కొప్పరపు సోదర కవుల కవిత్వము/వివిధ ప్రసంగావళి
ఆశుకవితలు
(వివిధ ప్రసంగావళి)
శ్రీమద్రౌద్రిసంవత్స రాశ్వయుజమాస నవరాత్ర వ్రతోత్సవములలో
శ్రీశ్రీరాజావారి యాహ్వనముచే వచ్చినప్పుడు చెప్పినవి -
శ్రీ పంగిడిగూడెములోని ప్రథమ సమావేశము
ఆశీర్వచనము
స్వస్త్యస్తు, విశ్వసంస్తవనీయ మహనీయ
సింహహయార్చా సుశీల! నీకు
విజయోస్తు, వీరసాధ్వీత్వాఢ్య విజయ రా
ఘవమాసతీ పుణ్యగణ్య! నీకు
పుత్త్రలాభోతస్తు, శ్రీ బొమ్మదేవరనాగ
భూపాగ్ర పుత్రాగ్ర పుత్ర! నీకు
శ్రీరస్తు, గోధరిత్రీ దేవదేవ స
పర్యా ప్రముదితార్యవర్య! నీకు
భోగ, భాగ్యాయురారోగ్య పూర్ణకీర్తి
నిస్తులసురాజ్య సుఖవృద్ధిరస్తు నీకు
సుకవి హృదయాంబుజ దినేంద్ర! సుగుణసాంద్ర!
ఘనవిభవ నిర్జరేంద్ర! నాగన నరేంద్ర!
రంగదుత్తుంగ పిశంగ జటానద్ద
మణిమకుటోత్కట ఘృణులవాఁడు
భూదళనోద్యమ భూరిసీరాగ్ర సం
శయదాయి లంబనాసంబువాఁడు
వివిధహస్తావళీ విన్యస్త బహుశస్త్ర
దుర్నిరీక్షాకృతిఁ దోఁచువాఁడు
అసమదంష్ట్రా కరాళాస్యరంధ్రమువాఁడు
శోణితానన విభాస్ఫూర్తివాఁడు
రాజవశ్య క్రియాశక్తిఁబలు వాఁడు
ప్రమథ గణరుద్రగణయుక్తిఁ బరఁగువాఁడు
వీర బేతాళదేవుఁడే వేళ మీకు
ఖ్యాత జయ, లక్ష్ము, లిడుత నాగక్షితీంద్ర!
అన్యోన్యకుశలప్రశ్నోత్తరములు
కుశలమే! యుష్మదంకుశ వజ్ర మత్స్యము
ఖ్యార్హలక్షణలక్షి తాంగమునకు
క్షేమమే! భవదీయ చిరపుణ్యఫలరూప
కర్ధాంగలక్ష్మి కత్యలఘుమతికి
మంగళంబే! భవ న్మత్తమాతంగ మ
హాంగ, తురంగ, శతాంగములకు,
సౌఖ్యమే! త్వత్కార్య సచివాప్త, బాంధవ,
సైన్య, కోశాయుధ జాతములకు
శుభమె! భవదీయ విజయ సంశోభితాస
దృక్షసామ్రాజ్య లక్ష్మీకటాక్షములకు
బొమ్మదేవర వంశాభిపూర్ణచంద్ర!
పూత గుణసాంద్ర! నాగధాత్రీతలేంద్ర!
మత్కవితాకుమారికయు, మత్సహజన్ములుమత్కుటుంబమున్
మత్కృతకావ్యవర్యములు, మద్విజయాంబుజగేహ, శాంకరీ
సత్కరుణావిశేషమున సౌఖ్యపరంపర నందుచుండె, సం
పత్కమలేక్షణాహృదయపద్మనభోమణి! నాగరాణ్మణీ!
గౌరవంబును, శ్రద్ధ కాన్పించు మామకా
హ్వానంబుఁ ద్రోయుదురా? యటంచు
మనకన్నముఖ్యులౌ, మాన్యాత్ము లెవరెందు
నేని పిల్చినఁజనిరేమొ? యంచు
నెవరెట్లు పిల్చిన, నేసమాధానోక్తి
నో తెల్ఫియిటకురాకుండ రనుచు
రాఁదీజుకున్నచో రానికారణమేని
వ్రాయకుపేక్షింతురా? యటంచు
నస్మదాలోకన కుతూహలాత్మకులగు
వారికిందెల్పి యిదెవచ్చు వారటంచుఁ
బలుకుచుండుట నేలూరు పట్టణమున
విని ప్రమోదించినారమో జనవరేణ్య!
దాసుమాధవ బుధోత్తంసుని భ్రాత, యా
ర్యహితుండు గోవిందరాయ సుకృతి
ధూమయానము డిగ్గి, యేము హేలాపురి
కేతేరఁ బ్రియహర్ష దృష్టిఁగాంచి
అస్మత్సుఖోదంతమరసి, క్షేమముఁదెల్పి,
స్వీయసద్మమున వసింపఁజేసి
మధురభోజనమున మాన్యతాంబూల స
త్కారాదికమున, మోదము ఘటించి
సరస కొండూరి, భామార్యవరుఁడు కామ
వరపుఁగోటకుఁ బిల్వ, భావమును మెచ్చి
తన హయస్యందనమున స్టేషనున కనుప
నుచితగతివచ్చి మిముఁగంటిమో నరేంద్ర!
విశ్వనుతార్హసత్కృతులు, పెల్లుగవల్లురియందుసల్పి యీ
యాశ్వయుజాదిరాఁబిలిచి, నట్టులె పంగిడిగూడియంబునం
దీశ్వరి లక్ష్మి వాణిభజియించునినున్ సహధర్మిణీయుతున్
శాశ్వతకీర్తి కంటిమి భృశంబుగఁగొంటిమిహర్ష సంపదల్
పూజచేయు దంపతులను జూచుసందర్భమునఁ జెప్పినది
శారదా సారసాసను లొక్కచో గిరి
జాశంకరులఁ బూజసల్పినట్లు
శ్రీశచీ దేవతాధీశులొక్కెడ మహే
శీమహేశ్వరుల నర్చించినట్లు
ఉర్వీసుతా రాము లొక్కచక్కినిఁబార్వ
తీ పశుపతులఁ బ్రార్ధించినట్లు
జాంబవతీ సరోజాతాక్షులొకచోట
గుహమాతృ శంభులఁగొల్చినట్లు
నిశ్చలామల చిత్తులై నిల్చి యొకట
దైవపూజల నొనరించు దంపతులను
మిమ్ముఁగననేఁడు నేత్రపర్వమ్ముగల్గె
రాఘవాంబామణీ! నాగరాజమౌళి!
సర్వాపత్తిమిరార్కమండల సహస్రంబుల్ బలారాతీ దు
ర్గ ర్వారణ్యమహాగ్ను లిష్టజయసౌఖ్య శ్రీప్రదంబుల్ సమ
స్తోర్వీశాదృతముల్, కుటుంబశుభలాభోదర్కముల్ బ్రాహ్మణా
శీర్వాక్కుల్, నిరతంబమోఘమహిమ శ్రీఁబ్రోచుసాగాధిపా
సూర్యచంద్రోపమాస్ఫురణాంచితాఖండ
దీపద్వయీ సముద్దీపితంబు,
చిత్రరూపవ్యాజ సేవితాజహరీశ,
వాగ్రమా దుర్గాప్రభావితంబు,
ఫలభారనమ్ర, రంభాస్తంభ, తన్మహా
పత్రపుష్పాధిక, భాసితంబు
వ్యా ఘ్రాజినస్థిత, వసుమతీసుర, వరా
మోఘ, శుభోక్తిసంపూరితంబు
పుష్పగంధాక్షతాదిక భూషితంబు
శ్లాఘ్యభవదీయ, దేవపూజాగృహాంత
రాళమౌక్తిక మండప రాజమిది యి
తోధిక శుభాధ్యమగుత, నాగావనీంద్ర!
ఏదేవిజపియించి, వృత్రాదులజయించి
యింద్రుడు, స్వారాజ్యమేలుకొనియె
నేదేవిఁబ్రార్ధించి, యీశ్వరుచే విష
బాధవో, జగము, శుభంబుఁబెంచె
నేదేవిఁబూజించి, యింద్రారుల వధించి
రాముండు, సీతతో రాజ్యమందె
నేదేవి సేవించి, యెల్లశత్రులఁ ద్రుంచి
స్థిరరాజ్యరమ, యుధిష్ఠిరుఁడు సెందె
నజ్జయద, యమృతప్రద యఖిలసౌఖ్య
దాత్రి, సామ్రాజ్య కర్త్రి భూధరవరేణ్య
పుత్త్రి, ప్రోవుత నిను మనఃపూర్తిగాఁగ
జయ విభవసాంద్ర! నాగనక్ష్మాతలేంద్ర!
అభివందనంబు, దుగ్దాబ్దీంద్రసుతయంచుఁ
గేలుమోడ్పులు, చక్రగృహిణియంచు
దండంబు, పుష్పకోదండ జనని యంచు
గిడిగిళ్ళు, జలజాత గేహయంచు
జోహారు, మిహిరాంశు సోదరియంచు న
మస్కృతి సురసతీమాన్యయంచు
జోత, ప్రద్యోతపద్మాతపత్ర యటంచుఁ
బ్రణతీ శుద్ధసువర్ణ వర్ణయనుచు
వినతి, వనజాతపాణి యంచును సుభక్తి
తో దినత్రయపూజ సంతుష్టిసల్పు
రాఘవాంబను నాగభూరమణుఁగరుణఁ
శ్రీరమాదేవి సిరుల రక్షించుఁగాత!
అమలకీర్తిఫలంబు లందింతు ననుటకు
స్వచ్ఛముక్తామయ జపసరంబు
అక్షరతత్త్వ వేద్యతఁ గూర్తుననుటకు
స్వస్తికరాక్షర పుస్తకంబు
వేదార్ధముఖముగా బింబాశనమును స
ల్పిన యట్ల ప్రజ్ఞలిత్తునన శుకము
సుఖద మేకస్థానసుస్థితి యెల్లదం
పతులకు ననుచుఁ జెప్పంగఁదమ్మి
నెలమిఁదననాల్గు కేలుఁదమ్ములనుదాల్చి
శారదదినంబులందుఁ బూజనములందు
సకలమహిమాధికాలంబ శారదాంబ
మంగళములిచ్చు రాజదంపతులకెపుడు
హరితద్యుతివితాన, మలరుప్రదేశంబు
లాకు జొంపముల యట్లందమంద
నరుణకాంతికలాప మమరెడు తావులు,
ఫలపల్లవాది శోభలనెసంగ
బహువిధప్రభలతో భాసిల్లుచోటులు,
వివిధప్రసవదీప్తి విస్తరిల్ల
స్వర్ణవర్ణముల లోచనతృప్తి నిడునెడల్
పండుటాకులభంగిఁ బాదుకొల్ప
బంధు సత్క వి వర మిత్ర పరిజనోక్తి
కీర పిక శారికాళి హర్షారవముగఁ
బరఁగెఁ ద్వద్భద్ర భవన ముపవనమనఁగ,
మాధవోపమ! నాగరాణ్మానవేంద్ర!
వన విహరణ సమయమున జెప్పినది
అమరాధిపతినందనారామ మేవని యా
రామంబుఁ గన, జ్ఞప్తిరాకపోదు
మారసంహారు, కుమార వనంబేని
వనముఁ గన్గొనఁదలఁపునకు వచ్చు
అర్ధేశు నుద్యానమగు, చైత్రరథమేని
యుద్యానమునకు రా నూహకెక్కు
నందనందను, కూర్మి బృందావనమెవాని
వనికిఁజేరిన, మనంబునకుఁజేరు
బహుళతరచిత్ర, సుమ, పత్ర, ఫలయుతంబు
శుక, పిక, భ్రమరాది, సంశోభితంబు
తావకారామ మిది మహోత్సాహమొదవఁ
గాంచఁజేసితివౌ నాగ కాశ్యపీంద్ర!
దుర్గాదేవత ప్రభువును రక్షించునట్లుగా నొక సమయమునఁ జెప్పినది
కన్నెత్తి పరకాంతఁ గన్గొనఁగా నొల్లఁ
డేకపత్ని వ్రతం బెపుడు సల్పు
దుష్ప్రవర్తనల కెందును జోటొసంగఁడు
శిష్టవర్తనులను జెంతఁజేర్చు
స్వల్పాత్ములకొకింత స్వాతంత్ర్యము నొసంగఁ
డుత్తమాత్ములతోడి పొత్తువిడఁడు
వ్యర్ధ వ్యయంబు సేయఁడు పుణ్యకీర్తుల
కర్షధన త్యాగ మాచరించు
నే సుగుణసాంద్రుఁ డట్టి భూభృత్కులేంద్రుఁ
దావకీనపదాంబుజ ధ్యానశీలు
రాఘవాంబాపతిని, నాగరాజమౌళిఁ
గరుణనిరతంబుఁగనుము దుర్గాభవాని!
తన గాంభీర్యము, సౌకుమార్యమును, శుద్ధాంతైక మర్యాదయుం
బనిగాపీయెడనంచు, నిర్మలతర స్వాంతంబుఁ ద్వన్నామచిం,
తనమందుంచి, సుకుంకుమాంచిత హరిద్రాచూర్ణ పూజల్, ఘటిం
చిన పూతవ్రత రాఘవాంబను గృపాశ్రీఁబ్రోవుమో యీశ్వరీ!
కరుణాశాలినివంచు, దాసజన రక్షాదీక్షవౌదంచు సు
స్థిరభక్తి న్నినుఁగొల్చుదంపతుల రక్షింపంగదే త్వత్పదాం
బురుహద్వంద్వమిళన్మిళింద మిధునంబుంగాఁ గటాక్షించి శ్రీ
కర కారుణ్యమరంద తుష్టి పొసఁగంగా రాజరాజేశ్వరీ!
విత్తాధీశునిగాఁ గుబేరు, మనువున్ విశ్వామరాధీశుఁగా
మత్తార్వార్యధి రోహణున్, మహితధర్మస్థాన నిర్ణేతఁగా,
హత్తంజేసిన దేవి, యుత్తమనృపత్త్వౌన్నత్యుఁగా నాగభూ
భృత్తుం, ద్వత్పదభక్తు,ఁ బ్రోవఁగదవే? శ్రీరాజరాజేశ్వరీ!
భువనంబుల్ సృజియించునంబవగునిన్ భూతాళికిం దండ్రియౌ
శివుఁబుత్రాశజపించుచోఁగరుణ, నాశ్రీకంఠుతోఁ దెల్పి, జాం
బవతీకృష్ణులఁ బుత్రవంతులుగ, సల్పంగల్గితీ, వాకృపా
శివ మీదంపతులందుఁ జూపఁ గదవే, శ్రీరాజరాజేశ్వరీ!
కనకక్ష్మాధర రాట్సుతాసుతయనంగా, రౌప్యధాత్రీధరా
గ్రనివాసార్ధ శరీరవాసిని యనంగా! నొప్పునింగొల్చు, నా
గనభూపుం, గులదీపుఁగాఁగనక రౌఫ్యాన్నత్యనిర్లోపుఁగా,
మనుపంగాఁగదవే! దయాగుణమణీమంజూషవై యీశ్వరీ!
నీనునేకాగ్రతఁగొల్చునాగవిభునిన్, శ్రీరాఘవాంబన్ సతం
బును భానుంబ్రభంజంద్రుఁజంద్రికనుగాఁబోల్పించిదాంపత్యసౌ
ఖ్యనిరూఢిన్ శతవర్షముల్ తనరఁ బుత్రానందముంజెంద, నీ
యనుకంపామృతవృష్టి, నింపఁగదె, యంబా! రాజరాజేశ్వరీ!
గజారోహణోత్సవులై శమీపూజకుఁజను శ్రీరాజావారిని గుఱించి
ఆంగ్ల రాజేంద్ర దత్తానర్హ్యమణి భుజా
బంధకాంతులు, రవిప్రభలనొరయ
స్వర్ణకీలిత లసచ్ఛార్దూలనఖర సం
తానహారము, శౌర్యమీనుచుండ
భూచక్రనామ విస్ఫురదుష్టవారణ
ద్వితయంబు, ప్రాభవోన్నతులఁదెల్ప
అఫ్తగిర్నామవిఖ్యాతంబులౌ, సూర్య
చంద్రాంకయుగము, పార్శ్వముల వెలుఁగ
సామజవరంబునం గవీశ్వరయుగంబు
సుకవితామహితాదరస్ఫూర్తిఁ, జూప,
భద్రగజమున, దేవతాపట్టభద్రు
పగిది, శమికడకేగు, నీభద్రతర, మ
హోత్సవంబెన్నవశమె! నాగోర్వరేశ!
వేశ్యలయాటఁ జూచునప్పుడొకరు వ్రాసిపంపినదానికిఁ బ్రత్యుత్తరము
నాఁడునునేఁడునేమి? యొకనాఁటికీబోటికిఁ జిక్కఁబోము పూ
బోఁడులగోడులందగిలి, పోఁడిమిమాన్పఁగలాభమేమి? మా
కూడిక కర్హలంచు, విధికూర్చినవారలు, గల్గిరింత, కే
బోఁడులతోడనేమిపని? పూర్ణయశస్కుల కిట్లెఱుంగుమా!
శ్రీచిన్నరాజాగారి సందర్శనమునుగుఱించి, శ్రీపెద్దరాజాగారు అడిగినప్పుడు చెప్పినది
ఈవఱకెన్నఁడుంగనమి, నెట్లని తెల్పఁగనౌఁ, బ్రసంగపున్
భావమునెంచుచో, సరసపద్దతితోఁచె, మఱొక్కమారుమ
మ్మావరమూర్తిపిల్చునఁట, యయ్యదినిక్కమయైనచోఁగ్రియా
కేవలముత్తరమ్మన, సుకీర్తినిధీ! సకలంబు వేద్యమౌ
దివాణములోని యుద్యోగులనుగుఱింది
స్వస్వకార్యము లెట్లు జరిగిన, స్వామికా
ర్యము శ్రద్ధతోఁదీర్చునట్టివారు
జీవితవృద్ధినిఁ జేయు మీ చిత్తంబుఁ
గరుణామయముఁ జేయఁ గడఁగువారు
భవదీయవిజయ సంపల్లాభముల కిష్ట
దేవతాప్రతతిఁబ్రార్ధించువారు
సత్య, ధర్మములు, విశ్వాస, వివేకము
లస్యవంద్యములుగా నమరువారు
విద్వదభిమాన మానసుల్, విజ్ఞవరులు
కార్యకరణ ప్రవీణు లీ కర్మసచివు
లిట్టి ప్రభుభక్తి పరులచే, నెసఁగు నీ ది
వాణ మణిగణ్యమో, నాగపార్థివేంద్ర!
శ్రీ శ్రీ రాణిగారిని గుఱించి
మంత్రవాక్కునకంటె మాననీయము, పతి
వాక్యంబని గ్రహించు వనితలందు
దైవసేవలకంటె, ధన్యముల్, నిజభర్తృ
సేవలంచు, నొనర్చు చెలువలందు
గురునిఁగొల్చుటకంటె, వరునిఁ గొల్చుటె మహో
త్తమకార్యమని కొల్చు రమణులందు
పితృ, మాతృ, సోదర ప్రేమకంటె సునాధు
ప్రేమ హెచ్చని నమ్ము భామలందు
నగ్ర గణనీయవౌచు నాగావనీంద్రు
స్థిరయశః పుణ్యముల వృద్ధిసేయు నిన్ను
శ్రీ కలితమూర్తి గణియింపఁ జెల్లునిపుడు
భవ్యగుణపేటి! రాఘవాంబావధూటి!
సంతోషించితిమేము తావక లసత్సత్కార సంపత్తికిన్
సంతోషించె మదీయదివ్యరసనా సంచారవాగ్దేవి తా
సంతోషించె భవాని మద్దృదయకంజాతస్థ సభ్యుల్ కడున్
సంతోషించిరి సంతతోల్లసిత హృత్సంతోష! నాగాధిపా!
నీసౌధంబు రమాసతీ నిలయమై నీయాత్మ ధర్మస్థిరం
బై సర్వాధిక శక్తి శౌర్యసహితంబై యొప్పునీమూర్తియ
న్యాసాధ్యారి పరాభవప్రదజయాఢ్యంబై తగం బ్రోచు ని
న్నాసర్వేశ్వరి బొమ్మదేవరకులేంద్రా! నాగధాత్రీశ్వరా!
నీయౌదార్యము కర్ణు జ్ఞప్తిపఱుప న్నీ సత్కవిప్రీతి ప్ర
జ్ఞాయుగ్వంద్యునిఁ గృష్ణరాణ్ణృపుని సంకల్పింపఁగాఁజేయ దీ
ర్ఘాయు శ్శ్రీసుయశస్సముజ్జ్వలుఁడవై హర్షోన్నతుల్ గాంచుమ
య్యా! యార్యస్తుత! బొమ్మదేవరకులేంద్రా! నాగధాత్రీశ్వరా!
వాల్మీకి కవికవిత్వముచేతనే రామ
నృపతినామము స్మరణీయమయ్యె
వ్యాససత్కవి కవిత్వముచేతనే పాండు
విభుసూనుల యశంబు విశదమయ్యెఁ
గాళిదాసకవీంద్రు కవితచేతనె భోజ
వసుమతీశుని పేరు వ్యాప్తమయ్యెఁ
పెద్దనసుకవి కవితచేతనే కృష్ణ
రాయప్రతిష్ఠ దిక్ప్రథితమయ్యెఁ
గాన సుకవులచేతనే కలుగవలయుఁ
బటుయశోవృద్దులుత్తమ ప్రభులకనుచు
సత్కవిమనఃప్రపూర్తిని సల్పుచున్న
నినుఁబొగడఁజెల్లు నాగేంద్ర! నృపకులేంద్ర!
దాతల్ గల్గుదు రందునందునెఱదాతల్‌కొందఱేయుందురా
దాతృత్వాంబుధులన్ సమర్హకృతివేత్తల్ స్వల్పసంఖ్యాకులా
యీతీరుల్‌గణియింప శ్రేష్ఠపదమే యీవందితౌ, సత్కవి
వ్రాతఖ్యాత సుపద్యగద్యనిచయభ్రాజద్యశోవైభవా.
అంచితాన్యోన్య సమావేశమూనక
దాంపత్యసుఖమొందఁ దలఁచుటెట్లు
గందపుంజెక్కఁ జక్కఁగ నఱగింపక
చందనానందంబుఁ జెందుటెట్లు
తైలవర్త్యగ్ని సంధానంబుసల్పక
తిమిరంబువో వెల్గుఁ దెచ్చుటట్లు
సామజాశ్వాదుల సమకూర్చికొనక త
దారోహణోన్నతి నందుటెట్లు
వ్యజనచామరముఖ సంగ్రహణము లేక
స్వేదబాధాపహసుఖంబుఁ జెందుటెట్టు
లనుచు నర్హక్రియల ధన వ్యయమొనర్చి
యశము నార్జించితీవు నాగావనీశ !
వైవాహికోత్సవా వసరంబునందుఁ బి
ల్పించి హెచ్చుగ గౌరవించుటయును
పట్టాభిషేకవైభవమందు నాఁడర్హ
విధుల సత్కృతులఁ గావించుటయును
శ్రీవేణుగోపాల దేవోత్సవములయం
దిరునూట పదియారు లిచ్చుటయును
అన్నియమంబు వర్షాశనంబుగఁబ్రవ
ర్తించునట్లుగ నేర్పరించుటయును
గరివరోత్సవ మేటేట జరుపుటయును
గన్నవాఁడవుగాన మీ పిన్నతండ్రి
పుత్రకునికన్న జ్యేష్ఠత పొసఁగునట్లు
సర్వ గౌరవముల హెచ్చు సల్పితౌర
అలఘుసద్గుణసాంద్ర! నాగావనీంద్ర!
శ్రీ రాజావారి సత్కారములను గుఱించి మఱియొక సమయమునఁజెప్పినవి
శ్రీమాన్య కొప్పర గ్రామవాసుల మమ్ము
దంచిత ప్రీతి రావించినాఁడు
అంబికా సుప్రసాదాసాదితాసాద
కవితా విశేషముల్ గాంచినాఁడు
స్వర్ణమండన గజోత్సవ రాంకవాది స
త్కారంబుల మనంబుఁదనిపినాఁడు
ఏనూట పదియార్లు యాన వ్యయార్ద సం
యుక్త వార్షికపత్ర మొసఁగినాఁడు
రసిక శేఖరుఁడౌర యాంధ్రక్షమాంత
రావనీ నాధసుకవి సింహప్రభాస
మాన పరిషద్వరిష్ఠాతిమాననీయ
పద్యరింఛోళి నాగభూపాలమౌళి
ఒక మాఱొసంగ వేఱొకమాఱు చనుదెంతు
రంచును, వెన్కముందాడువారు
ఇచ్చినకొలఁది, పైనిమ్మందురనుచు, ము
న్ముందు బేరములాడఁ బూనువారు
ఉచితానుచిత రీతులూహసేయక, గ్రుడ్డి
చేతి రాయి విధంబుఁ జేయువారు
తప్పించుకొనుటె, యిత్తఱి నుత్తమంబని,
సాకుల పొత్తముల్ చదువువారు
అంచితాహ్వానములను, రావించి, సంత
సించి, యిష్టార్ధముల సత్కరించి, ప్రీతిఁ
బెంచి యనువత్సరంబు రానెంచు నిన్నుఁ
బోలనేర్తురె? శతజన్మములకు భూప!
పటుతరానిలము వీచుట మహారణ్యముల్
కూలిన నోకవేళఁ గూలుఁగాక
కడు ప్రవాహముల వేగములఁదటాకముల్
తెగిన నొక్కొకవేళఁ దెగునుగాక
కరమువర్షా భావకాలంబులందేఱు
లింకిన, నొకవేళ నింకుఁగాక
గణ్య సంస్కార యోగములేమిఁగోవెలల్
గూలిన నొకవేళఁగూలుఁగాక
చెడదు కల్పాంతమును శుభశ్రీవిరాజ
మాన విజయప్రధాన యశోనిధాన
కవివరాశీస్సువాక్యంబు; గణ్యకీర్తి
చంద్రికాచంద్ర! నాగనక్ష్మాతలేంద్ర!
నిల్వుటద్ధములయందు బ్రతిబింబించు శ్రీ రాజావారిని గుఱించి సన్నిధానము సీతారామశాస్త్రిగారడిగినప్పుడు చెప్పినది
ప్రచురసత్యాశ్రయ భాస్వత్సమాఖ్యల
నంతామరనుతి బ్రహ్మయని తెల్ప
నసమాశ్వ భద్ర విహారంబహీన గు
ణాఢ్యత శంభుత్వమభినయింప
శ్లాఘ్య చక్ర ప్రకాశకరవిలాస ప
ద్మాక్షత్వములు హరియనుచుఁదెల్ప
మణికుండలాఖండ ఘృణి వితానంబులు
కిరణ సంతానంబు నెఱుక పఱుపఁ
బొసఁగి మూర్తిత్రయైక రూపుఁడగు సూర్యుఁ
డీ యినుండన సాగనరేంద్ర సూర్యుఁ
డమలినాదర్శముల దృశ్యుఁడయ్యె జన ని
రీక్షణ సరోజ వికసనంబెసఁగ ననఘ!
మరియొకప్పుడు ప్రసంగ సందర్భమునఁ జెప్పినవి
పంతమునందు భార్గవుఁడు బాహుబలంబున భీమసేనుఁడ
త్యంత సులక్ష్య లాఘవములందున నర్జునుఁడీడు వచ్చు భూ
కాంతులలోన నాగనరకాంతునకున్ మఱి రాఘవాంబికా
కాంతునకున్ నృసింహ నరకాంత సుతాగ్రణికిన్ ధరాస్థలిన్
భూప! త్వద్విగ్రహంబు రవిగ్రహంబయి
భయద జంతుధ్వాంత పటలినడఁప
లోకాప్త! తావకాలోకంబుదగ్ర సిం
హాలోకమై పరేభాళినొంప
మానవో త్తంస! యుష్మన్మానసము మాన
సంబయి సుకవిహంసములందనుపఁ
సద్గుణాంభోధి! భవద్గళ రవమబ్ద
రవమయి, హితమయూరములఁగూర్ప
సంతతాచలధర్మ! నీసతి పతియయి
యాత్మ వసియింప నన్యజనాద్భుత జయ
గరిమఁగంటివి మఱియును గనఁగదయ్య
నిరుపమితపుణ్య! శ్రీనాగనృపవరేణ్య!
తివాచి మేడసుగుఱించి
అభ్రగంగా తరంగాగత శీతల
వాతపోత సుఖానుభూతి గల్గి
విపులసోపానాధ్వ వేలిత వల్లికా
సుమ సుగంఘ్రాణ శోభగల్గి
మెత్తందనంబునఁ జిత్తంబుఁదనియించు
నునుదూది చలువ పానుపులుగల్గి
పెనుకురిచీలు చక్కని తివాచీలెల్ల
పనులు వెంటనె తీర్చు భటులు గల్గి
నాగరాడ్ఘటితోత్సవోన్నతులు గల్గి
మేము వసియించి సుఖియింప నీవహేతు
వగుట నిన్ గడుఁ బొగడుటర్హంబు బ్రహ్మ
వనిత విహరించువాడ తివాచిమేడ
శ్రీ సూరావధానులుగారి ప్రశ్నమునకుఁ బ్రత్యుత్తరము
పాక్యంబుల్‌పదియేల, నాగనరరాట్పత్నీమణింబోలి తా
లౌక్యాంచద్వ్యవహార విజ్ఞయయి ధీలక్ష్మీజయావాప్తికా
స్తిక్యాత్మంబతిదేవతార్చలను ఖాసింకోటలో స్రైణ మా
ణిక్యంబా నృపుపత్నిసల్పి వెలయున్ విద్యావిశేషంబులన్
ఏమేగుదెంచుట లెఱిఁగి ప్రత్యుత్థాన
వందనాదుల గౌరవము ఘటించి
రాకకాలస్య కారణమెఱుంగఁగఁగోరి
కుశలప్రశంసలఁ గూర్మినెఱపి
సతియుఁదత్సహజుఁడాస్థానికోద్యోగులు
నానందపడుట కాహ్లాదమంది
శ్లాఘ్యాసనోత్తమ శయ్యాదికముల మ
మ్ముఁ దివాచిమేడ నిమ్ముగనునిల్పి
సకలోపచారముల్ సల్పనిత్యముఁజెంత
నివసింప భృత్యుని నిర్ణయించి
పైపరామర్శంబుపరఁగ ననంత రా
మాఖ్యు ముసద్ది నాయత్తపఱచి
ఏలూరునుండి ప్రత్యేకంబుగాఁబాక
నిపుణుఁ బిల్పించి వండింపఁజేసి
ప్రాతరాహ్నికముఁ దీర్పఁగఁగాఫి యుపమ లు
పాహారములు గల్గునట్లమర్చి
అభిమత సుపదార్దహారిభోజనముగా
నర్హతాంబూలంబు లందఁజేసి
అపరాహ్ణవేళలయందు గోధూమ మా
షాదిభక్ష్యాహార మమరఁగూర్చి
వివిధపురీసభా వృత్తాంతముల మదీ
యముల నాకర్ణించి హర్షమంది
విశ్వకద్రు శ్యేన విషధర శార్దూల
శిఖ్యురభ్రముల వీక్షింపఁజేసి
ఆరామయుగళ మహాశ్వోష్ట్ర బహుదేశ
సురభి వృషాదులఁ జూడఁజేసి
దినమొక్కగడియఁగాఁజన నర్హమధురప్ర
సంగంబులను బ్రహర్షంబుఁగూర్చి
సమధిష్ఠితద్విపేంద్రము చెంత గజరాజ
మెక్కించి గరిమనూరేగఁజేసి
శతవధానంబునుసల్ప నేనూటప
దాఱులు స్వర్ణభూషాదు లొసఁగి
అనువర్షమేతాదృశానందమొనర వ
ర్షాశన పత్రంబునప్పగించి
అశ్వరాట్పుర రసికాప్తభూవర గౌర
వముల మేమొందెడు వలనుదీర్చి
దినదినాధికతరాత్యనురాగ సన్మాన
ముల మమ్ముఁదృప్తాత్మకుల నొనర్చీ
సత్కవీశ్వరులకు సద్యశంప్రియులగు
సత్ప్రభులు సల్పఁదగినవి సల్పి యుత్త
మప్రశంసలఁగొను నిన్నుమనుచుఁగాతఁ
గృప జగత్కర్తి శ్రీనాగ నృపవరేణ్య!
నర్సారావుపేట పట్టణములోని సుప్రసిద్ధ న్యాయవాదులగు బ్రహ్మశ్రీ చింతలచెఱువు కోటేశ్వరరావు పంతులు గారినిగుఱించి శ్రీ రాజావారడిగిన ప్రశ్నమునుబట్టి చెప్పినది
నరసరాట్పుర సర్వనరలోకహితుఁడయి
న్యాయవాది యశోభినంద్యుఁడయ్యెఁ
గవిబుధాశ్రిత బంధుగణమిత్రచయకల్ప
వృక్షమై సకలసంవినుతుఁడయ్యె
నిరతాన్నదాన వర్ణితగృహుండనఁ ద్యాగ
భోగాఢ్యుఁడన యశఃపూర్ణుఁడయ్యెఁ
గామేశ్వరీ సమాఖ్యామాన్యసాధ్వీ ప్ర
దర్శిత గార్హస్ధ్య ధర్ముఁడయ్యె
అస్మదీయాఖిల వ్యవహార కార్య
విజయసంధాయియై హర్షవిభవకారి
యయ్యెఁ గోటీశరాయ ధీరాగ్రయాయి
అలరుఁ జింతలచెర్వు వంశ్యాగ్రుఁడధిప
నర్సారావుపేటలోని డాక్టరుగారిని గుఱించివచ్చిన ప్రసంగములోఁ జెప్పినది
అమృతకరుఁ డమృతాత్మకుఁ డాలవట్ట
మన్వయుఁడు శేషయాచార్యుఁడఖిలవైద్య
రత్నమై నర్సరాట్పురిం బ్రభు నియుక్త
వైద్యశాలాధిపతియయి వఱలుననఘ.
నర్సారావుపేటలోని జమీందారువారగు మ.రా.రా.శ్రీశ్రీరాజా మలరాజు నరసింహారావు బహద్బరు జమీందారుగారినిగుఱించివచ్చిన ప్రసంగములోఁ జెప్పినది
శ్రీమలరాజవంశ నరసింహనరేంద్రుఁడు నర్సరాట్పురీ
భూమివరుండుయోగ్యగుణపూర్ణుఁడు, శిష్టహితుండుకూర్చుంజిం
తామణియట్లమాకు సతతంబు సమస్తసమీప్సితార్ధముల్
శ్రీమహిళాస్వరూపయనఁ జెన్నగుఁ దన్నృపురాజ్ఞి భూవరా!
ప్రకటభక్తినిఁ బ్రతివత్సరంబు భక్తి
నిన్నుఁగల్పోక్తవిధులఁ బ్రసన్నఁజేయుఁ
బూజఁగావించు నాగన్నభూపు, రాఘ
వాంబికాధీశుఁ గృపఁబ్రోవుమా భవాని!
ప్రయివేటు సెక్రటేర్పదమునఁ దనరారు
చందువంశభవుండు స్యాలకుండు
గుణరాశివేంకట కోదండరామకృ
ష్ణయనాయఁడాత్మ హర్షమువహింపఁ
వెల్లటూర్యన్వయ వీరయాభిధుఁ డసి
స్టాంటు సెక్రటరి వేడ్కనురహింపఁ
బ్రాజ్ఞవర్ణ్యుండు సిరస్తదారగు రామ
కృష్ణరెడ్డి మనఃప్రహృష్టిఁ దెల్ప
వడ్లపట్ల సువంశభవ రామలింగేశ
రావంతికోద్యోగి ప్రమదమంద
బ్రథితుండు హెడ్డుజవాబినీనీసు వేం
కటరావు పులకితాంగమున సమర
నిపుణుఁడు హెడ్డెకౌంటెంటగు తల్లాప్ర
గడ బాలకృష్ణవిజ్ఞాని యలర
శ్లాఘ్యచర్యుం డసిస్టాంటుజవాబ్నీసు
భానుమూర్తి ప్రమోదభావమూనఁ
దల్లాప్రగడ కులోత్తంసుఁ డకౌంటెంటు
వీరభద్రార్యుండు ప్రియముసూప
వీరరాఘవసమాఖ్యారాజితుఁడు కమీ
షనరు శాంతిపయోధి సంతసింప
సన్నిధానకుల ప్రశస్త సీతారామ
గుణి గణనీయుండు కుతుకమంద
దామరాజసుగోత్ర ధన్యుండు సూర్యప్ర
కాశాహ్వయుండు డాక్టరెదమెచ్చ
సివిలురిజష్ట్రారు శ్రీ పెమ్మరాట్కుల
రామలింగార్యుఁ డౌరా! యనంగ
సరసుండు కొవ్వలి సత్యనారాయణ
మూర్తి యక్కౌంటెంటు మోదమొంద
నడిదమన్వయ శోభనాచలసుజనుండు
పరమసంతోషంబు నెఱుకపఱుప
బమ్మదేవరకులబంధుండు శ్రీరామ
కృష్ణనాయండు సంప్రీతిఁజూప
కులబంధువుండైన గుణశాలి ధృతిశాలి
సుబ్బయ్యనాయఁ డెచ్చుగ గణింప
వడ్లపట్లాన్వయోద్భవుఁడు సీతారామ
సద్గుణి ఫేష్కారు సన్నుతింప
ఆదినారాయణాహ్వయుఁడు నారాయణ
పురము ఠాణాదారుఁ డరుసమంద
మఱియు నుద్యోగులు మాన్యులు సుకవులు
పండితవరులు సంబరముఁజెంద
విజయరాఘవనామ సాధ్వీవతంస
మతితరానంద కందళితాంతరంగ
గాఁగ నీ చేసినట్టి సత్కారశతము
లఖిలజననంద్యములు నాగనావనీంద్ర!
ఆశీర్వాదము
మణి గిరి నగర క్షమావల్లభుల కీర్తి
చంద్రికాహాసల సఖ్యమెనసి
ఆత్మకూర్గద్దవాలాపనీధవ కీర్తి
ముకురకపోలల ముదముఁగాంచి
మునగాల, వనపర్తి, జననాయకుల కీర్తి
కుట్మలదంతల కూర్మిఁజూచి
ఉయ్యూరు, పీరపురో ర్వ రేశుల కీర్తి
కంబుకంధరలతోఁ గలసి మెలసి
ఉర్లాము వెల్లవూ, రుర్వీశవర కీర్తి
మౌక్తికహారల రక్తిఁదేలి
నరసరా డశ్వరాట్పుర నరేంద్రుల కీర్తి
ధవళలోచనల బాంధవము మెచ్చి
వర మైలవర, పెద్దపవని, భూవర కీర్తి
చంద్రాననల చెల్మి సంతరించి
అల చల్లపల్లి, దొడ్డమపేట నృపకీర్తి
హంసయానల సత్ప్రశంస లెఱిఁగి
బొబ్బిలి, జటప్రోలు, భూవల్లభుల కీర్తి
వజ్రతాటంకల వాసికలరి
ఖాసీముకోట, వేంకటగిరి నృప కీర్తి
చందనగంధుల సౌఖ్యమరసి
మఱియు నఖిల ధరానాథ మహితకీర్తి
మల్లికా స్రగ్విణులఁగూడి మాటలాడి
సకలభువనాభినంద్యయై సంచరించుఁ
గాతఁ ద్వత్కీర్తికాంత నాగన నరేంద్ర!
శబ్దరూపములు, స్పర్శరస గంధములుర్వి
నెంతదాఁకఁబొసంగునంతదాఁక
శబ్ద, రూపములు, స్పర్శ, రసంబు, లుదకమం
దెంతదాఁకఁబొసంగునంతదాఁక
శబ్ద, రూపంబులు, స్పర్శంబు, వహ్నియం
దెంతదాఁకఁబొసంగునంతదాఁక
శబ్దంబు, స్పర్శంబు, శ్వసనదైవతమునం
దెంతదాఁకఁబొసంగు, నంతదాఁక
నలఘు శబ్దాత్మకంబగు గుణం, బభ్రమం
దెంతదాఁకఁబొసంగు నంతదాఁక
స్థిరతరములౌతఁ దావకశ్రీసుకీర్తి
వైభవంబులు, భువనసంభావితములు
రాఘవాంబామనః పయోరాశి విహర
ణాచ్యుతానందరూప! నాగావనీప!