కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/తనని తాను తెలుసుకోవడం లేకుండా ధ్యానం వుండదు
తనని తాను తెలుసుకోవడం లేకుండా ధ్యానం వుండదు
మనం క్రిందటిసారి యిక్కడ కలుసుకున్నప్పుడు సంపూర్ణమైన విప్లవం ఒకటి-అంతర్గతమైనదీ, బాహ్యమైనదీ కూడా అయిన ఒక విప్లవం- రావలసిన అవసరం గురించి మాట్లాడుకున్నాం. ప్రపంచంలో శాంతి వుండాలంటే క్రమత- బయటవుండే క్రమతే కాకుండా, అంతకంటే ముఖ్యంగా అంతర్గతంగా క్రమత- ఆవశ్యకమని మేము చెప్పాము. ఈ క్రమత అంటే రోజూ వరుసగా ఒకటే పనులు చేయడం వంటిది. కాదు. క్రమత సజీవమైనది; కేవలం మేధతోను, సిద్ధాంతాలతోను, ప్రవర్తనను రకరకాల నిర్బంధాలకు లోను చేయడం ద్వారాను క్రమతను తీసుకొనిపోవడం సాధ్యంకాదు. పాతదే అయిన ఆలోచన, గతంలో అది ఏర్పరుచుకున్న నమూనాలో తప్ప పనిచేయలేదని కూడా మేము చెప్పాము. ఆలోచన ఎప్పుడూ పాతదే అయివుంటుంది. క్రమతను తీసుకొని రావడం ఆలోచనవల్ల సాధ్యంకాదు, ఎందుకంటే మేము యిప్పుడే చెప్పినట్లుగా క్రమత సజీవమైనది. పైగా యీ ప్రపంచంలో క్రమరాహిత్యాన్ని తీసుకొచ్చిందే ఆలోచన, అదంతా మనం చాలావరకు వివరంగా మాట్లాడుకున్నామనే అనుకుంటున్నాను. క్రమత అంటే ఏమిటి అని కాకుండా క్రమరాహిత్యాన్ని కలిగించేది ఏమిటో మనం చర్చించాలి అని కూడా మేము అన్నాం. ఎందుకంటే క్రమరాహిత్యం అంటే ఏమిటి అన్నది అవగాహన చేసుకోగానే, గ్రహించగానే, కేవలం మేధాపరంగా కాదు, యదార్ధంగా క్రమరాహిత్యపు సమస్త స్వరూపాన్ని చూడగానే- అప్పుడు క్రమరాహిత్యం గురించిన ఆ సంపూర్ణమైన అవగాహనలోనుండి క్రమత జన్మిస్తుంది.
ఇది అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం; ఎందుకంటే మనలో చాలామంది చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుండటం ద్వారా క్రమతను సాధించవచ్చని అనుకుంటారు; నలభై ఏళ్ళపాటు ఒకే ఆఫీసుకి వెళ్ళగలిగితే, ఒక యింజనీరుగా గానీ, ఒక శాస్త్రవేత్త గాగానీ ఒకే పద్దతిలో పని చేస్తుంటే క్రమతను తీసుకొచ్చినట్లు అని మనం అనుకుంటాం. కానీ ప్రతిరోజూ ఒకే వరుస క్రమంలో పనులు చేయడంకాదు క్రమత అంటే. ఈ వరుస కార్యక్రమమే అస్తవ్యస్తతకు దారితీసింది. బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా అస్తవ్యస్తత వున్నది. అందులో ఏ సందేహమూ లేదు, అంతటా పరచుకున్న అల్లకల్లోలం వున్నదీ, బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా ఈ అల్లకల్లోలంలో నుంచి బయట పడే మార్గం కోసం మనిషి తడుముకుంటున్నాడు, చేతులెత్తి అర్ధిస్తున్నాడు, గొంతు చించుకొని అరుస్తున్నాడు, కొత్త నాయకులను వెతుక్కుంటున్నాడు. ఒక కొత్త నాయకుడు - రాజకీయనాయకుడు కాని, మతాధిపతి కాని దొరుకుతే అతన్ని అనుసరిస్తాడు. అంటే అర్థం, మనిషి యాంత్రికంగా అలవాటైన ఒక రోజువారీ కార్యక్రమాన్ని, ఒక ఆశయాన్నీ, ఒక పద్ధతిని అనుసరించడానికి సిద్ధంగా వుంటాడూ అని.
అయితే, యీ క్రమరాహిత్యం- అంటే అస్తవ్యస్తత ఎట్లా వచ్చింది అని కనుక పరిశీలిస్తే, ఎక్కడయితే ఆధిపత్యం, ముఖ్యంగా అంతర్గత ఆధిపత్యం వుంటుందో అక్కడ అస్తవ్యస్తత వున్నదని గ్రహిస్తాం. అంతర్గతమైన యింకొకరి ఆధిపత్యాన్ని బోధకుడిదో, గురువుదో, గ్రంధానిదో, మరొకరిదో- మనం అంగీకరిస్తాం. అంటే యింకొకరినీ. వారి నియమ సూత్రాలను, వారి బోధలను, వారి ఆజ్ఞలను, వారి ఆధిపత్యాన్ని ఒక యంత్రంలాగా అనుసరించడం ద్వారా మన లోపల క్రమతను తేగలుగుతామని ఆశపడతాం. శాంతి కావాలంటే క్షమత అవసరం. అయితే ఒక ఆధిపత్యం వెనకాల మనం పరుగులు పెట్టి, అనుసరించి సాధించిన క్రమత్వం వల్ల గందరగోళమే కలుగుతుంది. ప్రపంచంలో, ముఖ్యంగా యీ దేశంలో ఏం జరుగు తున్నదో మీరు పరిశీలించవచ్చు. ఇక్కడ యింకా ఆధిపత్యపు పరిపాలనే సాగుతున్నది. ఇక్కడ అంతర్గత ఆధిపత్యం, శాసించడం, మరొకరిని అనుసరించాలనే బలమైన కాంక్ష చాలా పటిష్టంగా వేళ్ళుతన్నుకొని వున్నాయి. ఇదంతా యిక్కడి సంప్రదాయంలోని, యిక్కడి సంస్కృతిలోని అంశం. అందువల్లనే యిక్కడ ఎన్నో చిన్నా, పెద్దా ఆశ్రమాలు వున్నాయి. ఇవన్నీ నిజంగా చూస్తే కాన్ సెంట్రేషన్ కేంపులు, అంటే మారణ శిబిరాలు. ఎందుకంటే అక్కడ మీరు చేయవలసినవాటి గురించి వాళ్ళు చాలా నిష్కర్షగా వుంటారు. ఆధ్యాత్మిక ఆచార్యులని అంటారే, వారిదే అక్కడ సర్వాధిపత్యం. తక్కిన కాన్ సెంట్రేషన్ కేంపుల్లోలాగే యిక్కడా మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తారు. మిమ్మల్ని ఒక కొత్త చట్రంలో బిగించాలని ప్రయత్నిస్తారు. అభిప్రాయాలను మార్చడానికి, ఆలోచనా వైఖరిని మార్చడానికి, మనుష్యుల మీద ఒత్తిడి ప్రయోగించడానికీ రష్యాలోని కమ్యునిస్టులు, నియంతృత్వ ప్రభుత్వాలు కాన్ సెంట్రేషన్ కేంపులు (మారణ శిబిరాలు) నిర్మించాయి. సరిగ్గా అదే యిక్కడ కూడా జరుగుతున్నది. ప్రపంచంలో అల్లకల్లోలం ఎక్కువవుతున్న కొద్దీ ఆశ్రమాలు అనబడేవి కూడా ఎక్కువవుతుస్నాయి. ఇవి మీకొక అద్భుతమైన భవిష్యత్తుని ప్రసాదిస్తామని నమ్మిస్తూ, మనుష్యులని పూర్తిగా వక్రంగా తయారు చేయడానికి, ఒకే నమూనాలో అచ్చుపోయడానికి, ఒక ప్రత్యేకమైన వరవడిలోకి వారిని నిర్బంధించడానికి ప్రయత్నిస్తున్న కాన్సంట్రేషన్ కేంపులు. మూర్ఖులు యిదంతా నమ్ముతారు. తమకు భౌతికమైన భద్రత లభిస్తుంది కాబట్టి వీటన్నింటికీ అంగీకరిస్తారు. అక్కడి సర్వాధికారి, నియమ సూత్రాల బోధకుడు, గురువు ఏం చేస్తే మీరు ఖచ్చితంగా అదే చేయాలి. అయితే, యివన్నీ అందరూ ఎంత యిష్ట పూర్వకంగానే చేస్తుంటారు. ఎందుకంటే దీని ద్వారా స్వర్గమో, ఏదో ప్రాప్తిస్తుందనీ యీ లోపల యిక్కడి భౌతికమైన రక్షణ లభిస్తుందనీ, ఈ విధమైన యాంత్రిక విధేయత. అసలు విధేయత అంటేనే యాంత్రికం- విపరీతమైన అస్తవ్యస్తతను పెంచి పోషిస్తుంది. చరిత్ర పుటలు తిరగేసినా, జీవితంలో ప్రతినిత్యం జరుగుతున్న సంఘటనలు గమనించినా యిది మనం గ్రహించవచ్చు.
అందుకని, అస్తవ్యస్తత అంటే ఏమిటో తేట తెల్లంగా తెలుసుకోవాలంటే అస్తవ్యస్తతకు గల కారణాలేమిటో అవగాహన చేసుకోవాలి. ఇంకొకరెవరో విశ్వాస భరితంగా చెప్పిన మాటలు నమ్మి పరమసత్యాన్ని సాధించాలని పూనుకోవడమూ, అన్వేషించ బూనడమూ అస్తవ్యస్తస్థితికి గల ప్రధానకారణం. మనలో చాలామంది గందరగోళపు స్థితిలో వున్నారు కాబట్టి, మనలో చాలా మంది విపరీతమైన ఆందోళనలో వున్నారు కాబట్టి, సౌఖ్యవంతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని యిస్తాము, అని ఎవరైనా నమ్మకంగా చేస్తే, వారిని అనుసరించడానికి తయారవుతాం. ఇది చాలా విచిత్రమైన విషయం- రాజకీయాల్లో నిరంకుశత్వాన్నీ, నియంతృత్వాన్ని మనం వ్యతిరేకిస్తాం. అభ్యుదయ దృక్పధమూ, నాగరికతా ఎక్కువైన కొద్దీ, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎక్కువైనకొద్దీ, రాజకీయ, ఆర్ధిక రంగాలలో నిరంకుశత్వాన్నీ, నియంతృత్వాన్నీ నిరసించడం, ద్వేషించడం ఎక్కువవుతూవుంటుంది. అయితే, అంతర్గతంగా మరొకరి ఆధిపత్యాన్ని, మరొకరి నిరంకుశత్వాన్ని మాత్రం ఒప్పుకుంటారు. అంటే యింకొకరెవరో సత్యానికి దారి యిది అని ఒక సాధన మార్గాన్ని నిర్ణయిస్తే, దానికీ లొంగిపోయి అనుసరించడం కోసం మనసుల్ని మనం వక్రంగా చేసుకుంటాం, మన ఆలోచనల్ని వక్రంగా చేసుకుంటాం, మన జీవిత విధానాన్ని వక్రంగా చేసుకుంటాం. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనలోని నిర్దుష్టతను మనం ధ్వంసం చేసుకుంటున్నామన్నమాట. నిర్దుష్టతని అంటే కాంతిని మనంతట మనమే కనిపెట్టాలి తప్ప యింకొకరి ద్వారాగానీ, ఒక గ్రంధం ద్వారాగానీ, ఒక మహాత్ముడి ద్వారా గానీ కాదు. ఈ మహాత్ములంతా సాధారణంగా వక్రబుద్ధిగల మనుష్యులై వుంటారు. చూసేవారికి చాలా నిరాడంబరంగా కనబడే వారి జీవీతాలు అందర్నీ విస్మయపరుస్తాయి. కానీ, వారి మనసులు మాత్రం వంకర తిరిగి వుంటాయి. వాళ్ళ దృష్టిలో పరమసత్యం అనీ అనుకుంటున్నదానిని వాళ్ళే తయారు చేసి పెడుతుంటారు.
అయితే, అస్తవ్యస్తతను పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే, ఆధిపత్యం యొక్క సమస్త స్వరూపాన్ని, అంతర్గతంగా వుండేదానినీ, బాహ్యంగా వుండే దానిని కూడా అవగాహన చేసుకోవాలి. బాహ్య ప్రపంచంలో వుండే ఆధిపత్యాన్ని మనం కాదనలేము. అది అవసరం కూడా. ఏ నాగరిక సమాజంలోనైనా అది అవసరమే. అయితే మేము మాట్లాడుతున్నది యింకొక మనిషి ఆధిపత్యం గురించి. అంటే, అందులో యీ వక్త ఆధిపత్యం కూడా వుంటుంది. మనమంతా యీ సమాజంలోని వారమే కాబట్టి, మనలో ప్రతి ఒక్కరం కలిగించే అస్తవ్యస్తతను అర్ధం చేసుకుంటే తప్ప క్రమతను సాధించలేము. మనమే యీ సమాజ స్వరూపాన్ని నిర్మించాము, యీ సమాజంలోనే మనం చిక్కుకొని పోయాం. జంతువుల నుండి సంక్రమించిన జంతులక్షణాలకు వారసులమైన మనం, మానవజాతికి చెందిన మనం, మనుష్య ధర్మంగా కాంతిని, క్రమతను కనిపెట్టాలి. అయితే యీ కాంతినీ, క్రమతనూ లేదా అవగాహనను ఎవరో మరొక మనిషి ద్వారా కనిపెట్టలేము. ఆ మనిషి ఎవరయినా సరే- ఎందుకంటే యింకొక మనిషి అనుభవాలు బూటకమై వుండచ్చు. అన్ని అనుభవాలనూ ప్రశ్నించి తీరాలి. అవి మీవయినా సరే, మరొకరివైనా సరే; అనుభవం అంటే స్మృతులను మూటగట్టుకొని అవే కొనసాగించు కుంటూ వుండటం, ఒక స్పందనకు మనం యిచ్చే ప్రతిస్పందనను తమ నిబద్ధీకరణను బట్టి స్మృతులు మార్చి వేస్తూ వుంటాయి. అంటే- అనుభవం కలగడం అంటే ఒక స్పందనకు ప్రతిస్పందించడం, అవునా కాదా?
అనుభవం మన వెనకటి నేపధ్యాన్ని అనుసరించే ప్రతిస్పందించగలదు. మీరు ఒక హిందువో, ముస్లిమో, క్రిస్టియనో అవుతే ఆయా మతాలు మిమ్మల్ని నిబద్ధుల్ని తత్వం చేస్తాయి. మీ మీ సంస్కృతులు మిమ్మల్ని నిబద్ధీకృతులని చేస్తాయి; ఆ నేపధ్యమే మీ రకరకాల అనుభవాలను చిత్రిస్తుంది. మీ సామర్థ్యం, చాతుర్యం వుపయోగించి మీరు ఆ అనుభవాలకు వ్యాఖ్యానాలు కల్పించి చెబుతూ వుంటారు. పదిమందీ మిమ్మల్ని గౌరవిస్తూ వుంటారు. దీనితో పాటుగా వుండే ఆ తమాషా, అదంతా మీకు తెలుసు.
కాబట్టి, యింకొకరి అనుభవాన్నే కాకుండా, మన అనుభవాన్ని కూడా మనం ప్రశ్నించాలి, సందేహించాలి. చేతన సీమను విస్తృతం చేసుకోవడం కోసం కొత్త కొత్త అనుభవాలను వెతుక్కోవడం వివిధ రూపాల్లో వున్న మాదకద్రవ్యాల వాడకం ద్వారా యిది జరుగుతున్నది. ఇదంతా కూడా చేతనావర్తం లోపలనే జరుగుతుంది, కాబట్టి యిదంతా పరిమితులకు లోబడినదే. అందుకని, ఏ రకమైన అనుభవం కోసం అయినా-ముఖ్యంగా మతసంబంధమైనది అనీ, ఆధ్యాత్మిక సంబంధమైనది అనీ చెప్పుకొనేదాని కోసం- అన్వేషించేవారు ఆ అనుభవాన్ని ప్రశ్నించాలి, సందేహించాలి, అంతేకాకుండా దానిని పూర్తిగా త్రోసి పారేయాలి. చాలా స్పష్టంగా వున్న మనసుకు, సావధాన శీలత్వంతోను, ప్రేమతోను నిండివున్న మనసుకు యింకా ఏవో అనుభవాలు కావాలనే ఆరాటం ఎందుకుంటుంది?
సత్యం అనేదానిని రారమ్మని మనం పిలవలేము. రకరకాల పూజా ప్రార్ధనలు, ప్రాణాయామం, ఒక పరమసత్యాన్నీ, ఒక అనుభూతిని కనిపెట్టడం కోసం మనుష్యులు చేసే యింకా ఎన్నో గారడీలు- యివన్నీ ఎంతయినా మీరు నిత్యం అభ్యాసం చేస్తూ వుండండి. కానీ, సత్యాన్ని మాత్రం యీ విధంగా పిలిచి రప్పించలేరు. కొలతలకు లోబడినది రావచ్చేమో తప్ప, కొలతలకు అందని, ప్రమేయమైనది కాదు. నిబద్ధీకరణం చెందిన మనసుతో అవగాహన చేసుకోలేని ఆ సత్యాన్ని వెంటాడుతున్న వ్యక్తి బాహ్యంగానే కాకుండా, అంతర్గతంగా కూడా అస్తవ్యస్తతను పెంచిపోషిస్తాడు.
కాబట్టి ఆధిపత్యాన్ని పూర్తిగా త్రోసిరాజనవలసిందే. అయితే, అది చాలా కష్టసాధ్యమైన కార్యం. చిన్నతనం నుంచీ ఏదో ఒక ఆధిపత్యం మన మీద పెత్తనం చేస్తూ వస్తుంది. కుటుంబం, తల్లి దండ్రీ, పారశాల, అధ్యాపకుడు మొదలైనవారి ఆధిపత్యంలోనే మనం నడిచాం. శాస్త్రవేత్తలు, సాంకేతిక వైజ్ఞానికుడికీ తప్పకుండా ఆయా రంగాల్లో ఆధిపత్యం వుంటుంది. కానీ, ఆధ్యాత్మికమైన ఆధిపత్యం అనబడేది మాత్రం మహా దుర్మార్గమైనది. అదే క్రమరాహిత్యానికి గల ప్రధానకారణాల్లో ఒకటి. ఎందుకంటే అది ప్రపంచాన్ని రకరకాలైన మతాలుగాను, రకరకాలైన సిద్దాంతాలుగాను విభజించింది, కాబట్టి, మనస్సుని సమస్తమైన ఆధిపత్యాన్నుండి విడుదల చేయాలంటే తనంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే స్వీయజ్ఞానం. నేను చెప్తున్నది వున్నతంగా వుండే మరో జీవుడు లేదా ఆత్మని గురించి కాదు. అవన్నీ మనసు చేసిన కల్పనలు, ఆలోచన చేసిన కల్పనలు, భయంలో నుండి పుట్టుకొచ్చిన కల్పనలు. మనం మాట్లాడుకుంటున్నది స్వీయం జ్ఞానం గురించి; అంటే తను యదార్ధంగా ఏమిటో ఆ తనని తెలుసుకోవడం; తను ఎట్లా వుండాలి అనేది కాదు. తను బుద్ధి హీనుణ్ణని, తను భయపడుతున్నానని, తనకు చాలా ఆకాంక్షలున్నాయని, తను చాలా క్రూరుడినని, తనలో దౌర్జన్యం వున్నదని, అత్యాశ వున్నదని గ్రహించడం; తన ఆలోచనల వెనకాల వున్న వుద్దేశ్యాలు, తన చర్యల వెనకాల వున్న వుద్దేశ్యాలు గ్రహించడం. తనని తాను తెలుసుకోవడం ఆవిధంగా ఆరంభమవుతుంది. మీరు ఏమిటో మీకు తెలియకపోతే, మీ మానసిక ప్రక్రియలన్నీ ఎట్లా పనిచేస్తుంటాయో, మీరు ఎట్లా అనుభూతి చెందుతున్నారో, మీరు ఏమీ ఆలోచిస్తున్నారో, మీ వుద్దేశ్యాలు ఏమీటో, కొన్ని పనులు మీరు ఎందుకు చేస్తారో, కొన్ని ఎందుకు చేయకుండా తప్పించుకుంటారో, సుఖం కోసం, సంతోషం కోసం మీరు పడే ఆరాటం- యిదంతా కనుక ముఖ్యంగా మీరు తెలుసుకోకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకునే అవకాశం వుంది; మీకే కాదు, యితరులకి కూడా విపరీతమైన కీడు చేసే ప్రమాదం వుంది. ఈ ప్రాధమికమైన స్వీయజ్ఞానం కనుక లేకపోతే, ధ్యానం అనేదానికి ఆస్కారం లేదు. దానిని గురించి యిప్పుడు మాట్లాడబోతున్నాను.
చూడండి, ప్రపంచమంతటా యువతీయువకులు, పాతుకొనిపోయిన యీ వ్యవస్థను ప్రపంచాన్ని వికృతం గాను, ఘోరంగాను, అల్లకల్లోలంగాను తయారుచేసిన యీ వ్యవస్థను- త్రోసి పుచ్చుతున్నారు, దానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఎన్నో యుద్ధాలు జరిగినై. ఒక్క వుద్యోగం కోసం వేలమంది పోటీపడుతున్నారు. పాత తరానికి చెందినవాళ్ళు తమ ఆకాంక్షలు, తమ దురాశ, దౌర్జన్యం, తమ సిద్దాంతాలు ఆధారం చేసుకొని సమాజాన్ని నిర్మించారు. ఇప్పటి తరంవారు, ముఖ్యంగా యువత, సిద్దాంతాలన్నింటినీ త్రోసి అవతల పడేస్తున్నారు. బహుశ యీ దేశంలో అది జరగడం లేదేమో; ఎందుకంటే మనం యింకా అంత ఆధునాతనం అవలేదు, యింకా అంత నాగరీకం చెందలేదు, ఆధిపత్యాన్నంతటినీ త్రోసిపుచ్చేంతగా, అయితే, యీ సిద్ధాంతాలను తిరస్కరించిన వాళ్ళు మళ్ళీ తన కొత్త సిద్ధాంతాలతో యింకో పద్దతిని సృష్టిస్తున్నారు. పొడుగ్గా జుట్టు పెంచుకోవడం యింకా అటువంటివే మరికొన్నింటిని.
కాబట్టి, తిరుగుబాటు , చేయడంతో సమస్య పరిష్కారం కాదు. సమస్యకు సమాధానం ఏమిటంటే మనలోపల క్రమశీలతను తీసుకొనిరావడం- సజీవంగా వుండే క్రమతను; రోజువారీ కార్యక్రమం లాంటిది కాదు. రోజూ నిత్యకృత్యం లాగా చేయడ మనేది మృతప్రాయమైనది. కాలేజీ పరీక్షల్లో వుత్తీర్ణులయీ అవగానే- ఒక వుద్యోగం కనుక మీరు సంపాదించగలుగుతే, ఆఫీసుకు పోవడం మొదలు పెడతారు. ఇక ఆ తరువాత నలభై, యాభై సంవత్సరాలు వరుసగా ప్రతిరోజూ ఆఫీసుకు వెళుతూనే వుంటారు. అటువంటి మనస్సు ఏమయిపోతుందో మీకు తెలుసునా? ఒక దైనందిన కార్యక్రమాన్ని మీరు అలవాటు చేసుకున్నారు; అదే ప్రతీ రోజూ మళ్ళీ మళ్ళీ చేస్తూ వుంటారు. పిల్లల్ని కూడా యిటువంటి కార్యక్రమం ప్రతిరోజూ వరుసగా చేయమని ప్రోత్సహిస్తారు. సజీవంగా వున్న ఏ మనిషైనా దీనికి తిరగబడవలసిందే. కొని, "నాకు బాధ్యతలున్నాయి; నేనుండే పరిస్థితుల్లో యిష్టమున్నా లేకపోయినా యిది వదలలేను" అని మీరు అంటారు. ప్రపంచం యిట్లాగే నడుస్తూ వుంటుంది. విసుగెత్తేటట్లుగా చేసినదే చేయడం, మార్పులేని స్తబ్దత్వం, బొత్తిగా ఏమీ లేని ఖాళీతనం- వీటితో జీవితం సాగిపోతూ వుంటుంది. దీన్నంతటినీ వ్యతిరేకిస్తూ మనిషిలోని వివేకం తిరగబడుతున్నది.
అందువల్ల ఒక కొత్త సక్రమ వ్యవస్థ, ఒక కొత్త జీవిత విధానం వచ్చి తీరాలి. ఆ కొత్త క్రమత, కొత్త జీవితవిధానం రావాలంటే ప్రస్తుతం వున్న అస్తవ్యస్తతని అర్ధం చేసుకోవాలి నిరాకరించడం ద్వారానే అసలైనదానిని మీరు అర్ధంచేసుకోగలుగుతారు తప్ప, అసలైనదాని కోసం ఆరాటపడటం ద్వారా కాదు. సర్! మీకు అర్థమైందా? ప్రతికూలంగా వుండేదానిని తిరస్కరించినప్పుడు, త్రోసిపారేసి నప్పుడు; మానవులే సృష్టించిన సమస్తమైన సాంఘిక, ఆంతర్గత అస్తవ్యస్తతలన్నింటినీ మీరు అర్ధం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క మనిషి ఆకాంక్షల తోనూ, అత్యాశలతోనూ, యితరులలో ఆగ్రహద్వేషాలు రగిలిస్తూ, పోటీలు పడుతూ, హోదా కోసం తపిస్తూ, అధికారం కోసం, ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ వున్నంత కాలం అతడు అస్తవ్యస్తతను తయారు చేస్తూనే వుంటాడు అనేది అర్థం చేసు కున్నప్పుడు; అస్తవ్యస్తత యొక్క నిర్మాణ స్వరూపాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు- ఆ అర్ధం చేసుకోవడం అన్నదానిలో నుండే క్రమ శిక్షణ వుద్భవిస్తుంది. అణచి వుంచడం ద్వారా కలిగే క్రమశిక్షణ కాదు, అనుకరణ ద్వారా కలిగేదీ కాదు, నిరాకరణ ద్వారానే అసలైన, క్రమశిక్షణ కలుగుతుంది, అదే క్రమశీలత.
కాబట్టి, తనని తాను అవగాహన చేసుకోవడమే వివేకానికి ఆరంభం. వివేకం పుస్తకాల్లో వుండదు, అనుభవంలో వుండదు, మరొకరిని అనుసరించడంలో వుండదు, బోలెడు ధర్మపన్నాలు వల్లించడంలో వుండదు. తనని తాను అవగాహన చేసుకున్న మనస్సులో, ఆలోచన ఎట్లా పుడుతున్నది అనేది అవగాహన చేసుకున్న మనస్సులో వివేకం వుదయిస్తుంది. మీ రెప్పుడయినా ప్రశ్నించారా, అడిగారా, ఆలోచనకి ఆరంభం ఏమిటి అనీ, ఆలోచన ఎట్లా పుడుతున్నదీ అనీ, బాగా అర్ధం చేసుకోవలసిన చాలా ముఖ్య విషయం యిది. ఎందుకంటే ఆలోచనకు ఆరంభం ఏమిటి అన్నది అర్ధం చేసుకుంటే, అప్పుడు బహుశ మీరు, మునుపు జరిగినదానిని పునరుక్తి చేసుకోవడం అనే ఆలోచనల భారం లేని మనసును కనిపెట్టగలుగుతారు. మేము యింతకుముందు చెప్పినట్లుగా ఆలోచన ఎప్పుడూ పాతదే, ఆలోచన కొత్తది ఎప్పటికీ కాలేదు. మీ అంతట మీరు కనిపెడితే తప్ప ఇంకొకరు చెప్పినది చిలకపలుకుల్లాగా తిరిగి అనడం కాదు, ఆ యింకొకరు ఎంత గొప్పవారయినా సరే- ఆలోచనకు మొదలు ఏది, ఆకుపచ్చని చిగురాకును పైకి పంపే బీజం వంటిది ఏది అనేది మీ అంతట మీరే కనుక కనిపెట్టకపోతే నిన్న యొక్క పరిమితులనుండి దాటి ఆవలగా పోవడం మీకు సాధ్యంకాదు.
ఇక, ఆలోచన ఎట్లా ఆరంభం అవుతుందో తెలుసుకోవాలంటే, మీ గురించి మీకు అవగాహన వుండాలి. విశ్లేషణ చేయడం ద్వారా కాదు. విశ్లేషణకు సమయం పడుతుంది. ఉల్లిపాయ మీద ఒక్కొక్క పొర తీసినట్లు, విశ్లేషణ ద్వారా, అంతర్ వీక్షణ ద్వారా, పైకి లేచిన ఒక్కొక్క భావనను వెంటాడి, దాని వెనకాల వున్న కారణమేమిటో పరీక్షించి, మనల్ని అవగాహన చేసుకోవచ్చు అని అనుకుంటాం. కాని దీనంతటికీ సమయం పడుతుంది. అవగాహన చేసుకోవడానికి కాలంపైన ఆధారపడితే, కాలమే క్రమరాహిత్యాన్ని తయారు చేస్తుంది. కాబట్టి కాలం అంటే దుఃఖం. మీకు అర్థమైందా? మీలో నుంచి హింసను నెట్టివేయడానికి మీరు కాలాన్ని తీసుకుంటే, హింస నుండి విమోచనాన్ని ఒక లక్ష్యంగా ఒక ఆదర్శంగా మీరు నెలకొల్పుకుంటే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు కొంత సమయం వుండి తీరాలి; హింసకూ, హింసలేని స్థితికీ మధ్యన వున్న దూరాన్ని మీరు ప్రయాణం చేయాలి. హింసను వదిలించుకోవడానికి మీరు కొంత సమయం తీసుకుంటున్నప్పుడు, ఆ సమయంలో హింస అనే విత్తనాలు మీరు నాటుతునే వుంటారు. ఇదీ సందేహం లేని వాస్తవం. “కొండ శిఖరాన్ని చేరుకున్నాక, యిక ఆ పైన నేను ఏ ఆకాంక్ష పెట్టు కోను” అని మీలో మీరు కనుక అనుకుంటే, ఆకాంక్షపరుడిలో వుండే కర్కశత్వపు బీజాలను శిఖరాన్ని చేరుకునే యీ లోగా మీరు నాటుతున్నారన్నమాట. కాబట్టి తనని తాను అవగాహన చేసుకోవడం అన్నది కాలం మీద ఆధారపడి వుండదు; అది ఆ క్షణంలోనే జరగవలసినది. దాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం.
ప్రపంచం ప్రస్తుతం అల్లకల్లోలంగా వున్నదని మనం అంటున్నాం. యుద్ధాలు వున్నాయి, ఒకే రకమైన పనులు మళ్ళీ మళ్ళీ చేయడం, చర్చిలలో వుండే వ్యవహారాలు యివన్నీ ప్రపంచంలో చాలా అనర్థాలని కలిగించాయి. ఇవన్నీ యింకా కొనసాగు తుండటమే అస్తవ్యస్తత అని అంటున్నాను. క్రమతను తీసుకురావాలంటే అస్తవ్యస్తత నిర్మాణ స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి. ఈ అస్తవ్యస్త తలోని ప్రధాన అంశాల్లో ఒకటి ఏమిటంటే ఆధిపత్యం. భయం కారణంగా మనం ఆధిపత్యానికి తలవంచుతున్నాం. "నాకేమీ తెలియదు; మీకు తెలుసు; దయచేసి నాకు చెప్పండి" అనీ మీరు అంటారు. మీకు చెప్పగలిగినవారు ఎవ్వరూ లేరు. అది మీరు గ్రహించారంటే అప్పుడు ప్రతిదీ పూర్తిగా మీ అంతట మీరే తెలుసుకోవాలి, అంతర్గతంగా, మానసికంగా; మీకు సహాయం చేయడానికి అప్పుడిక ఏ నాయకుడూ వుండడు, గురువూ వుండడు, తత్వవేత్త వుండడు, ఏ మహాత్ముడు వుండడు. ఎందుకంటే వారంతా వ్యవహరిస్తూ వుండేది ఆలోచన స్థాయిలోనే కాబట్టి. ఆలోచన ఎప్పుడూ పాతదే. ఆలోచన ఏనాటికీ మార్గదర్శకత్వం చూపలేదు.
అందుకని, ఆలోచన యొక్క మూలాన్నీ, ఆరంభాన్ని మనం కనిపెట్టబోతున్నాం. ఇది చాలా ముఖ్యం. దయచేసి యిది శ్రద్ధగా వినండి. అయితే వట్టి శబ్దాలను కాదు. వినడం అంటే ఏమిటో మీకు తెలుసునా? నేర్చుకోవడం కోసం కాకుండా కేవలం వినాలి. నేర్చుకోవడం కోసం వినకండి, మీ స్వీయాన్ని పూర్తిగా వదిలివేసి వినండి. అప్పుడు నిజమేమిటో, బూటకం ఏమిటో మీకే తెలుస్తుంది. అంటే దాని అర్థం మీరు అంగీకరించడమూ లేదు, తిరస్కరించడమూ లేదు. అంటే మీ మనసు తెరచిపెట్టివున్న ఒక జల్లెడ వంటిదనీ, అందులో ఎన్నిపోసినా ఏవీ మిగలవనీ కాదు అర్థం. అందుకు పూర్తిగా విరుద్ధమైనది. మీరు వింటున్నారు కాబట్టి అపరిమితమైన సున్నితత్వంతో వుంటారు. ఆ కారణంగా అత్యంతమైన విమర్శన శీలత కలుగుతుంది. అయితే, మరొకరి ఆభిప్రాయానికి వ్యతిరేకంగా వున్న మీ అభిప్రాయం మీద మాత్రం మీ విమర్శనశీలత ఆధారపడివుండదు. అదంతా ఆలోచనా ప్రక్రియ చేసే పని. దయచేసి కారులు చేస్తున్న ఆ ధ్వనులను వింటున్నట్లుగా వినండి. ఇష్టంతోనూ కాదు, అయిష్టతతోనూ కాదు, పిల్లవాడు సుత్తితో దేనినో కొడుతున్న ఆ శబ్దాన్ని మాత్రమే వినండి, చిరాకు పడకుండా, మీ ధ్యాసను చెదిరిపోనీయకుండా. అంత సంపూర్ణంగా మీరు వింటున్నప్పుడు, మరింకేమీ చేయడానికి వుండదని తెలుసుకుంటారు. నది ఒడ్డు పై నిలబడి చూస్తున్నవారు మాత్రమే ప్రవాహంలోని సొందర్యం గురించి వూహాగానాలు చేస్తుంటారు. ఒడ్డును దిగి వారు ప్రవాహంలో అడుగు పెట్టాక, అప్పుడిక వూహాగానం వుండదు, అప్పుడు ఆలోచన వుండదు. కదలిక మాత్రమే వుంటుంది. ఇప్పుడు మేము వివరించ బోయేదానిని. అంటే ఆలోచన యొక్క మూలాన్ని, ఆరంభాన్ని - అర్ధంచేసుకోవాలంటే తనని తాను అర్థంచేసుకోవాలి. దీని అర్థం తనని గురించి తను నేర్చుకోవాలి అని. తనని గురించి సమాచారాన్ని ఆర్జించడమూ, తనని గురించి నేర్చుకుంటూవుండటమూ అన్నవి రెండూ రెండు భిన్న విషయాలు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించడం ద్వారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనడం ద్వారా మీ గురించి జ్ఞానాన్ని పోగుచేసుకోవచ్చును. ఈ తెలుసుకున్న దానినుండి, యీ నిలవ చేసుకున్నదాని నుండి మీరు చర్య తీసుకోవడం సాగిస్తారు. ఈ విధమైన చర్యలలో నుండి మరికొంత మీరు ఆర్జిస్తున్నారన్నమాట. అర్ధమైందా? మీరు తెలుసుకున్నది, మీరు పోగుచేసుకున్నది ఎప్పుడో గతంగా మారి పోయింది. పోగుచేసుకున్నదంతా గతంలోనిదే, ఆ గతం నుండి పరిశీలించడం మొదలు పెట్టి మరికొంత పోగు చేసుకుంటారు. అయితే నేర్చుకోవడం అన్నది మాత్రం పోగుచేసుకోవడం కాదు, నేర్చుకుంటూ వుండటం వుంటూనే వుంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఆ క్రియతో పాటుగా మీరు కదులుతుంటారు. కాబట్టి యీ నేర్చుకోవడంలో అడుగున మిగిలివుండే అవశేషం ఏమీ వుండదు. ఎప్పటికీ నేర్చుకుంటూ వుండటమే. నేర్చుకుంటూ వుండటం సకర్మకవర్తమాన క్రియా శబ్దం, కర్మణి వర్తమాన క్రియ కాదు. మనం నేర్చుకోబోతున్నాం, అయితే పోగుచేసి వుంచిన వాటినుండి కాదు. ఒక భాషని నేర్చుకుంటున్నప్పుడు పోగుచేసుకోవడం వుంటుంది. ఆ శబ్దాలన్నీ తెలుసుకోవాలి, రకరకాల క్రియా పదాలను నేర్చుకోవాలి, యింకా అటువంటివి ఎన్నో వుంటాయి. నేర్చుకున్న తరువాత వాటిని మీరు వుపయోగించడం మొదలు పెడతారు. అయితే యిక్కడ మాత్రం అట్లా కానేకాదు. ఒక అపాయాన్ని చూశారంటే తక్షణమే చర్య తీసుకుంటారు. ఒక కొండ శిఖరం మీద చిట్ట చివరి అంచు వంటి ప్రమాదాన్ని చేరుకోగానే తక్షణమే మీరు క్రియను చేస్తారు.
కాబట్టి, మనం యిప్పుడు చేయబోతున్నది ఏమిటంటే ఆలోచన యొక్క మూలాన్నీ, ఆలోచన యొక్క ఆరంభాన్ని కనిపెట్టడం, అవగాహన చేసుకోవడం. ఆ పని చేయాలంటే దానిని వినడం, దానితో పాటు పయనించడం అవసరం; అంటే అర్ధం మీ సావధానత్వాన్ని యివ్వాలి. మీరు గాఢంగా తరచి విచారణ చేస్తున్నప్పుడే సావధానంగా వుండటం సాధ్యమవుతుంది. అంటే తరచి విచారణ చేయడానికి మీరు నిజంగానే స్వేచ్ఛగా వున్నారని, ఎవరో చెప్పిన మాటలు మిమ్మల్ని బంధించి వుంచలేదని అర్థం.
సరే, ప్రాణికోటి అంతా జీవశక్తితో నిండివుంది. నిరంతరమైన కదలిక ఆది. ఈ జీవశక్తి తన కదలిక ద్వారా ఒక పద్ధతిని తయారుచేస్తుంది. ఇదంతా స్వీయరక్షణ, భద్రతల కోసం, అంటే ప్రాణాలతో బ్రతికి వుండటం- అనే దానికోసం జరుగుతుంది. జీవశక్తి, కదలిక, బ్రతికి వుండటం కోసం తయారు చేసుకున్న పద్దతిలో చిక్కుకొని పోవడం, ఆ వరవడిలోనే మళ్ళీ మళ్ళీ చేస్తూ వుండటం- యిదే ఆలోచనకు ఆరంభం. ఆలోచనే మనస్సు. శక్తి అంటే కదలిక. ప్రాణాలతో బ్రతికి వుండటం కోసం ఏర్పరుచుకున్న పద్దతిలో చిక్కుకు పోయిన ఆ కదలిక, సుఖపడటం, భయపడటం అనేవి మళ్ళీ మళ్ళీ చేస్తూ వుండటం ద్వారా బ్రతికి వుండటం- అదీ ఆలోచనకు ఆరంభం.
పోగు చేసుకున్న స్మృతులు, పోగు చేసుకున్న పద్ధతులు ప్రతి స్పందించడమే ఆలోచన. ఒక హిందువుగానో, ఒక ముస్లింగానో, పార్శీగా, క్రిస్టియనుగా, కమ్యునిస్టుగా, సోషలిస్టుగానో లేదా మరొకరిగానో మీరు చేస్తున్నది యిదే. ఒకే నమూనాలోని పద్దతుల్లోనే మనం పనిచేస్తుంటాం. ఒక పద్దతినే మళ్ళీ చేయడం అంటే ఆలోచన్లని పునరుక్తి చేయడం; మళ్ళీ మళ్ళీ అనేకసార్లు అదే చేయడం. ఒక హిందువుగానో, ముస్లింగానో, ఒక పార్శీగానో మీరు చేస్తున్నదీ అదే- హిందూ సంస్కృతి, ముస్లిం సంస్కృతి లేదా పార్శీ సంస్కృతీ అనే చట్రంలో బిగించుకొని పోయిన ఒక పద్ధతినీ, ఆంతరించి పోకుండా సజీవంగా వుంచడంకోసం, మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి లోపల నిజంగా జరుగుతున్నది యిదే. ఆలోచన ఎప్పుడూ ఒక పద్ధతిని స్థాపించుకుంటూ వుంటుంది. పాత పద్ధతి కనుక 'సరిపోకపోతే' మరో పద్ధతిని స్థాపించుకుంటుంది. పెట్టుబడిదారీ పద్దతి కనుక సవ్యంగా లేకపోతే, అప్పుడు కమ్యునిజమ్ బాగా పనిచేస్తుంది; అదీ ఆ కొత్త పద్ధతి. అట్లాగే హిందూమతమో, క్రైస్తవమతమో సౌకర్యంగా లేదనుకుంటే మరో కొత్త విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారు.
కాబట్టి, ఒక పద్ధతిని మళ్ళీ మళ్ళీ చేయడం అన్నది మెదడులోని కణాలను-అవి పదార్థం- వాటినే నిబద్దీకరణం చేసివేస్తున్నది. ఆలోచన కూడ పదార్థమే. ఇది మనకు మనమే నిరూపించుకోవచ్చు. ఇదీ మీరు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి, యీ వక్త చెపున్నాడని కాదు. దానికి ఏ మాత్రం విలువ యివ్వకండి. ఇది ఎట్లా వుంటుందంటే, బాగా ఆకలిగా వున్న మనిషితో భోజనం బ్రహ్మాండంగా రుచిగా వుంటుంది అని చెప్పి, అతను తినడానికి సిద్ధాంతాలను పెట్టినట్లుగా వుంటుంది. ఈ దేశంలో అదే జరుగుతున్నది. తినడానికి సిద్ధాంతాలను, ఆదర్శాలను మీకు పెడుతున్నారు. బౌద్ధ సిద్ధాంతం, హిందూ ఆదర్శం, శంకరాచార్య సిద్ధాంతం యింకా అటువంటివి. మీ మనసులు ఖాళీగా వున్నాయి కాబట్టి మాటలను మీకు ఆహారంగా పెడుతున్నారు. ఈ కారణంగా అస్తవ్యస్తత వున్నది. అందువల్ల యిదంతా త్రోసి అవతల పారేయాలి, కొత్తదానిని ఆరంభించడం కోసం. కొత్తగా ఆరంభించాలంటే ఆలోచన యొక్క సమస్త స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి. ఇక, యీ ఆలోచన స్వరూపాన్ని మీరు ఎప్పుడు అవగాహన చేసుకుంటారంటే, మీరు ఒక సజీవమైన స్రవంతి, కదలిక అని అర్థంచేసుకోవడం మొదలు పెట్టినప్పుడు. అర్ధంచేసుకోకపోతే ఆలోచన్లకు మరికొంత చేర్చి పెడతారు. అప్పుడది మృతప్రాయంగా అవుతుంది. సంస్కృతి అనే చట్రంలో మీరు ఒక సజీవమైన ప్రాణి. ఆ సంస్కృతి, సంప్రదాయం, ఆ ఆధిపత్యం మిమ్మల్ని పట్టి వుంచుతాయి. ఈ చట్రం లోపల వున్న చేతనలో అస్తవ్యస్తత వుంటుంది. ఈ ప్రక్రియ సమస్తాన్ని అవగాహన చేసుకొని, అంతకంటే యింకా చాలా ముందుకు పోవడమే- యిప్పుడు మనం అదే చేయబోతున్నాం. ధ్యానం.
ధ్యానం అంటే మంత్రాలను పునశ్చరణ చేసే సూత్రం కాదు, క్రమబద్ధంగా గాలి పీల్చడం కాదు, ఒక ప్రత్యేకమైన ఆసనం వేసుకొని కూర్చుని ఎరుకగా వుండటాన్ని అభ్యాసం చేయడంకానీ, సావధానత్వాన్నీ అభ్యాసం చేయడంకాని కాదు- యివన్నీ బొత్తిగా యాంత్రికమైన పనులు. మనం మాట్లాడుకుంటున్నది ఒక సజీవమైనదానిని గురించి. శతాబ్దాల తరబడి యీ యాంత్రికమైన వాటిని మీరు అభ్యాసం చేస్తూనే వున్నారు. వీటిని ఆచరించినవారు మరణించారు; వారు చూసిన మనోబింబాలన్నీ వారి గతం నుండి, వారి నిబద్ధీకరణం నుండి వారు దృశ్యీకరించుకున్నవి. కానీ మనం మాట్లాడుకుంటున్న ధ్యానం సజీవత్వంతో తొణికిసలాడుతుంటుంది; యాంత్రికమైన, పునశ్చరణ చేయడం వంటి, క్రమ శిక్షణా బద్ధమైన ధ్యానం కాదు. ధ్యానం అంటే ఏమిటో మీకు తెలిస్తే తప్ప మరణం అంటే ఏమిటో బాగా తెలిస్తే తప్ప- ఒక నూతన సంస్కృతి వుండదు, నూతనమైనది ఏదీ జన్మించదు.
చూడండి, సంస్కృతి అంటే చాలా అద్భుతమైనది. అయితే అది నిరంతరంగా మీరు మాట్లాడుతూవుండే మృత సంస్కృతి కాదు- భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి కాదు. అది ఎప్పుడో భూస్థాపితమై పోయింది, గతించి పోయింది, సమాప్తమై పోయింది. సజీవమైన సంస్కృతి అంటే యిప్పుడు యదార్థంగా జరుగుతున్నది ఏదో అది. ఈ గందరగోళం అంతటినీ, యీ గజిబిజి నంతటినీ, యీ దారుణ దుర్భరవేదన లన్నింటినీ పరిశీలించి చూసి, అందులో నుండి ఎదగడం, అందులోనుండి వికాసం చెందడం, అదీ సంస్కృతి అంటే. పోయిన మీ పూర్వీకుల వద్దకు తిరిగివెళ్ళడం కాదు.
కాబట్టి, ధ్యానం అంటే ఏమిటి అనే యీ ప్రశ్నకు సమాధానం కోసం మనం అందరం కలిసి అన్వేషించబోతున్నాం, మనందరం కలిసి ప్రయాణించబోతున్నాం. అయితే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం జరిగాక ఆ ప్రశ్నను మీరు అడగచ్చు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే తప్ప, మీ గురించి మీకు అవగాహన వుంటే తప్ప, ఎంతగా సాధ్యపడుతుందో అంతగా మిమ్మల్ని మీరు పరికించుకుంటే తప్ప, 'ధ్యానం అంటే ఏమిటి' అని మీరు అడగకూడదు. “మిమ్మల్ని మీరు పరికించుకోవడం” ఆ క్షణంలోనే జరిగిపోతుంది. ఆ క్షణంలోనే మీ సర్వస్వమూ విశదమవుతుంది, కాలం గడిచాక కాదు. ఒక చెట్టుని, ఒక పూవునీ, మీ పక్కనే వున్న ఒక మనిషిని మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. ఆ చెట్టు గురించి, ఆ మనిషి గురించి ఒక మనోబింబాన్ని మీరు కల్పించుకొని వుంటే మాత్రం ఆ చెట్టు యొక్క సర్వస్వాన్ని, మీ పక్కనే కూర్చున్న ఆ మనిషి యొక్క సమస్త సంపూర్ణత్వాన్ని మీరు చూడలేరు. అందులో సందేహం లేదు. మనోబింబం లేనప్పుడు మాత్రమే మీరు సంపూర్ణంగా చూడగలుగుతారు. ఈ మనోబింబం అంటే పరిశీలకుడు- ఒక కేంద్రం- అక్కడి నుండే మీరు పరిశీలిస్తుంటారు. ఒక కేంద్రం నుండి, అక్కడినుండి మీరు పరిశీలిస్తుంటే, పరిశీలకుడికీ, పరిశీలిస్తున్న అంశానికీ మధ్యన ఎడం వుంటుంది. నేను చెప్తున్న దానిమీద అంత విపరీతమైన శ్రద్ధ చూపనక్కరలేదు, మీ అంతట మీరే యిది పరిశీలించి తెలుసుకోవచ్చు. మీ భార్యని గురించో, మీ భర్తను గురించో, ఒక చెట్టును గురించో ఒక మనోబింబం మీరు కల్పన చేసుకొనివుంటే, ఆ మనోరూపమే దానిని చూస్తూ వున్న కేంద్రం. అప్పుడు పరిశీలకుడు, పరిశీలిస్తున్న అంశమూ విడివిడిగా వుంటాయి. ఇది అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనిని గురించి యింకా కొంత తెలుసుకుందాం.
మొట్టమొదట ఏకాగ్రతను గురించి వున్న అపభ్రమలను తొలగించుకుందాం. ధ్యానం చేసేవారు, ధ్యానం అధ్యయనం చేసే లేదా ధ్యానం బోధించే అధ్యాపకులు పదేపదే చెప్పే ప్రధమ సూక్తుల్లో యిది ఒకటి- ఏకాగ్రతను మీరు నేర్చుకోవాలి అని. అంటే, ఒక ఆలోచన మీదే కేంద్రీకరించడం, యితర ఆలోచనలను త్రోసిపారేసి, ఆ ఒకే ఒక ఆలోచన మీద మాత్రమే మనసును స్థిరంగా నిలపడం. ఇది చాలా మూర్ఖత్వం. ఎందుకంటే, అప్పుడు కొన్ని ఆలోచనలకు, మీరు నిరోధం చూపుతుంటారు. ఒక విషయం మీదే కేంద్రీకృతం చేయాలనే ఒత్తిడికీ, రకరకాలైన యితర విషయాల మీదకు పరుగు పెడుతున్న మీ మనసుకూ మధ్యలో యుద్ధం జరుగుతున్నదన్నమాట. అసలు మీరు చేయవలసినది ఆ ఒక్క ఆలోచన ఎడల సావధానత్వం కలిగి వుండటమే కాకుండా, మనసు ఎక్కడెక్కడ సంచరిస్తున్నదో దాని ఎడల, మనసులో జరిగే ప్రతి కదలిక ఎడల కూడా సంపూర్ణ సావధానత కలిగివుండటం. ఏ ఒక్క కదలికనూ నిరాకరించకుండా వున్నప్పుడే, “నా మనసు ఎక్కడెక్కడికో సంచారం పోతున్నది, నా మనసు పరధ్యానంగా వున్నది” అని మీరు అనకుండా వున్నప్పుడే, యిది సాధ్యమవు తుంది. పరధ్యాసగా వుండటం అన్నది లేనే లేదు. ఎందుకంటే, మనసు ఎక్కడికో సంచారానికి వెళ్ళి పోయిందంటే, అది ఆ మరొకదాని మీద ఆసక్తి చూపుతున్నదని సూచిస్తుంది.
కాబట్టి, అదుపు ఆజ్ఞల్లో వుంచడం అనే మొత్తం ప్రశ్నని మీరు అర్ధం చేసుకోవాలి. అయితే, దురదృష్టవశాత్తు సమయం సరిపోదు కాబట్టి యీ సాయంత్రం ఆ విషయాన్ని చర్చించలేము. మానవులం అనుకునే మనమంతా అదుపులో వుంచబడిన, నిర్జీవమైన వట్టి సత్వాలం. అయితే దీని అర్థం మనకి యిష్టమైనవి నిరాఘాటంగా చేసెయ్యాలని కాదు- నిజానికి యిది రహస్యంగా మనం చేస్తూనే వుంటాం. అయితే ప్రేమలోనే ఒక క్రమశిక్షణ కూడా వుంటుంది. అది ఏమిటో క్లుప్తంగా వివరిస్తాను.
ధ్యానం అంటే ఆలోచనలను అదుపులో పెట్టడం కాదు. ఆలోచనలను అదుపు చేసినపుడు ఆ ధ్యానం మనసులో సంఘర్షణను పెంచిపోషిస్తుంది. అయితే, యిప్పుడే మీకు విశదపరచినట్లుగా, మీరు కనుక ఆలోచన స్వరూపాన్ని, ఆలోచన పుట్టుకను అవగాహన చేసుకుంటే, అప్పుడు ఆలోచన మధ్యలో కల్పించుకోకుండా వుంటుంది. అందువల్ల, ఆలోచనకు వుండే స్థానం ఆలోచనకు వున్నది అని మీరు గ్రహిస్తారు-అంటే మీరు ఆఫీసుకి వెళ్ళాలి, మీ యింటికి మీరు తిరిగివెళ్ళాలి, ఒక భాష మాట్లాడాలి మొదలైనవి. అక్కడ ఆలోచన తన పనిని నిర్వహించాలి. అయితే, ఆలోచించడం అనే మొత్తం సంవిధానాన్ని అంతటినీ మీరు కనుక అవగాహన చేసుకుంటే, ఆ ఆలోచనా స్వరూపపు అవగాహనే దానిని క్రమశిక్షణలో వుంచుతుంది. ఇది అనుకరణ చేయడం కాదు, అణచివేయడం అసలే కాదు.
ఒక హిందువుగానో, ఒక ముస్లింగానో, పార్శీగానో, క్రిస్టియనుగానో, కేథలికగానో, కమ్యునిస్టుగానో ఒక నిర్ణీతమైన పద్ధతిలోనే కొనసాగుతూ వుండటానికి మెదడులోని కణాలు నిబద్ధీకరణం చెంది వున్నాయి, ఎన్నో శతాబ్దాలుగా మెదడు పొందిన యీ నిబద్దీకరణం వల్ల చేసినదే మళ్ళీ పునరుక్తి చేయడం అనే పద్ధతిలో మెదడు పడిపోయింది. అందువల్ల యీ మెదడు ఒక నిరంతరమైన విచారణకు మళ్ళీ తానే ప్రధానపాత్ర వహిస్తున్నది. వివరంగా చూస్తే మీరే స్వయంగా అది తెలుసుకుంటారు.
కాబట్టి, సమస్య ఏమిటంటే మెదడు కణాలలోనే అత్యంతమైన ప్రశాంతతను తీసుకొని రావాలి. అంటే, 'నేను' కు గుర్తింపు కోసం తాపత్రయపడటం, నేను భావాన్ని కొనసాగించుకోవడం మానాలి, అర్థమైందా మీకు? భౌతికమైన స్థాయిలో మనం బ్రతికి వుండాలి, మానసిక స్థాయిలో మృతి చెందాలి. మానసికమైన స్థాయిలో వేలాది నిన్నలు మరణించడం జరిగినప్పుడే మెదడులోని కణాలు నెమ్మదిని పొందగలుగుతాయి. అయితే యిది ఏదో ఒక వుపాయంతో ఆలోచనను ప్రభావితం చేయడం ద్వారా కాని, మంత్రాలు పునశ్చరణ చేయడం ద్వారా కానీ జరగదు. ఇవన్నీ పరిపక్వత లేకపోవడం వల్ల చేసే పనులు. ఆలోచన యొక్క సమస్తమైన కదలికలు అంటే మీరే- అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అప్పుడు మెదడులోని కణాలు అపూర్వమైన తీరులో ప్రశాంతమై పోతాయి; బాహ్య ప్రపంచంలో నుండి వచ్చే స్పందనలకు ప్రతిస్పందిస్తాయి తప్ప మరే యితర కదలికా వుండదు.
కాబట్టి, మెదడే నెమ్మదిగా వుండిపోవడం వలన మనసు సమస్తం సంపూర్ణ నిశ్శబ్దతను పొందుతుంది. అయితే యీ నిశ్శబ్దం ఒక సజీవమైన విషయం. ఇది ఒక గురువు ద్వారాగాని, పుస్తకం ద్వారాగాని, ఒక ఆశ్రమం ద్వారాగాని, నాయకుని ద్వారాగాని, ఒక ఆధిపత్యం వల్లగాని, ఒక మాదక ద్రవ్యం వల్లగాని కలిగిన ఫలితం కాదు. ఒక మాదక ద్రవ్యంగాని, ఒక రసాయనిక మత్తుమందు గాని తీసుకొని, మీ మనసును మీరు నెమ్మది పరచవచ్చు, లేదూ మిమ్మల్ని మీరే సమ్మోహపరచుకొనే పద్ధతి ద్వారా కూడా నెమ్మది సాధించవచ్చు. అయితే అది మనసు తనలోకి తాను గాఢంగా చూసుకోవడం వలన కలిగిన సజీవమైన నిశ్చలత్వం కాదు. ఇటువంటి నిశ్చలత్వం వల్ల మాత్రమే మనసు అత్యంతమైన సావధానత్వాన్ని, అత్యున్నతమైన సున్నితత్వాన్ని పొందుతుంది. అటువంటి మనసు మాత్రమే ప్రేమ అంటే ఏమిటో అవగాహన చేసుకోగలుగుతుంది. ప్రేమ అంటే కోరిక కాదు, సుఖం కాదు. మనకి వున్నవల్లా కోరికా, సుఖ సంతోషాలూ, దీన్నే మనం ప్రేమ అని అంటారు. 'నేను నా భార్యని ప్రేమిస్తాను', 'మా దేవుణ్ణి నేను ప్రేమిస్తాను' మొదలైనవి అంటూ వుంటాం. దీనంతటికీ వెనకాల వున్నది భయం, సుఖం, యింద్రియానుభూతి.
కాబట్టి, యిదంతా అర్ధం చేసుకొని, నిజంగా పరిశీలించినవారు, ముందుగా తమ లోపల క్రమతను తీసుకొనిరాగలుగుతారు. తన లోపల కనుక క్రమత వుంటే ప్రపంచంలో కూడా క్రమత వుంటుంది. మీలో ప్రతీ ఒక్కరూ కనుక నిజంగానే మీ లోపల క్రమశీలత్వాన్ని తీసుకొని రాగల్గుతే, ఒక సక్రమ జీవనం, ఒక నూతన సమాజం, ఒక నవ్య జీవితం మీకు సిద్ధిస్తుంది. అయితే అది చేయాలంటే పాత జీవితవిధానాలను మీరు నిర్మూలించాలి. పాత జీవిత విధానాలను పరిహరించడం మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. ఆ అవగాహనలోనే ప్రేమ వుత్పన్నమవుతుంది.
చూడండి, మనిషి అంతులేకుండా ప్రేమను గురించి మాట్లాడుతునే వున్నాడు; ఇరుగు పొరుగును ప్రేమించు, దైవాన్ని ప్రేమించు, దయగా వుండు. అయితే ప్రస్తుతం మీలో దయా లేదు, దాక్షిణ్యం లేదు. మీ ధ్యాసనంతా మీ మీదే ఎంతగా కేంద్రీకరించుకొని వుంటారంటే మీలో ప్రేమ అనేదే వుండదు. ప్రేమ లేనప్పుడు యిక వుండేది అంతా దుఃఖమే. కేవలం చిలక పలుకుల్లోగా మీరు వల్లించడానికి చెప్పిన సూక్తి కాదు యిది. ఇది మీరే గ్రహించాలి, మీరే కని పెట్టాలి. దానికోసం మీరు బాగా కృషి చేయాలి. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకుంటూ, నిర్విరామంగా, గాఢోద్వేగంతో కృషి చేయాలి. గాఢోద్వేగం అంటే కామం కాదు. గాఢోద్వేగం అంటే ఏమిటో తెలియని మనిషికి ప్రేమ అంటే ఏమిటో ఎన్నటికీ తెలియదు. సంపూర్ణమైన తన్మయత్వం అంటే స్వీయాన్ని పూర్తిగా పరిత్యజించడం వున్నప్పుడే ప్రేమ కలుగుతుంది. ప్రేమ మాత్రమే క్రమతను, ఒక నూతన సంస్కృతిని,ఒక క్రొత్త జీవన మార్గాన్ని తీసుకొని రాగలుగుతుంది.
ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVII వాల్యూమ్,
మూడవ ప్రసంగం, బొంబాయి, 1967