కొప్పరపు సోదర కవుల కవిత్వము/ఆగ్రహ సందర్భములు
ఆగ్రహ సందర్భములు
1. గుంటూరులో రంగావఝల హనుమయ్యగారు అను ప్లీడరు గారింటిలో శ్రీ తిరుపతి శాస్త్రిగారు అనవసరముగా కొప్పరపు కవుల ఆశుకవితను విమర్శింపగా, కొప్పరపు సుబ్బరాయకవికి కోపమువచ్చి అన్నమాటలివి.
తమకు సాధ్యముగాని యద్దాని నొరులు
ఖండనము సేయు టెందును గలదు కాదె
2. గుంటూరు సభలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు “ఈ కొప్పరపు కవులు మాతో సమానులు కారు. మాతో సమానముగా కూర్చుండుటకు వీలులేదు", అని అనగా కొప్పరపు సుబ్బరాయ కవిగారు ఆగ్రహముతో కొన్ని ప్రతిజ్ఞా పద్యములు చెప్పిరి. (ఈ పద్యములు చీరాల శతావధాన పీఠికయందు కలవు.)
3. తిరుపతి వేంకట కవుల శిష్యులైన శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారు గన్నవరములో కొప్పరపు కవులు సభజరుపుచుండగా, కొప్పరపు కవులపై కొన్ని ప్రతిజ్ఞా పద్యములు వ్రాసిన కరపత్రములు పంచుచుండగా, ఆగ్రహముతో కొప్పరపు సుబ్బరాయ కవిగారు చెప్పిన పద్యములివి -
రోసమున్న నిజంబైన మీసమున్న
పాఱిపోవుట కూడదు పందవగుచు
ద్వైత వనమున పాండవోత్తముల చేత
సింధుపతి పడ్డపాట్లు గాంచెదవు రమ్ము.
జననుత శక్తి సంపద నసాధ్యు లభేద్యులునైన వారితోఁ
ధన లఘు శక్తిఁ జూడక మదంబున మార్కొనఁ జూచు వాఁడిఁకే
మన శతతాళ దఘ్నమగునట్టి మహాహ్రదపాత మాత్మనా
శనమును గోరి సేయుటకు సాహసికుండగు వానిఁ బోలఁడే.
తిరుపతి వేంకటేశ కవి ధీరుల శిష్యుల మంచు చాటి మా
గురువులు వారటంచుననుకొన్న ప్రభాకర శాస్త్రి ముఖ్యులి
ప్పరుసున దుర్వివాదముల పాలయి దుర్యశముం గడించిరే
హర హర! బాల చేష్ట విడనాడని నీవొకరుండు దక్కగన్.
ఆశలడంగి నీ గురుల యంతటి వారెదిరింపలేక యా
వేశము దక్కి యుండి రిఁకఁ బిన్నవు కాఁగలవాఁడ విప్పుడీ
యాశుకవీంద్ర సింహముల కాగ్రహమున్ కలిగింపఁ బోక, వ
త్సా! శివరామ శాస్త్రి! సుగుణాఢ్యుఁడవై యశమున్ గడింపుమా.
4. గుంటూరులో తిరుపతి శాస్త్రిగారు కొప్పరపు కవులను గూర్చి “కొప్పరపు వారు గోదావరి దాటి వచ్చిన బుఱ్ఱ గొరిగింపమా”, అన్న మాటలు దృష్టిలో పెట్టుకొని, కాకినాడలో కొప్పరపు కవులు తిరుపతి శాస్త్రిగారిపై కోపముతో చెప్పిన పద్యములు.
బుఱ్ఱ గొరిగించెద నటంచు బొఱ్ఱ బలిసి
యెవ్వఁడో పల్కెనఁట తొల్లి హీనుఁడగుచు
కంచు దివిటీన వెదకినఁ గానరాఁడు
ప్రాణముండెనొ లేదొక్కొ! పశువొ? నరుఁడో?
జందెంపుఁ బందెంబు సంధించు వారల
జాడింపమే సభాస్థలికిఁ జేర
తొడదట్టి కడు మిట్టిపడు నట్టి వారల
జాడింపమే సభాస్థలికిఁ జేర
మీసాల పందెంబు వేసి దూకెడి వారి
జాడింపమే సభా స్థలికిఁ జేర
గోడ చాటునఁ జేరి గోళ్లు గిల్లెడివారి
జాడింపమే సభా స్థలికిఁ జేర
అరయ పదియవ నాఁటి ముతైదువలనఁ
జాటు మాటునఁ జేరి వాచాటులగుచు
వాగుటిది యేల? సత్సభా భవనమునకు
వాడిమై చేరి నిగ్గి పోవలయుఁ గాత.
ఆతఁడు మూతిమీసము గలట్టి మగన్నయె యయ్యెనేని తా
నీ తఱి వచ్చి సత్సభ నహీన గతిన్ జయమందవచ్చుఁగా
కోతి విధాన నెందు సొర కోతలు కోసిన లాభమేమి - యీ
భీతియె తొల్లి యున్ననిటు పెప్పెప కొమ్మెక యంట గల్గునే?
మీ కొఱగాని కృత్యములు మీచెడు పోకలు నెంచలేదె! మీ
కాకులగూడు పొత్తములగాకు ఘటింపఁగఁ బూనలేదె, మీ
చీకులుఁ జింతలున్ బయలు చేర్పఁగ నూకొనలేదె యెందుకీ
కాకరుతంబు లేటికి నగన్ గొన దిర్పతి వేంకటేశ్వరుల్
ప్రాసములున్ విరామములు పాడొనరించుచు బూతుపద్దెముల్
వ్రాసిరి నాటకంబులఁ బ్రబంధము లంచని పేరుఁ బెట్టి యు
ద్వాసన మాచరించి రల ప్రాక్కవి మార్గము లట్టి వీరి కీ
రోసములా యటంచు మిము రోయరె తిర్పతి వేంకటేశ్వరుల్
కాకరపర్తియే సలిపె గర్వము మానిపి శృంగభంగమున్
కాకులయట్లు బాఱఁగఁ జికాకొనరించెను బైడిపాడు పై
యాకులపాటుఁ దెచ్చి బలమంతయుఁ బాపెను గొప్పరంబిఁకన్
గూకలుమాని యెందొ తలఁ గ్రుక్కుఁడు తిర్పతి వేంకటేశ్వరుల్
ఘోర సింహంబు లట్టుల కొప్పరంపు
కవులు చనుదెంచి నాటిరీ కాకినాడ
యందు కవితోన్నతిని విజయధ్వజంబు
మిన్నయై దీని పీకు మగన్న యెవఁడొ?
కొండవీటి మహాగుహఁ గూర్కు జెందు
సింహములు రాఁగ నీ గ్రామ సింహములకు
బ్రతుకుఁ దెరువును వర్తన పరిఢవిలునె?
చాటు మాటున మొరుగుటే జరుగుఁ గాక.
బుఱ్ఱ గొరిగించి సున్నపు బొట్లు పెట్టి
ఖరము నెక్కించి యూరేగఁగా నొనర్చి
మాల దాసులు ఛీయని గేలిగొట్ట
తిరుపతిని వేంకటన్నను త్రిప్పినాము.
కట్టితిమి విజయ ఘంటిక
మొట్టితి మెసరేఁగి కుకవి మూర్ధము లగలన్
బట్టితిమి కాకపురి జయ
మట్టిట్టన రాని మీ దయాశక్తి శివా!
5. శ్రీ రాజా మంత్రిప్రెగడ భుజంగరావు బహద్దరు వారి పుత్రిక వివాహ సందర్భమున తిరుపతి శాస్త్రిగారు పద్యములను చెప్పుచు ఒక పద్యమిట్లు చెప్పిరి.
ఎలమిన్ సత్కవివై ధరాధిపతివై ఈలీల నీకూతు పెం
డిలికిన్ సత్కవులందఱన్ బిలిచి పాండిత్యంబు మన్నించుచో
పులులన్ మేకల నొక్క చెర్వున జలమ్ముం ద్రావఁగాఁ జేయు చ
ర్యలఁ జూపించితివయ్య! శ్రీ భుజగభూపా! ....
అలవోకన్ గవితా సరస్వతికిఁ గల్యాణంబుఁ గావింప ....
.... తొండమున్ ముడిచి పర్వుల్ దీయు నేతత్ గజం
బుల సింగంబుల నొక్కరేవున జలంబుంద్రాగఁగాఁ జేసితే
అలఘూద్యత్‌ధిషణా! వినిర్జిత సురేజ్యా! పూజ్య విద్యానిధీ!
ఈ సంఘటన తరువాత మరల ఈ యుభయ కవి యుగళములు కలసి కొనలేదు.
6. ఏలూరులో శ్రీ రాజా మంత్రి ప్రెగడ భుజంగరావుగారి యింటి గడపను దాటుచుండగా, కావలెనని ఒకడు తుమ్మగా సుబ్బరాయకవి ఆగ్రహముతో చెప్పిన పద్యము -
కైటభాంతకు నిరాఘాట శంఖ రవంబు
విన్నంగాని విభీతి నున్నవాని
గాండీవధరు జయోద్దండ కాండాహతిఁ
దిన్నంగాని చలింపకున్నవాని
కాలకాలుని ఫాల కీలి కీలాలంబు
గన్నఁగాని యెదిర్చియున్నవాని
సంభోధి సంభవ హాలహలంబు పై
కొన్నఁగాని కలంగ కున్నవాని
విందుమే గాని వినమెందు విశ్వలోక
భూత సంఘాత ఘాతుక భూతనిశిత
పటపటాత్కార దంష్ట్రికా పటల చటుల
భీకరాభ క్షుతారవాపేత భీతు
పరమేశీ కరుణా ప్రలబ్ద కవితా వైశ్వానరజ్వాలలన్
దరియం జొచ్చి నశించు కాకవి కనాధప్రేత సంస్కార మీ
శ్వర ఘట్టంబునఁ గొప్రపుంగవులొనర్పంబూని రప్పుణ్యమం
దిర మందుండు శ్మశాన రక్షకులు రండీ కాటికాసుల్ గొనన్.
WVVWVVW