కాశీమజిలీకథలు/పదవ భాగము/242వ మజిలీ

డాసల్లాపములఁ జొక్కి తిగిరి బసలోనికిం బోలేక పోయితినని సౌమ్యుఁడు తనకథ నెఱింగించెను.

అని చెప్పువఱకు వేళయతిక్రమించినది. మణిసిద్ధుం డవ్వలి కథ పై మజిలీయందిట్లు చెప్ప మొదలు పెట్టెను.

___________

242 వ మజిలీ.

మయూరధ్వజునికథ.

పిమ్మట మయూరధ్వజుండు తనకథ నిట్లు చెప్పఁదొడంగెను. సోదరులారా ! మిమ్ము నేవిడిచి దక్షిణవీథింబడి పెద్దదూరము పోయితిని. ఆనగరము తుది చూచితీరవలయునని నాకు బుద్ధిపుట్టి వేగముగా నడువఁ దొడంగితిని. ఎంతసేపు నడిచినను దుది కనంబడదు. ఇంక చాలదూర మున్నట్లు చెప్పిరి. అంతలో సాయంకాలమైనది. దీపము లెల్లెడల వెలిగించిరి. అప్పుడు నాకొకవీథి కన్నులుపండువు గావించినది. నేనా వీథిని గొంతదూరము పోయితిని. ఒకవీథి యరగుపైఁ గూరుచుండి కొందఱు కథలుచెప్పుకొనుచుండిరి. నేనుగూడ నందొకచోఁ గూర్చుండి యాకథల వాలించితిని. కథకుఁ డిట్లు చెప్పదొడంగెను.

గోపాలుని కథ.

ఉజ్జయినీవురంబున మహాసేనుఁడను రాజు రాజ్యము సేయు చుండెను. అతనికిఁ బదాఱువేల భార్యలు గలిగియున్నను సంతానాభివృద్ధి లేకపోయినది. యెప్పటికో గోపాలకుఁడు, పాలకుఁడు అను పేరులుగల యిరువురు పుత్రులుదయించిరి. అతనిమంత్రి భరతరోహకుఁడనువాఁడు. నీతిశాస్త్ర పారంగతుఁడు. అయ్యమాత్యునికిఁగూడ రోహాంతకుఁడు, సురోహకుఁడు, అను పుత్రులిద్దఱు పెద్దకాలమునకు జనియించిరి. వారిరువురు రాజపుత్రులకు సమానప్రాయులగుట నలువురం గలిసి విద్యాభ్యాసము జేయించుచుండిరి.

కొలదికాలములో నలువురు సమస్తవిద్యలం జదివి మహాపండితులని ప్రఖ్యాతి వడసిరి. కొంతకాలమునకు మహాసేనుఁడు లోకాంతర గతుం డగుటయు మంత్రు లతని పెద్దకుమారుఁడు గోపాలునికిఁ బట్టము గట్టిరి. అతని తమ్ముఁడు పాలకుఁడు యువరాజయ్యెను. మంత్రి పుత్రు లిరువురు మంత్రులై సమస్త కార్యములు న్యాయముగా జరుపుచు రాజ్యతంత్రము లనుకూలముగా నెఱవేర్చుచుండిరి.

ఒకనాఁడు గోపాలుండు విజయదశమి పండుగకు పట్టపేనుఁగ నెక్కి తూర్య ఘోషములు భూనభోంతరాళములు నిండ మహావైభవముతో నూరేగుచుండెను. అప్పుడు పౌరులు మేడలెక్కియు గోడలెక్కియు నాయుత్సవమును రాజును జూడఁ దొడంగిరి. ఒకానొక బ్రాహ్మణ వీధిం బోవుచుండ నొక బ్రాహ్మణ కన్యక మదురుగోడ యెక్కి రాజపుత్రుం జూచుచుండ నతని యేనుఁగ తొండముతో నా కన్యకం బట్టుకొనఁబోయిన నాయబల యడలుచు నేలంబడినది. అప్పుడు గోపాలుఁడు వెఱచుచు మదకరి నాపీ యాపిల్లను మెల్లగా లేవదీయించి అయ్యో! పాపము! నీకు దెబ్బ తగిలినదికాఁబోలు. ఉపచారములు సేయింతు నూరడిల్లుమని పలికిన నాకలికి యతనిం జురచురం జూచుచు రాజవుత్రా! నీవు చంపఁదగని తండ్రినే చంపించి రాజ్యంబు గొంటివి. వేదాధ్యయనసంపన్ను లగు బ్రాహ్మణులం జంపువానికి మృగములం జంపుట లక్ష్యమా! నీయేనుఁగు నన్నిట్లు బాధించుటలో నాశ్చర్యము లేదని యాక్షేపించుచు నాకన్యక లోపలికిఁ బోయినది.

చండాలుండైన విన నసహ్యించుకొనఁదగిన యాకన్యకా వాక్యములువిని రాజపుత్రుఁడు చిన్నవోయి అయ్యో! నన్నీ చిన్నది యిట్లు నిందించినదేమి? నేను మాతండ్రి నెట్లుచంపితిని? లోకాపవాద మూరక రానేరదు. అని చింతించుచు నుత్సాహముడిగి యా యూరేగింపు మానిపించి యింటికిఁబోయి లోకాపవాదమునకు వెఱచుచు నాఁటి రాత్రి నల్లని కంబళి గప్పుకొని ఖడ్గముచేతఁబూని ప్రచ్ఛన్నముగా గ్రామసంచారము గావించెను. అందొక పాడుదేవాలయమున నభిసారికతోఁ గాముకుఁడు మాట్లాడుచున్న మాట లిట్లు వినంబడినవి.

కాము - ఓసీ! నీనిమిత్తమై యెంతసేపటినుండి వేచియుంటిని. నీమాటలు నమ్మి వృథాశ్రమపడితిని. వీలులేదని మొదటనే చెప్పితివేని రాకపోవుదునే?

అభి - మనోహరా! నేనందుల కే వెఱచుచుంటి. పాపము. నీవు ముందుగవచ్చి కూర్చింటివా? కాల మెట్లుజరిపితివో!

కాము --- పాప మనుచుంటివా చాలు చాలు. నిజముగా నాపైనీకుఁబ్రీతియున్నదని ముందుగవచ్చి కూర్చుంటి. నీవు రాకున్న నేమియుందోచక యాకసమును పిడికిటిచేఁబొడిచితిని. యూకవలిచితిని. అబ్బా! అప్పటి దుఃఖ మేమిచెప్పుదును? పిట్టలేచినను నాకు గదలిన నీవే వచ్చుచుంటి వనుకొంటిని. నీవు వట్టిదొంగవని యిప్పటికిఁ దెలిసికొంటిని. చాలు నీస్నేహము చాలు.

అభి – అయ్యయ్యో! నీవట్లనిన నాగుండె పగిలిపోవుచున్నది. నాచిక్కులు వినిన నీవిట్లనక పోవుదువుగదా.

కాము — ఆచిక్కు లెట్టివి? నీవు మహాపతివ్రతవలె యింటిలో నటియించితివి కాబోలు.

అభి — కాదు మనోహరా! నామాట వినుము. నాకుఁ బిల్లవాఁ డున్నాడనుమాట యెఱుంగుదువా? వానిని నిద్రపుచ్చవలయునా? నాభర్తకుఁ బెందలకడ నిద్రపట్టదు. ఏమిచేయుదును? ఆయాటంకములుండఁ బెందలకడ యెట్లురాఁగలనో చెప్పుము ?

కాము - అవును. నీమగఁడును గుమారుడును నాకన్న నిష్టులై యుండ నేనిం దధముఁడనై వట్టికుంకవలె నీకొఱకు వేచియుంటి. నాదే తప్పు.

అభి – అట్లనరాదు. భర్తలయందు ప్రీతిలేకయే విటులతో స్త్రీలు రమింతురు. భర్తలమూలమునఁ గులటలకునాటంకములు గలుగుచుండును. ఈగలేని తేనెవలె నిర్భయముగా విటులతో స్త్రీలకుఁ గలిసికొనుభాగ్యము పట్టుట కష్టము. నేనేమి చేయుదును?

కాము — నీయభిప్రాయ మేమియో నాకుఁదెలియలేదు.

అభి – నాకు భర్తయుఁ బిల్లవాఁడును నీక్రీడ కాటంకము గలుగఁజేయుచున్నారు. నీవు సంశయింపక వారిద్దరిం గడతేర్చితివేని హాయిగా మనము సుఖింపవచ్చును.

కాము - చాలుఁజాలు, ఇదియా నీవు చెప్పిన యుపాయము అది మహాపాతకముకాదా! నేనొల్లను.

అభి – నీవుపాపమునకు వెఱచి యట్టిపని చేయవేని నేను నాయిష్టము వచ్చిన ట్లనుభవించుటకు వీలుండదు.

కాము – ఆపాపకృత్యము నాకంగీకారముకాదు.

అభి - చాలుచాలు. దుర్వారరాగాంధులకుఁ జేయరాని పనులుండవు. బ్రహ్మయంతటివాడు కూఁతుతోఁ గలిసికొనియె. దీనింబట్టి చూడ నీకు నాయందు గాఢానురాగము లేనట్లు తోచుచున్నది.

కాము - అనురాగము కలిగియున్నదని ఘోరకృత్యము లెట్లు చేయుదును?

అభి — అయ్యనురాగమే చేయించును. సుఖార్ధుఁడవైతివేనితప్పక నప్పని సేయుము. మన రాజవుత్రుఁడు సుఖార్థియైకాదే తండ్రినిం జంపించెను. ఆవార్త నీవు వినలేదా? మహారాజులే ఘోరహత్యలు గావించుచుండ సామాన్యుండవు నీవిట్లు సంశయింతువేమిటికి? రేపు సాయంకాలము మాయింటికి రమ్ము. వారు నిద్రించుచుండఁ గత్తిచే నఱుకుము. తరువాతి బొంకులు నేను బొంకఁగలను. అనిపలుకుచు నాకులట విటునితోఁ గలిసికొనినది.

ఆమాటలన్నియుఁబ్రచ్ఛన్నముగానుండిగోపాలుఁడాకర్ణించెను. అయ్యో! కాముకురాలుగూడ నన్నాక్షేపించినది. నే నేకర్మము నెఱుంగను. లోకాపవాద మిట్లు వ్యాపించుటకుఁ గారణమేమియో యని యాలోచించుచు నతం డటకదలి మరియొక వీధికింబోయియొక గృహముకడఁ బొంచి యాలించెను.

ఒక బాహ్మణుఁడు భార్యతో నోసీ! పిల్లవాఁడు లేచి ఏడ్చుచున్నాఁడు. లేచి పాలిమ్ము నిద్ర యేమిటికిఁ బోయెదవని లేసిన నా యిల్లాలు కోపముతోఁ బిల్లవానిం గొట్టుచు పితృఘాతకుఁడా! ఏల ఏడ్చెదవు. నే నీకుఁ బాలీయఁజూలను. నిద్రవచ్చుచున్నది. పండుకొనుమని మందలించినది. ఆమాటలు విని యా బ్రాహ్మణుండు మూర్ఖురాలా! పిల్లవానిని బితృఘాతకుఁడా ! యని పిలిచెద వేమిటికి? వాఁ డింకను బాలు వదలలేదు. పితృఘాతకుఁ డెట్టులయ్యెను. ఈలాటి తుచ్ఛపు పలుకలు నీనోటనుండి రావచ్చునా? అని యడిగిన నామె లేచి మీకు దెలియలేదా ? కొడుకు లెప్పుడు పెద్దవారైనతోడనే తండ్రిచావును కోరుచుందురు. మన గోపాలుఁ డేమిచేసెనో చూచితిరా? ఆత్మసుఖమునకై తండ్రిఁజంపించి యారాజ్యము తానేలుచుండెను. వీఁడుమాత్ర మెదిగిన తరువాఁత మనల నెక్కువ నిర్వాహకముచేయునా? అని యుత్తరము చెప్పినది.

ఆమాట లాగోపాలుని చెవింబడినవి. అయ్యయ్యో! ఎక్కడికిఁ బోయినను నాకీమాటలే వినంబడు చున్నవి. నాతండ్రిని నేనెట్లు చంపితినో యెఱుంగను. గ్రామమంతయు నాయపయశము వ్యాపించినది. అని దుఃఖించుచు మఱియొక వీథికిఁ బోయి యాలింప నొకచోఁ దండ్రియుఁ గొడుకును గ్రుద్దులాడుచుఁ గొడుకు తండ్రితో నీవు బ్రతికి యుండ నీయాస్తి నాకీయవు. ధనహీనుండనై నేనెన్నినాళ్లు కష్టముల పాలగుచుందును? మనరాజు గోపాలుండు బలవంతమున దండ్రి జంపించి రాజ్యము గైకొన్నట్లు నిన్నుఁ జంపి నీధనము లాగికొందును చూడుమని యదలించెను.

ఆమాటలాలించి యాగోపాలుండు దుఃఖముతో నింటికిఁబోయి యారాత్రి నిద్రఁబోక యెట్టకే తెల్లవార్చి మంత్రికుమారులిద్దర రప్పించి రాత్రిజరిగిన చర్యలన్నియు నెఱింగించి యిట్టి యపఖ్యాతి నా కెట్లువచ్చినదని యడిగిన వారిట్లనిరి.

నీతండ్రి వార్ధక్యంబున జనకంటకములైనపనులనేకములుగావించెను. వినుము. ఒకనాఁడు క్షౌరము చేయించుకొనుచుండ మంగలవాఁడు దెల్లవెండ్రుకల లాగుచుఁ బ్రమాదవశంబున నల్లవెండ్రుక యొకటి తీసెనఁట. దానం గోపించి వానిం జంపించెను.

మఱియు వంటబ్రాహ్మణుఁ డొకప్పుడు కూర వండి వడ్డించగా దాని నమలునప్పుడు చిన్న రాయి తగిలి పన్నూడినదఁట. దానంజేసి వానిని వెంటనే పరిమార్పించెను.

మఱియొకప్పుడు బ్రాహ్మణులు ద్రవ్యార్థులై వచ్చి యాశీర్వదింప నారొదవలనఁ దలనొప్పివచ్చినదని వారినందఱం బట్టించి బందీ గృహంబునఁ బెట్టించెను. పార్శ్వంబున నిలిచి వింజామర గట్టిగావీచినదని చామరగ్రాహిణిం గొట్టించెను. వందిమాగధులు వేకువజామున నిద్రాభంగము గావించిరని కొరడాలచే బాదించెను. ఈలాటి ఘోరకృత్యము లనేకములు గావింపుచుండ వారించియు నప్పనులు మాన్పింపంజాలక దుఃఖించుచు నావిచారముతోఁ బెద్దమంత్రి కాలధర్మము నొందెను.

తరువాత మేము మంత్రిపదవి నధిష్టించితిమి. రాజుచేయు పనులవలనఁ బ్రజల కీర్ష జనించినది. అతని మరణము కోరుచుండిరి. అప్పుడు మేమాలోచించి మీతండ్రిని బలవంతమున గట్టించి బందీ గృహంబునఁ బడవేసితిమి. దైవికముగా నతఁ డాచెరసాలలో మృతుఁడయ్యెను. దానంజేసి మీకీకౌలీనము సంప్రాప్తించినది. ఇందులకు మేమే కారకులమని చేసినపనియంతయుం జెప్పిరి.

ఆవార్తవిని రాజపుత్రుఁ డదోముఖుండై క్షణకాల మూరకొని చేతులచే నేలంగొట్టుచుఁ గన్నుల నీరుగార నాకాశమువంకఁ జూచుచు నిట్లనియె.

మీరు శుక్రబృహస్పతులతో సమానులగుదురు. మీరు నా హితముగోరి మంచికార్యమేచేసితిరి. కాని యిట్టిపనులు శంకాశూన్య బుద్ధులగు సత్వవంతుల క్రమముగాని దృష్టాదృష్టభయగ్రస్తచేతస్కులగు మావంటివారికిఁ జెల్లనేరదు. నేనీభూమిని బాలింప సమర్ధుడఁ గాను. నేనీ యపఖ్యాతి భరింజాల. మాతమ్ముని రాజుగాఁజేసి మీరీరాజ్యము పాలించుఁడు. నేను తపోవనంబున కరిగెదనని పలికిన విని వారు సిగ్గుపడుచుఁ దలవాల్చుకొని యేమియుఁ బ్రత్యుత్తరము చెప్పలేకపోయిరి.

ఈసంవాదమంతయు రాత్రిజరిగినది. అంతలోఁ గోళ్ళు కూసినవి. అప్పుడు వందిమాగధులు జయము మహారాజా జయము. దిగంతవ్యాప్తయశఃసముదయా జయము. సకలభూపకిరీటమణి నీరాజితచరణా జయము. అని స్తుతియింపుచుండ సిగ్గుతోఁ జెవులు మూసికొని చాలుచాలు నాకీర్తి దిగంతముల వ్యాపించినది. వందిమాగధులనూరకొనుమనిచెప్పుమని ప్రతిహారిచే వార్తనంపెను.

అయ్యో ! చిరకాలము జీవించెడు తండ్రిని నావలె నెవ్వఁడు చంపించును. నేను మహాపాపాత్ముఁడ నాకీపాప మెట్లుబోవును? అని దుఃఖించుచు నప్పుడే జటావల్కముల ధరించి తపోవనంబునకుఁ బోవుట కుద్యోగించి సభామంటపమునకుఁ బాలకుని రప్పింపుఁడని, యాజ్ఞాపించి తానాస్థానమునకుఁ బోయెను. ఆవార్తవిని బ్రాహ్మణు లనేకులు వచ్చి రాజ్యము నీవే పాలింపవలయు ధర్మాత్ముండవని యెంతయో బోధించిరి కాని యతని తలకెక్కినదికాదు. తమ్ముఁడు సభకువచ్చి కృత్రిమబుద్ధితోఁ దనకు రాజ్యమక్కరలేదని కొంతసేపు ప్రతికూలము సెప్పెను. కాని బలవంతమునఁ గోపాలుండు తమ్మునికి రాజ్యమిచ్చుచుఁ దనకుమారుని వాని కప్పగించి మంత్రులకుఁ జెప్పి విరక్తుండై తపోవనంబున కరిగెను.

పాలకుండు ప్రజాపాలకుండై రాజ్యంబుసేయుచుండ నతనికొక దుస్వప్నము వచ్చినది. మంత్రులతో నాకలతెఱఁగెఱిగింప వారిట్లనిరి.

పూర్వము మీతండ్రి కిట్లె దుస్వప్నము వచ్చినంత బ్రాహ్మణుల కెఱింగింపగా వారు హోమములు సేయింపుఁడని చెప్పిరఁట. దానఁ గోపించి వారిఁ బట్టికొని కొట్టించెను. వారుచెప్పిన మితి కే కోటమీఁద పిడుగుపడి కోట నాశనమైనది. కావున బ్రాహ్మణులచే జపములుచేయించవలెను. లేక కొన్నిదినములు దేశాంతర మరుగవలయును. సింహాసనముమీఁద మృగముచెక్కించి పాలింపవలయునని యుపాయము చెప్పిరి.

అట్లు వారు మాట్లాడికొనుచుండఁగా నన్నకుమారుఁడు నరవాహనదత్తుఁడనువాఁడు బంతియాడుచుండ నాబంతి దొర్లి సింహాసనముదరికి వచ్చినది. దానిఁ దెచ్చుకొనుటకై యబాలుం డట కరిగెను. వాని యాకారగౌరవము జూచి సంతసించుచుఁ బాలకుండు వానికి రాజ్యమిచ్చి తాను తపోవనంబునకుఁ బోయెను.

తరువాత నరవాహదత్తుడు భూపాలుండైప్రజలం బాలించు చుండెను. ఒక నాఁడతనికడ కొకయాఁడుది వికృతాంగి చూడ నసహ్యము జనించినది రత్నములవంటిబిడ్డలఁ నాఱ్వుర వెంటబెట్టుకొని వచ్చి ఆశీర్వదించినది. ఆవికృతాంగిం జూచి యారాజకుమారుఁడు అస హ్యించుకొనుచుఁ గుమారులఁ జూచి యాశ్చర్యమందుచు నీనెవ్వతెవు ? ఈకుమారులెవ్వరు. నీవృత్తాంతముజెప్పుమని యడిగిన నావికృతాంగి యిట్లనియె.

ఈబిడ్డలు నేను గన్నవారే. నాపతి దేశాంతరమరిగిరని చెప్పిన వింతపడుచు నతఁ డౌరా నీకుఁ బతియున్న వాఁడా నిన్నెట్లు పెండ్లి యాడెను. ఇది వింతగానున్నది నీకథచెప్పుమని యడిగిన నామె యిట్లనియె. అయ్యా వినుండు.

పింగళికకథ.

అవంతిదేశములోఁ గపిష్ఠిలమను నగ్రహారముగలదు. అందు సోమదత్తుడను బాహ్మణుఁడు వేదవేదాంగపారంగతుఁడు కాపురము సేయుచుండెను. అతనికి వేన వేలు శిష్యులుగలరు. ఆవిప్రునిభార్య యరుంథతికన్నను మిన్నయని చెప్పనోపు. అపుత్రుకుఁడగు నాపాఱునకుఁ గొంతకాలము గతించినంత నుత్కలవలె నొకకూఁతురు పుట్టినది. స్త్రీలక్షణవేత్తలు దానింజూచి దీనికిఁ బతియు బుత్రులుండరు;. దేశాటనముచేయునని యెఱింగించిరి. ఆబాలిక ధూమకేతువువలె వారింట నెదుగుచుండెను. అన్నియు దుర్గుణములే. సుగుణమొక్కటియునులేదు. ఆచారహీనురాలై మాలపల్లెలోనికిఁగూడఁ బోయి వచ్చు చుండును. దాని యాకారము గుణములు జూచి యెవ్వరు బెండ్లి యాడలేదు. ఆచింత సోమదత్తుని స్వాంతమున మిక్కిలి వేధించు చుండెను. కనంబడిన పిల్లలను జావఁగొట్టుచుండును. పెద్దలపై రాళ్లు విసరుచుండును.

ఒకనాఁడొక వటుఁడు వీధింబడి పోవుచుండఁ బెద్దరాయి తీసికొని వానిం గొట్టినది. మొగము గంటుపడి బొటబొట రక్తముగారుచుండఁ సోమదత్తునొద్దకుఁబోయి యావ్రణము చూపినీకూఁతు రిట్లు కొట్టినదని రాయిఁ చూపెను. అప్పుడాసోమదత్తుఁడు మిక్కిలి కోపిం చుచుఁ శిష్యులఁ గొందఱఁజూచి దాని మహారణ్యమున విడిచిరమ్మని యాజ్ఞాపించుటయు వారట్లు కావించిరి.

ఆచిన్నది చావవలయునని తలఁచి యాయరణ్యములోఁ బడి పోవుచుండ నొకచో నొకవిష్ణ్వాలయము తటాకము గనంబడినవి. అందు స్నానముచేసి దేవునిబూజించి చచ్చినచో వైకుంఠము రాఁగలదు; లేకున్న నరకమునకుఁ బోవుదుననితలంచి స్నానముజేసి యందలి పూవులచే నాదేవు నర్చించినది. నాఁడేకాక నిత్యము నెలదినములట్లు పద్మములచే నాదేవు నర్చించుచు ధ్యానించుచుండ భక్తవత్సలుండగు నాదేవుం డొకనాఁడు స్వప్నములోఁ గనంబడి పుత్రీ! నీకిష్టమైనవరము గోరికొనుమని యడిగిన నాపడఁతి మరణము దయచేయుమని కోరినది. స్వామి నవ్వుచు నీవు పతిపుత్రధనాదులఁ గోరక యాత్మహత్య గోరితి వేల? అది సమంజసముగాదు. ఆలోచించి కోరుమని పలికిన నామె స్వామీ! నేను పూర్వజన్మమునఁ బుణ్యమేమియుఁ జేసియుండలేదు. పతిపుత్ర ధనాదులు నాకెట్లు లభ్యమగుదురు? ఇట్టికురూపినిఁ బెండ్లియాడువాడెవ్వఁడు? ఇతరసుఖములతో నాకుఁ బనలేదు. మరణమే శ్రేయము. దయచేయుమని కోరిన శ్రీవిష్ణుఁ డిట్లనియె.

పుత్రీ! నీవన్నమాట వాస్తవమే. కాని జన్మాంతరమున దండ్రిగారియింటఁ గుంచెడుధాన్య మొక బ్రాహ్మణునికి దానమిచ్చితివి. ఆబ్రాహ్మణుఁ డిప్పుడు బాహ్మణునింటఁ బుట్టి నాలుగువేదములు చదివినాఁడు చతుర్వేదియని బిరుదము వడసెను. ఆబాహ్మణుఁడే నీకు భర్త కాఁగలఁడు. అతనికొక్కనికిమాత్రము నీవు మిక్కిలిచక్కని దానవుగాఁ గనంబడుదువు. నీవతనిఁ బెండ్లియాడుము చక్కనిసంతానము గలుగఁగలదు. నీవాభర్తతో యవాఢకమువలన నీవు క్రీతుఁడ వైతివని యెన్నఁడు చెప్పఁగూడదు. చెప్పితివేని ముప్పురాఁగలదు. మఱియు నీవొకప్పుడు జన్మాంతరమున నువ్వులు దినుచుండఁగా వ్రేళ్ల సందునుండి యెనిమిదిగింజలు జారి యగ్నియందుఁ బడినవి. దానంజేసి నీకెనమండ్రువుత్రులు పుట్టుదురు. మరణము మానుమనిచెప్పి స్వామి యంతర్హితుఁడగుటయు సంతసించుచు నావిప్రకన్య తటాకములో స్నానముజేసి స్వామి నర్చించుచుండ నింతలో నామెతండ్రి శిష్యులతోఁగూడ వెదకికొనుచు నాస్థలమున కరుదెంచెను.

చెట్టుచెట్టునందువెదకి యొకచోనాకన్నెంగని కన్నీరుగార్చుచు బలవంతమున నింటికిఁ దీసికొనిపోయి కాపాడుచుండెను. ఒకనాఁడా చతుర్వేది శిష్యులతోఁగూడ సోమదత్తుని యింటికివచ్చి తండ్రిచేఁ బూజింపఁబడి కన్నెంజూచి యాశ్చర్యమందుచు నీదివ్యాంగన యెవ్వతె? దేవలోకము విడిచి భూలోకమున కెట్లువచ్చినది! అని యడుగ నాపాఱుఁడు వానిమాటలు పరిహాసజల్పితములనుకొని హీనన్వరముతో నిది నాకూఁతురు. దీని కింకను బెండ్లిచేయలేదని చెప్పెను.

దీని నాకిచ్చి వివాహము గావింపుము బెండ్లియాడెదనని యడిగిన సంతసించుచు నాసోమదత్తుఁ డప్పుడే వాని కాచిన్నదానినిచ్చి పెండ్లి కావించెను. ఆమెయం దతఁ డత్యంతానురాగంబున మెలంగుచు నామెచెప్పినట్లు వినుచు నామెయిష్టమువచ్చినట్లు కాపురముసేయు చుండెను. ఆపింగళికనే నేను. నాకతనివలన నెనమండ్రుకుమారు లుదయించిరి. వీరే వారు, శ్రీహరికృపచేఁ గలిగినారని యెఱింగించి మఱియు నిట్లనియె.

అట్లు కొంకతకాలమరుగ నొకనాఁడు నాభర్త నన్నుఁజూచి చండీ! నాకుఁ గాళ్ళు నొప్పిపెట్టుచున్నవి. పిసికెదవా? అని యడిగెను. ఎప్పుడు నన్నట్లడుగలేదు. నే నిట్లంటి. నీవు నాకేమైన నిచ్చి నన్నుఁ గొంటివాయేమి? ఊరక నీకుఁ బాదసంవాహన మేమిటికిఁ గావింపవలయును? అని యుత్తరమిచ్చుటయు నామగఁడు నీవుమాత్రము నన్నుఁ గొంటివా యేమి! సంతతము నీకుపచారములు సేయుచుండ లేదా అని చెప్పిన నేను పూర్వకర్మప్రారబ్ధమున శ్రీహరిచెప్పినమాట మఱచి తటాలున నవును. నిన్ను ఆఢకపరిమితయవలిచ్చికొంటిని. అని పలికితిని.

అంతలో నాతఁడు నాయకార మెగదిగా జూచి ఛీ ఛీ నీవెవ్వతెవు? పింగళిక యేమైనది? నీ వెక్కడినుండివచ్చితివి? పో పొమ్ము నాయెదుర నిలువవలదు. నిన్నుజూడ వాంతి వచ్చుచున్నది. అని యసహ్యించుకొని నాఆఢక ధాన్య మేమనియడిగిన యదార్థమంతయుఁ జెప్పితిని. నాకథ విని నామగఁడు నన్నుజూడ నేవగించుకొని యందు నిలువక యెందో లేచిపోయెను. తండ్రి స్వర్గస్థుఁడయ్యెను. పతిపితృ విహీననై యీపిల్లల వెంటఁ బెట్టుకొని తిరుగుచుంటిని. నాపూర్వకర్మ మిట్లున్నదని తనకథయంతయుఁ బింగళిక యెఱింగించినది.

నరవాహనదత్తుఁ డాకథవిని యక్కజమందుచు నామెను బిడ్డలను బోషించుటకుఁ దగినయుపాధు లిప్పించి యంపించెను. అని యంతదనుక నాకథజెప్పి యక్కథకుండు అబ్బా! యిప్పుడు ప్రొద్దుపోయినది. తరువాతికథ చాలయున్నది. చెప్పఁజాలను. అని పలుకుచు నందుండి లేచిపోయెను.

జగన్మోహినికథ.

నేనాకధ విని స్త్రీల సాహసచర్యల కాశ్చర్యమందుచు గోపాలుని పితృభ క్తికి సంతసించుచుఁ జిత్రసేనుని మూర్ఖత గ్రహించుచు నటఁ గదలి మిక్కిలి పెద్దగానున్న యావీధింబడి మఱికొంత దూరము పోయితిని. అందొక్కచో భూమిలోఁ గార్చిచ్చు రవులుకొని ప్రజ్వల జ్వాలాభీషణంబై మహరణ్యంబును దహించునట్టిచప్పుడు గొప్పగా వినంబడఁజొచ్చినది. ఆధ్వని విని నేనది యేమియోయని విమర్శింవు చుంటి నింతలో నావీధిగృహములందున్న వారెల్ల హల్లకల్లోలముగా రొదజేయుచు అన్నా ! తమ్ముడా! అమ్మా! తండ్రి! బాబూ!అమ్మా యీ! పట్టీ! రండు రండు వేగరండు అని హాహాకారరవంబులతో నొండొరులం జీరికొనుచు గాలుచున్న యిండ్లనుండివలెనే యీవలకు వచ్చి వీధింబడి యెక్కడికో పారిపోవుచుండిరి. అమ్మా! యని యేడ్చుచు వెనుకవచ్చు పిల్లలనైనఁ జూడకఁ నాధా, నిలు, నిలుమని పిలుచు భార్యనై నం బరిశీలింపక పట్టీ! మమ్ముఁ దీసికొని పోవా? అని కేకలుపెట్టు తలిదండ్రులవంకం జూడక యాడు వాండ్రు మగవాండ్రొండొరులం బల్కరించుకొనక శక్తికొలఁది పరుగిడుచున్న యాపౌరులంజూచి నేనందలి కారణంబు దెలియక అయ్యా! ఇప్పుడువచ్చిన యుపద్రవమేమి? అందఱు నిట్లు పారిపోవుచున్నా రెక్కడికి? చెప్పుఁడని యడిగిన నెవ్వరు నుత్తరము చెప్పినవారు లేరు.

నేనుగూడ వారితోఁ బోవుచుఁ గనంబడినవారినెల్ల గారణం బడుగుచుండ నొక్కఁ డయ్యో! నీవు గ్రొత్తవాఁడవు కాఁబోలు. భూమి పగులుచున్నది. ఇందు నిలువరాదు అని మాత్రము చెప్పి పరుగెత్తికొని పోవుచుండెను.

అతని మాట నాకేమియుఁ దెలిసినదికాదు. భూమి యెక్కడపగిలినది? పగిలిననేమి? యని ప్రవాహమువలెఁ బోవుచున్న పౌరుల నడుగుచు నేనొకచో నిలువంబడితిని. నిలిచితి వేల పదము. భూమి ! యెక్కడనో పగులును. ధ్వని వినంబడుచున్నది. అవ్వలివీధికినిబోయినఁ బ్రమాదము దప్పునని యొకఁడు చెప్పి యవ్వలఁబోయెను.

ఆయుపద్రవ మేమియో నాకుం దెలియక యందే నిలువంబడి యాప్రజలం జూచుచుంటిని. అప్పుడొక మేడలోనుండి యొక మెఱుఁగుంబోడి తలిదండ్రులతో నీవలకు వచ్చి తలిదండ్రులవెంటఁ బరుగెత్తుకొనిపోవుచుఁ గాలికి ఱాయితగిలి నేలంబడి మూర్ఛిల్లినది. ఆపాటుజూచి నేను తటాలున దాపునకుఁ బోయి ముట్టుకొనుటకుఁ సంశయించుచు నుపచారములు సేయుచుంటిని. అంతలో నామె తలితండ్రులు పుత్రికం గానక వెనుకకు వచ్చి యందుపడియున్న యా సుకుమారగాత్రిం గాంచి అయ్యో ! నిన్నా రక్కసుండు మ్రింగఁగలఁడు. పడియుంటివేమని యేడ్చుచు నడిగిరి.

అప్పుడు నేను వారి నూరడించుచు రాక్షసుఁ డెవ్వఁడు ? ఎక్కడనున్నాఁడు ? మీరందఱు నిట్లు పరుగెత్తుకొని పోవుచున్నారు. ఎక్కడికని యడిగిన వా రిట్లనిరి. అయ్యా ! నీవెవ్వఁడవో క్రొత్తవాఁడవు. రాఁబోవు ననర్థము తెలిసికొనక యిందు నిలువఁబడి నాబిడ్డ కుపచారము సేయుచుంటివి కాని ఇఁక పదినిమిషము లిందుంటిమేని యారాక్షసుఁడు వచ్చి మనల భక్షింపఁ గలఁడు, అప్పుడే భూమి పగిలినది. పొగ పైకి వచ్చుచున్నది. మే మీబిడ్డను విడిచి పోఁజాలము. మేమెట్లైన శమనలో కాతిధులము కావలసివారమే పడుచువాఁడవు. నీవిందు నిలువఁబడితివేల? కాలికొలది పరుగెత్తి కొని యవ్వలివీధికిఁ బొమ్మని యుపాయము జెప్పిరి.

నే నారక్కసుని వృత్తాంతమంతయు వివరముగాఁ జెప్పుమని యడిగితిని. చావునకుఁ దెగించి పుత్రికను విడువలేక యందు నిలువంబడి యున్న వారగుట వారు నాతో నార్యా! యీనగరములో నేఁడాది కొకసారి యిట్లే చప్పుడై భూమి పగిలి యొక చో వివరమేర్పడును. ఆవివరమునుండి భయంకరాకారముగల రక్కసుఁ డొక్కఁడు బైటకు వచ్చి యావీథినున్న మనుష్యుల నెల్ల నాబాలవృద్ధముగా భక్షించి పోవును. ఆవీథి సర్వశూన్యమై యరణ్యప్రాయ మగును. నాలుగేండ్లనుండి యిట్లు వచ్చుచున్నాఁడు. ఈవీట నాలుగు వీధులు పాడై పోయినవి. ఈసంవత్సర మీవీధికివచ్చుచున్నాఁడు, ముందుగా గొప్పచప్పుడు వినంబడును. తరువాత భూమిపగిలి వివరమేర్పడును. దానినుండి పొగవచ్చును. ఆవెంటనే రాక్షసుండు వచ్చి కనంబడిన మనుష్యులను దోమలవలె నోఁటిలోవైచికొని నమలును. పొగవచ్చు చున్నది. వాఁడు వచ్చువేళ యైనది. మేము మువ్వురము చచ్చిన వారమే యగుదుము. నీవుగూడ మాతో నిలిచితివేల? అవ్వలఁ బారి పొమ్మని పలికిన విని నేను నవ్వుచు నిదియా కారణము ? చాలు జాలు. ఈయూర వానిం బరిభవించు శూరుం డొక్కరుండును లేడా? మీరు వెఱవకుఁడు. మీప్రాణముల నేను గాపాడెద నిలువుఁడని పలుకుచు నాచిన్న దానిని సందిటఁ బట్టి భుజముపై కెక్కించుకొని వారిం గూడ రమ్మని యొక్క యరగుపై బండుకొనఁ బెట్టితిని.

అంతలో నాకాంతకు మెలకువ వచ్చినది. తలిదండ్రు లామెపైఁబడు దుఃఖించుచుండిరి. అయ్యో! నాకతంబున మీరిందేల నిలువంబడితిరి? పారిపోవలేక పోయితిరా ? నేనెట్లైననుం జచ్చినదాననే. మీరున్న వంశము నిలుచునుగదా ? అని కన్నీరు గార్చుచు గూఁతు రేడ్చినది. అమ్మా ! నిన్ను వరప్రసాదమునఁ జిరకాలమునకుఁ గంటిమి. నీకుఁ బెండ్లిచేయవలయునని యెంతయో వేడుకతోఁ దలంచుకొనుచుంటిమి. నీవలనఁ కుల ముద్ధరించుకొనఁ దలంచితిమి. ఇట్టి నీవే మిత్తివాఁతంబడు చుండ మేము బ్రతికి యేమిచేయుదుము. ఈపాడురక్కసుఁ డీయేడు మన వీధికే రావలయునా ?

మనకర్మ మిట్లున్నది. మన యైశ్వర్యమంతయు నేలపాలైనది. మనమేకాక పాప మీ పుణ్యాత్ముఁ డెవ్వఁడో నీ కుపచారములు సేయుచు మనతోపాటు చావఁ దెగించియున్నాఁడు. అని పలుకుచు నుండఁగనే యావీధిం బోవువారు శ్రుతిభీషణముగా నార్చుచు నారక్కసుం డెదురుపడినంతనే వెనుకకు మరలి మఱియొక దెసకుఁ పాఱిపోవఁ దొడఁగిరి,

ఆరక్కసుని యార్పులు విని నేను నడుము బిగించి చేతం గరవాలంబుబూని నడివీధిలో నిలువంబడితిని నాసాహసముజూచి యాకు టుంబమువారు బాబూ ! వాఁడు సామన్యుఁడు కాడు. మనుష్యులు వాని నెదిరింపఁజాలరు. ఏచాటుననో దాగికొందము రమ్ము. అని చీరుచుండ నవ్వుచు మీరు నిర్భయముగా నాయరుగుపయిం గూరుచుండుడు. గడియలో నాయసురుని మడియజేసెదనని పలుకుచుండఁ ప్రచండదోర్దండంబుల సాచి పారిపోవు మనుష్యులం బట్టికొని పొట్టలంద్రొక్కి విరిచి దంష్ట్రాకరాళంబగు నోటం బడవైచుచు నారా త్రించరుండు మేమున్న తావున కరుదెంచెను.

వానింజూచి యరుగుమీఁద నున్న వారు అమ్మయ్యో! చచ్చితిమి. చచ్చితిమి. వాఁడిందే వచ్చియున్నాఁడని పెద్ద యెలుంగున నేడువందొడంగిరి. వాఁడు ఎదురునున్న నన్నుఁజూడక యేడుచుచున్న యాకుటుంబము మీఁదికిఁబోవ నుంకించుటయు నే నప్పు డడ్డంబై మండలాగ్రంబు గిరగిర ద్రిప్పుచు క్రూరాత్మా! నేనిందుండ వారిపయిం బడెదవేల? రమ్ము. రమ్ము. ఇదియే మదీయ కృపాణహారము కాచికొనుము. నీయాయువు మూడియే యిందువచ్చితివని పలికినంత గుహాసదృశంబగు వదనంబు దెరచికొని యగ్నిజ్వాలవలె నాలుక వ్రేలాడుచుండ నారక్కసుం డుక్కుమీర నాపై లంఘించెను.

అప్పటి నాసాహసము తలంచికొనిన నా కే యాశ్చర్యము గలిగించినది. అట్టిబలము నా కెట్లు వచ్చినదో తెలియదు. వాఁడు నన్ను జేఁతులతో బట్టుకొనబోవునంతలో మండలాగ్రంబెత్తి ప్రచండవేగంబున వేసితిని. ఆవ్రేటుతో వాని నాలుక సగమును కరతలంబులుం దెగి నేలంబడినవి.

అప్పుడు వాఁడు వెల్లువగ రక్తముగారుచుండ వికృతస్వరంబున నార్చుచు మొండిచేతులతో నేదియుఁ బట్టికొనంజాలక గింజుకొనుచు జిందులుద్రొక్క నొక్కవ్రేటున వాటముగా వానిరెండు పాదంబులుం దెగనఱికితిని. వాఁడు కొండవలె నేలంగూలి భీషణఘోషముతో దొర్లుచుండ దండకుఁబోయి రెండుచేతుల మండలాగ్రం బెత్తి గొడ్డలి చేతంబోలె నాభీలగతి వాని కంఠంబు ఖండించి మొండెమును గావించితిని.

ఆదంపతులును బుత్రికయు నాపోరాటము వానిపాటుంజూచి యాశ్చర్య సంతోషములతో నాకడకువచ్చి పాదంబులంబడి మహాత్మా నీవు దేవుఁడవు కాని మనుష్యుండవుకావు. సామాన్యమానవుం డింత చులకనగా నీదానవుం బరిమార్పఁగలడా ? నీకతంబునమేము మువ్వు రము బ్రతికితిమి. నీవడ్డుపడుకున్న నీపాటికి జము వీటికిం జేరవలసిన వారమే. మేమేకాదు. ఈనగరవాసులకెల్ల మహోపకార మొనరించినవాడ వైతివి. ప్రతిసంవత్సరము వీఁడేవీధికో వచ్చి యందలి ప్రజలం జంపి శూన్యము చేయుచుండువాఁడు. బకుని జంపి యేకచక్రపురవాసులం గాపాడిన భీమునివలె నీ వీ పట్టణ ప్రజల రక్షించితివి ఈనగర మాఁడుది పాలించుచున్నది. ఇందులకుఁ బ్రతీకార మామె యేమియు నాలోచింపలేకపోయినది. అని వారు నన్ను బొగడు చుండఁగనే యందు మిగిలినయున్న వారెల్ల నావార్త విని మూఁగికొని పూవులచే నన్నుఁ బూజింపఁ దొడంగిరి.

ఆయజమానుని పేరు ధనకోటియఁట. పదికోట్ల దీనారముల కధికారియఁట. అతని కూఁతురు పేరు జగన్మోహిని. పేరునకు మించిన సౌందర్యము కలిగియున్నది. అట్టి భాగ్యవంతుఁ డెక్కడనున్న వస్తువు లక్కడ విడిచి ప్రాణములు దక్కించుకొనుటకై భార్యాపుత్రికలతో నిల్లువెడలి పోవుచుండ నొక్క పరిజనుండైన వెంటరాడయ్యె. ప్రాణములకన్న దీపైనవస్తువు లేదుగదా. ధనకోటి తనవృత్తాంతము నాకెఱింగించి నన్ను సగౌరవముగాఁ దనయింటికి రమ్మని ప్రార్థించి తీసికొనిపోయెను.

మాయల్లుం డారక్కసుం బరిమార్చెను పౌరులు నిర్భయముగా వచ్చి గృహములలోఁ బ్రవేశింపుండని ధసకోటి యావీధిని జాటింపఁ జేసెను. ఆరక్కసుండు గావించిన హత్యలును పౌరులకుఁ గలిగిన యపాయములునెఱింగించుచు నన్నుస్తుతియించుచు నా రాత్రి శేషంబు వెళ్ళించిరి. ఆమఱునాఁడు పౌరులెల్ల నాబాలవృద్ధముగా దేవునిఁజూడ వచ్చినట్లు పలహారములతో వచ్చి చూచి నన్నర్చించి పోవుచుండిరి. ఆమోహిని నన్నుఁ బతిగాఁ బడయఁగోరి తన యభిలాష తలిదండ్రుల కెఱింగించినది.

ధనకోటి నన్నుం బ్రార్థించి మఱునాఁడే తనకూఁతు నాకిచ్చి మహావైభవముతో, వివాహము గావించెను. మాసోదరులీ యూర నున్నారు. వారిని రప్పింపవలయునని చెప్పుటకు నాకు బుద్ధిపుట్టినది కాదు. ఆవీధివారెల్ల నాపెండ్లికి బంధువులవలె వచ్చి పరిజనులవలె నుపచారములుసేసి బట్టులవలెఁ బొగడుచు దేవునివలెఁ బూజించిరి.

అమహోత్సవములతో నెనిమిదిదినములు గడియవలె వెళ్లించితిని. ఈనగరి యవ్వలివీధిలో నెవ్వరో పెండ్లివారు పోట్లాడుచున్నారని వింతగాఁ జెప్పికొనఁగా నలువురతో నేనా వీధికి బోయితిని. అందు మన సోదరుఁడు గుఱ్ఱమ పై నిలువంబడి మీతోఁ గయ్యము సేయఁ గాలుద్రువ్వుచుండెను. అతండు నన్ను గురుతుపట్టి తనతోఁ గలుపుకొనియెను. తరువాతి కథ మీఱెఱింగినదియే. ఇదియే నా వృత్తాంతమని యెఱింగించిన విని పుష్ప కేతుఁ డిట్లనియె.

ఔరా ! మనచరిత్రములు విచిత్రములుగా నున్నవి. ఒక నగరంబున వసించియుఁ దలయొక దేశమున నున్నట్లు వ్యవహరించితిమి. అవ్వలివీధి నెవ్వఁడో యొక వీరుండు రక్కసుం బరిమార్చెనని చెప్పి కొనగా వింటి. నీవని తెలిసికొనలేక పోయితిని. ఈపట్టణము చాల పెద్దదగుట నెన్ని విశేషములైనం గలిగియున్నది. భూమండలమున నింత పెద్ద పట్టణము జూచియుండలేదు. స్త్రీ రాజ్యభాగమంతయు నగరముగానే యున్నదఁట. దీని వర్ణింపఁ బెద్దకాలము పట్టును. ఏవీధి కావీధియే యొక పట్టణమని చెప్పవచ్చును.

దైవకృపచే మన మేగురము మంచిభార్యలం బడసితిమి. అమితధనము సంపాదించితిమి. మఱియు నీస్త్రీ రాజ్యము మన యధీనమైనది. మన మిప్పుడు భార్యల వెంటఁబెట్టుకొని యన్నలవలె నింటికిఁబోయి తలిదండ్రులకు సోదరులకు ప్రజలకు నానందము గలిగింతము. మన దక్షిణదిగ్యానము గూడ గొంత సఫలమైనదని చెప్పుకొనవచ్చును. మనదేశమునకుం బోవుదమా? అని చెప్పిన నామాట కందఱు సమ్మతించిరి. తమతమ భార్యలకు వారివారి యాప్తులకు నావార్తఁ దెలియఁజేసి శుభముహూర్తంబునఁ బయనంబై యా రాజ్యంబు మంత్రులు బాలించునట్లు నియమించి చతురంగబలములు గొలువఁ గతి పయప్రయాణంబులం గన్యాకుబ్జనగరంబు ప్రవేశించి తలిదండ్రులకు సోదరులకుఁ దమ వృత్తాంతమంతయు నెఱింగించి సంతోషసాగరంబున మునుంగఁ జేసిరి.

అని యెఱింగించి.. .మణిసిద్ధుం డిట్లనియె.

___________

243 వ మజిలీ.

మునుల తారతమ్యము.

గీ. తన కుటంబంబు తామరతంపరగను
    నల్లుకొన వేనవేలకు నిధికమగుచు
    తనదు నామము సార్థకత్వము వహింప
    నలరె సౌభాగ్యసుందరి యధికమహిమ.

ఇరువదిమంది కుమారులును దిగ్విజయంబుజేసి లోకాతీత సౌందర్యంబునఁ బ్రకాశించు నించుబోడ్లం బెండ్లియాడి యింటికివచ్చిన తరువాతఁ గొడుకులును గోడండ్రును మనుమలు మునిమనుమలులోన