కాశీమజిలీకథలు/పదవ భాగము/248వ మజిలీ

248 వ మజిలీ.

నారద పంచచూడా సంవాదము.

ఒకనాఁడు నారదమహర్షి స్వర్గలోకమునుండి యెందేని బోవుచుండఁ బంచచూడ యను నప్సరస దారిలో దారసిల్లి నమస్కరించినది. దేవముని దీవించుచుఁ బంచచూడా! నీవు మిక్కిలి చక్కని దానవు. అప్సరఃకుల చూడామణివి. ఎక్కుడుగాఁ జదివితివి. స్త్రీరహస్యములు నెఱింగిన ప్రోడవు. నిన్నొక విషయ మడుగఁ దలంచితిని. దాచక నిజము జెప్పెదవా? అని యడిగిన సప్పడంతి యంజలివట్టి యిట్లనియె.

స్వామీ! మీరు నన్ను సమర్ధురాలనని పొగడితిరి. ఇంతకన్న నాకుఁ గావలసినదేమి! మీరడిగిన విషయము నాయెఱింగినదేయైనచో నెట్టి రహస్యమైనం జెప్పి మీదయకుఁ బాత్రురాల నయ్యెదఁగాక. మీకడనిలిచి మాటాడుట కర్హతలేని నన్ను మీరిట్లు పల్కరించుటచే నేనేకాక మాకులమువా రెల్లఁ బవిత్రమైరని స్తోత్రములుసేసిన విని తలయూచుచు నారదుఁ డిట్లనియె.

పంచచూడా! మఱేమియును గాదు. నీకుఁ దెలిసిన విషయమే యడుగుచున్నాను. స్త్రీస్వభావ మెట్టిదో చెప్పవలయును. నీవెఱుంగని స్త్రీరహస్యము లుండవుగదా. అని యడిగిన నా పంచచూడ యించుక నవ్వుచు నిట్లనియె.

మహాత్మా! నేనాఁడుదాననై నింద్యములైన స్త్రీరహస్యముల మీతో నెట్లు చెప్పుదును? శ్రీ లెట్టివారో యెట్టి కృత్యములు గలవారో సర్వజ్ఞులైన మీరెఱుంగరా? ఆగుట్టు చెప్పుమనుట మీకు న్యాయముగా దనవుడు నారదుఁడు కలికీ ! అసత్యము చెప్పిన దోషము గాని యదార్థ కధనంబున ననర్ధ మేమియున్నది? వాక్రువ్వుమని యడిగిన నవ్వుచుఁ బంచచూడ యిట్లనియె.

మునీంద్రా! మీ రెఱింగియు నానోటినుండి పలికింపవలయునని యడిగితిరి. చెప్పెద వినుండు. మంచికులమున జనించినను స్తోత్రపాత్రమగు సౌందర్యము గలిగి నిరుపమ కళావిభవాభిరాముం డగు మగఁడు గలిగియున్నను స్త్రీలు సద్వర్తనముగలిగి యుండరు. ఇదియే స్త్రీల యందుఁగల దోషము సమస్తదోషములకు స్త్రీలునెలువులు సమర్ధులగు భర్తల విడిచి నీచులతోఁ గ్రీడింతు రింతకన్న నధమకార్య మున్నదియా?

మునీంద్రా! సమీపమందున్నవాఁ డెంత తక్కువవాఁడైనను స్త్రీ భజింపకమానదు. లోకాపవాదమునకు వెఱచి మనంబున నిష్టములేకున్నను భర్తలయెడఁ బడఁతుక లిష్టమున్నట్లు నటింతురు. కాని, ధర్మభీతి నాతికిలేదు. స్త్రీలకు భర్తలయెడ భయభక్తివిశ్వాసములు సహజముగానుండవు మహాత్మా! మీయొద్ద నిజము చెప్పుచున్నాను. స్త్రీలకుఁ బొందరానివాఁడు లేడు. ముమ్మాటికిని లేడు. ఇదియే పరమరహస్యము. భర్తలం దిష్టముగలిగి యతఃపురముల రక్షింపబడు పడఁతులును, నంధ, జడ, వామన, కుబ్జాదులతోఁ గలిసికొనుచుందురు. వనితయు, లతయు దాపుననున్నవానిపైఁ బ్రాకునను సామెత మీ రెఱింగినదియే.

ఎట్టి వనితయైనను బదిదినము లేకాంతముగా నొకవురుషునితోఁ గలిసి తిరిగినచో నది వానిం గలియకమానదు. సమిధలవలన నగ్నియు నదులవలన సముద్రుఁడు, భూతవధవలన నంతకుఁ డెట్లు తృప్తిబొంద కుండుందురో యట్లే స్త్రీలు పురుష శతమువలన దృప్తిబొందరు. అంతకుఁడు, మృత్యువు పాతాళము, బడబాముఖము, కత్తిధార హాలాహలము, అగ్ని, సర్పము, వీని నన్నిటిని నొకదెసఁ ద్రాసులో వైచి రెండవ దెస స్త్రీని నెక్కించి తూచినచో వనితయే బరువుగా నుండును. గోవులు క్రొత్తక్రొత్త తృణములకై వెదకుచున్నట్లు స్త్రీలు క్రొత్తవానికై వెదకుచుందురు. ఈపంచభూతములు లోకములు స్త్రీ పురుషు లెప్పుడు సృష్టింపఁబడిరో యప్పటినుండియు స్త్రీలయం దీదోషములు నిరూఢములైయున్నవి.

శంబరుఁడు సముచి బలి కుంభీనసుఁడు మయుఁడులోనగు దానవు లెన్నిమాయ లెఱుంగుదురో యమాయలన్నియు స్త్రీలకు సహజములై యుండును. పెక్కేల స్త్రీలు అనృతమును సత్యముగాను, సత్యము ననృతముగాను జెప్పి వాదింపఁగలరు. సమస్త శాస్త్రవేత్తలగు శుక్ర బృహస్పతులుగూడ స్త్రీబుద్ధి నతిక్రమింపఁజాలరు.

మహత్మా! మఱియొకవిశేషము జెప్పెద వినుము.

శ్లో. ఉజ్జ్వలవపుషం పురుషం కామయతే స్త్రీనరోపి తాం దృష్ట్వా
    అనయోరేషవిశేషంః స్త్రీ కాంక్షతిధమన్‌నిరపేక్షా
    అభ్యర్థితాపి వుంసా సహసా నస్వీకరోతి సహజేన
    సుకృతసమయాద్య పేక్షీ ప్రవర్తతేవా నవా పురుషః

చక్కని పురుషుని చూచి స్త్రీలు చక్కని స్త్రీని జూచి బురుషుఁడును వరించుట సహజమనుకొనుఁడు. స్త్రీమాత్రము ధర్మాపేక్ష విడచి వరించును. ధర్మాపేక్షచే పురుషుఁడు సందేహించును.

సురమునీంద్ర! స్త్రీలు ఏదియో హేతువునుబట్టిగాని కేవలము ధర్మాపేక్షచే వరింపకుండరు. ఇదియే స్త్రీస్వభావమని యెఱింగించిన విని నారదుండు వంచచూడను మెచ్చుకొనుచు నెందేనిం బోయెను. అని యెఱింగించి మణిసిద్ధుండిట్లు. . . చెప్పందొడంగెను.


___________