కొప్పరపు సోదర కవుల కవిత్వము/మద్రాసు సభలు

పండిత కవుల ప్రశంసలు

లేక

కొప్పరపు కవుల యశోడిండిమము

మద్రాసు సభలు

శ్రీ చిరుమామిళ్ళ లక్ష్మీనారాయణ ప్రసాదు, బి.ఏ.గారు

ఉపోద్ఘాతము

సోదరులారా! విద్యాభిమానులారా!

బ్రహ్మశ్రీ కొప్పరపు సోదర కవీశ్వరులిదివఱకు శతావధానాష్టావధానము లనేకములుగా జరిగించియుండిరి. కాని, నేనెఱింగినవి మాత్రము శశిరేఖాది పత్రికల నుండి కొన్నిటి నెత్తి వ్రాసితిని.


శ్రీ కొప్పరపు కవులని కీర్తినొందిన బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకటసుబ్బరాయ వేంకటరమణాభిధానులయిన కవిశిఖామణులు, సోదరులు. వీరు నివసించు గ్రామము కొప్పరము. తాలూకా నరసరావుపేట. జిల్లా గుంటూరు.

వీరు పదిరెండేడుల వయస్సులో నుండినపుడే కవిత్వమల్లువారు. తమ తండ్రిగారయిన వేంకట రాయలగారియొద్దను, ఏర్చూరి గ్రామనివాసులయిన బ్రహ్మశ్రీ పోతరాజు రామకవి గారియొద్దను, నర్సారావుపేట నివాసులగు బ్రహ్మశ్రీ రామడుగు రామకృష్ణశాస్త్రిగారి యొద్దను విద్యనభ్యసించి క్రమక్రమముగాఁ గవితాశక్తితో నవధానసామర్ధ్యమును వృద్ధిపరచికొని పట్టణములందును, పల్లెల యందును రసికులచే మెప్పుఁజెంది అష్టావధాన శతావధాన సభ లిదివఱకెన్నియో జరిగించియున్నారు. మణికొండసంస్థానమున శ్రీతవిటిరెడ్డి గోపాలరెడ్డిగారను పండిత ప్రభువర్యునిచేఁ బండితప్రియంబుగా “బాలసరస్వతి" యను బిరుదము నంది యున్నారు.

నెల్లూరులో విద్యాప్రియులయిన మహాజనులచేఁ గూర్పఁబడిన సభలలోఁ దమ యాశుకవిత్వావధాన సామర్థ్యములఁ బ్రకటించి కవీంద్రసమ్మతముగా “ఆశుకవిసింహ” బిరుదము నొందిరి.

అప్పుడచ్చట స్పెషల్ డిప్టీకలెక్టరుద్యోగులును సంస్కృతాంధ్ర హూణభాషా ప్రవీణులును సత్కవితాధురంధరులునైన బ్రహ్మశ్రీ జయంతి రామయ్య పంతులు గారమ్మహాసభలో బిరుదమిచ్చు సమయమున

పంచశరున్ విరాలి గొలుపంగల చేడెల వాడిచూడ్కులన్
గొంచెము విచ్చు జాజిపువు గుత్తులనంటిన కమ్మతెమ్మెరన్
గాంచనగర్భురాణి కరకంజమునందలి చిల్కపల్కులన్
మించునుగాదె వీరి కమనీయ మహీయ కవిత్వసంపదల్

అని వచియించియున్నారు.

అచ్చట నుండి ఇరువది నాలుగు జిల్లాలకు ముఖ్యస్థానంబై లక్ష్మీ సరస్వతీ నివాస సదనంబై, రాజధానియై పొగడ్తకెక్కిన చెన్నపట్టణంబున కేగి అందుఁ బండిత కవీంద్ర మండల మండితంబులయిన మహా సభలలో నాశుకవిత్వావధాన విలాసంబులనేక విధంబుల గనుపరచిరి.

అట్టి యవధాన సమయములయందు సంతసించిన పండిత కవీంద్రు లీక్రింద నుదహరించిన విధంబునఁబద్య సత్కారంబుల జరిపిరి.

ఆనంద ముద్రాక్షర శాల హూణ సంస్కృతాంధ్ర పండిత కవులగు శ్రీమాన్ తంజావూరు దేవరాజ సుధీమణి గారు^

గుట గుట లింతగావు పటుగుంభిత గాంగ ఝరుల్సరస్వతీ
కటక ఝణం ఝణల్ శ్రుతి సుఖంబులు వేంకట సుబ్బరాయ వేం

కట రమణాఖ్య సత్కవులు గాఢ మనీష నొనర్చినట్టి యు
త్కట రసభావ భాసుర వికాస వచో రచనా విలాసముల్.

కలిమిన్ గొప్పరపన్వయోద్భవులు నిర్గర్వుల్ గవీంద్రుల్సుధీ
శులు వీరిప్పుడొనర్చినట్టి సరసాశుస్ఫార వాగ్వైఖరుల్
చెలఁగెన్ బో నవకంబులై నవరసోత్సిక్తంబులై నవ్య ని
ర్మల మందార మరంద బిందులహరీ మాధుర్య ధుర్యంబులై

రైల్వే డిపార్టుమెంటులో నుద్యోగస్తులును బండిత కవులునగు మ.రా.రా గద్దె రంగయ్య నాయుఁడు గారు

మీకవితాపటుత్వమును మీమహదద్భుత కల్పనంబులున్
మీకమనీయపాకములు మీసమయోచిత యుక్తిశక్తులున్
నాకనివాసులన్ముదమునందఁగఁ జేయుననంగ నిట్టి భూ
లోకజనాళిభావముల లోఁగొనఁజేయుట యబ్బురంబోకో

నిక్కము పల్కెదన్ వినుఁడు నే మిముఁబ్రీతులఁజేయఁగోరిపెం
పెక్కసుతించుచుంటినని యెంచెదరేమొ యదట్లుగాదు మీ
చక్కని యాశుధారయును జల్లని శైలియుఁ బ్రౌఢవాక్కు లే
నెక్కడఁజూచియుండనని యెల్లరకున్ వివరించుటే సుఁడీ

తిరుపతి వేంకటేశ కవిధీరులొకెత్తును మీరొకెత్తుగా
సరితులదూఁచ వారలను సర్వవిధంబులఁ బోలఁదూఁగుచున్
పరమయశంబు వారివలెఁ బల్మరు దిక్కుల నించుచు న్మహా
గరిమఁ జెలంగు మిమ్ముఁగని కౌతుకమందితిఁ దృప్తిఁచెందితిన్

ఆయుర్వేదీయవైద్యజ్యోతిష విద్వాన్ శ్రీయుత, బి.వేంకటరంగమునాయుఁడుగారు

గురుతరసభ్యులార మనకొప్పరపుంగవులైన సుబ్బరా
యరమణమంత్రిపుంగవ కృతాద్భుత భవ్యశతావధాన స

త్వరకవితాప్రభావములు వారిసుధామధురప్రకల్పనల్
కరమరుదారఁగాంచితిమి కంటిమె యిట్లెపుడైన నిద్దరన్

వారికవ్యాశ్రయ ప్రస్ఫురద్గరిమంబు
         వారి నైర్మల్యము వారిరీతి
వారిధారాశుద్ది వారిచల్లఁదనంబు
         వారి ద్విజన్మత వారిరుచియు
వారి పంకవిమోచనారూఢభవ్యత
        వారికూలంకష వర్తనంబు
వారిరసస్ఫూర్తి వారి గంభీరంబు
        వారిఘనోదయ ప్రకటనంబు

వారిసరసులదనుపు ప్రవాహగతియు
వారిసర్వజ్ఞమానిత ప్రాభవంబు
వారిభాస్వరకలన వహ్వాతలంప
వారికేతగుఁగాక నెవ్వారికగునె?

గవర్నమెంటు ఓరియంటల్ లైబ్రెరీ సంస్కృతాంధ్ర పండితులగు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు

నిరుపమ సత్కవిత్వ రమణీయులు నద్భుత వేగ దివ్య వాగ్
ఝరులు మహా ప్రవీణులును జాణలుఁ బ్రౌఢ శతావధాన దు
స్తర తర తంత్ర నిర్వహణ దక్షులు నెవ్వరటన్న మున్ను మా
తిరుపతి వేంకటేశ కవిధీరులఁ జెప్పుదు మిమ్ముఁ జెప్పుదున్.

స్వధర్మప్రకాశినీ సంపాదకులును వేదశాస్త్రపారంగతులునగు బ్రహ్మశ్రీ కనపర్తి మార్కండేయ శర్మగారు

కవితాసతీమణీ కమనీయ కేళికా
           వనులైవిరాజిల్లు వారలెవరొ

సరస భవద్వచోమృత వశంబునఁ జొక్కిన నాముఖంబునన్
బరవదు వాణి దాఁదెరలి భక్తియె గైకొనుమయ్య ధీమణీ.

పచ్చెయప్ప హైస్కూల్ సంస్కృతాంధ్రోపాధ్యాయులగు బ్రహ్మశ్రీ పర్ణశాల నృసింహాచార్యులవారు

విజయేతాం కవివర్యౌ కొప్పర వంశాబ్ది కౌస్తుభాబ్జౌ తౌ
యత్కవితా మధురిమ్ణా సంతుష్టాస్మోవయం నిరతాం.

శ్రీమత్కొప్పర వంశ మౌక్తికమణి శ్రీసుబ్బరాయాహ్వయ
స్తస్య శ్రీరమణోనుజశ్చ జయతాం సారస్వతజ్ఞోత్తమౌ
యౌ రామస్య సుతా వివాశుకవితా చాతుర్యలోకో స్వయం
జాతౌ సర్వజనైస్సదా భువినుతౌ సంభావితౌ సాదరం.

పర్ణశాలేన కౌండిన్య నరసింహేన సాదరం
కవితా మాధురీ సార పరితు ష్టేన సన్నుతౌ

తండియార్‌పేట హైస్కూల్ సంస్కృతాంధ్రోపాధ్యాయులగు బ్రహ్మశ్రీ బి.వేంకటరామానుజాచార్యులవారు

సరసపువాక్చమత్కృతుల సర్వజనంబుల కాదరంబుగా
స్థిరతరబుద్ధితోఁ జెలఁగిచేసెడు నీదు శతావధానమం
దరుదుగ మర్త్యలోకముననాడెడు భారతియో యటంచు నే
వెరవుగఁజూచినాఁడ సుమి వేంకటసుబ్బ కవీంద్ర శేఖరా

ముత్యాలపేట హైస్కూలుకవి పండితోపాధ్యాయులగు మ.రా.రా. పోకల వేంకటనరసింహారావు నాయుఁడుగారు

ఈసత్కవీశ్వరుల్ భూసురోత్తంసులు
           గొప్పరపన్వయుల్ గుణకుశలులు

వేంకటసుబ్బరా డ్వేంకటరమణాహ్వ
         యములచే భాను శశాంకులట్ల
నాంధ్రదేశంబున నతికీర్తి వహియించి
         నేఁడు చెన్నపురంబుఁజూడ వేడ్క
నరుదేర నీకన్యకాలయంబునఁగన్య
         కాదేవిభక్తులౌ ఘనముఖులిటఁ

జెలిమి నవధానకార్యంబుఁ జేయఁజేయఁ
గాంచితిమిగాదె కన్నులకఱవుదీలు
నింతకన్ననువేఱుగా నేమివలయు
సరసగుణులార యో సభాస్తారులార

మ.రా.రా. బి. వేంకటరంగకవి గారు

ఆకుల నీకెల పుడకల
కాకుల గూడల్లినటులఁ గల్పించెడియా
కాకవుల కైతలెన్నఁడు
నీకవులకవిత్వములకు నెన గాఁగలవే?

బ్రహ్మశ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులు శ్రీ కొప్పరపు సుకవి ప్రశంసా నవరత్నములు

అయ్యా! కొప్పరపుం గవీశ్వరులు మీ యాస్యంబు మేమేప్పుడే
నొయ్యంజూడఁగ లేదు శిష్యుఁడొకఁడోహోయంచు మెచ్చె న్మిమున్
వెయ్యాఱ్లియ్యఁగ శక్తిలేదు కొనుఁడీ వెయ్యాఱులేయంచు మే
మియ్యంబూనిన పద్దెముల్ మనుఁడి మీరెచ్చో నిరాఘాటు..

అరుదగు మీ కవిత్వమని యాప్తుఁడు శిష్యుఁడు నైన మా ప్రభా
కరము వచింపఁగా విని యఖండ ముదంబును పొందినాము బం

దరు దరి కేగుదెంచియును దామటకున్ జనుదేరకుంట మీ
దరిసెన మబ్బదయ్యెఁ బరితాపకరంబిది మాకు నెంతయున్.

సరిగ శతావధానములు చక్కఁగ ఁజేసెడివారు పూర్వమే
వరలిరి నేఁడు లేరనెడి వార్తలు కల్లలు దివ్యవాక్ ఝరీ
భర పరిపూరితాద్భుత సభా సదలంకరణ ప్రచార సుం
దర తర భావభావుక కనద్భవదీయ వధాన సంపదస్.

చనెడు శతావధానమను జాహ్నవి సంద్రమునందు డిందఁగా
నని జగమాడు నప్పలుకులన్నియు నేఁటి కబద్దమయ్యెఁ ది
న్నని కవితా ప్రవాహమున నాటక వేషములట్లుగాక మీ
రొనరుచు నున్న దివ్య కవితోదయమన్ హ్రదమడ్డువచ్చుటన్.

ఏమొక కొంతకాలమెదియో నొకతీరు శతావధానముల్
గ్రామములందుఁ బల్లెలను రాట్సభలన్ మఱి రాజధానులన్
స్వామి కృపావిశేషమున సల్పిన వారము సల్పుచుంటి మీం
కేమగునో, మఱేమి కొద వీరవధానుల రుద్బవించుటన్.

బందరు వచ్చియచ్చటి సభాసదులన్ దనియించి వారిచేఁ
జందనమో సుమంబొ మఱి శక్తికి మించని దేనిగాని మీ
రంది కృతార్థులన్ సలుపుఁడయ్య మమున్ మిముఁజూచుకోర్కె మా
డెందములందు మిక్కిలిఁ గడిందిగ సందడి చేసెడిన్ జుఁడీ

అనఘులు కూపకూర్మముల యట్టొకచోటనె మగ్గి సగ్గి నూ
తనమగు పాడుత్రోవ నవధానము మానము గంగఁగల్పి తా
మనృతమె యూఁతగాఁగొనెడి యర్భకపుం గవులట్లు గాక మీ
రొనరుచు మార్గముల్ మది కహోయని మెచ్చొడఁగూర్చెడున్‌జుఁడీ

మీ నామంబులు మీయవ
ధానము విని మాయ కవులు తలలెత్తక లో

లోన నిఁకనేని సిగ్గును
బూని యొకట నుండ్రుగాక బొమ్మల పోల్కిన్.

శశిలేఖలోనఁ జదివితి
విశదంబయ్యెన్ భవత్ప్రవీణత మీకున్
యశమబ్బుఁగాక భగవ
ద్వశమై యాయువును సిరియు వఱలెడుఁ గాతన్.

సంస్కృతాంధ్ర భాషా పారంగతులగు బ్రహ్మశ్రీ మహర్షి కావ్యకంఠ గణపతి శాస్తులవారు

అంగ వాం వచన భంగ మాలినో
స్సూరి సంసది కుతః పరాజయః
సుబ్బరాయ రమణౌ మహాకవీ
వేంకటోహి యువయోర్ద్వయోః పురః

బ్రహ్మశ్రీ శతఘంటము వేంకటరంగ శాస్తులవారు

ఆశు కవీంద్ర సింహములటంచును బాలసరస్వతీ పదా
ధీశులటంచు ఘంట యొకఁడెన్న శతద్వయ పద్య కల్పనా
కౌశల వంతులంచు సుభగంకరణప్రవణావధాన వి
ద్యాశిత బుద్ధులంచు విని తద్దయుఁగోర్కులు వ్రేళ్లు వారఁగన్.

అరుదెంచి చూడ నవధా
నరచన యత్యద్భుతంబు నా కోనగూర్చెన్
సరసముగ మాటలాడెడు
కరణిన్ గవనంబు సేయఁగా శక్యంబే.

కనకాంగి చరిత్రముఁ గృతి
బొనరింపుఁడటంచు సభ్య బుధు లిటఁగోరం

గను వల్లే యని దానికిఁ
బనివడి రచియించిరౌ ప్రబంధము నిపుడే

అరగంటలోనఁ జాతురి
వఱలఁగ మృదు పద్యముల్ జవంబునఁ గవులం
దఱు మెచ్చ లేక్క మీఱఁగ
నొఱుపుగ రచియించి రిద్ది యొరులకుఁదరమే

వేంకట సుబ్బరాయ సుకవిప్రభుఁడాతని తమ్ముఁడైన యీ
వేంకట నామ సత్కవియు విశ్రుత కొప్పర వంశవార్ధి నే
ణాంకుఁడు కౌస్తుభంబనఁగ నభ్యుదయంబును జెంది చారుని
శ్శంకతరావధానము వెసం బచరించుట వింతఁగొల్పెడిన్

ఈ యిద్దఱి యాశు కవి
త్వాయత చాతుర్య విస్మయాంభోరాశి
స్ఫాయత్తరంగ మాలా
వ్యాయత్తత నొండు దోఁపదయ్యె నెడందన్

బ్రహ్మశ్రీ ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బరాయ పంతులుగారు

ధోరణి నిర్జరాంబువని తోఁపగ గంటకు మూఁడు నూర్లసా
ధారణ వేగయుక్తి బుధ తండము మెచ్చఁగఁబల్కి పద్యముల్
ధారణ తప్పకుండ నవధాన శతంబు ఘటింపఁజాలు నో
సూరి వరేణ్యులార! మిముఁజూడ మహాద్భుతమయ్యె నాత్మలోన్.

ఉత్పలమాలిక

శిష్టవరేణ్యులార! బుధశేఖరులార! కవీంద్రులార! సం
దృష్టము నేఁటి యీసభ త్వదీయమహాశుకవిత్వ సంపదల్
తుష్టిని గూర్చెనేని విబుధుండొక పద్యమునిచ్చునన్న ని
ర్దిష్ట సుభాషితంబుగొని ప్రీతిమెయిన్ వచియించువాఁడ ని

ర్దుష్టపు మీ కవిత్వమున రూఢిని నెయ్యెడఁ గానరావు సం
క్లిష్టములైన మాటలును క్లిష్టపదంబు లనర్ధకోక్తులు
త్కృష్టతరంబు వేగమనికృష్టముధోరణి శాస్త్రపాండితీ
మృష్టము సుప్రయోగము విసృష్టములౌర జఘన్యజల్పముల్
స్పష్టము భావమున్ సమయచాతురి భవ్యము నవ్య మెంతయున్
గష్టము శ్రోతకుం ద్వదనుగంతృత మీరు వచించు చోఁబురా
దృష్టము నశ్రుతంబుగద యిట్టి ప్రభావము గ్రామ్యభాషణా
శ్లిష్టము శైలి మీకుఁ బ్రతిసెప్పఁగ నెవ్వరునేర్తురో మహా
నిష్టముగూరనున్నయది యియ్యెడ భాషకు గ్రామ్యమొక్కఁడే
యిష్టమటంచు నొక్కపసయేదిన వాదముపుట్టఁగా మహా
దిష్టము మిమ్మువంటి గురుధీరకవుల్ జనియించుటల్ సభా
సృష్టవిధంబుగాఁగ జన హృష్టికరంబుగ సూరిమానసా
కృష్టిగఁబల్క నేర్చుటలు కీర్తితశీలురు నేఁటిగోష్ఠి ని
ర్దేష్టలు మిమ్ము మెచ్చి మొహరీలు వరాలు సరాలుకానుకల్
పుష్టిగనిచ్చి తన్పుటలు పోయె భయంబెదనాంధ్రవాణికిన్
భ్రష్టము నష్టమయ్యెఁ బెడవాదము సద్గుణశాలులాంధ్రమో
విష్టపమందు భాసిలఁగ వేడ్క రహింతురుగాక పండితుల్

తడయరు ప్రశ్నంబడిగిన
దడవరు పల్కులకుఁ గాఁగఁదడఁబడ రెపుడున్
నొడువుల మిడుకరు తోఁపక
వడివడి వచియంత్రు మున్ను వల్లించినటుల్

అనుచు వావిలికొలను సుబ్బాహ్వయుండు
బుధుల సుకవుల గొప్పరపుంగులాబ్ధి
విధుల వేంకట సుబ్బాఖ్యు వేంకటరమ
ణాఖ్యుఁదత్కవితాశక్తి కభినుతించు

బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు

ఆరయఁ దొంటి కాలమున నత్తయుఁ గోడలు గూడిమాడి మా
భారత జాతికెల్ల బహు భంగుల వన్నె యొసంగి రిప్పుడా
కూరిమి వీడి యత్త కడుఁ గొండిక చూపునఁ జూచుచుండినన్
భారతి మాత్రమెంతయుఁ గృపారతి నున్నతి నిల్పుచుండెడిన్

నాల్కతుదన్నిరంతరము నాట్యము సల్పుట కీ సహోదరుల్
పల్కు వెలందినట్లు తొలి బామునఁ గొల్చిరొ తేట తేనియల్
చిల్కినయట్లు విందొసఁగుఁ జెప్పిన పద్దెము లెల్ల వహ్వరే
పల్కిన పల్కులన్నియును బద్దెములయ్యెడు నేమి చెప్పుదున్.

ఆలోచించుట లేదు కల్పనకుఁ బద్యారంభ యత్నంబు ము
న్నే లేదించుక ప్రాసకేని యతికేనిన్ గొంకు కన్పట్టదే
యాలస్యంబును గల్గఁబోదు బళరా యయ్యారె యివ్వారికిన్
బాలేయౌఁ జుమి యాశుధార కవితా ప్రారంభ నిర్వాహముల్.

అమితాశ్చర్య శతావధాన రచనాత్యాశు ప్రబంధోక్తి ని
స్సములౌ తిర్పతి వేంకటేశ్వరులకున్ సంతోషముం గూర్చు భ
వ్య మహా శక్తులు వీరలాశు కవితోద్యద్రాజ పట్టాభి షే
కము నందందగు నట్టి దిట్టలని వక్కాణింతు నిక్కమ్ముగన్

బహ్మశ్రీ ఆశుకవి చెన్నాప్రగడ భానుమూర్తి పంతులుగారు - మాలిక

వరహిమశైల నిస్సరదవారితగాంగ ఝరావతారజి
త్వరమయి, పద్మ భూవదన భాసుర రంగ నట త్సరస్వతీ
చరణసునూపురారసిత చారుతరంబయి తత్కరాంబుజా
గ్రరుచిర రాజకీర మధురస్పుట వాగ్విసరాను కారియై
యరిమురి బారుమీదు కవితామృతధారలఁదోఁగుమాకు నీ

ధరపయి స్వర్గమబ్బెఁగడు ధన్యులమైతిమి నేఁడు మీదయన్
వరకవిసింహులార! ప్రతిభా విభవోజ్జ్వలులార! భవ్య కొ
ప్పర వర వంశవారినిధి పార్వణ శీతమయూఖులార! సో
దర కవులార! గైకొనుఁడుదారత మా యభివందనంబులన్
సరస కవీంద్ర సత్తములు సారవచో విభవాభి రాములౌ
తిరుపతి వేంకటేశ కవిధీరుల మన్ననఁగన్న మిమ్ము మే
మెఱిగి ప్రశంససేఁత జగమెల్ల నెఱింగిన యల్ల విప్రశే
ఖరునకు జన్నిదంబిడుట కావున నే విరమింతు నింతతోన్

పరిచిత భాసురార్ధపద బంధము లందముగాఁగఁ బద్దెముల్
సరసవచస్థ్సితిం దవిలి సర్వజనుల్ నుతియింప గంటకున్
బరువడి మూఁడునూరులు ప్రబంధముగా రచియింప నేరికిన్
దరమగునే మహిన్భవదుదార పురాకృత పుణ్యసంపదం
బరగెడు మీకుఁగాక కవిమాన్య సుధీయుతులార! యారయన్

వరమతినన్నపార్యుఁడును వాఙ్మయలోకవిధాతయజ్వయున్
సురుచిర బంధ దక్షుఁడగు సూరీవరేణ్యుఁడు శంభుదాసుఁడు స్వరకవితాపితామహుఁడవంధ్యచరిత్రుఁడు పెద్దనార్యుఁడున్
మఱియును వన్నెగన్న కవీమాన్యు లనేకులు కీర్తిశేషులై
యఱుఁగుటఁ జేసి వారి కవితామృత ధార పరోక్షరీతి న
క్షరమయ కావ్యరూపమునఁ గాంచుటె గాని సచేతనాకృతిన్
వరలఁగ జూచి సంతసిలు భాగ్యములేని కొఱంత కొంత దా
మరలు సరస్వతీ మహిత మంగళ విగ్రహులౌచు నిట్లు గొం
దఱు కవితావిలాస సముదంచిత బుద్ధిసమిద్ధు లిద్దరన్
దొరకి వచోమృతంబు దయతో వెదజల్లుచు నుల్లసిల్లఁగన్

బహ్మశ్రీ ఆర్య సోమయాజుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు

వర వేంకట రమణ సుధీ
వర వేంకట సుబ్బరాయ పరికించితి మీ
సరస కవిత్వపు ధోరణి
పరమానందంబు నెదను పాదుకొలిపితిన్

సాయంనటన్నటేశ్వర జటాతటవిని
           ర్గతగాంగభంగాళికల్పనాళి
మాకంద గోస్తనీ మాకరంద రసాతి
           రేకంబునకు మంజు టీక పాక
మన్యోన్యచరిత వాక్యార్ధ నిర్దూత న
           వ్యశిరీష పేశల వ్యక్తిసూక్తి
పండితాహ్లాద కృద్భావ రసౌచిత్య
           హృద్యానవద్యంబు పద్య సరణి

జవవిభిన్న నిరాఘాట సవితృఘోట
గరుడ పవమాన పరిపాటి కవన ధాటి
గురుతరంబుగ మీకుఁ జేకూరి నౌర
సూరి నుతులార! సోదర సుకవులార!

సరసత్వంబు మనోహరత్వము ప్రశస్తత్వంబు శోభిత్వమున్
బురుషార్ధప్రతిబోధకత్వమును సంపూర్ణప్రభావత్వమున్
పరమార్ధప్రతిపాదకత్వమును సంప్రాప్తించి రాణించుతన్
నిరతంబున్ భవదీయ మంజుతర వాణీధోరణిన్ ధారుణిన్

ధారుణిలో ననేకు లవధానము లెన్నియొ మున్నానర్చుచున్
బేరును బెంపుగాంచిరని వింటిని, గంటిని నేఁడు మిమ్ముఁ, జే
కూరిన తృప్తిఁబద్యములఁ గొన్ని యొసంగితిఁ గాన వీని వే
యారులుగాఁదలంచి యుపహారముగాఁ గొనరయ్య వేడ్కతోన్

భారద్వాజ సగోత్రుఁడ
హారియశుఁడ నార్య సోమయాజుల లక్ష్మీ
నారాయణ శాస్త్రిని సువి
చారుఁడ బేరూరిద్రవిడ శాఖోద్భవుఁడన్

ఆయుర్వేదీయవైద్యజ్యోతిష విద్వాన్ శ్రీయుత బొద్దకూరపాటి వేంకటరంగమునాయుడుగారు

సమదర్శులై యొప్పు సర్వజ్ఞమూర్తులు
          నజులుగాని చతుర్ముఖాంచితులును
పుణ్యజనావనాద్భుత పురుషోత్తముల్
          కులగోత్ర హితులైన గోప్రభువులు
సరసుల దనిపెడు సజ్జగద్బంధులు
          న్యూనతలేని కళా నిధులును
పాత్రవదాన్యులౌ బలిచక్రవర్తులు
          చెలి భిక్షుఁజేయని శ్రీదులనఁగఁ

దనరు చెన్నపురీమహా జనసభాగ్ర
గణ్యులార! భవత్ప్రియ గౌరవంబు
గాంచి భాసిల్లు నీయాశుకవులఁ గూర్చి
సుంతయేను బ్రశంసింపుచున్నవాఁడ
సభ్యులందఱు నన్ దయ సైచవలయు

చంపకమాల

పటిమగలట్టి కొప్పరపు వంశ్యులు వేంకట సుబ్బరాయ వేం
కట రమణాఖ్య సత్కవులకైతనుతింపఁ దరంబె శారదో
త్కటకటిసూత్ర భాగ్మణిరుగంచిత కాంచన కింకిణీగణా
ర్బటులఁ దదీయసుందర కరాగ్ర విభాసుర రత్నకంకణ
స్ఫుటతర నిష్కళంక పరిపూర్ణసుధా మధుర స్వనంబులన్

గటకఝళంఝళార్భటులఁగ్రాలు దినాంతసమున్నటన్మహా
నటపటు తామ్రజూట తటనవ్యశశాంక సుధామయూఖ సం
ఘటిత నిరంతరోద్గత సుకౌతుక గాంగ తరంగభంగికా
ర్భటుల ఘుమం ఘుమధ్వనుల ప్రాభవమున్ దెగడున్ దలంపఁబ్రా
కటసరసాశుధార గతిగన్న పురస్కృత బృంహితారవో
ద్భటకరణీ ప్రజాన్విత మతంగజనాథ సదృక్షధూమశా
కటసముదగ్ర సత్వర మఖండిత వృత్తిహసించు నెంతయున్

శ్రీ ఆర్యసోమయాజుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు (మఱొకసభలో)

రీవిఁద్వత్కవనధాటీ జపంబునకోడి
          పవమానుఁడొకమూల బడిచలించు
భవదీయచతుర వాక్పటిమకోడి యనంతుఁ
          డడుగంటి ఫూత్కృతులాచరించు
భవదుక్తపద్య భావగభీరతకునోడి
          జలధిఘూర్ణిల్లుచు జలదరించు
తావకామేయ మేధాశక్తి గనిధాత
          పంకజన్మము పాలఁబడితపించు

యుష్మదభివర్ణనీయ రసోచితపద
మృదులతకునోడి నవ్యశిరీష కేస
రాళి ధూళిధూసరితమై యటమటించు
నాశుకవిచక్రవర్తి విఖ్యాతులార!

పండు రేయెండజిగి నటుండుండుమనుచు
నిండె మీకీర్తి సకలదిజ్మండలములఁ
బండితావళి నుతిసేయుచుండ ధుతవి
తండకవులార! గండరగండలార!

శ్రీ బొద్దికూరపాటి వేంకటరంగము నాయుఁడుగారిచే రచింపఁబడిన చంపకమాల (మఱొకసభలో)

పరమ తపస్వి యాశుకవి పండితలోక విధాత భూమిని
ర్జరకులమౌళి గండుషిత సర్వశృతిస్మృతి దర్శనుండు దు
స్తర బహుబంధ గర్భముఖ సర్వకవిత్వ విశారదుండు దు
ష్కర వివిధావధాన శతకల్పనుఁడద్భుత ధీవిరాజి భా
స్వర పరతత్త్వ వేది గణపత్యభిధాన సుధీశ్వరుండు ధీ
గురుఁడగు భానుమూర్తి కవికుంజరుఁడిద్ద యశస్వియౌ ప్రభా
కరకవి పండితుండు శత ఘంటము వేంకట రంగశాస్త్రి దు
ర్దరమతి యాంధ్ర వాల్మికి పదాంకుఁడు వావిలి కొల్నుసుబ్బరా
డ్వర కవి పర్ణశాలకుల వార్ధి విధుండు నృసింహ సూరియున్
మఱియు ననేక పండిత సమాదృతమైన భవత్కవిత్వమున్
సరిగను మాదృశుల్వినుతి సల్పఁగ శక్తులు గారహో సహో
దర కవులార! మీకవనధాటి మహామహిమంబుఁజూడఁగా
సరసిజ భూ కళత్ర ముఖసారస భవ్యకురంగ నాభకే
సరఘనసార సమ్మిళిత సౌరభ సాంద్ర మనోబ్జ వీటికా
గురు గురు సౌర బంధుర సుగంధ ఘుమంఘుమ వైభవంబునౌ
సురుచిర హృద్యపద్య పద శుంభదలంకృతి మాధురీ మనో
హరగతి గోస్తనీ బిసరుహప్రభవాచ్ఛ మరంద శర్కరే
క్షురస రసాల పేశల సుకోమల సార సుధాప్రవాహమై
వరలి శిరీష మార్దవ మవారిగఁ గన్పడు నాశుధార పెం
పరయఁగ వాయు వేగముఁ దదశ్వజవంబు సహస్కరాశ్వ స
త్వరము మహీధ్ర నిస్సరదవారణ నిర్‌ఝర రంహమాశుగా
తిరయము వృష్టిధారగతిఁ దీవరమున్ ఖగరాడ్జవంబు మో

టరు శకటంబు ధూమ శకటంబుల బల్వడి మించునంచు భే
షరెరె యటంచు నౌర భళి యంచు నహాయనుచున్ బలే బలే
యరుదరుదంచు బాగురెయటంచును బాపురె వాహ్వయంచు న
ద్దిర యనుచున్ శభాష్షనుచు దివ్యమటంచు నయారె మేలు మేల్
వెరివెలటంచు ముక్కుపయి వ్రేలిడుచున్ దలలూపనట్టి వా
రరయ నభావమే సభల యందది యేమొ సభా సదాళి గొ
ప్పర వర వంశ మౌక్తిక విభా విభవాంచిత మూర్తులార! శ్రీ
తిరుపతి వేంకటేశ్వర సుధీశ్వర శంసిత కీర్తులార! స
ద్వర కవులార! వేంకట పదద్వయ పూర్వక సుబ్బరాట్కవీ
శ్వర రమణాభిధాన కవిసత్తములార! గొనుండివే నతుల్.

సంస్కృతాంధ్ర పండితకవి శ్రీ పంగులూరు రామచంద్రయ్య పంతులుగారు

శ్రీమన్నిర్మల భవ్య కొప్పరకుల క్షీరాబ్ది రాకాసుధా
ధాముల్, కొప్పరనామధేయ నగరీ ధాముల్, మహామంత్రి సు
త్రాముల్, వేంకట సుబ్బరాయ రమణ ప్రఖ్యాత నాముల్, కవి
స్వాముల్ గాంతురు గాత శ్రీపతి కృపన్ సర్వేప్సితార్ధంబులన్

ఆరంభంబున కన్యకాభగవతీ హర్మ్యంబునన్ రెండు మా
ర్లూరవ్యాగ్రణి భాష్యకార్ల గృహ మందొక్కప్పుడా పిమ్మటన్
శ్రీ రామానుజ కూటమందొక యెడన్ జిత్రంబుగాఁ జేసిరీ
ధీరుల్ నాల్గు శతావధానములు సద్విఖ్యాతి దీపింపఁగన్.

అవధానంబులఁ బెక్కుజూచితిమి మున్నందందు నెందేనియున్
వివిధానల్ప సుకల్పనా నిపుణతన్ విద్వద్వరుల్మెచ్చ న
వ్యవధాన స్ఫురణోచితాశుకవితా వైచిత్రితో వీరియ
ట్లవధానంబొనరించు బాలురను విద్యాశాలురన్ గంటిమే.

అరుదుగఁ జెన్నపట్టణ మహాజన సభ్యనికేతనంబునన్
గరిమను హృద్య పద్య శతకద్వయ మొక్కరగంట నిక్కవీ
శ్వరులొనరించి యాంధ్రజన సంఘము వారిని దన్పి సన్మనో
హరముగ నొందిరందు బిరుదాంకిత కాంచన మండనంబులన్.

శరశీఘ్రంబును నదీరయంబును నభస్వద్వేగమున్ మానస
త్వరితంబున్ నిరసించు నాశుకవితా ధారా సుధా పూర ము
ర్వర నెల్లన్ ఘనులైన కొప్పర కవుల్ వర్షింప సామాజికో
త్కర చిత్రస్థలి సమ్మదాంకురము లుత్పన్నంబులై వర్ధిలెన్.

ఎటుల నుతింతు వీరినిపుడిర్వురు సోదరులాఱువేల ని
ష్కుటిల నియోగి ఋక్షగణసోములు వేంకట సుబ్బరాయ వేం
కట రమణఖ్యులెల్లర నఖండ సుఖైక రసాబ్ధిముంచి రొ
క్కట మన పచ్చెయప్ప సదగారమునన్ గవితా చమత్కృతిన్.

బ్రహ్మశ్రీ ముదిగొండ నాగలింగ శాస్త్రులవారు

వాణీం శ్రీ సుబ్బరాయాభిధనుకవిమణేస్తూర్ణమాకర్ణ్యవిజ్ఞాః
పూర్ణానందైకభాజోజగతిహి విచరంతీతి నైతద్విచిత్రం
కించిద్ జ్ఞాయద్యసూయాపరికరకలుషీ భూతనైజాంతరంగా
వైవర్ణ్యంద్యోతయంతే నిజవదనతలేష్వాత్మసంతాప కేతుం

కొంకకనారదాచెపుమ కుంభినిలోని విశేషవార్తలన్
బొంకముగాఁగవిన్ము సురపుంగవ! యాంధ్రమహామహీస్థలిన్
బంకజసూతినాగపతి భారతులందలపించునట్టియా
వేంకటసుబ్బరాడ్బుధకవిద్విపుసానుజు నెమ్మిఁగాంచితిన్

మిహికామహీధరో ద్వహదభ్రవాహిన్య
          భంగరారంగత్ప్రవాహకంబొ

హృద్యోదయధరాధరోద్యత్ప్రభాకర
         ప్రోద్యన్మరీచి ప్రజోత్కరంబొ
ప్రచరన్మహాభాష్య రచనాసుకౌశల
         ప్రచురఫణీంద్ర సద్వచనచయమొ
కౌరవ్యఖండన కారణగాండీవి
         గాండీవనిస్సరత్కాండగణమొ

నాఁగనుతిపాత్రమయ్యెమీ నవ్యరచన
కొప్పరపువంశకలశాబ్ది కుముదబంధు
లార! వేంకటసుబ్బ రాయాఖ్య వేంక
టరమణాభిఖ్యులార! కవిరవులార!

కలమున్ బూనుట కాగితంబుగొనుటా కాలంబపేక్షించుటా
లలిఁబ్రాసంబువడిన్ మదిన్ వెదకుటా లక్ష్యంబులూహించుటా
విలసత్కావ్య పరంపరాభిరచనా వేగంబుసంధింపుచో
భళి నీకున్ సరియుందురే కవులు సుబ్బారాయధీమన్మణీ

బరంపురనివాసి శ్రీ గాదె శ్రీజగన్నాథస్వామి పంతులుగారు

గంటకునూరుపద్యములు గట్టిగఁజెప్పఁగఁ జాలినట్టివా
రుంటకె యబ్బురంబు పడుచుంటిమి యద్దిర! యాశుధారగా
గంటకునాల్గువందలను గ్రాలఁగజెప్పుచు మెప్పుఁబొందు మీ
వంటి కవీంద్రచంద్రములఁ బ్రస్తుతిసేయఁగ నేవ్వఁడోపెడిన్

తిరుపతి వేంకటేశ కవిధీరుల వెండియు రామకృష్ణ ధీ
వరుల శతావధానవిధిఁ బైకొనినారని చెప్పఁగల్గుదున్
స్థిరమతి వేంకటేశకవి దీనిని దా శశిరేఖ వేసింగొ
ప్పరపుకవీంద్రులార తమభాగ్యముసాటి యొకండు లేఁడుగా

కవితల్ గూర్చెడు వాఁడు నూరుగురి కొక్కండుండు నందెన్ననా
శువుగాఁ చెప్పెడువాఁడు తక్కు వెటులున్ జూడంగ నవ్వారిలో
నవధానంబులుసల్పుజాణలుకడున్ స్వల్పంబుగానుండ్రు గా
ని వచోధోరణియందు మీసములు క్షీణిన్ లేరుముమ్మాటికిన్

కంటిని మీస్వరూపమును గంటిని మీసదసద్వివేకమున్
గంటిని మీవచఃఫణితిఁ గంటిని మీకవితావిలాసమున్
గంటిని మీసుమేధ మఱిఁ గంటిని మీయవధాన పద్ధతిన్
గంటిని మీ ప్రభావమును గన్నులపండువుగాఁ గళానిధుల్

ఆసుధాధారఁబోలు మీయాశుధార
నాలకించినఁ గర్ణరసాయనముగ
నున్న హేతువుచేత మిమ్మెన్నితి నిటు
లాశుకవిచక్రవర్తి పదాంకులార!

ఇట్లే కవివరేణ్యులచే మెప్పుగొనిన యీ సోదరుల గుఱించి చెన్నపట్టణమున శ్రీ కానుకొలను త్రివిక్రమరామారావుగారను నొక సుకవి వీరి యవధాన సభలలోఁ బృచ్ఛకుఁడుగా నుండి వీరికిచ్చిన సమస్యలు

"కామిని పాదనూపురము ఖంగున మ్రోఁగదు హేతువేమొకో ”

అనియుత్పల మాలచరణమొకటి సమస్యగానిచ్చి యిది యుత్పలమాలలో నుండఁగూడదని యడుగుటచే

తన జారకృత్య మితరులు
గనకుండఁ బటంబుఁజుట్టెఁ గాళ్లకిపుడు కా
మిని పాదనూపురము ఖం
గున మ్రోఁగదు హేతువే మొకో, యన నేలా?
"సంయమి వరుఁడౌటఁ గుదిరె సంసృతి సుఖముల్ "

సంయుక్త సుగుణపుంజా!
సంయమినీనాథ పుత్రసన్నిభ! సర్వా
హంయుద్వేషీ వినుమీ
సంయమి వరుఁడౌటఁ గుదిరె సంసృతి సుఖముల్

ఈ సమస్య శ్రీ త్రివిక్రమరామారావుగారు మద్రాసులో నీ సోదరకవులచేఁ జెప్పఁబడిన సంగతిని బందరులో వేంకటశాస్త్రిగారికిఁ దెలియుటకు జాబొకటి వ్రాసిరి. ఆ జాబువలనఁ దమ సంతోషమును తెలుపుచు వేంకట శాస్త్రిగారదిఁ కృష్ణాపత్రికలో ప్రచురించిరి.

శ్రీ పిఠాపురము రాజాగారు కొప్పరపు కవులను గౌరవించుట, శ్రీ బొద్దికూరపాటి వేంకటరంగకవి, ఆయుర్వేద వైద్య జ్యోతిష విద్యావేది

స్వచ్చయశోజిత శాంకరాచలరాజు
           భూరికళాంచిత భోజరాజు
పూజ్యరావుకులాబ్ది పూర్ణిమాద్విజరాజు
           ప్రకటసంపజ్జిత రాజరాజు
రమణీజనేక్షణ ప్రత్యగ్రరతిరాజు
           పూర్ణ మేధాజిత భోగిరాజు
ఉచితధీతోషిత హూణధాత్రీరాజు
           భాసురైశ్వర్య కైలాసరాజు

తనరు బాంధవ సుహృదాశ్రితావనుండు
ఘనవదాన్యుండు రావువేంకటకుమార
మహిపతిపదాంక సూర్యరాణ్మానవేంద్రుఁ
డిద్ధతేజుండు బీఠపురీశ్వరుండు

చంపకమాలిక

పురికొను కాంక్ష మొన్నఁ బదుమూఁడవ తేదిని నా విభుండు కొ
ప్పరపు శతావధాన కవివర్యుల నార్యులఁబిల్చి యెట్టియా
పుర శివగిర్నృపాలకులు మొక్కపురాంకుఁడు సుబ్బరాట్సుధీ
వరుఁడు గనంగ గంటకును బద్యశతత్రితయంబుగా నలే
శ్వర చరితంబుఁ జెప్పుమని పల్కిన నాకవులట్టులే మహా
త్వరిత గతిం రచింపఁ గని తద్దయు సంతస మంది ప్రేమతో
నరుదగు వేయినూట పదియాఱులు రౌప్యములిచ్చి తన్పె నీ
ధరణిపుతో సమానులగు ధార్మికులుందు రనంగఁ జెల్లునే.

మున్ను సంస్కృతకవుల సమ్మోద మొదవఁ
బోషణ మొనర్చినట్టి యాభోజవిభుని
ఆంధ్రకవులను బోషించినట్టి కృష్ణ
దేవరాయలఁబోలు నీ భూవిభుండు

ఈ కొప్పరపు శతావధానులయందుఁగల సామర్థ్యములు మిగుల మెచ్చఁ బడినవగుటచే అభినవ సరస్వతియను నొక మాసపత్రికలో 1911 సం, ఫిబ్రవరి 2వ సంచిక నిట్లు ప్రచురించిరి.

అత్యద్భుతవిమర్శనము అని పిఠాపురపు సంస్థాన కవీశ్వరులగుఱించినది

ప్రకృతము వీరియష్టావధానాంతర్నాటకమునకు నాంది

ప్రారంభింపఁబడుఁగాక - అంతర్నాటకము

ఒకనికినుప్పు వేరొకనికుల్లి యిఁకొక్కనికాముదంబు మి
ర్చొకనికిఁ గందులొక్కనికి నొక్కనికిన్ బెస లల్లమింక నొ
క్కొకనికి నేక కాలమున నొప్పుగనిచ్చుచుఁ బద్దువ్రాయున
య్యకు భగవంతుఁడిచ్చు నలయష్టవధానికి బచ్చుకున్ సిరుల్

(నాంద్యంతమున)



సూత్ర : (ప్రవేశించి) ఓయీ! విదూషకా! యిటురమ్ము
విదూ : (ప్రవేశించి) హి, హి, హి, హి, హి
సూత్ర : ఏమీ యా వెఱ్ఱినవ్వు
విదూ ; మళ్ళా మాట్లాడితే వెఱ్ఱినవ్వు నీది!
సూత్ర : వెఱ్ఱికాదులే వేదురు
విదూ : వెదురా! అవును మఱచినాను. తెచ్చుకొనియెదను (పోఁబోవును)
సూత్ర : (ఆపి) వెదురు కాదు వేఁదుఱు
విదూ : అట్లా చెప్పండి వేదమందురు!
సూత్ర : అఘోరించినట్లే యున్నది. వేదముకాదు వేఁదుఱు
విదూ : అనఁగా!
సూత్ర : అనఁగా వెఱ్ఱియన్న మాటయే
విదూ : తెలిసింది కాని ఇప్పుడు మీరు ప్రదర్శించునాటక మేది!
సూత్ర : ఆంధ్రప్రకాశికా శశిరేఖా సంవాదము
విదూ : మా పెద్ద పేరెట్టినా రే!
సూత్ర : పేరునకేమిగాని, ప్రకాశిక ప్రవేశించుచున్నది, మనమనంతర కరణీయమునకుఁ ద్వరపడుదము. పద (నిష్క్రమింతురు)
ప్రకా : (ప్రవేశించి) ఆహా! ఆ కొప్పరపు జంటకవుల ధార యెంత చక్కఁగా నున్నది. కావుననే బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు

నిరుపమసత్కవిత్వ రమణీయులు నద్భుత వేగ దివ్యవాగ్‌
ఝరులు మహాప్రవీణులును జాణలు దివ్యశతావధాన దు
స్తరతరతంత్ర నిర్వహణ దక్షులు నెవ్వరటన్న మున్ను మా
తిరుపతి వేంకటేశ కవిధీరులఁ జెప్పుదు మిమ్ముఁ జెప్పుదున్

అని వీరి అష్టావధానమును మెచ్చికొనిరి. (యోజించి) దినమును వచ్చు చుండెడి శశిరేఖ నేఁడేమొ యాలస్యము చేసినది.

శశి : (ప్రవేశించి) ఇదిగో! మా ప్రకాశిక (సమీపించి) చెలీ! కుశలమా?
ప్ర కా: నీ దయవలనఁ గుశలమే. నేను నీరాకకయియే చూచుచున్నదానను. మొన్న (8)వ తేదిని బ్రకటించిన యష్టావధానమున బ్రహ్మశ్రీ యత్యద్భుత శతావధానుల పేరు సుంతయు నెత్తలేదేమి?
శశి: వారెవరు?
ప్రకా : ఎవరా? రామకృష్ణగ్రంథమాల చూడనేలేదా? అత్యద్భుత శతావధానులు.
శశి : అయినచో మొన్న కన్యకాపరమేశ్వరి యాలయమున నవధాన మయినతఱి వారిప్రశంసయే రాలేదే ప్రకా : ఆ కొప్పరపు జంటకవు లింక నెవరి పేరులుచెప్పిరి.
శశి : నీవంతయు నావలన నెఱింగియును మరల నడిగెదవేల! తిరుపతి వేంకటేశ్వరుల నెత్తికొనుట నీవెఱుఁగవా?
ప్రకా : (స్మృతినభినయించి) అవును, సభ్యులకోరికమీఁదను.

చ. అరుదుగనిచ్చమెచ్చి విబుధావళియే తమశ్లోకమెన్నఁగా
    హరువుగ శ్రీసమన్వితులునై విజయానుచరత్వమూనియా
    తిరుపతి వేంకటేశ్వరుల తీరునఁ జెప్పఁగనొప్పినారిలన్
    దిరుపతి వేంకటేశ్వర సుధీరులె శ్రీకనుపర్తివంశజా.

శశి : చూచితివా! ఈ వేంకటసుబ్బరాయ వేంకటరమణకవీశ్వరుల కవితాధార. ఆశువులో శ్లేషనుగూడ నెలకొల్పుట కెట్టిధారయుండవలెను? ఇట్టివారేదో మసిపూసి మారేడుకాయఁజేయు కవుల నెత్తికొనకుండుట తప్పుకాదు.
ప్రకా : వారియవధానమునకు దీనికిని దారతమ్యము నీవేమి కనిపెట్టితివి?
శశి : నేను గనిపెట్టుట యెందులకు! నీవీమధ్య దేశమాతనే చూచుటలేదా యేమి? ఆమె యిట్లు వాక్రుచ్చినది.
“ఆస్థానకవులగు వేంకటరామకృష్ణకవులు వేర్వేఱ సాయములేక నవధానములు తప్పక చేయఁగలరా? యని కొందఱికి సంశయ ముండెడిది.



అయ్యది యిప్పుడు నివృత్తియయ్యెను. వేంకటరామశాస్త్రిగారి యష్టావధానంబును రామ కృష్ణశాస్త్రిగారి శతప్రాసంబును నేమోగాని యంత సంతోషదాయకములుగా లేవ”నుకొనిరి. ఈ పంక్తులు నీవు చదువనే లేదా!
ప్రకా : చదివితిని గాఁబోలు (స్మృతినభినయించి) అవును. అక్టోబరునెల పేపరులోఁగాదు! ఆ! చదివితిని, ఒక సంశయము వారు శతావధానులే కాక యత్యద్భుత శతావధానులు గదా! అష్టావధానమే బాగుగనుండకుండుటకుఁ గతమేమో?
శశి: నాకేమి తెలియును, ఆ సంశయము నీవే తీర్పవలెను.
ప్రకా : అయినచో గ్రంథమాల నాయొద్దనే యున్నది. (పుస్తకమువిప్పి) అబ్బే! దీనికింత విచారమెందుకు? వారు వ్రాసికొన్న పంక్తులే సాక్ష్యమిచ్చు చున్నవి. "గురువారమున నొక యష్టావధానము జరుపఁబడెను.
దానఁ బ్రాచీనంబులగు రీతుల వదలి ... భాగము లేర్పఱుపఁబడెను. (2వ పుట) ప్రాచీనరీతులు వదలిన తరువాతఁబే రెట్లు వచ్చును, ప్రాచీను లేమి మూర్ఖులా!
శశి: అంత మాత్రముననే కాదు ఇంకను నేమేని లోపములున్నవా? ఏదీ ఆ పుస్తకమిట్లు తెమ్ము
ప్రకా: (ఇచ్చును.)
శశి: (విప్పి) అబ్బో! వీరి యవధానమునకును దానికిని హస్తిమశకాంతరముగా నున్నది. పిఠాపురపువారి యవధానములో కవిత్వమునకై మూఁడు గీతములు మాత్రమున్నవి, కొప్పరపువారి యవధానమునఁ దొమ్మిది పద్యములున్నవి. మొదటి వారి గీతములు మూఁడును నొకటే విషయమును జెప్పుచున్నవి. రెండవవారివి భిన్న భిన్న విషయములను జెప్పుచున్నవి. తుట్టదుద నొక సమస్య మాత్రమే మొదటివారి యవధానమునఁ గలదు. రెండవవారి యవధానమున రెండు సమస్యలు గలవు. దానికిని దీనికినిగల తారతమ్యమును నీవే తెలిసికొనఁగలవు. కాన నవి చదువుచుంటిని.

రామకృష్ణ గ్రంథమాలలోని సమస్యాపూర్తి

కుండను గొండఁ జొచ్చె నిదిగోయని పల్కెను విస్మయమ్మునన్
గొండలు రేఁగిలోకములగుండలుసేయుచునుండఁజూచి యా
ఖండలుఁడుద్ధతుండయి యఖండపరాక్రమ మొప్ప ఱెక్కలన్
జెండఁగడంగుటన్ దెలిసిశీతనగాత్మజుఁడబ్ది వజీరా (24వ పుట)

కొప్పరపువారి సమస్యాపూర్తి

హరుఁడు గణపతికిఁ బోలెన్
సరసీజాక్షుండు నాభిజన్మునకుఁ బలెన్
గురుకీర్తిగన్న యాసా
(గరుఁడుడు గణపతికిఁ దండ్రిగావలెఁ జుమ్మీ.)

ప్రకా : ఎక్కడి కెక్కడ, ఆ కవిత్వ మెక్కడ ఈ కవిత్వమెక్కడ? నక్కెక్కడ దేవలోకమెక్కడ! ఎట్లో యతిప్రాసములతికి పేకేజీ చేసినట్లది యున్నది. ఇది చక్కఁగా గరుడుని సాగరునిఁగఁజేసి కడు సొగసుగాఁ గనపఱచి పూరించు నటులున్నది. ఇంకను దారతమ్య మున్నదా! అర్ధబిందు విషయమునఁ జర్చ యించుక కల్గినను ననివార్యముకాదు.

శశి : నిషిద్ధాక్షరి యిరువురును జెప్పిరి. కాని పిఠాపురపువారు సంస్కృతములోఁ జెప్పిరి. వీరు తెలుఁగులోఁజెప్పిరి. ఇందుఁ గష్టమేదియో నీకు నేను జెప్పనక్కఱలేదు గదా!

ప్రకా : అవును. తెలుఁగులో జెప్పుట సంస్కృతముకన్న ననేక విధములఁ గష్టము.

శశి : కొప్పరపువారిని అలఁతి, వలతి, పొలతి, గలతి. అనుపదములు చేర్చి సత్యభామ నరకాసురునితోఁ బోరువిషయము వచ్చునట్లు చెప్పుమనిరి.

ఇట్లు కొన్ని మాసపత్రికలలో వీరి వృత్తాంతము ప్రచురింపఁబడెను.