కాశీమజిలీకథలు/పదవ భాగము/245వ మజిలీ

సీ మూర్ఖుఁడా! నాచెప్పిన నీతియంతయు వఱదపాలుగావించితివే. మోహమన నిదియేకాదా! ఇంత తెలిసికొనఁజాలకుంటివేమి? ఇది యొక యింద్రజాలమని గ్రహింపుము. ఎండమావులలో నీరు గ్రోలఁగలవా? నీవిట్లెన్ని కల్పములు దుఃఖించినను నీభార్య కనంబడదు. విరక్తుండనై యింటికిఁ బొమ్మని యుపదేశించిన విని తాళధ్వజుం డేమాటయుం బలుకనేరక లోలోపల దుఃఖించుచుఁ దటాకములో' స్నానముజేసి యింటికింబోయెను.

అని యెఱింగించి — పైమజిలీయం దిట్లు చెప్పఁదొడంగె.

__________

245 వ మజిలీ.

క. నారదుఁ డామాటలఁ జెవు
   లారఁగ విని నృపతిఁ గన్నులారఁగని యప
   స్మారుని గతిఁ దనమదిలో
   నూరక తలపోసిపోసి యూహగలంగన్.

గీ. నవ్వు, విలపించు, వగచి డెందమున దాను
   మున్ను జేసిన చేష్ఠలనన్ని దలఁచి
   స్వప్న మో! భ్రాంతియో! యింద్రజాలమో! య
   టంచుఁ దర్కించు నాకస మట్టెచూచి.

అతని చిత్తవికారంబరసి సరసిజాక్షుండు నవ్వుచు నారదా? నీవున్మత్తుండువోలె నీలోనీవే మాటలాడికొనుచుంటివేమి? జలంబుల మునింగి వింతలేమైన గంటివా! అని యడిగిన గ్రహించి నారదుండు ఓహోహో ఇదియా తాతా! తెలిసికొంటి నీవుపన్నిన యింద్ర జాలమా! నీచేతవంచింపఁబడితి. మాయాబలము జూపితివి. ఔరా! ఎన్నివిచిత్రములు గావించితివి? లెస్స. లెస్స. నేనాఁడుదాననై కావించిన చర్యలన్నియుఁ గన్నులకుఁ గట్టినట్లున్నవి గదా! అయ్యో!. తలంచికొనిన సిగ్గగుచున్నది. స్వామీ ! నిజముగాఁ దాళధ్వజుఁ డున్నాడా ? అతఁడు నావంటివాఁడేనా? అతండు నన్నుగురించి యుగ్గడించిన చర్యలన్నియు నేను గావించినవియే. అవి యన్నియు నిప్పుడు జ్ఞాపకమున్నవిగదా! నేను నారీదేహసంస్థుఁడ నైనప్పుడు నారదదేహ వృత్తాంతమేమియు జ్ఞాపకము లేదేమి? మనస్సు, బుద్ధి, చిత్తము, లింగదేహము, అదియే కదా. ఈమోహమేమిటికిఁ గలుగవలయును? అని యడిగిన శ్రీవిష్ణుఁ డిట్లనియె.

నారదా! తాళధ్వజుండు నావంటివాడేనా యని యడిగితివి. నీవంటివాఁడు కాక యతండు నిత్యు డాయేమి? ప్రపంచకమంతయు మాయాబలంబున నున్నట్లు కనంబడుచున్నది. అంతయు మిథ్య కాదా? సర్వజంతువుల దేహములయందు దశాభేదములంబట్టి మాయావిలాసములు వ్యాపించి యుండును. జాగ్రత్స్వప్న సుషుప్తులని యవస్థలు మూడుగలవు నాలుగవది దేహాంతరప్రాప్తి. స్వప్న వృత్తాంతములు మేలుకొనినతోడనే యన్నియుఁ బొడకట్టును. కలలోనున్నప్పుడు బాహ్యప్రచారము లేమైనం దెలియబడుచున్నవియా? నిద్రచేఁ జిత్తము జలింపఁగా స్వప్నములు వచ్చుచుండును. క్రూరజంతువులు తన్ను దఱుముకొనిరా స్థూలేంద్రియములు లేకపోవుటచేఁ బారిపోవ సమర్ధుఁడు కాఁడు. ఎన్నఁడో చచ్చిన పితామహుఁడు తనయింటికివచ్చి భుజించినట్లు కనంబడును! లేచినతోడనే యదియంతయు నసత్యముగాఁదోచును. అతఁడు వచ్చుటసత్యమా! అసత్యమా! కన్నులార జూడఁబడినట్లు మాట్లాడినట్లు తెలియబడుచుండును గదా. అదియే మాయాబలము. అప్పుడు నీవు నారదుండవని తెలిసికొనలేకపోయితివి. ఇప్పు డాకధలన్నియుఁ దెలియుబడుచున్నవి. మాయావిలాసములు స్వప్న భ్రమలవంటివని యెఱుంగుము.

మఱియు నేను శంకరుండు బ్రహ్మయుఁగూడ మాయాబల విశేషములఁ దెలిసికొనఁజాలము. ఇతరులమాట జెప్పనేల? గుణత్రయముచే స్థావరజంగమాత్మకమగు జగంబు జనించినది. గుణము లేక సంసారము గలుగదు. గుణములేనివాని నేనిదివఱకుఁ జూచియుండలేదు. వినలేదు. నేను జితమాయుండనని పలికితి వందులకై నీ మాయాబలము జూపితిని. తెలిసినదియా? అని యడిగిన నారదుండు సిగ్గుపడుచు హరికి నమస్కరించి యతని వీడ్కొని తిన్నగా బ్రహ్మ లోకమున కరిగి తండ్రికి నమస్కరించె.

క. మునిఁగనుఁగొని చతురానను
   డనురాగముతోడ నిట్టులను నీమోముం
   గనఁ జిన్నవోయియున్నది
   తనయా! యెఱిఁగింపు నువిదితనయా! యనినన్.

నారదుండు తండ్రీ! నామోహమునకంతయు నీవే కారకుండవు. నాయవమానమేమని చెప్పుకొందును ? పుట్టినతోడనే జ్ఞానమార్గ ముపదేశింపుమని కోరికొనినఁ గోపించి గంధర్వజన్మ మెత్తించి పెద్ద కాలము ఏబదుగుర భార్యలతో గ్రామ్యధర్మముల ననుభవింపఁజేసితివి. తరువాత దాసీపుత్రుం జేసితివి. అంతటితో విడువక సృంజయుని పుత్రికతోఁ గూర్చితివి. పిమ్మట నేను హరిభక్తుండనని పేరు పెట్టుకొని వైకుంఠమున కేగఁగా నన్ను విటాధమునిగా దలంచి కమల జాటునకుఁబోయినది. అందులకు వగచుచు శ్రీవిష్ణునితోఁ జెప్పఁగా నతండు పామరునకుఁబోలెనది మాయాబలము. పతివ్రత పరపురుషులకడ నిలువరాదని ధర్మములు బోధించెను. నీ పెద్దబిడ్డలు సనకసనందనాదులరిగిన లక్ష్మీదేవి చాటునకుం బోఁగలదా ! విష్ణు డట్లు జెప్పగలఁడా ? నాకర్మము. నన్నధమాధమునిఁగాఁ దలంచి యాఁడుదానింజేసి యనేక నీచకృత్యములు చేసినట్లు పన్ని నాకుఁ దగనియవమ మానము గావించెను. నేను మునులలోఁ గడుహీనుండనైతిని. పామరుండనైతి గానిమ్ము. నాకిదియొక ప్రారబ్ధకర్మ మగుంగాక. ఇటుపైన నాప్రజ్ఞ జూతురుగాక. నేను జితమాయుండనై త్రిమూర్తులనుగూడ మాయా బద్ధులం గావింపఁజాలక పోయినచో నన్నీ పేరఁ బిలువకుడు. ఇందులకు నీవు నాకొక యుపకారము గావింపవలయును. దక్షుండు నన్నొకచో నిలువకుండునట్లు శపించియున్నాఁడు. అక్కార్యంబు తపంబునకు విఘ్నప్రదంబు కావున నేను తపంబుగావించునంతకాలము నన్నా శాపదోష మంటకుండ వరంబిమ్ము. ఇదియే పదివేలనికోరిన బ్రహ్మ సంతసించుచుఁ బుత్రు నాలింగనంబు జేసికొని యిట్లనియె.

పుత్రా ! నిన్ను సంసారిగాఁజేయు తలంపుతో మొదటినుండియు నీతపంబున కంతరాయము గల్పించితి. నీవు రెంటికిం జెడిన వాఁడవైతివి. కానిమ్ము. నీయభీష్టము వడువునఁ దపంబు గావించి సర్వోత్కృష్టుఁడవు కమ్ము. నిన్ను దక్షశాపంబంటకుండ వరంబిచ్చితిఁ బొమ్ము. తపంబు సర్వకార్యసాధనమని యనుజ్ఞయిచ్చుటయు సంతసించుచు నారదుఁడు తండ్రియాజ్ఞ గొని ధరిత్రినతిపవిత్రమైన బదరికారణ్యమునకరిగి యందు నియమిత చిత్తుండై ,

చ. తరణికరప్రహేతిపరితప్త నిదాఘమునందుఁ బావకాం
    తరమున నభ్రఘోషభయదంబుల వార్షిక రాత్రులందు బీ
    తర బయలన్ హిమంబుగురియన్ వడకించెడు శీతకాలమం
    దరుదుగఁ గంఠదఘ్నజలమందు వసించి మునీంద్రుఁడుద్ధతిన్ .

నిరాహారుండై దక్షిణపాదాంగుష్ఠంబుననిల్చి యచలంబువోలెఁ గదలక యనేక సహస్రదివ్యవర్షంబు లత్యుగ్రతపంబు గావించుటయుఁ దన్మూర్థాంతరంబునుండి వెల్వడిన జ్వలనంబు ప్రజ్వలజ్జ్వలా

భీలంబై ప్రళయానలంబు పగిది జగంబులఁ పీడింపఁ దొడంగినది. మణియు,

చ. జలనిధులేడునుంగలఁగె సప్తకులాచలముల్ జలించె ది
    క్కులఁ బొగగ్రమ్మెవే తిరిగెఁ గుమ్మరిసారెగతిం ధరిత్రి వ్యా
    కులపడె నెల్లదేవమునికోటు లేదేమి? యయో? యకాలపుం
    ప్రళయమటంచు నారద తపః ప్రభవానల దహ్యమానులై .

అయ్యకాండ ప్రళయంబునకు వగచి హాహాకార రవంబులు సేయుచు ముప్పదిమూడుకోట్ల వేల్పులు దిక్పతులు సేవింప నింద్రుఁడు పరమేష్ఠికడ కరిగి యయ్యుపద్రవ ప్రకారం బెఱింగించుటయు నా సృష్టికర్త వారినెల్ల వెంటఁబెట్టికొని నారదునొద్దకుంబోయి వత్సా! నారద ! నీతపంబు లోకంబులం బీడింపుచున్నది. నీయభీష్టంబు దెలిపి వరంబులంది తపం బుపసంహరింపుమని పలికిన నతనిమాట వినిపించు కొనక యధాప్రకారంబు తపంబు గావింపుచుండెను.

అప్పుడు బ్రహ్మ యా దేవసమాజముతోఁగూడ శంకరు నొద్దకుంబోయి నారద తపః ప్రవృత్తిం దెలుపుటయు నమ్మహాత్ముండు వారెల్ల దనవెంటరా నత్తపోధన సత్తముని సవిధంబున కరిగి బోధించుచు నిట్లనియె.

క. యతివర యేమిటికి ట్లు
   గ్రతపంబొనరింపుచుంటిఁ గడువడి లోక
   త్రితయముచలింప నీకా
   మితమదియేమియొ వచింపుమీ యిత్తుననన్ .

మహేశ్వరున కేమియుఁ ప్రత్యుత్తర మీయక నారదమహర్షి తపంబు విరమింపఁడయ్యె నప్పుడయ్యుమాపతి యెల్ల వేల్పులతోఁగూడ వైకుంఠంబున కరిగి రమాధవున కయ్యుదంత మెఱింగించె నప్పుడా శ్రీమన్నా రాయణుండు లక్ష్మీసహితుండై బ్రహ్మరుద్రాదులతో నారదమహర్షి యొద్దకుబోయి తచ్ఛిరంబునఁ దనకరంబిడి,

శా. వత్సా! నారద! లెమ్ము నీవిటుల దుర్వారజ్వలద్వహ్ని భూ
    భృత్సాదృశ్యముగాఁ దపంబుసలుపన్ భీతిల్లె లోకంబు లా
    పత్సమ్మగ్నములై వచింపుము భవద్వాంఛా విశేషంబుల
    త్యుత్సాహంబున నీయవచ్చితిమి దివ్యుల్ గొల్వ మేమీయెడన్.

గీ. ఇతఁడు మీతండ్రి బ్రహ్మ గిరీశుఁ డీత
   డితఁడు సురపతి వీ రెదిక్పతులు వీరు
   వాగ్రమా పార్వతులు వింధ్యవాసినియును
   వరములీయంగ నీకిందు వచ్చినారు.

ఏను వాసుదేవుండఁ దపంబు చాలించి నీకోరికల దెలుపుమని పలికిన విని నారదుండు కన్నులందెరచి యెదుర సర్వలోకాధి పతులఁ ద్రిమూర్తుల సకలదేవతాసమూహములఁ గనుంగొని మేనం బులక లుద్భవిల్ల వారికెల్ల నమస్కారములు గావించుచు నారాయణు నుద్దేశించి యిట్లనియె.

మహాత్మా ! నాయభీష్టంబుదీర్ప నిప్పటికి దయవచ్చినదియా ? నాకడకు నీభార్య లక్ష్మింగూడ దీసికొనివచ్చితి విది వింతగానున్నది. నేనా మహాదేవి దర్శనముసేయ నర్హుండనైతిగా. నన్ను నాఁడు నీవాఁడుదానింజేసి యనేక మాయావిలాసంబులం జూపితివి. జ్ఞాపక మున్నదియా. అయ్యవమానంబు బాధింప నీ ఘోరతపంబు గావించితిని. నాకేకోరికయునులేదు. మాయను జయించుటయే నాయుద్దేశము. నన్ను జితమాయుండనని మీరెల్ల నొప్పుకొందురేని యీతపంబు సాలింతు లేకున్న నింకను ఘోరముగాఁ గావింతు నిదియే మదీప్సిత మని పలికిన విని సంతసించుచు నారాయణుం డిట్లనియె.

మునీంద్రా ! నీవిప్పుడు జితమాయుండ వైతివనుట కేమియు సందియము లేదు. మాయాస్వరూపిణియగు మూలప్రకృతి యాదిశక్తి యిదేవచ్చి నీకడనిలిచి నీకు వశవర్తినినైతినని సూచించుచున్నది. పుటంబిడిన బంగారమువలె నీవీతపఃకరణంబునఁ బరిశుద్ధుండవైతివి. నీగుణములన్నియు నశించినవి. త్రిమూర్తులకుఁగూడ గుణములున్నవి. నాఁటి యవస్థననుసరించి నిన్నట్లనవలసి వచ్చినది. ఇప్పుడు నీవు సర్వసముఁడవైతివి. త్రిమూర్తుల పత్నులేకాక యింద్రాణి ప్రభృతి దేవ కాంతలు నీకడ సిగ్గుపడరు. ఎవ్వరి యంతఃపురమునకరిగినను నీకాటంకములేదు. వారివారి సెలవులతోఁబనిలేదు. నిష్కాముఁడవగు నిన్ను జూచిన నెవ్వరికిని సందియము గలుగదు. సర్వమహర్షులందే కాక మద్భక్తులలో నీవే యగ్రగణ్యుఁడవైతివి. ఎల్లలోకముల స్వేచ్ఛా విహారములు సేయుచుందువుగాక. సమస్తపురాణములు నీముఖంబున వెలువడఁగలవు. తత్వజ్ఞుండవన నీకే చెల్లును. నీవెఱంగిన తత్వరహస్యములు దేవతలుగూడ దెలిసికొనఁజాలరు. నీయన్నలు సనకసనంద నాదులకన్న నీకే యెక్కవ ఖ్యాతిరాఁగలదు. అని యెన్నియో వరములిచ్చి విష్ణుఁడు నారదమహర్షిని సంతోషపఱచె.

పిమ్మట బ్రహ్మయు శంకరుండుగూడ నతనికి సర్వాధికుఁడగు నట్లు మఱికొన్నివరము లిచ్చిరి. అట్లు సమస్తదేవతాసమూహముచే సర్వమునిసార్వభౌముండని కీర్తింపఁబడి నారదుండు వారికెల్ల వంద నంబులొనరించి శ్రీహరిం బెద్దగా స్తుతియించెను.

బ్రహ్మాదిదేవత లమ్మహర్షిని దీవించి తమతమ నెలవులకుఁ బోయిరి.

అని యెఱింగించి – మఱియు నిట్లనియె.


___________