కాశీమజిలీకథలు/పదవ భాగము/233వ మజిలీ

గ్రహించి స్వామీ! కల యసత్యమైనను గలలోనున్నప్పుడప్పటి చర్యల ననుసరించి సుఖదుఃఖములు గలుగుచుండును. నాప్రవృత్తియునట్టిదే యనుకొనుఁడు. మీరు నవ్వినకారణము గ్రహించితినా! కరుణించి యవ్వలి కథ జెప్పుఁడని వేడుకొనియెను. అప్పుడు వేళమిగులుటయుఁ బయిపయనము సాగించి యతిపతి పై మజిలీయం దవ్వలి వృత్తాంత మిట్లు చెప్పం దొడంగెను.

_________

233 వ మజిలీ.

దేవకన్యకలకథ.

గీ. జలధి మునిఁగిన బావక జ్వాలఁ గూలి
    నను మహీధ్రమునుండి దొర్లినను బుడమి
    ఫణులచే బల్మిఁ గరవంగఁబడినఁ జావఁ
    డాయు వించుక మిగిలిన యతఁడు జగతి.

సముద్రపుటోడలకుఁ బ్రమాదమువచ్చునప్పుడు దప్పించుకొనుటకై ప్రక్కను జిన్నదోనెలంగట్టి యుంచుదురు. గనికిఁ దగిలి గుభాలునఁ జప్పుడై యోడమునుఁగుటయు నరనిమిషములో జరిగినది అప్పటికి రాత్రిజాము ప్రొద్దుపోయినది. అందున్న వారికి సాధనములఁ జూచుకొనుటకైన నవకాశము గలిగినదికాదు. అందు విక్రముడున్న యోడ శకలములై మునింగినది. ప్రక్కగట్టఁబడిన జిన్నదోనెలు దానితో విడిపోయి సముద్రజలంబునఁ దేలి కొట్టుకొని పోవుచుండెను. దైవికముగా విక్రమునిచేతికొక దోనెదొరకినది. అది ప్లవమువంటిదే. నీరెక్కినను మునుఁగదు. తెప్పకంటెఁ బెద్దదిగానుండును విక్రముఁడు. దానిపై కెక్కి కూర్చుండి యించుక యాయాసముదీరిన వెనుకవెన్నెల గాయుచున్నది. కావున నలుమూలలు పరికించి పొంగుచున్నసముద్ర తరంగములుగాక మఱియేమియుంగానక తన్ను మృతప్రాయునిగాఁ దలంచికొని యిట్లు ధ్యానించెను.

సీ! పురుష కారము ప్రధానముగాఁజేసికొని కార్యములు సేయ బూనెడు వారాపదలఁ బొందకమానరు. మేము ప్రతాపగర్వితులమై క్రోధనుండు యంత్రబలయుక్తుఁడు, యందుఁ బోవలదని యెందఱుచెప్పినను వినిపించుకొనక బయలుదేరుట మాకండక్రొవ్వుగాక మఱియేమి? క్రోధనుండు మా జోలికివచ్చెనా ! మమ్ము నిదించెనా ! అకారణ వైరముఁబూని పోరఁబోయిన నాపదలు జెందకుండునా ? క్షత్రియ ధర్మమే గర్హితమైనదని తలంచెదను. మా యోడలలో నొక్కటి యైన మిగిలినట్లులేదు. మేమన్నదమ్ములము నలువురమేకాక మా నిమిత్తము శ్రీధరుని బలములుగూడ సముద్రముపాలైనవి. మా యన్న కీ వార్త జెప్పువారెవరైనలేరు. మా జీవిత మీసముద్రజలంబుల ముగిసినది. దరిజేరుట కల్ల. ఆహా! కాలమెంతలో మారినది. జాముక్రిందట నోడమీదఁ గూర్చుండి మిత్రులతోఁ గ్రోధనుం జయించు నుపాయమేమని యాలోచించు చుంటిని. ఇంతలో నాజీవితమే యస్థిరమైనది. నన్నీ దోనెతోఁగూడ నే జలచరమో భక్షించును. నాకిఁక యాయువు గడియ యో రెండు గడియలోనున్నది. ఇఁక పరమేశ్వరునిధ్యానించుటయే లెస్స. ఐహిక విషయంబులం దలంచిన ఫలములేదని నిశ్చయించి కన్నులు మూసికొని యిష్టదేవతనిట్లు స్మరించెను.

ఉ॥ ఏమియుఁజేయనట్టి పరమేశ్వరు సన్నిధిఁజేరి తత్ప్రస
      క్తామల దీప్తిలాగికొని యన్నియుఁ దా నొనరించుచుండి మా
      యామయమైన లోకములనాతఁడె కర్తగ దోపఁజేయు సా
      ధ్వీమణి నాదిశక్తిఁ బ్రకృతిన్ బ్రణుతింతున నంత భక్తితో.

అని స్తుతియించి తదర్ధ మవఘటించుకొని అయ్యోనేను భక్త జన పరాణుఁడైన నారాయణుని ధ్యానింపఁబోయి యాది శక్తి నభినుతించితినేమి! ఔను పరదేవత నా కభీష్టదేవత యగుట సంకల్పింపక పోయినను నాబుద్ధి యామాతమీఁదఁ బోయినది. అదియు శుభ సూచకమే. అని మఱియును

శా॥ సంసారాంబునిధి న్మునుంగుచు సుహృజ్జాయాదివాస్స్వత్వముల్
      హింసింపం గడగాన కూర్మిచయముల్ హృత్ప్రజ్ఞ సర్వంబువి
      ద్వంసంబుం బొనరింపఁ బూర్వ సుకృత వ్యాప్తిన్మురా రే! హరే!
      కంసారే! యనినిన్ దలంపఁ దరి జక్కంజేర్పవే యీశ్వరా॥

అని ధ్యానించుచు నాదోనెను విడువక గొట్టుకొని పోవుచుండెను. నిద్రాహారములులేక రెండుదినము లాసముద్ర జలంబునం దేలియాడుచు నతండు పెద్దదూరము గొట్టికొని పోయిపోయి క్రమంబున నీరసము బలసి స్మృతిదప్పి కన్నులు దెరువలేక యాపట్టెనంటి పండుకొని యుండెను.

మూఁడవనాఁటి యుదయమున కాదోనె యొకచోఁ దీరమునకు జేరి యలలరాపిడి తలక్రిందగుటయు నతండు నీటిలోఁబడ కాలికి నేల దగిలిన నతని కించుక తెలివివచ్చినది. కన్నులు దెరచిచూడ భూమియు నందు వృక్షలతాదులు నతనికి నేత్రపర్వము గావించినవి. అప్పు డతని కెక్కడలేని బలమువచ్చి యట్టెలేచి నిలువంబడియెను. తీర భూమి కొంతదూర మిసుగగానుండెను. ఒడ్డుచేరి యతం డాలోచించి యాయిసుగలో జిన్న చెలమ దీయుటయు నందు మంచినీ రూరినది. అనీటిచే స్నానముజేసి కడుపునిండ నీరుగ్రోలికొంచెము సత్తువజేరగనే కట్టుగుడ్డ లారవై చుకొని యాభూమి పరికించి చూచెను.

జన సంచారమేమియును లేదు. తీరభూమియంతయు మహారణ్యముగాఁ నొప్పుచున్నది. అప్పుడతం డాహా ! పరమేశ్వరుని విలాసములు కడుచిత్రములు. మదభీష్ట దేవత నామొర నాలించి తీరమును జేర్చినది. ఇది వరుణద్వీపమో మఱియొకటియో తెలియదు. మా సోదరులుతీరముజేరియుండిరో మృతినొందిరో యెఱుంగ రాదు. వారు లేని నాజీవిక దుఃఖమున కే కారణముగాదే అని తలంచుచు సముద్రముదెస జూచి గుండెలు చెదర నమ్మయ్యో నేనీ మహార్ణవములోఁ బడి బ్రతికి గట్టెక్కితినా? కొండలవలెఁ బొంగి పాతాళమున కరుగుచున్న తరంగముల నడుమమునుఁగుచు నేనెట్లుబ్రతికివచ్చి తీనో! దైవకృపనుమాసోదరులుగూడనిట్లువచ్చిన నత్యానందముగదా. కానిమ్ము నన్ను బ్రతికించిన భగవంతునిసంకల్పమెట్టిదో యట్టు జరుగుంగదా. పడమరగాఁ గొంతదూరము పోయి చూచెద. నీయడవిలోఁ దినుటకుఁ బండ్లేమైనఁ దొరకకపోవునా? అని యాలోచించుచు లేనిబలము దెచ్చికొని కొంతదూరము నడచెను. అడుగులు తడఁబడ దొడగినవి. జాముప్రొద్దెక్కినది. యెండవేడిమి సహించలేక యతం డొక చెట్టు క్రిందఁ గూర్చుండి యటునిటు జూచుచుండెను.

పదిబారల దూరములో నొక వెలగ చెట్టు కనంబడినది. అందు. ఫలము లున్నట్లు తోచినది. మెల్లగా దానికడకుఁ బోయి క్రిందరాలిన పండ్ల నేరియాసక్తితో భక్షించెను. కొంత యాకలి యడింగినది. ఆప్రదేశమున మనష్యులెన్నఁడును సంచరించినట్లు తోచలేదు. కంటక లతాగుల్మాదు లలముకొని పోయినవి. మృగములు నడచిన బాట లక్కడక్కడ గనంబడుచుండెను. అతనిచేత నాయుధ మేదియునులేదు. సత్వకృతమార్గంబుల దూరిదూరి మఱికొంతదూరము పోఁగలిగెను. నీటిజాడ లేమియుఁ గనంబడలేదు.

అందొక వటవృక్షంబు శాఖాసమాచ్ఛాదితదిగంతంబై యతని కాహ్లాదము గలుగఁజేసినది. దాని నీడఁ గోంతసేపు విశ్రమించి యతండాలోచించి యూడ లూతగాఁ జేసికొని యాచెట్టెక్కి మధ్య శాఖాగ్రమున నిలువఁబడి నాలుగుదిక్కులు పరికించి చూచెను. తూర్పుదెస మహాసముద్రము వెఱపు గలుగజేసినది. తక్కినమూడు దిక్కుల నరణ్యమేకాని మఱేమియుఁ గనంబడలేదు. కనుచూపుమేరలో గ్రామమేదియుఁ నున్నట్లు తోచదు. పడమరగా విమర్శింపఁ గొంతదూరములో నీలమేఘాంతరమున మెఱయు మెఱుపుతీగెవలెఁ దరులతాదళాంతరమునఁ దళుక్కురని మెరయుచు బంగారు దీప్తియొకటి యతనికి నేత్రపర్వము గావించినది.

గాలిచే గదలుచున్న యాకులనడుమ మెఱయుచున్న యాతళుకుంజూచిచూచి యదియేదియో తెలిసికొనజాలక దాని నికటంబునకుఁ బోయి చూడవలయునని యభిలాషగలుగుటయుఁ నాప్రదేశము గురుతువెట్టుగొని తటాలున వటవిటపి దిగి తదభిముఖముగాఁ నడువఁ జొచ్చెను. అడుగు వెట్టుటకు సందులేని యాకాంతారములో నొక దండము సంపాదించి దానియూతచే డొంకలు దాటుచు ముల్లు కంపలు తప్పించుకొనుచు బొదలదూరుచు నతి ప్రయత్నమున సంజవేళకెట్లో నాలక్ష్యప్రదేశమునకు శరీరమును జేరవైచెను.

అప్పుడతని కపూర్వపుష్ప సౌరభ్యముఁ ఘ్రాణతర్పణముగావించినది. దాని ననుసరించి మఱినాలు గడుగులు నడిచినంతఁ గొంత తెరపి గనంబడినది. అందొక దేవాలయము బంగారు రేకులచే గట్టఁ బడి సమున్నతప్రాకార మంటపాదులచే నొప్పుచు నతని హృదయమునకు వికాసము గలుగఁజేసినది. అంతకుమున్న తనకుఁ గనంబడిన కాంతిపుంజ మాగుడి పసిండికుండల దీప్తియని యతండు తెలిసికొనియెను. పెన్నిధింగన్న పేదయుంబోలెఁ దద్దర్శనంబు తపఃఫలంబుగా దలంచుచుఁ బరదేవత ప్రత్యక్షమైనట్లు సంతసించుచుఁ త్రిదివసోప వాసపక్లేశ మంతయు నటమటమై పోవ నాకోవెల సమీపమున కరిగి ప్రదక్షిణపూర్వకముగాఁ బ్రహరిచుట్టు తిరిగి తూర్పుముఖముగానున్న సింహద్వారముకడకు వచ్చెను. అందుఁ బెద్ద గోపుర మొప్పుచున్నది. దాని గోడలయందు శక్తివిగ్రములు వ్రాయంబడియున్న వి. తలుపులు మూయఁబడి యుండుటచే లోపలికిఁ బోవుట యెట్లోకో యని యాలోచించుచు నతండు గంటల కవాటములు పట్టి త్రోసినంతలోప లిగడియ వేయఁబడనవగుటఁ దటాలునఁ దెరువఁబడినవి.

తన యదృష్టము ఫలించినదని ముఱియుచు నతం డల్లనలోపలనడుగు పెట్టెను. లోపలి యావరణము విశాలముగా నున్నది. గడ్డిమొలవక పుష్పలతలు పెక్కులు నాటఁబడియున్నవి. ఈశాన్య భాగమువ కళ్యాణమంటపము నాగ్నేయమునఁ జిన్నతటాకము ముందు బంగారు సింహ ధ్వజస్తంభము నొప్పుచున్నవి. ఆలయమంత పెద్దది గాకున్నను పైడిరేకులపై నగిషీపని విశేషముగాఁ జేయఁబడి స్థాపింపఁ బడుటచేఁ గన్నులకు మిఱుమిట్లు గొలుపుచున్నది. ముఖమంటపము స్పటికశిలలచేఁ గట్టబడి మెఱయుచున్నది. ద్వారశాఖలయందు ద్వారపాలికా విగ్రహములు స్పటిక శిలలచేతనే చేయఁబడియున్నవి. వాని గుప్పిళ్ళలోఁ దళతళలాడు నినుపకత్తు లునుపఁబడియున్నవి. తలుపులు మూయఁబడియుండుటచేలోపలిదేవతయెవ్వరో తెలిసికొసలేకపోయెను.

స్తంభముల మంటపములఁ గుడ్యములఁ దఱుచుగాఁ మూడు కన్నులుగల శక్తివిగ్రహములు వ్రాయఁబడియుండుట సింహధ్వజము గలిగియుండుట నరసి యతం డద్దేవళము దుర్గాలయమేమో యని యాలోచించుచుండెను.

అప్పుడు సూర్యాస్తమయమగుచున్నది. ఏది యెట్లైననేమి చీకటిపడకమున్ను తటాకములో స్నానముజేసి జలంబులఁ గ్రోలుట లెస్సయని తలంచి తిన్నగాఁ దటాకముకడ కరిగి సోపానములు క్రొత్తగాఁ గట్టఁబడినట్లొప్పుచుండుటకు విస్మయమందుచు నింద్రనీలచ్ఛాయాసదృశంబులై పుష్ప వాసనా వాసితములగు తజ్జలంబులమునింగి యవగాహనస్నానము గావించి వార్చి యమృతమును దిరస్కరించుఁ బానీయమును గడుపునిండ గ్రోలెను.

దానంజేసి పంచభక్ష్యపరమాన్నములు భుజించునట్లుగాఁ దృప్తిగలిగి యాకలియంతయు నడంగి యతని కుత్కృష్టమైన బలము గలిగినది. అందులకు వెరగంది యతండాత్మగతంబున నిట్లు తలంచెను. ఇది దేవభూమివలెఁ దోచుచున్నది. మనుష్యసంచారము లేకున్నను యెవ్వరోపచ్చి పుష్పలతలకు నీరుపోసినట్లు వేదికలలికి మ్రుగ్గులుపెట్టు చున్నట్లు మంటపములు తుడుచుచున్నట్లు కనంబడుచున్నవి. ఇందలి పూవుల వాసనలు భూలోకవిలక్షణముగానున్నవి. నేనిదివఱ కిట్టి తావి యాఘ్రాణించియుండలేదు. ఈతటాకము మానససరోవరము కాదుగద. ఇందలిజలంబు లమృతముకన్న రుచికలవగుటయేకాక క్రోలినంత నాకలియడంచి మిక్కిలి బలముగలిగించినవి. గర్భాలయకవాటములుగూడఁ దీయ శక్యమయ్యెనేని లోపలి దేవతదర్శనము జేసి కృతార్థుండ నయ్యెదంగాక. అప్పుడే చీఁకటులు దెసల వ్యాపించుచున్నవి. ఇంచుక వెలుఁగు కలిగియుండఁగనే దేవతం బరికింపందగునని నిశ్చయించి యటఁ గదలి దేవళముమంటపములోనికిం జనునప్పటికి

ద్వారశాఖలం జెక్కఁబడియున్న హారతివిగ్రహముల చేతిలోనున్న పైడిపాత్రలయందలి రత్నములు దీపములవలె మెఱయుచు వెలుఁగు గలుగఁజేసినవి. అతండావింత జూచి యోహో! ఈదీపముల నెవ్వరు వెలిగించిరి? ఇందెవ్వరు వచ్చినజూడఁ గనంబడలేదే అని యాశ్చర్యమందుచు విమర్శించి చూచుచు నందు వత్తిగాని చమురుగాని లేకుండుట నవి మణిదీపములని తెలిసికొని మఱియు వింతవడుచుఁ దత్కవాటములు బిగ్గరగా నొక్కి త్రోసెను. తటాలున విడిపోయినవి. మణి దీపములచేఁ బట్టపగలుగా నొప్పుచున్న యాగర్భాలయములో దివ్య తేజంబునం బ్రకాశించు దేవీవిగ్రహ మతనికన్నులకు మిఱుమిట్లు గొలిపినది. అతం డద్దేవతాస్వరూపచిహ్నముల పరిశీలించుచు,

శ్లో॥ ముక్తావిద్రుమహేమ నీలధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణై
     ర్యుక్తామిందునిబద్ధ రత్న మకుటాంతత్వార్ధవర్ణాత్మికాం
     గాయత్రీం వరదాభయాంకుశకశాశ్ళుభ్రంకపాలంగదాం
     శంఖంచక్రమధారవిందయుగళం హశ్తైర్వహంతీంభజె.

సీ. మూడుకన్నులుగల్గు మోములైదు సితాది
               పంచవర్ణముల దీపించుచుండ
    బాలేందుచేఁ గట్టఁబడి పొల్పెనగు రత్న
               పుం గిరీటము మస్తమున వెలుంగ
    శంఖచక్రగదాది సాధనాబ్జంబులె
               న్మిదికరంబులను నెన్మిదియు మెఱయ
    నొకచేయి వరముల నొసగు చిహ్నముదెల్ప
               నభయప్రదత్వ మన్యమువచింప

గీ. గరిమ తత్వార్ధవర్ణాత్మికత నెసంగి
    కళల బ్రహ్మాండముల వెలుఁగంగఁజేయఁ
    జాలుదేవత యమ్నాయసమితిఁ గన్న
    తల్లి గాయత్రి విప్రసంతతుల సురభి,

అద్దేవతను సకలబ్రహ్మాండనాయకురాలగు గాయత్రిమహాదేవిగాఁదెలిసి కొనియతం డానందపరవశుండై చేతులు జోడించి యిట్లుస్తుతియించెను.

గీ. జపముజేయకయున్నను జనని యధిక
   మహిమ నీమంత్ర ముపదేశమాత్రముననె
   బాడబుల కిచ్చుచుందు బ్రాహ్మణ్యమీవు
   ద్విజులపాలిఁటి వేలుపు ధేనువవుగా.

క. నీ నిజరూపముగనిన, ట్లే నేనెద ముఱయుచుంటి నిపుడంబా! నీ
   ధ్యానముసేయఁగనుంటిమ,హానందమునాకుగూర్పవాదయతోడన్ .

గీ. పాసె నంబుధినీదు నాయాసమెల్ల
    నడఁగె నుపవాసములు సేసినట్టి యార్తి
    సడలె భ్రాతృవియోగసంజాతభేద
    మంబ ! నీమూర్తినిజూచినయంత నాకు

తల్లీ! నేనాపత్సముద్రంబున మునుంగుచుశ్రీవల్లభునిధ్యానింపఁబూనిన నానోటినుండి యప్రయత్నముగా భవదీయస్తుతి వచనంబులు వెలువడిన వీ వస్మధభీష్టదేవత వగుట నామొర నాలించి నన్నట్టె గట్టునంబారవైచి యిందుఁ బ్రత్యక్షంబై నన్నుఁ గృతార్థుంజేయఁబూనితివి. అంబా! నీదయకు మేఱయున్నదా ! అని యనేకప్రకారంబుల స్తుతి యించుచుఁ దత్పాదపీఠంబునఁ బూజింపబడియున్న వింత లతాంతంబులం జూచి యాయద్భుత సౌరభ్యంబు తత్కుసుమ సంజాతంబని యెఱింగి యాపూవులు వాడక యప్పుడేకోసి పూజించినట్లుండుట కాశ్చర్యపడుచు నవి కల్పతరుప్రసూనములేమో యని యాలోచించుచుఁ దత్పాదపీఠమున సాష్టాంగనమస్కారము గావించి యాపుష్పంబుల నెత్తి విమర్శించుచుఁ బరిమళము వెదజల్లుచుండఁ గ్రమ్మఱ నామహాదేవీ నామంబు లుచ్చరించుచుఁ బూజించి మఱియుమఱియు వినుతించుచు భక్తివివశుండై యా రాజకుమారుండు పెద్దతడ వాగర్భాలయుములోనే వసించెను. కొంతసేపుండి వెలుపలకు వచ్చి ముఖమంటపంబునందలి మణిదీపములు పండువెన్నెలలుగాయ నిండువేడుకతో నాలోకింపుచుఁ గొంతతడ వందు విశ్రమించి తరువాత వినోదముగా గుడియావరణములో దిరుగఁజొచ్చెను. కౌముదీ సముదయంబుదెసలసమముగా నెఱజిమ్ముచుఁ గల్పితరుప్రసూనవాసనాచోరకములగు సమీరకి శోరములుమేనికి హాయిసేయ ఱెండుగడియ లాగుడిచుట్టును దిరిగితిరిగి యానందపరవశుండగుచు స్ఫటిక శిలాఘటితంబగు ముఖమండపపు మొదటి సోపానమునఁగూరుచుండితన రాకనుగుఱించి యిట్లువిత్కరించెను. నేను దాళధ్వజుని కుమారుండఁగదా! మేమేవుర మన్నదమ్ములము పశ్చిమ దిగ్విజయము సేయఁ బయలుదేరినమాట వాస్తవమే? యుమాపురంబున శ్రీధరునిం జయించి యతనికూఁతుం గమలాదేవిని మాయన్న శ్రీముఖుఁడు బెండ్లియాడినమాట యబద్ధముకాదు గదా? తరువాత క్రోధనునిం జయింప నోడలెక్కి మేమునలువురము సముద్రములోఁ బ్రయాణముసేసినపని యదార్ధముగానే తోచుచున్నది. సంద్రములోఁ గని తగిలి యోడ మునుఁగుటయు నిక్కువమే. అక్కడి నుండి జరిగినచర్య యంతయు నిజముకాదు. స్వప్నమనుకొనియెదను. ఆ! ఏమి! ఒకవేళ మొదటినుండి జరిగిన చర్యలన్నియు స్వప్నోపలబ్ధము లేమో! అన్నియుంగావు తెలిసినది. నేను సముద్రములోఁబడి మృతి నొందితిని. 'యాం తెమతిస్సాగతి!.' అను నార్యోక్తి ననుసరించి నా బుద్ధి యప్పుడు నాయభీష్ట దేవతయగు గాయత్రీమహాదేవిపై వ్యాపించుటంజేసి యిట్టి వినోదములన్నియు నాకుఁ గనంబడుచున్నవి. ఇదియే తథ్యము. నేను సమసి గాయత్రీ సాయుజ్యము నొందితిని. ఇఁకనాకుఁ బునర్భవదుఃఖములేదు. ఇదినాకు సాలోక్యముక్తియని తలంచెదను. ఇఁకఁ గర్తవ్యమేమి యున్నది. ఆకోనేఱులో స్నానముజేసి యాపుష్పములచే నిత్యము గాయత్రీదేవింబూజించుచుఁ గాలక్షేపముజేసెదం గాకయని యాలోచించుచుఁ గూర్చుండియే కునుకుపాట్లుపడఁజొచ్చెను.

నిశ్శబ్దముగానున్న యాసమయంబున నాకశమునుండి యెవ్వరో యక్కడికివచ్చుచు మాట్లాడికొనుచున్న సందడివినంబడినది. ఆరొద విని యతండదరిపడిలేచి నలుమూలలు పరికించెను. ఆధ్వని యాకాశముమీఁదుగా వచ్చుచున్నట్లు తెలిసికొని బయలకుఁ బోయి తల యెత్తి చూచెను. ఆకసమునుండి యెవ్వరో క్రిందికి దిగుచున్నట్లు తెలియబడినది. తద్ధారితములగు రత్నమండపములఁ బ్రతిఫలించి నక్షత్రపుంజములవలె మెఱయుచున్న వెన్నెల తళ్కు లతని కన్నులకు మిఱిమిట్లు గొల్పినవి. వారు దాపునకు వచ్చినకొలంది వారిమాటలు కొంచెము తేటగా వినంబడఁ జొచ్చినవి. వారిభాష సంస్కృతముగా గ్రహించి వారు గీర్వాణులని నిశ్చయించి యతండు విస్మయ సంతోషములతోఁ దదర్చకులు వారేయని తలంచి వారిచర్యలు బరీక్షించు తలంపుతో నందొక గూటిలో నొదిగి చూచుచుండెను.

అంతలో నతని కపూర్వ సౌరభ్యము నాసావర్వము గావించినది. గుడిలో నమ్మవారింబూజించిన పూవుల తావియు నాతావియు నొక్కటిగాఁ దెలిసికొని వారే తదర్చకులని నిశ్చయించి పంచేంద్రియ వ్యాపారములు నేత్రముల యందే వ్యాపింపఁజేసెను.

అప్పుడు నలువురు దేవకాంతలు దివ్య భూషాంబర ధారిణులై వికసితారవింద గంధంబులఁ బరిహసించుమేని తావులు నలుమూలల ఘుమఘుమాయమానంబులై వ్యాపింప నల్లన నాకసమునుండి యా తటాకము తూరుపు తటంబున డిగి కట్టు పుట్టంబులు విప్పి గట్టునంబెట్టి వింతమాట లాడుకొనుచుఁ గొంతసేపు జల క్రీడలుగావించిరి.

అప్పుడు విక్రముఁడు వారింజూచి యౌరా! యీ నారీరత్నములు సురాంగనలు కావలయును, నిత్యమువచ్చి కల్పపాదపప్రసూనములచే నిమ్మహాదేవి నర్చించుచుందురు కాఁబోలు దివ్యకాంతా దర్శనంబునంజేసి నేను ధన్యుండనైతి. మత్పూర్వకృత సుకృత విశేషంబునంజేసి వీరు నాతోమాటాడి రేని నావంటి సుకృతి యెందును లేడని చెప్పఁ గలను. నాకట్టి భాగ్యము పట్టునా? సరిసరి నేను గ్రమ్మఱ మోహమందు చుంటినేల. ఇదంతయుసత్యమనుకొనుచునిట్టియూహబొందుచున్నాను.

మిధ్యావ్యాప్తికిఁ గృతకసంకల్పముతోఁ బనిలేదు. స్వప్నభ్రాంతి యెంతవఱకుఁబోవునో చూచెదంగాక. ఆదేవకాంతలు తీర్థములాడి యీగుడిలోనికివచ్చి యమ్మవారి నర్చింతురుగదా? అప్పటి వీరి కృత్యములు పరీక్షించెదనని తలంచి యప్పుడే గర్భాలయములోనికిఁ బోయిఅమ్మవారివెనుక పాదపీఠముక్రిందనణఁగిపండుకొని చూచుచుండెను

అంతలో నా కాంతారత్నములు జలకమాడి పుట్టంబులంగట్టికొని గుడిచుట్టును ముమ్మారు ప్రదక్షిణములుసేసి మోడ్పు చేతులతో నాలయములోఁ బ్రవేశించి సాష్టాంగ నమస్కారములు గావించి లేచి శ్రేణిగా నిలువంబడి మనోహర స్వరగీతంబుల నమ్మహాదేవినిట్లుస్తుతియించిరి.

మాలిని. జయజయ సురమస్త స్థాన విన్యస్త భూషా
           చయ మణినిక రోస్ర స్ఫారభాస్వత్పదాబ్జె
           జయజయ శ్రుతి మాతః సర్వలోకైకపూజ్యె
           జయజయ నిజభక్త స్తావకాసక్త చిత్తె॥

     శ్లో॥ బ్రహ్మాసి వాంఛతి తధైవ హరో హరశ్చ
          సేంద్రాః సురాశ్చ మునయో విదితార్థతత్వాః
          యద్దర్శనం జనని తేద్యసదా దురాపం
          ప్రాప్తం వినా శమదమాదిభి రంబ సత్యం.

ధ్యానానంతరమున నత్తరుణులు నలువురు తత్పాద పీఠము మ్రోల శ్రేణిగాఁ గూర్చుండి నిర్మాల్యంబు తబ్బిబ్బగుటకు శంకించు జొనుచుఁ గాలిచే నట్లైనదని సమాధాసపడిఁ క్రమంబున నమ్మహాదేవిని షోడశోపచారములచేఁ బూజించి మంగళ గీతంబులంబాడి లేచి నిలువంబడి చేతులు జోడించి యిట్లు ప్రార్థించిరి.

సీ. ప్రతిశుక్రవారంబు రాత్రియిం దరుదెంచి
            యతిభ క్తి జాగరవ్రతముసలిపి
    గురునాజ్ఞ నాఱువత్సరములనుండి ని
            న్నర్చించుచుంటిమో యంబమేము
    రాఁబోవు శుక్రవారముతోడ వ్రతము పూ
            ర్ణంబగు మాయభీష్టము నెటుల
    తీర్చుదానవొ? మహాదేవి! గాయత్రి! ని
           న్నే నమ్మియుంటిమో నిగమజనని

గీ. నాకముననో తలంప భూలోకముననో
    నాగలోకంబుననొ దేవ నర ఫణాధ
    రులకులంబులనో బ్రాహ్మణులనొ క్షత్రి
    యులనొ యెటువంటి పతులసేయుదువొ మాకు.

అని ప్రార్థించి యించుబోఁడులు నలువురు మబ్బు వెల్వడిన మెఱుఁగుఁ దీగియలభాతి నాగర్భాలయము వెడలి ముఖమంటపము మ్రోలనున్న స్ఫటికశిలావేదికం గూర్చుండి యిట్లు ముచ్చటించుకొనిరి.

ఇంద్రుని కూఁతురు మధుమతి — గంధవతీ! మన యాచార్యుండు సెప్పిన విధానంబున నాఱు సంవత్సరములనుండి యీజగన్మాత నారాధించుచుంటిమిగదా. ఱేపు రాఁబోవు శుక్రవారముతో వ్రతము పూర్తికాఁగలదు. నాఁటి దివసంబు రాత్రి మనయభీష్టము లీయవలసినదియేకదా. మనమిప్పుడే మనకోరికలు నివేదించినచో నాఁటికవి సిద్ధముజేసి యుంచఁగలదు. నీకెట్టి భర్తగావలయో చెప్పుము. భర్తలకన్న మనకుఁ గోరఁతగు వస్తువేమి యున్నది?

యమునికూఁతురు గంధవతి — నవ్వుచు సఖీ! అమ్మవారు మనకుఁ బ్రత్యక్షమై యేమికావలయునని యడిగినప్పుడుగదా కోరికలు దెల్పుట. ఏమియు లేనిదే కోరమనియెద వేలా?

మ — సరి సరి. ఈమె ప్రభావము నీ వెఱుంగవా ! మహర్షులకుఁ గూడ నీమె ప్రత్యక్షముకాదు. ఆరాధించినవారి కోరికలు మాత్రము తీర్చుచుండును.

వరుణునికూఁతురు వారుణి - గంధవతీ ! మన యాచార్యుండు మొదటనే యామాట జెప్పియున్నాడు. నీవు మఱచిపోయితివి.

కుఁబేరునికూఁతురు చంద్రకళ - సఖీ! గంధవతీ! మేము నీకంటె జిన్నవారముగదా. నీయభిలాష ముందుగాఁ దెలిపితివేని తరువాత మాకోరికలు వక్కాణింతుము. గంధ — అవును. చంద్రకళ చెప్పినట్లు మధుమతిచేతనే మొదట నామాట పలికింపవలయును.

మధు - నాకోరికవిని యత్యాశాపరురాలని మీరు పరిహాసమాడుదురేమో యైనం జెప్పెద వినుండు.

శ్లో. మహాకులీనత్వముదారతాచ తథా మహాభాగ్యవిదగ్ధభావౌ
    తేజస్వితా ధార్మికతోజ్వలత్వ మమీగణాజాగ్రతి నాయకస్య.

గొప్పవంశమున జనింపవలయు లోకాతీత సౌందర్యశాలి కావలయుఁ గృత్యవస్తువులయందుఁ జాతుర్య ముండవలయుఁ ధర్మైకాయత్త చిత్తుండు, సర్వసర్వంసహైశ్వర్యయుక్తుండు జగత్ప్రకాశకుఁడు నగునట్టి వాని నాకు భర్తగాఁ జేయుమని నేనమ్మవారిం బ్రార్థించుచున్నాను.

గంధ — బాగు బాగు. ఇంకేమి? నీవు ధీరోదాత్తునే గోరితివి. నేనుమాత్రము సామాన్యునిఁ గోరుదునా? నాయభిలాష వినుము.

శ్లో. కీర్తిప్రతాపసంపన్నః పుమర్ధత్రయతత్పరః
    ధురంధరత్వగుణవాన్ నాయకః పరికీర్తితః.

మధుమతి కోరిన గుణములుండి కీర్తిప్రతాపములచే నొప్పుచుఁ బురుషార్ధములయం దిష్టము గలిగి ధురంధరుండై యొప్పువాని నాకు నాయకునిగాఁ జేయుమని యమ్మవారిం బ్రార్ధించుచున్నాను.

మ - ధీరోద్ధతుం గోరితివి. నీయభిలాషమాత్రము తక్కువగా నున్నదియా! కానిమ్ము, వారుణీ! నీయభిలాషఁగూడ వివరింపుము.

వా - మీయిరువురు గోరిన పురుషునిగుణములన్నియుఁ గలిగిన ధీరలలితుం బతిగాఁ జేయుమని గాయత్రీదేవిం గోరుచున్నాను.

మ - బలే బాగు. మంచికోరిక కోరితివి.

శ్లో. సధీరలలితో నేతా నిశ్చింతో భోగలంపటః.

అనుటచే నతండు భోగలంపటుఁడై యుండుగావున వారుణి నొడిలోఁ బెట్టుకొని కూర్చుండఁగలఁదు. చంద్రకళా ! నీమనోరథము గూడ వెల్లడింపుము. ధీరశాంతునిమాత్రము గోరకేమి ?

చంద్ర - నాకు వేరొకకోరిక లేదు. నాయకలక్షణములు దెలియవు మీరు మువ్వురుగోరిన గుణములన్నియుఁ సంపూర్ణముఁగా నున్న పురుషుని నామనోహరుంగాఁ జేయుటకు నమ్మవారి కనేక వందనము లాచరింపుచున్నాను.

మ - అమ్మనేచెల్ల చెల్లీ! మంచి గడుసుదానవు. ధీరోదాత్త ధీరోద్ధత ధీరలలితుల మువ్వుర గుణములు నీభర్తయం దుండవలయు నేమి? సెబాసు. మాభర్తలకన్న నీభర్తయే యుత్తముఁడైయుండును. కానిండు. సంతోషమే, మఱియొక్కటి చెప్పవలసియున్నది. మన నాయకు లేలోకమువారుగ నుండవలయునో నిరూపించుకొనవలసి యున్నది. దేవతలా? మనుష్యులా? పన్నగులా!

చంద్రకళ - సరి సరి. మనము దేవతలమైయుండ మనభర్తలు మనుష్యులు పన్నగులు నెట్లగుదురు. అట్టిప్రశ్నకే యవకాశములేదే.

మధుమతి - మనుష్యుల సామర్ధ్యము నీవేమి యెఱుంగుదువు? దేవతలకన్న నెక్కువ ప్రతిష్ఠగలవారు మనుష్యులలో ననేకులున్నారు. మన యూర్వశి దేవతల విడిచిపురూరవుని వరించినకథనీ వెఱుంగుదువా?

చంద్ర -- అట్టివా రున్నను వా రల్పాయువులుగారా సఖీ !

మధు — దేవసంపర్కము గలిగినప్పుడు వారు దీర్ఘాయువులే యగుచున్నారు.

వారుణి -- అక్కా! మనష్యు లొకపోలికగా నుందురుగాని పాములకుఁ జక్కఁదన మేమియుండును ?

మధు - ఇదియా మీసందియము. ఇందులకు నేనొక చక్కని కథ జెప్పెద మీరందఱు సావకాశముగా నాకర్ణింపుఁడు. మీసందియము తీరఁగలదు అని మధుమతి చెప్పుచున్నది. అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ యవ్వలి నెలవున నిట్లు చెప్పందొడంగెను.

________

234 వ మజిలీ.

గుణకేశినికథ.

చెలులారా! వినుండు. మాతండ్రి మహేంద్రుని సారధి మాతలి పేరు మీరు వినియుందురు. అతనికి లేక లేక చిరకాలమునకు గుణకేశిని యను కూతురు పుట్టినది. ఆబాలికామణిసౌందర్య మిట్టిదని వర్ణింప శేషునికైన శక్యముకాదఁట. త్రిభువనాశ్చర్యకరమగు చక్కఁదనంబుననొప్పునక్కన్యకామణికి వివాహముజేయ నిశ్చయించి మాతలి భార్యతో నాలోచించి వరాన్వేషమునిమిత్తము మాతండ్రి వలన సెలవుబొంది తొలుత స్వర్గపట్టణమంతయుం దిరిగి సురగరు డోరగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ కిన్నర కింపురుషాది దేవతా నగర విశేషములఁ బరికించి రూపయౌవనవిద్యామదగర్వితులగు వారి వారి కొమరులం జూచి తనకూఁతునకుఁ దగినవారు కారని నిశ్చయించి తిరుగా నింటికివచ్చి భార్య కత్తెఱం గెఱింగించెను.

అతనిభార్య మనోహరా ! మీతో మొదటనే చెప్పవలయునని తలంచితిని. చక్కఁదనముమాట యటుండనిండు, దేవజాతియం దొక లోపమున్నది. క్రొత్తసంతతి గలుగదు. ఎప్పుడు నొక్క పోలిక వారే యుందురు. నూత్నయౌవనముగల సౌందర్యవంతులు మందున కైనఁ గానరాదు. ఎప్పుడును ప్రాఁతబొందలే కావున మన గుణకేశినికి వేల్పులు పనికిరారు. భూలోకంబున కరిగి యభినవయౌవనమునం బ్రకాశించు రాజకుమారులఁ బరిశీలించి తగినవాడున్నఁ దీసికొనిరండని నియమించినది.