గోవింద సుందర మోహన దీన మందార


   మోహన రాగం    త్రిపుట తాళం


ప: గోవింద సుందర మోహన దీన మందార

గరుడ వాహన భవబంధాది దుష్కర్మ

దహన భక్తవత్సల త్రిలోక పావన || గోవింద ||


చ 1: సతి సుతులపై ప్రేమ రోసితి సం

తతము మీపై భారమువేసితి

మదిలోన మిము కనులజూడగ నెంచి

మీదయ కెపుడెదురెదురు జూచితి || గోవింద ||


చ 2: చాల దినములనుండి వేడితినే

కాలహరణముచేసి గనలేనైతి

మేలు నీ నామము పాడితి

మేలుగా ముందటి విధమున వేడితి || గోవింద ||


చ 3: దీనరక్షకుడవని వింటిని నీ

కనికర మే తీరున గందును మానస

మున నమ్మియుందును నా

మనవి చేకొన వేమందును || గోవింద ||


చ 4: అధికుడవని నమ్మినందుకు ఆశ్ర

యించిన శ్రమబెట్టేదెందుకు మిము

పెతకి వెలిసే దెందుకు మాకిది

పూర్వకృత మనేటందుకు || గోవింద ||


చ 5: క్రోధాన వచ్చెను వార్థక్యము యిక

ప్రాపేది బహు సామీప్యము పదములు

విడనందు గోప్యమా మీరెపు

డు చూపెదరు స్వరూపము || గోవింద ||


చ 6: భద్రగిరియందు లేదేమొ యునికి

భక్తుల మొరవిని రావేమొ కరిగాచి

న హరివి గాదేమో రామ

దాసుని మొరవిని రావేమో || గోవింద ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.