కాశీమజిలీకథలు/పదవ భాగము/232వ మజిలీ

నచో నందున్న యాఁడువారి కాఁడువారువలెఁ గనంబడున ట్లెవ్వరో వరమిచ్చిరని చెప్పితిరి. అట్లె జరిగినది. లెస్సయే కాని తరువాత విద్యాసాగరుని కుమారుని జాతకర్మాద్యుత్సవంబుల కనేకులు మగవారు వచ్చినట్లుగాఁ జెప్పియుంటిరి. వారందఱు నందలివారికి మగవారుగనే కనంబడినట్లు చెప్పియున్నారు. మొదటినియమ మేటికిమారినది? యీసందియము తీర్పుఁడని యడిగిన నవ్వుచు గురుఁడు వత్సా! గట్టి శంకలే చేయుచుంటివి. ఔను. ఆమాట నడుగఁదగినదే. మొదట వరమిచ్చిన సిద్ధుఁడు ప్రమద్వరరక్షణకై యట్లు వరమిచ్చెను. వివాహము వఱకే యానేమము చెల్లునని యాసిద్ధుం డానతియిచ్చియున్నాఁడు దానంజేసి జాతకర్మోత్సవంబున నావ్యత్యయము లేక యధాప్రకారమే జరిగినదని చెప్పి శిష్యునితోఁగూడ నవ్వలిమజిలీ చేరిరి.

అందుఁ జేరినదిమొదలు గోపాలుఁడు స్వామీ! నారదమహర్షి చరిత్రము గొడవగానుండుననుకొంటి. వరప్రసాదుల కధకన్న నదృష్ట దీపుని కధకన్న విజయభాస్కరుని కధకన్న చాల మనోహరముగా నున్నది. పాపము నారదమహర్షి తా నాడుదియై పిల్లలఁగంటినని యెఱుంగఁడుగదా! అతండు తిరుగా మహర్షియై యేమిచేసెనో వినవలయును. అతని తరువాతిపుత్రుల వృత్తాంతము జెప్పుఁడని ప్రార్థించిన సంతసించుచు శిష్యునకు గురుం డిట్లు చెప్పందొడంగెను.

__________

232 వ మజిలీ.

పశ్చిమ దిగ్విజయము.

శ్రీముఖుఁడు విజయుఁడు విక్రముఁడు చిత్రభానుఁడు. నలుఁడు వీ రేవురు తాళధ్వజుని కుమారులు. సులోచనుని తరువాతివారు. ఉత్తరదిగ్విజయము సేయ నరిగిన యన్నలు రాకమున్న వీరు తలిదం డ్రులకుఁ జెప్పకయే పశ్చిమదిగ్విజయముసేయఁ బయలుదేరి కంకణ టెంకణసౌరాష్ట్రాదిదేశముల కరిగి యందలిభూపతులచేఁ బూజింపబడుచుఁ బుణ్యతీర్థంబుల సేవించుచు గొన్నిదినములుదేశాటనము గావించిరి.

మహారాష్ట్ర దేశాధిపతి శ్రీధరుండను మహారాజు తనకూఁతురు కమలావతికి స్వయంవర మహోత్సవము చాటించుటయు నయ్యుత్సవమునకుఁ బేరుపొందిన రాజకుమారులు చతురంగ బలములతోఁ డద్రాజధానియగు నుమాపురంబున కరుగుచుండిరి. అవ్వార్త విని తాళధ్వజునిపుత్రు లేవురు ప్రహర్షాతిశయముతో నవ్వింతజూడఁ గతిపయప్రయాణంబుల నన్నగరమున కరిగిరి.

రాజశాసనప్రకార మానగరము చేరినవారినెల్ల గౌరవింపుచు దగిన విడిదలం బ్రవేశపెట్టి వారివారి కులశీల నామాదులం దెలిసికొని నృపతికిందెలియఁజేయుచుండును. శ్రీముఖాదులంగూడసత్కరించి మంచి సౌధంబున బ్రవేశపెట్టి వారిపేరులు బిరుదములు గ్రామము కులము వ్రాసికొనిపోయిరి.

ప్రఖ్యాత విద్యాసౌందర్యవిభవాభిరామలగు వామలకుఁగాని స్వయంవరము చాటీంపరు. కన్యకకుఁ దగిన వరు నరయ తిరిగితిరిగి విసిగి యనురూపం బడయజాలక శ్రీధరుం డారమణీమణికి స్వయంవరవిధి నిరూపించెను. ఆరాజు పూర్వాచారపరాయణుఁడు. ధర్మశీలుఁడు బలశాలి, విద్యాధన గర్వితుఁడు. ఆయుత్సవమునకు వచ్చిన రాజపుత్రుల చారిత్రములఁ దెలిసికొని యనుకూల సాంప్రదాయ విద్యాబలశీల సంపన్నులని నమ్మకముదోచిన వారినిం దప్ప నితరుల నాయుత్సవమునకు రానిచ్చుటలేదు.

అట్టివారిం బెక్కండ్ర నిషేధింపుచుండెను. వారితోఁ జేర్చి తాళధ్వజుని పుత్రులగూడ నాసభకు వచ్చుట కంగీకరింపక వారికిట్లు ప్రత్యుత్తరము వ్రాసిపంపెను. రాజపుత్రులారా ! మీరాజ్య మే మూల నున్నదియో మాకుఁ దెలియదు. మీకులశీల నామాదులు మాకంతగా నచ్చినవికావు. మీకాహ్వాసపత్రికలు మేము పంపియుండలేదు. నాకూఁతుం బ్రరిగ్రహించుటకు మీరర్హులుకారని నాకుఁ దోచినది. మీరిందువచ్చినందులకు మాకుఁదోచిన కనకాంబర వస్తు విశేషములిందుతోఁ బంపితిమి. వీనిం గైకొని మీరు మీగ్రామంబున కరుగవచ్చును. ఇట్లువ్రాసినందులకు మాపైఁ గినియకుందురుగాక!

అనియున్న పత్రికం జదివికొని వారేవురు నౌరా ! యీరాజునకెంత పొగరున్నది ? మన కులశీలాదులు తనకు నచ్చలేదఁట. తమ పిల్లను జేసికొనుటకు మనమర్హులము కామఁట. ఏమి ? యీగర్వము ! ఏమి యీస్వాతిశయము ! రాజులు స్వయంవరము చాటింపరో! రాజకుమారులు పోవరో ! తనకుమార్తె కిష్టములేకున్న వరింపక పోవచ్చుంగాని యిట్లు సభకే రాఁగూడదని నిషేధించుట యెందును జూచి యెఱుంగము. మమ్మేకాక యిట్లు పెక్కండ్ర నిరాకరించినట్లు తెలియుచున్నది. రాజవంశసంజాతున కింతకన్న యవమానము మఱి యొకటి కలదా ! ఇట్లు చేయుట తప్పని యప్పతిం బట్టికొని కాలిక్రిందఁ ద్రొక్కి పెట్టి యడుగుదుముగాక. అని రౌద్రావేశముతోఁ సర్పములవలె బుసకొట్టుచు వారూహించుకొను చుండిరి.

అట్లు నిరాకరింపఁబడిన రాజపుత్రుల పెక్కండ్రు శ్రీధరుని బలాధిక్యమునకుఁ వెఱచి తామేమీయుఁ జేయఁజాలక సిగ్గుతో నొకరితోనొకరు జెప్పికొనక తమ తమ నగరములకుఁ బోయిరి. మఱి నాలుగు దివసములకు స్వయంవర సభ జరిగినది. ప్రఖ్యాతసంపత్కుల విద్యా యౌవనబలగర్వితులగు రాజపుత్రులెల్ల నాసభ నలంకరించిరి. అప్పుడు కమలాదేవి కమలాదేవివలె నొప్పుచుఁ బుష్పదామంబు చేతంబూని సఖినివేదితములగు రాజపుత్రుల చరిత్రము లాకర్ణింపుచు నాసింహాసన శ్రేణీమధ్యమునుండి దేవదానవులనడుమ దిరిగెడి జగన్మోహినివలె మెల్లగాఁ దిరుగుచుండెను.

అట్టి సమయంబునఁ తాళధ్వజుని కొడుకు లేవురు వీర వేషములుదాల్చి గుఱ్ఱములెక్కి ఖడ్గంబులం ధరించి రౌద్రావేశముతోఁ జూపఱకు వెఱపుదోప నతిరయంబున నాసభామంటవద్వారంబున కరిగి యందు గుఱ్ఱంబుల డిగ్గనుఱికిరి.

శ్రీముఖుండు నలువురు తమ్ములు జుట్టును బరివేష్టించి నడువ ఖడ్గహస్తుఁడై లోవలఁ బ్రవేశింపఁ బోవుఁడు ద్వారపాలు రడ్డమువచ్చి భర్తృదారకులారా ! నమస్కారము. మీరిందుఁబోవుట కీయబడిన పత్రికలంజూపి పోవలయు. రాజశాసనమట్టిది. ఏవీ చూపుఁడని యడుగుచుండ పో, పొండు. మమ్మాటంకపరుప మీరెవ్వరని యదలించుచు వారిం ద్రోసికొని సభాభవనంబునం బ్రవేశించిరి. వారుకూర్చుండ దగిన పీఠంబు లెందున్నవని రాజుపురుషులు సభాంతరాళ ముపలక్షింపు చుండిరి. భయభ్రాంతస్వాంతులై రాజకుమారు లాలోకింపుచుండిరి. రండు. రండు. అందుఁగూర్చుండుఁడని పరిజును లాహ్వానింపుచుండిరి.

ఎవ్వరిమాట వినిపించుకొనక యెవ్వరిదెసం జూడక శ్రీముఖుఁడు తమ్ములతోఁగూడ సింహగమనంబునఁ దిన్నగా నారాజపుత్రికయున్న నెలవునకుఁజని యాజవ్వని విస్మయముతోఁ దన్నుపలక్షింపఁ బుండరీ కాక్షుండు రుక్మిణింబోలే నవలీల నాబాలికారత్నమును గుభాలునం సందిటం జిక్కబట్టి యొక్క పెట్టు సభాసదులు హాహాకార రవంబులుసేయ గీరాలున మఱలి చనుచుండెను.

అప్పు డడ్డువచ్చిన రాజభటులనెల్ల నతని తమ్ములు నలువురు కటారి ధారంబరిభవించుచుండ నేయాటంకము లేక శ్రీముఖుఁడు వడివడి నడచుచుఁ ద్వారముల దాటి ఘోటకములకడ కరిగి తన గుఱ్ఱముపై నెక్కించుకొని యక్కలికి భయభ్రాంతయై యొడ లెఱుంగక తడబడుచుండ నుపలాలించుచు దమ్ములు గుఱ్ఱములెక్కి చుట్టునుం బరివేష్టించి యడ్డు పెట్టినవారినెల్ల భల్లంబుల నేయుచుండ నతిరయంబున దమ నెలవునకుం దీసికొనిపోయి యంతర్భవనంబునం బ్రవేశపెట్టెను,

అరెరే! ఎంతమోసము జరిగినది. ఆక్షుద్రులు కన్యనెత్తుకొని పోవుచుండ నడ్డుపడ కూరక చూచుచుంటిమేల? అది మన కవమానముగాదా? అని రాజకుమారులెల్ల హల్లకల్లోలముగా రొదజేయుచు లేచి యాయుధంబులఁదాల్చి వాండ్రెందున్న వారోచూడుఁడు, పట్టుఁడు, కొట్టుడు. అని వీరాలాపము లాడుచు వీధిం బడిరి.

శ్రీధరుండును సెలవీయనిదే వాండ్ర లోపలి కేమిటికి రానిచ్చితిరని ద్వారపాలుర నిందించుచు నానీచులఁ బట్టి కట్టితెండని వీరభటుల నియోగించుచు నుత్సవభంగము గలిగినదని బంధువులతో విచారించుచు నావీరపురుషు లెవ్వరు? ఎట్టివారని మంత్రులతో నాలోచించుచు యుద్ధోన్ముఖులగు రాజపుత్రుల వలదని యనునయించుచుఁ బుత్రికావియోగదుఃఖితులగు నంతఃపురకాంతల నూరడింపఁదగిన వారిఁ బుచ్చుచు నేమిచేయుటకుఁ దోచక వారెందున్నవా రెక్కడికి దీసికొని పోయిరో తెలిసికొనిరండని కొందఱ వాఱువపు రౌతుల ననిపెను.

వాండ్రు పోయివచ్చి దేనా! వారాపల్లపువీధి సత్రముదాపున నున్న పెద్దమేడలో మనరాజపురుషులచేఁ బ్రవేశపెట్టబడినవారే. వారి నా స్వయంవరసభకు రావలదని మీరు నిషేధించినారఁట. భర్తృ దారిక నాయింటిలోఁ బ్రవేశపెట్టి వారేవురు గుఱ్ఱములెక్కి ద్వారమునఁ గాచికొనియుండిరి. ఇంతలో నీస్వయంవరమునకు వచ్చిన రాజకుమారులు దేవరపంపిన వీరభటులు పటకోపముతోఁ బోయి యా వీధి ముట్టడించి వారిపై , నాయుధములఁ బ్రయోగించుచుఁ బోరుగా వించుచున్నారు.

ఆవీరపురుషు లైదుగురు గుఱ్ఱముల జిత్రగమనంబుల నడిపించుచు సింహనాదములు సేయుచు నిర్వక్రపరాక్రమంబున విజృంభించి తమ్ముఁ జుట్టుకొనిన రాజకుమారవర్గంబు నెల్ల నిరర్గళ ప్రహారంబుల గొట్టియుఁ జుట్టియు నేసియు ద్రోసియుఁ బొడిచియు గెడపియు రెండు గడియలలో నామూకలనెల్లఁ జీకాకుఁబడఁజేసి పాండవులు కురుసేనను వలెఁ బీనుఁగపెంటలు గావించుచున్నారు. వీధులన్నియు మేదో రుధిర మాంసకర్దమములై చూడభయంకరముగానున్నవి. వారిముందర నిలిచెడి వీరుడెవ్వఁడును గసంబడఁడు. దేవర విచ్చేయవలయునని చెప్పినంత నమ్మహీకాంతుఁడు కవచంబుదొడిగి ఖడ్గాది సాధనంబులం దాల్చి పేరుగల వాఱువమెక్కి యొక్క,డుగులో నాసంగరరంగమునకుఁ బోయెను.

అప్పు డవ్వీరు లేవురు రాజపుత్రులం దరిమికొనిపోవుచు మా ర్మొగముబెట్టి పారిపోవుచున్న వారినుద్దేశించి సీ! సీ! మీబ్రతు కేల? ప్రాణముల కాసపడి శత్రువులకు వెన్నిచ్చి పాటుట యపఖ్యాతికాదా! నిలుఁడు. పోకుడు అని కేకలువైచుచు లేళ్ళగమిందఱుము పెద్దపులులవలె విజృంభించిపోవుటయుఁ దత్ప్రతాపవాతాహతి దూది పింజలవలె శత్రుసేనలు పలాయనము గావించినవి. అప్పుడు శ్రీధరుండు వారిం బురికొలుపుచు గుఱ్ఱముతో నావీరులయెదుటంబడి పోరుటయు శ్రీముఖుఁడు తనగుఱ్ఱము నతని గుఱ్ఱముమీఁదికి దోలి గదా దండంబున నతనిం గొట్టుటయు నావ్రేటు భరింపఁజాలక యతండు గుఱ్ఱమునుండి నేలఁబడియెను.

అభూపతిపాటు జూచి తద్బలంబులు హాహాకారమిళితముగా రోదనధ్వని వెలయఁజేసిరి. అతనిం గాపాడ దాపునకువచ్చు వీరభటులనెల్ల భల్లంబుల నాపి శ్రీముఖుండు దిగ్గున గుఱ్ఱము డిగ్గనుఱికి యతనిం బట్టికొని గుఱ్ఱముపై కెక్కించితన నెలవునకుం దీసికొనిపోయి నడివీధిని నిలువంబెట్టెను.

అతనికి తెలివివచ్చినది. ఱెక్కలు గట్టబడియున్నవి. యమాత్యాదివీరయోధులెల్ల వారి పరాక్రమమునకోడి దూరదూరముగా నిలిచి చూచుచుండిరి. అప్పుడు సిగ్గుపడి తలవంచికొనియున్న శ్రీధరుని చేయిపట్టుకొని శ్రీముఖుం డిట్లనియె.

చ. బలములు మేటిగుఱ్ఱములు భద్రగజంబులు లేవు శీలముం
    గులమును రాజ్యసంపద లగోచరముల్ ప్రభవం బదెట్టిదో
    తెలియ దనర్హులంచు మముఁ దేలికజేసి వచించి తా సభా
    స్థలి దరిజేరకుండ వసుధాధన ! జ్ఞాపకమున్న దే మదిన్.

చ. ఇపుడు గ్రహించినాఁడవె? మదీయపరాక్రమశీలవృత్తముల్
    నృపవర! యర్హులంచపుడు నీసభజేర్చిన రాజనందనుల్
    త్రపయొకయింతలే కనుఁ బరాజ్ముఖులై చనిరేమి? నీప్రతా
    పపువిభవంబువోవ నిటు పట్టువడం బనియేమి? చెప్పుమా?

క. పోలఁగ నీవెంతటి బల
   శాలివొ యని తలఁతు మొక్కక్షణమనిసేయం
   జాలితివి కా విదేమి నృ
   పాలా ! యీమాత్రమున కే పలికితివటు మేల్ .

క. నీకూఁతుం గైకొనఁగా
   మాకర్హ తగలదె తెల్పుమా యిపుడైనం
   గాకున్న విడిచివైతుము
   భూకంతా ! యనుడు సిగ్గుఁబొందుచు నతఁడున్ .

తలవంచుకొని మహాత్ములారా! మాచరిత్రము తెలియక కేవలము పత్రికలో వ్రాసినవిషయంబులం జదివికొని చులకనగాఁ జూచి యట్లాజ్ఞాపించితిని. నన్ను మన్నింపవలయు. మీరుత్రిలోకైకవీరులు.. మాపుణ్యవశంబుననిందు వచ్చితిరి. అయత్నోపలబద్ధముగా మీతో మాకు సంబంధము గలిగినది. మేము ధన్యులము. మీరు నన్ను జయించితిరని యించుకయు విచారములేదు. సంతోషమే కలుగు చున్నది. మాకమలాదేవి రాక్షసవివాహంబున మీచే స్వీకరింపబడి నది. రక్షింపుఁడు రక్షింపుఁడని ప్రార్థించెను.

శ్రీముఖుండతని దీనాలాపములు విని జాలిపడి కట్టులు విప్పి గౌరవించుచు లోపలికిఁ దీసికొనిపోయి యతని కొమార్తెం జూపించెను. కమలాదేవి తండ్రింజూచి సంభ్రమముతో నానందాశ్రువులు గ్రమ్మఁ దన నిర్భంధముగుఱించి పరితపించుటయు నతండు ఆమ్మా! వీరు మిక్కిలి బలశాలులు. వీరివృత్తాంతము దెలియక మొదట నిరాకరించితిని. అదియే మన కుపకారమైనది. శ్రీకృష్ణుండు రుక్మిణినిం బోలే వీరిలో శ్రీముఖుఁడు నిన్నెత్తికొనివచ్చెను. నీయదృష్టము ఫలించినది. నీవు విచారింపవలసిన పనిలేదు. దివ్యరూపసంపన్నుండు పరాక్రమశాలి భర్త నీకు లభించెనని యోదార్చుచు వారియానతి పడసి యప్పడఁతి నప్పుడే యందలముపై నెక్కించి కోటలోనికిం దీసికొనిపోయెను. పిమ్మట వారినెల్ల నేనుఁగుల నెక్కించి మంచివిడిదలలోఁ బ్రవేశపెట్టించెను.

శ్రీధరుఁడు శుభముహూర్తంబునఁ గమలాదేవిని శ్రీముఖునికిచ్చి వివాహము గావించెను. అమ్మహోత్సవమునకు శ్రీధరుఁడు పారిపోయిన రాజకుమారులనెల్ల రప్పించి సత్కరించుచు నల్లుండ్ర విద్యాబలపౌరుషాదు లెక్కువగా వారికడ స్తోత్రము గావించెను.

ఆరాజకుమారు లాస్తుతివచనములు విని మీయల్లుండ్రు పాండవులవోలె లోకైకవీరులని యొప్పుకొనియెదము. వరుణద్వీపాధిపతి యగు క్రోధనునితో వీరికిఁ బోరుతటస్తించిన నెవ్వరు గెలుతురోయని సందియముగా నున్నది. వీరతనిం జయించినచో భూమండలంబున వీరికిఁ దుల్యులు లేరని చెప్పవచ్చునని ప్రస్తావముగా ననువదించిరి. అతండు యంత్రబలసంపన్నుఁడు. భుజబలంబున వీరిం జెనకఁజాలఁడు యంత్రసామర్థ్యంబు మనుష్యబలము మించియుండకపోదని శ్రీధరుఁ డుత్తరము జెప్పెను. వారిమాటలు విని శ్రీముఖుఁడు ఆక్రోధనుఁ డెవ్వఁడు? ఎందున్నవాఁడు? వాఁడు యంత్రబలసంపన్నుఁ డగుంగాక! మాకు లక్ష్యములేదు. వేగఁబోయి వానిం బరిభవింపగలము. వాని వృత్తాంతము చెప్పుమని యడిగిన శ్రీధరుం డిట్లనియె.

వత్సా! ఇక్కడకు నూఱామడదూరములో సముద్రమధ్యంబున వరుణద్వీపము గలదు. అందు వరుణావతియను నగరంబున గ్రోధనుఁడను రాజు యంత్రబలగర్వితుండై యొప్పుచున్నాడు. వానికి దేవతలుగూడ వెరచుచుచుందురు. ఆనగరముచుట్టు ననేకయంత్రము లమరింపఁబడియున్నవి. ఫాలాక్షుండు వానినగరము సొరఁజాలఁడు. చొచ్చినవాఁడెవ్వఁడు చావక తిరిగివచ్చినవాఁడు లేడు. వాని జోలి మీకేల? పెండ్లికొడుకవు సుఖంబుండుమని బోధించిన విని శ్రీముఖుం డావార్త తమ్ముల కెఱింగించెను.

అందు విక్రముఁడు అన్నా! నీవు క్రొత్త పెండ్లికొడుకవు కొన్ని దినములిందుండుము మేమా దీవికిబోయి క్రొధనునింజయించి మహా వీరులని బిరుదములంది వత్తుముగాక. ఆవీటికి మార్గమెట్లో తెలిసి కొనుము. మీ మామగారితోఁ జెప్పి మమ్మందుఁబంపుమని కోరిన నతండు తమ్ములారా! క్రోధనుఁడు యంత్రశక్తిగలవాఁడట వాని నగరమెట్టి వీరుఁడు చేరలేఁడట. చేరిన వాఁడు తిరుగారాఁడట. అట్టి దుర్ఘటకార్యమునకు బూనుకొననేల? అప్పయనము శ్రీధరున కిష్టము లేదని మందలించిన విని విక్రముండిట్లనియె.

అన్నా! మన మింటికడ సుఖంబుండక యిట్టేమిటికి బయలుదేరివచ్చితిమి? నిర్వక్రపరాక్రమంబున విక్రమ గర్వితులఁ బరిభవించి' ప్రఖ్యాతి నొందుటకేకదా! పిఱికిపందల నెందఱంగొట్టిన నేమి యున్నది! క్రోధనునివంటి మహావీరుని జయించినప్పుడే మనపేరులు బైటికివచ్చును. యంత్రబలము తంత్రబలముగూడ మనభుజబలమును మించజాలదు. మీ మామతోఁ జెప్పి మాపయినము సాగింపుము తూరుపుదెసకరిగిన మనయన్న లెట్లింటికివచ్చిరో జ్ఞాపకమున్నదా! పోయిన నట్లె యింటికిఁ బోవలెను. లేకున్న నదిలోఁ జావవలసినదే. అని సాటోపముగాఁ బలుకుటయు శ్రీముఖుఁడు మామగారితో వారి యుద్యమప్రకార మెఱింగించెను.

వారు క్రోధనుని జయింపఁజూలరని యెఱింగియు నల్లుఁడు పోవుట మానెంగావున శ్రీధరుఁడెట్ట కే వారి పయనమున కొప్పుకొని, పదుగురఁ గర్ణధారుల రప్పించి యిట్లనియె.

మీరు వరుణావతీ నగరంబునకు నోడలఁ దీసికొని పోవలసియున్నది. మా బంధువుల సేనలతో వరుణ ద్వీపము జేర్పవలయును. సముద్రములోఁ క్రోధనుఁడు వైపించిన యంత్రపుగనుల స్థానములు మీకుఁ దెలిసియే యుండును. వానికిఁ దగులకుండ జాగరూకులై వీరిని వరుణావతికిఁ బదియోజనముల దూరముగా దక్షిణపువైపు దీరమున దింపవలయును. వారక్కడనుండి యెట్లో సాధనము జేసికొని పురిలోఁ బ్రవేశింపఁగలరు. వాతాగ్నిజల ప్రమాదము లెఱిఁగి యోడల నడిపింపుఁడు. ఎప్పటికప్పుడు మాకు వార్తల దెలుపుచుండ వలయునని యా మార్గ ప్రవృత్తియంతయు నెఱింగించినవిని నావికులు సంతసించుచుండ తదనుజ్ఞవడసి మూడు దినములతో బయనమునకు బదియోడల నాయత్తఱచిరి. ఉమాపురంబు సముద్రతీరమునందే యుండుటచే వెంటనే వారిపయనము సాగినది. శ్రీధరుఁడు కొంత సేనను వారికి సహాయమిచ్చి పంపెను. శ్రీముఖుఁడు తమ్ముల మంచి ముహూర్తమున నోడ లెక్కించి యింటికి మరలునప్పుడు తాను వినిన వరుణావతీ యంత్ర రహస్యములన్నియుఁ దమ్ములకుఁ దెలియఁ జేయుచు దన కెప్పటివార్తలప్పుడు పంపుచుండవలయు నందులకుఁ బ్రత్యేక మొకయోడ మీ వెంటఁ బంపఁ బడుచున్నది. వాని మర్మము లన్ని యుందెలిసినపిమ్మటఁగాని పోరఁదొడంగరాదుచుఁడీ. అని యెన్ని యో నీతి వచనము లుపదేశించి యెట్ట కే వారిని విడిచివచ్చెను.

నావికులు నేర్పరులగుట గాలి ననుసరించి సముచిత వేగంబున నావల నడిపించు చుండిరి. రాజపుత్రులు నలువురు నాలుగుతరులపైఁ గూర్చుండిరి. విక్రముండు ముందు నడుచు నోడపైఁ గూర్చుండి కర్ణ ధారులలోసమయవేదియనుప్రధాననావికునిఁదనకడనుంచికొని వరుణావతీ వృత్తాంతముస విశేషముగా నెఱింగింపుమని యడిగిన వాఁడిట్లనియె.

అయ్యా! నేను బిన్నటినాటినుండియు నీయోడలమీఁదఁ దిరుగుచుంటిని. అనేకద్వీపములకుఁ బోయితిని కాని వరుణావతీ నగరంబున కెప్పుడును బోవలేదు. ఆరాజు కడు క్రూరుఁడు. రావణాసురునివంటి వాఁడట. భూపతులెల్ల నతనిపేరువినిన గడగడ లాడుచుందురు. వరుణ ద్వీపము నూఱామడ వైశాల్యము గలదఁట. సముద్రములోఁ జుట్టును గనులువైచి యుంచెను. వానియునికిఁ దెలియక యోడలనడిపించినచో నవి తగిలి భగ్నములై పోవుచుండును. క్రోధనుని యోడలు వానిం దప్పించుకొని యెల్లదీవులకు సంచారము సేయుచుండు. మా శ్రీధరుఁడా క్రోధనునకుఁ బన్ను గట్టు చుండును. వానిజయించు వారి నిప్పటికిఁ జూచియుండలేదు. మీరెట్లు జయింతురో తెలియదు. మీరు బాహుబల సంపన్ను లగుదురుగాక. ఒక యంత్రము గడియలో వేలకొలఁది జనమును నాశనము చేయఁగలదు. ద్వంద్వ యుద్ధములో మీరు వాని నోడింతురుగాని వాని దాపునకు మీరెట్లు పోఁగలరు. పట్టణమే చేరుటకష్టము. వరుణావతికిఁ బదియోజనముల దూరములో మిమ్మ్ము తీరము జేర్తుము. మీ రాయూరిలోని కెట్లు పోవుదురో తెలియదు. మీ సంకల్ప మేమియో నాకుఁ దెలియకున్నది. అని యాకర్ణధారుం డెఱింగింప నాకర్ణించి విక్రముఁడిట్లనియె.

ఓయీ! నీమాటలు నాకు సంతోషము గలిగించినవి. క్రోధ నుండెట్టి దుర్గముననున్నను గాలవ్యత్యయమునఁ బట్టువడక మానఁడు. రావణుని లంకాపట్టణ మెందున్నదియో దేవతలకైనఁ దెలియునా? అట్టినగరము కోఁతి మూకలచే నాశనము జేయఁబడలేదా? ఎట్టివాఁడును గాలమును గెలువలేడు. వానికిఁ గాలము మూఁడినదనియే తలంపుము. లేకున్న మాకిట్టి సంకల్పము పుట్టనేరదు. అప్పటికిఁ దోచిన యుపాయమునుంబట్టి మేమాక్రోధనునిపట్టణము ముట్టడింపఁగలము. వేగముగా నా దీవింజేర్పుమని ప్రోత్సాహపరచెను.

ఆ కర్ణధారుఁడు గనిస్థానములఁ గనిపెట్టి మారు త్రోవల నోడల నడిపించుచుండెను. విక్రము డున్న యోడ ముందు నడిపించు చుండెను. దాని ననుసరించియే తక్కిన యోడలువచ్చుచుండెను. దక్షిణముగాఁ బోయిపోయి ద్వీపము పదియోజనముల దూరములో నున్న దనఁగాఁ బడమరగా నడిపించిరి. అందుఁ క్రోధనుఁడు క్రొత్త గనులవైపించిన రహస్య మా నావికుడెఱుంగఁడు. మఱికొంత దూర మవ్వలఁబోయిన నా గనులు తగులక పోయెడిదే. అమర్మమెఱుంగక యాతఁడీవలగా నడిపించినంత మొదటియోడ గనికిఁదగిలి గుభాలున ప్రేలి యక్కలము వికలమై శకలముగా విడిపోయి సముద్రములో మునిఁగిపోయినది. ఆవెంటనే తక్కిన యోడలుగూడ గనులకు దగిలి కొని పెటపెటార్పటులతో విడిపోయి సముద్రము పాలైనవి.

అప్పుడు హాహాకార రవంబులు సేయుచునందున్న జనులుతమకు దొరకిన సాధనంబులంగైకొని సముద్రములోఁబడి కొట్టుకొని పోయిరి.

అని యెఱింగించిన విని గోపాలుండు గుండెలు బాదికొనుచు నయ్యో! పాపము తాళధ్వజుని పుత్రుల యుద్యమమంతయు గడియలోనటమట మైనదిగదా? స్వామీ! వారుకమ్మఱ జీవించి వత్తురా? ఏమి జరిగినదియో యవ్వలికథ వేగముగాఁ జెప్పుమని యడిగిన నమ్మణిసిద్ధుండు పక్కున నవ్వెను. గోపాలుండందలి యర్థము గ్రహించి స్వామీ! కల యసత్యమైనను గలలోనున్నప్పుడప్పటి చర్యల ననుసరించి సుఖదుఃఖములు గలుగుచుండును. నాప్రవృత్తియునట్టిదే యనుకొనుఁడు. మీరు నవ్వినకారణము గ్రహించితినా! కరుణించి యవ్వలి కథ జెప్పుఁడని వేడుకొనియెను. అప్పుడు వేళమిగులుటయుఁ బయిపయనము సాగించి యతిపతి పై మజిలీయం దవ్వలి వృత్తాంత మిట్లు చెప్పం దొడంగెను.

_________

233 వ మజిలీ.

దేవకన్యకలకథ.

గీ. జలధి మునిఁగిన బావక జ్వాలఁ గూలి
    నను మహీధ్రమునుండి దొర్లినను బుడమి
    ఫణులచే బల్మిఁ గరవంగఁబడినఁ జావఁ
    డాయు వించుక మిగిలిన యతఁడు జగతి.

సముద్రపుటోడలకుఁ బ్రమాదమువచ్చునప్పుడు దప్పించుకొనుటకై ప్రక్కను జిన్నదోనెలంగట్టి యుంచుదురు. గనికిఁ దగిలి గుభాలునఁ జప్పుడై యోడమునుఁగుటయు నరనిమిషములో జరిగినది అప్పటికి రాత్రిజాము ప్రొద్దుపోయినది. అందున్న వారికి సాధనములఁ జూచుకొనుటకైన నవకాశము గలిగినదికాదు. అందు విక్రముడున్న యోడ శకలములై మునింగినది. ప్రక్కగట్టఁబడిన జిన్నదోనెలు దానితో విడిపోయి సముద్రజలంబునఁ దేలి కొట్టుకొని పోవుచుండెను. దైవికముగా విక్రమునిచేతికొక దోనెదొరకినది. అది ప్లవమువంటిదే. నీరెక్కినను మునుఁగదు. తెప్పకంటెఁ బెద్దదిగానుండును విక్రముఁడు. దానిపై కెక్కి కూర్చుండి యించుక యాయాసముదీరిన వెనుకవెన్నెల గాయుచున్నది. కావున నలుమూలలు పరికించి పొంగుచున్నసముద్ర