కాశీమజిలీకథలు/పదవ భాగము/230వ మజిలీ

స్వ స్వరూపముల దాల్చిరి. ప్రఫుల్ల నాపుత్రిక. కాళింది మంత్రి పుత్రిక. రుక్మవతి సామంతరాజు పుత్రిక . మీతమ్ములపోలిక గ్రహించుట గ్రొత్తవారికి గష్టముగానుండును. కావున వారేయెవ్వరేకన్యక యంతఃపురమున వెలసిరో యకన్యకం బాణిగ్రహణము జేసికొనవలయును. ఇది మాయభిలాష యని వినయముతోఁ బ్రార్థించుటయు హరివర్మ యంగీకారము సూచించెను.

అంత నమ్మహారాజు శుభలగ్నంబునఁ గళాభిరామునకుఁ దన పుత్రిక , ప్రఫుల్లను, మంత్రిపుత్రిక కాళిందిని సుధర్మునకు , రుక్మవతిని సులోచనుసకు యిచ్చి వివాహము గావించెను. మరియు నవంతీశ్వరుఁడు దూరమందున్న వాఁడగుటఁ జారుమతీకన్యాదాన సంస్కారము తానే గావించెను.

రామలక్ష్మణ భరతశత్రుఘ్నులుపలె నా రాజకుమారులు నలువురు నేకకాలమున వివాహ మహోత్సవముల నానందించి భార్యలతోఁ గూడఁ గొన్నిదినంబు లందు నిరవధిక కేళీవిలాసములతో వెళ్ళించిరి.

అని వినిపించి తరువాతనగు కథ నిట్లు వచియించెను.

230 వ మజిలీ.

రాజపుత్రులు నిత్యము స్వదేశమున కరుగఁ దొందరపడుచున్నను సోమదత్తుని నిర్భంధమునఁ గొన్ని నెల లాగిరివ్రజపురంబున నుండక తీరినదికాదు. అక్కడినుండి కాశ్మీరదేశమునకు మార్గము కడు సంకటముగా నుండును. ఆదేవకూటశైలము తిరిగిపోవలయును. మంచి దారులులేవు. కొండలనడుమనుండి యడవులమీఁదుగాఁ బోవలయును.

సోమదత్తుఁడు సుముహూర్తమున వారికిఁ బ్రయాణము నిరూపించి దాసదాసీసహస్రము లరణముగా నిచ్చి యేనుఁగులు గుఱ్ఱములు లొట్టియలమీఁదను సారెవస్తువు లెక్కించి పుత్రికల నందలము లెక్కించి చతురంగబలముల సహాయమిచ్చి యంపకము గావించెను. హరివర్మాది రాజకుమారులు నలువురు తమగుఱ్ఱములెక్కి యాశ్వికులు పెక్కండ్రు చుట్టుకొనిరా మజిలీలు జేయుచు మృగముల వేటాడుచు నదీసైకతప్రదేశముల విహరింపుచు విచిత్రవృక్షలతా గుల్మాదులనవలోకింపుచు నిరువదిదినము లయ్యరణ్యమార్గంబునఁ బ్రయాణము సాగించిరి.

ఒకనాఁడొక మహారణ్యమధ్యంబున నిర్మలకుల్యాతీరసైకతలంబున విడిసి పటకుటీరంబుల వెలయించి యందలి ఫలతరులతా వితానంబులు వినోదము గలుగఁజేయ భార్యల ప్రోత్సాహంబున మూడుదివసంబు లందు వసించిరి. మఱియు వారు ప్రొద్దున లేచి వారువంబులెక్కి స్వారీచేసి రెండు గడియలలలోఁ దిరిగి వచ్చువారు.

మూడవనాఁడు హరివర్మ తూర్పుగాఁ బెద్దదూరము పోయి తిరుగా వచ్చునప్పుడు దారితప్పి దిగ్భ్రమజెంది వచ్చినదారియేదియో పోవలసినదారి యేదియో తెలియక మధ్యాహ్నముదనుక కనంబడిన దారినెల్లఁ బోవుచుండెను. అట్లు కొంతదూరము పోవఁ దూర్యనాదములు వినంబడినవి. అందులకు శంకించుకొనుచు నాప్రాంతమం దేదియో గ్రామమున్నదని నిశ్చయించి యాధ్వని ననుసరించి తన గుఱ్ఱమును నడిపించెను. పోయినకొలఁది యానాదములు హెచ్చుగా వినంబడుటయేకాక మనుష్యుల కోలాహలముతోఁ గూడ తౌర్యత్రిక రవంబు శ్రోత్రపర్వము గావించినది.

అతం డది గ్రామమని నిశ్చయించి వేగముగా గుఱ్ఱమును దోలుటయు నొక కోటగోడ యగుపించినది. దాని చుట్టునుం దిరిగి సింహద్వారము దాపునకువచ్చెను. అందు విచ్చుకత్తులతో రాజభటులు పహరాయిచ్చుచుండిరి. ఆకోటలో నేదియో శుభముజరుగుచున్నట్లు తెలిసికొని హరివర్మ ద్వారపాలురతో గుఱ్ఱముపైనుండియే యీకోట యెవ్వరిది ? లోపల జరుగుచున్న యుత్సవమేమని యడిగిన నతనిమాట యెవ్వరును వినుపించుకొనరైరి. ఇంచుక యలుకజెంది హరివర్మ గుమ్మము దాపుగా గుఱ్ఱమునుదోలి యొకనితో నోయీ ! ద్వారపాలుర కింత యవివేకము తగదు. బాటసారితో మాటాడినంతనేయధికారము కొరంతయగునా? నామాట వినిపించుకొంటిరి కారిది మర్యాదయే యని యడిగిన స్థానబల గర్వంబున వారిట్లనిరి. అబ్బో ! గుఱ్ఱమెక్కినవారందఱు రౌతులేకాఁబోలు. మమ్ము ధిక్కరించి యడుగుచుంటివి ? నీవెవ్వఁడవు ? నీమాటల కుత్తరము చెప్పుటకు మాకవసరములేదు. గుఱ్ఱము దిగి మాటాడుము. నిన్నుఁ బరీక్షించి కాని పోనీయమని పలికిన, నతండు రౌద్రావేశముతోఁ దులువా ! యేమంటివి ? నిలువుమని పలుకుచుఁ దనచేతనున్న కొరడాతో వాని నొకదెబ్బ కొట్టెను.

అప్పు డందున్నవా రందఱులేచి గుఱ్ఱమును జుట్టుకొని యతని నదలింపఁబోయిరి. అతండు మొలలోనున్న కత్తితీసి గుఱ్ఱమును వారి పైకిఁదోలి త్రొక్కించుచుఁ గొందఱి శిఖలగోసి కొందఱి ముక్కులం జెక్కి కొందఱ చెవులు నరికివారినందఱంబారఁదోలెను. అప్పుడు కొందఱుభటులు లోపలికిఁ పరుగెత్తుకొనిపోయి జాతకర్మోత్సవముజూచుచున్న తన యేలికతో మహారాజా ! మనసింహద్వారముకడ కెవ్వఁడో గుఱ్ఱమెక్కివచ్చి ద్వారపాలురం జంపుచున్నాడు. తగినవారిం బంపిన గాని వాని యౌద్ధత్యము మానుప శక్యముగాదని తెలియఁజేసిరి.

అప్పుడు కూఁతురు నల్లుఁడు పీటలపైఁ గూర్చుండి శిశువునకు జాతకర్మ చేయుచుండిరి. ఒకమూల వారాంగన లాడుచుండిరి. యొకమూల బ్రాహ్మణులు వేదములు చదువుచుండిరి. సామంతులా యుత్సవముజూచి యానందింపుచుండిరి. అట్టితఱి నీవార్త వచ్చుటయు రాజు ప్రక్కనున్న మంత్రితోఁ గనుసన్నఁజేసెను.

ఆసచివుండు దండనాధుం బంపెను. ఆసేనాధిపతి పదుగురు కింకరులతోఁ బోయి ద్వారపాలురపాటు జూచి రోషముదెచ్చుకొని హరివర్మగుఱ్ఱమునుజుట్టుకొని కొట్టఁబోవుటయు నతం డవలీల వారి నందఱ గుఱ్ఱముచేఁ ద్రొక్కించి కాందిశీకులఁ గావించెను. దండనాధుండు దెబ్బలుతిని గొబ్బునలోపలికిఁబోయియావీరుఁడు సామాన్యుడు కాడు. గొప్పప్రయత్నమునంగాని వాఁడు పట్టుబడఁడు. మఱికొందఱ యోధులం బంపుఁడని నృపతి కెఱింగించుటయు నందున్న వారినందఱ దీసికొనిపొమ్మని యజ్ఞాపించెను.

దండనాధుఁడు పెక్కండ్రయోధులం దీసికొనిపోయి హరివర్మతో నాయోధనముజేయఁదలపెట్టెను కాని గడియయైన నాతనిముందర నిలువలేకపోయిరి. వారినందఱ గుఱ్ఱముచేఁ ద్రొక్కించి పారిపోవ జేసెను. రాజు యతం డసాహాయశూరుండని తెలిసికొని మంత్రితో నాలోచించి యీయుత్సవమున కంతరాయముగాకుండ నల్లునికిఁ దెలియకుండ మనము పోయి వానిపౌరుష మేపాటిదియో చూతము గాక అని నిశ్చయించి యేదియో నెపముపన్ని యిరువురు నట కదలి కవచంబుల దొడిగి శరశరాసనంబులం దాల్చి గుఱ్ఱములెక్కి సింహ ద్వారముకడకుఁ బోయిరి.

అందు యోధులు పెక్కండ్రు మూర్ఛజెందియుండిరి. రాజు వారింజూచి కోపమాపలేక నీవెవ్వండవని యడుగకయే తనగుఱ్ఱ మతనిమిఁదికిఁ దోలెను. వెంటనే మంత్రియు గొందఱు భటులు వానిం జుట్టుకొనిరి. అప్పుడు హరివర్మయం దొకభటుని చేతనున్న కరవాలము లాగికొని రౌద్రావేశముతో వాఱువమును బెండెములు త్రిప్పుచు రాజప్రధానుల కిరీటముల శకలములగాజేసి భుజకీర్తుల నరికి వారి నిరువురఁ దురంగములనుండి క్రిందఁబడనేసి మూర్ఛ నొందించెను. లోపల రాజుగారి యల్లుఁడు బ్రాహ్మణాశీర్వాదమంది పీటలమీఁదనుండిలేచి మామగారికి నమస్కరింప నెందున్నవారని యడుగుచుండఁగనే కొందఱు భటులు పటురయంబువ హాహాకారము లతో వచ్చి మహాప్రభూ ! రాజప్రధాను లిరువురు పడిపోయిరి. ఆ వీరుఁడు గుఱ్ఱముచేత వారిం ద్రొక్కింపఁ బ్రయత్నించుచున్నాడని తెలియఁజేసిరి. జామాత ఆవార్త యంతకుమున్ను వినియుండ లేదు. వీరుఁ డెవ్వఁడు? రాజప్రధానుల ద్రొక్కించుటయేమి? అని విస్మయముతో నడిగిన కథయంతయుఁ జెప్పిరి.

అయ్యో ఇంతసేపు నాకుఁ దెలియనిచ్చితిరికారేమి! ఆవీరుఁ డెవ్వఁడు ? ఈ యడవి నడుమ కెట్లువచ్చెను ? వానికులసీల నామంబులు దెలిసికొనిరా? అని యడిగిన నవి యెవ్వరికిం దెలియవని యుత్తరము జెప్పిరి. అప్పుడతండు యొక గుఱ్ఱమెక్కి చంద్రహాసముబూని విల్లమ్ములఁదాల్చి యతి వేగముగా సింహద్వారముకడకుఁ బోయి యందున్న గుఱ్ఱముపైఁగూర్చుండి ప్రతివీరుని రాక నరయుచున్న హరివర్మంజూచిచూచి సంగరంబునకు దొడంగక యోహో! మహావీరా! నీ వెవ్వఁడవు? ఇక్కడి కెట్లు వచ్చితివి? ఊరక వారితోఁ గయ్యమేల సేసితివి? నీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిన నతండతని నెగాదిగఁ జూచి స్వరముదెలిసికొని యోహో! నీవు మా విద్యాసాగరుఁడవు వలె నుంటివే ? యనుటయు నతని గురుతుపట్టి తమ్ముఁడా ! హరివర్మా! నీవటోయి! నేఁడెంత సుదినము! అని గుఱ్ఱము దిగ్గనురికి యతని దాపునకు బోయి చేయందిచ్చెను. హరివర్మయు సంతోషముతోదిగి యతనిం గౌఁగలించుకొని యానందాశ్రవులచే నతని శిరము దడిపెను. గాఢాలింగనములచే నొండొరుల ప్రేమదెలిపికొనిరి. విద్యాసాగరుఁడు హర్ష గద్గద స్వరముతోఁ దమ్ముఁడా! మనతమ్ము లెందుండిరి ! నీ వెట్లిక్కడికి వచ్చితివి ? నీ వృత్తాంతము జెప్పుమని యడుగుటయు హరివర్మ విపరీత వాతంబునఁ దాను గొట్టుకొనిపోయినది మొదలు నాఁటి వఱకు జరిగిన కథయంతయు నెఱింగించి యతనికి విస్మయ సంతోషములు గలుగఁజేసెను. వారట్లు మాటాడుకొనుచుండఁగనే హరివర్మను వెదకికొనుచు దమ్ములు మువ్వురు గుఱ్ఱములెక్కి, యక్కడికివచ్చిచేరి యన్నల నిద్దరఁ జూచి యోహో ! పెద్దన్న విద్యాసాగరుఁ డిక్కడికెట్లు వచ్చెను నీకొఱకు నడవియెల్ల వెదకికొనుచు దైవికముగా నిక్కడికివచ్చితిమే అని పలుకుచు మువ్వురు నతని పాదంబులఁబడి నమస్కరించిరి. వారిం గ్రుచ్చియెత్తి యాదరించుచుఁ బదుఁడు లోపలకుఁ బోవుదము. మా పుత్రుఁ జూతురుగాక మంచి సమయమున కే కలిసికొంటిమి. నా కథ చాలకలదు. ఆనక జెప్పెదంగాక యని పలుకుచు రాజప్రధానులపై నీళ్లుజల్లించి సేద దీర్పించిరి. ఇరువురులేచి కూర్చుండి హరివర్మఁజూచి సిగ్గుపడుచుండ నూరడించి విద్యాసాగరుఁ డిట్లనియె.

మామా! వీరు నలువురు నా తమ్ములు నిజము దెలిసికొంటి. మీద్వార పాలునివలన నాకయ్యము బొడమినది. మీరైనను నీ వెవ్వండవని యడుగక తొందరపడి కయ్యములో దిగితిరి. వానిగెలువ మీ తరమా! మంచివాఁడుకావున మిమ్ము గడ తేర్పక యవమానపరచి విడిచి వేసెను. రండు! రండు! లోపలకుఁ బోవుదము అని వారి వృత్తాంతమంతయు వారికింజెప్పెను. హరివర్మతన తప్పు క్షమింపుమని రాజుఁగోరికొనియెను. ఆనృపతివారినెల్లలోపలకు దీసికొనిపోయిమిగుల గౌరవించుచు సంతోషముతో వారికథ తమ బంధువుల కందఱకుం దెలియఁ జేసెను. విద్యాసాగరుండు తగువారింబంపి యడవిలోనున్న తమ్ములభార్యలను సపరివారముతో రప్పించి ప్రమద్వర యంతఃపురమున కనిపెను. కుమారునికి తాళధ్వజుఁడని పేరుపెట్టిరి. ఆశిశువును లాలించుచు నాఁడెల్ల వారందఱు తమ పడిన కష్ట సుఖంబుల నొండొరులకుఁ దెలియఁ జేయుచుండిరి.

చ. అని యెఱింగించి యత్తపసి యౌర! ప్రయాణపువేళమించిపో
    యినదిగదా! కథాగత సమీడ్య లసత్ప్రతిభా చమత్కృతిం

    జనవలె నింక లెమ్మనుచు ఛాత్రునితోఁ దదనంతర ప్రదే
    శనిలయమేగి చెప్పె సరసంబుగ నవ్వలివార్త గ్రమ్మఱన్॥

__________

231 వ మజిలీ.

స్వగ్రామప్రయాణము.

తమ్ములారా! వినుండు కీడుగూడ మేలునకే యొకప్పుడు కారణమగుననుమాట మనయందు నిరూఢమైనది. అమ్మహావాత పాతంబున గుఱ్ఱముతోఁగూడ నేనాదెసకు గొట్టుకొనివచ్చి యీకోటగోడకు దగిలికొంటిని. మీకుఁబోలె నాకు మన గుఱ్ఱముజేసిన సహాయమె యీవైభవమునకుఁ గారణమైనది. కోటలోఁజేరిన పురుషులు స్త్రీలవలె నందున్నవారికిఁ గనంబడునట్లు కాశ్మీర దేశాధిపతి యొకసిద్ధు నాశ్రయించి వరముగాఁ బడసెనఁట! నన్నీ ప్రమద్వర యాడుదాన ననుకొని తన యంతఃపురమునకుం దీసికొని పోయినది. మత్సంపర్కంబున గర్భవతియైనది. ఇందున్న కన్యకలందఱు పురపోపసృత్తముల నెఱుంగని వారగుట మాక్రీడల తెరంగెఱుఁగలేక పోయిరి. ఇందున్న ముసలిది ప్రమద్వర గర్భచిహ్నముల గహించి నన్ను బెదరించుచు నామె తండ్రికి వార్త నంపినది. ఎవ్వఁడో పురుషుఁడు స్త్రీ వేషముతోవచ్చి నీపుత్రికం గలసికొనియెను. ఇప్పుడు గర్భవతి యైనది. నీకూఁతురు నామాట వినక సంతతము వానితో దిరుగుచున్నది. కాపాడుకొనుమని వ్రాసిన యుత్తరము జదివికొని ప్రమద్వర తండ్రి చతురంగబలములతోవచ్చి యీకోట ముట్టడించి నన్నుఁ బట్టుకొనుటకుఁ బ్రయత్నించెను. ఖడ్గప్రహారముల వారినెల్ల నేను కాందిశీకులగావించితిని. రాజు నా పరాక్రమము మెచ్చికొని యా సిద్ధుని యుపదేశమున నే నల్లుఁడగుట సంతసించుచు నాతో సంధి