కాశీమజిలీకథలు/పదవ భాగము/249వ మజిలీ

249 వ మజిలీ.

కలియుగధర్మములు.

శ్రీకృష్ణనిర్యాణమైన పిమ్మట కలియుగ ప్రారంభమున వ్యాస, జైమిని, గౌతమ, పరాశర, గాలవ శాతాతప, శంఖలిఖితాది మహా మునులొక సభజేసి కలిధర్మములగురించి యిట్లు సంభాషించుకొనిరి.

గౌతముఁడు — మునీంద్రులారా! యిప్పుడు కలియుగము ప్రారంభించినది. ఇందుబ్రాహ్మణులు శ్రుతిచోదితములగు కర్మలు విడిచి శూద్రప్రాయులై వర్తింతురు. వర్ణాశ్రమధర్మములు నామమాత్రా వశిష్టములై ప్రవర్తిల్లును. కావున కొన్ని నియమములు మార్పవలసి యున్నవి. ఇందులకు మీమీ యభీప్రాయముల నివేదింపవలయును. అని చెప్పుచుండగనే నారదమహర్షి యొకచేత మొగంబు నొకచేత గుహ్యాంగంబు మూసికొని యాసభకరుదెంచెను.

అమ్మునివరుంజూచి యందున్న తాపసులెల్ల విస్మయముజెందుచు నాసంకేతక మేమని యడిగిన నారదుం డిట్లనియె. కలియుగ ధర్మముల గురించి మీరు సభజేసి నన్ను రమ్మని వార్తనంపితిరి గదా! తత్సంబంధంబులగు క్రియలసూచించుచు నిట్లు వచ్చితినని చెప్పుచు మఱియు నిట్లనియె.

కలియుగంబునఁ బ్రజలకు నీయింద్రియనియము లేమియు నుండవు. నోరు సత్యమునువిడిచి ధర్మము నతిక్రమించి యిష్టమువచ్చినట్లుగా మాట్లాడుచుండును. స్త్రీపురుషులు విధినిషేధముల విమర్శింపక పశువులవలె స్వేచ్ఛాసంయోగములు గావించుచుందురు. కలియుగంబున నీయింద్రియద్వయమే కడుంగడు దుష్టమై చెడిపోవును. అని సూచింపుచు నిట్లు కప్పికొనివచ్చితినని యెఱింగించి యాముని సమాజమునెల్ల వినోదముగా నవ్వఁజేసెను.

పిమ్మట గౌతముఁ డి ట్లుపన్యసించెను. ఇదివఱకు మనము వర్ణాశ్రమాచారముల శ్రుతిచోదితముగా విధించియుంటిమి. వానిలోఁ గొన్నిటిఁ దత్తత్క్రియలయందు మాత్రమే చేయఁదగునని తెలిపియుంటిమి. శ్రాద్ధ మాంసభోజనము విధవాప్రజోత్పత్తి అస వర్ణవివాహము లోనగు విధులనంగీకరించి ధర్మశాస్త్రములలో వ్రాసి యుంటిమి కలియుగంబునఁ బ్రజలు నియమ బలవిహీనులగుట నట్టి విధులఁకొన్ని సవరింపవలసియున్నది. యిందులకు మీయభిప్రాయము తెలుపవలయునని యుపన్యసించిన వినివారదమహర్షి తోలుతనిట్లనియె.

నారదుఁడు— శ్లో. సముద్రయాతు స్స్వీకారః కమండులు విధారణం
                      ద్విజానామసవర్ణాసు కన్యాసూపయమస్తదా
                      దత్తాక్షతాయాః కన్యాయాః పునర్ధానంపరస్యచ
                      ఇమాన్ ధర్మాన్ కలియుగె వర్జ్యానాహుర్మనీషిణః

సముద్రయానము సన్యాసము బ్రాహ్మణులు ఇతరజాతిస్త్రీలవివాహ మాడుట. అక్షతయోనులగు స్త్రీలకుఁ దిరుగా వివాహముజేయుట. వీని నిషేధింపవలయునని నాయభిప్రాయము.

శాతాతపుఁడు -
శ్లో. యావద్వర్ణవిభోగోస్తి యావద్వేదః ప్రవర్తతె
    సన్యాసం చాగ్నిహోత్రంచ లౌవత్కుర్యాత్కలౌయుగె.

ఎంతవరకు వర్ణాశ్రమధర్మ వివక్ష వేదప్రచారము ప్రవర్తించునో యంతకాలము సన్యాసము యజ్ఞకర్మలు చేయవచ్చునని నేభిప్రాయ మిచ్చుచున్నాను.

పరాశరుఁడు--
శ్లో. ఊఢాయాః పునరుద్వాహం జేష్ఠాంశంగోవధం తథా
    కలౌపంచ నకుర్వీత భ్రాతృజాయాం కమండులుం.

గౌతముఁడు - ఊఢ యననేమి?

పరాశర - ఒకనిం బెండ్లియాడినది. పరపురుషసంయోగాద్రుతెఊఢాపిదేయా” అని కొంద ఱభిప్రాయ మిచ్చుచున్నారు. ఊఢ యైనను అక్షతయోనియైనచోఁ దిరుగా నివాహము చేయవచ్చును.

శ్లో. నష్టేమృతెప్రవ్రజతే క్లీబేచ పతితె పతౌ
    పంచత్స్వాపత్సునారీణాం పతిరన్యోవిధీయ తే.

ఈయైదువిపత్తులయందు స్త్రీకి బునర్వివాహము చేయవచ్చునని నే నభిప్రాయ మిచ్చితిని.

గౌత --- మీరు రజస్వలానంతరము స్త్రీవివాహము చేయుట కంగీకరింతురా?

పరాశ-- అంగీకరింపము.

శ్లో. అష్టవర్షాభవేద్గౌరీ నవవర్షాతురోహిణీ
    దశవర్షాభవేత్కన్యాత్వత ఊర్ధ్వంరజస్వలా.

కన్యకకు సిగ్గు తెలియకపూర్వమే వివాహము చేయవలయును.

శాతాతపుఁడు — అట్లైన నక్షతయోనియగు స్త్రీకిం బునర్వివాహాము మీరెట్లంగీకరించితిరి?

పరాశరుఁడు - పదియేండ్లు దాటకుండ కన్యక భర్తృవియోగమును బొందెనేని యట్టి కన్యకకుఁ బునర్వివాహము చేయవచ్చునని నే నభిప్రాయమిచ్చెదను.

శాతాతపుఁడు -

శ్లో. వర శ్చేత్కులశీలాభ్యాం నయుజ్యేతకదాచన
    బలా దాహృత్య తాం కన్యాం వుసద్గుణవతె నయేత్ .

ప్రమాదవశంబున వరుని కులశీలాదులం తెలియక కన్యక నిచ్చిన పిమ్మట నతండుదుష్టుం డయ్యెనేని యాకన్యకను బలాత్కారముగా దీసికొనివచ్చి మఱియొక వరునకీయవచ్చునని నేనభిప్రాయమిచ్చితిని, నారదుఁడు – శాతాతపా! స్త్రీస్వభావము నీవెఱుంగ కిట్లనుచున్నావు. పరాశరమహర్షియుఁ గొంత ప్రమాదమును బొందుచున్నాఁడు. స్త్రీలకుఁ బునర్వివాహావకాశ మేమాత్ర మిచ్చినను ద్రోహకృత్యములు చేయకమానరు. కావునఁ బూతిన్‌గనే నిషేధింపవలయునని నామతము. దూరముగా నాలోచించినం గాని యందలి యుపకారము దెలియదు.

శంఖలిఖితుఁడు -- పతివ్రతయగు స్త్రీ సహగమనము చేయవలయును. అందుల కొడంబడదేని బ్రహ్మచర్యవ్రతము చేయఁదగును. అదియు జేయలేని యువతి పెండ్లియాడవలయునని నాయభిప్రాయము. వయోవ్యవస్థ దెచ్చిపెట్టిన పరాశరమహాముని యభిప్రాయము కఠినముగా నున్నది. నారదుని మతము లోకసమ్మతముగాలేదు.

నారదుఁడు — మునింద్రా! నీమతము లోకసమ్మతమేకాని యిప్పు డాచరింపఁదగినది కాదు. వర్ణాశ్రమ వివక్ష యున్నంతపర్యంతము నిషేధింపవలయును. బ్రజలు పణన్‌సంకరులై స్వేచ్ఛావిహారముల సంచరింపుచు ధర్మశాస్త్రముల గణింపనేరరు. అప్పుడు విధి నిషేధములు లేకయే ప్రవర్తింతురు.

అని యీరీతి మునులందరు పెద్దతడవు వివాదము గావించిరి. అందు గొన్నినిబంధనములు మార్చిరి. పెక్కండ్రు నారదుని మతములోజేరిరి.

శ్లో. కన్యానామసవర్ణానాం వివాహశ్చద్విజన్మభిః
    విధవాయాం ప్రజోత్పత్తి దేన్‌వరస్యనియోజనం
    బాలాయాక్షతయోన్యాస్తువరేణాన్యేన సంస్కృతిః
    యతేశ్చ సర్వవర్ణేషు భిక్షాచర్యా విధానతః
    పితాపుత్ర వివా దేషు సాక్షిణాం దండకల్పనం
    ఏతానిలోక గుప్త్యర్ధం కలేరాదౌ మహాత్మభిః
    నివతిన్ తాని విద్వద్భిర్వ్యవస్థా పూర్వకం బుధైః

అని మహర్షులందఱు కలియుగ ప్రారంభమున నొకసభ జేసి కొన్నియాచారముల మార్పు గావించిరి. అందుఁగూడఁ బరస్పర మతభేదములు గలుగఁగా పరాశర మహర్షి వానికన్నిటికి సామరస్యము గల్పించి యొక ధర్మశాస్త్రము రచించెను. ఆగ్రంధస్థ విషయములు మును లందరు నొప్పుకొని తమతమ నెలవులకుఁ బోయిరి. అందుల కే (కలౌపారా శరీస్మృతిః) అని ప్రసిద్ధి గలిగినది.

చ. అని మణిసిద్ధుఁడెంతయు ప్రియంబున నారదమౌనిసార్వభౌ
    ముని చరితంబు దెల్పుటయు మోము వికాసమునొంద గోపనం
    దనుఁడు బళీ! సెబాసు గురునాయక ! యింతకుమున్ను మీరు దె
    ల్పిన కథ లింత చిత్రముగలేవుచుఁడీ పరికించి చూడఁగన్,

క. ఆనందంబయ్యె గదా
    మానసమున గురువరేణ్య ! మనకిఁక నాకా
    శీ నగరం బెన్నాళ్ళకుఁ
    గానంబడు నెపుడు మునుఁగఁగల మాగంగన్.

క. అన, లేలెమ్మిఁక నెలలో
   పునఁ బోవంగలము ముక్తిపురికిం బృధుకా
   ననమార్గమెల్ల దాటితి
   మనువుగ సులభములు ముందునగు పయనంబుల్.

అని చెప్పినంత సప్పుడే కావడియెత్తికొని గోపాలుండు వెంట నడుచుచు మహాత్మా! నారదమహర్షి చరిత్రము ఇంకను జాలనున్నదని చెప్పితిరిగదా ! అవ్విశేషములన్నియు మనము కాశీపురంబు జేరిన

పిమ్మట సావధానముగా నెఱింగింతురుగాక. ఏమందురు? అని యడుగ నవ్వుచు నయ్యతిశిఖామఖి మౌనముద్రబూనియుండుట శిరఃకంపమున నంగీకారము సూచించుచు నడిచినడిచి క్రమంబున నవ్వలి మజిలీ చేరెను.

కందగీతి గర్భచంపకమాలావృత్తము.

పురహర కామదా కనక భూధరచాపవికారదూర ధ
ర్మరత శివా మనోహర పురందర ముఖ్య సురార్చి తాంఘ్రియు
గ్మరుచిర పుణ్యదామదన ఘన్మర! భక్తసమాజవంద్య శం
కర కరుణా కరా భుజగ కంకణహారవిభూషితాంగకా.

గర్బస్థకందము.



                   హరకామదా కనక భూ
                   ధరచాపవికారదూర ధర్మరత శివా
                   చిరపుణ్యదా మదనఘ
                   స్మరభక్తసమాజవంద్య శంకరకరుణా.

గర్భస్థగీతము. కనకభూధరచాపవికారదూర
                   హర! పురందరముఖ్య సురార్చి తాంఘ్రి
                   మదనఘస్మర భక్తసమాజవంద్య
                   భుజగకంకణహార విభూషి తాంగ.

మ. జయకృచ్ఛాలిశకంబి భాబ్ది వసుభూ(1848 )సంఖ్యాతమైయొప్ప నీ
     క్షయనామాబ్దమునందు నీపదవభాగం బేనుగావించి స
     త్ప్రియ మొప్పన్ భవదంకితంబుగ సమర్పింతున్గదా దేవ! య
     క్షయమైయొప్పఁగఁ జేయుమయ్య కృప నాచంద్రార్క తారంబుగాన్

చ. గిరితనయా మనోరమణ! కిన్నరసిద్ధపిశాచ సాధ్యభా
    సర్వముఖదేవయోని పరివార! కనద్రజతాచలేంద్ర మం
    దిర! పురహూతముఖ్యసురదివ్యకిరీటమణి ప్రభాలస
    చ్చరణ! సురాపగాలలితచారుకపర్ధ! కృపాపయోనిధీ!

గీ. గుడమునెరజూపి బాలునకును బ్రియమున
   మందుత్రాగి జడిమంబుమాన్పు కరణి
   కథలనుచు జెప్పి నీతియుక్తముగ జనులఁ
   గృతమతుల జేయుటయే మదీప్సితవిధంబు.

గద్య.

ఇది శ్రీమద్విశ్వనాధ సదనుకంపా సంపాదిత కవితావిచిత్రా

త్రేయముని సుత్రామగోత్ర పవిత్ర, మధిరకులకలశ

జలనిధి రాకాకుముదమిత్ర లక్ష్మీనారాయణ

పౌత్ర కొండయార్యపుత్ర సోమి దేవీ

గర్భశుక్తిముక్తాఫలసుకవిజనవి ధేయ

సుబ్బన్న దీక్షిత నామ ధేయ

రచితం బగు కాశీ యాత్ర

చరిత్రమను మహా

ప్రబంధంబునందు

పదవభాగము.

సంపూర్ణము.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

విశ్వనాధార్పణమస్తు.