కొప్పరపు సోదర కవుల కవిత్వము/రాజాలోకము
రాజా లోకము
గుంటూరు డిస్ట్రిక్టు కోర్టు సెషన్సు జడ్జిగారగు మహారాజశ్రీ ఎఫ్.ఏ. కొల్రిడ్జి గారు 22-1-1920న ప్రస్తుతపు ప్రభువులగు మహారాజరాజశ్రీ శ్రీరాజా బొమ్మ దేవర నాగన్న నాయుఁడు బహద్దరు జమీందారు గారికి వ్రాసి పంపిన యింగ్లీషు లేఖకుఁ దెలుఁగు.
ఇంగ్లండు నందుదయించి న్యాయాధిప
తిత్వాప్తి నిండియాదేశమందు
నర్హపర్యటన కార్యంబొప్ప న్యాయ స
భాస్థానముల న్యాయవాదులెన్న
న్యాయనిర్ధారణంబాచరించుచు దేశ
చరిత వ్రాయుచునుండు జనవరుండు
గుణసమగ్రుఁడు ఎఫ్. ఎ. కోల్రిడ్జి డిస్ట్రక్టు
సెష్షన్సు జడ్జి విస్తీర్ణబుద్ధి
మీ తండ్రిగారును మీరును బహువిధా
తిథ్య సంతృప్తులందించుకతన
పులుల వేఁటల సివంగుల షికారుల నతి
స్నేహానురాగముల్ నెఱుపుకతన
నితరేతరక్షేమ మెఱుఁగ నప్డప్డు లే
ఖాప్రతిలేఖలు గడపుకతన
పార్ధివోత్తముఁడౌ భవత్పితృమరణవా
క్యము విని గడుఁజింతఁగంటిననియు
నాప్తుండుసనినట్టు లస్మత్సతీసుతు
లాత్మవిచారంబు నందిరనియు
మీతండ్రిగారు ప్రేమించి యిచ్చిన వస్తు
రాజముల్ మఱవంగరానివనియు
ధనమువలెన్ వ్యాఘ్రదంష్ట్ర చేయించి యి
చ్చినకత్తిఁ బ్రీతిఁదాఁచితిననియును
నేర్పునోర్పు నెసంగఁదీర్పించి యిడిన యం
దపుఁగఱ్ఱఁ జేపట్టినాఁడననియు
నల్లకొమ్ములచే నొనర్పంగఁబడిన మే
జా, గదినుంచె మత్సతియనియును
మీజనకుండన మేదిని విస్మయ
ప్రదుఁడైన మానవ ప్రవరుఁడనియు
ఎస్టేటు లేనిచో నింజనీయరు ఖ్యాతిఁ
బడయంగఁదగు మహా ప్రజ్ఞుఁడనియు
నిరువదియేను వత్సరము లీయిండియా
తిరిగితిఁ దత్తుల్యు నెఱుఁగననియు
నిమ్మహా గాంభీర్య మిట్టి సామర్థ్యంబు
పరులయందెందుఁ గన్పట్టదనియు
నింతటి పరిపూర్ణు నెందు ద్వితీయుఁగా
లెక్కింప సమకూర లేదనియును
నఖిలసామాన్య కృత్యములకూనక జనా
ద్భుతకార్యములఁ దీర్చు ప్రోడయనియు
మత్సతీసుతులేసు స్మరియింతు మనిశమ
య్యధిపునాతిథ్య మర్యాదలనియు
విజయనగర ధరా విభులందుఁ బూర్వ భూ
వరవర్యునిం బోల్పవచ్చుననియు
నల్పసంఖ్యగల శ్రేష్ఠవనీశ్వరుల మ
త్పరిచితులం బోల్ప వచ్చుననియు
హైదరాబాదు ప్రయాణపు మర్యాద
నిరతంబు సంస్మరణీయమనియు
నగపడు మత్కృతంబగు నిండియా చరి
త్రను భవజ్జనకు నుదంతమనియు
మీరు మీసోదరుల్ మీరాజ్య మిప్డిప్డు
విభజింపఁబూనుట వింటిమనియు
ఆప్రయత్నముమాని యన్యోన్యమైత్రి రా
జిల్ల రాజ్యమున్‌వృద్ధి సేయుఁడనియు
కాదని విభజింపఁగా బూనిసేయఁ ద
దున్నతికిన్ లోప మొదవుననియు
మీ యోగ్యగుణములు మీ కుటుంబోన్నతుల్
భావదృష్టులఁజూడ వలయుననియు
నద్భుత పురుషులైనట్టి మీపూర్వుల
సచ్చరిత్రల స్మృతి సల్పుఁడనియు
నఖిలోపకారులై యాశ్చర్య చర్యులౌ
ప్రాచీనులఁ దలంపవలయుననియు
శ్రేష్ఠులౌ పూర్వుల స్మృతికైన ప్రాణ స
న్నీభమైన రాజ్యంబు నిల్పుఁడనియు
శ్రీ సికిందరు బాదులో సౌధములను గ
ల్పించిన నృపులు మీ పెద్దలనియు
భయదమౌనచటి సిపాయిల యల్లరిఁ
బాపినవారు మీవారెయనియు
నొకమాఱు వేఱయియున్న రాజ్యంబు వే
ఱొకమాఱు కలయిక నొందదనియు
మీ పూర్వరాజ్యంబు మీ పూర్వులయశంబు
రక్షింపమీరే భారకులరనియు
బలమన నొండొరుల్ కలిసియుండుటయను
సామెత నమ్మిన క్షేమమనియు
అతినూత్న నియమకార్యముల సల్పిరి ప్రజా
ప్రియులైరి మీతొంటి విజ్ఞులనియు
నవసరంబైనచో నరుదెంచిభేద హే
తువెఱింగి మైత్రిగూర్తుఁదగననియు
మామకదృష్టి యస్మత్సతీసుతుల చూ
పెపుడు మీమీక్షేమ మెంచుననియు
నేలిఖించిన లేఖ నీక్షింపఁ జేయుఁడీ
దయచేసి మీ సహోదరులకనియుఁ
బరఁగుప్రీతిని గుంటూరు పురమునుండి
యనుపులేక భవత్సువంశాధికతలఁ
దెలిపెఁ దెలుపుచునుండెను దెలుపునింక
జనవినుత కార్య! నాగనక్ష్మాపవర్య!
అశ్వారావుపేట ప్రయాణానంతరమున శ్రీశ్రీ రాజావారికి వ్రాసికొనిన లేఖాంశములు (మకాము: కామవరపుకోట)
వర్షాతపానిలాపాయ దూరంబయి
రమ్యమౌ శకట వర్యంబమర్చి
గమనచిత్రముఁజూపు కలధౌతతుహినాచ
లము లనందగు మహోక్షములఁబూన్చి
జవసత్వసౌందర్య సహితసైంధవముపై
సాయుధ శూరుఁ దోనరుగఁగూర్చి
వివిధాధ్వసముదయవేదియౌ వీరు వే
ఱొక్కని ముందేగుచుండఁజేసి
మత్ప్రయాణం బభయ సౌఖ్యమహితమై ప్ర
వర్తిలఁగఁదీర్చిమీరటు పనుపనాఁడు
కామవరకోటఁ గొండూరునామయాఖ్యు
భవనమునకేగితిమి నాగపార్ధివేంద్ర
ఏ సదన్వయకర్తగా సకలపురాణ
ములు విష్ణుదేవునిఁ దెలుపుచుండు
నేవంశపతీసతి యిందిరాదేవి దా
సశ్రేణులకు మహైశ్వర్యమొసఁగు
హర విలాసముకృతినందె శ్రీనాథుచే .
నవచితిప్పయ యేకులాగ్రణియయి
ధనము, దాతృత్వంబుఁ దనర నేగోత్రజుల్
శ్రీదుఁ గుబేరుని స్మృతిఘటింతు
రట్టి సద్వైశ్యసంతతి నవతరించు
కతనఁ గవితాయశోరక్తిఁగాంచు కతన
భామయాహ్వయుఁడాది నాహ్వానపఱచు
నాఁటిబలె మమ్ముఁగని మహానందుఁడయ్యె
త్వత్కృత గౌరవవిధు ల
స్మత్కవితారచన నెఱిఁగి మాన్యులచటి వా
రుత్కట హర్షాత్మకులై
సత్కారోక్తుల నుతింపసాగిరి మిమ్మున్
కొండురిభామయార్యమణికోరినయట్టరుదెంచుమమ్ము నొ
క్కండనె యంచునెంచ కధికప్రమదమ్మున నాదరించుచుం
బండినభక్తినిచ్చెనుసభాస్థలి నూటపదాఱు వస్త్రముల్
నిండదె తద్యశంబు ధరణీభువనంబున నాగభూవరా!
మంచిరాజువారు
కులవృద్ధుఁడేకాక గుణవృద్ధుఁడగు మంచి
రాడ్భగవత్సుధీ రాజమౌళి
తత్పుత్రకుండు విద్వద్వశంవదుఁడు కా
ర్యజ్ఞుండు వీరభద్ర ప్రధాని
నిరతభక్ష్యాన్న సంతృప్త కవీంద్రుండు
గ్రామణి హనుమంత రాయమూర్తి
తత్పితృవ్యుఁడు మహౌదార్య చర్యుఁడు సుబ్బ
రాయాభిధానుండు గేయగుణుఁడు
మమ్ముఁమ్రేమించి వైశ్యుల మాన్యమతుల
గొందఱంజేర్చి సభయొనగూర్చి శ్రుతివి
భూషణలను నూఱాఱుల భూరివస్త్ర
గౌరవంబులఁదన్పి రక్కజపుఁ బేర్మి
అవ్వారి సద్గుణోన్నతు
లవ్వారిగఁ బొగడఁజెల్లు నటకనుపుట మ
మ్మివ్వేడ్కగూర్చితని ని
న్మవ్వపుఁ బల్కుల నుతించినారు నరేంద్రా
ఆవాక్చాతురి, యాసుధీవిలసనం, బాప్రీతి, యాగౌరవం
బావిద్వత్ప్రియకార్యకౌశలియు, నాయౌదార్య, మాన్యాయవి
ద్యావైశద్యముఁజూడజూడ, మదికత్యాశ్చర్యముంగొల్పెడున్
మావారంచనుకొంటగాదు, జగతీమాన్యుల్‌నరేంద్రోత్తమా!
మంచిరాజాస్వయుల సతీమయులు సద్గు
ణాభరణ లందు నాత్మ విద్యావివేక
యగుట హనుమత్సుధీంద్రు సర్దాంగలక్ష్మి
రత్నమాంబిక స్త్రీజనరత్నమండ్రు
కర్ణతుల్యవదాన్యతా పూర్ణుఁడగుటఁ
గర్ణభూషలనప్డిడి గణ్యమైన
సభ యొనర్పింప మఱియొక్క సారిపల్కె
సీతమాపతి సుబ్బార్య శేఖరుండు
అంతభగవత్బుధాగ్రణి హర్షరాశి
మమ్ముఁగనిపల్కెనిట్టు లస్మద్ధితులగు
తడికమళ్లాన్వవాయు లుత్తములు లక్క
వరమునంగల్గిరట కేగవలయుననుచు
అనియటకుఁ బంపఁ దలఁపో
సిన భగవత్సుగుణి హృదయసీమఁ బ్రమోదం
బెనయఁగ నప్పురిఁ గల రా
జన యను నల తడికమళ్ళ సత్కులుఁడర్ధిన్
పరువడిభామ యాదులగు బంధులుసద్గుణసింధులెన్నఁగా
నరుదగు వస్త్రగౌరవము లందఁగఁజేసి మహాక్షయుగ్మసుం
దర శకటంబునం బనిచినన్ శుభవాద్య నినాదమొప్పఁ న
ప్పురమునువీడి లక్కవరమున్ వరమోదనిరూఢిఁజేరుడున్
అలకామవరకోటఁ గలచిన్నరాజాలు
శకటంబునెక్కిరా సంతసించె
భగవద్దనుమ దార్య భామయార్యాదుల
సత్కార్యములకు హర్షమువహించెఁ
దననూత్న సౌధమందున సమర్హాసనో
త్తమశయనాది మోదముల నించె
దినదినాదికభక్తి దీపింప నభిమత
భోజనానందముల్ పోహణించె
నుత్తమాంశుకయుతషోడశోత్తరశత
రూప్యసత్కారమాత్మాభి రూప్యమమర
నలిపెఁ బ్రతివత్సరంబు రాఁదెలిపె భక్తి
సత్యఘనునన్న పెద్దరాజాలు బళిరె!
తమ్ముఁడుసత్యమూర్తి సతతమ్మునయమ్మెసఁగంగనాత్మగాఁ
గుమ్మరఁ భిన్నతండ్రి కొమరుండగు నా పినరాజధీరుఁడం
గమ్మునకున్ భుజమ్ముగతిఁ గ్రాలఁగనొప్పగు రాజనార్యువం
శమ్మభివృద్ధినొందుత యశమ్మనిశమ్మునువాని కబ్బుతన్
వందనపుం గులుండు ధనవంతుఁడు రుక్కయనాముఁడప్పురం బందునమందచిత్తుఁడుమహావినయాఢ్యుఁడువొల్చునిందిరా
సుందరి తద్గృహంబునఁ ద్రిశుద్ధిగఁ గాఁపురముండు, వాక్యపుం
బొందిక నవ్విడన్వయునిఁ బోలఁగనెవ్వరుఁ జాలరోనృపా!
గౌరవసంపదన్ లవము గగ్గఁగనీయక మాధురీధురీ
ణోరువచఃప్రచారముల నుల్లములం గఱగించుచున్ మొదల్
బేరములాడియుం దుదకుఁ బెద్దసభన్‌సమకూర్చి భక్తినూ
ఱాఱును నంశుకంబులిడె నాతని వాక్కులు వేయిసేయవే
దేవమాన్యంబులం బెచ్చుఁ దీసి పొట్ట
నింపుకొను చేరికేనొకతంపిఁబెట్టి
పుల్లలెగనెట్టి గోడపైఁ బిల్లివోలె
జెలఁగు నొకబండ రామన్నవలన మొదల
బేరముంబెట్టెఁగాని యాసూరిహితుఁడు
రుక్కయాఖ్యుఁడు నీతిపరుండుగాఁడె?
అందలి విశ్వకర్మ సుకులాభరణుల్ రసికత్వపూర్ణు ల
స్పందవివేకులై, విభవసాంద్రులుగామికిఁ జింతనొంది, పే
ర్మిం దగునంగుళీయకవరీయములన్ మముసత్కరించి, రే
మందుము వారియా సుకవితాదర మాగురుభక్తిరాణ్మణీ!
జంగారెడ్డి గూడెము
ఘనుఁడౌదార్యగుణోజ్జ్వలద్యశుఁడు జంగారెడ్డిగూడెంబునం
దునఠాణాకధినేత, కృష్ణగుణి, యన్యోన్యానుమోదంబులిం
పెనయంబిల్చి, సభన్‌ఘటించి, బుధులెంతేమెచ్చ నూఱార్ల చే
తనుబట్టాంబర గౌరవాదికముచేతం దృప్తింగూర్చెన్నృపా
ఆయంబున నధికుఁడుగా
కా యనఘుఁడు దుర్ఘటంబులగు కార్యములం
జేయించు బుద్ధికుశలత
నోయనఘా! కుశల బుద్ది యొందఁడెకీర్తిన్!
కొన్నినాళ్ళందు విందులఁగుడిచి తనిసి
యశ్వరాట్పురిలో భవదాప్తమౌళి
నారసింహాధిపుఁడు గల్గుటారసియట
కరుగుచుండంగఁ దత్సుపథాంతరమున
జీలుగుమల్లి
జీలుగుమిల్లినాఁబరగు చిన్నిపురంబునక్షారవార్నిధిం
బోలు ధనేశ్వరుండొకఁడు పొల్చుమదాప్తునిపుత్త్రివాని యి
ల్లాలగుటం జనందగియె నయ్యెడకన్యులుబోవఁ జెల్లదా
శ్రీలలితాంగితత్ప్రియతఁజెంది వసించుటచిత్రమయ్యెడిన్
యోగ్యజనునట్ల చివరకా భాగ్యరాశి
షడ్రసోపేత దివ్యభోజనసమృద్ధి
గౌరవించెనుగాని త ద్గౌరవంబు
సహజమదిగామి నిటు వ్రాయఁ జనియెనధిప!
ఆ ధనేశ్వరు దార విద్యావతియును
సత్కుటుంబాగతయునైన సాధ్వియగుటఁ
బుణ్యవతి వానికీవలెఁ బుణ్యమెంతొ
కాక లభియింపదా యోగ్యుకార్యములను.
నాఁటి సాయంసమయంబున కటనుండి పయనంబై శ్రీ కందిమళ్ళాన్వయ వార్నిధి సంపూర్ణ సుధాకరుండగు శ్రీ మద్వేంకట రామ నారసింహ ధరావిభుండు నెలకొన్న యశ్వరాట్పురవర్యంబు నత్యంత సమ్మోదంబున మంగళతూర్య నాదంబులు శుభసూచకంబులై శ్రవణపర్వం బొనర్చుచుండ మలయ మారుతార్భకుండనుకూలుండయి తోననడువఁ గొంత ప్రొద్దేగుసరికిఁ జేరునంత.
వినుతగుణాభిరాముఁడగు వేంకటరామనృసింహరాయ రా
డ్జనమణి యస్మదాగమన శబ్దము వీనులవిందుసేయ మ
మ్మునుపఁగఁజేసియాత్మభవనోత్తమమందొకచోట సత్కళా
ఖనియగు విశ్వనాథబుధగణ్యునకున్ మము నప్పగించియున్
రాతిరిచాలయయ్యెను గరంబుశ్రమంబునఁ జేరియుందురీ
రాతిరియాపిప్రొద్దుటవరంబగు ప్రీతినిఁ జూపుఁడంచు భూ
నేతవచించెనంచు నవనీసుర వర్యుఁడు తెల్పి భోజన ప్రీతులఁదేల్పసౌఖ్యసముపేతులమైశయనించిరాతిరిన్
ప్రాగద్రిన్ దీనవల్లభుండు పొడసూపం గాల్యకృత్యంబు లు
ద్వేగప్రక్రియఁదీర్చి యన్నృపవరున్ వీక్షింప మేమెంచుచోఁ
దాఁగట్నంబనిపంచె గౌరవయుత ద్రవ్యాంశుకశ్రేణి ని
ప్డాగాథన్‌వివరింపనేల తుదకత్యానందముం గూర్చుటన్
మచ్చరిత్రంబు సమ్యగ్రీతి నెఱిఁగించు
పత్త్రికాభివ్యాప్తి పరఁగకుండ
మార్గశ్రమలకోర్చి మాదృశుల్ తత్పురం
బునకెన్నఁడేనియు జనకయుంట
ఆజ్ఞసుగ్రీవాజ్ఞయగుట నెఱింగిన
వారేనియుం దెల్పనేరకుంట
కాంచికావిభుని రంగస్వామిదర్శించు
కార్యవేగంబాత్మఁ గ్రమ్మియుంట
సరసమణి దానశాలి రసజ్జమౌళి
యైనఁగాని సభాయత్న మాపిమమ్ము
నుచితసత్కారములఁబంప నూహఁజేసెఁ
జిత్తమరయక శ్రీనారసింహవిభుఁడు
మావిషయంబు గార్యవిధి మానవనాయక నీదుపంపుఁబ
ద్యావళివ్రాసిపంప ముదమంది మహాసరసాగ్రయాయి యా
భూవరుఁడప్పుడేపిలువఁబుచ్చి నమస్కృతిపూర్వకోక్తి సం
భావనమొప్పఁ గూరిచిన మన్నన లార్యనుతంబులై తగున్
మముగన్నదాది యా భూ
రమణుఁడు నిజబంధులట్ల రాగము పేర్మిన్
మమువీడక దినము నీమే
షముగతి వెడలించు హృద్యసంభాషలచేన్
సముచితాభ్యంగ మజ్జనవిధానముల న
నూనానుమోదంబు నొందఁజేసె
ననుపమానేక భక్ష్యాహారముల నుపా
హారంబులం దృప్తినందఁజేసె
మహితతాంబూలాది మర్యాదలన్ బహు
గంధచర్చలమెప్పు గల్గఁజేసె
విశ్వనాధసమాఖ్య వెలయు విద్వాంసుఁ డా
త్మానందముం దెల్పునట్లుచేసె
వీరభద్రాఖ్యుఁడౌ మేటి ఫేషుకారు
అలకఱా సూర్యనారాయణాద్యలఘులు
ధర్మలింగాదిఘనులుఁ జంద్రయముఖ సర
సులును నుతిసల్ప సభ ముదంబొలయఁ జేసె
బాలభానుప్రభా భాసమానములుశ
రచ్చంద్రచంద్రికారాజితంబు
లపరదిగ్‌వ్యాప్త సంధ్యారాగ రమ్యముల్
క్షీరడిండీర రుచిప్రధితము
లబ్జరాగమణి ఘృణ్యౌఘ సంశ్లాఘ్యముల్
వజ్రమణిద్యుతివర్ణితంబు
లంగారకగ్రహాభంగఘృణాకృతుల్
కర్బురగురువరాకారయుతము
లగుచుఁ గలధౌతపు మొలాము లమరునరిది
సాలువులఁజేలముల నిచ్చిస్వాంతమలర
రెండునూటపదాఱు లర్పించె సభను
శ్రేష్ఠ వేంకటరామ నృసింహవిభుఁడు
పూర్వరసికప్రభూత్తముల్ పూర్వసుకవి
వరులు మీరలు మమ్మెట్టి తెఱఁగు లమర
గౌరవింతురొ, యట్లే తా గౌరవించె
నశ్వరాట్పురి నారసింహప్రభుండు
సర్వసమర్థుఁడౌసరసుఁడే భూజాని,
యన్నమాటకుగుఱియైనవాని
మహితశిష్టాచార మాన్యుఁడేధాత్రీశుఁ
డన్నసూక్తికి లక్ష్యమైనవాని
పటుధర్మకార్యలంపటుఁడే మహీధవుం
డన్ననుడికి సాక్షియైనవాని
విద్వత్సులభుఁడేవివేకి యే నరపతి
యన్నపల్కున కర్ధమైనవాని
వినయపునిధి, విద్యానిధి, వితరణనిధి
యేనృపతియన్న శబ్దసంతానమునకు
సేతుఁడగువాని నరసింహ నృపునిఁదావ
కాప్తుఁగని మెచ్చితిమి నాగనావనీంద్ర!
భవ్యసీతారామ పార్ధివుచిరయశః
పుణ్యపుంజంబైన పుత్రుఁడనియు
మాన్యలక్ష్మీకాంత మాసతీగర్భము
కాస్ఫోటమౌక్తికాగ్ర్యంబనియును
శనివారపుంబేట జననాధురాజ్య వృ
ద్ధినిఁబ్రీతిమైసల్పు ధీరుఁడనియు
న్యాయపాలనము నొనర్చుచు రాజ స
న్మానంబులొందు సమర్ధుఁడనియు
సుచితవ్యయంబుసేయుచుఁగీర్తి రాజ్యర
మాభ్యున్నతులఁ దీర్చు నసముఁడనియు
సత్కుమారులఁగన్న ప్రశస్తుఁడనియు
నర్హకార్యప్రవీణుఁడౌ నధిపుఁడనియు
దమరు నన్యులు, దెల్పిన క్రమముగాఁగ
విని, కనియుఁదుష్టిఁ జెందితిమనఘ! నేఁడు
అనివార్యంబయి రాజకీయమగుకార్యంబొండురాఁజెంతనుం
డిన శ్రీ వేంకటరామ భూధవునకెంతేఁదెల్ఫి ఱేఁడేగ, న
జ్జననాథాత్మజుఁడెఫ్డు నేర్చెనొమహోత్సాహంబుదీపింపఁద జ్జనకుంబోలిసమస్తరీతులనుమత్స్వాంతంబులన్ లోఁగొనెన్
పూచికపాడు
పూచికపాటిగ్రామపతి పుల్లయధీరునిఁజెప్పనొప్పు దా
దాఁచినకొంగుబంగరు బుధప్రకరంబున కాఘనుండు సం
కోచములేక పిల్చి సభఁగూరిచి నూటపదాఱు వస్త్రముల్
ధీచతురత్వమేర్పడఁగఁదెచ్చి యిడెన్ బృథుకీర్తికాముఁడై
అశ్వారావుపేట
పునరవలోకనోత్సుకతపొల్పు వహింప భవిష్యదబ్దమం
దునఁజనుదేరఁబల్కెఁబరితోష శుభోక్తులమమ్ము సత్యవా
గ్వినుతుఁడు యుష్మదాప్తమణి వేంకటరామనృసింహరాడ్వరుం
డనఘసుకీర్తి యానృపతియత్యధిక ప్రమదంబుఁగూర్చెమీ
రనవరతంబు విష్ణుశివులట్లనురాగము సత్య సౌఖ్యముల్
గొని తనరారుఁ డాప్తకవి, కోవిద, బాంధవ హర్షమొప్పమి
మ్మనయముఁగీర్తికాంతయు జయాంగనయున్ శుభదృష్టులం గనుం
గొనెదరుగాతపూజ్య కవికోవిద బాంధవ! నాగభూధవా!