కాశీ మజిలీ కథలు/33వ మజిలీ/కపింజలుని కథ

కపింజలుని కథ

గంధర్వరాజపుత్రీ! వినుము నీవట్లు శోకసాగరంబున మునిఁగి యుండ గగనవాణి ననుసరించి నే నెగిరితినికదా! అతండు నాకుఁ బ్రత్యుత్తర మియ్యకయే యాకాశమార్గంబునఁ బోయిపోయి క్రమంబునఁ జంద్రలోకమునకఱిగి యందు మహోదయంబను పేరుగల సభయం దొప్పుచున్న పర్యంకంబున నాపుండరీకశరీరమున పడవైచి నా కిట్లనియె.

కపింజలా! నన్నుఁ జంద్రునిగాఁ దెలిసికొనుము. నేను జగదుప కారమునకై యుదయించి ప్రకాశింపుచుండ నీప్రియమిత్రుఁడు పుండరీకుఁడు కామాపరాధంబున శరీరమును విడుచుచు నన్నుఁజూచి యిందు హతకా! నీకతంబున నేను ప్రియాసమాగసుఖం బనుభవింపకయే ప్రాణముల విడుచుచున్నవాఁడ గావున నీవు సైత మిట్లే కర్మభూమియైన భారతవర్షంబునం జనియించుచు జన్మజన్మకు ననురాగముగలిగి ప్రియాసమాగసుఖం బనుభవింపక తీవ్రమైన విరహవేదన ననుభవించి మృతినొందఁగలవని శపించెను.

అప్పుడు నేను అయ్యో! అపరాధమేమియు లేకయే నన్నిట్లు శపించితివేలనని కోపాగ్ని ప్రజ్వరిల్ల నతనిం జూచుచు నాయట్టికష్టముల నీవుగూడ ననుభవించుమని క్రమ్మర శపించితిని.

అంతలోఁ గోపమడఁచుకొని వివేకబుద్ధిచే విమర్శింపుచు మహాశ్వేత మత్కిరణసంజాతమగు నప్సరఃకులంబునఁ బుట్టిన గౌరివలన జనియించినది. దానంజేసి నాకాప్తురాలుగదా! అమ్మహాశ్వేతచే వరింపఁబడిన నిమ్మునికుమారుఁడుసైతము బందువుడేఁయగు. నిష్కారణము శపించితినే కానిమ్ము. జన్మజన్మకు నని పలుకుటచే రెండుజన్మము లెత్తినంజాలు నాతోఁగూడ నితండు మత్త్యలోకంబున రెండుసారులు జనియించునని తలంచుచు శాపదోష మంటక నిట్లనియె. పూర్వ మతని శరీరము గ్రహించి యశరీరవాణిచే మహాశ్వేత నూరడించుచు నిచ్చటికివచ్చితిని. ఇది బుండరీకునిశరీరము శాపాంతము వరకు నిచ్చటనే యుండును. నీవుబోయి యీవృత్తాంతము శ్వేతకేతున కెఱింగింపుము. అమ్మనుభావుఁ డెద్దియేని ప్రతిక్రియఁ చేయనోపునని పలికి నన్ను విడిచెను.

అప్పుడు నేను మిత్రశోకంబున నంధుండుబోలె గీర్వాణమార్గంబునఁ బరుగిడుచుఁ జూడక యొకవైమానికునిం దాటితిని.

దాన నతండు కోపించి ననుఁ జురచురం జూచుచు దురాత్మా! మిధ్యాతపోబలగర్విత! మిక్కిలి విస్తీర్ణమగు గగనమార్గంబున గుఱ్ఱము వలె నన్ను దాటితివి. నీకెందును జోటు దొరికినదికాదు కాబోలు కానిమ్ము నీకట్లు దాటుట యుత్సాహమని తోచుచున్నది. నీవు తురంగమై భూమియందు జనింపుమని శపించెను.

అప్పుడు నేను గన్నుల నీరుగార్చుచు నంజలిఘటించి దేవా! నేను మిత్రశోకాంధత్వంబున నిన్ను దాటితిని కాని తిరస్కారభావంబునంగాదు అనుగ్రహించి యాశాప ముపసంహరింపుమని వేడుకొనుటయు నతండు వెండియు నిట్లనియె.

ఆర్యా! నాశాపము త్రిప్పనలవికాదు. నీవు గుఱ్ఱమవై యెవ్వని వహింతువో వాని యవసానమున స్నానముచేసినంత ముక్తుండవయ్యెద నిదియే నాచేయు నుపకారమని పలికిన నే నిట్లంటి.

దేవా! అట్లయిన నేనొండు విజ్ఞాపనజేయుచున్నవాఁడ శాపదోషంబున నామిత్రున కిప్పుడు చంద్రునితోఁగూడఁ బుడమియందుఁ బుట్టవలసియున్నది. కావున దేవర దివ్యదృష్టిచేజూచి యశ్వజన్మమందు సైత మతనితోఁగలసి కాలముగడుపు నట్లనుగ్రహింపుము. ఇదియే నా కోరికయని పలికినవిని యతం డొక్కింత విచారించి యిట్లనియె. ధాత్రి నుజ్జయినీపురంబున నపత్యమునకై తపంబుజేయుచున్న తారాపీడునకుఁ బుత్రుండై చంద్రుం డుదయించును. నీమిత్రుండు పుండరీకుండును దదమాత్యుండైన శుకనాసునికి జనియించుం గావున నీవా రాజపుత్రుని యశ్వరత్నమై యుదయింపుము. నీయందుఁగల ప్రేమచే నింత దలంచితి పొమ్మని పలికినతోడనే నేనధోభాగముజూచి సముద్రములోఁబడి యశ్వమై పుట్టితిని. అట్టిజన్మమునందుగూడ నాకు జాతిజ్ఞానముకలదు. కావున నశ్వముఖమిధునము గనంబడినతోడనే వెంటంబడి యీభూమికిఁ దీసికొనివచ్చితిని. ఈచంద్రాపీడుఁడు చంద్రుని యవతారము. పూర్వజన్మానురాగంబున నిన్నభిలషించి నీశాపాగ్నిచే దగ్ధుండైన వైశంపాయనుఁడే పుండరీకుఁడని పలికి యూరకుండెను.

ఆమాటవిని మహాశ్వేత, హా! దేవ! హా! పుండరీక! నీవు లోకాంతరగతుండవైనను నన్నే స్మరించుచుంటివి? ఈరక్కసితో నీ కేమిప్రయోజనమున్నది. నేను వినాశముకొరకే జనించితిని కాబోలు. నన్ను సృష్టించి దీర్ఘాయు వొసంగుట పరమేష్టి కేమిప్రయోజనమో తెలియకున్నది. నే సమసితినేని నీకీయాపద రాకుండునుకదా! ఇప్పుడు నేనేమిచేయుదును? ఎవ్వరితోఁ జెప్పుకొందును? రక్షించువారెవ్వరు? అయ్యో! అయ్యో! ఇంచుకంతయుఁ దెలిసికొనలేకపోయితినే యని యనేకప్రకారముల విలవించుచు నురము బాదుకొనుచు నేలం బడుటయుంజూచి కపింజలుఁ డిట్లనియె.

గంధర్వరాజపుత్రీ! నీవిట్లు నిందించుకొనియెదవేమిటికి? నీయందేమిదోషమున్నది. వెండియు నిప్పుడు దుఃఖించుట కవసరమేమివచ్చినది. యలఁతితరిలో సుఖమే యనుభవింపఁగలవు. మీయిరువురు తచ్ఛాపాంతమునఁ బతులతో గలసికొందురు. అశరీరవాణిని మీరు వినియుంటిరికదా! అంతదనుక తపంబే చేయుచుండుఁడు. తపంబున నన్నికార్యములు చక్కఁబడును. తపంబునంగాదే శర్వాణి! ఈశ్వరుని యర్ధాంగశరీరము ధరించినది. చింతింపకుమని యూరడించిన మహాశ్వేతయు నతనిమాటలచే దేరి స్వాంతమున సంతసము వహించినది.

అప్పుడు కాదంబరి కపింజలుంజూచి మహాత్మా! నీవును పత్రలేఖము నొక్కసారియే యీసరస్సులోఁ బడితిరికదా! పత్రలేఖ యేమైనదని యడిగిన నతం డిట్లనియె.

దేవీ! నీటిలోఁబడినతరువాత నేమిజరిగినదో నాకేమియుం దెలియదు. నేనిప్పుడు త్రికాలవేదియగు శ్వేతకేతునొద్దకుఁబోయి చంద్రాపీడునియాత్మ యెక్కడ నున్నదియో పుండరీకావతారమైన వైశంపాయనుఁ డేమయ్యెనో పత్రలేఖ యెక్కడికిఁ బోయినదో యతని నడిగి తెలిసికొనివచ్చెదనని పలుకుచునే యాకాశమునకు నిర్గమించి యఱిగెను.

అట్లతఁడఱిగినపిమ్మటఁ గాదంబరి మహాశ్వేతంజూచి ప్రియసఖీ! మనయిరువురకు సమానశోకంబు గలుగఁజేసిన భగవంతుఁ డిప్పుడు నన్ను నిలబెట్టెను. నిన్ను ప్రియసఖీ! యని పిలుచుట కిప్పటికి లజ్జింపకుంటిని. నాకిప్పుడు నీవు నెచ్చెలివైతివి. నాకిప్పుడు మరణమైనను దుఃఖముకొరకుగాదు. నీవిప్పుడు నాకుపదేశింపఁ దగియుంటివి. నేనిప్పు డేమి చేయవలయునో నాకుం దెలియకున్నది. నీవు విమర్శించి కర్తవ్య ముపదేశింపుమని పలికిన విని యక్కలికి కాదంబరి కిట్లనియె.

వయస్యా! ఈవిషయమై చెప్పుటకును వినుటకును నేమి యున్నది. మనకు ప్రియసమాగ్రమాశ యేమిచేయించునో యట్లు చేయఁదగినదే! పూర్వము వాఙ్మాత్రముచేతనే యోదార్చఁబడితిని. ఇప్పుడు కపింజలుఁడు పుండరీకునివృత్తాంతమును గురించి స్పష్టముగా జెప్పెనుకదా! నీవుమాత్ర మేమిచేయుదువు? నీదొడయం దుంచు కొని యీచంద్రాపీడుని శరీరమును విడువక వినాశనము కాకుండా నర్చింపుచుండుము. మృద్దారుశిలారూపములైన యప్రత్యక్షదేవతల సేవించుటకంటె ప్రత్యక్షదైవమైన యీచంద్రాపీడుని శరీరమును బూజించుటయే శ్రేయము. అట్లుచేయుము. ఎప్పటికేని యేదేవున కై ననుగ్రహము రాకపోవునా యని చెప్పిన విని కాదంబరి యప్పుడే లేచి తరళికామదలేఖలు సహాయముచేయఁ జంద్రాపీడుని శరీరమును మెల్లగానెత్తి శీతవాతాతపాది దోషరహితమైన యొకశిలాతలమం దునిచి శృంగారవేషము దీసికొని స్నానముచేసి పరిశుద్ధచిత్తయై ధౌతదుకూలములదాల్చి అధరకిసలయంబున దట్టముగాఁ బట్టియున్న తాంబూలరక్తిమమును బెక్కుసారులుతోమి కడిగి మాటిమాటికిఁ గన్నీరు గార్చుచు ననభ్యస్తము నపూర్వమునైన నియమముధరించి పూర్వము సురతోపభాగమునకై తెచ్చినపూవులు గంధము నంగరాగము ధూపములు మొదలగువానిచేతనే చంద్రాపీడమూర్తి నర్చించుచు మూర్తీభవించిన శోకదేవతయుంబోలెఁ జింతించుచు మరణముకన్న కష్టతరమైన యవస్థ ననుభవింపుచు నాహారము గుడువక వెండియు నతని యడుగులు తొడయం దిడుకొని యొత్తుచు నెట్టకేల కాదివసము గడిపినది.

మరునాఁడుదయంబున నూత్న తేజంబుతో నొప్పుచున్న చంద్రాపీడునింజూచి వెరగందుచుఁ గాదంబరి మదలేఖతో నాతీ! యీతని మేనికాంతి యెంతవింతగా నున్నదియో చూచితివా? ప్రేమాతిశయంబున నాకే యిట్లుతోచుచున్న దేమో నీవుగూడ విమర్శించి చూడుమని పలికిన విని మదలేఖ యిట్లనియె.

రాజపుత్రీ! ఇందు నిరూపింపవలసిన దేమియున్నది యీపనికిం జైతన్య మొండు కొరంతగా నున్నది కాని యధాస్థితిగానే యున్నవాఁడు కపింజలుఁడు చెప్పినమాట యథార్థమని దీనస్పష్టమగుచున్న యది. లేనిచో మృతుండైనవాఁ డిట్లుండుట యెందేనిజూచియుంటిమా ఇది శాపదోషముకాక మఱియొండు కాదని పలికి యక్కలికి నూరడించెను. కాదంబరియుఁ బ్రతిదినము చంద్రాపీడమూర్తిని దేవతా విగ్రహమునట్లు త్రికాలములయందుఁ బూజింపుచు ధృతవ్రతయై శాపావసానకాల మరయుచుండెను.

మఱికొన్ని దినంబులకుఁ దారాపీడుఁడు చారముఖంబుగాఁ దద్వృత్తాంతమంతయును విని మిక్కిలి పరితపించుచు మనోరమా శుకనాసులను గమింప విలాసవతింగూడి యుచిత పరివారములతో నయ్యాశ్రమమునకుఁబోయి యందు జంద్రాపీడుని యవస్థంజూచి పెద్దయుం బ్రొద్దు జింతించి శాపప్రకారమంతయు వినియున్నవాఁడు కావున నెట్టకే శుకనాసునిచే బోధింపఁబడి వైరాగ్యమునువహించి రాజ్యభారము మంత్రులయం దుంచి భార్యతోగూడ నాప్రాంతమందున్న వనములో మునివృత్తిబూని కాలక్షేపము చేయుచుండెను.

అనిచెప్పి జాబాలి పక్కుననవ్వి హారీతప్రముఖులగు మునులతో ననఘులారా! యాకధారసం బెంత వింతగా నున్నదియో వింటిరా? వక్తవ్యాంశమునువిడిచి యతిదూరము చెప్పుకొని పోయితిని.

వినుం డాపుండరీకుండు కామోపహతచిత్తుండై తానుజేసిన యవినయదోషంబున దివ్యలోకమునకుఁ జెడి పుడమియందు శుకనాస తనయుండైన వైశంపాయనుఁడుగా జనియించెను.

వెండియు నతండు మహాశ్వేతచే శపియింపంబడి యిట్లు చిలుక యోనియందు జనియించెనని యెఱింగించినంత నాకప్పుడు నిద్రమేల్కాంచినట్లుగా యితిస్మరణగలిగి బూర్వజన్మోపాత్తవిద్య లన్నియును స్ఫురించినవి. మనుజుండువోలె స్పష్టముగా మాట్లాడుటయు సర్వవస్తు జ్ఞానము విద్వోపదేశకౌశలము మిక్కుటముగా లభించినది. పెక్కేల? శరీర మొక్కండుదక్క తక్కిన చర్యలన్నియు మనుష్యుండువలెనే చేయ సామర్ధ్యము గలిగినది. అట్టుజ్ఞానముగలిగి నిజవినయ శ్రవణంబునఁ గలిగిన సిగ్గుచేత నించుక తలవంచుకొని కొంచెముసే పూరకొని నే నల్లన నా జాబాలి కిట్లంటి.

దేవా! నీయనుగ్రహంబున మదీయ పూర్వవృత్తాంతమంతయు స్మరణకు వచ్చినది. యాప్తులనందరను స్మరించుకొంటిని. నామృతిని వినినంత హృదయము భేదిల్లఁ జైతన్యమును విడిచిన చంద్రాపీడుఁడు జన్మాంతరమున నే శరీరమును దాల్చెను? దయయుంచి వక్కాణింపుఁడు. అతనితోఁ గలసికొంటినేని తిర్యగ్యోనియందున్నను నాకు సంతసముగానే యుండునని యడిగిన నమ్మహర్షి పుంగవుండు కన్నుగవఁగెంపుగదుర నన్నుఁ జూచుచు, దురాత్మా! నీచిత్తచాంచల్య మింకను విడువకున్నవాడవే దానిమూలముననేకదా! ఇట్టియవస్థ ననుభవింపుచున్నవాఁడవు. ఇప్పుడు నీకు రెక్కలైనను బూర్తిగా రాలేదే తొందరపడియెదవేల? ఎగురుటకు సామార్ధ్యము వచ్చినప్పుడు నన్నీ సంగతి నడుగుము చెప్పెదనని పలికిన విని హారీతకుం డిట్లనియె.

తాతా! ఈతండు మునిజాతియందు జనియించియు జీవితమును విడుచునంత కంతుసంతాపమును జెందెనేమి? దివ్యలోకసంభూతున కల్పాయువు గలుగుటెట్లు నాకు మిక్కిలి విస్మయముగా నున్నది. ఎఱింగింపవేయని యడిగిన నమ్మునిమార్తాండుండు వెండియు నిట్లనియె.

వత్సా! యీతండు కామరాగమోహమయము నల్పసారము నైన స్త్రీవీర్యమువలనఁ బుట్టుటచేనట్లయ్యె. అల్పసారమగు స్త్రీవీర్యంబునం బొడమిన జంతువు గర్భంబుననే హరించును. లేక చచ్చియెనం బుట్టును. జీవించి పుట్టినను దీర్ఘకాలము బ్రతుకదని యాయుర్వేదంబున స్పష్టముగాఁ జెప్పఁబడియుండ దీనికి విస్మయమేల దద్దోషంబున జేసి వీఁడు కామరతుండై మదనజ్వరవేగంబున సమసె. శాపావసాన కాలంబున దీర్ఘాయుష్మంతుఁడై యొప్పునని చెప్పెను.

అప్పుడు నేను వెండియు మహాత్మా! నేను బాపాత్ముఁడైనై యీతిర్యగ్యోనియందు జనియించితిని. నీయనుగ్రహంబున నాకు వాక్కుమాత్రము వచ్చినది. యభూతపూర్వమైన జ్ఞానమునుగలిగినది. నా కే సుకృతంబున నీరూపము వాయగలదు. ఆయు వెట్లు వర్థిల్లు నాచేయవలసిన కృత్యమెద్ది? దయామయుఁడవై యెఱింగింపుమని ప్రార్థించిన విని యజ్జాబాలి దిఙ్ముఖంబులు సూచుచు, అయ్యో! ఈ కథామూలంబునఁ దెల్లవారిపోయినది యనుష్ఠానువేళ యతిక్రమించినది. యది యట్లుండనిమ్మని పలుకుచు నాగోష్ఠి చాలించి లేచుటయు నమ్మునులందరు తత్కధారసాస్వాదంబునఁ జేయదగిన కృత్యములు మరచి విస్మయమందుచు నెంతకష్టమని పలుకుచు నొక్కింతసేపుండి పిమ్మట దమతమ నివాసములకుఁ బోయిరి. హరీతకుండును నన్ను మెల్లగా జేతియం దెక్కించుకొని వర్ణశాలయం దొకవేదికయందు భద్రముగా నునిచి తాను స్నానార్ధ మఱిగెను.

పిమ్మట శేనాత్మగతంబున అయ్యో! అనేక భవసుకృతపరిపాకంబునంగాని మానుషదేహంబు గలుగదు. దానియందు సకలజాతి విశిష్టమైన బ్రాహ్మణ్యము దుర్ఘటమైనది. అంతకన్న నా సన్నామతృ పదముగల మునిత్వము విశిష్టతరమైనది. దివ్యలోక నివాసిత్వ మంతకన్న విశేషమైనది. అట్టి యున్నతపదమునుండి స్వదోషమూలముననే యధోగతింబడి యిట్టి తిర్వగ్జాతియందుఁ బుట్టితిని. అన్నన్నా! ఎంత మోసము వచ్చినది. సీ! ఇఁక నాకీ జీవితముతోఁ బ్రయోజనమేమి? ఈశరీర మెట్లయినను సరియే విడిచి విధిమనోరధమును సఫలము జేసెదనని యూహించి జీవితమును విడుచుటకు నిశ్చయించుకొని యుంటిని. ఇంతలో హరీతకుఁడువచ్చి అన్నా! వైశంపాయన! నీపుణ్యము మంచిది. నీతండ్రియొద్దనుండి నిన్ను వెదకిఁకొనుచుఁ గపింజలు డిచ్చటి కిప్పుడు వచ్చెనని చెప్పుటయు నే నప్పుడు రెక్కలువచ్చిన దానివలె నెగరబోయి యత్యంతసంతోషముతో నతం డెక్కడ నని యడిగితిని.

అప్పుడు హరీతకుఁడు అతండు మాతండ్రియొద్దనుండి మాటలాడుచున్నవాఁ డని చెప్పిన విని నేను ఆర్యా! అతనిం జూచుటకు నాహృదయము మిక్కిలి పరితపించుచున్నది. నన్ను వేగమ వాని చెంతకుఁ దీసుకొని వెళ్ళుమని ప్రార్ధించుచుండఁగనే యాకపింజలుఁడు గగనమార్గమునఁ బూర్వరూపముతో నాయొద్దకు వచ్చెను.

వానింజూచి నేను గన్నీరుగార్చుచు నట్లుండియు నెదురుకొనఁ బ్రయత్నించితినికాని రెక్కలు రామింజేసి శరీరము కదలినదికాదు. అప్పుడు నేను దీనస్వరముతో వయస్యా! కపింజల జన్మద్వయాంతరిత దర్శనుండవగు నీరాక చూచి తొందరగా లేచి యెదురుకొనుచుఁ జేతులుచాచి గాఢముగా నాలింగనము జేసికొనుటకును జేయిపట్టుకొని పీఠంబునఁ గూర్చుండఁబెట్టుకొనుటకు సుఖాసీనుండవైన నీకు గమనాయాసంబు వాయనడుగు లొత్తుటకును నాకు యోగ్యత లేకపోయినది కదా యని చింతించుచున్న నన్నుఁ గపింజలుఁడు తన రెండుచేతుల తోడ నెత్తిపట్టుకొని యాలింగన సుఖం బనుభవించువాఁడుఁబోలె వక్షమున నిడుకొనుచు శోకంబున మదీయచరణంబుల శిరంబున నుంచుకొనుచుఁ బ్రాకృతుండువోలె బెద్దయెలుంగున రోదనము జేసెను.

అట్లు పెద్దయెలుంగునఁ బాకృతుండువోలె శోకించుచున్న యతని నూరడించుచు నే నిట్లంటిని. సఖా! కపింజల సకలక్లేశపరిభూతుండనగు నాకీ శోకము తగునుగాని నీవిట్లు విలపించెదవేమిటికి? నీవు బాలుండవైనను సంసారబంధాత్మకములగు రాగాదిదోషముల నంటక వత్తింపుచుంటివి. ఈమూఢజనమార్గమును విడువుము. కూర్చుండి చెప్పుము. మాతండ్రి కుశలుఁడై యున్నవాఁడా? నన్నెన్నఁడైన స్మరించునా? ఈవృత్తాంతమునువిని యేమనుచున్నవాఁడు. కోపము సేయుచుండెనా? ఏమి? అని నేనడిగిన నతండు హరీతశిష్యునిచే వేయబడిన పల్లవాసమునఁ గూర్చుండి నన్నుఁ దొడయం దిడికొని హరీతకునిచే నీయఁబడిన యుదకముచే మొగము గడిగికొని నా కిట్లనియె.

మిత్రుఁడా! మీతండ్రి కుశలుఁడై యున్నవాఁడు మనవృత్తాంత మంతయు దివ్యదృష్టిచేఁజూచి ప్రతిక్రియకొఱకుఁ బ్రయత్నించుచుండెను. అంతలో నేను తురగత్వమునువిడిచి ఆయనయొద్దకుఁ బోయితిని. దూరమునందె నన్నుఁ జూచి కన్నుల నశ్రుజలంబుగ్రమ్మ భయపడుచున్న నన్నుఁ జేరదీసి గారవింపుచు నిట్లనియె.

వత్స! కపింజల వగవకుము. ఈతప్పు నాదికాని మీదికాదు. పుండరీకుఁడు పుట్టినప్పుడే వాని కిట్టి దోష మున్నదని యెఱింగియుఁ బ్రమాదంబున నాయుష్కరమగు కర్మ నిర్వత్తించితినికాను. ఇప్పు డన్నియుం దీర్చితిని కొలఁదిదినములలో నీకష్టము లన్నియుం బోవఁ గలవు. అంత దనుక నీవు నాయొద్ద నుండుమని యాజ్ఞాపించుటయు నే నిట్లంటి.

తాతా! నీకు నాయం దనుగ్రహము గలిగినచో నామిత్రుఁ డెందుండెనో యచ్చటికిఁ బోవుట కాజ్ఞ యిమ్ము. వానిం జూడ నాకు మిగుల నాతురముగా నున్నదని యడిగిన నమ్మహర్షి యిట్లనియె. వత్స! వాఁ డిప్పుడు చిలుకగా నుదయించి యున్నవాఁడు. నీవు వోయియు వానిం దెలిసికొనఁజాలవు. వాఁడును నిన్నెఱుగఁడు కొంతకాల మరుగనిమ్మని యాజ్ఞాపించెను. నేనందే యుంటిని. నేఁటి యుదయంబున నన్నుఁజీరి యా పారికాంక్షీ వత్సా! కపింజల! నీ మిత్రుఁడిప్పుడు మహానుభావుండైన జాబాలి యను మహర్షి యాశ్రమములో నున్నవాఁడు. వానికిప్పుడు తత్ప్రసాదంబునఁ బూర్వజన్మ స్మృతిగలిగినది. కావున నీవిప్పు డతనిం జూడఁబొమ్ము. కర్మ పరిపక్వమగువఱకు నా మహాత్ముని యాశ్రమము విడువవలదని నా మాటగాఁ జెప్పుము. అని యుపదేశించెను. మఱియు నీ తల్లియగు లక్ష్మియు నీ దుఃఖము విని దుఃఖించుచు నీ విముక్తి కొఱకై యమ్మునికిఁ బరిచర్య చేయుచున్నది. ఆమెయు నీకిట్లే చెప్పుమన్నది. అని పలుకుచు శిరీష కుసుమపేశల పక్ష్మమములగు నా గాత్రములఁ దన మృదుకరతలంబున దువ్వుచు హృదయంబున మిక్కిలి పరితపించెను.

అప్పుడు నే నతనింజూచి వయస్యా! నీవెందులకు విచారించెదవు? మందభాగ్యుండ నగు నా మూలమున నీవు తురగమై పుట్టి యనేక కష్టము లనుభవించితివి. అయ్యయ్యో! సోమపానోచితమగు నీ నోటి యందు నురగతోఁగూడిన రక్తము స్రవింపుచుండఁ దగిలించిన యినుప కళ్ళెముయొక్క క్షతము లెట్లుగా సహించితివి?

కిసలయశయనోచిత సుకుమారగాత్రుండవగు నీవు పండుకొనక సంతసము నిలఁబడి యెట్లుగానుంటివి? మిక్కిలి కోమలములగు నీ యంగములఁ గశాఘాతము లెట్లుగా భరించితివి? అక్కటా! బ్రహ్మ సూత్రభారమును వహించెడు నీ దేహమున బిడుగుపడినంత బాధగల నీడల నెట్లుగా సహించితివి బాబూ! అని పలుకుచు వానితోఁ బూర్వ వృత్తాంతముల ముచ్చటింపుచుండ క్షణకాలము తిర్యగ్జాతిదుఃఖము మరచి యానందించితిని.

అంతలో మధ్యాహ్న సమయమగుటయు హరీతకునితోఁగూడ గపింజలుఁడు యధోచితాహారమున నన్నుఁ దృప్తుం గావించి తాను గూడ భుజించి క్షణకాల మూరకొని వెండియు నాకిట్లనియె. వయస్యా! మీతండ్రి నీకీ వార్తజెప్పి నన్ను వెంటనే యక్కడికి రమ్మని యాజ్ఞాపించెను. నేనిఁక బోయివచ్చెద. నీవు కర్మ పరిసమాప్తి వఱకు నీ మహర్షి పాదమూలమును విడువరాదు సుమీ! అని పలికిన విని విషణ్ణవదనుండనై యిట్లంటి.

కపింజలా! ఇట్టి యవస్థలోనున్న నేను దలితండ్రుల కేమని సందేశమంపుదును? అంతయు నీవే యెఱుంగుదువు. అనుటయు నతండు నన్నందుండి కదలనీయవలదని హరీతకునకుఁ బలుమారు జెప్పి యప్పగించి నన్ను మఱియొకమాఱు కౌఁగలించుకొని మునికుమారు లెల్ల విస్మయముతోఁ జూచుచుండ నంతరిక్షమున కెగిరి యంతర్ధానము నొందెను.

అతండరిగిన వెనుక హరీతకుఁడు నన్నూరడించుచు స్వయముగా నా కాహారాదిక మిడుచు నేకొరంతయు రాకుండఁ గాపాడుచుండెను. కొన్ని దినంబులకు నాకు ఱెక్కలు వచ్చినవి. ఇంచుక యెగురుటకు సామర్థ్యము కలిగినప్పుడే నాత్మగంబున నిట్లు విచారించితిని. నా మిత్రుఁడు చంద్రాపీడుని మహాశ్వేతను జూచుటకు నా మనసుత్సుకము జెందుచున్నది. నేనక్కడికిపోయి వసించెదనని తలంచుచు నొకనాఁడు ప్రాతఃకాలమున విహారమునకుం బోలె బయలుదేరి యుత్తరదిక్కు ననుసరించి యెగిరిపోయితిని.

స్వల్పదివసముల క్రితమే యెగరనేర్చితిని. కావునఁ గొంచెము దూరము పోయినంతనే నా యవయవములన్నియు విడిపోయినట్లాయాసము గరలిగినది. దాహముచే నాలుక యెండఁ జొచ్చినది. శ్వాసలు బయలుదేరినవి. ఱెక్కలాడింపశక్యము గాకుండెను. కన్నులు తిరుగుచుండెను. ఇక్కడబడియెద నిక్కడ బడియెదనని తలంచుచుఁ దూలుచు నా సమీపమందున్న సరస్సీరమందలి జంబూతరుని కుంజముమీద నతి కష్టమున మేనుఁజేర్చితిని. కొంతసేపటికి గమనామాసమించుక తగ్గినది. మెల్లగాఁ జెట్టుదిగి శీతలంబగు తచ్ఛాయ నాశ్రయించితిని. మఱియుఁ గింజల్కర జోవాసితంబగు నా సరసిజలంబు దృప్తిగాఁ ద్రావి త్రావి మృదువులగు కమలకరుణికాబీజములచేతను, తీరుతరుపర్ణాంకురములచేతను, పండిరాలిన ఫలములచేతను ఆకలి యడంచుకొని యపరాహ్ణకాలంబునఁ దిరుగా బయలుదేరిన నెంతదూరముబోవఁగలనో యని యాలోచించుచు మార్గగమనఖిన్నములగు నవయవములకు విశ్రాంతి గలుగుటకై నీడతోఁ గూడిన తత్తరుశాఖ నాశ్రయించి మొదటి భాగమున నేకూర్చుంటిని. అంతలో నాకు నిద్రపట్టినది. కొంతసేపటికి మేల్కొనిలేచి చూచు వఱకు త్రెంపరాని తంతుపాశములచేఁ గట్టఁబడి యుంటిని.

అప్పుడు పాశములేని కాలపురుషుని భాతి నుక్కుముక్కలచే నిర్మింపఁబడిన రెండవ ప్రేతపతిచందమునఁ బుణ్యరాశికిఁ బ్రతిపక్షు వైఖరిని బావమున కాశ్రయుండట్ల తోచుచుఁ గోపకారణము లేకయే భ్రుకుటీరౌద్రములైన నేత్రములు గలిగి కృతాంతునికిఁగూడ భయము గలుగఁజేయు వాఁడుంబలె నొప్పుచు మలినవసనాంగుడైఁ యదృష్టాశ్రుతపూర్వుండైనను స్వరూపప్రకటిత క్రౌర్య దోషుండగు నొకానొక పురుషు నెదురం గాంచితిని.

వానిం జూచినతోడనే నాకు జీవితమందు నిరాశ గలిగినది. అయినను నించుక ధైర్యము దెచ్చికొని వాని కిట్లంటి. భద్రా! నీ వెవ్వఁడవు? నన్నిట్లేమిటికి గట్టితివి? మాంసలాలసత్వమున నంటివేని నిద్రలోనే నన్నుఁ జంపఁ దగినది. నిరపరాధినగు నాతో నీ కేమిపని? విలాసమున కిట్లు పట్టితినంటివేని కౌతుకము తీరినదిగదా? ఇఁక వదలుము. మిత్రులంజూడ నేను దూరము పోవలసియున్నది. ఆలస్యము నా హృదయము సహింపదు. నీవును బ్రాణిధర్మమునందే యుంటివి కదా! నీయెఱుఁగని ధర్మంబులుండునా? అని ప్రార్ధించిన వాఁడిట్లనియె. మహాత్మా! నేను జాతిచే ఛండాలుండను గౄరకర్ముఁడను విలాసమునకు మాంసమునకు నిన్ను నేను గట్టలేదు. ఇక్కడి కనతి దూరములోనున్న మాలపల్లెయందు నా యధికారి గలఁడు. అతని కూఁతురు తొల్లిప్రాయంబున నొప్పుచున్నది. ఆమెకు జాబాలి యను మహర్షి యాశ్రమమున మాటలునేర్చిన చిలుక గలిగియున్నదని నీ వృత్తాంత మెవ్వరో చెప్పియున్నారు.

ఆ కథవిని యా చిన్నది మిక్కిలి వేడుకపడుచు నిన్నుఁబట్టి తీసికొనివచ్చుటకై బహుదినములక్రితమే నావంటివాండ్రఁ బెక్కండ్ర నియమించి యున్నది. నా పుణ్యమువలన నీవిప్పుడు నాచేఁ బట్టుపడితివి. నిన్నామెచెంతకుఁ దీసికొని పోయెదను. నీ బంధమోక్షములకా పద్మగంధియే సమర్ధురాలని పలికిన విని నెత్తిపైఁ బిడుగుపడినట్లు అంతరాత్మ బాధపడుచుండ నే నాత్మగతంబున నిట్లు తలంచితిని.

అక్కటా! మందభాగ్యుండనగు నాయొక్క కర్మనిపాకము కడు దారుణమైనదిగదా! సకలసురాసుర మకుటమణి కిరణ నీరాజిత చరణ కమలయగు మహాలక్ష్మికిఁ బట్టినై పుట్టి జగత్త్రయపూజ్యుండగు శ్వేతకేతు మహామునిచేఁ బెంపఁబడి దివ్యలోకాశ్రమముల వసియించెడు నేనిప్పుడు మ్లేచ్ఛజాతికైనఁ బ్రవేశింపఁదగని మాలపల్లె కరుగ వలసినదా? ఛండాలులతోఁ గూడఁ గలసియుండవలసినదా? మా లెతలచే నీయఁబడిన కబళములఁచే దేహము బోషించుకొనవలసినదా? ఛండాల బాలకులకు నాటవస్తువును గావలసినదా? ఆహా! దురాత్మా! పుండరీకహతక! సీ! నీ జన్మ కడు నింద్యమైనదిరా! నీవు ప్రధమగర్భమందే వేయిముక్కలై చెడిపోయితివేని యీ యిక్కట్లు రాకపోవునుగదా? తల్లీ! లోకమాతా! పద్మశరణా! అశరణ జనశరణ చరణపంకజా! నన్నీ నరకూపమునం బడకుండఁ గాపాడ లేవా? తండ్రీ! భువనత్రయత్రాణ సమర్ధుండవు స్వయముగాఁ బెనిచిన నీకులతంతవునగు నన్నీయాపదనుండి రక్షింపుము వయస్యా! కపింజల! నీవు వేగవచ్చి నాకీయాపద దాటింపకపోయితివేని జన్మాంతర మందైన నిఁక నాతోఁ గలసికొనఁజాలవుసుమీ? అని యనేక ప్రకారముల విలపించుచు వెండియు వినయముతో వాని నిట్లు ప్రార్థించితిని.

చంద్రముఖ! నాకు జాతిస్మృతిగలదు. నేనొక మునికుమారుండను. ఈసంకటమునుండి నన్ను దప్పించిన నీకును బుణ్యమురాఁగలదు నన్ను బట్టి నట్లెవ్వరును జూచియుండలేదు. విడిచినచో నీకుఁబ్రత్యవాయమేమియుం గలుగదు. కావున గరుణించి నన్ను వదలుమని బ్రతిమాలు కొనుచు వానిబాదంబులం బడితిని. పక్కుననవ్వి వాఁడు నా కిట్లనియె. ఓరీ! మోహాంధుఁడా! శుభాశుభకమ్మలకు సాక్షిభూతములగు పంచభూతములు నీశరీరమున లేవా? అవి చూచుచుండవా? అకార్యకరణమునకు నే నంగీకరింపను. స్వామ్యాజ్ఞచే నిన్నుఁ బట్టికొంటిని వదలుటకు వీలులేదని పలుకుచు నన్నుఁతీసికొని పక్కణాభిముఖుండై యరుగు చుండెను. నేను వానిమాటచే నెత్తిపైఁ గొట్టబడినట్లు మూకీభావము వహించి యేపాపముజేసి యిట్టిఫల మనుభవింపుచుంటినో యని ధ్యానించుచుఁ బ్రాణములు విడుచుటకు నిశ్చయించుకొంటిని. మఱియు వానితో నట్లుతీసికొని పోఁబడుచున్న సమయంబున ముందుజూచినంత,

సీ. కుక్కలతోఁ గూడికొని గుంపు గుంపుగా
              చండాల బాలకుల్ సంచరింప
    దూషితమాంస మేదో వశాకర్దమ
              ప్రాయకుటీరాజితములు వెలయ
    గుడిసెల చుట్టు బల్ గోటగాఁ గట్టిన
              వెదుర కంపల దడుల్ వీథులంట

     నస్తి రాసులఁ జేరి యరపులతో మీఱి
                   కుర్కురంబులు దాడి గ్రుద్దులాడ

గీ. బురదగుంటలఁ బందులు పొర్లులాడ
    విస్రగంధి రజోధూమ వితతమగుచుఁ
    దులపఁజూడ నసహ్యమై తనరునట్టి
    పక్కణము గానఁబడియె నప్పతగపతికి.

నరకవాసులకుఁగూడ నుద్వేగము గలుగఁజేసెడు నామాలపల్లెం జూచి జుగుప్స జెందుచు నాహా! ఆచండాలకన్యక దూరమునందే నన్నుఁజూచి కరుణ జనింప వదలి వేయుమనునా? వట్టిది. వట్టిది. జాతికిం దగని యట్టిపని యెన్నడుం జేయదు. కానిమ్ము. నాపురాకృత మిట్లున్నది. ఏమిజేయుదును? నిమిషమైన నిందుండఁజాలనని తలంచు చుండగనే వాఁడు నన్నామెకడకుఁ దీసికొనిపోయి తల్లీ! అవధారు. ఇదిగో నీవుచెప్పిన చిలుకం దీసికొని వచ్చితిని. చూడుమని నమస్కరించి నన్నుఁ జూపెను.

ఆమగువ మిగుల సంతోషించుచు మంచిపని గావించితివని వాని మెచ్చుకొని నన్ను వానికరమునుండి తన రెండుచేతులతోఁ గైకొని పుత్రకా! నేఁటికిఁ దొరకితివిఁ కెక్కడికిఁ బోఁగలవు? నీకామ చారదోష మంతయుఁ బోగొట్టెదఁ జూడుమని పలికినది. అప్పు డొక చండాల బాలకుఁడు పరుగెత్తుకొనిపోయి లోమశంబై దుర్గంధ యుక్తంబగు గోచర్మముచేఁ గప్పఁబడిన దారుపంజర మొకదానిం దీసికొనివచ్చి యామెముందర నుంచెను. మహాశ్వేతా లోకన మనోరధములతోఁగూడ నన్ను లాగి యిందుండుము కదలకుమని పలుకుచు నన్నా పంజరములోవైచి తలుపు బిగించినది. అప్పుడు నేనాత్మ గతంబున నిట్లు తలంచితిని. అయ్యో! నేనిప్పుడు గొప్ప యాపదలోఁ బడిపోయితిని. శిరస్సుచే నమస్కరించి నా యవస్థయంతయు నీమె కెఱింగించి వదలుమని బ్రతిమాలుకొందునా? సరిసరి నేను లెస్సగా మాటాడుదుననియేకాదా? యీ పైదలి నన్నుఁ బట్టించినది. కావున నట్లు బ్రతిమాలు కొనుట వలన లాభములేదు. నా బంధనపీడ యీమె నేమి బాధించును? తనయుండననియా! సోదరుండ ననియా? బందువుఁడ ననియా? కావున మౌనమే యవలంభించుట యుక్తము. దానఁ గోపించి యింతకంటెఁ గష్టదశ నొందించునేమో! అవును. సందియమేలా! దీనిజాతి క్రూరజాతికాదా? ఇంతకన్నఁ గష్టమగుంగాక! యీ చండాలులతోఁ గలసి మాట్లాడుట అనుచితము. కావున మౌనమవలంభించుటయే శ్రేయము. ఇఁక మాట్లాడదు. ఈ మూకశుకంబు నాకేల యని యెప్పుడైన విసుగుజెంది విడువవచ్చును. మాట్లాడుచున్న విడువనేరదు.

ఆహా! దివ్యలోక భ్రంశము మర్త్యలోక జన్మము తిర్యగ్యోని పతనము, ఛండాల హస్తోపగమనము, పంజరబంధదుఃఖము. ఇది యంతయు నింద్రియచాపల్య దోషంబునంగదా! కలిగినది. అక్కటా! ఒక్క వాక్కునేకాదు. సర్వేంద్రియములను నియమించెద నని తలంచుచు మౌనము వహించితిని.

పలికించినను, తర్జించినను, గొట్టినను, బలవంతముగాఁ బొడిచినను నేమియు మాటాడక కేవలము సీత్కారము మాత్రము జేయుచుంటిని.

పానాశనములం దెచ్చిపెట్టినను నేమియు ముట్టక యా దివస ముపవాసమే కావించితి. ఆ మఱునాఁడును నే నేమియుం దినకున్నంతఁ జింతించుచు నా కాంతామణి స్వయముగా నానావిధములగు ఫలంబులు సురభిశీతలమగు జలంబును దీసికొనివచ్చి నాకిచ్చినది. నే నుపయో గించితినికాను. అప్పుడు నన్నుఁ దేరిబారి చూచుచు నా చిన్నది నాకిట్లన్నది.

నిర్వికారచిత్తములుగలిగి క్షుత్పిపాసలచే దీపించు పశువులకును, బక్షులకును, సిద్ధమైన యాహారమెట్టిదైనను గుడుచుట ధర్మమైయున్నది. నీ వట్టిదానవుగదా? నీకీ భోజ్యాభోజ్య వివేచన మేమిటికిఁ గలుగ వలయును? జాతిస్మృతి గలిగి యస్మదీయంబగు నాహారంబు గుడువ కుంటివా? అట్లైనను తిర్యగ్జాతియం దుదయించిన నీకీ నియమ మవసరములేదు,

అత్యుత్తమమైన తాపసజాతియం దుదయించుయుఁ దిర్యగ్జాతియందుఁ బుట్టఁదగిన పాపకర్మ గావించితివిగదా? ఇప్పుడు నీకీ విచార మేటికి? మొదటనే వివేకము గలిగియున్నచో నీ ముప్పు రాకయే పోవును. ఇప్పుడు స్వకృతకర్మ విశేషంబునం గలిగి జాతికిఁ దగిన యాహారము గుడుచుట నీకుఁ దోషము కానేరదు. అదియునుంగాక గొప్పవారుగూడ నాపత్కాలములయందు భక్షింపఁదగని వానిం దిని ప్రాణములు నిలుపుకొందురు. నీ మాట చెప్పనేల? మఱియు నీకు చండాలాశన శంక గలుగఁజేయు వస్తువులేమియు నేను దీసికొని రాలేదు. ఈ ఫలములం దినవచ్చును. వుల్కనభాండగతముకన్న నేలఁబడిన యుదకము పవిత్రమని చెప్పుదురు. అట్టిదానినైనఁ ద్రాగరాదా? ఊరకయేమిటికి క్షుత్పిపాసలచే నాయాసపడియెదవు? మునిజనోచితమైన యీ ఫలముల నేమిటికి భక్షింపవు? ఈ నీ రేమిటికి త్రాగవు? అని పలుకుటయు జండాలజాత్య నుచితములైన యా బోఁటి మాటలాలించి విస్మయము జెందుచుఁ జుగుప్సవిడిచి జీవితాశచే క్షుత్పిపాసోపశమనమునకై యశనక్రియ నంగీకరించితిని. మౌనము మాత్రము విడువలేదు.

అట్లు కొంతకాలము జరిగినంత నేను తరుణత్వము వహించిన పిమ్మట నొకనాఁడు ప్రాతఃకాలమున నిద్రలేచి చూచినంత నాదారు పంజర మేమైనదో తెలియదు. నేనీ బంగారుపంజరములో నుంటిని. ఆకన్యక యిట్టి దివ్యరూపముగలదై యొప్పెను. దేవర జూచియే యున్నారుగదా! మఱియు నామాలపల్లి యమర నగరసమానమై ప్రకాశించుచుండఁ జూచి నేను పుల్కనపురవాస పరితాపము విడిచి యాశ్చర్యమందుచు నిది యేమని మౌనము విడిచి యప్పఁడతి నడుగుదమని యెంతలోఁ దలంచుచుంటినో యంతలో నీకాంతారత్నము నన్నిక్కడికిఁ దీసికొనివచ్చినది.

మహారాజా! ఈసరోజానన యెవ్వతెయో యెందులకై యిట్లు చండాలరూపత్వము ప్రకటించినదో నన్నెందులకుఁ బట్టించినదో యిప్పుడు నన్నిక్కడి కేమిటికిఁ దీసికొనివచ్చినదో నాకేమియుం దెలియకున్నది. దేవరవోలె నీకథ వినుటకు నేనుగూడ నుత్సుకము గలిగి యుంటినని యాచిలుక చెప్పినది.

ఆకథ యంతయును విని యమ్మహారాజు ఆవార్త వినుటకు మిక్కిలి కుతూహలము గలవాఁడై వాకిటనున్న యామాతంగకన్యం దీసికొని రమ్మని ప్రతీహారి కాజ్ఞాపించెను. అదివోయి యిటురమ్మిటు రమ్మని పలుకుచు నాకలికిం దీసికొనివచ్చి యెదుర నిలిపినది. అప్పు డావాల్గంటి భూమినంటకయే నిలువంబడి తన తేజంబున నన్నృపునిఁ బరాభవింపుచుఁ బ్రౌఢముగా నిట్లు పలికినది.

భువనభూషణ! రోహిణీనాథ! తారారమణ! కాదంబరీలోచనానందచంద్ర! ఈదుష్టుఁడు తనయొక్కయు, మీయొక్కయు వృత్తాంతమంతయు మీకు వినిపించెంగదా! జాబాలియాశ్రమము విడువవలదని తండ్రిగారిచే నియమింపఁబడియుఁ దదాజ్ఞ నుల్లంఘించి కామరాగాంధుండై మహాశ్వేతయొద్దకుఁ బ్రయాణమైనవార్తయు మీకు విదితమే. నేనీ దురాత్ముని గన్నతల్లిని. మహాలక్ష్మిని. వధూదర్శనోత్సుకుండై యరుగుచున్న కుమారుని దుర్వృత్తి దివ్యదృష్టింజూచి శ్వేతకేతుఁడు నన్నుంజీరి నీపుత్రుం డింకను నధోగతిం బొందునట్లు తోచుచున్నది. పశ్చాత్తాపంబునంగాని వానిచిత్తవృత్తి యుపశాంతి వహింపదు. నీవువోయి వానికిఁ గర్మపరిపక్వమగుదనుక నొకచోటఁ గట్టిపెట్టి యనుతాపము గలుగునట్లు చేయుము వేగమ బొమ్మని యాజ్ఞాపించుటయు నేనీకల్పన యంతయుం గావించితిని.

క. నీవా చంద్రాపీడుఁడ
    వావైశంపాయనుండె యౌ నీశుకమో
    భూవర! మీకిత్తఱిశా
    పావిలదోషావసానమై యొప్పుటచే.

మీ యిరువురును శాపావసానంబున సమముగా సుఖియింపఁ గలరని వీని నీచెంతకుఁ దీసికొనివచ్చితిని. లోకసంపర్క పరిహారమునకై చండాలజాతిం బ్రకటించితిని.

ఇప్పుడు మీ యిరువురు జన్మజరామరణాది దుఃఖబహులములగు శరీరములవిడిచి యదేష్టజనసమాగము సుఖంబుల ననుభవింపఁ గలరని పలుకుచు నమ్మాతంగకన్యక మంజీరరవంబు ఘల్లురని మ్రోయఁ బాదంబులం నేలందట్టి యంతరిక్షమున కెగిరి యదృశ్యయై దివమునకుం బోయెను.

పిమ్మట నమ్మనుజపతి యయ్యువతి వచనములు వినినంత జాతి స్మరణ గలుగుటయుఁ గాదంబరిం దలంచుకొనుచుఁ గ్రమంబునఁ గాదంబరీ వియోగసంతాపంబునం గృశించి కందర్పశరాసారఘాతంబునం దుదకుఁ గాలధర్మము నొందెను. ఆచిలుకయు శాపావసానమైనది కావున నయ్యొడయనితోగూడ నయ్యొడలు విడిచినది. అంత నక్కడఁ గాదంబరియు నొక వసంతకాలంబునఁ గామోత్సవంబు గావించి వాడుకప్రకారము ప్రాతఃకాలంబునఁ జంద్రాపీడుని దేహము నర్చించి యుత్సుకముతోఁ గంఠము గౌఁగలించుకొనినది.

అప్పు డమృత సేకంబునంబోలె నయ్యాలింగనసుఖంబునఁ జంద్రాపీడుఁడు మేనంబ్రాణములు జేరుటయు నాతపసంతాపంబున ముకుళించిన కలువశరత్కాలకౌముదిచే వికసించినట్లు మెల్లన హృదయ ముచ్ఛ్వాసభాసురంబయ్యె. ప్రాతఃపరామృష్టేందీవర ముకుళము మాట్కి కణా౯ంతాయతమగు నయనయుగము విడినది. మోము పద్మవికాస వహించినది.

అట్లు నిద్రమేల్కాంచినట్లులేచి చంద్రాపీడుఁడు మెడఁ గౌఁగలించియున్న కాదంబరిని జిరవిరహ దుల్లభములగు లోచనములచే గ్రోలువాడుంబలెఁ జూచుచు గంఠంబు గౌఁగలించుకొని వాతాహత బాలకదళియుంబోలె వణంకుచుఁ గన్నులుమూసికొని తొట్రుపడుచున్న యాచిన్నదానికి మనోహరస్వరముచే నానందము గలుగఁజేయుచు నిట్లనియె.

బోఁటీ! నీవు వెరవకుము నీకరస్పర్శంబుదగిలి నేను జీవించితిని. అమృతసంభవంబగు నప్సరఃకులంబున నీవు జనియించితివికదా. శాపదోషంబున నిన్నిదినములు మనకు వియోగంబు గలిగె. ఇప్పుడు త్వద్విరహదుఃఖప్రదమైన శూద్రకనృపశరీరమును విడిచితిని. ఇఁక నీకు సుఖముగలుగు నీప్రియసఖి మహాశ్వేతయొక్క ప్రియుండుసైతము నాతోఁగూడ శాపవిముక్తివడసె నప్పఁడతియు సుఖించునని పలుకుచున్న సమయమునందే నాగలోకమునుండి కపింజలునికై దండఁగొని పూర్వము మహాశ్వేతచూచిన రూప మాకంఠమాల యాయక్షసూత్ర మాశాటీపటముతోఁ బుండరీకుఁ డచ్చోటికి వచ్చెను. అప్పుడు దూరమునం దతనింజూచి కాదంబరి చంద్రాపీడుని వక్షమునుండిలేచి యతివేగముగాఁ బరుగిడి మహాశ్వేతను గౌఁగలించుకొని తదాగమన వృత్తాంతమును జెప్పెను.

అంతలోఁ బుండరీకుఁడును జంద్రాపీడుని చెంతకువచ్చి యాలింగనము చేసికొనియెను.

చంద్రాపీడుఁ డతని బిగియఁగౌఁగలించుకొనుచు వయస్యా! పుండరీక! ప్రాగ్జన్మసంబంధంబున నీవు నాకల్లుఁడ వైతివి. ఎట్లయినను మనము తదనంతర జన్మసంబంధ సముపగతమైన మైత్రిచేతనే వర్తింపఁ దగినదని పలుకుచున్న సమయంబునఁ గేయూరకు డావార్త జిత్రరధహంసుల కెఱింగింప హేమకూటమునకుఁ బోయెను.

మదలేఖయు వేగముగాఁబోయి యాప్రాంతమునఁ దాపస వృత్తితో మృత్యుంజయ జపముచేయుచున్న తారాపీడుని పాదంబులంబడి చంద్రాపీడుఁడు జీవించిన వృత్తాంతమును జెప్పెను.

ఆమాటవిని తారాపీడుఁడు విలాసవతితోఁగూడ నానందసాగర మగ్నుండై యత్యాతురముగాలేచి శుకనాసుఁడు తోడరాఁ మదలేఖ వెంటఁ జంద్రాపీడుఁ డున్న చోటికిఁబోయి యందుఁ బుండరీకునిమెడఁ గౌగలించుకొనియున్న కుమారునింజూచి నానందబాష్పములు నేత్రంబులగ్రమ్మ నపారసంతోషపారావారంబున మునుంగుచుఁ బుత్రుం గౌఁగిలించుకొనియెను.

తల్లియుఁ బాలిండ్లు స్రవింపఁ దనయుంజూచి సంతోషవివశయై యుండె. అప్పుడు చంద్రాపీడుఁడు దల్లిదండ్రులకు నమస్కరించుచు శుకనాసునికిసైతము గేలుమోడ్చి యతని యాశీర్వాదమందుకొనుచు ఆర్యా! వీఁడే వైశంపాయనుఁడు చూడుమని పుండరీకునిం జూపెను.

ఆప్రస్తానములోనే కపింజలుఁడు సమీపించి శుకనాసుని కిట్లనియె. ఆర్య! శ్వేతకేతుండు మీకిట్లు చెప్పుమనియె.

ఈపుండరీకుఁడు నాచేతఁ బెంపఁబడుటయేగాని నీకే పుత్రుండు వీనికిని నీయందే ప్రేమగలిగియున్నది. కావున వీని వైశంపాయనుఁడే యనుకొని యవినయకార్యములఁ బ్రవర్తింపనీయకుము. వరుఁడని యుపేక్షింపకుము వీఁడు నీవాఁడే యనియే శాపావసానమున సైతము నీయొద్దకే పంపితిని.

అదియునుంగాక మదీయంబగు సాత్వికతేజం బిప్పు డింతకన్న నుత్తమలోకంబునకుం బోవనున్నది.

అని యిట్లు శ్వేతకేతుని సందేశము కపింజలుండు చెప్పగా విని శుకనాసుఁడు వినయావనమ్రుఁడైయున్న పుండరీకు నంసంబు బట్టుకొని కపింజలున కిట్లనియె.

కపింజల! సర్వజ్ఞుండైన శ్వేతకేతుం డిట్టివార్త బంపనేమిటికి? నేస్తంబున నిట్టిమాట వినినచో సంతోషము గలుగునా? అందరకు నమ్మహానుభావుని యాశ్రయమే కావలయునని యిట్లు పూర్వజన్మ సంస్మరణానురూపములైన యాలాపములుచేత నాదివసము గడిపెను.

అమ్మరునాఁ డుదయంబున గంధర్వకులనాయకులగు చిత్రరధహంసులు సపత్నీకులులై పెక్కండ్రు పరిచారకులుసేవింప నచ్చోటికి వచ్చి యల్లుండ్రం గూఁతుండ్రం జూచి యెం తేని సంతసము జెందుచుఁ దారాపీడ శుకనాసులచే మన్ననల వడసి తాత్కాలోచిత సంభాషణములచేఁ గొంత కాలక్షేపము చేసిరి.

అప్పుడు చిత్రరధుండు తారాపీడునింజూచి యార్యా! మిగుల వైభవముగల భవనములు గలిగియుండ నీ యరణ్యములో వర్తింపనేల? హేమకూటమునకుఁ బోవుదము రండని పలుకగా విని తారాపీడుం డిట్లనియె. గంధర్వరాజ! ఎచ్చట నిరతిశయమగుసుఖముగలుగునో అదియే భవనము. ఇట్టిసుఖము నేనేభవనమునందును బొందియుండలేదు. అదియునుంగాక మదీయంబులగు భవనసుఖంబు లన్నియు నీయల్లునియందే సంక్రమించినవి. నాకిఁక యరణ్యమే శరణము. వధూయుతముగా నతనినే తీసికొని వెళ్ళుమని పలుకగావిని చిత్రరథుండు సమ్మతించి యప్పుడ తారాపీడుని యనుజ్ఞ వడసి చంద్రాపీడాదులతోగూడ హేమకూటమునకుం బోయెను.

అందు శుభముహూర్తమున సకలగంధర్వరాజ్యముతో జిత్రరధుండు కాదంబరిని జంద్రాపీడున కిచ్చి వివాహము చేసెను.

హంసుండు నట్లే మహాశ్వేతనుఁ బుండరీకునిఁ కిచ్చి పెండ్లి చేసెను. అట్లు చంద్రాపీడ పుండరీకులు గంధర్వరాజ్యములతోగూడ నచ్చేడియల స్వీకరించి యమ్మించుబోడులతోఁ గ్రీడించుచు దమ్మాశ్రయించుకొనియున్న యించువిల్కాని కాప్యాయనము గావించిరి. మఱియొకనాఁడు కాదంబరి చంద్రాపీడునితో ముచ్చటింపుచున్న సమయంబున నామె యతని కిట్లనియె.

ఆర్యపుత్రా! మనమందరము మృతిజెంది వెండియుం బ్రదికి యొండొరులము గలిసికొంటిమి. పత్రలేఖ సరస్సులోఁబడి తిరిగివచ్చినది కాదు. ఆమె వృత్త మెట్టిదని యడిగిన విని చంద్రాపీడుఁ డిట్లనియె. ప్రేయసీ! నాభార్యయగు రోహిణియే పత్రలేఖ. నేను బుండరీకునిచే శపింపఁబడి పుడమి జనించుచుండుటఁజూచి నన్ను విడువలేక నా శుశ్రూషకై నాకన్న ముందుగనే భూమియం దుదయించినది. అంతకుఁ బూర్వము నేనును నెఱుఁగను. శాపాంతమైనది కావున నిప్పు డంతయు స్ఫురించుచున్నదని యెఱింగించెను.

చంద్రాపీడుఁడు పుండరీకునితోఁ గూడికొని కొన్నిదినంబు లుజ్జయినియందును, కొన్నిదినంబులు హేమకూటమునందును, గొన్ని దినంబులు చంద్రలోకమునందును, గొన్నిదినంబులు లక్ష్మీసరస్సు నందు వసించి దివ్యభోగము లనుభవించుచుండెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు గోపా! నీవుచూచిన చిత్ర ఫలకములోని యాకృతులు వీరివే. కాషాయవస్త్రము గట్టికొని గుహా ప్రాంతమున నిలువబడినది మహాశ్వేత. చంద్రాపీడుని విగ్రహము నర్చించుచున్నది కాదంబరి. అది మదలేఖ అది తరళిక అని యా వృత్తాంతమంతయు నెఱింగించుటయు నాలకించి యగ్గోపకుమారుండు సంతుష్టాంతరంగుఁడై యయ్యవారి ననేకప్రకారములఁ గైవారము సేయుచు నతనితోఁగూడఁ దదనంతరావసధంబుఁ జేరెను.

క. కాదంబరీ రసంబా
    స్వాదించిన నించుకంత పరవశులై సం
    మోదింతురు జనులనఁ ద
    న్మాధుర్యం బెఱుకపడదె మఱి విబుధులకున్.

గీ. బాణకవిచేత రచియింపఁబడియెఁ గొంత
    యతనిసుతుచేతఁ బూరితమయ్యెనంత
    మదియు నిదియుఁ గథాసంగ్రహంబు దప్ప
    కుండఁ దెనుగించినాడ గద్యోపసరణి.

క. నీకర్పించితి నీకృతి
    గైకొనుమా బాలచంద్ర కలిత లలిత ఫా
    లా! కాళీలోలా శై
    లాకర శెభకర మహేశ హరవిశ్వేశా!


గద్యము

ఇది శ్రీమద్విశ్వనాధ సదను సంపాసంపాదిత కవితా విచిత్రాత్రేయ

గోత్ర పవిత్ర మధిరకుల కలశ రాకా కుముద మిత్ర లక్ష్మీ

నారాయణ పౌత్ర కొండయార్య పుత్ర విబుధ జనాభి

రక్షిత సుబ్బన్న దీక్షితకవి విరచితం బగు కాశీ

యాత్రా చరిత్ర మను మహాప్రబంధ

మున నుత్తర ఖండానుబంధమను

నామాంతరము గల యాం

ధ్రీకృత కాదంబరి

సంపూర్ణము.

శ్రీ విశ్వేశ్వరార్పణమస్తు.