కాశీమజిలీకథలు/పదవ భాగము/235వ మజిలీ

గరుడుఁడు మీ మనుమనింజూచి స్వయముగా నే కోరికొనియెను. వలదనుటకు మాకు సామర్ధ్యముగలదా! ఇందు మా తప్పులేదని వారుత్తరము చెప్పిరి. తపోధనసత్తమా! మా సుముఖున కిఁకఁ బదిదినములు మాత్రమేయాయువున్నది. ఇట్టి వానికిఁమీరు పెండ్లిచేయుమని యడిగిననేనేమి సమాధానముచెప్పఁగలననిగోలు గోలుననేడువఁదొడంగెను.

సీ! సీ! శ్రీవిష్ణునికి వాహనమై కశ్యపునకుఁ గుమారుఁడై యొప్పు పక్షిపతి కించుకయు జాలిలేకపోవుట కడుంగడు శోచనీయమై యున్నదని నారదమహర్షియతనిగర్హించుచు మాతలిదిక్కు, మొగంబై యిందుల కేమందువని యడిగిన నతం డిట్లనియె. స్వామీ! మీయనుగ్రహముండిన గరుడుండు సుముఖు నేమిజేయఁగలఁడు! ఈసుముఖుని మన మిప్పుడు స్వర్గమునకుఁ దీసికొనిపోవుదము. మహేంద్రునితో నితనికథ జెప్పి యీముప్పు తప్పింపుమని వేడుకొందము. అతం డుపేంద్రుని ముఖముగా గరుడునకుఁ జెప్పించిన నంగీకరింపక పోవఁడు. గరుత్మంతుం డెంతబలవంతుండైనను నుపేంద్రునియాజ్జు నుల్లంఘింపఁ గలఁడా? ఇదియే కర్తవ్యమని నాకుఁ దోచినదని చెప్పిన నారదుండు సంతోషించి యార్యకుని కావార్త దెలియఁజేసెను,

ఆర్యకుఁడు మిగుల సంతోషించుచు మనుమని వెంటఁబెట్టికొని యాక్షణమందే వారివెంట నాకంబున కరిగెను. అని యెఱింగించి... ఇట్లు చెప్పందొడఁగెను.

__________

235 వ మజిలీ.

సుముఖునికథ.

ఆర్యకుఁడు సుముఖుని వెంటఁబెట్టుకొని చుట్టములతోఁగూడ మాతలివెంట స్వర్గమున కరిగెనని విని భోగవతీనగరంబునంగల నాగ ప్రముఖు లొకనాఁడు సభచేసి యిట్లు సంభాషించుకొనిరి. కాళీయుఁడు - ధనంజయా! మనము గరుత్మంతుని బ్రార్ధించి యెట్లో యతనినొప్పించి యొకరీతి సంఘమరణముల దప్పించుకొంటిమి గదా. అతండు రేవు వచ్చునఁట తాను గోరిన సుముఖుందెచ్చి నడి వీధి వధ్యశిలదాపున నుంచుమని యిప్పుడే వార్త పంపియున్నాఁడు వింటివా?

ధనంజయుఁడు - విన్నాము. బాహాటముగాఁ జాటించినఁ దెలియకుండునా యేమి?

కాళీయుఁడు - అనుముఃఖుఁ డేడీ? నీకుఁ జుట్టముగదా! నీవు గూడ నతినితోఁ బెండ్లికి వెళ్లితివికావేమి?

ధనంజయుఁడు — నీయెత్తిపొడుపుమాటల కేమిలే. పెండ్లి కరిగెనో పేరంటమునకరిగెనో నే నెఱుంగుదునాయేమి?

నహుషుఁడు -- అవును. ఇప్పుడు మనకు గట్టిచిక్కే రాఁగలదు. గరుఁడుఁడు వచ్చునప్పటికి మన మతని వధ్యశిలపైఁ దెచ్చి పెట్టనిచో మన పనిపట్టకమానఁడు.

నందకుఁడు - ఆర్యకుఁ డేమిన్యాయస్థుఁడు! మనతో నేమియు నాలోచింపక మాతలివచ్చి కూఁతునిత్తు నన్నంతనే నాగాంతకున కాహారముగా నిరూపింపఁబడిన తన మనుమని వెంటఁబెట్టికొని స్వర్గమున కెట్లుపోయెను? ఇది తప్పుపనికాదా.

శంకుఁడు — మీరిప్పుడిన్ని నీతివాక్యములాడుచున్నారు. వారు నాకంబున కరుగుదురని విన్నప్పుడు వారింటికిఁజని పోవలదని యాటంకము సేయలేకపోయితిరా? ఇప్పు డేమనుకొనిన లాభమున్నది.

దీలీవుఁడు - మేము కొందర మట్టియూహజేసితిమిగాని నారదమహామునింజూచి వెఱచితిమి. అతం డలిగిన నేరాయిగానో శపింపఁగలఁడు,

కర్కోటకుఁడు -- కానిండు. గతమునకు వగచినం బ్రయోజనములేదు. నారదుమొగముజూచియే వారరుగుచుండ నెవ్వరు నాటంక పెట్టలేకపోయిరి. ఇఁక ముందుఁ గావింప దగిన కార్యమేమి? రేపే గరుడుఁడువచ్చు దివసము. వార్తగూడ వచ్చినదిగదా స్వర్గమున కరిగిన సుముఖుని మన మిపుడు రప్పింపఁజాలము. ఉన్న వారిలో నతని కాహారమగువారెవ్వరో తెలుపవలసియున్నది.

తక్షకుఁడు - ముందరినెలలో నెవ్వరింటికి వంతున్నదో యా యింటిపురుషు నీనెలకు మార్పవలయునని నే నభిప్రాయమిచ్చుచున్నాను.

ధనంజయుఁడు -- (పత్రికం జూచి) కర్కోటకు నింటికి వంతువచ్చినది.

తక్షకుఁడు - కర్కోటకా! ముందరినెలలో మీయింటి వంతఁట, ఆవంతు రేపటికి మార్చఁబడినది. రేపటి భక్ష్యవస్తువును దెచ్చెడు బాధ్యత నీమీఁదం బెట్టబడినది. తెలిసినదియా?

కర్కోటకుఁడు - ఎప్పటికప్పుడు మార్చుటకు మీయిష్టమే? మావాండ్రుమాత్రము పెండ్లికిఁ బోలేదా? మా వంతు ముందరి నెలలోనున్నది. యిప్పుడు నే నెవ్వరింబంపఁజాలను.

ధనంజయుఁడు -- పంపకున్న దప్పునా? పాపము సుముఖుని కిది వంతు సమయముకానేకాదు. గరుత్మంతుఁడు వానింజూచి కోరి కొనుటచే నట్లు వంతువేసితిమి. మొదటివంతు కర్కోటకునిదే.

కర్కో - చాలుజాలు ఆపట్టిక నీకడనున్నదని మిట్టిపడుచున్నావు. మొన్న సుముఖుని వ్రాసి యిప్పుడు నాపేరు వ్రాసిన నేనొప్పు కొందునా? ఆనింబధనము పోయినది, మఱియొకనికి వంతుమార్పుఁడు.

ధన - ఇంకొకఁడు మాత్రమొప్పుకొనునా! దీనింబుచ్చికొని నీవే మిట్టిపడుము. (అని యాపట్టిక నతనిపైఁ విసరుచున్నాఁడు. )

కర్కో.- నాప్రతాప మెఱుంగుదువా? వాసుకి శేషప్రముఖులకే వెరువను. నీవా నన్ను గద్దించువాఁడవు? తక్షకుఁడు — కర్కోటకా ! తొందరపడకుము ఇట్టి నిబంధనముల మనమే యేర్పరచి మనమే దాటవచ్చునా? అందరు నిట్లే యనిన నేమిచేయఁదగినది? గరుడుం డడిగెను. కాని యార్యకునింటి వంతు జరిగిపోయినది. దైవ రక్షితుండై సుముఖుండు దివికరిగెను. నీకు వంతు తప్పదు. పెద్దలందఱు నట్లు చెప్పుచున్నారు. విందువా? వినవా?

కర్కోటకుఁడు— నేనెవ్వరు చెప్పినను వినను. నాకీనెలలో వంతు లేదుగదా యని మా వాని నూరికిఁ బంపితిని. వాఁడు రేపటికి రాఁజాలఁడు. అమాట గరుత్మంతునితో నే చెప్పుకొనియెదం గాక .

ధనంజయుఁడు - కర్కోటకుఁ డిందరుచెప్పుచుండవినకపోయెంగదా. కానిండు ఇఁకమీఁదటివంతుల కెవ్వరు సమ్మతింతురో చూచెదంగాక.

తక్షకుఁడు -- పోనిండు రేపతండు వచ్చుచున్నాడుగదా మన తగవులన్నియు నొక్కసారి యాపక్షి పతియే తీర్చునని భుజంగులెల్ల హల్ల కల్లోలముగా నాదివసంబెల్ల బోట్లాడుచుండిరి. అంతలో గరుత్మంతుని ఱెక్కల చప్పుడులు వినంబడినవి. పడగలు ముడిచికొని యందఱు కిక్కురుమనక నతని రాక కెదురు చూచుచుండిరి. అప్పు డప్పక్షిపతివచ్చి వథ్యశిల ప్రక్కవాలి ఱెక్కలు ముడిచికొనియెను. వథ్యశిలపై నెవ్వరింగానక కన్నుల నిప్పు లుఱుల నురగులనెల్లంగలయ నీక్షించుటయుఁ దక్షకుం డేదియో చెప్పింబోయినఁ గర్కోటకుఁ డడ్డంబై మహాత్మా రక్షింపుము. నాగులెల్లఁ గట్టుకట్టి మీతో నా మీఁద నేరములు సెప్పుట కుద్యుక్తులై యున్నారు. వీరిమాట లేమియు వినఁగూడదు. నాఁడు మీరు ముందరి నెలలో సుముఖుం భక్షింతునని చెప్పిపోయితిరిగదా అని చెప్పువఱకు నిలిచి యంతలో మఱికొందఱు నాగులతని నీవలకులాగి మహాప్రభూ ఈతనిమాటలు వినరాదు. సంఘసంస్కరణ విధ్వంసుకుఁడై కులస్థులతోఁ గలహించుచున్నాఁడని చెప్పుచుండ మఱికొందరువచ్చి వారిమాట విననీయక తారేదియో చెప్పఁబూనిరి.

ఈరీతినల్లరిగా నెవ్వరి నేమాటయుం జెప్పనీయక నాగులాటంకములు సెప్పుచుండ నయ్యండజపతి హుంకారము గావించుటయు నందఱు భయపడి నిశ్శబ్దముగా నిలువంబడిరి. అప్పుడు గరుడుండు కన్ను లెఱ్ఱజేయుచు నాగులు పొగరెక్కి నాచక్కినే యల్లరిసేయుచున్నా రే. ఒక్కఁడే మాట్లాడవలయు, వాని వాక్యము ముగియు దనుక రెండవవాఁడు మాటాడఁగూడదు. జాగ్రత. కర్కోటకా ! నీ యుపన్యాసమేమియో ముగింపుము. అనుటయు నతం డిట్లనియె.

స్వామీ! నాఁడు దేవర చికురుఁడను నాగుని భక్షింపుచు ముందరినెలలో తనకుమారుని సుముఖు డను వాని భక్షింతు నాఁటికి వాని వధ్యశిలపైఁ జేర్చియుంచుఁడని సెలవిచ్చియుండిరిగదా. మొన్న నాకమునుండి యింద్రసారధి మాతలియఁట తసకూఁతున కెందును భర్తదొరకలేదఁట యీగ్రామమువచ్చి వానితాత యార్యకు నడిగి మేమందరము వీఁడాగరుత్మంతునికి భక్ష్యము కొంపోవఁగూడదని చెప్పుచుండ వినిపించుకొనక మాతలి వానిచుట్టములతోఁగూడ స్వర్గమునకుఁ దీసికొనిపోయెదనని చెప్పినంతఁ గల్పాంతజీమూతమువలె గర్జిల్లుచుఁ బక్షిపతి యక్షీణకోపంబున నిట్లనియె.

నాకాహారవస్తువని మీరందఱు చెప్పుచుండ వినిపించుకొనక మాతలి సుముఖు నల్లునిగాఁ జేసికొనుటకై నాకమునకుఁ దీసికొని పోయెనేమి? ఇంద్రుని తేఱి గుఱ్ఱములగాచెడువాని కింతపొగ రేల గలుగవలయును. వాఁడు పిలిచినంతనే యార్యకుఁడు మనుమనిం దీసికొని నాకమున కరిగెనా? కానిమ్ము. నాకమన నెక్కడనున్నది? గడియలోఁబోయి పట్టకపోవుదునా? దేవేంద్రునెదుట మాతలిచేసిన దౌర్జన్యముగ్గడించుచు నాసుముఖుఁని జుట్టములతోఁగూడ బక్షింపక పోయినచో నన్నుఁ బక్షిపతియని పిలువవలదు. నాగులారా! ఆర్య కుఁడు మనుమని దీసికొనిపోవుచుండ నాటంకపెట్టవలదా? మాతలి యన నాముందర నెంతవాఁడు! మీయుపేక్షకూడ కొంతయున్నదని పలికిన విని గడగడలాడుచు తక్షకుఁ డిట్లనియె. స్వామీ! మేమా మాతలితో మీమాటలు సెప్పితిమి. కాని యతండు వినిపించుకొనఁడయ్యెను. బలవంతమున నాపుదమన్నను మాతలిబలమెట్టిదోమాకుఁ దెలియదు. అదియునుంగాక నారదమహర్షి యతని వెంటనుండుటచే శాపమునకు వెఱచి సాహసించితిమికాము. మీరు వచ్చునప్పటి కీవిషయమే కాదా తగవులాడుచుంటిమి. దేవా! దేవరవిషయమై మేమెప్పుడును భక్తిగలిగియుందుమని నివేదించికొనియెను. గరుడుండు క్రోధవివశుండై మాతలి నన్నేమియు లెక్క సేయలేదుగా. కానిండు. ఇప్పుడే పోయి నేనాసుముఖుని పొట్టచీల్చి కండలు భక్షించెదంగాక. ఈపాటికి పెండ్లిచేసియేయుందురు. అందు నాముందర నిలుచువారెవ్వరో చూచెదంగాక పో. పొండు. నేఁటికీమీరందఱు బ్రతికిపోయితిరని వలుకుచు నయ్యండజపతి యాక్షణమ యెగసి పక్షవాతంబువృక్ష లతాగుల్మాదుల కుత్పాతంబుగతి వ్యాపింప నతివేగంబున స్వర్గలోకమున కరిగెను. అందు సుధర్మాప్రాంగణంబును గొప్పపందిరివైచిరి. ముత్యాలు తోరణముగా గుచ్చిరి. కాంచనరత్న ప్రాంచితంబులగు నలంకారంబు లిన్నిగలవని వక్కాణింప శక్యముకాదు. పెండ్లిపందిరి శోభ వర్ణింపఁ బదిదినములుపట్టును. ఒకమూల నచ్చర లాడుచుండిరి. యొకమూల గంధర్వులు పాడుచుండిరి. మహేంద్రుండు మాతలినిమిత్తమై యుపేంద్రునిం దీసికొనివచ్చి వివాహవేదిక ప్రాంతమునఁ గూర్చుండబెట్టెను. ముప్పదిమూడుకోటులు వేల్పులు నారదాదిమహర్షులు గరుడగంధర్వకిన్నర సిద్ధవిద్యాధరాది దేవతావిశేషులు పెండ్లిపందిరి నిండఁ గూర్చుండిరి. దుందుభులు మ్రోగుచుండెను, మాతలిభార్యతోఁగూడ బీటపైఁ గూర్చుండి బృహస్పతి పురోహితుండై పాణిగ్రహణమంత్రములు జదువుచుండ సుముఖునకు గుణ కేశినినిచ్చి కన్యాదానము గావించెను. వధూవరులు విచ్చలవిడి నతిసంతోషముతోఁ దలబ్రాలుబోసికొనుచుండిరి. అట్టిసమయంబున నొకమూల దుందుభిధ్వనులంగప్పిన గొప్పచప్పుడు లుప్పతిల్లుటయు నెల్లరు నావంకఁ జూచుచుండిరి. అంతలో ద్వారపాలురువచ్చి గరుత్మంతుఁడు వచ్చుచున్నాఁడని తెలియఁజేసిరి. అప్పుడు మహేంద్రుఁ డుపేంద్రునితో స్వామీ! గరుఁడుఁడు వచ్చుచున్నాడఁట సుముఖు నెట్లు కాపాడెదరో యని తెలియజేసెను. అంతలో ఱెక్కలుముడిచికొనుచు వైనతేయుం డాకళ్యాణమంటపసమీపమునకు వచ్చి వ్రాలెను. అతనిరాక జూచి సుముఖు డదరిపడి పెండ్లిపీటలమీఁదనుండి లేచి లోపలకుఁ బారిపోయెను. ఆర్యకుఁడు చుట్టములతోఁగూడ వివరము లరసి డాగి కొనియెను. అప్పుడు పక్షీంద్రుం డుపేంద్రునకు నమస్కరించుచు మహేంద్రు నుద్దేశించి యిట్లనియె.

వృత్తారీ! నీసారథి మాతలి నాకెట్టి యపకారము గావించెనో చూచితివా? సర్వ భూత ప్రభువగు విధాతచే నాకుఁ బాము లాహారముగాఁ జేయంబడినవి. భోగవతీపురంబున సుముఖుఁడను నాగ కుమారుని నేఁటి దిన మాహారవస్తువుగా నియమించుకొంటిని. నా నోటియన్నము పడఁగొట్టి యా పాఁపపట్టిందీసికొనివచ్చి యీ మాతలి పెండ్లికొడుకుఁగాజేసి నాఁడిది యేటి ధర్మము? నేను నియమితాహారముదప్ప మఱియొకటి భుజింపను నీకువలెనే స్వేచ్ఛావిహారములు నాకులేవు. మన యిరువురము కశ్యపుని బిడ్డలమైనను నీవు త్రిలోకాధిపతివైతివి. నే నొరులకుఁ బరిజనుడనైతినని నిరసింపరాదు. జుమీ? నేను నీకంటె బలవంతుఁ డనగుదును. శ్రుతసేన ప్రభృతి రాక్షసుల నేను వధించినవార్త నీవెఱుంగవా? వదలుము నాకాహార వస్తువైన సుముఖునిందు రప్పింపుము భక్షించి పోయెదనని యడిగిన మహేంద్రుండు నవ్వుచు నిట్లనియె.

వయస్యా ! మనమందఱము కశ్యప సంతతిలోని వారమే యగుట నొండొరులము మైత్రిగలిగి యుండవలయు నీ మాతలి కూఁతురు మిక్కిలి చక్కనిది దాని కెక్కడ సరిపడిన వరుఁడు లభింప లేదని తిరిగి తిరిగి సుముఖునేరికొని వచ్చెను. సుముఖున కిప్పుడే పెండ్లియైనది. అట్టివానిం భక్షింప నీ కెట్లు నోరువచ్చును ? మా చుట్టఱికము దలంచి వానిని విడువుము. నీకంతకన్న బలముగలుగఁ జేయు వివాహభోజనము పెట్టించెద నీభోజనము విడువుమని సానునయముగాఁ బలికినవిని రోషారుణిత నేత్రుండై పతత్రి పుంగవుం డిట్లనియె.

మహేంద్రా? వీని భక్షించి తీరెదనని నాగ సభా మధ్యంబున శపధముజేసి వచ్చితిని. ఇప్పుడు వీని నేను విడిచితినేని నాగు లిఁక నామాట బాటింపరు. నీ మాట వినమి కీమాటు సైరింపుము సుముఖునిందు రప్పింపుమని పలికిన విని యనిమిషపతి పతగపతి కిట్లనియె సుపర్ణా ! ఇది కేవలము నామాటయే కాదు. ఇందున్న దేవతలు మహర్షులు దిక్పతులు నీకీ మాటయే బోధించుచున్నారు. అందరిమాట యటుండనిమ్ము ఈయుపేంద్రుని యభిప్రాయముగూడ నట్లే యున్నది. అమ్మహాత్ముని యానతి దాట నీకు సామర్థ్యము గలదా యని యడిగిన నతం డిట్లనియె.

మహేంద్రా! నేనుగాక యుపేంద్రుని మోయువాఁ డెవ్వఁడు గలండు? అతనికి ధ్వజముపై నిలచి జయము గలుగఁజేయుదును. ఇట్టి యాప్తుని నోటి యాహార మతఁడేల చెడగొట్టగలఁడని సాటోపముగాఁ బలికిన విని యుపేంద్రుండు మందహాసము గావించుచు గరుడున కిట్లనియె.

పక్షిపతీ! పాపము సంగరములయందు నీ కతంబున నాకు జయము గలుగుచున్నదిగా! కానిమ్ము. సంతోషమే. మహేంద్రుఁ డన మూఁడు లోకముల కధికారి. అతండు సుముఖుని విషయమై కాపాడుమని బ్రతిమాలికొనిన నిరసించితి విది బుద్ధిమంతుల తెరవే ? నన్ను హేలగా మోయుచుంటినని గర్వోక్తు లాడితివేదీ. నాయెడమ చేతి యీచిటికెనవ్రేలి బరువు మోయము. నీప్రజ్ఞ జూతునుగాక ! అని పలుకుచు నావ్రేలాతని పక్షముమీఁద మెల్లనమోపెను.

అప్పుడతండు పిచ్చుకపై పెద్దపాషాణము పెట్టినట్లు క్రుంగఁబడి యీకలు రాల నోఱుదెరచుకొని రక్తముగారుచుండ నెలుగురాక కీచు కీచుమని యఱచుచు మహాత్మా! అపరాధము సేసితి. రక్షింపుము అని తలతో సూచనగావించెను.

ఉపేంద్రుడు నవ్వుచు సుపర్ణా ! యింతే నీబలము ! నన్ను సకుటుంబముగా మోయువాఁడవు కాదా? ఈవ్రేలి బరువే మోయలేక పోయితివేమి? ఆ గర్వోక్తులేమైనవి! యిప్పుడైన నుపేంద్రుని మాట విందువా అని చేయెత్తి యెత్తిపొడుచుటయు గరుడుండు గరువము విడిచి చెంపలు వాయించుకొని యుపేంద్రుని కపరాధముజెప్పి కొనుచు సుముఖుని విడిచి యెందేనిం బోయెను.

పిమ్మట సుముఖుఁడు మాతలిఁ కూఁతుం బెండ్లియాడి నందన వనంబునఁ గ్రీడాశైలంబుల మందాకినీ కాంచన సిక తాతలంబుల విహరించుచుఁ బెద్దకాలము సుఖించెను. ఈకథగల పుస్తకము మా యింటనుండమిఁ జదివితిని. దీనింబట్టిచూడ నాగ కుమారులలోఁ గూడ ద్రిలోకాతీత సౌందర్యముగల వారుందురని తెలియఁబడుచుండుటలేదా. అందులకైనాగులాయని యడిగితిని. తెలిసినదియా యని యింద్రుని కూఁతురుమధుమతి చెప్పినవిని తక్కినవారనుమోదించుచు నమ్మవారికెవ్వరుత్తములనితోచునో వారినిదయఁజేయగలదు. ఇంతియే మనము కోరవలసినదని పలికిరి.

అంతలోఁ దెల్లవారు సమయమగుటయు వారు రాఁబోవు శుక్రవారమునాఁటి కవ్వేదమాత తమకు భర్తలందెచ్చియిచ్చునను నమ్మకముతో వారు ధరింపఁదగిన నూత్నాంబర మాల్యానులేపనాది వస్తు విశేషంబులందెచ్చి యుండిరి. కావున వానినెల్ల నాగుడిలో నొకచోటనునిచి యద్దేవికి మ్రొక్కి త్రిదివంబున కరిగిరి.

అనియెఱిఁగించి.....మణిసిద్ధుం డిట్లు చెప్పందొడంగెను.

___________

236 వ మజిలీ.

సావిత్రి కథ.

విక్రముం డావిగ్రహము పాదపీఠము చాటుననుండి యాదేవ కాంతల సౌందర్యాతిశయంబు కన్నులార నాలోకించెను. ముఖమంటపపు వేదికపైఁ గూర్చుండి వారాడుకొనిన మాటలన్నియుఁ జెవులార నాకర్ణించెను. వారి హృదయాశయముల మనసార గ్రహించెను. ఆనందసాగరమున నీదుచు న త్తరుణులు దివమున కరిగినవెనుక వారు ముఖమంటపములో దాచిన మాల్యాను లేపనవస్త్రాలంకారాదులఁ బరికించి యవి చతుర్విధముగా నుండుటకు ననుమోదించుచు మనంబున నేదియో క్రొత్తసంకల్ప మావిర్భవింపఁ దటాలునఁ దదంగరాగవాసితములగు తటాకజలంబులఁ గ్రుంకులువెట్టి తదామోదమోదితనాసా పుటుండై సూర్యోదయమగుచుండ సావిత్రి నారాధించి జులంబులం గ్రోలి తృప్తుండై యాత్మగతంబున నిట్లు తలంచెను.

నాకిది స్వప్నమో భ్రాంతియో నిజమో యింకనుం దెలియకున్నది. సూర్యుండు నెండయుఁ గనంబడుచుండఁ గన్నులు తెరువబడి యుండ నిద్రలేనిదే స్వప్న మెట్లువచ్చును! ఒకప్పుడు కలలోనే మెలకువవచ్చినట్లు తోచుచుండును. ఇది యట్టి యవస్థయేమో యేమైన నేమి? కలలో గాయత్రిసేవ దేవకాంతదర్శనము దివ్యకుసుమవాసనాసంప్రాప్తి లోనగువిషయంబులఁ జూచుటఁ గల్యాణప్రదమేకదా.