గురుజాడలు/కవితలు/ముత్యాల సరములు



ముత్యాల సరములు

గుత్తునా ముత్యాల సరములు
కూర్చుకొని తేటైన మాటల,
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు జిమ్మగా.

మెచ్చనంటా వీవు; నీ విక
మెచ్చకుంటే మించిపాయెను;
కొయ్యబొమ్మలె మెచ్చు కళ్ళకు
కోమలుల సౌరెక్కునా?

తూర్పు బలబల తెల్లవారెను,
తోకచుక్కయు వేగుచుక్కయు,
ఒడయుడౌ వేవెల్గు కొలువుకు
వెడలి మెరసిరి మిన్ను వీధిని.

వెలుగు నీటను గ్రుంకె చుక్కలు;
చదల చీకటి కదలజారెను;
యెక్కడనొ వొక చెట్టుమాటున
నొక్క కోకిల పలుకసాగెను.

మేలుకొలుపులు కోడికూసెను;
విరులు కన్నులువిచ్చి చూసెను;
ఉండి, ఉడిగియు, ఆకులాడగ,
కొసరెనోయన గాలివీచెను.

పట్టమున పదినాళులుంటిని
కార్యవశమున పోయి; యచ్చట
సంఘ సంస్కరణ ప్రవీణుల
సంగతుల మెలగి,



యిల్లుజేరితి నాటి వేకువ;
జేరి, ప్రేయసి నిదురలేపితి;
“కంటివే నేనంటి, “మింటను
కాముబాణం బమరియున్నది.”

తెలిసి, దిగ్గున లేచి, ప్రేయసి
నన్నుగానక, మిన్నుగానక,
కురులు సరులును కుదురుజేయుచు
ఓరమోమిడ, బల్కితిన్.

ధూమకేతువు కేతువనియో
మోముచందురు గలిగి చూడడు?
కేతువా యది? వేల్పులలనల
కేలివెలితొగ కాంచుమా!

అరుదుగా మిను చేప్పరంబున
చొప్పుతెలియని వింత పొడమగ,
చన్నకాలపు చిన్నబుద్దులు
బెదరి యెంచిరి కీడుగా.

అంతేకాని రవంతయైనను
వంతనేగతి కూర్చనేర్చునె,
నలువ నేరిమి కంతు యిదియన
నింగితొడవయి వ్రేలుచున్ -

కవుల కల్పన కలిమి నెన్నో
వన్నె చిన్నెలు గాంచు వస్తువు
లందు వెఱ్ఱి పురాణ గాథలు
నమ్మ జెల్లునె పండితుల్.

కన్ను కానని వస్తుతత్వము
కాంచ నేర్పరు లింగిరీజులు;
కల్లనొల్లరు; వారి విద్యల
కరచి సత్యము నరసితిన్.



దూరబంధువు యితడు భూమికి,
దారిబోవుచు చూడవచ్చెను -
డబ్బ దెనుబది యేండ్ల కొక తరి
నరుల కన్నుల పండువై.

తెగులు కిరవని కతల పన్నుచు
దిగులు జెందు టదేటి కార్యము?
తలతు నేనిది సంఘసంస్కర
ణప్రయాణ పతాకగాన్.

చూడు మునుమును మేటివారల
మాటలనియెడి మంత్ర మహిమను
జాతిబంధము లన్న గొలుసులు
జారి, సంపద లుబ్బెడున్.

యెల్ల లోకము వొక్క యిల్లై,
వర్ణ భేదము లెల్ల కల్లై,
వేల నెరుగని ప్రేమబంధము
వేడుకలు కురియ.

మతము లన్నియు మాసిపోవును,
జ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును;
అంత స్వర్గసుఖంబులన్నవి
యవని విలసిల్లున్ -

మొన్న పట్ణము నందు ప్రాజ్ఞులు
మొట్ట మొదటిది మెట్టు యిది యని,
పెట్టినా రొక విందు జాతుల
జేర్చి; వినవైతో?

అంటి నేనిట్లంత ప్రియసఖి
యేమి పలుకక యుండు యొక తరి,
పిదప కన్నుల నీరు కారుచు
పలికె నీ రీతిన్.



వింటి, మీ పోకిళ్ళు వింటిని,
కంట నిద్దుర కానకుంటిని;
యీ చిన్న మనసును చిన్న బుచ్చుట
యెన్నికని యోచించిరో?

తోటి కోడలు దెప్పె, పోనీ;
సాటివారోదార్చె, పోనీ;
మాటలాడక చూచి నవ్వెడి
మగువ కేమందున్.

తోడు దొంగని అత్తగారికి
తోచెనేమో యనుచు గుందితి;
కాలగతియని మామలెంతో
కలగ సిగ్గరినై.

చాలునహ! మీ చాకచక్యము.
చదువుకిదె కాబోలు ఫలితము!
ఇంత యగునని పెద్దలెరిగిన
యింగిలీషులు చెపుదురా?

కోట పేటల నేలగలరని
కోటి విద్యలు మీకు కరపిరి;
పొట్ట కూటికి నేర్చు విద్యలు
పుట్టకీట్లు కదల్చెనా?

కట్టుకున్నది యేమి కానీ;
పెట్టి పొయ్యక పోతె, పోనీ;
కాంచి పెంచిన తల్లిదండ్రుల
నైన కనవలదో?

కలిసి మెసగిన యంత మాత్రనె
కలుగబోదీ యైకమత్యము;
మాల మాదిగ కన్నె నెవతెనొ
మరులుకొన రాదో?

అనుచు కోపము నాపజాలక
జీవితేశ్వరి సరులు నామై
చేరచి చనె క్రొమ్మెరుగు చాడ్పున
మనసు వికలముగాన్.

తూర్పు బల్లున తెల్లవారెను;
తోకచుక్క యదృశ్యమాయెను;
లోకమందలి మంచి చెడ్డలు
లోకు లెరుగుదురా?

("ఆంధ్రభారతి” 1910 జూలై)