కుమారసంభవము/చతుర్థాశ్వాసము

శ్రీ

కుమారసంభవము

చతుర్థాశ్వాసము

శ్రీమదశేషమునీంద్ర । గ్రామణినుతచరితు విగతకల్మషు శివత
త్వామలమతిప్రకాశు ద । యామృతసరసీజు మల్లికార్జునదేవున్.

357


వ.

ఇట్లు పార్వతి పరమభక్తియుక్తిం దగిలి నిరంతరశుశ్రూషాతత్పర యగుచుండె
నంత.

358


క.

వినుతింపఁ గామసుఖసా । ధనముగ గౌరిఁ జంద్రధరుఁడు తపస్సా
ధనముగఁ జరించె నుత్తము । లనయము విపరీతచరితు లైనను జనదే.

359


వ.

ఇట్లు పరమేశ్వరుండు తపోవృత్తిం దగిలి జగద్వ్యాపారంబు లారయ కునికిం
జేసి తారకాసురుం డను ఘోరాసురుం డేచి హరిపరమేష్ఠిపురందరాదుల
కజేయుండై సకలజగజ్జనంబుల కనేకోపద్రవంబులు సేయం దొడంగిన.

360


క.

వానిపటుదండములు కమ । రానీకము లప్పగింప కపగతరాజ్య
శ్రీనిలయునై పితామహుఁ । గాఁనఁగ జని రెందుఁ బొందుగానక భీతిన్.

361


వ.

తదవసరంబున.

362


సీ.

మ్రొగిఁ దముఁ బడసినమునులమూర్తుల మీఱి ధర్మశాస్త్రములు మూర్తములు దనర
మణిదీధితులపెంపు మాయించి సాలోక్యముక్తులు తనుతేజములు వెలుంగ
వాణివీణారుచి వారించి సామగానంబులు తుతులఁ దియ్యంబు బెంప
మృగమదాదులతావి మగిడించి సుడిసి నిజాననాంబుజగంధ మతిశయిల్లఁ
జామరగ్రాహిణీకరచారురత్నరుచుల వెలుంగజేయక పాశరుచులు వొలయఁ
కనకమయపద్మకర్ణికాగ్రమున విశ్వకర్త సుఖలీలఁ బేరోలగమున నుండె.

362

వ.

ఇట్లు శతానందుండు సదానందకందళితహృదయారవిందుండగుచున్నంత
బృందారకబృందంబు గాందిశీకులై కంది తదీయాననారవిందమకరం
దంబుల కెఱఁగునలిసందోహంబునుంబోలె నెఱఁగి నానావిధస్తుతిరవంబు లురి
య నభయ మభయ మనుచున్నదేవేంద్రాదిగణంబులం గని విరించి గరుణించి
యోడక లెండని.

364


క.

మీ కింత వంది కంద భ । యాకులతం బొంది నిర్గతైశ్వరులరై
రాకకుఁ గారణ మేమి త్రి । లోకాహితదనుజతతికి లోఁబడరువరే.

365


వ.

అని తమవచ్చినకార్యస్వరూపంబున కనురూపంబుగా నానతియిచ్చినవాక్పతికి
బృహస్పతి నిటలతటఘటితకరకమలముకుతపుటవిలసింతుండై తారకాసురుబారిం
బడి తమబ్రదికి వచ్చినవృత్తాంతం బెల్ల నెఱింగించి వానిదోషవిశేషంబులు
విజ్ఞాపింపందలంచి యిట్లనియె.

366


సీ.

వేళ్ళతోడుతఁ గల్పవృక్షముల్ పెఱికించి కొనిపోయి తన కుపవనము జేసెఁ
గనకాద్రి గొనిపోయి తన కెక్కియాడ నిజారామభూమిఁ గ్రీడాద్రిఁ జేసె
నమరారి దనపేరియచ్చులు వెట్టించి సురధేనుసమితిఁ గీలరము సేసె
గరుడోరగామరతరుణుల నందఱఁ జేకొని తనవిలాసినులఁ జేసె
వేదవిహితవృత్తి విప్రుల నుఱిచెఁ దత్సతులపురుషభక్తి సలుపు దుడిచెఁ
బుణ్యకర్మ ముఱిచె భువి నిట్లు నిఖిలాపకారకుండు బలిమిఁ దారకుండు.

367


మ.

తన తేజం బహిమాంశువై తనమహత్త్వం బావసంస్తోమమై
తనకోపోన్నతి రుద్రులై తనమహెూత్సాహంబు సిద్ధాదులై
తనచె న్నశ్వినులై వెలుంగఁ దనదోర్దర్పంబు దిక్పాలురై
చన గీర్వాణనియోగము ల్గొని నిజేచ్ఛం దాన పాలించెడున్.

368


క.

అనిమిషపురముల నెల్లం । దనబలునాయకుల నిల్పదలఁచినవాఁడై
దనుజేంద్రుఁడు గోల్కొననీ । కనిశముఁ బోఁదోలుచుండు నమరగణంబున్.

369


క.

ఇలఁ జిత్రము తారకుకర । తలసంగత మైనఘోరతరవారి సొర
న్నిలు పగుఁ దనుఁ జొర కడరిన । దలమునుక యగు న్విరోధితతి కబ్జభవా.[1]

370

చ.

పలుపఱుతారకుండు సురపాలపురంబులు గాల్చుధూమప
ఙ్తులు పయిఁ గప్పుచున్న బెనుధూపటమై పొగసోఁకి కందెఁ గా
కలవఱ వానితోడివగ నబ్జుఁడుఁ గందఁగ నీయలంతి వీ
రులె మొగపెట్ట కాసురవిరోధికి నోడినవార వోరులన్.

371


గీ.

పోరఁ దన కోడిపాఱునీహారరోచిఁ । బట్టుకొని పోయి దానవప్రభుఁడు బిఱికి
వారి కెల్లను నొగులవానిఁగాఁగ । నురముపై జీడి నిఱ్ఱి య చ్చొత్తివిడిచె.

372


క.

ఆలమున నసుర చిచ్చును । గాలియుఁ గొని కవియుననుట గల దెదిరిరిపుల్
గాలుదురె దీఁ గనుకనిఁ । గూలుదు రెందేని నర్కతూలమ వోలెన్.

373


క.

సురగరుడోరగవిద్యా । ధరపురవరసతులతోడ దనుజేశ్వరుకిం
కరులు రమింతురు దోషా । చరులకు వెలిలోపు గలదె చతురాననుఁడా.

374


గీ.

ఇప్పుడు నీ కే మిన్నియుఁ । జెప్పిన నందేమి దనుజుఁ జేకొని దయతో
నెప్పుడు వర మిచ్చితి నీ । వప్పుడ మది నీడవిడిచి తమరుల నెల్లన్.

375


క.

కాలవశంబునఁ దనుజుఁడు । గాలునిఁ గీడ్పఱచె బలిమిఁ గాలుని నోర్చెన్
గాలునితేజ మడంచెన్ । గాలుఁడ తా నయ్యె నెల్ల కడలును బేర్మిన్.

376


క.

గోపాలక విను మిప్పుడు । గోపాలకు లాదిగాగఁ గుత్సితమతులై
గోపాలకు లెల్లను జెడి । గోపాలకు లైరి దారకున కతిభీతన్.

377


క.

విషధరుఁడు హరియు దక్కఁగ । విషధరసురగరుడయక్షవిద్యాధరత
ద్విషధరపదచరు లాదిగ, విషధరులై రిప్పు డసురవీరునగళ్ళన్.

378


సీ.

మృడునెద్దుఁ గొని [2]*గాడ్పుమృగము బండ్లఁగిఁ జేసి యెలయించి నెలలోని యిఱ్ఱినేయు
గౌరివాహనము దిగ్గజముల కుసికొల్పి విడిచి సింహముఁ బట్టి వేటలాడు
హరిఁ ద్రోచికొని పోయి గరుడుండు డేగగా విడుచు భేరుండాదివిహగములకు
జముపోతుఁ దెచ్చి భాస్కరుతేరిమావుల నెగిచి నుగ్గాడ వ్రేయించి చూచు

చుండు రేయుఁబగలు నొండువినోదముల్ విడిచి సురల మీఁదివేఁట దగిలి
తారకుండు రిపువిదారకుం డనివార్యవిక్రముండు దనుజచక్రవర్తి.

379


క.

ఇనశశితేజంబుల జగ । మనిశము విధి నడపు టెంత యని వాని మహిం
జననీక తారకప్రభ । జననడపెడి మిమ్ము మిగిలి సామర్థ్యమునన్.

380


క.

కోపించి సురల వెలువడ । ద్రోపించె సురారి బలిమి ధూర్జటి నీళ్ళున్
మోపించె విష్ణుఁ బసులం । గాపించెను మీకు నొరయుగడఁ బ్రాపించెన్.

381


మ.

హరుఁ డాదైత్యుని కోడి చన్నసడి వాయుంగాక మోక్షార్థమే
విరసం బైనతపంబు సేయఁదొడఁగెన్ విష్ణుండు తద్బాష్పభీ
కరదండాహతి దీర్ఘనిద్ర సనియెం గా కింతకాలంబు సా
గరమధ్యంబున నిద్రసేయునె జగత్కల్యాణకాక్షాత్ముఁడై.

382


క.

మందారార్కాలములు । ముందారార్కావనీజమయ మయ్యె సదా
నందనవనజావాసము । నందనవనజాకరాభినందిత మయ్యెన్.

383


సీ.

అనిమిషపతిపుర మనిమిషాస్పదమయ్యె ననలుప్రోలెల్లను ననలమయము
ప్రేతాధిపతివీడు ప్రేతసంగతము పలాశనునెలవు పలాశయుతము
వనధీశునగరంబు వనచరాకీర్ణంబు మారుతాలయము భీమారుతంబు
కనకాధిపతివీడు కనకోదితంబు శివావాస మెల్ల శివాన్వితంబు
సేసెఁ గానఁ దారకాసురుదెస విపరీతవృత్తి లేక రిత్త దూఱు
లేఁటి కనిన నాసురేశ్వరామత్యువక్రోక్తి విని సరోజయోని నగుచు.

384


వ.

నిజవరప్రభావంబున దారకుండు ప్రజలుండగుటకు సంతోషించియు నిఖిలజగద
పకారుం డగుటకుం గోపించి తద్వధోపాయంబు విచారించి కని.

385


చ.

వెలయు నుమామహేశ్వరులవీర్యమునం దుదయించునట్టిదో
ర్బలకలితుండు గాని సురపాలకవిద్విషుఁ దారకాసురున్
గెలువఁడు పోరిలో మకరకేతనుఁ బంపుడు వారికిం దప
శ్చలనము సేసి మైవడిఁ బ్రసంగము సేయు జగద్ధితంబుగాన్.

386


వ.

అని తమకుం గరుణించి చతుర్ముఖుండు హితోపదేశంబు సేసిన దానికి మహా
ప్రసాదం బని వీడుకొని.

387

క.

తమ కప్పుడు త్రిభువనరా । జ్యము సేకుఱి నంతకంటె సంతోషముతో
నమరతతి గొల్చి చనుదే । నమరేంద్రుఁడు వచ్చెఁ బేర్మి నమరావతికిన్.

388


వ.

ఇట్లు వచ్చి పచ్చవిల్తు రావింపం బుచ్చినం దదాజ్ఞాప్రేరితుండై కుసుమాయుధుం
డాక్షణంబు కదలి.

389


ఉ.

పూవులతేరు జక్కవలు పూన వసంతుఁడుఁ దాను నెక్కి కీ
రావళి గోకిలాళి మలయానిలముం దనుఁ గొల్చి పొల్చి రాఁ
గా వరమీనకేతనము గ్రాల నలివ్రజశంఖకాహళా
రావములుం జెలంగ నమరావతికిం జనుదెంచె నున్నతిన్.

390


వ.

ఇట్లు శృంగారయోని శృంగారరసప్రవాహంబు మేరదప్పి కప్పున ట్లప్పురంబు
సొత్తెంచు నప్పు డతిసంభ్రమంబునఁ బుష్పాయుధుం గనుంగొని.

391


ఆ.

పడఁతు లెల్లఁ గామపరవశులై రది దగు మనోజుఁ జూచి మగలు గరము
ప్రీతి దగిలి గంటబేటంబు గొని సురపురిజనంబు లెల్ల విరలిగొనిరి

392


వ.

ఇ ట్లఖిలజనసమ్మోహనాకారుం డగునమ్మోహనాయుధుండు వజ్రాయుధు
నాస్థానరంగంబు దఱియం జొత్తెంచి.

393


శా.

రంభాద్యప్సరసౌఘలాస్యరసపూరస్ఫారనేత్రామలో
జ్జృంభాంభోజసహస్రభోగఫలభాసిం దారకోన్మూలనా
రంభాయత్తసుచిత్తు నిర్దరధునీరాజీవమాలాధరున్
జంభారాతిఁ బురందరుం గని మనోజాతుండు ప్రీతాత్ముఁడై.

394


గీ.

తన్నుఁ గని యనిమిషులైరొ మున్నయైరొ । నాఁగ ననిమిషదృష్టిని నాకిసమితి
దగిలి కనుకొని వారిచిత్తములఁ దనకు । నెఱగ నమరేశునకును రతీశుఁ డెఱగె.

395


వ.

ఇట్లు సురరాజు వలరాజుసుందరాకారంబు గని ముదితహృదయుం డగుచు సము
చితాసనతాంబూలదానసన్మానాదులం బ్రహృష్టమనస్కుం జేసిన సురపతికి రతిపతి
నిజభుజాకలితపుష్పకోదండకాశలోన్నతి నెచ్చి మహూత్సాహంబున నిట్లనియె.

396


మ.

అతినిష్ఠాపరుఁడై సురేంద్రవిభవవ్యాసక్తి నుగ్రాధిక
వ్రతముల్ చేకొని ధీరులై నడతు మన్వా రెవ్వరైనన్ శుభ

స్థితి నెందేనియుఁ గల్గినం బనుపునన్ శీఘ్రంబ పుష్పాస్త్రసం
హతి విచ్ఛిన్నమనస్కులన్ విషయమాయాగ్రస్తులం జేసెదన్.

397


క.

పరమపతివ్రతలై సుర, పురములు సాధింప నున్న పుణ్యస్త్రీ లె
వ్వరు గలరు చూపు చూతాం, తురశరహతిఁ దిరులు మరులు గొలిపెద వారిన్.

398


చ.

అనుపమరూపయౌవనమహాగుణవైభవలీల నెవ్వరిం
గనుగొని మెచ్చకున్న వరకన్యక గల్గిన దాన్నిఁ జెప్పు నీ
పనిచినవాని వేలకొని పైఁ బడ జేసెద నీవు దన్నుఁ గ
ల్చిన నొరుఁ దాను గల్చి చనుచేడియ గల్గినఁ జూపు తెచ్చెదన్.

399


చ.

వలయుజనాలి కెల్ల మును వశ్యులఁ జేసితిఁ బుష్పబాణకౌ
శలమున సూర్పకాదిరిపుసంహతి నోర్చితిఁ దీవ్రసాయకా
వలిఁ ద్రిజగంబులందు వశవర్తులు భీతులు గాని నాకు న
గ్గల మొరు లెందు లేరు విను కౌశిక నేర్పున విక్రమంబునన్.

400


సీ.

జలశాయి ననుఁ గన్నజనకుండు హరి చక్రియైనను స్వామికార్యంబుగాఁగ
వేదజడుం డైన విధి పాశసంయుక్తుఁడైనను నాదుమహాత్మ్య మమరఁ
బరమతపోనిధి పరమేశుఁ డుగ్రాక్షుఁడైన నపారశౌర్యంబు వెలయ
మఱియు నమర్త్యాహిమర్త్యాధిపతు లెంతశుచులయ్యు నాయుధశూరులైన
నీక్షణంబ సతుల కెఱగింతుఁ బుష్పాస్త్రకౌశలమున నదియుఁగాక పోర
నీసుదక్క నీకు నెఱిఁగింతు నత్యుగ్రబాణశక్తిఁ దన్నుఁ బంపు దేవ.

401


క.

వెరవున భుజశౌర్యంబున, సురవల్లభ పనుపు నీవ చూడఁగఁ బరమే
శ్వరునైన నేర్తు బెఱసుర, సరఫణిదివిజాధిపతులు నా కెదురుదురే.

402


వ.

అని నెనరు ముట్టం బూనినకుసుమాయుధుపూనికి వజ్రాయుధుండు ఘనంపఱిచి
తారు తారకాసురుచేతం బరాజితులై పరమేష్టిమఱువుఁ జౌచ్చినవిధంబును విధి
తద్వధ కుపాయం బయ్యుమామహేశ్వరులవీర్యసంభవుం డైనకుమారుం డగు
నని హితోపదేశంబు సేయుటయు హరగిరిజలు నైష్ఠికానుష్ఠానులై హిమవంతం
బున నున్నవారు వారికి సంగమంబు సేసి జగద్ధితంబు సేయు మిది యనన్యవిష
యంబు నీవలననకాని యొరునకు సాధ్యంబు గాదు కావున నిన్నుం బ్రార్థించితి
నెట్లనిన.

403

మ.

ధర నత్యుత్తము లైనధీరుల మనస్తాపంబు వాప న్మహా
పురుషానీకము యోపుఁ గాక మహి నల్పుం డోపునే యధ్ధరా
ధరనైదాఘనితాంతదాహ ముడుపన్ ధారాధరానర్గళో
త్కరధారావళి గాక యార్ప నగునే గండూషతోయంబులన్.

404


వ.

అని తన్ను నగ్గించుచున్న సురవల్లభుం జూచి రతివల్లభుండు విజృంభించి.

405


చ.

పరముతపం బడంచి మఱి పార్వతియం దనురక్తుఁ జేయు మా
యిరువురకుం గుమారుఁ డుదయించిన మాపగ దీఱు నంచు న
చ్చెరువుగ నన్నిదొంతులును జెప్పఁగ నేఁటికి వానిపై సురే
శ్వర ననుఁ బంపు మీక్షణము చంపెద మీపగదీఱఁ దారకున్.

406


క.

తారకునోర్వఁగ వేఱకు, మారకుఁ బడయంగ సంగమము సేయను మున్
వారలపైఁ బంపనినాఁ డారిపుపైఁ బంపు మాతఁ డధికుఁడె నాకున్.

407


వ.

అనిన సురేంద్రుండు నీ కసాధ్యం బెందును లే దైనను బరమేష్ఠి వచనం బలంఘ
నీయం బగుట నిదియ మనకుం గర్తవ్యంబు దీని కొడంబడవలయు నని ప్రార్థిం
చిన నప్పని గైకొని నా కిది యేమిగహనం బని దర్పకుండు దర్పించి.

408


గీ.

శూలి సేకొన్నతప మెల్ల నాలిసేసి, యతనిదేహంబునందు సా మాలిఁ జేసి
కామకింకరుఁ జేసి నాకడిమి నెఱపఁ, గంటి నీప్రస్తవము దీర్పఁగంటి నెలమి.

409


వ.

నాకుం దగిన కెలసంబు గంటి దీని కింతకు మైకొంటిఁ దాంబూలంబు దయ
సేయు మని వసంతసహితంబుగా వలరాజు సురరాజుచేత నపారసత్కారం
బులు గొని వీడుకొని చనుదెంచునంత నిక్కడ.

410


చ.

రతి మతిఁ దల్లడిల్లి పతిరాకయ వార్చుచు నంతకంత క
ద్భుతములు దుర్ణిమిత్తములు పుట్టుచు నోలి నిజాంగసంగతో
ర్జితభయదాసురాద్యశుభచేష్టల కెంతయు బెగ్గలించి దుః
ఖిత యగుచున్నచో మకరకేతన మంబరవీథిఁ గ్రాలఁగన్.

411


క.

అలిగానము మదకోకిల, కలనాతోద్యమును శుకస్వసఘనమం
గలపాఠరవము భోరనఁ, జెలఁగఁగ రతిఁ గానవచ్చెఁ జిత్తజుఁ డెలమిన్.

412

క.

పతిఁ జూచి రతి నిజాంత, ర్గతఖేదం బెలమి మఱపుగా నిడి కాలో
చితవచనాంతరముల సుర, పతి గడువెస నిన్ను నేమిపని రాఁ బనిచెన్.

413


వ.

అని [3]తఱమియడుగు చున్నరతి ముఖవికారంబు గని మనసిజుండు మనంబునం
గుసురుకొనుచుఁ జిఱునవ్వు నవ్వుచు నిట్లనియె.

414


చ.

బెదరుచు నంతరంగమున భీతికిఁ గండవడంబు సుట్టి ప
ల్కెదు పొరపొచ్చెమున్ వెఱవుఁ గేనముఁ జెయ్వుల కోలి నెత్తువె
ట్టెదు వడి మోవియుం గరువటిల్లెడు నీమది నింతదల్లడం
[4]బొదవుడి దేమిగారణమ యుగ్మలి నా కెఱిఁగింపు మేర్పడన్.

415


వ.

అనిన దివ్యాంతరిక్షభౌమాంగికాద్యనేకదుర్ణిమిత్తంబులు నిర్ణిమిత్తంబ వుట్టు
టెఱింగించి దీనానన యగుచు నీపోయివచ్చినకార్యం బెఱింగింపు మనినం బెద్దయు
విశేషంబులే దయ్యుమామహేశ్వరులతపోభంగంబు సేయు మనిన దానికి మెయి
కొని వచ్చితి ననిన విని రతి యుదరిపడి యుల్లంబునం దల్లడిల్లుచు.

416


సీ.

మనకులదైవ మన్ మన్నన లేదేని ద్రిభువనారాధ్యుఁ డన్ తెంక లేక
పరమయోగాత్ముఁ డన్ భక్తి లేదేనియు సర్వేశ్వరుం డనుశంక లేక
యజశిరోదళనుఁ [5]డన్నదరు లేదేనియుఁ గాలారి యనునోటికండ లేక
విషమాంబకుం డనువెఱపు లేదేనియుఁ బ్రళయాగ్నిరుద్రుఁ డన్ భయము లేక
పంచె నట్టియుగ్రుపై నిన్ను నదిమీఁదఁ, బోయి తనకు లగ్గఁబోయి లగ్గ
వచ్చునే [6]ప్రధానవైరాన మరణంబు, ధ్రువ మనంగ వినఁడె దివిజవిభుఁడు.

417


చ.

విడపక పంచె నాకఁ డొకయేలినవాఁ డని పూన్కికాఁడవై
పొడువఁగఁ బోయె దీవు నొకపోటరిమూఁటవ నీకు నక్కడన్
మృడుఁ డొకయెల్లిదుం డకట మెచ్చక సింగపువేఁట లాడఁగాఁ
గడఁగెద రిట్ల యైనఁ దుది గా కెడ నింద్రుఁడు నీవు దక్కుటే.

418

క.

ఆనాకంబున గలయ, మ్మానిను లందఱును నీకు మన మిడి యున్నం
దాని సహింపక సురవిభుఁ, డీనెపమునఁ జంపఁ లఁచి యీపనిఁ బంచెన్.

419


క.

నినుఁ జూచినకన్నుల సుర, వనితలు దనుఁ జూడకున్న వాసవుఁ డలుకం
జలి చా నిన్ బంచినఁ జాఁ, జనునే యాతనిచలం బసాధ్యము గాఁగన్.

420


చ.

త్రిదశులు పిల్చి [7]పంపు డొకతేజముగాఁ గొని దేవదేవు నె
ల్లిదముగఁ జెప్పి యింతగొని లేవడి లేచెదు ప్రాణగొడ్డ మా
డెదు మది నోటకండ సెడి డెప్పరికంబులు సేసె దిట్టిక్రొ
వ్విదములు దక్కు మీపలుకు విష్ణుఁడు లక్ష్మియు విన్న మెత్తురే.

421


గీ.

హరుఁడు నెప మల్గి చూచుడు నాక్షణంబ, యఖిలజగములు సంహార మగురయమున
నట్టియుగ్రుపై నటే వోయే దకట లగ్గ, [8]మేలుమే లెంతమీ లెంతిమీలఁ ద్రాగు.

422


క.

కనుకిట్టిన నిట్టిక నమ, లినవిధమున దేవతావలికిఁ బూనితి నే
నని రుద్రున కుఱక పైఁజని, చెనయుట శిఖిశిఖుల మిడుద సెనయుట గాదే.

423


వ.

అని పరమేశ్వరు నెఱింగించుచున్నరతిం గనుంగొని.

424


ఉ.

ఏ నలరమ్ము లొడ్డఁ బరమేశ్వరుచిత్తము గౌరిచిత్తముం
దాన కరంగి కూడ మఱి దానికి సందియ మేల వెండియు
బూనెద మూఁడులోకములఁ బుట్టనిపూనికి వారిమేనులు
న్మానుగఁ గూర్తు నొక్కటిగ మార్గణకౌశలభావ మేర్పడన్.

425


గీ.

జగము లెల్లను నాయాజ్ఞ మిగుల కునికిఁ, గనియు వినియు నెఱుంగుదు వనజనేత్ర
యింతభయమునఁ బొంద నీ కేల మది భు, జంగభూషణు నబ్బూటగొంగఁజేసి.

426

వ.

అని మనసిజుండు మీఁదులేక పలికిన విని రతి పరమేశ్వరుమాహాత్మ్యంబు దలంచి
వెండియు నిట్లనియె.

427


చ.

అతనిశరాసనంబు గనకాచల మిక్షుశరాసనంబు నీ
కతనికి నమ్ము పాశుపత మంటినఁ గందెడుపువ్వు లమ్ము నీ
కతఁడు పురాపహారి విరహాతురపాంథజనాపహారి నీ
వతనికి నీకు హస్తిమశకాంతర మెమ్మెయి నెన్ని చూచినన్.

428


గీ.

ఈశుఁ దలఁచు మహాత్ములహృదయములును, గాఁడ నోపనిమృదుపుష్పకాండనికర
మతని భేదింపనోపునే యంగజన్మ, తమ కసాధ్యుల సాధింపఁదలఁపఁ దగునె.

429


గీ.

ఆఁడదాన నబల నైన నేయించుక యలిగి చూచుడును భయమున దలరు
దుగ్రునుగ్రలోచనోద్భూతవహ్నికి నెదిరి నిలువ నీకు నెంతకొలఁది.

430


సీ.

కొని బాలు రైనను దిని పిప్పి యుమిసెడు చెఱకు విల్లని నమ్మి చేతఁబట్టి
మెలఁతలతలవెండ్రుకలఁ బొంది కందాడునలరుపుష్పము లమ్ము లని తలంచి
తలిరాకులైనఁ గదల్ప నోపనిమందపవనుండు నొకపెనుప్రాపు గాఁగ
నబలలు సోఁపిన నాకాశమునఁ బాఱునలిశుకములు మూలబలము గాఁగ
నెంతవేసవి ముట్టిన నెండఁగమరు ననువసంతుండు దగుసహాయంబు గాఁగఁ
గాకిపిల్లల కోడుపికములుఁ బోటు, మగలుగా నుగ్రుపైఁ బోవఁదగునె మదన.

431


చ.

చిరముగ నొల్వువడ్డనరసింహునికంటెను బెద్దవే శిరం
బురలఁగ నాటువడ్డజలజోద్భవుకంటెనుఁ బెద్దవే పెనుం
గరిగొనఁ గాల్పువడ్డజముకంటెనుఁ బెద్దవె నీవు విశ్వసం
హరు నుఱ కెత్తిపోయి కలహంబున నోర్వఁగ నీయలంతియే.

432


మ.

హరికంకాలము చేతిముద్ర దివిజేంద్రాస్థుల్ సుభూషావళుల్
గరళం బభ్యవహార మంతకతనుక్షారంబు మైపూఁత పం
కరుహాసీరీనశిరఃకపాల మురుభిక్షాపాత్రగా విశ్వసం
హరు వర్తించుమహావ్రతోపహతి సేయం బూన నీప్రాప్తియే!

433


వ.

అనిన విని బలపరాక్రమాతిధైర్యశౌర్యమంత్రతంత్రధ్యానధారణైశ్వర్యాద్యశేష
దివ్యశక్తు లెంతవిశేషంబు లయ్యును జంద్రకాంతోపలంబులుఁ జంద్రకిరణస్పర్శ

నంబునం గరంగునట్టు లతికోమలం బైన కాముకశక్తికి లోనై మృదుభావంబునం
బొందు నిది జగంబునం దనుభవసిద్ధం బది యెట్లనిన.

434


గీ.

అదిమిపట్టినఁ గరులైనఁ జిదియు నట్టి, కడిఁదిబలు లగుమగ లొత్తి కౌఁగిలింపఁ
గుసుముకోమలు లగుసతు ల్కొసరుచునికి, గనియు నెఱుఁగవె విపరీతకామశక్తి.

435


వ.

దానికిం గారణం బేమి యందేని

436


క.

ఆరయఁగా స్త్రీపురుషా, కారములై చిత్తవృత్తి గలిగినఁ జాలున్
వా రెల్లఁ గామవశు లగు, వారని నియమించి నాకు వర మజుఁ డిచ్చెన్.

437


వ.

అని యాదిసృష్టికిని గారణం బైన కామతత్త్వమహత్త్వంబు దెలిపి రతి నొడం
బఱిచి రతీశ్వరుఁడు పరమేశ్వరుపైఁ బోవ నుద్యుక్తుం డగుడు నాక్షణంబ.

438


సీ.

పంకరుహంబులు బండికన్నులు చంపకంబులు నొగ లుత్పలంబు లిరుసు
గరవీరములు పలుఁగాఁడి జాదులు సనుఁగొయ్య లశోకముల్ గోడిపింట
సింధువారంబులు సీలలు గేతకుల్ మెట్టులు మొల్లలు మెట్టుగుదెలు
పొగడలు పలుపులు పున్నాగములు పగ్గములు సహకారముల్ పూనుగాఁడి
కురవకానీకమాలంపుఁగోల కైర, వములు మునుకోల కోకము ల్వాహనములు
గా వసంతుండు సూతుఁడై పూవుఁదేర, నెరయఁ గుసుమాయుధంబులు నీని తెచ్చి.

439


వ.

అంత రతిసమేతుండు పుష్పాయుధుండు పుష్పరథారూఢుండై నిజసామ్రా
జ్యనిభవైశ్వరంబులతో నతిరయంబున హిమవంతంబున కరిగి పరమేశ్వ
రుతపోవనంబు సొత్తెంచెఁ దత్క్షణంబ.

440


వలరా జామనిఁఁ బిల్చి వేగమెయి నీవాసంలికానందదో
హల మీకాననలక్ష్మి కి మ్మనుడు నాహ్లాదంబుతో నెయ్య మ
గ్గలమై యుండ వసంతకుండు దమనైఁ గన్నిడ్డఁ గారాకుఁ గెం
దలిరా కయ్యెనొ నాఁ దలిర్చె వడిఁ గాంతారాంతరోర్వీజముల్.

441


క.

తన సూడగు ధనధదిశాంగన నినుఁ డొడఁగూడఁ బోక గని యామ్యదిశాం
గన నొచ్చి వెచ్చనూర్చెనొ యన శిశిరవిముక్తదక్షిణానిల మెసఁగెన్.

442


చ.

మలయసమీరణాభిహతి మ్రాఁకుల నాకులు డుల్లి డుల్లి క్రొ
మ్మొలకలు సాగి సాగి విరిమోసుల గెందలి రొత్తియొత్తి కు

ట్మలములు గ్రమ్మిక్రమ్మి కుసుమంబులు వాసన కెక్కియెక్కి గు
ర్తులు గొని పండిపండి వినుతుల్ దగ నారము లోప్పె నామనిన్.

443


క.

భోరన సంకురపల్లవ, కోరకపుష్పఫలవితతిఁ గొమ రమరి మనో
హారములై సారములై, యారామము లొప్పె మధుసమాగమవేళన్.

444


సీ.

వేదన విరహులు సేదలు సెడి సంధు లెడలంగఁ బల్లాకు లెడలెఁ దరుల
రాగిల్లుకవలమేఁదీగలఁ బులకంబు లంకురింపఁగఁ దరు లంకురించె
సమ్మదంబునఁ గామిజనులచిత్తంబులు చిగురొత్తఁ దరులందుఁ జిగురు లొత్తె
రతిదోహలమున దంపతులముఖాబ్జముల్ విలసిల్ల వికసిల్లె విరులు దరుల
నెలమిఁ జిలుకపిండు దొలుమేనఁ జేసినతపము వండఁ బండెఁ దరువనంబు
లువిద లింపుమిగుల నోయలపాటలు నాడ మధుమదమునఁ బాడె నలులు.

445


క.

మదనుతలిరెల్లులో యన, బొదిగొని కెందలిరు లెసఁగు భూరుహములపై
నొదవెడురాగాంబుధి బు, ద్బుదములునా సెసఁగె ముకుళములు తోరములై.

446


ఉ.

పొన్నలు పూచెఁ బొన్న లొగిఁ బూవకముందఱఁ బూచె గోఁగు లా
పొన్నలుఁ గొండగోఁగులునుఁ బూవకముందఱఁ బూచె బూరువుల్
పొన్నలుఁ గొండగోఁగులును బూరువులు న్నొగిఁ బూవకుండఁగా
మున్న వనంబునం గలయ మోఁదుగు లొప్పుగఁ బూచె నామనిన్.

447


క.

భావజవిభుఁ డలిశుకపిక, సేవకతతి కెడరుదీర జీతము సేయం
గా వెలిఁబోసిన పసిఁడుల, ప్రోవులు నాఁ దమ్ము లెలమిఁ బూచె బెడంగై.

448


క.

నలి మొగ్గలు విరిపువ్వులు, సలలిత మయి చూడనొప్పెఁ జంపకమృత్యూ
జ్వలరుచి రేపగ లూరక, వెలిగెడునుద్దీపదీపవృక్షమువోలెన్.

449


గీ.

పొలిచె మధువేళఁ గంకేళి పూచి భృంగ, పరివృత మ్మై మనోజుండు పాంథతతికి
నాభిచారంబు వేల్చుకుండాంతరమున, దగిలి కామాగ్ని వొగలతో నెగయునట్లు.

450


క.

విరహులహృదయంబులు జ, ర్ఝురితంబులు చేసి మరుడు శరశస్త్రము లా
సురవృత్తిఁ బెఱికి పట్టిన, కరణిం గర మొప్పె నరుణకరవీరంబుల్.

451

క.

నునుపగు నలిగానము విని, వనదేవత గరము మెచ్చి వానికి నొసఁగం
జనఁ బైఁడులవీడెలు పు, చ్చినవిధముగఁ బొన్న లెలమిఁ జెలువుగఁ బూచెన్.

452


క.

సురపొన్నలపైఁ బ్రాఁకిన, గురువిందలు నవలఁ బెరిగి కొమ రమరె రతీ
శ్వరునకు వసంతుఁ డనుగొన, పరి చేసినముత్తియములపందిరివోలెన్.

453


క.

మారుజయలక్ష్మి మలయస, మీరునిపైఁ బూఁత మధుసమృద్ధికి నురుశృం
గారం బనఁదగు నన సహ, కారముఁ గురువకముఁ గర్ణికారముఁ బూచెన్.

454


చ.

మొగడలు వజ్రముల్ విరులు ముత్తెము లింపగునున్పుగెంపు లేఁ
జిగురులు పద్మరాగములు చిల్కలు వైరిజరాజి తుమ్మెదల్
నగరిపునీలజాలములు నాఁ దనరారె వసంతవల్లభుం
డగువలరాజు పంచమణిహర్మ్యములో యనఁ జూతభూజముల్.

455


క.

చన నున్మదనమదనమో, హనసంతాపన వశీకరాస్త్రము లన హృ
జ్జనునకు నంకురపల్లవ, ఘనకోరకపుష్పఫలనికర మామ్రములన్.

456


సీ.

పలఁకెడు కారాకులలితాస్థిచయముగా సోలుకొమ్మలు పలుకేలు గాఁగ
బాలుపల్లవములు వ్రేలు కెంజెడలుగాఁ బెనఁగుతీగలు దొడ్డఫణులు గాఁగఁ
గలకంఠనికరంబు గళమునకప్పు గారబుప్పొడి మేనివిభూతి కాఁగ
ఫలములు వరదానఫలములు గా నలిమాలికల్ రుద్రాక్షమాలికలుగ
శంభుమూర్తిఁ దాల్చి సహకారభూరుహచక్రవర్తి నవవసంతవేళ
నతిశయిల్లుచుండె నక్కడఁ గని మరి నుదరిపడి మనోజుఁ డోసరింప.

457


చ.

అలరులమందహాసమున నన్నినషట్పదమంజుగీతి రా
చిలుకలముద్దుమాటలనుఁ జెందలిరాకులరాసలీలఁ గో
కిలనినదంబులన్ బహిరకేశభరంబున ముక్తపర్ణమే
ఖల నభిరామ మయ్యె సహకారలతాంగి మధుప్రసంగతిన్[9].

458


క.

తలిరెల్లిపూవుటమ్ముల, బలసిన పికకీరభృంగపరివారముతో
వలరాజుఁ బోలి మామిడి, సలలితగతి నుతపసంతసంగతి నొప్పెన్[10].

459

చ.

మలయసమీర మర్థి సుకుమారలసత్సహకారనందనా
వలి నజిఁజొచ్చుఁ జుట్టుకొనివచ్చుఁ గుజాలికి మెచ్చు నీరిక
ల్విలు పొనరించుఁ గెందలిరు వెంచు ననల్ విరియించు దాని న
ర్మిలిఁ గబళించు నాదట రమించుఁదమిన్ విహరించు నామనిన్.

460


చ.

అలు లొడఁగూడుఁ బిండుగొని యాడు మృదుధ్వనిఁ బాడు నోట దొం
తులుగొని పాఱు జొంపములు దూఱు సుగంధము మీఱుఁ బువ్వుగు
త్తులపయి మూపు బుప్పొళులు ద్రావు వడిం దనివోవు మంజరుల్
వెలువడ నేఁగు దర్పమున వీఁగు మదిన్ నలిరేఁగు నామనిన్[11].

461


చ.

చెలఁగుచుఁ బాఱి యొక్కొకటిఁ జీఱి వనంబులు తూఱి చిల్కపిం
డెలఁబొఱఁ ద్రొక్కి కెందలిరు లెక్కి కొలంకులు నిక్కి చూచి కా
యలు గని మ్రానిపండ్లరస మాని ముదంబున నూని పల్కు మున్
పొలు పడరంగ దంపతులు వొంగ వియోగులు గ్రుంగ నామనిన్.

462


చ.

గుమురులు గట్టి యీరికలు గుట్టి ప్రవాళము వట్టి కింకతో
నమలక మ్రింగి మొగ్గలఁ బెనంగి విరుల్ గని వొంగి పూఁప లు
త్తమ మని చాని యుద్ధవడిఁ ద్రావికొను న్నెలమావియందుఁ గూ
రిమి పడఁజేయు నామనిని రేయుపవల్ వడి గూయుఁ గోవిలల్.

463


మత్త.

మెత్తమెత్తన చంచనాద్రిసమీరణుండు మనోభవుం
డెత్తకుండఁగ వేగకుండఁగ నెత్తు నొత్తిక తక్కినన్
జత్తు సుమ్ము వసంతుచే నని చాటునట్లు చెలంగె నా
మత్తకోకిల లాఱమిం గడ మాసరం బగు నామనిన్.

464


సీ.

ఆరగ్వధార్కజంజీరకర్కోలమందారచందననారికేరసింధు
వారకంకేళిఖర్జూరశాల్మలిఘనసారచంపకబీజపూరదేవ

దారుసల్లకికరవీరగుగ్గులుపీతసారపున్నాగనమేరుకర్ణి
కారధాత్రీత్వచిసారపటలసహకారభల్లాతకపారిజాత
భూరుహారూఢపికరాజకీరమదమ, యూరమధుకరమృదుమధురారవములఁ
జారుతర మైనభూరికాంతారమహిమ, గారవించుచుఁ జనుదెంచె మారుతంబు.

465


క.

మధుసంగమునఁ ద్రిలోకీ, వధు వనురాగమునఁ గామవశగతిఁ జేతో
విధురవిధి నడరె నట్టిద, మధుసంగతి జనులు రాగమయు లగు డరుదే[12].

466


సీ.

నెలఁతలపరిమళనిశ్వాసపవనంబు దలఁపించె దక్షిణానిలవిలాస
మింతులదరహాసకాంతి సంభావనఁ గావించెఁ జంధ్రప్రభావిభాతి
రమణులరక్తాధరభ్రాంతి నొదవించె లాలితాశోకప్రవాళలీల
వనితలమంజులస్వనశంకఁ బుట్టించెఁ గలకంఠమదకీరకలకలంబు
గామినీవిలోలకర్ణాంతవిశ్రాంతలోచనప్రశంసలోలబుద్ధిఁ
బడసె దలితపదపద్మవిభ్రమము వియోగులందు మధుసమాగమమున.

467


క.

సోలుచు సమ్మదరసమునఁ, గ్రాలుచు వనపాలబాలికలు నవలతికాం
దోలముల వేడ్క సలుపుచు, నాలతు లొగిఁ జేసి పాడి రభినవలీలన్[13].

468


సీ.

కరి యిచ్చె నరమేసి కరిణికి సల్లకీపల్లవ ముల్లంబు పల్లవింప
మృగ మర్థిఁ గబళించి మృగి కిచ్చె నంచుదర్భాంకురంబులు చిత్త మంకురింప
హంస పెక్కువ నిచ్చె హంసికి నోర్నోర నెలదూఁడుమొగముల నెలమి మిగుల
భృంగము దావితో భృంగికి దయ నిచ్చె మధుధారముఖరాగమదము దలఁకఁ
గిన్నరుండు గ్రోల్చెఁ గిన్నరివీనుల రాగరసము మేన రాగ మెసఁగ
మధువిడంబనమున మగలును మగువలు, విరలిగొనిరి మదనపరవశమున.

469


క.

ఆమనికి నెలమి విపులా, రామంబులపొల్పు సూచి రాగోత్కటమై
కాముఁడు రతిఁ గని తానునుఁ, గామాతురుఁడై మనోవికారము వొందెన్.

470

సీ.

లత్తుకరసమునఁ జొత్తిల్లఁ బదతలముల నరచేతుల మోవిఁ బూసి
నవకుసుమంబుల నానావిధంబులతొడవులు రచియించి తొడిపి వేడ్క,
రాజీవపుష్పపరాగంబు గబళించి విలసిల్లు సీమంతవీథిఁ బోసి
యరవిరి సురపొన్నయకరువు వరుసలో వలకలఁ జిన్నిపు వ్వలికి కలయ
సలలితం బగుపుప్పొడి డులిచి వీఁగుఁజన్నుగవమీఁదఁ బోయుచుఁ జెన్నుమిగుల
సుదతిఁ గైచేసి ప్రీతితోఁ జూచుచుండె, భావజన్ముండు వచ్చినపనియు మఱచి.

471


వ.

ఇ ట్లఖిలభువనభవనాపూరితం భై సకలజనానందకరం బై యతీరమణీయం బైనవసం
తోత్సవంబునం దత్కాలోచితక్రీడాపరవశుండై కంతుండు బెదరి నిజగమన
ప్రయోజనంబు దలంచి యాక్షణంబ.

472


మ.

దలితాంభోజదళాంగుళీతనుశిరస్త్రాణంబులుం గోమలే
క్షులసచ్చాపము నబ్జసూత్రగుణముం జూతాంకురాశోకకు
ట్మలజాతిప్రసవాస్త్రపూర్ణశరధుల్ మంత్రించి వశ్యాక్షతా
దులసన్నాహము చేసి మారుఁడు జగత్క్షోభంబు సంధిల్లఁగాన్.

473


చ.

ఇ ట్లసమశరుండు సమరసన్నద్ధుండై సకలజనంబులు నభినవవసంతోత్సవంబున
ననురాగరసపూరితహృదయులై పరవశులై యున్నం గని హరగిరిజల కంతకుం
దమయంతన సంగమం బగు నా వచ్చినకెలసంబు వసంతువలనన తీరకున్నెయని
పరమేశ్వరావాసంబున కనతిదూరంబుగాఁ జని ముందట.

474


మస్ర.

హరహాసాకాశగంగాత్యమలజలమరాళాబ్జనీహారధాత్రీ
ధరకర్పూరేందుకాకోదరవరపతిదిగ్ధంతిపక్షీరనీరా
కరముక్తాహారకుందోత్కరరజతశరత్కౌముదీద్యోతకీర్తీ
శ్వరు నాత్మారాము వాణీపరు వరగురు సర్వజ్ఞు నజ్ఞానదూరున్.

475


క.

దీపితవిమలజ్ఞానసు, దీపితసుఖదళితమోహతిమిరాపహర
వ్యాపారు సర్వసుజనద, యాపరు నచలాత్ము మల్లికార్జునదేవున్.

476


మస్ర.

శివధర్మార్థప్రవీణున్ సితయశుఁ ద్రిజగత్సేవ్యు వేదాంతవేద్యు
భవభావాఘోఘదూరున్ బ్రవిమలగుణు నభ్రాంతచేతస్కు నంగో
ద్భవబాణాఘోరతాపాపహతు నచలు నిర్భగ్ను నీశాంబుతోయో
ద్భవసద్భృంగాయమానోత్తమహృదయు మహోత్సాహు నానందదేహున్.

477

క.

దురితఘనాఘనమారుతు, నరిషడ్వర్గాటవీదవానలుఁ
బురుహసుధాకరు భవసా, గరకుంభజు దివ్యమునిశిఖామణి ననఘున్.

478


వసంతతిలకము.

సాహిత్యవేది గుణశక్తు వివేకయుక్తున్
మోహాదిదోషపథముక్తు బుధానురక్తున్
మాహేశ్వరప్రకరమాన్యు సదావదాన్యున్
దేహేంద్రియౌఘజయధీరు సుమేరుచారున్.

479


గద్యము.

ఇది శ్రీమజ్జంగమమల్లికార్జునదేవదివ్యశ్రీపాదపంకజభ్రమరాయమాణకవిరాజ
శిఖామణి నన్నెచోడదేవప్రణీతం బైనకుమారసంభవం బనుకథయందుఁ జతు
ర్థాశ్వాసము.



  1. “దెసలు చూడఁగనుండె దిగ్గను చక్రసమూహంబునకుఁ దలమును
    కలగుచు. ..... వెన్నెలనిట్టదోఁచె.” నిర్వ-ఆ-6
  2. గాడ్పుమృగము, జింకయనుటకు :-
    “తద్వధూస్వకరన్యస్తచిత్రపత్రలతాంకితః । అసౌవిహారహరణః కింస్యాదనల
    సారథేః” అని సాహసాంకచరిత్రము. “ప్రవహనామక మహాపపనవాహనమైన మృగ
    ముగాబోలు నీమృగముతరుణి” నై-ఆ-8
  3. తఱిమి= నిర్బంధించి "కీడు గాంచి..... నొండెండ్లు లేదని | తఱిమి యడుగుటయును వెఱవు వాసి" నిర్వ-ఆ-8
    "ఇత్తెఱంగున నూఱార్చి యింతిఁదఱమి | యల్లనల్లన దోకొని" నిర్వ-ఆ-9
  4. ఒదవుడు = ఒదవుట
  5. ఇట్టి సంధికి :- "అన్నిష్టసఖియూదియున్నదాని” భార. ఆది.
  6. "వైరేణ మరణం ధ్రువమ్మనంగ దివిజవరుడు వినఁడె." అనునది పాఠాంతరము.
  7. పంపుడు= పంపుట
  8. మీలనుమీలు ద్రాగువనుటకు:
    “మండలనాథు నాజ్ఞకు సమస్తజనంబులు నోడిపాడిమై | నుండక మేరతప్పి బలియుండ బలున్ మననీక పెద్దమీన్ కొండికమీనుద్రాక్రియ గ్రొవ్వునఁ జంపుచునున్న వ్రేఁకమ | మ్మండల మేలియుండ మతిమంతులకుం బరపక్ష భైరవా" అని భద్రభూపాలుని నీతిశాస్త్రముక్తావళి.
    మఱియు “తగరు కొండమీఁదఁ దాఁకగోరి నాదారి | నెదిరి తన్ను దెలియ కింత పలికె | నెంతమీను వచ్చి యెంతమీను మ్రింగె" రాధికాసాంత్వనము.
  9. "నా, చేననుచుంబతాకయును జెంచరుణాచలమెక్కి..” త్రిపురాంతకోదాహరణము.
  10. మన్మథునిఛత్రముపల్లవ మైనందులకు "కర్ణికారపుమొగ్గ కనకంపుగుబ్బగాఁ గోయిలనోరూరు గొడుగుతోడ" ఉ.హరి. ఆ-2. "కోకిలవ్రాతంబు గ్రుక్కిళ్ళు ప్రసంగించు క్రొమ్మావిచిగురాకుఁగొడుగుతోడ" హరవి. ఆ.3.
  11. ఏఁగు శబ్దమున నఱసున్నకు :- "కాఁగానిమాట లాడెదు | రాఁగూడదు... నుండం | గాఁ గోమలి యిటు నిల్వక | యేఁగుము మగనాలి కేల యీదుర్గుణముల్" భోజ. ఆ.4; "తాఁ గడువేగిరించె... | లోఁగుచు నింత నుంగి... | నేఁగుచు .. | దాఁగుట దేనిపేరు నిలిడంబిక" ప్రభా. ఆ.5
  12. అగుడు = అగుట
  13. అలతి = ఆలాపము "వల్లభుమీఁదియర్మిలి నెపంబు మలంగి మనంబులో నరా | గిల్లి కుచాంతరంగమున గిన్నెర మోపి గుణంబు సారెము | న్నల్లనమాట నూల్కొనెడునాలతి సేసి నిజాంగలీల శోభిల్లఁగఁ బాడె దైన్యబలభిధ్వనుధాధరుమంత్రి శ్రీధరున్" హుళక్కి భాస్కరుని దశగతులు. "ఆలతి సేయ భృంగమాలికలకు బెదరి బెదరి" దశ. ఆ.3