కేయూరబాహుచరిత్రము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
కేయూరబాహుచరిత్రము
చతుర్థాశ్వాసము
క. శ్రీవనితావాణీసత, తాహసితకృతవిలోచనాననపద్ముం
డావిష్కృతసుస్థిరధ, ర్మావర్తనుఁ డెలమి గుండనామాత్యుఁ డిలన్.1
వ. భాగురాయణుఁడు మఱియునుం దనలోగిటినుండి నగరిలోపలి కరుగు రాజమంది
రోద్యానంబుచక్కటి కటమున్న యాయతంబు సేసిన దృష్టితెరువు గలుగుట నం
దుఁ బ్రవేశించి వసుధావల్లభు శయనగృహస్తంభకుడ్యంబులలోపల బయలైన యం
త్రవిశేషంబులం గలయది యగుటయు నందలి యంత్రకీలంబులు దొలంగించు కది
యించు వెరవును నన్నికేతనంబున ప్రవేశనిర్గమస్థానంబులను నందు సంచరించువి
ధంబులును నంతకుమున్న మంత్రిముఖ్యునిచేత విన్నదియగుటం గళావతి తాను
ను నక్కన్యకారత్నంబును నయ్యంత్రంబున నక్కుడ్యంబులోపల సొచ్చి యొకస్తం
భంబునొద్దకుం జని యది కేయూరబాహుమహేశ్వరు నిద్రాగారం బగుటయు
నంచు నిద్రించినవాఁ డతం డగుటయుఁ జెప్పి యేను నిన్ను స్తంభంబు పార్శ్వంబు
వెలువరింప వెడలిపోయి యిన్నిలయంబులోపల నానరేంద్రమన్మథుండు మేలుకొ
నునంతకు ననతిదూరంబున నుండి యతఁడు బోధంబుఁ బొంది ని న్నవలోకింప భ
వదభీష్టంబు సిద్ధించుకొఱకు నీమనంబున నతనిం బ్రసవశరాసనుంగాఁ దలంచి నిన్ను
రతీదేవిగా నిరూపించుకొని యఱుతనున్నయిత్తారహారంబు నమస్కృతవచనపూర్వ
కంబు గాఁ దత్కంఠంబునం బెట్టి కరగ్రహణంబు సేయ నర్థించెనేనియు నీవు రత్న
సుందరికి వెఱతు నని పలికి తప్పించుకొని యతిత్వరితగతి నేతెంచి యిచ్చటు సొ
చ్చునది యని తెలియ నెఱిఁగించి యాసదనాభ్యంతరంబునం బొందునట్లుగా
వెలువరించిన.2
గీ. మెలపుమై నాతితోఁ బొలయలుక గూరి, కనుమొఱఁగి వచ్చి నిద్ర యేకతను చేయు
చున్న ప్రద్యుమ్నుచాడ్పున నొప్పువాని, సుప్తుఁ గేయూరబాహుని జూచెఁ గన్య.3
చ. వినుకలిమున్ను గీల్కొనినవేడుక చూపుల కర్థి చేయఁగాఁ
గనుఁగొని యన్నరేంద్రవరకన్యక నిద్రితుఁ డైన భూపతిం
గనుఁగవ ఱెస్ప వెట్టనివికాసము నెక్కుడువేడ్కుతోడ నె
మ్మనమునఁ జోద్యముం బొదల మన్మథుఁ డుద్ధతిఁ జాప మెక్కిడన్.4
ఉ. ఆరమణీలలామ హృదయంబున నాదట లంతకంతకుం
బేరఁగ నింపు సంతసముఁ బెంపువహింపఁగ ఱెప్ప వెట్టఁగా
నేరుపు లేక వేడుకలు నిట్టలద్రోసెడువాలుఁగన్నుల
న్వారణ లేక క్రోలె జనవల్లభసుందరు మేనిచెల్వమున్.5
వ. అట్లు చూచుచు నాత్మగతంబున.6
సీ. ఈఱెప్పపొది విచ్చి యించుక చూచిన నొప్పారు కన్ను లెట్లుండునొక్కొ
యీబొమ లల్లార్చి యెత్తి నటించిన నలిక మేసొబగునఁ బొలుచునొక్కొ
యీ ముఖాంబుజమున నెలనవ్వు మొలచిన నరుణాధరం బెంత యమరునొక్కొ
యీవాక్కు తెఱచి యేమేనియుఁ బలికిన మృదుభాష లెట్టివై మెఱయునొక్కొ
గీ. యనుచు నరనాథపుత్రిక మనములోన
మదనవికృతు లంతంతకు నుదిలకొనఁగ
వేడుకలు మెచ్చులును జోడుగూడిపొదల
ధరణినాయకు చెలువంబుఁ దగిలిపొగడె.7
వ. మఱియును.7
సీ. పూర్ణలలాటసముల్లాసవదనంబు నాననాంబుజముతో నంటఁ జేయ
సామజకుంభసంస్ఫాలనకర్కశహస్తంబు చన్నుల నంటుకొనఁగ
జ్యాకిణవ్యాయితచారుబాహులు కాంక్ష రెట్టిగా గళమునఁ జుట్టుకొనఁగ
రాజ్యలక్ష్మీమందిరప్రాంగణం బైన వక్షస్థలంబున వ్రాలి సొగియ
గీ. నప్పళించుఁ దివురు నఱ్ఱాడు మదిలోన, మానమూఁది తన్నుఁదాన మగుడఁ
దిగుచు రాజకన్య జగదీశసుందరుం, జూచి చూచి మదనుఁ డేఁచి యలఁప.9
వ. తదనంతరంబ.10
చ. ధరణీతలేశ్వరుండు వెడతాల్చిన నిద్రఁ దొఱంగి కన్నుదో
యరవిరియంగ లాటవసుదాధిపపుత్రికఁ జూచి రత్నసుం
దరి చనుదెంచెఁగాఁ దలఁచి తప్పక కన్గొని కాకయున్న న
చ్చెరువును సందియంబుఁ దనచిత్తములోపల సందడింపఁగన్.11
చ. ప్రకటితదేహదీప్తులు విభాసితభూషణదత్త దీధితి
ప్రకరముమీఁదఁ గన్నెగసి పార్శ్వములం బచరించి చుట్టుఁ బ
ర్వికొనఁగ వెల్గుచుండుఁ బరివేషములోపల నొప్పు చంద్రరే
ఖకు సరియైన లాటనృపకన్యకఁ గాంచె విభుండు భ్రాంతితోన్.12
ఉ. చూపులు మేన నంతటను సోఁకినచోటన నిల్చెఁ జెల్వపుం
దీపులు గ్రోలఁ గోరికలు దీఱిన వీనులు మంజుకోమలా
లాపరసామృతంబును దలంబుగ నింపుల కాససేయ న
భ్భూపతి లాటభూమిపతిపుత్రిక యొప్పునఁ జిక్కెఁ దద్దయున్.13
క. నిగుడుచు మగుడుచు నుండెను, మగువమెఱుఁగుఁ జూపుగములు మగుడక పటలం
బుగ నందు విభుని చూడ్కుల, తగులుత నొండొరులమీఁద దలముగఁ బర్వెన్.14
వ. ఆసమయంబున15
చ. అసదృశతారమౌక్తికసమంజసనాయకరత్న మై సమం
జసరుచిపుంజమై తనకుచంబులమీఁద వెలుంగు హారముం
బిసరుహహస్త పుచ్చుకొని పెట్టెఁ బ్రియంబునఁ జేరితే నమః
ప్రసవశరాసనాయ యని పల్కుచు భూపతికంధరంబునన్.16
వ. అప్పుడు.17
మ. కరమూలంబున మించుఁ బొంచులిడి కాంక్షంగ్రోలుఁ గప్పారు ముం
గురు లర్థిం గబళించు వాతెరమెఱుంగు ల్దొద్దలాడుం బయో
ధరకుంభంబుల నెక్కు డిగ్గు నొలుపొంద న్నీవికల్గుం దలో
దరినాభీనవదీర్ఘికంబొలుచు నద్ధాత్రీశుచూడ్కు ల్వెసన్.18
చ. ఎలుఁగు వినంగ నుబ్బి కమలేక్షణచేతులసొంపు గాంచి స
ల్లలితశుభాంగకంబులవిలాసము లాదటవోవఁ గ్రోలి దే
హలతికగంధమూని యిటులన్నియుఁ బండువు సేసె నింద్రియం
బు లొకఁడుఁ దక్కకుండ మది భూపతి కేఁకట వొందుచుండఁగన్.19
క. ఆసమయంబునఁ బుష్పశ, రాసనుచే నలసి తగవు నవుల జరపుచున్
దా సజ్జ డిగ్గి ధైర్య, వ్యాసంగం బెడలి నృపతి యతివఁ దరియుచున్.20
ఉ. ఎవ్వరిదాన వీవు హరిణేక్షణ యెయ్యది నీకుఁ బేరు నీ
న్నెవ్వతె తెచ్చెఁ జెప్పు మిది యేర్పడ బంటుగ నన్ను నేలు మం
చవ్వసుధేశ్వరుం డతివహస్తము వట్టిన పట్టి ధైర్యమున్
ద్రవ్వెడు కన్నులం గొని యదల్చి వదల్చె గరంబు చయ్యనన్.21
వ. ఆలోన మఱియును.22
గీ. రత్నసుందరి దోడుదు రాజ నీవు, వలదు మమ్మేల పట్టెదు తొలఁగు మనుచుఁ
గంబ మదిసొచ్చి జంత్రంబుఁ గదియఁ దిగిచి, యబ్జవదన యదృశ్యమై నట్లు వోయె.23
క. అప్పుడు నరపతి యిప్పటి, యప్పడతుక యెందువోయె నాశ్చర్యం బీ
చొప్పు కలయొ నిజమొ యనుచు, లెప్పంబయ్యెను మదను శిలీముఖములకున్.24
వ. అంత.25
సీ. లెక్కింపఁ జులుక నై చుక్క లాకసమునఁ బ్రాఁత ముత్తియములపగిది నుండ
నొదవెడు కెంజాయ నుదయాచలముమీఁద మాణిక్యవేదితో మచ్చరింప
నాకాశనదిక్రేవ నమృతభానుఁడు మేని మించుఁ గోల్పడి ముదియంచఁ బోలఁ
జలిగాలి సోఁకునఁ దెలిసి కొండొకవడి కవలెల్ల జక్కవ కవలఁ బెరయ
గీ. వెలరువాఱుచు గృహదీపవితతి యొప్ప
విరులపై నళులు గోరంటవిరుల దొరయ
నటనములు కుముదముల నవ్వ నలుదెసలను
జాలఁ బెరయంగఁ బ్రత్యూషవేళ యయ్యె.26
చ. జలజవనంబుకూర్మిచెలి జక్కవదోలముదంబు నిక్కు చు
క్కల పయిదాడికాఁడు త్రిజగంబులమ్రొక్కులయిక్క వేదము
ల్మొలచినపాఁదు యోగులకు మోక్షమువాకిలి ప్రాణికోటికి
న్వెలుఁగన నొప్పునవ్వెలుఁగు వేగమ తూర్పునఁ దోఁచె నత్తఱిన్.27
వ. త్వరితకృతప్రాతరుచితవర్తనుండై యేకతంబ యుండి.
క. భయభక్తిసమేతంబుగ, జయశబ్దము మున్నుఁగాఁగఁ జనుదెంచినయా
ప్రియసఖుఁ డగుచారాయణు, నయనములారంగఁ జూచి నరపతి పలికెన్.28
క. ఈరేయి వేగుఁబోకటఁ, జారాయణ యేమి చెప్ప జను లెన్నడు నె
వ్వారును నెచ్చటఁ గానఁగ, నేరని చోద్యంబు గంటి నిక్కము వినుమా.29
సీ. చైతన్య మొందిన చక్కనిచిత్రంబు చిఱునవ్వు మరగిన చిగురుబొమ్మ
నడుపాడ నేర్చిన నవకంపు నునుదీఁగ మురిపెంబుఁ బూనిన విరులయెత్తు
పంక వాయఁగఁ బెట్టి వచ్చిన క్రొన్నెల పలు కభ్యసించిన పసిఁడిప్రతిమ
నిలుకడ వడసిన తొలుకారు మెఱుఁ గర్థిఁ గైసేసి తోఁచిన కామునలుఁగు
గీ. నాఁగ నభిరామ మగు నెలనాఁగ యొకతె, మానవాంగనాసదృశంబు గాని రూపు
మహిమ గలయది నాసుప్తిమందిరమున, కేకతమ వచ్చి యుండఁగ నేను గంటి.30
క. తరుణప్రవాళరుచిరా, ధర నవమాణిక్యపాదతల వజ్రలస
చ్చరణనఖనీలకచ య, ప్పురంధ్రి కడునొప్పు రత్నపుత్రికవోలెన్.31
చ. మెలఫున దాఁటియాడు మగమీలవిలాసము దోలి వ్రాలి కం
దలపపుచాయ మీఱి వెలిదామరఱేకులతెంపు నవ్వుచుం
గలువలకాంతి గైకొనక కాఱుమెఱుంగులఁ బోలి నేత్రము
ల్చెలువకు నొప్పు ముత్తియపుఁజిప్పలపాటికి నింతపెద్దలై.32
క. కమలానన కన్నులు ని, క్కమనుకు దొనలోనఁ బొలుచు కామునిశితబా
ణములగు న ట్ కర్ణాం, తములును భ్రూచాపసంశితంబులు నగుటన్.33
ఉ. ఇంచుక నాపయిం బొలసె నిందుకరావళి ముంచి తెచ్చి పై
నంచినపోల్కిఁ బువ్వువల వైచిన చాడ్పునఁ గల్వదండ సా
రించినలీలఁ దమ్మివిరి ద్రిప్పినభంగి మెఱుంగుఁదీఁగె గ
ప్పించినమాడ్కి వాలు జళిపించినకైవడి నింతినేత్రముల్.34
వ. ఆసమయంబున శయనతలంబున నాసీనుం డైన నన్నుఁ గదియఁ జనుదెంచి.35
చ. జలరుహగంధి తామధురచారుసుధారస మర్థి నాదునీ
నులఁ జిలికించుచుం దనచనుగవమీఁద వెలుంగు నొక్క యు
జ్జ్వలతరహారవల్లి గరువంబున నామెడఁ జేరి పెట్టెఁ గో
మలకరపల్లవద్యుతిసమాజము మత్తనువెల్ల బర్వఁగన్.36
వ. అయ్యవసరంబున.37
చ. తను నెఱుఁగం దలంచి ప్రమదంబున బాణిసరోరుహంబు వ
ట్టినఁ గని రత్నసుందరికి డెందములో వెఱతంచుఁ గోమల
ధ్వని ననుఁ బల్కి కన్నుల నదల్చుచు నాదుమనంబుతోనఁ గ్ర
క్కునఁ దనహస్తముం దిగిచికొం చరిగెన్ లలితాంగి మెల్పునన్.38
క. అత్తఱి వెనువెనుకన చన, నత్తరుణి యదృశ్య యయ్యె నచ్చెరువు వయ
స్యోత్తమ యప్పటినుండియుఁ, జిత్తంబున సందియంపుఁజీఁకటిఁ బడితిన్.39
చ. కల యగునొక్కొ యొండె కల గా దిది నిక్కమ యొక్కొ నిక్కముం
గలయును బొత్తునం గలయఁ గ్రాఁగిన చందమొకో నిజంబు గాఁ
గల యగునేని నున్నదిదె కంఠము హారము నిక్క మైన న
క్కలికి వెడందవాలుఁదెలిగన్నులసుందరి యేది ముందఱన్.40
వ. అని యిట్లు మదనవికారభ్రాంతిపూర్ణస్వాంతుం డైన మేదినీకాంతుం గనుంగొని
సంతసిలుచు రత్నసుందరీసౌభాగ్యగర్వాపహరణక్రియాచింతైకపరాయణుం డగు
నాచారాయణుం డాత్మగతంబున.41
క. కానిమ్ము రత్నసుందరి, పై నిలిచినమనము కొంత పాఁతు గదలె నిం
కీనరనాథుని నొండొక, మానిని దెస నెట్టు లైన మరగ ఘటింతున్.42
వ. అని తలంచుచు నతనితో నిట్లనియె.43
మ. జగతీనాయక యింత యేమిటికి నీసౌందర్యజాలంబునన్
దగులంబడ్డది దేవకాంత యయినన్ ధైర్యంబు పొం దేది లో
మగుడన్ వచ్చుట కేమిసందియము నామాట ల్మది న్నమ్ము మా
మగువం జూపెద నీకుఁ దత్సులభసంబంధంబు సంధించెదన్.44
వ. అని యి ట్లచ్చట నవ్విధంబునఁ జెల్లుచుండ నావల రత్నసుందరి మేఘలకుం బ్రి
యంబుసేయుకొఱకు రాజు చారాయణద్వితీయుం డై యునికి విని యావిదూషకు
మీఁదియలుక నటువోవక సపరివార యై నిజనివాసంబున నిలచె నిట నద్దేవి యా
గ్రహంబ యసుగ్రహంబుగా సంతసిలుచు భూవల్లభుండు దానును సఖుండును మం
దిరారామంబునకుం జనియె నటమున్న వసంతాగమసమయం బగుటయు.45
క. ఎడలెం గారాకులకై, వడియై సూనములు పల్లవముల విధంబై
యడరెను రాగము పడతుల, యొడఁళులు లతలఁ బురుడించు టుచితమె యనఁగన్.46
చ. వననివహంబు లెల్ల మృదువల్లుల నామృదువల్లులెల్ల లేఁ
గొనలఁ దనర్చులేఁగొనలు గుత్తుల గుత్తులలోఁ జిగుళ్ళు పెం
పొనరుఁ జిగుళ్లఁ గ్రొవ్విరులు పొందగుఁ గ్రొవ్విరు లెల్లఁ దేఁటులన్
మునుకొను తేఁటు లెల్ల నునుమ్రోతల నెంతయు నొప్పె నామనిన్.47
సీ. మృడువేఁడికంటిక్రొ వ్వుడుపంగఁ జాలిన కందర్పు మాఱటబొంది యనఁగ
నెలదీఁగె లనియెడు నెలనాఁగలకుఁ బ్రీతి నర్తనంబులు సూపు నటుఁ డనంగఁ
గళికల పరువంపుఁ గన్నెఱికంబులు వెరవుతో నెడలించు విటుఁ డనంగ
వనమునఁ గ్రీడించు వల్లభారమణుల సురతాంతమునఁ గోరు సురటియనఁగ
గీ. ఆమనికిఁ బ్రాణ మనఁగ నుద్యానమునకు, సొబ గనంగఁ గొలంకుల చుట్ట మనఁగ
నచ్చవెన్నెల నెచ్చెలి యనఁగఁ బొలసెఁ, జందనపుఁగొండ బుట్టినచల్లగాలి.48
చ. సరసరతిశ్రమాన్వితభుజంగమమాతనపావకేళి ఝ
ర్ఝరితము లైన యమ్మలయశైలసముద్భవగంధవాహముల్
విరహిజనాననాబ్జముల వెల్వడు తోరపుటూర్పుగాడ్పులున్
బొరిబారి నంతనంతఁ దముఁ బొందఁగ దట్టము లయ్యెఁ గ్రమ్మఱన్.49
వ. మఱియుం దత్కాలంబున వికచారవిందవాసితగండూషబలంబు లొండొంటికి
చ్చుశుండాలమిథునంబులకుం గ్రీడాలవాలంబు లగుకూలంబులుం గలిగి పెఱికినయెల
దూండ్లు నఱికి చవిపట్టి ప్రియుల కొసఁగు చక్రవాకంబుల భాగ్యపరిపాకంబులుం
బోని పద్మాకరంబులును నెడవెలుపు లేని పూఁదేనియజడిం దోఁగి యసమకాల
పర్జన్యకాలశంక మత్తిల్లి నృత్యంబు సేయు మత్తకేకికేకల కోడు భుజంగకుటుంబం
బులును వలసలు వోయిన కతంబున రిత్తలైన గుప్తప్రేమభరపరితప్తంబు లగువనకేళి
లోలబాలికాజనంబులకుం బరిరంభణయోగ్యంబు లగుచంచనతరుసందోహంబులును
గుత్తులయెడ చిగుళ్ళు వలపంతవేఁడిమిం బొరలు కాంతలయిగురుపాన్పులకుఁ గొట్టిక
త్తెలు ఫుడికినం దేఁటిదాఁటునకు నెరసులేకుండ నొడికంబుగా వడివెట్టిన తావికు
ప్పలం బోలె నొప్పి పూచినయశోకభూజాతపోతంబులును సహకారకోరకాంశు
రములు గప్పునం గమిచి మేసి క్రొవ్వునం బెచ్చుపెరిఁగి నోరం గొలందులు కూయు
కోకిలదంపతులసందడికిఁ దొలఁగి మధురపక్వఫలంబులం బరితృప్తంబులై యెలమా
విమోకలమీఁద మూకలుగొనఁ బ్రాఁకిన గురువిందపందిరుల గొందుల సందు వెడ
లి తొరఁగిన పూరేకుంబాన్పులఁ గలుగు నీరంబులలోనఁ బ్రాణేశ్వరులయెఱకల
యిఱుకులం బారవశ్యంబు లూనఁ జంచులు నంచుల మీఁద నిడి నిద్రించురాచిలుక
రాణివాసంబులు నగుచు నత్యంతమనోహరం బగుచుండ.50
సీ. వలరాజు విజయకాహళనాదములభంగి నెలుఁగించు గండుఁగోయిలల క్రందు
చిత్తజుచాపసింజినులకైవడి మ్రోయు చంచరీకంబుల సందడియును
అంగసంభవుసేనయార్పలవిధ మగుకలికిరాయంచలకలకలంబు
రతిపతిబలసదోద్ధితధూళి చాడ్పున దెస లెల్లఁ గప్పెడుకుసుమరజము
గీ. పచ్చవిలుతునిగొడుగులపగిది యైన, యలరుమావిడిమోకల చెలువు పెంపు
నెమ్మనంబునఁ దాపంబు నిగుడఁజేయ, సఖునిఁ జూచుచు నిట్లనె జనవిభుండు.51
మ. కలయం బూచి వెలుంగుకింశుకము లంగారప్రతానంబు కో
మలసాంద్రాంకురభాసిచూతలతికల్ మంటల్ నభోవీథి న
గ్గల మైక్రాలుచుఁ దూలుచుం దిరుగు భృంగశ్శ్రేణి ధూమంబుగాఁ
బొలిచెం బుష్పశరప్రతాపదహనంబో నాఁగ నిచ్చోటుఁ దాన్.52
వ. అనుచు నందు విహరింపంజాలక యొకరమణీయలతామందిరంబు సొచ్చి యంద
లిచంద్రకాంతవేదిమీఁదం దనువు వైచి పొరలుచు నుండి కొండొకసేపున
కాసీనుం డై.53
మ. తనకంఠంబున కాంత మున్నిడిన ముక్తాహారముం బుచ్చి చే
త నమర్చం గడుఁబ్రీతిఁ గన్గొనుఁ గరద్వంద్వంబునం జేర్చు మో
మున నోతుం బలుమాఱు డెందమున మోపుం గ్రమ్మఱం గంధరం
బును బూనుం బరిరంభబుద్ధి మెయి గప్పుం ధైర్యగస్వస్తికన్.54
వ. ఇ ట్లతిబహుళం బగుకోరికలకు నెల వగుచుం దనలోనన యి ట్లని తలంచు.
ఉ. ఏపున మున్ను వేడ్క సుఖియించి సముద్థత యై యభీష్టకే
ళీపరిణామ మందియును లేమ పునఃపరిభోగసౌఖ్యముం
జూపుల వేడుచున్ మధురచుంబన మెన్నఁడు చేయునొక్కొ జం
ఘాపరభాగచుంబిశిఖరాయతలంబితకేశపాశ యై.55
వ. అనుచు మనోరథంబులం దేలుచు ననేకమదనవికారంబులకు నెల వగుచుండ న
చ్చోటువాసి కొనిపోవం దలంచి చారాయణుం డి ట్లనియె.56
క. మర్మస్పర్శనఁ బరఁగు ము, హుర్ముహురాగతవినోదయోగ్యముల మెయిం
బేర్మి జరింతురు క్రీడా, నిర్మాల్యము లేల మేదినీకాంతులకున్.57
వ. వనవిహారం బొక్కటియ యేల ద్యూతక్రీడ యొనర్తు గాని నిజనివాసంబునకు విజయం
చేయు మని తోడ్కొని చని యచ్చట రసాంతరంబు పుట్ట వినోదంబులును నీతిగ
ర్జితంబులు నగు కథావిశేషంబులు వినిపింపం దలంచి యి ట్లనియె.58
గీ. దేవీ మేఘల నెప్పుడు నీవిధమునఁ, జాల మన్నింప నీసు మత్సరము పుట్టి
నయవిధిజ్ఞ కళావతి నన్నుఁ బంచి, భంగపెట్టించె దాని భూపాల కంటె.59
క. మతిమంతులు నిజశత్రుల, నితరులఁ గొని యేనిఁ జెఱతు రెన్నివితములన్
సుతహంత యగుకిరాతుని, మృతుఁడుగ శుకి చేసినట్లు మేధాబుద్ధిన్.60
వ. అనుటయు నది యెట్లనుడు నమ్మహీనాయకునం జారాయణుం డి ట్లనియె.61
చ. ఒక పెనుగానలో నొకమహోన్నతభూజమునందు బాలశా
బకము లప్రస్ఫుటప్రబలపక్షములం గలవానిఁ బ్రోచి కొం
చొకశుకి యుంచు నత్తరువునొద్దన చిక్కని.......
దొకఫణినాయకుండు గరళోల్బణుఁడుం డొక......నన్.62
వ. అ ట్లారెండును నుండ నంత నొక్కనాఁడు.63
క. తొల్లియు నచ్చోటన తన, పిల్లలగొని చన్నబోయ పెద్దయుఁ గ్రూరుం
డుల్లమలద నబ్భూరుహ, మల్లన నెక్కి తనకూర్చునాత్మజయుగమున్.64
క. చంచులు దెఱుచుచు నఱవఁగ, నించుక కృపలేక పట్టు టేర్పడఁ గని శో
కించుచు రోధించుచుఁ బల, వించుచు నాతనికిఁ జిలుకవెలఁది యిటు లనెన్.65
క. అన్నన్న లేవె పక్షులు, కన్నులు తెఱవనివి తిన్నఁ గలదే చవి నా
మన్నిఁ గొననేల విడువఁ గ, దన్న యకట చంపఁగూడు నయ్య శిశువులన్.66
చ. అనవుడు బోయ యి ట్లను శుకాంగనతో నడలంగ నేల నీ
తనయులఁ జంప నేను బిసితంబులు బ్రాఁతెయె నాకు వీనిఁ గై
కొని వెలవెట్టువారికడకుం జని యమ్ముదు విల్చి వారునున్
బెనుతురు గాని వీని కొకసిడ యొనర్పరు నమ్ము నెమ్మదిన్.67
క. అనవుడు దానికిఁ గీరాం, గన సంపఁగ నొల్లవేనిఁ గనకముపైఁ గాం
క్షన పట్టితేని విడు నా, తనయుల నీ కేను జూపెదను హేమంబున్.68
మ. ప్రకటశ్రీయుతుఁ డొక్కఁ డీయడవిలోఁ బాటచ్చరశ్శ్రేణిబా
ధకు నుల్లంబున నోడి మొన్న తనయర్థం బొక్కచో డాఁచెఁ ద
ప్పక యేఁజూచితి నున్న దాపసిఁడిఁ జూపంజాలుదు న్నన్నుఁ బు
త్రకులం గాచెద నెల్లనాఁడు నని పంతం బాపి రక్షింపుమా.69
మ. అనినం బెన్నిధి యప్పుడే కనిన య ట్లానందముం బొంది యే
నిను నమ్మింపుదు నంచు శాబకముల న్నీడంబులోఁ బెట్టి చ
య్యన భూమిజము డిగ్గి బోయ నియతుం డై యొక్కచో నిల్చి యు
ర్లును బోనున్ వెస ముట్టి నమ్మఁదగుపల్కుల్ పల్కె నిర్వంచనన్.70
వ. అప్పుడు కీరవనిత వానితో నిట్లనియె.71
క. నమ్మిక లవి యేమిటికిం, గ్రమ్మఱ వచ్చెదవె నీవు ఖగమృగబహుదుః
ఖమ్ములకును నాచూపెడు, సొమ్ములపైఁ జేయి వెట్టి సుఖి వైనతుదిన్.72
వ. అని పలికి యిదె రమ్మని తోడ్కొని చని.73
గీ. పూనుఁగాడియంత భుజగంబు లోనున్న, వెలఁగమ్రాని వెడఁదతొలట సూపి
దీనఁ జేయి పెట్టి లోన నున్నది సవి, శేషహేమ మనుచుఁ జిలుక చెప్పె.74
ఉ. చెప్పిన వెఱ్ఱిబోయ వలచే యటు సొన్పుడు నందుఁ గన్నులన్
నిప్పులు రాలుచున్న మహనీయగరోజ్జ్వలభీషణోరగం
బుప్పలవాయిఁ దిన్న విష ముగ్రత నెక్కుడు దృష్టి చీఁకటుల్
గప్పఁగ నోరఁ బెన్నరువు గ్రమ్మ మృతుం డయి కూలె మేదినిన్.75
గీ. ఆస పాపజాతి యఖిలంబుపైఁ బాఱుఁ, బసిఁడిమీఁద నేల పాఱకుండు
పసిఁడిమీఁద నాసపాఱినమనుజుండు, తనకు వచ్చుకీడు తలఁపఁగలఁడె.76
క. తనచే నసాధ్యుఁ డగుశ, త్రుని నన్యునిచేతనైనఁ ద్రుంగునటులుగా
నొనరింపవలయుఁ దా నెఱుఁ, గనివాఁడునుబోలె నీతికౌశల మెసఁగన్.77
వ. అని చెప్పి చారాయణుండు మఱియు ని ట్లనియె.78
క. పగవాఁడ నైన నాయెడ, మొగమోడి మదీయవాక్యములు నమ్మి నిజం
బుగ నరయదయ్యెఁ గార్యము, మిగులఁగ దుర్బుద్ధి గాదె మేఖల యధిపా.79
క. మొగమోడవలయు నైనను, మొగమోటకుఁ గొలఁది కలదు మొగమోట ఘనం
బుగ నొప్ప దాలి కెక్కుడు, మొగమోడిన యక్షుఁ డొకఁడు మును హతుఁ డయ్యెన్.80
వ. అక్కథ యె ట్లనిన.81
క. యక్షపురంబునఁ గలఁ డొక, యక్షుఁడు ప్రియభాషణుఁ డన నతనివనిత ప
ద్మాక్షి నిపుణిక యనంగల, చక్షుద్రస్నేహుఁ డాతఁ డయ్యితివయెడన్.82
క. ఆరమణి గర్భభరశృం, గారంబున నొప్పెఁ బౌరగణ మట్టియెడన్
క్షీరాబ్ధినాథునుత్సవ, మారూఢం బగుటఁ జూడ నని యేగుటయున్.83
వ. ప్రియభాషణుండు నిపుణికతోడ.84
ఉ. కొండికదాన వెన్నఁడును క్రొత్తవినోదముఁ జూడ వింటఁ గా
పుండెద నేను నీవు సను ముత్సన మిమ్ములఁ జూడ నన్న నీ
వుండఁగ నొంటి నేఁ జనుట యుక్తమె కాదని పల్కితేని నీ
నిండిన చూలు మోచుకొని నేర్తునె యచ్చటి కేను బోవఁగన్.85
క. అనుటయు నీ వటఁ జను మిటఁ, జనుదెంచినయంతదాఁకఁ జామా నీతా
ల్చినగర్భముఁ దాల్చెద నని, తనకుక్షిం జూలు మోచి తరుణీం బంచెన్.86
చ. పనిచినఁ బోయి చూడ్కులకుఁ బండు వనందగు నుత్సవంబు నిం
పెనయఁగఁ జూచి వారుఁ దమయిక్కలకుం జనఁగా రసాంతరం
బున మనమూఁది యింటి దెసవోవుట మాని విభుండు మున్నుఁ జే
సిన యుపకారమున్ మఱచి చేడియ చింత యొనర్చె నాత్మలోన్.87
ఉ. ఇంటికి నేను బోఁ దడవె యెప్పటిగర్భము నిచ్చువాఁడు నా
కంటికి నిద్రలేక యది గైకొని మోవఁగ నేల వానిచేఁ
గొంటినొ తింటినో యతనికుత్సితబీజము వానిమీఁదనే
త్రుంటితి నింత నా కొరులదూఱు బొగడ్తయుఁ జూడ నేటికిన్.88
ఉ. చూలువహించి వెక్కుచును స్రుక్కుచునుండి ప్రసూతివేదనం
జాలఁగలంగి యాపదను జడ్డపడంగను నాకు నేల నా
పాలిటిదయ్యమద్దొసఁగువాపినఁ గ్రమ్మఱ నేలపోదునం
చాలలితాంగి వేఱ నొకయక్షుని గూడి నిజేచ్ఛనేగినన్.89
వ. అంతట.90
క. కడు పధికముగాఁ బెరిఁగిన, వెడమాయం బేని మార్పు వెడలక కడులో
బడి యాలికి విలపించుచు, వెడఁగగుయక్షుండు ప్రాణవిరహితుఁ డయ్యెన్.91
క. తగ దొరుల నమ్మ నెప్పుడుఁ, దగువారల నమ్మిరేనిఁ దగుఁగాక మహిం
బగవారల నమ్మఁదగదు, పగవారలకంటె వలదు భామల నమ్మన్.92
క. బలుపున మెలపునం గేళి, కులభామిని వెఱచుఁ గూర్చుఁ గుమతిత్వమునన్
దల నెక్కించుకొనం బతి, కులమును బ్రాణంబు సొమ్ము కోమలి చెఱచున్.93
క. దాక్షిణ్యగుణం బుత్తమ, లక్షణమని సజ్జనులు దలంతురు తమకుం
దాక్షిణ్యము సేసిననధి, కక్షుద్రులు మోసపోక గాఁ జూతు రిలన్.94
క. నమ్మకపోరాదనుతఱి, నమ్మి రిపునిఁ గలసి నమ్మనడచుట యొప్పున్
బిమ్మట నేమఱక తొలఁగి, నమ్మకయుండంగవలయు నరవర వానిన్.95
వ. ఈయర్థంబు దెలుపు నహిమూషోపాఖ్యానంబు నెఱిఁగింతు నవధరింపుమని చారా
యణుం డి ట్లనియె96
క. క్రూరోరగగ్రహణవిష, హారియనంబరఁగునొక్కఁ డతిశయవిషదు
ర్వారము నొకసర్పంబున, భీరుండై పట్టి వెదురుఁ బెట్టియఁ బెట్టెన్.97
క. పట్టిదానికి నెరగాఁగఁ బట్టి యొక్క, మూషకము వైచి పెట్టియ మున్నవోలె
గట్టిడించిన నురగంబు గఱవరాఁగ, నెలుక బెదరక వానితో నిట్టు లనియె.98
క. నీ కుపకారము సేసెద, నా కభయం బిచ్చి కావు నాకార్యంబున్
నీకార్యంబులు మేలై, చేకుఱు నాతోడఁ జెలిమి చేసితివేనిన్.99
క. వాఁడు బట్టినపుడ వానిచే నైనను, జావవలయుఁ దనకుఁ జావు నిజము
చచ్చియున్ననన్నుఁ జంపి చావనినీకుఁ, జెఱనయుండఁ దలచు టెఱుక యగునె.100
క. ఏ నధికబలుఁడ నాచే, గానిది యీయెలుకచేతఁ గానోపెడునే
తా నాచెఱ యేవిధమున, మానుచు నిది కల్ల యనుచు మదిఁదలఁపకుమీ.101
క. విను మెవ్వాఁ డేకార్యం, బున నిపుణఁడు దానియందుఁ బూజ్యుఁడు హీనుం
డనవలదు సూదినయ్యెడు, పని చిక్కనికఱుతచేతఁ బాగైయున్నే.102
ఉ. చాల నభీష్టముల్ తనవశంబుగఁ జేయునయోగ్యుఁ డైన న
మ్మేలుఁ దలంచి దానియెడ మిక్కిలివేడుక సేైఁత నేర్పగుం
గాలిపువేఁటకాఁడు ఝషకాంక్షన తా నుదకంబు మీఁదటన్
దేలెడు దృష్టిపై నిలుపు దృష్టియుఁ జిత్తము నాదరంబునన్.103
క. తనకార్యముకొఱకై హీ, నునియొద్దకు నైనఁ బోఁజను మహిం జండా
లునియింటి కుపశ్రుతికై, చను ననఁగా స్వార్థమూఁది సద్ద్విజుఁ డైనన్.104
క. నా చెప్పినట్లు చేసిన, నీ చెఱ విడు నట్లుఁ గాక నిలుపోవక నీ
వే చంపి నన్ను నోరను, వైచికొనిన మానునే భవత్క్షుతు లెల్లన్.105
మ. చెఱ యేఁ బాపిన నిష్ట మైన వలనం జెన్నొందఁ గ్రీడించుచున్
జిఱుగప్ప ల్చవిమీలు బల్లు లెలుకల్ చిట్టెల్క లాహారముల్
వఱలన్ గుత్తుకబంటితెమ్మెఱలఁ గ్రోలంబెట్ట పెంబాముతో
నెఱియున్ భోగముసుట్టునుం గలుగు నీ వీక్షింపుమా నెమ్మదిన్.106
క. అనవుడు నురగము సంతస, మున నాఖువుతోడ స్వప్నమున నైనను గీ
డొనరింప నీవు నాచెలి, వనుమానముఁ దక్కి నమ్ము మానందముతోన్.107
వ. ఇక్కరండనిగ్రహ మె ట్లుడిపెద వుడుపు మనుటయు.108
క. ఏ నొకమంత్రము నీతల, పైనుండి జపించి జపము వారించ తగం
గా నినుఁ బిలిచెద కదలక, నీనయనయుగంబు మూసి నిలు మందాకన్.109
చ. అని నియమించి దానిశిర మంజక యెక్కి కరండనిగ్రహం
బనువుఁగఁ జేసి యాఖునక మప్పుడ పోయె ననంతరంబు లో
చనములు విచ్చి చూచి మది సంతసమున్ వగపుం దలిర్ప నా
కనుమనఁ దాను నేగి భుజగం బొకబొక్క వసించి యాత్మలోన్.110
క. ఎలుక కపటమున నాక, న్నులు వ్రామెను మ్రింగలేదనో రెరియఁగటా
తొలఁగెద నికేటిబ్రతుకని, తలఁచె దురాత్మకుల కెందుఁ దగవులు గలవే.111
క. కెలనికి మేలుగఁ దనకుం, గలిగెడు నింద్రత్వమైనఁ గాదనుఁ దుదిఁ దాఁ
బొలిసిన మేలని తలఁచును, ఖలుఁ డొకనికిఁ గీడు సేయఁ గలిగినఁ జాలున్.112
వ. ఇ ట్లుండి దానిబిలద్వారం బెఱింగి యయ్యాశీవిషం బమ్మూషకంబునకు దోషంబా
పాదించు నభిలాషంబున.113
గీ. దానిబొక్కకడకుఁ దా నేగి నాప్రాణ, సఖుఁడ యేగుదెమ్ము సత్వరముగ
నొక్కచోట నుండి యుచితసల్లాపముల్, చేయవలెనటంచుఁ జీరుటయును.114
క. లాఁగలు పెక్కులు లోపల, బాగై తను ముట్టినపుడ పట్టువడక లో
డాఁగి చని వెలికి వెలువడి, పోఁ గనుమలు గలుగునట్టిబొక్కయెదిరికిన్.115
వ. వచ్చి మృద్బద్ధం బైనబిలద్వారంబున నిల్చి యాద్విజిహ్వంబుతో ని ట్లనియె.116
క. నన్నుఁ మును పీవుఁ గాచితి, నిన్నుం జెఱ కేను వాపి నిలిపితి నాకై
మున్ను గల కరుణ మఱవక, మన్నింపుము నాకు నంత మానమ చాలున్.117
గీ. వియ్యమందఁ బోక కయ్య మొనర్చుట, చెలిమిసేఁత తమకుఁ దలము గాని
వారితోడఁ దగదు వలదు నీచెలిమికి, నేను హీనబలుఁడ నెంతవాఁడ.118
క. మున్నీవు నాకు వైరివి, మిన్నక కార్యార్థమాత్రమిత్రత్వమున
న్నన్ను సహింపుదువే చను, మిన్నిపలుకు లేల వెఱతు నే నిను జేరన్.119
వ. అనుటయు నయ్యహి సిగ్గువడి పోయె నమ్మూషకంబును సుఖంబున నుండె నని
చారాయణుం డెఱింగించెఁ దనవలన మహీనాథవృత్తాంతంబు సమస్తంబు విని
భాగురాయణుండు కఱపి పుత్తేరఁ గలావతి యొక్కనాఁడు రత్నసుందరి పను
పునెపంబునఁ గేయూరబాహుభూధవుండు చారాయణసహితుఁడై యుండునె
డ కేతెంచి మ్రొక్కిన దేవీప్రేరితయై యది తనభావవృత్తి యరయవచ్చినదిగాఁ
దలంచి ప్రసంగవాక్యంబుల నింగితంబు నొడిచికొని ధరణీశుండు దానిం గార
వించి యాసీనంగా నియమించిన నది యట్ల చేసి వారి నుద్దేశించి సస్మితానన యై
యి ట్లనియె.120
క. మీయాడెడు నేకతమున, నాయతనము నృపతియఱుత హారం బది నా
చేయార గ్రుచ్చినది మీ, రేయెడ మొఱఁగెదరు నన్ను నీనేరుపులన్121
వ. అనుటయు ధాత్రీనాథుం డాశ్చర్యసందేహసంతోషంబులు మనంబున ముప్పి
రిగొనుచుండ ని ట్లనియె.122
క. చారాయణుఁడును నీవును, నారయ సరి నాకు నిట్ల యాడెదు నీకే
వారింతునె యేకత మీ, హారం బెవ్వరిది మొదల నంగన చెపుమా.123
వ. అనుటయు నెఱింగించెద నవధరింపు మని యి ట్లనియె.124
క. భూవర యొప్పును లాట, క్ష్మావల్లభపుత్రి నఖిలజనలోచన సౌ
ఖ్యావహలావణ్య మృగాం, కావళి యను కన్య హృదయహారిణి యగుచున్.125
వ. అనుపలుకు విని కేయూరబాహుమహీపాలుండు కళావతితో లాటేశ్వరుం
డగు చంద్రవర్మకు మృగాంకవర్మ యను పుత్రుం డొక్కరుఁడు కాక పుత్రి
యెక్కడిది యనిన నది నగుచు నలుదిక్కులుం బరికించి యిది యొక్క యత్యం
తరహస్యంటు దాని నియమం బవధరింపు మని యిట్లనియె.126
క. ధాత్రీశ లాటపతి యొక, పుత్రిం గని పుత్రనామమున వెలయించెన్
శత్రుకులసమీకరనా, స్యత్రాణప్రౌఢకౌశలాలసుఁ డగుచున్.127
చ. అతఁడు సుబుద్ధి గాన దనయన్వయపూర్వులు దొల్లి యేకసం
తతులయి పోక తా విధికృతం బగుటన్ దనయందుఁ బుత్రహీ
నత పరదేశరాజులమనంబునఁ బుట్టకయుండనోపి ర
క్షితముగఁ జేసె మంత్రము బ్రసిద్ధిగ మ్రోసె సుతత్వ మెల్లెడన్.128
వ. ఆయ్యపత్యంబు నామంబు మృగాంకావళి యై యుండ మృగాంకవర్మ యని పుం
స్త్యంబు దోఁపఁ దదభిధానంబునం బిలుచుచుందు రక్కన్నియఁ బొందినవానికి
సార్వభౌమత్వంబు కలుగు నని మహాపురుషాదేశంబు, ఈ రహస్యంబు సమస్తంబు
బుద్ధిమదగ్రేసరుం డగు నీమంత్రి భాగురాయణుండు భవదీయరాజ్యలక్ష్మీసమృద్ధి
చింతానిరతాత్ముం డగుట నక్కుమారీరత్నంబును వరించి దేవరసౌర్వభౌమత్వంబుఁ
బొందవలయు నని యొక్కయుపాయంబున నా రాజపుత్రి నిప్పురంబునకు రప్పించి
తనమందిరంబున నిడికొని రత్నసుందరియందు భయభక్తిసమేతుండగుట నద్దేవివల
ని దాక్షిణ్యవిశేషంబున నీ కెఱిఁగింపనేరకయున్నవాఁడు భవద్వల్లభ యెరుం
గకుండ నమ్మహామంత్రినియోగంబున నప్పురంధ్రీభూషణంబునకు నెచ్చెలివై
వర్తిల్లుదు.129
ఉ. ఆమదిరాక్షి రూపవిభవాతిశయంబుల దృష్టి సోకినన్
సోముని నైన వేఱ యొకసోముఁడు నామనినైన వేఱ యొ
క్కామని కమ్మదెమ్మెరలనైనను వేఱొకకమ్మతెమ్మెఱల్
కామునినైన వేఱ యొకకాముఁడు నేచుదు రేమి సెప్పుదున్.130
మ. వనితారత్నము నాసికాపదభుజద్వంద్వశ్రవోలంకృతుల్
వనజామోదపుటూర్పు లంచనడుపుల్ వాణిద్యుతుల్ శాతలో
చనపార్శ్వంబులు దృష్టిదోషమున రక్షల్ నాకుఁ జూడఁగఁ ద
ద్ఘనముక్తావళి యందియల్ వలయముల్ కళ్యాణతాటంకముల్.131
మ. కరపాదాంబురుహంబులుం గుచరథాంగద్వంద్వమున్ మోముచం
దురుతో దాయలు ఘ్రాణచంపకము శత్రుల్ కుంతలాళీంద్రసం
కర మి ట్లక్కట యీవధూసురుచిరాంగశ్శ్రేణి కయ్యెం బర
స్పరవైరం బని కుంది డస్సె ననఁగా సన్నంబు కౌ నింతికిన్.132
క. నయనాద్యవయవములు మే, లయినపదార్ధములఁ జేసె నజుఁ డవి వోగా
బయ లావటించి చేసిన, క్రియ నయ్యరవిందగంధినె న్నడు మొప్పున్.133
క. తొడవులకుఁ దొడవు తనులత, తొడవులకుం దనులతకును దొడవులు నడుపుల్
తొడవులకును దనులతకును, నడుపులకుం దొడవు లరయ నాతుక నుడువుల్.134
సీ. వాలుఁగన్నులుఁ జారువదనంబు నుత్పలవనజకాంతుల నుద్దివైచికొనఁగ
మెఱుగుదంతములు వాతెఱయును మౌక్తికచూతపల్లవముల సూడువట్ట
భుజములు మృదుహస్తములును లేఁదూండ్లను జెందొవరేకుల సిగ్గుపఱపఁ
జనుఁదోయి నలకలు జక్కవకవపొందుఁ దుమ్మెదచాయల దొద్దగొనఁగ
గీ. నలిక మరచందురునితోడఁ జెలిమి సేయఁ, దియ్యపలుకులు దేనెలు వియ్యమంద
నడపు లంచల కొంచదనంబు సేయఁ, గమలగంధి మనోహరాకార మలరె.135
క. ఆచేడియ సౌందర్యము, నాచేఁ జెప్పించుకొని వినఁగ వలసి మదిం
జూచెదవు గాక ముందఱ, నీచూడనియదియె మేదినీవర చెపుమా.136
వ. అదియె ట్లం టేైని.137
చ. అసదృశతారమౌక్తికసమంజితనాయకరత్న మై సమం
జసరుచిపుంజ మై తన కుచంబుల మీఁద వెలుంగు హారమున్
బిసరుహహస్త పుచ్చుకొని పెట్టెఁ బ్రియంబునఁ జేరితే నమః
ప్రసవశరాసనాయ యని పల్కుచు భూపతి కంధరంబునన్.138
క. అనుపలుకు లమృతము క్రియం, దనవీనులు సొచ్చి డిగి హృదయ మంతయునిం
డిన నొకపడిఁ దన్నెఱుఁగక, జనపతి పూర్ణానురాగశరనిధిఁ దేలెన్.139
వ. చారాయణుండునుఁ ప్రమోదితహృదయుఁ డగుచుం గళావతి శిరం బక్కున నది
మి పెక్కుదెఱంగులం బ్రశంసించె నప్పుడు మేదినీనాథుఁడు.140
గీ. బహువిధంబులఁ గొనియాడి బహుళరత్న, భూషణాంబరాదికముల పూర్వముగను
నొసఁగి యరలేని చెలిమిఁ దీపెసఁగఁ దన్నుఁ గలిపికొనియుఁ గళావతి గారవించి.141
వ. లాటరాజనందన యటమీఁది వృత్తాంతంబు విను కౌతూహలంబుతో నునికి యె
ఱింగి కళావతి యిట్లనె నట్లు దేవరచే గృహీతయయ్యును నటమున్న నాచే బోధి
తయగుటం గులపాలికాధవంబైన ధైర్యం బవలంబించి యెట్టకేనియు విడిపించుకొ
ని తదీయశయనగృహంబు సుషిరస్తంభకుడ్యరచితంబుఁ గావున యంత్రస్తంభాంతరిత
యైన యంభోరుహవదనను వీడ్కొని తత్సదనంబున నుచితప్రభాతం బగుచుండ నే
నును మదాలయంబున కఱిఁగి యొకప్రహారమాత్రంబు మసలి మరలి తనయున్న
తావునకుం బోవ నమ్మానవతియు నంతక మున్న బహువిధమన్మథవికారమగ్నమా
నస యగుచుండి తన యంతర్గతంబున సకలంబు నాకు వెలిఁబుచ్చ సిగ్గుపడి పద్య
త్రయంబు గా రచించి యొక్కకేతకీపత్రంబున లిఖించి యేమరి పడవైచినట్లు
డవైచి ననుం గనుంగొని మిథ్యానిద్ర నభినయించుచు నావలిమొగంబై నేనును
గదియంజని యక్కేతకీపత్రగతంగు పద్యత్రయంబు పఠించితి నది యె ట్లనిన.141
ఉ. తాడిడిపండుఁ దిన్నక్రియఁ దద్దయుఁ గాలము గోరుచుండఁగా
జూడఁగవచ్చు నే నృపతిసుందరు నింకొకమాటు గ్రమ్మఱన్
జూడఁగ నైన నోఁచు నొకొ చూశ్కీ. కళావతి దేవి కాత్మలో
నోడి ప్రమాదకార్య మిది యొప్పగు వొమ్మను నొక్కొ దైవమా.142
చ. యిట నటఁ జూడ రా దతని నింత యెుకప్పుడు నాడు నిండ ముం
దటఁ బొలయంగ నీ కిది ప్రధానుఁడు వల్కఁగఁ జామ యిద్ది నీ
చిటిపొటిపొన్నచుక్కలకుఁ జేతులు సాచుట గాదె యిట్టిదు
ర్ఘటనపుఁగూర్మికిన్ శరణు గల్గునె యెట్లు దలంచి చూచినన్.143
ఉ. ఒంటియ యుండి ఱేయి విభుఁ డుల్లమునం బ్రియమార నన్ను నీ
బంటుగ నేలికొ మ్మనుచుఁ బట్టిన యప్పు డదేల యియ్యకోయ
కుంటి వృథాభిమానమున నుంటఁ గళావతి మాట లేమిగా
వింటిఁ బ్రసూనసాయకుని వింటిదృఢత్వముఁ గంటి బేలనై.144
వ. అని చదివితి నని చెప్పిన సానందహృదయుండును సదయుండును లజ్జావదనుండు
ను నగు నజ్జగతీవల్లభు ననలోకించుచు నటమీఁద నవధరింపుమని కళావతి యి ట్లని
యె నే నప్పద్యంబులు పఠించి యదరిపడి యక్కాంతవలవంతకుం దల్లడిల్లుచుండి
నప్పుడ నిద్రతెలిసినదియవోలె నచ్చతుర నన్నుఁ గారవించుచుఁ బర్యంకతలంబు డి
గ్గి భాగురాయణుని నిష్కుటకూటంబులోనికిం బోవుతలంపునం బిల్చిన నేనును న
ట్లైనం బ్రొద్దుగడపుట కార్యం బని యనుమతించి యఱుఁగ నందుం బ్రవేశించి.145
సీ. ఎలఁదేఁటికదుపుల యెరకలఁ బడనెక్కి పయిఁ గ్రమ్ము పూవుఁదేనియల సొబగు
వలసినచొన కోకిలదంపతులకుఁ దల్పములగు జిగురుజొంపముల పెంపు
బలుపురాచిలుకల పక్షానిలంబుల నలుదెస రాలెడు ఫలచయంబుఁ
బుప్పొడితావితోఁ బొదరిండుల బయళ్ళఁ బూరించు తిన్ననిమారుతంబు
గీ. అంగజానల మంతంత కగ్గలముగ జేయఁ దలపోతలకుఁ జొచ్చి చిత్త మలయ
నిష్టసంచారకేళికి నెలయలేక, యబల యొక్కలతానిలయంబు సొచ్చె.146
ఉ. హారమువెట్టుచోట భవదంగము సోకిన యంగుళాగ్రముల్
భూరితపఃప్రభావఘనపుణ్యఫలంబులు గాఁ దలంచి యం
భోరుహనేత్ర రిత్తమెయిఁ బొల్పఱుచుం బలుమారుఁ జూచు స
స్మేరముఖారవిందమునఁ జేర్చుకొనుం బులకాంకితాంగియై.147
చ. విరహజవేదనాభరము వెన్ముఁగ డెందముమీఁదఁ గన్నునీ
రురువుగ ను౦డె ముద్దియ మహోగ్రమనోభవవహ్ని యంగముల్
దరికొని కాల్ప నందు సకలంబును నార్పఁగ లావులేమి జీ
వరమణుఁ డర్థినుండెడు నివాసము సేరి యొనర్చె కైవడిన్.148
వ. మఱియును.149
శా. వాడెన్ మోము రసాలబాలలతికావాసంతికల్ సూడఁగా
నోడెం గన్నులు వెచ్చఁగాఁ దొడఁగె నిట్టూర్పు ల్తనూవల్లికం
గూడెం దాపము వీడుకోలువడసెం గోష్ఠీవిహారంబు నూ
టాడెం దాలిమి మేను డస్సెఁ గడు నయ్యంభోజపత్రాక్షికిన్.150
వ. అట్లుండ నెట్టికేలకు దినంబు గడచి రాత్రి కొంత సనుటయు.151
ఉ. చుక్కలరాణివాసములు చుట్టును గొల్వఁ గొలంకు లెల్లఁ బే
రెక్కినజోదు పూవిలుతునిష్టుఁడు వెన్నెలపుల్గు లాశ్రితుల్
చక్కవదోయి తామరలు శత్రులు గా విహరించు రాజు మి
న్నెక్కె మనోజుతాపభర మెక్కె వియోగుల కెల్ల నత్తఱిన్.152
సీ. అంజనగిరి తనయద్రిఁ బోలుడు నీలకంఠుండు తోరణకట్టఁ బనుప
ననిమిషనది వెల్లి యని యగస్త్యాదులు బయల నెచ్చటనైనఁ బారి కృంక
వనజజగుహులు వాహనములు దడబడ్డ నలిగి వాదడచి సత్యముల కఱుఁగ
విచికిలప్రసవంబు వెదకెడు తేఁటి తమాలపు విరులందు మసలుచుండఁ
గీ. బ్రీతి బిసనాళములు గొని పీల్చ గలిగి, తగినదోయిళ్ళలో నుంచి త్రావఁజాలి
ముట్టికుండలు నిండంగ ముంచం గలిగి, నిఖిలదిక్కుల బండువెన్నెలలు వెలిఁగె.153
వ. అట్టియెడ మూర్ఛితయైన లాటరాజపుత్రిని సేదఁ దీర్చి నాచేయువివిధోపచారంబు
ల మదనానలం బగ్గలించి.154
క. సుందరి కిడ్డ కుచాంతర, చంచన, మొప్పారె దాపసంతాపితమై
కందర్పవహ్ని నెరిసిన డెందంబున నీరుకైవడికిఁ బట్టగుచున్.155
వ. అప్పు డేను తల్లడిల్లుచు నొక్కచెంగలువదండ పయికెత్తి.156
సీ. పద్మాస్య యనియెడి పగమాని చంద్ర యుత్పలనేత్ర యని కృప పట్టికొలిపి
కచభరంబున నీలకంఠాభ యని చూడ కంగజ రతిబోటి యని యెఱింగి
రామాభిధాన యీకోమలి యనక పికాధిప కలకంఠ యగుట సూచి
చంపకనాస యన్ చలము మాని యళీంద్ర కల్హారనిభగంధి గాఁగఁ దెలిసి
గీ. రమణ వెన్నెలచిచ్చువేడిమి కిఁ బాపి, ప్రసవసాయకముల పాలుపడఁగ నీక
వాకువిషమున సల్పక వాడిఝంకృ, తుల నదల్పక దయఁ గానఁ దలఁపుఁడయ్య.157
వ. అని యిట్లు మొరయిడుచున్న నన్నుం గనుంగొని దైన్యగర్భహాసంబు దెచ్చుకొని
యా రాచూలి యిట్లనియె.158
చ. సరసిజనేత్ర యేటికిటు చందురు గించురుఁ గాముఁ గీము నా
తురపడి వేడె దింతటనె దోషమనస్కులు వారు చాల నీ
పరిభవ మోర్వ రీయలరుఁ బాన్పుల వెన్నెల యింతఁ దెచ్చెనే
దరికొనఁజేయు మంతఁ బరితాపము గీపముం జక్కనయ్యెడున్.159
వ. అనిన నవ్వనం బట్టిది గావున నాస్థలంబు వాపి నివాసహర్మ్యంబునకుం గొనిపోవం ద
లంచి యాసుందరి కిట్లంటి.160
చ. అలరులసెజ్జ యింతయును నంగజుదిండియయంపప్రోవు కో
మలదళవీజనంబు లవి మందమరుజ్జనకంబు లీలతా
నిలయము కాము ఠా వకట నిల్తురె యిచ్చట డాగపోయియుం
దలవరియింటఁ డాగి రను తద్వచనం బది నిక్కువంబుగన్.161
వ. అని నినాసహర్మ్యంబునకుం దోడ్కొని యఱిఁగితి నాత్రియామయు సహస్రయా
మయై కడచె నిది యజ్జోటి విధం బిటమీఁద నీవయెఱుంగు దని పలికినం గళావ
తికి మఱియునుం బసదనం బొసంగి వీడుకొలిపి చారాయణుం జూచుచు న
న్నరపాలుండు.162
మ. కలయో నిక్కమొ మున్నెఱుంగఁ దుది నిక్కంబైన నే తన్వియో
తెలియంజాల సమస్తకార్యగతులుం దెల్లంబు లై చేకుఱెన్
గులశీలాదులఁ దుల్య యిట్టి సతి నాకుం జేర్చే దైవంబు నా
లలనారత్నముఁ బెండ్లియాడ నవలీలం గల్గు టెబ్భంగియో.163
వ. అనుచుండ భాగురాయణుం డొక్కచతురోపాయంబు గఱపి పుచ్చ నొక్కనాఁ
టి రేపు కళావతి రత్నసుందరిం గొలువం జని మేఘలాద్వితీయయై యుండ నద్దే
వితో నిట్లనియె.164
క. మనరాజు విదూషకుఁ గొని, మనమేఖల మోసపుచ్చె మన మిపుడాబా
పని మాఱుసేత యిదియొక, పనియే వెల్పెట్టవలదె పార్థివతిలకున్.165
వ. అనుచుంటయు నద్దేవి సంతసిలుచు నట్లైన మెచ్చుగల దది యేయుపాయంబు
సెప్పు మనవుడుఁ గళావతి యిట్లనియె.166
సీ. మనరాజు భోగైకమగ్నుండు కావున నేమిఁ జెప్పిన నమ్ము నెఱుఁగలేఁడు
చంద్రవర్ముని కొక్కచక్కని పుత్రి మృగాంకవర్ముని చెలియలు శుభాంగి
కల దాకుమారిక కరముపట్టినవాఁడు సార్వభౌమత్వ విస్తారమహిమ
మందుట తొల్లి సిద్ధోపదేశంబని మున్న యార్యులచేత విన్నదాన
గీ. ఒరుఁడు సార్వభౌముం డన నొప్పుచుండ, నీవు హీనుఁడ వై యున్కి కేను సాల
దాని నీవ పెండిలిగమ్ము ధరణినాథ, సార్వభౌమత్వ మది నీక జరుగవలయు.167
వ. అట్లైన నేను సార్వభౌముని నగ్రమహిషి యన నఖిలనరేంద్రవల్లభాభిసేవ్యనై
యుండుదుఁ గులపాలికలకు నేయుపాయంబునం గాని నాథునభ్యుదయంబు గో
రు టుచితంబు గాక న్మదీయమానమధురంబును బరిణయవిసరంబు నగు కామభోగం
బువలని ప్రియం బెట్టిది యట్లుండుఁ గాక యా రాచకన్నియ మాపినతల్లి కూఁతు
రగుటను నిది నా కావించుపరిణయం బగుటను మాసనంబున నీసు పుట్ట దివ్విధంబు
జేయుట నాయభిమతంబులు సకలంబులుం జేయుట యిక్కార్యం బంగీకరింపకునికి
య నాచనువు లెల్ల నంగీకరింపకునికి యని నరనాథునకుం జెప్పిపుచ్చి యొడంబడఁజే
యునది యటమీఁచ మృగాంకవర్మ యజాతశ్మశ్రూదయుం డగుట నతని కేను వ
నితాశృంగారంబు లలవరించి తదీయానుజ యని మ్రోయించెద నిక్కపువివాహం
బునక వోలె వివాహద్రవ్యంబులు సమస్తంబులు సమకట్టుం డివ్విధంబున మాయలు
పన్ని యవ్వేడుక కాని మోసపుచ్చి చారాయణుని తలయెత్తి రాకుండఁ జేసి మే
ఖల భంగంబు నీఁగికొంద మిది రాజును భేదింపలేడు నమ్మెడుఁ జూడు మనిన దేవి
యది యట్టిద యని ముదితచిత్తయై కళావతిం గౌఁగలించుకొని.168
గీ. పసదసం బిచ్చి బోటి యీపని యభేధ్య, ముగ రచింపఁగ నెవ్వరిఁ బుత్త మనిన
సుగుణనిలయ కళావతి తగినవారిఁ, బనుపవలెఁ గాన మేఖలఁ బనుపు మనిన.169
వ. దేవి యించుక విచారించి యిట్లనియె.170
క. మేఖల యిక్కార్యంబున, రేఖపడం బలుకు పనికి నేరదు చెలియా
నాఖేదము చారాయణ, శాఖామృగమదము సేవ చని పుచ్చవలెన్.171
వ. నాకు నీపని సేయుమని కరంబులు పట్టిన నది రాజునకు మందుసెప్పిన వారి కథ
యయ్యె నని వగచుచు నట్లచేయుదు నని కదలి నృపతిసన్నిధికిఁ జనిన యపూర్వ
కంబుగాఁ బొడసూపిన గౌరవించి సమీపంబున నుంచికొని.172
క. భూవలయాధీశ్వరుఁడుఁ గ, ళావతి సంతోషజాతసలలితవచన
శ్రీవదనము చందముఁ గని, భావించుచు సఖునికనియెఁ బ్రహ్లాదమునన్.173
వ. కళావతి యపూర్వసంతోషవతియై యున్నయది యీసంతసంబు మనకుం దేబోలు
వినవలతు ననిన నది యిట్లనియె.174
క. సంతసములు కళ్యాణపు, సంతసముం గడవలేవు జనుల కనిన భూ
కాంతుని పెండ్లికి ముసలికి, సంతసములు కొఱతయే విచారింపఁగన్.175
వ. అనుపలుకులు విని సందియంబుతో నించు కలరుచు మహిపాలుండు దాని కిట్లనియె.176
చ. మొగిళులలోని యేకతము మ్రుచ్చిలి పుచ్చుకొనంగఁ జాలు దఁ
స్తగిరికిఁ దామ్రపరికిని సంగమమైన ఘటింప నేర్తు నిన్
మిగిలిన యట్టి బుద్ధిమతి మేదిని నెందునుఁ గాన నేమి క్రొ
త్తగలుగఁ జూచి పెండిలి ముదంబని యాడితి బోటి చెప్పుమా.177
వ. అనినం గళావతి భాగురాయణోపదేశంబునఁ దాను దేవింబ్రబోధించిన ప్రకారం
బు రాజును జారాయణుండును ప్రశంసించుకొనుచుండఁ దద్దయు సవిస్తరంబుగా
వినిపించి యాపని ఘటింపం బూని తానవచ్చుట యెఱింగించినం బరమానందంబున
ధరణీకాంతుం డక్కాంతకు నత్యాదరంబునం గట్టనిచ్చి దేవితోడ నీకుం దోఁచిన
ట్లాడు మిట మీఁది కర్తవ్యంబును నీకు నెట్ల బుద్ధి యట్ల వర్తింపుమని వీడుకొ
ల్పి భాగురాయణు బుద్ధివిశేషంబుఁ గొండొక కొనియాడి చారాయణుతోడ.178
గీ. దేవి యిబ్భంగిఁ దా మోసపోవు నొక్కొ, కార్య మిదియును నడుమ విఘ్నంబు లేక
జరగునొకొ లాటనృపకన్యచరిత మిచట, నొరులు నెన్వరు వింట లేకుండునొక్కొ.179
వ. అనుచుండఁ జారాయణుండు దేవి ననుఁ బేలువెట్టుదు నను తమకంబున నెద్దియు
నెఱుంగ దటుసూడు మిది యవశ్యంబు సిద్ధించు ననియూరడించె నటఁ గళావ
తి వికసితాననయగుచు దేవికి మ్రొక్కి.180
క. వనజానన యొడఁబఱచితి, మనుజేంద్రుని నతని సఖుని మాయాజాలం
బునఁ గట్టితి మీఁదటిపని, యొనరింపు రహస్యభేద మొలయక నుండన్.181
వ. అనుటయు సంతసిల్లి దానికి నభినవాంబరభూషణంబు లొసంగిన నది సని యవ్వి
ధం బంతయు భాగురాయణునకు వినిపించి ప్రసాదంబువడసి మృగాంకావళి కె
ఱింగించి మహానందంబునం దేలు నారాజనందన చేత మెచ్చుకొనియె నిట
దేవి యొప్పున ముహూర్తకు రప్పించి యతనిచేత వద్దినంబునం బూర్వాహ్ణంబు
న నతివిశిష్టంబగు లగ్నంబు గలుగుట విని యప్రొద్ద వివాహం బని క్రమ్మరఁ గ
ళావతిచేతఁ చెప్పి పుచ్చి తదనుమతోత్తరంబున ముదం బది పురంటు నగరు నలంక
రింపవలసిన పనులకుఁ దత్తదుచితకర్మకారులఁ బనిచి మృగాంకవర్మునకుం గాంతా
లంకార మలవడంజేయు మని కళావతి నతిప్రయత్నంబున నియోగించి రాజుం
గైసేయ నభినవప్రసాధనరచనానిపుణు లగు చతురుల కానతిచ్చిన నాప్రొద్దు స
ర్వం బనుష్ఠితం బై లగ్నం బాసన్నం బగుటయు.182
సీ. సల్లలితాశ్వత్థపల్లవమిశ్రితచారుపల్లవరత్నతోరణంబు
అసదృశకుంకుమరసలిప్తతలపరివశితముక్తారంగవల్లికంబు
ఫలపుష్పశుక్తిజప్రాలంబమాలికోదారవిచిత్రవితానకంబు
రమణీయమంగళద్రవ్యకాంచనపాత్రికాకారపుణ్యాంగనాకరంబు
గీ. విశదవేదఘోషాపూర్ణవిప్రగణము, దీప్తమణికాంతికల్పితదీపచయము
నగుచుఁ బరిణయమండప మమరియుండ, రాజ్ఞి పనుపున రాజును రాజసుతయు.183
ఉ. చూడ్కులు చూపఱన్ మొరఁగి చొచ్చి కృతార్థతఁ జెందుచుండఁగా
వేడ్కలు నిక్క నూరటలు వేగము నుల్లము సందియంబునన్
వీడ్కొలుపం బ్రమోదరసనీరధి దా నిరుమేను లైనయ
మ్మాడ్కి వహించి చేసిరి సమంత్రకకృత్యములం గ్రమంబునన్.184
వ. అనంతరంబు వేదిస్థలంబునకు వచ్చి హోమం బొనరించుచుండ దేవియు నాప్తపరి
చారికలును హాసోద్యోగు లగుసమయంబున భాగురాయణుండు సనుదెంచి రత్న
సుందరి సేయించునుపచారంబులు గైకొని యుచితస్థలంబున నాసీనుండై యాయ
మ నుద్దేశించి యిట్లనియె.185
గీ. చంద్రవర్మమహారాజుసతి సుధామ, దేవి నీపేర లేఖ పుత్తెంచె ననుచు
నగరి మొగసాల నొకరుఁడున్నాఁడు వానిఁ, బిలిచి తేరంగ నిప్పుడ వలయుఁబనుప.186
వ. అనుటయు దేవిచేత ననుజ్ఞాతయై యొక్కసతి చని తోడ్తేర వాఁడును దండప్రణా
మం బాచరించి హరిద్రముద్రం బైనతనచేతిలేఖ యిచ్చినం జదివించె నది
యెట్లనిన.187
సీ. స్వస్తి సమస్తప్రశస్తిసమేతసుధామమహాదేవి తనతనయకు
స్వస్తి సమస్తప్రశస్తిసమేతయై పరఁగినరత్నసుందరికిఁ బ్రీతిఁ
జెప్పు నీ కిపు డొక చిట్టితమ్ముఁడు గల్లె మున్ను నీపురమున నున్న యామృ
గాంకవర్ముఁడు చెలియలు గాని నీకుఁ దమ్ముఁడు గాడు మగపేరు మ్రోయఁ జేసి
గీ. పెనిచితిమి మేము సుతుఁడు లేకునికి దొల్లి , నిప్పు డక్కన్యఁ దగుపతి కిమ్ము నీవ
దానిఁ బొందిన భూపతి ధరణీ సార్వ, భౌముఁ డగు నిది మునివరభాషితంబు.188
వ. అను లేఖ యాకర్ణించి.189
క. ఱిచ్చవడి వెల్లవాఱుచు, ముచ్చముడిఁగి మూర్ఛ తన్ను ముంచికొనంగా
వచ్చిన ధైర్యం బూఁతఁగ, నచ్చేడియ నిల్చు టప్పు డద్భుత మయ్యెన్.190
వ. అట్లుండి తనలోన.191
క. ఇది యేమి చేసికొంటిని, మదిమదినుండి జను లెల్ల మతిలే దని న
వ్వెదరు సవతిరాకకునై, మదినోర్చినఁ దలమె వారీమాటల కోర్వన్.192
వ. అని యిట్లు పశ్చాత్తాపపీడితయై యిది విధికృతం బింక దీనికి ధైర్యం బంచమి.
లని మెచ్చునకు ధైర్యంబు దెచ్చుకొని ధీరయగుట నవికారయై యుండె.193
క. కార్యమూల మెఱుంగక కడగి యొరుల, కఱపు మదినమ్మి తమకు నయ్యెఱుక
యొరులఁ బఱచెద మనిపోయి యొరులచేతఁ, దారు వడుదురు రత్నసుందరివిధాన.194
వ. భాగురాయణుండు తనయుపాయంబు సఫలం బగుటకుఁ బ్రియం బందె.195
క. పరసుఖమునందుఁ బొందుగ, విరచించుచు మంతనంబు వెలిపుచ్చక నే
ర్పరి యైన భాగురాయణు, కరణి ననుష్టింపవలయుఁ గార్యము లెల్లన్.196
వ. మృగాంకావళీ కేయూరబాహు లనంతరంబున.197
సీ. కర్పూరకస్తూరికాపరిమళకరండము లంటిరత్నహర్మ్యములయందుఁ
గోకిలకీరాదికోలాహలంబున విలసిల్లు నుద్యానతలములందు
మత్తకేకులకెల్ల నృత్తరంగము లైనరమణీయకేళిశైలములయందుఁ
బరిమళకదళికాప్రాప్తిలతాశ్రేణి నమరుదీర్ఘికలతీరములయందు
గీ. నాఁడునాఁటికి వేడ్కలు నాటుకొనఁగ, సారెసారెకు నింపు లింపారుచుండ
నంతకంతకు నాచట లగ్గలింప, నంగజక్రీడఁ దేలుదు రభిమతముగ.198
వ. ఇట్లు లబ్ధమనోరథుం డై కేయూరబాహుమహీనాథుండు.199
సీ. తేజంబు గలఁడు సాధించు శత్రుల ప్రజ్ఞ వెండి నిందకుఁ జాల వెఱచుఁగాని
యరి నొవ్వఁగొనఁడు తప్పరయు ధర్మరతుండు భృత్యులం జెఱపఁడు సత్యవా
కలక యుబ్బుట భీతి కలుష మేమఱుట మొక్కలము వెఱగుపాటు చలము
కామినీలోలుండు గాఁడు సేవకుచేఁత మఱవఁ డిచ్చినయీఁగి మగుడఁ గొనఁడు
గీ. క్రౌర్యలోభజాడ్యకపటవ్యసనముల, పొంతఁ బోవఁ డాయమును వ్యయంబు
నెఱుఁగు నాఁడునాఁటి కింద్రియవర్యుండు, గాక సుజనవినుతికలితుఁ డయ్యె.200
సీ. యేలు భూమియంతయుఁ దననగరిలోపలవోలే నెంతయుఁ దెలివిపడఁగ
చ్చట మరుదేశ మిచట జాంగలరాష్ట్ర మిచ్చట సమతల మిచటసార
మ నసారము కొండలిట నేరునిచటఁ బేరడవి యిచ్చటఁ గలదని యెఱింగి
నాకాలమున కగు నిచట దుర్గం బని తెలిసి దుర్గంబులు బలుపుచేైసి
గీ. కాసి యున్న సమీపభూపతులలోన, సబలు నబలుని మిత్రుని శత్రు నరసి
గురుపాయంబులను వారిఁ జక్కఁ జేసి, పుడమి పాలించి యెల్లెడఁ బొగడ నెగడె.201
క. స్వామియు మంత్రియు దుర్గ, స్తోమము రాష్ట్రంబు వనము సుహృదులు బలముం
మహి సప్తాంగము లని, తా మదెలో నెఱిఁగి వీనిఁ దగ రక్షించెన్.202
సీ. స్త్రీలోలవృత్తి మై సింహబలుండును జూదంబుచే ధర్మసుతుఁడు నలుఁడు
..కపానాసక్తి యాదవులును వేఁటతగులునఁ బాండుఁడు దశరథుండుఁ
బొంకు ప్రల్లదమున బౌరవులును బరుసనిదండమున జరాసంధనృపతి
స్నప్రయోజననిఖిలార్థపరిత్యాగమున నాహరిశ్చంద్రమనుజపతియు
గీ. యాపదలఁ దొల్లిఁ బొందిరి యట్ల యగుట, వ్యసనసప్తక మెప్పు డొప్ప దని యెఱింగి
వాని వర్జించి ధరయెల్ల వ్రాలి యేలి, సార్వభౌమత్వమందె నజ్జనవిభుండు.203
గీ. బుద్ధి శస్త్రంబు సప్తాంగములును మేను, గార్యయత్నరహస్యరక్షణము జోడు
కారులేదృష్టులును సూతజనము ముఖము, ధర్మవర్తన ప్రాణ మాధరణిపతికి.204
వ. తద్రాజ్యంబున.205
ఉ. వృత్తులఁ గల్ములం బొదలి విప్రులు పెద్దయు ధన్యులైరి య
త్యుత్తమధర్మకార్యముల నొంది వసుంధర సర్వదానసం
పత్తి వహించె ధర్మము లపారతఁ బొందె జనంబు గేహమున్
దత్తదభీష్టవస్తువులఁ దామరతంపరలయ్యె నయ్యెడన్.206
ఆశ్వాసాంతపద్యములు
క్షాంతిదయాప్రియాభరణ కౌశికగోత్రగృహప్రదీప ది.
గ్దంతిమదాంబుసేచనవిధానవివర్ధితకీర్తివల్లికా
క్రాంతసమస్తలోక యవిఖండితసంతతదానవర్ష వి
శ్రాంతమనోహరార్థిజనచాతక భూతలపారిజాత
క. అభినవభానుతనూభవ, విభవపురంధరలసద్వివేక బహుళసౌ
రభసంవాసితమానస, సుభగీజనమదన నిఖిలశుభగుణసదనా.207
మాలిని. గణకశిఖరరత్నా కావ్యవిద్యాప్రయత్నా
ప్రణుతజనశరణ్యా ప్రాజ్యలోకాగ్రగణ్యా
ఫణిశయదృఢభక్తా బంధువర్గానురక్తా
గుణిజనకృతిసఖ్యా గుండనామాత్యముఖ్యా.
గద్య. ఇది సకలసుజనవిధేయ మంచననామధేయప్రణీతం బైన కేయూరబాహుచరి
త్రంబునందు సర్వంబును జతుర్థాశ్వాసము.
సంపూర్ణము.