కేయూరబాహుచరిత్రము

శ్రీరస్తు

కేయూరబాహుచరిత్రము

ప్రథమాశ్వాసము

ఉ. శ్రీ వసియించుఁగాత సుఖసిద్ధివహించి యనేక బంధుహం
     సావళియుం బ్రహృష్టిరతిశాంతిసముత్కరషట్పదంబుపై
     జీవన మెప్పుడున్ సుకవిసేవ్య మనం బొగడొందు సర్వపు
     ణ్యావహ మైనగుండసచివాగ్రణిగేహసరోవరంబునన్.1
చ. కరిముఖుఁ డస్వినుల్ శ్రుతులు కంజసముద్భవుమోము లంబికే
     శ్వరుమొగముల్ తదాత్మజునివక్త్రము లాదిమునీంద్రమండలం
     బురగపతుల్ గ్రహంబులు పయోరుహనాథుఁడు తారకంబులున్
     బొరిఁబొరి నెల్లసంపదలు పోలమగుండని కిచ్చుఁగావుతన్.2
మ. శ్రవణానందనభారతీచతురునిం బ్రాచేతసుం దివ్యు స
     త్యవతీవందనుఁ గాళిదాసుఁ గృతికర్తన్ గొల్చి వాక్పూర్ణమే
     రువులన్ నన్నయభట్టుఁ దిక్కకవిచంద్రున్ భక్తితోఁ గొల్చి యు
     ద్ధవచాణక్యయుగంధరాదినయవిద్యాకోవిదధ్యాని నై.3
వ. ఇట్లు కృతిప్రారంభకర్తవ్యంబు లాచరించి యున్నవాని.4
సీ. తనపేరిసొబగు మేదిని నెల్లవారికి వీనుల కమృతంపువాన గురియఁ
     దనునాశ్రయించిన జనులమందిరములు తోమ్మిదినిధులను దొంగలింప
     దనకీర్తికామిని యనిశంబుఁ గైసేసి యేడుసంద్రములందు నీడఁజూడ
     దనయొప్పు చూచుకాంతల కొండుమారుండు లేఁ డనుబుద్ధి గల్లించుచుండ
గీ. నెగడు బ్రహ్మవంశనీరధిసంపూర్ణ, చంద్రముఁడు కళావిశారదుండు
     నైజధార్మికుండు నండూరిగుండన మంత్రినిఖిలమంత్రిమండనంబు.5
వ. నిరంతరసరసగోష్ఠీనిష్ఠుంకు గావున నొక్కనాఁ డుచితకథాశ్రవణప్రసంగంబున.6
క. ఈనయిష్టసఖుని విద్వజ్జనమాన్యుని నుభయకావ్యసరణిజ్ఞుని మం
     చననామధేయు నన్నుం గనుఁగొని యి ట్లనియె వినయగౌరవ మెసఁగన్.7
గీ. నందనుఁడు వనమ్ము నట్టిల్లు నిధి సురగృహము చెరువు మేలికృతి యనంగ
     జగతి వెలయు సప్తసంతానములు వినఁ బుణ్యములు యశంబుఁ బొందవచ్చు.8

క. వననిధి తటాక దేవభ, వనములు పుణ్యదము లైనవాని ననుష్ఠిం
     చినచోనకాని యెఱుఁగరు చనుఁగాదె సరసకవిత సకలదిశలకున్.9
ఉ. కావున నాకు నొక్కకృతిఁ గైకొననిష్టము నీవు ప్రజ్ఞసం
     భావితకావ్యదక్షుఁడవు భవ్యమతిం ద్విజదేవనిర్మితం
     బై విలసిల్లు తంత్రము ప్రియంబునఁ జూచిన నందుఁ గర్ణసౌ
     ఖ్యావహ మై ప్రబంధరచనాశ్రయ మయ్యెడు మార్గ మూఁతఁగన్.10
క. స్థాయిరసము శృంగారం, బైయలవడఁ గథలు నీతులై యెడనెడ రాఁ
     గేయూరబాహుచరితము, సేయుము నీ వాంధ్రభాష శిల్పము మెరయన్.11
వ. అని పలికి బహుమానపూర్వకంబుగా నంబరాభరణాదివివిధపదార్థసహితంబుగాఁ
     దాంబూలం బిచ్చినం బుచ్చుకొని.12
ఉ. బాలరసాలపుష్పవవపల్లవకోమలకావ్యకన్యకన్
     గూళల కిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
     హాలికు లైన నేమి మఱి యంతకు నాయతి లేనినాఁడు గౌ
     ద్దాలికు లైన నేమి నిజదారసుతోదరపోషణార్థమై.13
క. అని తగనివాని దెస నా, మన మెప్పుడు రోయుఁ గొన మతిమజ్జనవ
     ర్ణనలకు మిగిలిన సుగుణుని, నినుఁబొంది మదీయకవిత నెగడుం బుడమిన్.14
వ. కావున నీకుం గృతి యిచ్చెద నని యొడంబడి పురాతనాధునాతనకవినమస్కారం
     బుఁ గావించి వారియనుజ్ఞ వడసి భారతిం బ్రార్థించి పునఃపునఃప్రణామంబు లాచ
     రించి యగ్గుండనామాత్యువంశక్రమంబు జగత్ప్రసిద్ధం బైననుం గృతిలక్ష్మికి ముఖతి
     లకంబుగా రచియింతు నది యెట్లనిన-15
సీ. జనపాలనుతసింహ చక్రవాలంబు సామంతనిర్మలరత్నమండనంబు
     రాజత్తురంగతరంగపయోనిధి భద్రేభమేఘనభస్థలంబు
     భూదేవదేవజాంబూనదాచలము వదాన్యకల్పకదేవతాపురంబు
     బహుకళాకర్పూరభాసికరండంబు సుజనముక్తాఫలశుక్తిచయము
గీ. చతురకాంతాప్రసూనవసంతవేళ, రసికవిటజనమధుకరారామలక్ష్మి
     మధురకవిరాజనవహంసమానసంబు, నాఁగఁ దనదుపురంబు వర్ణనలఁ దనరు.16
వ. మఱియును.17
సీ. పుష్పకనివహంబు భూమిపై నిలిచినయ ట్లంద మైనదేవాలయములు
     రూప్యాచలము బహురూపంబుల నటించు రమణ శోభిల్లు సౌధముల పెల్లు

     అలకాధిపతి నిధు లన్నియు వెలివీటి విడిసినక్రియఁ బణ్యవీథికలును
     ధాత మేదిని మిన్నుఁ దఱఁగివైచినమాడ్కి గనుపట్టు బహుతటాకములు సొంపు
గీ. నుపవనంబులు సరసులునొప్పుచేయు, చెఱకుఁదోఁటలుఁ బ్రాసంగుచేలు మెరయ
     నఖిలవిభవంబులకు నెల వగుచు మోయు, ధనదుపురమున కెనయనఁ దనదుపురము.
గీ. మంటికడవ నులకమంచంబు పూరిల్లు, నూలిచీర రత్నకీలితంబు
     గానిపైఁడితొడవు గలుగు టెఱుంగరు, దనదుపురములోనిజనము లెల్ల.19
శా. ప్రాగ్దిక్పశ్చిమదక్షిణోత్తరదిశాభాగప్రసిద్ధక్షమా
     భుగ్దర్పాంతకుఁ డేలెఁ గొంకవిభుఁ డీభూచక్ర మక్రూరతన్
     వాగ్దేవీస్తనహారనిర్మలయశోవాల్లభ్యసంసిద్ధితో
     దిగ్దంతిశ్రవణానిలజ్వలదటత్తీవ్రప్రతాపాఢ్యుఁడై.20
క. ఆవిభునకుఁ బ్రెగ్గడయై, భూవలయంబున యశోవిభూషణుఁ డయ్యెన్
     గోవిందనప్రధానుం, డావాసము గౌతమాన్వయం బాయనకున్.21
మ. విహితాస్థానములందుఁ జూపుఁ దగఁ గోవిందాభిధానప్రభుం
     డహితోర్వీధరవజ్రి గొంకవిభురాజ్యాధిష్టి యై సంధివి
     గ్రహముఖ్యోచితకావ్యసంఘటనవాక్ప్రౌఢత్వమున్ బాఢస
     న్నహనోదగ్రరిపుక్షితీశబహుసైన్యధ్వంసనాటోపమున్.22
క. ధీరుం డాగోవిందన, కూరిమినందనుఁడు వెలసెఁ గొమ్మన గొంక
     క్ష్మారమణున కుదయించిన, వీరుఁడు రాజేంద్రచోడవిభుప్రెగ్గడ యై.23
సీ. నవకోటిపరిమితద్రవిణ మేభూపాలుభండారమున నెప్డు బాయ కుండు
     నేకోనశతదంతు లేరాజునగరిలో నీలమేఘంబులలీలఁ గ్రాలు
     బలవేగరేఖ నల్వదివేలతురగంబు లేనరేంద్రునివాగె నెపుడుఁ దిరుగుఁ
     బ్రతివాసరంబు డెబ్బదియేనుపుట్లు నే, యే విభుమందల నెపుడుఁ గల్గు
గీ. నట్టి యధికవిభవుఁ డగుకులోత్తుంగరా, జేంద్రచోడనృపతి కిష్టసచివ
     తంత్రముఖ్యుఁ డనుఁగుమంత్రి గోవిందనం, దనుఁడు కొమ్మనప్రధానుఁ డొప్పు.24
ఉ. ఇల వెలనాటిచోడమనుజేంద్రునమాత్యత యానవాలుగా
     గులతలకంబుగా మనినకొమ్మనప్రెగ్గడ కీర్తిమాటలన్
     దెలుపఁగనేల తత్క్రియఁ బ్రతిష్ఠిత మైనతటాకదేవతా
     నిలయమహాగ్రహారతతి నేఁటికి నెల్లెడఁ దాన చెప్పఁగన్.25
సీ. రమణీయ మైనకూర్మగ్రామమునయందు గురుదుర్తిపురమునఁ గ్రొత్తచర్లఁ

     ద్రిపురాంతకమునఁ జేర్చిన కొట్టిదొనబొగ్గద, రమునఁ గళింగరాష్ట్రంబులోని
     యెలమంచి లాదిగా నెలమి ముప్పదిరెండు విష్ణుప్రతిష్ఠలు వెలయఁజేసి
     నిచ్చ వేవురుమేదినీసురవరులకు, బంతి సద్భక్తితోఁ బాయసంబు
గీ. దనర నిడుటయె జన్మవ్రతంబు గాఁగ, మనువు నడిపిన కొమ్మనమంత్రివరుని
     బుద్ధిలోన బృహస్పతి బోలువాని, బోలఁగలుగుదురే ధర్మపురుషు లెందు.26
మ. అరు దందన్ వెలనాటిచోడమనుజేంద్రాజ్ఞాపనం బూని దు
     స్తరశక్తింజని యేకవింశతిసహస్రగ్రామసంఖ్యాక మై
     ధరణిం చేర్పిన పాకనాడు నిజదోర్దండైకలగ్నంబుగాఁ
     బరిపాలించె నమాత్యకొమ్మన జగత్ప్రఖ్యాతచారిత్రుఁడై.27
క. చలముమెయిఁ గటకసామం, తులు గరిహయబహుళ సేనతో నేతేఱన్
     దలపడియెఁ గొమ్మసచివుఁడు, బలియుండై క్రొత్తచర్లపరిసరభూమిన్.28
సీ. సెలకట్టెవాటునఁ జెలఁగి రెంటిని మూటిఁ గూడ గుఱ్ఱంబులు గుదులు పరచఁ
     బ్రతిమొగం బగునరపతులకత్తళమునఁ గడిమిమై వీఁపులు వెడలఁ బొడుచుఁ
     బందంపుగొఱియలపగిది నేనుంగుల ధారశుద్ధిగ నసిధారఁ దునుముఁ
     జిదియించుఁ బగిలించుఁ జేతులతీఁటవో వడిఁగాండ మేసి మావఁతులతలలు
గీ. తల పుడికివ్రేసి మావంతు తలలు శత్రు, రాజశిరములు ద్రొక్కించు రాఁడెదిరుగ
     వాగె నుబ్బెడు తనవారువంబుచేత, మహితశౌర్యుండు కొమ్మనామాత్యవరుఁడు.29
చ. అరిగజకుంభపాటనవిహారము కొమ్మనమంత్రి సల్పుచో
     నురివినమౌక్తికవ్రజము లుర్విపయిం బొలిచెం దదీయసం
     గరహతవీరదోర్గ్రహణకారకసంభ్రమఖేచరీపర
     స్పరతనుమర్దనోద్గళిళభాసురహారమణీచయం బనన్.30
క. ఆకొమ్మనప్రెగ్గడసుతుఁ, డై కేతన చోడభూవరాత్మజుఁడై ధై
     ర్యాకరుఁ డగుపృథ్వీశమ, హీకాంతునిమంత్రి యయ్యె నెంతయుఁ బేర్మిన్.31
ఉ. కౌశికగోత్రభూసురళిఖామణి కేతనభూవరుండు పృ
     థ్వీశనరేంద్రుమంత్రి యయి యెల్లెడఁ జాలఁ బొగడ్త కెక్కె నా
     కాశనదీమరాళశివకాశసురాశనతారకేశ నీ
     కాశతరాధిరోచిరవకాశవికాసయశోవిశాలుఁడై.32
ఉ. కేతనమంత్రినందనులు కీ ర్తివహించిరి బంధుజాత వి
     జ్ఞాతవినీతభావుఁ డనఁజాలిన కొమ్మనదండనాథుఁడున్

     బ్రాతరహర్పతి ప్రతిమభాసురతేజుఁడు మల్లశౌరియున్
     బ్రీకసమస్తసజ్జనుఁడు భీమనప్రెగ్గడయుం గులాగ్రణుల్.33
ఉ. అందఱిలోనఁ బ్రాయమున నారసిచూడఁగఁ బిన్నయయ్యుఁ బెం
     పొంది గుణంబులం బొగడనొందె ధరిత్రి నమాత్యభీముఁ డా
     నందము తల్లిదండ్రులుమనంబున నొందఁగ మందిరంబునన్
     గుందవరాచ్ఛకచ్ఛపముకుందము లందము పెంపుఁ జెందఁగన్.34
సీ. క్షితిఁ గశ్యపప్రజాపతిమన్మఁడై తాను బట్టుట నతనిన పోలు ననుచు
     జను లెల్లవారును దను నెంచ నెగడిన గుండదండాధీశుకూర్మిపుత్రిఁ
     బుణ్య లక్షణమీర్తిఁ బోలన మారన పేరనలాదిగాఁ బేరుగలుగు
     సచివసప్తకముతో జనియించి మునుఁ గులభూధరంబులతోడఁ బుట్టినట్టి
గీ. వసుమతీదేవి కెన యనవచ్చు పోల, మాంబఁ బెండ్లాడెఁ దనయన్వయంబు పావ
     నంబు లోకంబు కీర్తిబూర్ణంబు గాఁగ, భీమనామాత్యుఁ డరిరాజభీకరుండు.35
సీ. పుణ్యంబుముడి మోచుపొలఁతుల కెల్ల నీపువుఁబోడి యౌదలభూషణంబు
     పతియాజ్ఞ దలనిడి బరియింత గడవని లలనల కీయింతి తిలకలక్ష్మి
     తొడి పూసికట్టి బంధువులకునిడి యున్న పడతుల కీపుణ్యభామ యొజ్జ
     కడుపు చల్లగ మేలికొడుకులఁబడసిన సుదతుల కీచామ మొదలిపేరు
గీ. తాల్మిగని యొప్పుకందువ తగవునెలవు, ధర్మములయిక్క మొగమాటతానకంబు
     సుగుణములఠావు వినయంబుచో టనంగఁ, బోలమాంబిక యెల్లెడ బొగడ నెగడె.36
చ. అతిశయపౌరుషైకపరులై జనియించిరి పుత్రు లట్టిదం
     పతులకు మువ్వు రుత్కటకృపానిధి కేతనదండనాథుఁడున్
     క్షితిధరతుల్యు డైనచినకేతనమంత్రియు సర్వసద్గుణా
     యతనసుబుద్ధి గుండసచివాగ్రణియున్ నిజవంశభూషణుల్.37
ఉ. రోహణపర్వతంబునఁ బరూఢము లైనయనర్ఘ్యరత్నసం
     దోహము నట్టినందనులతోఁ దనవృద్ధియు బంధురక్షణో
     త్సాహము బ్రాహ్మణోత్తముల ధన్యులఁజేయుగుణంబు సత్మళా
     గేహవిశుద్ధబుద్ధి యగుకేతనమంత్రికి నొప్పు నెప్పుడున్.38
ఉ. నూతనదర్పకుండన మనోహర మైనసురూప మొంది వి
     ఖ్యాతకవిత్వసంపదఁ బొగడ్తకు నెక్కి యశేషబాంధవ
     వ్రాతహితాత్ముఁడై గణకవర్గకళామహిమన్ బ్రగల్భుఁడై

     కేతనమంత్రి దిగ్భరితకీర్తి వహించె నమాత్యకోటిలోన్.39
శా. పుట్టెం గుండని బంధుకోటులతపఃపుణ్యప్రభావంబుతో
     బెట్టెం బాదము భూమి నప్రతిమమై పెంపారు భాగ్యంబుతో
     గట్టెం జీర విరోధిమానవమనోగర్వప్రపంచంబుతో
     బట్టెం గంటము సర్వజీవభరణప్రౌఢవ్రతప్రీతితోన్.40
ఉ. భారతిదాది పెన్నిధులు బాలసఖుల్ తొలువిద్య నిశ్చలో
     దారత ధర్మకృత్యము లుదాత్తవిభూషణము ల్వివేకవి
     స్తారము యౌవనబంధుబుధసంగతి వ్రాత జనప్రశస్తి ది
     క్పూరితకీర్తితో యనిరధిభోగము భీమయ గుండమంత్రికిన్.41
సీ. పుణ్యనదీతీరభూమిఁ దాని లిపినపట్టిండ్ల విప్రగణంబుచేత
     సరసకవిత్వప్రసంగతిఁ దనుఁ బ్రీతిఁ గొనియాడు సత్కవిజనులచేత
     గర్పూరకస్తూరికాముఖద్రవ్యానుభవవేళ సభలోని ప్రభులచేత
     గాంక్షమైఁ దనుఁబొందఁ గాంతుమోయని యుపశ్రుతులు వోయెడువధూవితతిచేత
గీ. దానశక్తి బహుకథానిపుణత్వంబు, సులభభోగమహిమ సొబగుపేర్మి
     నెగడుచుండ వెలసె జగతీతలంబున, మంత్రిగుండఁ డమలమతిగురుండు.42
శా. శైలవ్రాతము వారిసత్వములు భాస్వత్ఫేనము ల్తారకా
     జాలంబున్ భుజగాధినాయకఫణానందన్మణుల్ గన్నముల్
     వేలాసేతువు చక్రవాళగిరి పృథ్వీనాథుసన్మంత్రిచూ
     డాలంకార మమాత్యగుండని సమిధ్యత్కీర్తిదుగ్ధాబ్ధికిన్.43
సీ. వడుగుఁ బెండిలిఁ జేయ వయసైన విప్రులఁ దడవి సేయించు నీపుడమియెల్లఁ
     దొడఁ బూయఁ గట్టంగ నిడఁ గల్గునట్లుగ సహకుటుంబులఁ గవిజనులఁ బ్రోచుఁ
     బాఠకగాయకప్రముఖుల మన్నించి యాందోళికాదివాహనము లొసఁగుఁ
     బాటించి కాకుళేశ్వరుతిరణాళ్ళలో నర్థుల కేటేట నర్థ మిచ్పు
గీ. ధర్మజుడు భానుజుఁడు తొంటి తప్పుఛాయ దేహ మేకమై పుట్టినతెఱఁగు దోఁప
     దామమును దానధర్మముల్ దన్నుఁ బొందె, మంత్రిభీమన గుండనామాత్యమణికి.44
చ. వలువుగఁ గాకుళేశుతిరునాళులలోపల గుండమంత్రి ని
     ర్మలమతిఁ బిట్టువేగముగ మాడలు రత్నచయంబు జల్లఁగా
     నలవడు హేమవృష్టిక్రియ నర్థులు చాతకకోటికాఁగ హా
     గలకొనరాలు ముత్యములుఁ గాఁగఁ బడున్ వడగండ్లకైవడిన్.45

.

సీ. వాచకత్వము లేఖనోచితత్వము నాంధ్రలిపిరీతిఁగా సర్వలిపులయందు
     ఫణితిజాతియుఁ దీవ్రభంగియును దెనుంగుబాసపోలిక సర్వభాషలందు
     వదనవికాసంబు మృదువాక్యతయు బంధుజనులయట్లన సర్వజనులయందు
     మర్మజ్ఞతయుఁ ప్రౌఢమతియును గణతత్వవిద్యయట్లనె సర్వవిద్యలందు
గీ. మన్ననమును నిర్వంచనమతియును మిత్రగణములట్లనె సర్వార్థిగణములందు
     ననుట సహజంబు లివియు వర్ణనలు గావు, గుండనామాత్యునకు మంత్రికుంజరునకు.45
క. ఈగుండయప్రెగ్గడకును, ధీగుణచింతామణికి నతిస్థిరధర్మో
     ద్యోగమతికి శాస్త్రపురా, ణాగమదుగ్ధాబ్ధిమందరాచలమతికిన్.46
వ. ఇష్టార్థసిద్ధియు నైశ్వర్యసమృద్ధియుఁ బుత్రపౌత్రాభివృద్ధియుఁ గా నారచియింపం
     బూనిన కథాక్రమం బెట్టి దనిన.47

కథాప్రారంభము


క. అపరిమితవిభవ మై ధా, త్రిపయిం బరఁగిన కళింగదేశములో నిం
     ద్రుపురంబుఁ బోలె నొప్సుం ద్రిపురీనగరంబు, సంస్తుతికిఁ బట్టగుచున్.48
క. ఉరగిస్త్రీజలకేళీ, కరణంబులు దేవకన్యకాక్రీడాసం
     చరణంబులు తమకమరగఁ, బురికిం బరిఘలును సాలములు నొప్పెఁ గడున్.49
మ. నవముక్తాఫలరాసులు రుచిరనానాసన్మణిశ్రేణి శు
     క్తివితానంబులు హేమవాలుకలు నక్షిప్రీతి సంధించుచున్
     భువనస్తుత్యములై పురాంగణము లొప్పుం జూడఁగాఁ గుంభసం
     భవపీతాంబునిధిస్థలాభివనవిస్ఫారంబులై యెప్పుడున్.50
చ. మిగిలినవేడ్క నాట్యములు మీదఁటివేల్పులు చేయఁ దన్మృదం
     గగణనినాదముంే దఱచుగా శిఖరంబులఁ బట్టియున్న య
     మ్మొగుళులమ్రోతయుం గదిసి మ్రోసిన నొక్కకమాటుతాళవృ
     త్తిఁ గని యెఱుంగవచ్చుఁ బురి దేవగృహంబుల మర్ధళధ్వనుల్.51
క. పురహర్మ్యవిహారిణు లగు, తరుణులవదనములతోడఁ దడఁబడు ననిపం
     కరుహభవుఁ డెఱుక యిడెఁగా, కరయం గందేల యిందునందు ఘటించున్.52
చ. అనిశము మీఁదటన్ మెలఁగు నంగనలం గని నాఁడునాఁటికిం
     దనికినకామవేదన సుధారుచిఁ జల్లనిపట్ల విశ్రమిం
     చెనొ యనఁ జంద్రకాంతకృతశీతలనిర్మలచారువేదులం
     బెనుపుగ రాత్రులందుఁ బ్రతిబింబము లెంతయు నొప్పు మేడలన్.54

చ. కలితకపోలసాంద్రమదగంధవశభ్రమితాళిమాలికల్
     పలుమఱు మీఁద మూగినబలాహకమై కనుపట్టు శీకరం
     బులు బహునిర్ఘరంబులుగ బొట్లనుజేగురుసూర్యకాంతభం
     గులుగఁ బురంబులోన నడకొండలఁబోలి చరించు నేనుఁగుల్.55
చ. ఒడళులు కానకుండఁ బడియుండెడుగాడ్పులు దీర్ఘపక్షము
     ల్విడిచి ధరంజరించునహివిద్విషు లర్థి ననూక్ష్మరూపము
     ల్వడసినచిత్రము ల్చెదరఁబాఱిన వెల్లనుగూర్చి యొక్కచో
     నిడిన బెడంగుప్రోగు లన నెంతయు నొప్పుఁ బురిం దురంగముల్.56
ఉ. అత్రిసమాను లర్జునసమాధికశూరులు దేవవర్ణినీ
     పుత్రమహాధనుల్ విదురపూర్ణగుణుల్ మదనాయుధోపమా
     పాత్రము లుగ్రసింహనిభబాహుబలు ల్దలపంగ జాహ్మణ
     క్షత్రియవైశ్యశూద్రగణికాసుభటోత్తము లప్పురంబునన్.57
చ. సరసిజపత్రలోచనలచందనచర్చల నొందుచుం దలో
     దరులమొగంపుఁగప్పురపుఁదావులతో సరసంబు లాడుచున్
     దరుణుల గట్టిచన్నుగవఁ దాఁకుచు ధన్యత తన్నుఁ బొందగాఁ
     దిరుగుచు నుండు నింపుగలతెమ్మెర లెప్పుడు నప్పురంబునన్.58
మ. లలనారోహణవాద్యమానబహుడోలాఘాంటికానాదముం
     గలధౌతోజ్జ్వలపంజరాకలితశౌకశ్లోకికారావసం'
     కులముం చంచదమందక్షట్పదపదీకోలాహలంబుల్ కడున్
     దలమై మర్దళదుందుభిప్రభతివాద్యస్ఫూర్తి తోచుం బురిన్.59
చ. దలముగ నెల్లప్రొద్దును లతానివహంబులఁ గాఱుపుప్పొడుల్
     పులినదళంబుపైఁ జెలువు బూనఁగ మీఁదట దేలు కేతకీ
     దళముల మెత్తమోడలవిధంబునఁ దేలగఁ బాఱుఁ బెద్దలై
     ఫలరసవాహినుల్ పురియుపాంతవనంబులఁ గొన్నిచోటులన్.60
వ. అట్టిపురంబున కధీశ్వరుండు.61
చ. దశరథరాముతమ్ముఁడనఁ దాఁదగులక్ష్మణుపుత్రుఁ డై యశో
     వశుఁడగు చంద్రకేతునకు వంశజుఁ డైన మహేంద్రపాలుఁ డా
     శశధర మాదనేశ మనఁజాలుప్రతాపముతో జగంబ క
     ర్కశుఁ డన నేలె నానృపతిగాదిలిపట్టికులావతంస మై.62

సీ. తనకృపాజలధికి ధరణీతలంబుపై మానవేంద్రులు నీటిమానిసులుగఁ
     దనకీర్తి దశదిశాంగనలపాపటబొట్టులకును ముత్తెంపుసూచకము గాఁగఁ
     దనవాలు రిపుసంఘమునకు బద్ధకవాటగోద్వారమునఁ గుంచెకోల గాఁగఁ
     దనమూర్తి కామినీజనచకోరికలకుఁ బార్వణచంద్రబింబంబు గాఁగఁ
గీ. దనరు నుదయాస్తశిఖరులు దనప్రతాప, దీపికాస్తంభయుగ్మ మై తేజరిల్ల
     నెగడె నాదిమహీనాథనిభమహాప్ర, భావుఁ డనఁజూలు కేయూరబాహువిభుఁడు.63
మ. చతురస్త్రజ్ఞుఁడు చంద్రగుప్తున కిలం జాణక్యుభంగిం దివ
     స్పతికిం దైవతమంత్రియోజ సుమనశ్శ్లాఘ్యుండు వత్సావనీ
     పతికిం దొంటి యుగంధరాఖ్యుగతి శుంభత్పుణ్యుఁ డమ్మేదినీ
     పతికిం బ్రెగ్గడ భాగురాయణుఁ డనం బ్రఖ్యాతుఁ డిద్ధస్థితిన్.64
సీ. ఆరోగ్యవద్దేహుఁ డాకారశాలి వంశక్రమాగతసువిస్తారబుద్ధి
     ధీరుఁ డాఢ్యుండు గంభీరుఁ డవ్యసని ప్రజానందకరుఁడు దయాన్వితుండు
     నిజమర్మగోపననిపుణుండు పరమర్మభేదననిపుణుఁడు సాదరోక్తి
     శీలుఁ డాచారవిశిష్టుండు సర్వవిద్యానిధి ఘనుఁ డుత్తమాన్వయుండు
తే. లీలవాఁడు శూరుఁ డాలస్యరహితుఁ డౌ, చిత్యపరుఁడు నిఖిలచిత్తవిదుఁడు
     భర్తవలనుగలఁడు భక్తుండు చెలికాఁ డ, నంగ మంత్రిముఖ్యుఁ డతఁడు వెలసె.65
ఉ. రాజకళాసరోజవనరాజమరాళి యుపాయసాయక
     భ్రాజితచాపశింజిని పరాక్రమసంహృతవైరిభూపతి
     శ్రీజనయిత్రి ధర్మపరిశిక్షితవర్తన మేదినీప్రజా
     రాజగళత్సుధారసతరంగిణి యాతనిబుద్ధి యారయన్.66
శా. క్షోణీశోత్తముఁ డైన భూపతికిఁ దేజోరాశికిం దేవి యై
     యేణిలోచన రత్నసుందరి యనన్ హేలామనోహారి క
     ళ్యాణాకారసరోజగంధి కుచ భారానన్రుతన్వంగి య
     క్షీణప్రౌఢవివేకమాన యగుచుం జెల్వొందు నత్యంతమున్.67
శా. ఆలీలావతితోడ నావిభుఁడు కామాసక్తరాగక్రియా
     లోలుం డై విహరించు నెప్పుడును సంలుస్తావనీశౌర్యుఁ డై
     కేళీపర్వతరత్నకందరములన్ గ్రీడానివాసంబులన్
     లీలోద్యానమదాళిసంతమసవల్లీగేహమధ్యంబునన్.68
చ. నిడుపులు గానియల్కలను నిండి తొలంగుచు నుండుకాంక్షలన్

     దడఁబడు కామతంత్రములఁ దప్పు లెఱుంగని తత్తరింతలన్
     గడపట లేనికూటములఁ గప్పెడుచొక్కులఁ గాన రెన్నఁడున్
     బడతియు మేదినీశుఁడుఁ బ్రభాతమురాకలు రాత్రిపోకలున్.69
సీ. అంగనాకుచమండలాసక్త మై బుద్ధి భూమండలముదెసఁ బోవ దయ్యె
     లలనభ్రూచాపవిలాసంబుమెచ్చులఁ జాప మెన్నడు దృష్టి సైఁప దయ్యె
     భామినీరుచిరాంగపరిరంభలోలత సప్తాంగరక్షణస్మరణ మెడలెఁ
     దరళాక్షిచూడ్కులఁ దా నాజ్ఞపడి యున్కి ధర నాజ్ఞ చెల్లించుతగవు మఱచె
గీ. రమణితోడి సతతరతిరాజతంత్రమో, హమున రాజ్యతంత్రవిముఖుఁ డయ్యె
     నవనిపతికి యోషిదనురాగవారాశి, సోడుముట్ట నోలలాడుచుండి.70
ఉ. ఏకరసప్రమత్తుఁ డగునేలికచందముఁ జూచి గాఢచిం
     తాకులబుద్ధి యై తలరి యాతనిప్రెగ్గడ భాగురాయణుం
     డీకొఱగానిచందముల నీనరనాథునిఁ బాప నేక్రియం
     జేకుఱు నా కుపాయ మని చిత్తములోనఁ దలంచుచుండఁగన్.71
క. నానాదేశమ్ములకును, దానటుఁ బనుపంగఁ జనిన తనచారులలో
     ధీనిధి మతిమంతుఁ డనం, గా నొక్కఁడు వచ్చి సమయకర్తవ్యంబుల్.72
వ. నడిపి యుండ నేకాంతం బిచ్చిన వాఁడునుం దన యరయంబోయిన లాటదేశమం
     దలి విశేషంబు లెఱింగించి మహారాష్ట్రాధినాథుం డగుపరిఘబాహుండు తనమీఁద
     దండెత్తి వచ్చుచునికి విని యతనియుద్ధతి యోర్వక లాటేశ్వరుం డగుచండవర్మ
     చింతించుచున్నవాఁ డనియుం జెప్ప మఱియు నిది యొక్కరహస్యం బెవ్వ రెఱుం
     గనియది యవధరింపు మని యిట్లనియె.73
సీ. సచివభూషణ లాటజనపతి యొకకూఁతుఁ ద్రిభువనసౌందర్యవిభవలక్ష్మి
     యగుదానిఁ గని తనయన్వయంబునఁ బూర్వు లేకసంతతు లగు టెఱిఁగి తనకుఁ
     బుత్రుఁ డంతకుమున్ను బుట్టమి నీబిడ్డ నింతిఁగాఁ గెలనివా రెఱిఁగిరేని
     నిటమీఁద గద్దియ కెవ్వరు దిక్కు లేరని చుల్కఁగాఁ జూతు రని తలంచి
గీ. తాను దేవియు దాదియుఁదక్కఁ బుట్టి, నంతనుండియు నిక్కార్య మన్యు లెఱుఁగ
     కుండ సుతుఁ డని మ్రోయించె యుక్తిపేర్మిఁ, బెనుపఁ బెరిఁగి యక్కన్య జవ్వనము చెంది.74
క. ఉనికియు నవ్వనితం బొం, దినపురుషుఁడు సార్వభౌమతేజోమహిమం
     గను నని యొక ముని యేకత, మునఁ దత్పితృజనులతోడ మును జెప్పటయున్.75
వ. అక్కన్నియపేరు మృగాంకావళి యై యుండ మృగాంకవర్మ యని పుత్రనామం

     బుగాఁ బిలుతు రనియును విన్నవించిన మెచ్చి వానికిఁ దగినపసదనం బిచ్చి వీడుకొ
     లిపి భాగురాయణుం డంతట.76
శా. గౌళీనిర్జరరాజనందనుని బంగాళీముఖాబ్జార్కు నం
     ధ్రీలీలాంగజు ఘూర్జరీరతికళాదీక్షాసముద్భాసితున్
     జోళీలోలవిలోచనోత్పలసుధాంశుం గుంతలీభద్రు నే
     పాళీనూతనకూచిమారుఁ గుకురీప్రత్యగ్రపాంచాలునిన్.77
క. పురుషార్థగుణప్రీతున్, హరిభక్తిసుగంధిమానసాంభోజాతున్
     నిరుపమసద్గుణహారున్, ధరణీకల్పద్రుమాభిధానఖ్యాతున్.78
మాలిని. సకలసుగుణవారున్ సర్వలోకోపకారున్
     సురుచిరమణిహారున్ సుందరీచిత్తచోరున్
     నిరుపమధృతిహారున్ నీతివిద్యావిహారున్
     బురుషతనుసుమేరున్ బోలమాంబాకుమారున్.79
గద్య—ఇది సకలసుకవిజనవిధేయ మంచననామధేయప్రణీతం బైన కేయూరబాహుచ
     రిత్రం బనుమహాప్రబంధమునందుఁ బ్రథమాశ్వాసము.