కాశీమజిలీకథలు/పదవ భాగము/243వ మజిలీ

నగరముగానే యున్నదఁట. దీని వర్ణింపఁ బెద్దకాలము పట్టును. ఏవీధి కావీధియే యొక పట్టణమని చెప్పవచ్చును.

దైవకృపచే మన మేగురము మంచిభార్యలం బడసితిమి. అమితధనము సంపాదించితిమి. మఱియు నీస్త్రీ రాజ్యము మన యధీనమైనది. మన మిప్పుడు భార్యల వెంటఁబెట్టుకొని యన్నలవలె నింటికిఁబోయి తలిదండ్రులకు సోదరులకు ప్రజలకు నానందము గలిగింతము. మన దక్షిణదిగ్యానము గూడ గొంత సఫలమైనదని చెప్పుకొనవచ్చును. మనదేశమునకుం బోవుదమా? అని చెప్పిన నామాట కందఱు సమ్మతించిరి. తమతమ భార్యలకు వారివారి యాప్తులకు నావార్తఁ దెలియఁజేసి శుభముహూర్తంబునఁ బయనంబై యా రాజ్యంబు మంత్రులు బాలించునట్లు నియమించి చతురంగబలములు గొలువఁ గతి పయప్రయాణంబులం గన్యాకుబ్జనగరంబు ప్రవేశించి తలిదండ్రులకు సోదరులకుఁ దమ వృత్తాంతమంతయు నెఱింగించి సంతోషసాగరంబున మునుంగఁ జేసిరి.

అని యెఱింగించి.. .మణిసిద్ధుం డిట్లనియె.

___________

243 వ మజిలీ.

మునుల తారతమ్యము.

గీ. తన కుటంబంబు తామరతంపరగను
    నల్లుకొన వేనవేలకు నిధికమగుచు
    తనదు నామము సార్థకత్వము వహింప
    నలరె సౌభాగ్యసుందరి యధికమహిమ.

ఇరువదిమంది కుమారులును దిగ్విజయంబుజేసి లోకాతీత సౌందర్యంబునఁ బ్రకాశించు నించుబోడ్లం బెండ్లియాడి యింటికివచ్చిన తరువాతఁ గొడుకులును గోడండ్రును మనుమలు మునిమనుమలులోన గు తనకుటుంబమును జూచికొని సౌభాగ్యసుందరి తన్నుఁబోలు భాగ్యశాలిని యెందునులేదని గర్వపడఁ జొచ్చినది. లెక్కింప నామె సంతతి వేలకు మించియున్నది.

అకుంటుంబాభివృద్ధి ఆవైభవముం జూడ నింద్రభోగముగూడ హీనముగాఁ దోపకమానదు. ఆమె సంతతము మనుమలతో నాడు కొనుచుండును. మునిమనుమల ముద్దాడుచుండును. కోడండ్రతో ముచ్చటించుచుండును. గృహకృత్యములయందు లోపము రాకుండఁ బరిచారికాసహస్రముల నియమించి సమకూర్పించును. అట్టిమర్యాద యట్టి నైపుణ్యము యట్టి గౌరవప్రతిప్రత్తి యేమత్తకాశినికిని గలుగ లేదని విఖ్యాతి పొందినది.

ఆమె కోడండ్రు యిరువదిమందియు భువనైకసుందరులు. సకల కళాభిరాములు. సర్వజనస్తవనీయ చరిత్రులునై తరుచువిద్యాగోష్ఠి చేయుచుందురు. వారిలో వారి కొకప్పుడు మహాఋషుల తారతమ్యము గుఱించి సంవాదము గలిగినది. అందు

ఇంద్రునికూఁతురు, మధుమతి — మహర్షులందరు లోకాతీత ప్రభావముగలవారే, కానివారిలో లోపాముద్రా మనోహరుం డగస్త్యమహర్షి సర్వాధికుండని నాయభిప్రాయము. వినుండు,

సీ. జనియించె నేమునీశ్వరసార్వభౌముండు
               ప్రభమీర మహితకుంభంబునందు
    నిల్వలవాతాపు లేమహామహు కుక్షిఁ
              జేరి త్రేఁపినయంతఁ జీర్ణమైరి
    మునులచేఁ బల్లకీ మోయించి నహుషుఁ డె
              వ్వని హుంకృతిని బదభ్రష్టుఁడయ్యె
    గ్రహతారకాదుల గతుల కడ్డముగ నే
             గిన వింధ్యనగ మేని ఘనతనడఁగె

గీ. వనధి నాపోశనముగ నెవ్వాఁడు గ్రోలె
    సతత మేముని దక్షిణాశను వసించు
    నయ్యగస్త్యుండు సర్వసంయములయందు
    నగ్రగణ్యుం డటంచు నాయభిమతంబు.
    వారుణి — అక్కా! ఆమాట కాదనువారెవ్వరు?

గంధ:- ఆహా! ఆమహానుభావుండు గావించిన పనులు దేవతలకు గూడఁ శక్యమైనవియా? అతని సర్వాధికుం డనుటకు సందియమేలా?

చంద్ర – మధుమతీ! అగస్త్యమహర్షి యెట్టిపనులనైనఁ జేయ నీ యహంకారసక్తుడగుట సర్వాధికుండనుటకు నేనొల్ల.

క. పుత్రులు తిమూర్తులును క
   ళత్రం బనసూయ శాంతలలితాత్ముండా
   యత్రిమహామునికన్నఁ బ
   విత్రుండగు తపసిగలఁడె వెదకిన నెందున్.

రత్నావతి -- మహాపతివ్రతా శిరో మణియగు ననసూయా మహాదేవికిఁ బ్రాణవల్లభుండైన యత్రిమహర్షి యే యుత్త ముండని నాకును దోచుచున్నది.

ప్రభావతి — నా యభిప్రాయము నట్టిదే.

ప్రమద్వర — అక్కలారా! వీరిద్దరికన్నను బ్రహ్మమానస పుత్రుండగు మరీచికుమారుండు కశ్యపుని నుత్తముండని చెప్పినఁ దప్పు పట్టెదరా? వినుండు

గీ. అదితియుదున వేల్పులను దితియందు
    దానవులనెల్లఁ గనిన ప్రధానమూతిన్
    వనజభవు పట్టిపట్టి వామనుని తండ్రి
    కశ్యపునికన్న కథికుఁ డొక్కరుఁడు గలఁడె.

చారుమతి — కశ్యపుండే పరమోత్తముఁడని నే నభిప్రాయ మిచ్చుచున్నాను.

ప్రఫుల్ల - ఆమాటయే నేనును బలుకుచున్నాను.

కాళింది – అక్కా! నీవు మఱచిపోయితివిగదా! వినుము.

క. గోదావరి తనపేరిట
   మేదిని వెలయించినట్టి మేటి యాహ
   ల్యా దయితుఁడు గౌతమముని
   వేదండుం డధికుఁ డనుచు వివరింపఁదగున్.

రుక్మవతి — అక్కలారా ! నాకుఁ దోచినమాట నేనునుం జెప్పెద నాకర్ణింపుఁడు.

గీ. వసుధరాజిషిన్ యయ్యు దుర్వారభూరి
    వర తపఃప్రథితప్ర భావప్రభూతి
    సృష్టికిని వేరుసృష్టి జేసిన ఘనుండు
    కౌశికునిబోలు తపసి యొక్కరుఁడు గలఁడె.

మహారాజరత్నము - అక్కా ! రుక్మవతీ! ఇందఱు మహర్షులుండ నీమది కా పరమక్రోధనుండు మెప్పువచ్చెనా ? అక్కటా! నిత్యసత్యవ్రతుఁడైన యాహరిశ్చంద్ర మహారాజు నతండు పెట్టిన చిక్కులు తలంచిన నెంత కఠినాత్మునికైనఁ గన్నీరు రాకమానదు గదా ! నిజముగా విమర్శించినచోఁ

చ. వనజభవప్రసూతి రవివంశభవక్షితిపాల దేశికుం
    డనుపమ కీర్తివాసిత దిగంతుఁడు శాంతుఁ డరుంధతీ మనో
    వనజ దివాకరుం డురుతపః పరితోషిత సర్వదేవతా
    ప్రణుతుఁడు జ్ఞానమూర్తి మునివర్యుఁ డనంగ వసిష్ఠుఁడేకదా.

ఇమ్మహాత్ముని తపఃప్రభావముజూచి యోర్వలేకయేకాదా విశ్వామిత్రుఁడు మహర్షియగుట. రుక్మవతి - హరిశ్చంద్రునకు విశ్వామిత్రునివలనఁ గలిగిన కష్టములనే యుగ్గడించితివి కాని సుఖముమాట చెప్పవేమి? అమ్మహా రాజును మహేంద్రుని యర్ధసింహాసన మెక్కింపలేదా ! అదియునుంగాక హరిశ్చంద్రుఁడు పుత్రార్థియై వరుణు నారాధించి తనకుఁ బొడమిన కొడుకును పశువుగా వేల్తునని యొప్పుకొని కలిగిన పిమ్మట వరుణుం డరుదెంచి కొడుకును బశువుగా జేయుమనిన గడువులేర్పరచి త్రిప్పుచుండఁ గుమారుం డవ్విధం బెఱింగి పారిపోవుటయు దానం గోపించి వరుణుండు హరిశ్చంద్రుని జలోదర పీడితుండవు గమ్మనిశపించెను. తచ్ఛాపదోషంబునఁ బరితపించుచు హరిశ్చంద్రుఁడు అజీగర్తి యను బ్రాహ్మణుని మధ్యమకుమారుని శునశ్శేపుఁ డనువాని వారుణ యజ్ఞపశువుగాఁ జేయఁబూనినంత నాశునశ్శేఫుండు విశ్వామిత్రుని శరణుజొచ్చెను. పరమదయాసంపన్నుండగు నామహషిన్ శునశ్శేపుని కాపాడి హరిశ్చంద్రునియెడ వరుణుండు ప్రసన్నుం డగునట్లు చేసెను. హరిశ్చంద్రుని తండ్రి త్రిశంకు నిమిత్తమేకాదా క్రొత్త స్వర్గము నిర్మించెను. ఇన్ని విశేషము లే ముని యందున్నవి!

మహారాజిరత్నము - ఓహోహో ! ఇదెక్కడి కల్చన ? హరిశ్చంద్రుండు శునశ్శేపుని వరుణ పశువుగాఁ జేయుట యెప్పుడును వినలేదే. నీవు పొరపాటు పడుచున్నావు. హరిశ్చంద్రుని యజ్ఞమందు గాదు. అంబరీషుని యజ్ఞమందు. బాగుగా జ్ఞాపకము జేసికొనుము.

రుక్మవతి — నేనెఱింగియే చెప్పితిని. ఇందబద్ధములేదు.

మహా - నీవు రామాయణము చదువలేదా యేమి ?

రుక్మ - నీవు దేవీభాగవతము చదివిన నిట్లనవు.

మహా – రామాయణము కన్న దేవీభాగవతము ప్రమాణ గ్రంథమా?

రుక్మ - అది ప్రమాణగ్రంథము కాదని నీవెట్లు చెప్పగలవు ? రత్నమకుట - నిలుఁడు నిలుఁడు. ప్రస్తుతాంశము మఱచి మఱియొక గొడవలోఁ బడితిరేల ? మనము మహర్షి శ్రేష్ఠు డెవ్వఁడని కదా తగవులాడుచుంటిమి. ఆవిషయమే ముచ్చటింపుఁడు.

గంధ - అక్కలారా ! మీరందఱు తలయొకనిం బేర్కొను చుంటిరి. సర్వముని సార్వభౌముండైన నారద మహర్షి మాట యెవ్వఱకును జ్ఞాపకము వచ్చినది కాదేమి ?

సీ. పుట్టుకతోడనే పొడమె నేతపసికి
              జ్ఞానవైరాగ్యవిశ్వాసబుద్ధి
    భరియించె నెవ్వాఁడు పరమేష్టిశాపంబు
              గామినీవై ముఖ్య కలన నెసఁగి
    బ్రహ్మాత్మజన్మతాపసు లెందరున్న నె
              వ్వఁడు దేవమునియంచు వాసిగాంచె
    మూఁడులోకమ్ములు క్రీడాలయములుగా
              జరియించు నేమౌనిచక్రవర్తి

గీ. యక్షగంధర్వసిద్ధవిద్యాధ రాది
    ఖేచరులు భూచరులు శర్వరీచరులును
    స్త్రీలుపురుషులు సమత నర్చింతు రెవని
    నట్టి నారదమునియే సర్వాథికుండు.

చంద్ర - అవును ఆమహాత్ముని మించిన విరక్తుం డెవ్వఁడు కలండు?

క. ౙరగునది యెఱిఁగిచేయును
   సరిమిత్రులు శత్రు లఖిలసముఁ డామునికిన్.
   హరిభక్తాగ్రేసరుఁ డ
   ప్పరమ తపోధనునిఁ బోలు పరముఁడు గలఁడే.

మధుమతి — చంద్రకళ మంచిమాట చెప్పినది మనలో మనకి తగవేల. మన మన యభిప్రాయములు మన యత్తగారి కెరింగింతము. అమ్మహాసాధ్వి యెట్లుచెప్పిన నది సిద్ధాంతము. ఈమాట కందరు

నంగీకరింతురా ? అని యడిగిన నేకగ్రీవముగా నొప్పుకొనిరి. అప్పుడే యాకాంత లందఱు సౌభాగ్యసుందరికడ కఱిగి తమ తమ వాద ప్రకార మంతయు నెఱింగించిరి. సౌభాగ్యసుందరియు నారదనామ స్మరణంబున నేదియో మఱచిపోయి జ్ఞాపకమురాక యాలోచించు చున్నట్లు తలంచుచుఁ గొంతసేపటికి వారికిట్లనియె.

యువతులారా ! మహర్షుల తారతమ్యము తెలియక యింద్రాది బృందారకులే తొట్రుపడుచుందురు. మనమెట్లు గ్రహింపఁగలము? ఒక్కొక్కమహర్షియం దొక్కొక్క శక్తి లోకాతీతమైనది యొప్పుచుండును. ఏముని కామునియే యధికుండని చెప్పవలయును. మూర్తిత్రయ తారతమ్యంబు నిరూపింప నెట్లు శక్యముకాదో యిదియు నట్టిదే. ఇప్పటికి మీరందరు గెలిచితిరి. అందరు నోడితిరి. సంతసింపుఁడని చెప్పిన విని యింద్రుని కూఁతురు మధుమతి యిట్లనియె.

అత్తా! నీయభిప్రాయము నే దెలిసికొంటి. మాలో నొకరి వాదము గెలిపించినఁ దక్కినవారు చిన్నవోవుదురని యట్లుపలికితిరి. మీఁకు గోడండ్ర యందరియందు సమానప్రేమయున్నది. మొన్న మేమిట్లే పతివ్రతలలో నుత్తమురా లెవ్వతెయని వాదమాడితిమి. అన్ని విధముల మీరేయుత్తములని యేకగ్రీవముగా నంగీకరించితిమి. మీ యెదుట మిమ్ము స్తోత్రము చేయఁగూడదు కాని ప్రశంస వచ్చినది కావునఁ జెప్పుచుంటి. మీరు కోడండ్ర నందఱను సమముగా జూచుచు సమప్రేమతో నాదరించుచుందురు. మాపూర్వపుణ్యవిశేషంబున మీయట్టి యత్తగారు లభించినదని స్తోత్రములు జేయఁగా సౌభాగ్య సుందరి యిట్లనియె. మధుమతీ! నాకోడండ్రయొక్క సౌజన్యమే నా కీమంచికిఁ గారణమగుచున్నది. మీలోమీరు తగవులాడక నక్క చెల్లెండ్రవలె మెలంగుచుండ నేనెంతయు మురియుచుందును. నీవు మూడులోకములకు నధికారియగు మహేంద్రుని పుత్రికవు. నాకూడిగము సేయుచుండ నాభాగ్య మనన్య సామాన్యమని యొప్పుకొనకతప్పదు. నేను మీయందరి ముందర వెళ్ళినచో ధన్యురాలనగుదును. కాలమెట్టివారికిని సమముగా నడువదు. ముందరి క్షణమున మనమెట్లుందుమో తెలియదు. ఇప్పటికి మంచిగానే వెళ్ళినది. అని పలుకుచుండఁగనే తాళధ్వజనృపాలుం డయ్యతఃపురమునకుఁ దొందరగా నరుదెంచెను.

అమ్మహారాజుం జూచి కోడండ్రందఱు సిగ్గున దిగ్గున గదులలోనికింబోయిరి. అసమయమున వచ్చిన భర్తరాకకు శంకించుకొనుచు సౌభాగ్యసుందరి తదాగమన కారణంబడిగిన నాయొడయుం డిట్లనియె.

ప్రాణేశ్వరీ! యిప్పుడు మనకుఁ జెడుకాలము వచ్చినట్లు తోచు చున్నది. బునబిడ్డలు నాలుగుదిక్కులు జయించివచ్చిరని సంతసించితిమి. మనకు భూమియందుఁగల రాజులందఱు విరోధులైరి. అది యట్లుండె. మన వీరవర్మ పాతాళలోకమునకుఁబోయి యందుఁగల రాక్షసుల సంహరించి యాలోకము వశము జేసికొనియెంగదా. వజ్రకంఠుని పినతండ్రి పాతాళకేతుఁ డనువాఁడు దేవతలకుఁగూడ నజేయుఁడట. వాఁడు అయ్యతలమునందు రక్కసులకుఁ గలిగిన యపజయము విని రౌద్రావేశముతోఁ గొందఱరక్కసుల వెంటఁబెట్టుకొని యాయతలంబున కరుదెంచి యందున్న మన దూతలనెల్లం బరిమార్చి బిలద్వారమునఁ జిత్రకూటనగరమునకు వచ్చి యందు గాపున్న మనమూఁకల నెల్లఁ జీకాకుపఱచి మ్రింగుచున్నాడఁట. వాఁడు కుంభకర్ణునంత యున్నవాఁడఁట. వాని యాకారము చూచినంతనే మనుష్యుల ప్రాణములు పోవునఁట. అందున్న వాఱువపుఱౌతు ఒకఁ డెట్లో వాని బారి బడకుండఁ దప్పించుకొని వచ్చి యిప్పుడే యావార్త చెప్పినాడని యెఱింగించిన జడియుచు నప్పడఁతి యిట్లనియె.

ప్రాణేశ్వరా! బిడ్డలందఱు నింటియొద్ద నున్నారా! ఈవార్త విన్నారా? విని యేమనిరి? అని యడిగిన నతండు విన్నారు. ఈలాటి నిశాటుల నెందరినో బరిమార్చితిమని బీరములు వల్కుచున్నారు. వాఁడిందు వచ్చుచున్నాడని తరువాతి వార్తవినికవచాదిసాధనముల ధరించి యుద్ధసన్నద్ధులగు చున్నారని పలుకుచుండగనే యక్కు మార శేఖరు లిరువదిమందియు వీర వేషములతో నచ్చటి కరుదెంచి తల్లికి నమస్కరించిరి.

ఆమె వారి నందరం దీవించుచు బిడ్డలారా! ఆరాక్షసుఁ డెక్కడనో యుండఁగనే యోధవేషము దాల్చితిరేల? మన గ్రామమునకు వత్తురని నిశ్చయించితిరా? అనియడిగిన వారు తల్లీ! వాఁడు కామరూపుఁడు ఎగురఁగలడు. మన నగరమునకు గ్రోశదూరములో నున్నట్లు తెలిసినది. సేనల నంపితిమి. గుఱ్ఱము లెక్కి. మేము వోవుదుము. వీఁడన నెంత? వీని తాతలవంటి రక్కసుల పీచమడంచితిమి. నీవు జింతింపకుము. విజయమగునట్లు మా కాశీర్వదింపుము. నీ కోడండ్రు జడియుచుందురు. అదటుడిపి యుదుటు గరపుచుండు మని పలికినవిని యాయిల్లా లిట్లనియె.

బిడ్డలారా! నామది నేదియో యదటు గలుగుచున్నది. మీ రిప్పుడు యుద్ధమునకు బోవలదు. శత్రువుల బలాబలంబులు విచారింపఁవలయుంగాదే యనుటయు నవ్వుచు వీరవర్మ తమ్ములారా! అమ్మ మన పరాక్రమ మెఱుంగదు. వగచుచున్నది. నేనొక్కరుండపోయి వాని యుక్కడంచి వచ్చెద. మీ రిందుండుండని పలికిన నామె సరిసరి. నీవొక్కరుఁడవు పోవరాదు. తమ్ములతోఁ బొమ్ము. జాగరూకులై పోరొనరింపుఁడని పలుకుచు నెట్టకేలకు వారి సంపినది. పిమ్మట భార్యలకు జెప్పి వారిచే ననిపించుకొని యారాజ కుమారు లందఱు తురగారూఢులై యారాక్షస వీరుల కెదురుగా బోయిరి. అప్పుడు,

క. కాలము మేలై యొప్పఁగ
   వాలికపులి మేకయగుచు వశమగు మఱి య
   క్కాలము చెడ మేకయె శా
   ర్దూలంబై మీఁదఁబడి నిరోధించుగదా.

గీ. లీలరౌతులతో మావటీలతోడ
   గుఱ్ఱముల నేనుఁగుల మ్రింగికొనుచు నసుర
   తరిమి సేనల గబళింపఁ దాళలేక
   పఱచె వెన్నిచ్చి సేన దిగ్భాగములకు.

అట్లా దానవవీరుండు రౌద్రాకారంబున సేనలం దరుముకొని వచ్చుచుండుటఁజూచి రాజకుమారు లందఱ నొక్క పెట్టున గుఱ్ఱముల వానిపైకిఁదోలి శూలంబులం బొడిచియు వాలమ్ముల నేసియుఁ గుఠారంబుల నరికియు నసుల విసరియు గదలమోదియు నిర్వక్రపరాక్రమంబున వానిం జుట్టుకొనుటయు వాఁడు కోపావేశంబున వామనమూర్తియుంబోలె నాభీలముగాఁ మేను బెంచి,

క. అరచేతఁ జఱచికొందఱ
   గురుగతిఁ బిడికిళ్ళఁబొడిచి కొందఱఁ గాలన్
   జరచర ద్రొక్కుచుఁ గొందఱ
   నరనిమిషములోన వారినందఱఁ జంపెన్.

అట్లయ్యసుర గడియలో రాసుతులనెల్ల గతాసులం గావించి రాక్షసవీరులతోఁగూడ నిరాటంకముగ నానగరాంతరము ప్రవేశించి పేర్చిన కార్చిచ్చువోలె నలుమూలలు నాక్రమించి ప్రజాక్షయము

గావింపఁదొడంగె. మఱియు,

సీ. పారిపోయెడువారిఁబట్టి పొట్టలుచీల్చి
                రక్తంబు గ్రోలు ఘోరముగ నొకఁడు
    ఇండ్లలోదూఱి పూఁబోండ్ల దాసీదాన
                జనము లెంపలుకొట్టి చంపునొకఁడు
    శిశువుల నురమునఁ జేర్చి మూలలడాగి
               కొనువారి యీడ్చి చే దునుమునొకఁడు
    వెఱచి వే యుఱుకు బాలుర నెత్తిచఱచి మొ
              ఱ్ఱోయనం జక్కాడు నొక్కరుండు

గీ. డొక్కలూడగ వృద్ధుల ద్రొక్కునొకఁడు
   నల్లులనువోలె శిశువుల నలుపు నొకఁడు
   పసులఁ బులివోలె గొంతుకల్ పిసుగునొకఁడు
   ఊరిపైఁబడి రక్కసు లుక్కుమీఱ.

పాతాళకేతుఁడు రాక్షసబలములతోఁగూడ నావీటి పయింబడి మారిమెసంగినట్లు కనబడిన జంతువు పశుపక్షిమృగాదుల మనుష్యుల స్త్రీల వృద్ధుల బాలుర శిశువులఁబట్టికొని మొఱ్ఱోయని యఱవ మ్రింగుచుఁ జఱుముచు బ్రాముచుఁ బొడుచుచు ఆఁడుచుఁ ద్రొక్కుచుఁ బ్రజాక్షయము గావింపుచు నమ్మా! తండ్రీ! పుత్రా! మామా! అని యాక్రోశించుచు గుంపులుగాఁ బారిపోవు జనంబులఁ దరిమి పట్టుకొని ప్రోగులుగా సంహరించుచుఁ ప్రళయకాలంబోయని యెల్లరు తలంప రెండుయామయముల లో నానగరమంతయు మునుము వెట్టి శూన్యముగావించెను.

ఆరక్కసుఁ డుక్కుమిగిలి పోరనరిగిన రాజుకుటుంబమునంతయు సమస్త సేనలతోఁగూడ నాశనముచేయుటయే కాక పట్టణమునందలి పశుపక్షి మృగాదుల మనుష్యుల నాబాలవృద్ధముగా భక్షించుచు వచ్చుచున్నాడను వార్త విని సౌభాగ్యసుందరి హాహాకారరవము గావింపుచుదారుణశోకావేశంబునమే నెఱుంగక నేలఁబడి మూర్చిల్లినది.

ఆ యుపద్రవవార్త కోటలోనున్నవా రందఱకు దెలిసినది. అంతఃపుర స్త్రీలందఱు మహా దుఃఖావేశంబుతో బ్రాణబంధువుల మరణములకు దుఃఖించుచుఁ గటారులఁ బొడుచుకొనువారును దాదులచేఁ బొడిపించుకొనువారును నూఁతులం దూకువారును అగ్నిలోఁబడు వారు మెడ కురిబోసికొనువారునై రెండు గడియలలో రాజస్త్రీ లందఱు దేహత్యాగము గావించుకొనిరి. వారి పాటుజూచి దాసదాసీ జనంబులు బలవంతముగనే హత్యలు గావించకొనిరి. అంతలో నా రక్కసుఁడు కోటలోఁ బ్రవేశించి మిగిలిన శిశు బాలవృద్ధులఁ గ్రుద్ధుడై నెత్తిపై గ్రుద్దుచుఁ బెద్దనిద్దుర నొందఁజేసెను.

మఱియు రక్కసులెల్ల నాకోట గొల్లకొట్టి పాతాళలోకము నుండి రాజకుమారులు తెచ్చిన రత్నములు, మండనములు, బంగారము నంతయు నెత్తికొని యాకోట పాడుపదడుచేసి తిరుగాఁ బాతాళలోకమున కరిగిరి.

అని యెఱిఁగించునంతఁ బ్రయాణసమయ మగుటయు నయ్యతి పతి యవ్వలికథ పై మజిలీయం దిట్లు జెప్పందొడంగె.

___________

244 వ మజిలీ.

నారదుని స్వస్వరూపప్రాప్తి.

క. పెద్దతడ వొడలు తెలియక
   ముద్దియపడి కొంతవడికి మోహంబుడుగన్
   దద్దయు విలపించెను బలు
   సుద్దులఁ బుత్రుల దలంచి శోకము హెచ్చన్.