కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/దుఃఖాన్ని సమాప్తం చేయడం

దుఃఖాన్ని సమాప్తం చేయడం

ఇది చివరి ప్రసంగం. ఇక్కడ జరిగిన గత మూడు సమావేశాలలో మనిషి ఏ దిశగా పయనం సాగించాలి అన్నది చాలావరకు సూచించామనే అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తూ వున్న యీ ప్రపంచం చాలా చాలా అల్లకల్లోలంగాను, మహా హింసాత్మకంగాను, దాదాపుగా అరాజకంగా, సంఘవిద్రోహ కరంగా తయారవుతున్నది. ఒక పక్కన యుద్ధం వున్నది, విపరీతంగా దోపిడీ చేయడం వున్నది, బలహీనులను స్వప్రయోజనానికి వాడుకోవడం వున్నది; దయా దాక్షిణ్యాలు లేని కార్యసాధకత్వం, అవకతవక పరిపాలన, అసమర్ధ ప్రభుత్వం మొదలైనవి వున్నాయి. మనందరం- మనలో ప్రతి వొక్కరూ ఎదుర్కోవలసిన ఎన్నో సమస్యలను వరసగా ఏకరువు పెట్టచ్చు. మన దురాశలతో, మన దుఃఖాలతో, సంఘర్షణలతో, సుఖాపేక్షలతో, యితరుల పై పెత్తనం చేయాలనే కాంక్షా, హోదా కోసం ఆరాటమూ వంటి వాటితో మనమే తయారు చేసుకున్న ప్రపంచం యిది.

అనేకంగా వున్న యీ సమస్యలను ఒక్కటొక్కటిగా వివరించుకుంటూ పోవచ్చు, అయితే సమస్య ఎదురుగా నిలబడి మనల్ని నిలదీసినప్పుడు వర్ణనకి, వివరణకి వుండే విలువ శూన్యం. దురదృష్టం ఏమిటంటే వివరణలు చాలా సులభంగా మనల్ని సంతృప్తి పరుస్తాయి. మాటలు నిజంగానే మన సమస్యల్ని పరిష్కరిస్తాయని అనుకుంటాం. అందువల్ల నయాగరా జలపాతంలాగా మాటలు ప్రవహిస్తాయి. ఈ ఒక్క సమావేశంలోనే కాదు, ప్రపంచమంతటా యిదే జరుగుతున్నది. ప్రతివారూ అంతులేకుండా మాట్లాడుతునే వుంటారు. అసంఖ్యాకమైన సూత్రాలు, కొత్త కొత్త సిద్ధాంతాలు వున్నాయి; యివి చాలనట్లు మన దుర్బాగ్యం కొద్దీ కొత్త కొత్త నాయకులు - రాజకీయ రంగంలోను, ఆధ్యాత్మిక రంగంలోను కూడా వున్నారు. ఎదుటి మనిషి ఏం చేయాలో, ఏం ఆలోచించాలో చెప్పి, అతన్ని నమ్మించడానికి రకరకాలైన సిద్ధాంతాల ప్రచారము జరుగుతున్నది. ఎట్లా ఆలోచించాలో తెలుసుకోవడం చాలా కష్టసాధ్యమైన పనుల్లో ఒకటి. మన సమస్య కేవలం సాంఘికమైనదో, ఆర్ధికమైనదో, అటువంటిదే మరొకటో కాదు. అంతకంటే ఎక్కువగా అది ఒక ఆధ్యాత్మికమైన సమస్య. చేతన సమస్తంలోనూ ఒక విషమ పరిస్థితి ఏర్పడిన సమస్య. ఇక్కడ మాటలమీద, వ్యాఖ్యానాల మీద, నిర్వచనాల మీద మనం ఆధారపడితే అది అర్ధవిహీనంగా వుంటుంది. ఈ ప్రసంగాలు బహుశ మీకు ఏం ఆలోచించాలో కాకుండా, ఎట్లా ఆలోచించాలో అనేది సూచించి వుంటాయి. సిద్దాంత ప్రచారం మనల్ని దాస్యంలో పడేస్తుంది. ఏం ఆలోచించాలి అనేది- గీత, ఖురాను బైబిలు, మతాచారుడు, మార్కు లెనిన్ సూత్రాలు, అసంఖ్యాకమైన సిద్ధాంతాలు- చెప్పాయి. అయితే, గాఢంగా ఆలోచించడం ఎట్లా అనేది, ఆలోచనలు ఒక పరిధికే పరిమితం అయి వుంటాయి అనేది మనకు తెలియని విషయాలు.

మనకి వున్న చాలా పెద్ద సమస్యల్లో ఒకటి- బహుశ ఒకే ఒక పెద్ద సమస్య. ఏదంటే, దుఃఖం, దుఃఖాన్ని పరిష్కరించుకోవడానికి, దుఃఖాన్ని అంతమొందించడానికి మనిషి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. దాని నుంచి పారిపోదామని ప్రయత్నించాడు. దానిని పూజించాడు. దానికి ఎన్నో వ్యాఖ్యానాలు కల్పించాడు. కాని పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు మనిషి అంతులేకుండా యీ దుఃఖంలో మునిగితేలుతునే వున్నాడు. నాకేమనిపిస్తుందంటే, మనిషి యీ సమస్యను- మాటల్లో కాదు, భావాలలో కాదు, వ్యాఖ్యానాల్లో కాదు, అసలు వాస్తవంలోనే- ఆగకుండా ప్రవహిస్తున్న యీ దుఃఖ ప్రవాహంలో నుంచి బయటకు అడుగు పెట్టడం ద్వారా పరిష్కరించుకోనట్లవుతే, అతని సమస్యలు యింకా కోకొల్లలవుతాయి. మీరు చాలా ఐశ్వర్యవంతులై వుండచ్చు, మీ వద్ద అధికారం, అంతస్తు, పేరు ప్రతిష్టలు, హోదా, అన్నీ వుండచ్చు. మీరు చాలా తెలివిగలవారై వుండచ్చు, మీది ఎంతో సమాచారం సేకరించిన పదునైన బుర్ర అవచ్చు; అయినా సరే, యివన్నీ దుఃఖం అనే యీ అత్యంత ప్రధానమైన సమస్యా పరిష్కారానికి మనిషి చేసే ఒత్తిడులకు, మానవుడు పడే ఆతురతకు సమాధానం చూపలేవు, అని నాకు అనిపిస్తున్నది, ఎందుకంటే దుఃఖం అంతమైన తరువాతే వివేకం వుదయిస్తుంది. వివేకం అంటే గడసరితనం కాదు, జ్ఞానం కాదు, సిద్ధాంతాలు కావు. వివేకం కలిగేది దుఃఖం అంతమైనప్పుడే. ఈ వివేకం లేకుండా మన మానవ సమస్యలను, బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా, మనం పరిష్కరించుకోలేము.

చరిత్ర గతిని పరిశీలించినా, మన స్వంత జీవితంవైపు చూసుకున్నా, నిత్యజీవితంలోని మన కార్యకలాపాలు పరిశీలించినా సుఖదుఃఖాలు అనే సూత్రంలో మనిషి చిక్కుకొని పోయినట్లుగా మనం తెలుసుకోవచ్చు. సుఖమే మనల్ని నడిపిస్తూ వుంటుంది. మనలో చాలా మందికి కావలసినది సుఖమే. ఎంతో గోప్యంగా దాన్ని మనం వెంటాడుతూ వుంటాం. ఆధ్యాత్మికులందరూ సత్యం కోసం అన్వేషిస్తున్నాం అని సాధారణంగా అంటుంటారు తప్ప, నిజంగా వాళ్ళు వెతుకుతున్నది సుఖానికి ఒక సూత్రం కని పెట్టడం కోసమే. సుఖం, అది ఏ రూపంలోనైనా సరే, వున్నప్పుడు దుఃఖం కూడా దాని వెంటనంటే వుంటుంది. ఒకటి లేకుండా మరొక దానిని పొందలేము. ఇంద్రియనుభూతి అయిన సుఖమే కాకుండా, యింద్రియానుభూతి నిచ్చే సంతోషమే కాకుండా, మీరు కనుక కొంత అభిరుచి గల మనిషవుతే, కొంత సంస్కారం వున్నవారవుతే, యింకా కొంత మేధావి రకం అవుతే- సంస్కరణాభిలాష ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, సమాజాన్ని మార్చడం ద్వారా కలిగే సుఖం కూడా వుంటుంది. పుస్తకాలు రచించడం, రాజకీయాల్లో చేరడం, మీ ఆకాంక్షలను సార్థకం చేసుకోవడానికి చేసే అంతులేని కార్యకలాపాలు యివన్నీ కూడా సుఖ సంతోషాలని పెంచుకోవడానికే. మీ జీవితంవైపు మీరు పరిశీలించి చూసుకుంటే, మీలో ఆ స్పృహ కనుక కాస్తయినా వున్నట్లవుతే, మీ అభిరుచులు, మీ స్వభావ గుణాలే మిమ్మల్ని నడిపిస్తున్నాయని తెలుసుకుంటారు. మరింత మరింత ఎక్కువ సుఖతృప్తి కోసం జరిగే నిరంతరమైన ఒత్తిడి ఫలితంగా జనించినవే యీ అభిరుచులు, స్వభావగుణం అన్నవి. నిజంగా చూస్తే సద్గుణాలు అనేవి యీ సుఖం అనే సూత్రం మీద ఆధారపడినవే. ఈ సుఖాన్ని గురించి అవగాహన చేసుకోనంతవరకు దుఃఖాన్ని అంతం చేయడం జరగదు. ఇదంతా కొంత లోతుగా మీకు వివరిస్తాను.

అసలు జీవితం అంటే సుఖమేనా? జీవితం అంటే సంఘర్షణలూ, దారుణమైన బాధలూ, బయటా లోపలా వుండే ముగింపు లేని పోరాటాలూనా? రణరంగంగా తయారయిన జీవితం- మనకు తెలిసినదంతా యింతే. మనం సిద్దాంతాలు అల్లవచ్చును; వేదాంతపరమైన ప్రతిపాదనల్ని గురించీ, సమాజాభివృద్ధి గురించీ, ఏం జరగాలి అనే విమర్శలు చేస్తూ అంతులేకుండా మాట్లాడవచ్చు. కానీ, సుఖం కావాలని కోరే యీ విపరీతమైన ఒత్తిడిని అవగాహన చేసుకోక పోతే మాత్రం సంఘర్షణ, దుఃఖం అనే అంతూ దరీలేని ప్రవాహంలో కొట్టుకొని పోతాం అని నాకు అనిపిస్తున్నది. సుఖాన్ని అవగాహన చేసుకోవడం అంటే దానిని తృణీకరించడం కాదు. ఎందుకంటే సుఖం, సంతోషం లాగే జీవితంలోని ప్రాధమిక అవసరాల్లో ఒకటి. అందమైన ఒక వృక్షాన్ని చూసినప్పుడు, చక్కని చిరునవ్వుతో వెలిగే ముఖాన్ని చూసినప్పుడు, ఆకు మీద మెరిసే కాంతిని చూసినప్పుడు, మీరు నిజంగానే చాలా సంతోషపడతారు. అందులో గొప్ప వుల్లాసం వున్నది.

సౌందర్యం అనేది వేరు. అది సుఖం కాదు. సౌందర్యానుభూతి ఒక భవనంలో కాని, ఒక వర్ణ చిత్రంలో కాని, ఒక కవితలో కాని, ఒకరి చేతిలో ఒకరు చేయివేసి వుండటంలో కాని, ఒక పర్వతాన్నో నదినో పరికించి చూడటంలో కాని వుండదు - ఇవి ఎంత సుఖాన్నిచ్చేవయినా కేవలం యింద్రియాను భూతులు మాత్రమే. సౌందర్యం అంటే యిందుకు పూర్తిగా విభిన్నమైనది. సౌందర్యం అంటే ఏమిటో, మేధోపరంగా కాదు, మాటల్లో కాదు. నిజంగా అర్ధం చేసుకోవాలంటే, సుఖం అంటే ఏమిటి అన్నది అవగాహన చేసుకోవాలి.

చూడండి, మానవుడు సుఖాన్ని త్యజించాలని ఆదేశించడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది. మతం ద్వారానో, ఒక భావనను ఆరాధించడం ద్వారానో, మహాత్ములు, మత ప్రచారకుల ద్వారానో, సన్యాసులు, బైరాగుల ద్వారానే యిదీ జరుగుతున్నది. వీళ్ళంతా అదే పనిగా పెట్టుకొని మనిషిని సుఖాన్నుంచి దూరం చేశారు. సుఖపడటం తప్పనీ, అది దుర్మార్గమనీ, దాని నుంచి దూరంగా వుండాలనీ వాళ్ళు అంటారు. సంతోషంతోనే నిండిపోయివున్న మనసు, సుఖం కోసం వెతుక్కునే మనసు పరమసత్యాన్ని, దేవుణ్ణి ఏనాటికీ కని పెట్టలేదనీ, అందువల్ల మనిషి తనను తాను హింసించుకోవాలనీ వీళ్ళు అంటారు. అయితే అటువంటివాళ్ళు దేవుణ్ణి చేరేటప్పుడు వక్రమైపోయిన, చిత్రహింసలకు గురియైన, అల్పమైన, చిన్న మనసుతో వస్తారు. వాళ్ళది సమాజం చేత, సంస్కృతి చేత పీల్చి పిప్పిచేయబడిన మనసు. అటువంటి మనసు స్వేచ్ఛతో, సజీవత్వంతో, తొణికిసలాడే ప్రాణంతో, శక్తి సామర్థ్యాలు కల, భయరహితమైన మనసుగా ఎప్పటికీ అవలేదు. చాలావరకు మనుష్యుల మనసులన్నీ చిత్రహింసలకు లోనయినవే. వాళ్ళకు అది తెలియక పోవచ్చు. వాళ్ళకా ఎరుక లేకపోవచ్చు. కుటుంబ జీవనంలో, జీవనభృతి సంపాదించుకోవడంలో, వున్నత స్థితిని అందుకునే ప్రయత్నంలో ఎంతగా వాళ్ళు మునిగి పోయి వుంటారంటే, వాళ్ళ ఆస్తిత్వంలో ఏయే విషయాలున్నాయనే స్పృహ వాళ్ళకే లేకపోవచ్చును.

మనిషి ఎప్పుడూ ఏదో ఒక దానికోసం వెతుక్కుంటూ వుంటాడు. ఒక ఆశయాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక తృప్తిని అందుకోవాలని కోరుకుంటూ వుంటాడు. అత్యున్నతమైన స్థాయిలో వుండే తృప్తిని దేవుడు అని పిలుచుకుంటాడు. కాబట్టి, మనకు, ఎప్పుడూ ఏదో అందుకోవాలనే ఆరాటమే, వెతుకులాటే. ఏదో లోటు వున్నట్లుగానే మనం ఎప్పుడూ భావిస్తూ వుంటాం. అందుకని, మనలో వున్న ఆ శూన్యాన్ని నింపాలని ప్రయత్నిస్తాం. ఆ ఒంటరితనాన్ని, ఆ ఖాళీతనాన్ని, ఆ అలసిపోయిన, శక్తిని హరించివేస్తున్న, అర్ధవిహీనమైన బ్రతుకుని రకరకాల భావాలతో, సార్థకత్వాలతో నింపాలని ప్రయత్నిస్తాం. చిట్టచివరికైనా ఒక మార్పులేని, ఎప్పటికీ స్థిరంగా వుండిపోయే శాశ్వతమైన దానిని అందుకోవడంలో తృప్తి సాధించాలని కోరుకుంటాం. ఇక ఆ శాశ్వతమైన స్థితికి వేయి పేర్లు పెడతాం. దేవుడనీ, సమాధి అనీ యింకా అవీ యివీ; ఇంకా ఎన్ని కొత్త పేర్లయినా కని పెట్టచ్చు. అంతులేకుండా మనం వెతుక్కుంటూనే వుంటాం. ఎందుకు వెతుకుతున్నామో మనల్ని మనం ఎన్నడూ ప్రశ్నించుకోము. సుస్పష్టంగా కానవచ్చే సమాధానం ఏమిటంటే- మనం అసంతృప్తిగా వున్నాం, సంతోషంగా లేము, దౌర్భాగ్యకరమైన స్థితిలో, యితర్ల ప్రేమ అనేది ఎరగకుండా, భయపడుతూ వున్నాం. గట్టిగా పట్టుకొని వేలాడటానికి మనకి ఏదయినా కావాలి. మనకి రక్షణ యివ్వడానికి ఎవరయినా కావాలి- ఒక తండ్రి, ఒక తల్లో, ఎవరో ఒకరు. అందుకని మనం వెతుకుతూ వుంటాం. వెతుకుతూ వున్నప్పుడు ఏదో ఒకటి మనకు చిక్కకుండా వుండదు. దురదృష్టవశాత్తూ, వెతుకుతూవుంటే ఏదో ఒకటి మన చేతికి తప్పక దొరుకుతుంది.

కాబట్టి, ముఖ్యమైన విషయం ఏమిటంటే, వెతుక్కోకుండా వుండటం. అర్థమైందా మీకు? ఇంతకాలమూ మీకు వుపదేశించింది ఏమిటంటే- వెతుక్కుంటూ పొండి; సత్యంతో ప్రయోగాలు చేయండి; సత్యాన్ని అన్వేషించండి; దాని వెనకాల పడండి; వెంటాడండి; దానిని అందుకోడానికి పరుగెత్తండి; మిమ్మల్ని క్రమశిక్షణలో, అదుపు ఆజ్ఞల్లో పెట్టుకోండి అని. ఇప్పుడు యింకొకరు ప్రవేశించి “అవన్నీ చేయకండి, వెతకడం మానేయండి" అని అంటున్నారు. వెంటనే అతన్ని వెళ్ళిపొమ్మని చెప్పడమో, మీ ముఖాన్నీ మరో వైపుకి తిప్పుకోడమో సహజంగా మీలో నుంచి వచ్చే ప్రతిచర్య. లేదా, ఎందుకు అతను యీ విధంగా అంటున్నాడు అనేది మీ అంతట మీరే తెలుసుకోవడానికి ప్రయత్నించండి; ఆమోదించ వద్దు, నిరాకరించవదు; కానీ, ప్రశ్నించండి. అసలు మీరు వెతుకుతున్నది ఏమిటి?

మీ గురించి ప్రశ్నించుకొని శోధించండి. మీరు ఏదో వెతుకుతున్నారు. మీ జీవితంలో అంతర్గతంగా మీకేదో లోటుగా అనిపిస్తున్నది- ఒక రకమైన నేర్పు లేదని కాదు, వుద్యోగం చాలా చిన్నదనీ, డబ్బు ఎక్కువ లేదనీ- ఆ స్థాయిలో కాదు. మనం వెతుకుతున్నది అసలు ఏమిటి? మనం ఎందుకు వెతుకుతున్నామంటే, మన లోలోపల, మనకుటుంబం మీదా, సమాజం మీదా, సంస్కృతి మీదా, అసలు మన మీద మనకే విపరీతమైన అసంతృప్తిగా వుంది; మనల్ని ధ్వంసం చేస్తున్న, సతతం నమిలివేస్తున్న యీ అసంతుష్టిని తృప్తి పరచాలనీ, దానిని మించి ఆవలగా పోవాలనీ కోరుకుంటుంటాం. మనలోని యీ అసంతుష్టి దేనీకోసం? అసంతుష్టిని చాలో సులభంగా తృప్తి పరచవచ్చని నాకు తెలుసు. అసంతుష్టిలో పడిపోయిన ఒక యువకుడికి. అతను కమ్యునిస్టు అవచ్చు, విప్లవకారుడు కావచ్చు- మంచి ఉద్యోగం ఒకటి యిస్తే అన్నీ మరిచిపోతాడు. చక్కని యిల్లు యివ్వండి, మంచి కారు, అందమైన తోట, అంతస్తు యిస్తే అతనిలోని అసంతృప్తి ఆదృశ్యమవడం గమనిస్తారు. ఒక వేళ సిద్ధాంత పరమైన విజయం లభించినా కూడా అతనిలోని అసంతుష్టి అదృశ్య మవుతుంది. అయితే మీలో అసంతుష్టి ఎందుకు కలిగింది అనే ప్రశ్న మీరు ఎన్నడూ వేసుకోరు- అంటే చిన్న వుద్యోగాల్లో వుండి గొప్ప వుద్యోగాలు కాపాలనుకునేవారి గురించి కాదు యిది. సుఖమూ, దాని మొత్తం స్వరూపమూ, దాని అర్థమూ, దీని ద్వారా దుఃఖం గురించి పరీక్షించాలంటే ముందుగా అసంతుష్టికి మూలకారణం ఏమిటో తెలుసుకోపోలి.

సర్! చూడండి, పారశాల రోజుల నుంచి చనిపోయేవరకు పోల్చిచూడటంలోనే మన చదువు, మన నిబద్దీకరణం సాగుతాయి. మరొకరితో నన్ను నేను పోల్చిచూసుకుంటాను. మిమ్మల్ని మీరే జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తున్నది శ్రద్ధగా వింటూ, మీ మనసు ఎట్లా పనిచేస్తున్నదో పరికించండి. మీ మీద రెండు బాధ్యతలు వున్నాయి. వక్త చెప్తున్నది వినడమే కాకుండా, ఆ వింటున్నప్పుడు యదార్థంగా మీ మానసిక స్థితిగతులు ఏమిటో కూడా పరిశీలించాలి. అందుకని మీలో ఒక సావధానత వుండాలి. వక్తను గురించి, అతను చెప్తున్నదానిని గురించి కూడా ఎరుకగా వుండాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ వుండాలి. అయితే, మీరు కనుక యదార్థంగా వింటున్నట్లవుతే- అంటే అవగాహన చేసుకోవాలని ప్రయత్నించడం కాదు, వక్త వుపన్యసిస్తున్నదానిని మీకు అన్వయించుకోవడం కాదు, నిందించడం కాదు, సర్దుబాటు చేసుకోవడం కాదు, నిరాకరించడమో, అంగీకరించడమే కాదు- అట్లా వింటున్నప్పుడు వక్త అనే ఒకరు కానీ, మీరు కానీ లేనేలేరనీ, కేవలం వాస్తవం మాత్రమే, అంటే 'వున్నది' అనేది మాత్రమే వున్నదని మీరు తెలుసుకుంటారు. అదీ వినడం అనే కళ, వక్త చెప్పేది కానీ, మీ స్వంత అభిప్రాయాలను, నిర్ణయాలను కాని వినడం కాదు, 'యదార్ధంగా వున్నది' ని వినడం. మనం ఎప్పుడూ మరొకరితో మనల్ని పోల్చి చూసుకుంటూ వుంటాం. నేను మందకొడిగా కనుక వుంటే, బాగా చురుకైన వాడిని అవాలని కోరుకుంటాను. నేను కనుక వట్టి డొల్ల మనిషినవుతే గంభీరంగా అవాలనుకుంటాను; ఏమీ తెలియని అజ్ఞానినవుతే చాలా తెలివిగా వుండాలి, జ్ఞానం సంపాదించాలి అని కోరుకుంటాను. ఎప్పుడూ యితర్లతో నన్ను పోల్చి చూసుకుంటూ, యితరులతో పోల్చుకొని, నన్ను తూకం వేసుకుంటూ వుంటాను. వారి కారుని మించిన కారు, వారికంటే మంచి ఆహారం, వారిని మించిన యిల్లు, వారి కంటే మంచి ఆలోచనా విధానం, అట్లాగ. పోల్చి చూడటం అనేది సంఘర్షణను పెంచి పోషిస్తుంది. అసలు పోల్చిచూడటం ద్వారా అవగాహన కలుగుతుందా? రెండు సంగీత స్వరాలను, రెండు సూర్యాస్తమయాలను పోల్చి చూసినప్పుడు, ఒక వృక్షాన్ని మరో వృక్షంతో పోల్చి చూసినప్పుడు, వాటిలో ఒక్కటయినా అర్ధమవుతుందా? పోల్చి చూడటం అనేది ఏమాత్రం లేనప్పుడే ఒక విషయం మనకి అర్థమవుతుందా?

కాబట్టి, ఏ రకమైన పోల్చిచూడటమూ లేకుండా, మరొక వ్యక్తితో గాని, ఒక భావంతోగానీ, ఒక ఆదర్శ పురుషునితోకాని, ఒక దృష్టాంతంతోకాని పోల్చుకోవడానికి అనుగుణంగా మిమ్మల్ని సరిదిద్దుకోవడం అన్నది లేనేలేకుండా జీవించడం సాధ్యమేనా? ఎందుకంటే పోల్చిచూస్తున్నప్పుడు, 'యిక ముందు ఎట్లా వుండాలి' లేదా 'ఒకప్పుడు ఎట్లా వుండింది? అన్నదానితో పోల్చి మిమ్మల్ని తూకం వేసుకుంటున్నప్పుడు, యిప్పుడు 'వున్నది' ఏమిటో దానిని మీరు చూడటం లేదు. దయచేసి వినండి. ఇది చాలా సరళంగానే వుంటుంది. అందువల్లనే, అతిచాతుర్యమూ, అతి జిత్తుల మారితనమూ వున్న మీకు బహుశ అది అందకుండా పోతున్నది. ఏ రకమైన పోల్చిచూడటమూ లేకుండా యీ ప్రపంచంలో జీవించడం సాధ్యం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. సాధ్యంకాదు అని అనకండి. అసలు మీరెప్పుడూ ప్రయత్నించలేదు. 'నేను చేయలేను, అది అసాధ్యం; ఎందుకంటే పోల్చిచూడటం అనేది నా నిబద్దతలో ఒక ప్రధాన భాగం' అని మీరు అనరు. తరగతి గదిలో ఒక పిల్లవాడిని మరోక పిల్లవాడితో పోలుస్తారు. 'అతనంత తెలివిగా నీవు లేవు' అని అధ్యాపకుడు అంటాడు. “బి” అనేవాడిని ‘ఎ’ తో పోల్చినపుడు 'బి' ని అధ్యాపకుడు నాశనం చేస్తున్నాడన్నమాట. జీవితమంతా యిదే పద్ధతిలో కొనసాగుతూ వుంటుంది.

అభివృద్ధికి, అవగాహనకీ, మేధోపరమైన వికాసానికీ పోల్చిచూడటం అత్యావశ్యక మని మీరు అనుకుంటారు. కాని, అవసరం లేదు అని నాకనిపిస్తున్నది. ఒక చిత్రంతో మరొక చిత్రాన్ని పోల్చిచూస్తున్నప్పుడు ఏ ఒక్కదాన్నీ మీరు సరిగ్గా చూడటంలేదు. పోల్చడం లేనప్పుడు ఒక్కదానివంకే మీరు చూడగలుగుతారు. కాబట్టి, యిదే పద్దతిలో, మరొకరితో మిమ్మల్ని మానసిక పరంగా పోల్చిచూడటం అనేది జీవితంలో ఎప్పటికీ లేనేలేకుండా జీవించడం సాధ్యమేనా? రాముడితో కాని, గీతతోకాని, సీతతోకానీ, ఎవరితోనయినా సరే; నాయకుడితో, మీ దేవుళ్ళతో, మీ ఆదర్శాలతో బొత్తిగా పోల్చి చూసుకోకుండా వుండటం, పోల్చి చూడటం- ఏ స్థాయిలోనైనా సరే లేనేలేని మనసు బ్రహ్మాండమైన సామర్థ్యాన్ని, బ్రహ్మాండమైన సజీవత్వాన్ని పొందుతుంది. ఎందుకంటే అప్పుడది “వున్నది' ఏమిటి అన్నదానిని చూస్తుంటుంది కాబట్టి.

చూడండి, సర్! నేను ఒక డొల్ల మనిషిని. చాలా లోతైన స్వభావం, శక్తి సామర్ధ్యాలు, ప్రగాఢమైన ఆలోచనా శక్తీ, జీవన విధానమూ వున్నాయని పేరుపడిన ఒక వ్యక్తితో నన్ను పోల్చి చూసుకుంటాను. నేను డొల్ల మనిషిని, సంకుచిత బుద్ధి కలవాడిని, అల్పుడిని కాబట్టి ఆ వ్యక్తితో నన్ను నేను పోల్చుకుంటాను. అతనిలాగా వుండాలని అవస్థ పడతాను. అతనిలాగా వుండటం కోసం అతన్ని అనుకరిస్తాను, అతని మాటలు వుదహరిస్తూ వుంటాను, అతన్ని అనుసరిస్తాను. ఆ విధంగా నన్ను నేనే ధ్వంసం చేసుకుంటాను. ఈ ఘర్షణ అంతులేకుండా కొనసాగిపోతూనే వుంటుంది. అయితే, పోల్చిచూడటం అన్నది అసలు లేనేలేకపోతే నేను మందబుద్ధిని ఆని నాకు ఎట్లా తెలుస్తుంది? మీరు అన్నారు కాబట్టా? నేను ఒక వుద్యోగం సంపాదించుకోలేక పోయాను కనుకనో? పొరశాలలో సరిగ్గా చదువుకోలేదు కనుకనో? అసలు పోల్చి చూడటమే లేకుండాపోతే నేనొక మందబుద్ధిని అని నాకు అనిపిస్తుందా? అందువల్ల, నేను ఏమిటో అదే నేను. నేను ఒక స్థితిలో వున్నాను, అక్కడ నుండి కదలగలను, కొత్తవి కనిపెట్టగలను, మార్పు చెందగలను. కాని, మరొకరితో నన్ను నేను పోల్చు కుంటున్నప్పుడు జరిగే మార్పు మాత్రం పూర్తిగా కృత్రిమమైనది. దయచేసి యిదంతా శ్రద్ధగా వినండి, యిది మీ జీవితం. అంటే, పోల్చిచూడటం లేనప్పుడు 'వున్నది' వుంటుంది. అక్కడి నుంచి నేను కదులుతాను. జీవితంలోని ప్రాధమిక సూత్రాల్లో యిది ఒకటి. ఆధునిక జీవితం మనిషిని పోల్చిచూడటం, పోటీలు పడటం, అంతులేని పోరాటాలలో, యితరులతో కలహాలలో చిక్కుకొని పోవడం అనే నిబద్ధీకరణానికి లోను చేసింది. పోల్చిచూడటం లేనప్పుడే 'వున్నది' ని నేను చూడగలుతాను. కాబట్టి, పోల్చి చూడటం అన్నది వట్టి కుర్రతనపు వ్యవహారమని, అపరిపక్వతను సూచిస్తుందని నేను, మాటల్లోనే కాదు, యదార్ధంగానే అర్ధంచేసుకుంటాను.

సర్! ప్రేమ వున్న చోట పోల్చిచూడటం వుంటుందా? ఒకరిని మీరు మీ హృదయంతో, మీ మనసుతో, మీ శరీరంతో, మీ సంపూర్ణ అస్తిత్వంతో ప్రేమించి నప్పుడు, వారిని సొంతం చేసుకోవడం కాదు, వారిపై పెత్తనం చలాయించడం కాదు 'ఇదినాది' అనడం కాదు; అప్పుడు పోల్చి చూడటం అనేది వుంటుందా? పోల్చి చూడటం లేనప్పుడు మాత్రమే 'వున్నది' ని మీరు చూడగలుగుతారు. ఇది కనుక మనం అర్ధం చేసుకుంటే, అప్పుడు సుఖం యొక్క సమస్త స్వరూపం ఏమిటో తెలుసుకోవడం, తరచి శోధించడం మనం ఆరంభించవచ్చు. 'ఉన్నది' ని భవిష్యత్తు తోనే కాకుండా, జరిగిపోయిన గతంతో కూడా పోల్చిచూడకుండా వుండటం- దీనికి బ్రహ్మాండమైన సావధాన శీలత్వం అత్యావశ్యకం అవుతుంది. మీకు అర్థమైందా? నిన్న నాకు కొంత సుఖం లభించింది- యింద్రియాను భూతమైన సుఖం; అసాధారణమైన వెలుగును ప్రసరించిన ఒక భావం; కాంతితో పూర్తిగా నిండిపోయిన ఒక మేఘాన్ని నిన్న చూశాను; కానీ యివాళ దాన్ని నేను చూడలేక పోతున్నాను- అదీ నాకు మళ్ళీ కావాలి. కాబట్టి వర్తమానాన్ని, ఒకప్పుడు జరిగిన దానితో పోలుస్తాను. ఇకముందు ఎట్లా వుండాలి అన్నదానితో వర్తమానాన్ని పోల్చిచూడాలనుకుంటాను. ఈ పోల్చిచూడటం ద్వారా విలువగట్టడం అనేదాని నుంచి విముక్తం చెందాలంటే అఖండమైన తెలివితేటలు, సున్నితశీలత్వం అవసరం. తెలివి, సున్నితత్వం సంపూర్ణంగా వుండి తీరాలి. అప్పుడే 'వున్నది' ని అవగాహన చేసుకోగలుగుతారు. అప్పుడు మీలో గాఢోద్వేగం వున్నదని గ్రహిస్తారు. 'ఉన్నది' ని అందుకోవడానికి మీకు శక్తి వుంటుంది. అయితే 'వున్నది' ని 'జరిగినదాని' తోనూ, 'ఉండవలసినదానీ' తోనూ మీరు పోల్చి చూస్తుంటే ఆ శక్తిని మీరు పోగొట్టుకుంటారు.

సరే, యింతవరకు స్పష్టంగా వుందని ఆశిస్తాను. మేధాపరంగా కాదు, ఎందుకంటే దానివల్ల ఏమాత్రం లోభం వుండదు. అంతకంటే మీరు లేచి బయటకు వెళ్ళి పోవడం మంచిది. అయితే, నిజంగానే యిది మీకు అవగాహన అవుతే, అప్పుడు సుఖం వైపు సూటిగా చూడగలుగుతారు. అప్పుడు నిన్న పొందిన సుఖంతో దీనిని పోల్చిచూడరు. రేపు పొందబోయే సుఖంతో కూడా పోల్చిచూడరు. సుఖంకోసం వెతుక్కుంటున్న ఆ అసలు మనసును మీరు పరీక్షిస్తారు. సుఖం గురించిన యీ సూత్రాన్ని మనిషి అర్థం చేసుకోవాలి తప్ప, 'నాకు సుఖం కావాలి' అనకూడదు. మీకు సుఖం కావాలంటే బాధను కూడా స్వీకరించాలి. దానితో పాటు దుఃఖాన్ని కూడా, ఒకటి లేకుండా రెండోది పొందడానికి వీల్లేదు. ఏ రూపంలో వున్న సుఖాన్నయినా సరే వెతుక్కుంటున్నప్పుడు సంఘర్షణలతో కూడిన ప్రపంచాన్ని మీరు తయారు చేస్తున్నారు. 'నేను ఒక హిందువుని' అని మీరు అంటే- మనం తగిలించుకునే యితర పేర్ల చీటీలు కూడా మీకు తెలుసు. మీకు గొప్ప ప్రాముఖ్యం వున్నట్లు మీకు అనిపిస్తుంది. ఒక నదిని పూజిస్తుంటే తక్కిన నదులన్నింటినీ మీరు తృణీకరించినట్లుగా ఒక కుటుంబానికి చాలా గొప్ప ప్రాముఖ్యత వచ్చిందంటే తక్కిన కుటుంబాలన్నింటినీ తృణీకరించినట్లే. అందుకే కుటుంబాలే విపత్తులకు కారణం అవుతున్నాయి. ఒక వృక్షాన్నో, ఒక దేవుడినో మీరు పూజిస్తే తక్కిన వృక్షాలన్నింటినీ, దేవుళ్ళందరినీ తృణీకరించినట్లే లెక్క. ప్రస్తుతం అదే జరుగుతున్నది. మీ స్వంత, ప్రత్యేకమైన చిన్ని దేశాన్ని మీరు పూజిస్తుంటే, తక్కిన దేశాలన్నింటినీ మీరు తృణీకరించినట్లే. అప్పుడు మీరు కలహానికి తయారుగా వుంటారు; యుద్ధం చేయడానికీ, ఒకరి నొకరు చంపుకోడానికీ కూడా.

కాబట్టి సుఖం, దేవుళ్ళని పూజించడంలో, సత్యాన్ని అన్వేషించడంలో, 'నా దేశం', 'నా కుటుంబం', 'నా హోదా' అని అనడంలో కూరుకొనిపోయివుంది. వీటన్నింటిలోను కలిసిపోయివున్నది సుఖమే, ఈ సుఖమే చెప్పశక్యంకాని విపరీతాలను సృష్టిస్తున్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. తృణీకరించకూడదు. ఎందుకంటే, తృణీకరించిన క్షణంలోనే మీ చేతిని మీరే కత్తిరించి వేసుకున్నట్లవుతుంది, మీ కళ్ళను మీరే పొడుచుకున్నట్లవుతుంది. ఆ పైన అందమైన మేఘాన్నికాని, సుందరమైన స్త్రీనికానీ, చక్కని వృక్షాన్నికాని చూసే సుఖం లేకుండా చేసుకోవడం లాంటిది. కాబట్టి, సుఖం యొక్క అసాధారణమైన ప్రాముఖ్యాన్ని, సుఖం ఎట్లా కలుగుతుందో అన్నదానిని మనం అర్ధం చేసుకోపోలి, అది అర్ధం చేసుకున్నప్పుడు, సుఖం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుంటారు. అదేమిటో యిప్పుడు మనం చూద్దాం.

చూడండి, ప్రపంచంలోని మతాలన్నీ మీరు కోరికలు వుండకూడదని చెప్పాయి. ఆధ్యాత్మికులనబడే వారి సూక్తుల్లో ఒకటి ఏమిటంటే, కోరికలు లేకుండా వుండటానికి, నిష్కామంగా వుండటానికీ మీరు శతవిధాలా ప్రయత్నించాలి అని. అదంతా వట్టి మూర్ఖత్వం. ఎందుకంటే, ఏదయినా ఒకటి చూసీ చూసేలోపలే కోరిక మనలో కలుగుతుంది. కోరిక అనేది ఒక ప్రతిచర్య. ప్రకాశవంతమైన ఒక రంగుని చూసినప్పుడు, దానివైపు బాగా పరికించి చూడండి. మీకు తెలుసా, మహా సొందర్యవంతమైన వాటిలో రంగు ఒకటి. రంగు అంటే దైవం. దానివైపు చూడండి. 'నాకు ఎరుపు అంటే యిష్టం' అని కాని, 'నీలం యిష్టం' అని కాని అనకండీ, ఊరికే మేఘాల రంగుని గమనించండి. చీరె రంగుని, వసంతకాలంలో అప్పుడే చిగురించిన ఆకుల వర్ణాన్ని చూడండి. అట్లా చూసినప్పుడు, అందులో సుఖం ఏమీ లేదని, కేవలం సౌందర్యం మాత్రమే వున్నదనీ కని పెడతారు. సౌందర్యం ప్రేమ లాగానే కోరిక కాదు, సుఖమూ కాదు.

ఇప్పుడు యీ కోరిక అనే సమస్య సమస్తాన్నీ అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. నిజంగా చూస్తే యిది చాలా సరళంగా వుంటుంది. దీనిని గురించి మనుష్యులు ఎందుకంత గలభా చేస్తారో నాకు తెలియదు. అది ఎట్లా వూపిరి పోసుకుంటుందో మీరే చూడచ్చు. మొదట పరికించడం, ఆ తరువాత యింద్రియానుభూతి, పరిచయం, కోరుకోవడం. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇక సమస్య యిప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఆలోచన ప్రవేశించి, ఆ కోరికను గురించి తలపోస్తుంది. అదే సుఖంగా తయారవుతుంది. అంటే ఏమిటంటే- సర్! పెద్ద, లోతైన లోయలు వున్న ఒక అందమైన పర్వతాన్ని నేను చూస్తాను. మంచుతో కప్పుకొనిపోయి, పుషాకాంతిలో మెరిసిపోతూ, ఏకాంతంగా వున్న నిండైన వుజ్వల రమణీయ ప్రకాశం అది. దాన్ని నేను చూస్తాను. ఆపైన ఆలోచన యిట్లా అనడం మొదలు పెడుతుంది, 'ఎంత అందంగా వుంది! ఎల్లకాలం దీనినే చూస్తూ వుండిపోవాలని వుంది' అని. ఆలోచన అంటే స్మృతి మనం చూసినదానికి ప్రతిస్పందించడం- అది యిట్లా అంటుంది, 'నాకు అక్కడ నివసించాలని వుంది' అని. లేదూ ఒక అందమైన ముఖాన్ని నేను చూస్తాను. ఆ ముఖాన్ని గురించి ఆలోచిస్తాను. ఆపైన నిరంతరంగా దాన్ని గురించే ఆలోచించడం సుఖాన్ని యిస్తుంది. సెక్స్- మీరు అనుభవించిన ఆ సుఖం, దానిని గురించి, మీలోపల అది వదిలిన మనోబింబం గురించి మీరు ఆలోచిస్తూ వుంటారు. ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువ సుఖం మీకు. ఆ తరువాత కోరిక, ఆలోచన సుఖాన్ని కొనసాగించడాన్ని తీసుకువస్తుంది. ఇదంతా వివరంగా తెలుసుకుంటే చాలా సుకరంగా మీకు బోధపడుతుంది.

ఇప్పుడు, ఒకరు అడుగుతారు, 'కోరికను తాకకుండా వుండటం ఆలోచనకు సాధ్యమేనా' అని అర్థమవుతున్నదా? ఈ సమస్య మీది. సజీవత్వంతో, సొందర్యంతో తొణికిసలాడుతున్న అసాధారణమైన అందాన్ని చూసినప్పుడు, ఆలోచనను. అక్కడికి రానివ్వకూడదు. ఎందుకంటే ఆలోచన దానిని తాకిన క్షణమే, ఆలోచన పాతది కాబట్టి, ఆలోచన దానిని ఒక సుఖంలాగా వక్రీకరిస్తుంది. అందువల్ల సుఖంకోసమూ, మరింత మరింత సుఖం కోసమూ ఒత్తిడి బయలుదేరుతుంది. అది మనం యివ్వకపోతే సంఘర్షణ బయలుదేరుతుంది, భయం కలుగుతుంది. కాబట్టి, ఒక విషయంవైపు ఆలోచన లేకుండా చూడటం సాధ్యమేనా? అట్లా చూడాలంటే అఖండమైన సజీవత్వంతో మీరు వుండాలి, కదలలేని దుర్భలస్థితిలో కాదు. అయితే, మత బోధకులు, 'కదలిక లేని దుర్భల స్థితిలో పడివుండండి, పరమ సత్యాన్ని అందుకోవడానికి అవిటితనంతో రండి' అని మీతో అన్నారు. కానీ, అవిటితనంతో మీరు పరమసత్యాన్ని చేరుకోలేరు. సత్యాన్ని చూడాలంటే నిర్దుష్టత గల మనసు, ఏ వైకల్యాలూ లేని, సహజ స్వచ్చత్వంతో వుండే మనసు, గందరగోళంలో లేని, చిత్రహింసలకు లోనుకాని, స్వేచ్ఛగా వున్న మనసు కావాలి. అప్పుడే సత్యాన్ని చూడగలుగుతారు. ఒక చెట్టువైపు చూస్తున్నప్పుడు, స్పష్టంగా వున్న కళ్ళతో, ఏ మనోబింబమూ లేకుండా, చెట్టుని మీరు చూడాలి. ఆలోచన కోరిక గురించి ఆలోచించినప్పుడు - ఆలోచన నిరంతరం కోరిక గురించే ఆలోచిస్తుంది. అందులో అది సుఖాన్ని పొందుతుంది. ఆలోచన ఒక వస్తువుని గురించిన మనోబింబాన్ని సృష్టిస్తుంది. ఆ కాల్పనిక బింబాన్ని గురించి, ఆ చిహ్నాన్ని గురించి, ఆ బొమ్మని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూవుండటం సుఖానికి దారితీస్తుంది. చాలా అందమైన ఒక శిరస్సును చూస్తారు. దానివైపు బాగా పరికించి చూస్తారు. “ఇది చాలా అందమైన శిరస్సు, చక్కని తలకాయ, మంచి తలకట్టు వుంది” అని ఆలోచన ఉంటుంది. దాన్ని గురించి యింకా ఆలోచించడం ఆరంభిస్తుంది. అది చాలా సుఖంగా, సంతోషంగా అనిపిస్తుంది.

ఆలోచన లేకుండా ఒకదానిని చూడటం అంటే అర్ధం మీరు ఆలోచించడం మానివేయాలని కాదు. అసలు అంశం అది కాదు. కోరిక అంటే- చూడటం, యింద్రియానుభూతి చెందడం, పరిచయం అని తెలుసుకొని, కోరిక మధ్యలో ఆలోచన దూరి కల్పించుకున్నప్పుడు, మీలో ఆ ఎరుక వుండాలి. కోరిక పని చేసే ప్రక్రియ అంతటిని గురించీ, కోరిక కలిగిన ఆ క్షణంలోనే ఆలోచన దానిమీద పడి తొందర పెట్టడం గురించీ ఎరుకతో వుండాలి. దీనికి తెలివి తేటలే కాకుండా ఎరుకతో వుండవలసిన ఆవశ్యకత కూడా వున్నది. అంటే అపూర్వమైన సౌందర్యాన్ని కాని, అపూర్వమైన వికృత రూపాన్ని కొని చూసినప్పుడు ఎరుకగా వుండటం. అప్పుడు మనసు పోల్చి చూడదు. సౌందర్యం వికృతత్వం కాదు, వికృతత్వం సొందర్యం కాదు. కాబట్టి సుఖాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా దుఃఖాన్ని గురించి తరచి శోధించ వచ్చును.

దుఃఖం గురించి తెలుసుకోకుండా మీరు ఏం చేసినా సరే- అత్యున్నతమైన సాంఘిక హోదాను, అధికార హోదాను, ఆధ్యాత్మిక అంతస్తును, రాజకీయ హోదాను. దేన్ని అధిరోహించినా సరే- మీరు మాత్రం ఏదో విధంగా కీడు చేస్తూనే వుంటారు. మీ దేవుడు పేరు చెప్పుకొనో, మీ దేశం పేరు చెప్పుకొనో, మీ పార్టీ, మీ సమాజం, మీ సిద్దాంతాల పేరు చెప్పుకొనో కీడు చేస్తూనే వుంటారు. హానికారకులవుతారు మీరు. అందులో సందేహం లేదు.

సరే, దుఃఖం అంటే ఏమిటి? మళ్ళీ ఒకసారి 'వున్నది' ని చూడండి; 'ఏది వుండాలి' ని కాదు. ఎందుకంటే, మీరు బాగా అర్థంచేసుకొని వుంటే, పోల్చి చూడటం యిప్పుడు మానేసి వుంటారు. కేవలం 'వున్నది' ని మాత్రం చూస్తారు. అందువల్ల పరికించి చూడటానికి మీకు శక్తి వుంటుంది. పోల్చి చూడటంలో ఆ శక్తి వృధా అయిపోకుండా వుంటుంది. మానవుడికి వున్న సమస్యల్లో ఒకటి ఏమిటంటే శక్తి ఎట్లా వస్తుంది అనేది. నీచమైన, అల్పమైన మనుస్సులున్న యీ మతవాదులే మళ్ళీ, శక్తి కావాలంటే బ్రహ్మచర్యం అవలంబించాలి, శక్తి సంపాదించాలంటే మీరు ఆకలితో కృశించాలి, వుపవాసాలు చేయాలి, ఒక్క పూటే భోంచేయాలి, గోచీపాత ధరించాలి, పొద్దున రెండు గంటలకి లేవాలి, ప్రార్థనలు చేయాలి' - అని అన్నారు. ఇంతకంటే బుద్ధిహీనత మరొకటి లేదు. ఎందుకంటే యీ విధంగా చేసి మిమ్మల్ని మీరే ధ్వంసం చేసుకుంటున్నారు, మీ శక్తిని ధ్వంసం చేసుకుంటున్నారు. యదార్థమైన 'వున్నది' ని మీరు చూసినప్పుడు శక్తి వస్తుంది. అంటే అర్ధం పోల్చిచూడటంలో శక్తి వృథా అవడం లేదనమాట.

దుఃఖం అంటే ఏమిటి అని అడుగుతున్నాం. దుఃఖాన్ని జయించడానికి మానవుడు అనేక మార్గాలు అవలంబించాడు- పూజల ద్వారా, పారిపోవడం ద్వారా, త్రాగుడు ద్వారా, వినోదకాలక్షేపం ద్వారా ప్రయత్నాలు చేశాడు. అయితే దుఃఖం మాత్రం అట్లాగే వుండిపోయింది. దుఃఖాన్ని కూడా తక్కిన అన్నింటిలాగా అవగాహన చేసుకోవలసిందే. దానిని నిరాకరించకండీ, అణచిపెట్టకండి, దానిని తట్టుకోవడానికి ప్రయత్నించకండి; అర్ధం చేసుకోండి. అది ఏమిటో బాగా పరికించి చూడండి. దుఃఖం అంటే ఏమిటి? నేను మీకు చెప్పాలా? ప్రేమిస్తున్నానని మీరు అనుకుంటున్న వ్యక్తిని మీరు పోగొట్టుకుంటే దుఃఖం; పూర్తిగా, సంపూర్ణంగా సఫలత చెందలేక పోవడం దుఃఖం; అర్హత, అవకాశం మీకు దొరకనప్పుడు దుఃఖం; సఫలత చెందాలని మీరు కోరుకుంటూ, సాఫల్యం చెందడానికి ఏ మార్గమూ లేనప్పుడు దుఃఖం; మీ లోపల వున్న ఏమీలేని ఖాళీతనం, ఒంటరి తనం మీ ఎట్ట ఎదుట నిలబడి ప్రశ్నిస్తున్నప్పుడు దుఃఖం; ఇంకా తన మీద తనకే జాలి అనే బాధ కూడా దుఃఖంలో వుంటుంది. తన మీద తనే జాలిపడటం అంటే ఏమిటో మీకు తెలుసా? మిమ్మల్ని మీరే నిందించుకోవడం, మీకే తెలియకుండానో, ఒక్కొక్కసారి తెలిసి కూడా, మీ మీద మీరే సానుభూతి కురిపించుకోవడం. 'నేనిప్పుడున్న స్థితిలో, చుట్టు వున్న వాతావరణానికి విరుద్ధంగా ఏమీ చేయలేను' అని అనడం. మిమ్మల్ని మీరే ఒక పీడగా భావించుకోవడం, మీ పరిస్థితికి మీరే దిగులు చెందడం. అదే మీమీద మీరే జాలిపడటం అంటే స్వీయానుకంప. దుఃఖం ఆవిధంగా వుంటుంది.

దుఃఖాన్ని అర్థంచేసుకోవాలంటే మొదట యీ స్వీయ అనుకంప గురించి ఎరుక కలగాలి. దుఃఖానికున్న కారణాల్లో యిదీ ఒకటి. ఒక మనిషి చనిపోవడం వల్ల మీరు ఒక్కరే మిగిలినప్పుడు, మీరు ఎంతో ఒంటరిగా వున్నారు అనే స్పృహ మీకు కలుగుతుంది. ఒక మనిషి చనిపోవడం వల్ల డబ్బు, ఆదాయం ఏమీ లేక, మీకు భద్రత వుండదు. ఇతర్ల మీద ఆధారపడి జీవిస్తారు. ఆ పైన యిబ్బందుల గురించి చెప్పుకోవడం మొదలు పెడతారు, మీ మీద మీకే జాలి ఆరంభమవుతుంది. కాబట్టి, దుఃఖానికి వున్న కారణాల్లో ఒకటి స్వీయానుకంప; ఇది వాస్తవం; మీరు ఒంటరిగా వున్నారన్న వాస్తవంలాగే యిదీ ఒక వాస్తవం. 'ఉన్నది' అంటే యిదే. స్వీయాను కంపవైపు బాగా పరీక్షించి చూడండి. దానిని తట్టుకోవాలని ప్రయత్నం చేయకండి, నిరాకరించకండి, 'దీనితో నేను ఏం చేయాలి' అని అనకండి. వాస్తవం ఏమిటంటే స్వీయానుకంప వున్నది. వాస్తవం ఏమిటంటే మీరు ఒంటరిగా వున్నారు. ఆ వాస్తవం వైపు సూటిగా చూడగలరా? నిన్న మీ వద్ద డబ్బు వున్నప్పుడో, ఆ మనిషి వున్నప్పుడో, ఆ శక్తి సామర్ధ్యాలు వున్నప్పుడో- ఆది ఏదయినా సరే- అప్పుడు ఎంత బ్రహ్మాండమైన భద్రతలో వున్నారు అనేదానితో పోల్చి చూడకుండా, ఊరికే దానివైపు చూడండి. అప్పుడు స్వీయనుకంపకు ఏ మాత్రం స్థానం వుండదని గ్రహిస్తారు. అట్లాగని ఆ పరిస్థితిని వున్నదున్నట్లుగా మీరు స్వీకరించాలని కాదు.

దుఃఖానికి గల ఒక కారణం మనిషిలోని విపరీతమైన ఒంటరితనం. మీకు చాలామంది స్నేహితులు వుండవచ్చు. ఎంతోమంది దేవుళ్ళుండచ్చు. గొప్ప జ్ఞానం మీరు సంపాదించి వుండచ్చు, అంతూ పొంతూ లేకుండా రాజకీయాల గురించి కబుర్లు చెప్పుకుంటూ, అనేకమైన సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటూ వుండచ్చు-చాలా మంది రాజకీయ వేత్తలు కబుర్లతోనే కాలక్షేపం చేస్తుంటారు. అయినా కూడా యి ఒంటరితనం అట్లాగే వుండిపోతుంది. అందువల్ల జీవితానికి ఒక విశిష్టతను ఆపాదించేవి, మానవుడు ఒక అర్థాన్నీ, ఒక ప్రత్యేకతను కని పెడతాడు. ఇంకా ఒంటరితనం అట్లాగే మిగిలి పోతుందీ. ఆందుకని, పోల్చి చూడటం అనేది లేకుండా ఆ ఒంటరితనంవైపు బాగా పరికించి చూడగలరా? దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించకుండా, దానికో ముసుగు వేయాలనుకోకుండా, పారిపోవాలని ప్రయత్నించకుండా, వున్న దానిని వున్నట్లుగా చూడగలరా? అప్పుడు ఒంటరితనం పూర్తిగా విభిన్నమైన మరొకటిగా మారడం చూడగలుగుతారు.

మనిషి ఒంటరిగానే వుండాలి. కాని మనం ఒంటరిగా లేము. వేలకొద్దీ ప్రభావాలు, వేలకొద్దీ నిబద్ధీకరణాలు, మానసికమైన వారసత్వాలు, సిద్ధాంత ప్రచారాలు, సంస్కృతులు- యివన్నీ కలసి ఏర్పడగా వచ్చిన ఫలితమే మనం. మనం ఒంటరిగా లేము. అందువల్ల మనల్ని నకలు మనుష్యులని అనవచ్చు. ఒకరు ఒంటరిగా వున్నప్పుడు, సంపూర్ణమైన ఒంటరి తనంలో వున్నప్పుడు, వారికి ఒక కుటుంబం వుంటే వుండచ్చు గాక, కాని ఆ కుటుంబానికి చెందినవారుగా వారు వుండనప్పుడు, ఒక దేశానికి గాని, ఒక సంస్కృతికి గాని, ఒక ప్రత్యేకమైన నిబద్ధతకు గానీ చెందినవారుగా వుండనప్పుడు- తాము దేనితోనూ సంబంధంలేని వారం- ఏ తత్వంతోను, ఏ కార్యక్రమంతోను ఏ కుటుంబంతోను, ఏ దేశంతోను సంబంధంలేని వారం అనే భావం కలుగుతుంది. ఈ విధంగా పరిపూర్ణమైన ఒంటరితనంలో వున్నవారే సహజస్వచ్ఛత్వం గల అమాయకులుగా వుంటారు. ఈ అమాయకత్వమే మనసును దుఃఖం నుండి విముక్తం చేస్తుంది. దుఃఖంతో నిండిపోయిన మనసుకు ప్రేమ అంటే ఏమిటో ఎన్నటికీ తెలియదు. మీకు తెలుసా ప్రేమ అంటే ఏమిటో? పరిశీలించేవాడికి, పరిశీలిస్తున్న అంశానికీ మధ్యన స్థలం వున్నట్లవుతే ప్రేమ లేనట్లే.

స్థలం అంటే ఏమిటో మీకు తెలుసునా? మీకూ, ఆ చెట్టుకూ మధ్యన వున్న ఎడం, మీకూ, మీరు ఎట్లా వుండాలని అనుకుంటున్నారో దానికీ మధ్యన వున్న ఎడం. ఒక కేంద్రం- అంటే పరిశీలకుడు వున్నప్పుడు ఎడం అన్నది ఏర్పడుతుంది. అర్థమవుతున్నదా? ఒక విధంగా యిది చాలా సరళమైనదే; అయితే పోను పోను పరమ సంక్లిష్టంగా తయారవుతుంది. ముందు సరళంగా ఆరంభిద్దాం. ఈ వక్తముందు వున్న శబ్ద గ్రహణ యంత్రం (మైక్రోఫోను చూడండి. ఈ మైక్రోఫోను ఒక స్థలంలో వున్నది. అయితే మైక్రోఫోను కూడా కొంత చోటును సృష్టిస్తున్నది. నాలుగు గోడలతో వున్న ఒక యిల్లు వుంది. ఆ నాలుగు గోడల బయటనే కాకుండా, వాటి మధ్యన కూడా స్థలం వున్నది. అట్లాగే మీకు చెట్టుకు మధ్యన చోటు వున్నది. మీకు, మీ పొరుగువారికి మధ్యన, మీకు, మీ భార్యకు మధ్యన చోటు వున్నది. మీకు, మీ పొరుగువారికి మధ్యన, మీకు, మీ భార్యకో భర్తకో లేదూ యింకొకరికో మధ్యన యీ చోటు వున్నంతకాలం, యీ స్థలాన్ని తయారుచేస్తున్న ఒక కేంద్రం వున్నదని అర్థంచేసుకోవాలి. ఇదంతా అర్థం అవుతున్నదా? నక్షత్రాల వంక చూస్తున్నప్పుడు ఆ నక్షత్రాలను చూస్తున్న మీరు వుంటారు; ప్రకాశిస్తున్న నక్షత్రాలతో, స్వచ్ఛమైన చల్లని గాలితో కూడిన సాయంత్రపు రమణీయమైన ఆకాశమూ వుంటుంది. మీరు, అంటే పరిశీలకుడు, పరిశీలిస్తున్న అంశమూ వుంటాయి.

కాబట్టి, స్థలాన్ని సృష్టిస్తున్న కేంద్రం అంటే మీరే. ఒక చెట్టు వైపు మీరు చూస్తున్నప్పుడు, మీ గురించీ, ఆ చెట్టు గురించి మీలో ఒక మనోబింబం వుంటుంది, ఆ కాల్పనిక బింబమే చెట్టుని చూస్తున్న కేంద్రం. కాబట్టి మధ్యన ఒక ఎడం ఏర్పడుతున్నది. మేము చెప్పినట్లుగా యీ ఎడం లేనప్పుడే ప్రేమ వుంటుంది. అంటే పరిశీలకుడు తనకూ ఆ వృక్షానికీ మధ్యన సృష్టించే ఆ స్థలం లేనప్పుడు, మీ భార్యను గురించి మీకొక కాల్పనిక బింబం వుంటుంది. మీ భార్యకూ మీ గురించి ఒక కాల్పనిక బింబం వుటుంది. ఈ కాల్పనిక బింబాన్ని మీరు పది సంవత్సరాల పాటో, రెండు సంవత్సరాల పాటో లేదూ ఒక్క రోజులోనో, ఆమె సుఖాలతో, మీ సుఖాలతో, ఆమె అవమానాలతో, మీ అవమానాలతో నిర్మించుకుంటూ వచ్చారు. ఆమెని నసతో వేధించడం ద్వారా, పెత్తనం చలాయించడం ద్వారా, యింకా అటువంటి వాటి ద్వారా దానిని నిర్మించుకొచ్చారు. ఈ రెండు కాల్పనిక బింబాల మధ్యనున్న పరిచయాన్ని 'బాంధవ్యం' అంటున్నాం. ఏ కాల్పనిక బింబమూ లేనప్పుడే ప్రేమ వుంటుంది. అంటే అర్ధం ఎడం లేనప్పుడు అన్నమాట. ఇంద్రియ సంబంధమైన స్థలం కాదు; భౌతికమైన స్థలం కాదు; అంతర్గతమైన స్థలం వుండనప్పుడు ఎడం లేనప్పుడు సౌందర్యం వుంటుందే, ఆ విధంగా.

స్వీయాన్ని, అంటే తనని తాను పరిత్యజించడం అన్నది లేనప్పుడే ఎడం వుంటుంది. చూడండి, మీకు అవగాహన అవని విషయాలను గురించి మాట్లాడు తున్నాం. ఇంతకు ముందు ఎప్పుడూ మీరు యిది చేసి చూడలేదు. మీకు, మీ భార్యకూ మధ్యన వున్న, మీకూ ఆ వృక్షానికీ మధ్యన వున్న, మీకూ ఆ నక్షత్రాలకో, ఆ ఆకాశానికో, మబ్బులకో మధ్యన వున్న స్థలాన్ని మీరెప్పుడూ తొలగించలేదు. మీరెప్పుడూ నిజంగా పరికించి చూడలేదు, సౌందర్యం అంటే ఏమిటో మీకు తెలియదు. ఎందుకంటే ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదు కాబట్టి, దాన్ని గురించి మాట్లాడతారు, దానిని గురించి రాస్తారు; కాని అదేమిటో మీకు తెలియనే తెలియదు. కాబట్టి ఆ అనుభూతిని మీరు పొందలేదు. బహు అరుదుగా ఎప్పుడైనా పొందారేమో. స్వీయాన్ని పరిత్యజించడం అనే ఆ సంపూర్ణమైన తన్మయత్వాన్ని. ఎందుకంటే స్వీయం అనే ఆ కేంద్రమే తన చుట్టూ తానే యీ స్థలాన్ని తయారుచేసుకుంటుంది. ఈ స్థలం వున్నంతవరకు ప్రేమ వుండదు, సౌందర్యమూ వుండదు. అందువల్లనే మన జీవితాలు యింత శూన్యంగా, యింత కరడుగట్టుకొని పోయి వున్నాయి.

మీరు రోజూ ఆఫీసుకి వెళ్తారు- ఎందుకో నాకు తెలియదు. “నేను వెళ్ళి తీరాలి, ఎందుకంటే నాకు బాధ్యతలున్నాయి, సంపాదించాలి. నా కుటుంబాన్ని పోషించాలి” అని మీరంటారు. ఏ పనైనా మీరు ఎందుకు చేసి తీరాలో నాకు తెలియదు. మీరు బానిసలు- అంతే. ఒక చెట్టుని చూస్తున్నప్పుడు గాని, ఎదుట కూర్చున్నవారి ముఖంవైపు చూస్తున్నప్పుడు గానీ, మీరు పరిశీలించి చూడనే చూడరు. ఒకవేళ ఆ ముఖంపైపు మీరు పరికించి చూసినా, ఒక కేంద్రం నుంచి చూస్తారు. ఈ కేంద్రం మీకు, ఆ వ్యక్తికి మధ్యన చోటును సృష్టిస్తుంది. ఆ ఎడాన్ని అధిగమించడానికి కొందరు ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. ఆ మత్తు మందులు తీసుకోవడం వల్ల మీ మనసు అసాధారణమైన సున్నితత్వాన్ని పొందుతుంది. ఒక రసాయనిక మార్పు జరుగుతుంది. ఆ తరువాత ఎడం పూర్తిగా మాయమవుతుంది. అయితే నేను అవి తీసుకున్నానని అనుకోకండి. (నవ్వులు). అవన్నీ కృత్రిమమైన పద్ధతులు. కాబట్టి యదార్ధమైనవి కావు. అవన్నీ క్షణికమైన సంతోషాన్నీ, తాత్కాలికమైన స్వర్గసుఖాన్నీ, క్షణికమైన ఆనందాన్నీ యిచ్చే సాధనాలు. ఆ రకంగా దానిని పొందడం సాధ్యంకాని విషయం.

కాబట్టి ప్రేమ, సౌందర్యం లేనప్పుడు సత్యం వుండదు. మీ మహాత్ములు, మీ దేవుళ్ళు, మీ మతాచార్యులు, మీ గ్రంధాలు యిది వొప్పుకోరు. అందువల్లే మీరింత దుఃఖావస్థలో వున్నారు. ప్రేమను గురించి కంటే గీత గురించో, ఖురాన్ గురించో, బైబిల్ గురించో మీరు మాట్లాడాలనుకుంటారు. దీనికి అర్ధం ఏమిటంటే మురికి వీధులని, పరమ ఛండాలాన్ని, దారి పొడుగున వున్న రోతనీ చూసి కూడా మీరు సహిస్తూ వుంటారు. మురికికి మీ సహకారం అందిస్తారు. ఎప్పుడు సహకరించకుండా వుండాలో మీకు తెలియదు. ఈ వ్యవస్థకు మీ సహకారం అందిస్తారు. “లేదు, నేను సహకరించను, ఏది ఏమయినా సరే నేను లెక్క చేయను” అని ఎప్పుడనాలో మీకు తెలియదు. ఆ మాట మీరు అన్నారంటే మీలో ప్రేమ పుండబట్టి, మీలో సౌందర్యం వుండబట్టి. మీరు తిరగబడటం కాదు దానికి కారణం. అప్పుడు మీకు తెలుస్తుంది, మీలో యిది వున్నప్పుడు సౌందర్యం, ప్రేమ వుంటాయని. అప్పుడు 'వున్నది ఏది' అన్న పరిగ్రాహ్యత వుంటుంది. అదే ప్రేమ, అప్పుడు మనసు అప్రమేయంగా (కొలతల్లో చూపలేనంతగా) తనని మించి ఆవలగా పోగలుగుతుంది.

కాని, మీకు పనులు వున్నాయి. ప్రతి రోజూ ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఒక తుఫానులాగా పని చేసి తీరాలి. కష్టపడాలి. కాని యిది ప్రేమని సాధించడం లేదు. ఎందుకంటే వినయాన్ని ఎట్లా సంపాదించలేరో అట్లాగే ప్రేమను కూడా సాధించి అందుకోలేరు. గర్విష్టి మనిషే మాటల్లో వినయాన్ని సాధిస్తాడు. అయితే అతను గర్విష్టిగానే మిగిలిపోతాడు. వినయం లాగే ప్రేమనీ కూడా అలవర్చుకోలేము. సౌందర్యాన్నీ అలవర్చుకోలేము. ఎరుకగా లేకుండా సత్యాన్ని చూడటం సాధ్యం కాదు. మీరు ఎరుకగా వుంటే- ఏదో నిగూఢ తత్వం గురించి కాకుండా మీరు చేస్తున్న దానిని గురించి, మీరు ఎట్లా అగుపిస్తారు, ఎట్లా నడుస్తారు, ఎట్లాతింటారు, దేనిని గురించి మాట్లాడతారు అనే ఎరుక వుంటే, అప్పుడు ఆ ఎరుక ద్వారా సుఖం యొక్క, కోరిక యొక్క, దుఃఖం యొక్క స్వభావలక్షణం, మనిషిలో వున్న విపరీతమైన వొంటరితనమూ, ఏమీ తోచకపోవడమూ గ్రహించడం మొదలు పెడతారు. అప్పుడు 'స్థలం' అని మనం అంటున్నదానిని చూడటం ఆరంభిస్తారు. ఎక్కడయితే మీకు మీరు చూస్తున్న వస్తువుకు మధ్యన ఎడం వుంటుందో అక్కడ ప్రేమ లేదని మీరు గ్రహిస్తారు.

ప్రేమ లేనప్పుడు మీరు ఏం చేసినా సరే- సంస్కరణలు చేయండి, ఒక కొత్త సాంఘిక క్రమాన్ని తీసుకొని రండి, సైద్ధాంతికమైన అభ్యుదయాన్ని గురించి అంతులేకుండా మాట్లాడండి అవన్నీ బాధలకే దారితీస్తాయి. ఇక యిప్పుడు అంతా మీ చేతుల్లోనే వుంది. నాయకులు లేరు, గురువులు లేరు; మీరు ఏం చేయాలో చెప్పడానికి ఎవరూ లేరు. మీకు మీరే వెలుగును చూపించుకునే దీపం కావాలి. కాబట్టి, మీరు వొంటరిగా వున్నారు. మతిభ్రష్టం పొందిన, దౌర్జన్య పూరితమైన యీ ప్రపంచంలో మీరు వొంటరిగా వున్నారు. అందుకనే యీ సిద్ధాంతాల ఎడారిలో మీరు ఒక ఒయాసిస్ అవాలి. ఈ ఒయాసిస్ ప్రేమ వున్నప్పుడే ప్రాణం పోసుకుంటుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVII వాల్యూమ్,

నాల్గవ ప్రసంగం, బొంబాయి, 1967