కొప్పరపు సోదర కవుల కవిత్వము/కాకినాడ సభలు

కాకినాడ సభలు

శ్రీ చేగంటి బాపిరాజుగారు

శ్రీ మదయోధ్యా నగరీ
ధాముఁడు సోదర యుతుండు ధాత్రీతనయా
కామనుఁ డనిలజనుతుఁడు య
శోమహితుఁడు బ్రోచుఁగాత సోదరకవులన్

సుకవితాభిమానులారా! సూనృతప్రియులారా!

సకలదిగంత విశ్రాంతకీర్తులును బాలసరస్వత్యాది బిరుద విరాజితులును నైన శ్రీమత్కొప్పరపు సోదరకవీంద్రుల చరిత్రంబు నెఱుంగనివారును, వానను దడవనివారును, సూర్యకిరణ ప్రసారంబు సోఁకనివారును, లేరని నాకుఁదెలిసియు వారు నూతనముగా నీ కాకినాడ పురంబునకుఁ దెనాలిపురమున న్యాయవాదులు, రసజ్ఞులునునగు శ్రీమదజ్జడపు భీమశంకరరావు పంతులుగారిచే నాహ్వానింపంబడి 21-5-1912 తేదీయందు శ్రీగంజాం వేంకటరత్నము పంతులుగారి ద్వితీయ పుత్రికా కళ్యాణ మహోత్సవ సమయంబునకు వచ్చి యాపుర వాసుల నాశుకవితామృత ప్రవాహంబున నోలలాడించి యచ్చట ననేకవిధ బహుమానంబుల నందిరి.

ఆంధ్రభాషా విశేషంబున నీ యాంధ్రదేశ యోషామణికి సువర్ణమయ మహాభూషణంబనందగిన నీ కాకినాడ పురంబున నిట్టి యనుపమానమగు తమ కవితాశక్తినిఁ జూపి యింతటి సత్కారంబులంబడసినవారు మఱొక్కరు లేరగుటచే నిచట వీరిసభలను, సన్మాన విషయంబులును నాకుఁ దెలిసినంతవఱకుఁ దెలియంబఱచుచున్నాఁడను.

1. దివాన్ బహద్దరు బిరుదాంకితులును, హైకోర్టు వకీలుగారును నగు శ్రీ దురిసేటి శేషగిరిరావు పంతులుగారును, పండిత కవీంద్రులయిన శ్రీ కస్తూరి శివశంకర శాస్త్రిగారును, అగ్రాసనాధిపతులుగా శ్రీ గంజాము వేంకటరత్నము పంతులుగారి కళ్యాణ భవనంబున శ్రీ పంతులుగారి ధర్మపత్నియును సుగుణవతియునగు మాణిక్యాంబ గారిచే నొకసభ జరిగింపఁ బడెను. ఆ సభలో రు.116-0-0లు బహుమానమొసంగిరి. ఇందు సీతాకళ్యాణ మాశుప్రబంధముగాఁ జెప్పఁబడినది.

2. శ్రీ పోలవరము జమీందారుగారును, సరస్వతీపత్రికాధిపతులునునగు. శ్రీ రాజా కొచ్చర్లకోట వేంకటకృష్ణరావు బహద్దరు జమీందారుగారును, పండితవర్యులగు శ్రీ వంకా వేంకటరత్న శాస్త్రిగారును అగ్రాసనాధి పతులుగ నీ కాకినాడ మహాజనులందఱచే శ్రీ పిఠాపురపు మహారాజాగారి కాలేజీలో నొక మహాసభ జరిగింపఁబడెను. ఆ సభలో రు.232-0-0 లును, 2 బంగారపు బిరుద మండనములును నొసంగిరి, ఇందు భీష్మ జనన మాశుప్రబంధముగాఁ జెప్పఁబడినది.

3. ఆంధ్రాక్షరతత్త్వాదిగ్రంథకర్తలును, వైయాకరణులును, విద్వత్కవి వరేణ్యులునునగు శ్రీ పాడి వేంకటస్వామిపాఠీ గారగ్రాసనాధిపతులుగా నీ పురమందు సుజనరంజనీ ముద్రాక్షరశాలాధిపతులును విద్యావిశేషులునునగు శ్రీ పోతాప్రగడ బ్రహ్మానందరావు పంతులుగారిచేఁ దమ మందిరంబుననే యొకసభ జరిగింపఁబడెను. ఆ సభలో రు.116-0-0లును రెండు బంగారపు బతకములును నొసంగిరి. ఇందుఁగంసవధయు, నభిమన్యువధయు ఆశుప్రబంధములుగాఁ జెప్పఁబడినవి. 4. వైశ్య వంశజులును సుగుణధనాభిరాములును నగు శ్రీ పెండా పెద్దయ్యన్న గారను పర్యాయనామముగల వేంకటాచలపతిగారిచే వారి గృహంబుననే యొక సభ జరిగింపఁ బడెను. ఆ సభలో రు. 116-0-0లు నొసంగిరి. ఇందాశు కవిత్వమును జెప్పరి.

5. ధనికులును విద్యా రసికులునునగు శ్రీ కొవ్వూరి ఆదినారాయణ రెడ్డి గారిచే వారి భవనంబుననే యొక సభ జరిగింపఁబడెను. ఆ సభలో ననేకవిధములగు సత్కారంబు లొనర్చిరి. ఇందు నాశుకవిత్వమును జెప్పిరి.

ఇట్టి సభలలో వీరికవితా సామర్ధ్యంబును దిలకించి యభిలషించి పండిత కవీంద్రుల నామధేయంబును వారి యభిప్రాయంబులు తేటపడు పద్యంబులును నే నెఱింగినవఱకును నాకు లభించినంతవఱకు నీక్రింద నుదహరించితిని.

కాకినాడ

2-6-1912

ఇట్లు,

చేగంటి బాపిరాజు

గంజామువారి యింటియొద్ద సభలోఁ జదివిన పద్యములు

కవులును బండితేంద్రులును గ్రాల్కొనియుండిన కాకినాడలో
సవిరళశక్తితో సభల నద్భుతలీలల నిర్వహించి కా
కవులకు గర్వభంగమగు కైవడి నాత్మ జయధ్వజంబునున్
నవముగ నాటినారు భువనస్తుతిఁ గొప్పరపుంగవీశ్వరుల్

రారేపోరె మహాకవుల్ నిజవచోరంభంబు సూపింపరే
వారిని వారి కవిత్వమున్ గనియు సంభావింపరే సభ్యులె
వ్వారైనన్ మనకొప్పరంపుఁ గవిరాట్పర్జన్యుఁ లట్లొప్పిరే
స్ఫారప్రజ్ఞకు సభ్యులిప్పగిది సంభావించిరే యెవ్వరిన్

అరరేయంచు వహవ్వరేయనుచు వహ్వాయంచునున్ మెచ్చుచున్
కరతాళధ్వనులన్ ఘటించుచు మహానందంబునుం జెందుచున్
సరసత్వంబును జూపు వాయసపురీ సభ్యాళి మెప్పించుకొ
ప్పరపున్ సోదరసత్కవీశ్వరులదే భాగ్యంబు భాగ్యంబనన్

నిలువఁగలారె కాకపురినిర్భయులై సభనెట్టివారలున్
నిలిచిననిల్త్రుగాక యొకనేర్పున నూర్పయినన్ వెలార్ప కే
పలికినపల్కు వేరొకటఁబల్కక కొప్పరపున్ మహాకవీం
ద్రులవలె నాశుసత్కృతులు దూకఁగ జెప్పెడివారలుందురే

పుట్టిరి విప్రకులంబునఁ
బట్టిరి జగదేకమాత పదపద్మంబుల్
కట్టిరి జయకంకణములు
కొట్టిరి శాత్రవులతలలు కొప్రంపుఁగవుల్

రాజోలు

పొన్నాడ కృష్ణమూర్తి

నటదుమాపతిశిర స్తటవిరాజద్దివ్య
            గంగాప్రవాహ వేగంబుకంటె
కమనీయకాఠిన్య రమణీయ నిరుపమ
            ప్రౌఢాంగనాస్తన ద్వయముకంటె
నిస్తులమాధుర్య శస్తసంస్తవనీయ
            ఘనగోస్తనీస్తబకములకంటె
నిఖిలసుపర్వ ప్రముఖ నిత్యవర్ణనా
            ప్రాబల్యవహసుధా రసముకంటె

వడియు, రసభావ కఠినత, వర్ణనీయ
మాధురీధురీణత, స్వచ్ఛమహిమఁదాల్చి

వెలసెఁగా భవదీయకవిత్వ గరిమ
వంద్యమై సోదరకవీంద్ర వర్యులార

ఇచ్చినారు నృపాలు రెన్నేని బిరుదముల్
          మెచ్చినారు కవీంద్రులిచ్చతోడ
పెచ్చినారు గ్రహించి వేనూటపదియార్లు
          హెచ్చినారు సమాను లెవ్వరనఁగ
వచ్చినారు విరోధివర్గంబు నెల్లను
          ద్రచ్చినారు సమస్తగ్రంథములను
తెచ్చినారు సుకీర్తి దేశంబునకునింత
          వచ్చినారిపుడు కన్పండువుగను

గాంచినాఁడను మిము, సంతసించినాఁడ
భవదఖండాశుకవితా ప్రభావమనుప
మేయమని పొంగినాఁడ నమేయ కీర్తి
విభవులార! కొప్పరపుకవివరులార!

కొప్పరపువారి కవనము
కప్పురపుంబలుకులట్లు గనిపించె బలే
యిప్పగిదిఁ జెప్పనొప్పునే
యొప్పుగ నెవ్వారి కేని నుర్వీస్థలిలోన్

చెలఁగ గంజామువారింట సీతపెండ్లి
లీల భీష్మజననముఁ గాలేజిలోన
ఠీవిమీఱు బ్రహ్మానందరావుగారి
భవనమున నభిమన్యు కంసవధలనెడు
కధలఁ జెప్పిరి సోదరకవులు భళిర!

గంజామువారింటఁ గడిమిగైకొనినారు
        నూటపదార్లు వినోదమొదవ
నాపైని సంబరంబలరార నేనుంగు
        నెక్కియూరెల్ల నూరేగినారు
కాలేజిసభలోనఁ గైకొని రిన్నూట
        పదియార్లు బంగారు పదకములను
ప్రథిత బ్రహ్మానంద రావింటనూరార్లు
        బంగారుపదకముల్ పడసినారు

పైడ వెంకటాచలపతి మేడలోన
నూటపదియార్లుపడసిరి మాటమాత్ర
నరయ మాకాకినాడ భాగ్యంబుకడుఁబ
విత్రమయ్యెఁ గొప్పరపుకవివరులార!

చంద్రునకునూలుపోగన్న సామ్యముగ మ
దీయహృదయ తోషణమిట్లు తెలిపినాఁడ
నంతియేకాని మిమునెన్న నెంతవాఁడ
నాశుధారాకవీంద్ర సింహాంకులార!

కాకినాడ

18-6-1912

ఇట్లు,

ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యశాస్త్రి

కాకినాడ మనోరంజని పత్రికా సంపాదకులు శ్రీయుత కాళ్ళకూరి నారాయణరావుగారు కాలేజసభలోఁ జదివిన పద్యములు

తలమీఁద గంగను ధరియించు శివునకు
          సలిలాభిషేకంబు సలిపినట్లు
జగతికెల్లను వెల్గు సమకూర్చు నినునకుఁ
         బేరిమి దివ్వె జూపించినట్లు

విశ్వమెల్లసుఖింప వీచుమారుతునకు
         వీవనఁ జేపట్టి విసరునట్లు
వసుధాతలంబెల్ల వర్షించుఘనునకు
         సరవితో నర్ఘ్య మొసంగినట్లు

దశదిశల నాశుకవితామృతంబుఁగురిసి
ఖ్యాతిగాంచిన కొప్పరకవులమీఁద
బద్దెములు చెప్పుటకు సిద్ధపడిననాదు
చాపలముసైపుఁడీ సభిస్తారులార

సభలోన మాటాడఁజాలుటే గొప్ప ప
          ద్యములతో నగుట చోద్యంబు గాదె
తడబడుచైనఁ బద్యంబల్లుటే గొప్ప
          పరమాశుధార యబ్రంబు గాదె
అడిగిన పద్యమొండైనఁ జెప్పుట గొప్ప
          గంట కేనూఱు లక్కజము గాదె
ఉర్విలో నిట్టి వారొకరు పుట్టుట గొప్ప
          యిరువురొక్కింట నచ్చెరువు గాదె

పూర్వ భవమున వీరేమి పుణ్యమాచ
రించిరో యిట్టి వారిని గాంచ వీరి
తల్లిదండ్రులు చేసిన తపమదేమొ
బళిర యిట్లుండ వలవదే భాగ్య గరిమ

వడిలాగి విడువంగఁబడిన బాణమురీతి
           బరిమీఁదఁబఱచెడు పాముభాతి
నేలకుదిగుకొండ కాలువకరణిని
           మిఱుమిట్లుగొలుపు క్రొమ్మించుసరణి

మిడివేసఁగినిఁబడు వడగండ్ల చందాన
          సందీక మోదు వర్షమువిధాన
వడిజిచ్చుబుడ్డి వెల్వడుమిణ్గురులమాడ్కిఁ
          దమిరేఁగు మిడుతలదండుపోల్కి

బళిరెయొంటిగఁ బదులుగ వందలుగ స
హస్రములుగను మఱియు ననంతములుగ
వెలువడెడు వీరిజిహ్వాగ్రవీధినుండి
పద్యములు పండితకవీంద్ర హృద్యములుగ

కాలికి బంగారు గండపెండెర మంది
        వన్నెగన్నట్టి పెద్దన్న నాఁడు
పదగుంభనమునందు బహుళ విఖ్యాతిని
         గాంచిన రామలింగ కవినాఁడు
ఘటికా శతగ్రంథ కరణ ధురీణుఁడై
         కీర్తినించిన బట్టు మూర్తినాఁడు
జాములో శతకంబు సంధించి బిరుదంబుఁ
        గైకొన్న వీరరాఘవునినాఁడు

వెలసి పెంపొంది ప్రోడయై విస్తరించి
యవలఁ బెద్దలఁగలసిన యట్టియాశు
కవిత నేఁటికిఁగొప్పర కవులవలన
నవతరించెను మరల నీయవనిలోన

గణయతి ప్రాసలక్షణమె యుండ దటంచు
          వదరు వారికిఁ దలవంపు గాఁగ
వల్లించుకొన్నదే వడిఁ జదువుదు రంచుఁ
          జాటు వారికి నగుబాటు గలుగ

పల్లెటూళ్ల నొకింత పరువుఁ గాంచి రటంచుఁ
          బలుకు వారికి శృంగ భంగ మొదవ
చెప్పినదే మార్చి చెప్పుచుందు రటంచుఁ
          జెప్పెడి వారికి సిగ్గు రాఁగ

కాకినాడ పురమ్మునఁ కవివరులును
పండితులు పండితప్రభుల్ వఱలు సభను
ఆశు కవితామృత ప్రవాహంబు వెల్లి
విరియఁ జేసిరి నేఁడు కొప్పరపు వారు

వసుధలో నార్వేల వారి కైవసమందు
         రాశుకవిత్వ మహాప్రకర్ష
వలనొప్ప నార్వేల వారి సొమ్మందురు
         బంధ కవిత్వ సంబంధపటిమ
ధీరులౌ నార్వేల వారి సొత్తందురు
         గర్భ కవిత్వ సందర్భశుద్ధి
వంద్యులౌ నార్వేల వారి పంటందురు
         చిత్రకవిత్వ వైచిత్ర్యగరిమ

అట్టి యార్వేల వారింటఁ బుట్టఁగల్గి
నందులకు సార్థకంబుగ నందినారు
విశ్వము నుతింపఁగా జతుర్విధ కవిత్వ
పట్ట భద్రత్వమౌర కొప్పరపుఁ గవులు

కాకినాడ కాలేజీ పండితులు శ్రీ వేంకట నారాయణ పాఠీయను పాడి వేంకటస్వామి గారు

వళియుంబ్రాసములేని సంస్కృతకవిత్వంబందు దేవీప్రసా
ద లసత్ప్రజ్ఞులు కాళిదాసముఖ వేత్తల్ కావ్యమాశూక్తులన్

బలుకన్ గొప్పగనుండె; నీయెడల గొప్రంపుంగవుల్ గంటలో
పల బెక్కాశు చరిత్రముల్ సభలలోఁ బల్మాఱువాక్రువ్వరే

శ్రీమచ్ఛిష్ట కులాబ్దిపూర్ణశశియౌశ్రీకృష్ణమూర్త్యాఖ్యుఁడా
హా మున్ గోగ్రహణంబుఁ జెప్పెఁనట యొండాశుప్రబంధంబుగన్
సామాన్యంబుగ గొప్రపుంగవులు సంస్థానంబులం జెప్పరే
నామోదంబుగ గంటలోపల ననేకాశుప్రబంధంబులన్

యతియే యుండదు ప్రాసయే గదియ దేయంశంబునం దన్వయ
స్థితియే లేదు సమాస మిల్లయని విద్వేషంబుతోఁ బల్కు పం
డిత కాకంబుల దుష్ప్రలాపములు శాంతిం బొందెడున్ సభ్యులై
ప్రతతాశూక్తులఁ గొప్రపుంగవుల కావ్యంబింత యాలించినన్.

కొప్పరపుసోదరులుసభఁజెప్పుకవిత
వీనులలరంగఁ బలుమఱువినియువినియుఁ
గనులు తనియంగ వైఖరిఁగనియుఁగనియు
నలరె వేంకటనారాయణాఖ్య పాఠి

కాకినాడ పోస్టుమాస్టరు శ్రీయుత దేవగుప్త సన్యాసిరాజుగారు

తేనెలసోనలో! కలక దేరిన మీఱిన పానకంబులో
మానిత మాధురీగుణ సమంజస దివ్యరసాయనంబులో!
సూనమరంద గంధపరిశోభితదివ్యఝరీ తరంగ సం
తానములో! సుధారస నిధానములోగద మీకవిత్వముల్

గండగత్తెర కాడఁగట్టి పరీక్షగాఁ
         గబ్బంబు లల్లు తిక్కన్నరీతి
రెండందియలు గాళ్ళఁ గొండాడఁ దాల్చిన
         యల యలసాని పెద్దన్నకరణి

వాణి నారాణినా వాసికెక్కితినని
          యెన్నికఁగన్న వీరన్నభాతి
సర్వజ్ఞుఁడన సమస్తకవీంద్ర కోటిచే
          మన్ననల్ గన్న సోమన్న సరణి

వేగముగ నాశుధారా కవిత్వ మీరు
చెప్పఁగలుగుదురో కవిసింహులార!
బాలకాకారములుదాల్చు ప్రౌఢులార!
షట్సహస్రద్విజాన్వయ చంద్రులార!

రాయలుమీకవనము శ్రుతి
పేయముగావినిన మీకు వేయఁడతోడా
లీయెడ నీయిలలోఁగవి
రాయలుమీరనుచుఁ! గొప్పరపుంగవులారా!

ఆ కృష్ణ దేవరాయలు
మీకవనము విననిలోటు మెచ్చనిలోటున్
మాకృష్ణరాయలిప్పుడు
పోకార్చె సభాభిముఖ్యముం గైకొనుచున్

నూటపదియాఱులును నే
నూటపదాఱులును గొంచు నుతికెక్కిన మీ
బోటికవివరులు మత్కృతి
నూటిక నూల్పోగుగాఁ గనుంగొననెంతున్

శ్రీహరిచింతనామృతపాన పరిమత్త
         చేతో మధుపరాజు పోతరాజు
రాజాధిరాజ సభాజనస్తవనీయ
         బహుసద్గుణ సమాజుఁ బాపరాజు

గాంగనిర్‌ఝరసదృగ్దారావాక్సుధా
          రసవిభూషితభోజు రంగరాజు
రమణీయ రసవిస్ఫురచ్ఛబ్ద కలిత వి
          ద్యా దివిషద్భూజు నయలరాజు

దొట్టికవిలోక చక్రవర్తులనుగన్న
యాంధ్రభారతి పూర్వపుణ్యమునఁజేసి
యవతరించిన యనుఁగు కందువులుమీర
లవుదురను దేవగుప్త సన్యాసిరాజు

కొప్పరపు సోదరకవులకుఁ బంపిన పద్యములు-మహారాజశ్రీ బ్రహ్మశ్రీ కొప్పరపుఁ గవీశయుగళమునకు సమస్క్రియాపురసృతముగ

లేశమునేని జంకకవలీలఁ బదంబుల చాలు గూర్చి మా
యాశయముం బొసంగఁగఁ బ్రయాస మొకింతయు లేక గోస్తనీ
పేశల పాక మొప్పఁగను భీష్ముని సత్కథఁ జెప్పినట్టి మీ
యాశు కవిత్వ ధోరణికి నంజలి సేయఁగఁ జెల్లు, లేదిఁకే
కోశము నందు సందియము కొప్పరపుం గవులార మీకు స
ర్వేశు ననుగ్రహంబున సమృద్ధిగ నాయువు శ్రీయుఁగీర్తి ధీ
కౌశలమున్ బొసంగుత సుఖం బొడగూరుచు నిచ్చలున్ ధరా
ధీశుల సత్కృతుల్ వెలయు నెంతయు నుద్దతి గల్గుఁగావుతన్.

కాకినాడ

2-6-1912

ఇట్లు విన్నవించు. విధేయుడు,

ఆదిపూడి ప్రభాకరరావు

కొప్పరంపుఁగవులు గొప్పవారనుచుంట
వినుటెకాని యెపుడు కనుట లేదు
చేసినట్టి పనులె చెప్పినదానికి
సాక్ష్యమిచ్చెమాకు సరిగ నేఁడు

ఈవినయంబీవాగ్దా
రా విభవం బీకవిత్వ రమణీయత యీ
భావుకపదార్ధ గుంభన
మేవెరవునఁగనిన నొరులయెడ లేదుగదా

వచ్చిన ప్రాఁత పద్యములె వందల కొద్దిగ నొక్కగంటలో
నెచ్చట నేనియుం జదువ నేవ్వరి కైన నశక్యమన్నచోఁ
జెచ్చరఁ గ్రొత్త గాథలను జెప్పుఁడటన్నను జంకు గొంకులే
కుచ్చతఁ జెప్పు నిక్కవుల యొప్పులె చెప్పఁగ నొప్పు నెప్పుడున్.

ఎందఱఁ జూడ మిద్దరణి నిద్దకవిత్వ మహత్త్వ సంపద
స్పందుల, వారలిత్తెఱగు వారని వింటిమె కంటిమే మహా
నందము గూర్చి రిక్కవులు నాగ విభూష జటాటవీ విని
ష్యంది సరిత్‌ఝరీ పరిలసత్కవితా రస ధీర ధోరణిన్.

మంచిబిరుదములంగాంచి రంచితమగు
పదకములను జెందిరిబహు బహుమతులుఁగ్ర
హించిరిఁక వీరి కేమిత్తు నంచు నెంచి
పంచరత్నము లివె సమర్పించుకొంటి

ఇట్లు,

శృంగారకవి సర్వారాయకవి

శ్రీ కొప్పరపు కవులు సకల సత్కార్యంబులంది తమ నివాసంబున కేగు సమయంబునఁ జెప్పిన పద్యములు

శ్రీమాన్య కొప్పర గ్రామ వాసుల మమ్ము
         భీమాఖ్యు చేతఁ బిల్పించితీవె
గంజాము వంశ వేంకట రత్న ఘను నింట
         గురు సభాస్థలి మెప్పు గూర్చితీవె

కాకపురీ నరాగ్రణులచే సభ మహో
          దంచిత స్థితి సంఘటించితీవె
ఆ సభాధీశ్వరుఁడలరి కోరిన పద్య
          కృతులు మాచేతఁ బల్కించితీవె

తత్సభా స్థలి సుకవి విద్వన్నరేంద్ర
వరులచేఁ బెక్కు మన్ననల్ జరిపితీవె
మహిమ నీ కాకినాడ నస్మద్విజయపు
ధ్వజము నాటించితీవె శ్రీ వాగ్భవాని!

న్యాయవాదులు ధరానాథు లీపురి వర్ణ
          నీయు లెంతేని మన్నించినారు
పండితేంద్రులు కవిప్రవరు లీనగరి న
          ద్భుత కళాకౌశలుల్ పొగడినారు
గుణరాశి కొవ్వూరి కులుఁడాది రెడ్డి యి
          వ్వీట హెచ్చున గౌరవించి నాఁడు
అనఘ పండా వేంకటాచలుండిచ్చోట
          మేటి నూఱార్లిచ్చి మెచ్చినాఁడు

సుగుణశీలి బ్రహ్మానంద సూరి మౌళి
శ్రేష్ఠుఁడీయూరఁ గడు నాదరించినాఁడు
కాన నింతకు నీ కృప కారణంబు
తల్లి! కైకొమ్మ యిదియె వందన శతంబు

కాకినాడ

2-6-1912

ఇట్లు

చేగంటి బాపిరాజు

(సంకలన కర్త)