చిత్తరువని చూడ
రాగము, శంకరాభరణము- తాళము, మిశ్రజాతి చాపు
పల్లవి
చిత్తరువని చూడఁ జిత్తము గొంటివి |
చిత్తజు నపరంజి - చిలుక యెవ్వతెవే ||
అనుపల్లవి
వత్తువొ నా మ్రోల - వలరాజు వేఁడిన |
మత్తకాశిని నీదు - మనమైన నీగదె ||
చరణములు
1. ఇచ్చి పుచ్చుకొంట - యిలలోని మర్యాద |
ముచ్చిలి మౌనము - మెచ్చుదు రటవే |
వచ్చి చూచినంత - వంచనఁ జేయుదె |
పచ్చి దొంగతనము - పడతిరొ పరువె ||
2. మనసులేని తనువు - మరి యేలనే నాకు |
చెనటి దీనిఁగూడ - చేకొనఁ గదవె |
వానికి బదు లొక్క - వాక్కు నే వేఁడెద |
మానిని యీపాటి - మన్నింపఁ జెల్లునె ||
3. విలువ చాలదన్న - విరివిల్తుపై నాన |
కలుగు జన్మములఁ - గానుక కొనవె |
ఎలమి నానందేంద్రు - నేలిన వెన్నుఁడు |
పలు తెఱఁగుల మేలు - పడతి నీ కిచ్చునె ||
(ఈ ఆరు పాటలు "నీలగిరి పాటలు” అనే చిన్న పుస్తకంలోనివి. ఈ పుస్తకం 1907లో అచ్చయింది. రీవా మహారాణి అప్పుల కొండయాంబ 'అనుజ్ఞ'తో ఈ ఆరు పాటలు రాసి ఆనంద గజపతి స్మృతికి అంకింతం చేశారు గురజాడ. ఈ పాటలను ఆయన Songs of the Blue Hills పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. తెలుగు మాతృక, ఇంగ్లీషు అనువాదం ఒకే పుస్తకంగా అచ్చయ్యాయి. -సం||)