కేయూరబాహుచరిత్రము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
కేయూరబాహుచరిత్రము
ద్వితీయాశ్వాసము
.క. శ్రీరమణకటాక్షసుధా, సారవివర్ధితవిశిష్టసంపత్సస్యా
ధారు సదాచారు యశ, స్తారకితదశాశు గుండదండాధీశున్.1
ఉ. తనమేనల్లుని సోమదత్తు బహుతంత్రప్రౌఢు ధీమంతుఁ జ
య్యన నచ్చోటికిఁ బిల్వఁగాఁ బనిచి యేకాంతంబునన్ రాజ
వర్తనముం జారులచేత విన్నవియు మీఁదం దాను జేయం దలం
చిన కార్యంబులుఁ జెప్పె విస్మితరుచిశ్రీవక్త్రుఁడై వానికిన్.2
క. మతియుతుఁడు గాదె లాట, క్షితిపతి యిటుఁ గార్యగుప్తి సేయఁగవలదే
మతి యింత లేక బహుజన, పతి నయ్యెద ననుట పిన్నపనియే తలఁపన్.3
వ. అనవుడు సోమదత్తుఁ డాసచివోత్తముతో నిట్లనియె.4
క. పొసఁగఁ బరికింప నేర్చిన, వసుమతిపై బుద్ధి గలుగువారలు బ్రాఁతే
యసదృశగుణబహురత్నా, వసుంధరా యనుట నేఁటివచనమె చెపుమా.5
క. ఏల వెఱఁగంద నొకరుని, పాలిటిదే బుద్ధి వైశ్యబాలిక వినవే
ప్రాలసరితైల మమ్మియుఁ, దా లాభముఁ గొనదె తొల్లి తజ్ఞులు మెచ్చన్.6
వ. అక్కథ యించుక యవధరింపు మని యిట్లనియె.7
క. కాంచీపురమున నొకరుఁడు, కాంచనగుప్తుఁ డను బుద్ధిగల వైశ్యుఁ డని
ర్వంచనుఁడు సుతున కరయం, బంచెం బరిణయము సేయ బాలిక నొకతెన్.8
చ. పనిచిన వారు వైశ్యకులబాలలఁ జూచుచుఁ నప్పురాంగణం
బున నొకక్రేవ నొక్కరుఁడు మూటెఁడుప్రాలకు నూనెసంతలో
గొనఁ జను దెంచి బియ్యమునకున్ సరి తైలము వోయుమన్న నా
తనిపలు కెవ్వరున్ వినక తద్దయు నవ్వుచు గేలి సేయుచున్.9
క. ప్రా లేడుమానికెలకుం, దైలము మానెడు పురమ్ముధారణ గలుగన్
బ్రాలసరి తైల మడిగిన, జాలియ యగుఁగాని నీకుఁ జము రే లబ్బున్.10
క. అని పలుక మఱియు నడుగం, గని యచ్చట నున్న వైశ్యకన్య యొకతె యా
తనిఁ జీరి కలదు నూనియ, కొనియెదవే రమ్ము ప్రాలకును సరిలెక్కన్.11
వ. అని పలికి చేరవచ్చిన మూట దింపించి బియ్యము లెస్సయవిగాఁ జూచి వానితో
మఱియు ని ట్లనియె.12
క. ప్రా లొక్కటఁ గొని దానన, తైలము దిగువాఱఁ బోయుదానను నీకుం
బోలినఁ బ్రాలం కొలువుము, చాలము నీతోడఁ బిదప జగడములాడన్.13
వ. అనుపల్కులకు వాఁ డొడంబడుటయు.14
క. పళ్ళెరంబుఁ దెచ్చి పటుబుద్ధి బియ్యంబు, దాని నిండఁ గొని ముదంబుతోడ
నంచ వోసెఁ దైల మంచులు దిగువాఱఁ, నవ్విధంబు మెచ్చు నావహింప.15
క. చని కాంచనగుప్తునకున్, వినిషించిరి యతనివారు వేగమ యతఁ డం
దునఁ దద్బుద్ధివిశేషము, కొనియాడుచు దానిఁ దనదు కోడలిఁ జేసెన్.16
వ. కావున మతిగలవారు లోకమున లే కుందురే యని సోమదత్తుం డాసచివోత్తము
తోడ మఱియు నిట్లనియె.17
క. మతి గలిగియుఁ దాత్కాలిక , మతి గలుగక యుండెనేఁ బ్రమాదము వచ్చున్
మతిమద్వర తాత్కాలిక, మతిఁ గాదే డక్షుఁ డొకప్రమాదముఁ గడచెన్.18
వ. అక్కథ యెట్లనిన.19
క. క్షురికాపురమున నొకభూ, సురతిలకుఁడు దక్షుఁ డనఁగ సులభవివేక
స్ఫురణుం డయ్యును దోషా, కర మగుయౌవనముచేతఁ గాముకుఁ డయ్యెన్.20
క. అతని పొరుగింటియంగన, యతిశయసౌందర్య దానియధిపతి శస్త్రా
న్వితుఁ డుగ్రుం డ ట్లైనను, ధృతి దానిం జెఱుపఁ గోర్కి తీగలుసాగన్.21
క. ఆ వాలుఁగంటి యొంటిగ, నేవల మెలఁగినను మ్రొక్కు ని ట్లాధూర్తుం
డావిప్రుచేత యితరుల, చే విని యక్కాంతమగఁడు చిత్తము గలఁగన్.22
చ. అరసెదఁ గాక యివ్వడుగునాగడ మంచు వసించె నంగణాం
తరమున గోడమాటుపడి దక్షుఁ డెఱుంగక యుండె వాని సుం
దరి పనివెంట నద్దెసకుఁ దాఁ జనుదేర నిజేచ్ఛ నాత్మమం
దిరమున నుండి యావెలఁదిదిక్కునకుం జని యంత దక్షుఁడున్.23
ఉ. ఎప్పటియట్ల యింతిఁ గని యేడ్తెఱ మ్రొక్కిన దానివల్లభుం
డప్పుడ దిగ్గన న్నెగసి యచ్చటఁ దోఁచిన వాఁడు దిట్టఁ డై
తప్పక యన్నిదిక్కులకుఁ దా వెడ మ్రొక్కి ప్రదక్షిణంబుతోఁ
జప్పుడుగాఁ జపించుచును జండమరీచికి మ్రొక్కెెఁ బల్మఱున్.24
క. అది జపముతోడిమ్రొ క్కని, పొదలినకోపంబుఁ దొలఁగి పోయె భటుం డి
ట్టిది తాత్కాలికమతిసం, పద యాపద లైనచోటఁ బ్రజ్ఞానిలయా.25
క. మతిలేనివాఁడు విద్యా, న్వితుఁ డయ్యును మేలు వడయ నేరఁడు విద్యా
న్వితుఁ డయ్యుఁ దొల్లి గార్గ్యుఁడు, హతుఁ డయ్యెంగాదె విమతి యై యొకపులిచేతన్.26
వ. అక్కథ యెట్లనిన.27
క. గార్గ్యుఁ డనువిప్రుఁ డొకరుఁడు, దుర్గారాధనముఁ బెక్కుదొసఁగులఁ బడుచున్
దుర్గాటవిలోఁ జేయ ని, రర్గళగతిఁ దన్నుఁ జూచి యాయంబికయున్.28
క. వర మడుగు మనిన మ్రొక్కుచు, సరభసమగు కాంక్షతోడ సంజీవని ని
ర్భరకరుణ న్నాకొసఁగుము, పరమేశ్వరి యనినఁ గొన్ని పచ్చనియాకుల్.29
చ. తలఁచినమాత్ర నాత్మకరతామరసంబున నున్న వాని ని
మ్ములఁ గృపసేసి వీని రసముం బయిపైఁ జిలికింపఁగా శవ
మ్ములకును బ్రాణముల్ గలిగి ముందటిరూపము వచ్చి తేజముం
బలమును జెంది పూర్వగుణభంగిఁ జరించుట కల్గు నెట్టెడన్.30
క. ఎండవు తఱుఁగ వనుచు నిడి, చండిక పొడఁగానరాక చనుటయు మదిలో
నిండిన సంతసమున వి, ప్రుం డవికొని యాత్మపురము త్రోవ నొకరుఁడున్.31
చ. చనునెడ నిర్మనుష్య మగుచక్కటి నప్పెనుగాన నెండిసో
యిన యొకపుండరీకశవ మీరమువెల్పల నున్నఁ జేరఁగాఁ
జని తన కన్నయౌషధముశక్తి నిజంబుగఁ జూడ నెంచి చే
త నలఁపి యాకులం బసరు దానిపయిం బిడిచెం గుబుద్ధి యై.32
చ. పిడిచిన నేమి చెప్ప నతిభీకరదుస్సహపుండరీక మ
ప్పుడ తన నిద్ర మేల్కనినపోలిక మ్రోగుచు బిట్టు లేచి య
వ్వెడఁ గగువిప్రుఁ గూయిడఁగఁజేసి మృతుం బొనరించి మ్రింగె మే
ల్వడసియు బుద్ధిచాలనియభాగ్యులు తత్ఫల మంద నేర్తురే.33
క. మతియ కళాకృషిబీజము, మతియ తన ఫలప్రదక్షమాజము తలఁపన్
మతియ చెలి మతియ చుట్టము, మతిహీనులు చూడ మొరడుమ్రాకులు ధాత్రిన్.34
వ. అని పలికి తన్మతిం బ్రశంసించి తత్ప్రసంగం బట్లుండనిచ్చి తమరాజు వర్తనంబుఁ
దడవి చేయవలసిన కార్యంబు సేయం దలంచి సోమదత్తుండు మాతులున కి
ట్లనియె.35
క. ఏ రసమున కెవ్వఁడు ప్రియుఁ, డా రసమున యందుఁ బోల్చి యభినవరు చివి
స్తారము పుట్టించిన మును, జేరినదెస విడిచి మనము సేరు నవలకున్.36
క. మాటలు పె క్కేటికి మద, నాటోపము భూమిపతికి నతిశయముగ మే
ల్జోటిఁ గనఁబఱచి మన సా, రాటపడంజేసి కాని రా దుడిగింపన్.37
క. కావున మన మిటకు మృగాం, కావలిఁ గొనివచ్చి చూపి యధిపు మనంబున్
దేవివలన నూటాడం, గా వేగమ చేయవలయు గాఢవివేకా.38
వ. అట మీఁద నక్కన్య వరించి మన రాజు సార్వభౌమత్వముఁ జెందు నీ యుపా
యంబునకు నపాయవిమోచనంబును శ్రేయస్కరంబు నగుట దీనిం గడవం గార్యం
బొండు గలదే యక్కన్యకారత్నంబు రప్పింప మనకు నిది సమయం బది యె ట్లని
న నా రాజు రత్నసుందరి పినతల్లి భర్త యగుట భాంధవంబు దోఁప సహాయులం
దగు వారిఁ గొందఱిం బుచ్చి పరిఘబాహుతోడ యుద్ధం బొనర్చునాఁడు నీపుత్రుం
డగు మృగాంకవర్మ యట నుండ వలన దిటఁ బుత్తెంచునది యని దేవిపేరిలేఖ పు
త్తెంచిన నతండును సంతసిల్లుచు నిచటికిఁ బుత్తెంచు మన మతని కీబ్రియంబుఁ జే
సినవారమ పోలె మనకార్యంబు నిర్వర్తించుకొంద మిది యట్టిద.39
క. నయవంతులు నిజకార్య, ప్రయోజనములకును జేయు పను లన్యులు మా
కయి సేసిరి వీ రనుచుం, బ్రియ మందఁగఁ జేయుదురు భరితకౌశలులై.40
క. ఇతరులు తనవలనఁ బ్రమో, దితులై యుండంగఁ దాను దిట్టతనముతో
మతిఁ దన కార్యము నడసిన, చతురిక కథ వినవె యిట్టిచందము దెలియన్.41
సీ. విదిశాపురంబున వికచాంబుజానన చతురిక యనునది చాల వాసి
గలవారకామిని గల దోర్తు దాని కన్నగర మేలెడురాజు నగరి బచ్చు
కొడు కర్ధపాలనాఖ్యుఁడు మంత్రిపుత్రుండు బహుతంత్రుఁ డను పేరఁ బరఁగువాఁడు
తలవరి యగు దండధారుండుఁ బాతాళఖనికాభిధానంబు గలుగునట్టి
గీ. చోరుఁడొకరుఁడు బొజుఁగులై భూరిధనము, లొసఁగ సిరి గల్గి నలువుర యుల్లములను
దాను దక్కంగఁగొని వారు తమకతమక, కూర్చు నన నత్తలోదరి నేర్చి మెలఁగు.42
శా. ఆరామాతిలకంబు కూరిమిసఖుండై యుండు నవ్వీటిలో
నారీనాయకసంధినిగ్రహవిధానప్రౌఢసాచివ్యసం
చారైకప్రవణుం డధిష్ఠితమహాసాధుత్వవేషుండు మం
దారాఖ్యుం డగు విప్రుఁ డొక్కరుఁడు మేధాభూషణుం డెల్లెడన్.43
క. అతఁ డా చతురిక విటజన, చతుష్టయముఁ గూడఁ దనవశం బగుగతి స
న్మతిఁ జేసి జారి కిష్టా, ప్తతఁ గైకొనువాఁడుఁ బోలెఁ దా వర్తించున్.44
వ. ఇట్లు వర్తించుచు నమ్మందారుం డొక్కనాఁ డర్ధపాలనాఖ్యుమందిరంబునకుం బో
యి యేకాంతంబున నిష్టాలాపగోష్ఠి నడపు సమయంబున.45
క. అతనికిఁ బరమాప్తుండై, చతురిక నీవలని కూర్మి చాల గలుగఁజే
సితి వఁట నిజమా యనవుడు, నతిశయరాగాంధబుధియై వాఁ డనియెన్.46
ఉ. ఎన్నఁడుఁ జేర నీ దొరుల నేఁ జనుదొంచినఁ బ్రీతితోఁడ న
త్యున్నత మైన మచ్చు పయి నుంచు మహోజ్జ్వలరత్నభూషలన్
ము న్నొకనాఁడుఁ దాల్పనివి మోదముతో ధరియించి వచ్చు నా
యున్నెడ కింతి నావలని మాననిప్రేమముఁ జెప్ప నేటికిన్.47
వ. అనుటయు నవ్వచనంబులు విని మంత్రీపుత్రుం డగు బహుతంత్రుం డున్నయెడకుం
జని యర్ధపాలకు నడిగినట్ల యడిగిన నతం డమ్మందారుతో నిట్లనియె.48
శా. పాడున్ వీనుల కింపుగాఁగ ననుఁ దాఁ బాడించు జూదంబు నా
తోడన్ వేడుక నాడు నూతనకథాస్తోమంబు నాచే వినున్
గ్రీడాపుష్పవిభూషణప్రకర మర్ధిన్ నన్ను జేయించు నా
కై డక్కెన్ గమలాక్షి యేమిటికిఁ బెక్కాలాపముల్ నెచ్చెలీ.49
వ. నావుడు మందారుండును నచ్చోటుఁ గదలి యింకొక సమయంబున దండధారునిం
టికిం బోయి వాని నట్ల యడిగిన నతం డిట్లనియె.50
క. పొరుగింటికి వచ్చు సితాం, బురుహేక్షణ యేను జెప్పిపుచ్చిన యపు డె
వ్వరు గాని పిలువఁగా వ, త్తురె యింటికిఁ జెపుమ వారతోయజనేత్రల్.51
వ. అని పలికిన విని యట్ల యింకొకనాఁడు పాతాళఖనికు నడిగినం బొంగుచు వాఁ డ
మ్మందారునితో నిట్లనియె52
క. ఏ నిద్రఁ జెందునంతకుఁ, దా నొల్లదు నిద్ర దాల్సఁ దా నప్పుడు నా
మేను తన మేనితోడం, బేనికొనుం దెఱవ కూర్మి పెం పే లడుగన్.53
వ. అనిన విని యందఱి మనంబులం గల సంతసంబులు నెఱింగి తనలో నవ్వుచు మం
దారకుం డొక్కనాఁడు రహస్యస్థానంబునఁ జతురికతోడ నిరర్గళక్రీడాలాపగోష్ఠి
నడపు సమయంబున నిట్లనియె.54
క. నా కొకసందేహము గల, దోకోమలి నిన్నుఁ బొంది యుండెడి విటు ల
స్తోకవివేకులు నలువురు, నీ కెవ్వరియందు వలపు నిక్కము చెపుమా.55
క. అనుటయుఁ జతురిక నీ వెఱుఁ, గనివాఁడవ పోలె నడుగగాఁ దగ దం దె
వ్వనిఁగాని యేల తగులుదు, ధనముకొఱ కొనర్తుఁ గాక దట్టపుప్రియముల్.56
వ. అని మఱియు ని ట్లనియె.57
సీ. మిన్నక యొకనిపైఁ గన్నులు వొలయించి యరగంట నొకని నెయ్యమునఁ జూచి
చెన్నార నొకనిపైఁ జిఱునవ్వు చిలికించి యలరుచు నొకనిపైఁ బలుకు వైచి
యొకని నీ విట రాక యోర్వ రమ్మని పుచ్చి యొకనిఁ గూటంబునఁ నోరఁజేర్చి
యొకనికిఁ గూరిమి ప్రకటించి నమ్మించి పాటించి యొకనికి బాస చేసి
గీ. తన్నుఁ దా రందఱును జాలఁదగిలి యిచ్చఁ
దమక తక్కినవయది యని తలఁచుకొనఁగ
నెవ్వరికిఁ దాను గూర్సక యెల్లభంగి
ధనమునక కూర్చునది వారవనిత యనఁగ.58
వ. అనుటయు నమ్మందారుం డర్థపాలనున కెట్లు కూర్ప వని యతండు సానురాగుం
డై తనకుం జెప్పినపలుకులుం జెప్పినఁ జతురిక యతనిఁ జేఁజఱచి నవ్వుచు ని ట్లనియె.59
క. మ చ్చెక్కింపుదు వానిని, నిచ్చెన యిడి తొలఁగఁ బుచ్చి నెమ్మదితో నే
మ్రుచ్చిలి క్రిందటి యిండ్లన్, విచ్చలవిడిఁ బిలుచుకొఱకు విటుల నితరులన్.60
గీ. వాని పిలుపునాఁడు నవరత్నభూషణ, వ్రజముఁ బూను టెల్ల వాఁడు రత్న
శుద్ధి యెఱిఁగి యెఱుఁగు సొన్నారికపటంబు, గాన వానిఁ దాల్తు వానియొద్ద.61
క. అనుటయు నది కపటంబై , నను నయ్యెం గాక మంత్రినందనుతో నీ
వనురాగవిహారంబున, నెనయుట యది కూర్పకుండుటే యబ్జాక్షీ.62
వ. అని యతఁడు చెప్పిన పలుకులు చెప్పిన విని చతురిక యి ట్లనియె.63
గీ. వాఁడు ప్రోడగాన వానిచే మెల్లనఁ, గళల నేర్తు నాకుఁ గళలనేర్పు
గలుగ వానితోడఁ గవయ నొల్లక ప్రొద్దు, జరపుటకును నిదియ వెరవుగాన.64
క. అనుటయు నది యగుఁ బో నీ, వనురాగాధీనవై పరాలయమునకుం
జనుటయుఁ గూర్పనివిధమే, యని చెప్పెను దండధారునాలాపంబుల్.65
వ. చతురిక యిట్లనియె.66
ఉ. చోరుఁ డొకండు నావిటుఁడు సూడవె యచ్చట వానిమిత్రులన్
జోరకుసాధనంబులును జూచిన యప్పుడు దండధారుచే
దారుణదండపాత మగుఁ దథ్యము గావున వాని మద్గృహ
ద్వారముఁ దూఱనీఁక తలవాకిటి యిండ్లక వోదు నెప్పుడున్.67
క. బలవంతుఁ డైన మిండఁడు, నిలయములోనున్నవాఁడు నినుఁ గూడక
యే నిలువంగఁజాల నని చని, పలుమఱుఁ బొరుగిండ్లవాని పచనముఁ దీర్తున్.68
వ. అనిన నది కార్యార్థకృత్యంబైనను నయ్యెంగాక యిది నిక్కంబు నెయ్యంబు గాదె.
యని పాతాళఖనికు పలుకులు వినిపించిన నవ్వుచు నమ్మందారుతోఁ జతురిక
యిట్లనియె.69
ఉ. వానికి ముందుగా నిదుర వావిరిఁ బొందనువాడు దొంగకాఁ
డే నిలయంబులోని ధనమెల్లను దొంగిలకుండ మేనితో
మేను పెనిం బిగిండు మును మెల్లన వాఁడు సరింపకుండ మే
ల్కాన నుపాయ మొండొకఁడు గల్గునె నా కిది గాక చెప్పుమా.70
వ. అనుటయు మందారుం డివి యన్నియు నిట్లగుంగాక వారాంగనల యందుఁగూరి
మి యెవ్వరియందు లేదే యనినఁ జతురిక యిట్లనియె.71
క. కూరిమి లేదని పలుకుట, నేరమ యెవ్వారి కైన నెయ్య మొకదెసన్
జేరక తక్కదు కపటపుఁ, గూరిమి తఱ చడఁగి యుండుఁ గూరిమి యొకచోన్.72
క. కలవని వలవని ప్రియు నెడఁ, గలిగించుకొనంగ వెఱవు గలిగిన నటులం
గలిగిన నెయ్యము ప్రియులకు, వెలిదోఁపగనీరు సూవె వెలఁదులు తాల్మిన్.73
క. తనకొఱకై యాచతురిక, యొనరించిన పనులు కూర్మియుపచారము లై
కొని యర్థపాలనాదుల, మనములు హరియించె నేర్పుమతిఁ దెలిసితివే.74
క. కావున మనమును మనకొఱ, కై వేగమ చంద్రవర్మ కతిమిత్రులమై
యావిభుని కూఁతు నిచటికిఁ, దేవలయుం గార్య మిదియ ధీమత్ప్రవరా.75
క. అని యిట్లు తనకు నల్లుఁడు, వినిపించిననీతివాక్యవివరణ మెదఁ జే
కొని భాగురాయణుండును, బనిచెన్ దోడ్తేర లాటపతి కూర్మిసుతన్.76
సీ. వాఁ డట్లు చని వేఁగ వావిరిఁ దోడ్తేర నక్కుమారికఁ దనయాలయమున
విడియించుకొని లాటవిభుఁడు పుత్తెంచుడు నాయనసుతుఁడు మృగాంకవర్మ
చనుదెంచినాఁడు మీయనుజుండు గావున వేఱొకతావున విడియుట యుచి
తం బని మానివాసంబున విడియించుకొన్నార మని దేవి కున్నతప్ర
గీ. మదముగాఁ జెప్పి పుచ్చి యమ్మంత్రివరుఁడు, దేవిపరిచారికలలోన దృఢవివేక
యగు కళావతి నాత్మకార్యానుకూల, భారధూర్వహఁగాఁ బొందుపడ ఘటించె.77
వ. అమ్మృగాంకావళి విధం బెఱిఁగించి యక్కన్నియకుం జెలియ లై వర్తిల్లునట్లుగా బ
హుమానపూర్వకంబుగా నిలిపిన న ట్లక్కార్యంబు సమాధానం బగుటయు.78
ఉ. అంతటిలోన నొక్కమత మాత్మఁదలంచి యపూర్వశిల్పధీ
మంతులఁ జేయఁబంపె నసమానముగా నొకహర్మ్యరత్న మ
భ్యంతరమందిరంబునకు నావల దవ్వుల భాగురాయణుం
డెంతయుఁ గ్రొత్తలాగుగ మహీతలభర్తకుఁ బవ్వళింపఁగన్.79
వ. అది సుషిరకుడ్యస్తంభయంత్రం బగుగృహం బవ్విధంబు రాజు మొదలగువా రెవ్వ
రెఱుంగ రక్కాలంబున కాయతం బైన జగతీనాథుం డభినవంబును మనోహరంబు
ను నగుట నంద నిద్రించుచుండు నంత నొక్కనాఁడు.80
గీ. రాజ్ఞిదాదికిఁ బుత్రియుఁ బ్రాణసమయు, నైన మేఖలయనుదాసి యడ్డులేక
రాజు నెచ్చెలి యైనచారాయణాఖ్య, విప్రుతోఁ గలహించిన విధ మెఱింగి.81
క. మకరందికయును సుమతియు, సుకుమారిక యనఁగ రత్నసుందరి పరిచా
రికలు నగరిలో మువ్వురు, నొకచో నేకాంతగోష్టి నుండుచుఁ దమలోన్.82
వ. చారాయణమేఖలావివాదప్రసంగంబు లగుమాట లాడుచుండ నందు సుమతి యి
ట్లనియె.83
క. మొగమోట గరిమ మడకువ, తగ వుచితము మెలపు పెంపు తాలిమి యివి లో
నగుసుగుణంబులు వలవదె, నగళ్ళలోఁ దిరుగు పరిజనంబుల కెల్లన్.84
క. పోరఁ దొడంగిరి కంటిరె, చారాయణమేఖలలు విచారింపరు రా
త్రీరమణు నెదుటఁబడినను, నేరక యిటుఁ గినుక పుట్టునే యిరువురకున్.85
క. నైజగుణంబునఁ దమమది, రాజస మప్పటికిఁ గప్పి ప్రజతో నాయా
యోజఁ జరించినయంతనె, రాజులు సాధు లని నమ్మరా దెవ్వరికిన్.86
క. చలమున సన్నపుఁగార్యం, బులకై తమలోనఁ బ్రజలు పోరినఁ బతి యు
త్తలుఁ డైనఁ జెడరె వాదం, బుల శశముఁ గపింజలంబుఁ బొలిసినభంగిన్.87
వ. అక్కథ యె ట్లనిన.88
క. నర్మదతటమున హింసా, కర్మం బొరు లెఱుఁగకుండఁ గాఁపుర ముండున్
ధర్మమునఁ జరించు కపట, ధార్మిక మొక్కపులి యొక్కతరుకుంజమునన్.89
వ. ఇట్లు వర్తింపుచుండ నొక్క నాఁ డవ్వనంబున మృగంబు లెల్లఁ బెద్దయు నమ్మి త
మ్ముఁ బరిపాలించుట వేఁడిన నదియును హింసాధర్మంబున దండనం బొనరింపంగా
ని న్యాయాన్యాయంబులు నిర్ణయించి మిమ్ముఁ దగుభంగి శిక్షింపఁగలవాడ నని
యె నవ్విధం బట్లు చెల్లుచుండ నొక్కనాఁడు.90
క. ఒక్కయెడం దమలో నొక, బొక్కకు వా దడిచి శశకముఁ గపింజలముం
గ్రక్కునఁ బఱతెంచి పులికి, మ్రొక్కుచు నిజపాద మిరువురుం జెప్పుటయున్.91
వ. ఆవ్యాఘ్రంబును వానితోడ.92
గీ. ముదిసినారము కానము మున్నవోలె, శ్రవణములు దూరమును వినుశక్తి లేదు.
కదియఁ జనుదెంచి చెప్పుడు కార్య మనుఁడు, నవియుఁ దేకువమాలి డాయంగనడువ.93
క. ముందటికాళ్ళం గొని యా, కుందేలుం గైదుఁ బట్టికొని గొంతుకనం
దందఁ గఱచి భక్షించియ, మందప్రీతిఁ బులి శౌర్యమతమై యుండెన్.94
క. అలఁతు లగు కార్యములు ఘన, ములు సేసి చలంబుపేర్మిఁ బోవఁగ నది రా
జుల చెవులఁ బడ్డ నిరుదెఱఁ, గులవారికిఁ జాలఁ గీ డగుట సందియమే.95
వ. అని యిట్లు సుమతి యెఱింగించిన కథ విని మకరందిక యిట్లనియె.96
క. పోరొప్పు డెంచు నల్పులు, పోరిన నది బలసి యంతఁ బోవక విపదా
ధార మగుఁ దొల్లి తొండలు, పోరిన జనులకును బాధపుట్టినభంగిన్.97
వ. అక్కథ యెట్లనిన.98
సీ. మాణిక్యసేననామకుఁ డొకభూపతి జైనులయెడ భక్తి చాలఁ గలిగి
యవనికిఁ జేరువ యగుచో నగాధసలిల మగు నొకతమ్మికొలనిపొంత
వారికి వసతులు గోరినట్లన సమాచీనంబులుగ నొప్పఁజేయఁ బనిచి
సకలపదార్థసంచయములు నటఁ బుచ్చి యందు వా రుండెడునట్లుఁ జేసి
గీ. తమయనుష్ఠానవిధి కది తగిన యేక, తంపునెలవు మనోహరస్థలము గాఁగ
వారు నిజచర్శనోచితవర్తనముల, నుల్లములు సమ్ముదముఁ జెంద నుండునంత.99
మ. ఒకనాఁ డచ్చటి నీరజాతవనతీరోపాంతకుంజంబునం
దొకచోఁ దొండలు కాటులాడుటయు నం దొక్కండు విక్రాంతి కో
ర్వక యొక్కం డది వెంట రాఁ బంచి యేవంకం జొరంజోటు గా
నక కాంతారమదేభ మాకొలనిలోనం జొచ్చి క్రీడింపుచున్.100
క. తిరుగాడుచుండగాఁ గని, కరము భయభ్రాంత మగుచుఁ గరివరకర్ణాం
తకవిసరములోనికి నొక, తొరటముగతి సరట మంత దురదురఁ దూఱెన్.101
మ. అది చూత్కారముఁ జేసి కే ల్విద్రుచుకొం చంభోజషండంబు ను
న్మదభంగిం బలుమ్రోఁతతో వెడలి పల్మాఱున్ మహాఘీంకృతుల్
సెదరన్ వెండియుఁ దొండమున్ విద్రుచుచున్ శీఘ్రంబ పెన్మ్రాకులుం
బొదలం గూల్చుచుఁ బాఱి జైననిలయంబుల్ సొచ్చె నుగ్రాకృతిన్.102
ఉ. కొమ్ముల నూది కుడ్యములఁ గూలఁగఁద్రోచియుఁ కేల వీటతా
టమ్ముల నీవలావలఁ బడన్ సదనంబులు వైచియున్ మహో
గ్రమ్ముగ డాసియున్న కరిఁ గన్గొని గుండెలు జల్లనంగ వ
స్త్రమ్ములుఁ గుంచియల్ విడిచి తల్లడ మెక్కుడుగా వడంకుచున్.103
ఉ. ఒండొరుఁ దాఁకి జైనమునియూథము కుత్తుకదాఁక పట్టి నో
ళ్ళెండఁగఁ గాళ్ళుఁ దొట్రువడ నేదెసఁ బాఱఁగలేక కూయవే
దండము సేరి కొమ్ములఁ బదంబులఁ దొండమునన్ వధించినం
దండము లయ్యెఁ బీనుఁగులు ధారుణిఁ గాలువ లయ్యె నెత్తురుల్.104
గీ. అట్లు జైనుల వధియించి యచటఁ గడమ, వడినవసతులు వడద్రోచి వారణంబు
కొలను సొచ్చి సరోరుహకులను నెల్ల, మరల భగ్నముఁ గావించి దరికి వచ్చి.105
క. సరసీజలముల నిండం, గరమునఁ బూరించి యోరఁగాఁ బడి చెవిలో
గురిపించినఁ దల్లడపడి, సరటము బైటఁబడెఁ గరియు సమ్మద మందెన్.106
గీ. అల్సు లొనరించు దుష్కలహంబుఁ గూడ,
జేరు వైయున్న ఘనులకుఁ జేటుఁ దెచ్చు
సరటకలహంబు చేరువై సమసినట్టి
వారణము జైనకులముఁ గాసారమట్లు.107
వ. అని మకరందిక యెఱింగించినఁ గడుఁ గొనియాడి సుకుమారిక యిట్లనియె.108
క. ఆలుకయు మదమును గర్వము, నొలుకు నకారణవిరోధ మొందు జనులచె
య్వుల కెక్కుడైన యాపద, మొలచును మధుబిందుకలహముల చందమునన్.109
క. ధరణిపయి లాటనరపతి, పురిఁ దేనియ నమ్ముకొఱకు బోయలపల్లెం
జరియించుచుండువాఁ డొక, పురుషుం డది యొక్కకలశమునఁ గొని కడఁకన్.110
వ. అరిగి యానగరంబున నొకసన్నపువీథియందు.111
ఉ. తేనియకుండ మ్రోచికొని దిక్కులు నాలుగు బిక్కచూడ్కి నే
దేనియుఁ జూచుకొంచు నొకయేనిక కట్టెదుటన్ మదాంధమై
రా నచటం దొల గెడు పురంబుజనంబును జూచి భీతుఁ డై
దానును నుత్తరించుచుఁ బదంబులు తొట్రుపడంగఁ బాఱుచున్.112
గీ. వడఁకుఁ గొని నిలవఁద్రొక్కని యడుగు కొంత
జాతి మొగ్గతిలంబడం బాఱుటయును
నిండి మూఁపునఁ దాల్చిన కుండ తొలఁకి
యొలికె మధుబిందు వొకకొంత యుర్విమీఁద.113
సీ. ఆ తేనెబొట్టున కచట నీఁగలు ముసిరిన వానిఁ బట్టంగ నని కడంకఁ
జేరె నచ్చటి కొక్కచెలఁది, యాచెలఁది మ్రింగిన బల్లి నొకపిల్లి దినియె, నంత
నాపిల్లిఁ గఱచె రాజాధీన మగు వేఁటకుక్క యొక్కటి, దానిఁ గోప మడరఁ
బొడిచె బిడాలంబు, గొడయని నగరికుక్కలవారు చంపిరి కడఁగి దాని
గీ. దానివాడవారు తవిలి చంపించిరి, కుక్క, నంతఁ గినిసి కుక్క వేఁట
కాండ్రు రంద ఱేగి కత సవిస్తారంబు, నృపతితోడఁ జెప్ప నృపతి యలిగి.114
మ. తన వూహింపక యూరివాడప్రజలం దాఁ జంపఁగాఁ బంచినన్
జగతీవల్లభుఁ డైన నేమి యని యుత్సాహించి సన్నద్ధులై
నగరం గొల్వనివార లొక్కదెసయై నానాయుధోపేతులై
తెగి భూపాలకసేనఁ దాకిరి మహోద్రేకంబుతో నార్చుచున్.115
ఉ. రెండుతెఱంగుమూఁకలును రిత్తకు రిత్త చలంబు పెంపునన్
భండన ముగ్రభంగుల నొనర్పఁగఁ బెక్కులు ద్రెళ్ళెఁ బీనుఁగుల్
కండలుఁ బ్రేవులుం గలసి కాలువలై యెసలారె నెత్తురుల్
కుండలచారుమస్తములు గుప్పలుగట్టె పురంబువీథులన్.116
వ. అ ట్లగుటం జేసి.117
క. కడుసన్నపుఁగార్యము నె, క్కుడురోసముతోడఁ బెనఁగి కుమతులు మౌర్ఖ్యం
బుడుగక పెద్దయు సేగిం, బడుదురు చుమి లాటనృపతిపౌరులు వోలెన్.118
వ. అని చారాయణమేఖలాకలహంబు లుగ్గడించి కలహంబు లింత లెస్స యగునే య
నుచు మువ్వురు నిజేచ్ఛం జని రంత నొక్కనాఁడు.119
సీ. లలితవివేకకళావతి భాగురాయణుచేత నుపదిష్ట యగుచుఁ జెలిమి
జారాయణునితోడ సంధించి మేఖలఁ బరిభవింపంగ నుపాయ మొకటి
యెఱిఁగించె వాఁడు నయ్యతివ చెప్పినయోజఁ గదిసి మేఖలతోడఁ గపటసఖ్య
మొనరించి పురుషుఁ డం చొకదాసితోడను బెండిలిఁజేసిన పిదప నెఱిఁగి
గీ. భంగపా టనుశిఖి యంతరంగ మెల్లఁ, గాల్పఁ జేల ముసుం గిడి కదిసి రాజ
యుక్త మగు దేవియడుగులయొద్ద వ్రాలి, పొగిలి యడలె నమ్మేఖల యెగిచి యెగిచి.120
గీ. పెండ్లికిం బంపఁ దగుననఁ బ్రియము మెఱయఁ, దగినవారిని బుచ్చితిఁ దలఁపు మిగిలి
నిన్నరాతిరి పెండిలి నేఁ డి దేమి, వచ్చే దీనికి నని దేవి వగచుచుండ.121
క. భూరమణుఁడు సన్నపునగ, వారుమొగముతోడఁ దన్ను నల్లనఁ జూడన్
బూరితసంతోషుం డై, చారాయణనాముఁ డధికసంభ్రముఁ డగుచున్.122
గీ. జోటి పోయినరేయిని శోభనంబు, వచ్చి పెండిలియాడితి విచ్చ మెచ్చి
నిన్నఁ గట్టిననీత్రాడు నేలఁ బొరల, నిచటఁ బొరలంగఁ గారణ మేమొ చెపుమ.123
క. పరిణయసంధానమునకుఁ, దొడయుటఁ జారాయణుండు దొరయని నరునిన్
వరుఁ జేసెఁ బెండ్లి యేమిట, సరిగాడో నీమగండు చామా నీకున్.124
క. అని పలికి పెలుచ నవ్విన, జననాయకమహిషి యాత్మసఖితో నడలం
బని యేమి చెప్పు చయ్యన, ననవుడు నే డ్పుడిగి లేచి యవనతముఖి యై.125
వ. చారాయణుండు తనతోడం గపటసఖ్యం బొనరించి తన్ను దనబంధుజనంబుల స
మ్ముఖమ్మున నుత్సవదర్శనకుతూహలంబున వచ్చినవారియెదుర సరివారిముందఱఁ
బరిభవించిన తెఱంగు నీరెలుంగుతో వెక్కుచుం జెప్పి క్రమ్మఱఁ గన్నీరు మొగం
బున నించుచుండె.126
ఉ. అప్పుడు దేవి భంగము వయస్యకుఁ జేసిన రాజుమిత్రుపైఁ
దప్పు ధరాతలేశ్వరునితప్పుగఁ జూచి దరస్మితంబుతో
నొప్పెడు మోముఁ జేఁదుడిచి యోరగఁ జేసి యపాంగభాగముల్
ఱెప్పలఁ గప్పినం బుడమిఱేఁడు వడంకె మనంబులోపలన్.127
చ. వినయవివేకభూషణుఁ బవిత్రమహీసురవంశపోషణుం
గనకనగేంద్రధైర్యు సవికారరూఢగుణాభిధుర్యు స
జ్జనసతతోపకారహరిచందను బాంధవచిత్తరంజనున్
మనుజశరీరదృష్టశతమన్యుని సర్వనరేంద్రమాన్యునిన్.128
క. సుశ్రేయఃప్రారంభు జ, నశ్రుతపౌరుషుని భావనారాయణదే
వశ్రీపాదసరోజా, తాశ్రయనిజచిత్తషట్పదాన్వయమతికిన్.129
మాలిని. కవిజననుతకీర్తిం గామినీకామమూర్తిం
బ్రవిమలగుణహారుం బ్రజ్ఞచేతోనిహారున్
వివిధసుకృతయోగిన్ విష్ణుభక్తానురాగిన్
భువనహితచరిత్రున్ బోలమాంబాసుపుత్రున్.130
గద్య— ఇది సకలసుకవిజనవిధేయ మంచననామధేయప్రణీతం బైన కేయూరబా
హుచరిత్రంబునందు ద్వితీయాశ్వాసము.