కాశీయాత్ర చరిత్ర/మూడవ ప్రకరణము

మూడవ ప్రకరణము

ఆషాపురము 3 ఘంటలకు వదిలి రాత్రి 8 ఘంటలకు 6 కోసుల దూరములోనుండే హయిదరాబాదు షహరు ప్రవేశించి షహరుకు సమీపమందుండే బేగంబజార అనే పేటలో నొక తోటలోని బంగాలాలో దిగినాను. ఆ షాపురము వదలిన వెనక 2 కోసుల దూరములో షంషాబాదు అనే బస్తీ గ్రామము కోటసహితముగా నొకటి యున్నది. అదివరకు దోవసరాళము. లొగడి మజిలీ భాటవలెనే 1 గడియదూరము మిట్టయెక్కుచు గడియ దూరము పల్లములో దిగుచు దారిని నడవవలసినది. షంషాబాదు మొదలు చిన్నతిప్పలు దారికి నాలుగు పక్కలా అగుపడుచు వచ్చును. దారి కొంచెమయిన రాగిగొట్టుగలది. దగ్గిరదగ్గిర చిన్న గ్రామాలున్నవి. అనేక మశీదులు చూచుచు పోవచ్చును. చిన్న చెరువులు కొన్నియున్నవి. వాటికింద మామిడితోపులున్ను, కూరగాయల తోటలున్ను వేసియున్నవి.

ఆ దినము మొహర్రం అనే పండుగ ఆరంభ మయినది. ఆ తొమ్మిదో దినము ఆ షహరుకు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమ్మాత్ముని చైతన్యము ఆ షహరులో వెక్కువగా ప్రకాశించుట చేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆతొమ్మిదోదినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు. సకల విధములయిన యారాధనలను అంగీకరించి "యాదృశీ భావనా యత్ర సిద్ది భ్రవతీ తాదృశీ" అనే వచన ప్రకారము లోకుల యిష్టసిద్ధిని చేసే పరమాత్ముడు ఒక్కడే గనుక ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము అక్కడ ప్రతిఫలించుటచేత ఆ స్థలముఆ కాలమందు పుణ్యస్థలమని భావించి అక్కడ వట్టికాలమందు నన్ను ప్రవేశ పెట్టినందుకు నీశ్వరుని చాలా కొనియాడడ మయినది.

21 తేది రాత్రి మొదలు జూలాయి నెల 2 తేదీ సాయంకాలము వరకు హయిదరాబాదు షహరుతో చేరిన భేగంబజారులో నున్నాను. ఆ రాత్రిమొదలు జూలాయి 13 తేది రాత్రివరకు శికంద రాబాదు అనే పేరుగలిగిన యింగ్లీషువారి దండు ఉండే బస్తీకి సమీపముగా నున్న కాకాగూడ మనే బొమ్మదేవరు నాగన్నతోట చావడిలో నుంటిని.

హయిదరాబాదు షహ్రుకుచుట్టు బేగంబజారు అనే బస్తీయొకటి యున్నది. అందులో సాహుకర్ల కొఠీలు కలవు. అది షహరు కంటే వాసయోగ్యము. అక్కడికి కోసెడు దూరములో కారువానా అనే బస్తీ యొకటి యున్నది. అది రత్నాలు వగయిరా అమ్మే వర్తకులుండే స్థలము. ఆ బేగంబజారుకు చేరినట్టు యింగిలీషు రెసైడెంటు వారి ఖర్చుక్రింద విస్తారముగా నున్ను అలంకారముగా నున్ను ఒక హవేలి చుట్టున్ను లోకులున్ను వర్తకులున్ను ఇండ్లు కట్టుకొని యుండుటచేత నొక పెద్ద బస్తీ అయినది. ఆ స్థలము పేరు చంద్రఘాటు అనుచున్నారు.

షహరు లోపల షాలీబండ అనే పేరు కలిగిన యొక పేట యున్నది. ఆ స్థలమందు అక్కడి బ్రాంహ్మణులు ఇండ్లు కట్టుకొని కాపుర మున్నారు. దివాన్ పేష్కారు చందులాలు అక్కడ ఇండ్లు కట్టుకొని కాపురమున్నాడు. నిజాందేవిడి షహర్ నడమనున్నది. అనేకులయిన పెద్దమనుష్యులు, నిజాం వంశస్థులున్ను షహరు నడమ కాపురమున్నారు. షహరునడమ మక్కామజ్జీత్ అనే యొక తురకల్ జపశాల యున్నది. దాని స్థూపీలు రెండు మొలాము చేయబడి యున్నవి గనుక బహుదూరానికి తెలియుచున్నవి. మశీదుకు నెదురుగా లోగడి దివాన్ మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతుగా నున్నవి. వాటికి సమీపముగా చౌకు అనే పేరుగల గుజిరీ అంగడి యొకటిన్ని, బట్టల యంగళ్ళు, పాత్రసామానుల యంగళ్ళున్ను ఉన్నవి. నాల్గు దోవలు చేరడానకు గాను కట్టిన యొక గొప్ప స్థూపీ గలిగి నాలుగు ద్వారాలు దానాకు కట్టిన యొక గొప్ప స్థూపీ గలిగి నాలుగు ద్వారాలు గలిగిన యొక చావడిన్ని యున్నది. షహరులో రాజవీధులయందు గుండురాళ్ళు పరచియున్నవి. అట్టి వీధులలోనుండే కశ్మలమయిన యడుసులో నడిచేవారి పాదాలు పూడిపోవుచున్నవి. ఇండ్ల యలంకార మున్ను సందులకు సందియున్ను యితర దక్షిణదేశపు షహరులలావాసముచేసే వారికి ఇష్టముగా నుండవు. రాజవీధులలో ఏనుగులు మొదలయిన వాహనాలు యెల్లప్పుడు సంచరింపు చున్నవి గనుక నున్ను మనుష్యులందరున్ను, ఆయుధపాణులై మెత్తని వారిని కొట్టి నరుకుచున్నారు గనుక నున్ను, షహరులో ఇతర దేశస్థులు సవారీమీద పోయి రావలసియుంటే ఆయుధపాణులైన వాక్పారుష్యము కలవారిని కొందరిని కూడా పిలుచుకొని పోవలసి యున్నది. కృష్ణానది దాటినది మొదలు హైదరాబాదు వరకు ఫకీరులు నిండియున్నారు గనుక సవారీమీద నెవరు వచ్చినా అడుగడుగునా ఫకీరులు భిక్షం అడగక మానరు. వారికి కొన్ని గవ్వలయినా యిచ్చి పోకపోతే అవమానము తోచుచున్నది. చెన్నపట్టనపు రూపాయి 1 కి అక్కడి పయిసాలు 50 పయిసా 1 కి 20 పుంజీగవ్వలు. పుంజీ 1 కి గవ్వలు 4. యీ హయిదరాబాదులో పిచ్చిరూపాయిలని యొక దినున్ను గోవింద బఖ్షీలని యొక దినుసున్ను చెలామణి యవుచున్నవి. ఆ రూపాయలు ఒకచేతి నుంచి యొక చేతికి వచ్చేటప్పుడు యొకటి రెండు పయిసాలు నట్టమియ్యకనే చెలామణీ కానేరదు. చెలామణీ రూపాయలకు అక్కడివారు చేసే పరీక్ష అసదృశ మయినది. ఎట్టి రూపాయిలకయినా ఒక దోషము పెట్టకమానరు. చన్నపట్టణపు కుంఫిణీ రూపాయలకు ఆ తొందరలేదు. అయితే అవి దొరకవు. మరి అక్కడి రూపాయలకు రూపాయి 1 కి పయిసాలు 20.

ఈషహరు గోడకు చేరినట్టుగా 'ముసి ' అని అక్కడి వారిచేత చెప్పబడుచున్న ముచుకుంద నది పారుచున్నది. ఆ నది వాడపల్లెవద్ద కృష్ణలో కలియుచున్నది. అది గొప్పనది. పోయినసంవత్సరం నదీప్రవాహము ఎక్కువగావచ్చి డిల్లీ ధరవాజవద్ద యింగిలీషువారు కట్టిన వారిధిని పగలకొట్టి ఆ షహరులో కొన్నివీధులున్ను, బేగంబజారులో కొన్నివీధులున్ను ముంచివేసి పోయినది. బేగంబజారుకున్నూ, షహరుకున్నూనడమ ఆ నది దాటుటకు పూర్వకాలమందు తురకలు మంచిరాళ్ళతో అతి బలముగా నొక్క వారధి యేనుగలు మొదలయినవి గుంపుగా నెక్కి పోవడానకు యోగ్యముగా కట్టినారు. ఆ షహరు చుట్టున్ను చిన్న తిప్పలున్నవి. కొండలు మెండు. అనేక తిప్పలు కొనల యందు మశీదులు కట్టబడి యున్నవి. హిందూ దేవాలయాలు లేవు. అవి యున్నా వృద్ధికి రానియ్యరు.

షహరుకున్ను ఇంగిలీషుదండుకున్ను 2 కోసుల దూరమున్నది. నడమ హుశేనుసాగర మనే పేరుగల యొక చెరువున్నది. ఆకట్టమీద యింగిలీషువారు గుర్రపుబండ్లు పొయ్యేటందుకు యోగ్యముగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలున్నూ మనుష్యులున్ను ఎక్కినడచి చెరచకుండా భాటకు ఇరు పక్కల తమ పారా పెట్టియున్నారు. జాతులవాండ్లను తప్ప ఇతరులను ఆ కట్టామీద హుకుములేక ఎక్కనియ్యరు. ఈ జాతులవారిని సరంగీలని ఏలచెప్పుచున్నారంటే ఫిరంగీలతొ సహవాసము చేసేవారు గనుక ఫిరంగీవారని ఆభాసముగా అనబడుచున్నది. కుంఫిణీ లష్కరు ఉండే స్థలము హయిదరాబాదుకంటే నానాటికీ ఎక్కువగా బస్తీఅవుచున్నది. 20 సంవత్సరముల క్రిందట నేను చూచినదాని కంటే మిక్కిలి బస్తి అయియుండుటను చూడగా ఆశ్చర్యముగా నున్నది. షహరులో వస్తువులకు సుంకకులేదు. ఏవ్స్తువు మీద సుంకానికి ఎవడు ఊహించి దర ఖాస్తుచేసినా దినాంజీ ఆ సుంకము గుత్తకు ఇచ్చుచున్నాడు. కట్టెల బండ్లకు, విస్తరాకులకున్ను, షహరులో రావడానికి నాలుగయిదు తీరువలు తీరువ తీనేవాని జోరావరి కొద్దిన్ని ఇవ్వవలసి యున్నది. చంపినా అడిగేదిక్కులేదు. యింగిలీషు దండులో ఈ తొందరలు లేకుండా న్యాయవిచారణ కూడా కొత్తవాల్ చావడిలో కమ్మిస్సేరైయాటు అసిస్టాంటు గుండాజరుగుచున్నది. గనుక లోకులున్ను వర్తకులున్ను ఆదండులో వసించడానికి మిక్కిలి ఇచ్చయింపు చున్నారు. అక్కడి యిండ్లకంతా ఎన్నిమిద్దెలు అంతస్తులుగా కట్టినా స్తంభాల మీద పయి పూరి మోపుచేసి మట్టి గోడలుపెట్టి, ఆ గోడల పయిన నాజూకుగా సన్నగారచేసి కావలసినట్టు చిత్రములతో పూయుచున్నారు. అక్కడి గులక కలిసిన యెర్రరేగడ మిక్కిలి గట్టిగా నుంచున్నది. యింగిలీషు దండులో నేను దిగిన స్థలము వాసయోగ్యము. ఆ షహరుకు చుట్టునుండే భూమి బహు సారవత్త మయినది. ఏవృక్షము వేసినా అరి వీర్యముతొ పయిరయి వచ్చుచున్నది. అయితే పయిరుపెట్టే శ్రద్ధ యెవరికిన్ని 2 కారణములచేత లేదు. మొదటి కారణమేమంటే బీదలయినవారు ఏచెట్టువేసినా వాటిఫలమును క్షేమముగా, ఆయుధాలే ఆభరణాలుగా నుంచుకొని దర్పమేయశస్సుగా భావించుకొని యుండే లోకులు అనుభవించ నియ్యరు. రెండో దేమంటే ఉపపన్నులు తోటలు వనాలు వేసుకొనవలె నంటే రాజకీల్యము లయిన విత్పరంపరలు అప్పుడప్పుడు వారికి కలుగుటచేత ఆ సుఖము ననుభవించ డానికి ప్రాప్తిలేక నున్నది. ఇంతకున్ను ఓర్పుచేసిన చెట్లు బహుబాగా అయియున్నవి. చోటా అరంజీపండ్లు విస్తరించి కలవు. సకల విధములయిన పండ్లున్ను, అరటిపండ్లు దప్ప మంచివిగానే దొరుకును. అయితే అతిప్రియము. చెన్నపట్టణము కంటే మూడింతలవెల యివ్వవలసినది. కూరగాయలు ఆ ప్రకారమే ప్రియములయినా మహా రుచికరములుగా నున్నవి. వస్త్రాలు, ఆభరణాలు, శిఫాయిలకు లాయఖు అయినవి, ఆ షహరులో దొరుకును. భారీరత్నాలు కొనేపాటి యుత్సాహధైర్యము లెవరికిన్ని లెనందున వర్తకులు తేవడములేదు. ఆభరణాలు వగయిరాలు ఉంచుకొని విక్రయించేవారు తమ పాపు నిమిత్తమై కొంత శిబ్బందిని వుంచుకొన వలసి యున్నది. తద్ద్వారా ఒక గొప్పగౌరవము వారికి గలుగుచున్నది. అందువలన రత్నాలు, నగలు, కావలసిన గొప్పవారు వారియింటికి పెళ్ళి, వారిని పిలిపించుకొని కావలసినది వారు చెప్పిన ధరకు పుచ్చుకొని తమకు సమ్మతి అయినప్పుడు ఖరీదు నిచ్చుచున్నారు. వర్తక సరణిగా అట్టి గొప్ప వస్తువులు కొని అమ్మడము లేదు. సాత్విక ప్రభుత్వముకల రాజ్యములో మెదిగినవారికి ఆ షహరులో ఉనికిన్ని, ఆరాజ్య సంచారమున్ను, భయప్రదములుగా నుంచున్నవి.

ఆ షహరు 3 కోసుల దూరములో గోలకొండ అనే ప్రదేశ మొకటి యున్నది. అక్కడ బలమైన కోటయున్నది. అందులో నిజాముయొక్క, అంత:పుర స్త్రీలు సంస్థానము యొక్క మూలధనముతో కూడా ఉన్నారు, అందులో విస్తరించి గృహములు కట్టుకొని మనుష్యులు కాపురమున్నారు. ఆ షహరులో పెద్దమనుష్యులు ఆనందము కొరకు చేసుకోవడ మేమంటే ఒకబగీచా అనే చిన్నతోటవేసి, అందులో జలధారలు పయికిలేచే కారంజీలు, కట్టి యుంచుకొనుచున్నారు. ఆజల సూత్రాలు అలమారముగానే యుంచున్నవి.

అక్కడి రాజ్యూతంత్రము జరిపే క్రమమంటే పూర్వకాలమందు డిల్లీ పాదుషాను, శిఫాయి ధర్మముచేత సంతోషపెట్టి, ఆరాజ్యమును జాగీరుగా పుచ్చుకొన్న ఆనవాబు వంశస్థులు ఇప్పుడు రాజ్యము చేయుచున్నారు. యింతకు మునుపు షౌలరుజంగు అనే అతడు దొర తనముచేసి, సంవత్సరము కిందట చనిపోయునాడు. అతిని కొడుకులలో నొకడయిన నానద్దౌలా అనే అతడు ఇప్పుడు కుంఫిణీవారి సహాయము చేతకట్టుకొని ప్రభుత్వమును వహించి యున్నాడు. ఈ నవాబు కింద ఒక దివాన్ జాగీరు అనుభవింపు చున్నాడు. అతని కింద ఒక పేష్కారు సకల రాజ్య తంత్రము విచారింపు చున్నాడు. ఉండే రాజ్యమంతయు నవుకరులయిన అమీరు ఉమరాలనె పెద్దమనుష్యులకు జాగీరులుగానున్ను, పారంపర్యముగా ప్రభుత్వము చేసేవారికి జమీనులు గానున్న, భాగించి జమీనుదార్లవద్ద మాత్రము సాలుకు ఇంత మాత్రమని రూకలు వసూలుచేసుకొను చున్నారు. అమానిగా తాలూకాల నుంచుకొని మామిలియ్యతు వ్యహారమును జరుపు కోవడము నిండా లేదు. వారి వారి అధీనముగా నుండే భూమికి వారు వారు పూర్ణమయిన స్రాతంత్ర్యము గలిగి ఆయా భూములలోని కాపురస్థులను భర్త భార్య మీద చెల్లింఛే అధికారము కంటే ఎక్కువయిన అధికారముతో నేలుచున్నారు. ఆనావాబు పెద్దల వద్ద 40 సంవత్సరముల కిందట కుంఫిణీ వారు స్నేహమూలకుగా ప్రవేశించి 6 పటాలాలను, వారి తయినాతిగా శికందరాబాదు అనేస్థలములో ప్రవేశపెట్టి, వకీలు భావనగా నొక రెసైడెంటును అక్కడ నిలిపినారు. ఆ పటాలాలవద్ద జాగీరుగా కుంపిణీవారు పుచ్చుకొని యిప్పటికిన్ని అనుభవింపు చున్నారు. క్రమక్రమముగా రాజ్యతంత్రములో ఏ పని జరిగించ వలసి వచ్చినా రెసైడెంటు అనుమతిలేక జరిపింఛె వాడికెలేని ఘట్టము ఇప్పట్లో పొసగి యున్నది. తమకు రూకలు కట్టని బలవంతులయిన జమీనుదారులవద్ద సాలేనా పయికము వసూలు చేసుకొనేటట్టు కందనూరు నవాబు రాజ్యము కుంఫిణీవారి యధీనము చేసినట్టే, కొద్ది కొద్దిగా చేయుచు వచ్చుచున్నారు. అటువంటి జమీందారులవద్ద కుంఫిణీ వారు రూకలు వసూలుచేసి నిజాముకు ముజరా యిప్పించుచున్నారు. సదరహి 6 పటాలాలు గాక నింకా 12 పటాలాల పర్యంతము రిసైడెంటు మూలకముగా ఆ నవాబు దివాన్ ఫేష్కారు యిచ్చుచు, రూకలు కట్టని జమీదారుని మీదికి కావలసినప్పుడు కావలసిన మట్టుకు ఆ ఫౌజును పంపించుచు వచ్చుచున్నారు. ఇప్పుడు దివాన్ ఫెష్కారు చేసే చందులాలా సదరహీజాస్తి పటాలాల జీతానికి గాను నెల 1 కి సుమారు 3 లక్షల రూపాయలు యిచ్చుచున్నాడు.

యిదిగాక నవాబు మనోవర్తి ఖర్చులకు గాను నెల 1 కె 3 లక్షల రూపాయలు ఇవ్వవలసి యుంచున్నది. ఇంతేకాక నజురుయినా యతులుగా కొంత సెలవు చందులాలుకు తగులుచు వచ్చుచున్నది. ఇది పోగా మిగిలిన వస్తువులు ఆ దివాన్ పేష్కారు చేసేవాడు సమ్మతమైన వ్రయము చేసుకొనుచు వచ్చుచున్నాడు. ఆ వ్రయములు చెయ్యడమునకు రాజ్యములో అయ్యే వసూలు చాలక దివాన్ పేష్కారు అప్పులతో తహతహ పడుచున్నాడు. ఆ నవాబు రాజ్యమంతా కుంఫిణీ వారివల్ల చాలా భయమును పొంది యున్నది.

యిటువంటి షహరు 20 తేదీ ఉదయాన 4 ఘంటలకు వదిలి 3 కోసుల దూరములో నుండే మేడిచెర్ల అనేయూరు 5 1/2 ఘంటలకు చేరినాను. దోవ బహు సరాళము; గులక యిసకపొర; గుర్రపుబండ్లు నడవడానికి యోగ్యముగా నున్నది. బాటకు నిరుపక్కల సీతాఫలపు చెట్లయడవి, మనోహరముగా నున్నది. మేడిచెర్ల యూరి ముందర నొకటి రెండు వాగులు దాటవలసి యున్నవి. అవి వర్షాకాలమున ప్రవాహము వస్తే దాటుటకు నొకటి రెండు దినములు కావలసియున్నది. ఊరు పెద్దది; కావలసిన వస్తువులు దొరుకును; అంగళ్ళు చాలా యున్నవి.

నేను చెన్నపట్టణము నుంచి వచ్చేటప్పుడు కొలువుగా పెట్టుకొని తెచ్చిన 6 మంది బంట్రౌతులు గాక కడపలో 4 మరాటి బంట్రౌతులను కొలువులో పెట్టినాను. హయిదరాబాదులో నెక్కువగా 4 మందిని కొలువు పెట్టినాను. వీరికంతా జనము 1 కి నెల 1 కి రూ.7 లెక్కను జీతముచేసి నేను చేసిన ఖాయిదా యేమంటే కాపాడవలసిన మూల పదార్ధము సహజముగా యజమానివద్ద నుండే పెట్టెలలో నుండు ననే తాత్పర్యము లోకులకు ఉండవలసినదే గనుక అటువండి తాత్పర్యముతొ అయోగ్యులు ప్రమాదమును చేతురని తలచి నామూల ధనము క్షేమముగా నుండుట కొరకు మూలధనపు పెట్టెలను సవారీలలో ఉంచి సవారీ తలుపులకు బిగాలు వేసి సవారీలను ఊళ్ళలో దూర ప్రదేశపు చావిళ్ళలోనున్ను, ముసాఫరు ఖానాలలో నున్ను, మశీదులలో నున్ను ఉంచి యిద్దరేసి బంట్రౌతులను జాముకు ఒక జతగా పారాయిచ్చే బట్టు 6 మందిని నిశ్చయించి బోయీలను జాగ్రత్తగా కూడా ఉండేలాగు దిట్టము చేయుచూ వచ్చినాను. సామాను కావడి పెట్టెలను నేను దిగేస్తలములో ఉంచి అక్కడ జాముకు ఒకడు వంతున పారాఉండే లాగు ముగ్గురు బంట్రౌతులను ఉంచుచు వచ్చినాను. హయిదరాబాదులో పాల్ లు అనే శిఫాయి డేరాలు నాలుగు తీసినందున అవి మోయను 4 యెద్దులున్ను ఆడేరాలలో చెమ్మగిలకుండా వేసే కీలు చాపలు మోయను ఒకయెద్దున్ను, ఆడేరాల మేకులు 200 మోయను ఒక ఎద్దున్ను, అంతు ఆరు యెద్దులున్ను ఎద్దు 1 కి నెలకు రూ.8 లెక్కకొలువు పెట్టి తీసుకొని వచ్చినాను. 3 యెద్దులకు నొక మనిషి వంతున ఇద్దరు యెద్దుల వాండ్లు కూడా వచ్చినారు. ఆడేరాలు కట్టనున్ను, తియ్యనున్ను ఇద్దరు కళాసులను నెలకు 1 కి మనిషి 1 కి రూ.లెక్కను సంబళానికి కొలువు పెట్టుకొన్నాను. ఆ డేరా బొంగులు ఎద్దులు మోయవు గనుక మోయను ఒక మనిషిని 6 రూపాయల జీతము నిష్కర్షము చేసి కొలువు పెట్టి నాలుగు డేరాల బొంగులు పదిన్ని సదరహి యిద్దరు కళాసులచేతనున్ను, సదరహి మనిషి చేతనున్ను మోయించుకొని వచ్చినాను. ఇంతేకాక హయిదరాబాదు నించి నాగపురికి పొయ్యేదారి బహు అడివిన్ని, మృగ భయమున్ను, చోరుల యుపద్రవమున్ను కలిగినది గనుక దారిబాగా తెలిసే కొరకు హయిదరాబాదు రెసై డెంటు వద్దనుండే పోష్టాఫీసు రయిటరు మేస్తరు ల్యూమ అనే పరంగి వాని మంచి తనము చేసుకొని ఒకరన్నర్సు అనే టప్పాల మనిషిని కూడా పిలుచుకొని అక్కడక్కడికి రన్నర్సు మనుష్యులు వారి వారిహద్దు వరకు నాతోకూడా వచ్చి దారి చూపించేటట్టు దిట్టము చేసుకొన్నాను. ఆ తపాలా రన్నర్సులను ఇక్కడ హరకాలని వాడుచున్నారు. వారిని కుంఫిణీ యిలాకా మనుష్యు లని ఆయా యూళ్ళలో గౌరవపరచు చున్నారు..తద్ద్వారా యీ యుపాయము నేను చెయ్యడము మిక్కిలి అనుకూల మయినది గనుక ఆ రన్నర్సుకు 1 రూపాయి దనుక ఇచ్చుచు పుసలాయించి ఒక మజిలీ నుంచి మరియొక మజిలీకి పిలుచుకొని వచ్చినాను. ఆకృష్ణ దాటినది మొదలు ఆ దేశములో కాకులు విశేషముగా లేవు. ముఖ్యముగా హయిదరాబాదు షహరులో ఒకటియైనా కనుపడినది కాదు. డెగలు పెంచేవారు విస్తరించి యున్నందున షహరులో వుండే కొన్నిటినిన్ని బ్రతకనియ్యరని తోచుచున్నది. ఆ రాత్రి అక్కడే నిలిచినాను.

21 తేదీ ఉదయాన 3 ఘంటలకు బయలుదేరి 2 కోసుల దూరములో నుండే మాషాపేట అనే యూరు 12 ఘంటలకు చేరినాను. దోవ నిన్నటి దోవవలెనే రమణియ్యముగ నున్నది. ఇరు పక్కలా జీడిచెట్లు, టేకుచెట్లు, మోదగచెట్లు, మొదలయిన వృక్షములు గల యడివి భూమి; సమ మయినది. ఆ మాషాపేట గొప్పయూరు. పేటస్థలము, సకలపదార్ధాలు దొరుకును. అక్కడ ఆరాత్రి నిలిచినాను. ఆయూరు వర్షాకాలములో మిక్కిలి బురద కలిగి చిత్తడిగా నుంచున్నది. హయిదరాబాదు వద్ద హుశేనుసాగర మనే చెరువు మొక ప్రకారము దిగిన గ్రామము నుంచి అవతల దిగిపొయ్యే గ్రామనునకు పంపుచు వచ్చినాను. ఆరాత్రి దేవాలయములో చేరిన భ్రాంహ్మణ గృహమందు నిలిచినాను.

23 తేదీ ఉదయాన 3 ఘంటలకు బౌయలుదేరి అక్కడికె 5 కోసులదూరలో నుండే కామారెడ్డిపేట 10 ఘంటలకు చేరినాను. కృష్ణదాటినది మొదలుగా ఆ బిక్కనూరిపేట పర్యంతము దోవ గులక యిసక కలసిన గట్టిరేగడభూమి. ఏకాల మందున్ను నడిచేవారికి ఒక శ్రమమున్ను ఇయ్యదు. ఆ భిక్కనూరుపేట వదిలినది మొదలు కామారెడ్డిపేట చేరే పర్యంతము కాలుదిగబడే నల్ల రేగడ భూమి; వర్షాకాలములో మిక్కిలి అడుసుగా నుంచున్నది. యెండాకాలములో ముండ్లవలెనే నడిచే వారికి గుచ్చుకొనుచు, కొంతదూరము భాట గులక యిసక పరగా నుండినా యీ నల్ల రేగడ భూమిలో పడే ప్రయాస అసౌఖ్యమును జ్ఞాపకానికి రానియ్యదు. దోవలో కొన్ని వాగులు దాటవలసి యున్నవి. ఆ కామారెడ్డిపేట వసతి యయిన గ్రామమే. అంగళ్ళు కలవు. అన్ని పదార్ధాలున్ను దొగుకును. భ్రాంహ్యణగృహమందే దిగినాను. చెరువు వున్నది. జలవసతి గలదు. కృష్ణదాటినది మొదలుగా ప్రతిగ్రామములో నున్ను బియ్యము మంచిదిగా దొరుకు చున్నది. వడ్లపయిరు విస్తరించి హయిదరాబాదు మొదలుకొని పండుచున్నది. ఆరాత్రి అక్కడ వసించినాను.

24 తేది ఉదయమున 3 ఘంటలకు ఆ యూరు వదిలి అక్కడికి 4 కొసుల దూరములొ నుండే మల్లుపేట అనే గ్రామము 10 ఘంటలకు ప్రవేశించినాను. దోవనిన్నటికన్నా యెక్కువయయిన నల్లరేగడ్దభూమి. బహులోతుగల వాగులున్ను, చెరువు మడుగులున్ను దాటవలసి యున్నది. ఆ గ్రామము ఖిల మయినది. యధోచిత ముగా ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. దిగడానికి స్థలము లేక ఆ గ్రామమందు మూడు డేరాలు ఒక చావడివద్ద కొట్టించి దిగినాను. హయిదరాబాదు దాటినది మొదలు ప్రతి గ్రామానికిన్ని కోటలు బలమయినవి లేవు. కొన్ని కొన్ని గ్రామాలలో బురుజులు మాత్రము కట్టించి యుంచుతారు. ఆ మల్లుపేటలో ఒక పాడుకోట యున్నది. చెరువు జలసమృద్ధి గలది. ఆ గ్రామములో రాత్రి వసించినాను.

23 తేది ఉదయాన 7 ఘంటలకు బయలువెళ్ళి 11 ఘంటలకు 5 కోసుల దూరములోనుండే యీదలవాయి అనే రామస్థలము చేరినాను. ఆ యూరు చీలి జమీందారునితో చేరినది. గుడి చక్కగా కట్టి యుండక పోయినా దక్షిణదేశపు మర్యాద ప్రకారము ఆ జమీను దారుడు గుడిలో సకల రాజోపచారములతో ఆరాధన నడిపింపు చున్నాడు. గుడిచుట్టు 30 ఇండ్లుగల బ్రాంహ్మణుల యగ్రహారమున్నది. ఈతురకల రాజ్యమందు ఈస్థలము కుంపటిలో దామర మొలచి నట్టున్నది. తిరుపతి వదిలిన వెనక రాజోపచారములతో ఆరాధన నెడిచే గుడి యిది యొకటే చూచినాను. నా విచారణలోనున్ను వేరేలేదని తెలిసినది. ఈయూరు యధోచితముగా బస్తీగానే యున్నది. కావలసిన సామానులు దొరుకును. ఇక్కడి గుడిలో ప్రతిఫలించి యున్న పరమాత్ముడు ఈ జమీనుదారుని వంశస్థులకు పిలిచితేప లుకు ననేనాటి యనుగ్రహముతో ఆరాధనలు గైకొనుచున్నాడు. మల్లుపేట వదిలిన వనక కోసెడు దూరానికి ఇవతల యీదలగండి అనే దట్టమయిన అడివి యున్నది. రెండు కొంచపాటి తిప్పల నడమ భాట పోవుచున్నది. భాట బహురాతిగొట్టు, నల్లరేగడ భూమి. బహుచోర భయము గలది. మిక్కిలి భయంకరులయిన యింగిలీషు దొరలనే యీదలగండి భాటలో దోచినారు. నేను మల్లుపేట నుంచి ఆయుధసాణులను కొందరిని కూడా తీసుకొని నాతోకూడా వచ్చిన మనుష్యులను యుద్దసన్నద్దులుగా దిట్టము చేసుకొని గండి దాటి వచ్చినాను. దీనిపేరు యీదల్లఘాటు అని చెప్పుచున్నారు. నడమ వాగులు దాటవలెను. అదిన్నిగాక యీదలవాయి యూరినందు పర్షాకాలములో చెరువులో నుంచి మిక్కిలి వేగముగా పారుచునున్న బహులోతు గల రెండలుగు కాలువలు దాటవలెను. అక్కడ డేరామేకుల కంట్లము చెరువు మడుగు కాలువలు దాటేటప్పుడు కొట్టుకొని పోయినది. ఇట్టి భయ ప్రదేశములకు తుపాకులు బహుజరూరు గనుక కడపలో రెండు తుపాకులు తీసుకొన్నాను. హాయిదరాబాదులో కొల్వు పెట్టిన వారిలో అయిదుగురు తుపాకులు తెచ్చేటట్టు నిశ్చయము చేసినాను. ఆ గండిలో నడిచే టప్పుడు అక్కడక్కడ తుపాకీలు కాల్చుచు రావడ మయినది. మల్లుపేట మొదలుగా యీదలఘాటు చేరేపర్యంతము భాట నల్ల రేగడ భూమి; వెనుక భాట రాతిగొట్టు. ఆయీదలవాయి యూరిలో చీలి జమీనుదారుని తరఫున పట్టేలు అనే అధికారస్థుడున్నాడు. దేవాలయ విచారణను అతడే చేయు చున్నాడు. ఆయూరిలో 23 తేదీ రాత్రి పర్యంతము నిలవడమైనది.

27 తేదీ ఉదయమున 3 ఘంటలకు యీదలవాయి వదిలి అక్కడికి 2 కోసుల దూరములోనుండే జగనంపల్లె అనే గ్రామము 12 ఘంటలకు ప్రవేశించినాను. యీదలవాయి దాటినది మొదలు కొని కోసెడు దూరములో నుండే డిచ్చుపల్లె అనే మజిలీ గ్రామము చేరేవరకు ఒక చిన్నఘాటునడుమ మార్గము పోవుచునది. అయినా మొందర వదలివచ్చిన ఘాటంత భయము కలది కాదు. భాట సమభూమి. గులక యిసకపొర. కొంచెము రాతిగొట్టు; ఇరుపక్కల మోదుగ చెట్లు వగైరాల యడినవి. ఈ డిచ్చుపల్లెలో యీదలవాయిలో నుండే రామమూర్తిని ప్రతిష్టచేసే నిమిత్తమై పూర్వమందు గొప్పదేవాలయము కట్టినారు. అయితే వాసానికె యోగ్యముగాదని తోచి పరమాత్ముడు కొన్ని లోకదృష్టాంతముల చేత తెలియచేసి యీదలవాల్యిలో యిప్పుడు ఆరాధనలు గైకొనే మూర్తులను స్తాపింపచేసినాడు. ఇప్పటికిన్ని డిచ్చుపల్లెలో కట్టిన దేవాలయము పాడుగాఉన్నది. ఈడిచ్చుపల్లె మొదలు జగనంపల్లె కోసెడు దూరము కలదనే వరకు భాట సరాళము, గులక యిసకపర, నిండా అడివి లేదు; అవతలి కోసెడుదూరమున్ను ఘాటునడుమ పోవుచున్నది. భాట కిరుపక్కల దట్టమయిన యడివి. కొండలసందున భాట. ఈఘాటు నిండా భయాస్పద మయినది కాదు. ఇక్కడ మొగలాయి `రాణావారు కొందరు తుపాకులతో కూడా ఉంచున్నారు. వారు వచ్చేవారిచేత మనిషికి రెండేసి పయిసాలువంతున పుచ్చుకొను చున్నారు. యీఠాణావారు పాంధులను కాపాడే వారివలె అభినయించడమే గాని వేరుగాదని తెలిసియుండ వలసినది. ఈ జగనంపల్లెలో రెండు చిన్న దేవాలయాలున్నవి. రమణియ్యమైన స్నానఘట్టము కలిగిన చెరువున్నది. అంగళ్ళు కలవు. అన్ని పదార్ధములు దొరుకును. బ్రాంహ్మణుల యిండ్లలోనే దిగి నాను. యిక్కడికి 4 మజలీల దూరములో వేములవాడ అనే మహాక్షేత్రమున్నది. అది భీమేశ్వర రాజేశ్వరక్షేత్రము. వేములవాడ భీమకవి జన్మప్రదేశము. ఈ ప్రాంతములో వ్యాఘ్రాలు పశువులను అప్పుడప్పుడు భాధింపుచున్నవి. ఆ రాత్రి జగనంపల్లెలో నిలవడమయినది.

నాల్గవ ప్రకరణము

28 తేది ఉదయమున 6 ఘంటలకు ఆ యూరువదిలి 12 ఘంటలకు అక్కడికి 6 కోసుల దూరములో నుండే దూదుగాం అనే ఊరు చేరినాను. అది గోదావరీ నదీతీరము. ఆరు భ్రాంహ్యణుల యిండ్లున్నవి. గోవదావరి కవతలి గట్టున స్వర్ణ అని చెప్పబడే భ్రాంహ్మణుల యిండ్లు గల యగ్రహారమున్నది. ఆ దినము నడిచిన భాట సరాళము, యిసకపొర, నిండా అడివి లేదు. జగనంపల్లె నుంచి యీదూదుగాముకు రెండు మూడు భాటలు కలవు. అందులో నేను వచ్చినభాట కొంచము చుట్టయినా వసతి యయునది. ఆర్మూరు అనే బస్తీ గ్రామము జగనంపల్లెకు 2 కోసుల దూరములో నున్నది. ఆయూరి మీదనొక భాట పోవుచున్నది. అది వసతి కాదు. జగనంపల్లెకు 4 కోసుల దూరములో బాలకొండ యనే గొప్పగ్రామము షహరువలెనే బస్తీగానున్నది. యేరస్తాగుండా జగనంపల్లెనుంచి వచ్చినా యీ బాలకొండ నడివీధిలో నడిచి రావలసినది. నేనువచ్చిన భాట శీదాగా బాలకొండకు మధ్య యేయూరున్ను తగలకుండా వచ్చుచున్నది. హయిదరాబాదు వదిలినది