కాశీమజిలీకథలు/రెండవ భాగము/15వ మజిలీ
కాశీమజిలీ కథలు
రెండవ భాగము
15వ మజిలీ
సంగీతవృక్షముకథ
పదియేనవమజిలీ స్థలమునకు ముందరి గ్రామము మిక్కిలి దూరముగా నుండుటచే నయ్యతీంద్రుడు అందున్న సత్రమునందు బసజేసి వంట జేయుటకు ముందుగా స్నానముజేసి జపము చేసికొనుచున్న సమయంబున వింతలుజూచుటకై యాప్రాంతమునకు బోయిన శౌనకుడు వడిగా జనుదెంచి తానుజూచివచ్చిన విశేషమును దెలుపుటకై యాయన మౌనముద్రను విడగొట్టి యంజలిపట్టి యిట్లనియె.
స్వామీ! మీ జపమున కంతరాయము గలుగ జేసినందులకు క్షమింపుడు. నేను జూచిన విశేషము వినిన తరువాత మీరు నామీద గోపము చేయరు. మీరు జపము జేయుచున్న వారు గదా యూఱక యిచ్చట గూర్చుండనేల. నీప్రాంతవిశేషములు జూచి వచ్చెదంగాక అని నేను యిటునటు దిరుగచుండగా గనుచూపు మేరలో నొక దట్టమైన వృక్షముల గుంపు గనంబడినది. పర్వతము లాగున నొప్పుచున్న యత్తోట ఏపాటి మేటిదియో యని దాని దాపునకు బోయితిని. అందు బెక్కు వృక్షవిశేషములు గలవు. దేనినైన దినుటకు ఫలము లుండునేమోయని పరిశీలింపుచున్నంతలో నా చెవులకు నద్భుతమైన గానధ్వని యొకటి వినఁబడినది.
దానికి వెరగుపడుచు నలుమూలలు పరికించి యాపాటవీతెంచిన తెరవరయలేక విభ్రాంతి నొందితిని. అంతలో మరల నాగీతి వేఱొకరీతిని వినవచ్చినది. అచ్చట జనులెవ్వరును లేరు. ఇండ్లులేవు. ఇట్టిగానస్వాన మెచ్చటనుండి వచ్చినదో యని పెక్కుగతుల దలపోయుచు నొకవేళ దేవతలు విమానము లెక్కి గ్రుమ్మరునప్పుడు గానము పాడుకొనుచుండుట గలదు. కావున నదియేమో యని యాకాశమంతయు బరిశీలించితిని. ఎచ్చటను నెవ్వరిజాడయుం గనంబడలేదు. ఇదియునుంగాక మిక్కిలి దాపుగా నున్నట్లు వినంబడినది. అచెట్ల పైన నెవ్వరైన నుండిరేమోయని వాని కొమ్మల బరిశీలించి చూచితిని. కాని యందు నెవ్వరును లేరు. అంతలో మరల నొకవిధముగా వినబడినది. ఆహా? ఆ సంగీతము మనుష్యలోకసంబంధమైనది కాదని రూఢిగా జెప్ప గలను. ఆ వృక్షములపైన బ్రచ్చన్నముగా నుండి దివిజులు పాడుచున్నారని యూహించితిని. నిముషమున కొకరీతిగా నాగీతము వినంబడును. నేను బెద్దతడవందు నిలబడి వింటిని. ఎంతసేపున్నను నచ్చటనే వినబడినది. ఆ గానము వినుటచే మనస్సంతయు నీరైపోయినది. మనము కొన్నిదినము లిందుండి యా గానము వినుచు సంతోషముగా గాలక్షేపము చేసికొందము అయ్యా! ముందుగా నావృత్తాంతమెట్టిదో చెప్పుడు. తరువాత జపము చేసికొనవచ్చును. దానివిధము వినినదాక తోచుటలేదు. అని మిక్కిలి వినయపూర్వకముగా బ్రార్ధించెను.
జపవిఘ్నము చేసినందులకు మొదట వానిపై నెంతేని గోపము వచ్చినది కాని వాని దీనాలాపములచే దుదకదియంతయుం బోయి మణిసిద్ధుడు పక్కున నవ్వుచు నోరీ! నీతో మిగుల జిక్కుగానున్నది. సమయము తెలిసికొనక యడుగుచుందువు. ఏమి మించిపోయినది. మరికొంతసేపుండి అడుగరాదా! యెన్ని సారులు చెప్పినను నీ తొందర విడువవు. నే నెచ్చటికేనిం బోయెదనా! భోజనమైన వెనుక సావధానముగా గూర్చుండి చెప్పుకొనిన జక్కగా నుండునుగద కానిమ్ము ఇక ముందెన్నడు నిట్లు జపవిఘ్నము చేయకుమని పలుకుచు నమ్మణివిశేషముచేత దద్వృత్తాంతమంతయు గరతలామలకము భంగి దెలిసికొని సంతసించుచు వానికా వృత్తాంతమిట్లని చెప్పం దొడంగెను.
రుచికుని కథ
తొల్లి జగన్నాథంబున బలదేవుండను మాలికుడు గలడు అతడు నిత్యము రమ్యముగా బుష్పమాలికలగట్టి యమ్ముకొనుచు జీవనము చేయుచుండెను. బలదేవుడు ప్రతిదినము రెండు పూటల యందు దప్పక జగన్నాధస్వామి యాలయమునకు బోయి మంచి మంచి దండలర్పించి స్వామి నర్చించి యింటికి వచ్చుచుండును. దానం జేసి వానికి హరిదాసని నామాంతరము గలిగియున్నది దైవమునందు వానికిగల భక్తి విశ్వాసములు వాని సాధుజీవనము జూచి ప్రజలు వానిని మహర్షితుల్యునిగా భావించు చుందురు.
ఒకనాడు కళింగదేశాధీశ్వరుండు సకుటుంబముగా యాత్రకు వచ్చి జగన్నాధస్వామి నర్చించి యేగెను. బలదేవుండు నాలుగేడులు ప్రాయము గలిగి ముద్దులమూట గట్టుచున్న యా భూపాలుని కుమారుని దాది యెత్తుకొనగా జూచి యుత్సకము జెందుచు దనకట్టి నందను గలుగ జేయుమని నిత్యము హరిభజనావసరములయందు నాస్వామిని బ్రార్ధింపుచుండెను. అట్లు కొన్ని దినములు గడిచినంత జగ న్నాథుని కరుణావిశేషంబున దత్పత్ని గర్భవతియై పదవమాసంబున దివ్యతేజస్సమంచితుండైన కుమారునిం గనియెను. బలదేవుడు వాని సౌందర్యాతిశయంబున కచ్చెరువందుచు బ్రాహ్మణప్రేరణంబున వానికిం రుచికుడని నామకరణము జేసెను.
శిశువుగా నున్నప్పుడు వానిం జూచిన వారెల్ల యౌవనోదయంబున వీడెంత జక్కగా నుండునోయని యక్కఱ పడజొచ్చిరి. యముడు కృతాకృతంబుల విచారింపడుగదా? రుచికుని కైదేడులు రాకముందే తల్లి పరలోక మలంకరించినది. బలదేవుడు పత్నీవియోగశోకంబు గణింపక తల్లి లేని లోపమగుపడకుండ గుమారుని మిక్కిలి గారాబముగా బెనుచు చుండెను. పసితనంబుననే రుచికుడు తండ్రి మాలికలు గట్టుచుండ దానుగూడ నల్లుచుండును. రుచికునకు బూవుబంతులు, మాలికలు, జడలు క్రీడనకములై యొప్పెను. రుచికుని కెనిమిదేడులు ప్రాయము వచ్చినది. మొదలంత ప్రాయముగల గౌతముడను విప్రకుమారునితో మైత్రి గలిగినది బలదేవుడు రుచికునకు గౌతముని సహాధ్యాయునిగా జేసి తన యింటికి నుపాధ్యాయుల రప్పించి పెక్కువిద్యల నేర్పించెను. రుచికుడు మిగుల బుద్దిమంతుడగుట శీఘ్రకాలములో అనేక విద్యల యందు బాండిత్యము గలుగజేసికొనియెను.
మఱియు వానికిగల మాలికానిర్మాణకౌశల మింతింతయని చెప్పనలవి కాదు. ప్రజలు రుచికుడు కృత్రిమపుష్పములతో గట్టిన అలంకారముల దొడవులకు మారుగా ధరించుచుందురు. విశేషించి వారకాంతలు వానిదండలును బంతులును తొడవులును గోరికతో ధరించుచుందురు. దానంజేసి దేశమంతటను రుచికుని ప్రఖ్యాతి యెక్కువగా వ్యాపించినది. గౌతముం డొకనాడు రహస్యముగా రుచికుం జూచి తమ్ముడా! నీవు గట్టిన దండ లంగళ్ళలో విశేషము అమ్మబడుచున్నవి. నీయందు గల ప్రేమచే నీతండ్రి నిన్నిల్లు గదలనీయడు నీమాలికలు నీవు స్వయముగా వేశ్యాంగణమునకు దీసికొనిపోయి అమ్మితివేని నెక్కుడు వెల రాగలదు. మీ తండ్రి గుడికి బోయినప్పుడు రహస్యముగా అంగడికింబోయి దండల నమ్ముకొని వత్తమేయని బోధించిన విని సంతసించుచు రుచికుడు నాడు మంచిమంచిదండలం గట్టి వాడుకప్రకారము తండ్రి స్వామి నర్చింప నాలయమున కరిగినవెంటనే చక్కగా నలంకరించుకొని గౌతమునితో గూడ గణికాంగణంబున కరిగెను.
నానావిధాలంకారశోభితంబులైన గగన మొరయుచున్న మేడలపై గూర్చుండి వేణువీణాపటహమద్దల ధ్వనివిశేషముల కనుకూలముగా మేళగించి మధురస్వరంబులతో గాంధర్వంబు వెలయింపుచున్న వేశ్యామణుల గాంచి రుచికుండు విస్మయముతో గౌతమా! మనవీట నిట్టి వింతలున్నవని యెన్నఁడునుఁ జెప్పితివికావేమి? ఆహా! యిది స్వర్గము కాదుగద! అయ్యారే! ఆ కనంబడువారు. అచ్చరలేమో! భళిభళీ! అని మెచ్చుకొనుచు జూచిన సౌధమే చూచుచు బోయిన వీథికే పోవుచు విన్న గానమే వినుచు బెద్దతడవా వీథినే తిఱుగుచుండెను.
ఒకచోట వారాంగనానిమిత్తమునఁ జేసి యిరువురు బ్రాహ్మణులు కలియబడి పోట్లాడుచుండుట చూచి రుచికుఁడును గౌతముఁడును విడిపించిరి. ఆ సందడిలో రుచికుని చేతనున్న పూవుదండలు నలిగి పోయినవి. అప్పుడతండు గౌతముం జూచి అన్నా! దండలు నలిగిపోయినవి. వీనినెవ్వరును గొనరు మాతండ్రి యింటికి వచ్చు వేళ కావచ్చినది. మనమిక నింటికిఁ బోవుదమే ? అని పలికిన అతండును సమ్మతించెను. ఇరువురునుఁ గదలి యింటికి బోవుచుండ నాదారిలో నొక చిత్రసౌధము వారికి నేత్రపర్వము గావించినది.
తద్విశేషములరయుచు నొక్కింత తడవువారందు నిలువంబడిరి. అప్పుడా లోపలినుంచి యొకపూబోఁడి వాకిటకువచ్చి యెవ్వరి నిమిత్తమో పరిశీలింపుచుండెను. అప్పుడా వీధింబడి యొక విటపురుషుండు పోవుచుండ వానింజూచి యా చిన్నది రసికశేఖరా! ఇటుచూడక పోవుచుంటివేమి? నన్ను గురుతుపట్టలేదా యేమి! నీవు కొన్ని దినములు కళత్రముగా స్వీకరించిన దారావళి సఖురాలను. పూవుఁబోణిని. జ్ఞాపకము వచ్చినదా? అని పల్కరించిన అతండటుచూచి యోహో? పూవుబోణి! నీవిందుంటి వేల? ఇది చంద్రలేఖ గృహము గదాయని అడిగిన అప్పడతి యిట్లనియె.
బావా ! నేను ప్రస్తుతము తారావళి యొద్దనుండుటలేదు. దానికిని నాకును విరోధము వచ్చినది. చంద్రలేఖ నాకు జుట్టమగుట నిందుంటిని. మాపనికత్తియ రుచికుఁడు గట్టిన పూవుదండలు దెమ్మనిన అంగడికిబోయి నేఁడు మరియొకరు కట్టిన దండలం దెచ్చినది. రుచికుని దండలుగాని చంద్రరేఖ ధరింపదు. అందునిమిత్తము దాని మరల అంగడికిఁ బంపితిని. దానిపాడ నరయుటకై యిందు వచ్చితిని. దీనికి ఫలము మీదర్శనమని పలికిన నవ్వుచు నావిటశిఖామణి యిట్లనియె.
పూవుబోణి! చంద్రలేఖ యింటికెవ్వరైన సరసులు వచ్చుచున్నారా? దాని కెవ్వరైన గన్నెరికము గావించినారా? అది తల్లి మాట వినక సంతతము విద్యాగోష్ఠియే చేయుచుండునని చెప్పుదురు. ఆ నియమంబులన్నియు నున్న యవియా? లేవా? నాకుఁ దడవులంబట్టి దానిఁజూడవలయునని యున్నది. ఉపాయ మేమని అడిగిన అప్పడఁతి బావా! అది పట్టిన నియమము బ్రహ్మవచ్చి చెప్పినను విడువదు. విద్యారుచికుంగాని పెండ్లియాడదఁట సరసులఁ గన్నెత్తిచూడదు. ఆడపండితులకుగాక యితరులకు గనంబడదు. నీవు దానింజూడఁ గోరితివేని యొక యుపాయము చెప్పెద వినుము. రుచికుని దండలు మాదిరిగాఁ గట్టవలయునని ప్రయత్నము చేయుచున్నది కానిశక్యముకాకున్నది. ఆ రుచికుఁడీ యూరనే నున్న వాఁడట. వానిం దీసికొనివత్తువేని దర్శనము చేయింతునని చెప్పుటయు అతండు నవ్వుచు నాలాగే ప్రయత్నము చేయుదునని పలికి అవ్వలికిఁబోయెను.
ఆ ప్రసంగమంతయును విని రుచికుడు మురియుచు గౌతమా! మాలికల మూలమున నాకు మంచివాడుకయే వచ్చినది. నేనిప్పుడీ లోపలికిబోయి నాపేరు జెప్పిన జంద్రలేఖ నన్ను మిక్కిలి గౌరవపరచును కాబోలు పోయియాపని దానికి నేర్పుదునా అని అడిగిన అతండు నవ్వుచు జాలుచాలు మనమింటికిబోవుదము రమ్ము నిన్ను గానక నీతండ్రి పరితపించుచుండును. నీవు లోపలికి బోతివేని తిరిగివత్తువా? అని మందలించెను. అప్పుడు రుచికుడు వయస్యా! ఎట్లైయినను మాతండ్రి మందలింపక మానడు అయిన యాలస్యమైనదిగా మఱికొంత సేపిందుండి వింతలంజూచి పోవుదమని బ్రతిమాలిన అతండు మరికొంతసేపు నిలిచి మఱల రమ్మని నిర్బంధించెను. కాని పోవుటకు రుచికునికి గాళ్ళుసాగినవికావు. అప్పుడు గౌతముడు గోపము చేయుచు గానిమ్ము ఇంత ప్రొద్దుపోయినదికదా రాకుంటివి నేనుబోయి మీతండ్రిం దీసికొనివత్తు నని అవ్వలికి బోయెను. అంతలోఁ బరిచారిక దండలు తెచ్చినదేమోయని పూవుబోణి మరల వాకిటకు వచ్చినది. ఆసమయము గ్రహించి రుచికుడు పదతీ! నీవు రుచికుడు గట్టిన దండల నిమిత్తము విమర్శింపుచుంటిని. అవి నాయొద్దనున్నవి కాని కొంచెము నలిగినవి చూచుకొమ్మని పలుకుచు అక్కలికి యొద్దకుఁబోయి యా మాలికలం జూపెను.
అచ్చెల్వ వానిం బుచ్చుకొని విమర్శించిచూచి యివి రుచికుడు కట్టినవే. నలిగినను రమ్యముగానే యున్నవి. వీని నెంత కమ్మెదవని అడిగిన మీరు నిత్యము నెంతకు గొనుచున్నారో అంతియే నీవెల యని చెప్పెను. అది మాకు దెలియదు. నీ వీదండల నెచ్చట గొంటివి లాభమేమి కావలయును అడిగిన అతండు నవ్వుచు నేనివి యొరులయొద్ద గొనలేదు. స్వయముగానే కట్టితిని. కావున నీయిష్టము వచ్చినంత సొమ్మిమ్మని అడిగిన అవ్వెలది నీపేరేమని యడిగినది. అప్పుడతండు నా పేరు రుచికుడని చెప్పెను.
ఆమాటవిని యాబోటివిస్మయ నభినయించుచు నేమేమీ! దండలుగట్టెడు రుచికుడవు నీవేనా? మీయి ల్లెక్కడ. ఎప్పుడుఁ గనంబడితివి కావేమి? నీదండలకు మాసఖురాలు మిక్కిలి వేడుకపడు చుండును. ఆపని నీయొద్ద నేర్చుకొనవలయునని నిన్ను దీసికొనిరమ్మని పలుమారు నాతో జెప్పినది. నీయునికిపట్టు నాకు దెలిసినదికాదు. లోపలికి బోవుదమురమ్మని పలుకుచు దీపము వెలుగున వాని చక్కదనముజూచి తల యూచుచు నక్కజపాటుతో నాబోటివానిని లోపలికి దీసికొనిపోయి అమ్మా! రుచికుడు. రుచికుడని నీవు పలుమారు స్మరించుచుందువు. వాని నిదిగో! నీయొద్ద దీసికొని వచ్చితిని జూడుమని పలికిన విని యబ్బురముఁజెందుచు జేరలకు మీరిన కన్నులును దళ్కు బెళ్కులును, దీర్ఘబాహువులును సుందరముఖంబునుం గలిగి లేతయౌవనమునఁ బొలు పొందుచుఁ గంతు, వసంతాదుల మించియున్న రుచికునింగాంచి యక్కాంచనగాత్రి హర్షపులకితగాత్రియై మోహావేశముజెందుచు లేచి వాని నుచితపీఠంబునం గూర్చుండ నియమించి స్వాగతపూర్వకముగా నిట్లనియె.
ఆర్యా! నిన్నుజూడక పోయినను నీవుగట్టిన దండలు నీపరిచయము గలుగఁజేసినవి. ఈవిద్యయొక్కటియే యక్కజమనుకొనుచుంటిమి. రూపమంతకంటె వింతగానున్నది. నీవీవిద్య నెక్కడ సంపాదించితివి? నీకు గురువులెవ్వరు? నీకులశీల నామంబు లెట్టివని పలుకుచు శృంగారవిలోకనములతని మొగంబున వెలయించి వాని హృదయమును స్మరవికారము నొందించినది. రుచికుడు తదీయవిభ్రమవిలోలచిత్తుండై యున్మత్తుండువోలె వక్తవ్యాంశము నెఱుంగక యేమేమో చెప్పదొడంగెను. వాని చిత్తచాంచల్య మరసి యమ్మత్తకాశిని చిత్తజునివంటి యాప్తుండెందును లేడుగదాయని సంతసించుచు నాతడే తన మనోహరుడని నిశ్చయించుకొని మనసుచే వరించి యవ్విషయ మెఱుకపడనీయక కపటముగా మాటాడుచు సంగీతము పాడి మోహము గలుగఁ జేయుచుఁ చందనతాంబూలాది సత్కారంబుల బరిహాసపూర్వకముగాఁ గావించుచు వానిం శృంగారలీలాజలధి వీచికలఁ దేలిఁయాడజేయుచుండెను.
అంతలో వీధిద్వారముదాపున నేదియో సందడి వినంబడినది. అది ఏమని విచారింపుచున్నంత రాజభటులు తలుపుతీయుఁ డని అఱచిరి ఆ రొదవిని రుచికుం డదరిపడి అయ్యో! ఇఁక నేమియున్నది. గౌతముఁడు పోయి మాతండ్రి నిచ్చటికిఁ దీసికొనివచ్చెను నే నొక్క నిమిషము గనంబడినిచో మాతండ్రి మిక్కిలి పరితపించును. కదలక కదలక యిల్లు కదలి యంత అల్లరిపా లయితినేమి? ప్రమాదము వచ్చినది. నీప్రియవాక్యముల విని నేను వెనుకటి కథలు మరచితిని. న న్నొకచోట దాచి యవమానము రాకుండఁ గాపాడుమని వేడుకొనుటయు నవ్వుచు నాచంద్రలేఖ యిట్లనియె. రుచికా! నీవు వెఱవకుము. మాయింట దాగినవానిని బరమేశ్వరుఁడు పట్తుకొనలేడు. నీతండ్రిమాట లెక్కయేమని పలికి అతనికొక గుప్తమందిరము చూపినది. అది మా తండ్రి వెదకక మానడు. మరియొక రహస్యస్థలము చూపుమని అడిగెను అమ్ముదితయుఁ దనయింటనున్న గూడ ప్రదేశము లన్నియుఁ జూపించినది కాని అతండంగీకరింపక వేరొకటిలేదా అని అడుగుచుండును. చివరకది తనయింటినిఁ జేరియున్న యొక యుద్యానవనము జూపి దానికి రెండవదారిలేదనియుఁ బదిదినములు వెదికినను నందున్న గనంబడరనియుం జెప్పి వానినందొక మందిరమున నుండ నియమించి యా దొడ్డితలుపు బిగించి యీవలకు వచ్చినది.
అంతలో రాజభటుల యార్పులతిశయించి చంద్రలేఖ హృదయభేదకము గావించినవి అక్కలికి వెఱచుచుఁ దలుపులు దీయించినది. అందు గౌతముఁడును బలదేవుఁడును రాజభటులతో నిలువంబడియుండిరి. వారినిఁ జూచి చంద్రలేఖ యీ అర్ధరాత్రము మీ అందఱు మాయింటి కేమిటికి వచ్చితిరని అడిగిన రక్షకభటు లిట్లనిరి. ఈ బలదేవునికొడుకు రుచికుఁడను వాఁడు మీయింట నున్నాడఁట. వానిం దీసికొని పోవుటకు వచ్చితిమి. సామమున పంపుదువా? క్రమప్రకారము చేయమా అని బెదరించిన నత్తలోదరి రుచికుఁ డెవ్వఁడో మే మెఱుఁగము. మాయింటికి రాలేదు. క్రమ మేదియో అట్లు చేసికొనవచ్చునని నిర్భయముగాఁ జలికినది. అప్పుడందరు లోపలికి బోయి కరదీపికలఁ దాల్చి దాని యిల్లంతయు వెదకిరి. ఎందును వానిజాడ కనంబడినదికాదు. అంతలో దెల్లవారినది. అప్పుడు గౌతముఁడు పెరటిలోనికిం బోయి నలుమూలలు చూచుచుండ నిష్కుటద్వారకవాటము గనంబడినది. దానితలుపు తీయమని కోరినఁ జంద్రలేఖ యా యుద్యానవనము తనది గాదనియుఁ మరియొకరి తోఁటకుఁ బంపుటకు తన కధికారము లేదనియు దానిముద్ర తనయొద్ద లేదనియుఁ జెప్పి పెద్ద తడవు వాదించినది. గాని రాజభటులు సమ్మతింపక బలాత్కారముగా ముద్ర విడఁగొట్టి యాతోఁటలోఁ బ్రవేశించిరి.
అత్తరి నత్తన్వి హృదయమున దిగులుపడి యేమియు మాటాడక మేడమీఁదికి బోయి పశ్చాత్తాపముఁ జెందుచుఁ బూవుబోణి! మన మనవసరపుకృత్యము గావించి బొంకరులమైతిమి. అయ్యో! ఇంత యేల వచ్చినది పిలిచి నప్పుడే యథార్ధము చెప్పిన ముప్పులేక పోవునుగదా. రుచికుని పిరికితనము జూచి యిట్టిపూనిక వహించితిమి. కానిమ్ము నీవు బోయి యక్కడ నేమేమి విశేషములు జరుగునో చూచి రమ్మని పంపినది. పువ్వుఁబోఁడి పోవువరకు నాతోఁటనంతయు వెదకి రుచికునిం గానక విచారింపుచున్న బలదేవు నూరడింపుచు నీవలకు వచ్చుచుండిరి. ఆవార్త దెలిసికొని పువ్వుబోఁడి వడివడిఁ బోయి చంద్రలేఖ కెరింగించినది. అతండందు లేడను వార్త విని చంద్రలేఖయు మిక్కిలి విస్మయముఁ జెందుచుఁ గాని మ్మామాటఁ తరువాత విమర్శింపవచ్చును. ఇప్పటి కీయవమానము దాటినదికాదా యని సంతసించుచు నక్రమముగాఁ దనయిల్లు బరీక్షించినందులకై యభియోగము దెత్తునని యెదురువారిని బెదరించినది. అప్పుడేమియు మాటాడలేక లజ్జావనతముఖులై వారెల్ల వచ్చినత్రోవంబోయిరి. రాజభటులు గౌతముని యనిమృశ్యకారిత్మమునకు మిక్కిలి నిందించిరి. వార లేగినవెనుకఁ జంద్రలేఖ పువ్వుబోఁడితోఁ గూడికొని యాతోటలోనికి బోయి కొమ్మకొమ్మ చెట్టుచెట్టునందుఁ గొంచెమైన విడువక వెదకినదికాని యెందును రుచికుని జాడగనంబడలేదు.
ఆ తోఁటకు రెండవదారిలేదు. దానిప్రహరి మిక్కిలి యెత్తయినది. అతఁ డందు లేకుండుటకు గారణముఁ దెలియక అక్కలికి మిక్కిలి పరితపించుచు రహస్యముగా పూఁబోణిఁ బంపి యాగ్రామ మంతయు వెదకించినది. కాని యెందును గనంబడలేదు. మరికొన్నిదినము లరిగిన తరువాత నొకనాడు గౌతముడు చంద్రలేఖయొద్దకు వచ్చి యర్చితుండై యల్లన నిట్లనియె. బోఁటీ! నీవు లోకముపాటి యాటవెలఁదివికావు విద్యలచే ననవద్యవై యుంటివి. బలదేవుడు పుత్రవియోగదుఃఖంబునఁ జివికి ప్రాణావశిష్టుఁడై యున్నవాడు. అపాపమేలఁ గట్టుకొనియెదవు. రుచికుని విడిచి పెట్టుము. నీకు మంచిపుణ్యము రాఁగలదని బోధించినఁ గన్నీరుఁగార్చుచు నా గణికామణి జరిగిన యథార్థ మంతయు వానికి జెప్పి విచారింపదొడంగినది.
గౌతముఁ డాబోటిమాటలు విని వెఱఁగుపడి యాతోటలో సంచారవృక్షము లున్నవేమోయని శంకించెను. పిమ్మటఁ జంద్రలేఖ గౌతమా! యీదోషము నేనుగట్టి కొంటిని. బలదేవునితో నీకుమారుని వెదకి తెప్పింతునని చెప్పుము. నిక్క మతనినే నేనుఁ బతిగా వరించితి నన్నిగతుల నా కాతనికంటె జీవనోపాయములేదు. నీకుఁ గావలసినంత ద్రవ్యమిచ్చెద. దేశాటనముచేసి అతనిజాడఁ దెలిసికొనిరమ్ము. ఎప్పటికప్పుడు నాకు విశేషవార్తల దెలుపుచుండుము. అతండు నీకునుఁ బరమాప్తుడు గదాఁయని ప్రార్ధించిన సంతసించుచు నప్పుడే కొంతద్రవ్యము గైకొని బలదేవునికిఁ జెప్పి యిల్లువెడలి రుచికుని వెదకుచుఁ గొన్నిదినములు దేశసంచారము గావించెను.
మఱికొన్నిదినము లఱిగిన వెనుక గౌతమునొద్దనుండి చంద్రలేఖ కొక యుత్తరము వచ్చినది. అందు చంద్రలేఖా! నేను బెక్కుదేశములు దిరిగితినికాని యెందును రుచికునిజాడ తెలిసిదినకాదు. ఇప్పుడు సముద్రప్రాంతమందున్న రామచంద్రనగరంబునకు వచ్చితిని. ఇందు బరిశీలింప నొకవిశేషము గనంబడినది వినుము. ఈపట్టణంబు శూరసేనుడను రాజు పాలింపుచున్న వాడు. ఇతనికి దిలోత్తమయను కూతురు కలదు. ఆ చిన్నది విద్యారూపగుణశీలంబుల అసామాన్యయైయున్నది. ఎట్టి రాచపట్టివచ్చినను మెచ్చక దివ్యప్రభావసంపన్నుడగు వానినిగాని బెండ్లియాడనని నీమముచేసికొని యున్నదఁట మఱియుం దండ్రి బలవంతముసేయఁ గొన్ని దినంబుల క్రింద నొకసుందరపురుషుని యాకృతిం జిత్రఫలకమునవ్రాసి యిట్టివానిందెచ్చినఁ బెండ్లియాడుదు. లేకున్న నాతో మఱిచెప్పవలదని చెప్పినదఁట ఆధాత్రీపతియు నా చిత్రఫలకం బాయూరిలోనున్న యొకదేవాలయంబులోఁ వ్రేలగట్టించి అట్టిపురుషునిం దెచ్చినవారికిఁ బారితోషిక మిత్తునని ప్రకటనవ్రాసియున్నవాఁడు. నేనును నాగుడిలోనికి బోయి యాపటంబును చూచితిని మన రుచికుని యాకృతియే యందున్నది. దానింజూచిన నామిత్రుని చూచినట్లేయున్నది. కొంతసే పట నిలచి నాకన్నుల కరవుదీరఁ బ్రత్యవయవంబుఁ బరికించితిని ఇంతయేని భేదము గనబడలేదు. అచ్చద్దినట్లే యున్నది. అచ్చట నున్న వారిని దానివృత్తాంతమడిగినఁ బైనవ్రాసిన ప్రకారమే చెప్పిరి.
మన రుచికుఁ డాతిలోత్తమ హృద్గతుఁడగుటకుఁ గారణమేమో తెలియదు. నేనాతిలోత్తమ నడుగుదమన్నను శుద్ధాంతచారిణియగు నక్కాంతారత్నము నెటుల చూడనగును. అప్పఁడతియు నిప్పు డెద్దియో విచారముజేఁ గుందుచున్నదఁట. నేనచ్చట నున్న ప్రకటనలనుఁ జదువుచుండగా రాజభటులువచ్చి యిందున్నవాని నెఱుఁగుదువా యేమి యిట్టివానిం దీసికొనివత్తువేని నీకు మంచిబహుమతి నిప్పింతుననుటయు నేనిట్లంటి. అయ్యో! నిందున్నవాఁడు నామిత్రుడు వాని వెదుకుటకే నేను వచ్చితిని. వాఁడు కనఁబడినఁజాలును. ఇంతకన్న బహుమతి నా కక్కరలేదు. ఇంతకన్న మీకేమైనం తెలిసిన జెప్పుడు. మీకు నేనే బహుమతి నిప్పింతునని చెప్పితిని. నామాటలకు వారు వెరఁగడుచు మాకింతకంటె నేమియుఁ దెలియదని చెప్పిరి. మఱియు నిందెవ్వరికేనిం దెలియునేమోయని పురమంతయుఁ గ్రుమ్మరుచుంటిని. ఇవియే యిచ్చటనున్న విశేషములు నీ వొకసారి వచ్చితివేనిఁ దిలోత్తమతో మాటలాడనగును. అచిన్నదియు మిగులపాండిత్యము గలదగుటచే నీతో మైత్రి సేయకమానదు. తక్కిన విశేషములన్నియుఁ దిలోత్తమవలన నీకుఁ దెలియఁబడును. అనియున్న యుత్తరమునుఁ బలుమారు చదువుకొని గౌతముని బుద్ధినైపుణ్యమునకు మెచ్చుకొనుచు చంద్రలేఖ రామచంద్రనగరమునకుఁ బోవుట యుచితమే అని తలంచి యాప్తులకేరికిం దెలియకుండ నొకనాఁటిరాత్రి పూవుఁబోని మాత్రము వెంటఁబెట్టుకొని ప్రచ్ఛన్నంబుగా నిల్లువెడలి రామచంద్రనగరంబునకుఁ బోవు తెరవు తెరంగంతయు గౌతముం డుత్తరములో వ్రాసియున్నవాఁడు కావున నట్టి మార్గమునంబడి చంద్రలేఖ స్వల్పకాలములోనే యా పట్టణము చేరినది.
అందొకయింట బసఁజేసి రెండుమూఁడు దినములు గౌతముని వెదకినదికాని అతండు గనంబడలేదు. తరువాత నానాతి దేవాలయములోనికిఁబోయి అందున్నపటము జూచి ముద్దుఁబెట్టుకొనుచుఁ గొంతసేపు సంతాపముజెందినది. పిమ్మట నప్పరిచారికచే దెలుపంబడి మోహమునువిడిచి అచ్చటినుండి మరల బసలోనికివచ్చి ఆచిత్రపటమునుగురించి పెక్కు తెరంగుల నాలోచించుచుండెను. రాజపుత్రిక అగు తిలోత్తమతో మైత్రిఁజేసినఁ నాడుగాని దీనివృత్తాంతము దెలియదనియుఁ దన విద్యామహిమంజూపినగాని యట్టిపని నెరవేరదనియు నిశ్చయించి, మరునాడు తానొక విద్యావినోదసభఁ జేయుననియు నందుఁ దన్ను జయించినవారికిఁ గానుకలిత్తుననియు నీయూరిలోనున్న విద్వాంసులును ప్రజలును రావలయుననియు బ్రకటనపత్రికలు వ్రాసియంపినది.
ఆవీటిలో మేటులగువార లాపత్రికల నంతగా మన్నింపక యా సభకుఁ బోవలేదు సామాన్యజనులు పోయి యమ్ముదిత చేసిన అమానుషంబులగు విద్యావినోదంబులఁజూచి మెచ్చుకొని ఆమ్మరునాఁడు తత్ప్రభావమంతయుఁ జాటింపదొడంగిరి. మఱి రెండుదినములు జరిగిన వెనుక నత్తెరవ మరలనొక సభఁజేయుదునని పూర్వము వలెనే పత్రికలంపినది. అప్పుడాయూరిలోనున్న పెద్దమనుష్యులు ధనికులు విద్వాంసులు లోనగు వారందరు నాసభకువచ్చిరి. భూపతియు దానికీర్తి పౌరుల వలన విని యున్నవాఁడు కావునఁ దానుకూడఁ బండితులతో నాసదస్సునకుఁబోయెను.
పిమ్మట నాయూరిలోని విద్వాంసులు దానితోఁ బ్రసంగముచేయ బూనిరి గాని యొకటిరెండుప్రశ్నములలోనే వారలఁ బరాజయంబు నొందించినది. అందుల కందరు వెరఁగందుచుండ వెండియు నద్భుతములైన విశేషంబులు సహస్రావధానము వ్యస్తాక్షరీ నిషేధాక్షరీ విచిత్రబంధకవిత్వాది వినోదములచే సభ్యులహృదయంబుల కాహ్లాదంబు గలుగఁజేసినది. అప్పు డప్పూవుఁబోడిని సరస్వతియొక్క యపరావతారమని స్తోత్రములు సేయఁ దొడంగిరి. సభ ముగించిన తరువాత నాచేత పారితోషికమియ్య బోవు డిది అందికొనక దేవా! నేనీసభ బహుమతుల నొందుటకుఁ జేసినదికాదు. నాకు ధన మవసరము లేదు. మీవంటి మహాత్ముల అనుగ్రహము గలిగినంజాలునని సవినయముగా బ్రార్ధించినది. దానిమృదుమధురోక్తులకు సంతసించుచు నందుల కభయహస్త మిచ్చి యాఱేఁడు పరివారముతోఁగూడ నరిగెను.
తిలోత్తమ కథ
శూరసేనుండింటికిబోయిన కొంతతడవునకు రాజభటులు కొందరు వచ్చి చంద్రలేఖం జూచి బోటీ! నిన్ను జూడవలయునని రాజపుత్రిక తిలోత్తమ మిగుల వేడుకపడుచున్నదట? మాఱేడుఁ నిన్ను దీసికొని రమ్మని చెప్పెను. వెంటనే రావలయు ననుటయు నది తనకోరిక లీడేరినవికాదా అని సంతోషించుచు జక్కగా నలంకరించుకొని తన పరిచారిక పూబోడితోగూడ రాజభటులవెంట నగరిలోనికిం బోయినది. అందు అంగజాలలచే జూపింపబడిన మార్గంబున దిలోత్తమ యంతఃపురమునకు బోవుటయు నక్కన్యకాతిలకంబు చంద్రలేఖ నుచితమర్యాదలతో దోడితేదగు పరిచారికల నియమించినది. వారు చేయు సత్కారములకు మిక్కిలి సంతసించుచు నవ్వేశ్యాతిలకము తిలోత్తమను జూచిన తోడనే నమస్కారమును జేసినది.
రాజపుత్రికయు దీవించి దానిగాత్రసౌకుమార్యమునకు నద్భుతమందుచు నోహో! యిట్టి యుత్కృష్టవిద్యారూపంబులు గల గలకంఠి నుత్తమకులంబున బుట్ట జేయని పరమేష్టి నిందాపాత్రుడు. ఇదియుం గులపరిపాటిపాటింపక యుత్తమస్త్రీ లక్షణంబుల కనుగుణంబులను సుగుణముల నొప్పారుటచే మిగుల గొనియాడదగియున్నది. దీనితో గొంత ముచ్చటించి మరియుం దీనిస్వభావ మెరిగెదగాక యని తలంచి అల్లన దానితోనిట్లనియె. ఇంతీ? నీవు నిన్నటిసభలోఁ జేసిన వింతపనులు వినినంత నాకు మిగుల సంతసమైనది. నీ కులంబున కెల్ల గౌరవమును సంపాదించితివి. మేలుమేలు, నీవిద్యోప దేశకులెవ్వరు? ఏమి విద్యలభ్యసించితివి! విద్యలు సాంగములైనవియా? అనురూపవరునిం బడయక యిట్టి లేప్రాయమంతయు వృధాఁ జేయుచున్న దానవేమి? ఇది యొక్కటియే నాచిత్తమ్మున కుమ్మలికము గలిగింపు చున్నదని పెక్కుగతుల అమ్మదవతిని నుతియించినది.
తన్ను రాజపుత్రిచేసిన పొగడ్తల సహింపమి నభినయించుచు జంద్రలేఖ భర్తౄదారికా! నేను చదివినది యొక్కరియొద్ద కాదు. కావ్యనాటకాలంకారగ్రంథము లొకరియొద్దను, వ్యాకరణ మొకరియొద్దను, తర్కము వేఱొకరియొద్దను, గీతశాస్త్ర మొకరియొద్దను జదివితిని. ఇట్లే “పుష్కలేన ధనేనవా" అనురీతిని ధనము వ్యయపుచ్చి పెక్కువిద్యలు సంపాదించితిని. చదివినవి మాత్రము సాంగంబుగానే చదివితిని. నన్నింతగా నీవు పొగడవలదు. నేను నీకంటె విద్వాంసురాలనుకాను. భవదీయవిద్యామహత్వములు నిన్నటిసభలోనే పౌరులవలన వినియుంటి. నన్ను నీ చెలికత్తియలలో జేర్చికొమ్ము. అదియే నా కోరిక. మరియు అనురూపచరుని బడయకునికి గారణమేమని అడిగితివి. బుద్ధిశాలినివగు నీ కీప్రశ్న కుత్తరము జెప్పుట యనావశ్యకము. అనురూపశబ్దమున కర్థ మెద్దియో విచారింపుము. తగిన వరునింబడయుట దైవికంబు గదా నిన్ను గూడ నేనిట్టి ప్రశ్న అడిగినచో నాయవివేకము తెల్లమగును. కావున నేను నిన్నేమియు అడుగదలచు కొనలేదు. సఖ్యము సాప్తపదీనమని ప్రసిద్ధియున్నది. మనకిప్పుడు నేస్తంబు కలిగినది. ఇటు పైన నొండొరుల అభిలాషల జెప్పుకొనుట కేమి సందేహము! నెమ్మదిమీద అన్నియుం దెలియనగునని పలుకుచు దిలోత్తమ చిత్తంబును దృటిలో దన యధీనము చేసికొనినది రాజనందనయు జంద్రలేఖ పలికిన గంభీరవచనముల కెంతయు సంతసించుచు దన ప్రాణసఖులలో మొదటిదానిగాఁ జేసికొంటినని అప్పుడే వాగ్దత్తము చేసి గాఢాలింగనము గావించెను. అప్పు డిరువురకు నానందబాష్పములు ప్రసవించినవి. శుద్ధాంతకాంతలెల్ల వారి సఖ్యమునకు అనుమోదించిరి.
అది మొదలు వారిరువురు నాహారనిద్రాక్రీడావిహారాదుల నొకనిముష మేని విడువక యేకదేహమె ట్లట్లు వర్తింపుచు సంతతము విద్యాగానవినోదంబులతోఁ బ్రొద్దులు బుచ్చుచుండిరి. ఇట్లు కొన్నినాళ్ళు జరిగిన వెనుక నొక్కనాడు చంద్రలేఖ తిలోత్తమతో నేకాంతనిశాంతమందు గూర్చుండి యిష్టాగోష్టివిశేషంబుల సంభాషించుచు అల్లన నిట్లనియె.
సఖీ! మనమిప్పుడు నూతనయౌవనములో నుంటిమి గదా. ఇట్టి సమయంబునఁ బతిహీనులమైయుండుట లోకగర్హితమై యున్నది. అడవిగాచిన వెన్నెలవలె మన ప్రాయమంతయు వృధాగాఁ బోవుచున్నది. నాకుఁబోలె నీకు సైతమును రూపవరుడు లభింపమికి వింతగా నున్నది. నాది నీచజాతియగుట మా కులములోని పురుషుడు విద్యారూపములు గలిగియుండరు. అన్యకులకునిఁ బెండ్లి యాడుట శాస్త్రనిషిధము గదా కులవృత్తిమై వర్తించు నా యట్టిదాని కాదరణీయమేమో నీవే చెప్పుము. ఇవి అన్నియుఁ దిలకించియే నేనిట్టి కన్యావ్రతముతో నుంటిని. నీవు రాచపట్టివి. మీకులములో విద్యారూపప్రతాపవిహీనులు పుట్టనేపుట్టరు. నీవు కోరితివేని తగిన మనోహరుడు లభింపక మానఁడు. అదియునుంగాక నీవొక సుందరుని యాకృతిపటంబున వ్రాసి అట్టివానిం దెచ్చిన బెండ్లియాడుదునని చెప్పి యంటివఁట ఆ చిత్రఫలకమున నేనును గుడిలోఁ జూచితిని. అందున్న పురుషుఁ డెవ్వడు? వాని నెటు లెరింగితివి? అట్టివానిం నెప్పుడేనిం జూచియుంటివా? లేక నీ యూహవలననే అట్లు వ్రాసితివా! ఈ వృత్తాంతమువిన నాకు వచ్చిన నాటనుండియుఁ గోరికగా నున్నది. సమయము గాక అడిగితిని కాను. నాకును గోప్యము కానిచో వక్కాణింపుమని మిక్కిలి వినయముగాఁ బ్రార్ధించినది.
అత్తిలోత్తమయు అమ్మత్తకాశినిమాటలు విని స్వాతంబున నెద్దియో తలంచుకొని అదరిపడి యొక్కంతవడి నేమియుం బలుకకఁ గన్నులంగ్రమ్ము బాష్పములం గోనగోరం జిమ్ముచు నుస్సురని పెద్ద నిట్టూర్పునిగిడ్చి యొక్కింత తలయెత్తి వాల్గంటీ! ఏమంటివి! నావంటి మందభాగ్యురాలి కనురూపవరుఁడెట్లు దక్కును. సమసుఖదుఃఖవగు నీతో నావృత్తాంతము జెప్పవలయునని తలంచుకొనుచు నెప్పటికప్పటి కెద్దియో వినోదమూలమున మరచుదానను నీవు వచ్చినది మొదలు నేనా గోష్టి మరచి నీతో విలాసంబుగా నుండుటచే నించుక యాహారము భుజించుచున్నదాన. అంతకుమున్ను నేను జీవచ్చవంబువలెఁ బడియుండుటయే గాని యొకరితో మాటలాడుటలేదు. ఆచిత్రఫలకంబునంగల మనోహరుని వృత్తాంతము జెప్పెద నాకర్ణింపుము.
మా తండ్రి నాకు యుక్తవయస్సు వచ్చినతోడనే వివాహము చేయవలెనని ప్రయత్నించి అనేక రాజకుమారుల రూపములు వ్రాయించి తెప్పించి నాకుఁ జూపెను. నేనును వారి వారి చరిత్రల సఖీముఖంబుగా విమర్శించి తెలిసికొని వారు సరిపడరని యెవ్వారిని వరించితినిగాను. నాకు మొదటినుండియు దివ్యప్రభావసంపన్నుఁడగు వాని బెండ్లయాడ నభీష్టమైయున్నది. ఇట్లుండునంత నేనొక్కనాఁడు వసంతకాలంబున సాయంసమయంబునఁ జక్కగా అలంకరించుకొని కతిపయప్రియసఖీజనంబు సేవింప నేతల్సౌధోపరిభాగంబునఁ బేరోలగంబునుండి మలయమారుతములు మేనులకు హాయిసేయ నిండువేడుకతో దంత్రీనాదమిళితంబులైన కంఠస్వరము లమరఁ బంచమస్వరంబున విపంచి వాయించుచుంటిని. అట్టిసమయమునం దాకాశమునఁ గలగల యని బంగారుచిరుగంటలధ్వని యొకటి వినంబడినది. దానికి వెఱఁగందుచు మేమందరము తలయెత్తి చూచితిమి. అప్పుడు గౌముదీరుచి నిచయముల బ్రచురమగు దీప్తిపుంజ మొకటి అల్లంత దవ్వునుండి మా కన్నులకు మిరుమిట్లు గొల్పుటయు జడిసి కన్నులు మూసికొని దిగ్గునలేచి దానికి నమస్కరించితిమి.
మరియు నాదీప్తిజాలములు మామేడయంతయు వ్యాపించుటచే నది యెట్టిదియో చూడవలయునని అభిలాష గలిగియున్నను గన్నులు దెరచుట శక్యమైనది కాదు. కొంతసేపు గన్నులఁగప్పికొని యట్టేయుంటిమి కాని క్రమక్రమముగా నా మెరుపు లదృశ్యమైనందున మఱల గన్నులఁదెరచి చూడగా మాయెదుట నొకపురుషుడు నిలువఁబడి యుండెను. అట్టిమోహనాంగుడెదుర నిలువబడినంత వానినాపాదమస్తకమును చూచి వర్ణించుచు బరమేష్టినైపుణ్యమునకు మెచ్చుకొనుచు వాడు తప్పక దివ్యుడని నిశ్చయించి యేమియుం బలుకక వాని పాదంబులంబడి నమస్కరించితిని. అప్పుడా మనోహరుఁడు తన మృదుపాణిపల్లవంబుల నన్ను మెల్లన లేవనెత్తుటయుం దదంగస్పర్శముచేత నామేనెల్ల గగుర్పొడిచి చెమ్మటలు గ్రమ్మి వణఁక జొచ్చినది. పిమ్మట నేను కొంతసేపటికి ధైర్యము దెచ్చుకొని కంఠమున గద్గదికఁ దోపనిట్లంటి.
మనోహరా! నీ వింద్రుఁడవా చంద్రుఁడవా, వసంతుఁడవా, జయంతుఁడవా వీరిలో నెవ్వఁడవు కానిచో నిట్టిరూపము గలిగియుండవు! ఆకాశమునుండి వచ్చుటచే దివ్యుఁడవని తేటయగుచున్నది. మరియుం దేవత లనిమిషులని వాడుకయున్నది. నీయందట్టి విధము లేకునికిఁ గారణమేమో తెలియదు నేను తిలోత్తమయనుదాన. నీపట్టణప్రభువైన శూరసేనుఁడను రాజు కూఁతురను. నేను దివ్య ప్రభావసంపన్నుఁ డగువానింగానిఁ బెండ్లియాడనని నియమము జేసికొంటి. నాకోరిక లీడేర్ప భగవంతుఁడు నిన్ను దయచేసెనని తలంచుచున్న దాన మీ వృత్తాంత మాకర్ణింప నా కెంతేని వేడుక యగుచున్నది. గోప్యము కాదేని నుడువుఁడని మోడ్పుచేతులతోఁ ప్రార్థించితిని.
అప్పుడతండు మందహాసముఁజేయుచు నేమియుమాటాడక నా సఖులపై దృష్టినెరయఁజేసెను. సేనాసన్నగ్రహించి యాసన్నవర్తిసులగు నా చెలికత్తియలనెద్దియో మిషఁబన్ని యవ్వలకుబోవఁ బనిచితిని. తరువాత నాతఁడు తన మెడలోనున్న పుష్పమాలికను నా మెడలో వైచెను. నేను సంతోషములోఁ దాపులు వెదఁజల్లు నా మాలిక ధరియించి మరల నా మెడలోనున్న ముక్తాహారమొకటి తీసి అతని మెడలో వైచితిని. బోఁటీ? పెక్కేటికి వినుము. మన్మథుడు దుర్లంఘ్యశాసనుఁడగుట వసంతసమయము మదజనకమగుట నచ్చోటు రమణీయమైనదగుట నూత్నయౌవన మవినయభూయిష్ట మగుట నింద్రియములు చపలస్వభావంబులగట మనోవృత్తి చంచలప్రకృతియగుట నన్నియుంగూడిన నెట్లుండునో యాలోచింపుము. అంత నప్పురుషపుంగవుండు నాకరం బనురాగంబునం బట్టికొని యల్లనప్రాంతమందున్న తల్పంబునకుందార్చెను. నేనును నేమి అనిన నేమి కోపము వచ్చునోయని భయపడుచు నతండుచేసిన చర్యలకు నొడంబడుచుంటిని. మూడహోరాత్రము లేకరీతి నొకక్షణమైనను విడువకం గ్రీడింప మాకు గడియలాగైననుఁ దోచలేదు నా చెలికత్తెయ లావృత్తాంత మెరిఁగి యుండిరికావున నితరుల నచ్చటికి రానీయక కావలియుండి మా తలిదండ్రులకుఁగూడ నేదియో మిషఁజెప్పి యామర్మమును దెలియనిచ్చిరి కారు నెచ్చెలీ! పిమ్మట జరిగిన వృత్తాంతమేమని వక్కాణింతు నామూడుదినములు నాశృంగారకళానైపుణ్య మంతయు దేటఁబడి నాయొడయునితో నలరితిని.
మఱియు నాసమయంబున నొండొరులకు శృంగారవాగ్రచనావిలాసంబులు మాపుటయేకాని కుశలప్రశ్నావకాశ మింతయుం గలిగినదికాదు. ఒండు రెండు సారులు నాకట్టి యుద్యమము పొడమినదికాని యేమనిన నేమి కోపము వచ్చునో అని యూరకుంటిని. అట్లు సంతోషపారవారవీచికలం దేలియాడుచు మేము మూడవనాఁటి రాత్రి వేగుజామువరకు రతిక్రీడలం జొక్కి నిద్రాయమత్తులమైతిమి. కాంతా! అంత నిశాంతమ్మున నేను లేచి చూచువరకు నా మనోహరుఁడు శయ్యపైలేఁడు. అప్పుడదరిపడి నలుమూలలు వెదకితినిగాని యెందును గనంబడలేదు. పిమ్మట నావయస్యలంజీరితిని. వారును ప్రాంతమందే వేచియున్నవారు కావున నాపిలుపు వినంబడినతోడనే తటాలునఁ జనుదెంచిరి. వారింజూచి నా వల్లభుఁడెందుఁబోయెనో యెరుంగుదురా అని అడిగితిని. వారేమియు నెరుంగమని చెప్పిరి. మేమందరము లేచి యామేడలో నడుగు మేరయైనను విడువక మిగుల శ్రద్ధతో వెదకితిమి కాని ప్రయత్నంబులేమియు సఫలంబులైనవికావు.
పిమ్మట నేను నిరాశఁజేసికొని యేమియుందోచక నేలంజదికిలబడి వాని చర్యలన్నియుం దలంచుకొనుచు వెక్కి వెక్కి యేడువఁదొడంగితిని. అప్పుడు నా సఖులు చుట్టుకొని అయ్యో ! యిదియేమి చర్య ఈపాటి వియోగము సహింపలేవా? మనమొకటి మరచితిమి. అతండాకాశము నుండి వచ్చెనుగదా! యిప్పుడు సైత మా దారినే పోయి యుండవచ్చును. మరల వెంటనే రాకమానఁడు. దీనికి నీవు చింతింపనేల. అతని యాగమనంబు వీక్షించుచుండుమని నాకు ధైర్యము గరపిరి. ఆ మాటలు విని ధైర్యంబు దెచ్చుకొని యాదినము సాయంకాలము వరకు నాకాశంబు నలుమూలలకు దృష్టి ప్రసారములు జరగించితినికాని యేమియు లాభము లేకపోయినది. ఆకాశంబు జూచువరకు నాకన్నులు చిల్లులుపడినవి అది మొదలు కంటికి నిద్రరాదు. నోటికాహార మింపుకాదు. ఏపనియుం దోచదు సర్వదా అతఁడే కన్నులకు గట్టినట్లుండును. సఖీ! నీతో నేమని వక్కాణింతు. నేఁటికతండుపోయి సంవత్సరమైనది నీతో మాట్లాడుచునే యుంటినికాని నాబుద్ధి యతని అందేయున్నది. ఇప్పటికిసైత మాశవదలక బయలు చూచుట అలవాటుపడినది. నీవు వచ్చినది మొదలు కొంచె మాహారము రుచింపుచున్నయది. ఈ నడుమ మాతండ్రి యీ గొడవ యేమియు నెరుఁగక నన్ను వివాహమాడుమని నిర్బంధింపగా నేమియుంజెప్పక నామనంబున నాటియున్న నామనోహరుని యాకృతిఁ జిత్రపటంబున వ్రాసియిచ్చి యటువంటి పురుషునిఁ దెచ్చినఁ బెండ్లి యాడెదనని చెప్పితిని. అతండు పటమును దేవాలయంబునం గట్టింపఁబోలు. ఇదియే నావృత్తాంతము. ఈ రహస్యము నేనును నా చెలికత్తియలుతప్ప యితరులెవ్వరు నెరుఁగరు. నీవును నా ప్రాణసఖివిగసుక వక్కాణించితిని. నావంటి దురదృష్టవంతురాలి కట్టిప్రియుఁడెట్లు దక్కునని మిక్కిలి పరితపించుచు నతడు తనమెడలో వైచిన పుష్పమాలిక మందసములో భద్రముగా దాచి యుంచినది కావున దానిందెప్పించి చంద్రలేఖకుఁ జూపినది.
అప్పుడు చంద్రలేఖ యాదండ రుచికు డల్లినదానిగా గురుతుపట్టి వికలమతియై యిట్లు తలంచెను ఆహా! ఈ వృత్తాంతమంతయు మిక్కిలి చోద్యముగా నున్నది ఎక్కడి జగన్నాథము? యెక్కడి రుచికుఁడు ? యెక్కడి రామచంద్రనగరము! యెక్కడి యాకాశగమనము! యెక్కడి తిలోత్తమ! ఇట్టి అద్భుతము లెప్పుడునుఁ గనివిని యెఱుంగము. రుచికునికి వియద్గమనశక్తి కలిగియున్నట్లు తోచుచున్నది. తన్మూలంబున నతఁ డాతోఁట గోడ దాటిపోయెను కాబోలు. అట్టిశక్తి రుచికునికిఁ గలిగియున్నచో నతని బాల్యస్నేహితుఁడైన గౌతముఁ డెరుఁగడా? యెఱింగి యుండిన నాతో నేమిటికిఁ జెప్పకుండును కావున నదియును నిశ్చయింపరాదు. కానిమ్ము మరికొన్నిదినములు నేనిందుండెద నెప్పటికేని మరల నాదివ్యుఁ డిందులకుఁ రాకుండునా? వచ్చినంబట్టుకొనిన సర్వము నతనివలఁన దెలియనగునని యీరీతిఁ బెక్కుతెఱంగులఁ దలపోసి యారహస్యమేమియుఁ దిలోత్తమకుఁ దెలుపక మరల దానితో నిట్లనియె.
బోఁటీ! వచ్చినవాని కులశీలనామంబులు దెలియకుండ మగనిగా వరించుట కొంచెపుసేతకాదా! వరించితివివో! నడుమ అడిగినందప్పా? అప్పురుషుండును నీ తెఱఁగెరుఁగకుండ నీవువోలె నూరక నీతో గ్రీడించుటయుఁ జిత్రముగా నున్నది. కానిమ్ము కడచిన పనికి వగచిన ప్రయోజనములేదు మరల నంత డెప్పటికేని రాఁగలఁడని నాకునుం దోచుచున్నది. నీవు చింతిల్లకుము. నేనును దీనిని గురించి ఆలోచించుచుండెద నని పలుకుచు నెట్టకే దాని దుఃఖము బోఁగొట్టినది. నాఁటఁగోలెఁ దిలోత్తమకువలెఁ జంద్రలేఖకును దివ్యదృష్టి యభీష్టమైనది.
బలసింహుని కథ
ఇట్లుండునంత నారాజు బావమరది బలసింహుఁడను వాఁడు చంద్రలేఖ యాయూరిలో సభఁ జేసిననాటనుండియు దానిని వలచియున్నవాఁడు గావున విరాళిం గుందుచు మరల దానిం జూచి మాట్లాడవలయునని యెన్నియో ప్రయత్నములు చేసెను. కాని యప్పల్లవపాణి యెల్లప్పుడు తన మేనకోడలు తిలోత్తమ యంతఃపురమున నివసించి యుండుటచే శక్యమైనదికాదు.
బలసింహుఁడు ప్రతిదినమున వేశ్యను వశపరచుకొనుట కెన్నియో తంత్రంబులు మంత్రంబులు క్రియలు జరుపుచుండుటచే నాసంగతి గ్రహించి పూవుఁబోడి తన యజమానురాలగు చంద్రలేఖతో వాని వలపు పొలుపును మంత్రతంత్రప్రయోగరీతియుం జెప్పిన నప్పడతి అంతగా విశ్వసించినదికాదు. ఒకనాఁడు బలసింహునిచే బోధింపబఁడి మంధరయను పరిచారిక యేకతమ చంద్రలేఖ యొద్దకుఁ బోయి రహస్వముగా నిట్లనియె.
యువతీ! నీతో నొకరహస్యము చెప్పవచ్చితిని. అదియుఁ నీకు సుఖప్రదమైనదని సాహసించితిని. మరియొకలాగునఁ దలంపకుమా, మారాజుగారి బావమరిది బలసింహుడు నిన్ను సభలోఁ జూచినది మొదలు మదనశరముల కెరయైయున్నవాఁడు. అతని వైభవము నిదివరకే వినియుండవచ్చును. శూరసేనుండు సైత మతనికి జడియుచుండును. మా రాజుగారికిఁ బుత్రసంతతి లేనందున నీ రాజ్యమతనిదిగా భావింపుము. మారాణికి బలసింహుని యందు మిక్కిలి యక్కటికము గలిగియున్నది. పిన్ననాట నుండియు నతని నామెయే పెంచినది పెక్కేల నామెకు బలసింహునియందుఁ దిలోత్తమయెడకన్న నెక్కుడు మక్కువ గలిగియున్నది. రూపంబున నీకు దగినవాడు. అట్టి పురుషుఁడు నినుఁ జేపట్టఁ దలఁచికొన్నవాడు. నీవును వారాంగనవుగదా. దీని కేమికొదవయయ్యెను. సంతతము నీ విద్యారూపంబులకే యచ్చెరువందుచుండు. వేయినేల తన ప్రాణము నీయధీనము చేయుదునని చెప్పుమనియె. యొప్పుకొనినం జక్కగా నుండునని నాకు దోచెడిని. కుసుమకోమలమైన యీ జవ్వనమంతయు వృధఁజేయకుము. మా రాజపుత్రిక నున్మత్తగా నెంచికొంటిమి. నీవును నట్టి వెర్రిత్రోవంబడక నా చెప్పిన చొప్పున నొప్పుకొనుము. నీకు మేలయ్యెడినని మరియుం బెక్కు విధముల దన చాతుర్యమంతయుం దేటఁబడ బోధించినది. ఆ మాటలన్నియు విని చంద్రలేఖ మందహాసము సేయుచు నోహో! మందరా! నీవు మందరయంత దానవగుదువు. నాహితంబు కోరి చెప్పినందుల కెంతయు సంతసించితిని. కాని యట్టి యుద్యమము నాకు గలుగలేదు. ఊరక నావిషయమై విరాళిఁగుందుట బలసింహునికిఁ దగదని నుడువుము మరియు నేను వారకాంతనైననుఁ బరాయతనై యుంటినిగాని స్వైరిణిగాను. నా ప్రాణవల్లభుఁడు దేశాంతరమందున్నవాడు కావున నీ వీమాటలం బోయి చెప్పుము. మరియెప్పుడును నేసందేశమును నాయొద్దకుఁ దీసికొని రాకుము. పోపొమ్ము. అని తిరస్కారపూర్వకముగాఁ బలికినది.
అప్పుడు మంధర చిన్నవోయి మారుమాట పలుకక యలుకమెయి వచ్చినదారిం బోయి బలసింహున కంతయుం జెప్పి యప్పా! యిప్పు డప్పడఁతి రాజపుత్రిక సాంగత్యంబు కలిగెనని మిగుల గర్వముతో నున్నది. నిన్నును నన్నును లెక్క సేయునా? యని కేరడమాడినది. అప్పుడుబలసింహుని చిత్తంబున లజ్జాక్రోధంబు లుత్తలపెట్టినవి గాని చంద్రలేఖపయింగల వలపుపెంపునం జేసి యవి వెంటనే యణగిపోయినవి. తరువాత నతఁడు మంధరకొక పారితోషికమిచ్చి ఓసీ? యింత మాత్రమునకు నీవు విరక్తిఁ బొందకుము. మత్తకాశినుల చిత్తంబులు క్షణక్షణమునకు మారుచుండును. నీకు మరియుం బారితోషిక మిచ్చువాఁడ. సర్వదా యాచంద్రలేఖ చిత్తంబును గనిపెట్టి యంతరముననే తిరుగుచుండుము. సమయమరసి నాతోఁ జెప్పుము. కోపముసేయక నిదానించుమని యెన్నియో బుద్ధులు గరపి దానింబంపెను.
పిమ్మట బలసింహుఁ డేమియుందోచక యంతకంతకుఁ గంతుసంతాపము మీరుటయు నా పట్టణంబులో శకునంబులు సెప్పునట్టి యొక యోగియొద్దకు రహస్యముగాఁబోయి తాను వారకాంతను వలచుటయు నది తన్ను నిరాకరించుటయు లోనుగా నగు కథ యంతయుం జెప్పి యప్పూఁబోణి తనకు వశ్యమగునట్లు చేయుదువేని నీవు కోరిన ధనమిత్తునని పలికెను. ఆ మాంత్రికురాలు వాని మాటలు విని మిగుల సంతసించుచు నోహో ఇది యెంతపని. ఆ కాంత నీచేతిలోనిదానిగాఁ దలంపుము. నా ప్రజ్ఞావిశేషంబు చూచి నీవే సంతసింతువు. నాకిచ్చు సొమ్మెంతయో చెప్పుము. దానిలో సగము ముందుగా నీయవలయును. తరువాత బహుమతితోఁ గూడ తక్కిన సగము నిచ్చెదవుగాని యిప్పుడే యాయోషధి సిద్ధము చేసి నీ కిచ్చెదనని చెప్పుటయు సంతసించి బలసింహు డిట్లనియె.
దేవీ? నేను పెద్దల చాటువాఁడనని యెరుంగుదువు గదా అట్లైనను ముందు నీకు రెండువేల నిష్కము లిచ్చెదను. తరువాత నాయీవి చూచుదానవుగదా. ఈ మాత్రమునకు సంతసింపుము నీ యుపకార మెప్పటికి మరువనని బ్రతిమాలఁ దొడంగుటయు నర్ధాంగీకార సూచనము జేయుచు కానిమ్ము తెమ్ము. సొమ్మున కేమి మాటకావలయును గదా యని పలికెను. బలసింహుఁ డప్పుడే పోయి యాసొమ్మంతయుం దెచ్చి రహస్యముగా దానికిచ్చెను. అదియు సంతసంబుతోఁబుచ్చుకొని స్నానము చేసి రమ్మని యొక మంత్రముపదేశము చేసి యిట్లనియె.
శ్లో॥ శివశిరసిస్థితమాల్యం జీవంజీవక మయూరయోరస్థి
వామక రేణగృహీతం వాత్యావర్తోద్దితం పత్రం.
రాజపుత్రా? ఏతదాద్వనేకశ్లోకసమ్మతమగు నీ చూర్ణమును నేనుపదేశించిన మంత్రమును జపించుచు నీవు కోరిన చంద్రలేఖ శిరముమీదఁ జల్లుము. నీకుఁ గుక్క లాగున వశ్యయై నీవున్న చోటునకు వచ్చి సంతతము నిన్ను విడువకుండునని చెప్పి యాచూర్ణ మిచ్చి యంపినది.
అతఁడా చూర్ణమునుఁ బదిలముగా మూటఁగట్టుకొని యయ్యోగిని చెప్పిన చొప్పున నా మంత్రమును జపించుచు సంఖ్యాపూర్ణమైన వెనుక చంద్రలేఖ శిరంబున నోషధీచూర్ణము జల్లుట కవకాశము వెదకుచు నొక్కనాఁడు రాత్రి యంతఃపురరక్షకులకు మిక్కిలి రొక్కము పంచిపెట్టి యెట్టకేలకు మందరతోఁగూడ చంద్రలేఖ యున్న మేడలోనికిఁబోయెను. మంధర చంద్రలేఖ పండుకొనియున్న గది యెరిగియున్నది. కావున నచ్చోటికిఁ దీసికొనిపోయి యతని కా నాతిం జూపినది. చంద్రలేఖ గాఢముగా నిద్రఁబోవుచుండుట పరికించి శిరమున కా చూర్ణము విసరినతోడనేఁ దనతోఁ గుక్క లాగున వచ్చునను నమ్మకముతో నా చూర్ణము తీసి దాని తలపై రుద్దెను.
అప్పుడా చంద్రలేఖ యదరిపడి లేచి కన్నులు నులిమికొనుచు నెదుర నిలువంబడిన బలసింహుని జూచి భయపడి యెవ్వఁడవు నీ వని యడిగినది. అతండును హ్రాం, హ్రీం, క్లీం, హు, మ్మని యా మంత్రమును జపించుచు నా చూర్ణంబును మరలఁజల్లుచు నేను. నేను రమ్ము. రమ్ము, అని పలుకఁగా నక్కలికి యలికిపడి యోహో! నేననఁగా నేమి నీ వెవ్వఁడవు యీ యర్ధరాత్రంబున నిచ్చటి కేల వచ్చి తివి? యీ దుమ్ము నా శిరమ్మున రాయుటకేమి కారణము. చెప్పుమని యడిగినవాఁడు అయ్యో! చంద్రలేఖా? నేనే! యింకను దెలియదా యేమి? నిద్ర మెలకువ రాలేదు. కాఁబోలు. ఈసారి తెలియునులే యని తన చేతిలో నున్న చూర్ణమును మరల దాని నెత్తిమీదఁ జల్లెను.
అప్పుడది మిగుల వెఱపుతో దొంగ దొంగ అని అరచినది. ఆ రొద విని యంతఃపురకాంతలెల్లరును లేచి అచ్చటికి వచ్చిరి. ఆ యలజడిలో నిలువ భయఁపడి బలసింహుఁడు వచ్చినదారిఁబట్టి పారిపోయెను. ఆధ్వని విని తిలోత్తమ లేచివచ్చి దొంగ వచ్చెనా అని అడిగినఁ జంద్రలేఖ బలసింహుని క్రౌర్యమని గ్రహించియుఁ దన్మూలమున నది చిన్నవోవుననితలంచి యేమియు నెరుఁగని దానివలె మాట్లాడినది. అంత నబ్బలసింహుఁడు నంతఃపురములో నల్లరి జరిగినందులకు భయంబు జెందుచు నాసంగతి వెల్లడియైనచో రాజే తన్ను శిక్షించునని వెఱచుచు మంత్రంబును తంత్రంబును నేమియు బ్రయోజనమైనవి కావని మాంత్రికురాలిందిట్టుచుఁ జంద్రలేఖ యొకవేళ మందు తల కెక్కిన వెనుక ననురాగముఁ జెంది తన్ను వెదకికొనుచు మరల వచ్చునేమో యని యాశతో నలుమూలలు బరికింపుచు నే మాత్రము చప్పుడైనను దానిపాదధ్వనితలచి యిటురమ్ము ఇచ్చట నున్నాఁడనని మెల్లగా బలుకుచు నీరీతి నతిప్రయత్నముతో నా రాత్రివేగించెను. ఉదయంబున దన్నుఁ జూడవచ్చిన మంధర గాంచి యేమే! బోఁటీ! నేను వచ్చినతరువాత జరిగిన యంతఃపురవిశేషములేమి? నన్ను గురుతుపట్టలేదుగద. మాంత్రికురాలు నన్ను మాయజేసినట్లు తలంచెదనుసుమీ! అది నాప్రస్తావనయేదైనను నీయొద్ద తెచ్చినదా? నామందు తల కెక్కమినట్లున్నది. కాని యీపాటికి దాని హృదయములోఁ గొంచెము కొంచెమనురాగ మంకురింపుచుండు ననుకొందును. నీవేమని యెదవని బలుఁకగా నది నవ్వుచు నిట్లనియె.
మేలుమేలు, నిన్ను మాంత్రికురాలు చక్కఁగామాయఁజేసినది. దానికి నీయం దెంతమాత్రము నిష్టములేదు నీవూర కాశపడియెద వేటికి? తిలోత్తమతోఁ నీవార్త యేమియు మొదటఁజెప్పక మఱియొక రీతి బొంకినది. అప్పుడు నేనది నీమందు పని చేసినదనుకొంటిని గాని తరువాత నుదయమున నన్నుఁ జూచి కోపంబుతో నిట్లనియె. మంధరా! బలసింహుఁడుచేసినకృత్యము నేను గ్రహించితిని. రాజబంధువుఁడను బుద్ధితో నీసారి కూరకుంటిని. దీనికి నీవు కారకురాలవు. ఇంకొకమాఱు మీరిట్లు చేసితిరేని రాజుగారితోఁ జెప్పకమానను. నీబలసింహుని బుద్ధిగలిగి యుండుమని చెప్పుము. మొదటఁజెప్పిన సంగతి మరచితివా? అంతఃపురచారిణివగు నీ కిట్టిబుద్ధులు తగపు పొమ్ము. అని నన్ను భయపెట్టినది. కావున నీవు చంద్రలేఖపైఁ గల యాశ వదలివేయుము. లేదా మరియొకయుపాయ మాలోచించుకొనుము. తిలోత్తమయుఁ జంద్రలేఖయు రెండుమూడుదినముల కీయూరిప్రాంతములోనున్న యుద్యానవనంబు లోనికిఁ బోయి యందుఁ గొన్నిదినంబులు గ్రీడింతురట. ఈమాటయు వారివలననే నింటి. నివియే యంతఃపురవిశేషంబులు అని చెప్పియరిగినది. అప్పు డతఁడు హృదయమున రోష మావేశింప నౌరౌరా! రాజపుత్రికతో మైత్రి కాబట్టికదా బోగముతొత్తున కింత మత్తత గలిగినది. కానిమ్ము. దీనిపని పట్టించెదను. ఉద్యానవనమునకుఁ బోవనీ యని తలచి యప్పుడే యాపట్టణంబున గజదొంగలని పేరుపొందిన మర్కటమారీచులను వారియింటికిఁ బోయి యంతకుఁపూర్వమే వారితో మైత్రి గలిగియున్నవాడు కావున వారిని కుశలప్రశ్నవేసెను. వాండ్రును బలసింహుని మిగుల మర్యాదఁజేసి కూర్చున్న వెనుక నాగమనకారణ మడిగిరి.
బలసింహుఁడు తనకథయంతయుం జెప్పి యాచంద్రలేఖ యుద్యానవనములో నిద్రించుచుండ మంచముతోఁగూడ నా ప్రచ్ఛన్నగృహంబునకుఁ దీసికొనిరావలయును. మీకుఁ దగిన పారితోషిక మిచ్చెదను. మీమే లెప్పటికిని మరువనని ప్రార్ధింపఁగా మర్కటమారీచులందులకు సమ్మతించి యప్పుడే యతనిచేఁ బారితోషికమంది సమయ మరయుచుండిరి. అంత మరిరెండుదినములకుఁ దిలోత్తమయుఁ జంద్రలేఖయు నుచితసఖీపరివారము సేవింప బాహ్యోద్యానవనంబునఁ గ్రీడింప నరగిరి. అయ్యుపవనంబునకుఁ జుట్టునుఁ బ్రహరియున్నది. లోపల ననేకవిచిత్రములైన మేడలున్నవి. అందు వారు నిరాఘాటంబుగా విహారంబు చేయుచుఁ గొన్ని దినంబులుండిరి.
వారిగుట్టంతయు మంధరచేతఁ దెలిసికొని బలసింహుఁడు మర్కటమారీచులకుఁ దెలుపగా వాండ్రును నొక్కనాఁడు రాత్రి సమ సహచరులఁ గొందర వెంటబెట్టుకొని యత్తోఁటగోడకు మారుమూలఁ గన్నంబువైచి లోనికిఁబోయి తిలోత్తమయుఁ జంద్రలేఖయుఁ బరుండియున్న మేడ వెదకిపట్టుకొని దాని యుపరిభాగంబున నిద్రించుచున్న వారిద్దరిం గనుంగొని గురుతుపట్టజాలక సంశయించుచు దమకుఁ దోచిన యూహ చొప్పున దిలోత్తమనే చంద్రలేఖ యనుకొని యామె మంచంబును భుజముల నానుకొని మెల్లగా నాగోడలన్నియుం దాటి కన్నము వెంపటబడి నీవలకు వచ్చి గూఢంబుగా బలసింహుఁడు నివసించియున్న రహస్యగృహంబునకుఁ దీసికొనిపోయిరి.
ఆహా! వారిచోరచాతుర్య మెట్టిదో చూడుము. ఎంతదూరము నడిచినను నప్పడఁతికి నిద్రాభంగ మైనది కాదు. బలసింహుఁడు వాండ్రతో మొదట తిలోత్తమాచంద్రలేఖల గురుతులు చెప్పుట మరచిపోయెను. కావున నావిషయమై యనుమానము జెంది వాండ్రు మంచమును తీసికొని వచ్చినతోడనే దీపము పెట్టి చూచి పరీక్షించెను. అత్తరుణి తిలోత్తమయని తెలిసికొనినంత బలసింహునకు మేను వణకజొచ్చినది. కంఠము గద్గదికమైనది. చెమ్మటలు మేనెల్ల గ్రమ్మినవి అప్పుడు వాండ్రతో సన్ననియెలుంగున నోరీ! కొంపముంచితిరే! ఇది నామేనగోడలు, తిలోత్తమ. దీనికి మెలకువ వచ్చెనేని నన్ను గురుతుపట్టును. వేగిరము తీసికొనిపోయి యథాస్థానమం దుంచుఁడు. లేకున్నముప్పువచ్చునని పలుకుచు హస్తసంజ్ఞాపూర్వకముగా వాండ్రను తొందర పెట్టెను.
అప్పు డాచోరులు భయపడుచు బలసింహునిపై విసిగికొనుచు మరల నా మంచమును భుజంబుల నానుకొని మెల్లగా వీథింబడి పోవం దొడంగిరి. ఆవీథియం దొకపెండ్లివారు మేళతాళంబులతో నూరేగుచుండఁగా నయ్యలజడిలోఁ దిలోత్తమ లేచునేమో యను భయముచే మరియొక వీథింబడి నడువసాగిరి. అందునను రాజభటులసమ్మర్దము గలుగుట వేరొకవీథిని బోఁదొడంగిరి. అచ్చటను ప్రజలు లేచితిరుగుచుండుటచే మరియొకమారుమూలవీథి నరిగిరి. ఈరీతి క్రమక్రమంబుగా నొకదెసలనుండి వేరొకదెసకుబోయిరి. వారికి నుద్యానవనంబునకుఁ బోవుట కెంతమాత్రము నవకాశము గలిగినదికాదు. అప్పుడు వాండ్రు ఇక మనము తోఁటలోనికి బోలేము. తెల్లవారు సమయమైనది. రాజభటులు మనలను జూచిరేని బట్టుకొందురు. బలసింహుని భయంబు మన కేటికి, దీనిమేనున మంచివిలువఁగల రత్నపు సొమ్ములు గలిగియున్నవి కావున దీనిం దీసికొని యడవిదారిం బడి బోవుదము అని యొండొరులు నిశ్చయించుకొని యా మంచంబుతో నొకమహారణ్యమార్గంబునంబడి పోయిరి.
అచ్చట నుద్యానవనంబులో నుదయంబునఁ జంద్రలేఖ లేచి తిలోత్తమను గానక పరితపించుచుఁ జెలికత్తియల నందఱం బిలిచి యా తోఁటయంతయు వెదకుచుండెను. ఇంతలోఁ గావలివారలు తోఁటగోడకు దొంగలు కన్నంబువైచిరని అఱచిరి. ఆమాటలు విని చంద్రలేఖ యురస్తాడనపూర్వకముగా దుఃఖింప దొడంగినది. ఇంతలో నా వృత్తాంతము విని భార్యామంత్రిబంధుపరివారసహితంబుగా మహీపతి అచ్చటికి వచ్చి పుత్రికారహితమగు నయ్యుద్యానవనంబు గాంచి మిక్కిలి దుఃఖంపఁదొడంగెను. పృథుకీర్తియను నతనిమంత్రియుఁ దిలోత్తమ నరయుటకై వడిగల వారువంబు నిచ్చి నలుమూలలకు రాజభటుల నంపెను. అట్టిసమయంబున బలసింహుడు చనుదెంచి చంద్రలేఖను సాధించుట కిదియే సమయమని తలంచి మోహో! మీరు వెఱవకుఁడు వెఱవకుఁడు. దీనిగుట్టంతయు నేను గ్రహించితిని. అని పలుకగా నచ్చటివారెల్ల విచారించుటమాని యతని మొగంబున జూడ్కులు బరగించిరి.
అప్పుడు పుడమిఱేఁడు శ్యాలకునిఁజూచి యోయీ! నీవేమెఱుంగుదువో చెప్పుమని అడుగఁగా నతండిట్లనియె. బావా! నేనేమని వక్కాణింతును. ఇట్టిపని చేసిన దొంగ యిచ్చటనేయున్నది. ఎచటనుండియును జోరులు రాలేదు. ఈకపటము మనము గ్రహింపలేకపోతిమి లంజపడుచుతో మన తిలోత్తమ సహవాసము సేయుచుండ నుపేక్షించి యూరకొనిన తప్పెవ్వరిది. ఆ లంజను నుంచుకొనినవాఁడు మన తిలోత్తమ విద్యారూపసంపత్తులు విని దానిం దీసికొనివత్తువేని నీకు మిక్కిలిరొక్క మిత్తునని చెప్పుటచే నీవేషము వేసికొని క్రమముగా దానితో మైత్రిఁ జేసి యుద్యానవనవిహారపుమిషచే యిల్లు గదలఁజేసి తుదకు దాని నంపివేసినది. ఇదంతయు నిక్కువంబు. ఈ సంగతి యొండు రెండుసారులు నా చెవింబడినది గాని మహారాజుగారే యుపేక్షింప నాకేమిటికని ప్రకటించితినికాను. ఇంతయేల యిందలి యథార్ధమంతయు మనయింట నున్న మంధర నడుగుఁడు. చెప్పఁగల దనుటయు నృపతి యాదాదిని రప్పించి యడిగిన మ్రొక్కుచు నది యిట్లనియె.
దేవా! యీ చంద్రలేఖ వచ్చినది మొదలు కపటాలోచన చేయుచున్నది. మన తిలోత్తమ నెచ్చటికో తీసికొని పోవలయునని దలఁచుచున్నది. ఆ స్థల మెద్దియో తెలిసినదికాదు నిత్యంబును దాని కెచ్చట నుండియో యుత్తరంబులు వచ్చుచుండునవి. కాని దాని పరిచారిక పూఁబోణి పుచ్చుకొని చంద్రలేఖ కిచ్చిన వానికది ప్రత్యుత్తరములు వ్రాయుచుండును. ఈరీతి జరుగుట నేను గ్రహించి మొన్న నొకనాఁ డాయుత్తరంబులు తెచ్చెడు సమయమున నచ్చటనే కాచి యుంటిని. ఇంతలో నా దూతలు పూర్వమువలెనే యెద్దియో యుత్తరము తెచ్చిరి. అది చూచి నేను వారితో నయ్యా! నేడు పూఁబోణి పనిమీద వెళ్ళినది మీయుత్తరమును నన్నుఁ దీసికొనిరమ్మని చంద్రలేఖ పంపినది. కావున మీరు తెచ్చిన యుత్తరంబు నా చేతికిండని యడిగితిని. వాండ్రు నా మాటలు సత్యమే యనుకొని యాయుత్తరంబు నాకిచ్చి మేమిచ్చటనే యుందుము ప్రత్యుత్తరంబు వడిగాఁ దీసికొని రమ్మని చెప్పిరి.
పిమ్మట నే నాయుత్తరము విప్పి చదువఁగా నిట్లున్నది. చంద్రలేఖా! నీవు బోయి పెక్కుదినంబులైనది. తిలోత్తమ నెప్పుడు తీసికొని వత్తువో తెలియదు. నేను నీ విరహముచేతఁ గృశింపుచు గడియ యుగముగాఁ గడుపుచుంటిని. ఎట్లయినను కార్యము సఫలము చేసికొనిరమ్ము. నీ రాకకు నిరీక్షించుచున్న వాఁడను. ప్రత్యుత్తరమిమ్ము అని యింతవరకుఁ జదువునంతలో చంద్రలేఖ పరిచారిక పూవుఁబోణి వడివడివచ్చి నాచేతిలోని యుత్తరము లాగికొనినది. కావునఁ దరువాత నేమియున్నదో చదువుటకు వీలు పడినది కాదు.
అప్పువ్వుఁబోణియు నేనది చదివినందులకు మిగుల కోపము చేయుచు గానిమ్ము తిలోత్తమతోఁ జెప్పి నిన్ను దండింపఁ జేయుదునని పలికి పోయినది తరువాత నే నీసంగతి నెవ్వరితోఁ జెప్పక యీ అయ్యగారితో మాత్రము జెప్పితిని. ఇదియే నే నెరిఁగిన సంగతి. ఇంతకన్నా నాకేమియుం దెలియదని అదరును బెదరును లేక చెప్పినది. దాని మాటలు విని అచ్చట నున్నవారెల్ల వెఱఁగు పడఁజొచ్చిరి. అప్పుడు మంత్రి తక్షణమే యా చంద్రలేఖం బిలిపించి మందర చెప్పిన మాటలన్నియును మరల వినిపించి దీనికి నీవేమి చెప్పెదవని అడిగెను.
ఆ మాటలువిని చంద్రలేఖ మ్రాన్పడి యొక్కింతసేపు కన్నులు మూసికొని యూరకుండి హా? విధీ! నన్నెట్టి యాపత్సముద్రంబులో ముంచితివి. ఇప్పుడు నేనేమి చెప్పినను వీరికి నమ్మకముఁ దోచునా! ఈమంధర నాపయింగల కోపముఁ దీర నెంతకల్పనం జేసినది. నా ప్రారబ్ధ మిట్లుండ దానిదూరఁట యేమిటికి. కానిమ్ము. వీరితో నిప్పు డిది సత్యము అది అసత్యము అని వాదించి చెప్పుట నాకేమి అవసరంబున్నది. అట్టి యాప్తులతో వియోగము గలిగినది గదా? నేను బ్రతికియున్నను లాభ మేమి అని పెక్కుతెఱంగులం దలంచుచు నెట్టకేలకా మంత్రితో నిట్లనియె.
అయ్యా! నే నిట్టిపని చేయుదునని మీకు సమ్మకము తోచినచో నన్ను సత్వరంబుగా శిక్షింపుఁడు. అని పలికి కన్నులు మూసికొని తలవాల్చి యూరకున్నది. అప్పుడు మంత్రి చెలువా! నీ వీరీతిఁ బలికిన మేమేమి చేయుదుము నీవు నేరంబు చేయనట్టు నిదర్శనంబులున్న వక్కాణింపుము. లేకున్న శిక్షకుఁ బాత్రురాలవే అగుదువు నిజము చెప్పుము. అని అడుగ నేనట్టి పనిచేయుదునని మీకు నమ్మకము దోఁచినయెడల నన్ను సత్వరముగా శిక్షింపుఁడు అని పలికిది. వారెన్నిసారు లడిగినను వేఱొకమాటలేదు.
అప్పుడు బలసింహుఁడు కోపించుచు నీ కీ అనుమానమేల గలుగవలయును? కన్నములో దొరికిన దొంగ యేమని బొంకునో చెప్పుము. అది చెప్పిన మాటలలో నొప్పుకొనునట్లు సూచన కాలేదా? తప్పక దీని దండింపవలయునని చెప్పెను. బుద్ధిమంతుఁడగు మంత్రి బలసింహా! తొందరపడకుము. ఈమగువ మొగంబు చూడ నేరము చేసినట్లు కనంబడదు. ఇది యిట్లు చెప్పుటకు వేరెద్దియో కారణముండ వచ్చును. ఈ మంధర చెప్పిన మాటలు నాకంత విశ్వసనీయంబులుగాఁ దోచలేదు. ఇత్తరుణి తిలోత్తమకన్న విద్యారూపంబులచే నధికురాలైయున్నది. ఇప్పడఁతి యొడంబడునేని మహారాజులై నను శుద్ధాంతకాంతగా స్వీకరింతురు. ఇట్టి తరుణి యొకరికి దూతికాకృత్యంబు జరుపుట కేమి యవసరము కలిగెడిని తిలోత్తమయందు దీనికి సహజానురాగము గలిగియున్నదని నేనుఁ జెప్పగలను. తద్వియోగశోకంబుచేతనే యిట్లనుచున్న యది. కావున నీపూఁబోణి దండ్యురాలు కాదని చెప్పెను. బలసింహుఁడును రాజు నెదుట దాని దండింపక తీరదని వాదించెను
మంత్రికిని బలసింహునకును దానిగురించి పెద్దతడవు పోట్లాట జరిగినది. రాజు మంత్రిమాట మన్నింపక బావమరది పక్షమే అవలంబించి యతండు నుడివిన శిక్ష చంద్రలేఖ కప్పుడే విధించెను. రాజశాసన మెవ్వరు గాదనఁగలరు. చంద్రలేఖను బండి యెక్కించి యూరేగించి బలసింహుఁడు వెంటరా రాజభటులు చటులముగాఁ బలుకుచు నక్కుటిలాలకను సముద్రప్రాంతమందున్న మహారణ్యములో విడిచివచ్చిరి. ఆహా! విధిగతి
మ. ధరఖర్వాటుఁడొకండు సూర్యకరసంతప్తప్రధానాంగుఁడై
త్వరతోడం బరువెత్తిచేరి నిలిచెం దాళద్రుమచ్చాయఁ ద
చ్చిరమున్ తత్ఫలపాతవేగమున విచ్చెన్ శబ్దయోగంబుగాఁ
బొరి దైవోపహంతుండు బోవుకడకుం బోవుంగదా యాపదల్.
పిమ్మట నతండనురాగముతో నా కొమ్మ చేతికట్టులన్నియు విప్పి తదంగస్పర్శవలన సంతోషము జెందుచు తెరవా! కన్నులు తెరువుము. నే నిట్లు చేయించితినని నామీఁదఁ గోపమా యేమి? ఈ అపరాధమునకుఁగాను నిన్ను దగినసౌఖ్యంబునుఁ బొందింతునులే అని అనేకప్రకారముల వన్నెచిన్నెలతోఁ బల్కరించెను. కాని అది యేమియు నెఱుఁగదు. పిమ్మట దాని లేవనెత్తవలయునను తలంపుతో లేచి కొంచెము వంగి చేతులు సాచునంతలో నాప్రాంతమున మృగముల వేటాడుటకై కుమ్మరుచున్న యొక కిరాతుఁ డతనిఁ జూచి యెద్దియో మృగమనుకొని వాడిఁగల యూచతో నేసెను. ఆ శరఘాతంబున నతండు హా! చంద్రలేఖా అని అరచుచు నేలంగూలి తన్నుకొనుచుఁ గొంతసేపటికి బ్రాణములు విడిచెను. అబ్బోయవాఁడును తన బాణంబునం గూలినవాఁడు మనుష్యుడని తెలిసినతోడనే భయపడుచు నాప్రాంతమందు నిలువక యెక్కడికేని పారిపోయెను.
ఉ. రాతిరి మూషకంబు వివరం బొనరించి కరండబద్ధమై
భీతిలి చిక్కి యాసచెడి పెద్దయు డస్సిన పామువాత సం
పాతముఁ జెందె దానిఁ దిని పాము తొలంగె బిలంబుత్రోవనే
యేతరిహానివృద్ధులకు నెక్కటిదైవమె కారణంబగున్.
ఆకలిచేత డస్సి చచ్చుటకు సిద్ధముగానున్న యొక పాము రాత్రియందు యెలుక యొకటి తానున్న పెట్టెకుఁ గన్నము గొట్టి లోపలకురాఁగా దానిం దిని యాకలి యడంచుకొని యావివరంబునుండి పెట్టె వెడలి పారిపోయెను. ఆరీతినే శుభాశుభంబులు యింటిలోనున్నను దైవమే తెచ్చి యిచ్చునుగదా! ఆ యలజడిలో జంద్రలేఖ తెరపి తెచ్చికొని లేచి యెదురనున్న బలసింహునిఁ గాంచి యమ్ము సోకి యతండు గతాసుఁ డగుటయుం దెలిసికొని యాశ్చర్యమందుచు నౌరా యీ దుర్మార్గుఁడు నన్ను గురించి యెట్టి యేర్పాటుఁ గావించెను. వీనిం దైవము తెగటార్చెను. నాచేతికట్లు విప్పినది వీఁడే కావచ్చును. పాప మాహారవస్తువులు గూడ నానిమిత్తము తీసికొనివచ్చెనే! కానిమ్ము. భగవంతునికి నాయందు దయబుట్టినది కాబోలు. ఇప్పుడు నాహృదయంబున దుఃఖమిళితమైన సంతోషంబు కలుగుచున్నది. ఇట్టి సమయమందు ధైర్యమును విడువరాదు. కర్మసూత్రంబునం బట్టిపోయెదను అని పెక్కుతెరంగులం దలపోయుచుఁ వాడు తెచ్చియుంచిన యాహారపదార్ధంబులు భుజించి యాకలిఁ దీర్చుకొని మెల్లగా నచ్చటఁ గనంబడిన త్రోవంబడి నడువసాగినది.
ఆదారింబడి పోవంబోవ సముద్రతీరంబునకుఁ బోయినది. చంద్రలేఖకు మొదట సముద్ర మొకరాతిపలకలాగునఁ గనఁబడినది శ్రీరామచంద్రుఁడంతవానికి సముద్రమునుఁ జూచినంత భయమైనది. ఇఁక చంద్రలేఖ మాట చెప్పనేటికి? చంద్రలేఖ సముద్రంబు పేరు వినుటయే కాని యెన్నఁడును చూచియెరుఁగదు. దానిం జూచినంత హృదయము భేదిల్లినది.
అట్టి సమయంబునఁ గర్తవ్య మెద్దియో తెలియక పర్వతంబు లాగునఁ బొంగివచ్చెడు తరంగంబులం గాంచి అవి మీఁదబడునను వెఱపున వెనుకకుఁ బరుగిడుచు నేమూలకుఁబోవుటకు తెరవుగానక పరిపరిగతులం దలపోయుచుఁ దన చరిత్రను స్మరించుకొని వెతఁజెందుచు నా సముద్రముపై దృష్టినిడి యావిశేషము లరయుచుండెను. ఇంతలో గాలి క్రమక్రమముగా బలసి యెక్కుడుగా వీవఁదొడంగుటయు నా ప్రతికూలవాతపాతంబున నాసాగరంబులోఁ బోవునోడ యొకటి యా చంద్రలేఖ యున్న యొడ్డునకుఁ గొట్టుకొని వచ్చెను. అందున్న జనులందరు నాగాలితాకున నోడ మునుఁగక దరిఁజేరినందులకు మిగుల సంతసించిరి.
అప్పుడు కర్ణధారుఁడు జనులంజూచి రాత్రి యీతీరమున నుండవలయును. తూరుపుగాలి తిరిగినతోడనే యోడ నడిపింతుము కావున మీరందరును దిగి యిచ్చట వంటలు చేసికొని భుజింపుఁడని పెద్దయెలుంగునం జెప్పెను. అప్పు డందున్న వారందరు వానిమాటలు విని తమ తమ సామగ్రులతో తీరంబునకు దిగిరి సాధారణంబుగ సముద్రతీరంబున మంచినీరు పడును గనుక నచ్చట చిన్న చిన్న చలములు తీసి యా యుదకంబుచే వంటలు చేసికొని నాఁటిరాత్రి ప్రతికూలవాతమును నుతియింపుచు యథేచ్ఛముగా భుజించిరి. సముద్రతీరభూమి అంతయు జనాకీర్ణ మగుట నా జనసంఘములోఁ జంద్రలేఖను జూచినవారెల్ల తమతో వచ్చిన బాటసారిఁగా నెంచిరి. చంద్రలేఖయు నట్టివిజనభూమియందు జనసహాయంబునుఁ గూర్చిన భగవంతుని వేతెరంగులఁ గొనియాడుచు నారాత్రి సుఖముగా గడిపి యుదయంబున నబ్బాటసారులతోఁగూడ దానును నోడనెక్కెను. ఓడసరదారుఁడు అది రేవు స్థలముకాదు కావున నప్పు డెక్కినవారి నంతగాఁ బరీక్షింపఁడయ్యెను
అప్పుడు మంచిగాలి విసరుచున్నందున తెరచాప లెత్తించి యోడ విడుచుటయు రెండుదినములు నడువవలసినపయన మొకనాఁటికే నడచినది. కావున నమ్మరునాటియుదయమునఁ ద్రిగర్త దేశరాజధానియైన యలకాపురము రేవుజేరెను. అప్పుడు కర్ణధారుని అనుమతి నందున్న జనులందరు నోఁడదిగిరి. చంద్రలేఖయుఁ డిగఁబోయినది కాని తాను సొమ్మిచ్చినందులకు గురుతుగల పత్రిక తనయొద్ద లేమింజేసి నావి కుఁడు చంద్రలేఖను దిగకుండ నాటంకము జేసెను. అప్పు డాకలికి నీకీయవలసిన సొమ్మెంత అని అడిగినదానికి నీవెచ్చట నెక్కితివో చెప్పుమని అడుగుటయుఁ దనకు రేవుస్థలముల పేరేమియుఁ దెలియమింజేసి యోఁడ గాలిచే యొడ్డునకు విసరఁబడిన చోట నెక్కితినని చెప్పినది. అప్పుడది చెప్పిన మాటలకతండు వెఱఁగందుచు నోహో! అది రేవుస్థలము కాదే అట్టి అరణ్యంబులో నొంటిగా నీవెట్లు వచ్చితివి? నిన్ను జూఁడ ననుమానముగా యున్నది. తరువాత విమర్శింతుము. ఇప్పుడు తొందరగా యున్నదని పలుకుచు నానెలఁత నొకయరలో నుంచునట్లు తన పనివాండ్రకు నియమించెను.
మార్గస్థులందరు నోడఁదిగి యరిగిన తరువాత సరదారుడు చంద్రలేఖ దగ్గిరకు వచ్చి మచ్చెకంటీ! నీవెచ్చటిదానవు! నీపేరేమి? యా రేవునకెట్లు వచ్చితివి? యెందుబోవుచున్న దానవు! నీ కేమియుభయము లేదు. నిజము జెప్పుమని శృంగారహాస విలోకనంబులంజూచి యడుగుచున్న వాని అభిప్రాయము గ్రహించి యయ్యించుబోఁడి యిట్లనియె. అన్నా? నా నివాసస్థలము రామచంద్రనగరము. నేను మా బంధువులతోఁగూడి యిందున్న మాపినతల్లినిఁ జూచుటకయి వచ్చుచు దారితప్పి బంధువులతో విడి అచ్చటికిఁ జేరితిని. ఇంతలో మీయోడ అచ్చటికి వచ్చినది. అదియు నా పుణ్యమే అనుకొని అందెక్కితిని. దీనికిఁ బారితోషికముగా నీమణిభూషంబుచ్చికొని నన్నుఁ దీరమున దింపుము. నీకుఁ గడుపుణ్యము గలదని దీన ముఖముతోఁ బ్రార్ధించిన విని వాఁడు స్మరశరపీడితహృదయుండై యిట్లనియె మదవతీ! నిన్నుఁ జూచినది మొదలు మదనుఁడు నన్ను వేపుచున్నవాఁడు. ఒక్కసారి నీ చక్కని చెక్కులు ముద్దుఁకొని యధరరసంబు చవిచూచెద. ననజ్ఞ యిమ్ము. నీవు దానికేమియు నియ్యనక్కరలేదు. ఈ మాత్రంబునకే సంతసించెద నేమనియెదవని అడిగిన నమ్మగువ ముక్కు మీఁద వ్రేలువైచుకొన అయ్యో! యిదియేమి ద్రోహము సంసారిని యిట్లనవచ్చునా నావంటి వారలు నీకు లేరాఁ అట్టిపని కెన్నడును నేనుబ్యోగించు దానను కాను. నాయందుగల మరులు మరలించుకొనుము. నన్ను వేగిరము తీరమునుఁ జేర్పుమని పలుకఁగా నతండు మరియేమియుం జేయను. ఒకసారి ముద్దు బెట్టుము. ఊరక చెడిపోక నా మాట వినుము అని పెక్కుగతుల వేడికొనిన నాచేడియ సమ్మతించినది కాదు
అట్లు వారిరువురు వాదించుకొనుచున్న సమయమందుఁ గ్రొత్తగా వచ్చిన యోడలఁబరీక్షించెడు రాజభటు లా యోడమీఁదికి వచ్చి యోడ సరదారు డెక్కడని కేకలువైచిరి ఆ కేకలు విని వాఁడు మిగుల భయపడుచు లేవఁబోవు సమయమునకు వారే అచ్చటికి వచ్చిరి. వారిం జూచి చంద్రలేఖ వందనములు సేయుచు అయ్యా! వీడు నన్నేమి చేయుచున్నాఁడో చూచితిరా? నేనొక బాటసారిని. మా వాండ్రందరు దిగిపోయిరి. నన్ను దిగనీయక నిర్భందించుచున్న వాఁడు. నా పుణ్యము వలన మీ రిచ్చటకు వచ్చితిరి. నన్ను రక్షించి దరిఁజేర్పుడని ప్రార్థించినది. అప్పుడు రాజకింకరులు దాని దీనాలాపములు విని జాలిపడి అభయమిచ్చి యా చిన్నది చెప్పిన మాటలను గురించి యోడసరదారునడిగిరి.
వాఁడును బెదరుగదుర అయ్యా! యా చిన్నది మాకు నోడకూలి యియ్యవలసి యున్నది. ఇమ్మని యడుగుచుంటిమి కాని మరియొకటి కాదు. మా కియ్యకుండఁబోవలయునను తాత్పర్యముతో నట్లనుచున్నది. నేనేమియు నెరుఁగనని చెప్పెను. ఆ భటులు వాని పోలిక గనిపెట్టి యట్టిపని కుద్యోగించినట్లు గ్రహించిరి. కావున వానిని వదలించి చంద్రలేఖను నెమ్మదిఁగా దీరమున దింపించిరి.
వీరగుప్తుని కథ
అప్పుడు చంద్రలేఖ స్త్రీజాతిని నిందించుచుఁ గటగటా! యిట్టి కష్టపుజన్మమెత్తితి నేటికి? నా రూపమే నా కింత ముప్పు తెచ్చుచున్నది. ఎచ్చటికిఁ బోయిననుఁ జిక్కులే వచ్చుచున్నవి. ఇఁక నీ రూపము మార్చి పురుషవేషము వేసికొనిన సుఖముగా నుండవచ్చును. అన్నన్నా! పురుషజన్మ మెంత యుత్తమమయినదో గదా? యని తలంచుచు నప్పుడే యంగడికి పోయి తనవద్ద నున్న మణిభూషణ మొకటి యమ్మి దానివలన వచ్చిన సొమ్ము పెట్టి మంచి దుస్తులుకొని యారాత్రి యొకచోటునఁ బురుషవేషము ధరించెను. పురుషవేషము వేసినప్పుడును. జంద్రలేఖ మిక్కిలి చక్కగా నుండెను మరియుం దగినకైదువు దానికిం దగిన దుస్తులును సంపాదించి వీరపురుషవేషముతో నా రాజధానిలో వీరగుప్తుఁడని పేరు బెట్టుకొని తిరుగుచుండెను. ఆ పట్టణమును ధర్మాంగదుఁడను రాజు పాలించుచుండెను. దైవవశంబున నాధాత్రీపతి మంత్రి కాలధర్మము నొందెను. ఆయుద్యోగంబు తమకిమ్మని యనేకులు వచ్చిరి. కాని రాజుచేసిన పరీక్షలకు నొకఁడైనను సదుత్తరంబు చెప్పలేకపోయెను. దానంజేసిన రాజా యుద్యోగం బెవ్వరికి నియ్యలేదు మరియు నే నడిగినతోడనే నా వచనంబులకు నా చిత్తవృత్తి ప్రకారంబుత్తరం బెవ్వఁడిచ్చునో వానిని మంత్రిగా స్వీకరింతునని తన సింహద్వారంబుపైనఁ బ్రకటన పత్రిక గూడఁగట్టి యుంచెను. ఎవ్వండు వాని మాటలకు సదుత్తరంబు చెప్పలేదు. ఇట్లుండ నా వీరగుప్తుండొకనాఁడు విలాసార్థ మా పురమంతయుఁ గ్రుమ్మరుచుఁ గోటగుమ్మము దాపునకుఁ బోయి యందున్న ప్రకటన పత్రికఁజదివి సంతసించుచుఁ దనపేరు వ్రాసి నేను మీ మాటలకు దగిన యుత్తరం బిచ్చెదనని పతిక వ్రాసి యా రాజుగారి యొద్దకుఁ బంపెను. ఆ నరపతి చదువుకొని యంతకు మున్నట్టి వారలనేకులు వచ్చిపోయిరి కావున విసిగికొనుచు నర్ధాంగీకారముగాఁ దీసికొని రండని భటుల కానతిచ్చెను. రాజకింకరు లతని యానతి చొప్పున వీరగుప్తుని రాజునొద్దకుఁ దీసికొనిపోయిరి.
రాజు వీరగుప్తుని ముఖవిలాసము నేత్రసౌష్టవంబు మొదలగు లక్షణంబులు పరికించి యోహా! ఈతండు మంత్రియధికారంబు కాదు. రాజ్యాధికారంబునకు సైతము తగియున్నవాఁడు వీనినొక్క ప్రశ్నయే యడిగెదను. దానికుత్తరం బిచ్చెనేని తప్పక మంత్రిగాఁ జేసికొనియెదనని తలంచుకొని యతనిమిగుల మన్నించి కూర్చున్న వెనుక, అయ్యా! పండ్రెండింటిలో నాలుగు తీసివేసిన నెంతయని యడిగెను. వీరగుప్తుఁడు ఆలోచింపకయే సున్నయని యుత్తరముచెప్పెను. ఆమాటలు వినిన సభ్యు లెల్లరు పెదవులు విరుచుచు అయ్యో! లెక్కయే రానివానికి మారాజు మంత్రిత్వ మెట్లిచ్చును. మనమేదియో నడుగునని కొంటిమి. ఈమాత్రపుప్రశ్న మనలనుఁ జేసినచో మంత్రిత్వంబు మనకేవచ్చునే! రాజులు వెర్రివాండ్రు వారేమన్న నది గొప్పప్రశ్న యగును. పాపమీ చిన్నవాఁడు దానికే యుత్తరము చెప్పక సున్నయనెను. యెనిమిదని చెప్పినచో మంత్రిత్వంబు వచ్చును గదాయని యనేక ప్రకారంబులు జెప్పుకొనఁ దొడంగిరి.
అప్పుడు ధర్మాంగదుఁడు వీరగుప్తుని గౌరవించుచు అన్నా! నేఁటికి నాకు దగిన మంత్రివి దొరకితివి. నీపాటి బుద్ధిమంతు దింతకుమున్ను నాయొద్దకు రాలేదు. నే డెంత సుదినమోకదా ఇదిగో? యిప్పుడీ మంత్రిత్వముద్రికలిచ్చువాడ. నీవే నా మంత్రివని ముమ్మారు పలికి యాముద్రికలం దెప్పించి అతనికిచ్చెను. ఆ యర్ధము వారిరువురకే గాక అచ్చటనున్న వారెవ్వరు గ్రహింపలేక రాజును వట్టి మూర్ఖుడని నిందింప దొడంగిరి. మరికొందరు సాహసముతో రాజుగారింజూచి అయ్యా! తామింతకు మున్ను పెక్కండ్రకు జిక్కు ప్రశ్నలిచ్చి వారెద్ది చెప్పినను సమ్మతింపక యూరకపొమ్మంటిరి. ఇప్పు డితనిని సుఖమయిన ప్రశ్న అడిగిరి. అతడు చెప్పకున్నసు ప్రధానిగాఁ జేసికొంటిరి. పండ్రెండింటిలో నాలుగుపోయిన సున్న యెట్లగును యెనిమిదికాదా? ఈ సందియము మమ్మందర బాధించుచన్నది. కారణమెద్దియో చెప్పుడనుటయు ధర్మాంగదుడు నవ్వుచు వారికిట్లనియె.
ఓ మందలార? నే నిందులకే యెవ్వరిని నొప్పుకొంటిని కాను వినుఁడు. పండ్రెండింటిలో నాలుగుపోయిన నెనిమిదని యెల్లరకు దెలిసినదే. నాఅభిప్రాయము మాత్రమదికాదు. పండ్రెండనగా మాసములు పండ్రెండు మాసములలో నాలుగనగా వర్షకాలము నాలుగు మాసములు కనుక నాలుగుమాసములు తీసివేసినయెడల ననఁగా వర్షింపని యెడలనని అర్ధము. వర్షములు కురియనియెడల పంటలు పండవు గదా పండ్రెండుమాసములకు ముఖ్యమైనవి వర్షకాలము నాలుగుమాసములే. ఆ నాలుగుమాసములు పోయినవనఁగా వర్షము కురియక యూరకున్న నా సంవత్సరము సున్న కాక మఱేమియున్నది. అందువలననే పండ్రెండింటిలో నాలుగుతీసివేసిన సున్నయని చెప్పెను. ఇట్టిఅర్థముగల నా మాటకు వెంటనే యుత్తరము చెప్పిన యితందెంత బుద్ధిమంతుఁడో యోచింపుఁడు.
ఇంత సూక్ష్మబుద్ధికి మంత్రిత్వమిచ్చుట నా తప్పా! చెప్పుడని పలుకుటయు సభ్యులెల్లరు తెల్లబోయి యుల్లంబుల వారిరువుర బుద్ధికౌశల్యమును గురించి వేతెరంగులఁ మెచ్చుకొనదొడంగిరి. వీరగుప్తుడు మంత్రియై క్రమక్రమముగఁ దనవిద్యా ప్రభావమంతయు ధర్మాంగదునికిఁ జూపుటయు నతండు మరియు సంతసించుచుఁ దన రాజ్య భారమంతయు వీరగుప్తునియందే యుంచి యతఁడు చెప్పునట్లుగాఁ దాను నడుచుచుండెను. వీరగుప్తుఁడు మంత్రియైనది మొదలు దేశములో సుభిక్షముగా ఫలవంతముగా పాడిపంటలు నభివృద్ధిగావించుటచేతను, బ్రజ లతనిని మిక్కిలిస్తోత్రములు చేయఁదొడంగిరి.
అని చెప్పువేళకు వేళ యతిక్రమించుటయు నప్పుడు చెప్పుట మాని యయ్యతిశిఖామణి యవ్వలికథ తదనంతరావసథంబున నిట్లని చెప్పం దొడంగెను.
16వ మజిలీ
భక్తురాలి కథ
పట్టీ! వినుమట్లు చంద్రలేఖ వీరగుప్తాభిధానముతో ధర్మాంగదునిమంత్రిగా నుండి యొకనాడు నగరాలోకనకౌతుకంబు మీర నుచితపరివారముతో బట్టణమంతయు గుమ్మరుచుండ నొకవీథిదండను వాసంతికకోకిలకాకిలీనాదమును మేలమాడు కంఠస్వరముతో బాడుచున్న యొకచిన్నదాని గానము విననయ్యె. అగ్గానము చెవియొగ్గి విని చిత్తమునీరైపోవ నెద్దియో నిరూపింపనలవికాని యుత్సాహ మొకటి మనంబునం జనింప నిలిచిపరిచారకుం బిలిచి యోరీ! యీప్రాంతమందెచ్చటనో సంగీతము పాడుచున్నట్లు వినంబడుచున్నది. యరసిరమ్మని పంపిన వాడును బోయి సత్వరమువచ్చి అయ్యా! యీచేరువ దారకేశ్వరుని యాలయమున్నది యందొక భక్తురాలు పాడుచున్నదని చెప్పెను.
అప్పుడతండు మనమచ్చటికి బోవచ్చునా అని అడుగుటయు వాడు స్వామీ! సంశయమేల? దేవాలయమునకు బోవుట కెవ్వరి యానతి కావలయును? అదియును మనయధికారమునకు లోబడినదే. సందియము వలదు. రండుపోదము. ఎద్దియేని తలంచుకొని యాస్వామికి మీదుగట్టినచో దప్పక యాకార్యము కాగలదు. ఈ తారకేశ్వరునికి మ్రొక్కులు చెల్లించుటకుం బెక్కు దేశములనుండి ప్రజలువత్తురు. మీరు చూడదగినదేయనిన సంతసించుచు మంత్రి యాయాలయము లోనికి బోయెను. అచ్చట