునుండి అనేకమందిని పంపుచున్నారు. మనదేశమునుండి ఎంతమందిని పంపినారు? అమెరికాదేశమందలి గ్రంథాలయము జనులందరియొక్క యుపయోగము నిమిత్తమును ఏర్పడినది. అందుచేత నిరోధములేమియు లేకుండ ఆదేశమందలి గ్రంథాలయములు జనులందరికిని అందుబాటులో నుండును. మానవుని విజ్ఞానమునకు ఆవశ్యకములైన శాస్త్ర గ్రంథములు, చరిత్ర గ్రంథములు మొదలగు అన్ని శాఖల గ్రంథములును వానియందు దొరకును. చదువరికి కావలసిన సదుపాయము లన్నింటిని గ్రంథాలయములు చేయుచుండును.
ఆదేశ గ్రంథాలయము లన్నింటియందును చదువుకొనుటకు ప్రత్యేకగదు లుండును. పరిశోధన చేయువారు ప్రత్యేకముగా పరి శ్రమచేయుటకుగాను ఏర్పాటులు చేయుదురు. అట్టివారికి ఒక్కసారి ఇరువదియైదు పుస్తకములవరకు ఎరు విచ్చెదరు.
ఆదేశమందు గ్రుడ్డివారికిగూడ ప్రత్యేక గ్రంథాలయములున్నవి. వారికి గదులను ప్రత్యేకించి, ఉబ్బెత్తు అక్షరములుగలిగిన గ్రంథములను వానియం దుంచెదరు. ప్రభుత్వమువారిచే నిర్వహింపబడుచు ఆదేశమందెల్ల అగ్రస్థానమును, ప్రపంచమందెల్ల మూడవ స్థానమును వహించియున్నట్టి కాంగ్రెసు జాతీయగ్రంథాలయమునందు ఆంధ్రులగు చదువరులకు పుస్తకములను ఇంటికిగూడ ఎరు విచ్చెదరు.
పట్టణ గ్రంథాలయములందును, పల్లె గ్రంథాలయములందును గూడ విద్యార్థికి వారమునకు 6 లేక 7 గ్రంథములను ఎరు విచ్చెదరు. గడువుకాలమునకు ఆగ్రంథములను తిరిగి ఇయ్యనియెడల రెండు లేక మూడుకాసులకు మించని జుల్మానాను విధించెదరు.
ఆదేశ గ్రంథాలయములందు పుస్తకములు పోవుట మిక్కిలి అరుదు. పుస్తకములు చదువరులు ఎత్తుకొని పోయెదరేమో యని గ్రంథాలయాధిపతులు అనుమానగ్రస్థులై యుండరు. అట్టి అనుమానముతో జూచుటవలన గ్రంథాలయములయందున్న "అమూల్యాఇశ్వర్యమును" చదువరులు ఉపయోగింప ఉత్సాహవంతులై యుండ రని వారి తలంపు.
ఆదేశగ్రంథాలయములు సాధారణముగా ఉదయము 8 గంటలుమొదలు రాత్రి 10 గంటలవరకు తెరచి యుంచబడును. శలవు దినములందు మాత్రము మధ్యాహ్నము 2 గంటలు మొదలు రాత్రి 10 గంటల వరకు తెరచెదరు.
గ్రంథాలయ మనగా గ్రంథములను సేకరించి యుంచుస్థానము గాదు; గ్రంథములను పాతిపెట్టు స్థలముగాదు; మిక్కిలి తెలివితేటలతో జనులకు గ్రంథములను ఉచితముగా పంచి యిచ్చు స్థలమునకే గ్రంథాలయ మని పేరు. తనతేజమును వ్యాపింపజేయునట్టిజ్ఞానజ్యోతి యేగ్రంథాలయము. అంతేగాని దుమ్ము కొట్టుకొనియున్న గ్రంథసంపుటములను భద్రపరచునట్టిది కాదు.
గ్రంథాలయములను జనులు ఉపయోగించుటకు గాను తగిన యభిరుచు గలుగునటుల ఆదేశ గ్రంథాలయాధిపతులు అనేకవిధములైన ఆకర్షణములను జూపెదరు; వారు ప్రకటించెదరు; పత్రికలను పంచిపెట్టెదరు; పలువిధములైన ప్రచారమును గావించెదరు. చిల్లర దుకాణములందు కొనునట్టివారిని ఆకర్షించుటకై, వారు కొనువస్తువులను చుట్టబెట్టుటకు గాను అట్టి ప్రకటనపత్రికలను ఉంచెదరు. సంచార గ్రంథాలయ పేటికలను పంపెదరు. అప్పు డప్పుడు గ్రంథముల నంపు శాఖల నేర్పరచెదరు.
ఆదేశమందు "ఫిలడెల్ఫియా" గ్రంథాలయములందు గ్రంథములను టెలిఫోను వార్తలమూలమున తెప్పించుకొనవచ్చును. రెండు వేలమైళ్ల దూరమునుండి యైన తెప్పించుకొన వచ్చును. అక్కడ గ్రంథాలయములయందు ఉత్తరములు వ్రాసికొనుటకు ప్రత్యేకమైన గదులు గలవు. చివరకు చుట్టలు కాల్చుకొనుటకు గూడ ప్రత్యేకమైన యేర్పాటులు గలవు.
ఐరోపాదేశమందు పదిసంవత్సరములకు తక్కువ వయస్సుగల బాలురు గ్రంథాలయముల నుపయోగింపరాదు. కాని అమెరికా దేశమందు పిల్లలను నిషేధింపలేదు. ఆదేశ గ్రంథాలయములందు పిల్లలకు ప్రత్యేకముగ "బాలశాఖలు" గలవు. గ్రంథ భాండాగారి వారికి అప్పు డప్పుడు కథలు - పురాణగాధలు - ప్రసిద్ధపురుషుల వీరకార్యములు - మొదలైనవానిని జెప్పుచుండును. అట్టివానిని చెప్పునప్పుడు ఆగాధలను సగముజెప్పి ఆపివేసి, కొన్నిపుస్తకములను వారియెదుట బెట్టి, ఆగాధలయొక్క మిగిలినభాగములను ఆపుస్తకములనుండి ఎవరికి వారు చదువుకొనునటుల జేయును.
గ్రంథాలయములపని ప్రత్యేకమొక శాస్త్రము. ఈపనియందు తరిబీతు చేయునట్టి పాఠశాలలు అనేకము లాదేశమందుగలవు. ఈ పేజి వ్రాయబడియున్నది.ఈ పేజి వ్రాయబడియున్నది.మనదేశ చరిత్రయం దీ సందిగ్ధ తరుణమందు గావలసినది గ్రంథాలయముల మూలమున జ్ఞానజ్యోతియొక్క ప్రకాశము.
దాసు త్రివిక్రమరావు గారు
అఖిలభారత ధర్మగ్రంథాలయ సంఘమునకు సంయుక్త కార్యదర్శియగు దాసు త్రివిక్రమరావు ఎల్. ఎల్. బి. బార్ - ఎట్- లా గారు హాలండుదేశమున జరుగబోవు అంతర్జాతీయ యువక మహాసభకు ఆంధ్రదేశ పక్షమున ప్రతినిధిగా పోయియున్నారు. ఆసందర్భమున వారిని అభినందించుటకు గాను బెజవాడయందు అఖిలభారత గ్రంథాలయ సంఘముయొక్కయు - ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముయొక్కయు - బెజవాడ యందున్న రామమోహనధర్మగ్రంథాలయము, దుర్గామల్లేశ్వర ఆంధ్రగ్రంథాలయము, కార్మిక గ్రంథాలయముల యొక్కయు ఆదరణక్రింద సభ సమావేశ మయ్యెను. ఫలాహారములైనపిమ్మట ఆంధ్రవిశ్వవిద్యాలయ వైసుఛాన్సిలరు కట్టమంచి రామలింగారెడ్డిగారి అధ్యక్షతక్రింద గొప్పసభ సమావేశమైనది. అధ్యక్షులు శ్రీత్రివిక్రమరావుగారిని అభినందించుచు వారి వైదుష్యమును దేశసేవాపరతంత్రతను, స్వార్థ పరిత్యాగమును, నిర్మాణదీక్షతను, సర్వతోముఖవిజ్ఞానమును ప్రశంసించిరి. జరుగనున్న మహాసభకు ప్రతినిధిగా యుండి భారతవర్షముయొక్క సందేశమును అచట ప్రకటించి మాతృదేశమునకు నానాజాతీయ సభ్యతయందు అర్హస్థానమును సంపాదించుటకు తగిన సమర్ధత త్రివిక్రమరావుగారికి అన్నివిధముల యున్నదని రెడ్డిగారు కొనియాడిరి. శ్రీ సూరి వెంకటనరసింహశాస్త్రిగారిచే చదువబడిన వినతిపత్రమును శ్రీ త్రివిక్రమరావుగారు అందుకొని, ఆమూలమున అఖిలభారతగ్రంథాలయ సంఘమువారును స్థానిక గ్రంథాలయ సంఘములవారును తమ కిచ్చిన గౌరవమువలన తానువిస్మితుడ నైతిననియు, అందులో తననుగూర్చి చెప్పబడిన యంశములకు తాను అర్హురుగా యుండునటుల కృషిచేయుటయే తన జీవితపర మార్థమనియు చెప్పి తన ఇతరదేశపర్యటనలో ఆయాదేశముల యందలి దర్మగ్రంథాలయోద్యమ విజృంభణను గూర్చి జాగ్రతతో పరిశీలించి, తన్మూలమున మాతృదేశమునకు హితోధికలాభమును జేకూర్చుటకు ప్రయత్నించెద నని విన్నవించిరి. వీరు తిరిగి వచ్చిన పిమ్మట ఆయాదేశములందు వారు సంపాదించిన అనుభవముల వలన భారత ధర్మగ్రంథాలయోద్యమునకు గొప్ప చేయూత దొరకగలదు.
గ్రామ గ్రంథాలయములు.
గ్రామములే దేశమునకు ఆయువుపట్టులు. పట్టనములయందలి జనులు ఎంత విద్యాధికులైనను, ఎంత నాగరికులైననూ దేశ మభివృద్ధి గాంచనేరదు. పట్టణవాసులతోబాటుగ పల్లెలయందుండు జనులుకూడ అభివృద్ధిపథము ననుకరింప గలిగిననేగాని జాతియొక్క వికాసము సంపూర్ణము గానేరదు. ఇది నిర్వివాదాంశము. కాని పల్లెలయందుండు జనులు విజ్ఞానులగుటకు గల మార్గమేమి? అక్కడక్కడ కొన్ని పల్లెలయందు ప్రారంభవిద్యను ఒసగునట్టి పాఠశాలలు గలవు. వానియందు కొంతమంది బాలురు విద్య నభ్యసించెదరు. కాని ఫలితమేమి? ఆకొద్దిమంది అభ్యసించునట్టి స్వల్పవిద్యయైన జాతీయ వికాసమునకేమైన దోడ్పడుచున్నదా?
అక్కడక్కడ గ్రామములందున్న పాఠశాలలయందు కొందరు ప్రారంభవిద్యను జదివెదరు. పిమ్మట ఏమిచేయుదురు? ఆస్వల్పవిద్యను ' కచేరీలకెక్కుట ' కు గావలసిన తరిబీతునందు వినియోగించెదరేకాని, పిమ్మట జ్ఞానాభివృద్ధిని జేసికొనుట కెంతమాత్రమును వినియోగింపరు. అందుచేత పిల్లలకేగాని పెద్దలకుగూడ జ్ఞానాభివృద్ధిని జేసికొనుటకుగాను గ్రంథాలయములు అత్యవసరములు. పాఠశాలలందు చదివిన విద్యయొక్క శేషమును వారిచట ప్రారంభించెదరు. ఇంతేగాక, మన పల్లెలయందు చదువుకొనజాలని జనులుగూడ విశేషముగ గలరు. నేటి గ్రంథాలయములు అట్టివారికిగూడ సహకారు లగుచున్నవి. చదువుకొన గలిగినవారు చదువుకొనజాలని వారికి గ్రంథములను చదివి వినిపించి; గ్రంథాలయములందు వారికి జ్ఞానమును ప్రసాదించు చున్నారు. ఇంతేగాక ఒక గ్రామమునందలి సమస్యలన్నియు గ్రంథాలయములందే పూరింపబడుచున్నవి. అందుచేత నేటి గ్రంథాలయములే గ్రామములయొక్క ఆయువుపట్టులు. వానిని మనము రక్షించి పోషించినగాని జాతియొక్క వికాసము సంపూర్తి గాజాలదు.
నైజాము రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ
సూర్యాపేటయందు మహావైభవముతో జరిగిన ఆంధ్రసభలలో గ్రంథాలయ మహాసభకు దేశభక్త వామననాయకుగారు అధ్యక్షత వహించిరి. వామన నాయకుగారు మిక్కిలి సమర్థతతోడను, ఉత్సాహముతోడను ఆంధ్రభాషయందే సభా కార్యక్రమమును జరిపిరి. గ్రంథాలయోద్యమమును నైజామురాష్ట్రములోని ఆంధ్ర జిల్లాలయందు వ్యాపింపజేయుటకుగాను ఒక ప్రచారకుని వేతనమునకై రు. 300 లు విరాళము నిచ్చెదమని అధ్యక్షులు వాగ్దానము జేసిరి. కేంద్రసంఘ యాజమాన్యమున నొక గ్రంథాలయ ఉపసంఘము ఏర్పరుప బడినది. ఈయుపసంఘమునకు శ్రీదేశభక్త నాయకగారు అధ్యక్షులుగ నుండ నంగీకరించిరి.
బరోడా గ్రంధాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంధాలయములకు విధ్యాశాఖ నుండియు లోకలుఫండునుండియు సహాద్రవ్యమిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయంలో పండ్రెండవభాగమును గ్రంధాలయోద్యమమునకై ప్రత్రేకించుటకును, ఈయుధ్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్కులరులను వెంటనే రద్దుచేయించ వలసినదనియు--హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంధాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృత గ్రంధము
బరోడా గ్రంథాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంథాలయములకు విద్యాశాఖ నుండియు లోకలుఫండు నుండియు సహాయద్రవ్య మిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయములో పండ్రెండవభాగమును గ్రంథాలయోద్యమమునకై ప్రత్యేకించుటకును, ఈ యుద్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్క్యులరులను వెంటనే రద్దు చేయించ వలసినదనియు - హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంథాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృత గ్రంథము లనుకూడ ఉంచవలయుననియు - దీనిని సెలవులలో మూయకుండ ఏర్పాటుల చేయవలయుననియు - గ్రంథాలయ సంబంధములగు సభలను ముందు ప్రభుత్వాధికారులు ఆపకుండ ఏర్పాటుల చేయవలసిన దనియు ప్రభుత్వమువారు ప్రార్థింప బడిరి.
కళింగదేశ గ్రంథాలయసభ
గంజాంజిల్లా భీమునిపట్నమున 18-5-28 తేదీ ఉదయం ఆంధ్రభారతీ తీర్థముయొక్కశాఖగ ఆంధ్రగ్రంథాలయసభ జరిగెను. విజయనగరం సబ్‌కలెక్టరుగా రగు వి. ఎస్. కుడ్వా ఐ. సి. ఎప్. గారధ్యక్షత వహించిరి. అడయారు కాలేజి యుపాధ్యాయులగు వి. ఎస్. శర్మగారు శాంతివిషయమై ముచ్చటించిరి. పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు విపులముగా నుపన్యసించుచు గ్రంథాలయముల ప్రస్తుతస్థితి - క్షీణదశలను గురించి వివిరముగా దెల్పిరి. గ్రంథాలయోద్యమనాయకులు సరియైన యభిమానముతోను పూనికతోను పనిచేయలేదనియు, బీరువాలలో బైండుపుస్తకము లుండుటతోనే సరిగాదనియు, వాటిని ప్రతివారును చదువవలెననియు, అట్టి యవకాశములు కల్పించి గ్రంథకర్తలకు తోడ్పడి మూలమూలలకు గూడ గ్రంథాలయ ప్రతిష్ఠాపనలకు గడంగవలయునని చెప్పిరి. మంగిపూడి శ్రీరామచంద్రశాస్త్రిగారు ఎట్టి గ్రంథములు గ్రంథాలయములలో నుండవలె నను విషయము - అవి వాడుకభాషలో నుండవలయుననియు, జనసామాన్యమునకు బోధపడవలెననియు, దేశోద్ధరణకు మూలముగ నుండవలెననియు, ప్రాచీన గ్రంథములన్నియు వాడుకభాషలో ద్విపదలో రచింపవలెననియు నుడివిరి. కుడ్వాగారు అవసరమగు పనిపై విజయనగరమునకు దయచేయుటచే తిత్తి బలరామయ్యగారు చివర కార్యక్రమము సాగించిరి. ఈ దిగువ తీర్మానములు అంగీకరింప బడెను.
(1) ప్రతిపట్టణములోను పల్లెలోను గ్రంథాలయములను పఠన మందిరములను స్థాపింపవలెనని యీ సభవారు ప్రజలను హెచ్చరించుచున్నారు.
(2) గ్రామ పురోభివృద్ధికి హేతుభూతంబులగు ధర్మగ్రంథాలయములకు గ్రాంటునిచ్చి తోడ్పడవలెనని జిల్లాబోర్డులను తాలూకా యూనియను బోర్డులను మ్యూనిసిపాలిటీవారిని యీసభవారు కోరుచున్నారు.
(3) ఇప్పుడు ప్రభుత్వమువారు గ్రంథాలయములకు గ్రాంటులిచ్చుచున్నారు. కాని రిజస్టరీ అయినవాటికే యిచ్చుచున్నారు. మిక్కిలి బీదస్థితిలో నున్న గ్రంథాలయములు రిజస్టరీచేయ నవకాశములేదు. కావున గ్రంథాలయముల నుచితముగా రిజస్టరీచేయ వేడుచున్నాము.
(4) కళింగ మండలములోనేమి తదితర మండలములలో నేమి ప్రజల యుపయోగార్థ మేర్పడియున్న ద్రవ్యవసతిగల గ్రంథాలయము లాంధ్ర భారతీతీర్థములో సభ్యత్వము (రూ, 2/- వార్షికముతో) పొంది ఆంధ్ర భారతీతీర్థము ప్రజలలో ఉన్నతజ్ఞానము ప్రచారము చేయుటకై చేయుచున్న ప్రయత్నములకు దోహదము చేయవలెననియు, అట్లు సభ్యులైన గ్రంథాలయముల పక్షమున ఆంధ్రభారతీ తీర్థపండితులు అవసరమైనపుడెల్ల ప్రచారకులుగా పనిచేయవలెననియు తీర్మానించడ మైనది.
(5) ప్రస్తుతము గ్రంథాలయములకు గవర్నమెంటువారును జిల్లా తాలూకాబోర్డులును మ్యూనిసిపల్ యూనియనులు గ్రాంటులిచ్చే సందర్భములో ప్రతిబంధకములుగా నున్న డిస్ట్రిక్టు ఎడ్యుకేషనలు ఆఫీసరు ఆమోదమును తీసివేయవలెననియు, గవర్నమెంటువారు జి. ఓ. రూపకముగా బహిష్కరించిన గ్రంథములు తప్ప తదితర గ్రంథముల విషయమున గ్రంథాలయములు తయారుచేసిన లిష్టుల ప్రకారము గవర్నమెంటువారు గ్రాంటు లీయవలెననియు నీసభవారు కోరుచున్నారు. (6) భారతీతీర్థపక్షమున గ్రంథాలయోద్యమము ప్రచారము చేయుటకు డిపార్టుమెంటును యేర్పరచవలసినదని తీర్మానించి అందుకు డాక్టరు బుర్రా శేషగిరిరావు (అధ్యక్షులు) తిత్తి బలరామయ్య (కార్యదర్శి) వి. ఎస్. శర్మ (అడయారు), జగన్నాథపాడీ, గిడుగు సీతాపతి, కోన వెంకటరాయశర్మ, తూముల కృష్ణమూర్తి, విద్వాన్ గంటి సోమయాజులు, కొండపల్లి జగన్నాథదాసు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగార్లు గల ఉపసంఘమును ఏర్పరచిరి.
ఆంధ్రగ్రంథాలయసభ - దక్షిణాది.
రామనాథపురం జిల్లా సాతూరు శ్రీవెల్లిపుత్తూరు తాలూకాల ప్రథమ ఆంధ్రగ్రంథాలయసభ సాత్తూరుగ్రామమున కమ్మవారి మందిరమున ది 24-6-28 తేదీ ఉదయం 8 గంటలకు సమావేశమైనది. రెండు తాలూకాలలోనిగ్రామపంచాయితీలు సంపాదించిన గ్రంథములు ప్రదర్శింపబడినవి. షుమారు 5 వేల గ్రంథములు 140 గ్రామపంచాయితులనుంచి ప్రదర్శనమునకు వచ్చినవి. ఆనరబుల్ వేమవరపు రామదాసు పంతులుగారు ప్రదర్శనమును తెరచిరి. ప్రదర్శనమునకు తేబడిన వివిధశాస్త్ర గ్రంథములను, పంచాయితుల పుస్తక భాండాగార వ్యాప్తికి చేయుచున్న కృషియు, పంచాయితీ ఆనరరీ ఆర్గనైజ రగు అళగిరిస్వామినాయుడుగారు పరిచయము చేసిరి. రామదాసుపంతులుగారు ప్రదర్శనమును తెరచుచు విద్యావ్యాప్తికి పాశ్చాత్య దేశములో పుస్తకభాండాగారోద్యమ మెట్లుపనిచేయుచున్నది తెలియజేసి, విద్యాభ్యాసము, బడులలో ముగిసిన తరువాత గ్రామపు బడులలో చదివిన చదువు మరచిపోకుండ పాఠశాల విడిచినతరువాత జనులలో సద్విద్యావ్యాప్తికి పుస్తకభాండాగారము లెట్లు యుపకరించునో వివరించి చెప్పిరి. సంచార పుస్తకభాండాగారములు బరోడా సంస్థానములో యెట్లు పనిచేయుచున్నవో తెలిపిరి. తూర్పుగోదావరిజిల్లా ఆలమూరు వాస్తవ్యులును సహకారోద్యమ నాయకులును అగు శ్రీయుత నరసింహదేవర సత్యనారాయణగారి యాధిపత్యమున పుస్తక భాండాగారసభ సమావేశమయినది. ఆహ్వాన సంఘాధ్యక్షులగు రామనాథజిల్లాచీఫ్ ఆనరరీ ఆర్గనైజరు ఆనందరావుగారు పంచాయితీ పుస్తకభాండాగారాభివృద్ధిగూర్చియు, ప్రజాసామాన్యమునకు పుస్తక భాండారములు విజ్ఞానవ్యాప్తికి యెట్లు తోడ్పడగలవో విశదీకరించిరి.
అధ్యక్షకోపన్యాసము ఆంధ్రమున యుపన్యసింపబడినది. ప్రతి వాక్యమును అరవమునకు తర్జుమాచేయబడినది. ఆంధ్రదేశమునుంచి సుమారునాలుగువందల సంవత్సరముల క్రితము వచ్చి అరవదేశములో నివాస మేర్పరచుకున్న ఆంధ్రులే యీ పంచాయితీ పుస్తకభాండాగారాభివృద్ధివ్యాప్తికి తోడ్పడుచున్నారు. అధ్యక్షులు వందనము లర్పించుచు పుస్తక భాండాగారోద్యమము ఆంధ్రదేశములో గత 25 సంవత్సరములనుంచి ప్రభుత్వయాదరణతో సంబంధము లేకుండగ జాతీయోద్యమ వ్యాప్తికి, జాతీయ ప్రబోధమునకు గ్రామసీమలలో యెట్లు కృషిసలిపినది వ్యాప్తిగాంచినది తెలియజేసిరి. ప్రాచీనకాలమున విజ్ఞానవ్యాప్తికి ప్రభుత్వమువారు విశ్వవిద్యాలయములు దేవాలయస్థాపకులు పుస్తకభాండాగారములను రాజనగరులలో విశ్వవిద్యాలయములందును దేవాలయములందు పెంపొందించి ఎటుల భద్రపరచెడివారో - పౌరాణికులు ఎట్లు పోషింపబడుచుండెడివారో - పౌరాణిక గ్రంథములు శాస్త్ర గ్రంథములు వ్రాయుటకు గ్రంథములు భద్రపరచుటకు ఎట్టి ఏర్పాట్లు కావింపబడెడివో - తాటియాకులు ప్రశస్థమైనవి, వ్రాయుటకు తగినవి భద్రపరచుటకు ప్రత్యేకముగ సేవకులు ఎట్లు పోషింపబడెడివారో - మొదలగు చారిత్రక విషయములను ప్రాచీన శాసనములలో యెట్లు వివరింపబడినది నిరూపించిరి. చదువను వ్రాయను నేర్వని వారలకుకూడ ఆధునిక కాలములో మ్యాజిక్కిలాంతర్లు బయస్కోపులు మూలమున యెట్లుప్రదర్శనమూలమున విజ్ఞానమునువ్యాప్తిచేయుచున్నారో - ప్రాచీన కాలమున ప్రజాసామాన్యమునకు చరిత్రాంశములు బోధించుటకు నైతికధర్మ వ్యాప్తికలుగజేయుటకు దేవాలయపు గోడలపై వ్రాయు చిత్తరువులను, బౌద్ధమఠములలోను, గుహలలోను చిత్రింపబడిన చిత్తరువులు, పడకటిండ్లలోను రాజమందిరములలోను అద్దములపై వ్రాయబడిన చిత్తరువులు, బొమ్మలాటలు, భాగవతకథలు, హరికథలు ప్రజాసామాన్యములో విజ్ఞానబోధనకు వివిధమార్గముల నన్వేషించి ఎట్లు ప్రచారము జరిగియుండెడిదో యుదాహరణపూర్వకముగ రుజువు చేసిరి. ప్రాచీన కాలమున ప్రతిగ్రామమున పౌరాణికులను పోషించి ధర్మగ్రంథపఠనమునకు ఎటుల హెచ్చరించి యుండిరో ఆరీతినే గ్రంథాలయములలో కేవలము పుస్తకములను సంపాదించుటతో మాత్రమే సంతృప్తిజెందక, నాలుగైదు పంచాయితులు కలసి పురాణవేత్తను నియోగించి, రైతులు తీరికగాయుండు కాలములో గ్రంథములు చదువుట, వార్తాపత్రికలు వినిపించుట మొదలగు కృషిసలుపుటకు పూనవలసినదిగా హెచ్చరించిరి. దేశ పురోభివృద్ధికి, జాతీయభావవ్యాప్తికి గ్రంథాలయము లెట్లు తోడ్పడగలవో వివరించి చెప్పిరి. పిమ్మట గ్రంథాలయ అభివృద్ధికి గావింపవలసిన పనులవిషయమై కొన్ని తీర్మానములు గావింపబడినవి.
శ్రీ సరస్వతీనిలయ గ్రంథాలయము
పొలమూరు - పశ్చిమగోదావరి జిల్లా.
ఈ గ్రంథాలయము 1913 సంవత్సరమున శ్రీ కొత్తపల్లి నరసింహముగారిచే స్థాపితమైనది. మొదట 150 గ్రంథములతో ప్రారంభింపబడి దినదినాభివృద్ధి గాంచినది. వారు అనేక వార్తాపత్రికలను గ్రంథములను తమస్వంత ద్రవ్యమును వ్యయపరచి రప్పించి చదువరుల కందించుచు పరోపకారార్థము మిక్కిలి దీక్షతో పాటుపడిరి. గ్రంథముల గృహములకు గొంపోయినవారు తిరిగి సరిగా నొసంగకపోవుటచే చాలభాగము గ్రంథము లంతరించినవి. మెంబర్లందరును చందాలు సరిగా నిచ్చు పద్ధతియే లేకపోయినది. ఈరీతిగా గ్రామవాసులకు ఉత్సాహము లేకపోవుటచే క్రమముగా క్షీణదశలోనికి వచ్చినది. ఇటీవల ఈగ్రామమందు గ్రామపంచాయితి స్థాపింపబడినది. దానికి శ్రీ కొత్తపల్లి నరసింహముగారే అధ్యక్షులుగ నున్నారు. ఈ గ్రంథాలయమును పంచాయితీవారి యాజమాన్యము క్రింద దీసికొని జయప్రదముగ నిర్వహించుచున్నారు.
రామమోహన గ్రంథాలయము.
ఘంటసాల, కృష్ణాజిల్లా.
ఈ గ్రంథ్హాలయము చాలకాలమునుండి పనిచేయుచున్నది. కాని ధనములేమిచే తృప్తికరముగా పనిచేయజాలకున్నది. కొంతకాలము క్రిందట యీ గ్రామసహకారపరపతిసంఘమువారి యాజమాన్యమున నిర్వహించుటకు తీసికొనబడినది. దీని లోకలు కోఆపరేటీవుయూనియనువారు యీ గ్రంథాలయమునకు రెండువందల రూపాయిలు విరాళ మిప్పించవలసినదిగా ప్రభుత్వవారికి సిఫార్సుచేసినారు.
స్వవిషయము.
భదవదను గ్రహమువలన "గ్రంథాలయసర్వస్వమును" తిరిగి ప్రారంభింప గలిగితిమి. మాసపత్రికగ వెలువడుచుండును. సంవత్సరమునకు చందా అందఱకును అందుబాటులో నుండునటుల రు 1 - 4- 0 లుగ ఏర్పరుపబడినది. గ్రంథాలయోద్య మాభిమానులందరును ప్రోత్సాహించెదరని ప్రార్థన.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.