కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల/పీఠిక

పీఠిక

వివిధములైన వస్తుసముదాయము నొకచోట చేర్చి వాటిని తగురీతిలో పరిశోధించుటకు, చూచి ఆనందించుటకు ఏర్పాటైన ప్రదేశమును వస్తుప్రదర్శనశాల (మ్యూజియం)[1] అని పిలుతురు. ఈ వివిధ వస్తువులు ఒకే ప్రదేశమునకుగాని, వివిధ ప్రదేశములకుగాని చెందియుండవచ్చును. అటులనే ఆ వస్తు సముదాయము ఒకే నాగరికతకుగాని, విభిన్న నాగరికతలకు, అనేక శతాబ్దములకు చెందినవై కూడ ఉండవచ్చును. కాని మన మేర్పాటు చేయు మ్యూజియం యొక్క ముఖ్యోద్దేశమును బట్టి వస్తుసేకరణ జరుగుట సమంజసము. పెద్ద మ్యూజియంలు, అనగా రాష్ట్రస్థాయికి, దేశస్థాయికి చెందినటువంటివి, వివిధ రకములైన వస్తువులు, వివిధ నాగరికతలకు, అనేక శతాబ్దములకు చెందినవాటిని సమకూర్చుకొనవచ్చును. కాని కొలనుపాక మ్యూజియంవంటి ప్రాదేశిక లేక స్థానిక మ్యూజియంలు (Site Museums), ఆ ప్రదేశమునకు, లేక కొంత చుట్టు ప్రక్కల ప్రదేశములకు చెందిన వస్తువులను సేకరించి భద్రపరచి ప్రజాబాహుళ్యమునకు అర్థమగు రీతిలో చూపించుటకు ప్రయత్నించుట సమంజసము. కొలనుపాక గ్రామానికి చుట్టుప్రక్కల ఇప్పటికినీ అనేక పురావస్తు శిధిలావశేషములు మనకు కనిపించుచున్నవి. అట్టివానిలో సేకరించిన అనేక శిలావిగ్రహములు, శాసనముల నొకచోట చేర్చి మ్యూజియంగా నేర్పాటుచేయబడినది.

చారిత్రక యుగమునుండీ కొలనుపాక ప్రఖ్యాతిలోనికి వచ్చినదనుటకు దృష్టాంతములు కలవు. జైన మతానుయాయులకు కొలనుపాక ఒక పవిత్ర యాత్రాస్థలము. ప్రస్తుత మిచ్చట శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైనదేవాలయము నిత్య పూజారాధనలతో విలసిల్లుచున్నది. దీనిని దర్శించుటకు దేశపు నలుమూలలనుంచీ యాత్రికులు ఇప్పటికిని ప్రతినిత్యమూ వచ్చుచున్నారు. ఇదిగాక ఇచ్చట అనేక శైవమఠములు ఇతర దేవాలయములు కలవు. అందు సోమేశ్వరస్వామి వారి ఆలయ మొకటి. చాళుక్య, కాకతీయ వంశములు ఇచ్చట తమ ప్రాబల్యమును చూపినవి. ఆ కాలమునాటి శిల్పములు, శాసనములు, ఈ గ్రామము చుట్టుపట్ల దొరకినవి. ఆ తరువాతి కాలమునకు చెందిన శిల్పములు కూడ ఇచ్చట దొరకినవి. వీటినన్నింటిని చేర్చి ఈ మ్యూజియంను ఏర్పచిరి. ఇచ్చట నెలకొనియున్న సోమేశ్వరస్వామి వారి దేవాలయ ముఖ మంటపము నందు ఈ మ్యూజియమును చక్కగా నమర్చి యున్నారు.

మ్యూజియము నందు వస్తునిర్దేశన, వాటిని గురించిన విపుల వాఖ్య చేయుదురు. అందువలన ప్రతి ఒక్కరికి ఆయా వస్తువుల యొక్క లేక కళాఖండముల యొక్క ప్రత్యేకతను గుర్తించుటకు వీలగుచున్నది. ఈ విధముగా ఇచ్చటి శిల్పముల నామము, వాటిని ఎచ్చట నుండి సేకరించినది, ఏకాలము నాటివి, మొదలగుగా గల విశేషములను విపులకీరించి యున్నందు వలన ప్రేక్షకులయందు జిజ్ఞాసను రేకెత్తించును. ఇచ్చట పరిపాలించిన వివిధ రాజ వంశములు, అప్పటి శిల్ప కళారీతులు మొదలుగాగల విషయముల గురించి క్షుణ్ణముగా పరిశీలించు ఆసక్తిని చూపుదురు.

మ్యూజియంనందు ప్రదర్శింపబడు వస్తువులను గూర్చి తెలుసు కొనుటకును, వాటిపై విపులముగా పరిశోధించుటకును మంచి వాతావరణము, అనుకూల పరిస్థితులు ఏర్పరచవలయును. అప్పుడే ఆ మ్యూజియంను దర్శించు ప్రజల సంఖ్య అధికమగును. ఆ మ్యూజియం యొక్క పేరు పైకి వచ్చును. ఆ విధముగా చూచిన కొలనుపాక మ్యూజియంకు కొన్ని ప్రత్యేక అనుకూల పరిస్థితులు కలవు. ఇది ఇచ్చట సోమేశ్వర స్వామి వారి దేవాలయ ముఖ మంటపమందు ఏర్పరచబడినందున కలిగినది. ప్రస్తుతః ఈ దేవాలయము పశ్చిమ చాళుక్యుల కాలమునాటిది. అనగా క్రీ. శ. 11 లేక 12 శతాబ్దము నాటిది. ఆపైన ఈ దేవాలయము ఇప్పటికినీ పూజా పునస్కారముల నందుకొను చున్నది. అందువలన ఎల్లవేళల దైవ దర్శనమునకై ప్రజలు వచ్చు చున్నారు. ఈ దేవాలయ సమీపముననే గల శ్వేతాంబర జైన దేవాలయమునకు దేశపు నలుమూలలనుంచీ యాత్రికులు ఎల్లవేళలా తీర్థప్రజగా వచ్చు చున్నారు. ఆ వచ్చిన వారందరూ సామాన్యముగా సోమేశ్వర స్వామి వారి దేవాలయమును, అచ్చట మ్యూజియంను చూచుటకు వచ్చెదరు. పూర్వకాలమున ఇది రాజ ప్రతినిధి స్థావరము.[2] అందువలన చరిత్రకు సంబంధించిన అనేక విషయములు ఇచట లభ్యమగుచున్నవి. ఆ విషయముల గిరుంచి తెలుసుకొనగోరి చరిత్ర పరిశోధన చేయుటకై పరిశోధకులు వచ్చుచున్నారు. శిల్ప విశేషములను, అందలి ప్రాంతీయ విభేదములను పరీక్షించుటకు ఎక్కువ అవకాశము కలదు. సోమేశ్వరస్వామి వారి దేవాలయ శిల్పములు, కుడ్య ప్రతిమలతో కలిసిపోయి యున్న మ్యూజియం శిల్పములు చూచిన మనకు మిక్కిలి ఆనందము కలుగును. ఈ అనంత కాల స్రవంతిలో అనేక మంది మహారాజులు, రాజులు, ధనవంతులు, ఒక్కరననేల ప్రతి ఒక్కరూ, తమకు తోచినంత, తమ అంతస్తుకు తగినటుల ఇక్కడ నెలకొనియున్న అనేక దేవాలయములకు, మఠములకు వివిధ కైంకర్యములు చేసి నటుల ఇచ్చట అనేక శాసనములు తెలుపుచున్నవి. ఎక్కువ శాసనముల వలన ఇచ్చట అంబిక దేవాలయమునకు అనేక కైంకర్యములు చేసింటుల తెలియుచున్నది.[3] చాళుక్య, కాకతీయ ప్రభువులు ఈ దేవతకు అనేక కైంకర్యములు చేసిరట. స్వామివారికి ఎనలేని కైంకర్యములు చేసిరి. కొన్ని సుంకములను దానము చేసిరి. క్రీ. శ. 12 వ శతాబ్ధి అంతమునుండి మాత్రము జైనమత ప్రాబల్యము చాలవరకు తగ్గిపోయినటుల శాసనాధారములు కనుపించు చున్నవి. బహుశ: ఇది శైవమత ప్రాబల్యము వలన కలిగియుండ వచ్చును. అంబిక దేవాలయ వినాశము గూడా ఈ మత వైషమ్య ఫలితమై యుండవచ్చును.

భారతీయ శిల్ప శైలులను గురించి వ్యాఖ్యానించుచూ ఆచార్య రాధా కమల్ ముఖర్జీ పండితుడు ఈ విధముగా చెప్పినాడు. మన దేశమందు కనిపించు శిల్ప సంపద యావత్తూ మన భావనా జగత్తుకు, కల్పనా చాతుర్యమునకు గీటురాళ్ళు.[4] యుగ యుగములుగా వచ్చుచున్న వేదాంత పాఠము గాని, యోగాచారములు గాని ప్రజలలో భారత ప్రజలంతా ఇకటేనని గ్రహింపు కలిగించ జాలరు. కాని కాకతీయ శిల్ప కళా ఖండులను తరచి చూచిన కొద్దీ మనకు ఒకటే ఊహ కలుగును. వివిధ శైలులందు ఏకత్వము గోచరించును. అందువలననే కావచ్చును వివిధ మనములవారు, వివిధ భాషలను మాటలాడువారు అందరు కూడ ఈ మ్యూజిమంను చూచుటకు విచ్చేయు చున్నారు. వీరు అందరూ సోమేశ్వరుని మీది భక్తి తత్పరతతోనే ఇచ్చటికి వచ్చుట లేదు. ఎక్కువ మంది ఇచ్చట ఒక చోట చేర్చబడియున్న అనేక శిల్పములను చూచి ఆనందించుటకై కూడ వచ్చు చున్నారు. ఈ విధముగా చూచిన భారతీయులందు గల విభిన్నత్వమందలి ఏకత్వము (సమైక్యతా భావన) కనుపించు చున్నది.[5] హిందూ విగ్రహ నిర్మాణము అనేక ఆగమ సూత్రములతో ముడిపడి యున్నది. అందువలన మన స్థపతి (విగ్రహ నిర్మాణకర్త) తన శిల్పనాచాతురినంతనూ ఈ ఆగమ సూత్రములకు లోబడియే చేయవలసియున్నది. కనుకనే స్థపతి ప్రతిమా లక్షణములను విస్తృత పరచుటయందు, వాటిని అలంకారముతో శృంగారించుట యందు తన ప్రతిభను ప్రజ్ఞాపాటవమును చూపించినాడు. రేఖా సూత్రములకు ప్రాథాన్యమిచ్చిన మన స్థపతి అవే సూత్రములద్వారా అతి సుందరమూ, సౌకుమార్యము కలిగిన శిల్పములను తయారు చేసి నాడు.

మ్యూజియం ద్వారా విజ్ఞాన సముపార్జన చేయుట యనునది ఈ శతాబ్దపు నినాదము. ఈ నినాదము నిజము కావలెనన్న, ప్రతి వస్తువునకు దానిని గురించిన పూర్తి విపులీకరణ యుండవలయును. అందు కనుగుణముగా ఈ మ్యూజియంనందు వస్తు వివరణ జరిగియున్నది. ఇదియే ప్రేక్షకునియందు విషయ పరిజ్ఞానమునకై ఆసక్తిని దృఢతరము చేయును.


-<•>-

  1. ప్రదర్శనశాల అను పదముకన్నా 'మ్యూజియం' అను పదము ప్రజాబాహుళ్యమునకు తేలికగా అర్థమగును గాన 'మ్యూజియం' అను పదమునే ఇక మీద వాడుదును.
  2. మనకు తెలిసినంతవకూ కళ్యాణి చాళుక్యుల కాలము వరకూ ఇది రాజప్రతినిధి స్థావరము. కాకతీయుల కాలము నుంచీ మాత్రమే ఇది రాజప్రతినిధి స్థావరము కాదు.
  3. అంబిక జైనుల ఇరువది నాలుగవ తీర్థంకరుడైన మహావీరుని శాసన దేవత. ఈమె మామిడిపళ్ల గుత్తిని చేతియందు ధరించి, తన ఇరువురు కుమారులతోను, సింహము రూపు ధరించిన తన భర్తతో పరివేష్టించియుండును.
  4. రాధా కమల్ ముఖర్జీ:.... ప్లవరింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్.
  5. గాంధార శిల్ప సాంప్రదాయము. మధుర శైలి. అమరావతి, నాగార్జునకొండ మొదలగునవి చాళుక్య, కాకతీయ శైలులు అన్నీ కొన్ని విభిన్నరీతులను సంతరించుకొన్నను, లోతుగా చూచిన మనకు తెలిసినది ఒకటే. వివిధ శైలులు వేరు వేరు గాక, ఒక దానినుంచి కొంత గ్రహించి నూతన పోకడలను సంతరించుకొని తమ ప్రతిపత్తిని నిలుపుకొన్నవి అని మాత్రమే.