కాశీమజిలీకథలు/రెండవ భాగము/16వ మజిలీ

చెప్పెను. ఇట్టిఅర్థముగల నా మాటకు వెంటనే యుత్తరము చెప్పిన యితందెంత బుద్ధిమంతుఁడో యోచింపుఁడు.

ఇంత సూక్ష్మబుద్ధికి మంత్రిత్వమిచ్చుట నా తప్పా! చెప్పుడని పలుకుటయు సభ్యులెల్లరు తెల్లబోయి యుల్లంబుల వారిరువుర బుద్ధికౌశల్యమును గురించి వేతెరంగులఁ మెచ్చుకొనదొడంగిరి. వీరగుప్తుడు మంత్రియై క్రమక్రమముగఁ దనవిద్యా ప్రభావమంతయు ధర్మాంగదునికిఁ జూపుటయు నతండు మరియు సంతసించుచుఁ దన రాజ్య భారమంతయు వీరగుప్తునియందే యుంచి యతఁడు చెప్పునట్లుగాఁ దాను నడుచుచుండెను. వీరగుప్తుఁడు మంత్రియైనది మొదలు దేశములో సుభిక్షముగా ఫలవంతముగా పాడిపంటలు నభివృద్ధిగావించుటచేతను, బ్రజ లతనిని మిక్కిలిస్తోత్రములు చేయఁదొడంగిరి.

అని చెప్పువేళకు వేళ యతిక్రమించుటయు నప్పుడు చెప్పుట మాని యయ్యతిశిఖామణి యవ్వలికథ తదనంతరావసథంబున నిట్లని చెప్పం దొడంగెను.

16వ మజిలీ

భక్తురాలి కథ

పట్టీ! వినుమట్లు చంద్రలేఖ వీరగుప్తాభిధానముతో ధర్మాంగదునిమంత్రిగా నుండి యొకనాడు నగరాలోకనకౌతుకంబు మీర నుచితపరివారముతో బట్టణమంతయు గుమ్మరుచుండ నొకవీథిదండను వాసంతికకోకిలకాకిలీనాదమును మేలమాడు కంఠస్వరముతో బాడుచున్న యొకచిన్నదాని గానము విననయ్యె. అగ్గానము చెవియొగ్గి విని చిత్తమునీరైపోవ నెద్దియో నిరూపింపనలవికాని యుత్సాహ మొకటి మనంబునం జనింప నిలిచిపరిచారకుం బిలిచి యోరీ! యీప్రాంతమందెచ్చటనో సంగీతము పాడుచున్నట్లు వినంబడుచున్నది. యరసిరమ్మని పంపిన వాడును బోయి సత్వరమువచ్చి అయ్యా! యీచేరువ దారకేశ్వరుని యాలయమున్నది యందొక భక్తురాలు పాడుచున్నదని చెప్పెను.

అప్పుడతండు మనమచ్చటికి బోవచ్చునా అని అడుగుటయు వాడు స్వామీ! సంశయమేల? దేవాలయమునకు బోవుట కెవ్వరి యానతి కావలయును? అదియును మనయధికారమునకు లోబడినదే. సందియము వలదు. రండుపోదము. ఎద్దియేని తలంచుకొని యాస్వామికి మీదుగట్టినచో దప్పక యాకార్యము కాగలదు. ఈ తారకేశ్వరునికి మ్రొక్కులు చెల్లించుటకుం బెక్కు దేశములనుండి ప్రజలువత్తురు. మీరు చూడదగినదేయనిన సంతసించుచు మంత్రి యాయాలయము లోనికి బోయెను. అచ్చట ముఖమండపములో దంత్రీనాదముతో గంఠస్వరము మేళగించి మనోహరముగా శివకీర్తనల బాడుచున్న యాభక్తురాలింజూచి దానిరూపమున కాశ్చర్యమందుచు మంత్రిపుంగవుం డంతరంగమ్ముననెద్దియో సంతోషంబు దీపింప గొంతసేపు రెప్పవాల్పక యామెంజూచెను.

మంత్రి లోనికిఁబోయినంతనే యాభక్తురాలును నచ్చట నున్నవారును తటాలున లేచి యవ్వలికిం బోయిరి. ఇంతలో లోపలనుండి గుడిధర్మకర్త వచ్చి వీరగుప్తుని సగౌరవముగాఁ తీసికొనిపోయి యాలయము చుట్టునుంగల వింతలును నచ్చటచ్చటఁగల విశేషంబులు చూపుచుఁ గ్రమంబున గర్భలయములోనికిఁ దీసికొనిపోయి స్వామినిఁ జూపించి తదీయమహిమావిశేషముల వక్కాణింపుచు మరల ముఖమంటపము దాపునకుఁ దీసికొనివచ్చి యచ్చట తగిన యాస్తరణలు వేయించి యందుగుర్చుండం బెట్టెను. అప్పుడు వీరగుప్తుఁడు ధర్మకర్తంజూచి మనము వచ్చువరకు నిచ్చట పాడుచున్న చిన్నదియెవ్వతె అని అడిగెను. అదియొక భక్తురాలు దాని కులశీలనామంబు లెవ్వరకినిఁ దెలియవు. కొన్నిదినములఁబట్టి యిూ యాలయములోనున్న విజ్ఞానయోగి నాశ్రయించుకొని యున్నది. నిత్యము సాయం తమీస్వామిపై కీర్తనలు పాడుచుండును. దానికి భోజనము స్వామి నైవేద్యములోనిదే యిచ్చునట్లేర్పరచితినని ధర్మకర్త చెప్పెను.

దీనికంఠస్వరము చక్కగానున్నదిసుమీ అని మంత్రి పలుకఁగా విని అతండు తమసెలవైనచోఁ దిరుగపాడింతును. దానికేమి కొదవ అది మనస్వామిదాసురాలే అని పలుకుచు భక్తురాలియొద్దకుఁ బోయి అమ్మా! యిప్పుడు మంత్రిగారు నీ సంగీతమువిన వేడుక పడుచున్నారు. వడిగావచ్చి రెండు శివకీర్తనలు పాడుమని చెప్పగా నామె కొంచెముసేపు వచ్చుటకు సంశయించెను. కాని మరలనేమియనుకొనినదో తటాలునఁ జనుదెంచి మంత్రికి నమస్కరించుచు నతని అనుమతిని శ్రుతి మేళగించి జక్కఁగా బాడఁదొడంగినది. ఆ భక్తురాలు కాషాయవస్త్రము ధరించి మేనెల్ల విభూతిఁ బూసికొని దుద్రాక్షలు ధరించియున్నను నివురుగప్పిన నిప్పునుంబోలె నొక అద్భుతతేజంబునఁ బ్రకాశిల్లుచుండుట వీరగుప్తుఁడు దానిని మిక్కిలి నిరూపణపూర్వకముగా జూచుచుండెను.

మరియు నా భక్తురాలు శివకీర్తనలు పాడుచు నడుమ నొక గీతము పాడినది. ఆ గీతము చంద్రలేఖ రచించి తిలోత్తమకు జెప్పినది. దానిలోఁ జంద్రలేఖ అంకితమున్నది. అట్టిదానిం బాడినతోడనే వీరగుప్తవేషముతో నున్న చంద్రలేఖ యుల్లము ఝల్లుమనం దల్లడిల్లుచు నౌరా! యీగీతము నేను రచించినది. ఇది తిలోత్తమకుగాక మరియెవ్వరికిఁ జెప్పియుండలేదు. ఆ తిలోత్తమ మరియొకరికిఁ జెప్పి నట్లు తలంచను. ఈ భక్తురాలు తిలోత్తమకాదుగద; సందేహమేల, నిరూపించి చూడ దానియాకారమంతయుఁ బొడగట్టుచున్నది. మొదట వికృతవేషముతో నుండుటచే గనిపెట్టలేక పోయితిని. ఈ కంఠస్వరము దానిదే! అన్నన్నా! తిలోత్తమా! నీకు నెట్టి యవస్థవచ్చెనే! పాపపు విధీ! నీవెంతనిర్దయుఁడవురా! అట్టి మహారాజుకూఁతున కిట్టి యవస్థఁ దెచ్చి పెట్టితివి. అని పెక్కు తెఱంగుల నంతరంగమ్మున వగచుచు నంతటితో సంగీతము చాలింపుమని చెప్పి పైవారినందరను దూరముగాఁ బొమ్మని యానతిచ్చి నా భక్తురాలికిట్లనియె.

తల్లీ! నీవు పాడిన గీతమునకు నా యుల్లము నీరైపోయినది. నేడు నీదర్శంబున నాకులంబంతయు ధన్యతం బొరసె మరియు నీకులశీలనామంబులు విన నాడెందము మిగుల నుత్సాహమందుచున్నది. నీవిచ్చటి కెట్లువచ్చితివి? ఇప్పుడు పాడిన గీత మెవ్వరియొద్ద నభ్యసించితివి? నీనివాసస్థల మెచ్చట? తల్లిదండ్రులెవ్వరు? నీవృత్తాంత మెరిగించి నాకానంద మాసాదింపుమని మిక్కిలి వినయముగా బ్రార్ధించెను. మంత్రిపలికిన వినయోక్తులకు భక్తురాలు మెచ్చుకొనుచు అయ్యా! నాపూర్వాశ్రమవృత్తాంత మేమియు నేను గురుతెఱుంగను. ఇప్పుడు నన్ను భక్తురాలని పిలుచుచుందురు. ఈవిజ్ఞానయోగి శిష్యురాలను. తారకేశ్వరుని సేవించుటయే నాపని ఇంతకన్న నాకీజన్మమున మఱేమియు లేదని చెప్పగావిని యమ్మంత్రి అప్పటి కంఠస్వరమువలన మరియుం గురుతు తెలిసినది కావునఁ దప్పకఁ దిలోత్తమయేయని నిశ్చయించి యది చెప్పిన మాటలకు మనమున శోక మావేశింపఁ గన్నుల నీరు గమ్ముటయు నాపుకొనుచు నతఁడు మఱల నిట్లనియె.

తల్లీ! నన్నన్యురాలిఁగాఁ జూడకుమని పలికిన యంతలోఁ దెలిసికొని నాలుకఁ గరచుకొనుచు నన్యభావంబునఁ జూడకుము నీపూర్వవృత్తాంతము వినిన మిక్కిలి వేడుక యగుచున్నది నీకెద్దియేని మనుష్యకృతములగు నాపదలు సంభవించినం జెప్పుము తప్పక నవి యన్నియు దొలుంగఁజేసెదను. ఆపన్నుల రక్షించుటయేగదా రాజధర్మము. నీ ముఖము జూడ నెద్దియో విపత్తు నొంది యిట్టి వైరాగ్యము బూని యున్నదానవని తోచుచున్నది. నాకు జెప్పుటవలన నీ కుపకృతియే యగును. ప్రజలు తమయిడుమల నొడయనితోఁ జెప్పుకొనుట యావశ్యకము నీ వీయోగినీవేషము వేసికొని యెన్ని దినములయినది? ఈగుడిలో నెన్నిదినములబట్టి యుంటివి. నీగురు వెందున్నవాఁడు చెప్పుము. చెప్పుమని మిక్కిలి లాలనగా నడుగుటయు నాభక్తురాలు ఒక్కింత సేపూరకుండి కన్గొనల నుండి వెడలు నశ్రుకణముల నుత్తరీయంబున నొత్తుచుఁ బుణ్యాత్మా! ఈనిర్భాగ్యురాలి చరిత్రతో మీ కేమిప్రయోజనము గలదు. దీనిని వినినంత మీస్వాంతమునఁగూడ చింత యుదయించును. నాకెద్దియో యుపకృతి జేయునంతటి యాదరణతో మీరడుగుచుండ వచింపకుండుట మూర్ఖతగదా సర్వసుఖపరిత్యాగము జేసిన నాకు మరల సౌఖ్యము గలుగుననునది కలలో వార్తయే యైనను జెప్పెద వినుండని యల్లన పికస్వరముతో నిట్లనియె.

దేవా! నేను రామచంద్రనగర ప్రభువైన శూరసేనమహారాజు కూఁతురను. నాపేరు తిలోత్తమ అందురు. నేను జంద్రలేఖ యనుదానితో మైత్రిఁజేసి అదియు నేను నొక్కనాఁడు మాపట్టణబాహ్యోద్యానవనంబునకుఁ గ్రీడార్థమయి అరగి అందు నిద్రించి యుండగా నన్నుఁ గొందరు దొంగలు మంచముతోఁగూడ నెత్తికొనిపోయి యొకఅరణ్యములోనికిఁ దీసికొనిపోయిరి. ఉదయంబున నేను లేచి చూచువరకు మహారణ్యమును దొంగలు మాత్రము గనంబడిరి. అప్పుడు నేను వెఱచుచు మీ రెవ్వరు నన్నేటికి దీసికొని వచ్చితిరి. మీకు గావలసినపని యేమనియడుగఁగా వాండ్రు వెఱవక నాతోనిట్లనిరి.

మేము దొంగలము. బలసింహుఁడు నీతో సహవాసముగాఁ దిరుగుచున్న చంద్రలేఖను మంచముతోఁ గూడ తనయొద్దకు దీసికొనిరండని పంపెను. మేమును మీ యిరువురిలో గురుతుఁబట్టలేక నిన్నుఁ దీసికొనిపోయితిమి. నిన్నుఁజూచి అతఁడు జడియుచు దీనిని మరలఁ దీసికొనిపోయి యథాస్థానమందుంచి రెండవదానిం దీసికొని రండని పంపెను. కాని మేము మరల నీ మంచము మోచుకొని పోవుచుండగా దారిలో రాజభటుల యలజడి తగిలినది. దానికి వెఱచి యాదారిని విడిచి యీయరణ్యములోనికిఁ దీసికొనివచ్చితిమి ఇక మేమింటికిఁ బోవుటకు వీలులేదు. నీమూలమున మా కాపురములకు నీళ్ళుపోసికొంటిమి. కావున నీదగ్గిరనున్న వస్తువులన్నియు మాకిచ్చివేయుము. నీ విది మొదలు మేము చెప్పినట్లు నడువుము. మేము నిన్నొకచోట కొనినట్లు చెప్పుదుము. ఎవ్వరేని ఆడిగినచో నట్లు చెప్పుదునని ప్రమాణము చేయుము. లేనిచో నిన్నిప్పుడే సంహరింతుమని పలుకఁగా విని నేను విభ్రాంతురాలనై విధినిదూరుచు నప్పుడు మఱేమియు జేయునది లేక ప్రాణమునందు గల దీపునుబట్టి వాండ్రు చెప్పినమాట లన్నింటికిని నొప్పుకొని ప్రమాణము చేసితిని. ఆ చోరులు నా మేననున్న నగలన్ని యు నప్పుడే లాగికొని కాలక్రమంబున నా అరణ్యము విడిచి పట్టణములలో సంచరింపఁ దొడంగిరి. నేనును వాండ్రతో బానిసవలె వెంటనంటి తిరుగుచుంటిని

ఇట్లు గ్రుమ్మరుచుండ నొకపట్టణములో నొకవర్తకుడు నన్ను జూచి యా చోరులతో నీ చిన్నది యెవ్వతె అని అడిగెను. వాండ్రువానితో దీని మేము పారశీకదేశములో వేయి బంగారునాణెములకు గొంటిమి. ఎవ్వరికేని గావలసినచో నమ్మి వేయుదుము. అని చెప్పగా విని యా వర్తకుడు మిగుల ధనము గలవాడు కావున నప్పుడే యాసొమ్మిచ్చి వేసి నన్నుజూచి బోటీ! నిన్ను నేను గొంటిని. నీవు వీరు చెప్పినట్టి దానవగుదువా! నీవేమేమి పనులు జేయుదువని నన్నడుగఁగా నంతకుమున్ను నేను వారితో ప్రమాణికముచేసి యున్నదాననగుట నామాటకు సమ్మతించి లోకగర్హితములు కాక సజ్జనసమ్మతములైన పనులన్నియు జేయుదునని పలికితిని.

ఆ వర్తకు డందులకు సమ్మతించి అప్పుడే నన్ను దనవెంటబెట్టుకొని యీ పట్టణమునకుఁ దీసికొనివచ్చి తన భార్య కప్పగించెను. ఆ వర్తకుని భార్యయు నన్ను సగౌరవముగాఁ జూచుచు నాకుఁ దగిన పనులే చెప్పి మన్నించుచుండెను. నేనును ఆమె యందు భక్తివిశ్వాసములుగలిగి తల్లి లాగునఁ జూచుకొనుచు నామె చెప్పిన పనులు మనసు కనిపెట్టి చేయుచుంటిని. ఇట్టులుండగా నావర్తకుని కుమారుఁడు దేవలుఁడను వాడుఁ నన్ను మోహించి యొకనాఁడు తన అభిప్రాయము నాతోఁ జెప్పెను. నేనును వాని మాటలు విని శివశివా అని చెపులు మూసికొని తమ్ముఁడాఁ నేనట్టిపని కొడంబడు దాననుగాను. నీవు నాకఁ దమ్ముఁడవు. నీతలిదండ్రులను నేను తలిదండ్రులే అని నమ్మియుంటిని. మీ తండ్రితో నేను మొదటనే యిట్టిపనుల కొడంబడనని చెప్పితిని. కావున నీవు సోదరీభావముంచి అట్టి అభిప్రాయము మరలించుకొనుమని మందలించితిని. అప్పటి కేమియుం బలుకక యూ చిన్నవాఁడు సిగ్గుపడిపోయి మరి రెండు దినములు గడిచినంత నేనొంటిగా నుండుటంజూచి నాయొద్దకువచ్చి మచ్చెకంటీ! నీవు చెప్పిన మాటలేమియు నాకు నచ్చలేదు. పచ్చవిల్తుడు నన్ను విచ్చలవిడి బడలఁ జేయుచున్నవాఁడు. నీ నియమములకేమిలే; నీచేత దాసీకృత్యములు చేయించుట మానిపించి నిన్ను మంచిస్థితిలోనికి రప్పించెద. నేను చెప్పినట్లు చేయుమని పలుకుచు నా చేయి పట్టుకొనఁ బోయెను.

అప్పుడు నేను భయఁపడుచు వడివడి పరుగుపెట్టి అతని తండ్రి యొద్దకు బోయి దేవలుఁడు చేయుచున్న దుష్కృత్యములెల్ల జెప్పితిని కాని యావర్తకుఁడు తన కొక్కడే కుమారుఁడు గావున వానిని మిక్కిలి మందలింపనేరక నాతో నేను వానిని దండింతునులే పొమ్మని పలికెను. గట్టిగా నట్టిపని చేయలేకపోయెను. పిమ్మటఁ దల్లితో చెప్పితిని. యామెయు వాని నేమియు ననలేక నన్నెప్పుడు వాఁడున్న చోటికి బోవద్దని చెప్పినది.

ఆ మాటలందు విశ్వాసముంచి నేనట్లు చేయుచుండగా మఱి రెండు దినములు పోయిన వెనుక నొకనాఁడు వాఁడు నాకెదురుపడి నన్నుఁ జూచి శిరఃకంపము చేయుచు గానిమ్ము, నీవు నేనడిగిన వార్త యెల్లరకు వెల్లడిచేసితివిగదా వారు నన్నేమి చేసిరి. ఇప్పటికైన నాప్రజ్ఞ తెలిసినదా. ఈ మాటైనను సమ్మతింతువా అని పలుకుచుండఁగనే ఆవలకుఁ బారిపోయి యా వర్తక యిరుగు పొరుగువారితో జెప్పగా వారును నావర్తఁకుడు మిగుల భాగ్యవంతుఁడగుట నతనితో నేమియుఁ జెప్పలేకపోయిరి. అప్పుడు నాదురవస్థ అంతయుం జింతించుకొనుచు ఛీ! నావంటి మూడురాలీ లోకములోలేదు. మహారాజవైభవమంతయుఁ బోయినను స్వదేశము విడిచినను, నొకరి యింట దాసినై యున్నను నాకింకను జీవితాశ వదలకున్నది ఆహా! ఇంక నేను బ్రతుకుట యేమిటికో తెలియకున్నది? ప్రారబ్ధ శేషమింకను మిగిలియున్నది కాబోలు అనుభ వింపక తీరునా? ఔరౌరా! నా విద్యయు నా రూపము వీరింట దాసీ కృత్యమునకు వినియోగించెనే! అని అనేక ప్రకారములం దలపోసి నాఁటిరాత్రి బలవన్మరణము చేయుటకు నిశ్చయించుకొంటిని.

అంత నర్ధరాత్రంబున నింటివారందరు నిద్రఁజెందియుండుటఁ దెలిసి యిల్లు వెడలి యీ దేవాలయములో నూతినంతకుమున్ను చూచి యున్నకతంబున నందు దేవసన్నిధానమున మృతినొందిన పుణ్యమని తలంచి మెల్ల మెల్లగా నిచ్చటికి వచ్చితిని. ఈ గుడి తలుపులు రాత్రులుగూడ మూయకయే యుండును. నేను లోనఁ బ్రవేశించి యానూతిగోడ పైకెక్కి దూకుటకుఁ జేతుల పైకెత్తి భగవంతుని స్మరించు నంతలో నొకమాట జ్ఞాపకము వచ్చినది. అయ్యో! నే నిప్పుడు చచ్చుటకు సిద్ధముగానుంటిని. ఇట్టి సమయమున నీతారకేశ్వరస్వామికిఁ బ్రదక్షిణము చేసివచ్చిన ముక్తి గలుగునుగదా! అట్టి పని నిమిషములో చేసి మరల వచ్చెదంగాక అని తలంచి యానూతి గోడదిగి యుత్తరపు దిక్కుగాఁ బ్రదక్షిణము జేయఁబోయితిని.

బలదేవుని కథ

ఆవైపుననున్న మంటపములో నగ్ని వ్రేల్చెడి వెల్తురుననెద్దియో మాట్లాడుచున్న జనులసందడి యొకటి వినంబడినది. దానికి నేను సంకోచింపుచు నాదారిం బోయినచో నన్నుఁ బల్కరింతురను వెఱపున నటుపోవక వారు నిద్రబోయిన వెనుక పోవుదమను తాత్పర్యముతో నచ్చటఁ బొంచియుండ వారిమాటలు విననయ్యెను.

శిష్యా! వినుము సంసారము పుత్రదారధనాది సంగమూలకంబై యున్న యది.

ఉ. దేహము వాయుసంచలితదీపిక పుత్రకళత్రమిత్రసం
    దోహము స్వప్నకాలమున దోచెడిసందడి భూరిభోగస
    న్నాహము జంత్రముంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాలమీ
    యైహికసౌఖ్య మేమిసుఖ మంచుదలపగనౌఁ గుమారకా.

మఱియును—

సీ. కామరోగాదిదుష్కరశత్రువర్గప్రతాపప్రధానము ధనము
    జన్మపరంపరాసంపాదితానేకఘనకర్మజాలవర్ధనము ధనము
    కైవల్యసంప్రాప్తికారణవైరాగ్యధర్మమార్గావరోధనము ధనము
    సకలావగుణపుంజసంశ్రయారూపదారుణనిగళబంధనము ధనము.

గీ. గలిగి గర్వంబు దొట్టిదుఃఖంబు మదికిఁ
   బెనుచు నజ్ఞానపావకేంధనము ధనము
   స్వప్నలబ్ధపదార్థంబు చందమునను
   దలఁచి చూడంగ వట్టిదందనము ధనము.

చ. కొడుకులు గల్గుదాక నొక కొన్ని దినంబులు చింత నందనుల్
    బొడమిన నాయువు న్బలము బుద్ధియు విద్యయు జాలగల్గఁగా
    నుడుగనిచింత గల్గి తనునోలిభజింపనిచింత తండ్రి కె
    ప్పుడు గడుజింత సేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే.

వ॥ దీనికి దృష్టాంత మొక్కటి చెప్పెదవినుము. నేను బూర్వాశ్రమున జగన్నాధంబున నివసించి జగన్నాధస్వామి నారాధింపుచు మాలికలంగట్టి స్వామి కర్పించుచు నవియే అమ్ముకొని కాలక్షేపము చేయుచుంటిని. ఇట్లుండగా ముందు సంతాన మెడమైనందున దాని గురించే గొప్ప విదారమొకటి గలిగినది. దానికై యుపవాసములు నియమములు దానములు మొదలగు కృత్యములెన్ని యో చేసితిని. కొంత కాలమునకే వ్రతమహాత్మ్యముననో యొక కుమారుఁడు గలిగెను. వాఁడు పుట్టిన కొద్దినాళ్ళకే తల్లి మృతి బొందినది. వాఁడు కంతువసంతజయంతుల మీరియుండిన రుచి గలిగి యుండుటచే రుచికుఁడని పేరు పెట్టితి నట్టి వాని నెచ్చటికిఁ గదలనీయక నింటనే యుంచి మాలికలు గట్టుపని నేరిపితిని. ఆ పనిలో వాఁడు నాకన్న నెక్కువ కీర్తి సంపాదించెను వాఁడొకనాఁడు సాయంకాలమునఁ బూవుదండల నమ్మివచ్చెదనని పోయి మరల నింటికి రాలేదు. తరువాత నేనుఁబోయి యాగ్రామమంతయు వెదకితిని. యెక్కడను జాడలేదు. గొడ్డు వీగికన్న బిడ్డగావున మిగుల విచారించుచు, నిద్రాహారముమాని సంతతము వానినే ధ్యానించుచుఁ జివరకు బలవన్మరణము సేయ నిశ్చయించితిని. నాయుద్యమం బెఱిఁగి యాప్తుఁడైన యొక వృద్ధభూసురుండు నాయొద్దకు వచ్చి బలదేవా! నీవు పుత్రమోహంబున బలవన్మరణము నొంద నిశ్చయించినట్లు తెలిసినది. అట్టిపని మాత్రమెన్నఁడును సేయకుమీ. నీవు భక్తుఁడవు గదా యింతకు మున్ను జేసిన పుణ్యము పోవుటయేకాక చిరకాలము నిరయములో నుండవలసివచ్చును. అని మంచి మాటలచే నా యుద్యమము మాన్పెను. నాఁటినుండి నేను నిట్టి యవధూత వేషముబూని పెద్దలవలన నాత్మజ్ఞానము సంపాదించి విజ్ఞానయోగి అను పేరుతో దిరుగుచుంటి. శిష్యా! ఇట్టి శోకమంతయు నా కుమారుని మూలముననే కదా వచ్చినది. మొదటనే యతఁడు కలుగకుండనిచో దుఃఖమే లేదు.

ఉ. కోరకు మేపదార్థమును గోరినవచ్చునె రానివస్తువుల్
    గోరకయున్న రావె తనకున్ లభియింపఁగనున్న యర్థముల్

    గోరినరానిచోఁ గలిగి కోల్పడుచో వెతగాన సజ్జనుల్
    గోర రనాస్థఁబ్రాప్తములు గొందురుకుందురు వస్తుహానికిన్.

శా. ప్రారబ్ధంబగుమేననేయనుభవం బౌచుండఁ దత్సాక్షివై
    యారూఢస్థితి సర్వము న్మఱచి సర్వాస్థలం జిత్వుధా
    భారాసావసుఖాస్తి సర్వగత శుద్ధబ్రహ్మ మేనంచు శం
    కారాహిత్యముమానుమీ యదియు మోక్షప్రాప్తికిన్ బాలకా.

వ. ఈ రీతి నుపదేశించు నయ్యోగిపుంగవుని వచనంబు లమృతబిందువుల వలె నా చెవుల శోకినంత నేనత్యంత సంతోషముఁ జెంది యోహో! నీవీ మరణోద్యోగము మానుమని భగవంతుఁడు నాకీరూపమున నుపదేశించెను గొబోలు. ఇది యుపశ్రుతియై యుండవచ్చును. బలవన్మరణమువలన నరక ప్రాప్తియగునఁట. ఇచ్చటనేగాక పరమందు గూడ నిడుములం గుడువవలయునా! కానిమ్ము. నాలుగు దినము లెట్లో కన్నులు మూసికొనినఁ బోవును. పడిన దానికన్న నెక్కుఁడనుభవింతునా? ఈ యోగి వాక్యములే నాకు గురూపదిష్టములైనవి. నేను మా యింటివారు లేవకుండఁ బోవలయునని తలంచుచు నప్పుడే యా ప్రయత్నము మాని యింటికిఁ బోయితిని.

ఆహా! దైవము నా బుద్ధి నెంతలో మార్చినో చూడుడు. “బుద్ధిః కర్మాను సారిణి" అని పెద్దలు చెప్పుదురు నా పుణ్యమువలనఁ నేను పోవువరకు మా యింటి వారెవ్వరును లేవలేదు. దేవలునిం దలంచుకొనినంత నాకు వారి యింటికి మరలఁ బోవలయునని మనసు కలుగలేదు. గాని సొమ్మిచ్చికొనిన వర్తకుని మోసముచేయుట కిష్టము లేకపోయినది. నా రాకపోకలెవ్వరును గ్రహింపలేదు. నేనుఁ బూర్వమువలెనే పనులు చేయుచుండ నొకనాఁటి యర్ధరాత్రంబున దేవలుఁడు నేను బరుండియున్న యింటిలోనికిఁ గత్తిదీసికొని వచ్చి నన్ను లేపి యిప్పుడు నీవు సమ్మతింతువా? లేకున్న నిన్నీకత్తితో వ్రేయనాయని యడిగెను. నే నప్పుడు భయఁపడుచు దేవలుఁడు నన్నుఁ జంపుచున్నాఁడో యని యరచితి.

ఆ రొద విని యాప్రాంతమందే పరుండియున్న వాని తలిదండ్రులు తటాలునఁ జనుదెంచి వానిచేతులం బట్టుకొనిరి. వాడు దురహంకారముఖముతో నన్ను విడువుఁడు. ఈ రండనుఁ జంపినంగాని నా కోపము దీరదని పలుకుచుఁ దనచేతులు లాగికొనఁజొచ్చెను. అప్పుడు వాని తండ్రి పట్టుకొనలేక చేతులు విడచెను. ఆ విసరున చేతిలోనున్న కత్తి మిక్కిలి వాడికలది కావున వాని మెడకుఁ తగిలి తల తెగి పడిపోయినది. అప్పుడు వాని తలిదండ్రులు మిక్కిలి శోకించుచు ననుఁజూచి అమ్మా నీవు మా కొంప తీసితివి. నీ మూలముగా మా వంశనాశనమైనది. నిన్నిందులకే కాఁబోలు కొంటిమి. నీకుఁ బదివేల నమస్కారములు నీ యిష్టము వచ్చినచోటికిఁ బొమ్మని నిందించుచుఁ బలికిన నేనును అయ్యా! నేనేమి జేసితిని. వాని దుర్బుద్ధియే వాని మరణము నకుఁ గారణము. నన్నూరక నిందించెదరేల? మీ యనుమతి లేనిదే పోఁగూడదని యుంటి మీకిష్టమేని నిప్పుడే పోవుచున్నానని పలికి వారి యిల్లు వెడలిపోయితిని.

అప్పుడు నాకు మరియొక చోటికిఁబోవుట కిష్టంలేక తిన్నగా, నీయాలయములోనికి వచ్చి యీ విజ్ఞానయోగి నాశ్రయించితిని. అయన నన్ను శిష్యకోటిలోఁ జేర్చుకొనియెను. నిత్యము నయ్యోగిపుంగవుని బోధామృతమువలనఁ దృప్తినొందుచు సాయంకాలమున నీతారకేశ్వరుని గానము సేయుచు హాయిగాఁ గాలము గడుపుచుంటిని. భక్తురాలని పేరు పెట్టి నిత్యము స్వామి ప్రసాదమే నాకిచ్చునట్లు ధర్మకర్తగా రానతిచ్చిరి. ఇదియే నా వృత్తాంతమని పలుకఁగా విని మంత్రిరూపముతో నున్న చంద్రలేఖ తిలోత్తమ యవస్థకు మిక్కిలి వగచుచు బలసింహుఁడు చేసిన కపటోపాయమునకు వెఱుఁగందుచు రహస్యముగాఁ దిలోత్తమకుఁ దన వృత్తాంతంబు చెప్పవలయునని నిశ్చయించి కర్తవ్య మెద్దియని యాలోచించుచున్న సమయములో ద్వారపాలకుఁడు వచ్చి అయ్యా! విదేశ బాహ్మణుఁడెవ్వఁడో తమ దర్శనము చేయుటకై ద్వారమున వేచియున్నవాఁడు. తమతో నేదియో మనవి చేసికొనునఁట, బ్రవేశమునకు సెలవేయనుటయు నామంత్రి బ్రాహ్మణుల కవసరమేల రమ్మని చెప్పుమని యానతిచ్చెను.

అప్పడాప్రతీహారి యాబ్రాహ్మణుం దీసికొనివచ్చి మంత్రి ముందరవిడిచి వారే ప్రభువువారని చుపించెను. మంత్రియు నాబ్రాహ్మణునిం జూచినతోడనే ముఖము వికసింప నమస్క రించి కూర్చుండ నియమించి యాగమనకారణంబడిగెను. అప్పుడా బ్రాహ్మణుఁ డాశీర్వదించి అయ్యా! నావత్తాంతము వినుడు. నాపేరు గౌతముఁడు. నాకాపురము జగన్నాథము. నేను రుచికుడను మిత్రుని వెదకుటకై బయలుదేరి యనేకపురములు చూచుకొనుచు ఢిల్లీ రాజధానిఁ జేరితిని. అందు దైవానుగ్రహమున నా మిత్రుఁడు కనబడియెను. వానిని వెంటఁ బెట్టుకొని యచ్చటనుండి బయలుదేరి నాలుగు దినములక్రిందట నీయూరు చేరితిని. ఇందుండి మా దేశమునకు నోడమీఁదఁ బోవలసి యున్నది. నేటిసాయంకాలమునఁ బ్రవహణము విడుతురఁట. విదేశాగతుల నెక్కుడుగఁ బరీక్షించినంగాని యాజ్ఞాపత్రికలనియ్యమని మీక్రింది యధికారులు చెప్పుచున్నారు. మేము మాదేశము విడిచి చాలాకాలమైనది ఎట్లయిన మా ప్రయాణము నేడు నాగున ట్లాజ్ఞాపత్రికల నిప్పింపఁ బ్రార్థింపుచున్నాఁడ. నిదియే నాకోరికయని చెప్పిన విని మంత్రివేషముతో నున్న చంద్రలేఖ ఆశ్చర్యసాగరమున మునిగి యొక్కింత తడ వొడ లెఱుంగక ధ్యానించుచు సంతోషము మనంబునఁ బొంగుచుండ నాహా? కాలమే మంచిచెడ్డలఁ గూర్చును. ఓర్పుగలిగిన సుఖములు గూడ, దుఃఖములు వచ్చినట్లప్రయత్నముననే వచ్చుచుండునని పెక్కు తెరంగులఁ దలంచుచు నాసంతోషము దెలియనీయక గౌతముని జూచి యిట్లనియె.

ఆర్యా! మీరు నేఁడే యోడ నెక్కి మీ దేశమున కేగఁదలంచు కొంటిరేని మిమ్ము నేను స్వయముగాఁ బరీక్షించెదను. మీ మిత్రుని దీసికొని మాయింటికి రండు. పొండు. మీ నిమిత్తము కొంచె మాలస్యమైననుఁ బ్రవహణము నిలుపునట్లు చేసెదను. బ్రాహ్మణుల కీపాటియుపకారము చేయుట యబ్బురము కాదని యేమేమో చెప్పి తన గృహము జూపుటకై యొకభటుని నతనివెంట నంపి తరువాత భక్తురాలిం జూచి అమ్మా! నీవృత్తాంతము వినినచో నెట్టివారికిని జాలి వొడమకనదు. నీవు రాచబిడ్డవై యిట్టి నీచవృత్తిమైనవర్తించుట న్యాయముకాదు. మీతండ్రికి నుత్తరమువ్రాసి నిన్ను మీ దేశమున కనిపెదను. అంతదనుక మాయింటనంతఃపుర స్త్రీలలోఁ గలిసియుందువుగాని రమ్మని యుక్తియుక్తముగా బోధించి యొప్పించెను.

అప్పుడా మంత్రి యింటికిబోయి భక్తురాలిం దీసికొనిరమ్మని యొకపరిచారికనుఁ బంపెను. భక్తురాలు మంత్రి తన్ను జేసిన అపూర్వ గౌరవమునకు మిక్కిలి సంతసింపుచు నందలమెక్కి వారిసౌధమునకుఁ బోయినది ఆలోపల జంద్రలేఖ పురుషవేషమును తీసి మునుపటివేషముతో నొక అంతఃపురమున నుండి యాభక్తురాలి నచ్చటికి రప్పించుకొనియెను. అప్పుడు చంద్రలేఖంజూచి భక్తురాలు ఓహో! యీమె మంత్రిభార్య కావలయును. చంద్రలేఖ పోలిక అగుపడుచున్న దేమి? అక్కలికి యిక్కడికేమిటికి వచ్చును? ఒకవేళ నన్ను వెదకుచు వచ్చినదా! అని పెక్కుగతులఁ దలంచుచు నిలువంబడియున్న భక్తురాలింజూచి చంద్రలేఖ సంతోషము పట్టజాలక ప్రాణసఖీ! నన్ను మరచిపోయితివా? పల్కరించవేమియని యట్టెలేచి యా చెల్వం గౌఁగలించుకొనినది.

తిలోత్తమయుఁ దత్కాలోచితమైన వచనములచేఁ జంద్రలేఖకు శోకమిబ్బడింపఁ జేసినది. ఇరువురు కొంతసేపు చిరకాలవియోగశోకం బభినయించుచు నొండురుల వృత్తాంత మెరింగించి యాశ్చర్యమందఁ జొచ్చిరి. చంద్రలేఖ తిలోత్తమకుం దన వృత్తాంతమంతయుంజెప్పి సఖీ! మనకిప్పుడు కాలము మంచిదైనది. విను మల్లఁనాడు నీ మేడకువచ్చిన దివ్యపురుషుం డిక్కడికివచ్చెను. వాని నీ కిప్పుడు చూపెద సరయుము. వాని వృత్తాంతము కొంత నే నెరిఁగియుండియుఁ జెప్పితిని కాను. అతనిచేత నంతయుం జెప్పించెదనని పలుకుచుండఁగనే యా విదేశపురుషు లిరువురువచ్చి ద్వారమున నిలిచి యున్నారని యొక యాంతరంగికసఖురాలు వచ్చి చెప్పినది. వారి నాలోపలకే తీసికొనిరమ్మని దానినే యంపినది. అదివోయి ముహూర్తమాత్రములో వారిరువురును లోపల బ్రవేశింపఁజేసినది. అప్పుడు గౌతముఁడును రుచికుఁడును నందు బురుషులెవ్వరును లేక స్త్రీలు మాత్రమే యుండుట దూరమునందు చూచి దారితప్పితిమని వెరచుచు దిరిగి వెనుకకుబోవఁ బ్రయత్నింపుచున్నంతఁ జంద్రలేఖ సఖురాలు అయ్యా! పోకుఁడు పోకుఁడు వారే మి మ్మీలోపలకుఁ దీసికొనిరమ్మనిరని చెప్పినది.

ఆ మాటవిని వారు సంశయాకులితహృదయులై యల్లన నప్పల్లవపాణులున్న నెలవునకుఁబోయిరి. మునుపటికన్న నద్భుతతేజమున మెరయుచున్న రుచికునింజూచి చంద్రలేఖయుఁ దిలోత్తమయుఁ వెరగుపడుచు మాట్లాడవలయునని తత్తరపాటుజెందుచు నెట్టకే లాపుకొనియున్న సమయంబున గౌతముఁడు చంద్రలేఖం జూచి గురుతుపట్టి యబ్బురపాటుతో బోఁటీ! యిచ్చటి కెప్పుడు వచ్చితివి? నేను గౌతముఁడ నితఁడు నా మిత్రుఁడు రుచికుఁడు జ్ఞాపకమున్నదా అని అడిగిన విని అమ్మించుబోడి లేచి వారికి నమస్కరింపుచు నందున్న పీఠములఁ గూర్చుండ నియమించి యల్లన నిట్లనియె.

గౌతమా! నీవు నన్ను గురుతు పట్టగలవో లేవోయని మాట్లాడితినికాను. పాపము నీ వీరుచికుని నిమిత్తము చాలా శ్రమపడితివి. ఈతండెందు గనఁబడెను. విశేషములేమి. చెప్పమని యడిగిన అమ్మగువ కతం డిట్లనియె. చంద్రలేఖా! మావృతాంతము చాలగలదు నీ వీవీటి కెప్పుడువచ్చితివి. ఈ మంత్రిగారికిని నీకును సంబంధ మెట్లు కలిగినది. నీవృత్తాంతము ముందుజెప్పుమని యడిగిన జంద్రలేఖ తాను జగన్నాథము విడిచివచ్చినది మొదలు నాఁటితుదదనుకి జరిగిన కథ అంతయు జెప్పి మరియు నిట్లనియె.

ఆర్యా! నీ మిత్రుని చరిత్ర మింద్రజాలమువలె నున్నది. జగన్నాథములో నంతర్ధానమై రామచంద్రనగరములో దిలోత్తమ నుత్తలపెట్టి ఢిల్లీనగరములో నీకుఁ గనంబడెను. రెక్కలుగట్టుకొని తిరిగెడి వారైన నిట్టిచిత్రములు చేయలేరు. మమ్మతడు మరచినను మేమితని నిమిత్తమే యిడుములఁ బడుచున్నారము. ఈ చిన్నదియే తిలోత్తమ. ఇతని నిమిత్తమై యిట్లు జోగురాలైనది. కానిమ్ము. దైవికమునకు వగచినం బ్రయోజనము లేదు గదా! తదీయవృత్తాంతము విన మాశ్రవణము లుత్సుకత నొందు చున్నవి. అనిన విని రుచికుండు విస్మయశోకసంభ్రమంబులు చిత్తంబుత్తలపెట్ట నల్లన నిట్లనియె.

చంద్రలేఖా! మీరు నానిమిత్తము మిక్కిలి యిడుములం గుడుచుచున్నారు. ఇందులకు మీకు కృతజ్ఞుఁడునై యుండెదను నా వృత్తాంతము వినుడు. నాఁటి రాత్రి నీ యుద్యానవనములోనికి బోయి తలుపులు వైచుకొన్నది. నీవు చూచితివికదా! తరువాత నేను నలుమూలలు బరికించి యెందు నిలిచిననుం దెలిసికొందురని తలంచి యేబలవితానములచే దట్టముగ నల్లుకొనఁబడిన నొక యశోకపాదపమునెక్కి చిట్టచివర కొమ్మలసందున నాకుమరుగు పిందివలె నణఁగియుంటిని.

జయంతుని కథ

ఇంతలో సమీపమున నెవ్వరో మాట్లాడుచున్నట్టు ధ్వని వినఁబడినది. అదిరిపడి తలపైకెత్తి చూచితిని. మెరపుతీవంగల కాంతులు ప్రోగుపడి నామీద బడుచున్నట్లు తోచిన విస్మయముతోఁ బరిశీలించునంత నాకాంతిమండలము నేనున్న మ్రానుదండకేవచ్చి యల్లన నిలువంబడినది. అప్పుడు నాకది కనకమణిస్యందనమని తెల్లమైనది. పిమ్మట నాకందున్న వారి మాటలుగూడ నిట్లువిననయ్యె. తిలోత్తమా! మన పయనమున కంతరాయము గలుగఁజేసి గంధవహుండే తత్ప్రసూనవాసనావిశేషం బాతిథ్యముగ నిచ్చి నాసాపర్వంబు గావింపుచు నిచ్చటికిఁ దోడ్కొని వచ్చె గదా! ఈ యద్యానవనము జూడుము. నీమాటలం ద్రోచి పోవుదమనుకొంటిని గాని యేతదాగమనము సాద్గుణ్యమే యైనది. వేగమపోయి నీ యిచ్చకు వచ్చిన బూవులం గోసికొనిరమ్ము లెమ్ము. అనుటయు నొకతరుణి మరల వానితో జయంతా! నేనెంత సంతసమునులేక నిన్నూరక నింతదూరము దీసికొని వత్తునా! ఇది అద్భుతసౌరభ్యము వలె బొడకట్టినది. ఆహా! మన దేవలోకమువలె భూలోకమునను మంచి పుష్పజాతులు గలిగియున్నవే! అందు నేనొంటిమైఁ బోవలేను. నీవుకూడ రావలయునని పలికినది. అప్పుడతండు బోఁటీ! వెఱవకుము. ఇది యర్ధరాత్రము. ఇందెవ్వరును లేరు. యధేచ్ఛముగాఁ బూవులు గోసికొనవచ్చును. నేనును వత్తునని పలుకుచు మెల్లన లేచి యాచిగురుబోఁడి పాణిపల్లవమును గైకొని భేచరత్వమున నాతోఁటలోనికి దిగిరి. ఆ విమానమచ్చటనే యున్నది. నేను వారి రూపములు భాషణములు వేషములుఁజూచి దేవతలని తలంచి దివ్యదర్శనమునకు సంతసించుచు వారుపోయిన జాడఁజూచి మహా సాహసముతో నాకొమ్మలమీఁద నిలువఁబడినంత నాయరదము చేతికందినది.

మెల్లన దానిపై కెక్కి చూచితిని అది రెండంతరములు గలదిగా నున్నది. మొదటిది రత్నస్థంభభూయిష్టమై యున్నది. రెండవది రత్నాసనశయ్యాచిత్రవస్తుమండితమై యొప్పారుచున్నది. అది వారు నివసించు తావని యూహించి మొదటియంతరమున రతనపుకంబళముల చాటునఁ జిత్రప్రతిమవలె దాగియుంటిని. ఇంతలోఁ బూవులఁ గోసిఁకొని వారిరవురు మాటలాడుకొనచు వచ్చి యావిమాన మెక్కిరి. అది యేమి మహిమయోకాని యాయరదము వారెక్కిన తోడనే మరఁ ద్రిప్పినట్టు రివ్వునఁ గదలి వాయువేగముగఁ బైకి నడువఁదొడంగినది. దానికిఁ జక్రములు గాని రెక్కలుఁగాని యేవియునులేకయే యట్లునడుచుచుండుట దేవతామహిమ అని యూహించి నేనందుండి భూలోకము చూడ నేమియుం గనఁబడినదికాదు. అంతయు నలికికొని పోయినట్లున్నది. ఇంచుకయుఁ గుదుపులేదు. స్థంభమునుఁ గౌఁగలించుకొని కూర్చుంటిని. అప్పుడు పుష్పముల నాఘ్రాణించుచుఁ తిలోత్తమ జయంతునితో మనోహరా! ఈ విరులు మిగుల వింతగానున్నవి ఇట్టివి మనలోకములో నున్నవియా! మనుష్యులు మనకంటెఁ దక్కువవారని చెప్పెదరే! వారికిట్టి భోగ్యవస్తులేటికి; వారును మనవలెనే సౌఖ్యము లనుభవింతురేమో? నీవెప్పుడైనను చూచితివా అని అడుగ నతఁడు నవ్వుచు బువ్వుఁబోఁడీ! మనుష్యులు మాత్రము సామాన్యులను కొంటివా యేమిఁ వారిలో భోగమునను రూపముననుఁ ప్రభావమునను మనల నతిశయించువార లనేకులు గలరు ఇంతయేల మీలో మిగులసొగసుకత్తెయగు నూర్వశి భూలోకచక్రవర్తియైన పురూరవుని వరింపలేదా? మాతండ్రి యహల్యమూలముననేకదా సహస్రాక్షుండను నభిఖ్య వహించుట. అందు జరామరణవ్యాధులు క్షుత్పిపాసలును గలిగి యున్నవి. మన కవి లేవు. ఇదియే మనకును వారికినిఁగల తారతమ్యము. ఇందున్న వృక్షజాతులన్నియుఁ బ్రతినామముచేత నందొప్పుచున్నవి. ఒక సంగీతవృక్షము మాత్రము భూలోకములోలేదు. తక్కినవన్నియుం గలవు. అని యీరీతి యిష్టగోష్టీవినోదమునం బోవుచున్నంత నా ప్రాంతమందు వడిగాఁ బారిబోవుచున్న కింపురుషులకును వారి కెదురపడిన సిద్ధులకును నిట్టిసంవాదము జరిగినది.

సిద్ధులు — కింపురుషులారా! కడువేగముగాఁ బారిపోవుచున్న వారేమి? స్వర్గమున నేమైనను విశేషములు జరుగలేదుకద?

కింపురుషులు - అయ్యో! మీకింకనుఁదెలియలేదు. కాఁబోలు ఇప్పుడు స్వర్గమున గొప్ప యలజడి జరుగుచున్నది. పాపము మనయింద్రుని కిట్టి యవస్థ యెప్పుడును రాలేదు.

సిద్ధులు — ఆఁ! ఏమేమి? ఇంద్రునకే! యెవ్వరివలన! వడిగాఁజెప్పుడు.

కింపురు - రక్తాక్షుఁడను రాక్షసుడు వరగర్వమునం బ్రబలి పెక్కండ్రు రక్కసులతో వచ్చి స్వర్గమును ముట్టడింప దేవేంద్రుడు వానిబలమెఱింగి బలవద్విరోధమునకు వెఱచి వాని కెదురేగి వినయపూర్వముగా బ్రార్ధించి నందనవనములో విడియఁజేసెను.

సిద్ధులు - అది మంచిపనియే. తరువాత.

కింపురు — ఇంద్రుఁడు వానికిని వానిపరిచారకులకును నప్పుడు చేసిన యుపచారములేమని చెప్పుదుము వానినేమియుఁ బాటింపక వాఁడు పురముచూడవలయునని బయలువెడలి దేవతాగృహము లన్నియు వాని రాయిడికివెఱచి మూసియుండుట జూచి యహంకరించి యౌరా! నేనీయూర విహరింపరాగా దేవకాంతలందరు నుపహారము లియ్యక వంచనమైఁదలుపులు మూసికొనిరే! ఇదియంతయు నీకపటమే ఇట్టి నీతో మాకు మైత్రి యెట్లనిపలుకుచు సుధర్మకు దారిఁజూపుమని యింద్రునడగెను.

సిద్ధులు - ఆహా! దుర్జనులెప్పుడైనను సామమునఁ జక్కఁబడుదురా! తరువాత.

కింపురు - ఇంద్రుఁడు కొంతసేపు తడఁబడచు మరల ధైర్యము దెచ్చుకొని, అచ్చటికి రాక్షసులు పోరాదని చెప్పెను. పురుహూతువచనములు వినినతోడనే రక్తాక్షుఁడు రక్తాక్షుఁడై యేమి యింద్రా! మాకు దేవసభకుఁబోవుటకు నర్హత లేకపోయెనే. కానిమ్ము. నిన్ను బరిమార్చి యీరాజ్యము గైకొనిన నేమిచేయుదువో. అప్పుడైననుఁ దగుదుమా, అని యీరీతి సారెసారెకు ధిక్కరించి పలుకుచుండ నలుక జనించి, యింద్రుడు నుక్కుమెయి రక్కసులతోఁబోరాడ దేవతలఁ బురికొల్పెను. అప్పుడు దేవదానవులకు గొప్పయుద్ధము జరిగినది.

సిద్ధులు - దేవతల కెప్పుడును రక్కసులే హృదయశూలములైరి. తరువాత.

కింపురు — అనంతరమున రక్తాక్షుండు సహస్రాక్షు నోడించి పాశంబులఁ గట్టి జయజయధ్వనులతో తనలోకమునకుఁ గొనిపోయెను. దేవతలు అనాథులై వాని వెంటనంటి యూఱకపోయిరి తరువాత రాక్షసులు చేయుచున్నయల్లరి నేమనిచెప్పము. కనంబడినవారినెల్లఁ బట్టి వేధింపుచున్నారు. మేము రాయిడికోడి పారిపోవుచున్నవారము. మీరుగూడ నిప్పుడు స్వర్గమునకుఁ బోకుఁడు వృథగాఁ గట్టడులు బడియెదరు.

సిద్ధులు - ఆలాగునా, అయ్యో! పాపము మన యింద్రుని పనియేమగునో కదా! అని వెఱచుచు నందరు వడిగాఁబారిపోయిరి.

ఆ సంవాదమంతయు మావిమానము ప్రాంతమందే జరిగినది. అట్టి సంవాదము విని జయంతుఁడు తిలోత్తమంజూచి వాల్గంటీ! వీరిమాటలు వింటివా నీవింటికిఁబొమ్ము. నేనారక్కసుని యుక్కు మాపి మాతండ్రిని విడిపించుకొనివచ్చెదను. నేను లేకపోవుటఁగదా యింత పుట్టినది. కానిమ్ము. అని పలుకుచు నాయుధములు ధరించి రౌద్రాకారముతో వడిగా విమానము దిగి యెక్కడికోపోయెను.

అత్తరినత్తిలోత్తమయు నావిమానము నందనవనములోనున్న విమానశాలలోనికిఁబోయిన నందు దిగఁబోవుసమయమున నన్ను జూచినది నేనునుఁ బురుషులెవ్వరు లేరను ధైర్యముతో స్తంభము మాటునుండి దానికన్నులంబడితి. అక్కన్నియ నన్నుఁ జూచినతోడనే విస్మయమందుచు అయ్యా! తమరెవ్వరు? ఈవిమానముమీఁదికెట్లు వచ్చితిరి. మీరు నివసించు లోకమెచ్చట. మీవృత్తాంతము చెప్పుఁడని యడిగినది. నేనునుఁ గొంచెముసేపాలోచించి యింతీ! వినుము. మా కాపురము శ్రీజగన్నాథము. నేను స్వామిభక్తుఁడను, నా పేరు రుచికుఁడందురు. సరితము మాలికలు గట్టి స్వామి కర్పించుచుందును. ఇట్లుండ నేను మొన్నను స్వర్గవిషయములన్నియు నొకచోటఁ బురాణములో విని దాని జూడవలయునని వేడుక పడుచు స్వామిని ప్రార్థించి నిద్రఁబోయితిని.

భక్తపరాధీనుడగు జగన్నాథస్వామి నాకుఁ గలలో దర్శన మిచ్చి వత్సా! నీవు చింతింపకుము. నీయభీష్టము తీర్చెదను. ఱేపటిరాత్రి యీయూరనున్న చంద్రలేఖ యను వేశ్యామణి పెరటితోఁటలోని యశోకపాదపము నెక్కియుండుము. అచ్చటికిఁ దిలోత్తమాజయంతులు విహారార్థమై విమానములో వత్తురు. నీవప్పుడా విమాన మెక్కుము. దేవలోకమునకుఁ బోయెదవు. దేవదానవయుద్ధకారణమున దేవతలందరు దనుజులోకమునకుఁ బోవుదురు. తిలోత్తమతో నీకు మైత్రి గలుగును. ఆ కాంత యేకాంతముగా నీకు స్వర్గలోకవిశేషములన్నియుం జూపునని చెప్పి యంతర్ధానము నొందెను.

నేనునుఁ దద్వచనప్రకారము జరిగించి మీలోకమునకు వచ్చితిని. స్వామివచనము తప్పదుగదా. నీవు తిలోత్తమ గావచ్చును. ఈ పైకార్యము నీకతంబున జరుగవలసియున్నది. ఇదియే నావృత్తాంతమని చెప్పితిని. నా మాటలు విని యవ్వనిత తన హృదయంబునంగల భయభక్తివిశ్వాసంబులు మొగంబునఁ గనంబడ నభినయించుచు నోహో! స్వామికార్య మెల్లరకు నాచరణీయమే యగుంగదా? మీకార్యము జక్క జేసెదను. ఇంచుక సేపిందు నివసింపుడు. గ్రామవిశేషము లరసి వచ్చెదనని పలికి నాయనుమతి వడసి యప్పడఁతి వీథిలోనికిఁ బోయినది.

అప్పుడు నందనవనములో నెవ్వరులేరు. రాక్షసభయముచేఁ గాపరులు గూడ పారిపోయిరి. అట్టివనములో నేను యథేచ్ఛముగాఁ గ్రుమ్మరుచు మనోహరములైన పూవులనుగోయుచు మధురములగు ఫలముల భక్షింపుచు సంగీతవృక్షముల గానం బాలింపుచు నీరీతి గొంతతడవు విహరించితిని. మరియు నందున్న విరులేరి, చక్కని దండలు గట్టితిని. ఇంతలో తిలోత్తమ యరుదెంచి ఆర్యా! నేను వీటిలోనికిఁబోయి వచ్చితిని. రాక్షసభీతిచేఁ దలుపులన్నియు మూయఁబడి యున్నవి. ఈ పట్టణమంతయు యంత్రములచే నమర్చఁబడియున్నది. యొకచోఁట కీలుద్రిప్పినచో మార్గము లన్నియుం గప్పఁబడును ప్రతిగృహమునకు మఱుఁగు తెరవుగలదు. అవి మాకు గాక యొరులకుఁ దెలియవు. నీకా విశేషములన్నియుం జూపెద రమ్మని పలుకుచు నేను గట్టిన దండలు జూచి వెఱుగుపడుచుఁ దొలుత నాకు నందనవనవిశేషములం జూపినది.

చంద్రలేఖా! ఆ నందనవనవిశేషములు చెప్పుటకు నావశమా? ఆహా! అవ్వనములోని తావి యాఘ్రాణించిన సౌఖ్యమును దలంచికొన్న నిప్పుడు గూడ మేనుగరపు జెందుచున్నది. అత్తోఁట స్వర్గపట్టణమునుండి తూర్పుగానున్నది. అందు మొదట విమానశాలలు తరువాత చిత్రశాలలు పిమ్మట విహారశాలలు, అటుపైన రత్నాశాలలు. నడుమ నడుమ ననేకశాలలు గలిగియున్నవి. ఫలజాతులు పుష్పజాతులు క్రొత్తలేకాని చూచినది. మరలిఁ గనఁబడలేదు. అత్తోటలోఁ బోవుచుండ నొకదండ వర్షాకాలము పోలిక జలయంత్రములఁ జిమ్మె డు తుంపురుల బెంపున మేనుదడియును. ఒక పొంత హేమంతమురీతి మకరందమిళితమగు శీతలమారుతములఁ జలి జనియించును. ఒకచెంత వసంతముభంగి సర్వసుమనస్సంపూర్ణంబై మలయానిలములు హాయిసేయును. ఒకఛాయ గ్రీష్మమతెఱంగున రవికాంతశిలాదీప్తికలాపంబులఁ దాపంబు గలుగఁజేయును. అట్టి వనములోఁ బెద్దతడవు దిరిగితిని కాని యెప్పటికిని తుదయు మొదలునుఁ గనంబడినది కాదు.

మణిశిలలచేత నడుమ విశాలముగా మార్గంబు లేర్పరుపఁబడియున్నవి. అందు దివారాత్రవిభాగము తెలియదు. పెక్కేల నా చక్కనితోఁటలో నొక్క నిముషము వసియించినం జాలదే! బ్రహ్మపదమేల? దాననేకదా భూమియుందనేక సుకృతములు చేసినవారు గాని స్వర్గమునకుఁ బోవలేరు నీ కతంబున నాకే సుకృతమును లేకనే యట్టి సౌఖ్యంబు దొరికినది. అంతకుమున్ను రక్కసుల రాయిడి కోడి పొదలమాటున డాఁగియున్న వనపాలికలు తిలోత్తమంజూచి ధైర్యముతో బైటికి వచ్చి నన్నుఁ జూచి సంకోచించుచుఁ చేసన్నలఁ చేయుచుండ నవ్వేదండగమనయు, రండు రండు. ఈతం డొక పుణ్యపురుషుండు. రక్కసు లెక్కడికో పోయిరి. మన ప్రభువు రక్తాక్షుం బరిమార్చి రాఁగలండని ధైర్యము గరిపిన వారును సంతోషముతో బయల్పడి జయజయధ్వనులు చేయుచు నాట్యములు సేయఁదొడంగిరి.

బోఁటీ! అచ్చటి పాటలగంధులందరును సన్నని నడుములును గొప్ప పిరుందులును, పలుచనివట్రువ మొగంబులును, విప్పిన నెమలిపింఛముల చొప్పున నొప్పారు కేశపాంబులుం గలిగి తారతమ్య మరయరాక యొక్కపోలికనే వెలయుచుందురు. అన్నన్నా! విధి సృష్టికి మేరలేదు సుమీ? దివిజకాంతలం జూచి మనుష్యకాంతలం దలంచుకొనినంతఁ బరిహాసాస్పదముగా నుందురు. మిక్కిలి సంతోషముతో నత్తోటలోఁ గ్రుమ్మరుచు నొకచోటఁ బలుతెరంగుల మనోహరస్వరంబు లీన గానంబు వెలయింపుచున్న యొకమ్రానుం జూచి యావిశేషంబేమియని యడుగఁగా దిలోత్తమయిట్లనియె. ఆర్యా! ఇది సంగీతవృక్షము. పెక్కండ్రు వైణికులు పాడినట్లు పాడును. గాలి వీచినకొలది వింతవింతస్వరములు, రాగములు జనించును. మా లోకములో నెక్కుడు విశేషమిదియేయని చెప్పఁగా నేను గాంతా! యీవృక్షమునకు బీజమెట్టివి. దోహద మేరీతి? మాలోకమునంబాతిన బ్రతుకునా? దీనివిశేషమెఱిగింపుమనియడిగితిని. అదియుఁ గొంత సేపాలోచించి ఆర్యా! యీపాదపము పూర్వము కైలాసమునందుండునది. శివునింబ్రార్ధించి విష్ణుఁడు తనలోకమునకుఁదెచ్చుకొనియెను. తరువాత నందుండి శతానందుండు ముకుందు నడిగి తనలోకమునఁగూడ దీని విస్తరింపఁజేసెను. బ్రహ్మను వేడికొని యింద్రుడీ లోకములో నాఁటిన మిగుల వ్యాప్తమైనది. అని యావృత్తాంతముజెప్పి యప్పడఁతి నన్నుఁ బట్టణము లోనికిం దీసికొని పోయినది

అయ్యారే! అందుఁగల విశేషంబు లెరిగింప నాకేమియుఁ బాటవములేకున్నది. నేనుఁ జూచినదానిలో సహస్రాంశమైనను నా హృదయంబునం దోచదు, తోచినదానిలో సహస్రాంశమునైనఁ జెప్పనేరుపు లేదు. ఆహా! నేనొక వీథిలో నిలువంబడి చూచితిని. ఎటుచూచినను సౌధములును వీథులునుగానే తోచినవి. ఇది రాజమార్గము, ఇది మేడ, ఇది భూమి, ఇది యాకసమనియు దెలియ శక్యము గాకున్నది. మన దేశములో నుసిరికాయంత మణి దొరికిన నబ్బురముగా నుండును. అచ్చట నున్న శిలలన్నియు మణులే! రాజమార్గములన్నియు మణిఖచితములగుటచే నందు సౌధములు ప్రతిఫలించి యడుగునఁ గూడ పట్టణమున్నట్లు తోచును.

అట్టి వింతలంజూచి దారి తెలియక నేను దెల్లబోయి చూచుచుండ, నా యండజయాన నవ్వుచు నిలువంబడి యేమియది చూచుచుంటివి నా వెంటరావేయని యడుగఁగా నయ్యో! నీకును నాకును నడుమ ప్రవాహమున్నది. ఎట్లు దాటఁగలను. ఈ గట్టు దూకుటకు నే నోపుదునా? ఈ తలుపు మూసియున్నది ఎలాగున వత్తును. అని యీ తెఱంగునఁ బల్కుచుండ నా చేయి పట్టుకొని నీవు చూచినది మణికాంతి ప్రవాహము కాదు. రమ్ము రమ్ము. ఇది తలుపు కాదు. ప్రతిబింబము భ్రమయక చక్కగా నిదానించి చూడుము. ఇది దేవసభకుఁ బోవు రాజమార్గము. దీని ప్రక్కల నున్న మేడలు మిగుల గొప్పవి వీని విశేషములఁ బరిశీలింపుమని పలుకుచుండ నేనిట్లంటిని.

తిలోత్తమా! నీ పుణ్యము నా చేయి విడువకుము. ఎడమైనచో నీవును నాకుఁ గనంబడకుంటివి. క్రిందఁగూడ మేడలున్నవా యేమి? నా కేమియు దారి తెలియదు నిలునిలు అయ్యో! ఈ ప్రహరి నెట్లు దాటిపోయితివి. ఈ శ్రేణి యెచ్చటనుం గనంబడినదే? అని యిట్లు బలుకుచుండ అయ్యో! నీ కెన్నిమారులు చెప్పితిని, ఇది గోడకాదు. మణిశిలాప్రతిఫలితమగు సాలము తగులదు. రమ్మని పలికి క్రమంబున నా వీథులన్నియుం ద్రిప్పినది కాని నా కేమియునుఁ దెలిసినది కాదు. అప్పుడా మేడ తలుపులన్నియు మూయబడి యున్నవి. మొదట నా కెవ్వరునుఁ గనంబడలేదు గాని యా మేడఁ మీఁదనున్న సాలభంజకల జూచి దేవకాంతలని భ్రమయుచుండ నవి బొమ్మలని యది చెప్పి నా సందియము దీర్చినది.

అందున్న మానికపు బొమ్మలనుఁ గొమ్మలకును భేదముఁ గనిపెట్టుట మిక్కిలి దుర్ఘటనము. తరువాత నా నాతి నా భ్రమనంతయు నుడిపి చూడుమల్లదె పొడవుగానున్నది. జయబతమను పేరుగల యింద్రునిమేడ దానిదాపున నున్నది శచీగృహము. ఆ ప్రక్కది జయంతునిది. దానికిఁ దూర్పుదెసగా మెరయుచున్న సౌధములోనే సుధర్మయను పేరుగల దేవసభయున్నది. అవియే దిక్పాలుర గేహములని యందలి గృహవిశేషములన్నియు వేరువేర నిరూపించి చెప్పినది. నేను వానివిశేషముల కచ్చెరువందుచు ముందు నింద్రునిగృహములోనికిఁ దీసికొనిపొమ్మని కోరగా నది ఆర్యా! ఇప్పుడాగృహము వాకిలి మూయఁబడియున్నది. ప్రచ్ఛన్నమార్గము నేనెరుంగుదును. కాని యందనేక దేవతలు కాచికొని యుందురు. నిన్నుఁ జూచి శంకింతురు. కావున నచ్చటికిఁబోవలదు. ముందు మాయింటికిఁ దీసికొని పోయెదను. చూతువు గాని రమ్మనిపలుకగాఁ సంతసించితిని. ఆకాంత నన్నేకాంతమార్గమునఁ దనయింటికిఁ దీసికొనిపోయినది. ఆహాహా! సద్గృహాలంకారవిశేష మేమని పొగడఁగలవాడ. చూచినతోడనే నాకు విభ్రాంతిగలిగి యది యేయవస్థయో తెలిసికొనలేకపోయితిని.

పిమ్మట నన్నొకగదిలోనికిఁ దీసికొనిపోయినది. ఆగదియలంకారమంతయుఁ జెప్పుటకొక సంవత్సరము పట్టును. అందొకహంసతూలికాతల్పము జూపి కూర్చుండు మనుటయు సంతసముజెంది యందు గూర్చుండి యాగది యలంకారములు వెఱఁగుపాటుతోఁ జూచుచుంటిని. ఇంతలో నాతిలోత్తమ జగన్మోహనంబగు వేషంబుగా నలంకరించుకొని నా మంచపుదాపునకువచ్చి నిలువంబడినది. నేను మొదట నాయువతింజూచి మఱియొకతె యనుకొంటిని. అంతలోఁ దెలిసికొని మోహాక్రాంతస్వాంతుండనై చూచుచుండ నార్యా! నీవు మాయింటి కతిథివిగా వచ్చితివి హరిభక్తుండవు. నిన్నర్పించవలసి యున్నది మా సపర్యలనందుము. అని పలుకుచు నామేనఁ జందనమలఁదినది. అయ్యంగరాగంబు పరిమళము భూలోకములో లేదనిచెప్పగలను.

మందారకుసుమదామంబు చిరునగవు మొగంబునకు రవణంబై మెఱయ నా మెడలో వైచినది. తన మృదుకరతలస్పర్శంబున నామేను ఝల్లుమన్నది. ఒడలు పరవశమైపోయినది. చంద్రలేఖా ఇఁక జెప్పనేమి యున్నది. దానిచిట్టకంబులు సిగ్గున కగ్గమై యున్న నాచిత్తమును శృంగారలీలాయత్తమును గావించినది.

అప్పుడు నేను దుగువమై దెగువా? నీయపూర్వసపర్యలకు నాడెందం బానందము జెందినది. నీవు దేవకన్యవు. నీయర్చనఁ గైకొని యూరకుండరాదు. ప్రత్యర్చన జేయవలసియున్నది. ఆ గిన్నెనిటు దెమ్మని పలుకుటయు నక్కుటిలకుంతల రసికశేఖరా? నీయభీష్ట మెట్లో యట్లుకావింపుము అని పలుకుచు నాగంధభాజనము నా కందిచ్చినది. నేనుగౌతమునితోఁ గూడ శృంగారప్రబంధముల జదివియున్న కతంబున నాగంధము జేతనందుకొని దాని మేనంబూయుచుఁ గళాస్థానములంటి యావాల్గంటికిఁ బులకలు బొడమఁచేసితి. తరువాతఁ జెప్పవలసినదేమిగలదు నీవే గ్రహించుకొనుము.

శ్లో॥ తన్మయఃకిమహంబాలా మన్మయాకిముభావపి
     కిమానందమయావేతి నవిజ్ఞాతంమయాతథా.

అప్పుడు నేను తన్మయత్వము అయ్యువతి మన్మయత్వము నొందుటచే మే మెట్టియానంద మనుభవించితిమో మాకేతెలియదు.

శ్లో॥ కిం నాథః నిర్దయతరం భుజకందళీభ్యాం
      ద్వాభ్యాంనిపీడయసి మాంన నహిష్ణు రస్మి
      వామభ్రువామితి సుఖేష్వపి దుఃఖభాజాం
      ధన్యాన శ్రుణోతి యదికుట్టమితాక్షరాణి.

శ్లో॥ శ్యామా కఫకృతికా బడబా మృగీవా
     గంధర్వయక్షసుర నిర్జర కన్యకావా
     బాలధవాభినవయౌవనభూషితాంగి
     సాభామినీభవభుజాంపరమంరహస్యం

దేవకన్యలలో నగ్రగణ్యయగు తిలోత్తమ సౌందర్యచాతుర్యాదివిశేషములు యౌవనలావణ్యములు క్రీడావినోదములు, మనోహరములని వేరచెప్పవలయునా ? ఆచేడయతో వేడుక లెంతకాల మనుభవించితినో చెప్పజాలను. గడియవలెనైనఁ దోచలేదు. కాని యింద్రుడు వచ్చి నాకపటము గ్రహించి నన్ను శిక్షించునేమోయను వెఱవు పానకములోఁబుల్లవలె నామదికిఁగఱకుగా నాటుచునే యున్నది.

మఱియు నానెలంత నేను గోరికొనిన నొక్కనాఁడు దేవసభఁ జూపింప నన్నుఁ దీసికొని పోయినది. అప్పటికి దేవేంద్రునిజాడ యేమియు దెలియలేదు. పురమంతయు నారీతినే యున్నది. అప్పుడప్పఁడతి నన్నొక ప్రచ్చన్నస్థలమునకుఁ దీసిగొనిపోయి యందున్న యొకమరఁద్రిప్పగా నొక తలుపు తెరవఁబడినది. ఆమార్గములోనికిఁ బోయితిమి. అదియొక గుహవలె నున్నది. కాని రత్నకాంతులచేఁ జీకఁటి యెంతమాత్రమునులేదు. నిరాటంకముగా నామార్గమునం బోవంబోవ నాదేవసభ గనంపబడినది.

ఆ దారి యింద్రుడు గూర్చుండెడి పీఠము వెనుకకుఁబోయినది. ఆ సభఁ జూచినంత నాస్వాంతమున నేవస్తువునకు మితిలేదని నిశ్చయించితిని. అందున్న ప్రతివిశేషమునుఁ జూచినదానికన్నఁ గ్రొత్తవింతగాఁ గనంబడుచుండెను. ఆ సభ చతురశ్రముగా యోజనోధ్రయము గలిగియున్నది. తూరుపుదెసఁ చింతామణియను పేరుగల యింద్రుని సింహాసనము నవరత్నఖచితమై యున్నది. ఇరుప్రక్కలను రత్నపీఠములు పెక్కురకముల నొప్పుచున్నవి. దక్షణోత్తరభాగములయందు దేవతలు గూర్చుండెడి పీఠములున్నవి. ఎదుర రంభాదుల నాట్యము జేసెడు రంగస్థలము మిక్కిలి వింతయగు నలంకారము గలిగియున్నది

దిక్పాలురును, మహర్షులును, బృహస్పతియు, నింద్రునిప్రాంతమందుగల పీఠములపైఁగూర్చుందురఁట. ఈపీఠములు శ్రేణిగాను క్రమక్రమోన్నతముగాను సుంపఁబడినవి. ఆ సభాలంకార మదివరకందు నేనుఁ జూచినదానికన్న వింతగానున్నది. పెక్కేల నచ్చట విశేష మొక్కొక్కటి జెప్పుటకుఁ పెద్దతడవు పట్టును చూచినదే పలు మారుచూచుచు, నడిగినదే పెక్కుసారు లడుగుచు, నీరీతి నాయాస్థానములోఁ గ్రుమ్మరుచుండగా నింతలో నాగుప్తద్వారమున నెవ్వరో మాట్లాడుచున్నట్లు వినంబడి నది. ఆరొద విని తిలోత్తమ జడియుచు నాచేయి పట్టుకొని చింతామణి పీఠముమాటునకు లాగికొని పోయినది. నేనును భయపడుచు నొకమందసము సందున దాఁగియుంటిని. మేమున్న చోటునకు గుప్తద్వారము దాపుననే యుండుటచే నచ్చటివారి మాటలు మాకీరీతి వినంబడినవి.

విజయుడు — నందా! ఈ రహస్యకవాటము తెరవబడియున్న దేమి శత్రువు లెవ్వరేనిఁ దెలిసికొని లోపల దూరలేదు కదా! నిన్ను సంతతము నిచ్చటఁ గాపుగా నుండమని మన ప్రభువు నియోగించెను గదా యేమి చేయుచుంటివి?

నందుడు -- విజయా ! ప్రమాదము వచ్చినది. కాపాడుము నేను సురాపానమత్తుండనై రతికేళిఁ జొక్కి యిక్కడకు రామరచితిని. ఈ సంగతి మనయేలికకు దెలిసెనేని శిక్షించును. నీవు గుప్తముగా నుంచుమీ.

విజయుడు - కడచినదానికి వగచినం బ్రయోజనము లేదుకదా దాని కేమి తెరచియుండుటకు గారణ మాలోచింపుము. ఇప్పుడు ఇంద్రుడుగారు వచ్చుచుండిరి. వెంటనే సభకు వేంచేయుదురట. సిద్ధముగా నమర్చియుండవలయును.

నందుడు - మనమే మరచియుండవచ్చును. ఈసంగతి శత్రువుల కెట్లు తెలియును. మన దేవేంద్రుని కెట్లు విజయము గలిగినదో చెప్పుము.

విజయుడు - విను మతనిం గట్టితీసికొనిపోయి రక్తాక్షుండొక బందీగృహములో నుంపించెను.

నందుడు - అయ్యో ! పాప మెంతవారి కెట్టి అవస్థ వచ్చినది. తరువాత.

విజయుడు - ఇంతలో జయంతుడు పోయి యా రేద్రిమ్మరి యేమరుపాటుగా నున్నతరి వానిపైబడి సంహరించెను. పిమ్మట రక్కసులందరు పారిపోయిరట.

నందుడు - ఓహో ! మన జయంతు డెంతపరాక్రమము చేసెను! మొదట గ్రామములో లేడాయేమి ?

విజయుడు - లేడు. ఎచ్చటికో విహారార్థ మరిగెను.

నందుడు – విష్ణుమూర్తి వచ్చి సహాయము చేసెనని యొకవదంతి పుట్టినదేమి?

విజయుడు — అదియు నుండవచ్చును. శ్రీహరికటాక్షములేక యెట్టివారికిని జయము కలుగదుగదా.

నందుడు - ఇప్పు డీసభకువచ్చి యేమిచేయుదురు.

విజయుడు - దిగ్విజయవిశేషములం జెప్పుకొని సంతసింతురు.

నందుడు - అట్లయినం ద్వరగారమ్ము. పీఠములన్నియు జక్కగా సవరింతము.

అని యీరీతి నొండొరులు సంభాషించుకొనుచు వచ్చి యాపెద్దగుమ్మము తలుపులు తెఱచిరి. అప్పుడు నేనును దిలోత్తమయును నాపెట్టెమాటున నణగి యుంటిమి. మఱియు నేను భయపడి తిలోత్తమతో మన మవ్వలకు బోవలదా? అని పలికినంత నానోరు మూయుచు మాట్లాడవలదని సంజ్ఞచేయుచు నన్ను బట్టుకొనినది. అంతట భేరీధ్వనులు వినబడినవి. ఆ ధ్వనుల వలన నాగుండెయలు పలిగినవి. పిమ్మట మేళములతో జయజయధ్వను లేపార వాసవు డాసభాభవనమునకు విచ్చేసెను. మే మెవరికి గనంబడుటలేదు. కాని అందరును మాకు గనంబడుచుండిరి. అది రహస్యస్థలమని యెఱుగును. కావున దిలోత్తమ నిర్భయముగా నుండుమని నాకు బోధింపదొడంగినది.

ఇంద్రుని కథ

పిమ్మట నింద్రుడు తన సింహాసన మలంకరించిన తరువాత దేవతలు, మునులు వారివారిప్రదేశమ్ములం గూర్చుండిరి. అప్పుడు బృహస్పతి లేచి యా రక్కసునివరవిశేషము లుగ్గడింపుచు జయంతుని పరాక్రమమునుగురించి కొంతసే పుపన్యసించెను. అచ్చట నున్నవారందరు తమకు దోచిన ప్రకారము క్రమముగా నుపన్యాసము లిచ్చిరి. పిమ్మట రంభాదుల నాట్యవినోదము జరిగినది. అట్లు కొంతసేపు దేవేంద్రుడు సభజేసి తన విజయమును గురించి నుతియించుచు దేవతలకు గానుక లిచ్చి వారి వారి నివాసముల కనిపి తానును వైజయంతమునకు పోయెను. పిమ్మట నా సభాద్వారము మూయలేదు. అచ్చట ద్వారపాలకులు విచ్చుకత్తులతో గాచుకొని యుండిరి. మాకా దారినిబోవుటకు వీలులేకపోయినది.

అప్పుడు తిలోత్తమ పెక్కు తెరంగుల నంతరంగమునం దలపోయుచు ప్రతీహారులకు గనబడకుండ నాగుప్తద్వారము దాపునకు నాతోగూడ బోయినది. అంతకుమున్న మేము వచ్చిన ద్వారమును విజయునందు ననుమానపడి బిగించి లోపల బీగమువైచిరి. దానింజూచి తిలోత్తమ గుండెమీద జేయి వైచుకొని అమ్మో! ఇక మనకు బ్రదుకులేదు ఈ ద్వారమునకు దాళము వైచిరి. మరియొకదారిని బోవుట శక్యము గాదు. ఇంద్రుని యానతిలేక పెద్దగుమ్మమున జీమకయినను రాకపోకలు గలుగుట కష్టము. ఇప్పుడు మనలను జూచినచో శంకింతురు. ఎన్ని దినము లీమాటున నుందుము. నాకుగూడ నవ్వలకుబోవుట దుర్ఘటము. ఈ సభలోనికి వచ్చువారికి బోవువారికిని లెక్కయున్నది. ఆ మార్గమునరాక నేను బోయినచో నెట్లు లోపలికి బోయితివని యడుగుకుందురా! అడిగినప్పు డేమిచెప్పుదును. అని పెక్కుతెఱగుల దలపోయుచు నంతలో గన్నులుదెఱచి ఆఁ! జ్ఞాపకము వచ్చినది. రుచికా! మనకొక యాధారమున్నది. రేపు రాబోవు శుక్రవారమున నీయూరిలో శ్రీపుష్పయోగమను నుత్సవము చేయుదురు. ఆ యుత్సవమునకయి రాత్రి పార్వతీపరిణయమను నాటక మీసభలో నాడుదురు. అప్పుడు మిగుల సమ్మర్ధముగా నుండును. ఆ సందడిలో నెట్లయిన దాటి పోవచ్చునని పలుకుచు మరల భీతినభినయించుచు నయ్యో! దీనిలో నాకొక యుపద్రవము బొడగట్టుచున్నదే ఆ నాటకము బృహస్పతిగారు రచించిరి. అందులో నే నొక భూమికను, ఊర్వశి పార్వతివేషము వైచును. నేనామె చెలికత్తెయైన జయవేషము వైచుటకు నిరూపింపబడితిని. కథాసరణియంతయు నిదివరకే వర్ణించితిని. ఆ నాటకములో భూమికలుగానున్న వారందరు రేపటిరాత్రి బృహస్పతిగారి యింటికి బోవలయును. అప్పుడే నాపరీక్ష వచ్చును. దీని కేమిచేయుదును. అని పెక్కు తెఱంగుల జింతింప దొడగినది.

దాని యధైర్యమునుజూచి నేనును విదారింపుచు మనంబున మా కులదైవ మగు జగన్నాథస్వామిని ధ్యానింపుచుంటిని. అదియు దుఃఖావేశమున మేను తెలియక పడియున్నది. అప్పుడు నాకు మిక్కిలి యాకలిగా నుండగా నాసభలో నలంకారమున కయి వ్రేలగట్టిన ఫలములను కొన్ని తిని యాకలి యడంచుకొంటిని అట్టి విచారముతో నాదినము గడపితిమి. మరునాడు తిలోత్తమ తనకు వాటిల్లిన యిడుమును గురించి విచారింపుచుండగా నింతలో భేరీధ్వని యొకటి వినబడినది. ఆ రవము చెపియొగ్గి విని యోహో! ఇంద్రుడుగారిప్పుడు సభకు వచ్చుచున్నారు. ఎద్దియో కారణమున్నది. లేకున్న నసమయమున నిచ్చటికిరారు. ఎంతయో గొప్ప కారణముండినగాని క్రొత్త వేళల నోలగము సేయరు. ఆయన యాస్థానసమయము లన్నియును మాకు దెలియును. కావున నిప్పు డేమేమి చెప్పుకొనియెదరో వినవచ్చును. సావధానముగా నుండుము. తల మాత్రము పైకెత్తకుము అని పలికినది.

ఇంతలో దేవేంద్రుడు బృహస్పతి దేవతలు విచారముఖములతో సభకు వచ్చి వారివారిస్థానముల గూర్చుండిరి. రంభాది దేవకాంతలు వచ్చిరి గాని నృత్యగీతాదివ్యాపారములు మాని నిశ్శబ్దముగా నెదుర నిలువబడిరి. పిమ్మట దేవేంద్రుడు లేచి యెల్లరు విన నిట్లనియె. ఆచార్యా రక్తాక్షుని పుత్రుడు విరూపాక్షుడను వాడు సంగర మున నోడి పారిపోయినవార్త మన మెఱిగినదేకదా? ఇప్పుడు వాడు సేనలం గూర్చుకొని మనపట్టణము ముట్టడించుటకై వచ్చుచున్నవాడని యొకకింవదంతి పుట్టినది. దాని నిజము దెలియుటకయి చారణులం బంపితిని. మనము జేయవలసిన శ్రీపుష్పయోగోత్సవము చేయదగినదా లేక ప్రస్తుతము మానదగినదాయని యడుగగా బృహస్పతిలేచి యిట్లనియె.

దేవేంద్రా! విరూపాక్షుడు మిక్కిలి బలవంతుడగును. అట్టి ప్రయత్నము చేసినను జేయవచ్చును. అట్టి వదంతి వట్టిదని తోసివేయరాదు మనప్రయత్నములో మనముండవలయును. ఈ యుత్సవము మరియొకప్పుడు చేసికొనవచ్చును. మనవీటి మార్గములన్నియు గట్టునట్లాజ్ఞ యిప్పింపుడు అని బృహస్పతి చెప్పగా విని దేవతలందరు నాయాలోచన యుక్తముగానున్నదని యొప్పుకొనిరి. అప్పుడు దేవేంద్రుడు స్వర్గపురవాకిళ్ళన్నియు మూసివేయుటకును దేవసైన్యమంతయు నాకముచుట్టును గాపుండునట్లును, ఆజ్ఞయిచ్చి యంతటితో సభ ముగించి యింటికిబోయెను. వెంటనే యచ్చటనున్న ద్వారపాలురు సభా సింహద్వారము తలుపులు బిగించి ప్రచ్చన్నమార్గమునకు వచ్చిరి. మేమంతకు పూర్వమే వేరొకమందసము మాటునకు బోయితిమి. కావున మమ్మును జూడకయే యాతలుపు తెరచుకొని మరల మూసి వారు పోయిరి.

అప్పుడు తిలోత్తమ సంతసించుచు నన్ను జూచి ఆర్యా! మనయందు దైవానుగ్రహము గలిగియున్నది. విరూపాక్షుని మూలమున మన మీసభలో నుండి దాటిపోవచ్చును. ఈ గుప్తద్వారము తలుపున దాళము వైచియుండలేదు. కాని నందు డనువాడు సంతతము దాపున గాపుండును. కాన నేను వానిని మోహ పెట్టెదను. నీవు నా వెనుక నుండుము. నందు డందు గాపుండినచో వాని నెద్దియో మాటలసందడిని దూరముగా దీసికొనిపోయెదను. ఆ సమయమున నీవు బైటికి వచ్చి యందున్న బిత్తి మాటున నిలువుము. పిమ్మట నేను గలిసికొని తీసికొని పోయెదనని చెప్పి మెల్లన నన్ను గుప్తద్వారము దాపునకు దీసికొని పోయినది.

అచ్చట దడవి యొక మరపట్టుకొని త్రిప్పగా నాతలుపులు తటాలున దెరవబడినవి. అప్పుడందున్న నందుడు ఎవ్వరు వారని కేకలు వేయగా దిలోత్తమ పైకి బోయి నందా! నేను తిలోత్తమను నన్ను లోపలబెట్టి తలుపులు వైచితివేమి! నన్ను జూచుటలేదా యని చెప్పినది. అప్పుడా నందుడు విమర్శించి ఏమీ! నీవు మొదట సభలోనికి బోయితివా? నిన్ను నే జూడలేదె? నీవిషయమయి కనబడలేదని యందరు చెప్పుకొనుచున్నారే? నీమాట దబ్బరగా నున్నదని పలుకగా నది యోహో! నందా! నీభార్య బాగున్నదా! దానికిని నాకును మిక్కిలి స్నేహము. నీతో నామాట యెప్పు డైనందెచ్చునా? నీవు నాకు బావకి బావ వగుదువు. మాయక్క నడిగితినని చెప్పుము. మరియొక రహస్యమున్నది. చెవిలో జెప్పవలయు నిటురమ్ము. ఎవరికిని జెప్పవుగదా? నాచేతిలో చేయివేయుమని పలకగా నందుడు నవ్వుచు మరదలా! అది యేమి రహస్యము చెప్పుమని పలుకుచు దిలోత్తమ యొద్దకుం బోయెను.

అదియు వాని గ్రమక్రమముగా దూరముగా దీసికొనిపోయినది. అది యంతయు నేను వివరములో నుండి చూచుచునేయుంటిని అతడు దూరముగా బోయిన వెంటనే బయలువెడలి యది చెప్పిన గోడ మాటున దాగితిని. వానిచెవిలో నేమి చెప్పినదో వాడు మిగుల సంతోషింపుచు వచ్చి యాగుమ్మమును మూసి యచ్చట గాపుండెను. తిలోత్తమయు నందా! ఈ గుమ్మమును భద్రముగా గాపాడుచుండవలయు జుమీ? యని పలుకుచు మెల్లన నాయొద్దకు వచ్చి నన్ను వెంటబెట్టుకొని రహస్యముగా దనయింటికి బోయినది.

ఆహా! అప్పుడుమాకు మృత్యుముఖమునుండి వెలువడినట్లుగా నున్నది. పిమ్మట నాకొమ్మ చెలికత్తియలంజేరి తాను వెళ్ళిన తరువాత నేమి జరిగినదని యడుగగా నిట్లనిరి. అమ్మా! నీవు పోయిన వెసుక మొదట జయంతుడు వర్తమాన మంపెను. తరువాత బృహస్పతి పంపున నిన్ను బిలుచుటకు రంభ వచ్చినది అప్పుడు మేము ఇంటిలో లేదనియు యెచ్చటికి బోయినదో మాకు దెలియదని చెప్పితిమి. తరువాత నింద్రుడు వార్త నంపెను. నీవిషయమై బృహస్పతివారు మిక్కిలి కోపముజేసి యింద్రునితో జెప్పిరట! ఇంతలో విరూపాక్షుని యల్లరి వచ్చుటచే నీ ప్రశంస యడుగునబడినది. ఇదియే యిచ్చటి వృత్తాంతమని చెప్పిన విని తిలోత్తమ భయపడుచు విచారముఖముతో నంతఃపురమునకు నన్ను దీసికొనిపోయినది.

ఇంతలో వీథిలో నెద్దియో చాటించుచుండిరి. ఆ వార్త తెలిసికొని వచ్చి పరిచారిక అమ్మా! విరూపాక్షుని గురించి చెప్పినవార్త యంతయు నసత్యమట. రేపు శ్రీపుష్పయోగోత్సవము జరిగింతుమనియు బురమార్గంబులన్నియు దీయబడుననియు యధేష్టముగా నెల్లరు విహరింపవచ్చుననియు జాటించుచున్న వారు అని చెప్పినది. ఆ మాట వినినతోడనే తిలోత్తమ రేపు అమ్మహోత్సవము జరిగిన నాటకమాడుదురు. న న్నడిగిరేని నెచ్చటికిబోయితివని బొంకుదును? ఏమి చేయుదునని యాలోచించుచు నా పజ్జంగూర్చుని యెద్దియో చెప్పబోవు సమయమున చెలికత్తె వచ్చి జయంతుడు వచ్చుచున్నాడని చెప్పినది.

ఆమాట వినినతోడనే యదరిపడి లేచి నన్నొక మూల దాచి యతని కెదురేగి యుచితమర్యాదల దోడితెచ్చి యాతల్పమున గూర్చుండబెట్టినది. అత డప్పుడు తిలోత్తమా ! ఇన్నా ళ్ళెచ్చటికి బోయితివి. పార్వతీపరిణయ నాటకములో నీవొక పాత్రను వటకాదా? సరిచూచుటకయి నిన్నను బృహస్పతిగారి యింటికి బోలేదటే. దాన గోపము వచ్చి యాయన మాతండ్రితో జెప్పెను. నేను దొందరగా బోయితిని. తరువాత నీ వేమి చేసితివి చెప్పుమని యడిగిన జయంతునికి దిలోత్తమ యిట్లనియె. జయంతా! నావృత్తాంత మేమని చెప్పుదును నీవు దారిలో నన్ను విడిచిపెట్టిపోయితివికదా! నేనును విమానశాల దగ్గిరకు బోవువరకు నక్క డొకరక్కసుడు నన్ను బట్టుకొని బలాత్కారముగా దీసికొనిపోయెను.

నే నెన్నియో కేకలు పెట్టితిని కాని నామొర నాలించువారు లేకపోయిరి. వాడు నన్నొక పర్వతదుర్గమునకు దీసికొనిపోయి యందొక గుహాముఖమున నునిచి తనతో భోగింపుమని చెప్పెను. నేనును సమ్మతింపక వానిని బెక్కుతెఱంగుల నిందింప దొడంగితిని. అప్పుడు వాడు రోషకలుషితహృదయుడై కన్ను లెఱ్ఱంజేయుచు దనచేత నున్న చంద్రహాసము జళిపించుచు నీవిందులకు సమ్మతింతువా! లేక నీశిరము ఖండింపనా యని యడిగెను.

నేనప్పుడు భయపడి యోహో! తరువాత జూచుకొనవచ్చు నీ గండము గడచినంజాలునని యూహించి ఓరీ! నేను నీయభీష్టము దీర్చెదను కాని నీవిప్పు డశుచిగానుంటివి. ఇట్టి సమయంబున గ్రీడింపరాదు. స్నానము చేసి వచ్చి దార్చి నాయొద్దకు రమ్మని పలుకగా వాడు సంతసించుచు నాచంద్రహాసమందుంచి యందున్న చిన్నకాలువ కభిముఖముగా బోరగిలంబడి చేతులతో నెత్తిమీద నీళ్ళు పోసుకొనుచుండెను. ఆ సమయముచూచి నేను మిక్కిలి సాహసముతో నా చుద్రహాసము గయికొని వాని కంఠముమీద గట్టిగా వయిచితిని. ఆ దెబ్బతో వానితలతెగి కొండచరియవలె దొర్లి దొర్లి వెల్లువలో గొట్టుకొని పోయినది

వానినట్లు సంహరించి నేను స్వర్గమునకు వచ్చు దారిగానక చింతించుచు నాపర్వత శిఖరమెక్కి కుమ్మరుచుండ విహారార్దమయి కింపురుష మిధునమొకటి యచ్చటికి వచ్చినది. నే నప్పుడా మిధునము కడకుబోయి నాపేరు జెప్పితిని. వారును గురుతుపట్టి నన్ను దమ విమానముపై నెక్కించుకొని యప్పుడే బయలుదేరి యీ యూరి తోపులో దిగబెట్టిబోయిరి. పిమ్మట నేనింటికి వచ్చితి. ఇదియే నావృత్తాంతము. బృహస్పతిగారును దేవేంద్రుడుగారును గోపముజేసిన నేనేమి చేయగలదాననని చెప్పినది.

ఆ మాటలువిని నేను దాని సమయస్ఫూర్తికి వెఱగందుచు స్త్రీల మాయ లిట్టివిగదా యని శంకించుకొనుచు దానియిడుమల కన్నిటికి నేనేగదా కారణమని గర్హించుకొనుచు నామరుగున నణగియుంటిని. కలికీ! ఇంకొక్కటి వినుము విహారార్ధమై పోయినసంగతి మా తండ్రికిం దెలిసినచో నన్ను నిందించును. నీపుణ్య మీరహస్యము మాత్రము బయలుసేయకుము తీగిలాగిన డొంక గదిలినట్లు నీవృత్తాంతము మూలమున నాగుట్టు వెల్లడియగుచున్నది. నీవార్త మఱియొకలాగున జెప్పుము మొదటికథ తెలియ నీయక నందనవనమునకు విహారార్ధమై పోవునప్పుడు రక్కసుడు చెఱగొనిపోయెనని నుడువుము అని చెప్పి యతం డరిగిన వెనుక రంభోర్వసులు వచ్చియున్నారని పరిచారిక వచ్చి చెప్పినది. అప్పుడు వారికెదురేగి తీసికొని వచ్చినది.

వారిరువురు దానిం గౌగలించుకొనుచు ఏమీ ప్రాణసఖి? నిన్నెవ్వడో రక్కసుడు చెఱగొని తీసికొనిపోయెనట. మాకు దెలియలేదె యెంత ప్రమాదము నీవు నిన్న బృహస్పతిగారి యింటికి రాకున్ననేమోయని యూహించితిమి ఈమాట దెలియక యాయన నీవూరక రాలేదని కోపముజేసెను. అని చెప్పిన దిలోత్తమయు వారికి దగినట్లుత్తరము చెప్పినది నేనొక సందునుండి వారిద్దరిని జూచితిని. చంద్రలేఖా! వారి సౌందర్య మేమనిచెప్పుదు. వారేకదా లోకములో సౌందర్యమునకు నవసానభూతులని జెప్పదగినవారు. వారింజూచినప్పుడుగదా కన్నులు గలిగినందులకు ఫలము! వారి యవయవము లీరీతిగా నున్నవని చెప్పనవసరములేదు. శాస్త్రములో నుత్తమమత్తకాశినుల కెన్ని లక్షణములు చెప్పబడెనో యంతకన్న కొన్ని మిన్నగానే యున్నవి.

నేను దదేకదృష్టిగా వారియవయవము లన్నియు విమర్శింపుచుంటిని. వారు మరల దిలోత్తమతో సఖీ! యీరాత్రి నాటకములోనికి వత్తువా? నీభాగము మఱి యెవ్వరు వర్లింపలేదు. ఆ నాటకమునకు దిక్పాలురందరును వత్తురట మనము చక్కగా వినిపింపవలయునని పలుకగా దలద్రిప్పుచు దిలోత్తమ వారి కనుగుణ్యమగు మాటలం జెప్పినది. అట్టి సమయమునందు మఱియొక పరిచారికవచ్చి అమ్మా! ఇంద్రుడుగారు నిన్ను రమ్మనమని వర్తమానము బంపిరి. దేవదూతవచ్చి వాకిట నిలువబడియున్న వాడని చెప్పినది.

ఆ మాటలువిని తిలోత్తమ అక్కలారా! మీరు పదుడు నేను దేవేంద్రు నొద్దకు బోయివచ్చెద. రాత్రి తప్పక నాటకములోనికి వత్తునని పలికి ముందుగా వారిని సాగనంపి పిమ్మట నాయొద్దకువచ్చి యిట్లనియె. అనఘా! నీవు వీరిమాటలన్నియు వినుచుంటివికద. ఇప్పు డింద్రుడు వార్తనం పెను. నేనుబోయి యిప్పుడే వచ్చెదను. ఇచ్చటనే యుండుము. ఈలోని కెవ్వరును రాకుండ దాళము వైచిపోయెదను. నీకేమియు భయములేదని పలికి కదిలిపోయినది. నేనును నవ్వనిత లేనిసమయమందు నిముషమొక యుగముగా దలంచుచు నేమియుదోచక యాసౌధములో నలుమూలలు గ్రుమ్మరుచు నన్యులెవరేని వత్తురేమోయని వెఱచుచు నేమాత్రము రొదయైనను నదియే వచ్చుచున్నదని తొంగిచూచుచు నీరీతి నొకయామము గడిపితిని. ఇంతలో నాయింతి నూర్పులు నిగుడవచ్చి తలుపు తీసింది. నేనును నెదురేగి సభావిశేషము లేమని యడిగిన నిట్లనియె.

ఆర్యా! వినుము నావార్త కుమారునివలన దేవేంద్రుడు విని నాకు వర్తమానము బంపెను. నేను వెళ్ళిన తరువాత నాదరపూర్వకముగనే నాకథయంతయును విని తానుగూడ విచారించెను. తరువాత నీరాత్రి నాటకములోనికి బొమ్మనికూడ నానతిచ్చెను. ఇంతవరకు జక్కగనే యున్నది. కాని మఱియొక చిక్కు తటస్థించునని యోజించుచున్నదాన నాతో నతడు మాట్లాడుచున్న సమయమున విజయుడను సుధర్మాభవన ద్వారపాలుడు వచ్చి దేవేంద్రా! నమస్కారము నేను సభాద్వారపాలుడను. ఈరాత్రి నాటకమాడుదురని యీసభయంతయు బరిశోధించి యలంకరింపుచుండ జింతామణిపీఠము వెనుక నీకాగితము దొరికినది. ఇందున్నది మనలిపికాదు. మనుష్యలిపివలె దోచుచున్నది. ఇట్టిది యీ సభలోనికి వచ్చుటకు గారణమేమో దేవరవారే యాలోచింపవలయునని పలుకుచు నా యుత్తరము చేతికిచ్చెను. దానింబుచ్చుకొని సకలభాషావేదియయిన దేవేంద్రుడు చదువగా బూవులదండలకయి నీ కెవ్వరో వ్రాసి నట్లున్నది. అప్పుడు దేవేంద్రుడు సందేహమందుచు నోహో! ఈరుచికుడెవ్వడు ఎచ్చటి జగన్నాథము ఈయుత్తర మీసభలో నుండుట మిగుల జిత్రముగా నున్నదేయని పెక్కుగతుల దలపోయుచు రెండవద్వారపాలకుడయిన నందునికి బృహస్పతికిని తక్షణమే సందేశము బంపెను. అంతవరకు విని నేను భయపడుచు నింద్రుని యనుమతి వడసి యిచ్చటికి వచ్చితిని.

ఆ యుత్తరము నీవచ్చట మరచితివి కాబోలు. ఇంక మనగుట్టు బట్టబయలు కాకమానదు. నందుని నిర్బంధించి యడిగినచో నాసంగతి చెప్పునేమో దానింబట్టి క్రమముగా నిజము లాగికొందురు. ఇదియుఁ గాక దివ్యజ్ఞానసంపన్నుడగు బృహస్పతి తలచుకొనిన నిజము దాగునా అందులకే బృహస్పతికిగూడ వర్తమానముచేసెను. ఇక నీవిచ్చటనుండిన మాటదక్కదు లెమ్ము నిన్ను భూలోకమునకు దీసికొనిపోయి దింపి వచ్చెదను. నీవు సుఖముగా నుండినజాలు. నా కర్మము నాయది మఱియు నీకొక్క మేలు గూర్చెదను. భూమిలో నొక రాజకుమారిత నా పేరనే యొప్పుచు రూపలావణ్యాదుల నన్ను బోలి సామాన్యుని బెండ్లియాడనని పట్టుపట్టియున్నది. మొన్నటి ప్రయాణములో నేను దాని వృత్తాంతము వింటిని. దానికి నీవు దగినవాడవు దానిమేడమీద నిన్ను విడచివచ్చెదను. దానితో సుఖముగా నుండుము లెమ్ము, మరల నేను వేగిరముగావచ్చి నాటకమున కందుకొనవలయునని పలుకగా విని అయ్యో! యెంత ప్రమాదము వచ్చి నది నిష్కారణముగా నిన్నిడుములబెట్టినవాడనైతినే కటకటా! యని పలుకుచు గన్నులనీరు గార్చినంజూచి యా చిగురుబోడియు విచారించుచు నేనేమి చేయుదును. నన్ను మించిన యాపద రాబోవుచున్నది. నిన్ను విడుచుట నాకు బ్రాణముల విడుచుటకంటె గష్టముగానున్నది. అయిన నీకు మంచిసౌఖ్యము గలుగజేసెదను. లెమ్మని పలుకుచు నన్ను బ్రచ్ఛన్నముగా విమానశాలయొద్దకు దీసికొనిబోయి యొక విమానముపై నెక్కించి యరగడియలో భూలోకమునకు దీసికొనివచ్చినది

నన్నొక మేడదాపునకు దీసికొనిపోయి యల్లదిగో! ఆమేడమీద దిలోత్తమ యను రాజపుత్రికయున్నది. ఆ చిన్నది విద్యారూపసౌకుమార్యంబుల నన్ను మించి యున్నది. నీకు దానివలన సుఖంబు గలిగెడిని పొమ్ము. నేను పోయివచ్చెద అనుజ్జ యిమ్మని పలుకుచు ముద్దాడి విడచినది. తిలోత్తమయు నవ్విమానము దీసికొని స్వర్గమునకు నిర్గమించినది. పిమ్మట నేనామేడమీద సఖులతో గూడ వీణవాయించుచున్న యాయించుబోణింజూచి మోహించితిని. అమ్మగువయు నాయభిప్రాయమెరిగి చెలికత్తియలకు సన్న సేసినది. కాబోలు నా ప్రోయాండ్రందరు తొందరగా దలయొకపనిమీద బోయిరి. పిమ్మట జెప్పునదియేమి యా మానినియు నేనును మూడహోరాత్రము లేక దేహమెట్లట్లవర్తింపుచు గామక్రీడలం దేలితిమి. పెక్కేల నాదివసములో గులశీలనామంబు లొండొరుల నడుగుట నక్కేళీవిలాసంబులనడమ నవకాశము దొరికినది కాదు. అట్లు మూడుదినములు కామకేళిందేలి మూడవనాటిరాత్రి మృదుతల్పంబున నలసి సొలసి యక్కలికియు నేనును గాఢనిద్రా వశంవదులమైతిమి.

ఆహా ! దైవప్రయత్న మెట్టిదో చూడుము. అమ్మరునాడుదయమున లేచి చూచువరకు నేనాశయ్యయందలేను. నన్నెవ్వరో యెచ్చటికో తీసికొనిపోవుచుండిరి. యడిగితిని. వారు కొంతసేపటికి మేము దేవదూతలమనియు నింద్రుని యానతి నిన్ను స్వర్గమునకు దీసికొనిపోవుచున్నారమనియు జెప్పిరి. వారిమాటలు విని నేడు స్వర్గమున నెట్టియుపద్రవము పుట్టినదో! తిలోత్తమమాట నిజమే యైనది. దానినేమి బాధించు చుండిరోకదా! కటకటా! ఇంద్రుడు నన్నేమిచేయించునో యని పెక్కు తెఱంగుల దలపోయుచు వారితో నిట్లంటిని.

అయ్యా! దేవదూతలారా! మీకు వందనములు సేసెదను. ఇంద్రుడు నన్నేమిటికి దీసికొనిరమ్మనెను. దేవలోకములో నావార్త వచ్చుటకు గారణంబేమి? మీతో నింద్రుడు నన్ను దీసికొని రండని చెప్పినప్పు డచ్చట నెవ్వరుండిరి. మరియు నేమమిప్రసంగము జరిగినది నిక్కమువక్కాణింపుడు. మీకు నార్తులరక్షించిన పుణ్యము కలుగునని వేడుకొంటిని. కాని వారేమియు మాటాడిరికారు. ఏమాటయు జెప్పకయే వారు నన్ను స్వర్గమునకు దీసికొనిపోయిరి. నేనును దేవేంద్రునితో నేమని చెప్పుదును. తిలోత్తమమాట జెప్పిననొకతప్పు. చెప్పకున్న నొక తప్పు. అచ్చట నేమి జరిగినదో తెలియదు. ఇంతచింతయేల దైవమేమి తోపించిన నట్లు చెప్పువాడనని తలచుచు స్వర్గ పట్టణమువీథినుండి పోవుచుంటిని.

ఆ సమయమున నింద్రుడు శివపూజ సేయుచున్న వాడు కావున నవసరమైనది కాదు. అంతవరకు నన్ను వారొక బందీగృహములో నుంచిరి. అదియు భూలోకములోనున్న కారాగృహమువలె దుర్గంధాంధత మస్సంవృతంబైయుండక యున్నతమగు ప్రహరిచే నొప్పుచు లోన నొక భవనముచట్టును మిక్కిలి వింతలగు పుష్పజాతులు ఫలజాతులుంగలిగియున్నది. మనలోకములో రాజభవనమైనను నట్లుండదు. అచ్చట దప్పుచేసినవారిని దానిలో నుంతురట. ఎట్టి శిక్షయో చూడుము గోడమీద వ్రాసిన ప్రకటనను బట్టి యది కారాగృహమని తెలియబడినది.

వారు నన్నట్లు దానిలోబెట్టి కొందరు ద్వారమునందు గావలియుండి మరికొందరు పురందరుని కావర్తమానము తెలియబరుచుటకు బోయిరి. అట్టిసమయమున నేనేమియుందోచక యత్తోటలో గ్రుమ్మరుచుంటిని. అప్పువ్వులతోటలో నేను సంచరింపుచున్న సమయంబున నంతలో నంతరిక్షమునుండి యొకచిలుకవచ్చి నామ్రోల వ్రాలినది. దాని నుద్యానవనశుకమేయని యంతశ్రద్ధగా బరీక్షించితికాను. అదియు నన్ను విడువక నేనెచ్చటికిబోయిన నచ్చటికి వచ్చుచుండుటజూచి విమర్శింప దాని ముక్కున నెద్దియో పత్రికయున్నట్లు కనంబడినది. అప్పుడు దానిని పెంపుడుదానిగా గురుతుపట్టి పట్టుకొనబోయిన నదియు నేను జూచుచుండ దనముక్కున నొక్కి పట్టియున్న యుత్తరమును నామ్రోలవైచి కొంచెముదూరముగా నెగిరిపోయినది.

ఆయుత్తర మెద్దియోయని నేను బుచ్చుకొని విప్పినంత నది దేవభాషకాక మనుష్యలిపితోడనే యున్నది. దానింజదువగా నిట్లున్నది. ఆర్యా! నీవు వెళ్ళినది మొదలు నాకేమియు స్థిమితములేదు. ఇంద్రుడు బృహస్పతికిని నందునికిని వర్తమానము సేసెనని మున్ను నీకు జెప్పియుంటినికదా? వారిరువురును వచ్చినతరువాత నతండా యుత్తరము గురువుగారికి జూపించి యిది మనసభలో నుండుటకు గారణమేమియో యాలోచింపుమని యడిగెను. అతండును దానిం జదువుకొని యోహో! యిది భూలోకములోనున్న శ్రీజగన్నాధకాపురస్తుడగు రుచికుడను మాలికాకారునికి నొక వారకాంత తనకు గొన్ని పూవుదండలు కావలయునని వ్రాసినటులున్నది. ఈయుత్తర మిచ్చట నుండుట శంకనీయమేయని పలికెను. నింద్రుడు నందుని నిర్బంధించి యోరీ! మేము లేనప్పుడీసభ కెవ్వరైన వచ్చిరేమో యథార్ధము చెప్పుము లేకున్న నిజము తెలిసికొని నిన్ను శిక్షింతునని యుగ్రముగా బలుకగా వాడు రహస్యము నిలుపలేక వెఱచుచు స్వామీ! నన్ను రక్షింపుడు నిక్కము చెప్పెదను. నేను కొంచెము మయిమరచి యున్నప్పు డెవ్వరో గుప్తమార్గమున లోనికిబోయియుందురు. ఆ ద్వారము తెరవబడి యున్నది. కారణము తెలిసినదికాదు. మరియు దిలోత్తమ మొన్నను లోననుండి గుప్త మార్గమునవచ్చినది. ఇంతకన్న నాకేమియు దెలియదని చెప్పెను.

ఆ మాటలు వినినతోడనే యింద్రుడు మరియు వెఱగందుచు నోహో! యిది మిక్కిలి చిత్రముగానున్నది. తిలోత్తమ రక్కసునిచే జిక్కి యెక్కడికోపోయి యుండగా మనసభలో బ్రచ్ఛన్నమార్గమున నెట్లువచ్చినది. నీమాటయేమియు దార్కాణముగాలేదని పలుకుచు నందలి నిక్కు వమరయ నాకుసందేశముపంపెను నేను వెఱపుతో నాపురుహూతునొద్దకుంబోయితిని. అతండు నన్నుజూచి నందుడుజెప్పిన మాట లన్నియుంజెప్పి మొన్నను నీవు గుప్తమార్గమున సుధర్మనుండి వచ్చితివాయని యడిగెను. అయ్యో! మీరు నన్నట్లడుగుట కాశ్చర్యముగానున్నది. రక్కసునిచేజిక్కి మిక్కిలి యిక్కట్టుజెందియున్న నేనెట్లీ సభకువత్తును. వీనిమాట మీరెట్లు నమ్మితిరి. ఇదియేమియు నే నెఱుగనని చెప్పితిని.

పిమ్మట నావృత్రారి యాచార్యుని మొగమును జూచుచు నిది యేమి చిత్రము. నందునిమాటలు పాటింప దగినట్లు తోచవు. తాను బోవువరకు గుప్త ద్వారము తెరచియున్న దనుమాట యెంత నిక్కువమో విచారింపవలయును. ఈ యుత్తర మెట్లువచ్చినదని యడిగిన దిలోత్తమ వచ్చినట్లు చెప్పుచున్నవాడు తిలోత్తమకును నీయుత్తర మందున్న రుచికునికిని సంబంధమేమి. దీనికెద్దియో కారణముండ వచ్చును. గురువర్యా! ఇందలిసత్యము తెలియుట మనకు మిక్కి లి యావశ్యకమై యున్నది. ముందు నీవా రుచికుడను వాడిప్పు డెచ్చట నున్న వాడో చెప్పుము. వాని నిందు రప్పించిన నంతయును దెలియనగునని యడుగగా నతండు జ్యోతిష సిద్ధాంతశాస్త్రమునుబట్టి లగ్నమునుగట్టి చూచి నీవున్నచోటు నిక్కముగా జెప్పెను. తరువాత నిన్ను దీసికొనివచ్చునట్లు దేవదూతల కాజ్ఞయిచ్చెను. వారు నీకొరకు వెళ్ళినతరువాత బురుహూతుడు మరియు నందుని దర్కించి యడిగినవాడు అయ్యా! నామాట దబ్బర కాదు. తిలోత్తమ లోపలినుండి వచ్చినది. లోపలి కెప్పుడు వోయితివని యడుగగా నన్ను లోపలబెట్టి యరయక తలుపువైచితివని యెద్దియో గొడవ బెట్టినది ఇదియంతయు దాని నిర్బంధించి యడిగినం దేటబడును దీనినప్పుడు చూచినవా డొక్కడుగలడు వానిచేత సాక్ష్యమిప్పించెదనని చెప్పగా మంచిదని యొప్పుకొని యింద్రుడు వాని నప్పుడే రప్పించి యడుగగా వాడిట్లనియె దేవా! గుప్తద్వారము దాపున నందుడును దిలోత్తమయు నెద్దియో యేకాంతమాడుచుండ నేను జూచితిని. అప్పుడు మరియెవ్వరు నచ్చటలేరు. ఇరువురు మాటలాడుకొనుచుండ బోవుట తప్పని నేను దరికిబోక వేరొక మార్గంమునం బోయితిని. తరువాత నొకప్పుడు నందునితో నీవు మొన్నను తిలోత్తమతో నెద్దియో రహస్యముగ మాటాడుచుంటి వది యేమని యడిగితి.

అతడది వేరొక సంగతియని నా కుత్తరము జెప్పెను. ఇదియేనేనెఱుగునది యని యాసాక్షి చెప్పెను. అప్పుడింద్రుడు శిరఃకంపనముజేయుచు మంచిది నందా! మరియుం దర్కించినంగాని నీ మాటనమ్మము. మరియెవ్వరేని యప్పుడు చూచితిరేమో యీ పురమున నరసిరమ్ము . పొమ్మనిపలుకగా వాడు వగచుచు నప్పుడు పట్టణములోనికి బోయి కనంబడినవారినెల్ల నడుగుచు గొంతసేపటికి నలుగురు మగువల దీసికొని వచ్చి యింద్రు నెదురబెట్టి అయ్యా! మొదటవాడు నాకు స్నేహితుడని త్రోసివేసిరి. ఈ కాంతల నే నెన్నడు నెరుగను. వీరినడుగుడు. అని చెప్పగా విని యింద్రుడు నాసుందరుల మిరీనడుమ నెక్కడనేని యీయూరిలో దిలోత్తమంజూచితిరా యనియడుగగా నందు ముందుగా నిరువురు పడతు లతనికి మొక్కుచునిట్లనిరి.

దేవా! మేము నందనవనపాలికలము. దేవరవారిని రక్తాక్షుడు జెఱగొని పోయినప్పుడు మేమువెఱచి పొదరిండ్లలో దాగియుండగా దిలోత్తమ యొక చక్కనిపురుషునితో నీ వనములో విహరించినది. అప్పుడు మేము దగ్గరకుబోయి యితడెవ్వడని యడిగిన నవ్వుచు నొకపుణ్యపురుషుడని జెప్పి వానితోగూడ బట్టణములోనికి బోయినది. ఇది మాకన్ను లార జూచితిమని జెప్పిరి. వారిమాటలు సత్యములని యింద్రునికి దోచినవి. తక్కుంగల చక్కెరబొమ్మలును దిలోత్తమ యొకచక్కని పురుషునితో వీధింబడి పోవుచుండ గొన్ని దినముల క్రిందట మేము చూచితిమని చెప్పిరి.

అప్పుడు దేవేంద్రుడు మిక్కిలి కోపముతో నన్ను బిలిచి యేమే! తిలోత్తమా! నీవేమో యుత్తమురాల వనుకొంటిని. వీరి మాటలన్నియును వింటివా? దీనికి నీవేమి చెప్పెదవు? ఎద్దియో పన్నితివే? ఈ మర్మమంతయు నీయందున్నది. నిజము చెప్పుము. ఆ రుచికుడెవ్వడు? స్వర్గమున కెట్లు వచ్చెను అని నన్నడుగగా నేను సమ్మతింపక వారు చెప్పిన మాటలన్నియు నసత్యములనియు నవి యేమియు నేనెరుగననియు వారెవ్వరిని జూచి నేనని! భ్రమసిరో, నేను మొదట జెప్పినదే సత్య మనియు రూఢముగా బలికితిని. అంతట నింద్రుడు కన్నులెర్రజేసి నన్ను జూచుచు దిలోత్తమా! నీకున్న మర్యాదయంతయు బోగొట్టుకొనుచున్నదానవు. కానిమ్ము. ఆ రుచికునే యిచ్చటికి రప్పించి యడిగెద నప్పుడైనను నిక్కము తెలియకపోదని పలుకుచు మమ్ము నందరిని పొండని యానతిచ్చి యంతఃపురమునకు బోయెను, తరువాత జయంతుడీ వార్త యంతయు విని నాయొద్దకువచ్చి గ్రుచ్చి గ్రుచ్చి యడిగెను. కాని నే నేమియుజెప్పక మొదట జెప్పినదే సత్యమని పలికితిని. నీవు వెళ్ళిన తరువాత జరిగిన విశేషమిది. ఇటుపైన నాభారమంతయు నీమీద నున్నది. ఇక నన్ను ముంచినను యుద్ధరించినను నీవేకాని మఱియెవ్వరును లేరు. నీ జగన్నాథస్వామి యనుగ్రహమిప్పుడు కనబడవలయును. నామాటలేమియు నసత్యము గాకుండునట్లు చెప్పవలయు. శోకావేశముచే వ్రాసితిని తప్పులుండిన క్షమింపవేడెదను.

నీ ప్రియురాలు,

తిలోత్తమ.

అనియున్న యుత్తరమును పలుమారు చదువుచు దాని యధైర్యమును గురించి యెడదబొడమిన దుఃఖసముద్రము పైకి వెడలుచున్నదో యనునటుల జటెలముగా నయనములనుండి యశ్రుజలంబులుగార నాయుత్తరమును తడిపితిని.

ఆ చిలుకయు నెంత తెలివి గలదియో చూడుము. నేనాయుత్తరము చదివి నంతసేపును దూరముగానుండి ముగించినతోడనే నాదాపున వ్రాలి ప్రత్యుత్తరమిమ్మని యడిగినట్లు నటింప దొడంగినది. దాని యభిప్రాయమును గ్రహించి నేనాయుత్తరము మీదనే నీవిందులకు జింతింపకుము. మనపాల జగన్నాథస్వామి గలడు. నీ కెంత మాత్రము నవమానము రానీయను. నీయుత్తరముచూచి మిక్కిలి పరితపించుచున్న వాడ. నిది త్రికరణపూర్వకముగా జెప్పినమాట నమ్ముము సంతోషముగా నుండుము. ఇంతకన్న వ్రాయుట కవకాశము లేదని యొక ఫలరసముతో వ్రాసిమడచి యాయుత్తర మాచిలుక ముక్కున కందిచ్చితిని. అప్పతంగ మప్పత్రిక మప్పినట్ల ముక్కునం గరచుకొని రివ్వున నెగిరిపోయినది. ఇంతలో దేవదూతలువచ్చి యింద్రుడిప్పుడు సభ జేసియున్నవాడు. మనమచ్చటికి బోవలయులెమ్మని పలుకుచు నాక్షణము నన్ను దేవసభలోనికి దీసికొనిపోయిరి.

అప్పుడు దేవేంద్రునిం జూచి నేను సాష్టాంగనమస్కారము చేయుచు సభ్యుల కందరకు మ్రొక్కి మోడ్పుచేతులతో నెదుర నిలువబడితిని. ఆయన ప్రక్కను బృహ స్పతిగారు కూర్చుండిరి. నన్ను జూచి యాసభ్యులందరు నాశ్చర్యపడుచున్నట్లు వారి మొగములం జూడ నాకు దోచినది. తరువాత దేవగురుండు దేవేంద్రుని యనుమతి నా కిట్లనియె. నీవెవ్వడవు? నీ పేరేమి? నీ కాపుర మెచ్చట? నీ వెప్పుడైన నింతకు బూర్వ మీ స్వర్గమునకు వచ్చితివా? యని యడుగగా నేనిట్లంటి. అయ్యా! నా పేరు రుచికుడు. నా కాపురము శ్రీజగన్నాథము. స్వామి భక్తుడైన బలదేవుని కుమారుండ. నేను మిక్కిలి పుణ్యాత్ముడను. నాకీ స్వర్గదర్శనంబు తొలుత స్వామిదయవలన లభించినది ఇప్పుడు మీదయవలన లభించినది. నన్నిచ్చటికి రప్పించిన కారణమేమియో యానతీయుడని వినయముగా బ్రార్థించితిని.

నా మాటనకు వెఱగందుచు బృహస్పతి వెండియు నిట్లనియె. రుచికా! నీవు మొదట స్వర్గమునకు నెట్లు వచ్చితివి ఎచ్చ టెచ్చట గ్రుమ్మరితివి ఇందెవ్వరిని గంటివి. నిక్కము వక్కాణింపుము. నీకు బారితోషికం బిప్పింతునని పలుకగా నే నిట్లంటి అయ్యా! నా వృత్తాంతమంతయుం జెప్పెదవినుండు. అసత్యమాడ నా కేమియు నవసరములేదు. మాతండ్రి బలదేవుడు. శ్రీజగన్నాథంబున వసియించి పూవుదండలు గట్టి స్వామి కర్పింపుచు సర్వదా యతని ధ్యానించుచు బరమభక్తుడై కాలము గడుపుచుండెను. మాతల్లి పుత్రలేమిం జేసి యొకనాడు తన్ను బుత్రులకై మిక్కిలి వేధించిన స్వామినారాధించి యాయవసరంబున నన్నుగనియె నన్ను మిక్కిలి గారాముగా బెనుచుచుండగా నేను గ్రమంబున బదియారేడుల ప్రాయముగలవాడనైతిని. అప్పుడు మాతండ్రి నాకు బెండ్లి చేయవలయునని ప్రయత్నము చేయుచుండెను. అంతకుపూర్వ మొకనాడు పురాణము చెప్పుచుండ స్వర్గవిశేషములన్నియు విని యున్నవాడ గావున నేను దేవకన్యకలను గాని మానవకన్యకలను బెండ్లియాడునని మా తండ్రితో జెప్పితిని.

అతండు నన్ను మందలింపుచు నోహో! నీ మాటలు మిగుల జిత్రములుగా నున్నవే మానవులకు మానవుడుగాక దేవతలెట్లు లభ్యమగుదురు. స్వర్గము లోకాంతరమే! మనకు బోవుటకైన శక్యముకాదు. నీ వెరుగక యిట్టిమాట పలుకు చున్నవాడవు. నీకు మనుష్యకాంతలలో జక్కనిదాని నరసి పెండ్లిజేసెద బెండ్లి యాడుమని యెంతయో బోధించెను. నేను మాతండ్రి మాటలకు సమ్మతింపక నాయనా! నీవేమి చెప్పినను సరిపడదు. మనుష్యకాంతలలో శాస్త్రసిద్ధమైన సౌందర్యము గలవారే లేరు. ఉండినను విద్య యుండదు. అదియు గలిగినను శీలము సున్న. ఇన్నియుం గలిగినను నస్థిర యౌవనలుగదా? దేవకన్యల కీదుర్గుణము లేవియుం గలిగియుండవు. పెండ్లియాడిన వేల్పు చేదియనే బెండ్లియాడవలయు లేకున్న బ్రహ్మచారిగా నుండ వలయుగాని యీ మానవనీచజాతి పొలతులం గైకొనుటకంటె హైన్యమున్నదా (ఏకానారీసుందరీనా దరీనా) ఉండిన మంచిసుందరియగు భార్యగలుగవలయు లేనిచో నడవులలో గుహలోనుండుట శ్రేయము. నావివాహ విషయమై నీవేమియు బ్రయత్నింప వద్దు నీసుద్దులేమియు నేను వినువాడను గానని నిస్సంశయముగా బలికితిని.

పిమ్మట మాతండ్రి తాను జెప్పియు నొకరిచేత జెప్పించియు నెన్నియో ప్రయత్నములు సేసెనుగాని నాయుద్యమము మాన్పింప లేకపోయెను. లోకములో బుత్రులంగాంచుట వంశము నిలుచుటకు గదా! వీడు వివాహమాడనినాడు మదీయ వంశాంతమగు నేనేమి చేయుదు. వీ డెవ్వరు చెప్పినను వినకున్నవాడని పెక్కుగతుల జింతించుచు నొక్కనా డంతఃకరణంబున దన యిష్టదైవమగు జగన్నాథస్వామిని ధ్యానించి నిద్రవోయెను. భక్తపరాయణుడగు నారాయణుండతని స్వప్నములో సాక్షాత్కరించి బలదేవా! నీవు చింతింపకుము, నీకుమారుని యభీష్టమును దీర్చెదను. రామచంద్రనగరములో దిలోత్తమయంశంబున దిలోత్తమయను రాజపుత్రిక పెరుగుచున్నది. దానిం బెండ్లి జేయుము తన్మూలముగా నతండు స్వర్గసౌఖ్యమనుభవింపగలడు. నీవు కోరినంత నీపుత్రున కా ధాత్రీపతి తనపుత్రికనిచ్చి వివాహము గావించును. నీ వంశము మిగుల ఖ్యాతికి రాగలదని బోధించి యంతర్ధానము నొందెను.

మా తండ్రియు నిద్రమేల్కొని మేల్కలగనినందులకు సంతసించుచు నన్ను జేరి తనస్వప్నవృత్తాంత మంతయుం జెప్పెను. స్వప్న మందైన నసత్యమాడని మాతండ్రి మాట నేన నమ్మి యుత్సాహముతో నత్తిలోత్తమం బెండ్లియాడుటకు సమ్మతించితిని. వెంటనే యతడా రాజునొద్దకు బోయి ప్రార్ధించిన సమ్మతించి శీఘ్రకాలములో నాకన్యకనిచ్చి వివాహము చేసెను. ఆ కాంతయు సాముద్రిక శాస్త్రలక్షణంబుల నేకొరంతయులేక నాయభీష్ట ప్రకారము చక్కదనము గలిగియున్నది. కావున నేను మిక్కిలి సంతసింపుచు జగన్నాథస్వామిని బెక్కుగతుల వినుతింపుచు నాయింతితో గొన్ని దినము లిప్టోపభోగముల గాలముగడిపితిని.

అంత నొక్కనాడు నేను స్వర్లోకదిదృక్షా కౌతుకంబుమనంబున దీపింప మాతండ్రితో నిట్లంటి. తండ్రీ! నీవు నాతో మొదట స్వర్గసౌఖ్యములు నీకు ముందు గలుగును. తిలోత్తమం బెండ్లియాడుము. ఈరీతి స్వామి యానతిచ్చెనని నాకు బెండ్లి చేసితివి. స్వామిమాట యసత్యమైనట్లు తోచుచున్నది. స్వర్గవిశేషములు నాకిప్పటి కేమియుం దెలియలేదు. ఇక నేను భార్యనువిడిచి సన్యాసినై తిరిగెదను. వలదని మొదటనే చెప్పితిని. నన్ను మరపించి పరిణయము సేసితివి. నేను జెప్పలేదనుకొనవద్దు. ఇప్పుడే లేచిపోవుచున్నవాడనని బాల్యచాపల్యంబున బలికితిని.

పుత్రవత్సలుండైన బలదేవుడు నామాటలువిని విచారింపుచు నాయనా! నీవు తొందరపడకుము. భగవద్వచనమెప్పుడును దబ్బరకాదు. మరికొన్ని దినములు నిరీక్షింపుము. నీవిషయమై మరల స్వామి నారాధించి తెలిసికొనియెదనని నాకు బోధించి యారాత్రి చక్రపాణి నాత్మసన్నిధానము గల్పించుకొని నాయందలి ప్రేమాతిరేకం బునం జేసి పలుదెరంగుల ధ్యానించి నార్తరక్షాదక్షుండగు నాపుండరీకాక్షుండు మరల స్వప్నములో గనంబడి తరువాత నాచరించవలసిన కృత్యము లన్నియు బోధించి యంతిర్హితుండయ్యెను.

మరునాడు లేచి మజ్జనకుడు మురియుచు నాదరికివచ్చి వత్సా! నీయభీష్టము స్వల్పకాలములో నెరవేరును. కొన్నిదినములలో రక్తాక్షుండను రాక్షసుండు స్వర్గమును ముట్టడించి సహస్రాక్షు నక్షీణబలంబునబట్టి చెరగొనిపోవును. అప్పుడు స్వామి గుడి వెనుక కొక విమానమువచ్చునట. నీవు నీభార్యతో దానిమీద నెక్కిన స్వర్గమునకు బోగలవు. దానంజేసి అచ్చటివిశేషములన్నియుం జూడగలుగునట. ఈలాగున రాత్రి నాకు స్వప్నంబున హరి యానతిచ్చెను. కావున నీవు సంతోషముగా నుండుమని నాకు బోధించెను.

నేను నట్టి అవసరమువేచియుండ అతడు చెప్పిన సమయమునకు నాగుడి యొద్దకు విమానము వచ్చినది నేను దిలోత్తమతో గూడ నద్దేవయాన మెక్కితిని. అదియు దృటికాలములో స్వర్గమునకు దీసికొనిపోయినది. మాతండ్రి చెప్పిన ప్రకారము మేము మొదట నందనవనములో గొంత సేపు గ్రీడించితిమి. అప్పుడెవ్వరో కొందరు కాంతలువచ్చి తిలోత్తమా! యీతండెవ్వడేయని నా భార్య నడిగిరి అదియు నవ్వుచు నీతడొక పుణ్యపురుషుడని యుత్తరము చెప్పి నా మొగముజూడ నేను దానితో వాల్గంటీ! నీవు తిలోత్తమ యంశంబున బుట్టితివి. నీకును దానికిని నామరూపంబుల నించుకయు భేదము లేదని దోచుచున్నయది నిన్నా తిలోత్తమవే యనుకొని యిట్లడిగిరి. కానిమ్ము దీన నీకు గొరతయేమి? సంశయింపక నీవును తగినట్లుత్తరము చెప్పితివి. భళిభళి! యని పలుకుచు గొంతసేపా చిలుకలకొలికితో నవ్వనములో విహరించితిని.

మేమీయూర జూడవలసిన విశేషములన్నియు భగవద్వచన ప్రకారము మా తండ్రి నాకు బోధించియున్న వాడు కావున తరువాత అత్తోటలోనుండి పట్టణములోనికి వచ్చితిమి. అప్పుడు పట్టణమంతయు జనశూన్యముగా నున్నది. నిరాటంకముగా నలుమూలలు గ్రుమ్మరి మాతండ్రి చెప్పినరీతి అతిప్రయత్నముతో వెదకి సుధర్మయొక్క గుప్తద్వారము గనుగొని అక్కీలుద్రిప్పిన దలుపువచ్చినది. అప్పుడచ్చట నెవ్వరును లేరు. మే మామార్గమున లోనికిబోయి అచ్చటి విశేషములన్నియుం జూచి మరల నా దారినే బైటికి వచ్చితిమి.

నా వెనుకవచ్చుచున్న తిలోత్తమను ద్వారములో నెవ్వడో నిలిపి యీ యూరనున్న తిలోత్తమే అసుకొని యెట్లు లోపలను బోయితివని యడిగెనట. అదియు వానికి దగినట్లె యుత్తరము చెప్పి నాయొద్దకు వచ్చినది. పిమ్మట మేమిరువురము కొంత సేపు స్వర్గములో విహరించి అటు పైన మరల నా విమానమెక్కి భూలోకమునకు బోయి యందు మా అత్తవారియింటియొద్ద గొన్ని దినంబులుంటిని. అంత నొక్కనాడుదయంబునలేచి చూచువరకు దేవదూతలు నన్ను బట్టుకొని తీసికొనిపోవుచుండిరి. మీరెవ్వరు నన్నెచ్చటికి దీసికొనిపోవు చుంటిరని అడుగగా మేము దేవదూతలమనియు నింద్రునియానతి స్వర్గమునకు దీసికొని వెళ్ళు చున్నారమనియుం జెప్పి క్రమంబున నన్నిచ్చటికి దీసికొని వచ్చిరి.

ఇదియే నా వృత్తాంతము నేను వెనుకజూచిన సభ యిదియే. నా పూర్వపుణ్యమువలన రెండవసారి జూచుట లభించినది. అప్పుడు దేవరవారి దర్శనము కాలేదు. అంతకన్న విశేష మిప్పుడు గలిగినది. నేను గృతార్థుడ న న్నెల్లకాల మిచ్చట నుండులాగున అనుగ్రహింపుడని అనేకవిధముల బ్రార్థించితిని. నామాటలన్నియు విని ఇంద్రుడు వెఱగుపడుచు బృహస్పతి మొగము జూచి గురువర్యా! వీరి చరిత్రమును వింటివా? మిగుల విచిత్రముగా నున్నదే? ఇది అంతయు నిక్కమే యగునా? పరిశీలించి వక్కాణింపుడనుటయు నాయాచార్యుండు నవ్వుచు దేవేంద్రా! వీడెంతవాడు కాకున్న రెండుసార్లు స్వర్గమున కెట్లు వచ్చును. జగన్నాథస్వామికి వీని తండ్రి భక్తుడగును. వీని పూర్వపుణ్యము మంచిది. ఈ యుత్తరము వీనిదే. ఇచ్చట మరచిపోయిన వాడు కాబోలు. వీనినిక భూలోకమున కనుపుమని పలికెను.

అప్పుడు దేవేంద్రుడు గురుని మాట మన్నించి యోహో! హరిదయాపాత్రుడైన వీనికి మనము సత్కారములు సేయవలయును. లేకున్న నాయనకు గోపము వచ్చుచు తన భక్తుల నవమానపరుచుటకు యతడు సహింపడు. అతం డలిగెనేని మన యైశ్వర్యమంతయు దృటిలో నశించును. పాపము తిలోత్తమపై నిష్కారణము నింద మోపితిమి ఆసతి చెప్పిన దంతయును సత్యమే. నందుని దూషింపరాదు. కావున నిప్పటి కెవ్వరు నపరాధులు కారు అని పలుకుచు నా మొగముపై దృష్టి బరగించి యిట్లనియె.

రుచికా! నీవు మిక్కిలి పుణ్యాత్ముడవు. మరియు మాకును బ్రభువైన హరిభక్తుడగువాని కుమారుడవు. నిన్ను గౌరవము చేసే యిందుండి పంపవలయును. కావున నీ యభీష్టమైన కార్యమొక్కటి దెలుపుము. దానినిచ్చి నీ వలసిన చోటున కంపెదమని పలుకగా నేనిట్లంటి. దేవా !

సీ. ముజ్జగంబులనెల్ల ముదమొప్పనేలునా
               హరి కగ్రజన్ము నిందరయగంటి
    బుద్దికి నుపమానభూతుడౌ సురపురో
               హితునితో నేడు భాషింపగంటి

    అతిశయసత్ప్రభావాఢ్యులై మించు ది
              క్పతుల సాన్నిధ్యంబు బడయగంటి
    బహుజన్మకృతపుణ్యపరిపాకమునగాని
              గనలేని స్వర్గంబు గాంచగంటి

గీ. అందమున కెన్నగా బరమావధియన
    బరగు నచ్చరజాతి వైభవమునెల్ల
    జూచి యానందమును గంటి జోద్యముగను
    శ్రీజగన్నాథుసత్కృపాదృష్టివలన.

త్రిలోకాధినాథులైన మీ దర్శనము దొరికినది. ఇంతకన్న నాకు మించిన యభీష్టమేమి కలదు. అయినను గోరికొనియెదను. మీ లోకములో నేను జూచిన వస్తువులలోనెల్ల సంగీతవృక్షము మనోహరముగా గనంబడినది. దాని భూలోకములో వ్యాపకము చేయవలయునని యుత్సాహముగా నున్నది. ఇదియే నా కోరిక. మరియు నా భార్య తిలోత్తమవలె నుండెనని స్వామి యానతిచ్చెను గదా ? ఆ నిదర్శనము చూచుటకై తిలోత్తమ నొకసారి యిచ్చటికి రప్పింపుడు. చూచి సంతసించెదను. ఇంతకన్న నాకేమియు నక్కరలేదు. మీదయయుండినం జాలునని పలుకగా దేవేంద్రుడు మరల నా కిట్లనియె.

రుచికా! నీవు కోరినది యసాధ్యమైనదియే యైనను నీకిచ్చెదనని పలికితిని కావున మరియొకలాగున జేయుట తగదు. నీ వా విత్తనమును భూలోకములో నీకిష్టమైనచోట నాటుము. అది వృక్షముగా బెరిగి మనోహరముగా బాడుచుండును. పుణ్యాత్ములు కానివారికి దాని గానమేమియు వినంబడదు. వారి కది కంటకతరువులాగున దోచుచుండును. పెద్దకాలము పుడమిలో నీ పేరున నొప్పుచుండును. పుడమిలో బుణ్యపాపవిచక్షణ దాని మూలమున దెలియబడునని పలుకుచు నప్పుడే యా విత్తనము తెప్పించి నా చేతికిచ్చి దోహద ప్రకారమంతయుం జెప్పెను.

మరియు దిలోత్తమ మాట జ్ఞాపకము జేయగా నచ్చటికి రప్పించి తిలోత్తమా! నిన్ను నిష్కారణము దూరితిని. నీ మాటలలో నసత్యమింతయును లేదు. నందుడు చెప్పినది సైతమును సత్యమైనదే! ఈ రుచికుడు మనము లేనప్పుడు భార్యతో గూడ నీ లోకమునకు వచ్చి క్రీడించెనట. వీని భార్య పేరు తిలోత్తమయట. రూపమున నీకును దానికి నించుకయు భేదము లేదట. దానిని జూచి యిచ్చటివారలు నీవేయని భ్రమసిరి. ఈ రహస్యమంతయు నీ రుచికునివలన దెలిసినది. నీవు చింతింపకుము. నిన్ను జూడవలయునని యీతడు కోరిన రప్పించితినని పలుకుచు నింద్రు డిదియే యిచ్చటి తిలోత్తమ యని నాకు జూపెను.

నేనును సానురాగముగా జూచితిని. అదియును బ్రేమాతిశయమును దెలిపెడు చూపులు నాపై బరగింపుచు ఆర్యా! నీకు నమస్కారము. నన్ను రక్షించి నానింద బాపితిరి. నీ యుపకారమునకు బ్రతి యెన్నడును జేయలేను. సంతతము నీ స్మరణ జేసికొనుచుందును. నన్ననుగ్రహింపుమని యెల్లరు విన దేవసభలో నన్ను గొనియాడినది.

నేను దానిమాటలు విని మిక్కిలివిస్మయము నొందితిని. అని చెప్పి ఆహా! స్త్రీ లెట్టి మాయవారో చూచితివా యని పరిహాసము సేయగా జంద్రలేఖ నవ్వుచు ఔను. నీ వీ మాటాడినందులకు నాకు మిక్కిలి వింతగా నున్నది. త్రిలోకప్రభువైన దేవేంద్రునిసభలో బుద్ధిమంతులకెల్ల నుపమానభూతుడగు బృహస్పతి వినుచుండ నసత్య మాడి నమ్మించిన సాహసుడవు. తిలోత్తమచేసిన సాహసమునకు వెఱగుపడుచుంటివి? యెంతకైన సాహసులు మగవారు గాని యాడువారా? ఆ తారతమ్య మానక విచారింపవచ్చు దరువాయికథ జెప్పమని యడుగగా రుచికు డిట్లనియె.

చంద్రలేఖా! వినుము నన్నట్లు స్తుతియించిన తిలోత్తమం జూచి నేను స్తుతిసహింపమి సూచింపుచు నన్ను నీ వింతగా బొగడుటకు నీకు నేనేమి యుపకృతి జేసితిని. జరిగిన యథార్ధము జెప్పితిని కదా! దీన నీ సౌజన్యము దేటయగుచున్నది. నీకును నాభార్యకు నింతయును భేదము లేదు. నీనామరూపంబుల సామ్యతను బట్టి నీకును మాకును బాంధవ్యము గలిగియున్నది. దివ్యదర్శన మెవ్వారికి ముదము గలుగ జేయదు? అని మరియుం బెక్కుగతుల మరల నుతియించితిని. ఇంతతో దేవేంద్రుడు నన్ను జూచి రుచికా! ఇక నీవు పోవలసిన తావు దెలుపుము. దేవదూతనిచ్చి పంపెదను. తిలోత్తమా! నీ విక నివాసమునకు బొమ్మని పలికిన నత్తిలోత్తమ యెట్టకేల కాప్రదేశమునుండి కదలి నడుమనడుమ నెద్దియోమిషమీద నన్ను జూచుచు ప్రాణంబులన్నియు నీమీద నుంచి పోవుచున్నదాననని సంజ్ఞజేసి యింటికి బోయినది.

నేనును నాలోచించి దేవా! భూలోకములో నాకు బ్రాణమిత్రుడు గౌతము డనువాడు గలడు. వా డిప్పు డెచ్చటనుండునో నన్నచ్చట విడిచివచ్చునట్లు మీదూతల కాజ్ఞ యీయవలయునని కోరితిని. ఇంద్రుడాతని యునికి బృహస్పతిని బ్రశ్నపూర్వకముగా నడిగి తెలుసుకొని తనదూతలతో జెప్పినంత వారు నన్ను గన్నులు మూసికొమ్మని తృటిలో భూమిలోనున్న ఢిల్లీనగరంబునకుం దీసికొనివచ్చి యొకయింటి ముంగల విడిచిపోయిరి. నేనును గన్నులు తెరచి చూచువరకు నాయింటిలోనుండి నామిత్రుండు గౌతముడు వెలుపలకు వచ్చెను. వానింజూచి నేను గురుతు పట్టితిని. నన్ను వా డానవాలుపట్టలేక విభ్రమముగా జూచుచుండ నేను వానిం గౌగలించుకొని పేరు చెప్పితిని.

వాడును కన్నుల నానందబాష్పములుగార నన్ను బెద్దతడవు గాఢాలింగనము చేసికొనియెను. ఇట్లు కొంతసేపు మేమిరువురము నన్యోన్యదర్శనసంజాతకౌతూహలంబున మేనులు మరిచి కంఠంబులు డగ్గుతికవార నెట్టకేలకు సన్ననియెలుంగున గుశలప్రశ్నములు వేసికొంటిమి. మేము విడిచిపోయినది మొదలు నాటివరకు జరిగిన కథలన్నియు నొండొరులకు చెప్పుకొని యప్పుడే యచ్చటనుండి బయలువెడలి మా దేశమునకు బోవుచు నీయూరు జేరితిమి. తరువాతకథ నీమె యెరిగినదేకదా? ఇదియే నావృత్తాంతము దైవకృత్యమువలన ప్రాణతుల్యులైన మిమ్ము నందర నిచ్చటం గంటి నని పలుకగా విని యందరు నాశ్చర్యపారావారవీచికలం దేలుచు రుచికుని యదృష్టమును వేతెఱగుల బొగడదొడంగిరి.

అప్పుడు చంద్రలేఖయు వానిం జూచి ఆర్యా! చెఱకుదినిన నోటికి బెండు రుచింపనటుల దేవకాంతారతిసౌఖ్యంబు లనుభవించిన నీకు మాయందేమి మక్కువ యుండును? నీకొరకు మేమూరక పెక్కిడుములం గుడిచితిమి. ఆ తిలోత్తమ నిచ్చట నుండనీయదు. ఎప్పుడో మరల స్వర్గమునకు దీసికొనిపోవునని తోచుచున్నది. నీయభిప్రాయ మెట్లుండెను జెప్పుమని యడుగుటయు దానిం రుచికుం డోదార్చుచు నిట్లనియె.

బోటీ! నీవెప్పుడు నట్లు తలంపకుము. మీరు రూపంబున దేవకాంతలను మించినవారు. మనుష్యులకు మానవకాంతలు భార్యలైన యుక్తముగా నుండును. తిలోత్తమ నన్నెప్పుడు స్వర్గమునకు దీసికొనిపోవదు. ఆచర్య గతించిపోయినది. స్వర్గమునకు పోవుట సామాన్య మనుకొంటివా యేమి? అప్పుడు యుద్ధసమయముగనుక నిరాటంకముగా దిరిగితిమి. కాని యితరసమయములయందు. నింద్రుని యనుమతిలేక గాలియైనం గదలటకు వీలులేదు. ఇక మిమ్ముల విడువనని ప్రమాణము చేయుచున్నవాడ. మీరు నాకై పడినబాధలం దలచుకొనిన మిగుల దుఃఖమగుచున్నది అని పలుకుచు వారి నిరువురను వేరువేర నక్కున జేర్చుకొని మన్నించుచు వారుపొందిన దుఃఖమును పోగొట్టెను. తరువాత విజ్ఞానయోగిగానున్న తనతండ్రి నచ్చటికి రప్పించుకొని యతనికి దనవృత్తాంతమంతయుంజెప్పి యింతింతనరాని యానందము గలుగజేసెను. పిమ్మట జంద్రలేఖయు రుక్మాంగదునికి నతనివృత్తాంతము దెలుపుచు నతండాశ్చర్య బడుచుండ దాను ధరించెడు దుస్తులు చూపించి నమ్మకము కలుగజేసినది.

రుక్మాంగదును వారినందరిని తనదేశములో నుండుమని యెంతయో బ్రతిమాలికొనియెను కాని రుచికుండు తండ్రియాజ్ఞవలన దనజన్మభూమియగు జగన్నాథముననే యుండుటకు నిశ్చయించుకొనెను అంత రుక్మాంగదుడు వారికందరికి దగు బహుమతులుజేసి చంద్రలేఖకు బుత్రికకుంబోలె కొన్ని గ్రామంబు లరణముగా నిచ్చి మచ్చికతో నప్పుడప్పు డచ్చటికి వచ్చున ట్లొడబరచి యనురాగపూర్వకముగా బంపెను. చంద్ర లేఖను దిలోత్తమను గాంధర్వవివాహంబున భార్యలగా స్వీకరించి రుచికుండు తొలుత నోడనెక్కి వారందరితో రామచంద్రపురనగరమునకు పోయి పుత్రికావియోగచింతాకులస్వాంతుడగు శూరసేనమహారాజునకు దమరాకంజెప్పి ముప్పురిగొను సంతోషముతో గొన్నిదినము లందుండెను. అందు పూవుబోడి చంద్రలేఖం గలసికొని మిగుల నాదరించినది.

శూరసేనుడు పుత్రహీనుడు కావున దనరాజ్యమునకు రుచికునే యధీశ్వరునిగా జేసి పట్టముగట్టెను. రుచికుండు తనకు రాజ్యమువచ్చిన తక్షణము గౌతమునికి మంత్రిత్వాధికారమిచ్చి యతనికిగూడ యొక చక్కనికన్యం బెండ్లిజేయించెను రుచికుడు స్వర్గమునుండి తెచ్చిన సంగీతవృక్షబీజమును శ్రీజగన్నాథములో స్వామిగుడి యావరణలో బాతింపవలయునని యుత్సాహము గలిగి యొకనాడు యిరువురుభార్యలు గౌతముడు సేవింప జతురంగబలముతో వెడలి జగన్నాధమునకు బోవుచు నొకనాటిరాత్రి నిన్న నీవు చూచినచోట బసజేసిరి.

మరునాడు బయలువెడల సమయములో గానవృక్షబీజము మిక్కిలి సూక్ష్మమైనది గనుక పెట్టెలో సవరించబోయిన చేయిజారి నేల బడినది. తరువాత దానికొరకు నెన్నియో ప్రయత్నములు చేసి వెదకిరిగాని కనంబడినదికాదు. బుద్ధిమంతుడయిన రుచికు డప్పు డాభూమి యంతయు నీరుచల్లించి దానికిజేయవలసిన దోహదము జేయించెను. అప్పుడది మొలకెత్తి క్రమముగా బెరిగి వృక్షమయినది. రుచికు డక్కడనే మంచిసౌధములుగట్టించి సంవత్సరమున కారుమాసము లిరువురుభార్యలతో వచ్చి యచ్చట నివసించి క్రీడించువాడు అతడు పెద్దకాలము పుడమి పాలించెను.

గోపా! నీకు వినంబడినగాన మాసంగీతవృక్షమువలనం జనించినది. నీవు మిగులపుణ్యాత్ముడవు కావున నీకా గీతము వినంబడినది. యొరుల కాపాట యేమాత్రము వినబడదు. అత్తరు వితరులకు జూడ గంటకద్రుమమువలె దోచును. ఆవృక్షము నాటి నేటికి పెక్కు సంవత్సరములయినది. దానివృత్తాంత మెఱింగినవా రెవ్వరు నిప్పుడు లేరు. మణిమహిమచే నాకు దెలినయ్యె నీకథయు బుణ్యప్రదమయినదే. వినినవారికి నభీష్టసిద్ధియగు ఇప్పుడు నీసంశయము తీరినదా? యని జెప్పిన విని యాగోపకుమారుడు సంతసించుచు నయ్యా! మీయక్కటికము నాయందు బరిపూర్ణముగా నుండినప్పుడు నన్ను దురితములంటునా! ఈకథ నాకు మిగల సంతోషము గలుగజేసినదని పలికెను. పిమ్మట భుజించి గొంత విశ్రమించి గోపాలుండు గావడి యెత్తుకొని దోడరా నచ్చట గదలి క్రమంబున నగ్గురుశిష్యులు దరువాయి మజిలీ జేరిరి.