కాశీమజిలీకథలు/పదవ భాగము/229వ మజిలీ

గీ. పౌరులార! వెఱవఁబనిలేదు క్రవ్యాదుఁ
    డీల్గె నిందు నస్మదీయహస్త
    కలిత హేతిధారఁ గౌతుకమేపారఁ
    దిఱుఁగుడింక వీధితెరవులందు.

అని పలుకుచుఁ బౌరుల భయమువాపి యంతకుముందు హతశేషులైన పురరక్షుకుల కుదుటుగఱపి రాక్షసదేహంబు గాల్పుఁడని నియమించి “యావీరు లెవ్వరో భగవంతులై వచ్చి తమ్ము రక్షించిరని ” పౌరులు స్తుతియించుచుండ నాసత్రంబునకరిగి యొండొరుల వృత్తాంత మొండొరులకుఁ జెప్పికొని యానందించిరి. అని యెఱిగించి -

__________

229వ మజిలీ.

బ్రహరాక్షసునికథ.

అన్నగరాధిపతియగు సోమదత్తుండు వేటకుఁ బోయివచ్చుచు వార్తాహరులవలన నయ్యుపద్రవము విని నాఁటి సాయంకాలమున కే పురముజేరి యాయుత్పాతమునకుఁ బరితపించుచుఁ గోటలోనే చిన్న సభజేసి ప్రధానితో నిట్లనియె, అమాత్య శేఖరా ! మనవీట నెన్నడును నిట్టి విపరీతము జరిగియుండ లేదు. చిలుకలు గుఱ్ఱములగుటయు బ్రహ్మరాక్షసుఁడగుటయు మనుష్యులం జంపుటయు జాలవింతగా నున్నది. తంత్రవేత్త లెవ్వరైన వచ్ఛి నగరముపైఁ బ్రయోగము సలిపిరా ? ఆరక్కసుం బరిమార్చిన మహావీరు లెక్కడనుండివచ్చిరి? ఆవార్తయంతయు సవిశేషముగాఁ జెప్పుమని యడిగిన నామంత్రియంతకుమున్ను రప్పించియుంచిన బోగముదాని ముందుకుద్రోసి నీ వెఱింగిన కథ నీయింట నేమిజరిగినదియో చెప్పుమని యడిగిన నావేశ్య రాజునకు నమస్కరించి యిట్లనియె. మహారాజా ! నేనాఱుమాసముల క్రిందట నొక కొండవాఁడుచిలుకనమ్మదేగా మంచిపుట్టంబు లిచ్చి దానిఁగొంటిని. బంగారు పంజరములోబెట్టి మాటలు నేర్పి ముద్దుగా బెంచుచుంటిని. మూఁడుదినముల క్రిందట నొక కోయది చిలుకల కలంకారములని పైడిమువ్వలు దెచ్చి యమ్ముచుండెను. చిలుకయందలి ప్రేమచే నేనా మువ్వలం గొని మంచివేళజూచి దానికంఠమునకుఁ గట్టింపుచున్నంతలోనాచిలుక యొక బ్రహ్మరాక్షసుఁడై యఱచుచు నెదురునున్న నాదాదినిమెడఁ గరచి నెత్తురుపీల్చి చంపి. నాట్యముసేయుచుండెను. అప్పుడు నేను గదిలోఁ దూరి తలుపు వేసికొంటిని. లేకున్న నేనీపాటికిఁ బెద్దలలో జేరియుండుదాననే. పిమ్మటఁ జావడిలోఁ బండికొనియున్న మాయమ్మను నెమ్ములు విరుగజఱచి పరలోకగతంజేసెను. వీధిగదిలోఁ బండుకొనియున్న యొక భాగ్యవంతుని కుమారుని విటధర్మమునకై యరుదెంచినవాని మెడ జెఱుకుముక్కవలె విఱచి రక్తముద్రావెను. పాఱిపోవుచున్న నలువుర దాదులం దరిమి చంపినది. తరువాత మాయిల్లు విడిచి నడివీధిం బడినది. ఇంతవట్టు నేనెఱుంగుదు. స్వామీ ! మా తల్లిం బూవులలోబెట్టి పోషించుచుంటి. అట్టి మాతం గోలుపోయితినని గోలున నేడువఁ దొడంగినది.

ఓహో ! ఈచిచ్చు నీయింట బుట్టినదా ! కానిమ్ము. పెద్దది మీయమ్మ కేమి ? నీవు బ్రతికితివిగదా. పొమ్మని పలుకుచుఁ దరువాతి వృత్తాంతము జెప్పుమని యడిగినఁమంత్రియా సుబ్బి సెట్టి నెదురకు బంపెను. అతండు నమస్కరించుచు దేవానేనేపాపము నెఱుఁగను. నా యుసురా దండనాధుఁనకుఁ గొట్టినది. కొన్నిదినములక్రిందట మావర్తకులతో పాటు నేనొక చిలుకం గొంటిని. ఆమాయకోయసాని ఎక్కడినుండి వచ్చినదియో పైడిమువ్వలమ్మి పోయినది. నాచిలుకకు గట్టినఁ బెద్దగుఱ్ఱమైనది. దానివలెనే మాదాయల చిలుకలు గుఱ్ఱములైనవి. నాకర్మము, ఆసాహేబు నేనాగుఱ్ఱముఁ దొంగిలించి తెచ్చితినని రచ్చకులాగికొని పోయి చెరసాలలోఁ బెట్టించెను. లంచము గొని నా దాయాదుల మువ్వుర జోలికిఁ బోడయ్యెను. చిలుక రాక్షసుఁడైనప్పుడు గుఱ్ఱమగుట యసత్యమగునా? తండ్రీ! నామాటనమ్మక నన్నన్యాయముగా బందీగృహంబునం బెట్టించినందుల కాతురక బాలిశునకు మంచి ప్రాయశ్చిత్త మైనదఁట. ఆరక్కసుని నోటఁబడెనని చెప్పికొనిరని దీనుండై తనయుదంత మంతయు విన్నవించెను.

సోమదత్తుఁ డావర్తకుని నూరడించుచు మంత్రితోఁ దరువాత నేమిజరిగినది. ఆమహావీరు లెక్కడినుండి వచ్చిరి. పిమ్మట నేమైనదని యడిగిన నతండిట్లనియె. మహారాజా! కొన్నిదినముల క్రిందటఁ గోయవాండ్రు మూడు కొండచిలుకల నమ్మదెచ్చిరంట. కొండ చిలుకలు గుజ్జురెక్కలతో నొప్పుచుఁ జూడ మిక్కిలి సొంపుగానుండును. వానిలో నొక దాని భర్తృదారికయు నొకదాని నాకూతుఁరు కాళిందియు నొకదాని సామంతరాజు కూఁతురు రుక్మవతియు గొన్నారఁట. మొన్న కోయవాడమ్మదెచ్చిన పైడిమువ్వలు మువ్వురుకొని తమ చిలుకలకుఁ గట్టించిరి. తత్సంపర్కంబున మూఁడు చిలుకలు మహావీరపురుషులై నిలువంబడినవి. అది యట్లుండ నామువ్వలమ్మం దెచ్చిన కోయవాఁడు వీధులం దిరుగుచుండగనే బోగముదాని చిలుక బ్రహ్మరాక్షసుఁడై యూరంబడి మహామారియుంబోలెఁ బ్రజల గసిమసఁగు. చుండుటయు నెఱింగి యాకోయవాఁడు రయంబున రచ్చలోనున్న చిలుక మార్పు హయంబు నొక్కదాని నెక్కి కరవాలంబు బూని యాదానవుని దరుమఁజొచ్చెను.

అంతకుఁ బూర్వమే యవన దండనాధుండు వానియలజడి విని కొందఱు వీరభటులతో నెదుర్కొని గడియలో వానిచే జంపఁబడియెను. దానంజేసి యుద్ధభటు లెవ్వరు వాని నెదుర్కొన వెఱచి పారిపోయి గుప్తస్థలంబులం దాగికొనఁ జొచ్చిరి. అప్పుడా కోయదొర యడ్డుపడకున్న గ్రామమంతయు నరణ్యమైపోవును.

ఆదానవుఁడు కోయదొరను సామాన్యుడనుకొని చులకనగా మీఁదబడి కరవఁబోవుటయు నావీరుండు అడిదంబున వ్రేలాడుచున్న వాని నాలుక రెండుచీలికలుగాఁ గోసి పారవైచెను. అప్పుడువాఁడు వికృతస్వరంబున నార్చుచు నాదొరకు వెరచి వెన్నిచ్చి పాఱఁదొడంగెను. ఆరౌతు విడువక వాని వెన్నంటి తరిమి తరిమి వీధులన్నియుం ద్రిప్పుచు నిలుచుట కవకాశము లేకుండఁ గొట్టుచుండ వాఁడాగ లేక యెగసి మాయింటిగోడ దుమికి లోపలఁ బడియెను.

లోపలివారెల్ల నాక్రందనముసేయుచు గదులలో దూరి తలుపులు వేసికొనుచుండిరి. దేవా! అప్పుడు నేనుగూడ దాగికొనక తీరినదికాదు. మాయింటఁ జిలుక పురుషుఁడై యున్న వీరుండా యలజడి విని జడియక యడిదముగొని వానిందరిమికొని వీధిలోనికిఁ బోయెను. కోయదొర వానికొఱకు గుఱ్ఱముపై వీధిలో నిలువంబడి యుండుటఁజూచి యాదానవుండు వెఱచుచు నెగసి యాప్రాంతమందలి సామంతనృపతి గేహంబునం బ్రవేసించెను.

అందున్న రెండవవీరుఁడు వానిపయింబడి యడిదంబున వాని ముక్కు చెక్కి వీధిలోనికి దరిమివైచెను. కోయదొరయు రెండవవీరుండును గుఱ్ఱములెక్కి వాని వెదకుచు వీధిలో నిలువంబడిరి. మూడవ వీరుండు గూడ వారితోఁ గలసికొని మూడవగుఱ్ఱమెక్కి మువ్వురు వాని నిలువనీయక వేటకుక్కలు మేటి వరాహముంబోలెఁ వెన్నంటి తరుమఁజొచ్చిరి. అప్పుడు వాఁడేమియుం దెఱవుగానక యెగసి దేవర కోటలోబడిఁ దాదులు మొరవెట్ట వాఁడు గాళిందిం బట్టికొని యెత్తుకొనిఁబోవఁ దొడంగుటయు మీయింటనున్న నాలుగవవీరుండు కైదువగొని వాని మీఁదంబడి బాదుటయు వాఁడా చేడియను విడచియా వీరునిసందిటంబట్టి బుజముపైఁ బెట్టుకొని యెగసిపోవుచుండెను. అంతఃపురస్త్రీ లందరు హాహాకారరవంబులు గావించిరఁట.

అప్పుడా వీరుండు రెండుచేతులు తెగనరికి పారవైచుటయు వాఁడు రెక్కలు విరిగిన పక్షివలె నేలంగూలెను. వానింగాచి తిరుగుచున్న మువ్వురు వీరులు తచ్ఛిరంబు ఖండించి గతాసుగావించిరి. నాలుగవవీరుండు గూడ వారితోఁ గలసికొనియెను. నలుగురు గుఱ్ఱములెక్కి పౌరుల కభయము దెలుపుచు బిమ్మటఁ బెద్ద సత్రమునకుఁబోయిరఁట. రెండువేలభటులతో దండనాథుడు మడసెను. ప్రజలు మూడువేలు నష్టమైనట్లు లెక్కలు తేలినవి. అంతఃపురముల నా వీరులులేకున్న స్త్రీలందరు మడియువారే. మహారాజా! క్షీరాబ్థిలో మొదట హాలాహలము పుట్టి తరువాత నమృతము జనించినట్లు చిలుక నుండి రక్కసుఁడు మహావీరులుగూడ నుదయించిరి. ఇట్టి చోద్య మెన్నఁడును వినియుండలేదు. ఆగుఱ్ఱములునాలుగు నలువురకుఁ బరిచయముగలవివోలె మనసు కనిపెట్టి రెక్కలుగలవివోలె నాదానవుని వెంట నెగయఁ జొచ్చినవి. ఆమహావీరుల దర్శనముజేసి యీజాలా విషయము లన్నియు దేవర తెలిసికొనవలసి యున్నదని మంత్రి యావృత్తాంతమంతయు నెఱింగించెను. ఆకథ విని పృథివీపతి యించుక యాలోచించి కానిమ్ము రేపు మనమందరము వారి బసకరిగి యేనుగనెక్కించి యూరేగింపుచు నింటికిఁ దీసికొనివచ్చి గౌరవింతము గాక. అందులకుఁ దగిన సన్నాహము గావింపుమని నియోగించి సోమదత్తుఁ డంతఃపురమున కరిగెను.

అతనిభార్య సంతోషమిశ్రితమైన శోకమును గద్గదకంఠయై భర్తయొద్దకువచ్చి మేమందరము తల్లికడుపున వెండియుం జనించితిమి. ఆమహావీరుఁ డడ్డపడకున్న నీపాటికి గాటిలో భస్మమైయుందుమని పలుకుచు నచ్చటివృత్తాంతమంతయు నెఱింగించినది. అప్పుడా రాజు భార్యనూరడించుచు నావీరులెవ్వరో తెలిసికొనవలసియున్నది. అందులకు ఱేపు సభగావింపు చుంటిమి. వారిఁ బెద్దగా గౌరవింతుమని పలికిన విని రాజపత్ని వారికథ మాకుఁ జాలభాగము తెలిసినది. కోయదొరభార్య మనయింటనే యున్నది. అమ్మాయి దానివలననిజమంతయుఁ దెలిసికొనినది. పాండవులవలె వారు మారురూపులు ధరించి మన వీటికివచ్చిరి. అయత్నోపలబ్ధముగా మీకును మంత్రికిని సామంతరాజునకు నల్లుండ్రులభించిరి. ఆకథయంతయు నమ్మాయి చెప్పఁగలదని యేమేమో చెప్పి యతని కానందము గలుగఁ జేసినది.

తరువాత ప్రఫుల్లవచ్చి తండ్రితోఁ గొంతసేపు ముచ్చటించి చేయఁదగిన కృత్యము బోధించినది. మరునాఁ డరుణోదయంబున మంత్రిసామంత హిత పురోహితసహితముగాఁ తూర్యనాదములు భూనభోంతరాళఁబునిండ దాసదాసీ సహస్రములుగొల్వ నలంకరించిన భద్రదంతావళములతో బయలుదేరి సోమదత్తుఁ డామహావీరులున్న సత్రంబున కరిగెను. అందుఁ బౌరులు గుంపులుగావచ్చి తమ్ము దైవము లని స్తోత్రములు సేయ వారితో ముచ్చటించుచున్న యా వీరులు నల్వురు రాజుగారి రాక విని యెదురేగిరి.

రాజు దూరమునుండియే మోడ్పు చేతులతోఁ బోయి వారి పాదములమ్రోల సాష్టాంగముగా నమస్కరించుచుఁ దానుదెచ్చిన పుష్పమాలలు వారిమెడలోఁవైచి వినయముతో నిట్లనియె. మహా వీరులారా! మీచరిత్రము కొంత వినియున్నాఁడను. మీరు సత్కులప్రసూనులు, మీపరాక్రమము వేరే యుగ్గడింపఁబనిలేదు. మొన్న మీరు మాదేశమునకుఁగావించిన యుపకార మేతన్మాత్రమని నిరూపించి చెప్పఁజాలము. మీరుచేసిన మేలునకు గృతజ్ఞులమై మీనిమిత్త మొక సభ జేయుచున్నారము. అంగీకరించి యీభద్రగజమెక్కి రావలయునని సోమదత్తుఁడు ప్రార్ధించుటయు హరివర్మ యిట్లనియె. మహారాజా! మీప్రజలకు మావలననే యీయుపద్రవము తటస్థించినది. స్వకార్యసాధకమగు ప్రక్రియ ప్రమాదమున నన్యబోధక మైనను దోషము కానేరదను నార్యోక్తి ననుసరించి మాతప్పు క్షమింప వలయునని మీప్రజలను మిమ్మునుగూడ వేడుకొనుచున్నారము.

అట్లు జరిగించుటకుఁగల కారణము ముందు మీకు వివరింపఁ గలమని పలుకుచు నానృపతి ప్రార్ధన మంగీకరించి తద్దత్త సత్కారములందికొనుచు సోదరులతోఁగూడ నేనుఁగనెక్కి వారాంగనానృత్యగాన వినోదములతో జనపతిప్రముఖులు ముందు నడుచుచుండ మహా వైభవముతో నూరేగుచు నత్యంతాలంకార రమణీయమగు సభా మండపము జేరెను.

ఆవీరుల నలువుర రత్నసింహాసనములం గూర్చుండబెట్టి కొందఱు పూవులు జల్లిరి. కొందఱు గీతములం బాడిరి. కొందఱు పద్యముల రచించిరి. వారు పౌరులకుఁ గావించిన యుపకారము లుగ్గడించుచు విద్వాంసు లాశీర్వదించిరి. మాకత్యంతోపకారకులైన మీచరిత్రము విన సభ్యులు వేడుకపడుచున్నారని మంత్రిలేచి యుపన్యసించుటయు నందు హరివర్మ లేచి యెల్లరువిన నిట్లెఱిఁగించెను.

హరివర్మాదుల కధ.

నాపేరు హరివర్మయండ్రు. వీరు నాతమ్ములు. మాయన్న విద్యాసాగరుఁడు. మేము తాళధ్వజుం డను చక్రవర్తి బిడ్డలము. మే మేవుర ముత్తరదిగ్విజయము సేయఁ బయలుదేరి పెక్కండ్రరాజులఁ బాదాక్రాంతులఁ గావించి యంతటితోఁ దృప్తినొందక దిగంతము జూడవలయునని యౌవన మదంబున బయలుదేరి సేనలతోఁగూడ జన పదంబులం దాటి పెద్దదూరము మహారణ్యములో సంచారము గావించితిమి. మేమొకచో గుఱ్ఱములెక్కి పోవుచుండ నొక జంఝావాతంబు ప్రళయప్రభంజనమువలె వీచివీచి మమ్ముఁ బొప్పాకులవలె నెగరఁగొట్టినది. మాయన్న విద్యాసాగరుండొక దెసకును మేము నలువురము నొకదెసకుఁ గొట్టుకొని పోయితిమి. గుఱ్ఱములతోఁ గూడ మేము దూది పింజలవలెఁ బెద్దదూరము పోయిపోయి యొకమహాపర్వతం బవరోధము గలుగజేయుటయుఁ బ్రవాహవేగంబునఁ గొట్టుకొనిపోయిన కట్టియలు తటంబు జేరునట్లు మేము తత్తటం బూతగా నిలువంబడి తొట్రుపడుచుండ నంతలో నాగాలి చల్లారినది. అప్పుడు మేము వాఱువములఁ దిగి యలయికదీరఁ గొంతవడివిశ్రమించితిమి. ముందుకర్తవ్య మేమని యాలోచించితిమి. తిరుగా నట్టి వాతంబు వీచునేమోయని వెఱపు జెందుచు నెట్లుపోవుటకుం దోచక పరితపించుచుంటిమి.

మాతమ్ముఁడు సుధర్ముఁడు మనమిప్పుడీ పర్వతశిఖరమెక్కి నలుమూలలు పరికించి నదులు, గ్రామములు, నరణ్యములు నేమూల నున్నవియో యెట్టిపరిమాణము గలవియో తెలిసికొందము పిమ్మట నప్పటికిఁ దోచిన మార్గంబునం బోవుదమని యుపాయము జెప్పెను. అందుల కందఱము ననుమోదించితిమి.

గుఱ్ఱంబులఘాసక బళంబులఁ మేపితృప్తిపరచి నీరుద్రావించి మేము ఫలాహారములఁదృప్తులమై మంచి వేళయనితోచిన సమయంబునగుఱ్ఱములనెక్కి జయపరమేశ్వరా యని యుచ్చరించుచు నొకని వెనుక నొకఁడు తత్తడిని నడిపించుచు నక్కొండ యెక్క ప్రారంభించితిమి. కొంతదూరము సులభముగా నెక్కఁగలిగితిమి. పోయినకొలఁది నిడుపుగానుండుటచేఁ బ్రక్కప్రక్కగా నడిపించుచుంటిమి.

మామావులు తావులెఱింగి యొక్కొక్క చోఁ బక్షులవలె నెగురుచు నొక్కచోఁ గోతులవలె దాటుచు నొక్కచోఁ బురుగులవలెఁ బ్రాకుచు మోకాళ్ళ నానియాని డెక్కలఁ జిక్కఁబట్టి క్రోధంబుదెచ్చికొని ప్రోధంబులఁ జఱియలనంటియంటి నడుములువంచి పొదలదూరి కంటకపాషాణాదులవలన మేనులు జీరికొనిపోయి రక్తము గారుచున్నను లక్ష్యము సేయక యతి ప్రయాసముతో నాపర్వత మెక్కఁ దొడంగినవి.

ఆఘోటకముల పాటుజూచి మే మాత్రపడుచు నడుమనడుమ గుఱ్ఱములుదిగి యడ్డుపడిన కంటక లతాగుల్మాదుల నరికివై చుచు నాగచేయు రాల నేలఁదొర్లించుచు జీఱికొని పోయి రక్తముగారు వాఱువముల గాత్రములకు నాకుపసరు లంటించుచు వాని కాళ్ళు త్రోమి త్రోమి యలయికలుదీర్చి తటాంతరముల మొలచిన గరికిపరకల మేపించుచు రాత్రిపడినంత నిరవగుపాషాణతలంబులఁ బండికొని వేగించుచు నైదుదినంబులకుఁ బ్రాణావశిష్టులమైయాకొండశిఖర మెక్కఁగలిగితిమి.

అందునిలువంబడి దక్ష్మిణదిక్కంతయుఁ బరికించితిమి. ఇది యరణ్యము, ఇవి గ్రామములు, ఇవి గిరులను భేదమేమియుఁ దెలియఁబడ లేదు. పెద్దనదులు వెండితీగెలవలె జూపట్టినవి. అంతయుఁ బచ్చగా నలికికొని పోయినట్లు కనంబడినది. మఱియునగ్గిరికూటము శృంగాటకమువలె విశాలసమభూతల విరాజమానమై యొప్పుచుండెను. ఇందే వేని వింతలు గనంబడకపోవునా యని తలంచి గుఱ్ఱముల కలయిక తీరినవెంటనే యుత్తరముగాఁ బోవఁ దొడంగితిమి. పోవునప్పుడు.

సీ. ఈప్రసూనవిశేష మీక్షించితిరె? వన్నెఁ
             బద్మరాగప్రభ పరిహసించె
    నీపూవుతావి నాసాపర్వమొనరించెఁ
             గంటిరే? మణికర్ణికల నెసంగి
    యీఫలంబుల రుచులెఱిఁగితిరే క్రోలి
            యమృతంపురుచిఁ గేరియవఘటించు
    క్రొత్తపూఁదేనె యీకొమ్మనంటె భుజింత
            మిటు రారెయళుల రేపుటకు ముందు

గీ. భళిర మనమెప్పుడిట్టి పుష్పముల ఫలము
    లను సువాసనలను దేనెలను విచిత్ర
    లలిత పాదపదళలతాదులను జూచి
    యెఱుఁగమనుచు వచింతు మొండొరుల మేము.

అమ్మార్గంబున నదృష్టపూర్వములగు వృక్షలతాగుల్మాదుల నాలోకించుచు వింతలతాంతంబులఁ గోసి నాసాపర్వము గావించుకొనుచుఁబోయి పోయి.

క. జలవిహంగంబులు నళినీ
   దళములు మత్స్యములులేక తటముల నొరయం
   గల సలిలముతోఁ దగునొక
   కొలనుంగనుగొంటి మేము కుతుకంబమరన్ ?

పద్మినీజలచరనిహంగమ మండూకశూన్యంబగు తటాకంబు గాంచి పిపాసాలసులమగుటఁ దత్తటనికటంబున ఘోటకంబుల దిగి జీనులవిప్పి గఱికిమేయుటకై వాని విడిచి తేరవునడచిన బడలికబాయ జలక్రీడలాడఁదలఁచి గుభాలున నాజలాకరంబునంబడి మునిఁగి తేలుచు డప్పికి నిలువలేక మాతమ్ములుమువ్వురును దోసిళ్లతో నీరువట్టిమూడు గ్రుక్కలుగ్రోలుటయు నేను జూచుచుండ వారు మువ్వురు చిలుకరూపము దాల్చి గగనంబున కెగసి యుత్తరమార్గంబుగాఁ బోయిరి.

అయ్యనర్ధము గన్నులారజూచి నేను గుండెలు బాదుకొనుచు లేది యాచిలుకలుపోయినదారిం బరుగిడికొనిపోయి తమ్ములారా! నన్ను విడిచి పోవుచున్నా రా? నాదెస జూడరా? ఆప్రేమయంతయు నేమిజేసిరి? రండు రండు. చూఁడుఁడు. అని కేకలువైచుచు నవిపోయినదారిని కొంతదూరము పోయితిని. అంతలో నాచిలుక లదృశ్యము లై దూరముగాఁ బోయినవి. పక్షులతో నేను బోవఁగలనా? నిరాశజెంది పిమ్మటఁబోక మరలి తటాకంబునకరుదెంచి తచ్ఛిహ్నములఁ బరికించి దుఃఖించుచు నేమిచేయుటకుం దోచక అయ్యో! నాతమ్ములు చిలుకలైపోయిరి. ఇఁక వారి నీజన్మంబునఁ జూడఁజాలను. ఈతటాకజలంబున నిట్టిదోషముండఁబట్టియే జలచరశూన్యమైనది. మాకర్మమిక్కడి కీడ్చికొనివచ్చినది. మాదిగ్విజయాత్రఫలం బిట్లు పరిణమించినది. అన్నగా రేమైరో తెలియదు. తమ్ములిట్లైరిగదా. నేనొక్కరుండ మిగిలి యేమిచేయువాఁడ బ్రతికినను ఫలమేమి? నేనుగూడ నీనీరు ద్రావి చిలుకనై యీదుఃఖము మఱచి వానితోఁగలసికొనియెదంగాక. ఇంతకన్న వేఱొకమార్గమునుపోవదగినది కాదు. అనినిశ్చయించినీటిదరి కరిగి దోసిట నీరుపట్టి నోటియొద్దకుఁ జేర్చికొని యంతలో మఱల దింపి యిట్లు తలంచితిని.

మ. అకటా? సర్వగుణాభిరాముఁడగు లోకాధీశు పుత్రుండనై
     సకలక్ష్మాతలనాధ సన్నుతయశఃక్షాత్రంబునం బొల్చు వా
     రికిఁ దమ్ముండననొప్పి నిర్జితమహారివ్రాతుఁ డైనట్టి నే
     నొకకీరాధమరూప మూనఁదగునొక్కో ? నీచుచందంబునన్ .

ఇప్పుడు నేనీజలంబులంగ్రోలి శుకంబునై యెగసిపోయిన నాజీవిత మింతటితో సమాప్తినొందెడిని. అంతకన్న మృతినొందుటయే శ్రేయము “జీవన్ భద్రాణిపశ్యతి" అనునార్యోక్తియు విమర్శింపఁదగి నదియే. నేనుగూడఁ బక్షినగుటకంటె సోదరుల పక్షిరూపము మార్చు ప్రయత్నముచేయుట లెస్సయని తలంతుఁ గొంత ప్రయత్నముజేసి చూచెదంగాక యత్నము సఫలముకానినాఁ డీపనిచేయవచ్చును మనష్యుల బక్షులఁజేయు సామర్ధ్య మీతటాకమున కెట్లువచ్చిసదో తెలిసికొనవలసియున్నది. యూరక చచ్చినఁ బ్రయోజన మేమియున్నది. అని తలంచి నాదోసిటనున్నజలం బవ్వలఁ బారజిమ్మితిని.

వెంటనేలేచి యా తటాకమునకు మూడు ప్రదక్షిణములుచేసితిని. ముకుళిత కరకమలుండనై యో కాసారరాజమా ! నీ బ్రభా వమే మహానదులకులేదు. గంగాది తరంగిణులు సేవించిన వారికి మరణానంతరమునఁగాని ముక్తి నీయజాలకున్నవి. జలపాన మాత్రముననే సద్యోదేహవిముక్తి నిచ్చుచుంటివి. నీకు నమస్కారము నీ కిట్టి సామర్ధ్యమెట్లు వచ్చినదియో తెలుప బ్రార్థించుచున్నాను.

అని పలుకుచు నేదియో ధ్యానించుచుండ దత్తటంబున మేయుచున్న మా గుఱ్ఱములు నాలుగును దప్పిగొని తటాలునవచ్చి, యా చెఱువునీరు రెండు గ్రుక్కలు గ్రోలి చిలుకలై యెగసిపోయినవి. ఆమార్పుజూచి అయ్యయ్యో నేనెంత మఱపుజెందితిని. భ్రాతృవియోగశోక వేగంబున వీనిమాట మఱచిపోయితిని. మాతోఁగూడఁ గష్టసుఖంబు లనుభవింపవచ్చిన యోగుఱ్ఱములు తమ్ములలోఁ గలిసి పోయినవి, కానిమ్ము. ఎన్నిటికి విచారింతును ! తలిదండ్రులమాట వినని నిర్భాగ్యులిట్లే కష్టముల పాలగుదురు. వీరి యాకారములు మారుట కేదేని యాధారము దొరికిన సరే. లేకున్న సరస్తోయంబు లుండనే యున్నవి. మఱికొన్ని దినంబు లీకూటశృంగాట కంబున సంచారము గావించి చూచెదంగాక యని తలంచుచుఁ దత్ప్రదేశము లన్నియుం దిరిగి చూచుచు నందందు సంచరించు చిలుక గుంపుల దావునకరిగి తమ్ములారా ! అని పిలుచుచు బ్రతివచనంబు బడయక పూర్వ వృత్తాంతము దలంచుకొని దుఃఖించుచుఁ బదిదినము లతీకష్టము మీఁద వెళ్ళించితిని నాయరణ్య రోదనమునకు ఫలమేమియుఁ గనంబడ లేదు సీ! నేనువట్టి మూడుండనై యిట్లు తిరుగుచుంటి దైవము మమ్మిచ్చటఁ గష్టములుపాలు సేయఁదలంచెను. తదాజ్ఞ నతిక్రమింప నేనెంత వాఁడను ప్రారబ్ధశేషమున నా కీ పదిదినములు బ్రతికి శోకించుటఁకుఁగారణమైనది. నేను నాఁడెచిలుకనైతినేని యీశోకముండునా. ఇఁక నాకువేరొక తెరవులేదు. ఈ జన్మమున నాకన్నదమ్ములతోఁ గలియు భాగ్యముపట్టదు. వట్టియాస బెట్టుకొని తిరిగితిని. అని ఆలోచించి తటాకమునకరిగి స్నానముచేసి కన్నులు మూసికొని దోసిలితో జలంబులెత్తి పరమేశ్వరుని ధ్యానించుచు మహాత్మా! నాకు నిరుపమాన సౌందర్యకళాబలపరాక్రమాది విశేషము లొసంగియుఁ జివర కీయడవినడుమ దిక్కు లేక యొక్కరుఁడ దేహమువిడుచునట్లు చేసితివే! ఏమిపాపముజేసితిని. మాతమ్ము లీకష్టము లేమియు నెఱుగకుండ చిలుకలై యెగసిపోయిరి. నాకీజ్ఞాన మేల కలుగవలయును? నన్నుఁగూడఁ దెలియకుండఁ జిలుకంజేసిన బాగుండునే! నాప్రారబ్ధమునునీవెట్లుమార్చుదువు? ముందుజన్మమునందైననిట్టి కష్టములు లేకుండ జేయుమని ప్రార్థించుచు జలపానంబుసేయ నుద్యుక్తుండనగునంతలో నత్తటాకజలాంతరమున గుభాలుమని యొక పెద్ద చప్పుడైనది. అదరిపడి కన్నులం దెరచి చూచితిని. ఆజలమధ్యమునుండి సుడిగుండములువొడమ దోయంబుపొంగి తటంబనగొట్టుకొన

గీ. మూరెడేసిగోళ్లు మోకాళ్లదనుక వ్రే
    లాడుజడలుగల్గి చూడ భీతు
    గదుర నొక్కసత్వ ముద కాంతరమునుండి
    పైకివచ్చెఁ గచ్ఛపంబుపగిది.

ఆసత్వంబు మకరమత్స్య కచ్ఛపాదుల బోలక వేఱొక విధంబున నుండుటంగాంచి నేను వెరఁగందుచు నన్నిది గడతేర్చు నేమో యని వీరపుతోనుండి తచ్చర్యలం బరికించుచుంటి. ఆసత్వంబు క్రమంబునఁ బశ్చిమతటంబుజేరి కూర్చుండెను. అప్పుడు చూడంజూడ మనుష్యాకృతిగా తోచినది సూర్యున కర్ఘ్యప్రదానమిచ్చినంత నేనతండొక దిగంబరియోగియని తెలిసికొంటి. అయ్యోగి కొంతసేపు జపముచేసుకొని లేచి తత్ ప్రాంతమందు నెరయఁబడిన తరుని కటంబునకరిగిదోయిలిపట్టుటయు నందలిఫలంబులు జలజలరాలి కొన్ని వాని దోసిటంబడినవి. వానిం దెచ్చికొని తీరంబునం గూర్చుండి దేవతా నివేదనము గావించి కొన్ని భక్షించెను.

నే నావింత కన్నులార జూచి యోహో! ఈమహాముని యెవ్వఁడో జలస్థంభనజేసి తటాకములో జపము జేసికొనుచున్నాఁడు. ఇప్పు డే కారణముచేతనో బాహ్యప్రచారముగలిగి బయటకువచ్చెను. ఇమ్మహాత్ముని జలచరమనుకొంటి నాసాపము శమించుఁగాక. నే నిప్పు డీతని చెంతకరిగి పాదంబులంబడి వేడికొనియెదను. కృపా దృష్టులు నాపై బరగించెనేని మనుష్యులలోనన్నుఁ బోలు పుణ్యాత్ముఁ డుండఁడు. ఇంతవఱకు నిష్ఫలమని తలంచిన మాప్రయాణము సఫల మగును. అలిగి శపించెనా కృతార్థుఁడనే యగుదును. అని తలంచుచు నంజలినున్న నీరుపారఁజిమ్మి మెల్లనలేచి కరయుగంబు శిరంబునంజేర్చి మందగమసంబున నవ్వలితటంబున కరిగి దూరంబునుండియు సాష్టాంగముగా నేలంబడి ప్రాకుచుంబోయి అతనిచరణ పంకజంబులం బట్టుకొంటిని అమ్మునిపతి యదిరిపడి యెవడవురా ! ఈవిజనస్థలంబున కెట్లువచ్చితివి ? తటాకజులంబులఁ గ్రోలలేదా ! అని యడిగిన నేనల్లన లేచి నినయ భయభక్తి విశ్వాసములు ప్రకటించుచు నిట్లంటి.

మహాత్మా! అతి పవిత్రములగు మీదృష్టి ప్రాసారములు నాపై వ్యాపింపఁజేసితిరి. నా పాపములు పటాపంచలైనవి. నేను గడుపుణ్యాత్ముండనైతి నాపురాకృత సుకృతములు ఫలించినవి. ఆహా! పామరుండనగు నేనెక్కడ! పరమహిమాస్పదంబగు నీ పరత్వ శిఖర మెక్కడ? దేవతలకైన పడయ శక్యముగాని మీ దర్శనమెక్కడ? నాకు నేఁడెట్టి సుప్రభాతమైనది! నా జన్మావధిలో నిట్టి శుభ వాసరములేదుగదా! ఇఁకనే జచ్చినను ధన్యుండనే. అని యనేక ప్రకారము లగ్గించుచు నా వృత్తాంత మంతయు సంక్షేపముగా నెఱింగించితిని మత్పూర్వకృత సుకృత విశేషమువలన నా నుడివిన నాలుగుమాటలు నెన్నినాళ్లకోగాని బాహ్యప్రచారమురేని యామహాయోగిచెవింబడినవి. ఒక్కసారినన్నుఁ బవిత్రుంజేయువాఁడుంబోలె నా దెసఁజూచి స్తుతివచనముల కేమి ? నీ కోరికయేదియో చెప్పుమని యడిగిన నేను దొందరపడుచు నేమికోరవలయునో తోచకనేను మా సోదరులతోఁ గూడికొని సుఖముగానింటికింపోయి తలిదండ్రులకు నమస్కరించునట్లనుగ్రహింపు డింతకస్న నధిక మేమియు నీయనక్కరలేదని కోరితిని. ఆ సిద్ధుండట్టెలేచి యేదియో మూలిక పెరికికొనివచ్చి నాకిచ్చి చేయఁ తగిన విధానము బోధించి పోపొమ్ము నీ తలంచినట్లగునని పలుకుచు నా యోగి గుభాలునం దటాకములో నుఱికి మునిఁగిపోయెను.

అయ్యోగి మూలమున నా కర్మసూత్రంబు బయటఁబడినదని సంతసించుచు నమ్మూలికను బదిలముగా మూటగట్టికొని చిలుకలనరయుచుఁ గ్రమ్మర నాశిఖరప్రదేశమంతయుఁ దిరుఁగఁజొచ్చితిని. చిలుకలు గనబడినను నేనుదాపునకుఁబోయినంత నెగిరిపోవుచుండునవి. చెట్ల శాఖలనున్న చిలుకల కీ మూలిక దగిలించుటయెట్లు ? అని యాలోచించి మట్టియుండలఁ గొన్నిటంజేసి పచ్చిగానున్న యామూలికబెరడు ఆయుండలో గలిపి కనంబడిన చిలుకకుఁ దగులునట్లు వినరుచుంటిని.

చారుమతి కథ.

ఒకనాఁడొక తరు శాఖపై నిలువంబడి మధురముగాఁ బలుకు చున్న యొక చిలుకంగాంచి పొంచి పొంచి దాపునకుంబోయి గుఱి జూచి యా మట్టి దాని పాదంబులకుఁ దగులునట్లు గొట్టితిని తత్సంపర్కంబు గలినంత.

చ. కలకల నవ్వునెమ్మొగము గంతుశరంబులఁబోలు సోగ క
    న్నుల వెలిచూపు లద్భుత తనూద్యుతి చక్కని కౌను తళ్కు, చె
    క్కులు మృదుపాదముల్ గులుకు గుబ్బలుగల్గి మనోహరాకృతిం
    చిలుక నెలంతయై నిలిచెఁ జెంగట విస్మయమాత్మఁదోపగన్.

నే నాయెలనాగం గాంచి వెరగుపాటుతో బోటీ! నీవెవ్వని కూఁతురవు? నీపేరేమి ? మాతమ్ములవలె నీ వీ తటాక జలంబులఁ గ్రోలి చిలుక వైతివాయేమి? ఈదుర్గమ శిఖరంబున కెట్లువచ్చితివి? నీవృత్తాంతము చెప్పుమని యడిగిన నప్పడఁతి నాకు నమస్కరించుచు నిట్లనియె.

మనోహరాకారా! నే నవంతీశ్వరుని కూఁతురను. నా పేరు చారుమతి యండ్రు. మా తండ్రికి నే నొక్కరితనే పుత్రికనగుట. నాకుఁ బెండ్లిచేయు తలంపుతో వరాన్వేషణము నిమిత్తము భూమండ లంబంతయుఁదిరిగి యెందును దగిన పురుషుం గానక స్వయంవర మహోత్సవము చాటించెను. ఆ యుత్సవమునకు రూప యౌవన మదగర్వితులగు రాజకుమారు లనేకులు వచ్చి సభ నలంకరించిరి.

అప్పుడు నేను దివ్యభూషాంబర మూల్యానులేపనాదుల నలంకరించుకొని యంతఃపురమునుండి బయలుదేరి సఖీహస్తావలంబనంబు గావించి మెల్లగానడుచుచు సభాభవనము చేరునంతలో నొక్క. బ్రహ్మరాక్షసుం డెక్కడనుండియోవచ్చి గ్రక్కున నన్నక్కునం జేర్చికొని యందున్న వారెల్ల హాహాకారంబులు సేయుచుండ నురగింబట్టికొనిన గరుడ పక్షియుంబోలె నాభీలవేగంబున నెగసి యాకాశ మార్గంబునం బడిపోవదొడంగెను.

అప్పుడు నేనుకురరియుంబోలె వాని బుజంబుననుండి వాపోవుచు శోక వేగంబున నొడలెఱుంగక మూర్చవోయితిని. కొంత సేపటికి వాఁడు నన్నీ శిఖరముమీఁదకుఁ దీసికొనివచ్చి యిందు దింపి సేఁద దీర్చుచు నిట్లనియె. సుందరీ ! నేను మధుండను దానవచక్రవర్తిని. గగనంబునం బోవుచు నిన్నుఁజూచి మోహపరవశుండనై యిట్లెత్తికొనివచ్చితిని. భుజబలంబున నాకీడగువాఁడు మూడులోకములలో లేడు. ఇగ్గిరికూటంబుమిధునవిహారమునకు వాటమైయున్నది. యధేచ్ఛముగా మన మిందు సుఖంపవచ్చును. నన్నంటియున్న మదనుం దృప్తిపరచితి వేని నీకు దాసుండనై పరిచర్యలఁ జేయువాఁడఁ గన్నులెత్తినన్నొక సారి చూడుము తలోదరీ ! నీచిలుకపలుకుల నాచెవి సోకింపుము అని యేమేమో దుర్భాషలాడ వినిపించుకొనక నోటికివచ్చినట్లు వానిం దిట్టుచుఁ బెద్దయెలుంగున విలపించితిని.

నాలుక యెండి యెలుంగురాక తొట్రుపడుచుండ నాదానవుండు అయ్యయ్యో ! ప్రేయసీ ! వెక్కి వెక్కి యిట్లేల యేడ్చెదవు? శోకతాపంబున నీనాలుక యెండిపోయినదిగదా. తటాకజాలంబులం దెచ్చి యిచ్చెదఁ ద్రాగెదవా! అని పలుకుచు వాఁడాసరోవరములోఁ దిగి యేమిచేసెనో తిరుగా వాఁడు నాకడకు రాలేదు. ఎంతసేపటికి వాఁడు రాకున్న వెఱఁగుపడుచుఁ గన్నులెత్తి నలుమూలలు చూచితిని. ఎందును వానిజాడ గనంబడలేదు. ఆతటాకములోఁ గాలుజారి పడెనేమో యని తలంచితిని. ఏది యెట్లైనను నానాలుక యెండిపోవుచున్నది. నీరుత్రాగి తరువాత వానిసంగతి విచారింతమని తలంచి నేను మెల్లన జలాకరమున కరిగి జానుదఘ్నంబగు నీట నిలిచి చేతులతో జలోపరిభాగంబునందలి మలినంబు ద్రోయుచు మొగముగడిగి కన్నులఁ దుడిచికొని యంజలిచే రెండుగ్రుక్కలు నీరు ద్రావితిని. సౌమ్యా ! అంతలో నా దేహము చులకనై చిలుకనైపోయినట్లు కొంచెము జ్ఞాపకమున్నది. తరువాత నేమిజరిగినది తెలియదు. నాకీరూప మెట్లువచ్చినదియో దేవరయే చెప్పవలయును అనియాత్మీయవృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆకథ విని నేను మిక్కిలి యాశ్చర్యమందుచు రాజపుత్రీ ! నీ చరిత్రముకొంతమమ్ముఁబోలియున్నది. మాతమ్ములుమువ్వురీ చెఱువు నీరు త్రాగి నీపలెనే చిలుకలై యెగిరిపోయిరి. వారినిమిత్తమే నేనిందు గ్రుమ్మరచున్నవాఁడ. ఈతటాకాంతరమున నొకసిద్ధుండు తపంబుజేసికొనుచు జనసంబాధమునకు వెరచి యీనీరుత్రాగినవారు చిలుకలై యెగసిపోవుదురని నియమముజేసెను. నేను తమ్ములపోకకుఁ జిం తించుచు మరణకృతనిశ్చయుండనై యుండ నమ్మహాత్ముదర్శనమైనది. అతనివలన నీమూలిక గ్రహించితిని. దాని సంపర్కంబున నీవు కలికి వైతివని నావృత్తాంతమాద్యంత మెఱింగించుటయు నాచంచలాక్షి సంతోష మభినయించుచు నాకిట్లనియె.

మహారాజపుత్రా ! నీవు నాకుఁజేసిన యుపకారమునకుఁ బ్రతి యేమియుం జేయఁజాల. క్షుత్పిపాసావ్యసనగ్రసితమగు పక్షిరూపము వాయఁజేసి తొంటిరూపు గలుగఁ జేసితివి. లేకున్న నాజన్మాంతము యీయడవులలో దిరుగవలసినదియేకదా. జీవితాంతముదనుక నీపాదసేవజేసి మీఋణము తీర్చికొనఁదలంచితిని. అందుల కంగీకరించితిరేని నన్నెత్తికొనివచ్చినయాసక్తంచరునిఁ బరమోపకారిగాఁ దలంచెదనని పలికిన విని నే నిట్లంటి.

తరుణీమణీ ! నేనీయపకృతి నీకుఁ జేయవలయునని చేసినది కాదు. యదృచ్ఛముగా నీ కుపచరించినది. అందులకు నీవునన్నింతగాఁ గొనియాడఁబనిలేదు. నిన్నుఁ బూవులఁబెట్టి తీసికొనిపోయి మీతలి దండ్రుల కప్పగించెదను. అందు నీనిమిత్తమై క్రమ్మఱ నీతండ్రి స్వయంవరము చాటించును. నీయిష్టమైనభర్తను వరింతువుగాక. ఇప్పుడనన్య గతికవని యాలోచింపవద్దు. ఇది కపటముగాఁ జెప్పిన మాటగాదు. యధార్ధవచనమని పలికితిని.

ఆచిన్నది నామొగముపై దైన్యదృష్టుల వ్యాపింపఁజేయుచు మనోహరా! పదిమాటలాడుటచే నాకు మీకడఁ జనువుజిక్కినది. మీమాటల కే నంగీకరించితిని. మీరుగూడ నాస్వయంవరమునకు వత్తురుగదా. అందు మిమ్మే వరించితిననుకొనుఁడు. సరిపడినదియా? మాటల కుత్తరముజెప్పలేని దానను గాను. నాయీవేషము నాఁటిదే. ఈదామము నాఁడు బూనినదే. త్రికరణములచేత నిదివఱకెవ్వరిని వరించియుండలేదు. దైవసాక్షిగఁ జెప్పుచున్నాను. మీనిమిత్తమే నన్నారక్కసుఁ డిక్కడికిఁ దీసికొనివచ్చినాఁడు. మీరేనాభర్తలు. అని పలుకుచు నానందాశ్రువులతో నాదామము నామెడలో వైచినది. నేనును దత్పత్నీత్వమున కనుమోదించి యాదరించితిని. ఇరువురమక్కొండశిఖరంబునఁ చిలుకలగుంపులఁ బరిశీలింపుచుఁ గొన్ని దినములు వసించితిమి. ఒకనాఁడు నే నిట్లంటిని. రమణీ! మాసోదరు లీకూటంబున నున్నట్లులేదు. ఇప్పర్వతమున కుత్తరభాగంబున నొక్కపట్టణమున్నదఁట. ఇందు లేకున్న నందుఁబోయి వెదకుమని యాసిద్ధుండాన తిచ్చియున్నవాఁడు. కావున మనమందుఁ బోవలసియున్నది. నీవెట్లు దిగుదువో యని యాలోచించుచున్న వాఁడ నిక్కొండ దిగు పాటవము నీకుఁ గలదా! అని యడిగితిని. ఇట్లు చేయరాదా? అని యాచిన్నది నాకుపాయము చెప్పినది. దానిబుద్ధినైపుణ్యమునకు నేను సంతోషించుచు నప్పుడే యొక వెదురు గొట్టము బాగుజేసి దానినిండ నాతటాక జలంబెక్కించి చీల బిగించి యామూలికలు దానితోఁ జేర్చికట్టి చారుమతిచే నాకొలనినీరు ద్రాగించితిని. అక్కలికి చిలుకయై నిలువంబడినది. దాని కాలికిఁ ద్రాడుకట్టి చేతికిఁ గట్టికొంటిని.

ఆవెదురుగొట్టముకట్ట బుజముమీఁద బెట్టుకొని దాన్ని పైఁ జిలుక నెక్కించి యొకప్రక్కనుండి యక్కొండదిగుటకుఁ బ్రారంభించితిని. అప్పుడు నాకుఁ గొండదిగుటకంటె నెక్కుటయే సులభమని తోచినది. క్రిందుఁజూచిన నగాధముగాఁ గనంబడును, ఒక్కొక్కచోట నూఁతివలెనుండుటచే నతికష్టముమీదఁ దిగఁగలిగితిని. క్రిందికి దుమికి కాలుజారిన వృక్షశాఖలం బట్టుకొని యాగుచుండెడి వాఁడను. ఈరీతి నతికష్టంబున నక్కొండ దిగగలిగితిని. కొంతదూరమందుండఁగనే యీ నగరము నాకుఁ గన్నలపండువ గావించినది. దగ్గిరఁ జేరినకొలఁది పురిచుట్టు ప్రహారి గలిగియుండుటంబట్టి యుత్తరముగాఁ బోయి గిరిదిగి బాటలోఁ జేరితిని. వీరవేషంబుతోఁ బోయిన నగరములోనికి బోనీయ రని తెలిసికొని కోయవానివేషము వైచితిని. తరుచు జిలుకలు రాణి వాసములలో స్త్రీలచేఁ బెంపఁబడుచుండును. కావున నాభార్యచే గోయసానివేషము వేయించితిని. నాచేతినున్న రవ్వయుంగరమొకటి యమ్మి బంగారముకొని కరగించి యామూలిక దానిలోఁగలిపి మువ్వలు జేయించితిని.

వీఁటిసత్రములోఁ జేరినపిమ్మటఁ జిలుకగానున్న నాభార్యను మువ్వలు తగిలించి స్త్రీనిజేసితిని. చేయఁదగినకృత్యములు బోధించి కోయమాటలు నేర్పి యూరిలోనికిఁ బంపి మువ్వలమ్మించితిని. దైవకృపచే మాతమ్ములును గుఱ్ఱములును యథారూపము వహించినవి. చారుమతి నెత్తికొనివచ్చిన రక్కసుఁడు ఆనీరుత్రాగి చిలుకయై కొండ వాండ్రచేతిలోఁ జిక్కి బోగముదానికమ్మఁబడియుండెను. మామువ్వల సంపర్కంబున నాఁడు నిజరూపము దాల్చి యంతయల్లరి గావించెను. ఇదియే మాచరిత్రము. భగవంతుని యెత్తికోలు ఎవ్వరికిం దెలియదు గదా. ఇప్పటికి మేమందర మొక చోటికిఁ జేరుకొంటిమి. సిద్ధునికృపచే నీసంఘటనము గలిగినది. ఆచారుమతియే కోయదొరసానివేషము వైచికొని మువ్వలమ్ముచు నీరాజుగారి యంతఃపురముకరిగి రాజవుత్రికలు పెనుచుచున్న చిలుకలకుఁ గట్టించి మా యుద్యమము సఫలము జేయించినది. తరువాతివృత్తాంతమంతయు మీపౌరు లెఱింగినదియే కదా. మిమ్మును మీనగరస్థులను శ్రమపెట్టినందులకు మాతప్పులు క్షమింప వలయునని కోరుచున్నాను. అని చెప్పి హరివర్మ పీఠముపైఁ గూర్చుండెను.

అవృత్తాంతము విని సభ్యులెల్లరు నాశ్చర్యసాగరంబున మునింగిరి. పిమ్మట సోమదత్తుండు వారి నలువుర నగరిలోపలకుఁ దీసికొనిపోయి గౌరవించుచు హరివర్మ కిట్లనియె. మహావీరా! మీతమ్ములు మువ్వురు శుకరూపమున మాయంతఃపురములఁ బ్రవేశించి యందే స్వ స్వరూపముల దాల్చిరి. ప్రఫుల్ల నాపుత్రిక. కాళింది మంత్రి పుత్రిక. రుక్మవతి సామంతరాజు పుత్రిక . మీతమ్ములపోలిక గ్రహించుట గ్రొత్తవారికి గష్టముగానుండును. కావున వారేయెవ్వరేకన్యక యంతఃపురమున వెలసిరో యకన్యకం బాణిగ్రహణము జేసికొనవలయును. ఇది మాయభిలాష యని వినయముతోఁ బ్రార్థించుటయు హరివర్మ యంగీకారము సూచించెను.

అంత నమ్మహారాజు శుభలగ్నంబునఁ గళాభిరామునకుఁ దన పుత్రిక , ప్రఫుల్లను, మంత్రిపుత్రిక కాళిందిని సుధర్మునకు , రుక్మవతిని సులోచనుసకు యిచ్చి వివాహము గావించెను. మరియు నవంతీశ్వరుఁడు దూరమందున్న వాఁడగుటఁ జారుమతీకన్యాదాన సంస్కారము తానే గావించెను.

రామలక్ష్మణ భరతశత్రుఘ్నులుపలె నా రాజకుమారులు నలువురు నేకకాలమున వివాహ మహోత్సవముల నానందించి భార్యలతోఁ గూడఁ గొన్నిదినంబు లందు నిరవధిక కేళీవిలాసములతో వెళ్ళించిరి.

అని వినిపించి తరువాతనగు కథ నిట్లు వచియించెను.

230 వ మజిలీ.

రాజపుత్రులు నిత్యము స్వదేశమున కరుగఁ దొందరపడుచున్నను సోమదత్తుని నిర్భంధమునఁ గొన్ని నెల లాగిరివ్రజపురంబున నుండక తీరినదికాదు. అక్కడినుండి కాశ్మీరదేశమునకు మార్గము కడు సంకటముగా నుండును. ఆదేవకూటశైలము తిరిగిపోవలయును. మంచి దారులులేవు. కొండలనడుమనుండి యడవులమీఁదుగాఁ బోవలయును.

సోమదత్తుఁడు సుముహూర్తమున వారికిఁ బ్రయాణము నిరూపించి దాసదాసీసహస్రము లరణముగా నిచ్చి యేనుఁగులు గుఱ్ఱములు లొట్టియలమీఁదను సారెవస్తువు లెక్కించి పుత్రికల నందలము లెక్కించి చతురంగబలముల సహాయమిచ్చి యంపకము గావించెను.