కాశీమజిలీకథలు/పదవ భాగము/246వ మజిలీ

246 వ మజిలీ.

శుక నారద సంవాదము.

ఒకనాఁడు నారదమహర్షి యదృచ్ఛగా స్వాధ్యాయనిరతుం డగు శుకమహర్షి యొద్ద కరుగుటయు నమ్మునివరుం డతని నర్ఘ్యపాద్యాదివిధులనర్చించి సుఖోపవిష్టుండైన పిమ్మట నేదియోయడుఁగ దలంచి యతని మొగముపైఁ జూట్కులునెరయఁజేయుటయు నారదుం డతని యాశయము గ్రహించి యిట్లనియె. ధర్మజా ! నావలన శ్రేయస్కరమగు ధర్మ మేదియేని వినఁదలతువేని యడుగుము. నాయెఱింగి నంత వినుపింతు ననవుఁడు శుకమహర్షి మహాత్మా! ఈలోకమందు హితమైన దేదిగలదో యది నాకెఱింగింపుమని యడిగిన నారదుం డిట్లనియె.

వత్సా! పూర్వకాలంబునఁ దత్వాభిలాషులగు ఋషులకు సనత్కుమారుఁ డెఱింగించిన విషయంబులు గొన్నిగలవు. అవి ముముక్షుజన శ్రోత్రానందంబులైయుండు. వాని నెఱింగించెద నవ హితుండవై యాలింపుము. విద్యాసమంబగు చక్షువు సత్వసమంబగు తపంబు, రాగసమంబగు దుఃఖంబు, త్యాగసమంబగు సుఖంబు లేదని పెద్దలు సెప్పుదురు. పాపకర్మలయందు నివృత్తి, పుణ్యకర్మలయందుఁ బ్రవృత్తియుఁ గలిగియుండుట శ్రేయము. సుఖలేశ శూన్యముగు మానుషజన్మ మెత్తుట కెవ్వఁ డుత్సహించునో వాఁడే మోహమును బొందువాఁడు. దుఃఖము సంయోగమువలన వచ్చును. సక్తునియొక్క బుద్ధి మోహజాలమును బెంపుజేయును. మోహయుక్తుఁ డిహపరముల యందు దుఃఖమునుబొందును.

శ్రేయస్కాముఁడగు వాఁడు సర్వోపాయములచేతను గామ క్రోధముల నణుఁచు ప్రయత్నము చేయుచుండవలయును. మఱియుఁ గ్రోధమువలనఁ దపస్సు, మత్సరమువలన సంపద, మానావమాన ములవలన విద్యను, ప్రమాదమువలనఁ దన్నును రక్షించుకొనుచుండ వలయును. ఏభూతమునకు ఘాతుకత్వము దలంపకపోవుటయే యుత్తమధర్మము. అంతకన్న క్షమ యుత్తమమైనది. అంతకన్న నాత్మ జ్ఞానము శ్రేష్ఠము. దానికంటె సత్య మెక్కుడిది. దానికంటె సర్వ భూతహితముగాఁ బలుకుట మంచిది. భూతహితము గోరుటయె సత్యమని నామతము.

సర్వారంభముల విడిచినవాఁడును, ఆశాశూన్యుఁడును, బరిగ్రహరహితుండును, ఉత్తముఁడని చెప్పుదురు. ఎవనిచేత సర్వము విడువఁబడినదియో వాఁడే విద్వాంసు డనఁబడును. ఎవ్వఁడు నిర్వికారుఁడై యింద్రియముల వశముజేసికొని యింద్రియార్ధములతోఁగూడ నీయక చరించునో యతం డుత్తముఁడందురు. భూతములదెస జూడక పోవుట, నంటకపోవుట, మాటాడకపోవుట, పరమ శ్రేయము. సర్వ భూతములయందు మైత్రిగలిగివర్తింవుము. శరీరియెవ్వరితోడను వైరము చేయఁగూడదు. జితేంద్రియుండగు నాత్మవేత్తకు దరిద్రమే సంతోషము పరిగ్రహమును విడిచి జితేంద్రియుఁడవగుము. తా తా ! శోక శూన్యమగు స్థానము నాశ్రయింపుము. ఇహపరములయందు భయరహితుఁడ వగుదువు. నీకుసంగమునం దిష్టమున్న చోఁ దపోనిత్యుఁడు దాంతుఁడు నగు వానితో సహవాసముచేయుము. గుణసంగులతో నెన్నఁడును బరిచయము చేసికొనకుము. ఏకచర్యారతుఁడవు కమ్ము,

సుఖదుఃఖములకు నారామములగుభూతములయందు నొక్కండే క్రీడించును. అట్టివాఁడు జ్ఞానతృప్తుఁ డనంబడును. జ్ఞానతృప్తుఁ డెన్నఁడును దు:ఖింపఁడు. కేవల సుఖములచే దేవత్వమును బొందు చున్నాఁడు. మిశ్రమ సుఖములచే మనుష్యుఁ డగుచున్నాడు. అశుభములచే నథోగతిఁ బొందుచున్నాఁడు. మనుష్యజన్మమునందు జరామృత్యదుఃఖములచే సర్వదా తొట్రుపడుచు నీసంసారమున మునింగి యున్నాఁడు. అదిగ్రహింపనేరక ఆసంసారమున సహితము హితముగాను, హితము సహితముగాను వాఁడబడును. అనిత్యము నిత్యమనియు, నరర్ధ మర్థమనియుఁ దలంపఁబడును.

తనయందుఁ బుట్టఁబడిన పలువిధములగు తంతువులచేఁ దన్నే చుట్టుకొను పట్టుపురుగువలె సంసారంబునఁ దనదోషములచేతనేచుట్టుకొనఁబడి బాధలం జెందుచుండును. చివరకుఁ బట్టుపురుగు తంతువేష్టితమై మృతినొందు. అట్లె పుత్రదార కుటుంబములయందు సక్తులై బురదలోఁ జిక్కుకొనిన యడవి యేనుఁగులవలె జంతువులు దుఃఖించు చున్నారు.

మహాజాలములచే లాగబడి మెరకజేరిన మత్స్యములవలె స్నేహజాలసమాకృష్ణులగుచు జను లెట్లు దు:ఖించుచున్నారోచూడుము. తనదేహమె యధ్రువంబగుచుండ బంధుమిత్రాదులు ధ్రువులాయేమి? సర్వమును విడిచి యెప్పుడో వెళ్ళదలఁచినవాఁడవే కదా! ఇట్టి యనర్ధకార్యమం దేమిటికి సక్తుండవయ్యెదవు? విశ్రాంతిశూన్యమై యాలంబరహితమై పాధేయముదొరకనిదై జీకటిచే నగమ్యమైయొప్పు మార్గంబునంబడి మరణానంతరమున నీవొక్కరుఁడ వెట్లుపోగలవు? మృత్యముఖంబునంబడి బయలుదేరి వెళ్ళునప్పుడు నీవెంట నీభార్యా పుత్రాదులలో నొక్కరుఁడు రాడని యెఱుంగుదువా? నీవుజేసిన సుకృత దుష్కృతములే నీవెంటవచ్చును. నిన్ను రక్షించినను భక్షించినను సుకృత దుష్కృతములే! నీ కెవ్వరును లేరు. నీ వెవ్వనివాఁడవునుకావు.

విద్యయు, గర్వము, జ్ఞానము, శౌచము, అర్థార్థమై యనుసరించును. వానిచే సిద్ధార్థుఁడు విడువఁబడుచున్నాడు.

నీకు గ్రామంబుననుండు తలంపు గలుగుట నది నీకు బంధన పుత్రాడునుమీ. ఉత్తముఁడు దానింద్రెంపిపోవుచున్నాఁడు. పాపులు దానిం ద్రెంపలేక కట్టుపడియుందురు. ధర్మాధర్మముల విడువుము. సత్యాసత్యములవదలుము. వాని వదిలిసపిమ్మట నీవు దేనిచేత విడువఁబడుచున్నావో దానిఁగూడవదలి వేయుము, సంకల్పశూన్యుడవై, ధర్మంబును అలిప్సచే నధర్మమును విడువుము. మంచిబుద్ధిచే సత్యానృతముల విడువుము. పరమ నిశ్చయమువలన బుద్ధిని విడువుము. మఱియు నెముకలచేఁ గట్టఁబడినది, న్నాయువుతోఁ గూడికొన్నది, మాంసశోణితములచేఁ బూయఁబడినది, చర్మముచే గప్పఁబడినది, మూత్రపురీషములఁచేఁ బూరింపఁబడినది, జరారోగములచే బీడింపఁబడునది యనిత్యమైనది ఇట్టి భూతావాసమును శరీరమును నమ్మియుండకుమీ.

పుత్రా! ఈకనంబడుచున్న పంచభూతాత్మకమగు జగంబంతయు మహత్తని చెప్పఁబడుచున్నది. ధర్మాధర్మములను, సుఖదుఃఖములను, జీవితమరణములను, ఎవ్వఁడుఁ తెలిసికొనుచున్నాడో వాఁడే తెలిసిన వాఁడు, జ్ఞానవంతుఁడుసుఖదుఃఖములంబారంపర్యముగావచ్చునని యెఱింగి శోకమోహముల నందఁడు, ఇంద్రియముచేత హింసింపఁబడునది వ్యక్తమనియు, నతీంద్రియమైనది యవ్యక్తమనియుఁ జెప్పఁబడుచున్నది. ఇంద్రియముల జయించిన దేహియుదకపానంబునంబోలె దృప్తుం డగును. లోకమందుఁ దన్నును దనయందు లోకమును జూచుచుండెడి పరాపరజ్ఞుని శక్తి జ్ఞానమూలకమగుట నెన్నఁడు నశింపదు. మోహజములైన వివిధక్లేశములను జ్ఞానముచేత జయించుచున్నాఁడు. భూతములయొక్క సంయోగము కారణము లేక రానేరదు. బుద్ధిప్రకాశత చేత లోకమార్గము దెలియఁబడుచున్నది.

జీవి స్వకృతములగు కర్మలచేత నిత్యదుఃఖితుండై తద్దుఃఖ నివారణముకై నిత్యము ననేకజంతువుల హింసించుచుఁ దిరిగి క్రొత్త కర్మలం చేయుచుండును. అసథ్యముజేసిన రోగివలెఁ దానుజేసిన కర్మఫలము తాననుభవింపుచుఁ దపించుచుండును. మోహాంధుండై సుఖమను పేరుగల దు:ఖములో సర్వదా మునింగి తేలుచుండును.

స్వకర్మములచేఁ గట్టఁబడి కవ్వమువలె సంసారచక్రంబునఁ ద్రిప్పఁబడుచు ననేకబాధలం బొందుచుండును. కావున వత్సా! నీవు బంధంబులఁ ద్రెంపికొని కర్మల విడిచి నిజుమెఱింగి భావశూన్యుండవై సిద్ధింబొందుము. సంయమనంబున బంధముల ద్రెంపికొని సుఖోదయమై బాధాశూన్యమై యొప్పు సిద్ధిని ననేకలు పొందియున్నారు.

మహాత్మా! శోకోపహతికొఱకు శాంతికరమైన శాస్త్రముల వినినచో మంచిబుద్ధిగలుగును. అట్టి బుద్ధిబొందిన జనుండు సుఖవంతుఁడగును. ప్రతిదినము శోకస్థానసహస్రములు భయస్థానశతములుమూర్ఖుని బొందుచుండును. పండితుఁడు వాని గణింపఁడు. కావునఁ దండ్రీ! యనిష్టనాశనమునకై మదీయోపన్యాసమును వినుము, బుద్దీని వశము జేసికొనినవానికి శోకము నశించును. స్వల్పబుద్ధులు ఇష్టనాశనమునకై వగతురు. భూతములను గుణములు పొందుచున్నవి. విడిపోవుచున్నవి. వానిగుఱించి విచారించిన లాభములేదు.

మృతునిగుఱించి నష్టమును గుఱించి యతీతమైనప్పుడు విచారించుటవలన దుఃఖమేయగును. లోకప్రచారము దెలిసికొనిన నశ్రు మోచనముచేయఁడు. పెక్కేల సమస్తము లెస్సగాఁ జూచువానికి నశ్రుబిందు వైనరాఁజాలదు. వినుము. దుఃఖోపఘాతుకంబగు శరీరధర్మంబునందును మనోధర్మంబునందును నుండువానికి దుఃఖము రాకుండ మానునాయందువేమో! తగిన యత్నము జేసి దానిందలంపఁగూడదు. దుఃఖమునకు వైద్యము తలంపకుండుటయే. చింతించుచున్న వాని శోకము క్రొ త్తదియై వృద్ధిపొందుచుండును. ప్రజ్ఞచే మనోదుఃఖమును ఓషధులచే శరీరదుఃఖమును బోగొట్టుకొనవలయును. విజ్ఞానసామర్థ్య మన నిదియేకదా! లేనిచో శిశువులవలె రోదనము జేయుదురు.

లోకము, యౌవనము, రూపము, జీవితము, ద్రవ్యము, ఇష్ట జనాప్తి, సర్వము నధ్రువమని యెఱిఁగిన వానికిఁ దద్వియోగంబున శోకము జనింపదు. జనసంఘమువలన వచ్చిన శోకము తానొక్కఁడే యనుభవింపవలదు. దుఃఖింపకయే ప్రతీకారము తెలిసికొని కావింప వచ్చును. లోకమున జీవులకు సుఖముకంటె దుఃఖమే విస్తారముగా నుండును. ఇంద్రియార్ధములయందు స్నిగ్ధత్వము మోహమువలన మరణంబు గలుగుచున్నది. సుఖదుఃఖములు రెండును విడిచినవాఁడె యుత్తముఁడు. వయసు నడుచుచు నిమిషము నిలువదుగదా. శరీరమే యనిత్యమగుచుండఁ డత్సంబంధములు నిత్యము లెట్లగును. కష్టము మీఁద నర్ధములను విడుతురు. తత్పాలనకై సుఖములఁ గోల్పోవుదురు. ధనాభివృద్ధి వడసియుఁ దృప్తిలేక సంపాదనపరుండగును. తృప్తిలేనివారు దుఃఖమునే పొందుదురు. తృప్తిగలవాఁడే సుఖముగల వాఁడు. సముఛ్రయములు పతనాంతములు. వియోగాంతములు సంయోగములు. మరణాంతములు జీవితములు. భూతముల యనిత్యత యెఱింగినవా రెప్పుడును దేనికిని శోకింపరు. విద్వాంసులు సంతోషమే ధనముగాఁ జూతురు. కామములఁ దృప్తిబొందక వానిని గుఱించి విచారించుచుఁ దదనుగుణములగు కార్యములఁ జేయుచున్న మూఢునిఁ బెద్దపులి పశువుంబట్టినట్టు మృత్యుదేవత పైఁబడి యీడ్చి కొనిపోవును. కావున దుఃఖమోచనమునకై యుపాయ మాలోచించు కొనవలయును. ఆలోచింపక యేకార్యము ప్రారంభింపఁగూడదు.

ధనికుఁడైనను దరిద్రుడైనను శబ్దస్పశన్ రూపరస గంధముల ననుభవించుటకంటె వేరులేదుగదా ? అంతకుమున్ను దుఃఖములేదు. భూతసంమేళనపూర్వమును దుఃఖములేదు. తాను బుట్టకపూర్వ మేమియును లేదు. తరువాత వచ్చిపోయినవానిగుఱించి పరితపించుట తెలిసికొనమిఁగాదే. పూర్వవృత్తాంతము దలంచికొనిన నాదు:ఖము నిలువదు. ధైర్యముచే శిశ్నోదరములను మనన్సుచేత చక్షుశ్రోత్రములను విద్యచే మనోవాక్కులను గాపాడుకొనవలయును.

అధ్యాత్మరతుండై కూర్చుండి నిరపేక్షుండై నిరామిషుండై యొప్పు పురుషుఁడు తన బుద్ధిసహాయమువలన దుఃఖములఁ బాసి సుఖించునని యెరింగించి నారదుండు వెండియు నిట్లనియె

మునీంద్రా! సుఖదుఃఖములయొక్క విపర్యాసములు గలిగినప్పుడు ప్రజ్ఞాయుక్తుండుగూడ ధైర్యము నిలుపుకొనఁజాలఁడు. కాని యట్టి ప్రయత్నము స్వభావముచేతనే చేయుచుండవలయును. యత్నముగలవాఁడు దుఃఖింపఁడు. జరామరణరోగముల వలన తన్నుద్ధరించుకొనవలయును. శరీరములు రోగయుక్తములు గదా. శారీర మానసికములగు రోగములు (ఆదివ్యాధులు) ధన్వులచేఁ బ్రయోగింపఁబడిన బాణములవలెఁ జీవుల బాధించుచుండును. రోగములచేఁ బీడింపఁబడుచుఁ జీవితాశగలిగి యవశుండగు వాని దేహము వినాశనమునకై మృత్యువుచేలాగఁబడుచున్నది. జరాజీర్ణమై జారినదేహము నదీప్రవాహమువలె వెనకకు మరలదు. (తిరుగా పడుచుఁదనము పొంద నేరదు).

రాత్రింబవళ్ళు మనుష్యుల యాయువుల హరించుచున్నవి. శుక్లకృష్ణపక్షములు వృద్ధులఁ జేయుచున్నవి. కాలము నిమిషమైనను నిలువదు. ముదిమిరాకున్నను సుఖదుఃఖములు మనుష్యుల వృద్ధులఁ జేయుచున్నవి.

సూర్యుఁ డస్తమించుచు నుదయించుచు ననేకవిచిత్రభావములఁ గల్పించుచుండును. పురుషకృత్యములగు పనులయొక్క ఫలవిషయమై పరాధీనముకాక స్వతంత్రమే కలిగినచో నెవ్వఁ డేది తలంచి చేయునో యకార్యము తప్పక సఫలముకావలసినదేకదా. అట్లగు చున్నదా. ఒకసారి లోకముదెసఁ జూడుము. దక్షులు బుద్ధిమంతులు నగువారు తలపెట్టినకార్యములు నిష్ఫలమగుచున్నవి. వట్టిమూఢులు లోకజ్ఞాన మీమియు లేనివారు సర్వకాముములచేఁ దృప్తులగుచున్నారు. ఒకనీచుండు హింసాపరుండై జీవులఁ జంపుచు లోకుల వంచించుచు సుఖించుచుండును.

ఒక్కఁడు నిర్వ్యాపారుఁడై కూర్చున్ననువానినిలక్ష్మి యాశ్రయించును. ఒక్కొకఁ డెంతప్రయత్నముజేసినను దరిద్రుఁడుగానే యుండి కర్మానుగుణ్యమైనఫల మనుభవింపనేరఁడు. ఇందులకు హేతు వేదియో చింతింపుము. ఇందుఁ బురుషునియపరాధ మేమియున్నది ? కొందఱు సంతానకాంక్షులై వ్రతాదులు జేసియుఁ బుత్రులం బడయ లేకున్నారు. కొందఱికి వలదనుచున్నను సంతానాభివృద్ధి గలుగు చున్నది. మఱియు మంచివారికి నీచులు నీచులకు మంచికుమారులు పుట్టుచుందురు. గర్భమందు మూత్రపురీషములుగలవు. తినిన యన్నము జీర్ణమగుచున్నది. రేతస్సు జీర్ణముగాక గర్భముగలుగ జేయుచున్నది. మఱియొక్క విచిత్రము చూడుము. జంతువులకు గర్భధారణమునకుగాని విసర్జమునకుగాని స్వతంత్రమేమైనఁ గలదా. అన్నము లోపలవేయుటయే వాని స్వతంత్రము. తరువాత నేమగునో యెట్లు పోవుచున్నదో వానికిఁ దెలియునా ? కావున మనుష్యులకు స్వతంత్రోద్ధారణమందు సామర్ధ్యము లేదు.

వ్యాధులచే క్షుద్రమృగములవలె వ్యాధులచే మనుష్యులు పీడీంపఁబడుచుందురు. తఱుచు రోగములు ధనికులనే పీడించుచుండును. మృగములకుఁ బక్షులకు నెవ్వఁడు చికిత్సచేయుచున్నాడు? మఱియు మంచిమందులుగల వైద్యులుగూడ రోగపీడితులగుచున్నారు. లోక మీరీతి శోకమోహముల నందుచున్నది. ధనమున నెల్లవారు లోకము నతిక్రమింపవలయునని తలంచుచుందురు. అందులకుఁ దగిన ప్రయ త్నములు చేయుచుందురు. ఎన్నటికిఁ దృప్తిబొందరు. ఐశ్వర్యమత్తుల, మద్యపానమత్తుల, శకులాశ్రయింతురు. కొందఱికష్టములు విమర్శింపకున్నను దొలఁగిపోవును. కొందఱికష్టము లెన్నిప్రయత్నములనైనఁ దొలంగవు. కర్మసంగులయందు ఫలవైషమ్యము జూడఁబడుచున్నది. చూడుము! కొందఱు పల్లకీయెక్కుట గోరుచుండఁ గొందరు పల్లకీ మోయుటయే యుద్యోగముగాఁ బరిగణింతురు. కొందఱు స్త్రీలులేక కొందఱు పురుషులులేక దుఃఖింతురు. కావున నో వ్యాసనందనా! గహసమువంటి సంసారమున మునుంగక నీవు నాయుపన్యాసమును వినుము. నీవు ధర్మాధర్మములు సత్యాసత్యములు విడువుము. దేనిచేత నీవు విడువఁబడుచున్నావో దాని విడువుము. ఇది రహస్యము. మనుష్యలోకము కడుచెడ్డది. ఆదెసం జూడకుమని పలికిన విని శ్రీశుకుఁడు మనస్సులో నాలోచించి అయ్యో! దారాపుత్రాదుల సంగమము మహాక్లేశకరము. విద్యావ్యాసంగము శ్రమకరమైనదే. అల్ప క్లేశలభ్యమగు మార్గ మేదియున్నది? నిశ్చయమైన గతియేది? అని రెండుగడియ లాలోచించి నే నెట్లు మోక్షమును బొందువాఁడ నక్కటావియోగసంకటసాగరమగు నీసంసారమునం బడి తిరగఁజాల. ఎందుఁ బోయినఁ దిరుగా నావర్తము లేదో దానిం గోరుచున్నాను. సర్వసంగములు విడిచి నాకెందు శాశ్వతమైన సుఖముగలుగునో నే నక్కడికిఁ బోవుచున్నాను. కర్తవ్య ముపదేశింపుమని యడిగిన నారదమహర్షి యీయర్ధంబు దేటవడ నొక్క యితిహాసంబు జెప్పెద నాలింపుము.

అని చెప్పునప్పటికి కాలాతీతమగుటయు మణిసిద్ధుం డవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.


___________