కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల/తొలిపలుకు

తొలిపలుకు


ఈ కాలములో ప్రదర్శనశాలలు వింత వస్తువులను చారిత్రక అవశేషములను సమీకరించియుంచు గిడ్డంగులు వలెకాక వాటికొక అర్ధమునిచ్చి ప్రజలకుపయోగపడు రీతిలో వస్తువులను అమర్చి చూపవలయును. విద్యార్థులకు వారి విద్యావ్యాసంగములోను, విద్వాంసులకు వారి వారి వ్యాసంగములందు హితోదిక సహాయముచేయు విధముగా మన వస్తుసేకరణ వాని నమర్చు విధానములలో క్రొత్త క్రొత్త పోకడల ననుసరించి సహాయ పడవలయును. ఇవికాక గైడు పుస్తకములు కరపత్రములు, బొమ్మల పోస్టుకార్డులు తయారుచేసి మ్యూజియంను చూడవచ్చిన వారికి పంచిపెట్టుటద్వారా మన మ్యూజియం గురించి ప్రజా బాహుళ్యములో కొంత ఆసక్తియును శ్రద్ధను, కలిగించవచ్చును. తరచుగా మార్పులు చేర్పులు చేయుటద్వారా, ప్రతి వ్యక్తి అనేక మారులు మ్యూజియంను దర్శించుటకు దోహదము చేయవచ్చును.

కొలనుపాక మ్యూజియంను చూచుటకు అనేక మంది వివిధ తరగతుల వ్యక్తులు వచ్చుచున్నారు. వారందరూ ఇక్కడి స్థలప్రాశస్త్యమును గురించీ, మ్యూజియం నందలి వస్తు నిర్దేశన గురించి ఒక గైడు పుస్తకము బహుధా అవసరమని భావించి కోరినందున, ఈ పుస్తకమును రచించుట కవకాశము కలిగినది.

ఈ పుస్తకమును వ్రాయమని ప్రోత్సహించి, దానిని తయారుచేయునపుడు అనేక సలహాలనిచ్చి చేయూతనిచ్చిన మా డైరక్టర్ శ్రీ ఎన్. రామేశన్, ఎమ్‌. ఎ., పి. హెచ్. డి., ఐ. ఎ. ఎస్. గారికి సర్వదా కృతజ్ఞుడను.

మా డిప్యూటీ డైరక్టర్ అయిన శ్రీ నారాయణమూర్తిగారికి, అసిస్టెంట్ డైరక్టర్ అయిన కుమారి లలితగారికి వారి సహకారమునకు నా కృతజ్ఞతలు. ఈ తెలుగు సేతను ఆ మూలాగ్రము పరిశీలించి వలయుచో సవరణల గావించి దీనికొక రూపము కలిగించిన మా డిప్యూటీ డైరక్టర్ శ్రీ పరబ్రహ్మశాస్త్రిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా సహచరులు, మిత్రులైన శ్రీ అవధాని గారికి (గైడ్ లెక్చరర్), శ్రీ జోగినాయుడు (అసిస్టెంట్ క్యూరేటర్) గార్లు ఎంతో సహకరించిరి. వారికి సర్వదా కృతజ్ఞుడను. మా చీఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీ సుబ్రహ్మణ్యంగారు, ఈ మ్యూజియంకు సంబంధించిన ఫోటోలను సకాలములో అందించినందుకు నా కృతజ్ఞతల నిచ్చుచున్నాను.


ఎస్. రమాకాంతం

4-3-76