కువలయాశ్వచరిత్రము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

కువలయాశ్వచరిత్రము

తృతీయాశ్వాసము

క. శ్రీరమణీమృదుపదలా, క్షారసకోపారుణప్రసారితవీక్షా

దూరితవైరికలాపా, నారీనవకుసుమచాప నారనభూపా!1

గీ. అవధరింపుము జైమిని కలపతంగ, కులపతంగంబు లిట్లని తెలుపఁదొడంగె

నట్లు పాతాళకేతుఁ డయ్యాతుధాన, పటలికన్నను మున్నుగాఁ బాఱుదెంచి.2

క. దళవాయితోడఁ గోటకు, వెలుపటియిల్లిల్లు గొట్టివేయించి పిరం

గులు లగ్గంబులమీఁద, న్నిలిపించఁగఁ బనిచి నిగుడు నెవ్వగతోడన్.3

చ. అరిగి పురంబు సొచ్చి పలలాశనమౌళి కుమారుతోడ మే

ల్సరియగు దైత్యులం గవనుల న్నిలువ న్నియమించి యాయస
స్ఫురణఁ దనర్చు కోటతలుపు ల్బిగియించఁగఁ బంచి ధీరతా
స్థిరమతిఁ జేరఁగా నగరుఁ జేరి హజారమునందు నిల్చుచున్.4

క. మించు తమిఁ గణజము ల్దెఱ, పించుచుఁ గైజీతములకు వేర్వేఱ న్వ్రా

యించుచు నెలకొలువునకుం , బంచియిడుచు మందుగుండుబాణములెల్లన్.5

క. ఇటు లండ నచట నృపుఁ డు, ద్భటగతి దానవుని కూటిపాలెం బెల్లం

దటుకునఁ జూఱ లొసంగుచు, నటు నిలువక సేనతోడ నప్పురిఁ జుట్టెన్.6

చ. అచలితవృత్తి నిట్లు విడియం దళవాయి పటాశి వీడు మే

చ్చుచు నలకోట కేగు జలసూత్రపుఁజోటు లెఱింగి యడ్డ క
ట్టుచు రసవర్గ మచ్చట కడున్వడిఁ జేరఁగనీక శూరతా
రచనలఁ జిల్లరల్చలుపు రక్కసిపాలియగాండ్రఁ గొట్టుచున్.7

క. ముత్తికె వేయించిన దితి, జోత్తముఁ డించుకయు బెదర కుద్భటధీరో

దాత్తమతి నగరు సొరక వి , యత్తటి నటునూకు గమనియందె వసించెన్.8

సీ. తెఱగంటిదొర నరాధిపు మెచ్చఁ జనుటకై నలువతో నాలోచనంబు సేయ

నిలనుండి వచ్చు వేగులవారి వెంటనే సురమౌని గొణుగుచు సుద్దు లడుగ
గిరిభేది నగరివాకిటివార్త లడుగంగ దిగధీశులు నియోగి తెగల నంప
అడ్డెలు విడి వేల్పు లమరగాం డ్రసురేంద్రుకార్యకర్తలబందు గట్టికొనఁగ
భూరిభుజశక్తి మ్రుచ్చిమిపోటు గాఁగ, మేదినీభర్త పాలెంబుమీఁదఁ బడిన
దానవులమూఁక తన్మహోత్కటభటోగ్ర, ధాటిఁ గ్రేడించి క్రమ్మఱఁ గోటఁ జేరు.9

సీ. అచ్చరచెలువ లుయ్యాలచేరులు నేలవైచితి రని తోడివారిఁ బదరఁ

జో టించుకయు లేక కోటకంబులలోని యిరవుపాములు పెఱ బొఱియఁ జొరఁగ
నఖిలపక్షులకులాయములుఁ బోఁ బిల్లల గఱచి యవ్వలికోనకడకుఁ బఱవ
ముంచి చీఁకటులు కల్పించు నీడలు పోవఁ బద్మాకరంబుల పాఁచి విఱుగఁ
జెట్టుగులులేని పెనుగారుచిచ్చు వచ్చె, ననుచుఁ జెంచెత లెండకై యలమటింపఁ
బార్థివేంద్రుని భటులు డాబాలు నడుప, నఱకి రయ్యద్రిపై విపినంబునెల్ల.10

క. దనుజుల తుపాకిగుండు, ల్గనఁబడు డాబాలు పలకలం దాఁకి బిరీ

లునఁ దిరుగుఁ దము నియోగిం, చినవారల నొంచ మగుడు చెలువం బమరన్.11

క. మనుజేంద్రుఁ డంత సేనలఁ, బనుపుచు సురతాణి లగ్గఁబట్టించిన న

ద్డనుజపతి వీరధర్మం, బునఁ దెగువకుఁ జొచ్చి యెదుర ముదిరిన కినుకన్.12

మ. అరరే వేఁడిమెఱుంగుతూపుఁ గొని యయ్యా యెంతయో వింత యా

నరనాథాగ్రణి యేయఁగా నది దిశాంతభ్రాంతరోచిర్నిరం
తరమై వానిశిరంబు గైకొని యనంతాకాంతపైఁ దార్చె దం
తురసంతోషహృదంతులై ధిగధికాంతు ల్చెంత చింత ల్విడన్.13

ఉ. అంతటఁ జేరవచ్చిన వియచ్చరనాథుల దీవన ల్మహీ

కాంతుఁడు గాంచి వారి మృదుగౌరవసారవచోవిభూతి న
త్యంతము సంతసం బొదవ నన్చు నిజాంచితసైన్యము న్బహిః
ప్రాంతమునందు నుంచి దరహాసవిలాసవిభాసమానుఁడై.14

క. నగరిపురిపునగరుం ద, న్నగరీరథయూధసౌధనానావిధరు

గ్ధగధగలు చూచువేడుక, చిగిరింపఁ గురింపరాని చిడిముడి వొడమన్.15

క. ఒక్కఁడె పవనోద్భవజన, ధిక్కరణధురీణ మైన తేజి న్వడిగా

నెక్కి ప్రకాశాత్యవశద, దిక్కంబగు పురము సొచ్చి ధృతి నచ్చోటన్.16

ఉ. గోడలు గోష్ఠము ల్గరిడి గుళ్లు గృహాంగణము ల్గజస్థలు

ల్మేడలు మేలుకట్టులును మిద్దెలు ప్రాకలు మేలుమచ్చులున్
వాడలు వేదులు న్విపణివర్గములు న్వనజాకరంబులుం
జూడఁ బదాఱువన్నె గల శుద్ధసువర్ణము లౌట మెచ్చుచున్.17

సీ. పరఁగఁ బిరంగీల బలుగుండ్లకై డాఁగఁ బలుక లమర్చిన పాఁతరలును

వెలుపటి మంచుతిత్తులు గూలిన యరాబు కొఱకమర్చిన పచ్చిగోడగుంపు
లెనసి మార్తురు లగ్గకెక్కకుండంగఁ దార్చిన కాంచనంపుచందనపుఁజేతు
లెదుటి సురంగంబు లెఱిఁగి యా చాయఁగాఁ గల్పించు ప్రతిసురంగముల గములు
ప్రతిబలము వ్రేయు తిరుగుడుఱాళ్లకతనఁ, గుమ్ము లానిన బంగారుగోడ లురలి
పడిన మగరాలు చూర్ణమై పుడమి రాలు, నీలములచాలుఁ జూచి వర్ణించుకొనుచు.18

క. ఘోరదశాధారనిశా, చారికృశాంగులను జూచి జడియకుఁ డనుచున్

సారతరదాతృమహిమం, బూర ధరాజాని యభయ మొసఁగుచు నంతన్.19

సీ. కోటవెట్టికి ముద్దుగుమ్మలతో మట్టితట్ట లందిచ్చు గంధర్వచయముఁ

గనునీళ్లు పులిమికొంచును బానశాలలో మంచు గట్టించు నమర్త్యకులము
మలఁగికొంచును ఫిరంగుల లగ్గములమీది కురువడితోఁ జేర్చు నురగగణము
బలిమికాండ్రగు రక్కసులకు సంకెళ్లతో జలకుంభములు మోచుసాధ్యపటలి
విబుధరిపు పాటుఁ జెప్పుకో వెఱచి ముత్తి, యపుహజారాన గుసగుసలాడుచున్న
కిన్నరశతంబుఁ గని బుజ్జగించి పనిచి, ననుచు వేడుక తోడుగా నగరు దరిసి.20

సీ. నలఁగిన మైలచీరలకు మైఁ బొంగారునిగ్గులు బంగారునీరు గాఁగ

ముడి వీడు నిడుచక్రొమ్ముడులడాలు శరీర నకు నల్లనిమేలిముసుఁగు గాఁగఁ
బవళించు కఠినభూభాగమ్ముమీఁద నిబ్బరపుఁజూపులు కల్వపాన్పు గాఁగ
నాఁకటి కన్యోన్య మలసత మై నాడుమాటలె యమృతెపుతేట గాఁగ
దనుజు చెఱసాల నున్న గంధర్వకాంత, లదరిపాటునఁ దనుఁజూచి బెదరి లేచి
కొంకుసిగ్గులతో మఱుంగులకుఁ బోవ, నిలచి వారలఁ జేర్చి మన్నించి పనిచి.21

క. తోవరాచరాతినిధ్దపుఁ, జవికేల తెగల న్నగళ్ల చావళ్లను నుం

బవడఁపుఁగొణిగెలలోగిలి, సవరనికేరులును దాఁటి చనఁ జన నెదుటన్.22

గీ. పచ్చి దేరఁగఁ జిలుక బాబా వజీరు, జగడమునఁ గుమ్ములాడు నచ్చరమిటారి

కత్తెయలవేల్పు నెఱనీటుకాండ్రరూప, ముండు బొమ్మలుగల మేడయొకటి గాంచి.23

క. తగురా మగరానిగనిగ, లగురా తొగరాచసాలల న్విన్ననువుం

బిగడాలడా లిదెంతటి, సొగసని తేజీని డిగ్గి చోద్యం బలరన్.24

మ. చనుచో నాతని కందుఁ గర్ణపదవిశ్రాంతంబు లయ్యెం గడున్

వనితా యెంతటి బేలవే నెలఁత యైనం జింతనే చింత గుం
దువటే యందనిమ్రానిపండులకుఁ జేతుల్ చాతురే యైన న
ద్దనుజోదంత మెఱుంగు నంతకును గాంతా తాళుమ న్వాక్యముల్.25

క. అది విని మఱియున్ వినివిని, యిదియేమో కాని చూత మిపుడని యవనీ

ధవనేత బూరికోరిక, నవలికి జని జనితవిస్మయనిమగ్నుండై.26

సీ. పలచనిపావడపై నొంటికట్టుగాఁ గట్టిన వలిపె చెంగావికడమ

పాన్పుపైఁ బొరల నిబ్బరపు గుబ్బలహారపటలి పెటిల్లునఁ జిటిలి రాల
కెరలు నిట్టూర్పులఁ గెమ్మోవి బగులంగ గోరునఁ జిమ్ము కన్నీరు వడిన
బంగారుగోడ కరంగిపోవఁ దలాట బటువు లల్లంతటఁ బడఁగనేమొ
పనికి దిగ్గున లేచి పూపాన్పుమీఁద, వ్రాలి కూర్చుండి ముక్కుపై వ్రేలు నిలపి
యొక్కచెలికత్తె యూరార్పఁ బెక్కుతలఁపు, లన్నుకొననున్న యొకవన్నెలాడిఁ గాంచి.27

మ. భళిరా కన్నులు మీలఁ కీసొగసు రూపా చాల సేబాసురా

కళలందించ్చు మెఱుంగు ముద్దుమొగ మింకం జంద్రుఁడా దీనిముం
గళ నౌరా బలితంపుగుబ్బ లివియే కాబోలుఁ బూచెండ్లమిం
డలు మేలే కురు లింద్రనీలములకన్నన్ మిన్న లౌనే కదా.28

క. నెమ్మి గదా నడతుమ్మెద, దొమ్మి గదా బెడఁగుగురులు తొలుకరి మించుం

గమ్మి గదా మెయి మరు దో, దుమ్మి గదా తగినచూపు తొయ్యలికి భళీ.29

ఉ. దబ్బరకౌను మాట వనితామణి కౌను మెఱుంగు జాళువా

గుబ్బలి ఱేని కోటవలి గుబ్బెత చన్గవ వేల్పురాచరా
ద్రబ్బల మేలితేట యలరాజముఖీమణి వేణికారుచుల్
లిబ్బిపడంతి పట్టి కనలీల జయంబగు దీని ప్రాపునన్.30

చ. కలకల నవ్వు వట్రున మొగంబు చరాలను చారెడేసి క

న్నులు పిడికింటిలో మిను మినుక్కను కౌనును ముద్దుగారు ప
ల్కులుఁ జెవికమ్మచేఁ దళుతళుక్కను చెక్కులుఁ పట్టెడేసి గు
బ్బలుఁ గనుచూపుమేరకు గుభాలను తావులు దీనికే తగున్.31

ఉ. జక్కవపిట్టకున్ గలికి చన్నులమిట్టకు నేమి పుట్టువో

చక్కెరదీవికిన్ వనిత సన్నపుమోవికి నేమి వావియో
నిక్కువచానికిం జెలున నిద్దఁపుమేనికి నేమి నేస్తమో
చుక్కలకోటికి న్మగువసొంపులగోటికి నేమి కూర్మియో.32

క. అని యెంచి యంచువిలువీ, రుని యలుఁగులగుంపు మది చురుక్కున నాటన్

జనియించిన తమకము ర, క్కొనిముంచినఁ గఱఁగి తెచ్చికొల్ ధృతిమించన్.33

క. ఎంత కడంగి నుతించిన, నంతకుఁ దగునేకదా మదాళి నవాళీ

కుంతలకాంతవసుమనః, కుంతలసదపాంగ కంది కుండెడిదేమో.34

చ. కనుగవకెంపు కొప్పు విడఁగా ముడిగొల్పెడు బొందిమీఁది జం

కెన నెఱిచూపు నెవ్వరు నగించని నవ్వు బయల్ గుఱించి ప
ల్కును గళ దేరు మేనుఁ గనుఁగొన్నను జక్కెరబొమ్మయొక్క చ
క్కనిమొగవానికి న్వలచెఁ గావలయుం గలయం దలంపఁగన్.35

క. బలవంతపు వలవంతలఁ, జెలువంతయు నేరి సొమ్ముఁ జేసెనొకో యీ

వలపునఁ దగిలినవానికి, దలపున లవలేశమైన దయ లేదేమో.36

ఉ. వానిది గాక జన్మమనువారము నీరమణీలలాల య

య్యో నగుబాటుగా నతనియొద్దకు నెచ్చెలిఁ బంచి పంచినం
దా నిటు రాక వేఱిమి యొనర్చునొ నావలపంచు నించువి
ల్కానికి లొంగి నెమ్మదిఁ దలంచుకొనన్ వలపించె నెవ్వఁడో.37

క. అవ్వల నొకనికి మీఁదుగ, జన్వన మిటు గట్టియున్న జలజేక్షణతో

నెవ్వగఁ పలుకులు పలికిన, నెవ్వగయే కాని చేరనేరవు కోర్కుల్.38

గీ. ఐన నేమగు దీనివృత్తాంత మెల్ల, దెలియవచ్చుగదా యంచుఁ దొలఁగి యొక్క

లోవమఱుఁగున నిలువ నాలోలనయన, జేరి నెచ్చెలిహారాళిఁ జిక్కుఁ దీర్చి.39

మ. తలివండ్రుల్ మన మీనిశాచరునిచేతం జిక్కి దిక్కేది యీ

యిలఁ గాసిల్లుట గానకేమయిరొ వారేమైనఁ గానిమ్ము నీ
యెలప్రాయంబు నిరూఢి కాసపడి వీఁ డేమేమి గావింప వ
ర్తిలుచున్నాడొ యెఱుంగ మిందులకె యింతీ వంత లేదాయెనే.40

క. అక్క ఋతధ్వజభూవరుఁ డెక్కడ నీ వెక్కడే యి యేమిటికే నీ

చొక్కపుఁ జక్కనినెమ్మే, నిక్కాఱియ కోర్వనేరదే వగ యేలే.41

చ. తలపున నెంతి మోహపరితాపము గల్గిన దాచుకొందురో

యలయక లేక యీకరణి నంగడి వెట్టిదురో వధూటులౌ
పలుకవు నిన్నువంటి కులభామలఁ గానవొ వారి కాత్మ నా
థులపయి బాళి లేదొ తమిబుట్టిన పట్టున మట్టుపెట్టరో.42

క. తగు లెఱుఁగఁజేసి కూడఁగ, మగవానికిఁ జెల్లుఁ గాని మఱి యెంతైనన్

మగువకుఁ జెల్లదు మీఁదట, నగుబాటగుఁ బిన్నపను లనన్ రాదు చెలీ.43

ఉ. నీమది నింతకోరిక జనించినయప్పుడు యెట్లు కూర్చునో

యామరుఁ డింక నిన్ను వసుధాధిపమౌళికఁ గూర్చకుండ నే
మీమనమంతగా రిపులమే మఱి వానికిఁ దానఁగీర్తి గా
దే మరియాద తప్పిన సతీ విను మొక్కటి సావధానవై.44

క. మనలం దెచ్చిన యాదై, త్యునిబాధలఁ గలఁగి మునులుతో తెరఁగ న

జ్జనపతి యాతనితో నిదె, యని సేయుచు నున్నవాఁ డటంచును వింటిన్.45

క. పురదనుజకామినులు కా, తరలై తరళైకహృదయతం గుందుచు నా

తురలై గరళైధితవా, క్పరతంత్రత మాని యునికి గనుఁగొను మబలా.46

క. గావున నృపతి జయించెం, గావలయుం జూడు మెడమక న్నదరు ననం

గా విని పలికినదానవు, నీవా యని చూచి కామినీమణి కలఁకన్.47

గీ. యేటి పలుకమ్మ యతడు నన్నేల యేలు, తిరిగి సంధించి నన్ను బోధించరాకు

మింత యేమిటి కింక నాయించువింటి, వాని కెక్కినప్రాణమే వామనయన.48

చ. అని పలుకం ధరాధిప సురాధిపుఁ డీసతి నెమ్మనమ్మునన్

నను నెనయం దలంచుట కనంబడె బోటి ఋతధ్వజేశ్వరుం
డని కొనియాడె గాన నటులైనది నిక్కమయ్యెనేని నే
దను విపు డీవధూమణి పదంబుల వైవఁగఁ దామసింతునే.49

శా. నాభాగ్యం బదిరయ్య యీయతివ యందం బిందు భావించినా

కేభంగిం గవయంగఁ గల్గునని యూహింపన్ మదర్థంబుగా
నాభీలాభవభూరిఫాలదహనాభానంగకౌక్షయక
క్షోభక్షయృతఁ జెందియున్నయది యిచ్చో మెచ్చవచ్చుం గదా.50

చ. ననుఁ గొనితెచ్చినట్టి మునినాయక నిన్ను నుతింతు నోబలా

మునిఁ గొనియాడనేల పెనుమొక్కలిరక్కసి అనికై కదా
యనుకలధావనాపరహయంబుగ వచ్చితి గాన నింక నా
తని యవదాన మెంచవలదా జలజాలక నిందుఁ గాంచుటల్.51

చ. ఇప్పు డిటు కానుపించుకొని యేను ఋతధ్వజరాజనంచు

దట్టపుదమిఁ దెల్పి జాణ యగుటన్ జెలి యెవ్వలికేఁగ సిగ్గు దో
రపువగకొంకు జారఁగ బరాబరి సేయుచు నిందు మారుక
య్యపురుచిఁ జూపి దీనివిరహంబుధికిం గడఁ జేరనిత్తునో.52

సీ. యీగుబ్బ లిఁకమీఁద నాగోటికొనధాటి గదిసిన గజిబిజి గాకయున్నె

యీమోవి యిఁకమీఁఁద నామోము మునిపంటిఘాతచే నలిబిలి గాకయున్నె
యీదేహ మిఁకమీఁద నాదు కౌగిలిగింత వగచేత వసివార్లు వాడకున్నె
యీకురు లిఁకమీఁద నాకూర్మిపెనఁకువ, పాటుచేవడిఁ జిక్కువడకయున్నె
చిక్కువడుగాక యేమి నాచింత దీర, ననుభవింపక పోనేర నకట యిట్టు
లేల తలచితిఁ బువువంటి దీలతాంగి, గాన నొకయింత యోర్వదో కద యిదేల.53

క. భళి యేటి కోర్కు లివి తొ, య్యలిచేఁ బేర్కొన్న యట్టి యాతని ననుఁగా

దఁలచితి వేఱొకఁ డేమో, యిలలోన ఋతధ్వజేంద్రు లెందఱు గలరో.54

గీ. ఐన నొకసాధనం బున్న దాఋతధ్వ, జేశ్వరుం డీపలాశిలోకేంద్రుతోఁడ

నని యొనర్చుచునున్నవాఁడని వయస్య, పలికెఁ గావున నతఁడ కావలయు నేను.55

క. అన్నిటికిని మంచిదియే, సన్నలతాంగులను డాయఁ జని తద్వచనా

చ్ఛిన్నమకరందధారా, భ్యున్నతికిం గర్ణపుటము లొగ్గుట యనుచున్.56

ఉ. లోన మఱుంగు వాసి జనలోకరసాకరబాకశాసి మై

తావులకంటె మున్న రుచి ధారలు బారులు దీర్పఁగా రతి
స్త్రీవిభు రంభ చుట్టమును జెక్కిలి గొట్టు నొయార మొల్కఁగా
నావనజాక్షు లున్నయెడ కద్దరిపాటున వచ్చి నిల్చినన్.57

చ. కని హృదయంబు ఝల్లుమన ఘుల్లుమనంగఁ బదాంగదంబు ది

గ్గన వెస లేచి లేనడ యొయారముతోఁ దెరచాటుఁ జేరెఁ గా
మిని చెలికత్తె తత్తరము మెక్కొన గద్దియఁ దెచ్చియుంచ మిం
చిన తమి నందుమీఁద నివసించె ధరావరుఁ డాదరాత్ముఁడై.58

ఉ. అంతటలో ఋతధ్వజనరేంద్రుని మోహనమూర్తి మున్ను గ

న్నంతయుఁ గన్నులం బడిన నాతఁడు కాడ యతండెయో గదా
కంతునిదాడికిన్ వెరవగా యని డెందమునందు నెంతయుం
గొంత వహింపుచుండె సరసీరుహలోచన బోటి యచ్చటన్.59

చ. ప్రకటగుణాంక యోపురుషసింహమ నీమహనీయమూర్తి మా

మకహృదయాంబుజమునకు మక్కువ నెక్కొనఁజేసె నింకఁ గొం
కక కనిపించమంచు నడుగన్ బని లేదయిన౯ శుభాభిధా
యక మగు నీచరిత్ర ముదయంబులకుం దగు నంద మొందఁగన్.60

చ. బహుతరదేహధామఘనబాహువిహారముఁ జూచినన్ మహా

మహుఁడవు గాక యొక్కనరమాత్రుడవే యని దా నెఱింగియున్
సహజపుముగ్ధతాగుణమునన్ వినఁగోరితి గాక నీశుభా
వహనధురీణమైన గుణవారము నే వినునంతదాననే.61

గీ. ఓ మహాభాగ నీకథాభ్యుడయ మెల్లఁ, దగినచందాన వినినయందాక లేదు

పారవిరహితఘోరార్తి వారిరాశి, మగ్నమామకచేతోతిమహిమకతన.62

క. కతలయ్యా మావిత మా, వెతలన్నియుఁ దెలుపకున్న వీడవు వినుమా

జతనమున గుణము లనియెడు, రతనంబులగని యటంచు రమణి వచించున్.63

వ. అని చెప్పి మఱియు నెచ్చెలి యిట్లనియె.64

సీ. అనఘ విశ్వావసుండనియెడు గంధర్వరాజు దుర్గావురిత్రాత వెలయు

నతని పాణిగ్రహితి హారిణియను పేరుగొరి కాంచిన ముద్దుగుమ్మ మించు
నాయమ్మ సుతు లెందఱైన గల్గియు కూఁతు రొకతెలేమికిఁ జాల నుమ్మళించి
యాత్మజాత నొసంగుఁడనుచుఁ దేవుండని యే, కంటఁ బడురాతి కెల్ల మ్రొక్కె
నట్టిదకదా వధూటుల కల్లుఁ డనుచు, నగవు దగవులటంచు నెయ్యంబు లంచు
నంపకము లంచు మఱియెన్నియైన కలవు, కాంతు లవి యుండె మీఁదటి కతలు వినుము.65

గీ. అంత నక్కాంత గర్భాలసాంగి యగుచు, నాకుఁ దెలియదుగా యొకనాటిరేయి

నండఱును మంచిశుభవేళ యనుచుఁ బలికి, రప్పు డీయుద్ధరించెడు నమ్మఁ గనియె.66

గీ. పుట్టినప్పుడె జవ్వనంబును సమస్త భామినీకోటిఁ దలదన్ను పాటి చెలువు

గలిగె దీనికి నదియె దుఃఖముల కెల్ల, మూల మైనది యంత నాలోలనయన.67

క. అసమాన వయోమదమున, లసమాన కలాదులం జెలఁగఁ జూచి మదా

లసయను పేరిడె విశ్వా, వసుఁడున్ హారిణియు గారనంబునఁ బెనుపన్.68

ఉ. అయ్య పరాకు మాప్రియవయన్య యటంచు వచింపలేదు మా

తొయ్యలి వీథిలో నోఱపుతో నడయాడఁగఁ జూచెనేని యా
తియ్యని వింటిజోచు శరధిం గదియించిన పూవుఁదూపులే
యెయ్యెడ వైచికొంచుఁ దమి హెచ్చినఁ బోఁ బొరలాడకుండునే.69

క. ఏటికి మాటలు నాఁటికి, నేఁటికి మగవాఁడు వలచునే కద వినుమా

బోటి తటాలునఁ జూచిన, నాఁటదివలచు న్మనోంబుజాగ్రమునందున్.70

సీ. బలవైరి పనిచినఁ బిలువ వచ్చినవానిఁ, గనుసన్నచే నిల్పి కడకుఁ బనిచి

మూపుపైఁ గేలుంచి ముచ్చటాడుచు వచ్చు నలకూబరుని మన్ననలు వరించి
నెనరుతోఁ గడునాచికొనివచ్చు నునుగచ్చుటరిగెలవారి నందందు నిల్పి
కడువేగ మడుపులు గైకొని యుడిగంపు రాజీవముఖిహజారమున నిల్పి
కొలువునకు నేఁగు రంభ నిచ్చలము గాగ, నగరులోపలఁ జొచ్చి మానాతిఁ జక్క
దనము వీక్షించి యామెనిద్దంపుఁజెక్కు, నొక్కముద్దిడుకొనిపోవు నొక్కవేళ71

సీ. శచిచేత జంభశాసనున కొక్కొకవేళ స్వారిసరాగాలు జరుగఁబాసె

రంభచే నల యక్షరాజపుత్రకునకు లలి హుషారుగా వెడలంగఁ బాసె
బార్వతిచే నర్ధపద్మారిమౌళికి నిట్టట్టుఁ బీరంబు లెత్తఁ బాసె
కమలచే నీలమేఘశ్యామమూర్తికి గరుడు నెక్కి వయాళి గనఁగఁ బాసె
నెందు సర్వసుపర్వపర్వేందుముఖుల, చేత నిశ్శేషదేవతాశ్రేణికెల్ల
సదనకోటులలోఁ గట్టు గదలఁ బాసె, ననఘ మానాతి జూతురో యనుభయమున.72

ఉ. ఆవెత లెన్నియైనఁ గలవయ్య మహాత్మ వచింప భారతం

బీవనజాక్షి మెచ్చఁ జన దెవ్వరి నెట్టి మహానుభావుతే
జోవిభవంబు దెల్పినను జుక్కను నెవ్వరి రూపమెంచినం
దా విననట్ల పోవు నొకతప్పు పనుల్ గదియించి యవ్వలన్.73

గీ. అంత నొకనాఁడు తలితండ్రు, లనుప భూమిఁ గలవిశేషంబు లీక్షింపఁదలఁచి యేను

లోనుగాగల నెచ్చలుల్ వేనవేలు, గొలువ నిగ్గజయాన యియ్యలకు డిగ్గి.74

క. ఇందుఁగల పుణ్యభూముల, నందందుఁ జరించి కోకిలాళిమదాళీ

కందళితకేళిపాళిన్, నందనముం గేరు నొకవనంబున విడిసెన్.75

చ. విడిసినయంత నొక్కదొర వేఁటకు వచ్చెనొ కాని కొంచెపు

న్నడ గని నెక్కిచేతను గ నంబడు నెట్టెముమీఁది డేగయున్
బడలినమోము గువ్వగుమిపట్టుల బాఱెడుచూపు మించఁగా
దొడిఁదొడి నూడిగంపుఁ దెగతోఁ జనియెన్ మముఁ జూడఁడేమియున్.76

గీ. అతనిఁ గనుగొన్న నేకన్నెయైన వలచు, నమ్మహారాజు దురగవేగాతిశయము

నంది చనలేక యంతంత నరుగువారి, నడుగ వారు ఋతధ్వజుం డనుచుఁ జనిరి.77

గీ. అతనిఁ జూచినదఁట యీసుధాంశువదన, యదియ నెపముగ రతిదేవి యాకుమడచి

నోటి కందియ్య వగకోటి నూటికోటి, యేసె నేర్చి మనోజాతుఁ డింతిమీఁద.78

చ. అదిమొద లీవధూటి విరులంటదు కస్తురి గీరుబొట్టు పె

ట్టదు పువుఁదోట రాయదు పటంబులు వ్రాయదు వీణచెంతఁ జే
రదు నెవరైన చిల్కను కరంబున దాలిచి ముద్దటంచుఁ దా
గదియదు కంజకాండకరకార్ముకకర్మహతాహతాంగియై.79

చ. చెలుల మొరంగి నిల్చి తనసిబ్బెపుగుబ్బలు నారుతీరు ని

గ్గులుగల కేలుఁదమ్మి కనుఁగొంచు నయో యిటువంటి మేనికిన్
వలదె తదీయచారుతరవక్షమునం బువుదండఁ బోలె నీ
యలసత దీక నిద్రఁగననంచుఁ దలంచి వితాకురాలగున్.80

చ. ఎలమి నరేంద్రమౌళి తనయింటికి వచ్చినయట్లుగా మదిం

దలఁపుచు సిగ్గుతో మరుగునన్ నిలువంబడి వచ్చినాతఁ డా
చెలువుఁడు చూడరే యనినఁ జెల్వలిఁ దెవ్వరిఁ గానమే యనం
దలఁకుచుఁ జూచి కల్లయె యనంగడు వెల్వలఁబారు దీనయై.80

సీ. అధిపప్రతాపాగ్ని నరికట్టుకొన్నట్టి సొంపునం గనుఁదోయి కెంపుదనరఁ

బతికీర్తి చంద్రకాపటలిఁ గౌగిటఁ జేర్చు మాట్కి మేనున బాండిమంబు వెలయ
విభుదానధారాంబువితతికిఁ జోటిచ్చు పొలుపున శ్రమజలంబులు చెలంగ
నాయకధైర్యంబు బాయకుండఁగబట్టుకైవడి నైశ్చలగరిమ మెరయఁ
గడపట నిజేశు మదిలోనఁ గట్టివైచి, కొన్నగతి సంతతధ్యానగుణము దనర
నమరియు నతండు గనిపించినట్టులైన, నదరిపడి లేచు ఱేలెల్ల నిదురలేక.81

సీ. తలచూప వెఱచు నీయళివేణి సమరందసుమబృందనవకాంచనములు గన్న

పెదవెత్త వెఱచు నీబింబోష్ఠ తరువారసుకుమారతతధీరశుకము గన్న
బొడఁగట్ట వెఱచు నీపువుఁబోడి ఝంకారభారాతిభయదషట్పదము గన్న
నడుగిడ వెరచు నీయబ్జపాద సమీపవికటానుభావహంసికలఁ గన్న
వెడవిలుతుచేతనగు నలజడియుఁ దేనె, జడియు గమ్మనిదెమ్మెరల్ తొడరుజడియు
నలయు నెమ్మేనఁ జలువఁ చాకలపరించుఁ, గలవరించు నొకానొక కలవరించు.82

క. పొన్నలకుం దెలిజాబిలి, మిన్నలకుం దలఁకు చిలుక మేలిమిపలుకుల్

విన్ననగున్ విన్ననగున్, గ్రొన్ననగుంపులకు దిగులుకొని మదిఁ బొగులున్.83

క. ఈరీతి నారికీరీ, శారీభారీకృతోక్తిచకితాత్మకయై

పారరహితవిరహవశా, పారావారమున మునుఁగఁబడియున్నయెడన్.84

మ. తనరెన్ మన్మథజైత్రయానసుముహూర్తప్రక్రమం బేరుసే

యనిశృంగారము భూరుహాళికి రతివ్యాలోలబాలామనో
బ్జనవప్రేమల కుబ్బు మందలి వధూజలంబు పాలింటి పి
ల్వనిపేరంటము వాసనాజనకమై వాసంతమాసం బిలన్.85

క. బెడగడరె లతావనితలు, నడతెంచు వసంతరాజునకు నడుగులకున్

మడుగులు వఱచినకైవడి, నడరెడు తెమ్మెరలఁ బండుటాకులు రాలన్.86

చ. తనరస మెల్లఁ జూపవలదాయని వేళ యెఱింగి యత్తరిన్

గనఁబడు మన్మథాగ్నిమొలకల్ వలె మోసులుగా జనించి యా
నుని పథికాంగనాపురుషమండలి డెందములొందఁ బంచివే
సినతి రెండు గాగ విరిసెం దలిరాకు వనాంగణంబులన్.87

క. తమ కుపమేయస్థానము, కొమిరెల మృదుపాద మగుటకు న్వైవర్ణ్య

క్రమ మొందిన సరణి రసా, లములుం గెందలికుటాకులం బస రెక్కెన్.88

గీ. వఱలె వనరాశిలోనఁ బ్రవాళపాణిఁ, గాంచి యీసునఁ బలెఁ బొడకట్టినట్టి

ముత్తియపుగుంపులను దలంపులు జనింప, తారకతమోనివారకకోరకములు.89

క. మనలతకూనల మాధవుఁ, డనువుగఁ గూడె నని యుస్సు రను వనపద్మాం

గనల ముకుళీకృతాస్యము, లన గాఁ దరులందు మొగ్గ లరవిరి యయ్యెన్.90

క. మనసిజుఁడు రోఁజుచుం ది, మ్మను తుమ్మెద నల్లప్రజలకై నానాపు

ష్పనికరదళ నవ్యాజం, బున నత్తఱిఁ దేనెకణజము ల్దెఱపించెన్.91

గీ. లతలసౌమ్మైన కుసుమజాలంబు లొరయ, నకరువులపేరి యెమ్మెచ్చు పెకలిరాలఁ

దొడిమలక్కలఁ బచ్చఱాతుటుము గాని, పించె ననఁ బసరుఁజాయల పిందె లమరె.92

గీ. మన్మథబ్రహ్మమునకు సమానదేవు, నొకని గల్పించి కైకొనరోయి యనుచు

నలవసంతుఁడు గట్ట వ్రేలాడు పసుపుఁ, బూఁతజాలెలవలె ఫలంబులు సెలంగె.93

క. వ్రాలిన విరిజొంపముపై, రాలినపుప్పొడులు ప్రసవరస మనుముద్ర

ల్గీలుకొనఁ బొలుచుచిలుకగు, ఱాలదునేదాని కొలుచురాసు లనంగన్.94

సీ. దాఁచఁబెట్టినవా సుధామాధురీధురీణమరందబృందసూనవ్రజములు

కాణాచులా యనర్గళపచేళిమభిదేళిమచూతపోతావళీఫలములు
సంతరించినవా విశాలమార్గననిర్దయోల్లూనకరుణార్హపల్లవమ్ము
లప్పళించినవా వియద్ధరాపద్ధతిప్రారూఢసంచారిసౌరభములు
దొమ్మిగాఁ దుమ్మెదలు మూఁగి తొక్కులాడు
పొగరుతోఁ గీరములు చేరి జగడమాడు
గొంటుగాఁ గోయిలలు రేఁగి కుమ్ములాడు
మొనసి వలితెమ్మెరలు కెర్లి పెనఁగులాడు.95

సీ. చిలుక బాపనకొలంబుల బందుగులకెల్లఁ గలితామ్రఫలకోటి గ్రాస మొసఁగు

నెలదేఁటి రాచగుంపుల చుట్టములకెల్లఁ బలుకుఁదేనియ పల్లెబట్ర లొసఁగుఁ
జలిగాడ్పు కోమటి చాలు సజాతీయములకుఁ దావులసంచి మొద లొసంగుఁ
గోయిల నాలనకొలముదాయాదుల కేలుకోఁ జిగురాకునేల యొసఁగు
కొమ్మల నెలర్చు సాలజాలమ్ములోనఁ, జిలుకసాంబ్రాణితేజీవజీరుఁ డనుప
దాణెమున్న వసంతుని రాణువెల్ల, గన్నుగుట్టెడు కడుపుంజి గనుటకతన.96

మ. ఎడలెం దత్తఱ చిల్కతేజిని జుమాయించంగఁ బల్మాఱు బ

ల్విడి వంచ న్రస మొల్కు లేఁజెఱకుమేల్వి ల్లెక్కుడించంగ న
వ్వెడవిల్కానికి దూరదేశగమిథోవిశ్లిష్టమోహావల
జ్జడిమాకంపితధైర్యదంపతిహరచ్చైత్రాదియాత్రారతిన్.97

క. ఆతఱిఁ దమి వెగ్గలమై, శాతోదరి పొగుల మిగుల జడిసి శరీర

ద్యోతకము లైన చిన్నెల, చేత న్విరహ మని తెలిసి చెలువలు తమలోన్.98

సీ. ఆయెనమ్మ యిదేటి యాగడా లిది యేమి యెఱుఁగు నిన్నటినేఁటి మెెఱుఁగుఁబోఁడి

యెఱుఁగునా యనఁగూడ దిప్పుడిప్పుడు కొంత గడిదేఱెలే వలకారివగల
గడిదేఱ కింక నెన్నఁడు మంచిమగవానిఁ గోరించు జవ్వనం బూరఁజేయ
జవ్వనం బౌనెకా చదువుకొన్నది గాన మనసు నిల్పఁగలేక మరులుకొనియెఁ
జెలువ యీబాము లనుభవించినను గాని, తెలియదే ప్రేగులోపలి తీఁట వంటి
వలపుకసికోఁత లివి పగవారి కైన, వలదుగా దీని కిపుడేల వచ్చెనమ్మ.99

చ. తడఁబడు మాట గద్గదిక దార్కొను నిల్చినచోట నిల్వరా

దడుగులఁ దొట్రుపాటు గదియంబడుఁ గంపము చెందు నిద్ర రా
దెడపని కోర్కి హెచ్చు మదినేమొ వితావిత జాలిజాలి యౌ
నడిగినఁ జెప్పఁగూడ దకటా మరులెత్తిన యాఁటదానికిన్.100

క. ఇవి యన్నియుఁ జెలులారా, చివురాకుం బోఁడియందెఁ జెలువొందెడు ని

క్కువ మింతకు విరహమహా, దవ మేకార్ణవము మీఁదఁ దగ వెయ్యదియో!101

మ. అతివా యింతకుమున్ను నన్బిలిచె డాయంబోయితిం బోయివ

చ్చితివా యంచనె నేడ కంటి నదె రాజీవాక్షి యే లెస్స వేఁ
డితిఁగా నిన్ననె నేటికే చెలువ యంటి న్నావెత ల్నీకు స
మ్మతమా యన్న వితాకురాలయితి సమ్మా కొమ్మ యమ్మాటకున్.102

క. అని రట్టు సేయు బోఁటులఁ, గనుసన్నలఁ గడకుఁ బోవఁగాఁ బనిచి ననుం

జనవిచ్చి మనుపుఁ గావున, నెనసినతమి వనితఁ జేరి యే నెయ్యమునన్.103

గీ. వచ్చి తడవాయెఁ గద మహీవలయమహిమఁ

జూచిన ట్లాయెఁ గద యింక శోభనాంగి
పోవలవదె మనపురంబునకు మగిడి
తల్లిదండ్రులు కడుఁ దల్లడిల్లకుండ.104

క. తెలిసె నిఁకఁ కొన్నినా ళ్ళీ, యిఁలగల చెలువములు చూడ నిచటనె నిలువం

దలఁచినకైవడి నున్నది, చెలువా యది లెస్స యట్ల చేయుద మేమీ?105

క. అని నన్నుఁ జూచి తలవాం, చిన డగ్గఱఁ జేఱి యే మొ చింతాసంతా

పనిరూఢి జెందునందము, గనఁబడియెడు నిట్టు లౌనొ కాదొ యెఱుంగన్.106

చ. సరసిజగంధి నీమది విచారము దోఁపఁగ వేఱొకండు లే

దరయఁగఁ గారణంబు నవయౌవనరూపకలావిలాసభా
స్వరుఁడగునట్టి యొక్కమగవానిపయిం గనువైచి తేమొ దు
ష్కరతరచింతచే నదియె కావలయుం దలపోసి చూచినన్.107

మ. బలభిన్నీలకచామణీ యిదియుఁ దప్పా కాంతులంగోరి కాం

తలు చింతింప కంతుకుంతముల వంత ల్నింపరో లేక నీ
తలనే పుట్టెనె యైన నేర మొకఁ డేతత్కార్య మాద్యంతముం
దెలియం బల్కకయుంట నీవలన నింతీ యంతనే వింతటే.108

క. నావంటి బోఁటి గలుగం, గా వగవఁగ నేల యెంతకార్యం బైన

న్నీవే కావలె నన్నం, దైవకటాక్షమునఁ గరగతము సేయ నటే.109

చ. అనవిని యాలతాంగి నగ వామతిల న్ననుఁ జూచి భావవే

దినివి గదమ్మ నీకు నిఁకఁ దెల్పకయుండఁగ నేర్తునమ్మ నీ
యనువు మదీయఘోరవిపదబ్ధికిఁ నోడ గదమ్మ వాఁడిమై
నొనరినకంతుతూపులకు నోడఁగదమ్మ యిఁకన్ వధూమణీ.110

గీ. నాతి యెఱుఁగుదువా యల్లనాఁడు డేగఁ, జేత సహియించి చిన్నతేజీదువాలిఁ

గాఁగఁ దోలుచు నీత్రోవగానె చనియె, నామనసు వానిమీఁదనె నాటెనమ్మ.111

చ. కలకల నవ్వుమోము పురిగల్గిననెమ్మెయి నూగునూగు మీ

సలు నపరంజిడా లెగుబుజంబులు చక్కని ముక్కు తేటక
న్నులు నిడుసోగకన్బొమలు నొక్కిన గ్రక్కునఁ బాలుగాఱు చె
క్కులు నిసునుంతకౌను తళుకుందొడ లానృపమౌళికే తగున్.112

క. కనమో వినమో ఘనమో, ఘనమోహనమోదకారికచ మగవానిం

దినముం భువనంబుల నా, మనము న్హరియించువాని మఱి గంటి మటే.113

గీ. వనజలోచన నేను గావలసినట్టి, దాననైతేని నెటులైన మాన వేంద్రుఁ

గూర్చి నాప్రాణ మిపు డెత్తుకొమ్ము లేని, పక్షమైనను నామీఁదిబాళి విడుము.114

క. అని పలికి సొమ్మసిల్లినఁ, గని దీని మనంబు తెలిసెఁ గద యిఁకమీఁదన్

మనసిజుఁ డదయుఁడు శరమే, సిన నేమగునో పరాకు సేయుదమనుచున్.115

గీ. ఎంతలే దింతి యిఁక లెమ్ము నంతయేల, యిందులకు నట్ల యొడఁగూర్చికొంద మబల

యపుడు నీచిత్త మే వచ్చు నిపుడు వట్టి, మాటలాడినఁ గలదమ్మ మానుషమ్ము.116

క. కొమ్మలకుం బురుషులకుం, గమ్మని విలుకాఁడె వేల్పు గావున నతని

న్నెమ్మదిగాఁ బూజింతము, రమ్మీ యలకేలివనికి రాజీవముఖీ.117

క. అని పలికి యేను నెచ్చెలు, లును మచ్చిక హెచ్చ నీవిలోలేక్షణఁ దో

డ్కొని వచ్చి కుసుమవిసృమర, వనిఁ జొచ్చి రసార్ద్రవచనవైఖరి బెరయన్.118

చ. అలవడఁ జంచలాలియుతమై సుమనోహరచాపహార్యన

ర్గలగతి మించి పాదపవికస్వరవైభవహారియైన యీ
యలఘువనోల్లసద్ఘనమహత్వము నేమని చెప్పవచ్చునో
లలితలతాంగి కామితఫలంబు లొసంగుచుఁ బ్రోచు నంపఱిన్.119

మ. పొలఁతీ యాపొన గున్నపొన్నవిరికిం బూఁదేనె బల్కాల్వగా

యలరన్ సారెకు నెక్కుచుం దిగుచు చాలై దుమ్మెద ల్మించె ని
చ్చలపుం జాయలతావిజాజివిరి నేజాజోడు గైకొన్న క్రొం
దలుకుం బచ్చలమేడఁ దార్చు జలయంత్రంబో యనం గంటివే.120

మ. సరసాళు ల్నిజగంధ మానుచుఁ జరించం గుంభినీజాతము

ల్వరుసం జుట్టుఁ జెలంగుచుండ మహావాలంబుకుం జాస్తిచేఁ
గర మొప్పార సుధాప్రభావమధువు ల్గ్రాల న్విదాహాతివి
స్ఫురితంబై విలసిల్లె నోయబల యీపున్నాగముం జూచితే.121

చ. అరవిరివెండిచెంబుల నయంబునఁ దేనియపానకంబు లేఁ

బరువగు గుజ్జుమావి చలిపందిరుల న్లతకూన లియ్యఁగా
నరుదుగఁ గ్రోలియు న్సరసిజాస్త్రగుణస్థితిఁ గండుదేఁటి ని
బ్బరమగుబాళిమై నధరపల్లవ మంటుటఁ గంటివే చెలీ.122

చ. హితగతి నిందుబింబరుచు లింపుఘటింప మనోజకాండసం

గతిఁదగు కైరవారముల గర్వము మించె వధూటి కంటివే
హితగతి నించుబింబరుచు లింపుఘటింప మనోజకాండసం
గతిఁదగు కైరవారముల గర్వము మించుట చోద్యమే చెలీ.123

చ. తనతను వెల్ల దాఁచికొని దక్షిణమారుతచోరకుండు నే

ర్పునఁ జనుదెంచి తావిఁ గొనిపో వనదేవత హెచ్చరిల్లి కో
యని పెనుఁబోటుఁగూఁత లిడునట్టిగతి న్విననయ్యె వింటివే
యనుపమగాత్రి కోకిలకులాకులకేళి కుహూకుహూధ్వనుల్.124

గీ. మేలితేనియనిండిన మెట్టతమ్మిఁ, జేరి కొలనాడి పుప్పొడిపేరి రక్ష

పొసఁగ నవ్వలి క్రొవ్విరుపురుటియిల్లు, వింతగాఁ జెందెఁ దేఁటి బాలెంత కంటె.125

క. అనియాలివితతకేళీ, వనపాళీగరిమమోలి వర్ణిచుచుఁ గ్రొ

న్ననగుంపుఁ జిదుము వేడుక, జనియింపఁ గడంగి సరససల్లాపములన్.126

రగడ

అతివరోొ చూచితె యలరెడి మావులు — జతకూడిన వివె చల్లనితావులు
ఏల? పొదలివె యిటు రారాదటె — యేల పోయె దన నింతనె వాదటె
చాలుచాలు నీ సంపెగ మొల్లము — బాలకంటివే పాదిరిమొల్లము
నెలఁత రాఁగదే నిమ్మల నీడకు — వలుక నేలనే యంతటి ప్రోడకు
ఎగిరి పడకులే యీకంకేలికి — జిగురు చాలదే చెలి నీ కేలికి
నాస లేటికే యందని పొగడకు — వేసట లే కీవిరులనె పొగడకు
పడఁతి రాకు నాపాలిటి పొన్నకు — ముడివిడె రోసము మొన్నటిచిన్నకు
వాసంతికకై వచ్చెడు చివ్వకు — దోస మెఱుంగని తొయ్యలి నవ్వకు
యీవిరవాదుల కేటికి ముచ్చట — తావులవిరికే తఱుమకు మిచ్చట
నెఱసిన వివి కంటివె వాసంతులు — యెఱుక లేదె నీ కేటికి రంతులు
పొదలిన వచ్చటి పుప్పొడితిన్నెలు — అది గైకొనిరే యప్పుడె కన్నెలు
తెఱవ దాఁటితే తేనియకాల్వలు — వెఱచిరి నేఁ డీవిద్యకుఁ జెల్వలు
సరసను మొలచెను జాలుగ మొల్లలు — దొరసెడు నచ్చటఁ దుమ్మెదపిల్లలు
బొండుమల్లె లివె పొలఁతిరొ మెచ్చితె — దండలు కడువింతలుగా గ్రుచ్చితె
పలుకకు కోయిలపదువులు మూగెడు — బొలఁతి వెఱచితే పూఁబొద లోఁగెడు
వెలఁది చూడు కురువిందలయందము — కెలఁకులఁ గడుఁ దొఱఁగించె మరందము
సురపొన్నల కీసున వెన్నాడకు — తరుణి వెఱతు నిత్తఱి నన్నాడకు
కోవిదారములకును వాదేటికి — నేనఁ గయ్యముల కేగెడు మాటికి
వనితలు బడలిన వగ కనిపించెను — కొనకొని తుమ్మెదకొదమలు ముంచెను.127

వ. అని పుష్పాపచయంబు గావించి చాలించినంత.128

క. మధురిమధురీణసవిధవి, విధమాధవికాప్రసూనవిసృమరమారం

దధునీమిధోవిహృతిమ, న్మధుపపథాళించమందమారుత మొందెన్.129

ఉ. మానవతు ల్గనుంగొని రమందమరందనవారవిందబృం

దానుసరన్మిళిందనికరాంధుకబంధురగంధసాంద్రమం దానిలమత్తసిందురవిహారవిలోలతరంగజాలడో
లానిశఖేలనాకలితహంసము నొక్కసరోవతంసమున్.130

వ. ఇత్తెఱంగునం గనుంగొని జలమానవకుమారు లెమ్మెలకై చిమ్ము క్రొమ్మెఱుంగుజము

దాడులటెక్కునం దళుక్కున నెగురు నిడువాలువాలుగుపిల్లలకై నికటతటతరు
పటలశాఖాశిఖానికరంబులనుండి దుముకు లకుముకులగరుత్తులం బెరుఁగు మరు
త్తులం దొఱఁగు సరాగంబు లగు పరాగంబులం దగిలి యరవిందమందిరకుం దార్చినగం
దవొడియఱపెట్టెలచందంబున నీషదుచ్చలితరథాంగంబు లగుతరంగంబులసందున న
దభ్రవిభ్రమంబునం దిరుగుజలభ్రమంబులం దగిలి నిగనిగనికెంపురాలు నింపిన గో
ముగను వామనగుంటలం దలపించుటకు శిరఃకంపనంబు సేయుచు జలబిందుసందో
హకందలితచిత్రశతపత్రపత్రసమావేల్లితం బగుహల్లకంబు వారిదేవత కెత్తుమరకత
పాత్రమౌక్తికారాత్రికంబుల డంబు విడంబింప నందులకు సోబనలువాఁడు ముత్తై
దువుల చెలువున మ్రోయు తేఁటినీటుకత్తియల తేటపాటలకుం జొక్కెనో
యన నాయకులతోడి పొలయలుకలం దొలంగి చని వనజకుడుంగంబులం గపటని
ద్రాముద్రితలై చలితజలాంబులికలు సోఁకిన నులికిపడి యనునయింపం బతు లేతెం
చి రని బయలుజంకించు నీటుకత్తియల తేటపాటలకుం జొక్కెనో బయలు జంకిం
చు జక్కవమించుబోఁడుల యలక్ష్యబహుతరాక్షేపంబుల పెల్లునకుం గొల్లున నవ్వు
చుఁ బువ్వింటిసాది మవ్వంపుననిగేరు మారుతమానవునకుం దీరసంచారిశిఖావళకుమా
రికాకేకారావంబు లను గద్దింపులం జళుకు వొడమించి నడదిద్దు నెడం బర్విన రజం
బువిధంబున దుమారంబుగా నుప్పరం బెగయు పుప్పొడిపేరింట నుల్లసిల్లు నుల్లడ
నీడలవీడుజోడాడువేడుకలఁ గమలినీకమలబంధుపాణిగ్రహణంబునకుఁ గులదేవతల
నెదురుకొనుచదురున లజ్జించుచు పుటసమంచితసకోరకబిసాగ్రపాలిక లగుచు వచ్చు
మరాలికాబాలికలకలకలంబులకుం గ్రమ్మికొని తమ్మిమేడ లెక్కి పెక్కువగల ఱేకుచి
క్కొమ్మలసందునం దొంగిచూచు మధుపానరోధవధూమణుల మిధస్సమ్మర్దకల
కోలాహలబాహుళ్యంబులకుం దగవు లూహించుచు నాళీకముకుళంబులను కలశకు
లంబులం బ్రతిష్ఠించి నిష్ఠాసంపదం గలహంసదంపతులు ప్రథమసమాగమంబునం బు
ణ్యాహం బాచరించి యెదురుసూడం బొడసూపిన యజ్ఞాతప్రభాతం బగు నిశాస
మయంబు విధంబుం దనరు పరిసరతరుచ్ఛాయామాయాంధకారంబునకుం దిగులువ
డి యప్పటప్పటికి వికసితాంబుజంబులం గనుంగొని యవియు ముకులింపమిం బొం
గు రథాంగకామినుల వినోదంబులకు ఖేదమోదంబు లనుభవించుచుఁ జెంగటఁ జె
లగు చెంగలువమాలెపై నంకించిపాడు టెక్కుల తేఁటిజక్కులవారియాలాపంబుల
లకుం బరిఫుల్లసరోజం బనుకామిల్లిచేరువఁ బరఁగు విగళితప్రసవపరాగపరంపర య
నుపరికమ్రుగ్గుల డగ్గఱ నందం బగుమందమరుదాందోళితేందీవరముపైనుండి శివ
మాడు సారసవరారోహలకు సమీపంబున శైవాలకలాపంబు లనుధూపంబు లర్పిం
చుచు మూఁగికొని యాగామికార్యంబు లడుగు నమ్మలక్కలచందంబునం బొసంగు
నానావిధజలవిహంగమాంగనావ్యూహంబున కుత్సాహంబుఁ బొందుచుఁ గమలాక
రాభిధానంబుగానం గంకణవిరాజమానంబై పుష్కరస్వరూపంబు గావున రాజహం
సకలాపంబై శోభితరంగవిశాలంబు గావున శైలూషప్రముఖానుకూలంబై సారం
గవిలసితంబు గావునఁ బద్మకరేణుభూషితంబై యెసంగుటకు నంతరంగంబున నా
నంద మందుచుం జేరి.131

సీ. వారు మీరును నొక్కవయసువారలు గాన నువిద వారికి మీకు సుద్ది యనుచు

నోడినదానిపై నొడిసిన నేలిక సానిపాదములపై నాన యనుచు
నాజతతోడ నేకాంతమాడితివి మాగుంపులో నీ వుండఁగూడ దనుచు
నంటిమి గాక మర్యాదతో నిల్చునే యప్పటికైన యట్లగు నటంచు
బాల యలనాఁడు నామీఁద నోలవెట్టి, తిచ్చ నిఁకమీఁదఁ జరియింపుమీ యటంచు
నందు కేమాయెఁ గాని లేవమ్మ యనుచుఁ, బలికికొంచును దెగలుగాఁ బంచికొనుచు.132

మ. మెలఁతల్ తుమ్మెదకంటుకమ్మవిరిరుమ్మీపాదుషామామ మా

టలతబ్బిబ్బుల కుల్కి కీలుజడఁ గొట్టం బూను జేజేలయొ
జ్జలయిల్లాలని వ్రాసినట్టి వలువ ల్చాలించి యచ్చంపు ని
చ్చలపుంజందురుకావి పావడలు మించన్ ఖేలనాలోలలై.133

గీ. డాసి దరి నిల్వ వారినీడలు పొసంగె, నీటిలోఁ దమ్మిమేడల నీటు రోసి

తన్ముఖాంభోజముల నిల్వఁదలఁచి వచ్చు, పద్మ తాల్చిన విశ్వరూపము లనంగ.134

చ. సుదతులు బంతిగాఁ గొలనుఁ జొచ్చి చనంగఁ గ్రమక్రమంబునం

బదములు ముంచి పెందొడలఁ బైకొని పొక్కిట నాఁగి చక్రసం
పదలు సహింపలేని కుచభారము లోఁగొని కంఠదఘ్నమై
తుది నటు మించదయ్యె నలతోయము కంబులు నాఁగమించుటన్.135

మ. కొల నయ్యింతులు సొచ్చినం దరగ సోఁకుల్ హెచ్చిన న్వీఁగుఁ ద

మ్ములపైఁ దేఁటులు వేఱుతామరలపై మూఁగం దదీయాళిరే
ఖలు వాటిం గదుమంగఁ దధ్వనికి రేఁగం జక్కవ ల్దాఁటు ఱె
క్కల లేఁదెమ్మెరపుప్పొడుల్ చదలనాఁగం జిత్రమయ్యె న్వడిన్.136

చ. చెలువ యొకర్తు క్రొందళుకుఁ జెందొవ బిట్టెగరంగవైవ న

య్యలరు తదంజలిం బడుట యద్భుత మయ్యె మదీయపద్మరే
ఖలఁ జెలరేగి గాసి యిడఁగాఁ దగునే యని యేగుదెంచి చే
తులపయి వ్రాలి వేఁడికొను తోయజబాంధవబింబమో యనన్.137

గీ. సారకుచశైలమథితకాసారజలధి, నప్పుడప్పుడు వొడము నబ్జారికరణి

నొకశుకాలాపమించి వెల్లకిల నీఁద, నమరె ముద్దులుగాఱు చిన్నారిమోము.138

చ. ఎలమినొకతులు వెల్లకిల నీఁదఁగఁ జుట్టును గల్యమొగ్గ ల

గలముగ మించెఁ జన్నుఁగవకాంతులు గన్గొనవచ్చు నంబురా
డ్జలరుహగంధి పంపఁ బరిచారిక లచ్చట ముద్దుగాఁగ పొం
దులు గని వైచు గూటములతోడి కడానిగుడారము ల్బలెన్.139

గీ మొగము మాత్రంబు కానరా ముద్దుగుమ్మ

యొకతె నిలువీతఁ యీఁదఁ జెన్నొందెఁ గురులు
నీరజాకరమనెడు మున్నీటిలోఁ గృ
పీటములు గ్రోలు మేఘంబుపిల్ల యనఁగ.140

క. బోరగిల నీఁదు నొక్కమి, టారి విశంకటకటీతటం బొప్పారెన్

సారతరాపరపారా, వారావృతమైన భూమివలయం బనఁగన్.141

గీ. బాలికలు మేలి జీరుకురాలనుండి, నీటికై జారు సౌరు వర్ణింపఁదగియె

నలమదాలసపై నదరంట నేయు, నలరువిలుకాని నునుదోనియమ్ము లనఁగ.142

సీ. చనుఁగవమీఁది చందనము చెందినచోటు వెలిదమ్మిపుప్పొడు ల్గలసికొనఁగ

మెడల కుంకుమచర్చ మించి ముంచినచోటు చెంగల్పవిరిగుంపు చేరికొనఁగ
సారమౌ నుదుటి కస్తూరి మీఱినచోటు తేఁటిలేజవరాండ్రు మాటికొనఁగఁ
నెమ్మినిఁ బసుపువన్నియలు పన్నినచోటు నవకంపుటకరులు నాఁచికొనఁగఁ
జెలువ లీరీతి నీరాడి కొలను వెడలి, తమముఖాంభోజముల నిండు తావి గ్రోలఁ
దేనియలు గ్రాయు కక్కుర్తితేఁటు లనఁగ, జలజకణములఁ గీలుగంటలు సెలంగ.143

చ. తటమహిఁ జేరి యంతట మదాలసకుం గయిసేసి తాము ను

త్కటమణిభూషణావళులు దాలిచి యేటిపరాకులమ్మయి
క్కుటిలకచాశిఖామణికిఁ గోరుకులిచ్చు రమాకుమారు నె
క్కటి భజియింపకున్న నిది కార్యముగా దని యేగి యవ్వలన్.144

వ. చెలువగు పూఁబొద న్వలపు చల్లెడు కస్తురితిన్నెయందుఁ గెం

దలిరుపరంగిపీఁటపయిఁ దామరఱేకునఁ జెంతనున్న నె
చ్చెలి మొగ మోరసేయ రతి చెక్కులు నొక్కుచు మోవి యానుచున్
గలరవ మిచ్చు పచ్చవిలుకాని లిఖించి సఖీశిఖామణుల్.145

చ. అలిగిన మ్రొక్కి చుక్కజవరా లదలించుచుఁ గాలఁ దన్నినం

బులకలు దాల్చు చందురుని పొంకము వ్రాసి వసంతు మత్తకో
కిలములఁ దేఁటులం జిలుకగేస్తుఁ దెమ్మెరయాకతాయలన్
నిలిపి యమర్చి తెచ్చిన వనీకుసుమంబులు కుప్పవోయుచున్.146

క. పూజించి చిలుక ముష్కీ, తేజీదొరఁ గూర్చి వికచదీవ్యద్గంగా

రాజీవ నవమధుద్రవ, రాజీవరవైఖరీపరంపర దొరయన్.147

మ. హిమరుగ్భాంధవ మంత్రరహీనము క్రియాహీనంబు సద్భక్తిహీ

నము మత్కల్పితమైన యీనిఖలనానాసూనపూజావిధా
నము సంపూర్ణముగాఁ దలంచి దయ నానందింపు నీవంటి దై
వము చిత్తంబున మెచ్చినం గలుగలేవా మన్మనోభీష్టముల్.148

గీ. అరయ హరునంతవాఁడు త్వద్గురుశరాగ్ర, దళితపురదర్పుఁడై మహాదరముతోడ

నబ్జశరపాలిఁ గని మౌళి నావహించు, ననిన నీశౌర్యసార మే మనఁగవచ్చు.149

క. దైవం బనిన న్నీవే, దైవము గా కింక నొకఁడు ధవళాక్షుల నా

శీవిషవిశిఖశిఖార్తులఁ, గావింప న్వరులఁ గూర్పఁగా నెవ్వ డిఁకన్.150

సీ. వేఁడి యౌఁగదవయ్య విహితశైత్యాంధమంధరగంధవాహస్తనంధయంబు

వాఁడి యౌఁగదనయ్య వనజాతిసహజాతిమార్దననవకౌసుమవ్రజంబు
చేఁదుచూపుఁ గదయ్య జితసుధామాధురీసారకీరారావగౌరవంబు
వింతసేయుఁ గదయ్య సంతతాత్యంతపోషితహంసకాంతానిషేవణంబు
కామినీకాముకులకు యోగప్రసక్తి , దక్షమగు నీకటాక్షము దప్పెనేని
గాన నిను గొల్చువారిదే కౌశలంబు, భవజయోన్నిద్రతారీణ పంచబాణ.151

సీ. వీటిఁబుచ్చవె దాసవిభుకన్యఁగను బరాశరమౌనివనరు సదాచారగరిమ

బైట వైవవె బృహస్పతిభార్యఁ గనుఁగొన్న తారకాకామినీధవునిగుట్టు
నగడు సేయవె యహల్యాకాంతఁ జూచిన యమరలోకాధినాయకుని నడత
కొద వొనర్పవె కూర్మికూఁతు నీక్షించి యుబ్బిన పద్మసంభవు పెద్దతనము
భావభవ యమ్మచెల్లగా నీవు చేత, సేజఁ బట్టిన నెవ్వారు నిలుచువారు
మారమణి నింతయేఁచిన యాఋతధ్వ, జేంద్రుఁ జెనకంగఁజాల వదేమొకాని.152

క. మారామపట్ల నీసుష, మారాజచ్ఛరము దాఁపుమా రాజ యిదే

మారాటమునకు నోర్వదు, మారాజముఖీమణీకుమారా మారా.153

క. అని మగువ యపుడు మగుడం, బని వడి పొగడ న్మధాంధపాంథజిగీషా

తనుతత్తురంగహేషా, ఘనతరఘోషాప్తి యొదవఁగాఁ గలఁగుటయున్.154

శా. చీనాచక్కెర ఖాణపుంబులుఁగుఁ దేజీజోదుకేదంగి బ

ల్సానాకత్తికిఁ దత్తరిల్లి నవలాసాయంసమారంభవే
లానాలీకినిలీల సొమ్మసిల బాలాపాలికల్ చంద్రకాం
తానర్ఘాంతికవేదిఁ జేర్చి బహుచింతాకంపితస్వాంతులై.155

సీ. మదనుగుణవ్యక్తిఁ బొదలెడు తేఁటులే మంచకింకను ఝంకరించఁ దొడఁగె

మానసప్రేమ యేమఱని రాయంచ లే మించికొంకక హుకరించఁ దొడఁగె
సహకారవృత్తిచే జరగు రాచిల్కలే కొంచకిక్కడ వెక్కిరించఁ దొడఁగె
ఘనమెత్రిచే నెమ్మిగను నెమ్మిగుంపులే ధృతియింకఁగా హంకరించఁ దొడఁగె
నేమి చేయుదుమే బోఁటి యింక నేటి, మాటలే పోటు మరునకు మగువమీఁద
నింతపగ యేల బాలవాఁ డేమి చేయు, మనలపాపంబు పొలియింప ననుచు మఱియు.156

ఉ. కొమ్మ చిగుళ్లు దెమ్మలతకూన విరు ల్గొనిరమ్ము పద్మినీ

తమ్ములు గొంచురమ్ము వనితామణికి న్ననశీతలోపచా
ర మ్మొనరించకున్న వలరాయని రాయడి నేమి పుట్టునో
యమ్మకచెల్ల యింకఁ దడయం బనిలేదని సంభ్రమంబునన్.157

సీ. ఆడుగునఁ బడవైచి రని దళం బెత్తునో నెత్తమ్మి పదముల నిలుప నేల

యంకంబునకుఁ దార్చి రని పొరవిచ్చునో యనఁటు లూరులచెంత నునుప నేల
యధరభూమిని నిల్పిరని మొనచూపునో చిగురాకు కెమ్మోవిఁ జేర్ప నేల
యంబకమ్ముల నుంచి రని యెఱ్ఱవాఱునో హల్లకం బక్షుల నలమ నేల
యిచట సమవస్తుసంయోగ మేల యమ్మ, యిదియుఁ బగవూనేె నేని నీయిగురుఁబోణి
తాళలే దమ్మ మీనేర్పు చాలునమ్మ, తరుణి యివి యెల్ల మదనసాధనము లమ్మ.158

క. అనుచుఁ బెనఁగొన్న తత్తర, మునఁ దగు శిశిరోపచారములు చేయుటయున్

మనసిజశిఖ బగ్గురుమన, నెనరునఁ దత్సఖులగుండె నెగ్గురు మనఁగన్.159

సీ. తనులతమీఁద జివ్వున నింకి మిహికాంబుకాండ మెంతయు నిరాకార మయ్యె

నఱచేతిపైఁ జుఱచుఱ స్రుక్కి యందందఁ గెందమ్మి పుష్కరాకృతి వహించెఁ
గలికి కన్నులమీఁదఁ గమలిన పరువంపు ననగుత్తు లయ సూనంబు లయ్యె
మినుకుఁ జందోయిపైఁ దునిసి మౌక్తికరాశి తిలకింప ముత్తెంపుతెరలు వూనె
బళిర యివియెల్లఁ దమపాటు దలఁప కిప్పు, డంగజాగ్నికి సాహాయ్య మాచరించి
కొమ్మ పై వేఁడి చూపె నాకమ్మవింటి, యెమ్మెకానికి విజయకాలమ్ము సుమ్ము.159

గీ. అదియుఁ గా కిందుఁ జనుదెంచునపుడు తమ్మి, విరుల దగుకమ్మదెమ్మెరల్ వీచెనమ్మ

గైకొనక వచ్చినంతయుఁ గంటిమమ్మ, యబల నిం దుండనీయరా దమ్మ యనుచు.160

క. ఇందీవరలోచన లిం, దిందిరకచ సేద దీర్చి తెచ్చిరి సుషమా

కందలితైందవరుచిగరి, మందిరమగు ధవళవసనమందిరమునకున్.161

గీ. ఇట్లు చెలువలు దోడ్కొని యేగుదేర, నంబుజానన తనగుడారంబుఁ జేరె

ననిన జైమినిముని యావిహంగములన, నంతర కథావిధం బెట్టిదని యడిగిన.162

శా. లక్ష్మీశోపమ వీరవేంకటనృపాలశ్రీమహారాయ ద

త్తక్ష్మామండల మండనాయిత యశోదామాభిరామాంశునీ
రక్ష్మావర్తన కార్తికీకుముదినీప్రాణేశ చారుప్రకా
శక్ష్మీలత్ప్రతిపక్షభూమిపతియోషాలోచనాంభోరుహా.163

క. ధాటీఘాటీఖరఖుర, కోటీపాటితవిరోధికుతలపతిశిరః

కోటీరహారశకలవ, ధూటీనవమదన విభవధూర్వహసదనా.164

పంచచామరము

వచావదాహిభోగిరత్న వర్ణవర్ణితక్షమాం, గదాగదాసిమద్విరోధిఖండనాత్తలోకస
మ్మదా మదావళారివిక్రమస్ఫురదృశఃకలా, పదాపదానవద్రులోకపారిజాతవైభవా.

గద్య

ఇది శీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమన్వయా

భరణ నారాయణభూపాలతనూభవ శఠగోపతాపసేంద్రచరణారవింద సంచలన్మా
నసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర రూపరేఖావిజి
తచైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధాయక చిననారాయణనా
యకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రంబను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.