కాశీ మజిలీ కథలు/32వ మజిలీ/వైశంపాయనుని కథ

వైశంపాయనుని కథ

దేవా! యవధరింపుము వైశంపాయనునితోఁగూడ మీరు మెల్లగా రండని మాకు జెప్పి దేవర యరిగితిరిగదా! ఆదినము మేము ప్రయాణసాధనముల సవరించుకొని మరునాఁ డుదయంబునఁ బ్రయాణభేరిని గొట్టించి నంతలో వైశంపాయనుండు వచ్చి వారించుచు నీప్రాంతమందచ్ఛోదమను పుణ్యసరస్సు గలదు. అందు దీధ౯మాడి శంభునర్చించి రేపుపోవుదము. ఈపుణ్యభూమి కిప్పుడైనను వత్తుమా? యని పలుకుచుఁ బదగమనముననే తానయ్యచ్ఛోదమునకుఁబోయెను.

ఆప్రదేశమంతయు రమణీయముగా నుండుటచే నందందు దృష్టి బరగింపుచు నందందు మెలంగుచు నవ్వనవిశేషములఁజూడఁ గ్రుమ్మరుచున్నంత నత్తటాకప్రాంతమున మణిశిలామంటపమొండు గనంబడినది.

దానిని జిరకాలమునకు గనంబడిన సోదరునివలెఁ బుత్రకుని భాతిమిత్రుని చందమున నత్యంతప్రీతితో రెప్పవాల్పక చూచుచు స్థంభితుని యట్ల కదలక నిర్వికారహృదయుఁ డై యెద్దియో థ్యానించుచు నథోముఖముకా నందుఁ గూర్చుండటయు మే మతనిం జూచి మనోహర దేశాలోకంబునం జేసి తదీయచిత్తమట్లు వికృతి బొందినదని తలంచి కొంతసే పూరకొంటిమి.

ఎప్పటికిని రాకున్న మేము దాపునకుఁ బోయి ఆర్యా! వేళ యతిక్రమించుచున్నది. స్నానము చేయుము. పయనమునకు సైనికులు మీరాక వేచియున్నారు. ఈప్రదేశ మెంతసేపు చూచినను జూడవలయుననియే యుండును. ఆలస్యము చేయక లెం డని పలికిన మామాటలు వినిపించుకొనక కదలక మాకేమియుఁ బ్రత్యుత్తరము జెప్పఁడయ్యెను. ఆ లతామంటపమును మాత్రము రెప్పవేయక నిశ్చల దృష్టితోఁ జూచుచుండెను. పలుమారు మేము తొందరపెట్టుటయు నెట్టకేలకు మమ్ము జూడకయే నేను రాను. మీరిందుండరాదు. అతండరిగి పెద్దతడవయినది. వేగమ పొండని పలుకగా విని అయ్యో! యీతం డకారణముగా వైరాగ్యమును జెందెనే యని శంకించుకొనుచు సానునయముగా బోధించియు, నిష్ఠురముగాఁ బలికియు నీకీ మోహము తగదు. వడిగా రమ్ము. చంద్రాపీడుఁడు నిన్నువిడిచి వచ్చిన మమ్ము జండించునని యెన్నియో రీతులం జెప్పిన నెట్టకేలకు విలక్షణహాసయుక్తమగు మొగముతో మా కిట్లనియె.

ఇప్పుడు నాకేమియుం దెలియకున్నది. నన్ను మాటిమాటికి గమనమునకు మీరు బోధన చేయుచున్నారు. నేను చంద్రాపీడుని విడిచి యెప్పుడైన నుంటినా? అంతయు నాకెఱుక యగుచున్నది కాని నేనేమియుం జేయలేను. తెలిసినను జేయుటకు శక్తుఁడకాకుంటిని చూచుచున్నను నాదృష్టి మఱియొకచోటికిఁ బ్రసరింపదు. పాదములు గదలవు. ఇచ్చట స్థాపనజేయఁబడినదివోలె నాతనువు కదలకున్నది. కావున నేను వచ్చుటకు సమధు౯డను కాను నన్నొక వేళ మీరు బలాత్కారముగాఁ దీసికొనిపోయెదరేని నామేనఁ బ్రాణములు నిలుపనని తోచుచున్నది. ఇచ్చటనే యుండినచో నాహృదయంబున నెట్లో యున్నది. ప్రాణములు ధరింతునని ధైర్యమున్నది. కావున మీరు నన్ను నిర్భంధింపకుఁడు మీరువోయి యావజ్జీవము చంద్రాపీడమఖదర్శన సుఖం బనుభవింపుఁడు. నాకట్టి సుఖములేకుండ దైవము విడదీసి నని పలికిన మేమడలుచు నదికైతవనునుకొని అయ్యో! యిట్లు పలికెదరేల? చంద్రాపీడుని దావునకు రారాయని నిర్బంధముగా బెక్కుసారు లడిగిన నతం డిట్లనియె.

అక్కటా! మీరూరక నన్ను నిర్బంధించెదరేల? చంద్రాపీడుని జీవితముతోడు నా కేమియుఁ దెలియకున్నది. నేను వచ్చుటకు సమధు౯ఁడను కాను. కారణము నాకుఁ దెలియదు. మీరు చూచుచునే యడిగెదరేల? మీరు పొండు పొండని పలికి ముహూత౯కాల మూరకొని యందు రమ్యములైన లతాగృహములు సరస్త్సీరములు గ్రుమ్మరుచు నాదేవాయతనమున నెద్దియో మరచిపోయినట్లు నెదకుచు నితరదృష్టిలేక తిఱుగుచుండెను.

మేము పొదలమాటుననుండి ఱెండుయామములవరకు నతని చేష్టలం గనిపెట్టి తిరిగిపోయి రమ్మని నిర్బధింప నతఁ డయ్యో! నన్నిట్లు వేపెదరేల? నాకు నాజీవితముకన్నఁ జంద్రాపీడుని ప్రాణములు ప్రియములుకదా! అవి యతని విడిచి బలత్కారముగా నా యొద్దకు వచ్చినను గార్యము లేదని తోచుచున్నది. ఇంక మీరేల వేడెదరు? పొండని పలికి లేచి యందు స్నానము చేసి కందమూల ఫలము లాహారముగాఁ బుచ్చుకొని వనవాసోచితవ్యాపారమును గైకొనియెను.

అప్పుడు మేము విస్మయమందుచు మూఁడహోరాత్రములు వేచియుంటిమి కాని యతనిబుద్ధి తిరిగినదికాదు. అప్పుడు నిరాశులమై యందుఁ గొందరఁ గావలియుంచి మేము బయలుదేరి వచ్చితిమి.

అని యెఱింగించిన వారి మాటలు విని చంద్రాపీడుఁడు చింతా విస్మయము లొక్కమాటు చిత్తం బుత్తలపెట్ట నిట్లు తలంచెను.

అయ్యో! వైశంపాయనుని కింతలో వై వృత్తిబూనుటకుఁ గారణమేమియుం గనంబడదు. తారాపీడుఁ నన్నుఁబలె వానిని సైతము గారవించును. ప్రజలకు సైతము నాయందుకన్న వాని యందె మిక్కుటమగు మక్కువగలిగియున్నది. శుకనాసుఁడు మనోరమయు నతని నేవిషయములోను మందలించి యెఱుఁగరు. అతనికిఁ బ్రశాంతికైన నిది సమయముకాదు ఇదివరకు విద్యజ్జనోఁచితమైన గావా౯స్థ్యమందే ప్రవేశింపలేదు. ఇదియేమియో యని పెక్కు తెరం గులఁ దలంచుచు నతివేగముగా నచ్చోటికి బోవఁదలంచియుఁ దల్లిదండ్రుల కెఱిగింపకపోరాదని నిశ్చయించి యప్పుడే తురగమెక్కి యత్యంతరయంబునఁ దనపట్టణమునకు వచ్చెను.

ఆవీటిలోఁ బ్రజలందరు గుంపులుగాఁ గూడుకొని వైశంపాయనుని వృత్తాంతమే చెప్పుకొనువారును, వినువారును, అడుగువారును, విచారించువారునై వీథులయం దుండుటఁ జూచి చంద్రాపీడుఁడు అక్కటా! యీవాత౯ నాకన్న ముందర పట్టణములోనికి వచ్చినది. మాతండ్రిగారికిని శుకనాసునికిఁగూడఁ దెలిసియేయుండును వైశంపాయనునిగురించి బాహ్యజనంబే యింత విచారింపుచుండఁ దల్లిదండ్రుల కెట్లుండునో? నన్నేమని శంకింతురో యని పెక్కు తెరంగులఁ దలపోయుచుఁ గ్రమంబున బహిర్ద్వారము దాపునకుఁబోయి యందు గుఱ్ఱమును దిగి యాస్థానమునకుఁ బోవుచున్నంతఁ దారాపీడుఁడు విలాసవతితోఁగూడ శుకనాసునిగేహములందున్న వాఁడను వాత౯ వినంబడినది.

అప్పు డతండును మరలి తానుగూడ నచ్చటికిఁ బోవుచుండ సమీపముగా నిట్టిధ్వని వినంబడినది.

హా! వైశంపాయన? హా! వంశపావన! మదీయాంకసీమ యందు లాలింపఁబడుచుండెడి నీవిప్పుడు వ్యాళశతభీషణమయిన కాంతారములో నొంటిగా నెట్లుంటివి? అందు శరీరరక్ష నీకెట్లు జరుగుచున్నది? నీకు నిద్రాశుకమిచ్చుశయ్య నెవ్వరు గల్పించుచున్నారు? నీయాకలి గనిపెట్టి యన్న మిడువారెవ్వరు? పట్టీ! ఎట్టియవస్థవచ్చినది. అయ్యో! నీవు వచ్చినతోడనే మీతండ్రితోఁజెప్పి తగినకన్యకను వివాహము జేయవలయునని తలంచియుంటినే మందభాగ్యురాలనగు నాకట్టి యదృష్ట మెట్లు పట్టును? నన్నును మీతండ్రిని నీవున్న చోతికి దీసికొని పొమ్ము. నిన్ను విడిచి మేము నిమిషమైనఁ దాళ లేము. ఇంత నిష్ఠురత్వము నీవేటికి బూనితివి? చంద్రాపీఁడునిఁవిడిచి క్షణమైనఁనుండువాడవు కావే తద్వియోగమిప్పు డెట్లు సైచితివి? ఆస్నేహమంతయు నేమయిపోయినది? నీవట్టివైరాగ్యము బూనుటకుఁ గారణమేమి? అయ్యయ్యో! ఎంతవచ్చినది? ఏమిచేతును? పుత్రా! యని యీరీతి పెక్కు తెరంగులఁ బుత్రశోకంబున విలపించుచున్న మనోరమగంఠధ్వనివిని యతండు విహ్వలుఁడై మూర్ఛవోయియంతలో దెప్పిరిల్లి క్రమంబునఁ దండ్రియొద్దకుఁ బోయి యతనిం జూచుటకు సిగ్గుపడుచుఁ దల వంచుకొని నమస్కరింపుచు దూరముగాఁ గూర్చుండెను.

ఆరాజు పుత్రుం జూచి బాష్పగద్గదస్వరుండయి వత్సా! చంద్రాపీడ! నీకు వైశంపాయనునియందు జీవితముకన్న నెక్కుడు ప్రీతియని యెఱుంగుదును కాని యతనివృత్తాంతము వినినది మొదలు నాహృదయము నీయెడ ననుమానము జెందుచున్న దేమని; పలికిన విని యతనిమాట లాక్షేపించుచు శుకనాసుం డిట్లనియె.

దేవ! అగ్నిచల్లబడినదనినను సూర్యుని నంధకారము గ్రమ్మినదనినను సముద్రమింకినదనినను నమ్మవచ్చును కాని చంద్రాపీడుఁ డట్టిదోషమును జేయునని తలంపరాదు. కృతయుగావతారమని చెప్ప నోపిన చంద్రాపీడుని సుగుణముల విమశి౯ంపక మిత్రఘాతకునిగా సూచించితిరేల? విచారింపవైశంపాయనుఁడే దుజ౯నుఁడని తలంచెదను. లోకంబునఁ బుత్రులంగనుట వంశవృద్ధికొరకుఁగదా! తండ్రి యానతిఁబూనక నేనెట్లు వైరాగ్యమును బూనుదునని యించుకంతయు వానిస్వాంతమునఁ బుట్టినదికాదే? అట్టిదుర్మాగు౯ని విషయమై దయదలపఁనేటికి? వాఁడు పెంచినచిలుకవలె దేవరచేఁ బోషింపఁబడి యంతయు మరచి యిప్పుడు కృతజ్ఞత దలంప విడిచి వెళ్ళెనే. ఆత్మద్రోహము చేసినవానితో మనకేమి? అప్పాపాత్ముని జననము మనకు శోకమునకే కారణమైనది అని పలికి కన్నీరు నించుచు నిట్టూర్పులు నిగుడించెను.

అప్పుడు తారాపీడుఁ డతనిం జూచి యార్యా! యూరడిల్లుము. వ్యజనానిలముచేత వాయువును వృద్ధిజేసినట్లుకదా! మీకు మేము బోధించుట! బహుశ్రుతుండైనను బ్రాజ్ఞుండైనను వివేకియైనను ధీరుండయినను దుఃఖాతిపాతంబునఁ జిత్తచాంచల్యమందకమానఁడు. మనస్సు చెడినవానికేమియుం దెలియదుకదా! వైశంపాయను గురించి కోపావేశముతోఁ బలుకుచున్న నీమాటలు వినుటచే నాకు మిక్కిలి వ్యసముగానున్నది. యతనియెడఁ గోపమును విడువుము. వాఁడు మిక్కిలి గుణవంతుఁడు కారణ మరయక వానినిందింపరాదు. చంద్రాపీడునంపి వానిశీఘ్రముగా నిచ్చటికి రప్పించి యట్టి విరక్తి నేమిటికిఁ బూనెనో యరయుదముగాక యరసినపిదప యధాన్యాయముగా నాచరింతమని పలికిన విని వెండియు శుకనాసుం డిట్లనియె.

దేవ! నీకు వైశంపాయనుని యందు గల మక్కువచే నిట్లనుఁ చున్నావు. నీయౌదార్యమట్టిదయే కాని యువరాజును విడిచి యాత్మేచ్ఛచేనుండుట గష్టమని పలికిన విని చంద్రాపీడుఁడు తండ్రియన్న మాట హృదయంబున ములికిపోలికనాఁటియుండ గన్నీరునించుచు గూర్చుండియే మెల్లగా దాపునకుఁ బోయి శుకనాసునకిట్లనియె.

ఆర్య! వైశంపాయనునివిషయమైన నావలన నేమియు దోసము లేదని చెప్పకపోయినను నేనెఱుంగుదు, అయినను మాతండ్రిగారి కనుమానము దోచుచున్నదని పలికిరికదా! లోకులు సైతమట్లే భావింతురు. అసత్యమయినను లోకాపవాదము భరించుట గష్టము. అయశఃప్రసిద్ధి లోకంబున వ్యాపించెనేని పరలోకహాని కాగఁలదు. కావున దీనికిఁ బ్రాయశ్చిత్తముగా వైశంపాయనుని దీసికొని వచ్చుటకు నన్ను నియమింపుము. మఱియొకరీతి నాకు నిష్కృ గలుగదు. తురగ యావంబునఁబోయిన నాకేమియు నాయాసము గలుగదు. గమనాభ్యనుజ్ఞ యిమ్ము. నేనుబోయి ప్రియమిత్రునిం దీసికొని వత్తును. అతండు రానిచో నేనుసైత మచ్చటనే యుండెదనని పలికిన విని శుకనాసుఁడు తారాపీడునితో దేవా! యువరాజుగ మనమునకు విజ్ఞాపనజేసికొను చున్నవాఁడు. సెలవేమియని యడిగిన నతం డిట్లనియె.

ఆర్యా! మనమొకటి దలఁచి కొనియుండ దైవము వేరొకటి తెచ్చిపెట్టెను. కానిమ్ము. వైశంపాయను నవశ్యముగా యువరాజు దీసికొనిరావలయును. అతని విడిచి యీతఁ డొక నిమిషమైనఁ తాళలేఁడు. తప్పక పోవలసినదే. యతని దీసికొనివచ్చుటకు నాయుష్మంతుని మాట జెప్పనేల. విలాసవతినైనఁ బంపెదను సుమీ యని పలికి దైవజ్ఞులరప్పించి యప్పుడే ప్రయాణమునకు ముహూర్తము నిశ్చయించి పిమ్మటఁ జంద్రాపీడునిం జూచి రాజు వత్స! నీవీ వార్త మీ తల్లికిం జెప్పి వేగపొమ్మని పలుకుచు శుకనాసునితోఁగూఁడ దన భవనమునకుఁ బోయెను.

తరువార నా రాజకుమారుఁడు తల్లియొద్దకుఁబోయి నమస్కరించుచు దాపునం గూర్చుండి మిక్కిలి విచారింపుచున్న మనోరమ కిట్లనియె. తల్లీ! నీవుల్లంబునఁ జింతిల్లకుము. వైశంపాయనుని దీసికొని వచ్చుటకు మా తండ్రి నా కానతిచ్చెను. నేనువెళ్ళి యలఁతికాలములో నాతనిం దెచ్చెదను. నీవుగూడ ననుజ్ఞయిమ్ము. పోయివచ్చెదననుటయు నామె యిట్లనియె.

వత్సా! నేను వెళ్ళెదనను మాటచే నాకు శోకోవశమనము జేసెదవేల? నాకు నతనియందుకన్న నీయందు మక్కువ మెండు. నీవు పోయిన నెవ్వరిజూచికొని ధైర్యమవలంభింతును? నీవు పోవలదు. దైవానుగ్రహము గలిగిన వాఁడెరాగలఁడు. లేక మఱియెవ్వనేని బంపుదురు. కాకయని పలికినవిని విలాసవతి యిట్లనియె. సఖీ! మన యిరువురకు వారిరువురయందును సమాన ప్రేమగలిగి యున్నది. వానిం జూడక నేనుమాత్రము సైరింపగలనా! వారింపఁకుము మనము వారించినను జంద్రాపీడుఁడు నిలుచువాఁడుకాడు. యనుజ్ఞ యిమ్మని పలికిన నక్కలికియు నెట్టకేలకు సమ్మతించినది.

అంతలో సాయంకాలమగుటయుఁ జంద్రాపీడుఁడు ఆ రాత్రి భోజనముచేసి తల్పంబున శయనించి సంకల్పశతములచే మనోరధములఁ బూరించుకొనుచు నిట్లు తలంచెను.

నేను ముందుగా నచ్ఛోద సరస్సునకుఁబోయి యందు వెనుక వెనుకగా నరిగి వైశంపాయనుని కంఠగ్రహణముచేసి నీవి కెందు బోవఁ గలవని పలికిన నతండు నామాట ద్రోయనేరక నాతో వచ్చునుగదా. పిమ్మట మహాశ్వేత యాశ్రమమున కరిగి యందుఁ బరిజనము నునిచి యామెతోఁ గూడ హేమకూటమునకుఁ బోయెదను.

అందు నన్నుంజూచి కాదంబరి పరిజనము తొందరగా నిటునటు తిరుగుచు నమస్కరింపుచుండఁ గ్రమంబునఁ గాదంబరి యున్న తావరసి యరిగిన నత్తరుణియు నా రాక సఖులచే నెఱింగి తటాలునఁ బుష్ప శయ్యనుండి లేచి యత్యాతురముతో స్వాంగాలంకారముల సవరించు కొనుచు సిగ్గుచేఁ దలవంచుకొని శయ్యాసమీపంబున నిలువంబడియున్న యన్నారీలలామమునుగాంచి కన్నులకలిమి సార్ధకము గావించెదను కదా.

తరువాత మదలేఖను పత్రలేఖను గేయూరకుని యధోచిత గౌరవంబున మన్నించుచు సాహసముతో వివాహప్రయత్నము చేయుటకు జిత్రరధునకు వార్త నంపెదను. పిమ్మట నా కొమ్మను శుభముహూర్తమునం బెండ్లియాడి బహుళకుసుమదామ భూషానులేపనాది వస్తుమండితమగు భవనంబునఁ బుష్పశయ్యపై మత్సమీపమున గూర్చుండి వయస్య లరిగిన వెనుక తానును మొగమువంచి యరుగఁబోవు నయంబున బలత్కారముగా సందిటిలో నిమిడ్చికొని తల్పంబునఁజేర్చి పిమ్మటఁ దొడయం దిడుకొని యెడమచేతితోఁ గేశపాశముగైకొని కుడిచేతిలో నధరము పుడుకుచుఁ గపోలములఁ జుంబించుచు సురలకు సైతము దుర్లభమయిన యధరామృతము తనివితీరఁ గ్రోలెదను.

అంత నింతింతనరాని సంతసముతోఁ గంతుసంతాపమునఁ గృశించియున్న యవయవములకు గాఢాలింగన సుఖరస భరంబున నుబ్బుగలుగఁ జేయుచుం దరువాత నా నాతితోఁగూడ మదనాగ్ని నార్పునదియు నింద్రియములకు సుఖమిచ్చునదియుఁ బెక్కుసారు లనుభవించుచున్నదైనను గ్రొత్తదానివలె దోచునదియు నిట్టిదని చెప్పుటకు నలవికాని సంతోషము గలుగజేయునదియు నిర్వాణ సుఖసాదృశ్యము గలదియు సచింత్యమయినదియు నగు సుఖ మనుభవించుచు నిమిషమైనను విడువక రమ్యప్రదేశములఁ గ్రీడింపుచు యౌవనమునకుఁ దృప్తి గలుగఁ జేసెదను.

ఆ రీతిఁ గాదంబరికి సంతోషము గలుగఁజేసి మదనలేఖను వైశంపాయనునకుఁ బెండ్లిచేసెదను. అని యిట్లు పెక్కు తెరంగుల నంతరంగమ్మునఁ దలపోయుచు మేను గరువుజెంద ననుభూతుఁడైన వాఁడుంబోలె నారాత్రి నిద్దురంజెందక తృటిలాగునగడిపి యుదయంబునలేచి సముచిత పరివారంబు సేవింప నింద్రాయుధమెక్కి యక్కుమారుం డప్పురము వెడలి కతిపయప్రయాణంబుల నచ్ఛోదసరస్త్సీరమునకుఁ బోవుచు నించుకదూరములో నెదురుపడిన మేఘనాధునింజూచి యత్యాతురముగా నిట్లనియె. మేఘనాధ! అచ్ఛోదస్సరస్త్సీరంబున నీకు వైశంపాయనుఁడు కనంబడియెనా? చూచి మాట్లాడితివా? ఏమనియెను? ఇప్పటికైనం పశ్చాత్తాపముజెంది యింటికి రావలయునని తలంచుచున్నవాఁడా! నా మాటయేమైనం దెచ్చెనా, యని తల్లిదండ్రులు జ్ఞాపకముండిరా యని యడిగిన నతం డిట్లనియె.

దేవా! దేవర ఇదిగో నేను వైశంపాయునితో మాట్లాడి నీ వెనుకనే వత్తునని చెప్పితిరికదా. మేమట్లుపోయి మీ రాక వేచియుండ నెప్పటికి వచ్చితిరికారు. అప్పుడు పత్రలేఖయుఁ గేయూరకుఁడు నన్నుఁ జూచి మన చంద్రాపీడుని వర్షాకాలమగుటచేఁ దల్లితండ్రులు రానిచ్చిరి కారు. నీవిచ్చోట నొక్కరుఁడ వుండనేల ఇంటికిఁ బొమ్మని పలికి వారిరువురు హేమకూటమునకుఁ బోయిరి.

నేను మఱికొన్ని దినములందుండి తిరుగానింటికి వచ్చుచున్నవాఁడ. నింతియకాని వైశంపాయనుని వార్త నా కేమియుం దెలియదు. అతం డచ్ఛోదసరస్సునకుఁ బోవుటయే నేనెఱుఁగనని చెప్పినవిని యా రాజకుమారుఁడు వెండియు వానితో నోరీ! అట్లైన సరియేకాని పత్రలేఖ యిప్పటికి హేమకూటముజేరునో లేదో చెప్పఁగలవా యని యడిగిన వాఁడిట్లనియె.

దేవా! దైవికమైన యంతరాయమేదియు రాకుండిన నది యాలస్యము చేయునదికాదు. కావున నేఁటి కబ్బోఁటి హేమకూటము జేరుననియె. నా యభిప్రాయము అనిచెప్పిన సంతసించుచుఁ జంద్రాపీఁడుడు వానితోఁగూడఁ గ్రమంబున వైశంపాయనింజూచు వేడుకతో నచ్ఛోదసరస్సునకుఁ బోయి యందు గుఱ్ఱపురౌతుల కిట్లనియె.

వైశంపాయనుఁడు వైరాగ్య వృత్తిబూని యీ వనములో నెచ్చటనో యణఁగియున్న వాఁడు. మనలనుజూచి పారిపోవును. కావున మీరందఱు గుర్రములనుండియే లతాగహనములను తరుమూలములు లతామంటపములు మొదలగు ప్రదేశములలో విమర్శగా నరయుఁడని పలుకుచుఁ దాను మిక్కిలి శ్రద్ధాపూర్వకముగా నతని వెదకెనుకాని యెందును అతనిచిహ్నము లేమియుం గనబడినవికావు.

అప్పు డతడు పెక్కుతెరంగులఁ జింతించుచు వైశంపాయనుని వార్త మహాశ్వేతకేమైనం దెలియునేమోయనియుఁ గాదంబరీ విశేషములుగూడఁ దెలియబడుననియు నూహించి తురగసైన్యమంతయు దదీయాశ్రమమున కనతిదూరంబున నుండ నియమించి సముచితపరివారముతోఁ దానింద్రాయుధమెక్కి యామె యాశ్రమమునకుఁబోయి గుహాముఖంబున వారురవమునుడిగి సన్ననివస్త్రములుదాల్చి యక్కందరాంతరమునకుఁ బోయెను.

అందు శోకవేగంబున నవయవంబులు చలింప గన్నులనుండి ధారగా నీరుగార్చుచుఁ గాలివానతాకుడున వాడినతీగెయుంబోలె మొగమువంచి తరిళికకేలు బట్టుకొనఁబడియున్న మహిశ్వేతంజూచి యతండు విభ్రాంతుండై అయ్యో కాదంబరి కెద్దియేని యప్రియము జరిగియుండఁబోలుఁ గానిచో నిమ్మానిని యిట్లుండదు. ఏమి దైవమా యని ప్రాణంబులెగిరిపోయినట్లు సారెసారెకుఁ దొట్రుపడుచు మెల్లగాఁ దాపునకుఁబోయి బోటీ యీమె యిట్లున్న దేమి యని తరళిక నడిగిన నప్పడతియు నేమియుంజెప్పక యట్టి యవస్థలోనున్నను మహాశ్వేత మొగముజూచినది. అప్పు డాసాధ్వియే క్రమంబున శోకవేగం బడంచుకొని గద్గదస్వరముతో నన్నరవరసూతి కిట్లనియె.

మహాభాగ! సిగ్గులేని యీపాపాత్ము రాలేమిడిఁకి జెప్పకుండును? వినుండు. కేయూరక ముఖముగా భవదుజ్జయినీగమన వృత్తాంతమునువిని మనమెఱియ అయ్యో మదిరాచిత్రరధుల మనోరధమును దీర్పలేక పోయితిని. కాదంబరికోరికయు సఫలము చేయలేకపోయితిని. యారాజకుమారుని యబీష్టము తీరినదికాదు. నేనువచ్చి యేమిచేసితినని సిగ్గుపడుచుఁ గాదంబరీ స్నేహపాశములంగోసి వెండియు దపంబు జేయుటకై యీ యాశ్రమమునకువచ్చి యిచ్చట దేవరఁబోలియున్న యొక్కబ్రాహ్మణకుమారుం డెద్దియో వెదకుచున్నట్లు శూన్యహృదయుఁడై నలుమూలలు జూచుచుండ గంటిని.

అప్పు డతండు నాయొద్దకు మెల్లగావచ్చి యదృష్టపూర్వుండై నన్ను నెన్నఁడో యెఱిఁగిన వాడుంబోలె నాముఖము రెప్పవాల్పక చూచుచు నాకిట్లనియె.

శోభనాంగీ! లోకంబున నెవ్వరును జన్మకును వయసునకును రూపమునకునుం దగినట్లు మెలంగిరేని నిందాపాద్రులుకారు. నీవట్లుగాక తగనివ్రయము చేయుచుంటివేమి? కుసుమసుకుమారమగు నీమైదీగె నుత్కృష్టతపఃకరణక్లేశంబున నిట్లు వాడఁజేయనేమిటికి? సుమనోమనోహరంబగు లతయుంబోలె నీయాకృతి ప్రాయములకుఁ దగినయట్లుగా రసాశ్రయమగు ఫలముతోఁ గూడుకొనకుండుట లెస్సయే. తపంబు పరలోకసుఖప్రదంబు. రూపగుణహీనులు సైత మైహికసుఖంబు లనుభవించుచుందురు. ఆకృతిమంతులమాటఁ జెప్పనేల? తుషారబిందుపాతంబునఁ పద్మినీలతయుంబోలె స్వభావసుందరమగు నీశరీరమిట్లు తపఃక్లేశంబునం గృసియించుట జూచిన నాకు మిక్కిలి విచారమగుచున్నయది. మఱియొక నీవంటివాల్గంటియే యింద్రియసుఖంబుల నిరసించి వైరాగ్యమును బూనియుండ నిఁక దర్పకుని పుష్పసాయక ధారణము వ్యర్థము సుమీ, చంద్రోదయముతోఁ బనియేమి? వసంతమలయా నిలముల రాక నిరర్ధకమే! కువలయకల్హార కమలాకర విలసనములు నిష్ప్రయోజనములు మనోహరోధ్యాన భూము లెవ్వరికిఁ గావలయునని పెక్కు తెరంగుల వక్కాణించెను. పుండరీకునికథ జరిగినది మొనలు నేనుత్సాహముడిగి యుంటిని కావున వానిమాటలువిని నీవెవ్వఁడవు? నీపేరేమి? నీవృత్తాంతమెట్టిది? నన్నిట్లు పలికెదవేలయని యడుగకయే యచ్చటినుండి మఱియొక చోటికి బోయి దేవతార్చన పుష్పములంగోయుచున్న తరళికంజీరి యిట్లంటిని.

తరుణీ! యీతరుణండెవ్వఁడే వీని యాకారముజూడ బ్రాహ్మణకుమారుఁ డట్లతోచుచున్నయది. నన్నుజూచినంత వీనిస్వాంతమున వెఱ్ఱిచేష్ట లంకురించుచున్నయవి. కావున వాని నిచ్చటికి వెండియు రాకుండునట్లు చేయుము. కూడఁగూడ తిరుగుచున్నవాఁడు. నివారించి నను వచ్చెనేని తప్పక యమంగళమును జెందగలఁ డని పలికితిని.

అదియు నతనితోఁ దగినట్లు చెప్పినది కాని మదనహతకునివృత్తి దుర్నివారమైనదగుటచే వానిచిత్తము మరలినదికాదు.

మఱికొన్నిదినములు గడచినంత నొకనాఁడురాత్రి జ్యోచ్స్నాపూరముచే జగంబంతయు నిండియుండ సంతాపంబువాయనే నీశిలా తలంబున శయనించి మందమందముగా నచ్చోదానిల పోతములు వీచుచుండఁ బుండరీకుని వృత్తాంతమే స్మరించుకొనుచు నిద్రపట్టమింజేసి యిందుబింబవిలాస మరయుచుఁ గన్నులుమూయక యట్టెచూచుచుంటిని.

అట్టిసమయమున నాబ్రాహ్మణకుమారుఁడు మదనావేశితహృదయుండై మెల్లగా నడుగులిడుచు నాయొద్దకువచ్చెను. నిస్పృహురాలనైనను వానిఁజూచినంతనే స్వాంతమున భయము జనింప నిట్లు తలంచితిని. అయ్యో! మంచియాపద తటస్థించినదే వీఁడు నన్నుముట్టినంత మాత్రమునఁ బ్రాణములు విడువవలసినదేకదా. పుండరీకునిరాక నిరీక్షించి యిన్నిదినములు ప్రాణములు దాల్చినది వ్యర్థమైపోవునే యని యాలోచించుచున్న సమయమున నతండునాదాపునకువచ్చి యిట్లనియె. ఇందుముఖీ! కందర్పునితోఁగూడి నన్నిప్పు డీచందురుఁడు చంపుటకుఁ బ్రయత్నించుచున్నవాఁడు కావున నిన్ను శరణు జొచ్చితిని. అనాథునాతు౯ నవ్రతీకారాక్షు భవదాయత్తు నన్ను రక్షింపుము, శరణాగత పరిత్రాణము తపస్వీజన ధమ౯మేకదా. నీవిప్పుడు నన్నాత్మ ప్రదానంబున రక్షింపవేని తప్పక నీకు బ్రహ్మహత్యాపాతకము గాఁ గలదని పలికెను.

వానిమాటలువిని నేను రోషానలంబున భస్మము చేయుదానివలె బాష్పస్ఫులింగదృష్టిచే వానింజూచుచు నావేశించిన దానివలె నొడలెఱుంగక కోపవేగ రూక్షాక్షరముగా హుమ్మనిపలుకుచు నిట్లంటి.

ఓరిపాపాత్ముడా! నన్ను నీవిట్లన నీతల పిడుగుపడినట్లు నూఱు వ్రక్కలయినదికాదేమి? నీజింహ లాగికొనిపోలేదే? సకలలోక శుభా శుభ సాక్షీభూతములగు పంచభూతములు నీయందులేవాయేమి? వాని చేతనయిన మడియవైతివే? మూఢుఁడా! ఇట్టి కామవృత్తిగలిగిన నీవు తిర్యగ్జాతియందుబుట్టక యిట్లేల పుట్టితివి? వక్రముఖానురాగముగలిగి స్వపక్షపాతమాత్ర ప్రతృత్తితో నొప్పుచు స్థానాస్థాననిరూపణ విధం బెఱుంగక చిలుకవలె హాతవిధిచేఁ బలికింపఁబడితివి. శుకజాతియందైనఁ బుట్టకపోయితివేమి? ఆత్మవచనానుగుణమగు జాతియందుఁ బుట్టితివేని యిట్లు నన్నుఁ గామింపకపోవుదువుకదాయని పలుకుచుఁ జంద్రమండలమున దృష్టియిడి దేవా! సకలలోకచూడామణీ! లోకపాల! నేను బుండరీకునిఁ చూచినదిమొదలు యితరదృష్టిలేక యతనినే ధ్యానించు దాననైతినేని వీఁడు నామాటచే హీనజాతియందుఁ బుట్టునని పలికితిని.

అప్పుడతండు మదీయశాపముననో మదనజ్వర వేగముననో పాప విపాకముననో తెలియదుకాని నేనట్లు పలికినతోడనే నరకబడిన తరువువలెఁ జేతనముబాసి నేలంబడియెను. అతం డట్లు గతాసుండగు టయుఁ దత్పరిజనము పెద్దయెలుంగున రోదనముజేసెను. అయ్యాక్రందము వలననే యతండు దేవర మిత్రుఁడని తెలియవచ్చినదని పలికి తలవంచుకొని మిక్కుటమగు నశ్రుధారచే భూమినిఁ దడిపినది.

అట్టి మాటలువిని చంద్రాపీడుఁడా కారణాంత విశాలమగు నేత్రములు మూయుచు భగవతీ! కాదంబరితో నన్ను గూర్చుటకు నీవు తగిన ప్రయత్నముచేసితివి. మందభాగ్యుండనగు నా కట్టియోగ్యత లేనప్పుడు నీవేమిచేయగలవు. ముందుజన్మమునకైనఁ గాదంబరీ చరణ పరిచర్యాసుఖము గలుగు నట్లనుగ్రహింపుమని పలుకుచునే హృదయము భేదిల్ల నట్టె నిలువంబడి ప్రాణముల విడిచెను.

చంద్రాపీడుఁడు వయస్యుని మరణవార్తను వినినతోడనే డెందము పగిలి జీవితము వాయుటఁజూచి తరళిక మహాశ్వేతను విడిచి యతనిం బట్టుకొని అయ్యో! చేడియా! యింకను సిగ్గేమిటికే యీతఁడు ప్రాణములను విడిచినట్లు తోచుచున్నది. మెడనిలుపక వాల వైచెను. చూడుము శ్వాసమారుతలేమియు వెడలుట గనంబడదు. కన్నులు మూయఁబడియున్నవి. హా! చంద్రాపీడ! కాదంబరీప్రియ యిప్పు డప్పడతిని విడిచి యేడకుఁబోయితివి. యా ప్రేముడియంతయు నెందుఁ బోయెనని పెద్దయెలుంగున నేడ్చుచుండజూచి మహాశ్వేతయు నతని మొగమునఁ జూట్కినిలిపి వైవరణ్యమును గనిపెట్టి గాఢశోకంబున జేష్టతక్కి పడియుండెను.

అప్పు డతని పరిజన మా వృత్తాంత మెఱింగి హాహాకారములతోఁ బెక్కు తెరంగుల నమ్మహాశ్వేతను దూరుచు నుచ్ఛస్వరంబున హా! రాజకుమార! హా వైశంపాయన! హా! తారాపీడ ! హా! శుకనాస! హా! విలాసవతి! హా! మనోరమ! మీకెట్టి యాపద సంప్రాప్తించినది. కటకటా! ప్రజలెంత భాగ్యహీను లయ్యెయో! ధరిత్రి యనాధయయ్యెఁ గదాయని యనేక ప్రకారంబుల విలపింపఁ దొడంగెను.

అతని గుఱ్ఱము దైన్యముగా సకిలింపుచు బలుమారతని మోము చూచుచు ఖురపుటాఖాతంబున భూతల రేణువు లెగర విచారంబు సూచింపుచుఁ జిందులు ద్రొక్కఁ దొడంగినది.

అని చెప్పువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుండు పై మజిలీజేరి తదనంతర వృత్తాంతమిట్లు చెప్పందొడంగెను.


శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

ముప్పదిమూఁడవ మజిలీ కథ

వత్సా! వినుము. అంతనక్కడఁ కాదంబరియుఁ బత్రలేఖచే చంద్రాపీడాగమన వృత్తాంతమునువిని చంద్రోదయమునసాగర వేలయుఁ బోలె నలరుచుఁ దల్లితండ్రుల కెద్దియో మిషజెప్పి వెండియు సుందరముగా నలంకరించుకొని పెక్కండ్రు పరిచారికలు సురభిమాల్యానులేపనాద్యుపకరణములు గైకొని తోడరాఁ కేయూరకుఁడు మార్గముజూపఁ బత్రలేఖ కైదండగొని నడుచుచు మదలేఖతో బోఁటీ! యీ పత్రలేఖ చెప్పినమాటలు వింటివా? అతని విషయమై నేను యశ్రద్ధ జేసితినఁట. నా యవస్థయంతయుం జూచియు హిమగృహంబున నైపుణ్యముఁగా బలికిన యతని వక్రభాషితములు నీకు జ్ఞాపకములేదా? నీవుసైత మప్పుడు నవ్వుచుఁ జూచి యతని మాటలకుఁ దగినట్లు ప్రత్యుత్తరముఁ జెప్పితివి. అట్టివాఁడిప్పుడు మాత్రము నన్ను విమర్శించునా, పయనము మాట దలపెట్టక పాపము నా నిమిత్త మీమత్తకాశిని యుత్తల మందు చున్నదని చిత్తంబునం దలంచు చున్నవాఁడు. కాబోలు కానిమ్ము. నేనతనింజూచి యేమియు మాట్లాడను. పాదంబులఁబడినను గ్రహింపను. మదలేఖా! నీవప్పుడు నాతో నేమియుం జెప్పవద్దుసుమీ! పెద్దతడవు చిక్కులుపెట్టి పిమ్మట మాటాడెదనని యతని గురించిన మాటలే చెప్పుకొనుచు మార్గమున భేదము గురుతెఱుంగక క్రమంబున జంద్రాపీడునిఁ జూడ మిక్కిలి తొందరపడుచు నమ్మహాశ్వేతాశ్రమమునకు వచ్చెను.

అట్లు వచ్చి యందు అమృతరహితమగు సమద్రంబు చందంబున నున్ముక్తజీవితుండై పడియున్న చంద్రాపీడునిం జూచి కాదంబరి హా! ఇది యేమికష్టమని మూర్ఛాక్రాంతస్వాంతయై నేలం బడుచుండ మదలేఖ తటాలునఁ బడకుండ బట్టుకొనినది. పత్రలేఖయుఁ గాదంబరి యొక్క కైదండ విడిచి మోహవేశముతో నొడలెఱుంగక నేలంబడిపోయినది.

కాదంబరియుఁ గొంతసేపటికి దెప్పిరిల్లి మూఢయుంబోలె నేమియు నెఱుంగక యూర్పులు విడుచుట సైతము మరచి రెప్పవాల్పక నిశ్శలతారకలతో నతని మొగమే చూచుచు వ్రాయఁబడిన ప్రతిమవలె కదలక యట్లె నిలిచియుండం జూచి మదలేఖ యామె పాదంబులబడి సఖీ! నీవీ శోకమును విడువుము. స్వభావమృదు సరసమగు నీ హృదయము అతివృష్టి భారంబున విచ్చిన తటాకమువలె భేదిల్లును సుమీ! ఈతండు చైతన్యంబుబాసి పరలోకమున కతిధియైనట్లు తోచుచున్నది. ఇఁక వీనికొరకుఁ జింతింపనేల? యింటికిఁబోయి తల్లి దండ్రుల కామోదము గలుగఁజేయుము. నిన్నుఁజూడక వారు నిమిషము తాళలేరని పలికిన విని కాదంబరి నవ్వి యవ్విద్రుమోష్టి కిట్లనియె.

ఓసి వెఱ్ఱిదాన! నా హృదయమును మృదువుగా జెప్పుచుంటివేమి? వజ్రసారకఠినమైనది. కాకున్న నిట్టి యవస్థఁజూచియు బగుల కుండునా? మఱియు జీవించువారికిగదా తల్లిదండ్రులు బంధువులు పరి జనము కావలయు నాకిక వారితోఁ బనియేమి? స్వర్గగమనోన్ముఖుఁడైన వీనికి నమంగళముగా నేను రోదనముగూడ జేయను. పాదధూళియుం బోలెఁ బాదముల ననుసరించియే పోయెదను. ఎవ్వనికొరకు కులమర్యాద విడిచి ధర్మము గణింపక తల్లిదండ్రుల లెక్కసేయక జనాపవాదము నిరసించి సిగ్గువిడిచి వయస్యల గష్టపెట్టి మహాశ్వేతను గురించి చేసిన శపథమును సైతము పరామర్శింపక ప్రయత్నించితినో యట్టి వాఁడు నా నిమిత్తము ప్రాణములు విడువ నాయసువుల నెట్లు పాలించు కొందునో చెప్పుము. నాకిప్పుడు మరణమే శ్రేయముగా నున్నది. నా యెడ నీకుఁ గనికరమున్నయెడ నా చెప్పిన చొప్పున జేయఁబూను కొనుము. వినుము.

గీ. శూన్యమగు నాదు భవనంబు జూచి చూచి
    సఖులు పరిచరులును బంధుజనము లెట్లు
    వగవకట వేడ్కఁ బూర్వంబువలె మెలంగు
    దురొ యటులు సేయుమిదియ నాకరయ హితము.

క. నాదగు భవనాంగణమున
    బోది వెలయనొప్పు చూతపోతకమునకుం
    బైఁ దనరు మాధవీలత
    కాదరమునఁ బెండ్లిసేయు మనుకొనినగతి౯.

సీ. పడకటింటను దల ప్రక్కఁగట్టిన కామ
                పటము వ్రక్కలుజేసి పాఱవేయు
    యువిద! ముద్దుగఁ బెంచుచున్న నాలేడి పి
                ల్లను విడు మొక తపోవనమునందు
    గలికి! నాక్రీడానగము నాశ్రమముగాఁగ
                నర్పింపుమొక్క మహాతపస్వి
    కలివేణి! శుకశారికల స్వేచ్ఛవిహరింప
                విడువుము నా మేని తొడవులెల్ల.

గీ. విప్రకాంతుల కిమ్ము నావీణ నీవు
    పుచ్చుకొని పాడుకొనుచుండు మిచ్చవచ్చి
    నట్లు చేయుము తక్కిన యన్ని వస్తు
    వులును నాకుఁ బ్రియంబుగాఁ జెలియ నీవు.

చ. రమణి! మదీయపాదతల రంజితమైన యశోకభూజపో
    తము జిగురించె నిప్పుడది తత్కిసలంబుల నేరుకణ౯పూ
    రమునకు నైన ముట్టుకొనరాదు సుమీ! మఱిమాలతీలతా
    సునముల దేవతార్చనకేసూ! లవనం బొనరింపఁగాఁదగున్.

క. ఆ వనిమానుషి తాపసిఁ
    బో విడువుము కానకేను బోషించెడు నా
    జీవం జీవక మిధుము
    గావంగాఁదగును కేలికా శైలమునన్.

మఱియు నాపాదసహచారి యగు హంసకమున కొకరివలన నపాయములేకుండ రక్షించుచుండుము. ప్రాణసఖీ! నీవేనాకుఁబుత్రుండవై పరలోకగతనగు నాకుఁ జలాంజలు లొసంగుచుండుము. నేనీ చంద్రాపీడుని కంఠమును గౌఁగలించుకొని ప్రాణంబుల విడుచుదాన నని పలుకుచు నాప్రాంతమందు నిశ్చేష్టితయైపడియున్న మహాశ్వేతను గౌఁగలించుకొని మఱియు నిట్లనియె;

ప్రియసఖీ! నీవు ప్రియుండు వెండియు వచ్చునని మరణము కన్న నెక్కుడగు నిడుములంబడుచుఁ బ్రాణములఁదాల్చి యాసతో నుంటివి. నాకట్టియాససైత ముంచుకొన నవసరములేదుకదా! కావున నాకు మరణమునకు ననుజ్ఞ యిమ్ము. జన్మాంతరమందైన నీస్నేహము గలుగునట్లు కోరుచున్నదాన నాతప్పుల మన్నింపుమని పలుకుచు లేచి వనకుసుమ కిసలయములచే నతనిపాదము లర్చించి హస్తములచే నెత్తి తొడయం దిడుకొని కూర్చుండెను. అప్పుడు తత్కరసంపర్కంబునంజేసి చంద్రాపీడునిదేహమునుండి యద్భుతతేజం బొండు బయలువెడలి యాప్రాంతమంతయుఁ దుషార మయముగావింపుచు నంతరిక్షములోఁగలసి యశరీరముగా నిట్లుపలికినది.

కాదంబరీ! నీవు చింతింపకుము. చంద్రాపీడుఁడు శాపదోషంబునఁ బ్రాణములఁబాసెను. వీనిశరీరమును విడువక నీవు కాపాడుచుండుము. శాపాంతమందుఁ గ్రమరజీవించు నీశరీరమున కగ్నిసంస్కారము చేయవలదు. నీకరసంపర్కంబునఁ దేజంబు దప్పక యట్లే యుండునని పలికినవిని యందరు శిరములెత్తి రెప్పలువాల్పక గగనమును జూడఁ దొడంగిరి.

అప్పుడు పత్రలేఖయుఁ దస్తేజస్తుషారాశీతలత్వమునం దెప్పిరిల్లిలేచి యావేశించిన దానివలె పరుగిడి యింద్రాయుధము కళ్ళెము పట్టుకొని చంద్రాపీడుఁడు లేక మనమేటికని పలుకుచు నాతురగమును లాగికొని పోవుచు దానితోఁగూడ నచ్ఛోదసరస్సులో దుమికెను.

ఆవెంటనే యాసరస్సులోనుండి తాపసకుమారుం డొకండు బయలువెడలి దూరమునుండి చూచుచున్న మహాశ్వేతదాపునకుఁ బోయి శోకగద్గదస్వరముతో గంధర్వరాజపుత్రీ! నన్నెఱుంగుదువా యని యడిగెను.

అప్పు డప్పడతియు శోకానంద మధ్యవత్తియై తొందరగా లేచి యతనిఁ నమస్కరించుచు దేవా! కపింజల! పాపాత్మురాలనగు నేనిట్లు సిగ్గులేక పుండరీకుఁడు స్వర్గగతుఁడైనను జీవించియుంటిని. అతం డెచ్చటికిఁబోయెను. ఎందుండెను? నీవెప్పుడైనఁ జూచితివా? యాతనివిడిచి నీవొక్కరుండవు వచ్చితివేమని యడిగెను.

అప్పుడు చంద్రాపీడుని పరిజన మతనిం జుట్టుకొని వింతగాఁ జూడఁదొడంగెను. పిమ్మటఁ గపింజలుఁ డామెతో నిట్లనియె.