కాశీమజిలీకథలు/పదవ భాగము/236వ మజిలీ

నమ్మకముతో వారు ధరింపఁదగిన నూత్నాంబర మాల్యానులేపనాది వస్తు విశేషంబులందెచ్చి యుండిరి. కావున వానినెల్ల నాగుడిలో నొకచోటనునిచి యద్దేవికి మ్రొక్కి త్రిదివంబున కరిగిరి.

అనియెఱిఁగించి.....మణిసిద్ధుం డిట్లు చెప్పందొడంగెను.

___________

236 వ మజిలీ.

సావిత్రి కథ.

విక్రముం డావిగ్రహము పాదపీఠము చాటుననుండి యాదేవ కాంతల సౌందర్యాతిశయంబు కన్నులార నాలోకించెను. ముఖమంటపపు వేదికపైఁ గూర్చుండి వారాడుకొనిన మాటలన్నియుఁ జెవులార నాకర్ణించెను. వారి హృదయాశయముల మనసార గ్రహించెను. ఆనందసాగరమున నీదుచు న త్తరుణులు దివమున కరిగినవెనుక వారు ముఖమంటపములో దాచిన మాల్యాను లేపనవస్త్రాలంకారాదులఁ బరికించి యవి చతుర్విధముగా నుండుటకు ననుమోదించుచు మనంబున నేదియో క్రొత్తసంకల్ప మావిర్భవింపఁ దటాలునఁ దదంగరాగవాసితములగు తటాకజలంబులఁ గ్రుంకులువెట్టి తదామోదమోదితనాసా పుటుండై సూర్యోదయమగుచుండ సావిత్రి నారాధించి జులంబులం గ్రోలి తృప్తుండై యాత్మగతంబున నిట్లు తలంచెను.

నాకిది స్వప్నమో భ్రాంతియో నిజమో యింకనుం దెలియకున్నది. సూర్యుండు నెండయుఁ గనంబడుచుండఁ గన్నులు తెరువబడి యుండ నిద్రలేనిదే స్వప్న మెట్లువచ్చును! ఒకప్పుడు కలలోనే మెలకువవచ్చినట్లు తోచుచుండును. ఇది యట్టి యవస్థయేమో యేమైన నేమి? కలలో గాయత్రిసేవ దేవకాంతదర్శనము దివ్యకుసుమవాసనాసంప్రాప్తి లోనగువిషయంబులఁ జూచుటఁ గల్యాణప్రదమేకదా. నావలెనే మాసోదరులుగూడ నేదేని యూతబూని గట్టుచేరరాదా. ఏమో దైవసంకల్ప మెవ్వరికిం దెలియదు. నేనాసముద్రతీరమునకుం బోయి వారిజాడ సరసెదంగాక కలగాని నిజముగాని ఇప్పుడక్కార్యమే కర్తవ్యమని తలంచి ద్వారపాలికాముష్టిఘటితమగు చంద్రహాస మూడబెరికి చేతంబూని సముద్రముదెసకుఁ బోవుచు నాకరవాలంబునఁ గంటకలతాగుల్మాదుల ఖండించి దారిచేయుచు మధ్యాహ్నమున కా సముద్రతీరము జేరెను. అప్పుడత్తీరమునుండి యమ్మవారిగుడి దాక చక్క నిమార్గ మేర్పడినది.

అతండు సముద్రముదెస పరికించుచు సాయంకాలముదనుక నాతీరమునఁ దిరుగుచుండెను. వికలములైన యోడశకలము లక్క డక్కడ నొడ్డునఁ జేరబడియున్నవి. వానిని విమర్శించుచు నామూల నుండియీమూల కూరక సంచారము చేయుచుండెను. అతనికిఁ దటాక జలంబులు గ్రోలినదిమొదలు క్షుత్పిపాసలు నశించినవి. దానంజేసి యతం డా రాత్రి యాతీరమునందే వసించి తొల్లి దక్షిణాబుంధితీరంబున దర్భలపై శయనించిన శ్రీ రాముండునోలె సభీష్టసిద్ధికై గాయత్రీ మహాదేవిని ధ్యానించుచుండెను.

వేకువజామున నతనికించుక నిద్రబట్టినది. అందుఁ దనసోదరులు తీరముజేరి తనతో మాట్లాడుచున్నట్లు కలవచ్చుటయు నదరిపడిలేచి నలుమూలలుచూచెను. అప్పుడరుణోదయమగు చున్నది. ఇదికలలోఁ గలకాఁబోలు. నాకట్టి భాగ్యముపట్టునాయని తలపోసి యట్టలేచి యేమియుం దోచక సముద్రపుగట్టునే యుత్తరముగా నడువఁజొచ్చెను. అది పాటుసమయమగుట సముద్రము కొంత లోపలకుఁ బోయినది. అందందుఁ జిక్కియున్న జల జంతువు లతనిరాకజూచి తటాలున బొరియలలోఁ దూరుచుండెను. ముత్తెపుచిప్పలు నత్తగుల్లలు పరాటికలు ప్రోగులుగానుండి యతని పాదములకు గ్రుచ్చికొనుచుండెను. వానిలక్ష్యముసేయక తనలక్ష్యమునందే దృష్టినుంచి కొంత దూరమేగునప్పటికి సూర్యోదయమైనది. ఆవెఁలుగులోనతండు తన దృష్టుల సముద్ర తీరమువెంబడి కొంతదూరము వ్యాపింపఁజేసెను. నూఱు గజముల దూరములోఁ బెద్ద దారువేదియో యొడ్డునఁ జేరి యున్నట్లు కనంబడినది. అతం డుబ్బుచుఁ గనుఱెప్పపాటులో నా దారువుచేరువకుఁ బోగలిగెను.

చంద్రోదయ చంద్రాస్తమయసమయములయందు సముద్రము పొంగి తరువాత తీసిపోవుచుండుఁ గదా. నాఁటిరేయి పోటున కా దారువు గట్టెక్కి పాటుతోఁబోవక యందాగియున్నది. దానిం బరిశీలించి చూడ సముద్రపుటోడ తెరచాపకొయ్యవలె దోచినది. గోడ నంటిన బల్లులవలె మువ్వురుపురుషు లందు బోర్లగిలఁబడి యంటిపండుకొనియున్నారు.

వారిం గురుతుపట్టి యతండు గుండె ఝల్లుమన హా! సోదరులారా! యని యఱచుచుఁ బ్రతివచనంబు గానక వారు మృతిబొందిరని నిశ్చయించుకొని నేలఁ గూలఁబడి పెద్దయెలుంగున నేడువందొడంగెను. అంతలో నతండయ్యో ! నాకిదేటిశోకము. ఆహారము గుడవనిచోఁ బదిదినముల వఱకుఁ బ్రాణములుబొందిని విడిచిపోవవనివైద్యలు చెప్పుదురు. మేము సముద్రములోఁబడి యైదుదివసములైనది. ఇతరోపద్రవము లేనిచో వీరికి మేనిలో బ్రాణములుండవచ్చును పొరబడి యాఁడుదానివలె నేడుచుచుంటినేమి? అని తలంచి యప్పుడ వారి యొద్దకుఁబోయి యొడలు ముట్టికొని యూపిరియుండుట గ్రహించి వడి వడి యొక చలమద్రవ్వి యందలి నీటిచే వారి దేహములుప్పుకస వోవఁ గడిగి మోములపై నీళ్లుజల్లి జిడ్డువోవ దుడిచితుడిచి యన్నా! విజయా! తమ్ముఁడా'! అనిపిలుచుచుండ వారికించుక యూపిరియాడుచున్నట్లు పొడకట్టినది. అప్పుడతండొక పర్ణపుటంబున నీరువట్టి వారి నోరు తెరఁవుడని పలుకుచు గొంచమునీరు ద్రావించెను. ఇంచుక తెలివి గలిగినది. కన్ను లెత్తి చూచిరి అప్పుడు వారి నాదారువునుండి లేవదీసి మెల్లగా నాదారువునకు జేరఁబడి కూర్చుండబెట్టి యాప్రాంతమునకుఁ బరుగెత్తికొనిపోయి వెలగపండ్లం గోసికొనివచ్చి వానిగుంజు మెల్లగా నోటికందిచ్చి తినిపించెను.

ఆరస మొకింత నొంటబట్టినతోడనే వారు లెస్సగాఁ జూచుచు నొండొరులఁ బరికించుకొనివిక్రమునితో నెలుగురాక మఱికొన్ని వెలగపండ్ల తినిపించుమని సంజ్ఞచేసిరి. అతండు కడుపునిండ వెలగ పండ్లదెచ్చి తినిపించెను. దప్పిదీర నీరుద్రావించెను. అన్నాతురులకు రుచియుఁ బక్వము గావలయునా? యెట్లో కడుపునిండించుటయే పని.

విక్రముఁడు తనయుపవస్త్రముమార్చి వారి పుట్టంబులు విప్పించి యుదికి యారవైచి కట్టించి సోదరులారా! మీకుదగిన పానీయము దీసికొనివచ్చెద. దానిం గ్రోలితిరేనిక్షుత్పిపాసలుండవు. నాలుగుగడియలలో వచ్చెద నిందుఁ బండుకొనియుండుడని పలికి యప్పుడే యమ్మవారి యాలయముకడకువచ్చి గర్భాలయములోనున్న అభిషేకఘటంబు గైకొని యమ్మవారికి మ్రొక్కుచు దానినిండనీరు వట్టి యావరణలోనున్న నారంగఫలములఁ గొన్ని గోసికొని యతివేగముగా వారికడకుఁ బోయెను.

అప్పటికి వారికిఁ గొంచెము బలముకలిగి యొండొరులఁ బలకరించుకొనుచున్నారు. విక్రముఁడు నారంగఫలముల రసముపిండి వారిచే గ్రోలింపఁ జేసెను. తటాకతోయము ద్రాగించెను. అమృత పానముజేసినట్లు వారికి శరీరములో మిక్కిలిబలము గలిగినది.

విజయుఁడు విక్రమునితోఁ దమ్ముఁడా! నీవెక్కినయోడమునుఁ గలేదాయేమి ? నిన్నుఁజూడ సముద్రములోఁబడనట్లు కనంబడుచుంటివి. మేమెట్లు గట్టుచేరితిమో తెలియదు. మనప్రయత్న మంతయు జలధిపాలైపోయినదిగదా! నే నాయోడ గుభాలున చప్పుడై మునిఁగినతోడనే సముద్రములోఁ బడిపోయితిని. చేతి కేమియు నాధారము దొరకలేదు. పెద్దతడ వీదితిని. ఆయాసము గలిగినది ఇఁక మునిఁగి పోవుదునని తలంచుచు దేహముపై నిరాశజేసికొని పరమేశ్వరిని ధ్యానించితిని. ఇంకను జీఁకటిగానేయున్నది. నాప్రక్కనే యొక్క పెద్దదారువు కొట్టికొనివచ్చుచున్నది. అది నాచేతికి దొరికినది. అది చిన్నదోనెవలెనే గుండ్రనై యున్నది. దానిపై కెక్కితిని మునుఁగలేదు. తమ్ములిద్దరు దానిమీఁద నున్నారని నాకుఁ తెలియదు. దానినంటి విడువకుంటిని. రెండుదివసములు చెరుపుమఱుపులతో నుంటిని. తరువాత స్మృతిదప్పినది. ఇక్కడికెట్లువచ్చి గట్టెక్కితినో తెలియదని విజయుఁడు తనకథ నెఱింగించెను.

తక్కిన యిరువురుగూడ నట్లేకొంతసేపు సముద్రములో మునిఁగి యాకొయ్య యాధారముదొరకగా నెక్కితిమని చెప్పిరి. ఆ తెరచాపకొయ్య మిక్కిలిపొడవుగాను లావుగానుండుటచే నొండొరు లున్నవార్త తెలియకయే కొట్టుకొనివచ్చిరి. ఆస్థంభమే వారికిదైవమై తీరమును జేర్చినది. వారునలువు రారాత్రి యిష్టాలాపములాడు కొనుచు నాతీరమునందే శయినించిరి. మఱునాఁడుదయమున లేచిన పిమ్మట విజయుఁడు విక్రమా! ఇప్పుడు మన మేమిచేయదగినది? ఇది యే దీవియో తెలియదు. ఇందు మనుష్యసంచారము లేకపోవుట వింతగానేయున్నది. ఇది వరుణద్వీపమైనచో జనులుండక పోవుదురా! శ్రీధరుఁడు జెప్పినమాట వినక మనమిట్లు బయలుదేరుట చాల తప్పు. మనతో వచ్చిన యోడలన్నియు మునిఁగిపోయినవి. శ్రీముఖునకు మన వార్త దెలియదు. క్రోధనుని జయించుమాట దేవుఁడెఱఁగు. మనమీ సముద్రముదాటి యింటికిఁబోవుటెట్లని యడిగిన నతం డిట్లనియె.

అన్నా ! మీరు పిఱికితనము వహింపవలదు. సముద్ర మధ్యం బునంబడిన మనలను గట్టుజేర్చిన భగవంతుని సంకల్పమెట్లో యట్లు జరగక మానదు. ఇందు మీ కొకవిశేషము జూపెదరండు మీరు పడిన యిడుములు మఱచిపోవుదురని పలుకుచుఁ దా నా గట్టెక్కినది మొదలు నాఁటి తుదివఱకు జరిగిన చర్య యంతయుం దెలువుచు నాదారిని వారినమ్మవారి కోవెల ప్రాంతమునకు దీసికొని పోయెను.

కాంచనసముద్దీప్తంబులగు నా యాలయ ప్రాకార గోపురమంటపాదులంజూచి యాశ్చర్యమందుచు నిట్టిదివ్యక్షేత్రంబున్నదని యెఱింగిన జనులు రాకుందురా! ఇది దేవతాభూమి మన పూర్వ పుణ్యవిశేషంబున దీనింజేరితిమని సంతసించుచు నందలి విశేషంబులంజూపింపుమని విక్రమునింగోరికనుటయు నతండు సోదరులఁ దటాకమునకుఁ దీసికొని పోయెను. వారు తత్తోయ పరిమళ విశేషమున కుబ్బి గంతులువైచుచు విక్రమా! నిన్న మాకుఁదెచ్చిన నీరీ కోనేటిలోనిదే కాఁబోలు. ఈ రహస్య క్షేత్రమును నీ వెట్లు పొడగంటివో వింతగానున్నది. అనుటయు నతండు ఇది నాప్రజ్ఞగాదు. భగవంతుఁడే దీనింజూపించె వేగమిందు గ్రుంకులు వెట్టుఁడు దేవీదర్శనము గావింతమని తొందర పెట్టెను.

పిమ్మట వారందఱు నందు తీర్థములాడియాడి వార్చి యెట్ట కే గట్టెక్కి తడిపుట్టంబులం బిండికొనుచు నా యాలయముచుట్టు ప్రదక్షిణములుజేసి తలుపులు తెరచికొని లోపలకుఁ బోయిరి. విక్రముఁడు సోదరులకు గాయత్రీ మహాదేవింజూపుచు నీ యంబ యెవ్వరోఁ యెఱింగితిరా? వేదములఁ గన్నతల్లి గాయత్రి మనపాలింటి కిప్పుడు కల్పవల్లియైనది. ఈమె కృపచేతనే మన మిందుఁజేరితిమి. ఇమ్మహా పరదేవత నారాధింపుఁడని పలుకుచు సోదరులతోఁగూడ నానందబరవశుండై గాయత్రిదేవినిఁ పోడశోపచారములచేఁ బూజించి పెద్దగా నగ్గించెను. అమృతపానము జేసినట్లుగా వారికిఁగూడ క్షుత్పిపాసలునశించినవి. పిమ్మట నతండందొకచో గూర్చుండబెట్టి సోదరులకు దేవకాంతా గమన వృత్తాంతము జెప్పుచు వారందుంచిన వస్త్రమాల్యాను లేపనాదులఁ జూపించెను. వాటిని వా రక్కజముతో విలోకింపుచుండ విక్రముండు తమ్ములారా ! వీని మనము ధరింతము దేవకాంతలు రేపు శుక్రవారము రాఁగలరు అప్పటి మన యదృష్ట మెట్లుండునో యట్లు జరగును. అని యుపదేశించుటయు వా రేకవస్త్రులై యున్న వారగుట సంతోషముతో నా కనకాంబరములుదాల్చి మణిహారకటకాంగుళీయాదికముల నలంకరించుకొని మందారదామంబు లురమున వై చుకొని దివ్యరూపములతోఁ బ్రకాశించుచుండిరి.

ఆరాజకుమారులు నలువురు నత్యంత భయభక్తి విశ్వాసములతో నియమితచిత్తులై మూఁడు దివసములా కోవెల ముఖ మంటపమున గూర్చుండి గాయత్రి మంత్రోపాసన గావించిరి.

శుక్రవారమునాఁడు సూర్యోదయమైనది మొదలు రాజకుమారుల చిత్తములు సంభ్రమాభివ్యక్తములై యెప్పుడు ప్రొద్దుగ్రుంకు నెప్పుడు దేవకాంతలం జూతుమని యుఱ్ఱూట లూగుచుండెను. వారికి నాఁ డెంతసేపటికిఁ బ్రొద్దు క్రుంకునట్లులేదు. సంతతము నాకసము వంకేచూచుచుందురు. ఎట్ట కే సూర్యాస్తమయమైనది. తారకాభర్త నక్షత్రముల నడుమ పూగుత్తియవలెవారి కాహ్లాదము గలుగఁజేసెను.

అప్పుడు వారు తటాకంబున మునుంగులాడి తమమేనులు దివ్యగంధమాల్యానులేపనాదుల నమరఁ జేసి నూత్నాంబర భూషా విశేషంబుల నలంకరించుకొని తదాగమన మభిలషించుచుండిరి.

దేవకాంతలును వల్లభ సమాగమాభిలాషంజేసినాఁడు వింతగా గై సేసికొని పెందలకడ బయలుదేరి మాటలాడికొనుచు నాయాలయ ప్రావరణములోఁ దిగిరి. రాజకుమారులను వారిసమ్మర్దము వినఁబడగనే గుడిలోఁ బ్రవేశించి యమ్మవారివెనుక దాగియుండిరి.

అనిమిషకాంతలు వాడుక ప్రకారము జలకమాడి బ్రదక్షిణ పూర్వకముగా గుడిముఖ మంటపములోని కరుదెంచి యందుఁ వారుంచిన వస్త్రాలంకారాదులం గానక యమ్మవారప్పుడే తమభర్తలకుఁ దాల్ప నిచ్చినదని నిశ్చయించి గుడిలోఁ బ్రవేశించి సమంచిత స్వరంబుల నమ్మహాదేవింగీర్తింపుచు సపర్యానంతరమున ముఖమంటపములోఁ గూర్చుండి యిట్లు సంభాషించుకొనిరి.

గంధవతి - మధుమతీ ! యిద్దేవి మన మందుఁ బోవునప్పటికే భర్తలందెచ్చి యుంచునని చెప్పితివికావా ? ఏరీ?

మధుమతి — ఓహో ! నీకు భర్తంజూడ జాల తొందరగా నున్నది గదా? మన ముంచిన వస్తువు లిందు లేకుండుటచే నవి యామె సంగ్రహించినదని యొప్పుకొనియెదవా ?

గంధవతి -- ఆమెయే తీసినదనుమాటయేల? మఱియెవ్వరైన వచ్చి తీయఁగూడదా.

మధు - మనముగాక యిచ్చటి కిదివఱ కెవ్వరైన వచ్చియుండిరా? రెండు గడియలు తాళుము. నీకంతయుం దెలియఁగలదు. నీవల్లభున కే రంగు పుట్టంబులుంచితివి?

గంధవతి - ఇంద్రనీల చ్ఛాయాపుటంబులు. నీవో?

మధు -- నాకుఁదెలుపేయిష్టము తెల్ల చీనాంబరములుంచితిని

గంధవతి - వారుణియో

వారుణి - నాకెఱుపు నేనట్టివేయుంచితిని

గంధవతి — చంద్రకళకేవర్ణ మిష్టము ?

చంద్రకళ - ఆకుపచ్చనిరంగునాకుఁజాలప్రీతి నేనాపుట్టంబులుంచితిని. అని వారు మాట్లాడుకొనుచు నమ్మవారు తమకు భర్తలం దప్పక తీసికొని వచ్చునను నమ్మకముతోఁ జేతఁ బుష్పదామంబులం ధరించి వారిరాక జూచుచుండిరి. ఇదియే సమయమని రాజకుమారులు నలువురు గుడిలోనుండియొకరి వెనుకనొకరు మెల్లగా నీవలకువచ్చి ముఖమండపములో నొకదెసశ్రేణిగా నిలువబడి యమ్మవారికి నమస్కరించిరి.

అప్పుడు దేవకాంతలు వారింజూచి మోహవివశలై యొక్కింత సేపు సిగ్గుపెంపునఁ దెంపుసేయక క్రేగంటిచూపులవారింజూచి చూచి లజ్జ దిగ ద్రోసి సాహసముతో మేను గఱు పార

క॥ నీవే నా ప్రాణేశుఁడ, వీ వే నాదైవమనుచు నెదసత్యముగా
     భావించి వరించితి నీ, దేవి కృపావశత ననుమతింపు మహాత్మా!

అని దేవకాంతలు వారువారు గట్టిన పుట్టంబులు గురుతుపట్టి మనోహరుగా నేరికొని మెడలోఁ బుష్పదామంబులు వైచుటయు వారును సంతోషావేశముతో

కం॥ ఇది నాసతి యిది నాసతి
       యిది నాసతియనుచు వెసగ్రహించిరి వార
       మ్మదవతుల కరతలంబులఁ
       దుది మదనుఁడె సత్పురోహితుండై కూర్పన్॥ |

అట్లు రాజకుమారగృహీత పాణులై యప్పల్లవ పాణులు లజ్జావనత వదనలై వారచూపుల నా భూపాల పుత్రుల సౌందర్యాతిశయం బాపోవక చూచుచుఁ దత్తదను రూపక్రియాకరణ నిరతచిత్తులై యమ్మవారి కెదురుగా నిలువంబడి

క॥ నినుఁగొనియాడ వశంబే
     జననీ గాయత్రి! మాకుసమధిక కరుణా
     ఖనివై దయజేసితి మో
     హనరూపులఁ బతుల గుణసమన్విత మతులన్ ॥

అక్కాంతల ప్రార్థనా వాక్యంబుల విని రాజ పుత్రులు వారికి దమయెడఁ గలుగు గౌరవప్రతిపత్తులం దెలిసికొని సంతసించుచు గాంతలారా ! మీరెవ్వరు ! ఈ యేకాంత ప్రదేశమున కెట్టువచ్చితిరి?"

మమ్మువరించిన మీ కులశీలనామంబులఁ దెలిసికొనుట మాకావశ్యక మైన పనికాదే యని యడిగిన మధుమతియిట్లనియె.

ఆర్యులారా ! నేనింద్రుని కూఁతురను ప్రభావతియను నచ్చర యందు జనించితి నిది యముని పుత్రిక యది వరుణునిపట్టి యిది కుబేరనందని. మా నలువుర తల్లులు నచ్చరలగుట మేము జనించినది మొదలొక్క చోటనే పెరిగితిమి. ఆహార నిద్రా విహారాదుల నొక్క గడియైన విడిచియుండఁజూలము మేముక్రమంబునఁ బెరిగి యౌవనవతులమై యతిగుణాన్వితులగు పతులంబడయఁదగు వ్రతముపదేశింపు మని యొకనాడు బృహస్పతికడకరిగి యడిగితిమి. ఆసురగురుండించుక యాలోచించి భూలోకమున శక్తిద్వీపమున గాయత్రీమహాదేవి క్షేత్రమున్నది. ప్రతిశుక్రవారము రాత్రియందుఁబోయి జాగరముండి యాదేవి నారాధించుచుండ నాఱుసంవత్సరములకు వ్రతము బూర్తి యగు. చిట్టచివరశుక్రవారమునాఁడు మీ కామిత మా దేవత యీడేర్చునని యుపదేశించెను.

మేమాగురువచనంబు గురువచనంబుగాఁదలంచి తదుపదేశప్రకారము వరుస దప్పకుండ నాఱువత్సరములనుండి యీదేవి నారాధింపుచుంటిమి. నేఁటికి మావ్రతము పూర్తియైనది. అమ్మవారు మిమ్ముఁ బతులగా దయచేసినది. మేము కృతకృత్యులమైతిమి. ఇఁక మేము మీయిష్టమువచ్చినట్లు మెలంగువారము. మీరు మాతో యధేష్టసుఖంబులనుభవింపవచ్చును. మీయిచ్చవచ్చినచోటునకు మేమువచ్చెదము. మీవృత్తాంతముకూడ నెఱంగించి మాకు శ్రోత్రానందము గావింపుఁడని వేడుకొనిన విక్రముండిట్లనియె. సాధ్వులారా! మాకథ చాలపెద్దది. ముందు వివరింతుముగాక యీమహాదేవికృపవలననే మేమిందు వచ్చుటకుఁ గారణమైనది. మనకుసంఘటన మీమెయేచేసినదని తత్సమయోచితములైన మాటలచేత నతండు వారికి సమ్మోదము గలుగఁ జేసెను.

అని యెఱిఁగించుటయు ముసిముసినగవులు నవ్వుచు గోపాలుండు స్వామీ! యిందు గాయత్రీమహాదేవి మాహాత్మ్యమేమియు నాకుదెలియఁబడలేదు. మాయూరిగుడిలోనున్న యమ్మవారువలె గాయత్రియు నాగుడిలోనుండుటయేకాని వారి కేమిసహాయము జేసినదియో చెప్పుడు. అమ్మవారి మహిమవలనఁ దమకాపతులు లభించిరని దేవకాంతలును గట్టెక్కితిమని రాజపుత్రులును సంతోషించు చున్నారు. నిజమరయ నందులకు నిందులకుఁగూడ నీమె యేమియుఁ గారణముకాలేదు. కాకతాళీయముగా రాజపుత్రులందుఁజేరి వారి మాటలు వినుటచేఁ గపటంబున నట్టి వేషంబులు వైచి వారిని మోసముజేసిరి కాదా! అని యడిగిన నవ్వుచు నయ్యవా రిట్లనియె.

ఓరీ! గాయత్రీమహాదేవిం దూఱితివికావున లెంపలువాయించుకో. అమ్మహాదేవికరుణావిశేషంబునం గాక యట్టినంఘటన మెట్లగును? ఆమె భక్తులకుఁ బ్రత్యక్షముగాదు కామ్యములు తీర్చునని నీ కదివఱకే చెప్పియుంటిని. అద్దేవి దయచేఁ గాక సముద్రమధ్యంబునం బడినవారు దరిజేరఁగలరా? ఆసేనలలో నొక్కరైనబ్రతికిరా? గాయత్రి దా నేమియు నెఱుఁగనట్లేయుండి సేవించిన వారికార్యంబులఁ దీర్చునని దేవీమహాత్మ్యము పెద్దగా వివరించి శిష్యునకు సంతోషము గలుగఁజేయుచు నవ్వలికథ పైమజిలీయం దిట్లు. . . చెప్పుచుండెను.


__________