కాశీమజిలీకథలు/పదవ భాగము/211వ మజిలీ

బాగు. సృష్టికి బూర్వమీ పంచభూతములు లేనియప్పుడీప్రపంచక స్థాన మెట్లుండునో చెప్పుటకేకాదు. ఇట్లుండునని యూహించుటకు గూడ వీలులేదు. అది పరమేశ్వరునికే తెలియును. నారదమహర్షి రెండవజన్మము, అసిక్నియందు గలిగినది. వినుమని యన్వలికథపై మజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

_________

211 మజిలీ

నారదుని గంధర్వ జన్మము.

క. తరమే విధిగతి దాటఁగ
   నొరులకు నారదమహర్షి యును గంధర్వాం
   బురుహాక్షుల నేబదుగురఁ
   బరిణయమై క్రీడ సలిపెఁ బరజన్మమునన్.

విద్యాధరాది దేవతావిశేషులలో గంధర్వు లొకతెగవారు. వారికి సంగీతమే కులవిధ్య. స్త్రీపురుషులు సంతతము గానపరిశ్రమ చేయుచుందురు. వారికి దేవలోకములోనేకాక భూలోకములోఁగూడ సంచారము గలిగియున్నది. గంధర్వులు స్త్రీపురుషులు మిక్కిలి చక్కనివారు. గంధర్వకన్యకలు అచ్చరలవలె స్వేచ్ఛావిహారములు సేయరు. భర్తలవరించి పాతివ్రత్యశీలంబుల నొప్పుచుందురు.

గంధర్వలోకములో నొకభాగము రత్న కేతుఁడను గంధర్వ రాజు పాలించుచుండెను. అతండు సకలైశ్వర్యసంపన్నుండయ్యు, సంతతిం బడయఁజాలక చింతించుచు వసిష్ఠోపదిష్టంబగు శివమంత్రంబు జపించుచుఁ బుష్కరతీర్థంబున నూరుదివ్యవర్షంబులు తపంబు గావించెను. తత్తపంబునకు మెచ్చి మహేశ్వరుండు ప్రత్యక్షంబై యభీష్టమే మని యడిగిన నతండు విష్ణుభక్తాగ్రేసరు సకలకళాభిరాముఁ గుమారు దయజేయుమని కోరుటయు నవ్వరంబిచ్చి యుమాకాంతుం డంతర్హిహితుం డయ్యెను.

తద్వరప్రభావంబున నచిరకాలములో రత్న కేతునకుఁగుమార రత్నం బుదయించెను. వాని కుపబర్హణుఁడని పేరుపెట్టిరి. ఆబాలుండు శుక్లపక్షక్షపాపాలుఁడు వోలె ననుదినప్రవర్ధమానుండగుచు మాటలతోనే హరినామకీర్తన హితుండు, ఆటలతో విష్ణుకథా ప్రస్తారకోపరతుఁడు నై సర్వజనమనోహరంబగు శైశవంబునఁ దలిదండ్రులకేకాక సర్వగంధర్వలోక మనోహరుఁడై యొప్పుచుండెను.

రత్న కేతుఁ డుచితకాలమున వానింజదువ వేయుటయు గంధర్వవృద్ధులుకులాచార ప్రకారంబున,

క. స రి గ మ ప ద ని యటంచున్
   స్వరములఁ బలికింపఁ దొలుత సంగీతమునన్
   హరి నిగమపద యటంచుం
   బరువడి వర్ణంములమార్చి పలుకు నతండున్ .

వత్సా! ఇది స్వరక్రమముగాదు. తొలుత సకారముచ్చరింపక హకారముచ్చరించెద వేమి? అని యుపాధ్యాయు లాక్షేపింప నాబాలుండు ఆర్యులారా! హకారపూర్వక రివర్ణకముగాని సకారపూర్వ రివర్ణము నానాలుకకు రాదు. సంజ్ఞలలో సవర్ణము హవర్ణముగా మార్చికొనిన దోషములేదని యుక్తి యుక్తముగా నుపన్యసించెను.

ఆయుపన్యాసమువిని గురువులబ్బో ! ఈబాలుండు సామాన్యుఁడు కాఁడు. శాస్త్రములు స్వయముగా రచింపఁగలఁడని యబ్బురపడఁ జొచ్చిరి. అతని కుపాధ్యాయులు నిమిత్త మాత్రమున కే వానినోటి నుండి ప్రవాహమువలె శాస్త్రము లావిర్భవించుచుండెను. అచిరకాలములో నాబాలుఁ డశేషవిద్యా పారంగతుడగుటఁజూచివాని గారణజన్మునిగాఁ దలఁచుచుండిరి.

ఒకనాఁడు అమ్మాణవకోత్తముఁడు సవయస్కులగు గంధర్వ కుమారులతోఁగూడి యుద్యానవనంబున హరిలీలావిశేషంబులఁ బాడి కొనుచున్నసమయంబున నొకపరిచారకుం డేదియో పత్రికందెచ్చి యిది ప్రభువుగారు కుమారరాజుగారికిమ్మనిరి. చదివి ప్రత్యుత్తరము తెమ్మనిరని నివేదించుటయు రాజపుత్రుని బాలసఖుండు శారదుండను వా, డా చీటి నందుకొని విప్పి యిట్లు చదివెను.

శ్రీమద శేష గంధర్వ శిరోమణి కిరణ నీరాజిత పాదపీఁఠుడగు రత్న కేతుసార్వభౌముని చరణసన్నిధికి నీమిత్రుఁడు చిత్రరథుఁడువ్రాయు విజ్ఞాపసపత్రిక. ఱేపురాఁబోవు కృష్ణచతుర్దశినాడు మద్గృహంబునఁ బార్వతీపరమేశ్వరులకు నాచే మహాపూజ గావింపఁబడును. అప్పుడు ముప్పదిమూడుకోటులు వేల్పులునింద్రాదిదిక్పతులు సంగీతవిద్వాంసులు మూడులోకంబులఁ బేరుపొందినవారందఱు వత్తురు. తాముగూడ సకుటంబముగా వచ్చి యిమ్మహోత్సన విషయంబులఁ బాలుగొని నన్నానందిందఁ జేయ వేడుచున్నాను,

మఱియు నందొకనాఁడు సంగీతవిద్యాప్రసంగము జరుగును. అందు మొదటివాఁడుగాఁ బేరుపొందిన విద్వాంసునకుఁ బార్వతీమహాదేవి స్వయముగా జేసిన మహతియనువీణ పారితోషికముగానీయ గలదు. అక్కానుకఁబడయుటకై త్రిభువనంబులంగల సంగీతవిద్యా విశారదుల వారిపేరులు పంపుఁడు. మనలో నెవ్వఁడైన నాపారితోషికమందఁ గలిగినచోఁ గులవిద్య నిలుపుకొనినవార మగుదుము.

ఇట్లు విదేయుడు,

చిత్రరథుఁడు.

ఆపత్రికనంతయు విని రాజకుమారుఁడు వయస్యా! ఈజాబు తండ్రిగారు మనకుఁ జూపుమని పంపుటకుఁ గారణమేమనుటయు శారదుఁడు నవ్వుచుఁ జూచుటయేగాక ప్రత్యుత్తర మిమ్మనిరఁట, .

మనవిద్యావ్యాసంగ మేపాటిదియో: తెలిసికొనుటకై పంపిరి. కానిమ్ము. ఆపారితోషికము నీవందకుందువా! క్రింద సంగీత విద్యాప్రసంగకర్త యుపబర్హణుఁడు అని వ్రాసిపంపుము. తక్కినవానితో మనకుఁ బనిలేదని పలికి యట్లు వ్రాయించి యాచీటి రాజుగారియొద్ద కనిపెదు.

గంధర్వపతి యుపబర్హణుని వ్రాఁతజూచి చిఱునగవుతో నట్టే ప్రత్యుత్తరము వ్రాసి హేమకూటనగరము న కనిపెను. మఱి రెండు దివసములఱిగిన పిమ్మటఁ గుమారు రప్పించి రత్న కేతుఁడు బాబూ! నీవాసంగీతసభలోఁ బ్రసంగింతునని వ్రాయించితివి. ముక్కుపచ్చలారని నీవెక్కడ! ఆసంగీతసభ యెక్కడ? తగనిపనికిఁ బూనుకొంటివే! ఆమహాసభకు మహావిద్వాంసులందరు రాఁగలరు. తుంబురుఁడనువాఁడు గొప్ప పండితుఁడు. వానిముందర గానములో నితరులు పెదవి గదపఁ గలరా? సభకుఁబోయి యోడివచ్చిన యపఖ్యాతికాదా? అని యేమేమో పలికిన విని కుమారుఁడు మందహాసము గావించెను. శారదుఁడు తప్పక నీపుత్రుఁడా కానుక , బడయఁగలఁడని పన్నిదము వైచెను. అదియుఁ జూతుముగదాయని ఱేఁడు సమాధానముచెప్పెను,

చతుర్దశి సమీపించినంత శుభముహూర్తంబున రత్న కేతుఁడు కుమారుఁ బయనముజేసి శారదప్రముఖులు గంధర్వకుమారులు పెక్కండ్రు వెంటరా ఛత్రచామరాందోళికాది రాజచిహ్నములతో హేమకూటనగరమునకనిపెను. అప్పుడప్పట్టణమంతయు విచిత్రముగా నలంకరింపఁబడియున్నది. గరుడ గంధర్వ కిన్నర సిద్ధ విద్యాధరాది దేవతావిశేషులు గుంపులుగా వచ్చి యందుఁ బ్రవేశించుచున్నారు. . ప్రేక్షకులు ప్రవాహమువలె వచ్చి చేరుచున్నారు. రాజధానియంతయు మంగళవాద్యములు మ్రోగుచున్నవి.

చిత్రరథుని మంత్రు లుపబర్హణుని రాక విని యెదురేగి సపరివారముగాఁ తీసికొనివచ్చి రాజబంధువుఁ డగుట రాజుపుత్రికలుండు గృహారామసౌధంబునఁ బ్రవేశపెట్టిరి. మఱియు,

సీ. కోరి ముప్పదిమూడు కోటులు వేలుపుల్
          భజియింప విచ్చేసె బలవిరోధి
    స్వాహా స్వధా వధూ సహితుఁడై వచ్చె మే
          షారూఢుఁ డగ్నిభట్టారకుండు
    కాలకన్యాది కింకర వర్గ మనుసరిం
          పఁగఁ జేరెఁ జారురూపమున యముఁడు
    గానశిక్షితులు కోటానఁగోటులు గొల్వఁ
          జనుదెంచె దానవచక్రవర్తి

గీ. వరుణుఁ డనిలునితోఁ గూడివచ్చె యక్ష
    భక్త విచ్చేసె నీశానుపజ్జ మఱియు
    నాగలోకమునుండి పన్నగులు శేష
    వాసుకి ప్రముఖులు వేడ్క వచ్చిరపుడు.

మఱియు నియమిత వాసరంబునకు,

గీ. ఇరుగడలఁ బార్షదులు బరాబరులు సేయ
    నందివాహనమెక్కి తా నగజతోడ
    వచ్చె శంకరుఁ డయ్యుత్సవమున కపుడు
    చిత్రరథుకోర్కె దీర నర్చింపఁబడఁగ.

చిత్రరథుండు బంధుమిత్ర పరివార యుక్తుండై పెద్దదూర మెదురేగి నమస్కారపూర్వక స్తుతివాక్యములతోఁ దూర్యనాదంబు లవార్యంబై యొప్ప నయ్యుమామహేశ్వరుల నాత్మీయ మందిరాభ్యంత రంబునకుఁ దోడ్కొనివచ్చి రత్న మంటపమునందలి మాణిక్యపీఠంబునం గూర్చుండఁబెట్టె నట్టియెడ,

శా. మ్రోసెన్ దంధణయంచు దుందుభిరవంబుల్ నల్దెనల్‌నిండఁబూ
    సేనల్ జల్లిరి వేల్పులాడిరి సురస్త్రీ లింవుగా వేణువీణా
    సంగీతముల న్నుతించిరట గంధర్వుల్ మును ల్భక్తితో
    దోసిళ్లొగ్గి నమశ్శివాయ యనుచున్ స్తోత్రంబులం జేయఁగా.

చిత్రరథుం డట్టితఱిఁ దనమనోరథంబు దీర నానాభువనంబుల నుండి యరుదెంచిన శునాసీరాది బృందారక బృందంబులు సంభ్రమముతో నుపలక్షించుచుండ భార్యతోఁగూడ నభిముఖముగాఁ గూర్చుండి యుమామహేశ్వర చరణారవిందంబుల సువర్ణపుష్పంబులఁ బూజింపుచుండె నప్పుడు తత్పుత్త్రికలు మాలావతీప్రభృతులేబదుగురు జగన్మోహన రూపవేషంబులతో వచ్చి తలిదండ్రులు గావించునర్చనలకు తోడుపడుచుండిరందు,

గీ. మాలావతి యటఁ జమరీ
    వాలముకై బూని వీచెఁ బరమేశ్వరులన్
    లోల మణికిరణ కంకణ
    జాల ఝణంఝణరవం బెసంగఁ బ్రియముతోన్.

కొందఱు పూజాపాత్రంబులఁ గైకొనిరి. కొందరు జేగంటల మ్రోగించుచుండిరి. కొందరు మంగళహారతులు బాడుచుండిరి. కొందరు పన్నీరు జల్లుచుండిరి. చిత్రరధుం డత్యంతవైభవంబుతో నుమామహేశ్వరుల మహాపూజగావించి స్తుతిపాఠంబులం బఠించె. తదనంతరంబున నతనిపుత్రికలే బదుగురు గీతంబులం బాడుచు మంగళహారతు లీయఁబోవుసమయంబున శారదుండు లేచి మహాపీఠంబున కనతిదూరములోఁ గూర్చున్న యుపబర్హణుని నిరూపించుచు “సభ్యులారా! యీతఁడు రత్న కేతునికుమారుఁడు. ఈమహాపూజాసమయం బునఁ బార్వతీపరమేశ్వరులపై దాను రచించిన గీతఁబొకండుపాడుట కుత్సహించుచున్నాఁడు. అనుజ్ఞయిత్తురే”యని యడిగినఁ దుంబురుఁడు లేచి "నేఁడుకాలాతీతమైనది. ఱేపుజరుగఁబోవు సంగీతసభలోనీగీతవిషయములు పాడవచ్చు”ననియుత్తరమిచ్చెను. 'ఇదిసంగీతవిషయముకాదు. శివస్తోత్రగీతమునేఁడే పాడవచ్చు'నని సభాధిపతిగానున్న బృహస్పతి యాజ్ఞయిచ్చెను.

అప్పుడుపబర్హణుండు వీణపై మనోహర స్వరములు వెలయించుచు నిట్లుపాడెను.

పంచచారమరము. ఉమామహేశ పాదపద్మయుగ్మమున్ భజింతునే
        సమస్త దేన మస్తకప్రశస్త రత్న భూషణా
        ప్రమేయ చిత్ర సత్ప్రభా విభాసితంబులన్ సదా
        నమో నమో నమో యటంచ నంతభ క్తి యుక్తిమై.

ఆగీతము వీణతంత్రీస్వర మిశ్రితముగా నపూర్వస్వరకల్పనలు సేసి తనకుఁగల సంగీతవిద్యావైదగ్థ్య మంతయుఁ బ్రకటించుటయు సభ్యులాశ్చర్యరసావిష్ణులై యాహాహాయనిపొగడ మొదలిడిరి. ఈ మహా పురుషుండెవ్వఁడని యందఱు నతనిదెస దృష్టులువ్యాపింపఁజేసిరి. క్షణకాల మాసభాభవనము తదీయ స్తవనాదముఖరితమై యొప్పినది. చిత్రరధుని పుత్రికలు అతనిసంగీతనైపుణ్యము ఆకారసౌష్ఠవము తేజోలక్షణముపరికించి మోహావివశులై యూరక యతనిఁ జూడఁదొడఁగిరి. తరువాత నప్పురాణదంపతులకు నివాళులిచ్చిరి. మహోత్సాహముతో నాఁటిసభ ముగిసినది.

అని యెఱింగించి యయ్యోగి పుంగవుండు. తదనంతరోదంతం బవ్వలిమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.


__________