కువలయాశ్వచరిత్రము/ద్వితీయాశ్వాసము

శ్రీరస్తు

కువలయాశ్వచరిత్రము

ద్వితీయాశ్వాసము

క. శ్రీరమణీనందనరే, ఖారాజద్రూప వైరికైరవవల్లీ

సూరప్రతాప సవరము, నారాయణభూప కీర్తి నవ్యకలాపా!1

గీ. అవధరింపుము జైమిని కలపతంగ, కులపతంగంబు లిట్లని తెలుపఁ దొడఁగె

నంత నాసర్వసర్వంసహాధినాథ, జంభసంభేది యత్యంతసంభ్రమమున.2

గీ. ఒక్కనాఁ డంతిపురమున మదుట బిగువు, గబ్బిగుబ్బెతగము లూడిగములు సలుప

రాజవర్య పరా కజారమున దొరలు, గాచినా రని హెగ్గడికత్తె తెలుప.3

సీ. పచ్చకప్పురము సాఁబాలు గూర్చి కురంగమదమున గీఱునామంబు దిద్ది

యలరుటెత్తులరూపు వెలిసూపు వలిపెంపు జాళువాసరిగరుమాలు చుట్టి
మొలకవెన్నెలలబారులు దీరు కట్టాణి తెలిపాలకాయయెంటులు ధరించి
క్రొత్తముత్యపు మేలుకుట్టుఁ జీనాపట్టుఁ దళుకుబంగరుపూలదట్టిఁ బూని
పికిలిపూబంతి దంతపుఁబిడి కడాని, పోఁతయొఱ వంక మొలవంకి పొంకపఱచి
తమ్మిదోదుమ్మిజోదుసాదనలహరువు, వ్రాఁతపనిదుప్పటీవలివాటు వైచి.4

చ. ఉడిగపుటింతి కట్టెదుట నుంచినపావలు రాజసంబునం

దొడిగి మెఱుంగుటుంగరపుఁ దోరపుహీరపుమించుమంచుపైఁ
బడఁ దులకించు కల్వవిరిబుతులమించు మదాళిమాళిక
ల్బడి నిరువంక వైచు తెలిపావడదోపుల వీఁగిపోవఁగన్.5

చ. చెలువలు వీచు పూసురటిఁ జిందినతెమ్మెరల న్రుమాలు చుం

గులు గదలంగ వాఁడికొనగోరులసోఁకుల గబ్బిగుబ్బచా
యల గరుదాల్చు నిద్దఱు లతాంగులు మూఁపులఁ జేతులూఁదిరాఁ
జిలుకపటానితేరిదొర చెన్నున నంతిపురంబు వెల్వడెన్.6

క. సకియలు సాహోయనఁగా, నకలంకశశాంకమణిగణాంతఃప్రతిబిం

బకలాకలనాద్విగుణిత, సకలానుగవారమౌ హజారముఁ జేరెన్.7

గీ. చేరి జగజోతిమగరాతి చెక్కడంపుఁ , గలికినీలంపుమెట్ల సింగంపుగద్దె

నుడుతకాల్పట్టుజిగి యడ్డయొఱగుతోడి, సొగసు నిద్దంపుఁ బట్టుగద్దిగ వసించి.8

సీ. చెవిదండఁ జేరి నిల్చిన వ్రాయసమువారి ముదలకమ్మల కొప్పములు లిఖించి

దిక్కులనుండి యేతెంచు మన్నీలమంత్రులతోడ నుచితంపుఁబలుకు పలికి
సమయోచితముగ హాస్యము లొనర్చు విదూషకులదిక్కు మొలకనవ్వొలుకఁ జూచి
యవసరంబులవార లవధారనుచుఁ దెల్పఁ బొడఁగనివారి కింపులు వెలార్చి
సత్కవీంద్రులు రచియించి చదువు పద్య, సమితియం దోరపారలు చక్కదిద్ది
ప్రౌఢి గనిపింపఁజేయు భూపాలుకొలువు, ప్రజల కవ్వేళఁ గన్నులపండువయ్యె.9

చ. ఇటువలె నున్నవేళ ధరణీంద్రునిమ్రోలిక వేలనీల సం

ఘటితఖలీనలీన సుముఖచ్యుతఫేనవిరాజి తేజి యొ
క్కటి తుదివాగె పూని వెనుకం గొనిరా మునిరాజు వచ్చె న
చ్చటికిని గాలవుండు పరిషత్పరిషక్త మహాద్భుతంబుగన్.10

మ. జలజాప్తోపమతేజ మంజలిపుటీసంధానము న్సంభ్రమా

కలితోద్ధానము భక్తిపూర్వకనమస్కారంబు నామ్రేడితో
ద్గలితాంతసేతుతివారముం జలుప శిక్షాదక్షమై సభ్యవ
ర్యులకు న్నెయ్యము నింప సంయమివరేణ్యుం డొయ్యనం జేరినన్.11

క. ఎదురేగి శిరోగ్రము త, తృదయుగళము సోఁక నృపతి ప్రణమిల్లి ప్రియం

బొచనఁగ నర్ఘ్యాదికవిధి, నెద రంజిలఁజేసి వినయ మెసఁయఁగ ననియెన్.12

క. క్షేమమె కద భవదాశ్రవ, భూమి న్నీవారవారిపూర్త్యమిథస్సం

గ్రామారంభమృగేంద్ర, స్తోమంబులకెల్ల నోవిశుద్ధచరిత్రా!13

శా. స్వామీ మీసుముఖత్వమే కుశలవాచారీతిఁ గన్పించు నే

నా మీరాకకు నన్యకారణము గాన న్నన్ను ధన్యాత్మునిం
గా మోదంబునఁ జేయవచ్చితిరి తక్కన్వక్లు కామత్వ మి
ట్లేమేనున్న నుపేక్ష సేయకయ మౌనీ యానతీవే దయన్.14

సీ. ఐశ్వర్యగతిమీఁద నరుచి పుట్టినఁగాని బలహంత మీచెంత నిలువ వెఱచుఁ

జక్కఁదనంబుపైఁ జౌక దోఁచినఁగాని సురభామ మీసీమ చొరఁగ వెఱుచుఁ
దనపేరుమాత్రంబు కనరు వేసినఁ గాని హరిపట్టి మిము గిట్టి యరుగ వెఱచు
విబుధధామముమీఁద వెగటు గల్గినఁ గాని ననజారి మిముఁ జేరి చెనక వెఱచుఁ
గానఁ దావకనియమవిఘ్నంబు నడుగ, నలికెదనుగాని యోమౌని యట్టులేని
ఘోరమామకతూణీరగుప్తశాత, శరమునకు నొక్కచెరలాట నవధరింపు.15

లయాగ్రాహి. అంగజమదావహశిరోంగవనటత్సరిదభంగురతరంగఘనరంగపరిధారా

సంగతి మహీవలయముం గడఁక మీఱు నొకయంగగొనువేగ మెనయం గలిగి ఠేవన్
రంగు మెయిచందము మెఱుంగు మొగమంచము చెలంగ నునుగందము పొసంగ నిదిగో మీ
చెంగటనె నిల్చెను దురంగమము వచ్చినతెఱంగు నెఱుఁగంగఁ బలుకంగదవె మౌనీ.16

ఉ. నావుడు మోమున న్మొలకకన వ్వొలుకం దమవారిఁ జూచి యా

హా వినయంబు గంటిరిగదా యనుచుం దలయూఁచి యాగదీ
క్షావిధిమత్సమిత్సమితికర్షణకర్కశమైనకేల నా
భూవిభుమేను తట్టి మునిపుంగవుఁ డిట్లనియెం బ్రియంబునన్.17

ఉ. అంతటివాఁడ వౌదువె కదయ్య తలంపఁగ శత్రుజిన్మహీ

కాంతునిపట్టివే యఁట యఖండమదారివిదారణక్రియా
కాంతపరాక్రమంబు లడుగన్వలెనే మఱి యీదిగంతవి
శ్రాంతసుధీవిధేయగుణసంగతి నీకె తగుం గుమారకా.18

చ. చలదరితావకీనభుజశౌర్యము పెట్టనికోటయై ముదం

బలవఱపంగ యాగహవిరాహరణార్థనిమంత్రణక్రియన్
బిలిచినఁ గాని రాఁడు బలభేదియు నేఁటిదినంబుదాఁక నో
కులనగధీర యీనడుమఁ గొన్నివిశేషము లెన్న శక్యమే.19

క. పాతాళకేతుఁ డనియెడి ఘాతుకుఁ డొకరక్కసుండు గలఁ డంబుధర

వ్రాతారవనీతాహవ, భీతానవధానసకలబృందారకుఁడై.20

క. ఫలకుసుమబిసాదులు గం, పలకొలఁదులు దెచ్చుకతన మాలిమికాఁడై

నిలుకడఁగ మాతపోవని, మెలఁగుచు వాఁ డుండియుండి మెల్లనఁ బిదపన్.21

గీ. మామకానూనజపహోమమౌనసంవి, ధానముఖమైన నియమసంతాన మనెడి

పద్మవనవైరికళ మాటువఱప నేఁడు, రాహువైనాఁడు వాఁడు ధరాతలేంద్ర!22

సీ. ఒకఁ డైనఁ గని యెఱుంగకయుండ విదళించు సారనీవారకేదారసమితి

వెనుకవేళలు గాచి కని కానమిగ దాఁచు నటవిఁ దాపసుల మృగాజినమ్ము
లాపిమ్మటను గొంద ఱది యేమి యనఁ ద్రుంచుఁ బర్ణశాలాసమీప ద్రుమాళి
బిదప నందఱుఁ జూడఁ గదిసి కైకొనసాగు యాగకల్పితహవిర్భాగతతులు
రచ్చ సేయఁగఁ దొరకొను రాత్రులందు, మునికుమారుల బెదరించి కొనఁగ దొడఁగుఁ
గామినీమార! వాఁడు నిక్కముగఁ జేసె, నిందు రమ్మన్నచోట నిల్లెల్లఁ గొనుట.23

సీ. పొడగన్న సాష్టాంగముగ వ్రాలి చనువాఁడె యెదురుగా రారంచుఁ బదరసాగెఁ

బిలిచిపెట్టిన వన్యభిక్ష గైకొనువాఁడె కోరి పెట్ట రటంచుఁ గొణఁగసాగె
నిలుచుండి చంక చేతులు కట్టుకొనువాఁడె కొలువరా రేమంచుఁ గెలయసాగె
వినయంబుతోఁ జేరి పని యేమి యనువాఁడె యరయ కడ్డాదిడ్డు లనుపసాగెఁ
దనవచోదోషము క్షమింపుమనెడువాఁడె, యేమనిన లేని నాతప్పు లెంచసాగె
వినుము మహికాంత కొండంతపనికి నైనఁ, బలుకులేటికిఁ గిల్లాకు పనుపసాగె.24

చ. ఇటు లతఁ డున్నయంత ధరణీంద్ర యొకకానొకనాఁడు నాకురం

గట నడయాడు నొక్కమృగకాంతకుఁ బ్రొద్దులవేళ చాలఁ జే
రుటకతనం దపోధనసరోరుహలోచనలంచఱు న్సము
త్కటగతి ముచ్చట ల్నిగుడఁగాఁ గడగానని సంభ్రమంబునన్.25

సీ. ఎన్ని న్చేనది తానిన్నటిమొటికగా యాకొమ్మఁ గడకుఁ బొమ్మనఁగదమ్మ

పడుచుదూడలచేతఁ బనియౌనె వీ రేల యనసూయఁ దోతేరఁ బనుపరమ్మ
యీప్రొద్దు నక్షత్ర మేమిలగ్నము మంచిదేయంచుఁ దగువారిఁ దెలియరమ్మ
శుద్ధవేళ సుఖప్రసూతి గావలెనంచు నిలువేల్పులకు మీఁదు లెత్తరమ్మ

గీ. అనుచు గుమిగూడి మృగి నొక్కయలరుఁదోటఁ

బూవుఁబొదరింటఁ దార్చియింపులు జనింప
నున్నతఱి మాయ గైకొని యట్టెపడిన
సరణిఁ జెట్టునఁ దెగిపడ్డ కరణివాఁడు.26

సీ. తళుకుటద్దపురంగు గలచెక్కులబెడంగు మేలికమ్మలడాలు పాలు చేసి

తొగరుఁగెంపులపెంపు నగు మోవి నెఱసొంపు పసని ముక్కఱనిగ్గుపాలు చేసి
సింగంపుగతిఁ బూను చిన్నారి చేఁగౌను బంగారుమొలనూలు పాలు చేసి
వలిజక్కవలఁ గేరు వలువగుబ్బలతీరు పసిఁడిపైఁటచెఱంగు పాలు చేసి
తనరెఁ గనుఁగొంటిరమ్మ యివ్వనిత యనఁగఁ, దగిన కాంతావిలాసంబుఁ దాల్చివచ్చె
గిలుకుమట్టెలురవలు పావలు నుజిటులు, విడెము మడమలఁబడుకీలుజడయు మెఱయ.27

చ. చెలువగు ముద్దుటుంగరపుఁ జే నెఱికుచ్చెలఁ బట్టి యుబ్బుగు

బ్బలజిగి జాలువాఱవికె పక్కున వ్రీలఁగఁ బైఁటవాటుగా
నలవడఁ గొంకుఁజూపులు నిజాంఘ్రినఖాళిఁ గల్వదండఁగాఁ
జెలువలచెంతకుం జనియె సిగ్గులపెండ్లికొమార్తయుం బలెన్.28

సీ. కూర్చున్నవారు లోఁగుచు లేచి చేఁజూపి యిందు రమ్మని ప్రియం బెనయఁ బలుక

నిలుచున్నవారు చెంతలఁ జేరి స్వస్తి భవత్యై యటంచు దీవన లొసంగ
ననల మాటాడువా రదరిపాటున మర్లి యొఱపు వీక్షించి నివ్వెఱపడంగ .
నపుడు వచ్చినవార లౌ చెలి యెవతె యీకొమ్మ యంచును గుసగుసలు వోవ
ధీరలగువార లూరును బేరు నడుగ, నెంచి యేమంద మని విచారించికొనఁగ
నిలిచె జిలిబిలి జడదారి చెలులఁ జేరి, మచ్చుకప్పెడుదారి నమ్మాయదారి.29

సీ. పనిలేనిపని గిఱుక్కున మోముద్రిప్పుచోఁ జెక్కు పైఁ గమ్మ తళుక్కు మనఁగ

సిగ్గునఁ దలవంచి చిఱునవ్వు నవ్వుచోఁ గెలకులఁ జికిలివెన్నెలలు గాయఁ
గెంగేలఁ బైఁటచెఱంగు బిగించుచో నిద్దంపుఁజనుఁదోయి నిక్కు దోఁపఁ
బలికించువారి మోములు దేలఁజూచుచో వాలుఁజూపులు పూలవాన గురియ
నిలుచు నొఱపును గరువంబుఁ దెలియనీక, పలుకుబెళుకును మొగమునఁ దొలఁకు దెలివి
యొడలియఁడకువనడలోన బెడఁగువారి, కన్నుఁబ్రామఁగ మృగియున్నకడకు నరిగె.30

క. వడి నరిగి రవికి రుచి నే, ర్పెడి మిడిగ్రుడ్డులును జిక్కిరించిన చెవులు

న్బొడవున నెత్తినవాలము, నడరఁగ నొకసింగమై మృషాంగన నిలువన్.31

చ. కనుఁగొని మౌనికాంతలు కకాపికలౌ మది నమ్మ చెల్లఁగా

యనుచు మిళద్భరీకృతభయంబు గళత్కబరీచయంబు న
త్యనుపద వనావిలమృగాంగనమున్ ముహురుల్చలద్గురు
స్తనమునుగా రయంబున యదాయదలై పఱతెంచి తెల్పినన్.32

క. కటకటఁబడి మఱి నే న, క్కుటిలక్రమగతులు గురియ గుఱి యెవ్వఁడొ యం

చటునిటు నారసి వీఁడని, పటుయోగజ్ఞానగరిమ భావించుటయున్.33

సీ. చిరదయాగాంభీర్యపరిఖకు తాఁబేలు నవధైర్యవప్రంబునకు సురంగ

ఖలజాతిగుణలతావళికిఁ బ్రాఁకుడుచెట్టు నిష్ఠురత్వంబను నిమ్మ కెరువు
క్రూరవాచాకాలకూటంబునకు వార్ధి దాక్షిణ్యవన్య కుద్దామదనము
ప్రకటితాత్మజ్ఞానరవికి దుర్దినవేళ మూర్ఖతాస్థితికి సామ్ముఖ్యకరము
కోప మిటు లౌనొ కాదొ యో భూపవర్య, యది యపుడు వచ్చి నామీఁద నావహించి
కటము లదరించె మొగ మెఱ్ఱఁగా నొనర్చె, బొమలు ముడివెట్టె ముకుపుటంబులు గదల్చె.34

వ. అంత.35

సీ. తాపసవటులకుఁ దరవాయిఁ జదివించు భాష్య మల్లంతటఁ బాఱ వైచి

కొమ్మున నంగంబుఁ గోకి చెంగట మేఁత లడుగు జింకను నుల్కిపడ నదల్చి
హరపూజ కంబుపర్ణాదులు గొనితెచ్చు నెదుటిశిష్యులను నేమేమొ తిట్టి
యాగమవాదమాధ్యస్థ్యంబు గోరు ప్రవీణసూరిశ్రేణి వెక్కిరించి
కళవసం బూడ జలకమండలువు వీడ, జడలు మహి జీరఁ జేజపసరము జాఱ
దర్భముడి వ్రేల ధ్యానతత్వంబు సోలఁ, గడిగి నిలుచుండి యాగ్రహగ్రహముఁ జెంది.36

వ. అక్కటా దిక్కటాహంబు లొక్కగ్రక్కున మెక్కందలంచు ముక్కంటిటె

క్కున యక్కటికంబఱి యిక్కటికిరాతిగుండియ నగ్గలపుటలుక యొగ్గి బగ్గుబగ్గు
రుమన శమనదనుజుక మన సంధానకరంబగు పరుషాక్షరంబున శపియింపంబూను
నావదనంబున సరస్వతీశంబరనయన దుడిదుడి వెడలఁగడంగునెడ జడధినసనాని
రాలంబనజనితంబుగు నొక్కవచనం బీవిధంబున వినంబడిన నాకర్ణించితి.36

చ. పదరకుమన్న మౌనికులపానన కుమ్మరి కొక్కయేఁడునుం

గుదియకు నొక్కపెట్టు నని కోవిదు లాడరె ఘోరసాధనా
భ్యుదితతపోబలం బిటులయో యొకరక్కసుపాలు చేతురే
మది మదినుండి మే మెఱుగమా మఱి వీని ఖరాపరాధముల్.37

గీ. ఐన నేమాయె గనుక ధరాధిపతులు, చేయఁదగినట్టి యీదుష్టశిక్ష నీకుఁ

బడినభారంబె పాఱెడుబండ్ల కెదురు, కాళ్లు సాతురె యో వెఱ్ఱికాన వినుము. 38

చ. ఇదె హరి యాఋతధ్వజనరేంద్రున కి మ్మిపు డానృపాలుఁడే

కదనములోన వీనిఁ గడికండలొనర్పఁడె నీకు నేటి కీ
యెదవడనన్నమాట యొకయింత వినంబడునంత మాత్ర నే
కదెయఁగ వ్రాలె నొక్కతురగంబు వియత్తలినుండి యత్తఱిన్.39

క. పతయాళుతురగవభృతో, న్నతకర్ణద్వయమునందునం గెంపులమే

ల్పతక మమరె రవికిరణం, బతిరయమున ననుపవచ్చు ననువు నటింపన్.40

చ. కనుఁగొని దాని ఫాలఫలకంబునఁ గట్టినపత్రికన్ లిఖిం

చిన వివరంబుఁ జూచి సరసిజహితుండు దయాళుఁ డన్ప వ
చ్చిన దిది యంచు భూవలయసీమ దిరంబును జుట్టివచ్చునం
చనఘ తదాఖ్యయుం గువలయాశ్వ మటంచు నెఱింగి నెమ్మదిన్.41

సీ. వరదానములకునై వచ్చు వాక్ప్రియకారి ముచ్చాయ లెఱిఁగించు మొగము దెల్ప

యాగభాగాసక్తి నరుదెంచుపాకారి యేఁకారి యిది మీకు నేల యనఁగ
వనవిహారాపేక్ష వచ్చు క్రొన్నెలదాల్పు జక్కిమార్పులకు హెచ్చరిక పడఁగ
మునులసేమ మెఱుంగఁ జనుదెంచు కరివేల్పు దండనాథుని సమాధాన మనుప
విని వినమి చేసి పని గలదనుచు వారిఁ , గూడదని త్రోయవలెఁ గద యేడజోలి
మాకు నేటికి వారితో మచ్చరంబు, సొమ్ము సొమ్మునఁ గూడఁ జేర్చుటయె నీతి.42

చ. అని తలపోసి యే నిటు రయంబునఁ దెచ్చితి నత్తురంగముం

గనుఁగొను మిత్తురంగము వికల్పితనిష్టురహేషచేఁ బరా
కని ముహురున్న మన్మృదుముఖంబున సారెకు సారెకు న్వలా
మొనరుచు దీనిఁ గైకొని జయోన్నతిఁ జెందుము రాజనందనా.43

చ. అనిన మహాప్రసాద మిపు డానతి యిచ్చితిరేకదా యిఁకం

గనఁబడఁ దెల్ప నేమిటికిఁ గార్యముఖంబున స్వామిచిత్తమే
ననుచు నదేల కావలసినం దనుజు న్వధియింపఁ జాలరే
ననుఁ గరుణావలోకనమునం మిముఁ జేయఁగఁగాక నచ్చటల్.44

సీ. చాయలొందిన దంచు సంతరించిన వాలుచూరకత్తి పరీక్ష చూడఁగలిగె

తరతరంబులనుండి దాఁచినారని విన్న కఱకునేజామేలు గాంచఁగలిగె
ననిలోనఁ దనుఁ గాచు నని చెంచు లర్పించు కేడెంబువాడి వీక్షింపఁగలిగె
పందెమొగ్గినఁ గూడఁ బగఱ గెల్చుకటారి యిది దీని వగ నిశ్చయింపఁగలిగె
స్వామి మీకతమున నిట్టి చౌకపనికి, మీకు వేంచేయనలయునే మీగృహమున
కరుగురెంచితి రందుల కనుట కాదు, పదము లెక్కడ బడలెనోకద మునీంద్ర.45

చ. అని మహిజాని యూడిగపుటాప్తులఁ గన్లొని దండు చాలుగాఁ

బనుపుఁడటంచుఁ బల్కి మునిపాలకమాళికిఁ గేలు మోడ్చి స
ద్వినయవినమ్రుఁడై నిలిచె వెంబడిగా నరుదెంతు మున్నుగాఁ
జనుఁడని వీడుకొల్పి హరి సాహిణి నీవశమంచుఁ బల్కుచున్.46

చ గడెలు పదాఱు చెల్లె ననఁగా విని కట్టికవారు మ్రోత గ

న్పడ నవధారు దేవ జతనాయన గద్దియు డిగ్గి యందఱి
న్విడిదల కంపి మౌళిసరణిన్ హరిగ ల్నిగుడంగ జెట్లు వెం
బడి కయిలా గొసంగఁ దెలిపావలు మెట్టి యొయార మేర్పడన్.47

శా. కోణేవాకిట వారి నిల్పి కులుకుంగుత్తంపుఁ జన్గుబ్బ లే

జాణల్కొందఱు కుంచెగిండి యడపా ల్సాగింప వాణీరణ
ద్వీణాపాణులు కొంద ఱారతిగము ల్ద్రిప్పంగ గక్ష్యాంతర
శ్రేణు ల్దాటి నృపాలుఁ డంతిపురముం జేరెం బ్రమోదంబునన్.48

వ. అంత.49

క. దనుజాతఖండనోద్ధతిఁ, జను మనుజాధిపు ప్రతాపజాతము మునుముం

గనిపించె ననుచు జనము, ల్గనుఁగొన మార్తాండమండలం బుదయించెన్.50

క, ఇటువలె వేజన నరపతి, పుటభేదనమునఁ బ్రయాణబోధకభేరీ

పటహఢమామీకాహళ, పటురవములు నిద్రలేపి పయనము దెలుపన్.51

సీ. పటుచక్రగతి నేలపాఁతు పెల్లగిలంగ విమలమణిస్యందనములు దనర

మావటీలకు మింటిదేవత ల్మంత్రాక్షతము లీయగ జయూధపములు వెలయ
ధారాసమున్నమద్ధవళ చామరలు ఱెక్కలభంగిఁ దగఁ దురంగములు సెలఁగ
జయలక్ష్ముల వరింపఁ జను పెండ్లికొడుకుల గుంపులై భటరాజకోటి యొనర
నడచి తమగపుబైట సన్నాహమెల్ల, నమరఁ బౌజులు దీర్చి నిజాప్తమంత్రి
వరముఖాంతరమున సరివారితోడ, మాటలాడించుకొనుచు సామంతనృపులు.52

చ. గొనబుపసిండికీ లరిగెగుంపులనీడ వసింప నంతలో

జనపతి మేలుకాంచి హరిచందనగంధిలమైనవారిఁ గుం
దనపుమెఱుంగుగిండ్ల వనిత ల్గొని తన్ముఖమజ్జనంబు నిం
పొనరఁగఁ దీర్ప నద్ద మొకయుగ్మలి పూనఁగ నామతీర్థమై.53

చ. మినుకుఁ గడానితాయెతు సమేళపుఁగ్రోవ్విరిదిండుదండ డా

ల్పనివలెవాటు చల్వనలిపంపురుమాలువు గట్టి దట్టిఁ జె
క్కినవిడి కెంపువంకి జిగి కెంపగు దుప్పటి దాల్చి యీతఁడే
మనసిజుఁ డాయన న్సొగసుమార్గముగాఁ గయిసేసి వేడుకన్.54

సీ. సమదవేత్రకరాతిసాహోనినాదంబు గదలివచ్చెనటంచు మదికిఁ దెలుపఁ

జామరగ్రాహిణీసరళకంకణరాన మివలి కేతెంచె నంచెఱుక సేయఁ
గమనీయయవనికాకాంచికానిస్వాన మల్లన వచ్చెనం చానతీయ
సంగీతవిద్యావిశారదాగానంబు లిదె యరుదెంచెనం చేర్పరింపఁ
జనవరులు లేచి నిల్వ హజారమునకు, నరిగి చౌకట్లముత్యాలయందుహస్త
మిడఁగఁ గొల్చుచు నిలిచి సాహిణులు మ్రొక్కి, తెచ్చి ముందఱఁ దొలునాఁటితేజి నిల్ప.55

క. వడిఁగట్టికవారలు పా, వడ మిడి హెచ్చరిక రాయవరగండ యనన్

బెడయంకెవన్నెపైఁ గా, లిడ కపుడు చివుక్కుమనఁగ నెక్కెం దేజిన్.56

మ. చనవు ల్మీఱఁగ మ్రోల నూల్కొలుపు బల్సామ్రాణిధూపంబు వా

సనకు న్వేలుపుముద్దరాండ్రు కచము ల్జార్పంగఁ బుణ్యాంగనా
వనజిన్యబ్జకరాపతచ్ఛితమణు ల్వర్ణింప ఛత్రంబుపై
ననువౌ బంగరుగుబ్బప్రొద్దుఁ దలఁబ్రాలై ముంచఁ జంచద్గతిన్.57

చ. జనవరమౌళి కొంతవడి సాహిణి నివ్వెఱగంది చూడ జో

డన రవగాలు చూపుచు హుటాహుటి నేగిపరాకు వీరువీ
రని తముఁ దెల్ప నందఱు రయంబున వెంబడ వాగె సళ్ళియొ
య్యనఁ గను మూసి కన్ దెఱచునంతటిలో మునిసీమఁ జేరఁగన్.58

క. అరుగఁ దదీయమనస్ఫుర, దరవింద మరందబృందమై మధురసుధా

చిరకందమై యొకానొక , పరమానందంబు హృదయబంధం బొందన్.59

సీ. మధ్యసంధ్యాస్నాన మౌనీంద్రలూన తాపసగంధపవనంబు భ్రమరివాఱె

నంబుపర్ణసమిత్కుశాయాతవటుజాతసమదనాదంబు మీసంబు దీఁటె
సవన ధూమాబ్దవీక్షణనటత్కేకికాంతావిలాసము తొడ ల్తట్టుకొనియె
నన్యోన్యవైరాసహమృగేంద్రమత్తవేషండకేళికలు పంతములు వలికె
నీకరణిమున్నుగాఁ బరాకిడియె మౌని, యాశ్రమంబని తన్మార్గ మభినుతింప
మోదమునఁ దేలి నృపమౌళి మోము చూడఁ, జనవు మైఁజేరి నిజకేళి సచివుఁ డనియె.60

సీ. చలువలు నించు నచ్చపుమంచుఁ జిలికించు ఱేరాయఁ డెడ లేర్పఱించువాఁడు

గలభి గాకుండ వేల్పుల నొక్కనొక్కనిఁగా ధనరాజు వెలినుండి యనుపువాఁడు
వారివారిప్రభుత్వతారతమ్య మెఱింగి గిరిశుండు బంతిసాగించువాఁడు
ప్రొద్దుపోయెను జూచి భుజియింపుఁ డని దేవపతి యుపచారము ల్పలుకువాఁడు
తగినవారల వీక్షించి తమ్మిబోఁటి ఱేఁడు మాటికిఁ జవు లెచ్చరించువాఁడు
జనవరాఖండలా యిందు సంయమీంద్రకాండకృతమైన సత్రయాగంబులందు.61

చ. మునివనిత ల్శచీముఖతమోనిభవేణులకుం బతివ్రతా

జనతతిఁ దెల్పుచోఁ బరవిచారము గాచని వేల్పుటొజ్జజ
వ్యనిమొగ మడ్డముంజోనుప వారలు నవ్వుచు రామె సిగ్గుపెం
పునఁ డలవంపఁ జందురుఁడు పొంగగ నిచ్చట యాగవేళలన్.62

సీ. సాలీఁడు గాఁబోలు సమదవేదండంబు తెలినారచీకలు డులిచి తెచ్చుఁ

బనివాఁడు గాఁబోలుఁ బటుఘోణిపోతంబు బలుమోర నివ్వరి కలుపుదీయు
గొల్లఁడు గాఁబోలు భల్లూకపాకంబు మేలిజన్నపుఁబసి మేఁపి తెచ్చు
జనవరి గాఁబోలు గొనబుఁబ్రాయపుజింక యలరిపై పారుపత్యంబు జేయుఁ
గూలిగొను నొజ్జకాఁబోలు గొదమచిలుక, తపసిబుడుతలగమికి వేదంబు నుడువు
సుసరముగఁ బారికాంక్షు లేజోలి లేక, జపతపంబులు సాగింప జనవరేణ్య.63

చ. మునివరు లేగ వెంట మృగము ల్నదికిం జని యంతనంత మే

పున కటు నిల్చుతు న్నియమపూర్ణత వారు నిజాశ్రమాళికిం
జనినఁ దదార్ద్రబంధురవిశాలజట ల్ధరజీరుకాడ వె
న్కొని చెవి బక్కరించి యుఱుకుం బొడకట్టినవెల్ల దాటుచున్.64

ఉ. ఎండదినంబులం బడగ లించుక నీడఁగఁ బట్టి మౌనులం

గొండొక సేదదీర్చు ఫణికోటులఁ జేరి యిదేటి కార్య మౌ
లెండు మ ఱేమి మే మిచట లేమె యటంచు మరల్చి చెల్వుమై
నింక మయూరిక ల్చికిలినిద్దపుఱెక్కల వీచు నక్కడన్.65

మహాస్రగ్ధర. జనవన్మౌనీంద్రవేదాక్షరయుత తతహస్తస్రువాజ్యాహుతిప్రో

ద్భవవహ్నిస్ఫారకీలాప్రకటితకరదీపప్రభ న్వత్తు రౌరా
హవిరర్హాహూతు లింద్రాద్యమరు లననికై యాస ప్రేరేపఁగా మీఁ
దివపాంచద్ఛీమధూమస్థితులు నిబిడమై దృష్టి చీఁకట్లు గప్పన్.66

క. వేలిమియగ్గిపొగల్దగు, వేలుపు డిగ్గి యమునింగి వెలువడు నమరీ

జాలము తిన్ననిపెన్నెఱి, వాలుఁగురుల కగరుధూపవైఖరి యగుచున్.67

చ. ఇనహరిణాంకరశ్మి కెడబాయని యవ్వనిఁ బంకజాకరం

బునఁ గవజక్కవ ల్వగవఁ బ్ద్దులు గ్రుంకుట దెల్లవాఱుట
ల్గనమి బలాగవర్షి కులకాంతలమోమను కల్వరాయనిం
గనుఁగొని విచ్చిపోవుటయె గాని వియోగ మెఱుంగఁ దెన్నఁడున్.68

చ. అని తెలుప న్మహీశుఁ డవుఁగా యని మెచ్చి పటానితేజి డి

గ్గినతఱి మూఁగి గచ్చు టరిగె ల్తెలిపావడ వైచి యచ్చపుం
బని మగఱాతిచెక్కడపుఁ బావలు నిల్పినవారలం గనుం
గొని యటు నిల్పి యాప్తులొకకొందఱు వెంటనె రా ముదంబునన్.69

క. చని నృపతి గనియె మునిజన, వనితాజనతానితాంతవర్ధితకేళీ

ననపాళీ కుసుమాళీ, జనితాళీనలినఘనము సంయమివనమున్.70

క. కని పర్ణశాలమ్రోలకు, జని యచ్చటివారిచెంత సంయమిపతికిం

దనరాక తెలియఁజేసి త, దనుమతిచే వేగఁ జని తదంతరసీమన్.71

సీ. అచ్ఛదంతేచ్ఛవి యామస్తకన్యస్తభసితాభఁ జేరి కేకిసలు గొట్ట

మోధావిరుచి గండమిలదురుశ్మశ్రురుక్చయములఁ జప్పట్లు చఱచి నవ్వ
జడలఁ బర్వినడాలు శారీరధారాళకాంతులఁ గికురించి కన్ను మూయఁ
బటునఖద్యుతి కరస్పటికాక్షమాలికాచ్ఛాయల డాసి కేకేయనంగ
నవ్యశార్దూలచర్మాసనంబుమీఁద, యోగపట్టె బిగించి కూర్చున్నవాని
గాలవుని గాంచి చేనున్ను కత్తి మంత్రి, యందికొనఁ జేరి సాష్టాంగమాచరించి.72

క. నిలిచినఁ గనుఁగొని నరవర, కులపావన యిందువచ్చి కూర్చుండవనా

నిలిపితివి తండ్రిపద్దులు, వెలసితి విటు లతనికన్న విక్రమగరిమన్73

చ. అనుచు బహూకరించుసమయంబున నూరకయుండి యుండి యం

జనరుచి పుంజమంజిమకచగ్రహ మైనతమంబు పర్వె తో
డన హరిచందనప్రతిభటం బగువెన్నెల దోఁచె వెంటనే
కనఁబడియె న్నిరస్తకనకస్తబకస్తుతు లైనయెండలున్.74

క. అది చూచి మేదినీవర, భిదురీ మృదురీతి గా దభేద్యము గంటే

యిదిసుమ్ము దనుజశాంబరి, గదిసె న్బరిపూర్తి దీని ఖండింపు మిఁకన్.75

గీ. విజయ మగు నీకు గెలువు మోవీరవర్య, యనుచు గాలవుఁ డాడుచో నచటఁ గలుగు

పారిగాంక్షులు కటకటం బడుచు శిష్యు, లంటి చనుదేర నచ్చోటి కరుగుదెంచి.76

క. మునిచంద్ర వచ్చి మావెం, టనె వచ్చునటంటి వీతఁడా నృపుఁ డేమ

య్య నరేంద్ర కన్నులారం, గనుఁగొంటివే వీని యవదగాకితనంబుల్.77

ఉ. అయ్యయొ మాకు దండమిడినంత ఫలంబు నరేంద్రచంద్ర యీ

దయ్యముతోడి జాగరము దాఁటఁగఁ జేసి శుభమ్ము లిమ్ము లే
వయ్య కొమాళ్ళతండ్రి వయి యాశ్రితరక్షణ దుష్టశిక్షణా
క్షయ్యదయాపరాక్రమవిశాలుఁడవై మనుమయ్య యిమ్మహిన్.78

సీ. చదువుకొన్నామంచు జట చెప్పుచుఁ బరీక్షఁ గొని వరింపు మటంచుఁ బెనఁగువారు

ననుజూచె ననుజూచె ననుచు రిత్తకురిత్త జవలు వట్టుక పోరఁ దొడఁగువారు
బులకము ల్మైనిట్టపొడువంగ వడి నోరు దెఱచి మైమైఁ జూడఁ దిరుగువారు
జేసన్న మటజంబుచెంతకు రమ్మని మునుదొంగమొక్కులు మొక్కువారు
నగుదు రీయయ్యలెల్ల వాఁ డదరుగడగ, గులుకుగుబ్బలు దళుకుఁజెక్కులు మిటారి
మొలకనవ్వులు గలమోము ముద్దుగులుక, మాయపుం డెక్కులాడియై డాయునపుడు.79

సీ. అటు మొన్న భార్గవజటికి శౌనకమౌని కొకవాదుమై నొంటకుండఁ జే సె

మొన్నఁ బారాశర్యముని యోటరాఁ గూఁత లెగయించి వెరవేఁకి యెత్తఁ జేసె
నిన్న విశ్వామిత్రునికిఁ దందరఘటించి యొడ లెఱుంగక పడియుండఁ జేసె
నేఁడు మార్కండేయునికి సివం బెత్తించి తల వీడఁగ బయళ్ళ మెలఁగఁ జేసె
మానవాధీశ విను మింతమాత్రమైన బ్రతుకవచ్చును వీనిచేఁ బడినపాట్ల
కొల్లఁబాటయ్యె మాకునిందునికి యేమి, చెప్పెడిది మాతపంబు నీ చేతి దింక.80

చ. అన విని యంతయేమిటికి నానతి యిచ్చెద రిన్నినాళ్ళుఁ ద

ద్దనుజుని నొంచి మీపద ముదారముదాకృతి నొందఁ జేయకుం
డిన యది నాకు నేర మవునేకచ యాకొదవ ల్సహించిన
న్ననుపుఁడు వానిఁ బట్టి నుఱుమాడెద నొద్దికఁ జెల్లఁ జేసెదన్.81

చ. అనిన రిపుక్షయోస్తు విజయోస్తు పతేభవతే యటంచు వా

రనుప దురాపకోపతరుణార్కవిభాదళితారుణాంబుజం
బనఁగను మోము కెంపుగఁ దదర్థరణోన్ముఖభృంగయుగ్మప
ఙ్క్తినటన భ్రూకుటిక్రమము డెల్పఁగ నచ్చోటుఁ దర్లి నిల్చినన్.82

సీ. అధిపభృత్యపరస్పరాన్వేషణాకారణప్రతివక్తృతన్నామకార్య

మననుగతస్వామి హయవేగభూరుహచ్చాయాసమాశ్రితచ్ఛాత్రకంబు
ధాననాయాసాస్వజీవనవృత్తిధిగ్వాచకాందోలికావహజనంబు
సమ్మర్దబహుళాదిసరణికోభయపార్శ్వచారితవారణాధోరణంబు
సరయ సరదుష్ప్రనిష్పతజ్జరఠధూర్త, గణ్యగాణిక్యసంభవత్కమనహాస్య
వారణక్షమతత్సుతాక్రూరదృష్టి, సంవృతాశంబు సైన్య మచ్చటికి వచ్చె.83

క. ఈరీతి సైన్యమంతయుఁ, జేరిన నొకబయట రాజసింహము భటులం

దేరిజ వేయంబనిచి గు, డారము లెత్తించి యంతట న్రవి గ్రుంకన్.84

గీ. పఱపుటంగడి వీథు లేర్పఱచి కొంచె, పాటి నడగని నెక్కి యాపాలె మెల్ల

విడియ నియమించి తిరిగె వేవేలు దివ్వ, టీలవెలుఁగున సంగీతమేల మమర.85

చ. తిరిగి యతండు వచ్చి నడఁదేర్పుచు ఘమ్మను వట్టివేళ్ళచ

ప్పరము కురంగటందగు తుపారము చేరువఁ జారువజ్రపాం
డరరుచిగ్రమ్ము గుమ్మెతగుడారమునం గొలువుండి పట్టనాం
తరముననుండి వచ్చునరనాథులకమ్మలు వించు నున్నెడన్.86

గీ. ఊడిగపుటత్తికాఁ డొక్కఁ డొఱుఁగుఁ జేరి, విభుని చెవిలోన నేమేమొ విన్నవింప

నతని కనుసన్న గనుఁగొని యయ్య మంచి, దతనిఁ బిలిపించెద నటంచు నఱిగివాఁడు.87

సీ. సేవమై సగము దీసిన బూదెపండుతోఁ గూడినబంగారు లాడె సింగి

బారసీలిపిని జొప్పడ భగవద్గీత లెన్నికవ్రాసిన చిన్నిపలక
బుడుత పసిమిరుచి పులితోలు చుట్టతో బవళిక ల్నించిన పట్టుజోలె
యొకతిత్తి బరదేశుల కొసంగఁ గూర్చిన రసవాదపు మెఱుంగుఁ బసిఁడి బుడ్లు
కొండవలె నెత్తిపైఁ జుట్టుకొన్న జడలు, వెండికట్టులబెత్తంబు విడెముమీఁచ
వీడియముగల్గుదొర పాతలాఁడెజోగి, బిలికొని వచ్చి పొడఁగనిపించుటయును.88

గీ. పతి కరముఁ జూప రత్నకంబళముమీఁదఁ, గడవసము వైచి కూర్చుండి బుడుతవీచు

సురటిగాడ్పుల నుదుటికస్తూరిబొట్టు, రవలు రాలంగ నాతఁ డారాజుఁ జూచి.89

సీ. ఇది చేత నుండిన నిసుమంతవడిలోన నేదేశమునకైన నేగవచ్చు

నిది మోళిపై నున్న నెదుటి చేవెళ్ళిన వైరికైదువజాఱి దారితప్పు
నిది దట్టిపొఱ నున్న నెటునంటిరూపైనఁ బ్రాపించి వేడుకఁ జూపవచ్చు
.........................................................................................
...........................................................................................
.............................బదనిక లొసంగి యొకమాయ పన్నుటయును.90

ఉ. కంటెఁ దగిల్చినట్టికొన గల్గిన చందురుఁగావి జాళువా

జంట పయంటపై నిగుడి చక్కని జక్కవ నిక్కు చొక్కపుం
జంట చెలంగు బంగరువు చాయలు దూచియనంగఁ జాలు వా
ల్గంటి మెఱుంగుఁ జూపులు దళారన వచ్చె మహాద్భుతంబుగన్.91

ఉ. చొక్కపుఁ బంజుకమ్మల రుచు ల్మెఱుఁగెక్కిన చెక్కు జాలువా

నక్కులచక్కుజక్కిణిగొనం బిగిగుబ్బలు పిక్కటిల్లఁగాఁ
జుక్కలరాచడాలు తెలిచూపులు త్రొక్కనిచోట్లు ద్రిక్క నా
చక్కెరబొమ్మ యమ్మహిపచంద్రుని చక్కటి కేగి గ్రక్కునన్.92

ఉ, రంగు చెలంగ గుబ్బల ధరాస్థలివక్షము మోపలేమి సా

ష్టాంగ మొనర్ప సిగ్గువడె నంచు నభంగురపాకభిన్మణీ
సంగతకంకణారవము చాటఁగఁ బైటచెఱంగు కేలితో
ముంగలఁ గొంకుచుం గొలువుమొక్కు ఘటించి పిఱింది కేగినన్.93

సీ. సయిదోడ చూడు నస్సాయ యిట్లేజ యిట్లేశవోజులపతి యింగిలయ్య.

[1]జగ్గుమంటివి వచ్చిశాణ నిద్దాహుంత్త కారి బుర్సాపుత్త గాలిసుమ్మ
అట్టె చూస్తుండది యదెనన్నెమోసిలి గలవాఁడ నని యదిగాక గడిని
చిక్కారిసాదన జేసెనదియింన్న దోభాజలల్ల మెలుద్రిబజారి
దీని పైయేడుసై సేసి నానువాని, చిక్కటారికొలారికచిస్తీరోలి
రాజుపాలానవిను యిటు రాయటంచు, రాచదేవళ్ళు కెరలి విరాళిగొనిరి.94

గీ. అంత వాకెల్లఁ దత్కారణాభినూత, నాతివాచాటతాజ్యప్రభూతగోష

వీతిహోత్రసముజ్జాతధూతికీలి, కాశ్రుతిస్ఫీతతామ్రాక్షు లగుచు లేచి.95

సీ. ఒఱలతోడుత దట్టిపొరల వంకులు డుస్సి తెలిచల్లడములతో నిలుచువారు

నింటి కిమ్మని పిల్లబంటుచేతికి సొమ్ము లొసఁగి వీరావేశ మొందువారు
ఔనన్నఁ జే వెళ్ళు మని హెచ్చరించుచుఁ జికటారి పొదలికె ల్సేయువారు
దీని ముందరనొంచి వానిపైఁ బడువారు...........................................
వాలు గొని లేచివచ్చు భూపాలుఁ ద్రోచి, యవ్వలిగుడారమున కేగుఁ డనుచుఁ జెనకి
యతనిగద్దింపులకు భయమందువారు, నగుచు నందఱు దొమ్మిగా నరయుటయును.96

గీ. అంత నాలాడెజోగి మాయావిధిప్ర, పంచమంతయు నుపసంహరించి నిలిచి

మునుపుఁ గొలువున్నవేళ నేయునికి నుండి, రట్లయుండఁగఁ గైవార మాచరించి.97

క. పాతాళకేతుఁ డంపిన, దూత న్నాసామి కెదిరి దురమున నిలువ

న్నీతరము గాదు విను నీ, వేతెంచి బలంబుతోడ నిటు విడియుటయున్.98

మ. తనచారు ల్గని వచ్చి దైన్యమున నేతద్వార్త విన్పింపఁగా

విని మీసంబులు దిద్ది దైత్యుఁ డహహా వీరా వడిన్వచ్చిపో
రనునన్నుం గదియించువారు మఱి వారా నన్ను మార్కొందురం
చనుమానింపక వచ్చి నిల్వఁగల వీరాగ్రేసరు ల్బాపురే!99

క. పెంపు విచారింపక విని, పింపఁగ రాదనక వచ్చి ప్రేలెడు వీరిం

జెంపలు వేయరె యనుచు ని, లింపారి రి నిజాప్తులం బిలిచి యిట్లనియెన్.100

ఉ. వింటిరె యొక్కవార్త మనవెఱ్ఱులు చెప్పిరి తాము కన్నులం

గంటి మటంచు నీతబిసిగాండ్రు మదీయమహోగ్రమాయకై
డంటతనంబునం జని ఋతధ్వజు సైన్యసమేతుఁ దేర నా
బంటుఁ దనంబుఁ బాపుటకుఁ బన్నినవా డఁట వాఁడు వాఁడిమిన్.101

సీ. గరళకంఠద్వేషి కరకకాయలు గొన్ని తినియైన నాఁకలి దెచ్చుకొనుము

దేవేంద్రమదభేది తెలిచాయ గలకోర పంటిమొన ల్సానఁ బట్టుకొమ్ము
ధూమ్రబర్బరకేశ తుప్పుపట్టినఘోరజిహ్వ మిక్కిలివాఁడి చేసికొమ్ము
కుటిలాక్ష మాంసంబు గొంతునఁ బడినోరు దెఱవ విప్పుడు సిగ్గు దెచ్చుకొమ్ము
తడవులకుఁ గల్లె మనుజయూధప్రచండ, పలలపారణ తద్రక్తపానకేళి
లాలనామోద మీసుమాళంబు మీఁ, వరుసనందఱు గంతులు వైవుఁ డింక.102

క. అని నన్నుఁ బనుప వచ్చితి, మనుజేశ్వర బారువెట్టుమా రాజుల ని

వ్వని తూర్పుదెసకు మాదొర, చనుదెంచు న్శౌర్యవహనసన్నహనమునన్.103

గీ. అనినఁ జిఱునవ్వు నవ్వి యజ్జనవరాగ్ర, గణ్యుఁ డతనికిఁ గట్టువర్గం బొసంగి

మంచి దటువలెనే నడిపించుకొంద, మంచు వీడ్కొల్ప నాదైత్యుఁ డరుగుటయును.104

గీ. అధిపతియుఁ జల్వలు ధరించి యారగించి, హితజనులు గొల్వఁ దగువారియిండ్ల కెల్ల

గేలిగితి నేగి యిది వేళ కీర్తిమాట, వాసులకటంచు లాలించి వచ్చెనంత.105

సీ. బొంగులు నిల్పి యుబ్బుగఁ బైఁడివ్రాఁత బొమ్మలగుడారంబు లమర్చువారుఁ

గొయ్యలు నాఁటి యాకులతోడిరెమ్మలు వాటంపుగుడిసెలు వైచువారుఁ
బొక్కళ్ళవలెఁ గుంతములు చేర్చి యామీఁద గడితంపుఁ బచ్చడా ల్గప్పువారుఁ
బచ్చిక ల్చెక్కుడుపాఱలఁ జెక్కి పూబొదరిండ్ల మున్నుగాఁ గదియువారు
నచ్చముగ నీటికందువ లరయువారుఁ, పురుఁగుఁబుట్రలు చెదర నుబ్బుచును నొక్క
పరిగ నవ్వుచుఁ జప్పట్లు చఱచువారు, నైరి తద్వేళఁ బాళెంబువారలెల్ల.106

సీ. రాతిరి పొక్కళ్ళ రౌలుకొల్పిన వహ్నిగలిగినపొగలు చీఁకట్లు గప్పె

గాడ్పులచే నూఁదకయ బగ్గుమను శిఖు ల్నిగుడుచోటులు పట్టపగలు చేసెఁ
దగవార్చి మూకుళ్ళ దిగువాఱనుంచిన కూటిబల్తావు లాగుబ్బకొనియెఁ
బొరలించి చండ్రనిప్పులమీఁదఁ గాల్చిన కఱకుట్లవాసన ల్గ్రమ్ముకొనియెఁ
ద్రోవఁ బోనీక బల్లెముల్ ఱువ్వి తెచ్చి, కడిగి జింకల వ్రేలాడఁ గట్టి తిత్తు
లొలుచు భీభత్సరసము మహోగ్రమయ్యె, భుక్తి గొన్నట్టివారి త్రేఁపులు పొసంగె.107

క. చాలఁ గురంగటిమడుగుల, గాలాపున్వేఁటలాడఁగా దొరకినబ

ల్మీలు చవిఁ దేల్చె నపు డా, పాలెంబున డిగిన బక్కబంట్రౌతులకున్.108

సీ. వలసినయెడకుఁ గమ్మలు వ్రాయు వ్రాయసంబులవారి గంటాల కిలకిలలును

దొరవలంచిన కారృసరణు లెంచు నమాత్యకుంజరంబు లొనర్చు గుసగుసలును
బొలదిండి రాయల యలవుల గనివచ్చి నిలుచు వేగులవారి కలకలములు
నరుస కిందఱటంచు వంతులేర్పడియున్న బలకరంబులవారి యలబలములు
నెపుడు వెడలునొకోయంచు నెంచి యాడఁ
జూచు సంగీతమేళంబు సొగసుకాండ్ర
ధిమ్మనెడి మద్దెలలమ్రోత గ్రమ్ముకొనియె
రాజు పవళించు తెలిగుడారంబుమ్రోల.109

చ. నలుఁగిడి చల్వదాల్చి పయనంపు టలంతల నిద్రఁ జెంచురో

వెలఁదుల లేపఁ గొంకి పతివింతగుడారపు పారివారిగం
టలరొద కుల్కిలేవఁ జిఱునవ్వులతోఁ చమవారిఁ గూడి యిం
పుల తమి దీఱినన్ నిదురవోయిరి నన్పుబొజుంగు లత్తఱిన్.110

చ. గుమిగొని తెచ్చికోలుకుసిగుంపులఁ జెట్టులనీడఁ బొట్టిమం

చములపయి స్శయించి పటసారకుటీరము లెత్తితే మేలిజా
నమున రమించు పల్లవులనంటున నేరము లెన్నుచు న్నృప
ప్రమపల మ్రోల నీటు నెఱపం బనిపూనిరి గుత్తలంజియల్.111

చ. కనుకని తెల్లవాఱుదనుక న్రతిగోరెడు పల్లవాళిమే

ల్గనుఁగొని వీడెముంగలుపు లాహిరిమేపుల నిద్రఁబుచ్చి చెం
దిన చిఱునవ్వుతో నపుడె నిద్దురలాయని వింతపైఁడి ప
ట్టిన వెలముద్దుగుమ్మలు వడిన్శయనించిరి చప్పరంబులన్.112

క. అల పాళెమునకు నిలుపని, బలకరమై పారివారిపరియై తెగును

క్కళమై నిదురించని సరి' వలపుల వెలచెలుల విటుల వర్తిలు టమరెన్.113

సీ. ఒక్కండు పట్టుగా నూఁకొనఁ దబ్బిబ్బుబాటు గొల్లసివాలు పాడుకొనుచుఁ

బాము నాడించు నేర్పాటునఁ దల యూఁచికొంచును జెంగు విన్పించుకొనుచుఁ
దమవారి గుమిగూడి దమ్మ రాజులకత ల్నోటి కడ్డము లేక నొడివికొనుచు
లయ యొక్కత్రోవ తాళం బొకత్రోవఁగా నేమేమొ ఢక్క వాయించుకొనుచుఁ
జిటుకుమన్నఁ బరామరిశించుకొనుచు, నంటుకత్తెలు తమపయనంబు సమ్మ
తించకాడిన వగఁ జెప్పుకొంచుమించి, రుక్కళపునల్లమందుల యొంటికాండ్రు.114

సీ. వెఱవకుమని వెన్ను చఱచి వేలుపుఱేఁడు తెలిపిన నింద్రాణి తెలియదయ్యెఁ

దను తానె తెలిసి మూసినకంటితో వాణివీనులపైఁ గేలు మానదయ్యె
నది పరామరిశింతునని యేగు పతినాఁగి జలధినందనకొంగు విడువదయ్యె
దడదడమన గుండె తాళిబొ ట్టదర గుబ్బలిపట్టి పడుకయి ల్వెళలదయ్యె
బాళెమున నక్కడక్కడఁ బదిలమునకు, మ్రోయఁజేసినతముకుల మొదలిపోటు
దారమ్రోతల పటహంపుధణధణలకు దొంతిగా నిండ్ల నిటులున్న యంతలోన.115

క. అలరాజు విజయ మెనయం, గలఁడని చంద్రుఁడును దారకావనితలతో

గలహించి ముడియవైచిన, పొలుపలరన్ వేగుఁజుక్క పొడిచెం బెడఁగై.116

క. అంతట దనుజేంద్రుం డొక, దంతపుఁజవికె న్ప్రధానదైత్యులతోడ

న్మంతనమాడుచు నృపుబల, వంతపువైఖరులు వేగువారలు దెల్పన్.117

క. పడవాళ్లఁ బిలిచి బలముల, వెడలింపుఁ డటన్న వారు వెసఁ జని నిద్రా

జడులను బలాశి వీరుల, వడిగా మేల్కొల్పి ప్రకృతవార్తలు దెల్సన్.118

చ. అదరుచు వచ్చె నొక్కపలలాశి నిజాంగన సిగ్గుతోడి న

వ్వొదవెడు చూడ్కిచేతఁ దనయుల్లములోని పునారతకియా
భ్యుదయపువాంఛ దెల్పఁ గనుబొమ్మ నదల్చుచు మీఁదివేలుపు
న్ముదితల నంటు దానిపయి ముందుగఁ జౌక ఘటించెనో యనన్.119

చ. ఒక దనుజాధినాథుఁడు మదోద్ధతి గంద మలందికొంచు గొం

చక చనుదెంచె నుగ్రరణసన్నాహనంబున రాజమార్గణా
ళికి నిఁకమీఁద డెందము బళీ యిరవౌనని ఱొమ్ముగోడపైఁ
జికిలియొసంగి నన్నియలఁ జెన్నగు సున్నము వూయుకైవడిన్.120

గీ. విరులు సిగఁ జుట్టికొని యొక్కవీరదైత్యు , డరిగె నిఁకమీఁదఁ గల్గు కల్పావనీజ

పుష్పములసారసౌరభంబునకు వాని, వలపునకుఁ బూని సరిచూడవలయు ననఁగ.121

క. ఈనేలచుట్టుఁ దిరిగినఁ, బోనీయఁడు రాజు పాఱిపోరాదనుతీ

రూనఁగ నొకనక్తంచర, సూనుఁడు చక్రంబు ద్రిప్పుచుం జనుదెంచెన్.122

క. అనలోపమనృపశరముల, మొనలంబడి తరణిబింబముం జొచ్చుగతిం

దనుజుం డొక్కఁడు గ్రక్కునఁ, గనకరథం బెక్కి యక్కు గ్రక్కుచు వెడలెన్.123

సీ. పడవాళ్లగమికిఁ జేపుడికి దబ్బఱనొప్పి పైవైచుకొని మూలఁబడినవారు

నిండ్లలోనన యుండి యెటువోయిరో కాన మనిపించి కనిపించ కడఁగువారు
నింటికావలికి న న్నిచట నిల్పరు గదా యని వేల్పులకు మ్రొక్కఁ జనెడువారుఁ
దొలునాఁడె నృపునివార్తలు విని యొకలేనిపనిఁ బూని యెందెందొ చనెడువారు
గ్రాసములు చెల్లలేదని గ్రాసిచేసి, కొలువుజీవితముల కొప్పుకొననివారు
నగుచుఁ గోఁచపిశాచము ల్దిగులుపడఁగఁ, దక్కు రక్కసిదొరలు ముందఱను నిల్వ.124

సీ. నిలుచుండి వీణ చేతులఁ బూని తెఱగంటిబయకాఁడు మేల్కొల్పుపదముఁ బాడ

నలుకుతో నాల్గుమోములదేవుఁ డొకయోర దినశుద్ది దెల్పి వేవెనుక కొదుగఁ
దనయూరినుండి తెచ్చినపూలమాల జేజేలరాయఁడు చేరి చేతికొసఁగఁ
జొరవ చేసికొని శంకరుఁ డిచ్చకాలకు సఖుఁ డౌకుబేరుపైఁ జాడి చెప్ప
గడియకుడుక మునుంగుటఁ గని గురుండు, తెల్లవాఱెడునని పఱతెంచి పలుకఁ
గటికవారెల్ల దొరలు వచ్చుట వచింప, దనుజపతి లేచి యొకభద్రదంతి నెక్కి.125

గీ. కోటకావలికై యాప్తకోటితోన, నీవు నీ వని నియమించి నిలిపి తక్కు

రక్కసులు వారణంబుల రథములందుఁ, దురగములయందుఁ బొడసూపి తోడనడువ.126

సీ. చెకుముకి యగ్గి జానకితాటిమిడుఁగురు ల్గొఱలెడునది యెలగోలుమూఁక

వెదురుమల ల్చేర్చువిధమున నీటియ ల్దాల్చి పొల్చినయది దండిబారు
లిరుగోపులను దుమ్ము లెగయించునదిసిలేముస్తీబుగల కాలుమొకరిపౌజు
కొమ్ముకత్తుల మెఱంగుల వెల్లపానడ ల్గొనునది మస్తేనుఁగులచయంబు
సురగిరీంద్రంబుపిల్లలై చుట్టు నున్న, కనకరథముల నడుమ సింగాణి విల్లు
దొనలు మెఱయంగఁ దేజిపైఁ దోఁచువాఁడు, ధారుణీశ్వరుఁ డని వేగువారు దెలుప.127

చ. అరిగి మహాభయంకరతరాహనదోహలబాహవప్రతా

పరుచులు వోలు చెందిరపుఁ బావడచేఁ బుఱచేయి వీచి సు
స్థిరమతి నంపపెట్టుకొలఁదిం గజరాజము నిల్పి దానవే
శ్వరుఁ డెలగో లొనర్పఁగ నిశాచరుల న్నియమించి నంతటన్.128

చ. అలరుమొగంబుతోఁ గువలయాశ్వము నిల్పి నరేంద్రమౌళి తూ

పులపొదిదోయి వీపుకడఁ బొందుపడం బిగియించి మించురా
చిలుకలవ్రాఁతగచ్చుపనిసింగిణి గైకొని యెక్కువెట్టి సే
నలు తనసన్న గోరఁగ గుణధ్వని చేయుచుఁ జేయి వీచుచున్.129

క. పేరెములు వాఱి యొక్కక, చేరువ గుంపగుచుఁ దారసిలి యిరువాగుం

ఘోరపుబాణపుఁ జువ్వలు, బోరనఁ గొనవిఱిచి వైవఁ బొసఁగె న్మొదటన్.130

క. కొనద్రుంచివైచు బాణపుఁ, బెనుజువ్వలు పాఱి నేలపెట్టుగఁబడుజీ

బున సిగిడి కాలుసేతులు, దునియలు గావించి ముందు దురుసున నడిచెన్.131

క. ఉయ్యాలచేరు లనఁగా, నయ్యిరువాగులును దఱిమి యటు దిరుగుచు బ

ల్కయ్య మొనరించి యించుక, డయ్యక యొడ్ల పయిఁ బెట్టుటయు నట్టియెడన్.132

చ. ఒకపరి యొడ్లలోని రిపు లుగ్రత వైచు తుపాకిమందుగుం

డ్లకు వెనుదీయ కాఁగి యచటంబడునాప్తులఁ గోలుగొట్టనీ
య కనిఁ బెనంగి యంతఁ దరియం బడి యచ్చటివారలం గకా
పికలుగఁ దోలి యొడ్లు విడిరించిరి చేరువకాండ్రు మెచ్చఁగన్.133

గీ. అలసినట్టి జనులు తేలి యవలి కరుగ, వేఱుతుటుములు పెనుబోటు భేరి మ్రోఁత

లమర నరుదెంచి దొడ్డకయ్యమున నవియుఁ, బడలనంతయుఁ గని దండి బారుగదిసె.134

క. అందఱు నిట్టలు వచ్చిన, యందము గనుపట్టెఁ దద్రణాంభోనిధి దాఁ

టం దెప్ప గట్టఁబూనిన, చండంబున నలుగు లరిదిచాయల నీనన్.135

గీ. ఒకఁడు కుంతానఁ బగవాని యుగము గ్రుమ్మ, వెంటనే యాతఁ డీటెచే వెళ్ళఁబొడువ

వెలసె నిద్దఱు నిల్చిన నిలుపు కచన, కాళికై కావడించిన కాను కనఁగ.136

క. పగవాని గ్రుచ్చి యీటిని, నెగనెత్తె నొకండు రణమహిందుములమునం

గగనమున నుండి వ్రాలెడు, ఖగపాళుల కంది యిచ్చు కైవడి మెఱయన్.137

క. జముదాడి నొక్కవీరుఁడు, విమతేంద్రుం బొడిచి వాఁడు వెస నిజభుజసా

రాము మెచ్చి చల్లుననకుం, కుమబలెఁ దద్రక్తమున నిగుంభితుఁ డయ్యెన్.138

క. అలుగునగ చూపువేళం, దలతలమను నింతసోఁకిన న్మగవానిం

గళదాఁకఁ బెనఁగు నొకమొ, క్కలపు దొరకరాసి నీటుకత్తియ యగుటన్.139

చ. గళము లూడ్వనెత్త కరిణీపతి చేరినఁ దేజిపావడన్

మొగమునఁ గప్పినూకి యొకమొక్కలపు న్నెఱరౌతు కుంభము
ల్పగులఁగ నేసిన న్వెడలెఁ బట్టము వెంటనె మౌక్తికావళు
ల్మగఁటిమి మెచ్చి చేరి జయలక్ష్మి సుమాంజలి యిచ్చుకైవడిన్.140

మ. బలియుం డొక్కపటానిరౌతు తనబాబానూకుచు న్రెండువీ

థులమాస్టీలత లల్కరాసిలతికం దుండించుచుం జుట్టిరా
నలరెం దత్తనువు ల్ధరంబడుట భూతాజ్ఞప్తిచే వెట్టిమో
పులు నేలం బడవైచి కూలఁబడు కాపుల్వోలె నప్పట్టునన్.141

క. నరపతి యంతట దనుజుల, యురువడిఁ గని చేయివీవ నుగ్రాకార

స్థిరతం గరులకుఁ గరులున్, హరులకు హరు లరదములకు లరదము లెదురన్.142

సీ. రాజ నాచెయి చూడు గ్రాసంబు ఋణముగాఁ జేయుదునే యంచుఁ జేరువారు

లలితంపుఁ దులశిప్రోగులు ద్రుంచి నోటిలో వైచికొంచుఁ దురీన వచ్చువారుఁ
గలనిలోఁ బొలియుటకంటె భాగ్యమ్ము లున్నవే యంచుఁ దెగి యనికఱుమువారు
నేలినవానికట్టెదుటనే పనికివచ్చుటగదా మేలని చొచ్చువారుఁ
బూర్వవైరంబు మాని సొంపులు జనింప
నొకని కొకఁ డెచ్చరించుచుఁ జికిలియొఱలు
పాఱవైచుచు వడిఁజొరఁబాఱువారు
నగుచుఁ గైజీతములవార లనికి నిగిడి.143

క. దనుజులఁ గదిసిన నత్తఱి, జనితంబగు ధూళిపాళి చదలఁ బొదలఁగా

ననిమిషకోటికిఁ గరములఁ, గనుదోయిం బులుముకొనుచుఁ గనుఁగొనవలసెన్.144

సీ. అరదము ల్దురదుర నరుచార నరుదేఱ నరదము ల్దురదుర నరిగె నెదురు

కరులు ఘీంకారబంధురములై నడతేఱఁ గరులు ఘీంకారబంధురత నెదురు
హరులు హేషాతిభీకరము లై పఱతేఱ హరులు హేషాతిభీకరత నెదురు
భటకోటి చటులతోద్భటములై చనుదేఱ భటకోటి చటులతోద్భటత మీఱు
సారథులు వ్రాలఁగొమ్ములు చదిసికూలఁ, బక్కెఱలు వ్రీలఁ గరవాలపటలి తూలఁ
కేడి వారంగ నవి పోరు ఖేచరాళి, హర్షమునఁ జూడఁగా బొమ్మలాడినట్లు.145

మ. చదిసెం దేరులు పాఱె వారణము లశ్వమ్ము ల్ధరం గూలెఁ గం

జెదకెన్ సైన్యము వ్రాలె బాహువులు ద్రెస్సె న్మాంసము ల్రాలె నం
గదము ల్దీలెఁ గిరీటము ల్పఱచె రక్తశ్రేణి కయ్యంపుఁజొ
క్కు దనర్పన్ భుజదర్ప మొప్ప నిరువాగుం జేరి పోరాడఁగన్.146

సీ. ప్రేగులుమీఁదఁ గన్పించి నవ్వెడు తలల్తూఁడులుగల తమ్మితుటుముఁ దెగడెఁ

గెంపుటుంగరపుడా ల్గీల్కొన్నబాహువు ల్ఫణమణు ల్గలయహిప్రభులఁ దెగడెఁ
బలు జముదాడి పోటులమించువక్షము ల్నెఱియ లానిన భూమినీటుఁ దెగడెఁ
వ్రేటులరక్తము ల్వెడలించుతొడలు కుంకుమనీటి చిమ్మనగ్రోవిఁ దెగడెఁ
దనుజమనుజేంద్రసైన్యముల్ దైన్య మెడలి, కయ్య మొనరింప సంగరాంగణము చూచు
దివిజవర్యులు మొగములు ద్రిప్పికొనఁగ, నప్పు డమ్మక్క యనిపించె నమృతముగను.147

వ. వెండియు నుద్దండతరదండధరకోపాటోపవిభ్రమభ్రమితనయనభ్రమావహస్యంద

నసహస్రసంగతరథాంగనికరాదభ్రవిభ్రమణవిధూతధూళీపాళికాధరాధురావ
హగిరీశచరణకరీశ్వరంబును గరీశ్వరధారాధరక్షతజపూరపారావారదుర్వాగత
రంగాయమానకనకపరికరంబును బోరనెడఁదగాయంబులవారలం గుంతసంఘ
టితద్విపేటికాడోలికలం గొనిపోవువారును మున్నఱకమై నెక్కినకత్తలాణంబు
లంబరులపాలు చేయనోపక డిగ నుఱికి కటారుల డొక్కలు విదారించి
నడచి పడువారును క్షతంబుల వెడలు ప్రేవుల నూడనీక యదిమి కదనోన్మాదం
బున దుప్పటులు బిగియించి యెదిరించువారును గెలుపుగాయంబులఁ బడియుం
డియు మండిగాలిడుకొని కైదువులు జడిపించుకొనుచు రౌద్రాకారంబున ను
న్నవారును గళ దెలిసి నలుదిక్కులుం బులుకుపులుకునఁ జూచి మానధనంబునం
దొడిగినచల్లడంబు లక్కడక్కడఁ జించుకొనువారును బ్రాణనిర్యాణసమయంబు
నందును నిజస్వామివిజయంబె విచారించువారును నడుగకమున్న యభ్యర్ణంపుమడుఁ
గుల జలంబు దెచ్చి దప్పి నివారించు బంటుల ఋణంబులు దీర్చుకొని వారితో నా
త్మీయులకు వలయు బుద్ధు లుపదేశించువారును దెట్టువలుగట్టియున్న క్రొన్నె
త్తురులు గనుంగొని నెత్తురుకళవట్టి తమకుఁదామ వ్రాలువారును దొలఁగ క
క్కడక్కడ భద్రపఱచిన ముదురుమానిసులకతంబునఁ బోఁగూడక నమోనమో
యనుచున్నవారును గ్రించుఁదనంబునఁ గొంచెపాటి చెనకులఁ దెచ్చికోలు వేదన
లంబడి తన్నుకొనువారును గలిగి సంగ్రామంబు గావున నధికధామంబును జన్యం
బు గావున భూతక్రియామాన్యంమును సమరతలంబు గావున ధమోజ్జ్వలంబు
ను నై యాసమీకంబు సమాకులితనాకలోకం బయ్యె మఱియు.148

గీ. పోరఁ బెనువానగా రక్తపూర మొలుకు, కాయములు పూను భూతనికాయనమలరెఁ

గేళిగతి నిల్చు రణభద్రకాళిమ్రోల, వరలు పన్నీరుతిత్తులవా రనంగ.149

సీ. గ్రుడ్డులు మిడికించుకొని దప్పి కిమ్మను దమవారి నొక్కబేతాళమౌళి

గొంతు మ్రోచిన దిగుల్కొని నోర వ్రేలిడి క్రక్కు నొక్కపిశాచికావిభుండు
అన్నువట్టినను మ్రాగన్నుతోఁ బొర్లాడు నేలపై నొకడాకినీవరుండు
కక్కుర్తి మెక్కి యగస్త్యమంత్రము వల్కు బొడ్డు నంటుచు నొక్కభూతనేత
తనివితీఱినత్రేఁపు విన్నునకునిక్క, శతపదాల్ ద్రొక్కు నొక్కనిశాచరుండు
పలలరాసుల బువ్వంపుబంతివిందు, మించుఁబోఁడులతో నారగించువేళ.150

గీ. ఒక్కని కళేబర మరసియుఁ దగఁదినక, వీనిఁ బడవైచె నాతఁ డావీరుఁ డనుచు

గా దనుచుఁ గుమ్ములాడునక్తంచరాళి, యెంతకార్యంబు దమ కేమి యెవ్వఁ డైన.151

క. ఒకవీరవరుకబంధము, నకు మూఁగి పిశాచికాగణము భూతావే

శకమున నది యెగిరినచోఁ, బకపక నవ్వించె నులికిపడి డాకినులన్.152

సీ. శౌనకమౌని విశ్వామిత్రుతోఁ దెమ్ము పన్నిదం బనుచుఁ జేపట్టి తిగువ

శుకుఁడు[2]

మాలిని. ధరణిభరణశేషా దర్పకద్వేషవేషా, శరనిధిసితకీర్తీ సౌధయూధాగ్రవర్తీ

వరగుణమణిజాలా వర్ణితోదీర్ణలీలా, నరపతికులహేళీ నారనక్ష్మాపమౌళీ.

గద్య

ఇది శ్రీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమ

న్వయాభరణ నారాయణభూపాలతనూభన శఠగోపతాపసేంద్రచరణారవింద
సంచలన్మానసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర
రూపరేఖావిజితచైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధా
యక చిననారాయణనాయకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రం బనుమహాప్ర
బంధంబునం ద్వితీయాశ్వాసము.
  1. యీపద్యమును బ్రత్యంతరము లేకపోవుటచే నిచ్చవచ్చినట్లు దిద్దినఁ గవిహృదయము చెడునని భీతిచే నాభారముఁ జదువరులకే వదలినాము.
  2. ఇక్కడఁ గొంతగ్రంథభాగము మాప్రతిలో లేదు.